ఆ వుత్తరం by S Sridevi

  1. ఆ వుత్తరం by S Sridevi
  2. ఊహించని అతిథి by S Sridevi
  3. అస్తిత్వసంతకం by S Sridevi
  4. అస్త్రసన్యాసం by S Sridevi
  5. ఒక కన్నీటిచుక్క ప్రయాణం by S Sridevi

విపుల, సెప్టెంబరు 1997

బాబీ: రెండు వొడ్లనీ వొరుసుకుంటూ ప్రవహించే నదిలా యిరుకైనది జీవితమని తెలుసుకునేంత వయసు నాకప్పుడులేదు. అప్పుడంటే ఆ వుత్తరం నా చేతికొచ్చినప్పుడు. ఇద్దరు తల్లులు నాకు. నాకన్నా డబ్బే ఎక్కువని ఒక తల్లి అనుకోవటంతో ఆవిడ పొత్తిళ్ళలోంచీ జారి ఇంకో తల్లి ఒళ్లోపడ్డాను. ఈవిడ స్వీకరించలేకా తిరస్కరించలేకా సందిగ్ధంలో పడేసరికి నేను గరళంలా ఆమె గొంతుక్కడ్డం పడ్డాను. ఎలాంటి రాగపూరితమూకాని అమలినబంగారంలాంటి ప్రేమైతే నా పెంపుడుతల్లి దగ్గర్నుంచి లభించిందిగానీ అందులో అంతఃస్పర్శ లేకపోవడంచేత మా ఇద్దరి మధ్యా ఎడం ఎడంగానే వుండిపోయింది. దాన్ని నా బాల్యంతో భాగించి నిశ్శేషం చేశాను. భాగఫలం జెన్నీ.


రావు:
డియర్ రేవతీ!
నేను ప్రస్తుతం బొంబాయిలో వున్నాను. నిన్ను మర్చిపోవాలని ఈ నెలరోజులుగా నేను చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. నిన్నొదిలేసి నాదారిన నేను స్వదేశానికి తిరిగి వెళ్ళిపోవాలనే ఆలోచనే దుర్భరంగా వుంది. ఇప్పటికీ నిన్ను నేను ప్రేమిస్తున్నాను. ప్రేమించబడకపోవడానికి నీ తప్పేముందిగనుక? నీ పరిస్థితిని నేసర్ధం చేసుకున్నాను. నీకేమీ కానివాళ్లంతా ఒకటై నీ జీవితాన్నెలా శాసిస్తున్నారో కళ్లారా చూశాను. ఇంత చిన్నవయసులోనే వితంతువన్న ముద్రవేసుకుని ఆగమ్యంగా జీవితాన్ని గడపమని నిన్ను వాళ్ళు ఆదేశించడం అమానుషం. ఏది ఏమైనప్పటికీ నా ప్రియతమా, నువ్వు తెరిచిన నా హృదయపుకవాటాలు తిరిగి మూసుకోవటం లేదు. నీవున్న పరిస్థితిలో ద్వితీయం చేసుకోవడంలో తప్పులేదు. భగవంతుడి దృష్టిలో సర్వప్రాణులూ సమానమైనప్పుడు స్త్రీపురుషులు మాత్రం సమానులుకారా ? కాబట్టి ఈ విషయంలో ఇంకే ఆలోచనా వద్దు.
ఈ నెల ఇరవయ్యారో తారీఖున బొంబాయి వచ్చే రైలెక్కయ్యి. అందులో నేను నీకోసం ఎదురుచూస్తూ వుంటాను. నువ్వు తప్పక వస్తావని ఆశిస్తూ ….
పి.యస్. తప్పక రావాలి…
సుదీర్ఘమైన ఈ ప్రేమలేఖ, ఒక యువతి జీవితగమ్యాన్ని నిర్దేశించే ఈ ప్రేమలేఖ పదిహేనేళ్లనాటిది. యథాతథంగా మీముందుంచలేదు. ఇంగ్లీషులో వున్నదాన్ని స్వేచ్ఛానువాదం చేశాను.
“ఏమండోయ్ మేష్టారూ! మీ కోడలి పేర్న రిజిష్టరు వుత్తరం వచ్చింది” అన్న పిలుపుతో నా చేతికొచ్చింది. దాన్ని నేను నా కోడలికివ్వలేదు. ఎవరికీ చూపించకుండా నేనే ఇప్పి చదివాను. చదివాక నా రక్తం కొంచెం మరిగింది. తర్వాత చల్లారింది. కాచి చల్లార్చిన నీళ్లకిమల్లే నా భావాలు స్వచ్ఛమయ్యాయి.
పదిహేనేళ్ల క్రితం జీవితం ఇప్పుడున్నంత వ్యక్తిగతమైనది కాదు. మనిషి సంఘంలోనూ, సాటిమనుషుల మధ్యా బతికేవాడు. మనం చేసేవాటికి వాళ్ళకి జవాబు చెప్పవలసొచ్చేది. అలాగే వాళ్లు చేసేవాటిని ప్రశ్నించే హక్కుకూడా వుండేది. మనిషి తానుగా సుఖపడ్డంకన్నా సంఘంలో సుఖపడ్డంగురించే ఆలోచించేవాడు. అంచేత ఈ వుత్తరం నా కోడలి చేతుల్లో పడకుండా నా చేతుల్లో పడ్డం నా అదృష్టం కొద్దీ జరిగిందని భావించాను.
రేవతి అభాగ్యురాలే, కాదనను. దాని నొసట ఈ ముద్ర వేసింది మేమే. అదీ కాదనను. దాని నుదుట ఇలాంటి రాత రాసి ఈ అకృత్యం మాద్వారా జరగాలని ఆదేశించాడు ఆ సర్వేశ్వరుడు, మాదేముందీ, నిమిత్తమాత్రులం అని ఎప్పుడో చేతులు దులిపేసుకున్న ప్రహసనాన్ని తిరగదోడేంత ఔదార్యం నాకులేదు. సంఘంలో పరువు ప్రతిష్ట, వంశగౌరవం, సాంప్రదాయం ఇత్యాది బంధాల్లో వున్నవాడిని. వాటిని తెంచుకోవటం నాకిష్టం లేదు.
ఉత్తరాన్ని చింపి ముక్కలు చేసి పారేద్దామనుకున్నాను. కానీ అంత అందమైన పుత్తరాన్నీ, దాని వెనుకనుంచి తొంగిచూసే ఆ అమెరికన్ యువకుడి భావుక హృదయాన్నీ ముక్కలు చెయ్యడానికి చేతులు రాలేదు. పాత భోషాణపు పెట్టె దొంగ అరలో రహస్యంగా దాచాను. నా కోడలి ముఖం చూసినప్పుడల్లా ఆ వుత్తరం గుర్తొస్తుంది . తప్పు చేసినట్టు తలొంచుకుంటాను.
ఆ వుత్తరం వచ్చాక ఆగస్టు ఇరవయ్యారు ఇప్పటికి పదిహేనుసార్లు వచ్చింది. దాన్ని నేను అంతకంటే ఎక్కువసార్లే చదివాను. ఇప్పుడది హఠాత్తుగా మాయమైంది. ఎక్కడా మర్చిపోవడానికి ఆస్కారం లేదు. ఎందుకంటే దాన్ని నేనీ స్టోరూంలోంచి బైటికి తీసికెళ్లలేదు. మరైతే ఎవరేనా తీశారా? ఎవరు తీసి వుంటారు? చింపి పారెయ్యకుండా ఇన్నాళ్ళూ దాచినందుకు నన్ను నేనే తిట్టుకున్నాను.
బాబీ:
నిన్న లీలా టీచరు పెళ్లికి వెళ్ళొచ్చినప్పట్నుంచీ నాకేదోగా వుంది. టీచరుది లేట్ మేరేజట. ముప్ఫయ్ ఐదేళ్ల పైబడే వుంటుందట వయసు. పెళ్లి అలంకరణలో ఆవిణ్ణి చూస్తుంటే నాకు అమ్మ గుర్తొచ్చింది. అమ్మదీ దాదాపు అదే వయసు. కానీ మోడులా జీవితాన్ని గడుపుతోంది. ఎప్పుడూ నవ్వదు. నేతచీరలు తప్పించి కట్టదు. నాతో కూడా సరదాగా మాట్లాడదు. ఆమె నా కన్నతల్లి కాదని నాకు తెలుసు. కానీ ఓ పెంపుడు తల్లి తన పిల్లాడితో మాట్లాడినట్టు కూడా మాట్లాడదు. ఆమె కళ్లల్లో ఆర్ద్రత వుంది. గుండెల్లో మాత్రం అది లేదనిపిస్తుంది. తను నాపట్ల ఎంత విముఖంగా వున్నా నాకీ అమ్మంటేనే ప్రాణం.
“ఏమిట్రా ! పక్కలో వూరికే కదుల్తున్నావు ? నిద్ర రావడం లేదా ?” అడిగిందమ్మ. తదేకంగా తన మొహంలోకి చూడసాగాను. ఒక గొప్ప సౌందర్యదీపం వెలుగుతుంటుంది. ఆమె మొహంలోకి చూడం నాకెంతో ఇష్టం.
ఏదో ఒకటి మాట్లాడాలనిపించింది.
“రేపు మా ఫ్రెండుని మనింటికి తీసుకొస్తాను” అన్నాను.
“అలాగే తీసుకురా”
“పేరు జెన్నిఫర్”
“అమ్మాయా? క్రిష్టియనా?” అంతే, ఆమె అడిగిన ప్రశ్నలు. ఇంకేం మాట్లాడలేదు. జెన్నీ గురించి ఎన్నో చెప్పాలనుకున్న నా వాక్రవాహానికి అడ్డుకట్టపడి ఆగిపోయింది.
“కళ్లు మూసుకుని పడుకో. అదే నిద్రొస్తుంది” అనేసి గోడకేసి తిరిగి పడుకుంది. అలవాటే … నాకు మాత్రం నిద్రరాలేదు.
జెన్నీ గురించి ఆలోచించసాగాను. వాళ్లు ఇండోఅమెరికన్స్, బోంబేలో వుండేవారు. ఈ వూరొచ్చి స్థిరపడ్డారు. ఈయేడే మా స్కూల్లో జాయినైంది. జెన్నీకి అమ్మ లేదు. ఎంత విచిత్రం! నాకేమో ఇద్దరమ్మలు!
ఇంతలో స్టోర్రూమ్‍లో లైటు వెలిగితే నెమ్మదిగా లేచి వెళ్లాను. తాతయ్య భోషాణం ముందు కూర్చుని ఏదో చదువుతున్నాడు. ఇంత రాత్రివేళ అంత రహస్యంగా చదువుతున్నదేమిటో పిల్లిలా అడుగులో అడుగేసుకుంటూ వెళ్లి ఆయన వెనక నిల్చున్నాను. అదో పాత వుత్తరం. అప్పటికే చదవడం అయిపోయింది. మూసేస్తుంటే దానిమీద పేరు చూశాను. అమ్మది.
రేవతీ, నీకు అన్యాయం చేశాను… తాతయ్య వుత్తరీయంతో మొహం తుడుచుకుంటూ గొణుక్కుంటుంటే మళ్ళీ పిల్లిలా అక్కణుంచి వచ్చేశాను. నా మనసంతా ఆ వుత్తరం మీదే వుంది. అది అమ్మ వుత్తరం. తాతయ్యకెలా దొరికింది? దాన్నంత జాగ్రత్తగా ఎందుకు దాస్తున్నాడు? దాంట్లో వున్న రహస్యమేమిటి? తాతయ్య అలా ఎందుకన్నాడు? ఎన్నో ప్రశ్నలు! తాతయ్య తన గదిలోకి వెళ్లిపోగానే నేనా వుత్తరాన్ని తెచ్చేసాను. అప్పటికప్పుడే చదివెయ్యాలనిపించిందిగానీ పట్టుబడిపోతాననే భయంచేత ఆ పనిని రేపటికి వాయిదావేశాను. స్కూలునుంచి వస్తూ నాకూడా జెన్నీని తీసుకొచ్చాను.
“ఎవర్రా ఆ పిల్ల?” వీధిగదిలోనే అడిగింది బామ్మ.
“జెన్నిఫర్, నా క్లాస్‍మేట్” చెప్పాను. జెన్నీ బెరుగ్గా అక్కడే ఆగిపోయింది.
“మా బామ్మ. పద … లోపలుంటుంది మా మమ్మీ చూపిస్తాను”
తన చెయ్యి పట్టుకుని తీసికెళ్లాను.
“అమ్మా!” ఏదో చదువుకుంటున్న అమ్మ నా పిలుపుకి తలెత్తింది. నా పక్కనున్న జెన్నిని చూడగానే ఆమె కళ్లల్లో మెరుపు చాలా స్పష్టంగా చూశాను.
“నిన్న చెప్పింది ఈ అమ్మాయి గురించేనా?” తనంతట తనే అడిగింది తనకింత మంచి ఇంగ్లీషాచ్చునని నాకింతదాకా తెలీదు.
ఔనని చెప్పి స్కూల్‌బేగ్ మేకుకి తగిలించాను. జెన్నీకూడా తన బేగ్ టేబుల్‍మీద పెట్టి పొందిగ్గా అమ్మ పక్కన కూర్చుంది. వాళ్ల సంభాషణ ఇంగ్లీషులోనే జరిగింది. నేను సంభ్రమంగా వింటూ కూర్చున్నాను.
“నీ పేరు జెన్నీఫర్ కదూ?”
“ఊ”
“ఇంట్లో ఏమని పిలుస్తారు?”
“జెన్నీ”
“ఈ వూరేనా?”
“ఊహు … లాస్ ఏంజిల్స్. అక్కణ్ణుంచి మా డాడీ ఈ దేశం వచ్చారట. బోంబేలో వుండేవాళ్లం చాన్నాళ్లు. ఈమధ్యనే ఈ వూరొచ్చాం”
“బాంబేకన్నా ఈ వూరు బావుందా?”
“ఉహు అక్కడైతే బోల్డుమంది ఫ్రెండ్స్ వుండేవాళ్లు. లేంగ్వేజి ప్రాబ్లం వుండేది కాదు. నా ఏక్సెంటు ఇక్కడెవ్వరికీ తెలీదు. ఎవరూ నాతో మాట్లాడరు. కొందరైతే టీజ్ చేస్తారు. వెక్కిరిస్తారు”
“మీ డాడీ ఏం చేస్తారు?”
“బిజినెస్. విన్యెట్ సిస్టమ్స్ మాదే”
“విన్యెట్ … వివ్యెట్ మీ నాన్నగారి పేరా పాపా?” అమ్మ గొంతులో ఆత్రం. నాకర్ధమైంది … ఆ ఉత్తరం రాసిన విన్యెటే జెన్నీ వాళ్ల డాడీ… లాసేంజిల్స్‌నుంచి బొంబే వచ్చి అక్కణుంచి అవంతీపురం రావల్సిన అవసరం ఇంకే విన్యెట్‍కుంటుంది?
“ఔనాంటీ!” జెన్నీ జవాబు.
“మీ నాన్నగారు బావున్నారా జెన్నీ?”
“మీకు మా డాడీ తెలుసా?”
“ఊ<మరి మీ మమ్మీ?” ఈ ప్రశ్నకి, “మా పేరెంట్స్ డైవోర్సు తీసుకున్నారు. నేను డాడ్ దగ్గర వుండిపోయాను. అమ్మ తమ్ముడిని తీసుకుని వెళ్ళిపోయింది” అంది జెన్నీ. అమ్మ జెన్నీ చేతిని వోదార్పుగా తనచేతిలోకి తీసుకుంది. నేనెప్పుడూ ఆమె దగ్గర అంత ప్రేమకి నోచుకోలేదేమో! జెలసీగా అనిపించి వాళ్లిద్దర్నీ చూస్తూ కూర్చున్నాను . అమ్మలేచి మాకిద్దరికీ బిస్కెట్లు, బోర్నవిటా తీసుకొచ్చింది. ఇద్దరం కాళ్లూ, చేతులూ, మొహం కడుక్కుని వాటిని తిన్నాం. ఆరింటికి వదల్లేక వదల్లేక జెన్నీని విడిచిపెట్టింది.
“ఎప్పుడేనా బాబీతో వస్తుందమ్మా” గేటుదాకా వచ్చి చెప్పింది. నేను తనని నా మోపెడ్‍మీద డ్రాప్ చేసి వచ్చాను.
బామ్మ దేన్ని గురించో పెద్దగా అరుస్తోంది. ఇంకేముంటుంది? ఈ విషయాన్ని గురించే అయ్యుంటుంది. అమ్మ కళ్లల్లో నేను వెలిగించిన జ్యోతులీపాటికి ఆరిపోయి వుంటాయి.
“అయ్యాయా,పెత్తనాలు? ఆడపిల్లల్తో నీకు స్నేహాలేంటి? వేలెడంత లేవు?ఇంకోసారి ఇలాంటి వేషాలేశావంటే తాతయ్యతో చెప్పి తాట వలిపిస్తాను” అంది బామ్మ నన్ను చూడగానే.
“చిన్నపిల్లాడికి అలాంటివి చెప్పకండి. ఆడామగా భేదం స్నేహంలో వుండదు” మొట్టమొదటిసారిగా నాపక్షం మాట్లాడుతూ అమ్మ నోరిప్పింది.
“క్రిస్టియన్‍పిల్లనా, దాన్ని వెనకేసుకొస్తున్నావు?” బామ్మ వుద్రేకపడిపోయింది. ఎక్కణ్ణుంచో తాతయ్యొచ్చాడు.
“ఇప్పుడేం జరిగిందని రాజేశ్వరీ! అలా వుద్రేకపడకు” బామ్మకి మందు వేస్తూ ఓదార్పుగా అని అమ్మకేసి తిరిగి, “రేవతీ! నువ్వు లోపలికెళ్లు” అన్నారు.
అమ్మ లోపలికి అంటే తన గదిలోకి వెళ్లబోయింది.
“దాన్ని లోపలికి పొమ్మంటున్నారా? అయ్యో! గుండెల్లో నొప్పిగా వుంది. కాస్తంత రాయాలనే జ్ఞానమేనా లేదు. ముంగిలా ఎలా చూస్తోందో! ఈ కొరివిని కట్టబెట్టి నా కొడుకుని అల్పాయుష్కుడ్ని చేసుకున్నాను. సావిత్రంత పతివ్రతేమో నా కోడలనుకున్నాను. చెట్టంత కొడుకు. పెళైన ఏడాది తిరక్కుండా పోయాడు. అయ్యో భగవంతుడా! నాకు చావెందుకు రాదో!” బామ్మ రాగం తీస్తూ ఏడుస్తుంటే అమ్మని అక్కణ్నుంచి వెళ్లిపొమ్మని తాతయ్య కళ్లతోటే సంజ్ఞ చేశారు. ఆమె వెళ్లిపోయింది. వెనకాలే నేనూ వెళ్లాను.
చీకట్లో దీపమేనా వేసుకోకుండా ఈజీచెయిర్లో కూలబడింది. కన్నీళ్లు దిగమింగడానికి మనిషెంత కష్టపడాలో ఆమె ముఖం చూస్తుంటే నాకర్థమైంది. చీకటినీ దాన్ని దిగమింగుతున్న దు:ఖపు వాతావరణాన్నీ ఛేదించడానికి లైటేసాను. అమ్మలో ఎలాంటి మార్పూలేదు. చీకటికీ వెలుతురికీ ఒకేలా స్పందించడం ఆమెకలవాటైపోయింది. ఆమె నవ్వు చూడాలని నేను తపించిపోతానుగానీ ఆమె నిజంగా నవ్వుతుంటే ఆ బామ్మ వూరుకుంటుందా? బామ్మ గురించి కోపంగా అనుకున్నాను.
“అమ్మా ! ఈవేళ నేను జెన్నీవాళ్లింటికి వెళుతున్నాను” పక్కరోజు రహస్యంగా అమ్మతో అన్నాను.
“ఆ పిల్లతో స్నేహం బామ్మకిష్టం లేదు నాన్నా! మానెయ్యి. లేకపోతే ఆవిడ రాద్ధాంతం చేస్తుంది” ఎటో చూస్తూ అంది అమ్మ. ఆమె గొంతులో దుఃఖపుజీర. కళ్లల్లో కన్నీటినీడ. ఇదివరకటి స్తబ్దతకన్నా ఈ దుఃఖం దుర్భరంగా వుంది.
“ఆవిడకి బాయ్‍ఫ్రెండ్స్ లేరా? నాకు గాళ్‍ఫ్రెండ్సుంటే తప్పా?” అవతలి గదిలో వున్న బ్యామ్మకే వినిపించేలా అరిచాను.
“నాకు బాయ్ ఫ్రెండ్సేమిట్రా?నీకేమైనా మతిపోయిందా? వింటే నలుగురూ నవ్వుతారు” బామ్మ అంది.
“తాతయ్య నీకు బాయ్‍ఫ్రెండ్ కాదా? నేన్నీకు బాయ్‍ఫ్రెండ్ కానా? సాయంత్రం టీవేళయ్యేసరికి వచ్చేస్తాడే తాత, ఆయన్నీకేమౌతాడేమిటి?” ప్రశ్నలు గుప్పించాను. అమ్మ నవ్వాపుకుంది. నాకు సంతోషం వేసింది. ఇంక దేనికోసమూ చూడకుండా బైటికి జారుకున్నాను.
స్కూలవగానే జెన్నీ వాళ్లింటికి వెళ్ళాను. వాళ్ల డాడీ ఇంట్లోనే వున్నారు. బూడిదరంగు కళ్లూ, తెల్లటి ఛాయ జెన్నీని చూస్తే పారినర్ కావచ్చునని వూహిస్తాం. ఆయన్ని చూడగానే తెలిసిపోతుంది. ఆయన తల్లి అమెరికన్. తండ్రి ఇండియన్. ఆయన్తో పరిచయం వున్నవాళ్లేవరేనా జెన్నీ అయన కూతురని చూడగానే తెలుసుకుంటారు. అంతగా ఇద్దరికీ పోలికలున్నాయి.
“నా ఫ్రెండ్ బాబీ” జెన్నీ పరిచయం చేసింది. నేను విష్ చేశాను.
ఆయన చాలా సరదాగా మాట్లాడారు. జెన్నీ చిన్నపిల్లలా అల్లరిచేసింది. తన బొమ్మలన్ని చూపించింది. చాలా వున్నాయి తన దగ్గర. అన్ని అమెరికావే. ఇంట్లో పనులు చెయ్యడానికి సర్వెంటు, కుక్ వున్నారు. మా ఇంట్లోలాగే ఇక్కడకూడా నాకు నచ్చని ప్రశాంతత వుంది.
“మీ ప్రాపర్ ఇదేనా?” జెన్నీ వాళ్ల నాన్న అడిగారు.
“ఔను. గోపాల్రావుగారు మా తాతగారు. రిటైర్లు టీచరు. రేవతి మాఅమ్మ”
“రేవతి … రేవతి కొడుకువా? ఎలా సాధ్యం? నేను తనని చూసి పదిహేనేళ్ళైంది. అప్పటికి నువ్వింకా పుట్టలేదు. షీ వాజ్ చెయిల్డ్‌లెస్ ” ఆయన స్వగతంగా అనుకున్నారు.
“మీకు మా అమ్మ తెలుసా?” అచ్చం జెన్నీ వాళ్ళ నాన్నని గురించి అడిగినట్టే అడిగాను.
“తెలుసు. బాగా తెలుసు. ఎలా వుంది రేవతి? ఆ ముసలివాళ్ళింకా బతికే వున్నారా? గోకుల్, కాత్యాయని ఇంకా ఆమెని శాసిస్తునే వున్నారా? రేవతి…పూర్ చెయిల్డ్…చాలా లౌలీగా వుండేది. ఇప్పుడెలా వుంది? నువ్వు… నువ్వు ఇదెలా సంభవం?” ఆయన పుద్వేగపడుతున్నాడు. కళ్లల్లో నీళ్లు నిల్చినట్టై ముఖం కర్చీఫ్‍తో గట్టిగా రుద్దుకున్నారు.
“నేను గోకుల్, కాత్యాయనిల కొడుకుని. రేవతి అమ్మకి నన్ను పెంపు ఇచ్చారు” అన్నాను. వాళ్ల గురించి ఆయనలా అనడం నాకు నచ్చలేదు.
పజిల్ విడిపోగా అయన ముఖం ప్రశాంతంగా మారింది.
“ఓ అలాగా ! అయాం సారీ మై బోయ్” సిన్సియర్‍గా అన్నారు.
“ఎలా వుంది రేవతి?”
“ఎలా వుందని చెప్పను? జెన్నీ ఐతే తనకి అమ్మ లేదని సింపుల్‍గా చెప్పేసింది. నా బాధని నేనెలా చెప్పుకోను? అమ్మ నవ్వడం నేనెప్పుడూ చూడలేదు. ఆమె మాట్లాడుతుంటే ఇంటికెవరో కొత్తవాళ్ళు వచ్చారు, కొత్తగొంతు వినిపిస్తోందనుకుంటాను. నాతో కూడా మాట్లాడదు” అన్నాను.
“స్వయంకృతం”
“అంటే?”
“చేజేతులారా చేసుకున్నది”
“ఎందుకని?” నేను కోపంగా అడిగాను.
“నువ్వు చిన్నవాడివి. నీకీ విషయాలు తెలీవు. ప్లీజ్ లీవిట్” అన్నారు.
“ఊహు నాకన్నీ తెలుసు. మా అమ్మ నవ్వుతూ అందల్లాగా తిరగాలి” ఏదో పెద్ద హీరోననుకున్నాను. నాకు ఏడుపొచ్చేసింది. జేబులోంచి వుత్తరం తీసి ఆయనవైపు విసిరేస్తూ వెళ్ళిపోబోయాను. ఆయన నా వెనకే వచ్చి, నన్నాపుతూ.
“ఇది నీకెక్కడిది?” కటువుగా అడిగారు.
“మా తాతయ్య దగ్గర దొరికింది”
“అంటే … రేవతి దీన్ని చూడనేలేదా?”
“నాకు తెలీదు. మా తాతయ్య చాలా జాగ్రత్తగా దాచాడు దీన్ని. నేను దొంగతనం చేసి తీశాను”
ఆయన పుత్తరాన్ని పదిలంగా మడిచి టేబుల్‍మీద పెట్టారు. ఆ తర్వాత వేగంగా పచార్లు చెయ్యసాగారు. రేవతి… రేవతి… మధ్యమధ్యలో గొణుక్కుంటున్నట్టుగా ఏదో అంటున్నారు అంత ఇంగ్లీషు నాకర్ధం కాలేదు. అమ్మ పేరొక్కటే గ్రహించాను.
” గో … గో ఎవే …. ” హఠాత్తుగా పచార్లు చెయ్యడం ఆపి నాకేసి తిరిగి కఠినంగా అన్నారు . నేను బిత్తరబోయాను. ఎక్కణుంచి వచ్చిందో, అందాకా ఎక్కడుందో జెన్నీ పిల్లిలా వచ్చినా చెయ్యి పట్టుకుని అక్కణ్ణుంచి ఇవతలికి తీసుకొచ్చింది. మా వెనకాల ఆయన గది తలుపులు మూసుకున్నాయి. జెన్నీ కళ్లనిండా నీళ్లు. ఓ చేత్తో వాటిని తుడుచుకుంటూనే మరో చేత్తో నా చేతిని గట్టిగా పట్టుకుంది.
“డాడీ అప్పుడప్పుడింతే. చాలా మూడీగా వుంటారు. మా అమ్మ అందుకనే డైవోర్స్ చేసింది. ఇప్పుడు తను డ్రింక్ చేస్తారు” అంది. ఆ తర్వాత నా సానుభూతి కోరుతున్నట్టు భుజం మీద తలానించింది. అప్పటిదాకా నేను గ్రహించలేదు, జెన్నీ నాకన్నా పొట్టిదని. బహుశా వాకన్నా చిన్నదేమోకూడా! ఒక్కసారి నాకు పెద్దరికం వచ్చేసింది.
“రాత్రంతా ఇలానే వుంటారా?”
“ఊ<. ఒక్కదానికీ నాకు భయం వేస్తుంది”
“మా ఇంటికెళ్దాం” నేను చెప్పాను.
కాసేపు తటపటాయించి జెన్నీ నాతో వచ్చింది. ఇంటికి రాగానే బామ్మ గొడవ చేసింది.
“ఈ స్నేహాలు నాకిష్టం లేదు. ఇలాగైతే వచ్చి తీసికెళ్లమని మీ అమ్మానాన్నలకి వుత్తరం రాసేస్తాను. క్రిస్టియన్ పిల్లతో నీకు తిరుగుళ్లేమిటి?” అంది.
“ఈ ఒక్కసారికే ” అన్నాన్నేను. జరగబోయేది తలుచుకుంటూంటే నాకొకటే వుత్సాహంగా వుంది . జెన్నీని వెతుక్కుంటూ వాళ్ల నాన్న ఇక్కడికొస్తారు. అమ్మని చూస్తారు. “నాతో వచ్చెయ్ రేవతీ!” అంటారు. అమ్మ ఆయన్తో వెళ్లిపోతుంది. నవ్వుతూ వెళ్లి జెన్నీకి అమ్మైపోతుంది. నేను మా అమ్మానాన్నా దగ్గరకెళ్లిపోతాను. చెల్లీ తమ్ముడు అమ్మా, నాన్న ఇందరున్న కుటుంబంలో ఎంచక్కా ఒకటైపోతాను. ఈ అమ్మకళ్లల్లో కన్నీళ్లుండవు . పెదాలెప్పుడూ విచ్చుకునే వుంటాయి.
బామ్మ మంచానికి దగ్గరగా కుర్చీ వేసుకుని కూర్చుకున్నారు. తాతగారు. “ఎవరి పిల్ల ? ఇప్పుడెందుకొచ్చింది?” అనడిగారు.
“జెన్నీ! నా ఫ్రెండు. ఈ వేళిక్కడే వుంటుంది”
“చూడండి వీడి ఆగడాలు ?” బామ్మేదో చెప్పబోయింది. తాతయ్య ఆవిడని ఆపి,
” పోన్లే, చిన్నపిల్లలు” ఆవిడకి సర్దిచెప్పి, నాతో “ఇంకెప్పుడూ ఇలా చెయ్యకు. మగపిల్లలు ఆడపిల్లలు ఇలాంటి స్నేహాలు చెయ్యకూడదు. స్కూలువరకే వుంచుకోవాలి” కఠినంగా అన్నారు. నేను తలూపాను.
అమ్మ జెన్నీని చూడగానే అభిమానంగా దగ్గరకి తీసుకుంది.
“ఇదెక్కడి చోద్యమే ? పదిహేనేళ్లు పెంచిన పిల్లాడి మీద లేని ప్రేమ ఈ పిల్లమీద వలకబోస్తున్నావు ” బామ్మ సాగదీసింది . అమ్మ జవాబివ్వలేదు . రాత్రి అమ్మకి చెరోపక్కన నేనూ , జెన్నీ పడుకున్నాము . అమ్మ జెన్నీని దగ్గరగా తీసుకుని పడుకుంది . జెన్నీ ఎంత స్వతంత్రంగా అమ్మని కావిలించుకుందని!
రేవతి :
జెన్నీ , బాబీ నాకు చెరోపక్కన నిద్రపోతున్నారు . జెన్నీ ! ఆ పిల్ల ముఖం చూస్తుంటేనే నాలో మమకారపు వెల్లువ పెల్లుబుకుతోంది . ఎన్నిసార్లు ముద్దు పెట్టుకున్నానో పట్టుకుచ్చులాంటి జుత్తు , పిల్లికళ్లు , కోల మొహం , పల్చటి పెదాలు … అన్ని అతని పోలికలే ! నేను కలగన్నది జరిగుంటే ఈ పిల్ల నా కడుపున పుట్టేదన్న ఆలోచనే నాకూ అతనికి సాన్నిహిత్యపు భావన కలగజేస్తోంది .
మొలిచిన ప్రతి మొక్కా పుష్పించి ఫలించాలని కోరుకుంటుంది . అది ప్రకృతి సహజమైన భావన . కోరికగూడా కాదు . నేను మాత్రం మోడులా పుట్టాను . మోడులానే మిగిలాను . ఇన్ని వసంతాలాచ్చినా ఒక్క చిగురు కూడా వెయ్యలేదు . నాలాంటివాళ్లని చూస్తే ప్రకృతిక్కూడా అసహ్యమేనేమో . మృత్యువనే గొడ్డలి తీసుకుని ఒక్కవేటువేస్తే కూలిపోయేదాన్ని ఇలాగే బతకమని శాసిస్తూ వదిలేసింది .
” ఈవేళ అనుభవిస్తున్నానే ఆ సంతోషాన్నీ , ఆ శోకాన్ని అలనాడెప్పుడో నీ జీవితపు విస్తట్లో నువ్వే వడ్డించుకున్నావు తెలుసా ? ” ఎక్కడో చదివిన కొటేషన్ గుర్తొచ్చింది . ఇంతటి శోకాన్ని నా జీవితపు విస్తట్లో వడ్డించుకునేంతటి కఠినాత్మురాలినా నేను అలానాడెప్పుడో ! నిశ్శబ్దంగా ఏడ్చాను . అశ్రువుల్ని దిగమింగేకన్నా బైటికి వదిలేస్తుంటే మనసుకి సాంత్వనగా వుంది .
అందరిమీద పగో , లేక నాలోని చైతన్యరాహిత్యమోగానీ నేను బాబీని ఎప్పుడూ ఇంతగా ప్రేమించలేదు . కానీ వాడికి నా మీద గంపెడు ప్రేముంది. ఇన్నాళ్ల నా ప్రవర్తనకి ఈవేళ నాకు సిగ్గేస్తోంది . అందులో నా తప్పేంలేదు . అలా నన్ను సమర్ధించుకోవాలంటే నా కథంతా ఇప్పి చెప్పాలి .
శనీశ్వరుడు , జేష్టాదేవీ వియ్యమంది మా అమ్మకి నాన్నకి పెళ్లి చేశారు . మేం నలుగురు పిల్లలం . ఆపరేషను చేయించుకోవడానికి నాన్నకి భయం . అమ్మకేమో రక్తహీనత . ఇవి రెండూ కూడా మేం పుట్టకుండా ఆపలేదు . అందర్లోకి పెద్దవాడు అన్నయ్య . వాడికి పోలియో వచ్చి ఒక కాలు చచ్చుపడిపోయింది . వాడి తర్వాత నేను . నా తర్వాత  మరో యిద్దరు ఆడపిల్లలు. అసలు ఎందరు పుట్టారో వాళ్లలో ఎందరు బతికారో, మిగిలింది మేము . ఏం తిన్నామో ఎలా బతికామో . ఎందుకింతమంది పిల్లలని ఎవరేనా అంటే ” నారుపోసిన వాడే నీరు పోస్తాడు . ఇందర్ని మాకివ్వడంలో ఆ పైవాడి సంకల్పం ఏమైవుందో” అని శుష్కవేదాంతం చెప్పేవాడు నాన్న. నారుపోసేదీ నీరు పోయ్యాల్సిందీ రైతేననని ఆయనకి తెలీదా ? అదో ఎస్కేపిస్టు సిద్ధాంతం
నాకు పదహారేళ్ళొచ్చేదాకా ఒకటే లేమి . ఒక్కపూట తినే అన్నానికోసం పిల్లలం కొట్లాడుకుపోయేవాళ్లం . మాకు సర్ది చెప్పలేక అమ్మ నెత్తిబాదుకుని ఏడ్చేది . పీడకలలాంటి రోజులు .
నా పదహారేయేట నన్ను చూసుకోవడానికి పెళ్లివారొచ్చారు . అసలలాంటి విషయమే ఇంట్లో అనుకోలేదు . ఇంత హఠాత్తుగా ఏం పెట్టి చేస్తాడు నాన్న ? అంతా అగమ్యగోచరంగా అనిపించినా పెళ్లిచూపులకి కూర్చున్నాను . వరుడి తల్లితండ్రులు , మరో ఇద్దరు పెద్దలు వచ్చారు. అతను రాలేదు .
” అమ్మాయి నచ్చింది . ముహూర్తాలు పెట్టుకుందాం ” అంది నాక్కాబోయే అత్తగారు . జానెడు వెడల్పు అంచున్న పట్టుచీర , గొలుసు, గాజులు పెట్టారు . బాగా వున్న వాళ్లే సంతోషంగా అనుకున్నాను . ఆ క్షణాన్న నా మదిలో మెదిలిన ఆలోచన నా జానెడు పొట్ట గురించి, పెళ్లికొడుకు గురించి కాదు .
మర్నాడు రాత్రికే పెళ్లి. అమ్మ ఓవైపు కళ్లు తుడుచుకుంటూనే మరోవైపు పెళ్లి ఏర్పాట్లు చేస్తోంది . పెద్ద ఆర్భాటమేం లేదు . క్లుప్తంగా గుళ్ళో పెళ్లి. ముహూర్తం వేళకి పెళ్లికొడుకుని తీసుకొచ్చి పక్కన కూర్చోబెట్టారు . అస్థిపంజరంలా వున్నాడతను . అతన్ని చూడగానే నా పెళ్లి వుత్సాహం చచ్చిపోయింది . ఇతనా, నా భర్త? అప్రసన్నంగా అనుకున్నాను.
పెళ్లితంతు ముగిసింది . పాలగ్లాసుతో అతని గదిలోకి అడుగు పెట్టాను .
” రా ” పిలిచాడు . అదే మొదటిసారి అతని గొంతునంత స్పష్టంగా వినడం , వెళ్లి మంచం అంచున కూర్చున్నాను .
” చాలా చిన్న పిల్లవి . నీతో ఎన్నో చెప్పాలని వున్నా ఎలా చెప్పాలో ఏం చెప్పవచ్చో తెలీడం లేదు ” నిస్సహాయంగా అన్నాడు . అతని మాటలారోజున అర్థం కాలేదుగాని క్రమక్రమంగా అన్ని తెలిసాయి . వట్టిమాటలు కావవి . భయంకరమైన నిజాలు . అవి విన్నాక నా పుట్టుక మీదే నాకు విరక్తి కలిగింది .
అతనికి కేన్సరట . ఇంకెంతోకాలం బతకడట. ఆర్నెల్లో ఏడాదో అంతే బతుకుతాడు. నిజాన్ని మొదట్లో హరాయించుకోలేకపోయినా క్రమేపీ గరళాన్ని మింగినట్టు మింగింది మా అత్తగారు . చెట్టంత కొడుకు చచ్చిపోతున్నాడన్న దుఃఖం ఒకవేపు వూపేస్తుంటే ఆ కొడుక్కి ఒక్క నలుసు కలిగితే అతని జ్ఞాపకంగా వంశవృద్ధి జరుగుతుందన్న స్వార్థచింతన ఆవహించింది . మా వాళ్లకి ఇరవై వేలు ఎదురిచ్చి నన్ను చేసుకున్నారు .
ఇవన్నీ చెప్పు అతను ” ఇలాంటి పరిస్థితుల్లో పిల్లలు పుట్టరని ఎవరెంత చెప్పినా మా అమ్మ వినలేదు. ప్రయత్నం చేస్తే తప్పేమిటంది. మా అమ్మలో కొంత స్వార్థం వున్న మాట నిజమేగాని చాలా మంచిది . నా తర్వాత నీకెలాంటి అన్యాయం జరగదు” అన్నాడు .
నేను విరాగిలా నవ్వాను . పదహారేళ్ళ పసిప్రాయాన యింత చేదు అనుభవాలు ! ఇతన్ని చేసుకోకపోతే నా జీవితం ఇంతకన్నా గొప్పగా వుంటుందని నేను అనుకోను . అందుకే రాజీపడిపోయాను . ఇంకో సంగతి . నా నిమిత్తమై ఇచ్చిన డబ్బుతో అన్నయ్య చిన్న దుకాణం పెట్టుకున్నాడు . వాడి జీవితం ఓదార్లో పడింది . వాడి ద్వారా మావాళ్ల దరిద్రం కొంతవరకూ తీరినట్టే . అతను నన్ను గురించి చాలా బాధపడే వాడు .
” ఎందుకేనా పనికొస్తాయి . నీవే దాచుకో అని చెప్తూ తన వంటి మీదున్న గొలుసు , చేతికున్న వజ్రపుటుంగరం నాకే ఇచ్చేశాడు . ఒక్కోరోజు మధ్యరాత్రి మెలకువ వచ్చి చూస్తే అతను మంచం మధ్యగా మఠం వేసుకుని కూర్చుని తదేకంగా నా మొహంలోకి చూస్తుండేవాడు .  అతని కళ్లనిండా నీళ్లు.
“నాకు చచ్చిపోవాలని లేదు. బతకాలని వుంది” అని ఏడ్చేవాడు. నాకూ ఏడుపొచ్చేది .
” అమ్మగురిమ్చే ఆలోచించానుగానీ తప్పుచేస్తున్నానని అనుకోలేదు. స్వార్థంతో నా కళ్లు మూసుకుపోయాయి . నీలాంటి అమాయకురాలి జీవితం నాశనం చేశాను ” తరుచుగా అనేవాడు .
అతనితో యిదమిద్దమని తెలీని ఆత్మీయత పెరిగిపోయింది . అతనికి సేవ చెయ్యడంలో ఒక రకమైన సంతృప్తి లభించేది . అతనికి తరుచుగా జ్వరం వచ్చేది . నొప్పితో విలవిల్లాడిపోయేవాడు .
” ఏ జన్మలోనో చేసిన పాపానికి యిప్పుడనుభవిస్తున్నాను . మళ్లీ ఈ జన్మలో పాపం మూటకట్టుకుంటున్నాను , వచ్చే జన్మలో అనుభవించడానికి . ఆ రోజున నా కళ్లకి మా అమ్మ దు:ఖమొకటే ఆనింది. ఒక ఆడపిల్లకి ద్రోహం చేస్తున్నానుకోలేదు ” అని బాధపడేవాడు . కేన్సరు బాధన్నా నా గురించిన బాధ అతనికెక్కువైపోయింది .తరుచు వేదాంతాన్ని గురించి చెప్పేవాడు . చావుపుట్టుకల గురించి , పాపపుణ్యాల గురించి మాట్లాడేవాడు . తన లైబ్రరీ అంతా చూపించి-
” ఏదో ఒక రోజున ఈ పుస్తకాలన్నీ చదివి నువ్వు నన్నర్ధం చేసుకోవాలి ” అనేవాడు .
అనుకున్నట్టుగానే మా పెళ్ళైన తొమ్మిదినెలల పన్నెండురోజులకి అతను మరణించాడు . అంతకుముందు పదిహేనురోజులు ఇంటెన్సివ్‍కేర్లో పెట్టారు . అతను చనిపోతున్నాడంటే నాకెంతో బాధ కలిగింది .
” చాలా నుంచివాడు ” పదేపదే అనుకున్నాను . హాస్పిటల్లో వున్నన్నాళ్లూ అతని పనులన్నీ అత్తగారే చూసుకునేది . నన్ను దగ్గరకే రానిచ్చేది కాదు . నా అంతట నేను వెళ్లబోయినా ” వాడి పేర ఆస్తేంలేదే నంగనాచీ ” అందొకసారి .
నా గుండెలు బద్దలైన భావన ! అతన్ని నేనెందుకు పెళ్లి చేసుకున్నాను! అతన్తో ఈ తొమ్మిది నెలలూ ఎందుకు ఒక గదిలో వున్నాను ?అతని వెనకాల డబ్బుకి ఆశించేనా ? నిశ్శబ్దంగా ఏడ్చాను .
అసలే నా జీవితం మిణుకుమిణుకుమంటున్న దీపం . అతని మరణం తర్వాత కొడిగట్టిపోయింది .
నేనెవర్ని ? ఈ ఇంటితో నాకున్న సంబంధమేమిటి ? అతని వల్ల పడ్డ ముడి అతన్తోటే తెగిపోయిందా ? ఈ ప్రశ్నల్ని పదే పదే వేసుకునేదాన్ని. నన్ను పుట్టింటికి తీసికెళ్తామని మావాళ్లు అనలేదు . వీళ్లు పంపించలేదు . నాకో కొడుకో కూతురో పుట్టలేదని మా అత్తగారికి చాలా కినుకుగా వుండేది . నన్ను అదే విషయాన్ని గురించి పదేపదే సాధించేది . కొందరు మనుషులు మూర్ఖత్వానికి పరాకాష్ఠలా వుంటారు. వాళ్ళలో ఈవిడని చెప్పుకోవచ్చు.
అలానే రోజులు దొర్లిపోతున్నాయి . జరిగిన అన్యాయమేమిటో పూర్తిగా ఆకళింపు చేసుకునే వయసొచ్చింది నాకు . కానీ ఆసరికే నాలో పొరుషం పూర్తిగా చచ్చిపోయింది . ఎవరేమన్నా నిర్లిప్తంగా సర్దుకుపోవడానికి అలవాటు పడ్డాను . మృత్యుముఖానికి ఏడాది దగ్గరయాను .కాత్యాయని వివాహం జరిగింది . ఆర్భాటంగా చేశారు . నా స్థానం వంట దగ్గిర. పందిట్లో అడుగుకూడా పెట్టనివ్వలేదు . దొంగచాటుగా పెళ్లి చూశాను . వధూవరులని చూస్తుంటే నేనేం పొగొట్టుకున్నావో అర్థమైంది . చనిపోయిన అతను పదేపదే గుర్తొచ్చాడు . అతన్తో నా జీవితం ఎందుకిలా ముడిపడింది ? ఈ బ్రహ్మముడి ఎలా వదులౌతుంది ?
” మరీ లేనివాళ్లు , ఆడపిల్లకి కన్నెచెర విడిపించమని మరీమరీ ప్రాధేయపడితే సరేసన్నాను . నా కొడుకే ఐనాసరే, అల్పాయుష్కుడికిచ్చి ఓ ఆడపిల్లగొంతు కోసేంత రాక్షసిని కాదమ్మా నేను ” వచ్చినవాళ్లకి అత్తగారు చెప్పింది .
చాలా ముఖ్యమైన వాళ్లు నన్నొచ్చి చూశారు . కాత్యాయని అత్తవారింటికి వెళ్లిపోయింది . అసలే ఆమెకి మొదట్నుంచి నా పొడగిట్టదు . నేనంటే చులకనభావం . పెళ్లయ్యాక మరీను . ఆమె భర్త గోకుల్‍కీ అంతే ! డబ్బు మనుషులు ! డబ్బు ఎర పెట్టి ఎన్నేనా కొంటారు . కొన్నవాటిని నెత్తికెక్కించుకుంటారు . కానీ లేమి కారణాన అమ్ముడుపోయిన నేనంటే మాత్రం తేలికభావం . మళ్లీ ఇక్కడొక విచిత్రం . ఇరవైవేలిచ్చి నన్ను తెచ్చుకున్నట్టే యాభై వేలిచ్చి అతన్ని తెచ్చుకున్నామని అనుకోరు !
కాత్యాయని పురిటికొచ్చింది . తెల్లగా పొడుగ్గా వుంటుందేమో కాస్త ఒళ్లు చేసి ఇంకొంచెం రంగొచ్చి కళ్లు తిప్పుకోలేనంత అందంగా తయారైంది. మొహంలో వుట్టిపడుతున్న మాతృత్వపు భావన . రోజుకి పాతికసార్లు దిష్టితీ సేది మా అత్తగారు .
” దిష్టి కళ్లు… వెధవ దిష్టి కళ్లు ” అని రుసరులాడేది తనకి కాస్తంత నలతచేస్తే. నాకు నవ్వొచ్చేది . బాధపడం మర్చిపోయాను .
వారానికోసారి గోకుల్ వచ్చి వెళ్లేవాడు . అతనెప్పుడూ నాతో మాట్లాడలేదు .
ఒకసారి తనతో ఓ అమెరికన్ ఫ్రెండుని తీసుకొచ్చాడు .
” ఇతను విన్యెట్ . కాలిఫోర్నియాలో వున్నప్పుడు స్నేహం. ఇండియా చూడాలని వచ్చాడు . అవంతీపురం కోట అవీ చూస్తాడట. మనింట్లో మూడు రోజులుంటాడు ” అని అతని గురించి చెప్పాడు . ప్రత్యేకించి నన్నెవరూ అతనికి పరిచయం చెయ్యలేదు . అంచేత నేనే నర్వెంటునో అనుకున్నాడతను .
అతని దృష్టిని నేను విపరీతంగా ఆకర్షించాను . నాలో ఏముందని ? కళాహమైన మొహమూ , శుష్కించిపోయిన దేహమూ తప్ప . విద్రాణమైన నా మనసు చాలా విచిత్రంగా అతనిపట్ల జాగృతమైంది . ప్రేమ తత్వమంటే ఇదే కాబోలు . అతను కల్పించుకుని నాతో మాట్లాడే వాడు . అతనికి తెలుగు రాదు . నాది వానాకాలం చదువు . ఒక్క ముక్క కూడా అర్ధమయ్యేదికాదు . ఏం చెప్పినా నవ్వేసేదాన్ని . నా చుట్టూ వున్న ముళ్లపొదలాంటి ప్రపంచాన్ని నేను తాత్కాలికంగా మర్చిపోయాను . వాళ్లంతా నా ప్రతి చేష్ఠనీ సునిశితంగా గమనిస్తారని నేను గ్రహించలేదు . నాకు ప్రపంచమంతా అతనేగా కనిపిస్తున్నాడు .
” ఏవిటమ్మా ఈ రేవతి ? ఆ విన్యెట్‍గారి చుట్టూ తిరుగుతుంది ? మా పరుపుపోతోంది . మన ఇండియన్ లేడీస్ గురించి వాళ్లక్కడెంత గొప్పగా పూహించుకుంటారో తెలుసా ? దీని ప్రవర్తనతో తలకొట్టేసినట్టౌతోంది . మీ అల్లుడు కూడా చిరాకుపడుతున్నారు ” కాత్యాయని చాటుగా తల్లితో అంది . ఆ మాటలు నేను విన్నాను . ఎక్కడో వూహాలోకంలోంచి పాతాళంలోకి వచ్చిపడ్డాను .
సాయంత్రం మరింత గొడవైంది . విన్యెట్ నన్ను వివాహం చేసుకుంటాని గోకుల్తో చెప్పాడట . మిత్రులిద్దరూ ఏమనుకున్నారో ఏమో నాకు తెలీదు . నేను వంటింట్లో పనిచేసుకుంటూ వంటరిగా వున్నప్పుడు గోకుల్ నా దగ్గరగా వచ్చి నిలబడ్డాడు . అతని ముఖం ఎర్రగా కందింది . ” నువ్వు ఈ ఇంట్లో పనిమనిషినని చెప్పుకున్నావా ? ” అడిగాడు . పిడుగులు వర్షించినట్టే వుందతని గొంతు . తలడ్డంగా వూపాను .
” మరి విన్యెట్ అలా ఎందుకనుకున్నాడు ? “
దానికి నేనే జవాబివ్వాలా ? తెల్లమొహం వేశాను .
” చూడు ఈ ఇంట్లోవాళ్ల మనసులు నొప్పించే అధికారం నీకు లేదు. నీ పుట్టింటి సాంప్రదాయం ఎలాంటిదో నాకు తెలీదు . లేకీబుద్ధులేమో ! మార్చుకో . ఈ ఇంటి కోడలివి నువ్వు. కాత్యా అన్నగారిని తెలిసి , ఇష్టమయ్యీ చేసుకున్నావు. ఆ తరువాతి బతుకేమిటనేది అప్పుడే ఆలోచించుకోవలసింది. అయినా ఎంత పుణ్యమో చేసుకుంటే తప్పించి గొప్పయింట్లో పడవు. ఇలాంటిచోట సాంప్రదాయాన్నీ గౌరవన్నీ మంటగలిపే పనులు చెయ్యకు. పరాయి ఆడపిల్లవి కాబట్తి నీకింత విపులంగా చెప్తున్నాను. అదే నా స్వంత చెల్లెలైతే వుప్పుపాతర వేసేవాడిని” ఈ మాటలనేసి అతను విసురుగా వెళ్ళిపోయాడు. నాకందులో ఒక్క పలుకుకూడా అర్థం కాలేదు . అయితే వీళ్ళు చాలా గొప్పవారని అతను చెప్పినట్టు మాత్రం గ్రహించాను. కాబట్టే చావబోతున్న కొడుక్కు పెళ్లి చేసి నామీద యిరవైవేలు బలాదూరన్నారు .
విన్యెట్ వెళ్లిపోయాడు. రాబోతున్న వసంతాన్ని తిరిగి గ్రీష్మతాపానికి బలిచేసి అతను వెళ్ళిపోయాడు.
వెళ్తూ అతను గోకుల్‍తో అన్నాట్ట.
“ఆమె ఈ ఇంటి కోడలని నేననుకోలేదు . వంటమనిషో పనిమనిషో అనుకున్నాను . అందుకే అంత స్వతంత్రంగా ప్రపోజ్ చేసాను. మరోలా అనుకోవద్దు” అని క్షమించమని పదేపదే అడిగాడట. కాత్యాయని వాళ్లమ్మతో చెప్తుంటే నేను విన్నాను.
ఆరాత్రి నేను ఇంట్లోంచీ పారిపోవాలని నిర్ణయించుకున్నాను . ఇంట్లో అందరూ నిద్రపోతున్నారు . అర్ధరాతైంది . నెమ్మదిగా గదితలుపు తీసుకుని హాల్లోకొచ్చాను . అక్కడ ఈజీచెయిర్లో కూర్చుని వున్నారు మామగారు . స్థాణువులా నిలబడిపోయాను . అడుగు ముందుకు పడలేదు . నేనిలా చేస్తానని ఆయన ముందే వూహించారా ఇంకేం గొడవ జరుగుతుందోనని నాకు కాళ్లలోంచీ వణుకొచ్చింది . నిలబడలేక అక్కడే కూలబడిపోయాను .
“ఏమ్మా, ఈ బంగారుపంజరంలోంచి పారిపోదామనుకున్నావా?” చాలా దయగా వుంది ఆయన గొంతు. ఎంతో వాత్సల్యం పుట్టినడుతోంది. “ఎక్కడికెళ్దామని ? మీ పుట్టింటికా? నోరు తెరచి ఒక్కమాట అంటే గౌరవంగా పంపించేవాళ్లంగా?”
నేను పుట్టింటికి వెళ్లడం లేదని ఆయనకెలా చెప్పను ? ఆ దరిద్రం, ఆ లేమి , పుట్టుకలు, చావులు… వాటిని సహించే ఓరిమి నాలో లేదు . మరైతే ఎక్కడికి నా ప్రయాణం? ఎక్కడకని చెప్పను?
” నీ వాటా నీకు రాసిచ్చేస్తాను . అది పెట్టుకుని మీవాళ్ళ దగ్గరుంటావా ?” ఒక్కక్షణం ఆయనేం చెప్తున్నారో నాకర్ధం కాలేదు . గ్రహించాక నిర్వేదంగా నవ్వుకున్నాను . నా పుట్టింట్లో లేమి , రోగాలురొస్టులు అంతా కలిపితే ఒక మహాసముద్రం . అందులో వీళ్లిచ్చేది ఒక బిందువు. వాళ్లు పస్తులుంటే నా ఒక్క కడుపు నేను నింపుకునేంత కలేజా నాకు లేదు . మరేం చెయ్యను ? నా సమస్యకి పరిష్కారమేమిటి ?
” జరిగిన పాపంలో నాకు వంతుంది . చచ్చిపోయిన కొడుకు గురించి కన్నా కళ్ళెదుట తిరుగుతున్న నీ గురించి నాకెక్కువ బాధగా వుందంటే నువ్వు నమ్ముతావా ? సాయంత్రం గొడవ జరిగినందుకేనా మన్విలాంటి పనిచెయ్యబోయినది ? కానీ ఒకటి చెప్పు మీ ఇంట్లో ఆడపిల్లలకి మారు మనువులున్నాయా ? మీ ఇంట్లోనేకాదు, ఎక్కడా లేవు . మన సాంప్రదాయం వప్పుకోదు . ఇలా అర్ధరాత్రి గడపదాటిన ఆడపిల్లలకి లోకం స్థానం ఎక్కడిస్తుందో తెలుసా ? సంసారుల ఇళ్లల్లోకాదు . మనం నోటితో కూడా చెప్పుకోలేని మరోచోట.”
“నీకిప్పుడేం వయసు మించిపోయిందని ? ఇంకో ఐదారేళ్లు గడిస్తే ప్రపంచంగురించి నీకే అర్ధమవుతుంది . అప్పుడు నిర్ణయించుకుందువుగాని. ఈలోగా చదువుకో ! నీకో ప్రపంచాన్ని సృష్టించుకో . మీ ఆయన కొన్న పుస్తకాలు చాలా వున్నాయి . అవన్నీ చదువు . నన్ను నీ కన్నతండ్రిలా భావించు . నీకెలాంటి అన్యాయం జరగనివ్వను . మీ అత్తగారిని సవిత్తల్లనుకో . అదో మాటన్నా పడి వూరుకో . అన్ని సమస్యలకీ కాలమే పరిష్కారం చూపిస్తుంది .”
ఆయన తన ప్రేమతో నన్ను జయించారు . నా జీవితానికి కొత్త ద్వారాలు తెరిచారు . నిశ్శబ్దంగా వెనుతిరిగాను . కాత్యాయనికి మగపిల్లాడు పుట్టాడు . పిల్లాడికి నెల నిండాక తీసుకొచ్చి వాణ్ణి నా వళ్ళో వేసింది .
” మా అన్నయ్య పోయిన దుఃఖంలో నీపట్ల కొంత వివక్షతతో ప్రవర్తించాం . మరోలా అనుకోకొదినా ! నువ్వు మాలో ఒక దానివేగానీ పరాయిదానిని కాదు . ఈ మాట నీచేత నమ్మించడం కష్టమని నాకు తెలుసు . అందుకే నా కడుపుతీపిని కూడా చంపుకుని వీడిని నీవళ్ళో వేస్తున్నాను . ఇహనుంచీ వీడికి తల్లివైనా తండ్రివైనా నువ్వే . నీ కొడుకే అనుకో ” అంది
” అదేమిటి కాత్యాయనీ ? ” తెల్లబోయాను .
” నీకూ జీవితంలో ఓ ఆలంబన కావాలి ” అంది అత్తగారు . శాస్త్రోక్తంగా దత్తత స్వీకారం చేయించినప్పుడుగానీ తెలీలేదు వాళ్ల మనసుల్లో వున్న ఆలోచనేమిటో . ఈ ఇంట్లోనూ , ఆస్తిలోనూ నాకు వాటా వుంది . ఏ క్షణాన మా అత్తాకోడళ్ళలకి పడకపోయినా నా వాటా నేను తీసుకుని వెళ్లిపోవచ్చు . ఇదంతా మా మామగారి పిత్రార్జితం . నేనలా చెయ్యకుండా ఇది ముందరికాళ్లకి బంధం . నీకో దారి చూపిస్తానన్నాను , చూపించానా లేదా అన్నట్టు గర్వంగా చూశారు మామగారు .ఇలాంటి నేపథ్యంలో నా వళ్ళో పడ్డ బాబీ మీద నాకెలాంటి ప్రేమా జనించలేదు . వాడినో దాదిలా పాలించానే తప్ప తల్లినెప్పుడూ కాలేదు . జెన్నీని చూసినప్పుడుగానీ నాలోని మాతృత్వపు వాంఛ ప్రకోపించలేదు . ఏమిటో ఈ సృష్టి వైచిత్రి !
తెల్లవారింది . రాత్రి నాలోవున్న పుద్వేగం చాలా వరకూ చల్లారింది . ఇంతదాకా నేను చేసిన ఆలోచనలకి నవ్వొచ్చింది . ఎంత పిచ్చిదాన్ని నేను . ఈ పిల్లతో నాకున్న సంబంధమేమిటి ? నా రక్తం పంచుకోలేదు . నా కడుపున పుట్టలేదు . విన్యెట్‍కి నేనికంకా గుర్తున్నానా ? అతను అమెరికన్. పక్కా మెటీరియలిస్టు . పైగా మగవాడు . నాలాగా ఈ సెంటిమెంట్సు పట్టుకుని వేళ్లాడడు . తన జీవిత గమ్యమేమిటో అతనికి తెలుసు . మొదట్లో నన్నిష్టపడ్డా అది విఫలమయ్యాక నన్ను మర్చిపోయి మరో స్త్రీని వివాహం చేసుకున్నాడు . అది రుచించక విడాకులు తీసుకున్నాడు . ఇంకో పెళ్లికూడా చేసుకునే వుంటాడు . వాళ్ల సంస్కృతీవీచికల్లో కొట్టుకుపోతున్న ఈ గడ్డిపరక కాసేపు వచ్చి నావొళ్ళో పడింది . మళ్లీ ఈ ప్రభంజనంలో ఇంకెటు పోతుందో ? నాకేమిటీ వెర్రి మమకారం ? ఈ కొత్తరకం ఆలోచనలతో నా మనసంతా కలతబారింది . అతనుగానీ ఈ జెన్నీగానీ నాకేమీ కాదనుకుంటే అసలీ ప్రపంచమే మిథ్యాపూరితంగా అనిపిస్తోంది . గుండెనెక్కడో నొక్కి పట్టినట్టు కళ్లల్లోంచి చివ్వున వీళ్లు చిమ్ముతున్నాయి . భగవంతుడా ! చచ్చేదాకా ఇలా ఏడుస్తూ గడపాల్సిందేనా ? ఎందుకింత నికృష్టంగా పుట్టించావయ్యా నన్ను ?
ఓ చేత్తో కళ్ళు తుడుచుకుంటూనే పనులు చేస్తున్నాను . వంట పూర్తిచేసి , భోజనాలు పెట్టి జెన్నీని వాళ్లింటికి పంపించే వుద్దేశంలో వున్నాను . వాళ్లిద్దరూ బాబీ రూమ్‍లో వున్నారు . అత్తగారు చాలా కోపంగా వుంది . మామగారు చాలా వుదాశీనంగా వున్నారు . నేను చేస్తున్నది వాళ్లకిష్టంలేని పనేనని నాకు తెలుసు . కానీ ఇంటికొచ్చిన పిల్లని పొమ్మని ఎలా చెప్పేది ? అదీగాక పసిపిల్లమీద ఈ అకారణ ద్వేషం దేనికి? తనెవరో వీళ్ళకి తెలుసా?
కాఫీ చేసి రెండు కప్పులు ట్రేలో పెట్టుకుని వాళ్ల దగ్గరకెళ్లాను .
” అమ్మాయికీ అల్లుడికీ ఫోను చేశాను . వాళ్ల పిల్లాణ్ణి తీసికెళ్లిపొమ్మని. మామీద నీకెంత కోపం వున్నా వాడినో పావుగా వాడుకుని మమ్మల్ని సాధిస్తానంటే వూరుకునేది లేదు ” అత్తగారు ఆవేశంగా అంది .
” మంచిది “
” ఆస్తీ అదీ వాడి పేరుమీదికి ట్రాన్స్‌ఫర్ చేస్తే మంచిది . ప్లీడరుకి కబురు పెడతారు మీ మామగారు . “
” నేనింకా బతికే వున్నాను . అడుక్కుతిననా? “
“మేం బతికుండగా నీకాగతి పట్టదు ” “
“మీరు పోయాక అడుక్కుతిననా ? ” చాలా కూల్‌గా అడిగాను . నా గొంతులో దుఃఖం వుండచుట్టుకు పోయింది . ఏం కాని పని జరిగిందని ఈ రాద్ధాంతమంతా ? ఒక పిల్లని , నాకిష్టమైన వ్యక్తి కూతుర్ని దగ్గిరకి తియ్యటం అంత నేరమా ?
మాటలింకా పెరిగేవే ! వాకిట్లో గోకుల్ వాళ్ల కారాగింది . అట్నించి బైక్ కూడా వచ్చి ఆగింది . నేను వీధి గుమ్మంలో కెళ్లాను . కార్లోంచి ముందు కాత్యాయనీ తర్వాత గోకుల్ దిగారు . బైక్ విన్యెట్‍ది .
” హలో ” గోకుల్ , విన్యెట్ పరస్పరం షేక్‍హేండిచ్చుకున్నారు .
నా గుండెలు దడదడలాడుతున్నాయి . లోపలికి తప్పుకున్నాను . నా దృక్కోణంలో వివ్యెట్ తప్ప ఇంకెవరూ లేదురు . పదిహేనేళ్లలో ఎంత మార్పొచ్చింది . మనిషి బాగా లావయ్యాడు . ఆరోగ్యంగా కూడా లేడు . అతను నన్ను గుర్తిస్తాడా ? పలకరించాలనున్నా ఆ పని చెయ్యడానికి బెరుగ్గా అనిపించి గోడకంటుకుపోయి అలాగే నిల్చున్నాను . అతను నాలుగు వేపులా వెతుకుతున్నాడు చూపుల్తో , జెన్నీ కోసం కాబోలు .
” జెన్నీ ” మెల్లగా పిలిచాను . నా గొంతు నాకే కీచుగా వినిపించింది . ” ఇక్కడే వున్నాను ” నా వెనకనుంచి జెన్నీ గొంతు గుసగుసగా వినిపించింది . నా పమిట చెంగుచాటుని దాక్కుంది . ఇప్పుడీ పిల్లని నేను డిఫెండు చెయ్యాలి కాబోలు . ఇదెక్కడి చుట్టరికం ! నవ్వొచ్చింది .
విన్యెట్ దృష్టి నామీద నిలిచింది . విభ్రాంతితో అతని కళ్లు పెద్దవయ్యాయి . ” ఓహ్ ! రేవతీ ! హౌ ఆర్యూ బేబీ ! ” అతని గొంతులో అనురాగం , కళ్లలో తడి , పిలుపులో ఆర్తి , నన్నింక నేను నిభాయించుకోలేకపోయాను .
” బావున్నారా ? ” రుద్ధ స్వరంతో అడుగుతూ జెన్నీని ముందుకితోసాను . “ “ఇదిగో మీ కూతురు . పసిపిల్లలముందు నిన్నటి మీప్రవర్తన …. ” దుఃఖంతో మాటలు పెకిలిరాలేదు .
” సారీ ! జెన్నీ డియర్ ! ” అతను కూతుర్ని దగ్గిరకి తీసుకున్నాడు . నన్నుకూడా ఒక్కసారి అలాగే దగ్గరకి హత్తుకుంటే బావుణ్ణు! గుండెల్లో పేరుకుపోయిన భారాన్నంతా దిగేలా ఏడ్చి అతని చేతుల్లో ప్రాణాలొదిలేస్తే … వదిలేస్తే ఆత్మన్యూనత , పరాధీనత వుండవు . ఏ గమ్యమూ లేకుండా ఎడారిలో ప్రయాణంలాంటి బతుకుండదు . ఎడతెరిపి లేకుండా కళ్లలోంచి గుండెల్లోకి జారిపడే అశ్రుధారలుండవు . ఎవరూ లేని ఏకాకిలా బతుకుతూనే అందరూ వున్నారనుకునే ఆత్మవంచన వుండదు . ఏమిలేని నాకు అక్కర్లేని, తెచ్చిపెట్టుకున్నవెన్నో వుండవు … ఇప్పుడూ కన్నీళ్ళొచ్చాయి . ఎప్పట్లానే వాటిని దిగమించాను .
” కూర్చోండి ” సాఫా చూపిస్తూ అన్నాను .
” ఇంగ్లీషు నేర్చుకున్నావా ? ” ఆర్ద్రంగా , రిలీఫ్‍గా అడిగాడతను . ఔనన్నట్టు తలూపాను .
” నీ గదేది ? ” అడిగాడతను . ” నీతో మాట్లాడాలి “
నాకు పై ప్రాణాలు పైనే పోయాయి . ఏమిటీ మనిషి ? అత్తింటి కోడల్ని పెళ్లి చేసుకుంటాననని చెప్పి ఆనాడు అందర్లో నా పరువు తీశాడు. ఈ రోజు ఇంతమంది మధ్యనున్న నాతో మాట్లాడాలంటున్నాడు . ఇందర్లోంచి ఇతన్ని నా గదిలోకెలా ఆహ్వానించేది ? అంత పర్సనల్‍గా ఏం మాట్లాడతాడు ? అయినా అతను నాతో ఫ్రీగా మాట్లాడగలిగేంత వ్యక్తిగతమైన గదంటూ ఏదీ లేదు . నా భర్త గదినే నేను వాడుకుంటున్నాను . నాతోపాటు బాబీ వుంటాడు . కాత్యాయని వాళ్లు వచ్చినప్పుడు నేనది వాళ్లకొదిలేస్తాను . అందులోకి ఇతన్నెలా తీసికెళ్లను ?
” నీకో గదంటూ లేదా ? నీకంటూ ఓ మనసూ , అభిరుచిలేవా ? అసలు నీకంటూ జీవితం వుందా ? ” అతను ఆవేశంతో దాదాపు అరిచినట్టే అడిగాడు . అదిరిపోయాను . ఆ వ్యక్తి నాకు అపరిచితుడిలా అనిపించడం లేదు . వూహల్లోని సన్నిహితత్వం చేతననుకుంటాను . ఎంతో దగ్గిరవాడిలా తోస్తున్నాడు . అలా నా మీద కోపం తెచ్చుకోవడంలో ఎంతమాత్రం వింత అనిపించలేదు . అసలు నా దయనీయమైన పరిస్థితికి నామీద నాకే కోపం వచ్చింది . నన్ను చూడ్డానికొచ్చి నాతో మాట్లాడాలనుకుంటున్న ఏకైక అతిథి .. అతన్ని కూర్చోబెట్టడానికి నాదైన స్థానం , అతని ముందు వ్యక్తపరచడానికి నాదైన అభిరుచి , అతనెంత అభిలషించినా అతనితో పంచుకోవడానికి నాదైన జీవితం …. ఏమీ లేని నిరుపేదని .
” ఓకే ! మన ప్రేమ సంభాషణని ఈ గదిలోనే అందరి మధ్యనే మొదలుపెడదాం . వినటానికి వీళ్లలేని అభ్యంతరం మనకి మాత్రం ఎందుకు? పదిహేనేళ్ల క్రితం నీకో ఉత్తరం రాశాను . నువ్వు దాన్ని చదివావా ? ఇప్పటికీ నా ప్రతిపాదన అలానే వుంది. నా ప్రేమకూడా అలానే వుంది. నాతో వచ్చేస్తావా ? ” అని సూటిగా అడుగుతూ వుత్తరాన్ని నాకిచ్చాడు .
నేనా ఉత్తరాన్ని చదవడానికి వుద్యుక్తురాలినౌతుంటే గోకుల్ మాటలు వినిపించాయి .
” వినీ ! దిసీ టూమచ్ “
“ఏది టూ మచ్ ? ఆమెకి నేను రాసిన పుత్తరాన్ని మరెవరో సీజ్ చెయ్యటమా ? “
” చూడు బాబూ ! ఆమె తండ్రిలాంటివాడిని . తల్లిదండ్రులు మమ్మల్ని నమ్మి మా యింతికి పంపారు. ఆమె మంచిచెడులు చూడాల్సిన బాధ్యత వాది . నువ్వేదో బొంబాయి లేచొచ్చెయ్యమని పుత్తరం రాస్తే దాన్ని వయసులో వున్న పిల్ల చేతిలో పెట్టి చెడిపొమ్మని ఎలా చెప్తాను ? ” నేనింకా చదవని ఉత్తరం గురించి మామగారు సంజాయిషీ ఇస్తున్నారు . విడీవిడని పొగమంచులా విషయం అస్పష్టంగా అర్థమైంది.
“నేనామెని పెళ్లి చేసుకుంటానని మీ ఎదురుగానే ప్రపోజ్ చేశాను . అప్పుడు మీరేం చెప్పారు ? మీ ఇళ్లలో విడోస్ ఇలాంటివి వప్పుకోరని చెప్పారు . అది అబద్ధమని నాకు తెలుసు . కాని అప్పుడామె మైనరు . నేనేం చేసినా తప్పువుతుంది . అందుకే తలొంచుకుని వెళ్ళిపోయాను . వచ్చేస్తున్నప్పుడు ఆమె చూసిన చూపు నేను మర్చిపోలేకపోయాను . అందుకే ఆ లెటర్ రాశాను . జవాబు రాలేదు . ఆమెని నేను తప్పుగా అర్ధం చేసుకున్నానేమో , మీరు చెప్పిందే నిజమనుకున్నాను . బట్… తనంటే ఇప్పటికీ నాకు యిష్టమే “
“వాటీజ్ దిస్ వాన్సెస్ ఐసే వినీ ? మా ఇళ్లల్లో ఇలాంటివి జరగవు . పెద్దవాళ్లప్పుకోరు . “
” నాన్సెన్స్ మాట్లాడకు గోకుల్ ! మీ ఇళ్లల్లో ఎన్వీ తినరు . నువ్వు తింటావు . మీ ఇళ్లలో తాగరు . నువ్వు తాగుతావు . మీరు మోరల్స్‌కి చాలా విలువిస్తారు . కానీ నువ్వు ఫ్లర్ట్ చేస్తావు. ఇవన్నీ మీ పెద్దవాళ్లప్పుకున్నవేనా ? అవన్నీ ఒప్పుకున్నప్పుడు ఇదెందుకొప్పుకోరు ? “
“వినీ! నువ్వు లిమిట్స్ దాటుతున్నావు”
“తప్పలేదు . ఆమె విషయంలో నువ్వెందుకు కలగజేసుకుంటున్నావు? నీకేం హక్కుంది? భార్యాపిల్లలతో సుఖంగా బతుకుతున్న మీకెవ్వరికీ ఆమెగురించి మాట్లాడే హక్కు లేదు. ఆమెనే చెప్పనీ ” అని విన్యేట్ నాకేసి తిరిగాడు జవాబు కావాలన్నట్టు.
” చెప్పవే ! ఇలాంటి ముదనష్టపు పని చెయ్యనని ” అత్తగారు కోపంగా అరిచింది . ఆవిడ నుదుటమీది నరాలు తపతప కొట్టుకోవడం ఇంత దూరంనుంచి కూడా నేను స్పష్టంగా చూశాను. కొడుకు చచ్చిపోయినప్పుడు కూడా అవడింత ఆక్రోశించలేదు . నాకేమిటో అంతా గజిబిజిగా వుంది . ఏళ్ళతరబడి చీకట్లో మగ్గుతున్నదాన్ని ఒక్కసారి వెలుగులోకొచ్చిపడితే ఎలా వుంటుంది ? చెయ్యి చాపితే అందేట్టున్న చందమామని కావాలో అక్కర్లేదో తేల్చుకోమంటే ఎవరితరం ?
ఈ వ్యవహారం ఇంత డ్రమెటిగ్గా మలుపు తిరుగుతుందని ఎవరూహించారు ? ఊహిస్తే జవాబేదో ముందే వూహించుకుని పెట్టుకునేదాన్ని . ఇప్పుడేం చెప్పను ?
“చెప్పు రేవతీ! నీకోసం పదిహేనేళ్లు అలమటించిపోయాను . మొదటిచూపులోనే గాలం వేసినట్లు నా మనసుని లాగేశావు . నువ్వు లేనిదే బతకలేననుకున్నాను . నిన్ను మర్చిపోదామని పెళ్లి చేసుకుని మరో స్త్రీని యిబ్బందిపెట్టాను. ప్లీజ్, చెప్పు. డూయూ లవ్ మీ ? “
“బాబూ ! పరువుగా బతుకుతున్నవాళ్లం . మమ్మల్ని వదిలేసి వెళ్లిపో. చిన్నవాడివైనా నీకు దణ్ణం పెడతాను ” అత్తగారు బతిమాలింది . ఉహు< అతను వింటేవా ? నావైపు సూటిగా చూస్తున్నాడు.
“చెప్పవే, దరిద్రగొట్టుమొహమా ! అసలు నీమూలాన్నే నా కొడుకు చచ్చిపోయాడు . అతన్ని వెళ్లిపొమ్మనవే! నలుగురూ వింటే ఎంత అప్రతిష్ట! అంది వుద్రేకపడిపోతూ .
” వదినా! నీకన్యాయమే జరిగింది . కాదనను . కానీ అన్నయ్య పోయాక నిన్ను కడుపులో దాచుకుని చూసుకున్నారు . ఈ వయసులో వాళ్ళని క్షోభపెట్టడం భావ్యమేనా ? మీ అమ్మానాన్నల విషయంలోనైతే నువ్వింత కఠినంగా వుండేదానివేనా ? ” జాలిగా అడిగింది కాత్యాయని . తనకి అవసరం వున్నప్పుడు తప్ప మరెప్పుడూ నేనూ తనలాంటి ఆడపిల్లనని కాదుకదా, కనీసం మనిషినని కూడా ఎరగని కాత్యాయని. అప్పటిదాకా నా మనసు ద్వైదీభావంతో వూగిసలాడింది . నా కాళ్ళు ముందుకి సాగకుండా నేనే వెసుకున్న సంకెళ్లు తెగిపడ్డాయి . నా చెయ్యి ముందుకెళ్లి వివ్యెట్ చేతినందుకోకుండా నేనే వేసుకున్న వుచ్చు తెగిపోయింది – కాత్యాయని నా తల్లిదండ్రుల ప్రసక్తి తేవడంతో . జనాంతికంగా కదిలి వెళ్లి విన్యెట్ పక్కన నిల్చున్నాను . అతను ప్రశంసగా చూశాడు .
అతను నాకు జీవితకాలపు ఆశ్రయం ఇస్తాడా? లేదా? ఇవేవీ ఆక్షణాన నాకు తోచలేదు. అపసవ్యతల చుట్టూ అస్తవ్యస్తంగా అల్లుకుపోయిన జీవితానికి వున్న ముడులు యిప్పాలంటే తెగింపు తప్పదు.
జెన్నీ కళ్ళలో సంభ్రమం. అది నాగుండెని సూటిగా తాకింది. ఈ పిల్లకి తల్లిని కాకుండా వుండలేననిపించింది. మరో ఆలోచన లేకుండా బయటికి నడిచాను. నా చేతిలోని వుత్తరం గాల్లోకి కొట్టుకుపోయింది.
“అయ్యో! ఆ వుత్తరం” అన్నాను.
“నేనున్నానుగా?” అన్నాడు విన్యెట్.