అమ్మానాన్నలు by S Sridevi

  1. వంటింటి కిటికీ by S Sridevi
  2. పగుళ్ళు by S Sridevi
  3. స౦దిగ్ధపు రహదారులు by S Sridevi
  4. కోడలొచ్చింది by S Sridevi
  5. అతనిష్టం by S Sridevi
  6. ఆమె విజేత కాదు by S Sridevi
  7. యుద్ధదృశ్యం by S Sridevi
  8. బేబీ ఆఫ్ అర్చన by S Sridevi
  9. తరంగనాట్యం by S Sridevi
  10. చిట్టికి క్షమార్పణలతో by S Sridevi
  11. ఇంకో మజిలీకి by S Sridevi
  12. అధిరోహణం by S Sridevi
  13. లివింగ్ టుగెదర్ by S Sridevi
  14. గుమ్మడి గింజలు by S Sridevi
  15. బంగారుపంజరం by S Sridevi
  16. చీకట్లో పూసిన పూలు by S Sridevi
  17. గినీ పిగ్స్ by S Sridevi
  18. మలయమారుతం by S Sridevi
  19. సార్వభౌముడు by S Sridevi
  20. అమ్మానాన్నలు by S Sridevi

అమ్మా!
నాన్న యాక్సిడెంట్లో చనిపోయారు. పిన్ని తమ్ముణ్ణీ చెల్లినీ తీసుకుని వాళ్ళూరు వెళ్ళిపోతుందట. నన్నెవరూ ఎక్కడికీ తీసికెళ్తామనడంలేదు. నేనిప్పుడేం చెయ్యాలి? ఎక్కడికెళ్ళాలి? ప్రియ

ఉత్తరం చదవటం ముగించి భార్య మొహంలోకి చూశాడు భార్గవ. మబ్బుపట్టిన ఆకాశంలా ఉంది ఆమె ముఖం. ఏడ్చి ఏడ్చి ఎర్రగా మంకెనపూలల్లా తయారయ్యాయి కళ్ళు. ఇంకా దుఃఖాన్ని ఉగ్గబట్టుకుంటున్నట్టే ఉంది.
మధ్యాహ్నం ఏదో అవసరమై ఆమె ఆఫీసుకి ఫోన్ చేశాడు. హాఫ్ డే లీవుపెట్టి వెళ్ళిపోయిందని సమాధానం వచ్చింది. ఇంటికి రాగానే వుత్తరం చేతిలోపెట్తింది. ఇదన్నమాట సంగతి! అతని భృకుటి ముడిపడింది.
హేమంత డైవోర్సీ. చచ్చిపోయింది, ఆమె మొదటి భర్త. ఉత్తరం అతని కూతుర్నించీ. తెగిపోయిన బంధాన్ని గురించి ఆమె ఏడవటం అతనికే మాత్రం నచ్చలేదు. అసహ్యంగా అనిపించింది.
అతని మనోగతభావాలను పట్టించుకునే స్థితిలో లేదు హేమంత. ఎంత విడాకులిచ్చేసినా చనిపోయిన వ్యక్తితో తను ఏడాదిపాటు గడిపింది. సహజీవనం. పగలూ రేయీ అతన్తో గడిపింది. భావాలూ, ఉద్వేగాలూ పంచుకుంది. ఆ తర్వాతే స్పర్ధలొచ్చాయి. విడిపోయారు. పాపని అతనివ్వలేదు. కోర్టుచుట్టూ తిరగలేక మనసు రాయి చేసుకుంది. కూతురివైపు దారి మూసుకుపోయిందని రాజీపడి మరోదారిపట్టాక మళ్ళీ ఇలా తెరుచుకుంది. ఇదిగో, ఈ ఉత్తరం గుండెల్లో అలజడిని రేపుతూ వచ్చింది.
“ఐతే ఏమంటావు?” ఉత్తరాన్ని టేబుల్‍మీద పడేసి కటువుగా అడిగేడు భార్గవ. అతనికి భార్య కష్టసుఖాలు పట్టవు. ఇద్దరిమద్యా అగాధమంత దూరం.
“వెళ్ళి తీసుకొస్తాను” అతను తన అభిప్రాయం అడిగుతున్నాడని పొరబడి జవాబు చెప్పింది.
హేమంత మాటలు వినగానే అతను విసురుగా కుర్చీ నెట్టేసి లేచాడు. “నీకు భర్త అవసరం. నా పిల్లలకి తల్లి అవసరం. మన మధ్యనున్న పెళ్ళి ఒప్పందం. ఇంతే!” అన్నాడు.
అప్పటిగ్గానీ అతనికి కోపం వచ్చిందని గుర్తించలేదు ఆమె. తెల్లబోయింది. “ఇలాంటప్పుడు కోపాలూ పంతాలూనా? అంటే దాన్నలా దిక్కులేనిదాన్లా వదిలెయ్యమంటారా?” అడిగింది.
“జవాబు చెప్పాల్సిన అవసరం నాకు లేదు”
“కానీ దానికోదారి చూపించాల్సిన బాధ్యత నాకుంది”
“ఐతే నీదారి నువ్వు చూసుకో. ఐనా ఒకసారి దారితప్పినదానికి రెండోసారి సమస్యేం వుండదులే!” వెటకారంగా అన్నాడు.
అకారణంగా దాచిపెట్టి చెంపమీద కొట్టినట్టయింది హేమంతకి. ఇలా జరుగుతుందని తనుమాత్రం అనుకుందా? అనుకోని సమస్యలు ఎదురైనప్పుడు అండగా నిలబడి పరిష్కారం వెతకడంలో సాయపడకుండా ఇంత తక్కువగా ప్రవర్తిస్తాడేంటి? ప్రియ ఎవరు? తన కూతురు. తన శరీరంలోంచీ బయటపడి, తనకి కొంత ఆనందాన్నిచ్చి, అనిర్వచనీయమైన అనుభూతిని పంచిచ్చిన తొలిసంతానం. అతనికి అతని పిల్లలెంతో తనకి అదీ అంతే. అతని పిల్లల్ని తను తల్లై లాలిస్తోంది. మరి ప్రియ భార్గవకేం కాకపోవటమేమిటి? తామేం సుఖాలని పంచుకోవడానికని పెళ్ళిచేసుకోలేదు. ఇద్దరూ కష్టంలో వున్నారు కాబట్టి ఒకరికొకరు తోడౌతారనుకున్నారు. దానికితను విపరీతార్థాలు తీస్తాడేంటి? ఆలోచిస్తున్నకొద్దీ ఆమె గుండె గాయం లోతెక్కుతోంది. అప్పుడు ప్రియ తండ్రి ఇప్పుడితను! ఆడవాళ్ళ మనసుని అర్ధం చేసుకోరెందుకని ఈ మగవాళ్ళు?
భార్గవ ఇష్టాయిష్టాలనిగానీ, అహం, అభిజాత్యాలనిగానీ పట్టించుకోదల్చుకోలేదు హేమంత. ఇది సందర్భంకూడా కాదు. జర్నీబేగ్‍లో జత బట్టలు పడేసుకుని బయల్దేరింది.
“అమ్మా! ఊరెళ్తున్నావా? మళ్ళీ ఎప్పుడొస్తావు?” అని భార్గవ చిన్నకూతురు ఏడేళ్ళది, బేలగా అడిగినప్పుడు మాత్రం కన్నీళ్ళని ఆపుకోలేకపోయింది. తనకోసం ప్రియ అంతే ఆరాటంగా ఎదురుచూస్తుంటుందని గుర్తొచ్చి ఆ పిల్లని గుండెకి హత్తుకుని బావురుమంది.
“ఛ… ఏడుపుగొట్టుగోల, కష్టాలన్నీ తీరి సుఖంగా బతకమని దేవుడు వరమిచ్చినా కొంతమందికి సుఖపడే రాత వుండదు” విసురుగా కూతుర్ని ఆమె చేతుల్లోంచి లాక్కుని అక్కణ్ణుంచీ వెళ్ళిపోయాడు భార్గవ.
ఆ పిల్ల “అమ్మా! అమ్మా!” అని ఏడుస్తుంటే
“ఎవరే నీకు అమ్మ? మీ అమ్మెప్పుడో చచ్చిపోయింది. ఆమాట ఎత్తవంటే వీపు చీరేస్తాను” అని అరిచాడు.
“మనమ్మ సరే, యీ అమ్మ” అన్న సింధు జవాబు విని సుదీర్ఘంగా నిశ్వసించి ఇంట్లోంచీ కదిలింది హేమంత,

హేమంత అటు వెళ్ళగానే ఇటు ఆమె తండ్రికి ఫోన్ చేసాడు భార్గవ. ఉత్తరం సంగతీ, తనకి యిష్టంలేకపోయినా ప్రిఅయని తీసుకురావటానికి ఆమె వెళ్ళిన వైనమూ చెప్పాడు.
“ఏంటీ? సూర్యనారాయణ చచ్చిపోయాడా?” మ్రాన్పడి పోయి అడిగాడు హేమంత తండ్రి. తండ్రిని కోల్పోయి, ఆదరించే దిక్కులేక మనవరాలక్కడ ఒక్కర్తీ ఎలా ఉందోనన్న బాధ, పెద్దపెట్టుని ఆయన్ని ఆవహించింది. హేమంత వెళ్ళిందన్న వార్తతో కొంత వూరట… అంతలోనే దాని పరిణామాలెలా ఉంటాయోనన్న భయం వెంటవెంటనే కలిగాయి. తెగతెంపులు చేసుకున్న మనుషులకోసం వీళ్ళెందుకింత బాధపడిపోతున్నారో అర్ధమవలేదు భార్గవకి.
“నేను చెప్తున్నది చచ్చిపోయిన మనిషిగురించి కాదు. బతికున్న నాగురించి. మీ కూతురసలు ఏ ఉద్దేశంతో నా మాట లక్ష్యపెట్టకుండా వెళ్ళింది? మా పెళ్ళిమాటలప్పుడు ఏం చెప్పారు? ఆ మొదటిపెళ్ళికి సంబంధించిన జోక్యం ఏదీ ఉండదన్నారు. ఇప్పుడిలా? ఛఛ… మాట నిలకడలేని మనుషులు” అన్నాడు.
“అంతంత మాటలు దేనికి భార్గవా? హేమంత రాగానే అందరం కలిసి ఏం చెయ్యాలో ఆలోచిద్దాం. నిన్ను బాధపెట్టేలా ఏదీ జరగదని నేను మాటిస్తున్నాను” అని ఫోన్ పెట్టేశాడాయన.
భార్గవకి కొంత ఉపశమనం కలిగింది.


ప్రియనీ, ప్రియకి రావల్సిన డబ్బునీ తీసుకుని పుట్టింటికి వచ్చింది హేమంత. పక్కింటావిడ ప్రియచేత రాయించిందట ఆ వుత్తరం. తండ్రి పోయిన బెంగలో వున్న ఆ పిల్లని కనీసం వూరుకొమ్మని చెప్పినవాళ్ళెవరూ లేకపోవటంతో తనే దగ్గరకి తీసి ఇంట్లో పెట్టుకుందట. డబ్బులెక్కలన్నీ తేల్చుకుని ఆ పిల్లని ఇంత డబ్బు కట్టి హాస్టల్లో పడేసి చేతులు దులుపుకుందామనుకున్నారట. కొన్నాళ్ళు ఈ వూపులో ఫీజులు కడతారు, ఆ తర్వాత కట్టకుండా వదిలేస్తే?
హేమంత వెళ్ళేసరికి అంతా తేలిగ్గా వూపిరి పీల్చుకున్నారు. కొన్ని లెక్కలేసి కొంత డబ్బు చేతిలో పెట్టారు. మిగతాది ఏదైనా వుంటే తరవాత పంపిస్తామన్నారు. మాట నిలబెట్టుకుంటారూ, నిలబెట్టుకోరూ, అది వేరే విషయం. డబ్బుతో అన్ని సమస్యలూ పరిష్కారం కావు. సూర్యనారాయణ చనిపోవటమే పెద్ద షాక్ హేమంతకి. అంటే అతన్నింకా మర్చిపోలేదని కాదు. అతని అర్ధాంతరపు చావువల్ల ప్రియ తన దగ్గరకి చేరటం అనేది దాని పరిణామం. విడాకులు తీసుకున్నాక ఎన్నోఏళ్ళు వొంటరిగా అలమటించింది తను. తల్లీ తండ్రీ తనకి అండగా వున్నా, భర్తా కూతురూ వుండీ లేకపోవడం చాలా బాధ కలిగించేది. పరిచయస్తులద్వారా భార్గవ సంబంధం వచ్చింది. అతనికి యిద్దరు పిల్లలు. భార్య పోయింది. తనకంటూ ఓ ఇల్లు ఏర్పడిందని సంతోషపడింది. సెటిలవ్వబోతూ వుంటే ఈ సంఘటన జరిగింది. భార్గవ ఈ విషయంలో ఎలాంటి సహకారమూ ఇవ్వడు. మళ్ళీ ఇక్కడ కూడా వైఫల్యమేనా?
“నువ్వెళ్ళగానే భార్గవ నాకు ఫోన్‍చేసాడు హేమంతా!” తండ్రి అన్నాడు. “ఏమన్నాడు?” ఆతృతగా అడిగింది.
“నువ్వక్కడికి వెళ్ళేముందు ఇద్దరూ పోట్లాడుకున్నారా?”
“పోట్లాటంటూ ఏమీ లేదు. ఉత్తరం చూపించాను. ఏం చేద్దామని అడిగే అవకాశం నాకివ్వలేదు. తనకి తనే వెళ్ళద్దనేసాడు. వెళ్ళకుండా ఎలా? ప్రియ ఏమౌతుంది?”
“అతనికి బాగా కోపం వచ్చిందనుకుంటాను. మరిప్పుడేం చేద్దామమ్మా?”
“అదే నాకూ అర్థమవడంలేదు” నిస్సహాయంగా అందామె.
“దాన్నిక్కడ వదిలేసి నువ్వతని దగ్గరికి వెళ్ళిపోతే? మాకుమాత్రం బాధ్యతలేం ఉన్నాయి? మేం పెంచి పెద్ద చేస్తాం. మధ్యలో నువ్వొచ్చి చూసి వెళ్ళు”
“కానీ, నేను భార్గవ పిల్లల్ని కన్నపిల్లల్లా చూసుకుంటున్నానమ్మా!” మనసు కష్టపెట్టుకుంటూ అంది హేమంత,
“పట్టులేనిచోట పాకులాడటం దేనికి? అది అతనిల్లూ, వాళ్ళు అతని పిల్లలూ. వాళ్ళమధ్య ఇదెలా ఇముడుతుంది? కించపాటుతో అదీ దానికోసం అతనితో గొడవలు పడుతూ నువ్వూ… ఇందుకోసమే మళ్ళీ పెళ్ళి చేసుకున్నావా నువ్వు? ప్రియకి మా దగ్గర ఏ లోటూ జరగదు. దర్జాగా పెరుగుతుంది. నువ్వేం దిగులు పెట్టుకోకు” మందలించాడు తండ్రి.
“చూద్దాం” అంది అక్కణ్ణుంచీ వెళ్ళిపోతూ.


అప్పటికి మూడురోజులైంది హేమంత ఇంట్లోంచీ వెళ్ళి. ఆమె దగ్గర్నుంచీ ఏ సమాచారం లేదు. వెళ్ళి కూతుర్ని తీసుకొచ్చిందా? అక్కడే వుందా ఇంకా? సూతకాలూ అవీ పడుతుందా? ఏడ్చిందిగా, పోయినవాడికోసం? భార్గవకి వళ్ళు మండిపోతోంది.
పిల్లలు అస్తమానూ అడుగుతున్నారు, అమ్మెప్పుడొస్తుందని. కనీసం ఫోనేనా చెయ్యచ్చుగా ఏం జరిగిందో, ఎప్పటికి తిరిగొస్తుందో! వీళ్ళు ఆమె పిల్లలైతేగా? అందులోనూ కూతురు దగ్గరికి వచ్చేసాక ఇంకా వీళ్ళెందుకు? చిరచిరగా ఆనుకున్నాడు..
భార్గవ దగ్గరికి తిరిగివెళ్ళడం గురించి ఎటూ ఒక నిర్ణయానికి రాలేకపోతోంది హేమంత. ప్రియ తండ్రికోసం బెంగ పెట్టుకుంది. నిద్రలో కూడా ఏడుస్తోంది. ఆమెకి తల్లి దగ్గరగానీ అమ్మమ్మ తాతయ్యల దగ్గరగానీ చనువు లేదు. అంతా కొత్తకొత్తగా బెరుగ్గా ఉంది. తమ్ముడు, చెల్లీ గుర్తొస్తున్నారు. ఆటల్లో పడితే కొంత బాధ మర్చిపోతుందనుకుంటే తోటిపిల్లలెవరూ లేరు. అలాంటి పిల్లని వదిలేసి తన దారిన తనెలా వెళ్ళిపోవాలో అర్థంకావటంలేదు హేమంతకి. పరిస్థితిని చూసి ఆమె తల్లిదండ్రులు కూడా ఏమీ అనలేకపోతున్నారు.
భార్గవకి ఫోన్ చేసి మాట్లాడాలనీ, సింధు గురించి అడగాలనీ ఎంతగానో అనిపించినా అతని కటుత్వం గుర్తొచ్చి ఆ పని చెయ్యడానికి అహం అడ్డొస్తోంది.

అహం…
మనిషిని శాసించేదీ, యుక్తాయుక్తవివేచనగానీ న్యాయాన్యాయాల విచక్షణగానీ లేకుండా అతని అంతర్, బహిర్ దృక్పధాలకి అడ్డం పడేది అదే. దాన్ని జయించలేకపోతున్నాడు భార్గవ.
హేమంత కూతుర్ని వదిలేసి ఆమెంతట ఆమెగా తన దగ్గరకి రావాలని అతని ఆకాంక్ష. రాకేం చేస్తుందనే దిలాసా.
“నాన్నా! అమ్మ ఇంకా ఎప్పుడొస్తుంది?” సింధు వచ్చి అతని పక్కన కూర్చుంటూ అడిగింది. ఇప్పటికి ఆ పిల్ల ఆ ప్రశ్నని ఎన్నోసార్లు అడిగింది. ఆ పిల్ల చిన్నిబుర్రలో అనుమానం. వెళ్తూ ఏడ్చింది హేమంత. అంటే అమ్మకి కోపం వచ్చిందేమో! ఇంక తిరిగిరావేమోనని భయపడుతోంది.
“వస్తుంది” ఎటో చూస్తూ అన్నాడు బార్గవ.
“రాదేమో!” అంది సింధు. “అంతే!” అంది పెద్దపిల్ల మధుకూడా వచ్చి కూర్చుని.
ఆ జవాబుకి తెల్లబోయాడు భార్గవ. అతని అంతరాంతరాలలో కూడా ఆ అనుమానం ఉంది. అంత తేలిగ్గా తనతో బంధాన్ని విచ్చిన్నం చేసుకుంటుందా అనే అపనమ్మకం… ఒకసారి అలవాటైందికదా అనే అవహేళన… ఆమె కూతురు తిరిగొచ్చిందికదానేది ఆధారం… అన్నీ ఒకదాని వెనుక ఒకటి పుట్టుకొచ్చి, ఒక్కక్షణంపాటు తను సర్వం కోల్పోయిన భావన కలిగింది.
“ఎందుకు రాదు, వస్తుంది” అందామనుకున్నాడుగానీ అనలేకపోయాడు.
“నాన్నా! అమ్మ రాదు. కోపం వచ్చింది” అంది మధు.
“ఎందుకు కోపం?”
“ఆరోజు నువ్వు కోప్పడ్డావు”
“తప్పుచేస్తే కోప్పడరా? నేను వద్దన్న పని చేయచ్చా?”
“అమ్మ తప్పు చెయ్యదు” స్థిరంగా వుంది సింధు గొంతు. అమ్మ తప్పు చెయ్యదని ఎంత నమ్మకం ఆ గొంతులో! నిజమే, జరిగినదాంట్లో హేమంత తప్పేం లేదు. అమ్మగా ఆమె ఏ తప్పూ చెయ్యలేదు. కానీ తన భార్యగా మాత్రం ఆమె చేసింది తప్పే.
“వెళ్ళి తీసుకొచ్చేద్దాం నాన్నా!” అంది సింధు.
నిజమే! ఆమె లేకుండా ఎంతకాలం? వెంటనే వచ్చెయ్యమనాలి. మరి ప్రియ విషయం? అదీ తేలిపోతుంది. దృఢనిశ్చయంతో లేచి నిల్చున్నాడు భార్గవ. “అమ్మ దగ్గరికెళ్లాం” అన్నాడు.
పిల్లలిద్దరి ముఖాలూ వికసించాయి. వెయ్యివోల్టుల బల్బుల్లా వెలిగాయి. తమకేమీకాని వ్యక్తిపట్ల వాళ్ళు పెంచుకున్న అనుబంధం అతనికి విస్మయాన్ని కలిగించింది. వీళ్ళకే ఇలా వుంటే అమ్మని వదులుకోవడానికి ప్రియ వప్పుకుంటుందా? ఆలోచిస్తున్న కొద్దీ ప్రియ తనకీ హేమంతకీ మధ్య అడ్డంకిలాగా తన పిల్లలకి ప్రత్యర్థిలాగా అనిపించి ఇదేదో తాడోపేడో తేల్చుకోవల్సిన విషయమేననిపించింది. ఊరుకుంటే కూతురితోటే వుండిపోతుందేమో!
పిల్లలు చకచక తయారై వచ్చారు. భార్గవ ఇల్లు తాళం వేసాడు.


కారిడార్లో కూర్చుని ప్రియకి అన్నం పెడుతోంది హేమంత. ఆ పిల్ల తిననని మొండికేస్తోంది. “అన్నం తినకపోతే ఎలా బతుకుతానే? ఒక్క రెండుముద్దలు తినమ్మా” అని బతిమాల్తోంది.
“నాకు… నాన్న కావాలమ్మా!” బావురుమంది ప్రియ. హేమంత అరచేత్తో సుదురు కొట్టుకుంది. “బతికుండీ సాధించాడు. చచ్చీ సాధిస్తున్నాడుకదే, ఆ మహానుభావుడు. చచ్చిన మనిషిని నేనెక్కణ్ణుంచీ తీసుకురానే??” నిస్సహాయంగా అంది.
“చిన్నపిల్లతో అవేం మాటలు హేమా? నువ్వులే, నేను పెడతాను. ప్రియ చాలా మంచిది. నేను చెప్తే వింటుంది. ఔనా?” అంటూ లోపల్నుంచీ వచ్చిన హేమంత తల్లి సరిగ్గా గేటుముందు ఆటో ఆగటం చూసి అక్కడే నిలబడిపోయింది.
భార్గవ పిల్లల్తో దిగడం చూసి ఆవిడకి పెద్దబరువు తలమీంచీ దిగినట్టైంది. ఇప్పటిదాకా హేమంత ఎటూ నిర్ణయించుకో లేకపోయింది. ఇప్పుడిక సమస్య దానంతట అదే పరిష్కార మౌతుందనుకుంది.
సింధు ఆవిడని చూసి హుషారుగా పరిగెత్తుకు వస్తూ “అమ్మమ్మగారండోయ్! మేం వచ్చేశాం. అమ్మని తీసుకెళ్ళిపోతాం” అంది. హేమంతని వెనకనుంచే సుడిగాలిలా చుట్టెయ్యబోతూ ప్రియని చూసి ఆగిపోయింది. ఆ పిల్ల కళ్ళల్లో సంకోచం… కుతూహలం. కళ్ళతో భావాలని భలే పలికిస్తుంది.
హేమంత ఆ పిల్లని దగ్గరికి తీసుకుంటూ తిరిగి చూసింది. మెట్లెక్కి వస్తున్నాడు భార్గవ. అతని చూపులు హేమంతని స్పృశించి, ప్రియమీద నిలిచాయి.
ప్రియ!
తమ వుమ్మడి శత్రువు. హేమంతని తమకి దూరం చెయ్యాలని చూస్తున్న ప్రత్యర్ధి! అస్తిపంజరంలాంటి ఎనిమిదేళ్ళ ఆమెని చూసి తన ఆలోచనకి తనకే సిగ్గేసింది. ఎంత చెడ్డగా ఆలోచించాడు, ఇంత చిన్నపిల్లగురించి! మనసు దయ్యాలమర్రి. ప్రతి చిన్న వూహా దయ్యపుపిల్లలా భ్రాంతి కలిగిస్తుంది. తను ప్రియ విషయంలో ఏవేవో వూహించుకున్నాడు. ఆ చిన్నపిల్ల పరిస్థితిని అర్థంచేసుకోకుండా ఆమె జన్మకి కారణమైనవాడిని ద్వేషించి దాన్ని ఆమెమీదికి మళ్ళించాడు. ఏడాదిక్రితం సింధు సరిగ్గా ఇదే స్థితిలో వుండేది. అమ్మ కావాలని ఏడ్చేది. అమ్మ చచ్చిపోయిందని ఇంక తిరిగి రాదనీ ఎన్నివిధాలుగా చెప్పినా గ్రహించేది కాదు. అమ్మని వెతుక్కుంటూ తనుకూడా వెళ్ళిపోతుందేమోనన్న భయంతో నిలువునా వణికిపోయేవాడు.
హేమంత సింధుకి అమ్మై లాలించింది. కన్నతల్లిని మరిపించింది. దు:ఖంలోంచీ బయటపడేసింది.
అప్పుడు సింధు. ఇప్పుడు ప్రియ. రోజులు బాగా మారిపోయాయి. అర్థాంతరచావులూ అల్పాయుష్షులూ పెరిగాయి. పిల్లలు పెద్దయేదాకా అమ్మ ఆలనా నాన్న రక్షణా కావాలి. మనసు పుష్పకవిమానంలాంటిది. ఎందరికేనా చోటిస్తుంది. కావాలనుకోవడంలోనే అంతా ఇమిడి ఉంది.
తను హేమంతని ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా ప్రియనుంచీ దూరంగా లాక్కుపోవచ్చు. ఒకసారి పెళ్ళి విఫలమైన వ్యక్తిగాబట్టి ఇంకోసారి ఆమె రిస్కు తీసుకోకపోవచ్చు. కానీ మనసుని ఇక్కడొదిలేసి వస్తుంది. దాంతోపాటే ఆమెలోని చైతన్యం కూడా. అప్పుడు తనతో వచ్చేది ఆమె ఛాయ మాత్రమే. ఏం కావాలో నిర్ణయించుకోవల్సింది ఇప్పటికీ తనే.
వెళ్ళి హేమంత పక్కన కూర్చున్నాడు.
“అదేంటి, కింద కూర్చున్నారు? కుర్చీ తెస్తాను” లేవబోయింది కంగారుగా. లేవకుండా ఆమెని మోచేతి దగ్గర పట్టుకుని ఆపాడు.
అప్పటికే సింధు ప్రియని పరిచయం చేసుకుంది. తన దగ్గర ఏమేం బొమ్మలున్నాయో చెస్తోంది.
తన దగ్గరొచ్చి కూర్చున్న భార్గవని చూసి ప్రియ బిడియపడి తల్లి భుజం చాటుకి నక్కింది. “నేను సింధూ వాళ్ళ నాన్నని. నువ్వూ అలాగే పిలవచ్చు. మీ నాన్నలాగే సింధూవాళ్ళమ్మకూడా లేదు. ఇప్పుడు మేమిద్దరం మీకు అమ్మానాన్నలమన్నమాట” అన్నాడతను.
మీలో ఇంత మార్పు! అన్నట్టు విస్మయంగా చూసింది హేమంత.
“మొదటి పెళ్ళి కెమికల్ ఈక్వేషనైతే రెండోపెళ్ళి మేథమెటికల్ ఈక్వేషన్. సబ్‍స్టిట్యూట్లతోపాటు కొఎఫీషెంట్లు తప్పకపోవచ్చు” అన్నాడు భార్గవ.
“మీ మాటలూ, కోపతాపాలూ నాకెప్పుడూ అర్థంకావు” అంది హేమంత.
“మనింటికి వెళ్ళాం పదండి” అన్నాడతను.
“ఈమాట ఆ రోజే చెప్పి వుంటే నాకింత టెన్షనుండేదికాదుగా? ఒక్కర్తినీ ఎంత నలిగిపోయానో తెలుసా?” చిరుకోపంగా అడిగింది.
“సారీ” నిజాయితీగా అన్నాడతను.
హేమంత ప్రయాణపు ఏర్పాట్లు చెయ్యడానికి వెళ్ళింది. భార్గవ మనసిప్పుడు చాలా ప్రశాంతంగా ఉంది. తెంచుకోవటంలో లేని ఆనందం పెంచుకోవటంలోనూ పంచుకోవటంలోనూ కనిపించింది. తల్లినో తండ్రినో కోల్పోయిన ఆ ముగ్గురు పిల్లలనీ పెంచి పెద్ద చేయటమనే బాధ్యత యీ కోపతాపాల ముందు బృహత్తరమైనదిగా అనిపించింది.
(16జూలై 2000 ఆదివారం ఆంధ్రభూమి)