ఊదాపచ్చనౌక -4 by S Sridevi

  1. ఊదాపచ్చనౌక – 1 by S Sridevi
  2. ఊదాపచ్చనౌక -2 by S Sridevi
  3. ఊదాపచ్చనౌక -3 by S Sridevi
  4. ఊదాపచ్చనౌక -4 by S Sridevi
  5. ఊదాపచ్చనౌక -5 by S Sridevi
  6. ఊదాపచ్చనౌక – 6 by S Sridevi
  7. ఊదాపచ్చనౌక – 7 by S Sridevi
  8. ఊదాపచ్చనౌక – 8 by S Sridevi
  9. ఊదాపచ్చనౌక 9 by S Sridevi
  10. ఊదాపచ్చనౌక – 10 by S Sridevi
  11. ఊదాపచ్చనౌక – 11 by S Sridevi
  12. ఊదాపచ్చనౌక – 12 by S Sridevi

తొలిచూపులో ప్రేమ. . . నిజమేనా? సాధ్యపడుతుందా? అది ప్రేమేనా? మరేదైనా అనుబంధమా? క్రిందటి జన్మ తాలూకూ అసంపూర్ణ సమీకరణం తమ మధ్య వుందా? పూర్తి చెయ్యమని అది ప్రేరేపిస్తోందా? ఆమో తలనిండా ఎన్నో ప్రశ్నలు.
ఇంటికి వచ్చాడుగానీ మనసునిండా దిగులు. ఏదో కోల్పోయినట్టనిపిస్తోంది. ధన్య మరీమరీ కావాలనిపిస్తోంది. ఆమె దగ్గరికి వెనక్కి వెళ్ళిపోవాలని బలమైన కోరిక. దాన్ని దాచుకుందుకు సంఘర్షణ. తాళం తీసుకుని మంచానికి అడ్డంగా వాలిపోయాడు. కళ్ళు మసగ్గా అనిపించాయి. చేత్తో తుడుచుకుంటే వెచ్చటి కన్నీళ్ళు తగిలాయి.
పద్మమాలిక. . . మైత్రీపాలుడు. . . వీళ్ళతో ముడిపడ్డ తన బాల్యం. . . వాళ్ళే నిర్దేశించిన తన ప్రస్తుతపు గమ్యం. ఎవరీ ధన్యాపార్థసారథి? గతంలో ఆమె ఎవరు? ఎందుకు తను అందర్లా వుండలేకపోతున్నాడు? ఒకే ఒక్కసారి చూసిన అమ్మాయిగురించి తనకంత ఆవేదన ఎందుకు? గుండె బరువెక్కిపోతోంది. ఆ బరువంతా కన్నీటిరూపాన్న వెలువడుతోంది. ఎంతసేపు అలా వున్నాడో. ఒళ్ళంతా వెచ్చగా అనిపించడం తెలిసింది. సమ్మెట్లతో బలంగా కొడుతున్నంత తలనెప్పి.
అటెండెంటు భోజనం తెచ్చి పెట్టాడు. దాన్ని వెనక్కి పంపేసి స్ట్రాంగ్ కాఫీ తెప్పించుకున్నాడు.
“ఏమైనా ప్రాబ్లమా ఆమో సాబ్?”” అటెండెంట్ కళ్ళలోనూ మాటల్లోనూ ఆదుర్దా. ఆమో నుదురు, పక్కలు తాకి చూడాలన్న కోరికని బలంగా ఆపుకున్నాడు తామిద్దరి మధ్యా వున్న అంతరాన్ని గుర్తించి.
“అలాంటిదేమీ లేదు. పొద్దుట తిన్న టిఫెను అరగలేదు. కడుపులో బరువుగా వుంది””
“ఏమైనా కావాలంటే పిలవండి”” అని చెప్పి అటెండెంటు వెళ్ళిపోయాడు.
పడుకుంటే వెంటనే గాడనిద్ర పట్టేసింది. దాదాపు రెండగంటల తర్వాత మెలకువ వచ్చింది. సాయంత్రం ఐదింటికి ఫెలిసిటేషన్ వుంది. ఇంకో గంటవ్యవధి వుంది. దానికి కొంత ప్రిపేరయ్యాడు. మనసంతా అల్లకల్లోలంగానే వుంది. ధన్య గుర్తొస్తోంది. పద్మమాలిక అలజడి రేపుతోంది. మనసులోంచీ ఎవరిని తోసెయ్యాలో, ఎవరు లేకపోతే ప్రశాంతంగా వుంటుందో అర్థమవలేదు. అంతా గజిబిజిగా వుంది. ఐదుగంటలకి కన్వెన్షన్ హాల్‍కి బయల్దేరాడు.
హాలంతా క్రిక్కిరిసిపోయి వుంది. బాస్ కేంపస్ కేంపసంతా అతనికోసం ఎదురుచూస్తోంది. ప్రవేశద్వారం దగ్గిరే హారతి ఇచ్చి పూలదండ వేసి మంగళవాయిద్యాలతో తీసుకెళ్ళారు. వేదిక దగ్గిరకి రాగానే శ్యాం సాదరంగా ఆహ్వానించాడు. ప్రిమియర్ చిరునవ్వు నవ్వారు.
“నువ్వు అసాధ్యుడివి”” అనే భావం అందులో వ్యక్తమై౦ది.
హర్షధ్వానాలమధ్య ఆమో స్టేజి ఎక్కాడు. అతని కళ్ళు ధన్య కోసం వెతికాయి. ఆమె వుంది. జనం మధ్య తప్పిపోయిన చిన్నపిల్లవాడికి తల్లి కనిపిస్తే ఎలా వుంటుందో అంత సంతోషం కలిగిందతనికి.
ఉపన్యాసాలు మొదలయాయి. ప్రిమియర్ ముందు మాట్లాడాడు. ఆ తర్వాత శ్యాం మాట్లాడాడు. ఆమో ప్రయోగాలు సీడీ వేసి చూపించారు. వూదాపచ్చరంగులోకి మారుతున్న ఫ్లయిగ్ సాసర్ని చూడగానే అందర్లో దిగ్భ్రాంతి. అదేంటి? అలా ఎందుకు మారుతోంది? ఎలా మారగలుగుతోంది? అందులో ఎవరున్నారు? ఏలియన్సా? ఎన్నోగుసగుసలు.
“ఇప్పటివరకూ ఇది మాత్రమే సాధించాం. ఇదేం చిన్న విజయం కాదు. ఇకముందు సాధించాల్సినది చాలా వుంది. ఆ ఫ్లయింగ్ సాసర్ని పట్టుకోవాలి. ఆ టెక్నాలజీ తెలుసుకోవాలి. . . అందుకు ఆమోయే సరైనవాడు. తను మొదలుపెట్టిన ప్రయోగాన్ని తనే పూర్తి చెయ్యాలి”” అన్నాడు ప్రిమియర్. ఎక్కడా టైం హంట్ ప్రస్తావన లేదు.
“మన ప్రియతమ ఆమో! నిత్యం వార్తల్లోకి ఎక్కుతుండే యూఎఫ్‍ఓల రహస్యాన్ని బహిర్గతం చెయ్యబోతున్నాడు. గివ్ అ బిగ్ అప్లాజ్” ” అని శ్యాం అనగానే హాలంతా చప్పట్లతో మార్మోగింది.


“ఆమో. . . ఆమో! ఇలా చూడు. కళ్ళు తెరిచి చూడు. ఎలా వుంది నాన్నా?”” తల్లి గొంతు. . .ఎక్కడో దిగంతాల అవతల్నుంచీ వినిపిస్తున్నట్టుగా. అతి కష్టమ్మీద కళ్ళు తెరిచి చూసాడు. కన్నీళ్ళతో తడిసిన తల్లి ముఖం. పక్కనే తండ్రిది. అతని ముఖంలోకి వంగి చూస్తూ ఆతృతగా అడుగుతోంది ఆమె.
ఏమైంది తనకి? గుర్తు తెచ్చుకోవాలని ప్రయత్నించాడుకానీ సాధ్యపడలేదు. విపరీతమైన తలనెప్పి. వెలుతురు భరించలేకపోతున్నాడు.
“స్పృహలోకి వచ్చాడుగా? నార్మలైపోతాడు. మీరేం కంగారుపడకండి”” డాక్టరు అనటం వినిపించింది. తరువాత ఇంజెక్షను. నొప్పి. . . మళ్ళీ మగత.
ఇంకో రెండురోజులతర్వాత పూర్తిగా స్పృహలోకి వచ్చాడు.
“అబ్బ. చాలా భయపెట్టేసావురా! వారంరోజులైంది, వంటిమీద స్పృహన్నది లేదు. క్వార౦టైన్‍లోంచీ బయటికి వచ్చిన రోజే ఇలా జరగటంతో ఇన్‍ఫెక్ట్ అయావనుకున్నారు అంతా. రూంలో వళ్ళు తెలియకుండా పడివుంటే అటెండెంటు ఆఫీసులో చెప్పాడట. వాళ్లు వెంటనే హాస్పిటల్లో చేర్చారు. ధన్య అనీ. . . ఇదుగో, ఈ అమ్మాయే మేం వచ్చేదాకా నిన్ను చూసుకుంది”” అంది సంధ్య పక్కనే నిలబడి వున్న ధన్యని చూపిస్తూ.
ఆమోకి ఒకొక్కటీ గుర్తొచ్చింది. ధన్యకోసం తను ఏడ్చాడని గుర్తొచ్చి, సిగ్గుతో ముఖం ఎర్రబడిపోయింది. ఆమెని సూటిగా చూడలేకపోయాడు. ఆ సాయంత్రం ఫెలిసిటేషన్ మీటింగ్‍కి వెళ్ళాడు. అక్కడినుంచీ ఎలా ఇంటికి వచ్చాడో గుర్తులేదు. ఆ తర్వాత ఏం జరిగిందో కూడా గుర్తు రాలేదు. ఒక్కటి మాత్రం అర్థమైంది. ధన్య తనని చాలా డిస్టర్బ్ చేసింది.
“మీకు జ్వరం వచ్చిందనీ హాస్పిటల్లో చేర్చారనీ శ్యాం నాకు ఫోన్ చేసి చెప్పారు. మీ ఫెరెంట్స్ వచ్చేదాకా హాస్పిటల్లో వుంటానన్నాను. . .ఇన్ ఫాక్ట్. . . అవసరం లేదన్నారనుకోండి, కానీ నేనలా వదిలిపెట్టలేకపోయాను. నేను అడగ్గానే మా యింటికి వచ్చారు, టీ తాగారు, మళ్ళీ ఫెలిసిటేషన్లో చూసాను. ఇలా మంచంమీద స్పృహలేకు౦డా వుండటం చూసి చాలా బాధనిపించింది. రెండురోజులు అసలు స్పృహలోనే లేరు. . . ఆస్ట్రానమిస్ట్ ఆమోని అలా చూసి తట్టుకోలేకపోయాను”” అంది ధన్య.
అతను చిన్నగా నవ్వాడు. ఆమె ఎదురుగా వుండటం అతనికి చాలా సాంత్వననిచ్చింది. తను పొరబడ్డాడు. పద్మమాలిక తనలో రేపే అలజడికి జవాబు ధన్య. అంతేగానీ ధన్యే అలజడి కాదు.
“నేనింక ఇంటికి వెళ్తాను. ఫ్రెషై మళ్ళీ వస్తాను”” అంది ధన్య. ఆమో ఆమె ముఖంలోకి చూసాడు. భావాలలో ఏదో స్వల్ప మార్పు.
“ఆమోని డిశ్చార్జి చేస్తామన్నారుగా, ఇంటికే వచ్చెయ్. ధన్యా! నీ భోజనం మా యింట్లోనే. నేనున్నన్నిరోజులూ మాతోనే తిందువుగాని”” అంది సంధ్య.
“ఐతే ఆమోకోసం రసం చేసి తీసుకొస్తాను. నేను చాలా బాగా చేస్తాను”” అని వెళ్ళిపోయింది.
“చాలా మంచి పిల్ల”” అంది సంధ్య.
ఆమో తలూపాడు.
డిశ్చార్జి ఫార్మాలిటీస్ పూర్తయాయి. ప్రతివారూ అతనికి సర్వీస్ చెయ్యడం ఒక అవకాశంగానే అనుకుంటున్నారు.
“జాగ్రత్త. మరీ బైట తిరక్కండి. అలసట పడకండి… కనీసం కొద్దిరోజులు”” చెప్పాడు డాక్టరు.
“థేంక్స్ డాక్టర్. చాలా కేర్ తీసుకున్నారు”” అన్నాడు ఆమో.
“బాస్‍కి మీరు చేస్తున్నదానిముందు ఇదెంత? ఎంతోమంది యువత మిమ్మల్ని తమని తాము చూసుకునే అద్దంలా భావిస్తున్నారు. మీలాగ తమని తాము తయారుచేసుకుంటున్నారు. మీకు తగ్గాలని ఎంతోమంది పువ్వులూ, ప్రేయర్ కార్డ్స్ పంపారు. గుడిలో పూజలు చేయించారు. ఛెయిర్ పర్సన్ శ్యాం మీగురించి చాలామాట్లు ఫోన్ చేసి తెలుసుకునేవారు. స్వయంగా ప్రిమియర్ ఫోన్ చేసారు”” అన్నాడు డాక్టరు.
ఆమో మనసు లోలోపల ఎక్కడో చిన్న జ్వాల. ఇంత అభిమానం ఒక వ్యక్తి పొందాలటే అతను విజయాల శిఖరంమీద నిలబడి వుండాలి. దాన్ని నిలబెట్టుకోవాలంటే ఆ శిఖరాన్నించీ ఎప్పుడూ దిగకూడదు. అదేకదా, శ్యాం తనతో అన్నది? టైం హంట్ సాధ్యపడదని ముద్రపడిన సిద్ధాంతం. అదొక మూసివెయ్యబడిన దారి. మరోదారిని తెరవటంద్వారా ఆ ముద్రని చెరపాలి. తన విజయ శిఖరాన్ని మరింత ఎత్తుకి మార్చాలి.
తనలో రేగిన అసంతృప్తి జ్వాలని చిన్న చిరునవ్వుగా మార్చి పెదవుల మీద నిలబెట్టాడు. డాక్టరుకి బై చెప్పి కదిలాడు. బాస్ కేంపస్‍లో ప్రైవేటు వాహనాలని అనుమతించరు. ఆమో వున్నది కమ్యూనిటీ హాస్పిటలు. బాస్‍కి చెందినది. పేషెంట్లు డిశ్చార్జైతే అవసరమైనప్పుడు హాస్పిటలే కారు ఇస్తుంది. ఆమోకి శ్యాం కారు పంపించి తన అభిమానాన్నీ, గౌరవాన్నీ ప్రకటించుకున్నాడు.
ఇంటికి చేరుకునేసరికి ధన్య వచ్చి వుంది. ఇంట్లో అక్కడక్కడా గోడలకి సెలోఫెన్ టేపుల్తో అందంగా అలంకరించిన గులాబీలు. వస్తూ తెచ్చిందేమో, గ్లాసుల్లోనూ ఖాళీసీసాల్లోనూ గుత్తులుగుత్తుగా అవే పువ్వులు. సంధ్యకి ఆ అమ్మాయిని చూస్తే చాలా ముచ్చటగా అనిపించింది. తనకి ఒక కూతురుంటే ఇలాగే వుంటుందనిపించింది. ఆమోకి పెళ్ళైతే వచ్చే కోడలుకూడా ఇలాగే వుంటుందనికూడా అనిపించింది. రెండిటి సారాంశం వొక్కటే. . . ఒక ఆడపిల్ల ఇంట్లో తిరుగుతుంటే బాగుంటుందని.
ఆమో స్నానం చేసి వచ్చేసాడు. అతను వచ్చేసరికి అన్నం వండి, కొంచెం బీరకాయకూర చేసింది సంధ్య. ఎన్నో రోజులుగా సరైన తిండిలేక, ఆవురావురుమంటూ తినేసాడు. ధన్య చేసిన రసం చాలా నచ్చింది. అతన్ని హాల్లో కూర్చోమని, ధన్యని అతన్తో కబుర్లు చెప్తుండమని తను మిగిలినవాళ్లకి వంట మొదలుపెట్టింది సంధ్య.
“చాలా భయపెట్టేసారు. ఒకటే కలవరింతలు. ఏమీ అర్థమవలేదు”” అంది ధన్య. అతన్తో ఎంతో చనువు పెరిగినట్టుగా వుంది. మొదటిరోజులా బెరుకుపడలేదు. ధన్యలో కనిపించిన మార్పుకి కారణం అర్థమైంది. ఆమోకి చాలా ఇబ్బందిగా అనిపించింది. ఏమని కలవరించి వుంటాడు? ధన్యా, నిన్ను వదిలిపెట్టి వుండలేననా? లేక పద్మమాలికనీ, మైత్రీపాలుడినీ కలవరించాడా? మొదటిదైతే ధన్య మొహం చూడలేడు. ఆమెకి తనపట్ల వున్న గౌరవం అంతా సమసిపోతుంది. ఇంక పద్మమాలికా, మైత్రీపాలుడూ ఐతే వివరణ ఇచ్చుకోవాలి. ఎలా అర్థంచేసుకుంటుందో!
“పద్మమాలిక ఎవరు? చాలా కలవరించారు తనగురించి”” అంది ధన్య. ఆమె ముఖంలో ఆశాభంగం గుర్తించాడు. ధన్యకూడా తనగురించీ అలాగే ఫీలౌతోందా? తామిద్దరిమధ్యా తను వూహించినట్టు అసంపూర్ణసమీకరణం వుందా? అదెప్పుడు మొదలైంది? ఈ జన్మలోనా? గత జన్మలోనా? ఇంకా ముందా?
“నీకు టైంహంట్ మీద నమ్మకం వుందా?”” అడిగాడు.
“ఐన్‍స్టీన్ స్పెషల్ థీరీ ఆఫ్ రిలేటివిటీ ప్రకారం సాధ్యం. కానీ ప్రాక్టికల్‍గా సాధ్యపడదనే అనుకుంటున్నాను. మీకు చెప్పదగ్గంతదాన్ని కాదు నేను” అంది ధన్య, అతనలా ఎందుకు అడిగాడో అర్థ౦కాక.
“జన్మలమీద?””
“ఎప్పుడూ ఆలోచించలేదు””
“నాకు నమ్మకం వుంది”” అన్నాడు. ””అప్పుడప్పుడు ఒక కల వస్తుంటుంది. అందులో పద్మమాలిక అనే యువతి వుంటుంది. ఆమెని ఎవరో ఎత్తుకుపోతుంటారు. కాపాడమని ఆర్తనాదాలు చేస్తుంది. అవి నా చెవుల్లో మార్మోగుతుంటాయి. ఆమె ఎవరు? ఎప్పటి వ్యక్తి? నాకెలా పరిచయం? అవి తెలుసుకోవాలంటే టైంహంట్ చెయ్యాలి. గతంలోకి వెళ్ళాలి. గతజన్మలో ఆమె ఎవరో తెలుసుకోవాలి. ఆ పీపీటీ క్రిస్టల్నికూడా నా చిన్నప్పట్నుంచీ చూస్తున్నాను. దాన్నిపట్టుకోవాలి. ఇవే నా ప్రయోగాలు” ఈమాటలన్నీ ధన్యతో చెప్పాననుకున్నాడు ఆమో. అంతర్ముఖుడైపోయాడు. ఒక్కమాటకూడా నోట్లోంచీ రాలేదు. అలాగే చూస్తూ వుండిపోయాడు.
ధన్యకి ఏదో అర్థమైంది. తనకి తనే అర్థం చేసుకుంది.
ఇంతలో సంధ్య ఆమెని భోజనానికి రమ్మంది. రమేష్ సంధ్యలతో కలిసి భోజనం చేసింది.
“మీ నాన్నగారు ఎవరమ్మా? అమ్మేం చేస్తారు?”” అడిగింది స౦ధ్య.
“మాది వరంగల్. నాన్న బేంకు ఆఫీసరు. అమ్మ డాక్టరు”” చెప్పింది ధన్య.
“నీకు బాస్‍కి రావాలని ఎలా అనిపించింది? ఇక్కడికొచ్చి ఎంతకాలమైంది?””
“ఆమో కేరాఫ్ ఇక్కడుంది మరి. తనని చూడలంటే అతనితో కలిసి పనిచెయ్యాలంటే ఇక్కడికి రావాలి””
“నీకు వాడంటే అంత ఇష్టమా?””
“నాకే కాదండీ, ఇక్కడున్న ప్రతివాళ్ళకీ అతనంటే ఇష్టం. అతనొక రోల్ మోడల్”” చెప్తున్నప్పుడు ధన్య ముఖంలో మొదటిరోజు వున్నంత దగ్గరితనం లేదనిపించింది సంధ్యకి. ఒక ఆడపిల్ల అంత చొరవ తీసుకుని రాత్రంతా హాస్పిటల్లో వుంది. ఎంతో ఆదుర్దా చూపెట్టింది. ఇంతలో ఏం జరిగింది? ధన్యకి ఆమోపట్ల వున్న గౌరవం కేవలం వృత్తిపరమైనదేనా? అసలు వీళ్ళిద్దరికీ పరిచయం ఎప్పట్నుంచీ? తను వీళ్ళ పరిచయాన్ని తప్పుగా అనుకుందా? అమోకోసం కంగారుపడుతూ హాస్పిటల్లో ఈ అమ్మాయిని చూడగానే ఎన్నో ఆలోచనలు కలిగాయి. అవన్నీ వూహలేనా? కలలన్నీ కరిగిపోతున్నట్టుగా అనిపించింది.
భోజనాలయాక సంధ్య టేబుల్ సర్దుతుంటే తనూ సాయం చేసింది ధన్య.
“నీకెందుకు, ఇవన్నీ?”” అని వారించినా వినలేదు. అంతా అయాక ఇద్దరూ కూర్చున్నారు.
“పద్మమాలిక ఎవరండీ?””అని అడిగింది.
“ఆమో చెప్పాడా?”” బదులుగా అడిగింది సంధ్య.
“లేదు. తను నిద్రలో కలవరించారు. అడిగితే ఏం మాట్లాడలేదు.మౌనంగా వుండిపోయారు. రెట్టించి అడగలేనుకదా? మీకు తెలుసా? తన ఫియాన్సీనా?” ” ఆమె కళ్ళలో ఏదో నిరాశ. దాన్ని గుర్తించింది సంధ్య.
“ఇన్ని ప్రశ్నలే? ఒక్క నిముషం వుండు చెప్తాను”” అంటూ లేచి లోపలికి వెళ్ళి, ఐదునిముషాలకి మళ్ళీ వచ్చింది. ఈలోగా ధన్యలో ఎంతో సంఘర్షణ. వారంరోజులేనా లేని పరిచయంలో తనిలా అడగడం తప్పేమో! ఆమోని అడిగింది. అతను మౌనం వహించాడు. మళ్ళీ అతని తల్లిని ఎందుకడిగింది? ఎందుకంత కుతుహలం తనకి? ఆమోని మొదటిసారి చూడగానే తన మనసు పురివిప్పిన నెమలిలా ఆడింది. అతనెంతో సన్నిహితుడనిపించింది. అతన్ని ఇంటింటికీ రమ్మనడం పెద్ద సాహసమే. కాని అతను వచ్చాడు. టీ తాగాడు. బాగుందన్నాడు. మెచ్చుకున్నాడు. మరో కప్పు తాగాడు. అదంతా అతని కలుపుగోలుతనం.
అతనికి జ్వరం వచ్చిందని శ్యాం ఫోన్ చేసి చెప్పగానే తల్లడిల్లిపోయింది. అదంతా తన ఫీలింగ్.
తను అతిగా చనువు తీసుకుందేమో!
“ఈ పెయింటింగ్ చూడు”” అంది సంధ్య.
ధన్య అందుకుంది. కాళికాదేవి గుడిముందు కూర్చున్న అందమైన అమ్మాయి చిత్రపటం అది.
“ఆమో కలలోకి తరుచు వచ్చే అమ్మాయి బొమ్మ యిది. ఈమే పద్మమాలిక. ఈమెని ఎవరో ఎత్తుకుపోయారు. ఆమె ఎవరో, ఎవరెత్తుకుపోయారో ఏమీ తెలియదు. అసంపూర్ణమైన కల పదేపదే వచ్చి వాడిని విసిగిస్తుంది. కలంటే నిద్రలో వస్తుంది. మెలకువ రాగానే కరిగిపోతుంది. మర్చిపోతాం. ఈ కల అలాకాదు. జరిగిన విషయంలా కళ్ళకి కట్టినట్టు వస్తుంది. ఈ బొమ్మే దానికి నిదర్శనం. నీతో వాడు ఇదంతా చెప్పలేక మౌనంగా కూర్చున్నాడు”” అంది సంధ్య.
ధన్య చిత్రపటాన్ని అందుకుంది. చాలా సజీవంగా వుంది. అందులోని అమ్మాయి ముఖకవళికలు, ఆమె చుట్టూ వున్న చెట్లూ, గుట్టలూ పువ్వులతోసహా అన్నిటినీ చాలా సూక్ష్మంగా చిత్రించాడు. రంగుల వాడక౦ ఎంతో సహజంగా వుంది. ప్రత్యేకత ఏమిటోగానీ చిత్రపటానికి పొడవూ వెడల్పులే కాక లోతుకూడా తెలుస్తోంది. తనేదో గొప్ప ఆర్టిస్టుననుకుని అతన్ని గులాబీ మొక్కల పక్కని నిలబెట్టి నాలుగు పెన్సిలు గీతలు గీసి ఇదే నీ బొమ్మ పొమ్మంది. మరి అతను? కలలో వచ్చిన అమ్మాయిని సజీవంగా నిలబెట్టాడు.
నవ్వుకున్నాడేమో! అసలంత చనువు ఎలా తీసుకుంది? తల దించుకుంది.
మళ్లీ ఆమె దృష్టి పద్మమాలికమీదికి పోయింది. ఎంత అందంగా వుంది! కళ్ళు చెదిరిపోయేంత అందం. . .పదేపదే ఆమో కలలోకి వస్తోందట. ఇద్దరిదీ జన్మజన్మల బంధమేమో! జన్మలమీద అతనికి నమ్మకం వుందన్నాడు. బహుశ పద్మమాలికని వెతికి పట్టుకుంటాడేమో!
“చాలా బావుంది”” అంది. అది పెయింటింగో, పద్మమాలికో అర్థంకాలేదు సంధ్యకి.
మళ్లీ ఆమోతో మాట్లాడలేదు ధన్య. ఇద్దరూ ఎదురుపడిన సందర్భాలు అరుదు. ఎవరి పనుల్లో వాళ్లు నిమగ్నమైపోయారు. అది కావాలని అతన్ని నివారించడం కాదు. కలవాలని కోరుకోకపోవడం.


అబ్రహం స్పేస్‍నుంచీ తిరిగొచ్చాడు. అతనప్పటికి మరో పదిసార్లు అంటే మొత్తం 143 మెసేజిలు రాసాడు, సెండ్ బటన్ నొక్కకుండా.
పద్ధతి ప్రకారం స్పేస్‍నుంచీ తిరిగి వచ్చిన ప్రతి శాస్త్రవేత్తా బాస్ చెయిర్‍పర్సన్ శ్యాంకి రిపోర్ట్ చెయ్యాలి. అబ్రహం తన ప్రయోగ ఫలితాలున్న రిపోర్టులతో శ్యాంని కలిసాడు. అన్నీ విశదంగా వివరించాడు.
“ఎక్కడో సుదూర గ్రహాలలో మనం ప్రయాణించలేనంత దూరంలో జీవం వున్నట్టుగా సెన్సర్లు గుర్తించాయి. నీలిపచ్చరంగు పేచెస్ కనిపించాయి. ఆ జీవం వృక్షసంబంధమైనది కావచ్చునని నా అంచనా. చెట్లున్నాయంటే మనుషులుకూడా వుండవచ్చు”
శ్యాం ఆశ్చర్యంగా చూసాడు. తన శాస్త్రవేత్తల ప్రయోగాలు అతనికి ఎప్పుడూ ఆశ్చర్యాన్నే ఇస్తాయి.
“కానీ శ్యాం, అక్కడ చెట్లున్నా మనుషులున్నా మనకి లాభం ఏమిటి? మనకన్నా అద్భుతమైన టెక్నాలజీ వుండి వాళ్ళు మన దగ్గిరకి రావాలిగానీ ఇప్పట్లో కాదుకదా, కలలోకూడా మనం అక్కడికి చేరుకోలేం. మనం సాధించిన వేగంలో ఆ దూరాన్ని చేరుకోవాలంటే ఒక మనిషి జీవితకాలం చాలదు. నాకీ ప్రయోగాలు నిరర్ధకంగా అనిపిస్తున్నాయి. నేనింక కొనసాగించలేను. అందుకు ఇంకెవరినేనా వినియోగించండి”” అ౦తలోనే అన్నాడు అబ్రహం.
“ఏమైంది అబ్రహంకి?”” చకితుడయాడు శ్యా౦.
అబ్రహం ముఖంలో ఒక నిస్పృహ. నిరాసక్తి. అతను చెప్పే విషయాలు వాస్తవమే కావచ్చు, కానీ ఒక శాస్త్రవేత్తకి ఆమోదయోగ్యమైనవి కాదు.
భూమి స్థిరంగా వుంటుంది, ఆకాశం ఒక టిన్‍షీట్‍లా, నక్షత్రాలు, సూర్యచంద్రులు ఇవన్నీ ఆ టిన్‍షీట్‍పై అతికించినట్టుగా వుంటాయన్న నమ్మకంనుంచీ, భూమి బల్లపరుపుగా వుంటుందన్న నమ్మకంనుంచీ, ఇంకా ఎన్నో అవాస్తవమైన నమ్మకాలనుంచీ ఎదిగిన మనం ఎన్ని ప్రయోగాలు చేస్తే, ప్రజలు గాఢంగా నమ్మిన ఇంకెన్ని సిద్ధాంతాలని ఖండిస్తే ఈరోజుని ఈ స్థాయికి ఎదిగాం? ఇంకా మరెన్నిటిని ఖండిస్తే ఇంకా ఎదగగలుగుతాం? ఏ శాస్త్రవేత్తా ఇలా రాజీ పడకూడదు. రాజీపడితే అతను ఒక మామూలు వుద్యోగి ఔతాడు. జీవికకోసం వుద్యోగం చేసే వ్యక్తికీ అతనికీ తేడా వుండదు. అతని విజ్ఞానం నిరర్థకమే. కొన్ని కోట్లమందిలో అతనొకడు. అబ్రహం అలాంటి జీవితాన్ని కోరుకుంటున్నాడా? ఒకసారి స్పేస్‍లోకి వెళ్ళి వచ్చాక? శ్యాం నమ్మలేకపోతున్నాడు.