కాపాడండి . . .నన్ను కాపాడండి . . .మైత్రీపాలా! నువ్వెక్కడ?”” ఎవరో ఎవర్నో ఎక్కడో ఎప్పుడో పిలిచిన పిలుపు అతని అంతర౦గపు లోతుల్లో ప్రతిధ్వనించింది. వెంటనే అతని మనోయవనికమీద కొన్ని ఆకృతులు రూపు దిద్దుకున్నాయి. అవి ప్రాణం పోసుకుని ఒక మిథ్యాపపంచాన్ని సృష్టించాయి. కనురెప్పలు తెరిచేవరకే ఆ సృష్టి.
ఆమె ఎవరో. . .తెలియదు. పేరు పద్మమాలిక. రాజకుమార్తె.
ఎవర్ని పిలిచిందో తెలియదు. అతని పేరు మైత్రీపాలుడు.
అదంతా ఎక్కడో తెలియదు. అతనికి పూర్తిగా అపరిచితమైన పరిసరాలు.
ఎప్పుడో తెలియదు. అదొక సుదూరగతం.
బాస్ విశ్వ. . . అన్న పెద్దపెద్ద అక్షరాలు. అవి అంతరిక్షపు చీకటిలోనే ఎప్పుడూ కప్పబడి వుంటాయి. చాలా అరుదైన సందర్భాల్లోమాత్రమే కనిపిస్తాయి. ఆ వ్యోమనౌక మీద వెలుతురు పడ్డప్పుడు మాత్రమే. అంతరిక్షంలో నిరంతరం జరిగే ప్రేలుళ్ళో మరే ఇతరసంఘటనల్లోనో కాంతి జనించినప్పుడు ఆ అక్షరాలని అంతరిక్షం, అంతరిక్షాన్ని ఆ అక్షరాలు చూసుకుంటాయి.
కార్మాన్ లైన్ . . . సముద్రమట్టానికి వంద కిలోమీటర్ల ఎత్తుని అంతరిక్ష శాస్త్రవేత్తలు వూహించుకున్న క్షితిజరేఖ. అక్కడినుంచీ రోదసి మొదలౌతుందని ఒక అంతర్జాతీయ వప్పందం.
భూమ్మీది వాతావరణం ఐదు పొరలుగా విస్తరించుకుని వుంటుంది. పదహారు కిలోమీటర్ల ఎత్తుదాకా ట్రోపోస్ఫియర్. దానిపైన స్ట్రాటో, మెసో, థర్మోస్ఫియర్లు వరుసగా. 640 కిలోమీటర్లదాకా. అక్కడినుంచీ ఎక్సోస్ఫియర్ పరుచుకుని వుంటుంది. వివిధ దేశాలు పంపించిన కృత్రిమ వుపగ్రహాలన్నీఎక్సోస్పియర్లో వుంటాయి. వీటన్నిటికన్నా చాలా ఎత్తుని వుంటుంది భారత్ ఆస్ట్రనామికల్ సొసైటీ బాస్ నిర్మించిన అంతరిక్ష పరిశోధనశాల. . . ఆ వ్యోమనౌక.
ఆరునెలలకి ఇద్దరుచొప్పున శాస్త్రవేత్తలు అందులో వుండి పరిశోధనలు చేస్తారు. వాళ్ళ పరిశోధనలు ముగియకపోతే మళ్ళీమళ్ళీ వస్తారు. అలా వచ్చేవాళ్ళలో ఆమో ముఖ్యమైనవాడు. అతనిపేరు ఆనందమోహన్. అలా చెప్తే ప్రపంచవ్యాప్తంగా కూడా ఎవరికీ తెలీదు.
అంతరిక్షం అంటే ఆమో. . .ఆమో అంటే అంతరిక్షం. రెండూ పర్యాయపదాలు.
అతనిప్పుడు తన వ్యక్తిగత అవసరాలకోసం కేటాయించబడిన మూడో నెంబరు మాడ్యూల్లో నిద్రావస్థలో వున్నాడు. నిద్రలో ఒక కల. . .
ఒక వూరు. . . ఎప్పటిదో, ఎక్కడుందో తెలియదు. గడిచిన కాలంలో ఎప్పుడో ఒకప్పుడు వుండే వుంటుంది. ఉండకపోతే కలలో ఎలా కనిపిస్తుంది? కత్తులూ బల్లాలూ పట్టుకున్న మనుషులు కోలాహలంగా తిరుగుతున్నారు. వాళ్ళలో కొందరు స్థానికులు, మరికొందరు పరదేశీయులని వస్త్రధారణనిబట్టి అర్థమౌతోంది.
రాజుకూతురు చెలికత్తెలతో గుడికి వెళ్తోంది. అక్కడున్నవాళ్ళంతా గౌరవసూచకంగా పక్కలకి తప్పుకున్నారు. క్రమంగా పరిసరాలన్నీ నిర్మానుష్యంగా మారాయి. ఆమెకి కొంత దూరాన్న గుర్రం మీద రహస్యంగా అనుసరిస్తూ మైత్రీపాలుడు.
కాళికా అమ్మవారి గుడి. రాచకుటుంబీకుల ఆరాధ్యదైవం. . . కులదేవత. నాలుక జాపుకుని, జుత్తు విరబోసుకుని, పెద్దపెద్ద ఎర్రటికళ్ళతో ఒకచేత్తో త్రిశూలం మరోచేత్తో కపాలం పట్టుకుని భయంకరంగా వుంది. ఆ దేవిని కొలుస్తారు, బలులిస్తారు, తమని కాపాడమని వేడుకుంటారు. తాంత్రికపూజలు జరుపుతారు. రాజుకూతురు రావడానికి ముందే బలివ్వటం జరిగిపోయింది- చూసి ఆమె తట్టుకోలేదని.
ఆమె తన స్వంత చేతులతో ఏరి కూర్చిన పువ్వులని మాలకట్టి దేవత మెళ్లో వేసింది. త్రిశూలపు అంచుని ఇంకా గడ్డకట్టని రక్తం వుంటే దాన్ని తిలకంగా దిద్దుకుని కళ్ళు మూసుకుని ప్రార్థించింది కొంతసేపు.
గుడి ముందు నల్లరాతి తిన్నె. పూజ ముగించుకుని వచ్చి దానిమీద కూర్చుంది. ఆమె కళ్ళలో నీలినీడలు. ముఖం విషణ్ణంగా వుంది.
కళ్ళు చెరిపోయేంత అందం ఆమెది. సౌందర్యప్రపంచానికి ప్రతినిధిలా వుంది. ఆమె ముఖం నిండుగా విచ్చిన పద్మాన్ని తలపిస్తోంది. అది పద్మమైతే ఆ పద్మం మీద వాలడానికి వచ్చిన తుమ్మెదల గుంపుల్లాంటి ముంగురులు. కళ్ళు కలువరేకులు. పెదవులది ఎర్రతామరల రంగు. దేహలావణ్యం తామరతూటికి వుండే నాజూకుతనాన్ని తలపింపజేస్తోంది. తండ్రి ఆమెకి అత్యంత ప్రేమతో పద్మమాలిక అని పేరు పెట్టుకున్నాడు.
మొగిలి, సంపెంగ, మల్లె . . . తల్లో పువ్వుల సుగంధం, వంటిని కస్తూరి, పునుగు, జవ్వాది సుగంధద్రవ్యాల పరిమళాలు. రకరకాల పువ్వుల పుప్పొడి తీసుకొచ్చి రాశి పోసి ఆమెగా మలిచినంత సుగంధభరితంగా వుంది. ఆమె ధరించిన వస్త్రాలు వంటి నునుపుకి నిలవడం లేదు. జారిపోతున్నాయి. వల్లెవాటు ఎదమీద నిలవకుండా వుంది. సర్దుకోవాలన్న ధ్యాస కూడా లేకుండా శూన్యంలోకి చూస్తూ కూర్చుంది. ఉండుండి ఆమె కళ్ళు చెమర్చుతున్నాయి. చెలికత్తె ఒకతె వుండలేక దగ్గిరకి వచ్చి పయ్యద సర్దింది. ఇంకా పక్కనే నిలబడి వుంటే వెళ్ళిపొమ్మని సైగచేసింది రాకుమారి. ఒక్కర్తే విషాదాన్ని ఆస్వాదిస్తూ కూర్చుంది.
ఇంతలో దూరాన్నించీ గుర్రపుడెక్కల చప్పుడు. మొదట వారెవ్వరూ గుర్తించలేదు. ఆ శబ్దం దగ్గిరౌతుంటే అపాయాన్ని శంకించి రాకుమార్తె దగ్గిరకి పరిగెత్తుకుని వచ్చేసారు. అప్పటికే జరగకూడనిది జరిగిపోయింది. అశ్వికుడు అడ్డగించబోయిన మైత్రీపాలుని కత్తితో పొడిచి రాకుమారిని పూలచెండుని ఎత్తినంత చులాగ్గా ఎత్తి గుర్రంమీద తన ముందు కూర్చుండబెట్టుకుని వచ్చినంత వేగంగా కనుమరుగయాడు.
“కాపాడండి . . .నన్ను కాపాడండి . . .మైత్రీపాలా! నువ్వెక్కడ?”” అన్న ఆమె అరుపులు గుర్రం వేగానికి ఎవరికీ వినిపించకముందే ఆమె దూరమైంది. సుడిగాలికి గుళ్ళో దీపాల్లా నభోవీధిలోని జ్యోతిర్మండలాలన్నీ గుప్పున ఆరిపోయినట్టు చీకటి . . . చిమ్మ చీకటి.
ఆ వెంటనే కొద్దిసేపు భయంకరమైన బాధ. అది శరీరానికి సంబంధించినదా లేక మనసుకి సంబంధించినదా అనేది అర్థమవదు. అనుభూతి మాత్రం వాస్తవం.
తరుచుగా వచ్చేకలే.
హఠాత్తుగా మెలకువ వచ్చింది ఆమోకి. పక్కమీద లేచి కూర్చున్నాడు. వళ్ళంతా చెమటలు. గొంతు తడారిపోయింది. చెయ్యి జాపితే అందేంత దూరంలో వాటర్ జగ్ వుంది. కానీ చెయ్యికాదుకదా, వేలుకూడా కదపలేనంత అశక్తత.
“ఆమో! ఏమైంది?”” అతన్ని కుదుపుతూ అడిగాడు అబ్రహం. స్పేస్లాబ్లో వుండే మరో శాస్త్రవేత్త.
జగ్లోంచీ నీళ్ళు గ్లాసులో పోసి నోటికి అందించాడు. అప్పటికి ఆమో కొద్దిగా తేరుకున్నాను. థేంక్స్” గ్లాసు అందుకుని గటగట తాగేసాడు.
“ఆర్యూ ఓకే?”” అడిగాడు.
నవ్వి తలూపాడు.
“ఏమైంది?””
“ఒక కల””
“ఆమోని భయపెట్టిన కల”” నవ్వాడు అబ్రహం””మైక్రోస్కోపు అడ్జస్ట్ చేస్తూ ఎందుకో నీవైపు చూసాను. ఏదోలా వున్నావు. ఏదో పీడకల వచ్చిందేమోననిపించింది”
“పీడకలేం కాదు. తరుచుగా వస్తుంటుంది. కొందరు వ్యక్తులు విజిట్ చేస్తుంటారు… అతి భీభత్సంగా”” అని నవ్వుతూ పక్క దిగి తన టెలిస్కోప్ దగ్గిరకి వచ్చాడు ఆమో.
“ఏం అర్థంకాలేదు”” అన్నాడు అబ్రహం.
“నాకే అర్థమవదు. నీకు అర్థమయేలా ఎలా చెప్పను?”” అన్నాడు ఆమో.
అబ్రహం ముఖంలో సందిగ్ధం.
“ఏం కల ఆమో అది?”” అడిగాడు స్ట్రెస్ చేసి. ఆమో క్లుప్తంగా చెప్పాడు. “
“అనలైజ్ చేయించావా?”” మరో ప్రశ్న.
“చెయ్యలేకపోయారు. సబ్కాన్షస్మైండ్లో ముద్రపడిన జ్ఞాపకాలో సంఘటనలో కావచ్చుననే అనుమానంతో హిప్నటైజ్ చేసి రిగ్రెషన్ ద్వారా నేను భూమ్మీద కళ్ళు తెరిచిన మొదటి క్షణందాకా తీసుకెళ్ళి నా మెదడులోని అరలన్నీ వెతికారు. గర్భస్థశిశువుగా వున్నప్పుడు అమ్మనుంచీ అలాంటి జ్ఞాపకాలుగానీ ఇంపల్సెస్గానీ వచ్చాయా అనికూడా వెతికారు. అంటే జెనెటిక్ మెమొరీలోకూడా. ఎక్కడా దొరకలేదు. అ౦దరికీ అదొక పజిల్‌గా మిగిలిపోయింది””
ఎంత విషాదం! మూలాలు తెలియని ఒక కల మనిషిని నిరంతరం వెంటాడుతుండటం… దాన్నుంచీ అతనికి విముక్తి లేకపోవడం…సైన్సు ఎంత అభివృద్ధి చెందినా ఇంకా తెలియని కోణాలు మిగిలి వుండటం చాలా బాధాకరం.
అబ్రహంని అలాగే ఆలోచనకి వదిలేసి తనపనిలో మునిగిపోయాడు ఆమో. ఔటర్స్పేస్లో జరిగే మార్పులని నిరంతరం గమని౦చి విశ్లేషణ చేస్తూ పరిశోధనలని ఎప్పటికప్పుడు బేస్ కేంపుకి పంపిస్తుండాలి ఆమో. కొద్ది నిముషాలకి అబ్రహం కూడా తన పనిలో నిమగ్నమయాడు. ఇక్కడి సమయం చాలా విలువైనది. ఇక్కడికి వచ్చే అవకాశం చాలా అరుదైనది.
స్పేస్ లాబ్ వున్నచోట యూఎఫ్‌వోలు (unidentified foreign objects) సందడి చేస్తుంటాయి. భూమి మరి ఒకటి, రెండు లేదా కొన్ని గ్రహాలతో కలిసి ఎక్సోస్ఫియర్ని పంచుకుంటోందనే సందిగ్ధం. స్పేస్లాబ్ వున్నచోటికి పైన ఈ ఓవర్ లాపింగ్ ఏరియా వుందనే అనే ఆలోచన. ఈ యూఎఫ్ఓలని బాస్ ఒక సవాలుగా తీసుకుంది. వాటిని ట్రేస్ చెయ్యాలి, ఒక్కదాన్నేనా పట్టుకోవాలనేది మిషన్.
“ఈ యూఎఫ్‌వోలు స్పేస్ షటిల్స్ కావని నా అనుమానం. అవి టైమ్ షటిల్స్ కావచ్చు. ఇక్కడ స్పేస్ టైం లూప్స్ వున్నాయని అనుకుంటున్నాను” ఒక ప్రతిపాదనాస్థాయి అభిప్రాయాన్ని ఆమో వ్యక్తపరిచినప్పుడు బాస్ ఛెయిర్ పర్సన్, భారతదేశపు ప్రిమియర్ – ఈ ఇద్దరితో కలిపి బాస్‌లో శాస్త్రవేత్తలంతా అతని ప్రతిపాదనని నిర్ద్వంద్వంగా తిరస్కరించారు.
“ప్రపంచంలోని అన్నిదేశాలకన్నా ఎత్తుని మన దేశం, మన యువత వుండాలనేది ప్రిమియర్ ఆకాంక్ష. ఈ రోజుని మనం ఈ స్థాయిలో వున్నామంటే అటువంటి ఆకాంక్షతో ఛేసిన నిజాయితీగల ప్రయత్నాలే కారణం. భారత ప్రభుత్వం బాస్ మీద చాలా ఖర్చుపెడుతోంది. వ్యాపారదృక్పథంతో కచ్చితమైన ప్రతిఫలాన్ని ఆశించకపోయినా దాన్ని వృధాకాకుండా చూడాల్సిన నైతికబాధ్యత మనందరిదీ ఆమో! టైమ్ ట్రావెల్ అనేది అసంభవమని ఎంతోమంది శాస్త్రవేత్తలు ఎన్నో ప్రయోగాలద్వారా నిరూపించారు. మరోసారి మనం నిరూపించనవసరం లేదనుకుంటాను. విజయవంతమయే ప్రయోగాలు చేయడద్వారా యువతని వుత్తేజపరుద్దాం. అది ప్రస్తుతపు సమాజంలోనూ పరిస్థితుల్లోనూ చాలా అవసరం. మీరు టైం హంట్ గురించి దయచేసి మర్చిపొండి” బాస్ ఛెయిర్ పర్సన్ శ్యాం చాలా స్పషంగా చెప్పాడు”
ఆమో మనసుకి కొద్దిగా నొప్పిగా అనిపించింది. కఠినమైన వాస్తవాలకి వుండే లక్షణమే బాధపెట్టడం.
అసలు యూఎఫ్‌వోలు కనిపించడమే పెద్ద అద్భుతం. సాసరుమీద కప్పు బోర్లిచినట్టుండే వింతవాహనం ఎక్కడినుంచో వున్నట్టుండి ఆమో టెలిస్కోప్ రేంజిలోకి వస్తుంది. ఆ తర్వాత జరిగేది దిగ్భ్రమ కలిగించే విషయం. క్రమంగా అది ఆకుపచ్చని మెరుపుగల వూదారంగు గాలిపటంలా మారి వున్నచోటే వేగంగా తిరుగుతూ కనుమరుగౌతుంది. ఒకొక్కసారి కనికట్టేమోననిపించేంత తక్కువ కాలంలో కనిపించి మాయమౌతుంది. ప్రత్యేకి౦చి ఇక్కడే ఎందుకిలా జరుగుతుందో తెలియదు.
అది వ్యోమనౌకా? కాలనౌకా? వ్యోమనౌకని కాలనౌకగా మార్చుకుని టైమ్ హంట్ చేస్తున్నారా? ఎవరు వాళ్ళు? మనకన్నా టెక్నాలజీలో ముందున్నారా? ఏలియన్సా? ఏ గ్రహపువాసులు? చక్కటి గుండ్రంగా బోర్లించిన కప్పులా వున్న వస్తువు రంగు మార్చుకుని ఒక అక్షాన్ని వదులుకుని ఆకాశానికి అంటించిన గాలిపటంలా మారటం ఎలా సాధ్యం?
ఇప్పుడుకూడా టెలిస్కోపులో కన్నుంచగానే వూదాపచ్చరంగులోకి మారుతున్న ఫ్లయింగ్ సాసర్ కనిపించింది. ఆ కల వచ్చినప్పుడే ఇది కనిపించడం చాలాసార్లు జరిగింది. యాదృశ్చికం కావచ్చు. కానీ జరిగింది. అందుకే మెలకువ రాగానే టెలిస్కోప్ దగ్గిరకి వచ్చి కూర్చున్నాడు.
“అబ్రహం!”” పిలిచాడు.
“ఏమిటి?”” తనున్నచోటినుంచే జవాబిచ్చాడు.
“త్వరగా రా!”” అని పిలిచి అతను రాగానే పక్కకి జరిగి అతన్ని టెలిస్కోపులోకి చూడమన్నాడు.
“అమేజింగ్. అది అచ్చం పొటాషియమ్ పర్మాంగనేట్ క్రిస్టల్‌తో చేసిన గాలిపటంలా వుంది. దీన్నేనా నువ్వు కాలనౌక అనేది?” అది కనుమరుగయేదాకా చూసిన తర్వాత తలతిప్పి అడిగాడు.
అబ్రహం బయో సైంటిస్ట్ . స్పేస్‌లో జీవం వుండటానికిగల అవకాశాలని పరిశీలిస్తాడు. అది భూమ్మీద వున్న అమీబా, బాక్టిరియా, వైరస్‌లాంటి సాంప్రదాయిక జీవమే కావాలనేం లేదు. అసలు జీవం అంటే ఏమిటి? సెల్ఫ్ రెప్లికేటింగ్ లక్షణంగల పదార్థాన్ని జీవం అని నిర్వచించారు.
అనేక గ్రహాలు, వాటి నక్షత్రాలనుంచీ అవి వున్న దూరం, పొందుతున్న నక్షత్రరశ్మి . . . బ్లాక్ మేటర్ . . . బ్లాక్ ఎనర్జీ . . .ఇలా ఎన్నో కోణాలనుంచీ పరిశోధన చేస్తాడు. భూమ్మీద జీవం ఏర్పడటానికి దారితీసిన పరిస్థితుల్ని రోదశిలోంచీ విశ్లేషిస్తాడు. భూమి ఆవిర్భవించిన తొలిదశలో హాట్ డైల్యూట్ సూప్‌లో మొదట అమినో ఆసిడ్లు, తరువాత ప్రోటీన్లు తయారై జీవం పుట్టడానికి ఏ పరిస్థితులైతే దారితీసాయో అలాంటి పరిస్థితులు ఇంకెక్కడేనా వున్నాయేమోనని పరిశోధిస్తాడు. ప్రారంభదశలో వున్నప్పుడు సముద్రాన్ని హాట్ డైల్యూట్ సూప్ అంటారు. అటువంటి ఫేజ్‌లో వున్న గ్రహం ఇంకేదైనా వుందా అని శోధిస్తాడు.
అతనికి ఖగోళశాస్త్రపరిజ్ఞానం చాలా తక్కువ. భూమ్మీద లాబ్‌లో ప్రయోగాలు చేసుకోవడానికీ ఇక్కడ ఈ స్పేస్లాబ్లో ప్రయోగాలు చేసుకోవడానికీ తేడా పెద్దగా కనిపించదు. అతని దగ్గిర కొన్ని సెన్సర్లు వున్నాయి. వాటి సాయంతో కొన్నిలక్షల కోట్ల మైళ్ళదూరంలో జీవం ఎక్కడున్నా గుర్తుపట్టగలడు. జీవాన్ని డీఎన్ఏ, ఆర్ఎన్ఏ, ఎండార్ఫిన్స్, ఎంజైములు అని విడగొట్టుకుని వేటి ఆవిర్భావం వేటికి దారితీసిందని వెతుకులాడే అతనికి ఆమో వేసే లెక్కలు అర్థం కావు.
ఇద్దరివీ వేరువేరు ప్రపంచాలు. పక్కపక్కనే వున్నా భౌతికంగానే కాదు, వూహాప్రపంచాలుకూడా వేరే. అబ్రహం పరీక్షనాళికలు, స్లైడుల్లో, మైక్రోస్కోపులో తన ప్రపంచాన్ని వెతుక్కుంటే ఆమో ప్రపంచం టెలిస్కోపు కన్నులో నిక్షిప్తమై వుంటుంది. 360 డిగ్రీల గడియారపు పరిభ్రమణాలలో ఎక్కువభాగం ఎవరి వూహా ప్రపంచాలలో వాళ్ళు వాళ్ళ ఆలోచనలు చేసుకుంటుంటారు. తమ ప్రయోగాలని విశ్లేషించుకుంటారు.
ఎవరికీ తెలియని మరో ప్రపంచం కూడా వుంది అబ్రహంకి. అది ప్రేమ ప్రపంచం. అందులో అతను వంటరివాడు. తన భావాలు కంప్యూటర్లో పెడతాడు. అవతలి వ్యక్తికి మెసేజిలు పెడతాడు. కానీ సెండ్ బటన్ నొక్కడు. ఏదో సంకోచం. అవతలి వ్యక్తి తన ప్రేమని అంగీకరిస్తుందా లేదా అని. తిరస్కారాన్ని వూహల్లోకూడా ఇష్టపడడు.
Nothing has really happened unless it is recorded-
Virgenia Wolf
లిఖించబడనిది ఏదీ కూడా వాస్తవంగా జరిగినట్టు కాదు. . . లిఖించబడటం. . . కంటితో చూసి, మనసుతో గుర్తించి కాలంపొరల మీద ముద్రించడం. . . అలా లిఖించబడిన సంఘటనలు ఎంతకాలానికి చరిత్రగా మారుతాయి? చరిత్రగా మారాకా మరెంత కాలానికి ఆధారాలని కోల్పోయి ఇతిహాసాలుగా మారి ప్రజల నమ్మకాలలోనూ, తద్వారా ఒక సంస్కృతిలోనూ మిళితమౌతాయి? ఆధారాలకి నిలిచే చరిత్ర గొప్పదా? ప్రాణాన్ని సైతం తృణప్రాయం అనిపించే నమ్మకం గొప్పదా? తన సబ్కాన్షస్మైండ్లో వున్న అటువంటి ఏ నమ్మకం వాళ్ళని తన కలల్లోకి ఆహ్వానిస్తోంది?
గతజన్మల బంధాలు కొన్ని స్పష్టంగానూ ఇంకొన్ని అస్పష్టంగానూ మనుషుల్ని వెంటాడుతుంటాయి. కలలు, అవ్యక్తంగా వుంటూ వెంటాడే ఆవేదనలు, అకారణ దు:ఖాలు…అవే. గతజన్మలలో అసంపూర్తిగా వుండిపోయిన బలీయమైన చర్యల తాలూకూ శేషఫలాలు ఈ జన్మలో పరిచయాలుగా రూపుదిద్దుకుంటాయి.
మనిషి ఒక ఎనర్జీ కాప్స్యూల్. పాజిటివ్ ఎనర్జీ నెగటివ్ కౌంటర్పార్ట్ని వెతుక్కుంటుంది, నెగటివ్ ఎనర్జీ పాజిటివ్ కౌంటర్పార్ట్ని వెతుక్కుంటుంది. ఇది మనిషి మంచి చెడ్డలకి సంబంధించిన విషయంకాదు. సాంత్వన పొందని వుద్వేగాలకి సంబంధించినది. గత జీవితకాలంలో పూర్తిచెయ్యలేకపోయిన ఇంటరాక్షన్స్‌ని పూర్తిచేసుకొమ్మని చేసే ప్రేరేపణ. ఈజీక్వల్టూకి అటూ ఇటూ చేర్చి సమానం చెయ్యవలసిన బీజగణితపు సమీకరణంలాంటిది. అసంపూర్ణంగా మిగిలిపోయిన సమీకరణం. . . మనిషి జీవితం జన్మజన్మలుగా ఇలాంటి అసంపూర్ణ సమీకరణాలతో నిండి వుంటుంది. ఏవి ఎప్పుడు పూర్తౌతాయో ఎవరికీ తెలియదు. అన్నీ పూర్తవ్వటం బహుశ: అదే ముక్తి.
పద్మమాలిక, మైత్రీపాలుడు అలాంటి ఏ సమీకరణానికి, ఏ జన్మకి చెందినవారు? ఈ జన్మలో ఎవరుగా పరిచయం కానున్నారు? వాళ్ళకి తనెవరు? తాము ఒకరినొకరు గుర్తుపట్టగలరా? ఆమో అన్వేషిస్తున్నాడు. . . ఎవరూ ఆమోదించని సిద్ధాంతపు ప్ర్రాతిపదికమీద ఎవరికీ అర్థమవని వెతుకులాట అది.
గతం ఒక పునాది.
వర్తమానం ఒక వూహ. భ్రమ. అవాస్తవం.
భవిష్యత్తు ఒక ఆలంబన.
ఒక క్షణం . . . పుట్టకముందు అది భవిష్యత్తు. పుట్టాక అది గతం. ఈ రెండిటిమధ్య మనిషి వుందనుకునే వర్తమానం వూహమాత్రమే.
గతంలో జీవితరహస్యాలన్నీ ఇమిడి వుంటాయి. సంఘటనలన్నీ వొదిగిపోయి వుంటాయి. అది ఎంత సుదూరకాలానికి అనే ప్రశ్న ఆమోని వెంటాడుతూ వుంటుంది. ఎన్ని జన్మల వెనక్కి అనే సందేహంకూడా అందులో అంతర్లీనంగా ఉంది, అది సాధ్యమేనా అన్న అనుమానంతోపాటుగా.
మనిషి జ్ఞాపకాలన్నీ శరీరంతో అనుసంధానించుకుని వుంటాయి. శరీరంతో మొదలౌతాయి. శరీరంతోనే అంతమౌతాయి. శరీరానికి ముందు అనుభవాలు, వాటి గుర్తులు లేవా అంటే వుంటాయి. అవి ఆత్మలో నిక్షిప్తమై వుంటాయి. వాటిని నిద్రాణ స్థితిలోంచీ లేపాలంటే ఆత్మని జాగృతం చెయ్యాలి. ఆత్మ అంటే?
ప్రాణికోటికి ఆద్యుడు స్వయంభువ మనువు. స్వయంభువం అంటే తనంతట తను ఆవిర్భవించినది అని అర్థం. హాట్డైల్యూట్సూప్లో ఆవిర్భవించిన మొదటి ప్రాణకణం. అదే ఆత్మ. అది రూపాంతరం చెంది అనేక ప్రాణులుగా తయారైనా, మనిషిగా మాత్రం ఒక ప్రత్యేకతని ఏర్పరుచుకుంది. అందుకే మనుసంతతిలో ఈ ద్విపాదప్రాణినే మానవులనీ, మనుజులనీ అన్నారు. అతనియొక్క ఒక జీన్ ప్రతి ప్రాణిలోనూ వుంటుంది. మనిషిలోనూ వుంటుంది. జన్మజన్మల బలమైన అనుభవాలు… అసంపూర్ణ వుద్వేగాలు డీయెన్ఏ నిచ్చెనమెట్లమీద వ్రాయబడి వుంటాయి…ఆ మనిషిని నిరంతరం వెన్నంటి వుండేలా.
భూమితో ప్రాణికి తొలి అనుబంధం ఏర్పడినప్పటినుంచీ ఆ ప్రాణి అనుభవాలన్నీ డీఎన్ఏ నిచ్చెన మెట్లమీద లిఖించబడి వుటాయి. అంటే అదంతా వాస్తవంగా జరిగినది. అందుకే మనుష్య శరీరంతో ఒక ఎనర్జీ కాప్స్యూల్ ఏర్పడినప్పుడు అంత వెతుకులాట. ఆమో దీనికి మినహాయింపు కాదు.
మిగిలిన అన్ని ప్రాణులకికూడా ఇలాంటి వ్యవస్థే వుండవచ్చు. కానీ వాటి భావవ్యక్తీకరణ మనిషికి అర్థమవదు.
“మైత్రీపాలా!” అన్న కలలోని పిలుపు తన యెనిమిదో ఏట కలలో మొదటిసారి విన్నాడు ఆమో.
మెలకువ వచ్చాక చూసుకుంటే నీలిరంగు బెడ్లాంపు వెలుతుర్లో తనెవరో ఎక్కడున్నాడో మొదట అర్థమవలేదు. క్రమంగా తెలిసింది. గదిలో తనొక్కడే. తల్లీ తండ్రీ వేరే గదిలో నిద్రపోతున్నారు. ఒక్కసారి తన వయసు చాలా పెరిగిపోయినట్టనిపించింది. ఎవర్నీ లేపాలనిపించలేదు. ఒక్కడూ పక్కమీద పడుకుని గుండె మెలిపెట్టినంత బాధని ఆ చిన్న వయసులోనే అనుభవించాడు.
మరుసటిరోజు పొదున్న లేవగానే తల్లికి తనకొచ్చిన కల చెప్పి, “”మైత్రీపాలుడెవరు?”” అని అడిగాడు. ఆమెకేం అర్థమవలేదు. కొడుకు కలలోకి వచ్చిన వ్యక్తి గురించి ఎంత అమ్మేనా ఎలా చెప్తుంది? అంత చిన్నపిల్లవాడికి అలాంటి కల రావడమేమిటి? ఆ కలగురించి అతనంత విపులంగా చెప్పడమేమిటి? ఏమౌతోంది ఆమోకి?
“మైత్రీపాల సిరిసేన. . . శ్రీలంక అధ్యక్షుల్లో ఒకరు. చాలా ఏళ్ళక్రితం శ్రీలంకని పాలించారు”” అని జవాబిచ్చింది సంధ్య. ఐతే ఆయన గుర్రమెక్కి తన కలల్లోకి ఎందుకు వస్తాడు? పద్మమాలిక కోసం ఎందుకు ప్రాణాలు పోగొట్టుకుంటాడు? ఇవి జవాబు దొరకని ప్రశ్నలు ఆమోకి.
అప్పట్నుంచీ ఎన్నోసార్లు ఆ కల వచ్చింది. ప్రతిసారీ తండ్రినీ, తాతగారిని, బామ్మని ఇంకా ఎంతోమందిని ఎవరు దగ్గిరుంటే వాళ్ళని అడిగేవాడు మైత్రీపాలుడెవరని. అప్పుడే కాదు, ఇప్పటికీ వాళ్ళకి అర్థమలేదు. వాళ్ళకే కాదు, ఎవరికీ అర్థమవదనీ, అది తనకి మాత్రమే సంబంధించిన విషయమనీ తనే పరిష్కరించుకోవాలనీ . క్రమంగా గ్రహింపుకి వచ్చింది.
ఒకరోజు రాత్రి… ఆ కలగురించి తల్లిని అడిగిన మొదటిరోజు తర్వాత కొన్ని రోజులకి . . . ఆరుబయట కూర్చుని వున్నారు. సంధ్య మల్లెమొగ్గలు మాలకడుతోంది. రమేష్ పళ్ళెంలో వున్న మొగ్గల్ని చేతుల్తో కదిలిస్తూ ఏవో మాట్లాడుతున్నాడు . . . అప్పుడు చూసాడు ఆమో, ఆకాశంలో చాలా ఎత్తుని దాదాపు నక్షత్రాలమధ్యని అనిపించేలా వూదాపచ్చరంగులో వెలుగుతూ ఎగురుతున్న గాలిపటాన్ని. క్షణంసేపుమాత్రమే. . . ఇలా కనిపించి అలా మాయమైంది.
పశ్చిమగోదావరి జిల్లా రెడ్డి పోలవరంలో 16 July, 1962 లో జననం. వరంగల్‌లో వుద్యోగం. హెడ్పోస్ట్‌మాస్టర్గా వరంగల్‌లో స్వచ్చందపదవీ విరమణ.
వివాహం శ్రీ చదలవాడ విష్ణుమూర్తిగారితో. వారు డెప్యూటీ ఏగ్జిక్యూటివ్ ఇంజనీరుగా చేసి రిటైరయారు.
మొదటి కథ అనగనగా 1978లో వనితాజ్యోతి మాసపత్రికలో అచ్చైంది. వీరివి 225కి పైగా కథలు, 9 నవలలు వివిధ పత్రికల్లో ప్రచురించబడ్డాయి. గూడు, సింధూరి, గుండెలోతు అనే కథాసంపుటాలు, నీలినక్షత్రం అనే నవల పుస్తకాలుగా వచ్చాయి. సింధూరి అనే సంపుటానికి శ్రీమతి సుశీలా నారాయణ రెడ్డి అవార్డు 2005 లో వచ్చింది. ప్రేమలోంచీ ప్రేమలోకి అనే నవలకి ఆంధ్రభూమి ప్రథమ, తిరస్కృతులు, నీకోసం నేను అనే నవలలకి ఆంధ్రభూమి ద్వితీయ, 5-3-2 అనే నవలకి కినిగె ద్వితీయ బహుమతులు వచ్చాయి. ఎంతెంతదూరం? అనే కథకి విపుల కన్సొలేషన్ బహుమతి, శ్రీమతి రంగవల్లి ట్రస్ట్ అవార్డు వచ్చాయి. ఇవికాక కథలకు మరో ఏడెనిమిది బహుమతులు వచ్చాయి.
కథలకు కాన్వాస్ పెద్దదిగా వుండాలనేది వీరి అభిప్రాయం.