అంతరాత్మ సాక్షి – 3 Translation by S Sridevi

  1. అంతరాత్మ సాక్షి – 1 Translation by S Sridevi
  2. అంతరాత్మ సాక్షి – 2 Translation by S Sridevi
  3. అంతరాత్మ సాక్షి – 3 Translation by S Sridevi
  4. అంతరాత్మ సాక్షి – 4 Translation by S Sridevi

రష్యన్ మూలం “Pikovaya dama” by Alexander Pushkin(in 1833)
Translated to English as “The queen of Spades” by Mrs Sutherland Edwards (in 1892) and available in Project Gutenberg in the Public domain.

ఇంటికి వెళ్ళగానే పరుగున తన గదిలోకి వెళ్ళి చేతితొడుగులోంచీ వుత్తరాన్ని తీసింది. అదేమి కవర్లో పెట్టి సీల్‍చేసినది కాదు. ఒక మామూలు కాగితం. అందులో ఒక ప్రేమసందేశం వుంది. చాలా మృదువైన, గౌరవనీయమైన భాషలో వుంది. ఆమెకి చాలా సంతోషం కలిగింది. ఐతే ఆమెకి తెలియని విషయం వుంది. ఆ వుత్తరంలోని ప్రతిపదం ఒక జర్మన్ నవలనుంచీ అనువదించబడిందని.
అలాంటి వుత్తరం ఆమె జీవితంలో మొదటిది. ప్రప్రథమంగా ఒక పురుషుడు తనలోని స్త్రీత్వాన్ని గుర్తించాడన్న ఆనందం ఆమెని నిలవనివ్వటం లేదు. ఐతే అతని తెగింపు ఆమెకి భయం కలిగించింది. ఎవరేనా అతను ఆ వుత్తరాన్ని యివ్వటం చూసి వుంటే? తనెందుకు ఇంత తెలివితక్కువగా ఆనందపడిపోతోంది? ఇప్పుడేం చెయ్యాలి? ఇకముందు కిటికీ దగ్గర అతనికి కనిపించేలా కూర్చోవటం మానేసి, తనకిలాంటివి నచ్చవని, ఇక్కడితో ఇదంతా ఆపెయ్యమనీ అతనికి సూచించాలా? అతని వుత్తరం అతనికి తిరిగి యిచ్చెయ్యాలా? తనకి ఆసక్తి లేనట్టు ముక్తసరిగా జవాబిచ్చి వూరుకోవాలా? ఇలాంటి వ్యవహారాలు పంచుకుని సలహా తీసుకుందుకు తనకొక్కరైనా స్నేహితుడో స్నేహితురాలో లేనందుకు చాలా బాధనిపించింది. ఎంతో ఆలోచించి చివరికి జవాబివ్వటానికే నిర్ణయించుకుంది.
తన చిన్న రాతబల్లముందు కూర్చుని జవాబు రాయటానికి వుపక్రమించింది. పెన్ను, కాగితం ముందు పెట్టుకుని చాలా ఆలోచించింది. నాలుగు అక్షరాలు రాయటం, ఆ రాసింది అతన్ని ప్రోత్సహిస్తున్నట్టో, మరీ అతనిది క్షమించరాని అపరాథమన్నట్టో అనిపించి నచ్చకపోవటం, దాన్ని చింపేసి మరోటి రాయటం… ఇలా ఎన్నోసార్లు జరిగాక చివరికి ఇలా జవాబిచ్చింది.
“మీ అభిప్రాయాలు, వుద్దేశ్యాలు మంచివేనని, తెలివితక్కువగా ప్రవర్తించి నన్ను ఇబ్బంది పెట్టరనీ నేను నమ్ముతున్నాను. కానీ మన పరిచయంమాత్రం ఈవిధంగా మొదలై వుండకూడదు. నాకు కొద్దిగా అవమానకరంగా వుంది. మీ వుత్తరాన్ని తిరిగి యిచ్చేస్తున్నాను. ఈ సంఘటనగురించి నేను ఎవరికేనా ఫిర్యాదు చేసే అవసరం రాదని నమ్ముతున్నాను”
మరుసటిరోజు హెర్మాన్ కిటికీలోంచీ కనపడగానే ఆమె ఎంబ్రాయిడరీ ఫ్రేము ముందునించీ లేచి డ్రాయింగ్ రూమ్‍లోకి వెళ్ళి వెంటిలేటర్ తెరిచి అందులోంచీ వుత్తరాన్ని రహదారిమీదికి పడేసింది. అతను తప్పక దాన్ని తీసుకుంటాడని గట్టిగా నమ్ముతూ.
ఆమె ఆశించినట్టుగానే హెర్మాన్ దాన్ని తీసుకున్నాడు. సీలు వేసిన వుత్తరం. దాన్ని తీసుకుని మిఠాయి అంగడికి వెళ్ళి, బాటతో సీలు పగలగొట్టి చూస్తే లిజవెతా జవాబుతోపాటు తన వుత్తరంకూడా వుంది. అతను వూహించినదే. ఏ ఆడపిల్లేనా అలాగే ప్రవర్తిస్తుంది. తన బసకి తిరిగి వెళ్ళిపోయాడు. లోలోపల అతని ఆలోచనలు, పథకాలు సాగుతూ వున్నాయి.
మూడురోజులు గడిచాయి. టోపీలు అమ్మే దుకాణదారుకి చెందిన యువతి ఒకతే లిజవెతాకి ఒక వుత్తరం తీసుకొచ్చింది. వృద్ధురాలు కొన్న టోపీలకి డబ్బు చెల్లించాల్సిందని నోటీసేమోనని అనుకుంటూ తెరిచింది లిజవెతా. అందులో అందులో వున్నది హెర్మాన్ చేతిరాత. గుర్తుపట్టింది.
“నువ్వు పొరపాటుపడ్డాఆవు. ఈ వుత్తరం నాకు కాదు” అంది.
ఆ యువతి అంతా తెలిసినదానిలా నవ్వుతూ, ” అది నీకే. చదివి చూడు” అంది.
లిజవెతా పైపైన చదివింది. హెర్మాన్ ఆమెని కలవాలని కోరుకుంటున్నాడు. అది దుస్సాహసమో, తనపట్ల గౌరవం లేకపోవటమో అర్థమవలేదు. “నాకు కాదని చెప్పానా, ఇది కచ్చితంగా నాకు కాదు” అంటూ దాన్ని చింపి పారేసింది.
“నీకు కానప్పుడు దానెందుకు చింపేసావు? అతనికే ఇచ్చేసేదానికదా?” ’అంది టోపీల దుకాణపు యువతి. లిజవెతా ఆమె మాటల్ని పట్టించుకోలేదు. “బుద్ధిగా వుండు. ఇలాంటి వుత్తరాలు మళ్ళీ ఎప్పుడూ తీసుకు రాకు. ఇలా చేస్తున్నందుకు సిగ్గుపడాలని పంపించిన మనిషికి చెప్పు” అని పంపేసింది.
హెర్మాన్ అలా వదిలిపెట్టే రకం కాదు. ప్రతిరోజూ ఏదో ఒక మార్గంలో లిజవెతాకి వుత్తరాలు పంపుతునే వున్నాడు. ఇప్పుడిక వాటిని జర్మన్‍నుంచీ అనువదించటం లేదు. నేరుగానే రాస్తున్నాడు. ఆమెని కలవాలనే బలమైన ఆకాంక్షని వెలిబుచ్చుతున్నాడు. అతడు బయటికి ప్రవచనాలెన్నో చెప్తాడు. ప్రలోభాలలో పడకుండా తనని తను నియంత్రించుకుంటాడు. కానీ లోలోపలి వున్మత్తత. తీవ్రభావావేశం, అదుపుచెయ్యలేనంత వూహాశక్తి నిలవనివ్వట్లేదు. ఏవేవో ఆశలు అల్లుకుంటున్నాడు. లిజవెతా అతని ప్రలోభంలో పడిపోయింది. ఇప్పుడు అతని వుత్తరాలని తిప్పి పంపేయటం లేదు. చిన్నచిన్నగా జవాబులివ్వటం మొదలుపెట్టి పెద్దపెద్ద ప్రేమలేఖలే రాస్తోంది. ఆమె రాసిన ఆఖరి వుత్తరం ఇలా వుంది.
“ఈరోజు సాయంత్రం ఎంబసీలో బాల్ వుంది. కౌంటెస్‍కూడా వెళ్తోంది. ఆమెతోపాటే నేనుకూడా. మేమక్కడ తెల్లవారి రెండింటిదాకా వుంటాము. నన్ను వంటరిగా కలిసే అవకాశం ఇప్పుడే. ఎలాగో చెప్తాను, అలా చెయ్యి. కౌంటెస్ వెళ్ళగానే పనివాళ్ళందరూ కూడా వెళ్ళిపోతారు. కౌంటెస్ పరిచారికలంతా ఒక గదిలో చేరతారు. కాపలాదారుడొక్కడే వుంటాడు. అతడుకూడా తనగదికి వెళ్ళిపోతాడు నిద్రపోవటానికి. నువ్వు పదకొండున్నరకి రా. రావడంతోటే నేరుగా పై అంతస్థుకి వచ్చెయ్. కిందని ఎవరూ వుండరనే నా నమ్మకం. ఒకవేళ ఎవరేనా కనిపిస్తే మాత్రం కౌంటెస్ వుందా అని అడిగి వాళ్ళ సమాధానం విని వెనక్కి వెళ్ళిపో. కాసేపయాక మళ్ళీ రా. మెట్లెక్కి వచ్చాక ఎడమవైపుకి తిరిగి, తిన్నగా నడిస్తే కౌంటెస్ పడగ్గది వస్తుంది. ఆవిడ పడగ్గదిలో ఒక తెర వుంటుంది. దాని వెనుక రెండు తలుపులుంటాయి. కుడివైపుది ఒక కేబినెట్‍కి దారితీస్తే రెండోది కారిడార్లోకి. ఆ కారిడార్ చివర్న గుండ్రటి మెట్లుంటాయి. అవి ఎక్కితే నా గది వస్తుంది. అక్కడ నాకోసం వేచి వుండు”
హెర్మాన్ పంజా విసరడానికి సిద్ధంగా వున్న వున్న పులిలా నిర్ణీతసమయంకోసం ఎదురుచూస్తున్నాడు. రాత్రి పదింటికే కౌంటెస్ భవంతిముందు వున్నాడు. వాతావరణం భీభత్సంగా వుంది. మంచు కురుస్తోంది. చలిగాలులు బలంగా వీస్తున్నాయి. వేసుకున్న మందపాటి ఓవర్‍కోటువల్ల చలిగాలిగానీ మంచుగానీ ఇబ్బంది పెట్టట్లేదు. అలా నిరీక్షిస్తూ నిలబడ్డాడు. వీధిదీపాలు పెద్ద కాంతివంతంగా లేవు. ఉండుండి మామూలు గుర్రాలతో నడిచే స్లెడ్జి ఒకటి ప్రయాణికులెవరేనా దొరుకుతారేమోనని వెతుకుతూ వెళ్తోంది.
ఎట్టకేలకి కౌంటెస్ బగ్గీ వచ్చింది. ఇద్దరు సేవకులు కౌంటెస్‍ని చేతులమీద తీసుకొచ్చి అందులో కూర్చోబెట్టారు. ఆ వెనుక తాజాపువ్వులతో సిగంతా అలంకరించుకుని లిజవెతా వచ్చింది. ఇద్దరూ ఎక్కి కూర్చున్నాక బగ్గీ తలుపులు మూతపడ్డాయి. మెత్తటి మంచుమీద బగ్గీ భారంగా కదిలింది. సేవకుడు వీధితలుపు వేసాడు. భవంతి కిటికీల్లోంచీ వచ్చే వెలుతురు మాయమైంది.
హెర్మాన్ నిర్జనమైన ఆ ఇంటిముందు అటూయిటూ నడవడం ప్రారంభించాడు. కాసేపటికి ఒక వీధిదీపంక్రింద ఆగి, తన గడియారం వైపు చూసాడు. అది పదకొండూ యిరవై చూపిస్తోంది. అక్కడే నిలబడ్డాడు. కళ్ళు వాచీకే అతుక్కుపోయాయి. మిగిలిన పదినిముషాలు గడవటంకోసం అసహనంగా చూస్తున్నాడు. సరిగ్గా పదకొండున్నర గంటలకు, హెర్మన్ భవంతిమెట్లు ఎక్కాడు. ప్రకాశవంతంగా వున్న ముందుగదిలోకి ప్రవేశించించాడు. సేవకులెవరూ లేరు. హర్మన్ హడావిడిగా మెట్లు ఎక్కి, యాంటీరూమ్ తలుపులు తెరిచాడు. అక్కడొక దీపం పక్కన పాతకాలపు నగిషీలు చెక్కిన కుర్చీలో సేవకుడొకడు కూర్చునే నిద్రపోతున్నాడు. చప్పుడు చెయ్యకుండా అతన్ని దాటుకుని వెళ్ళాడు. యాంటీరూంలోంచీ వస్తున్న కొద్దిపాటి వెలుతురు తప్ప ఇల్లంతా చీకటిగా వుంది.
హర్మన్ కౌంటెస్ బెడ్‍రూమ్‌కి చేరుకున్నాడు. అనేక పాతచిత్రాలతో నిండిన ఒక ప్రార్థనామందిరం ముందు బంగారుదీపం వెలుగుతూ ఉంది. గుర్రపు వెంట్రుకలు, ఎండుగడ్డి, పక్షియీకలు కూరిన, రంగు వెలిసిపోయిన కుర్చీలు, మెత్తటి కుషన్లున్న దీవాన్లు గతవైభవ చిహ్నాల్లా విషాదంగా నిలబడి వున్నాయి. గదిగోడలకి చైనాపట్టు తెరలు వేలాడుతున్నాయి. ఒకవైపు మేడమ్ లెబ్రూన్ ప్యారిస్‌లో చిత్రించిన రెండు చిత్రాలు వేలాడుతున్నాయి. అందులో ఒకటి ప్రకాశవంతమైన ఆకుపచ్చ యూనిఫాంలో వున్న దాదాపు నలభై సంవత్సరాల వయస్సు గల బలిష్టమైన, ఎర్రటిముఖంగల వ్యక్తిది. అతడి చాతీపై ఒక్క నక్షత్రం గుర్తుంది. రెండో చిత్రపటం డేగకులా వంపుతిరిగిన ముక్కుగల ఒక అందమైన యువతిది. ఆమె ముఖంమీది ముంగురులు వాలివున్నాయి. పుప్పొడి వెదజల్లినట్టు పౌడర్ చల్లిన జుత్తులో గులాబిపువ్వుంది. గది మూలల్లో గొర్రెలకాపరి స్త్రీపురుషుల పింగాణీబొమ్మలు, లెఫ్రాయ్ బ్రాండు గడియారాలు, చిన్నచిన్న వస్తువు అనేకం పెట్టి వున్న బేండ్‍బాక్స్‌లు, రౌలెట్ ఆటయంత్రాలు, పంకాలు, గతశతాబ్దాంతంలో స్త్రీలని వుర్రూతలూగించిన ఆటవస్తువులు, మాన్ట్‌గోల్ఫర్ బుడగలు, మెస్మెర్ అయస్కాంతయంత్రాలూ సమస్తం వున్నాయి. గదిని పరికించి చూసాక తెర వెనక్కి వెళ్ళాడు. చిన్న ఇనుపమంచం, దానికి కుడివైపున కేబినెట్‍కి దారితీసే తలుపూ వున్నాయి. అతను ఎడమవైపు తలుపు తీసాడు. మళ్ళీ మనసు మార్చుకుని వెనక్కి తిరిగి చీకటి కేబినెట్ గదిలో కూర్చున్నాడు.
కాలం చాలా నెమ్మదిగా కదుల్తోంది. అంతా నిశ్శబ్దం. డ్రాయింగ్‍రూమ్‍లోని గడియారం పన్నెండు కొట్టింది. ఒక్కొక్కగంటా ప్రతిధ్వనించింది. పన్నెండుగంటలూ వాటి ప్రతిధ్వనీ అయాక అంతా మళ్ళీ నిశ్శబ్దం.
ఎంతోకాలంగా వాడని చల్లటిపొయ్యికి ఆనుకుని నిలబడ్డాడు. ప్రమాదకరమైన తప్పనిసరి పని చెయ్యడానికి అన్నివిధాలా సంసిద్ధుడైనట్టు ప్రశాంతంగా వున్నాడు. గుండెకూడా వుద్వేగమేమీ లేకుండా మామూలుగానే కొట్టుకుంటోంది. ఉదయం వంటిగంటైంది. ఇంట్లోని గడియారం గంట వినిపించింది. ఆ తర్వాత రెండు. దూరాన్న గుర్రపుబగ్గీ చక్రాల చప్పుడు వినిపించింది. అప్పుడు అతన్లో అలజడి మొదలైంది. చక్రాలచప్పుడు దగ్గరై ఆగింది. బగ్గీలోనివాళ్ళు దిగడానికి మెట్లబల్ల వేసిన చప్పుడు. ఆ తర్వాత ఇంట్లో కోలాహలం మొదలైంది. సేవకులు వడావిడిగా అటూయిటూ తిరగసాగారు. వాళ్ళ మాటలు కలగాపులగంగా వినిపిస్తున్నాయి. గదులన్నిటిలో దీపాలు వెలిగించారు. కౌంటెస్ యొక్క ముగ్గురు పరిచారికలూ ఆవిడ పడగ్గదిలోకి వచ్చారు. వారి వెనుకే కౌంటెస్. ఆ వృద్ధురాలి ముఖంలో జీవకళన్నది లేదు. అక్కడే వున్న వోల్టైర్ పడక్కుర్చీలో కూలబడింది. హెర్మాన్ ఒక తలుపుకి వున్న ఒక కంతలోంచీ ఇదంతా చూడసాగాడు. లిజవెతా ఐవనొవ్న అతని సమీపంలోంచే వెళ్ళింది. ఆమె తన గదిలోకి వెళ్ళడానికని వడివడిగా వేసిన అడుగుల చప్పుడు విన్నాడు. ఒక్క క్షణం అతనికి తప్పుచేస్తున్నట్టనిపించింది. కానీ వెంటనే ఆ అపరాథభావనని జయించాడు. మళ్ళీ కఠినంగా మారిపోయాడు. అతనికి తన ధ్యేయం ముఖ్యం.
కొద్దిసేపటికి లేచి కౌంటెస్ పరిచారికల సాయంతో అద్దం ముందు నిలబడి బట్టలు మార్చుకోసాగింది. గులాబీరంగుపూత ఉన్న టోపీ తీసివేసింది. ఆపై పౌడరు అద్దిన
విగ్‍ని. విగ్ తీసెయ్యగానే కత్తిరించబడిన తెల్లటి జుత్తులోంచీ తలపిన్నులు జలజలా రాలిపడ్డాయి. వెండిజరీతో బ్రోకేడ్ చేయబడిన ఆమె పసుపు రంగు శాటిన్ పైదుస్తులు విడిచింది. అవి ఆమెయొక్క ఉబ్బిన పాదాలదగ్గర పడ్డాయి. ఆమె యొక్క అసహ్యకరమైన అలంకరణ రహస్యాలకు సాక్షిగా హెర్మాన్ ఇవన్నీ చూసాడు. చివరిగా కౌంటెస్ తన రాత్రిటోపీ, డ్రెస్సింగ్‍గౌనులోకి మారింది. ఇప్పుడామె తన వయసుకి తగినట్టుగా వుంది. సాధారణంగా వృద్ధులందరిలాగే, కౌంటెస్ కూడా నిద్రలేమితో బాధపడుతోంది. తేలికపాటి దుస్తులలో కొంచెం సౌకర్యంగా వుండటంతో దీపాలు తీసెయ్యమని చెప్పి పరిచారికలని పంపేసి మళ్ళీ వచ్చి వోల్టైర్‌కుర్చీలో కిటికీ దగ్గర కూర్చుంది. పరిచారికలు ఒక్క దీపంమాత్రం వుంచి మిగతావన్నీ ఆర్పేసి పరిచారికలు వెళ్ళిపోయారు. దీపం వెలుతుర్లో ఆమె పాలిపోయిన చర్మం దీపకాంతిని అలముకుని పచ్చగా మెరుస్తోంది. తనలో తను ఏదో గొణుక్కుంటూ వుంటే సాగిపోయిన పెదాలు వూగుతున్నాయి. ఆమెలోని జీవరాహిత్యానికి గాజుగోళాల్లాంటి కళ్ళు అద్దంపడుతున్నాయి. ఆమె కుర్చీలో మిమ్మల్నొక ముందుకీ వెనక్కీ కదుల్తున్న తీరు చూస్తే అదేదో అనాలోచితంగా అనియంత్రితంగా చేస్తున్నట్టు కాక, కుర్చీని తయారుచేసిన గాల్వానిక్ మెకానిజంవలన అన్నట్టనిపిస్తుంది. నిజానికి అది మామూలు కుర్చీయే.
అదే అదను. హెర్మాన్ ఆమెముందు వచ్చి నిలబడ్డాడు. అతన్ని చూడగానే ఆమె ఒక్కసారిగా కదలిక వచ్చింది. ఆమె ముఖంలో ఒక అనిర్వచనీయమైన భావం తొంగి చూసింది. పెదవులు బిగుసుకున్నాయి.
“కదలద్దు. గొడవచేయద్దు. నేను మీకేమీ హాని చెయ్యను. మీరు నాకొక సహాయం చెయ్యాలి”
వృద్ధురాలు ఏమీ వినిపించనట్టు మౌనంగా అతనివైపు చూసింది. ఆమెకు చెముడని నిర్ధారించుకున్నాడు హెర్మాన్. ముందుకి వంగి ఆమె చెవిదగ్గర మళ్ళీ చెప్పాడు. ఆమె అలాగే చలనం లేకుండా వుండిపోయింది.
“మీరు నాకేమీ డబ్బు ఇవ్వక్కర్లేదు. ఒక చిన్న సాయం అంతే. మీరు చేసే ఆ చిన్న సాయం నాకు ఎంతో మేలు చేస్తుంది. నా జీవితాన్నే మార్చేస్తుంది. అంతులేని ఆనందాన్ని నింపుతుంది… మీకు మూడుముక్కలాటలో ఏ ముక్కలు గెలుస్తాయో ఆ రహస్యం తెలుసటకదా, అదేదో నాకు చెప్పి పుణ్యం కట్టుకోండి” హెర్మాన్ చెప్పడం ముగించాడు. వృద్ధురాలు వూపిరి పీల్చుకుంది. అతనికేం కావాలో అర్థమైంది. జవాబు చెప్పటానికి మాటలకోసం వెతుక్కుంది.
“అలాంటిదేం లేదు. ఎవరో పుట్టించిన చతురోక్తి అది” అంది నెమ్మదిగా.
“చతురోక్తి కాదని నాకు తెలుసు. చప్లిట్జ్‌స్కీకి మీరు చెప్తేనే గెలిచాడు” కోపంగా అన్నాడు హెర్మాన్.