దాదాపు పదివేల ఎకరాల వైశాల్యంలో విస్తరించుకుని వుంటుంది భారత్ ఆస్ట్రనామికల్ సొసైటీ. మొదట కేవలం అంతరిక్ష పరిశోధనలకోసమే ప్రారంభమైనా తరువాత అనేక దిశలుగా విస్తరించింది. పంథొమ్మిదివందల తొంభై దశకంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీతో మొదలైన సాంకేతిక విప్లవం భారతసమాజంలో మానవవిలువల్ని మూడుదిశలుగా దెబ్బతీసింది.
ఎదిగీ ఎదగని వయసులోనే పెద్దపెద్ద జీతాలతో వుద్యోగాలు వచ్చి పిల్లలు తల్లిదండ్రులకి దూరంగా ఎక్కడెక్కడో వుద్యోగాలు చెయ్యడంతో మొదలైంది ఈ అపక్రమం. వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకున్నాక విపరీతమైన ఆర్థిక స్వేచ్ఛతో వేరువేరు వ్యక్తులుగానే వుంటూ కుటుంబజీవనం చెయ్యటం వరకూ కొనసాగి, చివరికి చాలా పెళ్ళిళ్ళు విచ్ఛిన్నమయాయి. వాళ్ళూ, చేసుకున్న పెళ్ళి నిలుస్తుందో నిలవదో అన్న సంకోచంతో వాళ్ళు కన్నపిల్లలూ నిర్మించిన సమాజం ప్రస్తుతం వుంది. ఇది మొదటి దెబ్బ.
ఒక వ్యాపారవేత్తకో, పారిశ్రామికవేత్తకో డబ్బుంటే దానితో అతడు తన పరిధుల్ని విస్తరించుకుంటాడు. కానీ మధ్యతరగతి కుటుంబాలలో ఎక్కువైన డబ్బు విలాసాలకీ, సుఖలాలసకీ, వస్తువినిమయసంస్కృతికీ దారితీసింది. సంపాదించు, అనుభవించు. . . అనే కొత్త సిద్ధాంతం మొదలైంది. కంప్యూటరు తీస్తే, సెల్‌ఫోన్ తెరిస్తే శృంగారం . . . విశృంఖల శృంగారం. . . హింస. . . గమ్యం, మార్గనిర్దేశికత లేని ప్రయాణం యువతని నిర్వీర్యం చేసి౦ది. మితిమీరిన స్వార్థం, ప్రపంచంలో వున్నవన్నీ కంటికి నచ్చినవన్నీ తమకే కావాలన్న ఆశ, మితిమీరిన పోటీ. ఇది రెండవ దెబ్బ. దేశం నాలుగైదు తరాల యువతని దేశనిర్మాణంలో భాగం కాకుండా కోల్పోయింది.
ప్రభుత్వఖర్చుతో పేరున్న విద్యాలయాల్లో పెద్దచదువులు చదివిన యువత ఇక్కడ తమ అభిరుచికి తగిన అవకాశాలు కోరుకున్నంత జీతాలు దొరకని కారణాన విదేశాలకి వలస వెళ్ళి తమ మేథోశక్తిని అక్కడ వినియోగించడం అనేది మూడో దెబ్బ.
కొంతంది అంకితభావంగల శాస్త్రవేత్తల కృషివలన అంతరిక్ష పరిశోధనలకోసమే ఆవిర్భవించిన బాస్ ఈ పరిస్థితుల్ని సమీక్షించుకుంది. ప్రభుత్వోద్యోగాలు చెయ్యటానికి ఎవరూ ముందుకి రావడంలేదు, అందులోనూ ఈ అడివిలాంటి చోట. ఉద్యోగాలని చదువుతో అనుసంధానించింది. అదికూడా ఆకర్షణ కాలేకపోయింది. చదువుని కింది స్థాయికి తీసుకెళ్ళింది. అదీ వుపయోగపడలేదు. ఇంకా. . . ఇంకా కింది స్థాయికి తీసుకెళ్ళింది. నాణ్యతగల చదువు. . .విలువలతో కూడిన చదువు. . . విలాసాలకి అలవాటుపడిన ప్రజలకి అదీ అక్కర్లేకపోయింది. ఎవరూ తమ పిల్లలని ఏ స్థాయిలోనూ పంపడానికి ముందుకి రాలేదు.
వీధిపిల్లల్ని చేరదీసి చదువు చెప్పడం మొదలుపెట్టింది బాస్. . . చాలా నిస్సహాయంగా. ఒకవైపు అంతరిక్షప్రయోగాలు చేస్తూనే వారిని తన ఆయుధాలుగా మలుచుకుని, తీర్చి దిద్ది, సమాజంలోకి పంపింది.
అందరూ ఒకేలాంటి తెలివైనవారు వుండరు. కొందరు కెమిస్ట్రీకి స్పందిస్తే మరికొందరి మనసు ఫిజిక్స్‌కి రంజిస్తుంది. కొందరి కళ్ళు కఠినమైన లెక్కని చూడగానే గుప్పుమని మెరిస్తే మరికొందరికి అంతే కరుకైన రాయిని చూడగానే అందమైన వూహలు కళ్ళముందు కదుల్తాయి. కొందరు అసలేమీ నేర్చుకోరు. చదువుకోరు. వారూ బతకాలి. ఆకలి వాళ్ళ పీడకల. కడుపునిండా తినగలగటం వారు కనవలసిన స్వప్నం. తిండికి సంపాదించుకోవడం వారు నేర్చుకోవలసిన విద్య. ఆ పిల్లలందరికీ కలలు కనటం నేర్పి, వాటిని సాధ్యం చేసి౦ది బాస్.
కొన్ని పదుల సంవత్సరాల కృషి . . . వృధాగా పోలేదు. అతికొద్దిమంది గుర్తించారు. వారిలో కొద్దిమంది కుతూహలంగా ఫలితాలకోసం నిరీక్షించారు. అలా మొదలైన కదలిక బాస్‌ని ఇప్పటి ఈ స్థాయికి చేర్చింది. ఉత్తమమైన చదువుకీ దేశప్రగతికీ కేరాఫ్ అడ్రెసైంది. తన దగ్గిర ఏం వుందో దాన్ని ప్రజలకి ఇవ్వడం కాదు, వాళ్ళకేం కావాలో దాన్ని అందిస్తుంది. వ్యవసాయం, వ్యాపారం, వుత్పత్తి, పరిశ్రమ, సేవ. . . ఏ రంగంలో ఎవరికి ఏది కావాలంటే దాన్ని విద్యగా మలిచి అందజేస్తోంది బాస్. ఈ పరిక్రమంలో గ్రామాలనీ, పట్టణాలనీ దత్తత తీసుకుంది.
సమున్నతమైన బాస్ భవనాలనీ కార్యాలయాలనీ చూస్తుంటే బాస్ ఆవిర్భావాన్నించీ ఇప్పటిదాకా జరిగిన ప్రస్థానంలోని ప్రతి అడుగూ గుర్తొచ్చింది ఆమోకి. ఇక్కడ చేరినప్పుడు పాఠ్యాంశాలుగా నేర్చుకున్నాడు.
ఆమో వెళ్ళేసరికి శ్యాం తన సీట్లోనే వున్నాడు. అతన్ని చూడగానే లేచి ఎదురొచ్చి ఆత్మీయంగా కౌగిలించుకున్నాడు.
“ఎలా వున్నావు ఆమో? నిన్ను మేమంతా చాలా మిస్ చేస్తున్నాం”” అన్నాడు కుర్చీ చూపించి తను కూర్చుంటూ.
అతన్నుంచీ అంత సౌహార్ద్రత ఆమో వూహించనిది. టైంహంట్ గురించి ప్రయోగాలు వద్దని నిర్మొహమాటటగా చెప్పి తనని గాయపరిచిన వ్యక్తి . . . అదంతా మర్చిపోయి తమమధ్య ఏమీ జరగనట్టు ఎలా మాట్లాడగలుగుతున్నాడు?
“హౌఆర్ థింగ్స్ దేర్?” ” అని తర్వాతి ప్రశ్న వేసాడు.
“ఫైన్””
ప్రాజెక్ట్ సాఫ్ట్‌కాపీని శ్యాంకి ఇచ్చాడు. హాకి౦గ్ భయంవలన ఫస్ట్హేండు ఇన్ఫర్మేషన్ని నెట్లో వుంచరు. డాటా ట్రాన్స్మిషన్కి కంపాక్ట్డిస్క్కి ప్రత్యామ్నాయంగా వచ్చిన నానో డిస్క్‌లు వాడతారు. డిస్క్‌ని శ్యాం సిస్టంలో వేసి, ఒకొక్కటీ వివరిస్తున్నాడు ఆమో.
తను కేప్చర్ చేసిన యూఎఫ్ఓ ఫొటోలు . . . సాసరుమీద కప్పు బోర్లించినట్టుండే ఒక మామూలు వ్యోమనౌకనుంచీ వూదాపచ్చరంగులోకి మారి, అపరిమితమైన వేగంతో వున్నచోటే తిరిగి అదృశ్యమైన విజువల్‌ని అతను విస్మయంగా చూసాడు.
“ఆమో! యూఆర్ అన్ బీటబుల్”” అన్నాడు ఇంకేమీ మాట్లాడటానికి లేనట్టు. “”నువ్వనుకుంటున్నట్టుగా అది కాలనౌకేనా?”” అడిగాడు. ఆమో తలెత్తి చురుగ్గా చూసాడు. అతని కోపాన్ని శ్యాం పట్టించుకునే స్థితిలో లేడు. అంత ఆశ్చర్యంలో తలమునకలుగా వున్నాడు. పదేపదే ఆ వీడియోని రివైండ్ చేసి చూస్తున్నాడు.
“బాస్ ఆ దిశగా ప్రయోగాలు వద్దందికదా, ఆపేసాను. ఇప్పుడేంచెయ్యాలో ఛెయిర్పర్సన్గా మీరే చెప్పాలి”” అన్నాడు.
శ్యామ్ చిన్న నవ్వాడు. “ఆమో! బాస్ వద్దన్నది నీ ప్రయోగాలని కాదు, ఆ పేరుతో వద్దని”” అన్నాడు. ఆమో కుడి మెదడులో వుండే
వైట్మేటర్లో చిన్న మెరుపు మెరిసినట్టైంది.
“బాస్ కేవలం ఒక సంస్థ మాత్రమే కాదు, వ్యవస్థ. ప్రతివారూ దీన్ని తమదిగానే భావిస్తారు, చిన్న అపజయాన్నికూడా తట్టుకోలేనంత
పొజెసివ్నెస్తో. ప్రయోగాలన్నాక వైఫల్యాలు తప్పవు. కానీ టైం ట్రావెల్ అనేది ప్రోవెన్ ఇంపాజిబులిటీ. దానిమీద మళ్ళీ ప్రయోగాలంటే చాలా వ్యతిరేకతని ఎదుర్కోవాలి. అది అవసరమా?”” అతని గొంతు చిన్నపిల్లవాడికి నచ్చజెప్తున్నట్టుగా చాలా మంద్రస్థాయిలో వుంది.
ఆమోకి అర్థమైంది. తను ఈ ప్రయోగాలని చెయ్యాలి, వేరే ప్రయోజనం కోసం. ఒకవేళ అది కాలనౌకే అయితే యాదృచ్ఛికంగా కనిపెట్టినట్టౌతుంది. తనకి తగినంత క్రెడిట్ రాదు. ఆమో కాలనౌకని కనిపెట్టాడని అనరు. యూఎఫ్వోలమీద ప్రయోగాలు చేస్తుంటే ఇది బయటపడింది అంటారు. ఐనాసరే, ఈ ప్రయోగాన్ని తను కొనసాగించాలి.
తన వ్యక్తిగత అవసరంకోసం. . . కాలగమనంలో ఎక్కడో చిక్కుపడిపోయి ఒక చిక్కుముడిలా జ్ఞాపకాలలో కదుల్తూ నిరంతరం వెంటాడే పద్మమాలికనీ, మైత్రీపాలుడినీ వెతికిపట్టుకోవాలంటే ఆ కాలనౌకని పట్టుకుని తీరాలి. భారతదేశపు చరిత్రలో ఒక శాస్త్రవేత్తగా తన వునికిని స్థిరపరుచుకునేందుకు కూడా ప్రయోగాలని కొనసాగించాల్సిన అవసరం వుంది ఆమోకి. అతను చేసే ప్రయోగాలకి బాస్ సహకారం కావాలి. ఈ పరికరాలు, ప్రయోగశాల ఇవన్నీ స్వంతంగా సమకూర్చుకోలేడు. ఒక నిరంతర విద్యార్థికి ఇక్కడ లభించే అవకాశాలు అతను వదులుకోలేడు. కొన్నిటిని కోరుకున్నప్పుడు ఇంకొన్నిటిని వదులుకోవడానికి సిద్ధంగా వుండాలి.
ఒక్క క్షణంసేపు బాస్ కోణంలోంచీకూడా ఆలోచించాడు. అర్థమైంది. అతికష్టంమీద సంపాదించుకున్న ఈ స్థానాన్ని, దేశంలోని యువతకి దిశానిర్దేశం చెయ్యగలిగి, అందరికీ జీవితంలో ఒక్కసారేనా చేరుకోవలిసినంత అత్యుత్తమమైనదిగా మలుచుకున్న స్థానాన్ని ఒకరి వ్యక్తిగత ప్రయోజనంకోసం రిస్క్‌లో పెట్టుకోవలిసిన అవసరం బాస్‌కి వున్నట్టు అనిపించలేదు.
ఈ విషయాలన్నిటినీ ఆమో అతికొద్ది సమయంలో సమీక్షించుకున్నాడు. మనసు సరిచేసుకున్నాడు. ముభావాన్ని వదిలిపెట్టి శ్యాంతో మామూలుగా వుండే ప్రయత్నంచేసాడు. కొద్దిసేపటికి ప్రయత్నపూర్వకంగా అంటే కృతకంగా మొదలుపెట్టిన సంభాషణ సహజంగా మారిపోయింది.
అంతరిక్షంలో పరిస్థితులగురించీ, అక్కడి లేబ్ గురించీ ఎన్నో ప్రశ్నలు అడిగాడు శ్యాం. అతనికి అంతరిక్షప్రయోగాలమీద చాలా ఆసక్తి వుంది.
“ఎంబియ్యే చేసి ఈ సీట్లో కూర్చున్నానుగానీ నాకు మీరు చేసే ప్రయోగాలంటే చాలా ఆసక్తి. ముఖ్యంగా నువ్వు స్పేస్‌లోకి వెళ్ళేవంటే రిజల్ట్స్ కోసం ఎంతో ఎదురుచూస్తాను”” అన్నాడు.
“మన లేబ్ వున్నచోట యూఎఫ్‌వోలు తరుచుగా కనిపిస్తాయి. ఐతే అవి చాలా దూరంలో వుంటాయి. ఇలా కనిపించి అలా మాయమైపోతుంటాయి. ఈ ప్రయోగాన్ని ముగించడానికి మరో ఆర్నెల్ల టైం కావాలి నాకు. ఈ దూరాలని కచ్చితంగా అంచనా వేసి చెప్పగలిగే ఆస్ట్రోఫిజిస్ట్ని నాకు తోడుగా వుండేలా పంపగలరేమో చూడండి”” అన్నాడు ఆమో.
శ్యాం కొద్దిక్షణాలు ఆలోచించాడు.
“ధన్యాపార్థసారథి అని. . . కొత్తగా వచ్చిన ఆస్ట్రోఫిజిస్ట్. చాలా తెలివైన అమ్మాయి. ఈ మధ్యనే మాస్టర్స్ పూర్తిచేసి, రిసెర్చి అవకాశంకోసం చూస్తోంది. స్పేస్‌లో చెయ్యడానికికూడా అప్లికేషన్ పెట్టుకుంది. ఆమె కళ్ళల్లో కోన్స్, రాడ్స్ వుండవు. మూలమట్టాలు, వృత్తలేఖినులు వుంటాయి. మెదడులో న్యూరాన్లు వుండవు. అంకెలుంటాయి. నీకు పెర్ఫెక్ట్గా సూటౌతుంది. తనని రికమెండ్ చేయనా?”” అడిగి అతని జవాబుకోసం ఎదురు చూడకుండా చెప్పడం అవగానే ఆమెకి ఫోన్ చేసి ఎక్కడున్నా వెంటనే ఇక్కడికి రమ్మని అభ్యర్ధించాడు.
ఈలోగా ఆమో ఇచ్చిన డిస్క్‌ని మొదటిసారి చూసినంత సంభ్రమంగా మరోసారి చూడసాగాడు శ్యాం. ఏవో ప్రశ్నలు అడుగుతున్నాడు. ఆమో జావాబులు చెప్తున్నాడు.
గది గుమ్మం దగ్గిర మృదువైన చప్పుడు. . . ఆమో తలతిప్పి చూసాడు. అప్పుడే విచ్చుకున్న గులాబీల పరిమళం. . . లావెండర్ పరిమళాలతో మిళితమై ముక్కుని తాకింది. బాదంరంగు ప్రింటున్న లేతగులాబీరంగు కాటన్ చీర, బ్లౌజు, పొడవైన జడ, అందులో జంటగులాబీలు. . . ఇప్పటి ఆడపిల్లలు ఇలాగే వుంటున్నారు. ట్రెండు, ఫాషన్లు మారాయి.
ఆమేనా ధన్య? తీవ్రమైన భావసంచలనం కలిగింది. ఎంతోకాలం తర్వాత కలుసుకున్న పాత మితృరాలిని. . . ప్రాణస్నేహితురాలిని . . . చూసినట్టనిపించింది. ఒక్క మాటలో చెప్పాలంటే నెగటివ్‌గా ఛార్జైవున్న అణువు పాజిటివ్‌గా ఛార్జైవున్న అణువు చుట్టూ ఎలా తిరుగుతుందో అలా౦టి స్థితికి చేరుకుంది అతని మనసు. . . మొదటిచూపులోనే.
అతన్ని చూడగానే ఆమె కళ్ళలో ఆశ్చర్యం, గౌరవం. . . ఇంకా అలాంటి ఎన్నెన్నో భావాలు.
“శ్యాం, దేనికి రమ్మన్నారు?”” లోపలికి వస్తూ అడిగింది.
“ఆమో! తనే ధన్య. . . ధన్యాపార్థసారథి. . .” ” అని ఆమెని పరిచయం చేసి, ఆమోని చూపిస్తూ, “ఎలాంటి పరిచయం అక్కర్లేని వ్యక్తి. మా అందరికీ ప్రియమైన ఆమో. ప్రొఫైల్ నేమ్ ఆనందమోహన్”” అన్నాడు.
“తెలుసు”” చిరునవ్వుతో అంది.
ఆమో చెయ్యి చాపాడు. ఆమె చెయ్యి మృదువైన పూమొగ్గలా అతని చేతిలో ఇమిడిపోయింది. ఆమె సన్నగా కంపించడం తెలుస్తోంది. ఎందుకలా? ఆమె స్పర్శలోంచీ సాన్నిహిత్యం ఒక వరదలా ఆమోలోకి ప్రవహించింది. తెలియని అలజడి. ఎందుకలా? చెయ్యి వదిలేసాడు.
“స్కూల్లో చదువుతున్నప్పట్నుంచీ బాస్‌లో చదివే పిల్లలగురించి తరుచు చెప్పేవారు మా టీచర్లు. మీగురించి చాలా వినేవాళ్ళం. అప్పట్నుంచీ హీరో వర్షిపే. మీ ఆర్టికల్స్ ఒక్కటీ వదలకుండా చదువుతాను. మిమ్మల్ని చూసే అవకాశంకోసం చాలా ఎదురు చూసాను” అంది.
ఆమో చిరునవ్వు నవ్వాడు. తన కలలాగా, వూదాపచ్చ గాలిపటంలాగా తమ కలయికకూడా జీవితాన్ని నిర్దేశించే మరో బలమైన శక్తి కాగలదని అనిపించింది అతనికి.
శ్యాం ఆమెకి కుర్చీ చూపించాడు. థేంక్స్ చెప్పి కూర్చుంది. ఆమో ఇచ్చిన డిస్క్ చూపించాడు. చాలా ఆసక్తిగా చూసింది పీపీటీ క్రిస్టల్‌ని అతను కాలనౌక అనటం ఆమెకి బాగా నచ్చింది.
“ఆమో ప్రయోగాలు ఇంకా పూర్తవలేదు. మళ్ళీ వెళ్ళబోతున్నాడు. నువ్వూ అతనితో వెళ్తావా?”” సంభాషణమధ్య అడిగాడు శ్యాం.
ఆమె షాకైంది. స్పేస్‌లోకి ఎవర్నేనా పంపించాలంటే దానికి చాలా ప్రొసీజరు వుంటుంది. వెయిటింగ్ లిస్టే కొండవీటి చాంతాడంత వుంటుంది. తను చాలా జూనియరు. అలాంటిది తనని రికమెండు చెయ్యటం. . . ఇంత పెద్దపెద్ద నిర్ణయాలు ఇలాంటి ఇన్ఫార్మల్ మీటింగ్స్‌లో తీసుకుంటారంటే నమ్మలేకపోయింది.
“ఇప్పటిదాకా నేను మూడుసార్లు స్పేస్‌లోకి వెళ్ళాను. ఒకసారి కెమిస్టుతోటీ మరోసారి ఫిజిస్ట్తోటీ మూడోసారి బయాలజిస్ట్తోటీ కలిసి పనిచేసాను. ఇప్పుడు నాకు నా ఫీల్డులోనే వున్నవాళ్ళ హెల్ప్ కావాలి. సీనియర్సైతే ఎవరి ప్రయోగాలు వాళ్ళవి. కలిసి పనిచెయ్యగలిగే అవకాశం వుండదు”” వివరించాడు ఆమో.
ధన్యకి వివరణ అక్కర్లేకపోయింది. సంభ్రమంలో తలమునుకలుగా వుంది.
“ఆ పీపీటీ క్రిస్టల్‌ని ఎలాగైనా పట్టుకోవాలి ఆమో! నువ్వది చెయ్యగలవు. నువ్వుమాత్రమే చెయ్యగలవు. నీకేం కావాలో చెప్పు. అవసరమైతే నేను ప్రిమియర్తో స్వయంగా మాట్లాడుతాను. కానీ నేను చెప్పింది మర్చిపోవుకదా? మనం గ్రహాంతరవాసుల స్పేస్‌షిప్ పట్టుకోబోతున్నాం, కాలనౌకని కాదు. నో టైం హంట్స్. సరేనా?”” అన్నాడు శ్యా౦. ఆమో సగం తృప్తితో తలూపాడు.
“ముందు మన స్పేస్లాబ్కీ దానికీ మధ్యగల దూరం, ఏ కోణంలోనైతే అది తక్కువగా వుంటుందో ఆ కోణం ఇవన్నీ లెక్క వెయ్యాలి. అత్యంత బలమైన లేజర్ అయస్కాంతాన్ని తయారు చెయ్యాలి. అది ఆ నౌకని మన షిప్ వైపు ఆకర్షించాలి. వీటికి నేను ప్రాజెక్టు తయారుచేసి ఇస్తాను” అన్నాడు.
“మీరు చెప్పిన దూరాలని నేను లెక్క వెయ్యగలను”” అంది ధన్య.
ఆమో తలూపాడు.
క్రమంగా ఆమో, శ్యాం జనరల్ టాపిక్స్‌లో పడేసరికి వెళ్తానని లేచింది ధన్య. “”ఇంకా చాలామందిని కలవాలి శ్యాం. మళ్ళీ వస్తాను”” అని ఆమోకూడా లేచాడు.
ఇద్దరూ కాంపస్‌లో పక్కపక్కని నడుస్తున్నారు. ధన్య ఫ్రీగా వుండలేకపోతోంది. ఆమె సన్నగా కంపించడం పక్కని నడుస్తున్న ఆమోకి తెలుస్తోంది. అది భయం మాత్రం కచ్చితంగా కాదు. మరేమిటి? తన వునికిని గుర్తించినట్టు ఆమె స్పందనా? తనలాగే ఆమెకూడా దగ్గరితనాన్ని అనుభవిస్తోందా?
“నా క్వార్టర్ ఇక్కడే. అభ్యంతరం లేకపోతే ఒక కప్పు టీ. . .” ” అడిగింది. ఆమో తలూపాడు. ఆమెని అప్పుడే వదిలిపెట్టి వెళ్ళాలని లేదు . ఇంకొంతసేపు గడపాలని వుంది.
ఇద్దరూ కలిసి ధన్య క్వార్టర్‌కి వెళ్ళారు. విశాలమైన ఆవరణలో కట్టిన ఇండిపెండెంట్ క్వార్టర్స్ అవి. ఇన్టర్న్స్కి ఇస్తారు. ప్రతి విద్యార్థికీ ఏదో ఒక దశలో బాస్‌కి వచ్చి కనీసం ఆర్నెల్ల ఇన్టర్న్షిప్ చెయ్యాల్సి వుంటుంది. ఆ పిల్లలు ఇక్కడే వుంటారు. ఇది ఒకరకంగా చెప్పాలంటే బాస్ యొక్క బాహ్యపరిధి. ఆ తర్వాతేవాళ్ళకి కోర్స్ పూర్తిచేసినట్టు సర్టిఫికెట్, వుద్యోగార్హత వస్తాయి.
ఇంటిచుట్టూ నేలమీదా కుండీలలోనూ గులాబీ మొక్కలు. వాటినిండా విరగబూసిన పువ్వులు. ఇవేకాకుండా క్రీపర్స్. వాటినిండా గుత్తులుగుత్తులుగా తలుపు, ఎరుపు, గులాబీరంగు గులాబీలు. . . మనసునిండా వున్న ఇష్టంపైకి వొలికినట్టుగా వుంది.
“గులాబీలంటే మీకు ఇష్టమా?” ” అని అడిగాడు.
“ప్రాణం”” అంది. ““ఎవరు పెట్టారోగానీ నేను ఇక్కడికి వచ్చేప్పటికే చాలా మొక్కలున్నాయి. వాటన్నిటినీ ట్రిమ్ చేసి ఆర్డర్లో పెట్టాను. ఎన్నిపువ్వులో చూడండి. దాదాపు పది రంగులున్నాయి. ఒక్క పింక్‌లోనే ఐదారు షేడ్స్ వున్నాయి”
ఆ డిజిటల్ ఫ్రేం పంపినది ఎవరు? ఆమో వూహకి అందీ అందనట్టుగా వుంది.
“ఐదు నిముషాలు కూర్చోండి. టీ చేసి తీసుకొస్తాను. తాగుతూ మాట్లాడుకుందాం” అని, చూడటానికి కొన్ని పుస్తకాలు ముందు పెట్టి లోపలికి వెళ్ళింది. ఆమె వంటింట్లో చేస్తున్న శబ్దాలు వినిపిస్తున్నాయి తరువాత టీ సువాసన. అన్నట్టుగానే ఐదునిముషాల్లో ట్రేలో రెండు కప్పులతో వచ్చింది. ఒకటి ఆమోకిచ్చి, రెండవది తను తీసుకుని అతని ఎదురుగా కూర్చుంది.
ఏమీ మాట్లాడుకోలేదు. మౌనమే ఇద్దరిమధ్యా సంభాషణ అయింది. ఎంతో కాలంగా పరిచయం వున్న వ్యక్తులు. . . ఒకరి గురించి మరొకరికి పూర్తిగా తెలిసినవాళ్ళు మౌనంగానే భావాలు ఎలా పంచుకుంటారో అలా వుంది ఆమోకి. తెలియని ఒక ఆత్మీయత. . . ఎన్నో యుగాలుగా కలిసి వుంటున్నామన్న భావన. . . వచ్చి చాలాసేపైంది, ఇంక వెళ్ళాలనే సూచన మెదడు ఇస్తున్నా దాన్ని పాటించలేకపోతున్నాడు. ధన్యలో వున్న ఏదో ఆకర్షణ అతన్ని కట్టిపడేస్తోంది.
“టీ చాలా బావుంది”” అన్నాడు.
ఆమె కళ్ళు మెరిసాయి.
“ఇంకో కప్పు తాగుతారా?” ” అడిగింది. ఆమో తలూపాడు. ఆమె వెంటనే వెళ్ళి కెటిల్ తెచ్చింది. రెండో కప్పు తాగాక ఇంకా అక్కడే వుండటానికి మరే కారణం కనిపించలేదు.
“ఇంక వెళ్తాను. థా౦క్స్ ఫర్ యువర్ టీ” ” అన్నాడు అతి కష్టంమీద వెళ్ళడానికి లేస్తూ.
“వన్ మినిట్. ఇక్కడకి వచ్చి ఈ మొక్కదగ్గిర నిలబడండి. ఒక స్కెచ్చి గీస్తాను”” అంది, పెన్సిలు, పాడ్ తెచ్చుకుని. ఫొటో తీసుకుందాం అనలేదు, సెల్ఫీ అనలేదు, బొమ్మ గీస్తానంది. ఆమో ఆమె చెప్పినట్టే వెళ్ళి నిండా పూలున్న గులాబీమొక్క వెనుక నిలబడ్డాడు.
కదలకండి, అలా నిలబడండి, ఇలా చెయ్యి వేయండి అని డైరెక్షన్స్ ఇస్తుందేమోననుకున్నాడు, ఏమీ లేదు, తిప్పలన్నీ తనే పడింది. యాంగిల్‌కి తనే సర్దుకుంది. చకచక పది పెన్సిలు గీతలు గీసి-
“ఇదుగో మీ బొమ్మ” అని చేతిలో పెట్టింది.
“వండ్రఫుల్”” అన్నాడు ఆమో ఇంకేమీ మాట్లాడటానికి తోచక. తనెలా వున్నాడో అలాగే వున్నాడు. పూలమొక్కా అలాగే వుంది. బేక్గ్రౌండూ అచ్చుగుద్దినట్టుంది. పెన్సిలు గీతల్లో ఇంత జీవం సాధ్యమా? అది అంత తేలికైన విద్య కాదు, ఆమె సాధన చేసి సాధ్యం చేసుకుని వుంటుంది.
“గులాబీరేకుల వర్షం. . .నేను . . . డిజిటల్ ఫోటో ఫ్రేం. . .పంపింది మీరేనా?” అడిగేసాడు.” అడగకుండా వుండలేకపోయాడు. ఆమేనని అర్థమైంది. కానీ అడిగాడు.
“ఒక మేగజైన్లో పడ్డ మీ ఫోటో తీసుకుని ఫోటోషాప్‌లో చేసాను”” అంది.
“థేంక్స్ ఫర్ ఎవ్రీథింగ్. . . మరి నేను వెళ్తాను. ఇంకా చాలామందిని కలవాలి””
“మీ అంతటివారు పిలవగానే వచ్చినందుకు నేనే థేంక్స్ చెప్పాలి. బై”” అంది. మాటల్లో అలా అందిగానీ ఆమె చూపుల్లో ఒక దిగులు. . . కనీ కనిపించనట్టు. మళ్ళీ ఎప్పుడొస్తారు అని అడుగుతున్నట్టే వుంది.
పశ్చిమగోదావరి జిల్లా రెడ్డి పోలవరంలో 16 July, 1962 లో జననం. వరంగల్‌లో వుద్యోగం. హెడ్పోస్ట్‌మాస్టర్గా వరంగల్‌లో స్వచ్చందపదవీ విరమణ.
వివాహం శ్రీ చదలవాడ విష్ణుమూర్తిగారితో. వారు డెప్యూటీ ఏగ్జిక్యూటివ్ ఇంజనీరుగా చేసి రిటైరయారు.
మొదటి కథ అనగనగా 1978లో వనితాజ్యోతి మాసపత్రికలో అచ్చైంది. వీరివి 225కి పైగా కథలు, 9 నవలలు వివిధ పత్రికల్లో ప్రచురించబడ్డాయి. గూడు, సింధూరి, గుండెలోతు అనే కథాసంపుటాలు, నీలినక్షత్రం అనే నవల పుస్తకాలుగా వచ్చాయి. సింధూరి అనే సంపుటానికి శ్రీమతి సుశీలా నారాయణ రెడ్డి అవార్డు 2005 లో వచ్చింది. ప్రేమలోంచీ ప్రేమలోకి అనే నవలకి ఆంధ్రభూమి ప్రథమ, తిరస్కృతులు, నీకోసం నేను అనే నవలలకి ఆంధ్రభూమి ద్వితీయ, 5-3-2 అనే నవలకి కినిగె ద్వితీయ బహుమతులు వచ్చాయి. ఎంతెంతదూరం? అనే కథకి విపుల కన్సొలేషన్ బహుమతి, శ్రీమతి రంగవల్లి ట్రస్ట్ అవార్డు వచ్చాయి. ఇవికాక కథలకు మరో ఏడెనిమిది బహుమతులు వచ్చాయి.
కథలకు కాన్వాస్ పెద్దదిగా వుండాలనేది వీరి అభిప్రాయం.