ఊదాపచ్చనౌక -2 by S Sridevi

  1. ఊదాపచ్చనౌక – 1 by S Sridevi
  2. ఊదాపచ్చనౌక -2 by S Sridevi
  3. ఊదాపచ్చనౌక -3 by S Sridevi
  4. ఊదాపచ్చనౌక -4 by S Sridevi
  5. ఊదాపచ్చనౌక -5 by S Sridevi
  6. ఊదాపచ్చనౌక – 6 by S Sridevi
  7. ఊదాపచ్చనౌక – 7 by S Sridevi
  8. ఊదాపచ్చనౌక – 8 by S Sridevi
  9. ఊదాపచ్చనౌక 9 by S Sridevi
  10. ఊదాపచ్చనౌక – 10 by S Sridevi
  11. ఊదాపచ్చనౌక – 11 by S Sridevi
  12. ఊదాపచ్చనౌక – 12 by S Sridevi

“అమ్మా! అక్కడ చూడు, గాలిపటం. నక్షత్రాలమధ్యని ఎగురుతోంది”” చెయ్యి చూపిస్తూ వుద్విగ్నంగా అరిచాడు. వాళ్ళు తలతిప్పి చూసేసరికి అక్కడ ఏమీలేదు.
ఆమో తల్లితండ్రులు ముఖాలు చూసుకున్నారు. రమేష్ మరింక ఆలస్యం చెయ్యకుండా సైకియాట్రిస్టు అపాయింటుమెంటు తీసుకున్నాడు ఆమోకోసం. అప్పటికే సంధ్య ఆమో కలగురించీ అతనడిగిన ప్రశ్నగురించీ చెప్పింది. మర్నాడు ఇద్దరూ కలిసి ఆమోని డాక్టరు దగ్గిరకి తీసుకెళ్ళారు.
“బజార్లో పనుంది. నువ్వు కొద్దిసేపు ఇక్కడే ఈ అంకుల్‍తో మాట్లాడుతూ, బొమ్మలవీ చూస్తూ వుండు. మేం పని చూసుకుని వచ్చేస్తాం” అక్కడికెళ్ళాక చెప్పాడు రమేష్ . అసలెప్పుడూ చూడని వ్యక్తితో గడపడం చిన్నపిల్లలకి ఇష్టం వుండదు. ఆమో ఏడుపుముఖంపెట్టాడు.
“కొద్దిసేపే. మాతో వస్తే నీకు బోర్ కొడుతుంది. అక్కడ ప్లేజోన్ వుండదు ఇక్కడైతే బోలెడన్నీ పెట్స్, బొమ్మలూ, కామిక్ పుస్తకాలూ వున్నాయి”” సంధ్య ఎంతో నచ్చజెప్పాక వప్పుకున్నాడు.
అది హాస్పిటలనీ పృథ్వీరాజ్ డాక్టరనీ పెద్దయేదాకా ఆమోకి తెలియలేదు. లోపలికి అడుగుపెట్టగానే రెండు బొచ్చుకుక్కపిల్లలు గెంతుతూ ఎదురొచ్చాయి. మందుల్లేవు. స్పిరిటువాసన లేదు. నర్సులూ కాంపౌండరూ లేరు. పైగా పృథ్వీరాజ్ టేబుల్ మీది వేస్‍లో రకరకాల పువ్వులున్నాయి. ఒక ట్రేలో పళ్ళూ, స్నాక్సూ వున్నాయి.
పృథ్వీరాజ్ చాలా మంచివాడు. ఆమోకి బాగా నచ్చాడు. ఇద్దరూ చాలా విషయాలు మాట్లాడుకున్నారు. ఆమో స్కూలుగురించీ, టీచర్లగురించీ, ఇంటిదగ్గిరా స్కూల్లోనూ అతనికున్న స్నేహితులగురించీ , స్నేహితులంతా కలిసి ఆడుకునే ఆటలు, బొమ్మలు, చదివే పుస్తకాలు, ఇలా ఎన్నో విషయాలు మాట్లాడాక, ఆమోకి వచ్చిన కలగురించీ, అతను చూసిన గాలిపటాన్నిగురించీ అడిగాడు పృథ్వీరాజ్. ఆమో ఏదీ దాచకుండా చెప్పేసాడు.
“ఫన్నీ!”” అంటూనే కుతూహలంగా విన్నాడు పృథ్వీరాజ్.””పద్మమాలిక, మైత్రీపాలుడు అనే పేర్లు నీకెలా తెలిసాయి?”” అడిగాడు.
“ఏమో! కలలో అలా అనిపించింది””
“వాళ్ళు నీకు బాగా తెలిసినట్టనిపించిందా? గుర్రంమీద వచ్చి రాజకుమారిని ఎత్తుకెళ్ళినది నువ్వేనా . . . చందమామ కథలోలా?””
“నేను కాదు”
“మరి మైత్రీపాలుడివా? రాజకుమారికోసం కత్తిపట్టుకుని యుద్ధం చేసావా?””
“నేనసలు మైత్రీపాలుణ్ణి చూడనేలేదు””
“కథలో మరి నువ్వెవరు?””
“నేను లేను””
ఆమోకి తనన్న జవాబు తనకే తికమకగా అనిపించింది. నిజమే. కలలో తను కనిపించలేదు. తనెవరు? అసలలా ఎవరి కలలో వాళ్ళకి వాళ్ళు కనిపిస్తారా? అది కథా? కలా? కథ కలలా వచ్చిందా?
“ఆ గాలిపటం మాటేమిటి? నువ్వొక్కడివే చూసావా? అమ్మావాళ్ళూ చూడలేదా?””
“చాలా కొంచెంసేపు కనిపించింది. నేను వాళ్ళకి చెప్పేంతలోనే మాయమైపోయింది””
“గాలిపటం ఎక్కడన్నా మెరుస్తుందా? అంతెత్తుకి ఎగురుతుందా?””
“ఏమో తెలీదు. కానీ దాన్ని నేను చూసాను””
“నక్షత్రాలమధ్యనా? రాజకుమారి వుందా, దానిమీద?” ” ఆయన నవ్వుతూ అడిగాడు.
“కనిపించలేదు. గాలిపటం చాలా ఎత్తుని ఎగిరిందికదా?””
పృథ్వీరాజ్ ఈమాటు పెద్దగానే నవ్వేసి, ఆమో భుజం తట్టాడు.
“మీ అమ్మానాన్నలు వచ్చారేమో చూడు. వస్తే బయట కూర్చుని వుంటారు. వెళ్ళి పిలుస్తావా?”” అని అడిగాడు. ఆమో తలూపి వెళ్ళేలోపు వాళ్లే లోపలికి వచ్చారు. పృథ్వీరాజ్ తో చాలాసేపు మాట్లాడారు. ఆమోకి వాళ్ళ సంభాషణ అర్థంకాక ఆసక్తి కలగలేదు. కామిక్స్ చదువుతూ కూర్చున్నాడు.
“ఆమోకి ఏమీ అవలేదు. చాలా తెలివైన పిల్లవాడు. చురుకైనవాడు. మీరేమీ భయపడక్కర్లేదు. ఐతే అతనికి కొన్ని హెలూసినేషన్స్ వున్నాయి. కథల పుస్తకాలవీ చదువుతాడుకదా, వాటిగురించే ఆలోచిస్తూ పడుకుంటే అవే కలల్లోకి వస్తాయి. ఆలోచించడం అనేది అతని వయసుకి చాలా పెద్ద మాట. పుస్తకాల్లో చదివినవీ టీవీలోనూ కంప్యూటర్లో చదివినవీ, చూసినవీ మనసుమీద ముద్రపడి అవే కలలుగా వస్తున్నాయి. పెద్ద ప్రమాదకరం ఏమీ కాదు. వయసు పెరుగుతున్నకొద్దీ తగ్గిపోతాయి. ఒక టేబ్లెట్ రాస్తాను. ఆరునెలలపాటు వాడండి. మనసుకి నిలకడ వస్తుంది”” అన్నాడు పృథ్వీరాజ్.
ముగ్గురూ ఇంటికి తిరిగి వచ్చేసారు.
“ఆయనెవరు?”” దార్లో అడిగాడు ఆమో.
“సైకియాట్రిస్ట్””
రమేష్ టేబ్లెట్స్ తెస్తానన్నారు.
“వాడికేమీ లేదు”” సంధ్య ప్రిస్క్రిప్షన్ చింపి పారేసింది.
ఆమోకి ఏమీ అర్థమవలేదు. అర్థంకాని, ఆసక్తిలేని ఎన్నో విషయాల్లాగే అదికూడా మరుగుని పడిపోయింది. తరువాత చాలా ఏళ్లకి సైకాలజీ అనే సబ్జెక్టు వుంటుందని తెలిసే వయసు వచ్చాక తల్లిదండ్రులు తన గురించి ఆ కోణంలో భయపడ్డారని అర్థమైంది.
ఆ క్షణాన్నించీ అతని జీవనగతిని నిర్దేశించినవి ఆ రెండే- పద్మమాలిక కల, వూదాపచ్చ గాలిపటం. ఆ కల మళ్ళీ మళ్ళీ వస్తునే వుంది. కల వచ్చినప్పుడల్లా గాలిపటం కనిపిస్తునే వుంది. తను ఎప్పుడూ చూడని పరిసరాలు, ఏమాత్రం పరిచయం లేని, ఈ కాలానికి సంబంధించని, వ్యక్తులు తన కలల్లోనూ జ్ఞాపకాలలోనూ ఎందుకు పదేపదే కదుల్తున్నారు? ఎవరా పద్మమాలిక? ఆమె ఎలుగెత్తి పిలిచిన మైత్రీపాలుడెవరు? ఆమెని ఎత్తుకెళ్ళినవాడెవరు? వాళ్ళ గురించి తనకెందుకీ బాధ? ఈ ఆందోళనేమిటి? తనకేమిటి సంబంధం? వాళ్ళెవరో తనకెలా తెలుస్తుంది? వాళ్ళని ఎలా కలవగలడు? ఇవి నిరంతరం అతన్ని వేధించే ప్రశ్నలు.
ఆ గాలిపటమేమిటి, వింతైన రంగులో అలా కనిపిస్తుంది? పృథ్వీరాజ్ అన్నట్టు మామూలు గాలిపటం అంత ఎత్తుని ఎగరగలదా? దాన్ని అందుకోవాలంటే అంతరిక్షంలో విహరించాలి. ఆ కలగురించి తెలుసుకోవాలంటే కాలంలో ప్రయాణించాలి. ఈ రెండూ అతని గమ్యంగా రూపుదిద్దుకున్నాయి.


కాలం క్షణాలుగా వున్నప్పుడు లెక్కలో అపరిమితంగా వున్నట్టనిపిస్తుంది. గంటలుగా, రోజులుగా, నెలలుగా లెక్కవేసినప్పుడు లెక్కలేనన్ని క్షణాలు ఆ లెక్కలో ఘనీభవించిపోతాయి. అలాంటి ఘనీభూతకాలం కొంత కరిగి మళ్ళీ లెక్కకి వచ్చేసరికి ఆర్నెల్లౌతుంది. స్పేస్‍లాబ్‍లో ఒక శాస్త్రవేత్త మారిపోతాడు.
“ఇంక మూడు గంటలు వుందంతే” అన్నాడు అబ్రహం దిగులుగా. ఆమో తలూపాడు.
ఎదురుగా పరమాణు గడియారం భారతకాలమానం ప్రకారం ఇరవైమూడుగంటలు అంటే రాత్రి పదకొండు గంటలు చూపిస్తోంది. ఇంకో మూడు గంటలకి బాస్ పంపించిన షటిల్ ఆమోకి రిలీవర్ని తీసుకునివస్తుంది.
ఈ అబ్జర్వేటరీ మొదలుపెట్టి దాదాపు ఏడేళ్ళైంది. మొదట ఇద్దరు శాస్త్రవేత్తలు వచ్చారు విశ్వాస్, జార్జి. మూడునెల్లు కాగానే జార్జి బేస్ కేంపుకి తిరిగి వెళ్ళిపోయాడు. విశ్వాస్ మరో మూడు నెలలు వున్నాడు. అప్పట్నుంచీ ప్రతి మూడు నెలలకీ ఒక కొత్త శాస్త్రవేత్త రావడం అప్పటికి ఆర్నెల్లు పూర్తిచేసిన శాస్త్రవేత్తని వెనక్కి పంపడం జరుగుతోంది. ఇప్పుడు అలా తిరిగి వెళ్తున్నది ఆమో.
నెలల్లో ఘనీభవించిన కాలం మళ్ళీ క్షణాలు క్షణాలుగా విడిపోయి ముందుకి జరగడం తెలుస్తోంది. వెనక్కి కూడా అలాగే జరుగుతుందా? అలా ఎప్పుడేనా జరిగిందా? డైలేషన్ ఆఫ్ టైమ్ గురించి కొన్ని కథలున్నాయి. ఖాట్వంగుడి కథ వుంది. బలరాముని భార్య రేవతి కథ వుంది. విశ్వంలోని ప్రతి గ్రహం, ప్రతి గ్రహశకలం, ప్రతి అణువూ, ప్రతి అణుశకలం దానికి అనువైన వేగంతో ప్రయాణిస్తుంది. ఈ వేగం, ప్రయాణం, రెండూ కాలంతో ముడిపడి వుంటాయి. రెండు వేర్వేరు వేగాలతో ప్రయాణించే ఖగోళవస్తువులలో ఆ వేగాలమధ్య వున్న బేధం వుత్పన్నం చేసే స్థితి డైలేషన్ ఆఫ్ టైమ్. కానీ కాలం అసలు ఆగిపోయినట్టో వెనక్కి నడిచినట్టో ఎక్కడా లేదు.
“ఏం ఆలోచిస్తున్నావు ఆమో! మళ్ళీ ఇక్కడికి వచ్చే ప్రపోజల్ వుందా? బేస్‍నుంచే నీ ప్రయోగాలు కొనసాగిస్తావా?” అడిగాడు అబ్రహం.
“బేస్‍లో ఏం వుంది? ఇక్కడికి వస్తేనే థ్రిల్. అదీకాక ఆ ఫ్లయింగ్ సాసర్నిపట్టుకోవాలి. అదే విషయం మీద మరో ఇద్దరు వర్క్ చేస్తున్నారు. ఇప్పుడు నా స్థానంలో వచ్చే వైభవ్ వాళ్ళలో ఒకరు”” అన్నాడు.
“అతనుగానీ సక్సెసౌతే?””
“ఐనా నేను రావాలి””
అబ్రహం నవ్వాడు.
“టైం హంట్ సాధ్యమని నిరూపించాలి””
“. . .” “
“నువ్వు?”
“నావి ఒక రిజల్ట్‌తో ముగిసే ప్రయోగాలు కావు. మళ్ళీమళ్ళీ వస్తునే వుంటాను. బట్ మనిద్దరం కలిసి వర్క్ చెయ్యడం మళ్ళీ జరగదేమో!””
ఆమో మనసు ఆర్ద్రమైంది. కొందరితో అనుబంధం బలంగా ఏర్పడుతుంది. కొందరితో అంత బలీయంగా వుండకపోయినా వాళ్ళని వదిలిపెట్టి వెళ్ళేప్పుడు వెల్తి తెలుస్తుంది. బహుశ తమిద్దరిమధ్యా గతజన్మల్లో ఒకప్పుడెప్పుడో ఏర్పడిన అసంపూర్ణ సమీకరణంలో లోటు అంత బలమైనది కావచ్చు.
“బాస్ రూల్స్ వప్పుకోవని వెళ్తున్నానుగానీ నాకు ఇప్పట్లో తిరిగి వెళ్ళాలని లేదు. ఆ పొటాషియమ్ పర్మాంగనేట్ క్రిస్టల్స్ గురించి ఒక నిర్ణయానికి రాలేకపోతున్నాను. వాటిమీద ఇంకా వర్క్ చెయ్యాల్సి వుంది””
“అవి నువ్వనుకుంటున్నట్టు కాలనౌకలేనా?””
ఆమో నవ్వి తలూపాడు.
“ఎందుకలా?””
“స్పేస్ టైమ్ కంటిన్యువమ్ అంటారు. అది నాలుగు అక్షాలమీద విస్తరించి వుంటుంది. అందులోంచీ స్పేస్‍కి సంబందించిన ఒక అక్షాన్ని తొలగిస్తే కాలంలో ప్రయాణించగలం. అంటే మనం టూ డైమన్షన్స్‌లో వుంటూ గతంలోకీ భవిష్యత్తులోకీ కదులుతాం. అలాంటి ఒక టూడైమన్షనల్ ఫిగర్ని పీపీటీ క్రిస్టల్లో చూసాను. ఇట్ వజ్ అమేజింగ్. . . టీవీ స్క్రీన్‌మీద కనిపించే బొమ్మలా వున్నాడతను. వాళ్ళు ఒక అక్షాన్ని స్పేస్‍లోంచీ తీసేసి అక్కడ కాలాన్ని వుంచారు. ఎక్కణ్ణుంచో వచ్చి ఒక దగ్గిర ఆగి వున్నచోటే అత్యంత వేగంగా కదుల్తున్నారు, కనుమరుగౌతున్నారు. అలా వచ్చేముందు స్పేస్‍షిప్‍లాగా వున్న వాళ్ళ వ్యోమనౌక వున్నచోటే తిరుగుతూ వూదాపచ్చరంగుకి మారుతోంది”” వివరించాడు.
అబ్రహం మెప్పుదలగా చూసాడు. “”చాలా బాగా అనలైజ్ చేసి చెప్పావు. బాస్ ఎందుకు వప్పుకోవడం లేదు?”” అడిగాడు.
“ఇంకొంత స్టడీ చెయ్యాలి”” అని ఆ సంభాషణని తుంచేసాడు ఆమో. ఇంతలో వైభవ్ బేస్ కాంపునుంచీ బయల్దేరినట్టుగా బీప్ శబ్దం వచ్చింది. సాధారణంగా స్పేస్ షటిల్స్ గంటకి 28000 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి. ఆ వేగాన్నికూడా బాస్ అధిగమించింది.
దాదాపు అరగంట తర్వాత వైభవ్ వస్తున్న స్పేస్ షటిల్ బాస్ విశ్వని చేరినట్టు రెండో బీప్ వచ్చింది. అందులో బాస్ విశ్వలో వున్నవారికోసం ఆక్సిజెన్ రిప్లేస్‍మెంటు, ఫ్రెష్‍వాటర్, ఫ్రెష్ టాయ్‍లెట్‍లాంటివి వస్తాయి. ఇక్కడ వాడుతున్నవి సాధ్యపడేంతవరకూ కంప్రెస్ చేసి వెనక్కి తీసుకెళ్ళిపోతారు. అబ్జర్వేటరీని క్లీన్ చేయటంకూడా జరుగుతుంది. ఇవన్నీఒకేసారి ఆటోమేటిగ్గా జరిగిపోతాయి.
మొదట స్పేస్ షటిల్ అబ్జర్వేటరీకి అనుసంధానించబడుతుంది. సరిగ్గా రెండూ కలిసినచోట ఒకదానిలోకి ఒకటి తెరుచుకుంటాయి. ఆ తర్వాత పనులన్నీ చకచక జరిగిపోతాయి. అంతా కలిపి మూడునిముషాలు పడుతుంది. అంటే 180 సెకన్లు. అంటే అన్ని బిలియన్ల నానో సెకన్లు. ప్రతి నిముషానికీ ఒక బీప్ వస్తుంది. డిస్‍ప్లే బోర్డుమీద సెకన్ల కౌంట్ డౌన్ మొదలౌతుంది. ఈ వ్యవధిలో ఆమో వైభవ్‍కి ఛార్జి ఇవ్వాలి.
వైభవ్ కూడా ఆస్ట్రోసైంటిస్ట్. విశ్వంమీద ప్రయోగాలు చేస్తాడు. బిగ్ బాంగ్ సిద్ధాంతంమీద కొంత కాంట్రవర్సీ వుంది. బిగ్ బాంగ్ ప్రకారం విశ్వం ఆవిర్భవించి పధ్నాలుగు బిలియన్ సంవత్సరాలు దాటదు. దాన్ని వ్యతిరేకించి మృత నక్షత్రాలని ఆధారం చేసుకుని విశ్వం వయసు ట్రిలియన్లలో ప్రతిపాదించే సిద్ధాంతాలు కొన్ని వున్నాయి. అతను వాటిమీద వర్క్ చేస్తాడు. ఆమోకీ వైభవ్‍కీ యిద్దరికీ ఒకరి నాలెడ్జి మరొకరికి పెద్దగా వుపయోగపడదు.
అన్నీ కంప్యూటర్లో ముందే ఫీడ్ చేసి వుండటంచేత రెండునిముషాల వ్యవధి ఇద్దరూ మాట్లాడుకోవడానికి వుపయోగపడింది. వాళ్ళు మాట్లాడుతునే వున్నారు. ఆమో తను ప్రయోగాలు చేస్తున్న విశ్వాన్ని జాగ్రత్తగా వైభవ్‍కి అప్పగింతలు పెడుతునే వున్నాడు. రెండో బీప్ వచ్చేసింది. వైభవ్‍ని వదిలేసి వెళ్ళి షటిల్లో కూర్చున్నాడు. అతను నవ్వుతున్న దృశ్యం మూసుకున్న గాజు తలుపుల్లోంచీ కనిపించింది. క్షణభాగాలలోనే అతనికి దూరమయాడు.
బేస్‍కి చేరగానే ఆమోని క్వారంటైన్‍కి తీసుకెళ్ళిపోయారు. అంటే ఐసొలేటెడ్ రూంకన్నమాట. కాప్స్యూల్లోనూ మాడ్యూల్లోనూ బంధించబడి వున్నప్పుడెప్పుడేనా విసుగనిపించి రోదసిలో నడుస్తుంటారు. అక్కడి పరిస్థితుల్లో బ్రతకగలిగిన ఆర్గానిజమ్స్ ఏవైనా వుంటే వీళ్ళతోపాటు భూమ్మీదికి వచ్చి హానికలిగిస్తాయేమోననే భయం ఒకటైతే ఆర్నెల్లపాటు భూమికి దూరంగా కృత్రిమ వాతావరణంలో గడిపి ఒక్కసారి బయట తిరిగితే ఇక్కడి ఇన్‍ఫెక్షన్లు వీళ్ళమీద దాడిచేస్తాయనే భయం మరొకటి.
అక్కడినుండీ ఆమో వేసుకొచ్చిన బట్టలని డిస్ట్రాయ్ చేసి స్పేస్‍సూట్‍ని ఈవాష్ చేసి భద్రపరిచారు. మళ్ళీ స్పేస్‍లోకి వెళ్ళేవాళ్ళకి దాన్ని వాడతారు.
ఇంకో పెద్ద ప్రమాదం కూడా స్పేస్‍లాబ్‍తో ముడిపడి వుంది. భారరహిత స్థితిని అధిగమించేందుకు కృత్రిమ అయస్కాంతత్వాన్ని సృష్టించి వుంచుతారు. అది ఆస్ట్రనాట్స్ రక్తంలోని ఇనుముని పీల్చేసుకుంటుంది. అందుకు ఐరన్ సప్లిమెంట్స్ బాగా తీసుకుంటారు. ఒకొక్కసారి జీవప్రక్రియల్లోనూ ఆర్ బీ సీ లెక్కలోనూ తేడా వచ్చి లుకేమియాకి దారితీస్తుంది. అలా మొదటి తరం శాస్త్రవేత్తల్లో ఇద్దరు చనిపోయారు. బాస్ ప్రయోగాలపై ప్రపంచవ్యాప్త్రంగా నిరసనలు వ్యక్తమయాయి. కొంతకాలం స్పేస్‍లాబ్‍ని బాస్ వెనక్కి తెచ్చేసుకుంది. కొంత ఇంప్రూవ్ అయాక మళ్ళీ పంపింది.
ఆమోకి వైద్యపరీక్షలన్నీ జరిపి కొన్ని మందులూ ఇంజక్షన్లూ ఇచ్చి మరికొన్ని పరీక్షలు చేసి ఇచ్చిన మందులన్నీ పనిచేస్తున్నాయని నిర్ధారించుకున్నాక రెండోరోజుని వదిలిపెట్టారు.
వెంటనే తన క్వార్టరుకి వెళ్ళాడు. పర్మనెంటు క్రూకి ఎప్పటికీ క్వార్టర్సు వుంటాయి. స్పేస్‍లోకి వెళ్ళినాకూడా వాళ్ళకే వుంచుతారు. వాళ్ళ అనుబంధాలనీ, జ్ఞాపకాలనీ పదిలంగా దాచుకోవచ్చు. ఆమో తిరిగి వెళ్ళేసరికి లెక్కపెట్టలేనన్ని పూలబొకేలు, వెల్‍కం గిఫ్టులు వచ్చి వున్నాయి. కొద్దిసేపటిక్రితం ఛార్జి చెయ్యబడిన అతని సెల్ మెసేజిలతో నిండిపోయింది.
వచ్చిన గిఫ్ట్‌లలో ఒకటి అతన్ని బాగా ఆకర్షిచింఅంది. లేతరంగు గులాబీరేకుల వర్షంలో తడిసిపోతున్నట్టుగా ఆ దుమారంలో కొట్టుకుపోతున్నట్టుగా అస్పష్టంగా అతని రేఖాచిత్రం వున్న డిజిటల్ ఫోటో ఫ్రేం. మిగిలినవాటిలా కాకుండా యిష్టంగా పంపించినట్టనిపించిది. దాన్నలాగే పట్టుకుని చూస్తూ చాలాసేపు కూర్చున్నాడు. తర్వాత అతి కష్టంమీద ధ్యాస మళ్ళించుకుని తల్లిదండ్రుల్ని వీడియోచాట్‍కి ఆహ్వానించాడు. నిజానికి వాళ్ళు చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ ఫోటోఫ్రేం అతని దృష్టిని అంతగా ఆకర్షించి మరల్చకపోతే అతనుకూడా అంతే. స్పేస్‍లోకి వెళ్ళేముందు వాళ్ళతో మాట్లాడాడు. తర్వాత ఒకటి రెండు మెసేజిలు పంపాడు . మనసు వుద్వేగంతో కొట్టుకుంది.
ఒక్క కొడుకునో కూతుర్నో కని వాళ్ళని అత్యుత్తమమైన స్థాయిలోకి తీసుకెళ్ళేందుకు తమ యౌవనజీవితంలోని ఇరవైనుంచీ పాతికేళ్ళ కాలాన్ని గడిపి ఆ పిల్లో పిల్లాడో తాము నిలబెట్టిన యెత్తునించీ ఇంకా ఎత్తుకీ అందనంత దూరానికీ వెళ్తుంటే చూస్తూ వంటరితనంలో మిగిలిపోవడం తప్ప చెయ్యడానికి ఇంకేమీ మిగిలిలేని ఎందరో అమ్మానాన్నలకి ప్రతీకలు వాళ్ళిద్దరూ.
చాలాసేపు మాట్లాడుకున్నారు. సంధ్య ఎక్కువగా ప్రిన్స్ గురించి చెప్పింది. ప్రిన్స్ ఆమె పెంచుకుంటున్న కుక్క. అదికూడా వీడియోకెమెరాలో ఆమోని చూసి మొరిగి, తోక వూపి దాని సంతోషాన్ని ప్రదర్శించింది.
ఒకప్పుడు సంధ్య ప్రపంచమంటే ఆమోమాత్రమే. ఇప్పుడు ఆమె ప్రత్యామ్నాయ సంతోషం ప్రిన్స్. ఆమె భావాలు పంచుకునే ప్రాణి అది. కొద్దిసేపు మాట్లాడాక ప్రిన్స్ గొడవచేస్తుంటే దాన్ని తీసుకుని అవతలికి వెళ్ళింది.
“ప్రిన్స్ పెద్దవాడైపోయాడు నాన్నా!”” అన్నాడు ఆమో కొంచెం భయంగా.
“ఏం చెయ్యను? ఇంకో కుక్కని ఇంట్లోకి రానివ్వడం లేదు. క్రాసింగ్ కూడా బయటే జరుగుతోంది”” అన్నాడు రమేష్.
ప్రిన్స్ పెద్దై చనిపోతే సంధ్య తట్టుకోలేదనే విషయాన్ని ఇద్దరూ అనుకుంటునే వున్నారు, ఆమె మళ్ళీ లైన్లోకి వచ్చింది.
“మైత్రీపాలుడు, పద్మమాలిక ఎలా వున్నార్రా? ఇంకా విజిట్స్ చేస్తునే వున్నారా?”” అనడిగింది నవ్వుతూ.
ఆమో నవ్వి తలూపాను.
“ఎంతోమందిని అడిగాను, ఒకే కల ఇలా ఇన్నేళ్ళపాటు ఇన్నిసార్లు రావటానికి కారణమేమిటని. ఫాంటసీ అని కొందరంటే చిన్నప్పటి విషయాలేవో సబ్‍కాన్షస్‍మైండ్‍లో వుండిపోయి వుంటాయని ఇంకొందరంటారు. అన్నిటికీ మించి నన్ను బాధపెట్టింది ఇదేదో సైకలాజికల్ ప్రాబ్లం అనటం”” అంది.
“వదిలేసెయ్”” అని జవాబిచ్చాడు.
టైం హంట్ గురించిన తన ఆలోచన చెప్పలేదు, ఇప్పట్నుంచీ ఆమెని అప్‍సెట్ చెయ్యటం ఎందుకని. దాదాపు రెండుగంటలు మాట్లాడి ఇక్కడ తక్షణం చెయ్యాల్సినవన్నీ తొందరతొందరగా పూర్తిచేసుకుని అక్కడికి వస్తానని చెప్పి సంభాషణ ముగించాడు. కలుసుకోవాలని ముగ్గురికీ ఎంతగా వున్నా, ఆమోకి మరో వారందాకా తీరదు. పెట్స్‌ని బాస్ కేంపస్‍లోకి అనుమతించరుగాబట్టి సంధ్య ఇక్కడికి రావటానికి ఇష్టపడదు. అతనే వెళ్ళాలి. కాల్ ముగించి చేతిలోని ఫోటోఫ్రేం మరొకసారి చూసి పక్కని పెట్టాడు.
కాల్‍తోపాటు ఆలోచనలుకూడా కట్టిపెట్టి ఫ్రెషై బాస్ ఆఫీసుకి బయల్దేరాడు. ఆరునెలల సుదీర్ఘ యంత్రసహవాసం, గ్రహాంతరవాసం తర్వాత కాళ్ళకింద ఆనుతూ నేల, వంటిని తాకుతూ చల్లటి గాలి, తలెత్తి పైకి చూస్తే కనిపించే సుపరిచితమైన ఆకాశం, ముక్కుపుటాలకి చేరుతున్న ప్రకృతి పరిమళాలు, రాత్రి కురిసి, కరుగుతున్న మంచు బిందువులు . . . అతని మనసుకి ఎంతో హాయిగా, అనిపించింది.
ఎందరో పరిచయం వున్నవారు అతన్ని కుతూహలంగా చూస్తున్నారు. వాళ్ళమధ్యనుంచీ తెలియని ముఖాలు తొంగి చూస్తున్నాయి. బాగా తెలిసినవాళ్ళు కొందరు పలకరిస్తున్నారు. కొందరు దూరంనుంచే చెయ్యూపుతున్నారు. చాలా కొద్దిమందికి అరుదుగా దొరికే అవకాశం పర్మనెంటు క్రూగా వుండటం. అంతరిక్షంలోకి రెండుమూడుమార్లు వెళ్ళి రాగలగడం, ఇంకా వెళ్ళగలిగే అవకాశాలు మిగిలి వుండటం . . . అలాంటి అదృష్టవంతుల్లో ఆమో ఒకడు. అందరి కుతూహలానికి అదే కారణం. అతని ఫోటోలు, వీడియోలు చూడటం, మీటింగ్స్‌లో అతను చేస్తున్న ప్రయోగాలు చర్చకు వచ్చినప్పుడు స్లైడ్ షోలు వెయ్యటంవలన చాలామందికి తెలుసు.