
అనుభూతులు పదిలం పదిలం
స్నేహితుడు
పాతకాలపు మనిషి
ఒలీవియా
నాకొద్దీ అభ్యుదయం
అర్హత
అనుభూతులు పదిలం పదిలం- ఆంధ్రభూమి వారపత్రిక
“అమ్మా! నిన్ను చూడాలనుంది. వెంటనే బయల్దేరి రా!” జమ్షెడ్పూర్లో ఇంజనీరింగ్ చదువుతున్న బాబీ వేడ్కోలు. ఎక్కడో వరంగల్‌లో వున్న నేను అంతదూరం వంటరిగా ప్రయాణం చేసి వెళ్ళటమంటే ప్రయాసే అయినా వాడి మాటల్లోని దిగులు నన్నటు అయస్కాంతంలా లాగేసింది.
ప్రయాణం ఏర్పాట్లు చేసుకుంటుంటే మరొక కాల్.. యూయస్నుంచీ.
“అమ్మా! అర్జెంటుగా వెబ్‌కామ్ ఆన్ చేసుకుని కూర్చో. నిన్ను చూడాలనుంది” సముద్రాల అవతల్నుంచి ఉష. చేస్తున్న పనులాపి వెళ్ళి కంప్యూటర్ ముందు కూర్చున్నాను.
“నిన్నటినుంచీ ప్రయత్నిస్తున్నాను నీతో మాట్లాడాలని. ఇప్పటికి తీరింది” ఉష కళ్ళనిండా సంతోషం. అంతలోనే దిగులు.
“ఎంత డబ్బు సంపాదించుకున్నా మన వూళ్ళో మనింట్లో వున్నట్టు వుండదు. తిరిగి యిండియా వెళ్ళిపోదామని నేనంటే… మళ్ళీమళ్ళీ
వస్తామా అని పీయూష్ అంటాడు. అమ్మా! నిన్ను చూస్తే యింత సంతోషంగా అనిపిస్తుంది కానీ, నేను చూసింది నీ బొమ్మని.. నిజంగా నిన్ను కాదని కాసేపటికే అర్ధమై నీ స్పర్శకోసం తపించిపోతాను”
“పెద్దదానివయ్యావు కదమ్మా?”
“నీకంటే చిన్నదాన్నేగా?”
“పిల్లల తల్లివి”
“ఐనా నీ కూతుర్ని”
“ఎలా ఉషా? ఇంటిమీద బెంగ తగ్గించుకోవాలి. నీకేం తక్కువ చెప్పు? చక్కటి చదువు, వుద్యోగం, మంచి భర్త, చురుకైన పిల్లలు… అందరూ అమెరికా వెళ్ళాలని కలగంటారు. నువ్వేంటిలా? అతనొకలా. నువ్వందుకు వ్యతిరేకంగా ఆలోచిస్తే ఎలా చెప్పు? మీయిద్దరిదీ ఒకటే మాట కావాలి. మీ యిద్దర్లో హార్మోనీ లేకపోతే పిల్లల ఆలోచనావ్యవస్థ దెబ్బతింటుంది” నచ్చజెప్పాను.
“మగవారి డాలర్ డ్రీమ్స్ వెనక కూడా ఆడవాళ్ళ త్యాగమేనా? మనం అనుబంధాలన్నీ తెంచుకోవల్సిందేనా?”
ఆపైన ప్రశ్నలు.
“అలా ఎందుకాలోచిస్తున్నావు ఉషా?”
“నీది ఆరుద్రపురుగు రంగు వెంకటగిరి చీర నేను తెచ్చుకున్నాను చూడు, ఎందుకే నేను కట్టే చీర? అన్నావు గుర్తుందా? ఆ చీరని నీ స్పర్శ యింకా అంటే వుందమ్మా! నిన్ను చూడాలని మరీమరీ అనిపించినప్పుడు దాన్ని దిండుమీద పరుచుకుని పడుకుంటాను. అమ్మా… దిండుమీద ఈచీర … అంటారు నా పిల్లలు ఆశ్చర్యంగా. మా అమ్మది… అని జవాబిస్తాను గుసగుసగా. పీయూష్ వినకూడదుగా? తనకిలాంటివి నచ్చవు. సెంటిమెంటల్ ట్రాష్ అనేస్తాడు సింపుల్‌గా”
” నీకక్కడ బాగానే వుంది కదూ?”
“బాగా లేక? అప్పుడప్పుడు బెంగగా ఉంటుంది. సరేగానీ తమ్ముడెలా వున్నాడు? ఎలా చదువుతున్నాడు? వాడినొకసారి మాట్లాడమను”
“వాడికీ బెంగే, యిల్లొదిలి అంతదూరాన్న చదవటం” అన్నాను.
“కానీ తప్పదు కదూ? అన్నీ మనకి నచ్చనివే చేస్తూ మన మంచికోసమే, ఎప్పుడో మనం సుఖంగా వుండటంకోసమే అని నచ్చజెప్పుకుంటూ, ఆ ఎప్పుడో వచ్చాక అప్పుడంత కష్టపడ్డాను కాబట్టే యిప్పుడింత సుఖంగా వున్నానని సుఖానికి నిర్వచనం యిస్తూ బతికెయ్యటం”
కొన్ని సంవత్సరాలక్రితందాకా నేను పాతిక ముప్పై సంవత్సరాల సుదూర భవిష్యత్తు వూహించేదాన్ని. దాని చిత్రం యిలా వుండేది కాదు. ఒక చక్కటి యిల్లు. అందులో నేను, అతుల్…ఉష బాబీల కుటుంబాలు… ‘నేను’ అనే మానవవిత్తనం శాఖోపశాఖలుగా పెరగటాన్ని వూహించుకునేదాన్ని. వాస్తవంలో జరుగుతున్నది వేరు. విత్తనాలు ఎక్కడో విసిరేయబడ్డట్టు మొలకెత్తడం, ఎవరికి ఎవరు ఎవరో… ఎక్కడెక్కడో!
ఉషతో మాట్లాడ్డం పూర్తయ్యేసరికి అతుల్ ట్రెయిన్ రిజర్వేషన్‌తో వచ్చాడు! బాబీ తనకికూడా ఫోన్ చేసాడట. వెళ్ళటానికి తనకి లీవ్ దొరకదట. ఎప్పుడూ వున్నదే. నాకోసం రిజర్వేషన్ చేయించుకొచ్చాడు.
ఉష గురించి చెప్పాను. “అదెందుకో బాగా దిగులుపడుతోంది” అన్నాను నేను కూడా దిగులుగానే. అతుల్ బాధపడ్డాడు. “దగ్గిరైనా దూరమైనా యిండియాలోనైతే వెళ్ళి చూసేవాళ్ళం. అక్కడికి మనం వెళ్ళాలన్నా అది రావాలన్నా బోల్డన్ని ఫార్మాలిటీస్. నేనుకూడా దానితో మాట్లాడతాలే లీజర్‌గా ” అన్నాడు.
వరంగల్‌లో కోణార్క ఎక్స్‌ప్రెస్ ఎక్కాను. కంప్యూటర్ ముందు కూర్చుంటే కాలం గంటలు, నిముషాలు, క్షణాలుగా విభజించబడిన అంకెల గారడీగా మారిపోతుంది. ఆఫీసు టేబుల్‌ముందు అదే కాలం కేలండరు పేజీల్లోకి లుప్తమౌతుందని అతుల్ చెప్తాడు. ఇప్పుడీ రైల్లో ఏమీ చేయాలనిపించక కిటికీలోంచి బైటికి చూస్తూ కూర్చుని కిటికీలోంచీ వేగంగా పరిగెడుతున్న కొండల్నీ, చెట్లనీ, చిన్నాపెద్దా స్టేషన్లనీ చూస్తుంటే దూరం అనేది కాలంగా మారటం తెలుస్తోంది. మొత్తం మీద ఇరవై తొమ్మిది గంటల ప్రయాణం.
పిల్లలు చిన్నవాళ్ళుగా వుండి ఇంటిపనితో సతమతమౌతూ వున్నప్పుడు ఒక్క క్షణం తీరిక దొరికితే చాలు, ఎన్నో చెయ్యాలనుకునేదాన్ని. ఎన్నో పుస్తకాలు చదవాలని వూహించుకునేదాన్ని. పిల్లలు పెద్దవాళ్ళై కావాల్సినంత తీరిక దొరికాక చదివే అలవాటు తప్పిపోయింది. బేగ్లో పుస్తకాలున్నా అవి హస్తాలంకారానికే. ఇప్పుడూ అంతే. ఏమీ చేయాలనిపించలేదు. కిటికీలోంచీ బైటికి చూస్తూ కూర్చున్నాను. ఎదురుగా ఒక సిక్కు, పక్కని తెలుగతను. మేం ముగ్గురమే వున్నాము. వాళ్ళు మధ్య మధ్యలో నన్ను చూసీ చూడనట్టు చూస్తూ ఏవో మాట్లాడుకుంటున్నారు. నాకు పరిచయం చేసుకోవాలనిపించలేదు. అలాగే కిటికీలోంచీ చూస్తూ కూర్చున్నాను.
ఖమ్మం స్టేషన్ వచ్చింది. ఎవరో ముసలమ్మ. అడుక్కోవడానికి వచ్చింది.
సిక్కు ఆమెని చూసి కదిలిపోయాడు. “నీకు కొడుకుల్లేరా?” అడిగాడు వెంటనే.
“ఉన్నారు. ఇద్దరు” జవాబిచ్చింది.
“ఇద్దరు కొడుకులుండి నిన్నిలా వదిలి పెట్టడమేంటి?” సిక్కతని ప్రశ్న.
రెండు అరటిపళ్ళు తీసిచ్చాడు. రైలు కూత కూసి, కదిలింది. అతనింకా బాధపడుతూనే వున్నాడు.
“మా రాష్ట్రంలో తల్లిని యిలా వదిలిపెట్టం. అమ్మకదా!” అంటున్నాడు. తెలుగుతను యిక్కడి పరిస్థితులను వివరిస్తున్నాడు. ఎదిగీ ఎదగని
పిల్లలు వుద్యమాల్లోకి వెళ్ళటాన్నిగురించీ, రైతుల ఆత్మహత్యల గురించీ, పాలమూరు కూలీల వలసల గురించి ఎన్నో చెప్తున్నాడు.
“అమ్మని మన నుంచి వేరుగా ఎలా చూడగలుగుతున్నారు? మన యింట్లోనూ మన సంస్కృతిలోనూ భాగం కదా?”
తెలుగతను నవ్వి వూరుకున్నాడు. వాళ్ళ సంభాషణ ఆగిపోయింది. తెలుగుతను నాతో పరిచయం చేసుకున్నాడు.
“ఎక్కడి దాకా వెళ్తున్నారు?” అడిగాడు. చెప్పాను.
చెప్పాను.
“అక్కడ ఎవరున్నారు?”
దానికీ చెప్పాను.
“అంతదూరం మీ అబ్బాయిని పంపించాలంటే బాధనిపించలేదా?” అడిగాడు.
నేను చిన్నగా నవ్వి “మా బాధలూ, వుద్వేగాలూ మీ జీవితాలనీ కెరీర్‌నీ ప్రభావం చెయ్యకూడదు కదా?” అన్నాను.
“అందరు తల్లిదండ్రులూ అలా ఆలోచించరు. మా పేరెంట్సు నన్ను దూరం పంపించి చదివించడం యిష్టంలేక లోకల్లోనే వుంచి చదివించారు. మాది శ్రీకాకుళం. అక్కడే చదివాను. కానీ ఈ రోజుల్లో ఏం చదివావు అనేదానికన్నా ఎక్కడ, ఏ యిన్‌స్టిట్యూట్‌లో చదివారనేది ముఖ్యం. డిగ్రీ పూర్తై రెండేళ్ళైంది. కంప్యూటర్ కోర్సులు కూడా చేసాను. జాబ్ లేదు. ఎప్పుడొస్తుందో తెలీదు. ఇంట్లో గొడవ ఇంత ఖర్చుపెట్టి చదివించాం, ఇంకా జాబ్ రాలేదని” అన్నాడు. అతని కళ్ళలో నైరాశ్యం నీడలా పరుచుకుంది. అతనికి ఓదార్పు అక్కర్లేదు. తను చెప్పినదాంట్లోని వాస్తవాన్ని గుర్తిస్తేచాలన్న తపన వుంది. గుర్తించినట్టు తలూపాను.
తర్వాత మా సంభాషణ ఆగిపోయింది. రాత్రికి యింటి నుంచీ తెచ్చుకున్న చపాతీలు తిన్నాను.
వైజాగ్‌లో సముద్రపు గవ్వల్తో చేసిన రకరకాల బొమ్మల్తో ఎక్కాడొక వ్యక్తి, అద్భుతమైన సృష్టి. ఫ్లవర్వేజ్లు, పూలగుత్తులు అన్నీ గవ్వల్తోటే. షాపులో షోకేసులో పెడితే వందలూ వేలూ పలికే బొమ్మల్ని పాతిక్కీ యాభైకీ యిస్తున్నాడు. రెండు బొమ్మలు కొని జాగ్రత్తగా చీరల మడతల మధ్య కదలకుండా పెట్టాను. ట్రెయిన్ దిగగానే ఒకటి యింటికీ ఒకటి ఉషకీ పార్సెల్ చెయ్యాలని మననం చేసుకుంటూ నిద్రపోయాను.
పలాసా దగ్గరపడ్తుంటే ఎవరో తట్టిలేపినట్టు మెలకువ వచ్చింది. బెర్త్మీంచీ దిగాను. స్టేషన్ వచ్చేసింది. ప్లాట్‌ఫామ్, లైట్లు, హడావిడిగా తిరుగుతున్న జనం. ఒక్కసారి దిగాలనిపించింది. రైల్లోంచి దిగి, ప్లాట్ఫామ్మీద నిల్చున్నాను. మనసంతా వుద్వేగం.
నా జీవన ప్రస్థానం ఈ వూరికి దగ్గర్లోని ఒక పల్లెటూర్లో మొదలైంది. ఎక్కడికెళ్ళాలన్నా యిదే రైల్వే స్టేషను. కొన్ని పదులసార్లు ఈ
ప్లాట్‌ఫాంమీద నడిచి, ఆ బెంచీలమీద కూర్చుని, రైలు కోసం ఎదురుచూసి, నా వుచ్చ్వాసనిశ్వాసాలతో యిక్కడి గాలిలో విలీనమై వుంటాను. మళ్ళీ యిక్కడికి రావాలని ఎన్నిసార్లనుకున్నా రాలేకపోయాను.
ఆస్తులున్నవారికి అనుబంధాలుంటాయి. నా యిల్లు, నా వూరు, నావాళ్ళూ అనే మనుకారాలుంటాయి.
“స్వంతిల్లున్నవాడికి ఒకటే యిల్లు. అది లేనివాడికి అన్నీ యిళ్ళే”? అనేవారు నాన్న. సంపాదిస్తూ, ఖర్చుపెడ్తూ విలాసంగా గడిపేసాడాయన. ఒక్క అన్నయ్య నాకు. వాడు జీవితంలో నిలదొక్కుకోవడానికి చాలా స్ట్రగుల్ చేసాడు. ఇప్పటికీ చేస్తున్నాడు. ప్రైవేటు ఉద్యోగం. చాలీచాలని
జీతం.
పెద్దతనంలో అమ్మానాన్నా చాలాకాలం వృద్ధాశ్రమంలో వున్నారు. వాళ్ళని తీసుకెళ్ళి తన దగ్గరుంచుకోలేదు అన్నయ్య. నేను రమ్మన్నా రాలేదు. తమమధ్య బాంధవ్యాలు ఎందుకిలాంటి టర్న్ తీసుకున్నాయనే విశ్లేషణ మొదలైంది వాళ్ళలో. స్వంతిల్లు ఏర్పరుచుకోకపోవటంలో, వున్న యిద్దరు పిల్లల జీవితాలనీ అందంగా మలచకపోవటంలో తమ వైఫల్యంకన్నా ఎక్కువగా బాధ్యతారాహిత్యం కనిపించింది. సమాజానికి అనుగుణంగా తాము ప్రవర్తించలేద, పర్యవసానంగా పిల్లలూ ప్రవర్తించలేదనే నిర్ణయానికి వచ్చాక, వాళ్ళకింక తమ జీవితం సౌందర్యరహితంగానూ అర్ధవిహీనంగానూ కనిపించింది. దిగులుతో ఒకరి తర్వాత ఒకరు చనిపోయారు.
రైలు కూత కూసింది. చప్పుని ఎక్కేసాను. డోర్ వేసేసి నా బెర్త్ దగ్గరకెళ్ళాను. సిక్కు నేను దిగటం చూసినట్టున్నాడు.
“ఎందుకు దిగారు?” స్వచ్ఛమైన యింగ్లీషులో అడిగాడు.
నా భావోద్వేగాన్ని వ్యక్తపరచాలనిపించింది. “నా చిన్నప్పటి వూరు. నేను తిరిగిన వూరు” చెప్పాను.
“అమ్మ కూడా అలాంటిదే కదూ? కన్నతల్లీ, స్వంతవూరు”
నేను అవాక్కయ్యాను. నా తండ్రి బాధ్యతారాహిత్యం, వోఖాపురి ఎక్స్ ప్రెస్‌లో క్రిక్కిరిసిపోయి ఒరిస్సానుంచీ గుజరాత్‌కి వలస వెళ్ళే కూలీలు,
ఎన్నో కట్నం చావుల వెనక దన్ను నిలబడే మగవాడి అమ్మలు. వీళ్ళంతాకూడా యీ సంస్కృతిలో భాగమే. కానీ ఏవీ కూడా అతన్తో చర్చించలేదు. అతనే నా మనసు చదివినట్టు అన్నాడు. “ఏ సమస్యేనా వ్యక్తిగతం. అమ్మ అనేది మన సంస్కృతి నాగరీకతలకి సంకేతం. ఆమె పెంచితేనేగా మనం యిలాగో, మరొకలాగో, అసలెలాగో ఒకలా తయారయేది? ఆమె వంటరిగా మిగిలేప్పటికే ఎంతోకొంత నాన్న పురుషాధిక్యతకీ మన బాల్యానికి ఖర్చైపోయి వుంటుంది. మిగిలిన కొద్దిభాగం కోరేది మన దయ, కరుణ, అవి కూడా లేనివాళ్ళమైతే ఎలా?”
తెలుగు యువకుడిలా నేనూ నిస్సహాయంగా నవ్వి వూరుకున్నాను.
బెర్త్ మీదికి చేరాను. మళ్ళీ ఏవో జ్ఞాపకాలు.
నాకప్పుడు ఇరవైనాలుగేళ్ళు, బియ్యెస్సీ పూర్తైంది. ఉద్యోగంలో చేరాలనుకుంటున్నాను. నా పెళ్ళి ప్రస్తావన యింట్లో యింకా రాలేదు. అన్నయ్య అప్పటికే బియ్యే చదివి ఏదో చిన్న వుద్యోగం చేస్తున్నాడు. ప్రైవేట్‌గా పీజీ కూడా చేసాడు.
“అమ్మావాళ్ళూ నీపెళ్ళి చేస్తారనే ఆశ నీకుందేమోగానీ అలాంటి నమ్మకం నాకేమీ లేదు. నా ఫ్రెండు అతుల్. బెంగాలీ. తల్లీతండ్రీ చిన్నప్పుడే చనిపోతే తాతగారి దగ్గర పెరిగాడు. నువ్వంటే యిష్టం. మన కుటుంబపరిస్థితులు తెలుసు. నిన్ను పెళ్ళి చేసుకుంటానన్నాడు. చదువు, మంచి వుద్యోగం. ఇంతకన్నా మంచి మేచ్ నీకు రాదు” అన్నాడు.
నేను తెల్లబోయాను. అతుల్‌ని అన్నయ్యతో రెండుమూడుసార్లు చూసాను.
“అమ్మా, నాన్నా?” అన్నాను.
“వాళ్ళకలాంటి పట్టింపులుంటాయని నేననుకోను. ఉన్నా బాధ్యత తప్పుతుందని వప్పుకుంటారు”
“అన్యాయంగా మాట్లాడుతున్నావు”
“నాన్నగారి బాధ్యతారాహిత్యంవల్ల మనం ఎంత అన్యాయమౌతున్నామో యింకొన్నాళ్ళు పోయాక నీకే తెలుస్తుంది”
“నీకు తెలిసిందా?”
“తెలిసింది. నాకూ అతుల్కీ గల తేడా చూడు. తల్లితండ్రీ లేకపోయినా వాడికి తాతగారు అన్నీ అమర్చారు. ఏం చెయ్యచ్చో, ఎలా వుండాలో అన్నీ దగ్గరుండి గైడ్ చేసారు. ఆ తర్వాత వాడికి నచ్చిన అమ్మాయిని చేసుకునే స్వేచ్ఛనిచ్చారు. నేను? పర్సనల్రూమ్ కూడా లేని యింట్లో మామూలు గవర్నమెంటు కాలేజీలో చదువుకున్నాను. ఇంటినిండా ఎప్పుడూ బంధువులు, ఫ్రెండ్సు. కాంపిటీటివ్ ఎగ్జామ్స్ ఎలా రాయగలనో ఆలోచించు. వీధిదీపాల ముందు కూర్చుని చదువుకున్న వాళ్ళు లేరా అని వాదించకు. మొండిగా చెప్పాలంటే అది వాళ్ళ కర్మ. గత్యంతరం లేక. అంతే తప్ప అవకాశం వుండీ అదో అభినివేశం కాదు. సున్నితంగా చెప్పాలంటే నేనంత తెలివైనవాడిని కాను. అన్నీ అనుకూలంగా వుంటేనే ప్రతిభని చూపించగలను. అదీ సామాన్యమైన ప్రతిభని. ఈ పెళ్ళిళ్ళూ, పార్టీలూ, వూళ్ళెళ్ళడాలూ, ఎవరెవరో మనింటికి రావడాలూ యివన్నీ తగ్గించి నాన్నగారు నామీదా నీమీదా కొంత శ్రద్ధ కనబరిస్తే బావుంటుందనిపిస్తుంది”
నిజమే! నాన్నగారు యిల్లు పట్టించుకోరు. అమ్మ ఆయన నీడ. డబ్బు అంతంత మాత్రమే.
“నేనిప్పుడేం చెయ్యను?”
“అతుల్‌ని పెళ్ళి చేసుకో. నేను దగ్గరుండి జరిపిస్తాను”
“భయంగా వుంది”
“ఐతే జీవితాంతం అమ్మానాన్నలకి సేవ చేసుకుని తరించు పెళ్ళి మానేసి”
ఆ తర్వాత అతుల్ నాతో మాట్లాడాడు. మూడు యింగ్లీషు పదాల్లో కాకుండా హావభావాల్లో తన ప్రేమని వ్యక్తపరిచాడు. తనకి నేనంటే చాలా యిష్టమట. నాకూ అలాంటి యిస్టం వుంటే పెళ్ళి చేసుకుందామన్నాడు. వయసులో వున్న అమ్మాయితో అన్ని అర్హతలూ గల యువకుడు అలా అంటే కాదనగల శక్తి ఎవరికీ వుండదేమో!
అన్నయ్య అమ్మానాన్నలతో మాట్లాడాడు.
“ఇప్పుడు దాని పెళ్ళికి తొందరేంటి? బియ్యెస్సీ చదివింది. ఏదో వుద్యోగం చూసుకుంటుంది. అప్పుడాలోచిద్దాం” అన్నారు నాన్న ఏమాత్రం వుత్సాహం చూపించకుండా.
“అప్పుడేనా మీరో లక్షో యాభైవేలో ఖర్చుపెట్టగలరా? “సూటిగా అడిగాడు అన్నయ్య. ఆ ప్రశ్నకి నాన్న దగ్గర జవాబు లేదు.
“తన ఫ్రెండ్సందరికీ పెళ్ళిళ్ళైపోయాయి. ఇదొక్కర్తే మిగిలివుంది. తోటివాళ్ళంతా భర్తలవెంట పిల్లల్ని ఎత్తుకుని తిరుగుతుంటే యిది వుద్యోగం చెయ్యాలా? ఏం వుద్యోగం? డిగ్రీకి ఏం వుద్యోగం వస్తుంది? ఐనా నాలుగేళ్ళనుంచీ ప్రయత్నిస్తుంటే నాకే రాని వుద్యోగం దీనికొస్తుందా? ఏ ప్రైవేటు కంపెనీలోనో చెయ్యాలి. అదంత అవసరమా? ఎందుకు నాన్నా, మీరు లోకం పోకడననుసరించి వెళ్ళరు?” తనే మళ్ళీ అడిగాడు.
నాన్న లేచి వెళ్ళిపోయారు.
అన్నయ్యే నిర్ణయం తీసుకుని పెళ్ళి తేదీ ప్రకటించాడు. “నువ్వింకా చదివి లేదా పుద్యోగం సంపాదించుకుని ఏదో సాధించాలనేది నాన్న ఆకాంక్ష కావచ్చు. అవన్నీ పెళ్ళయ్యాక కూడా చెయ్యచ్చు. అతుల్ ఈ క్షణాన మాత్రమే నువ్వందుకోగలిగే అవకాశం” అన్నాడు.
సివిల్ మేరేజికి అప్లై చేసాము నేనూ, అతుల్. అమ్మ, నాన్న నాతో మాట్లాడటం మానేసారు. అంతకన్నా వాళ్ళు నువ్విలా చెయ్యటం మాకిష్టం లేదు, నీ పద్ధతి మార్చుకో అని కోప్పడి వుంటే మామధ్యనున్న బాంధవ్యాలకి విలువ వుండేదేమో!
కానీ నాన్న స్వప్నాల్లో బ్రతికే వ్యక్తి.
పెళ్ళిరోజు నన్ను కేజువల్గా బైటికి తీసుకెళ్తున్నట్టు రిజిస్ట్రారాఫీసుకి తీసుకెళ్ళాడు అన్నయ్య. దండలు మార్చుకుని సంతకాలు పెట్టడంతో
పెళ్ళైంది. అన్నయ్య, అతుల్ తాతగారు సాక్షిసంతకాలు చేసారు. మన మంగళసూత్రాలకి వాళ్ళ సాంప్రదాయంలో సమానమయే దంతపుగాజులు అతుల్ నాకిచ్చాడు. ఇంటికి తీసుకురావద్దని నాన్న చెప్పారట. పెళ్ళవగానే ఫ్రెండ్స్‌కి చిన్న ట్రీట్ యిచ్చి, అట్నుంచీ అటే రైలెక్కాము. అదే పలాసా స్టేషన్‌తో నా ఆఖరి అనుబంధం. రైలెక్కిస్తూ అన్నయ్య నా చేతుల్ని పట్టుకుని ఏడ్చేసాడు. అతుల్ అన్నయ్య భుజం తట్టి ఓదార్చాడు. నేను చేసింది తప్పే కావచ్చు, కానీ అదొక్కటీ తప్ప విచారించవలసిన సందర్భాలేవీ అతుల్ సృష్టించలేదు.
ఆలోచనల్లో ఎప్పుడు నిద్రలోకి జారుకున్నానోగానీ భువనేశ్వర్‌లో ప్లాట్‌ఫారమ్ మీద హడావుడికి మెలకువ వచ్చింది. తెలుగు యువకుడు ఎప్పుడో దిగిపోయాడు. సిక్కు బేగ్ సర్దుకుని దిగటానికి రెడీగా వున్నాడు. నన్ను చూసి గౌరవంగా విష్ చేసి, దిగిపోయాడు. షాల్ మడతపెట్టి హేండ్‌బేగ్‌లో పెట్టుకుని, సూట్‌కేసు తోసుకుంటూ దిగాను. పెద్ద వర్షం పడుతోంది. రిటైరింగ్ రూమ్ తీసుకున్నాను. కొద్దిసేపు విశ్రాంతి స్నానం చేసి, కేంటిన్లో టిఫెన్ తిని, వైజాగ్‌లో కొన్న బొమ్మలు బేగ్లో పెట్టుకుని స్టేషన్ బైటికొచ్చాను. వర్షం పూర్తిగా తగ్గింది. చెట్ల ఆకుల మీద నిలిచిన నీటి బిందువులమీద సూర్యకిరణాలు పడి పరావర్తనం చెందుతున్నాయి.
దార్లో ఒక పెద్దచెట్టు. దానికి ఒకేఒక్క లేత నీలిరంగు పువ్వు. వంటరితనంతో దిగులుగా వున్నట్టనిపించింది. కోసి బేగ్లో వేసుకున్నాను. మళ్ళీ నాకే అనిపించింది. నా బేగ్లో వున్న అసంఖ్యాకమైన ప్రాధాన్యత లేని వస్తువుల మధ్య దాన్నలా వేస్తే యింకా బాధపడ్తుందని…వక్కపొడి వేసుకునే జువెల్రీ బాక్స్ ఖాళీ చేసి అందులో పెట్టి కొంత ప్రాధాన్యత కల్పించాను. ముదురు నీలిరంగు వెల్వెట్ మీద లేత నీలిరంగుతో అది సోయగాలు పోయింది. మనిషిని పట్టి వుంచే ఫ్రేమ్… కుటుంబం అనేది అందంగా వుంటే అందులోని ఆ మనిషికీ అందం వస్తుంది. అదే సోషల్ యీస్టటిక్స్. సామాజిక సౌందర్యం.
చాలాదూరం నడిచాక కొరియర్ ఆఫీసు కనిపించింది. విదేశాలకి కూడా వాళ్ళు పంపుతారట. అక్కడే బొమ్మల్ని పొందిగ్గా పేక్ చేయించి పంపేసాను. బొమ్మ అందగానే వుష సంతోషపడుతుంది. కానీ పీయూష్?
తిరిగి స్టేషనుకొచ్చాను. రాత్రి పదిన్నరకి రైలు. సుదీర్ఘ విరామం. మనిషిని బాధపెట్టే విషయాల్లో నిర్వ్యాపారత్వం ఒకటి. ఒరిస్సా టూరిజం బస్సు కోణార్క, పూరీ వెళ్తోందని తెలిసింది. టికెట్ కొనుక్కుని బస్‌లో కూర్చున్నాను. మళ్ళీ వర్షం. బస్సు నిండా జనం. జంటలుగా గుంపులుగా నేనొక్కదాన్నే వాళ్ళమధ్య వంటరిగా. వాక్‌మెన్ చెవులకి తగిలించుకున్నాను.
బస్సు కదిలింది. అరవై కిలోమీటర్ల ప్రయాణం. రెండు గంటలు పట్టింది కోణార్క చేరేసరికి. అతుల్‌తో అప్పుడెప్పుడో అల్లరల్లరిగా తిరిగిన ప్రదేశాలు. ఆకాశాన్నంటే గుడి.. గుడి వెనుక సముద్రపుహోరు. ఆ శిథిలాలయాన్ని చూస్తుంటే, గుండెల్నిండా చెమ్మలా పాకుతున్న బాధ. వెళ్ళి సముద్రపువడ్డుని నిలబడ్డాను. కాసేపటికి మళ్ళీ ప్రయాణం. ఈమాటు పూరీకి. అవే చెట్లు, అవే ఆకులు, అదే వంటరితనపు బాధ. పూరీలో కూడా సముద్రాన్ని చూసాను. మహానది కలుస్తుండటం చేత నీళ్ళు నల్లగా వున్నాయి.
తిరిగి రిటైరింగ్ రూమ్ చేరేసరికి ఆరున్నర. ఒక్కదాన్నీ గదిలో వుండలేక సామాన్లు తీసుకుని జనరల్ వెయిటింగ్ రూమ్‌లోకి వచ్చి కూర్చున్నాను. ఫైనార్ట్స్ పిల్లలు కూర్చున్నవాళ్ళని కూర్చున్నట్టు బొమ్మలు గీస్తున్నారు. వాళ్ళ కాగితాలమీద స్కెచ్చిగా కాసేపు మారిపోయాను.
రాత్రి పదీనలభైయైదుకి పురుషోత్తం ఎక్స్‌ప్రెస్‌లో టాటానగర్కి ప్రయాణం. చేరేసరికి వుదయం ఆరుంబావు. బాబీ స్టేషనుకొచ్చాడు నన్ను రిసీవ్ చేసుకోవడానికి. తన వెంట ఏడెనిమిదిమంది ఫ్రెండ్స్. నన్ను చూడగానే వాళ్ళందరి కళ్ళల్లో సంతోషపు మెరుపు. కొందరైతే నాకు తెలీనే తెలీదు. ఇంకొందరు ఫోన్లో పరిచయం. ఒక్కొక్కరూ ఎంతోకాలంనుంచీ పరిచయం వున్నట్టు ఆప్యాయంగా మాట్లాడుతున్నారు. అందరూ వాళ్ళ సాంప్రదాయం ప్రకారం వంగి నా కాళ్ళని స్పృశించారు.
“దగ్గర్లోనే హోటల్లో రూమ్ తీసుకున్నానమ్మా! నువ్వెన్ని రోజులుంటే అన్నిరోజులూ నీతోటే వుంటాను” అన్నాడు బాబీ చిన్నపిల్లవాడిలా.
హోటల్‌కి వెళ్ళాము. ఇంటి దగ్గర్నుంచి తెచ్చిన కారప్పూస, లడ్డూలు పేపర్ ప్లేట్లలో పెట్టి అందరికీ యిచ్చాను. ప్రీతిగా తిన్నారు.
మూడురోజులున్నాను టాటానగర్‌లో. అదే జమ్షెడ్పూర్. టాటాలని దేశానికి అందించిన ఆ వూరు పెద్దగా డెవలపవలేదు. అంతా లేబర్ కల్చర్.
ఇండస్ట్రియల్ లేబర్ బాగా ఎక్కువలాగుంది. శని, ఆదివారాలు కావటంతో బాబీ పూర్తిగా నాతోనే వుండిపోయాడు. క్షణం కూడా విడవకుండా ఒకటే కబుర్లు. తల్లిదండ్రులపట్ల యింత ఎటాచిమెంటుతో వుండే పిల్లల్ని మనమే చదువుల పేరిట, వుద్యోగాల పేరిట దూరం చేసుకుంటున్నాం అనిపించింది. బాబీ ఎంత బెంగటిల్లాడో చూస్తుంటేనే అర్థమైంది. ఊరు కాని వూరు, భాష తెలియని మనుషులు.
“ఇంకో రెండేళ్ళు కష్టపడ్డావంటే సెటిలౌతావు” నచ్చజెప్పాను.
“అప్పుడే ఎక్కడమ్మా? జీజాజీ స్టేట్స్ రమ్మంటున్నారా? ఉషక్క కూడా అంది” అన్నాడు. హతాశురాలినయ్యాను. ఈ బెంగ ఒక పార్శ్వం, కెరీర్ పట్ల ఆశ మరో పార్శ్వం.
సోమవారం బాబీ ముఖ్యమైన క్లాసులున్నాయని కాలేజీకి వెళ్ళిపోయాడు. హోటల్ రూమ్‌లో నాకు మళ్ళీ వంటరితనమే. మంగళవారం తిరుగు
ప్రయాణమయాను. ఉదయాన్నే స్టీల్ఎక్స్ప్రెస్కి ఎక్కించాడు బాబీ. రైలు కదుల్తుంటే వాడి కళ్ళలో పల్చటి కన్నీటిపొర. నా గుండెల్లో ఎక్కడో కలుక్కుమంది. కనుమరుగయేదాకా యిద్దరం చెయ్యూపుతూనే వున్నాం.
ఖరగ్‌పూర్ చేరేసరికి తొమ్మిదిన్నర. అక్కడినుంచీ నన్ను గమ్యం చేర్చడానికి ఈస్ట్‌కోస్ట్ ఎక్స్‌ప్రెస్ వుంది, అక్కడి నేలమీద అడుగుపెట్టగానే వళ్ళు ఝల్లుమంది అతుల్‌ని తాకిన మొదటిసారిలాగే. రవీంద్రుడినీ, శరత్‌నీ, యిద్దరు బోసుల్నీ అందించిన బెంగాలీ నేల.
ఏకంగా ఒక ఐఐటీయే వున్నా, చాలా చిన్నవూరు ఖరగ్‌పూర్. పొడవైనదిగా ప్రపంచం ప్రసిద్ధి చెందిన ప్లాట్‌ఫామ్. దాన్నే మూడుగా విభజించారు. వెయిటింగ్‌రూమ్ పాతకాలపు కట్టడంలా వుంది. పైనమాత్రం రేకులు.
ఇంతలో ఆకలిగా అనిపించింది. కేంటిన్‌కి దారితీసాయి నా కాళ్ళు. థాలీ ఆర్డరిచ్చానుగానీ ఒక్క ముక్క కూడా తినలేకపోయాను. స్టేషన్లో బాబీ కంటితడి ఒక్కసారిగా గుర్తొచ్చి నన్ను వుక్కిరిబిక్కిరి చేసింది. పదార్థాలన్నీ వదిలిపెట్టి కొద్దిగా పెరుగన్నం తిని లేవబోతుంటే నన్నే గమనిస్తూ నిలబడ్డ ముసలి వెయిటరు-
“ఏమైంది కూతురా?” అనడిగాడు బెంగాలీని వీలైనంత హిందీగా మార్చి. బాబుని వదిలిపెట్టి వచ్చిన విషయం మనసు కలతబారిన సంగతి చెప్పాను. అతడు తాత్వికంగా నన్వాడు.
“పిల్లలు మనమీద ఆధారపడి వున్నంతవరకే ఈ ఆరాటాలు, తాపత్రయాలు. ఉద్యోగాలొచ్చి, పెళ్ళిళ్ళైపోయాక వాళ్ళెవరో మనం ఎవరో” అన్నాడు.
అతడికి ఎనిమిదిమంది పిల్లలట. ఐదుగురు ఆడ, ముగ్గురు మగ. అందరికీ పెళ్ళిళ్ళయ్యాయని చెప్పాడు. దుర్గాపూజకి పిల్లలందర్నీ పిలిచి, బట్టలు పెట్టి వేడుగ్గా పండుగ జరుపుతాడట. జీవనసాఫల్యం కనిపించింది అతని మాటల్లో. అంతలోనే-
“పండుగవగానే ఎక్కడివాళ్ళక్కడికి వెళ్ళిపోతారు. మిగిలేది నేనూ నా భార్యే” అన్నాడు వైరాగ్యం ధ్వనించేలా.
అతుల్ గురించి, పిల్లల గురించి అడిగాడు. బాబీ యింతదూరం వచ్చి చదువుతున్నాడనీ, వాడిని చూడటానికి నేను రాష్ట్రాల అవతల్నుంచీ వంటరిగా వచ్చాననీ విని ఆశ్చర్యపోయాడు. ఉష అమెరికాలో వుందన్న విషయం విని యింకా ఆశ్చర్యపోయాడు. నాకూ తనకీగల స్థాయీభేదాన్ని అప్పుడే గుర్తించినట్టు ముడుచుకుపోయాడు. కానీ-
“ఏమైంది కూతురా?” అన్న అతని పలకరింపులోని ఆర్తి నా మనసునిండా మలయపవనంలా తాకుతూనే వుంది. అతనితో మాట్లాడుతూ వదిలిపెట్టినవన్నీ తిన్నాను. కడుపు నిండింది. లోపలి అలజడి చల్లారింది. నా హృదయం అతని యింటిని వెతుక్కుంటూ వెళ్ళింది. ఎనిమిదిమంది పిల్లల కుటుంబాల మధ్య దుర్గాపూజ జరుపుకుంటున్న దృశ్యాన్ని రమ్యంగా చిత్రించుకుంది. అలాంటి కుటుంబంలో నాకు భాగం లేనందుకు సన్నటి అసంతృప్తిరేఖతో తిరిగి నన్ను చేరుకుంది.
దార్లో తిందామని జమ్షెడ్పూర్లో కొన్న రసగుల్లాలు తీసి, అతనికిచ్చాను.
“ఎందుకు కూతురా?” మొహమాటపడ్డాడు.
“కూతుర్నన్నారుగా? ” నవ్వాను. అతను తీసుకుని కృతజ్ఞతలు తెలిపాడు.
ఈస్ట్‌కోస్ట్ ఎక్కాను. కిటికీ పక్క సీటు. ఎక్కిన దగ్గర్నుంచీ గమనించాను… వంటిమీద చిన్న ఆచ్చాదన మాత్రమే వున్న బెస్తవాళ్ళు రైలాగినప్పుడల్లా కేన్లూ, ప్లాస్టిక్బిందెల్తో దిగి, ట్రాక్ పక్కనున్న కుంటల్లోంచీ నీళ్ళు ముంచుకుని ఎక్కుతున్నారు. హడావిడి, తోపులాట, రైలెళ్ళిపోతుందేమోనన్న కంగారు. పడుతున్నారు, లేస్తున్నారు. ఎక్కుతున్నారు. వింతగా చూసాను.
తర్వాత తెలిసింది. ఈ రైల్లో ఏలూరుదాకా చేపల రవాణా జరుగుతుందనీ, ఎప్పటికప్పుడూ నీళ్ళు మారుస్తూ చేపలు చనిపోకుండా చూసుకోవలసిన బాధ్యత వాళ్ళదేనని. బ్రతుకు పోరాటంలో వాళ్ళ మనసులు నిద్రాణంగా వున్నాయి. ఉన్నదల్లా ఐదారడుగుల శరీరం. దాన్ని నియంత్రించే జానెడు పొట్ట. ఆ పొట్టకోసం తిప్పలు. నిట్టూర్చాను.
భువనేశ్వర్ చేరేసరికి చీకటిపడింది. మహానదికి ఎన్ని వంతెనలో! ఒరిస్సా ప్రభుత్వ ఆదాయమంతా ఈ వంతెనలు కట్టడానికీ వాటి నిర్వహణకే సరిపోతుందేమో!
వైజాగ్ స్టేషన్లో నా సెల్ మోగింది. అతుల్.
“నీకోసం ప్లాట్‌ఫామ్ మీద వున్నాను. ఎదురుచూస్తున్నాను. అసలు భువనేశ్వర్‌లోనే యింటర్సెప్ట్ చెయ్యాల్సింది. అంత టైం లేకపోయింది.
ఈవేళ, రేపు ఆఫ్ అని వుదయమే తెలిసింది. వెంటనే రైలెక్కేసాను”
నా గుండె గువ్వపిట్టలా కువకువలాడింది. రైలాగీ ఆగగానే దిగేసాను. అతని రెండు బలమైన చేతులూ ఆర్తిగా నన్నల్లుకున్నాయి.
“హౌ ఆర్యూ?” చెవుల్లో గుస గుస.
రాత్రికి హోటల్లో వుండి పొద్దున్నే బీచికి పరిగెత్తాము. ఎంత అందమైన వుదయం! రాత్రంతా అలలు విసిరిన గవ్వలేరుకోవడానికి బెస్తపిల్లలు అప్పటికే వచ్చేసి వున్నారు. వాకింగ్ కి వచ్చినవాళ్ళు, సూర్యోదయాన్ని చూడటానికి వచ్చినవాళ్ళు, నీరవనిశ్శబ్దంలో చిరు సందడి.
అతుల్ తన జేబులోంచీ ఒక బాక్స్ తీసాడు. నాకు ప్రియాతి ప్రియమైనది. చిన్న మంచి గంధం పెట్టె. దాంట్లో ఒకే ఒక సంపెంగపువ్వు, ఎండి
పోయి, ఐనా సువాసన వదలక. మా పెళ్ళిరోజున అతుల్ నా జడలో పెట్టినది.
“మన ప్రేమజ్ఞాపికని ఈ అనంతసాగరంలో కలుపుదాం. ప్రకృతిలో కలిసిపోయి అజరామరంగా వుంటుంది మనం వున్నా లేకున్నా” అంటూ ఆ పెట్టెని నీళ్ళలోకి వదిలాడు. తనని ఆనుకుని కైదండ పట్టుకుని నిలబడి దాని గమనాన్ని చూసాను. అరుణోదయవేళ ఎర్రటి వెలుతుర్లో అదొక అద్భుతదృశ్యం.
ఎండెక్కాక బట్టలు వంటిమీదే ఆరబెట్టుకుని, యిసుక దులుపుకుని హోటల్ రూముకెళ్ళాం. స్నానం చేసాక అతుల్ మంచి రెస్టారెంటుకి తీసుకెళ్ళాడు. వరంగల్లోలాగే యిక్కడా ఒక వంటరి టేబుల్. దానికి ఒకవైపు రెండు కుర్చీలు. మరోవైపు బిగించబడ్డ అద్దం. మేమిద్దరం ఎప్పుడు వెళ్ళినా యిలాంటి సీటే వెతుక్కుంటాడు అతుల్.
ఎందుకని అడిగాను పెళ్ళైన కొత్తలో.
అతని జనాబు “టేబుల్ అటంచుని వున్న శూన్యం కనిపించదు”
నిజమే! ఉన్నది మేమిద్దరమే అయినా ఎంతో నిండుగా వుంది టేబుల్.
“బెంగాల్దాకా వెళ్ళొచ్చానుకదా అతుల్, కొద్దిగా కవిత్వదోషం అంటుకుంది. పిసరంత వాత్సల్యాన్ని వెతుక్కుంటూ ఎక్కడెక్కడో తిరిగిన నా హృదయం ఆ తిరిగిన చోటల్లా కొంతకొంత తనని కోల్పోతూ వచ్చింది” అన్నాను.
అతుల్ నవ్వి “ఆ దోషం మా ప్రాంతపు రక్తంలోనే వుంది. నీవెనకే నా హృదయంకూడా వెళ్ళి నువ్వు పోగొట్టుకున్న భాగమంతా పోగుచేసుకుని
తనలో కలుపుకుంది. అందుకే దాని వైశాల్యం పెరిగిపోయింది. నిన్నందులో బంధించి వుంచుతాను యింకెక్కడికీ వెళ్ళకుండా” అన్నాడు.
నేను నవ్వాను. మా చుట్టూ మనుషులు లేకపోయినా మనసునిండా అనుభూతులున్నాయి. అందరూ ఆప్తులు కారు. కానీ అంతరంగంలోకి వచ్చి ఒక్కొక్క అనుభూతిని మిగిల్చి వెళ్తున్నారు. పుట్టుక సత్యం. మరణం తథ్యం. మధ్యలో వున్న జీవితం అనుభూతుల పొరలని చుట్టుకున్న కాలగతి.
రైల్లో సిక్కు, ఖరగ్‌పూర్‌లో ముసలి వెయిటరు.. తిరిగొస్తుంటే బెస్తవాళ్ళు.. నేను కప్పుకున్న కొత్తపొరలు.
స్నేహితుడు- ఆంధ్రభూమి సచిత్ర వారపత్రిక16.11.2006
“చిన్నమ్మాయిని చూడటానికి వెళ్లి పెద్దమ్మాయిని చేసుకుంటానంటే బావుండదురా! కాదంటే నచ్చలేదని చెప్పేసి వేరే సంబంధం చూసుకుందాం” అంది వైదేహి కొడుకుతో.
“నీలిమని నువ్వు మర్చిపోయావామ్మా? స్కూల్లో నాకు బెస్టు ఫ్రెండు. మనింటికికూడా నాలుగైదుసార్లు వచ్చింది” తల్లి మాటల్ని పట్టించుకోకుండా అడిగాడు సూర్య.
సూర్య స్నేహితులంతా వైదేహికి గుర్తే. చామనఛాయలో బొద్దుగా ఉండి, అతనితో తమింటికి వచ్చిన నీలిమని ఆమె మర్చిపోలేదు. నీలిమ తల్లి చనిపోయినప్పుడు తను వెళ్లి ఓదార్చింది కూడా. కానీ ఎలా? ముందురోజు పెళ్లిచూపులకి వెళ్లారు. అక్కడ పెళ్లికూతురి అక్కగా కనిపించింది నీలిమ.
“మా పెద్దమ్మాయి నీలిమ. ఎమ్మెస్సీ పాసైంది. లెక్చరరు. ఇప్పుడే పెళ్లిచేసుకోనంటోంది. ఎంత చెప్పినా వినట్లేదు. తనకోసం ఆపడమెందుకని కావ్యకి చేసేస్తున్నాం” అని పరిచయం చేశాడు రాజశేఖరం పెళ్లికూతురి పినతండ్రి,
“గుర్తుపట్టావా?” ఆప్యాయంగా అడిగాడు సూర్య. బదులుగా చిరునవ్వు నవ్వింది నీలిమ.
“మీకు మా నీలిమ తెలుసా?” అడిగాడు రాజశేఖరం.
“ఇద్దరం టెంత్దాకా కలిసి చదువుకున్నాం” జవాబిచ్చాడు సూర్య. “ఏమ్మా, నీలిమా! బావున్నావా?” అని వైదేహి కూడా పలకరించింది.
ఇంటికి తిరిగొచ్చినప్పట్నుంచీ సూర్య ఈ పాట పాడుతున్నాడు. అక్కడ వాళ్లద్దరూ ఇవేం మాట్లాడుకోలేదు. అదొక్కటే అదృష్టం. అక్కడితో ఆ సంభాషణ ఆగిపోయింది. లేకపోతే అక్కడే అభాసయ్యేదనిపించింది వైదేహికి ఇప్పుడు.
“నీ క్లాస్మేట్ అంటున్నావు, వరహీనమవుతుందేమో?” వైదేహి మరో అభ్యంతరాన్ని కొట్టిపారేశాడు సూర్య.
“అసలు పెళ్లి చేసుకోనందట” అంది.
“అంటే అలా వదిలిపెట్టెయ్యటమేనా? ఎందుకు చేసుకోనందో తెలుసుకుని నచ్చచెప్పే బాధ్యత రాజశేఖరంగారికి లేదా?”
“అడిగారేమో! ఎవర్నేనా ప్రేమించి భంగపడిందేమో!”
“అలాంటిదేదీ ఉండదమ్మా! తనలో అలాంటి మెచ్యూరిటీ కనిపించలేదు. ఆ పదిహేనేళ్లప్పుడెలా ఉందో ఇప్పుడూ అలాగే ఉంది.”
“ఆ అమ్మాయి పెళ్లిచేసుకోవటం, చేసుకోకపోవటం… అవన్నీ వాళ్ల కుటుంబవ్యవహా రాలు, ఇష్టమైతే నువ్వు చూసిన పిల్లని చేసుకో. లేకపోతే ఊరుకో. అంతేగానీ ఇలాంటి వేషాలేస్తే మర్యాదగా ఉండదు” అప్పటిదాకా… మౌనశ్రోతగా వాళ్ల సంభాషణ వింటున్న మూర్తి కలగజేసుకుని కచ్చితంగా అన్నాడు.
“తను నా ఫ్రెండు నాన్నా! తనకి సహాయం కావాలి. ఆ విషయం నాకు స్పష్టంగా తెలుస్తోంది. ఏమీ చెయ్యకుండా ఎలా ఉంటాను? కొన్నికొన్ని బావుండనివే కొందరికి ఉపకరిస్తాయి. నేను నీలిమనే చేసుకుంటాను. ఎవర్నీ నొప్పించకుండా… అందర్నీ ఒప్పించే చేసుకుంటాను” అంతకంటే స్పష్టంగా చెప్పాడు సూర్య.
ఎదిగిన కొడుక్కి అంతకంటే ఏం చెప్పగలరు? ఎలాంటి అపఖ్యాతి వస్తుందోననిపించినా భార్యాభర్తలిద్దరూ మౌనం వహించారు.
నేరుగా నీలిమ పనిచేస్తున్న కాలేజికి వెళ్లాడు సూర్య. అప్పుడే క్లాసు పూర్తయి వెయిటింగ్రూంలోకి వెళ్లబోతోంది ఆమె. సూర్య ఎదురొచ్చాడు. అతన్ని చూసి తెల్లబోయింది.
“నిన్న మాట్లాడలేదేం? అందుకే ఈవేళ వచ్చాను” అన్నాడు.
“బావుండదని” పొడిగా జవాబిచ్చింది.
చిన్నప్పటి స్నేహితుడు కనిపిస్తే మాట్లాడలేనంత అస్వతంత్రతలో ఆమె ఉందని అతనికి అర్థమైంది
“మాట్లాడాలని వచ్చాను. ఫ్రీయేనా?” జేబులోంచీ సెల్ తీసి టైం చూసి, “వంటిగంటవుతోంది. బైట లంచి చేద్దామా?” అడిగాడు.
ఆమె తలూపింది. ఇద్దరూ బైటికి నడిచారు. హోటల్ అవ్ంతీస్ ఇన్‌కి వెళ్ళారు. రావటమైతే వచ్చిందిగానీ నీలిమకి చాలా ఇబ్బందిగా ఉంది. చెల్లెలికి ప్రపోజ్ చేయబడ్డ వ్యక్తితో ఇలా రావటం… కానీ అతనంటే ఉన్న అభిమానం దాన్ని అధిగమించింది.
లంచి ఆర్డరిచ్చాక అది వచ్చేదాకా కొద్దిసేపు ఏవో విషయాలు మాట్లాడుకున్నారు.
“మీ అమ్మ చనిపోయాక మీరు ఆ ఊర్నించి వెళ్లిపోయారు. సెలవులుకదా, నేనప్పుడు మా తాతగారి ఊరు వెళ్లాను. తిరిగొచ్చేసరికి మీరు లేరు. అలా జరుగుతుందని కొంచెం కూడా ఊహించలేదు. చాలారోజులపాటు నువ్వు గుర్తొచ్చి దిగులేసేది. మళ్లీ కలుసుకుంటామనుకోలేదు” అన్నాడు అతను.
తల్లి ప్రస్తావన రావటంతో నీలిమ ముఖం విషాదంగా మారింది. ఆమెకి పదిహేనేళ్లప్పుడు జరిగిందా సంఘటన. పెళ్లికి వెళ్లొస్తుంటే కారుకి ఏక్సిడెంటై నీలిమ తల్లీ, చెల్లీ అక్కడికక్కడే చనిపోయారు. ఆమే, తండ్రీ మిగిలారు. చాలా పెద్ద ట్రాజడీ అది. నీలిమ చదివే స్కూలు పిల్లలూ, టీచర్లూ అందరూ వచ్చి ఓదార్చి వెళ్లారు. సూర్య వైదేహిని తీసుకొచ్చాడు. ఆమె దగ్గరకి తీసుకుని ఎన్నోవిధాల ధైర్యం చెప్పింది నీలిమకి.
నెలరోజులు అసలు స్కూలుకే వెళ్లలేదు నీలిమ. దిగులు, బెంగ ఆమెని తినేసేవి. చదువుతున్నది. టెన్త్ క్లాసు. పబ్లిక్ ఎగ్జామ్స్. నోట్సన్నీ రాసిపెట్టే వాడు సూర్య. వెంటబెట్టుకుని స్కూలుకి తీసుకెళ్లేవాడు. ఏడుస్తుంటే ఓదార్చేవాడు. టిఫిన్ బాక్సులో అన్నం తీసుకొచ్చి బలవంతంగా తినిపించేవాడు. ఆమెకి మళ్లీ ఊపిరిపోసింది అతని స్నేహమే. ఎలాంటి ఆకాంక్షలు. కోరికలూ ఎరగని స్నేహం. అదే సంవత్సరం నీలిమ తండ్రి ఆ ఊర్నించీ ట్రాన్స్ఫర్ చేయించుకుని వెళ్లిపోయాడు. అవన్నీ లిప్తలో గుర్తొచ్చాయి. ఆ తర్వాత జరిగినవి కూడా.
వేరే ఊరెళ్లాక నీలిమ తండ్రి రాజశేఖరం మళ్లీ పెళ్లిచేసుకున్నాడు. సరళ ఆమె పేరు. అప్పటిదాకా నీలిమకి ఆయనలో ఉన్న అనుబంధమేదో పల్చబడ్డట్లైంది. అప్పటిదాకా లేని దూరం, సంకోచం మొదలయ్యాయి ఆయన దగ్గర. కావ్య రాక ఆ దూరాన్ని మరింత పెంచింది. కావ్య సరళ అక్క కూతురు. తనకి పిల్లలు పుట్టరని తెచ్చి దగ్గరుంచుకుంది. నీలిమకన్నా రెండేళ్లు చిన్నది. ఆమెనే ముందురోజు సూర్య వెళ్లి చూసింది.
“పెళ్ళెందుకు చేసుకోలేదు నీలిమా, నువ్వు?” ఉన్నట్టుండి అడిగాడు సూర్య. “మన ఫ్రెండ్సందరికీ పెళ్లిళ్లయ్యాయి. నువ్వూ నేనూ మిగిలాం. నీకు చెయ్యకుండా కావ్యకి చెయ్యటమేమిటి? అసలెవరీ కావ్య? మీ చెల్లి అప్పుడే పోయిందిగా?” మామూలుగా ఉన్నట్టుండటానికి ప్రయత్నించాడు. అతని కన్సర్న్… తన గురించి పట్టించుకునేవాళ్లు వున్నారన్న ఆలోచన… ఆమె మనసును కుదిపాయి.
“నలుగురు వున్న కుటుంబంలోని ఇద్దరు వ్యక్తులు చనిపోయాక మిగిలిన ఇద్దర్నే కుటుంబం అనుకోలేక మళ్లీ పెళ్లి చేసుకున్నారు నాన్న. ఇంట్లో కేంద్రబిందువు పిన్ని అయింది. సహజమే. నాకూ ఆవిడకి చనువు ఏర్పడ లేదు. అదికూడా సహజమేననుకుంటా. కావ్య పిన్ని అక్కకూతురు. పిన్ని చుట్టే తిరిగేది. నాన్న ఆఫీసునించి రాగానే పిన్ని ఎదురెళ్లేది. పిన్ని వెంటే కావ్య కూడా వెళ్లేది… అమ్మ ఉన్నరోజుల్లో నేను ఎదురెళ్లినట్టే. ఆయన చేతిలోవి అందుకునేది. తనకి నచ్చినవి తీసుకుని మిగతావి వదిలిపెట్టేది. ఆ మధ్యలోకి ఎలా చొరబడాలో అర్థంకాక అలాగే ఉండిపోయాను. నాన్న నాకు ఇంకా ఇంకా దూరం జరి గారు” అంది తన మనసు తెరుస్తూ.
సూర్యకి బాధనిపించింది. ఆమె మౌనంగా ఇన్నాళ్లు అనుభవించిన బాధని అతను ఇప్పుడనుభవించాడు. బాంధవ్యాలు పరాయీకరణ కావటంలోని విషాదం అర్థమైంది.
“మరి పెళ్ళెందుకు వద్దన్నావు? చేసుకుంటే నీ ఇల్లు నీకు ఏర్పడేదికదా? స్వతంత్రంగా, సంతోషంగా ఉండేదానివి?” ఆర్తిగా అడిగాడు. ఇబ్బందిగా చూసి తల దించుకుంది. ఇంట్లో ఎన్నో వ్యవహారాలు.. అవన్నీ ఇతనికి చెప్పాలా? మనసు లోలోపలికి ముడుచుకుపోతున్న భావన. తల్లి పోయిన కొత్తరోజులూ, అతని అభిమానం గుర్తొచ్చాయి. అతని దగ్గర దాపరికమేమిటి? అని మళ్ళీ వెంటనే అనిపించింది.
“పిన్ని క్రెడిట్ కార్డులు ఇష్టం వచ్చినట్టు వాడేస్తుంది. అందులోంచీ వచ్చే డబ్బునీ దాంతో కొనగలిగే వస్తువులనీ గురించి తప్ప పెరిగిపోతున్న అప్పుగురించీ నెలనెలకీ పెరిగిపోతున్న ఇన్స్టాల్మెంట్స్ గురించి ఆలోచించదు. నాన్న చెప్పబోతే కోపం. నాన్నది రెండోపెళ్లనీ, ఆయనకింక పిల్లలు పుట్టరనీ తెలిసే చేసుకుంది. పెళ్లప్పటికి ఆవిడ వయసూ తక్కువ కాదు. కానీ ఆ రెండు విషయాలతో ఆయన్ని గుచ్చి గుచ్చి బాధపెడుతుంది … ” నీలిమ గొంతులో తీవ్రమైన బాధ.
“క్రెడిట్‌కార్డుల మీద అప్పు లక్షల్లో ఉంటుంది. నా జీతం ఇంట్లోనే ఇస్తాను. ఇద్దరి జీతాలూ కలిపినా చాలదు. అవికాక పర్సనల్ లోన్స్. ఇంకా చాలక బైట కూడా అప్పులు చేస్తున్నారు నాన్న. ఈ వత్తిడి తట్టుకోలేక బాగా స్మోక్ చేస్తున్నారు. నాకేమిటో భయంగా ఉంటుంది. ఆయన ఏ క్షణానేనా సూసైడ్ చేసుకుంటారేమోననిపిస్తుంది. ఆ టెండెన్సీ అలా అనిపిస్తుంది. ఇల్లమ్మేసి కావ్య పెళ్లి చేస్తానంటున్నారు”
“మరి నీ విషయం?”
“ఈ పరిస్థితుల్లో నేను పెళ్ళెలా చేసుకోను?”
తదేకంగా చూశాడు సూర్య ఆమెని. ఎంత అమాయకత్వం? తనింట్లోనే తనకి జరుగుతున్న అన్యాయాన్నిసైతం గుర్తించలేనంత అమాయకత్వం. దానికి తోడు తండ్రిపట్ల అవధుల్లేని ప్రేమకూడా. ఎలాంటి తండ్రి అతను! కన్నకూతుర్ని ఆక్టోపస్‌లా పీల్చేస్తూ పెంపుడుకూతురికోసం త్యాగాలు చేస్తున్నాడు! నిరసనగా అనుకున్నాడు.
“మనిద్దరం పెళ్లి చేసుకుందామా?” మెల్లిగా అడిగాడు.
నీలిమ ముఖం కోపంతో ఎర్రబడింది.
“ఏం మాట్లాడుతున్నావు నువ్వు? కావ్యని చూసుకోవటానికి వచ్చి ఇదేంటి? వద్దు. తను హర్టౌతుంది. అసహ్యంగా ఉంటుంది” అంది.
“నేను మేనేజి చేస్తానుగా?”
“వద్దు సూర్యా! మన స్నేహం స్నేహంలా ఇలాగే ఉండిపోనీ. నాన్నా, పిన్నీ ఇద్దరూ బాధపడతారు”
“సరే, ఎంతకాలం ఇలా ఉంటావు? ఎప్పటికి తీరతాయి నీ సమస్యలు?”
నీలిమ తలదించుకుంది.
“నీలిమా! మనం సింపుల్‌గా రిజిస్టరు మేరేజి చేసుకుందాం. ఇద్దరం కలిసి ఐతే మీనాన్న సమస్యలు తీర్చగలం.”
“అదేదో కావ్యని చేసుకుని కూడా చెయ్యచ్చు” పదునుగా ఉంది నీలిమ గొంతు.
“నువ్వు తప్ప వాళ్లెవరూ నాకేమీ కారు” స్థిరంగా ఉంది సూర్య జవాబు.
చాలాసేపటిదాకా నీలిమ ఏమీ మాట్లాడలేదు. ప్లేట్లో ఉన్న పదార్ధాలని కెలుకుతూ ఉండిపోయింది. తనకి పెళ్లి పట్ల విముఖతేమీ లేదు. సూర్య అంటే అయిష్టం కూడా లేదు. సూర్యని చేసుకుంటే తండ్రి సమస్యల్లోంచీ బైటపడతాడా? ఎలా? ఎవరో ఒకరి సపోర్టు కావాలనిపిస్తోంది తనకి. తండ్రికి కూడా అలాగే అనిపిస్తుందేమో! ఒక సమస్యని అందులోనే ఉంటూ విశ్లేషించడం వేరు. దానితో సంబంధం లేని వ్యక్తి విశ్లేషించటం వేరు. ఈ రెండు దృక్పథాలూ కలిసేచోట ఆ సమస్యకి పరిష్కారం ఉంటుందేమో! జవాబివ్వలేకపోయింది.
“నేను మీ నాన్నగారితో మాట్లాడతాను”అన్నాడు సూర్య తనే నిర్ణయం తీసుకుని.
“సర్! మీతో పర్సనల్ గా మాట్లాడాలి ఎక్కడైతే వీలవుతుందో చెప్పండి”
సూర్య ఫోన్ చేసి అడిగితే ఆశ్చర్యం కలిగింది రాజశేఖరానికి, “ఇంటికి వచ్చెయ్యండి” అన్నాడు మామూలుగా.
“ఎక్కడేనా బయట. పార్కుకి రాగలరా? గాంధీ బొమ్మ దగ్గర ఎదురుచూస్తుంటాను” సూర్య సూచించాడు.
“అలాగే. అరగంటలో అక్కడుంటాను” అతనికి జవాబిచ్చి బయల్దేరాడు రాజశేఖరం. మనసు నిండా ఎన్నో సందేహాలు. అక్కడికి చేరేసరికి సూర్య ఎదురుచూస్తున్నాడు. “రండి” ముందుకి దారితీశాడు. ఇద్దరూ ఒక బెంచి మీద కూర్చున్నారు.
రాజశేఖరానికి వింతగా ఉంది. ఇలా పార్కులో కూర్చుని విషయాలు చర్చించుకునే రోజులు ఇంకా మిగిలున్నాయా? ఎవర్ని పలకరించినా అవంతీస్ ఇన్‌లో వెయిట్ చేస్తాను. రత్నాలో లంచి తీసుకుంటూ మాట్లాడుకుందాం అనేవాళ్లే. మసకచీకటి వాతావరణంలో మనసంతా ముసురుపట్టినట్టు వుంటుది తప్ప ఆలోచనలు చురుగ్గా కదలవు. ఇక్కడేమిటో ప్రశాంతంగా ఉన్నట్టనిపించింది.
సూర్య ఇద్దరికీ రెండు కొబ్బరిబోండాలు తీసుకొచ్చాడు. తనొకటి తీసుకుని ఆయనకొకటి ఇస్తూ, “మీరు నన్ను గుర్తుపట్టలేదు. నీలిమకోసం మీ ఇంటికి చాలాసార్లు వచ్చాను ముఖ్యంగా ఆంటీ పోయినప్పుడు” అన్నాడు.
రాజశేఖరానికి నిజంగానే గుర్తురాలేదు. అవి చీకటిరోజులు. ఎవరు ఎవర్ని ఓదార్చారో… ఎలా ఆ దుఃఖంలోంచీ బైటపడ్డారో ఇప్పటికీ ఆశ్చర్యమే. కానీ ఆ దుఃఖపు కెరటాలు తననొక ఒడ్డుకీ నీలిమనింకొక ఒడ్డుకీ చేర్చినట్టు అప్పుడప్పుడనిపిస్తుంది. ఈమధ్య తామిద్దరి మధ్య దూరం మరీ పెరిగిపోయినట్టుగా ఉంది.
ఆయన ఆలోచనలు చదివినట్టు సూర్య చిన్నగా నవ్వాడు. అందులో స్వల్పంగా వ్యంగ్యం అర్థమైంది. రాజశేఖరానికి ఇబ్బందిగా కదిలాడు.
“నిన్న తనని కలిసి మాట్లాడాను. మీ ఇంటి పరిస్థితులు చెప్పింది. మా ఫ్రెండ్స్ సర్కిల్లో మొత్తం నలుగురు అమ్మాయిలు, ఇద్దరబ్బాయిలం. అందరం హేపీగా ఉన్నాం. నీలిమ ఒక్కర్తే ఇలా…తల్లి లేకపోవటం బాధే. కానీ…” ఆగిపోయాడు సూర్య.
“తనకి మా ఇంట్లో ఏ లోటూ లేదు. అందరూ మంచిగానే చూసుకుంటారు. అసలు తనకి సమస్యలేవైనా ఉంటే నాతో చెప్తే నేను పరిష్కరిస్తాను కదా?”
“తన ప్రాబ్లమల్లా మీరే. చేసిన అప్పుల వత్తిడిలో ఏ క్షణాన పేపర్లో న్యూస్‌గా మారిపోతారానని భయపడుతోంది” నిదానంగా అన్నాడు సూర్య. రాజశేఖరం ముఖం పాలిపోయింది. చెమటలుపట్టాయి. జేబులోంచీ కర్చీఫ్ తీసుకుని ముఖం తుడుచుకున్నాడు.
సూర్య కేంటిన్‌కి వెళ్లి వాటర్‌బాటిల్ కొనుక్కొచ్చి మూత తీసి ఇచ్చాడు. అందుకుని గటగటా తాగేశాడు రాజశేఖర్.
“రిలాక్స్డ్గా నా మాటలు వినండి. నీలిమని నేను పెళ్లి చేసుకుందామనుకుంటున్నాను. ఇప్పుడు మీరున్న పరిస్థితుల్లోనైతే తను ఒప్పుకోదు. అందుచేత కొంత ఓపెన్‌గా మాట్లాడాలనుకుంటున్నాను. మీ సమస్యలు నేను కొంతవరకూ పరిష్కరించగలను” అన్నాడు సూర్య.
“…”
“నాకు కట్నం అక్కర్లేదు. పెళ్ళికూడా సింపుల్‌గా చెయ్యండి. ఇల్లమ్మేద్దామనుకుంటున్నారు కదా? అమ్మితే ముప్పైలక్షలదాకా వస్తుందని చెప్పింది నీలిమ, ముందు అప్పులన్నీ తీర్చెయ్యండి. మిగిలినదాంట్లోంచీ ఐదులక్షలు సింగిల్ బెడ్రూం ఫ్లాట్‌కి అడ్వాన్సివ్వండి. మిగతాది లోన్ తీసుకోవచ్చు. ఎన్ని ఖర్చులున్నా స్వంతి యిల్లనేది ఉండాలి. ఇంకా మిగిలింది నీలిమకి, కావ్యకీ చెరిసగం ఇవ్వండి. నీలిమకి ఇవ్వకపోయినా నాకేం అభ్యంతరం లేదుగానీ, తను హర్టౌతుంది. కనీసం కావ్యతో సమానంగానేనా తనని చూడలేదని”
అతని మాటలకి రాజశేఖరం నిరుత్తరుడై చూస్తూ ఉండిపోయాడు.
“ఇవన్నీ జరగకపోతే నీలిమ పెళ్లి చేసుకోదు. ఇప్పుడు తన సంపాదన వాడుకుంటూ ఏదో ఒకలా బండిని నెట్టుకెళ్లిపోతున్న మీరు, ఒకరోజుని తనకి జవాబు చెప్పుకోవలసిన పరిస్థితి వస్తే మాత్రం చెప్పడానికి మీదగ్గర ఏదీ ఉండదు. నేను నీలిమని మాత్రమే చేసుకుంటాను. కావ్యని కాదు. వెళ్తాను. ఆలోచించుకుని చెప్పండి ఏ విషయం” సూర్య వెళ్లిపోయాడు.
రాజశేఖరం అలాగే కూర్చుండిపోయాడు. తనున్న పరిస్థితులు, వాటికి దారితీసిన తన నిస్సహాయత, వాటిచాటున నీలిమని ఎక్స్‌ప్లాయిట్ చేస్తున్న తన స్వార్థం.. కళ్లకి కట్టినట్టు కనపడుతున్నాయి.
మొదటిభార్య పోయాక వంటరితనం తట్టుకోలేక, చిన్నపిల్ల, నీలిమకేం అర్థమౌతుంది తన దు:ఖం అని రెండో పెళ్ళి చేసుకున్నాడు. సరళ చెడ్డది కాదు. ఏదో ఒక సంబంధం అని చేసుకోవలసిన నిస్సహాయత ఆమెది. అందులోంచీ పుట్టుకొచ్చిన అసంతృప్తి. అసహనం. దాన్ని చల్లబరుచుకునేందుకు ఆమె పెట్టే నిరర్థకమైన ఖర్చులు.. వృధా అవుతున్న నీలిమ జీతం… దాటిపోతున్న ఆమె పెళ్ళీడు… నిజమే ఈ వత్తిడిని తట్టుకోలేకపోతున్నాడు తను! కృంగిపోతున్నాడు. చచ్చిపోవాలనే కోరిక తరచుగా కలుగుతోంది. ఎన్నోసార్లు బలంగా అనిపించిందలా. ఎవరూ గుర్తించనిది తన కూతురు గుర్తించింది. ఎంత ప్రేను దానికి? తనేం చేశాడనీ? దానివైపు నించీ సూర్య ఎంత చక్కగా రిప్రజెంట్ చేశాడు!
నిజమే! అతను చెప్పినట్టు చేస్తే అప్పుల్లోంచీ విముక్తి తనకి. మిగిలిన డబ్బులోంచీ సగం తీసి సరళ చేతిలో పెట్టి ఏదైనా చేసుకోమనాలి. పదిపదిహేను లక్షలు ఖర్చు పెట్టి ఘనంగా కావ్యకి పెళ్లి చేయాలన్నది సరళ కోరిక. అది అవసరం కాదు, కేవలం కోరికే. అందుకు భిన్నంగా జరిగితే గొడవ చేస్తుందేమో! రెండోపెళ్లివాడికిచ్చి తన గొంతు కోశారనీ ఏ సరదా తీరలేదని ఏడుస్తుంది. ఏడవనీ. ఇప్పుడొకలాంటి వత్తిడి, అప్పుడింకొకలా. కానీ జీవితాలు నిలబడతాయి. నీలిమకన్నా కావ్య ఎక్కువ కాదు తనకి. ఇప్పటికే నీలిమ జీతం లెక్కలేకుండా వాడుకున్నాడు. తను. ఎంతో అన్యాయం జరిగింది నీలిమకి. తను చేసిన తప్పు సరిదిద్దుకోవటానికి వచ్చిన అవకాశం సూర్య.
గుండెలనిండా శ్వాస తీసుకుని లేచి నిలబడ్డాడు. ఏదో కొత్తశక్తి వచ్చినట్టనిపించింది. తను చర్చిస్తే ఇవన్నీ నీలిమ తనతోటే మాట్లాడేదేమో నేరుగా! తామిద్దరి మధ్యనీ అడ్డుగోడలు ఏర్పడిపోయాయి. సూర్యవలన మళ్లీ నీలిమ కనిపిస్తోంది.
“ఏమిటి, ఐదులక్షలతో కావ్య పెళ్లా? మీకేమైనా మతుండే మాట్లాడుతున్నారా? దానికి మంచి చేస్తామని తీసుకొచ్చాం. ఇదేనా? మా అక్కయ్య అసలు ఊరుకోదు. దానికొచ్చిన సంబంధం కాస్తా ఈవిడగారు ఎగరేసుకుపోయింది. కట్నం అక్కర్లేదన్నాడేమో అతడు? మళ్లీ సగం డబ్బు దేనికట?” అసహనంగా అరిచింది సరళ.
“చూడు, కావ్యకేదో చేద్దామని తీసుకొచ్చానంటున్నావు. దాని చదువు గురించి ఎప్పుడేనా పట్టించుకున్నావా? బాగుపడేదైతే, చదువుకుని అదీ నీలిమలాగా జాబ్ చేసేది. ఎవరో ఒకరు ముందుకొచ్చి చేసుకునేవారు. నీలిమకిలాగే మనకి తోచినది ఇచ్చి పంపేవాళ్లం. కానీ నువ్వేం చేశావు? చదువుకోవలసిన పిల్లని చెలికత్తెలాగా నీవెంట తిప్పుకున్నావు” అన్నాడు రాజశేఖరం.
వత్తిళ్లు తగ్గాక అతన్లో వివేచన పెరిగింది. ఇదివరకూ అతని ఆలోచనలన్నీ ఎక్కడినుంచీ డబ్బు పుట్టిద్దామా అనే విషయం చుట్టే పరిభ్రమించేవి. మరో ఆలోచన వుండేది కాదు. కావ్య విషయంలో ఎక్కడ పొరపాటు జరిగిందో అతనైతే వివరించి చెప్పగలిగాడు కానీ సరళే అర్థం చేసుకోలేకపోయింది.
“అంటే మీ కూతురు రాకుమారీ, నా కూతురు చెలికత్తేనా?” మండిపడింది.
“పిన్నీ, బాబాయ్ చెప్పినదాంట్లో తప్పే ముంది? ఎందుకు, అనవసరంగా గొడవ? ముందు నీలిమ పెళ్లవ్వనివ్వండి” కావ్య సర్దిచెప్పింది. ఆమె మనసులో లోలోపలెక్కడో చిన్న గాయం. ఏనుగు చచ్చినా వెయ్యే అనిపించినలాంటి భావం. ఇంట్లో నీలిమని కొంచెం చులకనగానే చూస్తారు. కనీకనిపించని అసూయ. ఆమె స్థానంలోకి తను వచ్చినా, ఆమె హుందాగా పక్కకి తప్పుకున్నా విలువ తగ్గకపోవటం ఏదో గుణపాఠం నేర్పినట్టైంది.
“మీ అమ్మకి నేను మొహం ఎలా చూపించనే? మాఇంట్లో ఎవరికీ జరగనంత ఘనంగా నీపెళ్లి జరిపిస్తానన్నాను. అందర్లో ఎలా తలెత్తుకు తిరగను?” సరళ ఏడ్చింది.
రాజశేఖరం మెత్తబడ్డాడు. “ఏడుపెందుకు? నీలిమ పెళ్లయిపోతే కొంచెం కూడదీసుకుని దీని పెళ్లి చెయ్యకూడదా? ఇంకా నాకు నాలుగేళ్ల సర్వీసుంది కదా? ఐనా పెళ్లెలా చేశామని కాదు, పెళ్లికొడుకెలాంటివాడనేది ముఖ్యం”” అన్నాడు ఓదార్పుగా.
సింపుల్‌గా రిజిస్టరు మేరేజి చేసుకుంటానన్నాడు సూర్య.
“అదేంటిరా? కట్నకానుకల్లేవు. పెళ్లేనా ఘనంగా చేయకపోతే ఎలా?” అంది వైదేహి.
“అమ్మా! ప్రస్తుతం వాళ్లున్న పరిస్థితిలో డబ్బు ఖర్చుపెట్టలేరు. గ్రాండ్‌గా చేసుకోవాలనేది మన సరదా. మన సరదాకోసం వాళ్లని ఖర్చుపెట్టమనడం సరైనది కాదు. మనం రిసెప్షను ఎరేంజి చేద్దాం” మెత్తగా అన్నాడు.
“నువ్వేది చెప్తే విన్నావుగనుక?” నిరసనగా అంది వైదేహి. మనసులో నీలిమపట్ల కొంచెం కోపం ఉండిపోయింది. కానీ పెళ్లి చేసుకుని వచ్చి బేలగా తన చేతులు పట్టుకుని “మీ అందరి మనసూ కష్టపెట్టాను. అటు మాయింట్లోకూడా బాధపడేవుంటారు. నన్ను క్షమించండి” అంటుంటే మనసు కరిగిపోయింది. తల్లిని పోగొట్టుకుని తన వళ్లో పడి ఏడ్చిన ఆ పదిహేనేళ్ల అమ్మాయి గుర్తొచ్చింది. కొడుక్కీ అంతేగా అనిపించింది. అకారణంగా కొందరి జీవితాల్లో అపశృతులు దొర్లుతుంటాయి. వాటిని సరిచెయ్యగలిగే అవకాశం ఉన్నవాళ్లు ఆ పని చెయ్యకపోతే ఎలా? అని అతన్ని కూడా క్షమించేసింది.
ఆ నెల జీతం తీసుకెళ్లి మూర్తికిచ్చింది నీలిమ.
“పెళ్లికి ముందు మా నాన్నకి ఇచ్చేదాన్నండీ!” అంది. ఆయనకి చాలా సంతోషం కలిగింది. నీలిమ జీతం తనకిచ్చినందుకు కాదు, తన పెద్దరికానికి విలువనిచ్చినందుకు. నువ్వెంత నీ లెక్కెంత, నీకొడుకు నాపక్షాన వున్నాడు అన్నట్టు ఉంటే ఎంతటివాళ్లకేనా బాధగా ఉంటుంది. “నాకెందుకమ్మా? నువ్వూ సూర్యా కలిసి దాచుకోండి” అన్నాడు ప్రేమగా. తర్వాత భార్యకి చెప్పాడు గర్వంగా.
“సూర్యా ఫ్రెండు…” అంటుంటే వైదేహి ఆపి “ఫ్రెండెవరండీ?” అనడిగింది.
“వాళ్లిద్దరూ ఫ్రెండ్సు కాదూ?” అని నవ్వి, విషయం చెప్పాడు.
“మంచిపిల్లే” సంతృప్తిగా అందామె. అని, “వాళ్లిద్దరూ ఇప్పుడు ప్రగాఢమైన ప్రేమికులు. ఫ్రెండ్షిప్ తర్వాతి ప్రకరణంలోకి అడుగుపెట్టారు. తాడూ బొంగరంలా ఒకళ్ళనొకళ్ళు చుట్టుకుని తిరుగుతున్నారు” అంది.
“బావా!!”
“చెప్పు కావ్యా!!…
“నువ్వు నీలిమని ప్రేమించావా? ఈ ఒక్క ప్రశ్నకి జవాబు చెప్పు”
సూర్య నవ్వాడు. “అలా ప్రేమించి ఉంటే తనొక్కదాన్నిగురించే ఆలోచించేవాడిని. తన సమస్యల గురించి ఆలోచించేవాడిని కాదు. అన్నిటికీమించి నీతో పెళ్లిచూపులకి వచ్చేవాడిని కాను. మామధ్య ఉన్నది స్నేహమే” అన్నాడు.
పాతకాలపు మనిషి-ఇండియా టుడే, 3.8.1999
డాక్టరు దగ్గర్నుంచి తిరిగొచ్చాక అప్పటిదాకా అయిన ఖర్చు లెక్కవేసుకున్నాడు తిలక్. ఎనిమిదివందల ఎనబై అంటే. భార్య చేతికొచ్చేదాంట్లో సగం. ఇవి కాకుండా ఇంకా అదనం ఖర్చులు, నెల మధ్యలో కూడా కొనాల్సివచ్చే మందులు కలిపి మరో ఇంత ఉంటాయి.
ఇలాంటవ్పుడే కరిగిపోయిన ఆస్తులూ, గతవైభవాలూ గుర్తొస్తాయి. రోజులు సాఫీగా సాగిపోయినన్నాళ్ళూ మనిషి మెడ గతం వైపుకి తిరగదు. తిలక్ తండ్రి పాతకాలం మనిషి. ఆ మాట తిలకే అనుకుంటాడు. పైకనడానికి కూడా ఏమాత్రం సంకోచించడు. వల్లమాలిన బంధుప్రీతితో ఆస్తంతా కర్పూరంలా కరిగించేశాడని అతని అభిప్రాయం.
ఆయనకి ముగ్గురక్కచెల్లెళ్ళు, అక్కగారికి, అంటే తిలక్ పెద్ద మేనత్తకి చిన్నప్పుడే పెళ్ళవడం ఆ వెంటనే భర్త చనిపోవడం జరిగింది. ఆవిడ పుట్టింటికి వచ్చేసింది. తండ్రి పోయాక ఇంక తమ్ముడితోనే ఉండిపోయింది. మిగిలినవాళ్ళిద్దరూ ఆయన తరవాతి వాళ్ళు. స్థితిమంతులు కాదు. అప్పుడప్పుడు అన్నగారి సహాయం కోరుతుండేవారు. వాళ్ళకి పిల్లలు. ఆ పిల్లల చదువులకి ఈయన తనకి తోచింది ఇచ్చేవాడు. వీళ్ళంతా కాకుండా విధవమేనత్త ఒకావిడుండేది. తిలక్ తండ్రి మేనత్త. ఎక్కడో ఆయన తండ్రి తండ్రికి చెల్లెలు. ఆవిడ , తమ దగ్గిరుండడం!
తండ్రికెలా చెప్పాలో, ఈ అనవసరపు బాదరబందీలన్నీ ఎలా తప్పించాలో అర్ధమవక సతమతమయ్యేవాడు తిలక్. ఇంత మంది మధ్య అతనికి పెద్ద గారాబమేమీ జరిగేది కాదు. మూడు పూటలా కడుపుకింత తినడమే గొప్పగా ఉండేది.
ఎన్నో సర్దుబాట్లుండేవి. పెద్దపిల్లలకి కుట్టించిన బట్టలు ఆ కుటుంబంలో చిన్నపిల్లలదాకా వరుసక్రమంలో వచ్చేవి. అలాగే పుస్తకాలూను. ఇప్పటన్ని ప్రైవేటు స్కూళ్ళు లేవు. విద్యారంగం ఇంత ఎత్తుని ప్రైవేటీకరణ చేయబడలేదు. గవర్నమెంట్ స్కూళ్ళేగాబట్టి దాదాపుగా అవే పుస్తకాలు చేతులు మారేవి. ఎప్పుడైనా పుస్తకం మారితే కొత్త పుస్తకం కొనేవాడు తిలక్ తండ్రి. అలాంటిది తిలక్ వంతులో ఎప్పుడూ రాలేదు. కాళ్ళకి చెప్పులుండేవి కాదు. చేతికి వాచీ ఉండేది కాదు. క్రికెట్టూ, కేరమ్సూ తెలీవు. కోతికొమ్మచి, బిళ్ళంగోడు, కబాడీ – ఇవే ఆటలు. ఇవిగాక ఆడపిల్లల్తో కలిసి గచ్చకాయలు, చింతపిక్కలు, తొక్కుడు బిళ్ళలూ ఆడేవాడు తిలక్ కొంత వయసాచ్చేదాకా. ఛఛ! ఏం జీవితమది! అనిపిస్తుందనికి ఇప్పుడారోజులు గుర్తొస్తే,
తిలక్ ఇంట్లోవాళ్ళతో కలవకుండా ఒకింత పెడగా ఉండేవాడు. తనకి సంబంధించిన విషయాలో నిర్ణయాలు తానే తీసుకునేవాడు. అవి చిన్నచిన్నవే గాబట్టి ఇంట్లో వాళ్ళకి అభ్యంతరం ఉండేది కొదు. కానీ, పెళ్ళి దగ్గిర కూడా అతనా స్వతoత్రం అలాగే నిలబెట్టుకోవడంతో గొడవైంది. మాటపట్టింపులూ, పంతాలూ వచ్చాయి. పెద్దవాళ్ళ మనుసులకి గాయాలయ్యాయి. అయినా, అతను చలించలేదు.
రెండో మేనత్త కూతుర్ని తిలక్‌కి ఇచ్చి చెయ్యాలని ఇంట్లో ప్రతిపాదన.
“నేను ఉద్యోగస్థురాలైన అమ్మాయినే చేసుకుంటాను” అని అతను ప్రకటించాడు. దానికి అనేకమైన కారణాలున్నాయి. ఇంట్లో ఇంట్లో ముడి పెట్టుకుంటే కట్నం అంటూ ఏమీ రాదు. చిన్నత్తా వాళ్ళదీ లేని కుటుంబమే కావచ్చు. కానీ, వాళ్ళ లేమికి తాను బాధ్యత వహించాలా? తనపాటి ఉద్యోగం ఉన్న వాళ్ళు బయట వేలకి వేలు కట్నం తీసుకుంటున్నారు. తానూ తీసుకోవచ్చు. కట్నం తీసుకుని బయటి సంబంధం చేసుకున్నాక కూడా తన బతుకులో మార్చేమీ రాదు. భార్య ఉద్యోగం మిషమీద ఈ ఇంటితోటీ, ఊరితోటీ సంబంధాలనీ తెంచేసుకోవాలి. తల్లిదండ్రులంటే తనకి విధాయకంగానీ, ఈ మందంతానా? ఈ మాటల్ని తిలక్ బయటికనలేదు.
“అదేమిట్రా? చిన్నప్పట్నుంచీ అనుకుంటున్న మేనరికం ఉండగా బైటి సంబంధం చేసుకోవడమేమిటి?” తల్లి తెల్లబోతూ అడిగింది.
“మేనరికం అనుకున్నారా?ఎవరనుకున్నారు? మీరనుకున్నారేమోగానీ నేనెప్పుడూ అనుకోలేదు” కొట్టినట్టే జవాబిచ్చాడు తిలక్.
“ఔనోయ్! మేమే అనుకున్నాం. ఏం, మా మాటకంత విలువలేకుండా పోయిందా? కనేటప్పుడు నిన్నడిగి కన్నామా, ఇందులో మాత్రం నిన్నడగడానికీ?”” దెబ్బతిన్న ఆత్మాభిమానంతో అడిగాడు తండ్రి.
“నన్నడిగి వుంటే కనద్దని చెప్పేవాణ్ణి” కొట్టినట్టే జవాబు ఇచ్చాడు తిలక్.
“ఏరా, అంత తీసిపోయిందా మా కడుపుని పుట్టడం? పెద్దంతరం, చిన్నంతరం లేకుండా మాట్లాడుతున్నావు?” తల్లి బాధపడింది.
“అంత గొప్పగా పెంచారామ్మా నన్ను? గుర్తు చేసుకుని చెప్పు. ఎన్నిసార్లు కొత్త బట్టలు కుట్టించారు నాకు? కొత్త పుస్తకాలేప్పుడైనా కొన్నారా? కోరుకున్న తిండి… చదువు.. ఏది అమరింది నాకు? నాకన్నా తక్కువ మార్కులొచ్చేవి చక్రధర్‌కి… వాడిప్పుడు డాక్టరు. తెల్లకోటేసుకుని నా కళ్ళముందే బోర్డు కట్టాడు..” బయటపడ్డాక ఇంక తగ్గడం దేనికని మనసులో వున్నదంతా అనేసాడు తిలక్.
“వాళ్ళతో మనకి సాపత్యమా? వాళ్ళకి తగలేసినంత ఆస్తుంది. ఖర్చు పెట్టి చదివించారు.”
“ఎక్కడిదమ్మా వాళ్ళకంత ఆస్తి? అక్కర్లేని బాధ్యతలూ, అనవసరపు ఖర్చులూ తగ్గించుకుంటే మీరు నన్ను మాత్రం చదివించలేకపోయేవారా” అనేసి విసురుగా వెళ్ళిపోయాడు.
ఆ మాటలు ఎక్కడ తగలాలో అక్కడ తగిలాయి
“చిన్నవాడైనా తిలక్ చెప్పింది నిజం తమ్ముడూ. మా బాధ్యతలు ఎత్తుకుని వాడికి అన్యాయం చేశావు. ” తిలక్ పెద్దమేనత్త బాధపడుతూ చెప్పింది.
“వాడి మాటలు మీరేం పట్టించుకోకండి వదినా! తల్లీ, తోడూ అన్నాక బాధ్యతలుండవా ? అయినా, మీకు మేమేం పెట్టేమని? మాతోపాటు ఇంత తిండి. అంతేకదా? తోటివాడు డాక్టరయ్యాడు కదూ, అదీ బాధ! దాచుకోలేక బైటికి వెళ్ళగక్కాడు”” తిలక్ తల్లి బతిమాలింది.
ఆ మాటలకి సాంత్వన కలగలేదు పెద్దావిడకి. “నాలుగు రోజులు చిట్టెమ్మ దగ్గిరుండి వస్తాను. ఈ బతుకెలా తెల్లవారుతుందో ఏమిటో” అంటూ పెద్ద చెల్లెలి దగ్గరికి ప్రయాణమైంది. చూస్తూ కూడా ఏమీ అనలేకపోయాడు తిలక్ తండ్రి.
“నీకు వంట్లో శక్తుంది. వెళ్ళడానికి చెల్లెళ్ళు వున్నారు. వెళ్ళిపోతున్నావు. నేనెక్కడికి వెళ్ళనే” అని ఏడ్చింది ఆయన మేనత్త. ఆవిడ చేతుల్ని తన తడికళ్ళ మీద ఉంచుకున్నాడు తిలక్ తండ్రి. ఇంకెప్పుడూ ఆవిడ తన బాధ బైటికనలేదు . ఆ మరుసటేడే దేవుడి పిలుపందుకుంది.
ఈలోగానే తిలక్ పెళ్ళయింది. కట్నం దగ్గర అతనే మాత్రం తగ్గలేదు. తండ్రివల్ల కాదని ముందుగానే తెలుసుకాబట్టి మధ్యవర్తిని పెట్టుకుని అన్నీ ఖరాఖండీగా మాట్లాడుకున్నాడు. బేరసారాలని చూసి తిలక్ తండ్రికి మనసు చెదిరి ఏదో తప్పు చేస్తున్న భావనతో తలదించుకున్నాడు. పిల్ల పేరు భారతి. పెళ్ళి జరుగుతున్నంత సేపూ పెళ్ళికూతురి మొహంలో ఎలాంటి కళాకాంతి కనిపించలేదాయనకి. పాపం! తండ్రి ఇస్తున్న కట్నం గురించే దిగులు పడ్తోందేమో! విలవిల్లాడాడు. వాళ్ళు బట్టలవీ పెడ్తుంటే చేతులు చాచి భిక్ష తీసుకుంటున్నట్టు అనిపించింది. ఇలాంటివేం తిలక్‌కి లేవుగాబట్టి నవ్వుతూ తుళ్ళుతూ తిరిగాడు.
కట్నం డబ్బు చేతిలో పడ్డాక తిలక్ మొదటిసారిగా తాను సుఖపడే మార్గాల గురించి ఆలోచించాడు. అంటే ఇంతకాలం అతను సుఖాన్ని గురించి ఆలోచించలేదని కాదు. అవన్నీ పేకమేడలు. వట్టి ఊహాసౌధాలు. పగటి కలల్లో మాత్రమే కట్టుకునేవి. ఇప్పటి ఆలోచనలు అతని వాస్తవ సుఖాలకి దారితీసేవి.
సుఖం! అతనికికి కొన్ని సుఖాలు తెలుసు. చాలా చిన్నప్పుడు – వేడి వేడి అన్నంలో పాతచింతకాయ పచ్చడి కలిపి చెయ్యి తడిసేలా నెయ్యిపోసి, నోట్లో ముద్దలు కలిపి తల్లి పెడ్తుంటే జిహ్వకి చాలా సుఖం తోచేది. కొంచెం పెద్దయ్యాక తండ్రి కుట్టించిన కొత్త షర్టు వేసుకుని స్కూలుకెళ్ళినప్పుడు పిల్లలందర్లో గొప్పగా తోచి మనసుకి సుఖమనిపించేది. తల్లి తాను చేసిన ఏ తాయిలమో కొంచెం మిగిల్చి చాటుగా చేతికిస్తే, అది తింటుంటే అమరసుఖం దొరికేది. కానీ, వీటినెవరూ సుఖాలని ఒప్పుకోరు. రోజూ పంచ భక్ష్య పరమాన్నాలు తినేవాడికి పాతచింతకాయ పచ్చడి రుచించదు. నిత్యం పట్టుబట్టలు కట్టుకునేవాడి సుఖంలో ఒక కొత్తచొక్కా తెచ్చే మార్పేం ఉండదు. కడుపు నిండిన వాడికి చాటుగా తినడంలో నీతి కనిపించదు. తనకవేవీ లేవు. అందుకే అవే సుఖాలనుకుంటున్నాడు. తనకి లభించినవి అంతమాత్రమేగాబట్టి అవే సుఖానిచ్చాయి.
ఆ క్షణాన్నించే తిలక్ ప్లాన్డ్గా ఆలోచించడం మొదలు పెట్టాడు. మూడేళ్ళదాకా పిల్లలొద్దనుకున్నాడు. అలాగే భార్యని డాక్టరు దగ్గరకి తీసికెళ్ళి లూపు వేయించాడు. ఈ మూడేళ్ళలో ఇంట్లోకి కావలసినవన్నీ కొన్నాడు.. అన్నీ అంటే, కలర్ టీవీ, ఫ్రిజ్, కూలర్ ఇత్యాది సమస్తం. ఆ తర్వాతే భారతికి నెల తప్పింది. తల్లిదండ్రులని దగ్గరకు తెచ్చి పెట్టుకున్నాడు. లోతుగా ఆలోచించి. లాభనష్టాలు లెక్కవేసుకుని. మేనత్తమాత్రం చెల్లెలిదగ్గిరే వుండిపోయింది.
“ఒక్కరు చాలు మనకి, ఆడేనా, మగేనా సరే! ఏం?” అన్నాడు భార్యతో.
ఆమె దిగ్గున తలెత్తి చూసింది. తనకి అతిచేరువలో ఉన్నా ఏమీ అర్థంకాని మనిషి. అతని కళ్ళలోకి లోతుగా చూసింది. అవి తేజోహీనంగా అనిపించాయి. అభావంగా వున్నాయి.
“ఏమిటాలోచన?” అడిగాడు తిలక్.
“మరీ ఒక్కరే ఏంటి? కనీసం ఇద్దరు పిల్లలేనా ఉండాలి” అంది నచ్చజెప్తూ. అతనిలో తెచ్చి పెట్టుకున్న సౌమ్యం ఎగిరిపోయింది.
“దేనికిద్దరు? మనకేం ఆస్తులున్నాయని? చాలీచాలకుండా వాళ్ళని పెంచుకొచ్చి గుమాస్తాగిర్లు వెలగబెట్టమని దేశంమీదికి వదుల్దామా? బుర్ర తక్కువ ఆలోచనలూ, బుర్ర తక్కువ మనుషులూ!”” అని విసురుగా లేచి వెళ్ళిపోయాడు.
భారతి ఏడ్చింది. నిరసనప్రతం చేసింది. అయినా, తిలక్ తనమాటే నెగ్గించుకున్నాడు.
తిలక్‌కు ఇప్పుడు ఒక్కడే కొడుకు. అతని ఆశలన్నిటికీ ఆయువుపట్టు వాడే. తనేవైతే మిస్ చేశాననుకున్నాడో అవన్నీ కొడుక్కి అమర్చాడు తిలక్. బిర్లా, టాటా లెవెల్లో వాడిని పెంచకపోవచ్చుగానీ, వాడికి జరిగినంత ముద్దు వాళ్ళకు జరిగివుండదన్నది మాత్రం నిస్సంశయం.
పిల్లాడి నాలుగోయేటిదాకా అన్నీ సవ్యంగానే జరిగాయి. తల్లీ, తండ్రీ ఆఫీసుకెళ్ళేవారు. వేల మీద ఆర్జించి తెచ్చేవారు. వాళ్ళు ఆఫీసుకి వెళ్ళినప్పుడు తాతాబామ్మలు చూసుకునేవారు .
స్కూల్లో వేశారు. తెల్లగా, బొద్దుగా ఉండేవాడేమో అక్కడంతా ముద్దు చేసేవారు.కాళ్ళకి షూస్, యూనిఫామ్‌తో మడత నలగని పుస్తకాలని బేగ్లో పెట్టుకుని వాడు స్కూల్‌కి వెళ్తుంటే తిలక్‌కి మనసు పరవశించిపోయేది. వాడిని దించడానికి లోన్ తీసుకుని తాను స్కూటర్ కొనుకున్నాడు. కానైతే వాడినడిగి తాను కనలేదనీ, తన అభిరుచులమేరకే వాణ్ణి పెంచుతున్నాడనీ ఎప్పుడూ తిలక్‌కి అనిపించలేదు.
నాలుగోయేడు నిండుతుంటే వాడిలో అనూహ్యమైన మార్పు వచ్చింది. స్కూలుకెళ్ళినని మొరాయించడం, మన్నుతిన్న పాములా స్తబ్దుగా ఉండడం, అస్తమానూ నిద్రపోవడం, ఆపైన తిండి. అతిగా. డాక్టర్ల చుట్టూ తిరిగే అధ్యాయం మొదలైంది.
…
అప్పుడే డాక్టర్ దగ్గరనుంచీ తిరిగివచ్చారు.
“ఏమన్నాడురా డాక్టరు?” తల్లి ఆతృతగా అడగడంతో తిలక్ ఆలోచనల్లోంచి తేరుకున్నాడు.
“ఏమీ చెప్పడం లేదు. ఆ టెస్టులు చేయించండి, ఈ టెన్టులు చేయించండంటాడు” బాధగా జవాబిచ్చాడు
“బంతిలాంటి పిల్లాడు, చలాకీగా తిరుగుతూ ఒక్కపనీ తోచనిచ్చేవాడు కాదు.. లేకపోతే వేరే డాక్టరుకి చూపించరా.” అంది.
“అదే అలోచిస్తున్నాను” సాలోచనగా చెప్పాడతను.
భారతి భర్తతో ఎక్కువగా మాట్లాడదు. అతన్ని కదిపి, తన మనసు నొప్పించేలా చేసుకోవపడంకన్నా మౌనమే వుత్తమమని చాలా తొందరగా గ్రహించిందామె. కానీ, అతన్తో సంప్రతించక తప్పని విషయాలూ ఉంటాయి. కొడుకు గురించి అతన్తోకాక ఇంకెవర్తో మాట్లాడుతుంది?
“వాడికేమెంది. పిచ్చా? మానసికంగా ఎదగడం లేదా? ఎందుకిలా జరిగింది?” భారతి ప్రశ్న వాడిగా వచ్చి తాకింది.
“ఛఛ… కాదు”
“బాబుని ముంబాయి తీసుకెళ్దాం. అక్కడ మంచి డాక్టరున్నాడట. నా ఫ్రెండొకతను చెప్పాడు.” తిలక్ ఆశగా చెప్పాడు
“మరేమిటి వాడికి? మీరు నాకెందుకు చెప్పరు? నాకు చెప్పాల్సిన అవసరం లేదని అనుకుంటున్నారా? అసలే విషయంలోనేనా నా మాట విన్నారా? వాడికేమిటసలు? అందరు పిల్లల్లా ఎందుకుండడు?” ఉద్రేకంగా అడిగింది.
“ఏమీ లేదు భారతీ! ముంబాయి తీసుకెళ్దామన్నానుకదా?”
“మీరు నా దగ్గర రాస్తున్నారు.”
“ఏం లేదన్నానా?” విసుక్కున్నాడతను.
ఆమె చాలా ఏడ్చింది. ఏడుస్తునే వుంది. ఏమిటిది? భార్యాభర్తలిద్దరూ కలిసి తీసుకోవలసిన నిర్ణయాలన్నీ తనే ఏకపక్షంగా తీసుకుంటున్నాడు. ప్లాన్డ్గా జీవితాన్ని గడపటంలో తప్పులేదు. కానీ ప్లానింగ్ అంటే డబ్బొకటే కాదు. కట్నకానుకలు తీసుకుని, జీతాలు పైసపైస లెక్కపెట్టుకుంటూ, ఎవర్నీ గౌరవించకుండా, పిల్లలు పుట్టడాన్నికూడా డబ్బుతో ముడిపెడుతూ… ఇలాగా బతకడం? చిన్నతనంలో ఏవీ జరగలేదేమో! ఎవరింట్లో లేవు సర్దుబాట్లు? తాము ఇద్దరు అక్కచెల్లెళ్ళు, ఒక తమ్ముడు. తమ్ముడికి ముద్దు జరిగేది. తమని సర్దుకుపొమ్మనేవారు. ఇప్పుడు తమ జీవితం తమదైంది. జీవితం చిందరవందరగా వుందనిపించింది.
ఆరోజు ఇంట్లో వంట లేదు. నిండింట అభోజనం ఉండరాదని తిలక్ తల్లికి మనసు లాగుతూనే ఉంది. కానీ, నా కొడుక్కిలా ఉండి మేం ఏడుస్తుంటే వంటెందుకు చేశానని అతననేస్తాడని అవిడకి భయం. ఏం చెయ్యకుండా కూర్చుంది. అపార్ధాలు, దారుణమైన అపార్ధాలు. భార్యా భర్తలకి మధ్య, తల్లి కొడుకులకి మధ్య. రాత్రి తాను ముంబాయి వెళ్ళే విషయాన్ని తండ్రితో ప్రస్తావించాడు.
“బాబుని ముంబాయి తీసికెళ్ళి చూపించాలనుకుంటున్నాను. రెండేళ్ళయింది. డాక్టర్ల చుట్టూ తిరగడం మొదలు పెట్టి ఏ ప్రయోజనమూ కనిపించడం లేదు. వాడిని సంతోషంగా ఉంచమంటారు. ఏమిటి సంతోషమంటే? ఎన్ని బొమ్మలు కొన్నాను? వీటి ఖర్చు వీటిదే అవుతోంది. మందుల ఖర్చు మందులదే అవుతోంది.” ఆవేదన వ్యక్తమైందతని మాటల్లో.
తిలక్ తండ్రి తాత్వికంగా నవ్వాడు. ఆ నవ్వు జీవితాన్ని కాచి వడబోసిన అనుభవాలని ప్రతిధ్వనిస్తాన్నా, వాటిని తిలక్ వినలేకపోయాడు. అవతనికిప్పుడే వినిపించవు కూడా.
“భారతీ, నేనూ సెలవు పెట్టి వెళ్తున్నాం. డబ్బు బాగా ఖర్చువుతుంది. అందుకే పొలం బేరం పెట్టాలనుకుంటున్నాను” అన్నాడు.
తండ్రి కొద్దిసేపు ఏమీ మాట్లాడలేదు. ఆ పొలం పిత్రార్జితం. తనతో సమానంగా అందులో కొడుక్కి హక్కుంది. అమ్మనంటే అతని వాటాకోసం గొడవప్డడతాడు కూడా. మంచి చెప్పినా వినే పరిస్థితిలో లేదు. ఇక్కడి సమస్య పాలం అమ్మాలా వద్దా అనేది కాదు. పదెకరాల పొలం తన పేరుమీద ఉన్నప్పుడే కొడుక్కి తాను భారంగా అనిపిస్తున్నాడు. ఎలాంతి విలువా ఇవ్వడు. ఆ పొలం కాస్తా అమ్మేశాక తన యొక్క నిజమైన భారాన్ని అతను మోస్తాడా అనిపించింది.
ఎటూ తాను అంగీకరించినా, అంగీకరించకపోయినా పర్యవసానం గృహచ్ఛిద్రాలే. అంగీకరిస్తే అవి బయటపడడానికి కొంత సమయం పడుతుందిది. లేకపోతే ఈ క్షణాన్నే వస్తాయి. దాని ప్రభావం పసివాడి మీద ఎక్కువగా ఉండచ్చు. ఆకొద్ది సేపట్లోనూ ఆయన పరిస్థితిని అవలోకించుకున్నాడు. రేపెప్పుడో రాబోయే రోజుకి అన్వయించకున్నాడు. అన్నీ తేటతెల్లమయ్యాయి. వెంటనే సరేననలేకపోయాడు. మనసు పీకింది. తాతల నాటి ఆస్థినే సెంటిమెంట్ వెనక్కి లాగింది. తాను చెప్పదలుచుకున్నది చెప్పేశాక
ఎక్కువ సేపు ఉండలేదు తిలక్. ఆయన అభిప్రాయం కూడా వినలేదు.
పెద్దాయన అశాంతిగా మంచం మీద ఒరిగాడు. పక్క మంచం మీద భార్య నిద్రపోతోంది. తానున్నాడన్న నిశ్చింతలో ఏ ఆలోచనా లేకుండా విశ్చంతంగా ఉంది. పాలం అమ్మేసాక ఈ నిశ్చింత ఎంతకాలం ఉంటుంది? రెక్కల కష్టంతో ఆమెని పోషించాలేమో! అప్పుడింక ఇద్దరికీ మిగిలేవి కన్నీళ్ళే ఆలోచిస్తున్న కొద్దీ బాధనిపిస్తుంటే ఇంక ఆలోచించడం మాని బాధని దూరం చేసుకునే ప్రయత్నంగా కళ్ళు మూసుకున్నాడు.
కోడలొచ్చి టేబుల్ మీద నాలుగరటిపళ్ళు, గ్లాసుతో పాలూ తెచ్చి పెట్టింది. ఆఖరిగా మరచెంబుతో మంచినీళ్ళు పెట్టి, దానికింద ఒక చీటి ఉంచింది. దాన్ని చూసి ఆయన గమ్ముని లేచాడు. మడతలిప్పి గబ గబ చదివాడు.
“పొలం అమ్మకానికి మీరొప్పుకోకండి. దానివల్ల ప్రయోజనం ఉండగలదన్న ఆశ నాకు ఏమాత్రం లేదు. అమ్మిన తదుపరి పరిణామాలలెలా ఉంటాయో నేను ఊహించగలను. ఒకవైపుని కన్నకొడుకిలా ఉండగా, కన్నవాళ్ళలాంటి మిమ్మల్ని కూడా దూరం చేసుకుని ఎడారిలాంటి బతుకుని ఓ అపరిచిత బాటసారితో గడపలేను. పెళ్ళయి ఇన్నేళ్ళైనా మీ అబ్బాయి నాకు బొత్తిగా అర్ధం కాలేదు.”
భారతి చాల ఉద్వేగంతో రాసినట్టుంది. తిలక్ ఇంట్లోనే ఉన్నాడు. మామగారితో ఈవిషయం మాట్లాడడం అతనున్నప్పుడు కుదరదు. అతను వింటే గొడవవుతుంది. అందుకే కాగితం మీద పెట్టింది. కాలిన గాయానికి నవనీతం పూసినంత చల్లగా అనిపించింది తిలక్ తండ్రికి. గుండెల మీద బరువంతా తీసేసినట్లయి తేలికపడి, కంటి మీదికి కునుకు కూడా వచ్చింది.
మర్నాడు ఆయన లేచేసరికి తిలక్ స్టాంపు కాగితాలో సిద్ధంగా ఉన్నాడు. వాటిని ఆయనకిచ్చి సంతకాలు చెయ్యమన్నాడు. ఆయన ఏమాత్రం సంకోచించకుండా చేసేశాడు. కాఫీ ఇవ్వడానికి అక్కడికొచ్చిన భారతి నిశ్చేష్టురాలైపోయింది.
“ఒక్క విషయం చెప్తాను, వింటావా తిలక్?” కొడుకు నడిగాడు.
తిలక్‌కి ఆయన పట్ల ఒక విధమైన జాలి కలిగింది. పొలం అమ్మడానికి ఆయన ప్రతిఘటిస్తాడని భావించి అప్పుడు తానేం చెయ్యాలో రంగాన్ని సిద్ధం చేసుకున్నాడు. అలాంటిదేమీ జరగలేదు. ఎన్నో ఆస్తులు కరిగిపోగా మిగిలిన ఈ చివరిది అమ్మడానికి కూడా ఆయనే మాత్రం సంకోచించలేదు. అది ఈ ఇంట్లో ఆయన ఉనికినీ, తన దగ్గర ఉండడానికి ఆయనకి గల హక్కునీ సవాలు చేసేదే అయినప్పటికీ వెనుకంజ వెయ్యలేదు. ఎంచేత? తనమీదున్న నమ్మకమా? మనుమడి మీదున్న ప్రేమా? రెండింట్లో ఏదో ఇదమిద్ధంగా తేల్చుకోలేక మరోసారనుకున్నాడు – బొత్తిగా పాతకాలం మనిషని.
ఇందాకటి జాలి స్థానంలో కొద్దిగా ప్రేమ పుట్టింది. వెళ్ళి పక్కలో కూర్చుకున్నాడు.
“చెప్పండి” అన్నాడు.
“ఇప్పుడు నువ్వమ్మబోతున్న భూమి తరాలక్రితం మన కుటుంబంలోకి ప్రవేశించింది. అంటే నీ తండ్రికన్నా, నా తండ్రి కన్నా ముందు తరానికి చెందినది”
“అమ్ముతున్నందుకు బాధపడ్తున్నారా?”
“నువ్వే అన్నీ ఊహించుకోకు. నన్ను కూడా చెప్పనీ. ఇన్నేళ్ళుగా మన కడుపుల్ని నింపింది. మనని ఆశ్రయించిన వారికి కూడా ఇంతన్నం పెట్టింది. ఇప్పుడున్నవి గడ్డురోజులు. రాబోయేవి మరీ గడ్డురోజులు.”
“మనం అయిదుగురం. ఇద్దరం తెచ్చుకుంటున్నాం. ఆపాటి తినలేమా?”
“తిండి తినలేమని కాదు నేననేది.”
“మరేమిటి మీరు చెప్పేది? అదేదో సూటిగా చెప్తే బావుంటుంది. అమ్మడం ఇష్టం లేకపోతే మీ అయిదెకరాలూ మీరే ఉంచుకోండి. ఆవారా అప్పో సప్పో చేసి తర్వాత తీర్చుకుంటాను” అని లేచి నిల్చున్నాడు తిలక్.
తండ్రి అతని చెయ్యి పట్టుకుని ఆపాడు. అతను మళ్ళీ కూర్చున్నాడు. ఈసారి అయిష్టంగా,
“బాబుకన్నా పొలం నాకు ముఖ్యమైనది కాదు. అలా ఆలోచించేవాడినైతే కాగితాలమీద సంతకం చేసేవాడిని కాదు. బొంబాయి వెళ్ళడం అనవసరమని నాకనిపిస్తోంది. జీవనశైలి కొద్దిగా మార్చుకుని చూడు. అప్పటికీ మార్పు రాకపోతే అప్పుడు వెళ్ళచ్చు. నీకన్నా రెట్టింపు వయనూ, అనుభవం ఉన్నాయి నాకు. ఎంతోమంది పిల్లల్నీ పెద్దల్నీ చూశాను. ఎన్నో జీవితాల్ని చదివాను.”
తిలక్ ముఖం గంటుపెట్టుకుని విన్నాడు.
“ఏమీ అమర్చిపెట్టలేనప్పుడు నన్నెందుకు కన్నారని ఒకనాడు నన్ను నిలదీసావు. అదే ప్రశ్న నా చెల్లెళ్ళుగానీ, నాకూతుళ్ళుగానీ అడిగి వుంటే? వాళ్ళడగలేదు. చూపించిన సంబంధాలు చేసుకున్నారు. తృప్తిగా బతుకుతున్నారు. నువ్వుమాత్రం ప్రపంచం బరువు మోస్తున్నట్టు తిరుగుతున్నావు”
“…”
“అందర్నీ వదిలి పెట్టి నువ్వొక్కడివే సుఖపడాలన్న ఆలోచన ఎలా వచ్చిందో ఎప్పుడొచ్చిందో నాకు తెలీదు. సుఖమంటే డబ్బుండం ఒక్కటే కాదు. డబ్బుతో కనిపించినవన్నీ కొనుక్కోవడం మాత్రమే కాదు. ఉన్నవీ, కొన్నవీ నాకు చాలన్న తృప్తినిచ్చే మనసుండడం మనిషి సుఖానికి మూలం. ఆ సంగతిని పెద్దలు చెప్పనే చెప్పారు. శాస్త్రజ్ఞులు చెప్తేగానీ నమ్మదేమో మీ తరం””
“ఇప్పుడివన్నీ ఎందుకు?”
“బాబు సమస్య దీంతో ముడిపడి ఉంది. ఏ మనిషి తన దగ్గర సరిపడ్డంత డబ్బుందని ఒప్పుకోడు. ఎంత సంపాదించినా ఇంకా కొరత మిగిలే ఉంటుంది. డబ్బు సంపాదించడం, దాన్ననుభవించడమే సుఖమైతే నీ లెక్క ప్రకారం ఈ ప్రపంచంలో నిజంగా సుఖపడ్డవాడు అత్యంత ధనవంతుడవుతాడు. అది తప్పు. మానవ సంబంధాలు సరిగ్గా ఉంటే మనిషి సుఖానికి డబ్బుతో నిమిత్తం లేదు. ఆలోచిస్తే నీకే అర్ధమవుతుంది”
“అంటే మీ ఉద్దేశం? నేను డబ్బు మనిషిననా?”
“అని కాదు. డబ్బుతో పిల్లాడికి సుఖాన్నీ, వైద్యాన్ని కొనివ్వగలననుకోవడం తప్పని నా భావం. వాడికి సందడి కావాలి. చుట్టూ మనుషులుండాలి. ఉలకని పలకని టెడ్డీబేర్లూ, మిక్కీమౌస్లు కాదు. తోటి పిల్లల్లో ఆటపాటలు కావాలి. జీవం, చైతన్యం ఉట్టిపడే లోకం కావాలి. ఇంకో పిల్లో పిల్లాడో ఉంటే వాడికింత ఒంటరితనం ఉండదు. ఇప్పుడా అవకాశం లేదా?”
మామగారి మాటలకి భారతి ముఖం ఎర్రబడగా అక్కణ్ణుంచి వెళ్ళిపోయింది. తండ్రి మాట్లాడం ఆపేసినా లేచి వెళ్ళే ప్రయత్నం చెయ్యలేదు తిలక్. తండ్రి చెప్పినట్టు తన ఆలోచనల్లో ఎక్కడో లోపం ఉంది. విత్తనాన్ని పెట్టి అది మొలకెత్తిందో, లేదోనని పదేపదే తవ్వి చూసుకున్నట్టు ఒక్కపిల్లాణ్ణి కని తన ఆశల ఆరాటంతో వాణ్ణి ఉక్కిరిబిక్కిరి చేసేస్తున్నాడు. వాడు స్వతంత్రంగా ఏదీ చెయ్యకుండా కీలుబొమ్మని చేసి వాడితో తాను ఆడుకుంటున్నాడు. తన తండ్రికి తమతో ఇంత ఎటాచిమెంటుండేది కాదు. పిల్లల విషయాలు తల్లికే వదిలేసేవాడు. ఆవిడ స్వేచ్ఛగా తమని పెంచింది. భారతికి తనలాంటి స్వేచ్ఛని ఇవ్వలేదు.
కాసేపాగి తిలక్ తండ్రి మళ్ళీ అన్నాడు. ” పెళ్ళైన వెంటనే భర్త పోయాడు నా పెద్దత్తకి. అత్తింట్లో పెట్టరాని ఆరళ్ళు పెడితే అర్ధరాత్రివేళ కట్టుబట్టలతో పొలంగట్లమ్మట పడి పారిపోయి వచ్చింది. ఇంక నా చెల్లెలు… దానికీ అలానే జరిగింది. మనోవర్తి చేతిలో పెట్టి పంపేసారు. ఆ డబ్బు మా నాన్న చేతికే ఇచ్చింది. నా తండ్రి తాతలిచ్చిన ఇల్లూ, పొలం కావాలని తీసుకున్నప్పుడు వాళ్ళ బాధ్యతలు… అందులో నిస్సహాయులైన ఆ ఆడపిల్లల బాధ్యతలు నావి కావా? నా తోబుట్టువుల్ని సరే, నీ తోడబుట్టినవాళ్ళని కూడా దూరం చేసుకుని ఏం సాధించేవు? నీ డబ్బు వాళ్ళంతా తినేస్తారనేగా నీ భయం? నీ చెల్లెళ్ళకి ఏడాదికి ఒకసారి పసుపుకుంకాలిస్తేనూ, భారతి తన తండ్రి మందులకని ఓ వంద రూపాయలిస్తేనూ తప్పా? అంత తరిగిపోయే ఆస్తుల్ని నువ్వు ఎంతకని పైసపైసా కూడబెట్టి పోగెయ్యగలవు? వాళ్ళకి లేక కాదురా, ఆ ఆశింపు. మనని మరొకరు గుర్తిస్తున్నారు. కని పెట్టుకుని ఉన్నారనే తృప్తికోసం “
తిలక్ తలొంచుకున్నాడు, తండ్రి తన మనసుని చదివేస్తుంటే,
“బాబు అమ్మ ఒళ్ళోని ఆర్తినీ, అనుభూతిని పూర్తిగా అనుభవించకముందే అమ్మాయెళ్ళి ఆఫీసులో చేరింది. ఇంకా లీవు పెడితే జీతం పోతుందని గొడవ. మూడేళ్ళకి స్కూల్లో వేసారు. అక్కడ బితుకుబితుకుమంటూ గడిపి వాడు ఇంటికొస్తే గుండెకి హత్తుకుని సేదదీర్చడానికి అమ్మ ఎదురురాదు. ఆడుకోవడానికి బయటికి వెళ్ళకూడదని ఆంక్ష. ముసలివాళ్ళం మేమిద్దరం. వాడి చిన్ని మనసు ఎంత నలిగిపోయి వుంటుందో ఆలోచించావా? నీ చిన్నప్పుడు నువ్వు మమ్మల్ని ఎంతేనా ద్వేషించి వుండవచ్చు. కానీ, తోటి పిల్లలతో ఆటల్లో పడ్డప్పుడు ఆ ద్వేషాన్ని కాసేపైనా మర్చిపోగలిగావా? మరిప్పుడు? నీ బాధని పంచుకోవడానికి ఎవరూ లేరు. ఓదార్చుకోవాలేగానీ ఒక్కరూ నీ సాయానికి రారు. నీ అంతట నువ్వు సేదరీరేంత ధైర్యం నీకుందా? నీకేగాదు, ఏ మనిషికీ ఉండదని నా నమ్మకం.”
“వద్దు. ఇంకేమీ చెప్పకండి.” సిగ్గేసింది తిలక్‌కి.
అతనికి చప్పుని గుర్తొచ్చింది . ‘డబ్బు’ అనేదొకటి ప్రపంచాన్ని శాసిస్తుందనీ, దాన్ని తండ్రి దుర్వినియోగపరచడం చేతనే తనకి దక్కాల్పివన్నీ దక్కడం లేదని తను అనుకోకముందు చాలా సంతోషంగా ఉండేవాడు. ఆ సంతోషపు రోజుల్లో తండ్రి మేనత్తని అతను అమ్మమ్మా అని పిలిచేవాడు. పెద్దమేనత్త అతన్ని ఎత్తుకుని తిరిగేది. అప్పట్లో కాస్తక్కువ దూరం నడవాల్సొస్తే తండ్రి అతన్ని భుజాల మీద ఎక్కించుకుని తీసుకెళ్ళేవాడు.
ఆకాశంలోని మబ్బులన్నీ తొలగి చంద్రోదయమైనట్టు అతని మనసంతా చల్లటి వెలుతురు పరుచుకుంది. ఆ వెలుతుర్లో డబ్బుని మినహాయించుకున్న ప్రపంచం కూడా శోభాయమానంగానే కనిపించింది. కొడుకు తన తెలివితక్కువతనం, అనుభవరాహిత్యాల వల్ల ఊబిలోకి కూరుకుపోతుంటే తండ్రి చేయూతనిచ్చి పైకి లాగుతున్న దృశ్యం రూపుదిద్దుకుంది.
ఆయన పాతకాలం వాడే కావచ్చు. డబ్బు దాచలేకపోవచ్చు, చీకూ చింతా లేకుండా నిశ్చింతగా ఉన్నాడు. ఆయన ఆలోచనల తాలూకూ వేర్లు సృష్టి ఆదిలోకి… మానవ సమాజపు తొలిపునాదుల్లోకి చొచ్చుకుపోయి సృష్టి అంతం దాకా విస్తరించేంత విశాలమైనవి. మనిషి సృష్టించినది డబ్బు. అది జీవితాల్ని శాసిస్తుందనుకోవడం భ్రమ. ఆ భ్రమని సృష్టించి మనిషి తానే సాటి వాడికి అన్యాయం చేస్తున్నాడు. అప్పుడున్నంత చిక్కదనం ఇప్పుడుండకపోవచ్చు కానీ, మనిషికి మానవ సంబంధాలు చాలా అవసరం అనుకుంటూ లేచాడు.
ఒలీవియా- ఆంధ్రభూమి
“అమ్మా! మాకు ఇంగ్లీషుకి కొత్త టీచరు వచ్చింది. పేరు ఒలీవియా” స్కూలునించీ రాగానే వుత్సాహంగా చెప్పింది అమూల్య. ఆ చెప్పడంలోనే అర్ధమైంది, కొత్త టీచరు బాగా నచ్చిందని.
ఆపేరు కాలం పొరల వెనుక నిద్రాణంగా వున్న జ్ఞాపకాన్ని తట్టి లేపింది. సుదూర గతం. వర్తమానంతో లింకులు తెగిపోయినది. తెగిపోయాయనుకున్న లింకులు మళ్ళీ వర్తమానాన్ని అందుకుంటాయన్న వూహ ఆ క్షణాన్న కలగలేదు.
“అమ్మా! రాగానే ఒలీవియా టీచరు మాకో కథ చెప్పింది తెలుసా? చాలామంచిది కదమ్మా? ” అంది అమూల్య.
“ఏం కథ చెప్పింది?” చాలా మామూలుగా అడిగాను. వూహకి అందని జవాబు వస్తుందని అనుకోలేదు.
“ఒక చిన్నమ్మాయి వుందట. అమ్మ తప్ప ఎవరూ లేరు. స్కూల్లో కూడా తనతో ఎవరూ మాట్లాడేవారు కాదట…”
షాకయాను. ఆమె ఎవరో అపరిచిత వ్యక్తి కాదు. నాకు తెలిసిన ఒలీవియానే. అనూహ్యమైన పరిణామమేమో జీర్ణించుకోవడానికి కొంత వ్యవధి పట్టింది.
“ఆ కథ నాకు తెలుసు. మీ టీచరు నా చిన్నప్పటి స్నేహితురాలు” అన్నాను నెమ్మదిగా.
“నిజంగా? రేపు టీచరుకి చెప్పనా? ” వుత్సాహంగా అడిగింది తను. వాళ్ళ టీచరు నాకు తెలియడం పిల్లకి గర్వంగా వుంది.
“రేపు నేను మీ స్కూలుకి వస్తాను. తనకి చెప్పు” అన్నాను.
ఆ రోజంతా నాకు ఒలీవియా గురించిన ఆలోచనలే, తన జ్ఞాపకాలే. ఎలావుందో? మేం శ్రీకాకుళం వదిలిపెట్టి వచ్చేసాక వాళ్ళమ్మ చనిపోయారని తెలిసింది. పెళ్ళి చేసుకుందా, ఒలీవియా? ఎవరేనా ముందుకి వచ్చారా? ఎక్కడి శ్రీకాకుళం, ఎక్కడి హైద్రాబాదు? అసలిక్కడికి, ఇంతదూరానికి ఎలా వచ్చింది?
సాఫ్ట్వేర్ ఇంజనీర్ల విషయంలోనో మరెవరో పెట్టి పుట్టినవాళ్ళకో అదో పెద్ద విషయం కాకపోవచ్చు. కానీ ఒలీవియా సంగతి అలా కాదు. ఎన్నో ప్రశ్నలు.
నేను ఎనిమిదో తరగతి చదువుతున్నప్పటి రోజులు. నాన్న శ్రీకాకుళం జిల్లాలో ఒక పల్లెటూళ్ళో ప్రైమరీ హెల్త్ సెంటర్లో డాక్టరుగా చేసినప్పటి రోజులు. ప్రతి మూడేళ్ళకీ ట్రాన్స్ఫరవటం, ఆ చుట్టుపక్కలే కొత్త కొత్త వూళ్ళకి వెళ్ళటం, స్కూలు మారటం. . . అలా మేం ఈ వూరొచ్చాము. పెద్ద ఇల్లు, విశాలమైన ఆవరణ, పెరట్లోకి వెళ్తే కనుచూపుమేరంతా పచ్చగా పంట పొలాలు, అంత దూరాన్నించీ సువాసనల్ని మోసుకొస్తూ నాగమల్లిచెట్టు. . . నాకు చాలా నచ్చింది.
కొత్త స్కూలు, అంతా కొత్త స్నేహితులు. సాయంత్రం స్కూలైపోయాక అమ్మాయిలం నెట్ కట్టుకుని రింగు ఆడుతున్నాం. మాకు కొంత దూరాన్న సిమెంటు బెంచీ అంచుని ఎవరితోనూ సంబంధం లేనట్టు కూర్చుని వుంది ఒలీవియా. చామనఛాయకన్నా తక్కువరంగు, కాస్తంతలావుపాటి ఆకృతి, గుండ్రటి కళ్ళు ,నొక్కుల జుత్తు. . . అందరం ఆడుకుంటుంటే తనొక్కర్తీ అలా కూర్చుని వుండటం ఒక వింతైతే తను కూర్చున్న తీరు మరొక వింత. పక్కని ఎవరూ లేకపోయినా బెంచీ అంచుని ఎవరో నెట్టేస్తారన్నట్టు కూర్చుని వుంది. రింగు నా పార్ట్నర్కి ఇచ్చి, తన దగ్గిరకి వెళ్ళాను.
“ఒక్కదానివీ కూర్చున్నావేం? నువ్వూ రా! ” అన్నాను.
“వద్దులే. మీరు ఆడుకోండి” అంది తను. అమ్మాయిల సమస్యేమోఅనుకుని బలవంతపెట్టలేదు. తిరిగి నెట్ దగ్గిరకి వెళ్ళిపోయాను.
“తనంతే. ఎవరోటీ మాట్లాడదు. కలవదు. మేమంతా ఆడుకుంటుంటే తనొక్కతే అలా కూర్చుని వుటుంది. ఆటకూడా చూడదు” అంది నా పార్ట్నర్. ఆటైపోయింది. అందరూ పుస్తకాలు సర్దుకుని ఇళ్ళకి బయల్దేరారు. నేను మళ్ళీ ఒలీవియా దగ్గిరకి వెళ్ళాను. తనలాగే కూర్చుని వుంది, వెళ్ళటానికి ఇష్టం లేనట్టు.
“రా, వెళ్దాం” చెయ్యందిస్తే అందుకోలేదు. తనంతట తనే పుస్తకాలు సర్దుకుని లేచి నిలబడింది. ఇద్దరం కలిసి నడుస్తున్నాం.
“మా యిల్లిక్కడే. ఈ సందులో చివరికి వెళ్ళాలి” అంది కొంతదూరం వచ్చాక.
“ఎవరెవరుంటారు మీ యింట్లో?” కుతూహలంగా అడిగాను.
“అమ్మా. నేను” క్లుప్తమైన జవాబు. తనకి సంబంధించిన ప్రతీదీ అలాగే క్లుప్తంగానే వుంటుందని నాకు అతి త్వరలోనే తెలిసింది.
“మీ నాన్నగారు?”
“లేరు. నేను పుట్టకముందే మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారట.”
“నీకు ఫ్రెండ్సేవరూ లేరా?”
తల అడ్డంగా వూపింది.
“మీ యింటికి రానా?”
“రా? అంది. అలా అనటంలో కొంచెం సందిగ్ధం, కొంచెం ఆశ్చర్యం. ఇద్దరం వాళ్ళింటికి వెళ్ళాం. ఉండటానికి ఒక చిన్నగది, వంటకి వరండా,
ఇల్లంతా కలిపి అంతే. వాళ్ళమ్మ గదిలో ఒక మూల మంచం మీద ముడుచుకుని పడుకుని వుంది. ఆ అమ్మే సమస్త ప్రపంచం ఒలీవియాకి. ఆవిడకి టీబీ. ప్రైవేట్ హాస్పిటల్లో నర్సుగా చేసేదట. టీబీ అంటువ్యాధిగాబట్టివాళ్ళు వుద్యోగంలోంచి తీసేసారట. వెళ్తే వైద్యం చేస్తున్నారటగానీ మందులు
కొనుక్కోమంటున్నారట. కొన్ని టెస్టులు చేస్తే ఫీజు అడుగుతున్నారట. ఎక్కువసేపు వుండలేకపోయాను వాళ్ళింట్లో, ఇంటికి వచ్చాక మాత్రం తన గురించిన ఆలోచనలే. అమ్మని ఎన్నో ప్రశ్నలడిగాను. నాన్న క్లబ్నుంచీ వచ్చేదాకా మేలుకుని వున్నాను.
“ఏమ్మా?” అన్నారు నాన్న.
ఒలీవియాగురించి చెప్పాను.
“ఆవిడని తీసుకుని ఆస్పత్రికి రమ్మని ఆ అమ్మాయికి చెప్పమ్మా! నేను చూస్తాను” అన్నారు.
“టీబీ చాలా పెద్ద వ్యాధికదా? దానికి బలమైన ఆహారం తినాలంటారు, వాళ్ళకి ఏమీ లేదు నాన్న గారూ! తనకి నాన్న లేరు. అంటువ్యాధి అని
ఆవిడని వుద్యోగంలోంచీ తీసేసారట. ఆవిడ తప్ప ఒలీవియాకి ఇంకెవరూ లేరు” అన్నాను.
“వైద్యానికి ఫీజు తీసుకోను. నా దగ్గరున్న మందులు, శాంపిల్సు ఇస్తాను. బలమైన తిండి తింటే మందులు బాగా పనిచేస్తాయి. పాలూ, పళ్ళూ
ఆకుకూరలూ సమృద్ధిగా తినాలి “అన్నారు నాన్న.
“సర్లెండి. లేనివాళ్ళంటోందిగా? పాలూ పళ్ళూ వాళ్ళకెలా వస్తాయి?”అంది అమ్మ.
“నాకు ప్రతి సంక్రాంతికి మూడు జతల బట్టలు కొంటారు. తిథుల ప్రకారం ఒకసారి, తేదీలప్రకారం ఒకసారి పుట్టినరోజులు జరుపుతారు. పెద్దపండుక్కి ఒక్కజత చాలు. తిథులప్రకారం ఒక్కసారి పుట్టినరోజు చేస్తే చాలు. మిగిలిన డబ్బులు వాళ్ళకిస్తాను” అన్నాను.
నాన్న నాకేసి సాలోచనగా చూసారు. “రేపు చూద్దాం” అన్నారు.
ఆరోజు రాత్రి అమ్మకీ నాన్నకీ మధ్యని ఈ విషయాన్ని గురించి కొంత చర్చ జరిగి వుంటుందనే అనుకున్నాను. నాన్న ఒలీవియా వాళ్ళమ్మని చూసి రాగానే వప్పుకున్నారు. ఆ యేడాది భోగికీ, కనుమకీ నేను కొత్తబట్టలు కట్టుకోలేదు. అమ్మ కూడా మానేసింది. ఇద్దరం అంతకి ముందు పండగలవి కట్టుకున్నాం. పుట్టినరోజుల్లో మార్పుకి అమ్మ వప్పుకోలేదు.
“ఎందుకిలా చేస్తున్నావు?” అడిగింది ఒలీవియా ఆశ్చర్యంగా.
“పర్వాలేదులే. నాకు చాలా బట్టలున్నాయి” అన్నాను. తనింకేం అనలేదు.
ఆతర్వాత ఆర్నెల్లకి నాన్న మళ్ళీ ట్రాన్ఫరయారు. తనని రిలీవ్ చెయ్యడానికి వచ్చిన సుబ్బారావుగారికి ఒలీవియా అమ్మ బాధ్యత అప్పగించారు. ఇద్దరూ మెడిసిన్ కలిసి చదువుకున్నారు. మంచి స్నేహితులు.
“ఎందుకు? ఇదంతా? అవసరం లేని బాధ్యత కదా?” అన్న ఆయన ప్రశ్నకి –
“పిల్లలు చేస్తున్నది మంచిపనైనప్పుడు కాదనడం ఎందుకు? మనం మంచిని ప్రోత్సహిస్తే పెద్దయాక ఎదురయ్యే చెడుని తేలిగ్గా గుర్తించి అందులో ఇరుక్కోకుండా వుంటారు ” నాన్న జవాబు.
మేం మరో వూరుకి వెళ్ళిపోయాం. కొద్దిరోజులకే ఒలీవియా వాళ్ళమ్మ చనిపోయారనీ, ఒలీవియా చర్చి ఆర్ఫనేజిలో చేరిందని వార్తలు. అక్కడితో తనతో సంబంధం ఆఖరు. మళ్ళీ తనగురించి వినడం ఇదే మొదలు.
“నాతో శ్రీకాకుళంలో స్కూల్లో చదువుకున్నమ్మాయి అమూల్యకి టీచరుగా వచ్చిందట. తనని కలిసి వస్తాను. సాయంత్రం నన్ను స్కూలుదగ్గిర
దింపి అమూల్యని ఇంటికి తీసుకురండి” మరుసటిరోజు విపిన్‌కి చెప్పాను. తను సరేనన్నాడు. సాయంత్రం స్కూలయ్యాక అమూల్యని విపిన్‌తో పంపేసి నేను ఒలీవియాని కలవటానికి వెళ్ళాను. నాకోసం ఎదురుచూస్తూ గ్రౌండులో ఒకచోట చెక్కబల్లమీద కూర్చుని వుంది. మొదటిసారి కలిసినప్పటిలా కాకుండా …సౌఖ్యంగా. పోల్చుకోలేనంత మార్పేమీ లేదు. వయసు పెరిగిన ఒలీవియాలా వుంది. ముఖం, అరచేతులు, పాదాలు తప్ప మరేమీ కనిపించకుండా తెల్లటి డ్రెస్.
“రా, జయా!” అంది చాలా మామూలుగా. ఎలాంటి వుద్వేగంలేదు. నాకు మాత్రం తనని హగ్ చేసుకోవాలని, తన చేతిని నా చేతిలోకి తీసుకోవాలనీ బలంగా అనిపించింది. కానీ అవేవీ చెయ్యలేకపోయాను. అలా నియంత్రిస్తుంది తన చూపు. మౌనంగా వెళ్ళి తనపక్కని కూర్చున్నాను. తరువాత కూడా చాలాసేపటిదాకా మౌనమే. తనదగ్గిర కబుర్లేం వుండవు.
“నిన్న పొద్దుట మొదటిసారి అమూల్యని చూసినప్పుడు నువ్వెందుకో గుర్తొచ్చావు. తను నీ కూతురవడం చాలా ఆశ్చర్యంగా వుంది” అంది. “వాళ్ళ నాన్న విపిన్. ఇంజనీరు. ఇల్లు ఇక్కడికి దగ్గరే. రాకూడదూ?” అన్నాను.
“మా రూల్స్ వప్పుకోవు”
“ఓకే. ఎలా వున్నావు?” అడిగాను.
“నీవలన అమ్మకి మంచి వైద్యం, పోషణ జరిగాయి. లేకపోతే ఆమె అలా నిస్సహాయంగా చనిపోతే చాలా బాధగా వుండేది. ఇంక నా గురించి.
అమ్మా లేక, నాన్నా లేక నా అనేవాళ్ళూ లేక తెగిన గాలిపటంలాంటి జీవితం. అమ్మ దాన్ని మతమనే కొమ్మకి ముడేసింది. . . చర్చే నన్ను పెంచి పెద్దచేసింది. నాకు ఈ వుద్యోగం కూడా చూపించింది. ఆ ప్రభువు దయవల్ల బాగానే వున్నాను ” అని ఆగింది.
“ఏమిటి?” అడిగాను.
“ఒక ప్రశ్న నన్ను తీవ్రంగా బాధపెడుతోంది. జయా! మొదటిసారి హాస్పిటల్‌కి తీసుకెళ్ళినప్పుడు మా అమ్మని చూడగానే డాక్టరుగారిలో ఆశ్చర్యం. తరువాత అమ్మని చూడ్డానికి వచ్చిన సుబ్బారావుగారిలోనూ ఆశ్చర్యం. వాళ్ళ ముగ్గురిమధ్యా ఒక రహస్యం వుందనిపిస్తుంది. వాళ్ళెప్పుడూ నా యెదురుగా వైద్యానికిమించి యేవీ మాట్లాడుకోలేదు. కానీ మా అమ్మ కచ్చితంగా వాళ్ళిద్దరికీ తెలుసు. తెలిస్తే తెలిసినట్టు బయటపడాలి. కానీ దాచారు. అంటే వాళ్ళిద్దర్లో ఒకరు నా జన్మకి కారకులా అనే అనుమానం నాకు అప్పుడప్పుడు కలుగుతుంది. జవాబు తెలుసుకోవాలనే కోరిక నన్ను బలంగా వూపేస్తూ వుంటుంది” అంది. సాధారణమైన విషయాన్ని గురించి చెప్పినంత మామూలుగా తను చెప్పిందిగానీ నేనంత తొందరగా జీర్ణించుకోలేకపోయాను. నాన్న గురించిగానీ సుబ్బారావుగారిగురించిగానీ అలా వూహించుకోలేకపోయాను.
“తెలుసుకుంటాను” అన్నాను. నాగొంతు నాకే బలహీనంగా వినిపించిది.
“వద్దులే జయా! నా మనసులో మాట బయటికి అలా అనేసాను. జస్ట్ కుతూహలం అంతే. విషయం ఎట్నుంచీ ఎటొచ్చినా నువ్వు బాధపడతావ్” అంది ఒలీవియా. తండ్రి ఎవరో తెలీకుండా బతకడానికి చిన్నప్పట్నుంచీ అలవాటుపడిపోయి, యిప్పుడొక వైరాగ్యయుతమైన జీవితం గడుపుతున్న తనకి అది పెద్ద విషయం కాకపోవచ్చు. అలాంటి రహస్యాలు జీవితాలని అల్లకల్లోలం చేస్తాయని తనకి తెలియకపోవచ్చు. ఎన్నోయేళ్ళుగా మనసులో దాచుకుని చెప్పుకునే వాళ్ళు లేక ఇప్పుడు నన్ను చూడగానే చెప్పి వుంటుంది . నాకు మాత్రం చాలా అలజడిగా వుంది. మరికొద్దిసేపు కూర్చుని వచ్చేసాను. ఇంటికి రాగానే నాన్నకి ఫోన్ చేసాను. సంభాషణ ఎలా మొదలుపెట్టాలో అర్ధమవలేదు.
“ఒలీవియా కలిసింది నాన్నా” అన్నాను బలహీనమైన గొంతుతో,
“ఒలీవియా… అంటే సుబ్బారావు కూతురు. నీ చిన్నప్పటి ఫ్రెండు. అప్పుడు మీయిద్దరూ చిన్న పిల్లలు. ఏం చెప్పినా అర్ధం చేసుకోలేని వయసు.
అందుకని ఏమీ చెప్పలేదు”
నా మనసులోంచి పెద్దబరువు తొలగిపోయింది. మరోలా వినవలసి వస్తే ఏం చెయ్యాలో కూడా నాకు తెలిసివుండేది కాదు. కాలం మరుగునపడిపోయిన ఈ నిజం చుట్టూ బలమైన వుద్వేగాలు అల్లుకుపోయేవి.
“సుబ్బారావు నాకు మెడిసిన్‌లో ఒక సంవత్సరం సీనియరు. మంచి ఫ్రెండయాడు. ఒలీవియా వాళ్ళమ్మ సునంద నర్సు ట్రెయినింగ్ చేస్తుండేది.
ఇద్దరిమీదా పుకార్లుండేవి. అలాంటిది సునంద వున్నట్టుండి కాలేజి వదిలిపెట్టి వెళ్ళిపోయింది. అందరూ రకరకాలుగా అనుకున్నారు. నేను సుబ్బారావుని అడిగాను. దానికతడు-
మాది షరతులేని ప్రేమ. అందులో ఎలాంటి ఆశింపులకీ చోటుండదు.
నేను తనని పెళ్ళి చేసుకుంటాననిగానీ, తను నాకు ఫెయిత్ఫుల్ వైఫ్‌గా వుండి నా తల్లిదండ్రులకి సేవచేస్తూ నాకు పిల్లల్ని కనిచ్చి నా వంశాన్ని అభివృద్ధి చేస్తుందనిగానీ, మేం అలాంటి షరతులేవైనా పెట్టుకుని వుంటే కనీసం వెళ్ళిపోవడానికి ముందు నన్ను నిలదియ్యడమో గొడవ చెయ్యడమో చేసి వుండేది. అదేమీ చెయ్యకుండా సైలెంటుగా వెళ్ళిపోయింది- అన్నాడు.
సునంద ఎక్కడికెళ్ళిందని అడిగాను.
తెలియదన్నాడు” అన్నారు నాన్న.
“తప్పుకదూ?” అన్నాను.
“సునందదా? ఔను. తప్పే. జీవితాలతో ప్రయోగాలు తప్పు. ప్రేమిస్తే వచ్చే పర్యవసానాలగురించి చర్చించుకోకుండా ప్రేమించడం తప్పు. ఒకవేళ అన్నీ కప్పదాటు వేసినా, మెడికల్ ప్రొఫెషన్లో వుంటూ జాగ్రత్తలు తీసుకోకపోవటం తప్పు. అనాలోచితంగా ఒక పిల్లని కనటం తప్పు. సుబ్బడిదేముంది? మగవాడు. చేతికంటుకోకుండా దులుపుకున్నాడు”
నేను సుబ్బారావుగారిది తప్పనుకుంటే నాన్న సునందగారిది తప్పంటున్నారు.
“డీ ఎన్ ఏ టెస్టుల్లో తెలుస్తుందికదా?
“అప్పుడు ఆ టెస్టుల్లేవు. ఉన్నా పిల్లలని వదిలిపెట్టేస్తారని చెయ్యరు. మరోలా రుజువు చేసినా అందులో బ్రీచ్ ఆఫ్ ప్రామిస్ లేదని సుబ్బారావు వాదిస్తాడు. అసలు అలా అడిగే అవకాశం సునంద ఇవ్వలేదుకదా?”
“…”
“అలా మాయమైన సునంద ఒలీవియాకి అమ్మగా మళ్ళీ కనిపించింది. పెళ్ళి కాకుండానే తల్లి కాబోయినందుకు తల్లితండ్రులు బంధువులు ఎవరూ దగ్గిరకి రానివ్వలేదట. అబార్షన్ వాళ్ళ మతంలో తప్పు. అందుకని వంటరిగానే పిల్లని కని పెంచింది. షరతుల్లేని ప్రేమయొక్క పర్యవసానాన్నీ, బాధ్యతనీ తనే తీసుకుంది. టీబీ రాకపోతే ఆమెకి మరొకరి సహాయం అవసరమై వుండేది కాదు. అలాంటి పరిస్థితి వస్తుందనే మనుషులు సంఘానికీ సాంప్రదాయాలకీ కట్టుబడి వుంటారు”
“నష్టపోయింది ఒలీవియా”
“ఔను. పెద్దవాళ్ళు కట్టుబాటు దాటితే నష్టపోయేది పిల్లలే. ఇప్పుడెలా వుంది ఆ అమ్మాయి?”
“అమూల్య స్కూల్లో టీచరుగా చేస్తోందట. అది చెప్తే వెళ్ళి కలిసి వచ్చాను. మీరో సుబ్బారావుగారో తన తండ్రి అని గ్రహించింది.”
“చాలా తెలివైన పిల్ల” నాన్న చిన్నగా నిట్టూర్చారు. ” పెళ్ళి చేసుకుందా?” అడిగారు.
“అమూల్య స్కూల్లో టీచర్లు పెళ్ళిచేసుకోరు నాన్నా!”
సుదీర్ఘంగా నిశ్వసించి నాన్న ఫోన్ పెట్టేసారు. వెంటనే సుబ్బారావుగార్నించీ ఫోను.
“ఏమ్మా, జయా! కులాసానా? ఆంటీ పోయాక నన్ను పూర్తిగా మర్చిపోయినట్టున్నావు? ఫోన్ చెయ్యడం మానేసావు” అన్నారు నిష్టూరంగా. ఆయన భార్య గైనకాలజిస్ట్. ఆవిడ మొదట్నుంచీ హైద్రాబాదులోనే ప్రాక్టీసు చేసేది. ఆయన వుద్యోగరీత్యా తిరిగేవారు. మేం శ్రీకాకుళంనుంచీ
వెళ్ళిపోయిన కొంతకాలానికి ఆయన వాలంటరీ రిటైర్మెంటు తీసుకుని భార్య దగ్గిరకి వచ్చేసారు. ఫిజీషియన్‌గా భార్యతో కలిసి ప్రాక్టీస్ మొదలుపెట్టారు. ఆవిడ రెండేళ్ళ క్రితం పోయింది. ఇద్దరు కొడుకులు. ఇద్దరూ అమెరికాలో స్థిరపడ్డారు. ఆవిడ వున్నప్పుడు మాకు రాకపోకలు బాగానే వుండేవి. వాళ్ళ పిల్లలు అక్కా అక్కా అంటూ నావెంట తిరిగేవారు. వాళ్ళు అమెరికా వెళ్ళటం, ఆవిడ పోవటంతో రాకపోకలు ఆగాయి. సుబ్బారావుగారితో నాకు ప్రత్యేకించి పెద్దగా చనువు లేదు. ఇప్పుడీ ఫోను.
“మీ ఇంటికి వద్దామనుకుంటున్నాను. కొంచెం మాట్లాడాలి” అన్నారు.
ఒలీవియా గురించేనని గ్రహించాను.
“తప్పకుండా రండి. భోజనానికి వచ్చెయ్యండి” అన్నాను. కొద్దిసేపు ఏవో విషయాలు మాట్లాడి పెట్టేసారు.
మర్నాడు విపిన్ ఆఫీసుకీ, అమూల్య స్కూలుకీ వెళ్ళిపోయాక సుబ్బారావుగారు మాయింటికి వచ్చారు. కొద్దిసేపు మామూలు కబుర్లయాయి.
“రండి. అన్నం తింటూ మాట్లాడుకుందాం” అన్నాను. నేను టేబుల్ మీద అన్నీ సిద్ధం చేసేసరికి ఆయన చేతులు కడుక్కుని వచ్చారు. ఇద్దరం భోజనం మొదలు పెట్టాం.
“ఇంటిభోజనం తిని చాలా రోజులైంది. వంటావిడ బాగానే వండుతుందిగానీ ఇలా ఎందుకుంటుంది?” అన్నారు. నేను నవ్వి వూరుకున్నాను. మనస్పూర్తిగా మాటలు కలపలేకపోయాను.
“ఒక ఫ్రెండుతో కలిసి అతని మనవడి విషయంలో స్కూలుకి వెళ్ళినప్పుడు ఒలీవియాని చూసాను” అన్నరాయన.
“తను మీకేమౌతుందో నాన్న చెప్పారు” అన్నాను, సంభాషణని సులభతరం చేసేందుకు.
“ఎప్పుడు?”
“నిన్న సాయంత్రం”. జరిగింది క్లుప్తంగా చెప్పాను.
“నీతో ఈ విషయం ఎలా చెప్పాలో అర్ధమవలేదు జయా! మీనాన్న చెప్పి నన్ను బతికించాడు. చదువుకుంటున్నప్పుడు సునందతో పరిచయం. మేం చేసింది తప్పా ఒప్పా అనే చర్చ ఇన్నేళ్ళు గడిచాక అవసరం లేనిది. ఒలీవియాని చూసాను. వంటరిగా బతుకుతోంది. ఆంటీ పోయి. తమ్ముళ్ళు స్టేట్స్లో సెటిలయ్యి నేనూ వంటరిగానే వున్నాను. తండ్రికూతుళ్లం. ఒకరికొకరం ఆలంబన ఔతాం. తనకేం మరీ పెళ్ళి వయసు దాటిపోలేదు. ఏదైనా సంబంధం చూసి చేస్తాను. నాకళ్ళముందే వుంటుందనేది నా ఆలోచన”.
నేను మౌనం వహించాను.
“ఒలీవియాతో మాట్లాడాను. నాతో రమ్మని బతిమాలాను. తను రానంటోంది. నువ్వు నచ్చజెప్ప. నీ మాటైతే వింటుంది” అన్నారు.
“మీరూ, సునందగారూ చేసినదాంట్లోని తప్పొప్పులని విమర్శించను. కానీ అంకుల్, ఒలీవియాగురించేనా మీరు ఆలోచించలేదా?” అడిగాను.
“సునంద పోయాక ఒలీవియాని నా దగ్గిరకి తెచ్చుకుందామని ఎన్నోసార్లు అనుకున్నాను. కానీ అప్పటికే ఇటు ఇద్దరు పిల్లలు. ప్రాక్టీసు మంచి స్వింగ్‌లో వుంది. ఏం చేసినా అందరి జీవితాలూ తలక్రిందులౌతాయి. అలా చేసే హక్కు నాకు లేదనిపించింది. పైగా నాకూ సునందకీ మధ్య ఎలాంటి వొప్పందమూ లేదు. ఒలీవియాకి జీవితంపట్ల ఏ ఆశింపులూ లేవు. తనని నేను తెచ్చుకోవడానికి తెచ్చుకోకపోవడానికి తేడా కనిపించలేదు. “
“ఆర్ఫనేజిలో పెరిగింది అంకుల్, తను” గుర్తు చేసాను.
“నాదగ్గిరకి వచ్చివున్నా అంతకన్నా మంచి జీవితాన్ని ఇవ్వగలిగేవాడిని కాదేమో జయా! ఆంటీ చాలా పొజెసివ్. సునందగానీ ఒలీవియాగానీ ఆమెకేమీ కారు. కానివాళ్ళకోసం ఇబ్బందిపడటమో సర్దుకుపోవడమో చేసే మనస్తత్వం కాదు ఆమెది. సమస్య ఎదురైతే దాన్ని సమూలంగా నిర్మూలించాలనుకుంటుంది. మామధ్యని ఒలీవియాకి స్థానం వుండేది కాదు. అయాం ష్యూర్ అబౌట్ ఇట్. నువ్వు నా కోణంలోంచీకాక ఆవిడ కోణంలోంచీ ఆలోచించు”
“…”
“నీ ఫ్రెండుని నొప్పించడానికి చూడు జయా! ఇంతకాలం ఏం జరిగిందో జరిగింది. ఇప్పడిక తన భవిష్యత్తు బాగుండేలా నేను చూస్తాను.”
భోజనం పూర్తైంది. కొద్దిసేపు విశ్రాంతి తీసుకుని ఇంక వెళ్తానని లేచారు. నేను మళ్ళీ ఒలీవియాని కలిసాను. ఈలోగా సుబ్బారావుగారు తనని
మరో రెండుసార్లు కలిసారట. సుబ్బారావుగారింటికి తను వెళ్ళటం నాకు ఎంతమాత్రం ఇష్టం లేదు. ఆయనలో ప్రేమకన్నా ఈ పెద్దతనంలో తనకి ఆసరా ఔతుందన్న ఆలోచనే ఎక్కువగా కనిపించింది. కానీ ఒలీవియా జీవితంలో మార్పొస్తుందన్న ఆశ ఆ అయిష్టాన్ని అధిగమించింది.
“భార్యని కోల్పోయి, పిల్లలు దగ్గిర లేక వంటరిగా గడుపుతున్న ఆ వృద్ధుడి ప్రార్ధన కాదనలేకపోతున్నాను జయా! జన్మనిచ్చిన రుణంకూడా
వుందికదా? కొంతకాలం సేవ చేస్తాను. అందుకు చర్చినుంచీకూడా అనుమతి వచ్చింది” ఒలీవియా చెప్పింది.
సుబ్బారావుగారి కొడుకులు మాత్రం ఆయన తల్లికీ తమకీ చేసిన ద్రోహాన్ని క్షమించలేకపోయారు. తెల్లటి మతసాంప్రదాయపు దుస్తుల్లో ఉన్న
ఒలీవియాని వాళ్లు అక్కగా వప్పుకోలేకపోయారు. తండ్రికి కేర్‌టేకర్‌గా మాత్రమే గుర్తించారు.
సుబ్బరావుగారుండే ఇల్లు సిటీ సెంటర్లో వుంది. చాలా పెద్దది. ఆయన భార్య పేరుమీద వుంది. విల్లు భర్తకి రాసింది. ఆవిడ నర్సింగ్హెూంకోసం కట్టించుకున్నది. ఆవిడ పోయాక ఖాళీగానే వుండిపోయింది. మూడునాలుగుకోట్లేనా చేస్తుంది. దాన్ని ఒలీవియాకి రాసిచ్చేస్తారేమోనన్న భయం వాళ్ళలో మొదలైంది. దాచుకునే ప్రయత్నం ఏమీ చెయ్యలేదు. పెద్దకొడుకు మామగారికి తండ్రిచేత ఇప్పించుకుని పవరాఫ్ అటర్నీ ఇంటిని లీజ్‌కి ఇచ్చేసారు. తల్లి బంగారం వున్న లాకర్లనీ ఇతర ఆస్థుల్నీ అధీనంలోకి తీసుకున్నారు.
“మీకొక్కరికీ అంత ఇల్లెందుకు నాన్నగారూ! ఆమెని తీసుకుని వుప్పల్ ప్లాట్‌లో వుండండి”అన్నారు తండ్రితో. తను జీవిత శిఖరాలని ఒక్కొక్క
మెట్టు దిగుతున్నట్టు ఆయన గ్రహించారు. రెండు పోరాటాలు ఒకేసారి మొదలయ్యాయి. మొదటిది కొడుకులపరంగా, మరొకటి…
“ఏమిటమ్మా, నీ ఫ్రెండు? ఆంటీ చీరలు కొన్ని వందలు బీరువాల్లో పడి వున్నాయి. కట్టుకోదట. అవి కట్టుకోవడం ఇష్టం లేకపోత కొత్తవి కొనిపెడతానన్నాను. వద్దంది. ఆ గోనెసంచీల్లాంటి బట్టలే వేసుకుని తిరుగుతుందట. ఉద్యోగం మానదట” ఆయన కంప్లెయింటు అపరాథభావమో, కొడుకుల్లాగే ఒలీవియాని యధాతథంగా చూపించుకోవడానికి చిన్నతనమో.
నేను మళ్ళీ ఒలీవియాని కలవడానికి వెళ్ళినప్పుడు తన గదిలో నేలమీద కూర్చుని బైబిల్ చదువుకుంటోంది. నన్ను చూసి పుస్తకం మూసి లేచింది.
“ఎలా వున్నావు?” ప్రేమగా అడిగాను.
“ప్రభువు దయవలన బాగానే వున్నాను” అంది.
ఇద్దరం హాల్లోకి వచ్చాము.
“అంకుల్ లేరా?”
“ఎటో వెళ్ళారు”.
“పదిలక్షల డబ్బు, ఇప్పుడుంటున్న ప్లాటు, సొమ్ము నాపేరు పెడతానంటున్నారు. వద్దన్నాను. నాకెందుకు ఇవన్నీ ? ఎలా బతుకుతావని
దెబ్బలాడుతున్నారు. ఇన్నాళ్ళూ బ్రతకలేదా? ” అంది ఒలీవియా.
“ఆయన కూతురివికదా? నీకేదైనా చెయ్యాలని వుందేమో! అన్నాను.
“చేసిన పాపానికి పరిహారంగానైతే చర్చికి ఇమ్మన్నాను. నా తల్లి చూపించిన మార్గాన్ని నేను వదలలేను. ఇంత దూరం వచ్చాక కొత్తదార్లోకి
అడుగుపెట్టలేను.”
తనకి ఇంకెలా చెప్పను?
సుబ్బారావుగారు బయటినుంచీ వచ్చారు. ఒలీవియా ఆయనకి మంచినీళ్ళు తేవడానికి వెళ్ళింది.
“ఏ క్షణాన ఈ పిల్ల నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతుందోనని భయంగా వుంది జయా! ఈ పెద్దతనంలో అలా చెయ్యద్దని చెప్పు ” అన్నారు దీనంగా.
నాకాయనలో ఒకప్పటి ఒలీవియా కనిపించింది. ప్రతిక్షణం భయపడుతూ మానవసంబంధాల అంచుని వుండీవుండనట్టుగా వుంటూ ఇంత జీవితాన్ని నెట్టుకొచ్చింది. ఇప్పుడా స్థానంలో రావుగారు వుండటాన్ని విధో కర్మో అని నేను వప్పుకోలేను. స్వయంకృతం అనేమాట సరిగా సరిపోతుంది. సునందగారు అమాయకురాలైతే ఆయన సరిదిద్ది వుండాల్సింది. అవకాశాన్ని తీసుకున్నారు. ఎప్పుడూ అవకాశాలు మనవైపే వుండదు.
నాకొద్దీ అభ్యుదయం- ఆంధ్రప్రభ, 8.5.2000, గూడు కథాసంపుటి
అతనికోసం ఎదురుచూడటంలో రెండుగంటలు గడిచాయి. అప్రయత్నంగా వాచీ చూసుకున్నాను. తొమ్మిదిన్నరైంది. ఉదయకేసి చూశాను. తప్పుచేసినట్టు తలవంచుకుంది. చాలా నిరుత్సాహపడిందని గ్రహించాను.
“సారీ అన్నయ్యా! తప్పకుండా వస్తానని చెప్పాడు. ఎందుచేత రాలేదో! రేపు తనని తీసుకుని మీ ఇంటికి నేనే వస్తాను!”” అంది.
” ఏదైనా అనుకోని పని తగిలివుంటుంది. అతని అడ్రస్సివ్వు, నేను వెళ్లి కలుస్తాను!”” అన్నాను. ఉదయ అతని ఆఫీసు అడ్రసు రాసిచ్చింది.
“భోజనం చేసి వెళ్లకూడదూ?” లేస్తుంటే అడిగింది.
“రమ్య ఎదురు చూస్తూంటుంది!” అందామని నాలుక చివరిదాకా వచ్చిన మాటల్ని మింగేశాను. ఉదయకూడా భోజనం చెయ్యలేదు. నేను నాదారిన వెళ్లిపోతే ఇంక తినదు. ఆకలితో అలాగే ఉండిపోతుంది.
“ఐతే పెట్టు!” అన్నాను. తను కిచెన్‌లోకి వెళ్లింది.
నా ఆలోచనలు అతని చుట్టూ తిరుగుతున్నాయి. భాను ప్రకాశ్. పేరునిబట్టి మనిషిని ఊహించుకుందామని ప్రయత్నించాను. ఉదయ అతన్ని ప్రేమిస్తున్నాననీ, త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాననీ చెప్పింది. అతన్ని పరిచయం చేయయాటానికని ఏడున్నరకి ఇద్దర్నీ తన ఫ్లాట్‌కి ఆహ్వానించింది. నేను వచ్చానుగానీ, అతను రాలేదు. ఎందుకు? ఏం జరిగుంటుంది? కనీసం ఎందుకు రాలేదో ఫోన్ చేసి చెప్పాచ్చు. కావాలని తప్పించాడా? అదే నిజమనిపించింది నాకు. ఇలా అనుకోవటానికి కారణాలుందవు. మనసుకి అలా అనిపిస్తుందంతే.
సాధారణంగా ఇలాంటి వూళ్లలో ప్రేమవ్యవహారాలు దాగవు. ఏదో ఒక నోటినుంచీ పుకారుగా బయటపడతాయి. అలాంటిది ఉదయ తనంతట తానుగా చెప్పేదాకా ఈ విషయం నాకు తెలియలేదు. అంత రహస్యంగా ఎలా ఉంచగలిగారు? ఒక ఆడపిల్లా, మగవాడూ పదే పదే కలుసుకుంటే చనువు పెరిగి, ప్రేమకు దారితీస్తుంది. కలిసి తిరిగినందుకు రూమర్స్ రాకుండా ఉండవు. ఇంత సైలెంట్‌గా ఈ వ్యవహారం పెళ్లిదాకా ఎలా వచ్చింది? ఇందులో ఏదో తిరకాసుందనిపించింది.
“వడ్డించాను, రా అన్నయ్యా!” ఉదయ పిలుపుతో నా ఆలోచనలకు బ్రేకు పడింది. లేచి వెళ్లాను. డైనింగ్ టేబుల్ ముందు కూర్చుని నిశ్శబ్దంగా తింటున్నాము. ఒక విధమైన ఉదాసీన వాతావరణం మామధ్య చోటుచేసుకుంది. వంటకాలు చాలా రుచిగా ఉన్నా మస్తిష్కంలోని ఆలోచనలచేత నాలుక వాటి రుచిని గుర్తించలేకపోతోంది
“ఏవైనా కబుర్లు చెప్పన్నయ్యా!”” నిశ్శబ్దాన్ని భరించలేక అనుకుంటా, చిన్నపిల్లలా అడిగింది.
“ఈ వారంలో నేను పర్కాలవైపు కేంప్‌కి వెళ్లాలి. బహుశాః నాలుగైదురోజులు పడుతుందేమో తిరిగి రావడానికి!”” అన్నాను.
“రమ్య ఒక్కర్తీ ఏం ఉంటుందీ? వెళ్తూ వెళ్తూ ఇక్కడ డ్రాప్ చెయ్యకూడదూ?”అడిగింది. రమ్య నా భార్య.
“వాళ్లింటికి వెళ్తుందట. పది రోజులు లీవ్ పెట్టింది. బాగా వీక్‌గా ఉంది. రెస్ట్తీసుకుంటే బావుంటుందని!”” సందిగ్ధంగా ఆగిపోయాను.
“ఏమిటి అనారోగ్యం?” ఆతృతగా అడిగింది.
ఈ విషయాలు ఉదయతో చర్చించాలంటే నాకు ఇబ్బందిగా ఉంటుంది. తను నా స్వంత చెల్లెలు కాదు. చిన్నాన్న కూతురు. నాకన్నా రెండేళ్లు చిన్నది. నా భార్యకన్నా నాలుగేళ్లు పెద్దది. జాబ్ చేసుకుంటూ స్వతంత్రంగా ఉంటోంది. తను ఈ ఊరొచ్చి దాదాపు మూడేళ్లయింది. అంతకుముందు మామధ్య ఓ మోస్తరు పరిచయం ఉండేది. అది తను ఈ ఊరొచ్చాక బలపడింది. తనకి ఏ సమస్య వచ్చినా నాతో చెప్తుంది. నా అభిప్రాయాలని పూర్తిగా మన్నిస్తుందని నేననుకోనుగానీ, మనవాళ్లకి చెప్పుకోవటంద్వారా పొందే రిలీఫ్‌ని తను నాద్వారా పొందుతుంది. ఇప్పుడు తన ప్రశ్నకి జవాబు చెప్పటం ఇబ్బందిపూర్వకమైన విషయమే. ఎందుకంటే రమ్యకి నాలుగో నెల.
“ఏమీ లేదు, జనరల్ వీక్నెస్!” క్లుప్తంగా అన్నాను అసలు విషయం దాచిపెట్టి. వీధిలో వినిపించే పెళ్లి బాజాలకే అప్పెటౌతూంటుంది ఉదయ. అలాంటిది ఈ విషయం తనలో ఎంత సంచలనం రేపుతుందో ఊహించగలు. ఐతే అది జెలసీ మాత్రం కాదు. గుండెలోతుల్లోంచీ ఎగదన్నుకొచ్చే ఆవేదన, తీరని ఆశాభంగం.
“రాగానే అతన్ని కలుస్తాను!” చెయ్యి కడుక్కుంటూ అన్నాను. ఉదయ టవల్ తెచ్చిచ్చింది. ఏదో చెప్పాలని నా ముఖంలోకి చూసి ఆగిపోయింది.
“రమ్యని ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోమను. వాళ్లకి ఆఫీసులో వర్క్ బాగా ఉంటుందట.ఇంటిపనుల్లో నువ్వు కొంచెం సాయం చెయ్యకూడదూ?” అంది. అదంత తటపటాయించి చెప్పే విషయం కాదే? ఏదో చెప్పాలనుంది తనకి. మనసుకీ, వాక్కుకీ మధ్యనున్న ఇనుపతెర.
నావెంట బయట స్కూటర్ దాకా వచ్చింది. “ఈ విషయం మా నాన్నకి తెలియనీకు!” చీకట్లో తన గొంతు వణింకింది
“ఉదయా!” విస్మయంగా అన్నాను.
“జరిగినవన్నీ నాకు తెలుసు. వచ్చిన ప్రతి సంబంధాన్నీ నాన్నే చెడగొట్టాడు. నా సంపాదన కావాలి ఆయనకి. ఈ విషయాలన్నీ నాకు తెలిశాక వాళ్లకి దూరంగా ట్రాన్సఫర్ చేయించుకుని ఇప్పటికి ప్రశాంతంగా బతుకుతున్నాను. నాకు… నాక్కూడా పెళ్లి చేసుకుని సెటిలవ్వాలనుంది. పెళ్లి చేసుకోకూడనంత తప్పు పని నేనేం చెయ్యలేదుగా?” తన కళ్లల్లో తడి మెరవటాన్ని నేను స్పష్టంగా చూశాను. తనెందుకంత ముభావంగా ఉంటుందో అర్ధమైంది. తల్లిదండ్రుల దగ్గరే దొరకని ప్రేమ బయటివాళ్ల దగ్గర ఎలా దొరుకుతుందని ఆశించి అనుబంధాలు పెంచుకుంటుంది?
ఉదయ తల్లి అమ్మకి కజిన్. ఉదయ తండ్రిగురించి బంధువులందరికీ తెలుసు. స్థిరుడు కాదు. ఏ వుద్యోగం నిలకడగా చెయ్యడు. దమ్మిడీ సంపాదన లేదు. ఉదయకి వుద్యోగం వచ్చేదాకా అసలు ఎలా బతికారో, ఏం తిన్నారో కూడా ఎవరికీ తెలీదు. తనకి వుద్యోగం వచ్చేకే నలుగుర్లోకీ వాళ్ళూ వచ్చినది.
ఆ తర్వాత?
ఉదయ చక్కగా వుంటుంది. ఆపైన గవర్నమెంటు వుద్యోగం. చాలా సంబంధాలొచ్చాయి. కట్నం అక్కర్లేదని ముందుకి వచ్చినవాళ్ళు వున్నారు. ఉదయ తల్లిదండ్రులు చాలా షరతులు పెట్టేవారు. కూతురు తమతోనే వుంటుందని, కష్టపడి పెంచారుకాబట్టి తమ పోషణభారం ఆమెదేననీ, ఆమె జీతంమీద హక్కు తమదేననీ. ఇలా వుండేవి ఆ షరతులు. అవి చూసి అందరూ తిరిగిపోయేవారు. ఒకరకంగా చెప్పాలంటే అలా చేసి సంబంధాలు రాకుండా ఆయనే జాగ్రత్తపడేవాడు.
మొదట్లో అంటే ఉదయ చిన్నపిల్ల. ఏమీ తెలుసుకునేది కాదు. తరువాత క్రమంగా అర్థమయ్యాయి. వాళ్ళని ఎలా ఎదుర్కోవాలో తెలియని పరిస్థితి. ఇప్పుడు ఈ సంబంధం తనే వెతుక్కుంది.
“జరిగిందేదో జరిగిపోయింది. ఇకమీదట అంతా మంచే జరుగుతుంది. రాగానే వెళ్లి అతన్ని కలిసి అన్నీ మాట్లాడతాను. నువ్వేం వర్రీ అవకు. బై. గుడ్ నైట్!” అని చెప్పి స్కూటర్ స్టార్ట్ చేశాను. దాదాపు పది నిముషాలు పట్టింది ఇల్లు చేరడానికి.
భోజనం చెయ్యకుండా నా కోసం ఎదురుచూస్తోంది రమ్య.
“ఇంత లేటైందేం? రండి, అన్నం పెట్టేస్తాను. నాకు ఆకలి దంచేస్తోంది!” అంది నన్ను చూడగానే.
“ఇంత రాత్రిదాకా తినకుండా ఎందుకు కూర్చున్నావు? లేటవుతుందేమోనని కూడా చెప్పనుకదా!” కోప్పడ్డాను మెత్తగా.
“ఒక్కదానికీ తినాలనిపించలేదు.”
“నా భోజనం అయిపోయింది. ఉదయ ఇంట్లో తిన్నాను. నువ్వు పద. తింటూ అన్నీ మాట్లాడుకుందాం” అన్నాను. తను లోపలకి వెళ్లిపోయింది. నేను బట్టలు మార్చుకుని డైనింగ్ టేబుల్ దగ్గరకి వెళ్లాను. ఒక కంచం పెట్టి అందులో పదార్థాలన్నీ వడ్డించాను. ఇంతలో తను అప్పడాలు వేయించి తెచ్చి కంచం ముందు కూర్చుంది.
“ఇలా ఎప్పుడూ చెయ్యకు, రమ్యా! బయటకు వెళ్లాక ఒక్కొక్కసారి మనం అనుకున్నట్లు ఉండదు!” గిల్టీగా అనిపించి మరోసారి మందలించాను.
“అతన్ని చూశారా? ఎలా ఉన్నాడు?” కుతూహలంగా అడిగింది భానుప్రకాష్ గురించి.
“అతను రాలేదు!” అన్నాను.
“అదేమిటీ?” తెల్లబోయి నమ్మలేనట్టు అడిగింది.
“కనీసం ఫోన్ చేసి కూడా చెప్పలేదు. ఉదయతో నేనింకాఅనలేదు కానీ, కావాలనే రాలేదేమోననిపిస్తోంది! పాపం చాలా డిసప్పాయింటైంది ” అన్నాను.
“పెళ్లి చేసుకోవాలని ఆమెకి చాలా ఉంది.”
“తప్పా మరి?”“
“తప్పెందుకవుతుంది? మీ మగవారి వైఖరి పెళ్లి విషయంలో ఏమిటోగానీ, ఆడవాళ్లకిమాత్రం కష్టం సుఖం పట్టించుకునే మనిషొస్తాడని సంతోషం. ఇంత లేటైనా ఇంకా మీరు రాలేదని నేను కంగారుపడుతూ కూర్చున్నాను. ఆకలితో ఉన్నానని మీరొచ్చి నాకోసం బాధపడ్డారు. అంటే తోడూ నీడా అన్నమాట” అంది.
పెళ్లిగురించి ఎంత బాగా చెప్పింది రమ్య! పెళ్లంటే ఒకళ్లకోసం ఒకళ్లు ఆలోచించుకోవటం, ఒకళ్లనొకళ్లు అర్ధం చేసుకుని ఆరాటపడటమన్నమాట.
“వదినకి మీ వయసుంటుందా? చదువుకుంది. జాబ్ చేస్తోంది. అనాకారి కాదు. అసలింతదాకా పెళ్లెందుకవలేదు? మీ బాబాయిగారు పట్టించుకోరెందుకని?” అడిగింది. ఈ విషయాలు మేం ఎప్పుడూ చర్చించుకోలేదు. అలాంటి సందర్భం ఇంకా రాలేదు.
“నాకన్నా చిన్నది. ఉద్యోగం కొంతమంది ఆడవాళ్లకి శాపం. ఆ కొద్దిమందిలో తనూ ఉంది”
“అంటే?!”
“అంతే!”
నేను నాలుగు రోజులనుకున్నది పరకాలలో వారం రోజులు ఉండాల్సి వచ్చింది. ఊరునుంచి తిరిగి వచ్చి ఇంటి తాళం తీస్తుంటే ఎలాగో అనిపించింది. రమ్య లేని ఇల్లు ఖాళీగా, కళావిహీనంగా కనిపించింది. మా పెళ్ళై రెండేళ్లైందంతే. అప్పుడే మా ఇద్దరిమధ్యా ఎంత అనుబంధం పెరిగింది! ఈ పాటికి తనక్కడ నా కోసం బెంగపెట్టుకుని ఉంటుంది. ఇక్కడికి వచ్చేస్తానని గొడవచేస్తూంటుందేమో బహుశా! నా ఇల్లూ, నావాళ్లూ! ఎంత అందమైన భావన అది! ఇల్లంటే నాలుగ్గోడలు కాదు. మనం నిష్క్రమిస్తే చైతన్యరహితమై, మన పునరాగమనంతో మళ్లీ ఉత్తేజాన్ని పుంజుకునే పరిసరాలు. అలాంటి పరిసరాలతో మమేకం చెందే మనుషులు! ఇలాంటి అనుబంధం భార్యాభర్తలు పిల్లల మధ్యనే సాధ్యపడుతుంది.
నాకు ఇలా ఆలోచిస్తుంటే ఉదయ గుర్తొచ్చింది. ముప్పయ్యేళ్ల ఉదయ… పదేళ్ల సర్వీసూ, ఆరువేల జీతం ఉన్న ఉదయ… పాపం, ఒంటరితనంతో ఒంటరిగా దశాబ్దంగా పోరాడుతోంది.
భానుప్రకాశ్కి ఫోన్ చెయ్యాలి. టైమ్ చూసుకున్నాను. ఐదు కావటానికి చాలా వ్యవధి ఉంది. ఫోన్ చేసి, అతనుంటే వస్తానని చెప్పటానికి సరిపడా టైముంది. మాకింకా ఫోన్ రాలేదు. ఇంటెదురుగా పబ్లిక్ బూత్ ఉంది. అక్కణ్ణుంచి అతని ఆఫీసుకి రింగ్ చేశాను. ఎవరో ఎత్తారు. అతను లేడట. లీవు పెట్టాడట. మామగారు పోతే, భార్యాపిల్లల్ని తీసుకుని ఊరెళ్ళాడట. పెద్దగా షాక్ అనిపించలేదు. ఇలా జరక్కుండా ఉంటే బావుండేదని మాత్రం అనుకున్నాను.
ఇప్పుడున్న సమస్యల్లా ఒక్కటే ఉదయనెలా ఫేస్చెయ్యాలి? అది రెండు వైపులా పడుసున్న కత్తిలా నాలోకి దిగబడి తన ప్రతాపాన్ని చూపించసాగింది. అతనికి పెళ్లయిన విషయం ఉదయకి ముందే తెలుసా? తెలిసే రెండో భార్యగా ఎడ్జస్టయిపోదామనుకుందా? ఉద్యోగం చేస్తూ ఆడవాళ్లు ఏదైనా సాధించారేమో నాకు తెలియదు కానీ, కొన్ని కొత్త సమస్యలు మాత్రం ఉత్పన్నమవుతున్నాయి. కొంతమంది అమ్మాయిలు పెళ్లి అనే చట్రంలో ఇమడలేకపోతున్నారు. స్వతంత్రంగా బతకడానికి అలవాటుపడి, పెళ్లి చేసుకోవటం ద్వారా వచ్చి పడే బాధ్యతలకి భయపడుతున్నారు. ఉదయకిలాగే ఏవో కారణాలచేత పెళ్లవని వాళ్లు కొందరు. ఇలాంటివాళ్లలో చాలామంది వివాహితుణ్ణి చేసుకోవడానికి ఇష్టపడుతున్నారట. ”ద్వితీయం అనేది తమ సమస్యలకి ప్రత్యామ్నాయ పరిష్కారంగా భావిస్తున్నారు. అలాంటి కొందర్లో ఉదయకూడా ఉందా? లేక తనకి తెలియదా?
నా ఆలోచనలు ఎటూ తేలక ఉదయని కలవటాన్ని రెండురోజులు వాయిదా వేశాను. ఇంతలో తనే ఫోన్ చేసింది రమ్మని. వెళ్లాను. నేను వెళ్లేసరికి వంటింట్లో ఉంది.
“కూర్చో, వచ్చేస్తున్నాను!”” అక్కణ్ణుంచే చెప్పింది.
నేను సోఫాలో కూర్చుని టీపాయ్‌మీద పేపరు తిరగేయసాగాను. ఈ విషయం ఎలా ప్రస్తావించాలా అనే ఆలోచన నా బుర్రని తినేస్తోంది. ఇంతలో మృదువైన అడుగుల చప్పుడికి తల తిప్పాను. తనే! తెల్లటి దుస్తుల్లో ఉంది. ఆ బట్టలు ఆమె తనకై తను తీసుకున్న ఏదో నిర్ణయాన్ని చూచాయగా తెలియజేస్తున్నాయి.
“ఎప్పుడొచ్చావన్నయ్యా ఊర్నుంచీ?” తనూ కూర్చుంటూ అడిగింది.
“మొన్న”
“రమ్య కులాసాయా? వాళ్లమ్మగారింటినుంచీ తిరిగొచ్చిందా?”
“ఇంకా లేదు”
ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూ నేనేదీ అడిగే అవకాశం ఇవ్వకుండా జవాబు మాత్రమే చెప్పించుకుంటోంది. అది తనలో చెలరేగే సంఘర్షణని అణచిపెట్టుకునే ప్రయత్నమని నేను గ్రహించేలోపుగా తనే బరస్టయింది.
“బ్రహ్మకుమారీ దీక్ష తీసుకుందామనుకుంటున్నాను””అంది. ఒక మంచుతరంగం నా నిలువెల్లా పాకినిట్టయింది. ఈ ఆశ్రమం గురించి నాకు కొద్దిగా తెలుసు. దీక్ష తీసుకున్నవాళ్లు సాంసారికసుఖాలకీ, పెళ్లికీ దూరంగా ఉంటారు. వాళ్ల సిద్ధాంతాలు వైదిక సిద్ధాంతాలకి కొంచెం భిన్నంగా ఉంటాయి. అద్వైతానికీ దూరంగానే ఉంటాయి.
“అదేమిటి ఉదయా?”” అన్నాను ఇంకేమనాలో తోచక.
“ఆరోజు వస్తానని భానుప్రకాశ్ రాకపోయేసరికి వాళ్లాఫీసుకి ఫోన్ చేశాను. నాన్నని దృష్టిలో ఉంచుకుని మా అఫైర్ సీక్రెట్‌గా ఉంచమని కోరినది నేనే కాబట్టి అతను జాగ్రత్తలేమీ తీసుకోలేదు. ఆ ఒక్క ఫోన్ కాల్‌తో అతని వ్యవహారం అంతా బయటకొచ్చింది”
“అందుకే కాంప్నుంచీ రాగానే నిన్ను కలవలేకపోయినది. నేనూ అతనికోసం ఫోన్ చేశాను”
“ఈ ఊరొచ్చినప్పట్నుంచీ ఏది చేసినా నీకు చెప్పి చేస్తున్నాను. ఈ విషయంలోకికూడా నిన్ను తీసుకొచ్చాను. అందుకే నీకు నా నిర్ణయాన్ని చెప్పాల్సిన బాధ్యత ఉంది”
“నిర్ణయించుకున్నాకా, చెప్పటం?
“ఇల్లు, పెళ్లి, పిల్లలూ అనే వ్యవహారాల్లోకి తల దూరిస్తే ఒక మగవాడి సాహచర్యం అనివార్యమవుతోంది. మగవాడంటే ఎవరు? నిలువెత్తు స్వార్థపు ముద్ద. జనరల్‌గా చెప్తున్నాను”
“సరేగానీ, ఈ నిర్ణయం ఏమిటి?“
“అదే చెప్పబోతున్నాను. తనకెలాంటి స్వార్ధమూ లేనట్టూ మరొకరికోసం పాటుపడుతున్నట్టూ కనిపించడానికి భార్యాపిల్లలనే కవచం వేసుకుంటాడు. ఆ కవచంలో తను క్షేమంగా ఉంటాడు”
“అందరూ అలాగే ఉంటారా ఉదయా?”” అడిగానుగానీ, నాప్రశ్న నాకే అసంబద్ధంగా అనిపించింది. ఉదయ జీవితంలో ముఖ్యమైన స్థానాన్ని తీసుకున్న ఇద్దరు మగవాళ్ళు… ఒకరు తండ్రి, మరొకరు ఈ భానుప్రకాశ్… స్వార్థాన్నే చిలికించారు. అలాంటప్పుడు ఆమె అభిప్రాయంలో తప్పు లేదు. తను నా ప్రశ్నని పట్టించుకోలేదు.
“నాన్న గురించి నీకు తెలుసు. బాధ్యతలేని మనిషి. ఏ వుద్యోగమూ నిలకడగా చెయ్యలేదు. ఇప్పటికీ కూడా చెయ్యడు. కుటుంబాన్ని నడపడానికి అమ్మ చాలా ఇబ్బందులు పడింది. ఆవిడ కష్టాలు తీర్చడానికన్నట్టుగా నేను చదువుకుని ఉద్యోగం వెతుక్కున్నాను. మంచి వుద్యోగమే. గవర్నమెంటుది. నాన్నలో స్వార్థం మొదలైంది. అమ్మలోకూడా. నాకు పెళ్ళిచెయ్యాలని వాళ్ళకి లేదు. నా నిస్సహాయతను అవకాశంగా తీసుకోవాలని భానుప్రకాశ్లో కోరిక కలిగింది. అతను నాతో తను విడోయర్ననీ, పిల్లలు లేరనీ చెప్పాడు”
“ఎంత ధైర్యం?”
“అలా నావైపునుంచి అడిగేవాళ్లు లేరనే అతని ధైర్యం. నిన్ను పరిచయం చేస్తాననగానే తోక ముడిచేశాడు. కానీ, అన్నయ్యా! నాకు చదువూ, వుద్యోగం లేవనుకో, నాన్న తినో, తినకో ఇంత మిగిల్చి నాకు పెళ్లిచేసి పంపించేసేవాడు. ఆ వచ్చిన వ్యక్తి ఎవరైనా అతనేం చేసినా అదే సంతోషం అనుకుంటూ గడిపేసేదాన్ని”
“పెళ్ళే సుఖాలకి నిర్వచనమా, ఉదయా? పెళ్ళయ్యి కష్టాలు పడుతున్నవాళ్లు ఉన్నారు కదమ్మా!”
“కష్టం, సుఖం, లేక సంతోషం… ఇవి మనిషి అనుభవానికీ, వాటినుంచీ వచ్చిన జ్ఞానానికీ, జీవనసరళికీ సంబంధించినవి. పూట గడవటమే కష్టంగా ఉన్నవాడికి పట్టెడన్నం సునాయాసంగా దొరకడం సుఖం. నెహ్రూలాంటి స్కాలర్స్‌కి పుస్తకం చదవలేకపోవటం అనేది సంభవిస్తే దాన్ని మించిన కష్టం మరొకటి ఉంటుందనుకోను. ఏమీ తెలియని అజ్ఞానంలో ఉన్నప్పుడు అన్యాయంకూడా న్యాయబద్ధంగానే కనిపిస్తుంది. ఒకవేళ అన్యాయంలాగే తోచినా ఖర్మ అని సరిపెట్టుకుంటారు. ఇప్పటి ఆడవాళ్లు చదువుకుని ఉద్యోగంచేస్తూకూడా మగవాడి స్వార్ధానికి రకరకాలుగా బలైపోతున్నారు. అలా బలైపోతున్నామని తెలిసీ ఏమీ చెయ్యలేకపోతున్నారు”
“చెప్పు, ఉదయా! ఇన్ని తెలిసినదానివి నిన్ను నువ్విలా శిక్షించుకోవటమేమిటి?”
“ఇది శిక్షించుకోవటమెలా అవుతుంది? పెళ్లిచేసుకోకూడనంత పెద్ద తప్పు నేనేం చేశానని ఆరోజు చీకట్లో నిన్నడిగాను. అమ్మ, నేను, భానుప్రకాశ్ భార్యాపిల్లల కోణంలోంచి ఆలోచిస్తే దానంత పెద్ద తప్పు మరొకటి లేదనిపిస్తోంది. మగవాడితో ప్రవేయం లేని జీవితాన్ని అర్ధవంతంగా గడపాలనుకుంటున్నాను”
నన్ను నేను శోధించుకున్నాను. ఎందుకంటే, నేనూ మగవాడినే. నాలో కూడా ఎక్కడో ఒకచోట స్వార్థం ఉండే ఉంటుందా? పెళ్లి చేసుకున్నప్పటినుంచీ రమ్యకి సానుకూలంగానే ఉంటున్నాను. తనని ప్రేమగానే చూసుకుంటున్నాను. పెళ్లి… రమ్య… తిరకాసేదో ఇక్కడే ఉందనిపించింది. నాకు కావాల్సినంత కట్నం తెచ్చింది కాబట్టి రమ్యని నేను పెళ్లి చేసుకున్నాను. లేకపోతే నా భార్య స్థానంలో మరో ఆడపిల్ల ఉండేది. నెలనెలా జీతం తెచ్చి నా చేతికిస్తూ నా అవసరాలు చూస్తోంది. అంటే నా అనుబంధం భార్యస్థానంతోనూ డబ్బుతోనేగానీ, ఆ స్థానంలోని వ్యక్తితో కాదు.
ఉదయ అన్నట్టు కష్టసుఖాలు జీవనసరళికీ, మనోవికాసానికీ చెందినవి. నేనుగానీ, రమ్యగానీ మరో భార్యాభర్తలుగానీ ఒకరినొకరు ప్రేమించటం అనేది ఇలానే నేర్చుకున్నాం. అదే ప్రేమ,అన్యోన్యత అనుకుంటున్నాం. ఇది తప్పని తెలియదు కాబట్టి టేకెన్ ఫర్ గ్రాంటెండ్గా భావించాను.
నేను ఆలోచనలో నిమగ్నమై ఉండటం చూసి తనే మళ్ళీ అంది ఉదయ “నా సమస్యకి ఇది పరిష్కారంగా భావించటంలేదు. కానీ… నాకు అందరికీ దూరంగా వుండాలనుంది. వేరే ఆలోచనల్లో… వేరే జీవనమార్గంలో. డబ్బు సంపాదించగలగటమే ఆడవాళ్లు సాధించిన అభ్యుదయమైతే అలాంటి అభ్యుదయం నాకొద్దు. ఎవరికో సంపాదనా యంత్రాన్ని కాలేను. నా జీతమే, నాలోని ప్రేమాస్పదమైన అంశమని అనుకునే మనుషుల్ని నేను ప్రేమించలేను. నా జీతాన్ని వాళ్ళకి హక్కుగా ఇవ్వను. నాచేత సాయం పొందేవాళ్ళలో వాళ్ళూ ఒకరౌతారుతప్ప హక్కుదారులు కాలేరు”
ఉదయ నిర్ణయంలోని మంచి్చెడులు నిర్ణయించే స్థానంలో నేను లేను. ఆ అర్హత నాకు లేదేమో! కానీ ఒక ప్రశ్న. అభిమానం దెబ్బతిన్న ప్రతి స్త్రీ ప్రత్యామ్నాయ సమాజాన్ని వెతుక్కుంటే?
నేను లేచి నిలబడ్డాను. “నేను నీనుంచి ఏదీ ఆశించలేదు. స్నేహాన్ని మాత్రమే పొందాను. మరోసారి నీ నిర్ణయాన్నిగురించి ఆలోచించుకో. నిర్ణయం మార్చుకుంటే నీకోసం ఏం చెయ్యగలనో నాకు తెలీదు. కానీ ప్రయత్నం చెయ్యగలిగే అవకాశం ఇంకా మిగిలి వుంటుంది. అన్నగానో, స్నేహితుడిగానో నన్ను గుర్తుపెట్టుకో. ఏ అవసరం వచ్చినా ఏది కష్టమనిపించినా నాతో చెప్పుకోవడం మానకు!” అన్నాను.
ఉదయ చిరునవ్వు నవ్వింది. అది బాధాపరితాపాలచేత ప్రక్షాళనమైన, స్వచ్చమైన నవ్వు.
అర్హత-ఆంధ్రభూమి , 14.1.1999
“సమీరా!”
పీఎఫ్లోంచీ డ్రా చేసి, హడావిడిగా బేగ్లో పెట్టిన డబ్బుని సీట్లో కూర్చుని స్థిమితపడ్డాక మరోసారి లెక్కపెట్టుకుంటున్న సమీర తలెత్తి చూపింది . టేబుల్‌కి అవతలి అంచుని నిలబడి వేదమూర్తి ఏదో అడగడానికి సంశయిస్తున్నట్టు నిలబడ్డాడు.ఏమిటన్నట్టు కళ్ళతోటే ప్రశ్నించింది.
“మా అబ్బాయి ఫీజు… మీరు .. మీరేమీ అనుకోకపోతే ఐదువందలు … అప్పుగానే… ఇస్తే… శాలరీ రాగానే యిచ్చేస్తాను. మా మిసెస్ వంట్లో బాగుండకపోవడంతో యీ నెల .. బడ్జెట్ తలకిందులైంది… ప్లీజ్ ” మాటకి మాట అతుక్కోకుండా అతను చెప్తున్నదంతా అర్ధమై చిరాకేసింది.
“సారీ! నేను వేరే పనికోసం ఈ డబ్బు తీశాను. చాలా అవసరం” క్లుప్తంగా అనేసి అతని రియాక్షను పట్టించుకోకుండా వెళ్ళిపోయింది. అందమైన పేరూ, అందమైన వొళ్ళూ ఆమె ఎసెట్స్. మగవాళ్ళంతా పనిపాటలు మానుకుని తనలాంటి అమ్మాయి కోసం బీటేస్తుంటారనీ కలలుగంటారనీ గట్టినమ్మకం ఆమెకి. మగవాళ్ళు స్త్రీ శరీరసౌందర్యానికన్నా విలువిచ్చేవి ఇంకా వుంటాయనీ, అందం అనే మాటకి స్త్రీ ఒకలాగా పురుషుడు మరొకలాగా అర్ధాలు ఆపాదించుకుంటారనీ ఆమెకి తెలీదు. అంతేకాదు, ఆమెకి తెలీనిని చాలా వున్నాయి.
ప్రేమ అనేది సినిమాల్లో మాత్రమే బహిరంగంగా ప్రకటింపబడుతుందనీ, వాస్తవంలో అది మన జీవితాల్లో అంతర్వాహినిగా వుండి బంధాలని బలపరుస్తుందనీ…దేవుడు సృష్టించిన అందంకన్నా మనిషికి తనే సృష్టించుకున్న డబ్బు చాలా ముఖ్యమైనదనీ… యిలా చాలా తెలీవు.
ఇవేవీ తెలీని సమీర వచ్చిన ప్రతి సినిమా చూస్తుంది. టీనేజి లవ్‌స్టోరీస్ చూసి ఆశ్చర్యపడుతుంది. వాళ్ళ కార్లూ, సొఫిస్టికసి చూసి తనకీ అలాంటి జీవితం అమిరి వుంటే బావుండేదనుకుంటుంది. ఓవైపు ప్రేమగ్రంధాలు నడుపుతూనే మరో వైపు టెడ్డీబేర్ బొమ్మల్తో ఆడుకోవడం చూసి సంభ్రమపడుతుంది. మనసు ఆపుకోలేక తనూ రెండు బొమ్మలు కొనుక్కుందిగానీ, తల్లి కోప్పడుతుందని బట్టల అడుగుని దాచేసింది. అన్నిటికీమించి తన అందానికి దాసోహమంటూ ఏ రాకుమారుడో వస్తాడని ఆశపడుంది.
ఉత్తమ్‌తో ఆమె పరిచయం సినిమాటిగ్గానే జరిగింది.
ఆరోజు…
రోడ్డుమీద పరాకుగా నడుస్తోంది. వెనుకనుంచీ కారు హారెన్ మోగినా వినపడలేదు. దాదాపు రాచుకుంటున్నట్టు కీచుమని శబ్దం చేస్తూ ఆగింది. ఎర్రటి మారుతీ.
“ఏ అమ్మాయ్! చూసుకుని నడవక్కర్లేదా?” రఫ్‌గా అడిగాడు డ్రైవరు.
తుళ్లిపడింది సమీర.
తర్వాత వెనకసీట్లోంచి బైటికి తొంగిచూసిన వ్యక్తిని చూసి సమీర షాకైంది. చాలా అందంగా వున్నాడు. అతనూ అంతే! అలాంటి అమ్మాయిని ఎప్పుడూ చూడనట్టు విభ్రాంతి ! తర్వాత పెదాలమీద మందహాసం. వెనక్కి జరిగి, కారు కదిలిపోయేదాకా అలాగే నిలబడింది.
ఆఫీసుకి చేరుకోగానే ఫోనొచ్చింది. తండ్రి దగ్గర్నుంచేమోననుకుని రీసీవర్ ఎత్తితే కాదు.
“హలో! ఉత్తమ్ దిస్ సైడ్” మెత్తటి హస్కీ వాయిస్. ఎందుకో మారుతీ కారతను గుర్తొచ్చాడు సమీరకి. అతనేనేమోననిపించింది.
“మీ పేరు?”
“సమీర” అతన్నే దృష్టిలో వుంచుకుని అంది.
“చాలా బాగుంది. ఆ బిల్డింగ్‌లో ఏం చేస్తుంటారు? క్లర్కా?”
“ఊ … మీరు ?” సందిగ్ధంగా అడిగింది.
“ఇప్పుడే కలుసుకున్నాం. అప్పుడే మర్చిపోయారా?” అతని గొంతులో కవ్వింత.
అతనే. మారుతీకారతను. “ఓహ్! సారీ!” అంది సమీర.
“సాయంత్రం అదే స్పాట్లో మీకోసం చేస్తుంటాను” అతను రిసీవర్ క్రెడిల్ చేపేశాడు. తెలివిగల మరో అమ్మాయైతే ఒక అపరిచితుడికి అలాంటి అవకాశం యిచ్చేది కాదు . ఇచ్చింది కాబట్టే ఆమె సమీరైంది.
ఒక్క సాయంత్రం కాదు, నాలుగైదు సాయంత్రాలు అతనితో షికార్లు తిరిగింది. కార్లో అతని పక్కని కూర్చోవటం, అతన్ని ఆవరించుకుని వుండే ఖరీదైన వాతావరణం… అన్నీ కలిసి ఆమెని కలలప్రపంచంలోకి తీసుకెళ్తున్నాయి.
రోజూ వుత్తమ్తో కలిసి తిరగడం ఆమెకి చాలా థ్రిల్లింగ్‌గా వుంది. అందులో కొంత యిబ్బంది. డ్రెసెస్ మెయింటేన్ చెయ్యాలి. ఆమెకి చీరలు, డ్రెస్‌లూ కలిపి పాతికదాకా వున్నాయి. అందులోంచీ ఖరీదైనవిమాత్రమే వాడుతోందిప్పుడు. అలాంటివి పదో పన్నెండో మాత్రమే తేలాయి. రోజువారీ వాడకానికి ఆవిడవి ఖరీదైన చీరలు ఇవ్వటానికి తల్లి వప్పుకోవటం లేదు. నాలుగు చీరలు తీసుకోవాలని పీఎఫ్లోంచీ డ్రా చేసింది సమీర. ఇంట్లో చెప్పలేదు. ఇప్పుడు యుత్తమ్తో కలిసి షాపింగ్ చెయ్యబోతోంది. బహుశ: బిల్ అతనే చెల్లిస్తాడేమో! కానీ తన దగ్గరకూడా డబ్బుండాలికద!
ఎప్పట్లాగే బస్టాప్ దగ్గిర నిల్చుంది. అనుకున్న టైముకి కారొచ్చి ఆమె ముందు ఆగింది. డోరు తెరుచుకోవడం, ఆమె అందులో ఎక్కడం అన్నీ తృటిలో జరిగిపోయాయి. ముందుగా షాపింగ్‌కు వెళ్ళారు. సమీర అశించినట్టు బిల్లు అతనే పే చేశాడు. తర్వాత స్టార్హోటల్లో ట్రీట్ యిచ్చాడు.
“అకేషన్?” అడిగింది సమీర.
“ప్రత్యేకంగా ఏమీ లేదు” నవ్వేడు. తర్వాత నెమ్మదిగా అన్నాడు. “విహేవ్ కమ్ ఫార్ లాంగ్. రాత్రికి యిక్కడే రూమ్ బుక్ చెయ్యనా?”
అతని వుద్దేశ్యం అర్థమయ్యీ కానట్టు… అదేం లేదు, స్పష్టంగానే అర్ధమైంది సమీరకి. ముఖంలోకి చివ్వునుని రక్తం చిమ్మింది. తను ప్రేమ అనుకుంటున్నదాన్ని, యితనేమిటిలా మొరటుగా అడుగుతున్నాడు?
“పెళ్ళికాకుండా నాకిలాంటివి నచ్చవు” అంతే నెమ్మదిగా అంది.
“పెళ్ళి. యూమీన్ మేరేజ్… నాతో…??!!” అతను చిన్నగా నవ్వాడు. మొహంలో అదోలాంటి కపటత్వం. తర్వాత భుజాలు ఎగరేశాడు. అదోలాంటి నిర్లక్ష్యం. సమీరకవేం అర్ధం కాలేదు.
లేచి నిల్చున్నాడు. ” ఓకే ఇక వెళ్దాం. రేపు కలుద్దాం” అన్నాడు.
రేపు, రేపేం చెప్తాడతను? తల్లిదండ్రులని అడిగి జవాబు చెప్తాడా? పెళ్ళి చేసుకుందామంటాడా? లేక వద్దంటాడా, యింతదూరం వచ్చేక? ఎంతదూరం? అతనే అన్నాడుగా, చాలాదూరం వచ్చేమని? ఆరాత్రి సమీరకి చాలాసేపు నిద్రపట్టలేదు. అతి ప్రయాసమీద నిద్రపోతే ఎన్నో కలలు… ఆకాశంలో తేలుస్తూ, నీటి అలలమీద వూగిస్తూ… చాలా అందమైన కలలు.
ఎప్పటిలాగే బస్‌స్టాప్‌లో వచ్చి నిలబడింది సమీర. కారు వచ్చి ఆమె ముందు ఆగడం, ముందు డోర్ తెరుచుకోవడం, ఆమె ఎక్కడం, తలుపు మూసుకోవడం అన్ని ఎప్పట్లాగే జరిగిపోయాయి. సీట్లో సర్దుకుంటూ తల తిప్పి చూసి తెల్లబోయింది . డ్రైవింగ్ సీట్లో వున్నది ఉత్తమ్ కాదు. ఒడ్డూ , పొడుగూ , రంగూ పోలికల్తోసహా ఉత్తమ లాగే వున్నాడు . వయసు మాత్రం యాభైకి పైనే వుంటుంది.
సమీరని చూసి చిన్నగా నవ్వి ” నేను ఉత్తమ్ తండ్రిని, పేరు సంజయ్” అన్నాడు పరిచయం చేసుకుంటూ.
ఆమె గౌరవంగా నమస్కరించింది. కారు రోడ్డుమీద స్మూత్‌గా వెళుతోంది. తను ఉత్తమ్‌తో పెళ్ళి గురించి అన్నమాటకి యింత యింపాక్ట్ … అతను తండ్రిని పంపించి మాట్లాడించడం… ఎంతో సంతోషం కలిగింది .
“నాకు నలుగురు కొడుకులు, యిద్దరు కూతుళ్ళు. ఇద్దరు కొడుకులు వాళ్ళ భార్యల్తోసహా జిడ్డాలో వుంటారు. ఒక కొడుకూ యిద్దరు కూతుళ్ళూ స్టేట్స్లో సెటిలయ్యారు. మిగిలింది ఉత్తమ్ ఒక్కడే, నా భార్యపోయి ఏడాదైంది”
తను ఆయనకి కాబోయే కోడలుగాబట్టి యివన్నీ చెప్తున్నాడన్న భావనతో చాలా శ్రద్ధగా వింది సమీర.
“నా భార్యకి పిల్లలంటే చాలా యిష్టం. మా మనవలంతా మాదగ్గరే వుంటారు. ఉత్తమ్‌కి కూడా చేసేస్తే ఆఖరి బాధ్యత తీరిపోతుంది. బిజినెస్ వాడికి అప్పగించేసి పిల్లల్లో సరదాగా గడపాలని నా కోరిక”
సమీర ముఖంలో చిరుసిగ్గు కదలాడింది.
“వాడిక్కూడా కుదిరిపోయింది. అమ్మాయి గ్రీన్కార్డుహోల్డరు… డాక్టరు… వీడక్కడికి వెళ్ళాలనుకుంటే బిజినెస్ వైండప్ చేసేస్తాను. ఆమె యిక్కడికొస్తే…”
సమీర వులిక్కిపడింది. ఆమె చెవులపడ్డ ఆ ఆఖరిమాటలు మెదడులో చేరి గొప్ప సంచలనాన్ని సృష్టించాయి. అదామె ముఖంలో ప్రతిబింబించింది.
“నీకు కార్లలో తిరగడమన్నా ఖరీదైన బట్టలు కట్టుకోవడమన్నా చాలా యిష్టంలా వుంది. ఇష్టం ఒక్కటే దేనికీ అర్హత కాదు. నన్ను చేసుకో. నా మనవలకి కేర్‌టేకర్‌గా వుండచ్చు. నువ్వు చాలా అందమైనదానివి. మాయింట్లో షోపీస్‌లా వుంటావు. నాక్కూడా మంచి కంపెనీ ఔతావు. నీ సరదాలూ తీరుతాయి”
ఒక్క కుదుపుతో కారుకూడా ఆగింది. సమీర నోటిమాట మరచిపోయి, చెవులప్పగించి వింటున్నదల్లా ఒక్కసారి ఈలోకంలోకి వచ్చింది. విండోలోంచీ బైటికి చూస్తే బయల్దేరినచోటికే వచ్చినట్టు అర్థమైంది. డోర్ తెరుచుకుని దిగింది. దిగేముందు బేగ్లోంచీ ముందురోజు డ్రా చేసిన డబ్బు తీసి డాష్బోర్డుమీద పెట్టి, “నిన్నటి చీరల బిల్లు” అంది క్లుప్తంగా.
సంజయ్ దాన్ని తీసి జేబులో పెట్టుకున్నాడు.
“నీకిష్టమైతే ఈ నెంబరుకి చెయ్యి. ఉత్తమ్‌ని కలిసే ప్రయత్నం చెయ్యకు. ఎందుకంటే వాడే నాకీ సలహా యిచ్చినది” విజిటింగ్ కార్డు ఆమె చేతిలో పెట్టాడు.
కారు కదిలిపోయింది. సమీర చేతిలో వున్న సంజయ్ కార్డు కింద పడిపోయింది. కారు వెళ్ళినవైపు చూస్తూ నిలబడింది.
తలలో ఏవో భాగాలు పెళపెళ విరిగి కూలిపోతున్న భావన. చెవుల్లో హోరు. కళ్ళముందు నల్లటి వలయాలు తిరిగాయి. అవమానంతో ఆమె మనసు భగ్గుమంది. ఆ మంటల్లో ఆమె కలలసౌధాలన్నీ మాడి మసైపోయాయి. వాటిమీద అధిష్ఠించి కూర్చున్న ఆమె వాస్తవంలో పడింది.
ఎంత తెలివితక్కువగా ఉత్తమ్ వెంటపడింది! అతనెవరని? తనకి ఏమౌతాడని? అతన్ని అందుకునే అర్హత తనకి వుందా?
వేదమూర్తి గుర్తొచ్చాడు ఆమెకి. తనతోటి వుద్యోగి, తండ్రి వయసువాడు… పిల్లవాడి ఫీజుకోసం ఐదువందలు అప్పడిగితే లేదంది తను. అటువంటిది ఎన్నోమెట్లు పైన వున్న ఉత్తమ్ దిగివచ్చి అతని సుఖసంతోషాల్లో వాటా యిస్తాడని ఎలా అనుకుంది? ఇంత సింపుల్ లాజిక్ తనకెలా తట్టలేదు?
విలాసాలపట్ల యిష్టం ఒక్కటే ఉత్తమ్‌ని చేసుకోవటానికి అర్హతకాదన్నాడు సంజయ్. నిజమే! ఉత్తమ్‌ని తనేం ప్రేమించలేదు. పట్టుమని పదిరోజుల పరిచయంలో ప్రేమ ఎలా పుడుతుంది? పుట్టినా అది పెళ్ళికి ఎలా దారితీస్తుంది? అతన్ని చేసుకుంటే తనకి అందుబాటులోకి వచ్చే సుఖాలమీదే తనకి ధ్యాస. అతనికి తన అందంమీద. డబ్బుతో కొందామని చూసాడు. సాధ్యపడలేదు. ఎంత దూరంలో వుంచాలో అంతలో పెట్టాడు. డబ్బే తనకి ప్రధానమైనప్పుడు అతనైనా అతని తండ్రైనా ఒకటే.
తల బలంగా విదిల్చింది.

పశ్చిమగోదావరి జిల్లా రెడ్డి పోలవరంలో 16 July, 1962 లో జననం. వరంగల్‌లో వుద్యోగం. హెడ్పోస్ట్‌మాస్టర్గా వరంగల్‌లో స్వచ్చందపదవీ విరమణ.
వివాహం శ్రీ చదలవాడ విష్ణుమూర్తిగారితో. వారు డెప్యూటీ ఏగ్జిక్యూటివ్ ఇంజనీరుగా చేసి రిటైరయారు.
మొదటి కథ అనగనగా 1978లో వనితాజ్యోతి మాసపత్రికలో అచ్చైంది. వీరివి 225కి పైగా కథలు, 9 నవలలు వివిధ పత్రికల్లో ప్రచురించబడ్డాయి. గూడు, సింధూరి, గుండెలోతు అనే కథాసంపుటాలు, నీలినక్షత్రం అనే నవల పుస్తకాలుగా వచ్చాయి. సింధూరి అనే సంపుటానికి శ్రీమతి సుశీలా నారాయణ రెడ్డి అవార్డు 2005 లో వచ్చింది. ప్రేమలోంచీ ప్రేమలోకి అనే నవలకి ఆంధ్రభూమి ప్రథమ, తిరస్కృతులు, నీకోసం నేను అనే నవలలకి ఆంధ్రభూమి ద్వితీయ, 5-3-2 అనే నవలకి కినిగె ద్వితీయ బహుమతులు వచ్చాయి. ఎంతెంతదూరం? అనే కథకి విపుల కన్సొలేషన్ బహుమతి, శ్రీమతి రంగవల్లి ట్రస్ట్ అవార్డు వచ్చాయి. ఇవికాక కథలకు మరో ఏడెనిమిది బహుమతులు వచ్చాయి.
కథలకు కాన్వాస్ పెద్దదిగా వుండాలనేది వీరి అభిప్రాయం.