“నేను ఢిల్లీ వెళ్ళిపోతున్నాను. నా పాత వుద్యోగానికి”” అన్నాడు అబ్రహం.
ఆమోకీ, అబ్రహంకీ వున్న స్పష్టమైన తేడా కనిపించింది శ్యా౦కి. అసాధ్యమైనదాన్ని సుసాధ్యం చెయ్యడానికి పరుగుపెడుతున్నాడు ఆమో. ఇతను వున్నతమైన కెరీర్‌ను వదిలిపెట్టి సాధారణమైన జీవితం గడపాలనుకుంటున్నాడు. చేసిన ప్రయోగాలు వుత్తేజాన్నివ్వటంలేదు. మనుషుల్లో వుండే వైవిధ్యం. . .
శ్యాంకి అన్నీ అప్పజెప్పి బయటికి వచ్చేసరికి కేంపస్‌లో ఎదురైంది ధన్య. గుండె ఆగిపోయినట్టైంది. పంపకుండా స్టోర్ చేసిన మెసేజిలన్నీ రెక్కలొచ్చిన గువ్వల్లా అతని మనసునిండా సందడి చేసాయి.
ఇద్దరూ ట్వెల్త్దాకా కలిసి చదువుకున్నారు. ఊహ తెలిసినప్పట్నుంచీ ఆమెని ఆరాధిస్తున్నాడు. అంత చిన్న వయసులో అది ప్రేమనిపించలేదు. ఒక దగ్గరితనంలా అనిపించింది. గ్రాడ్యుయేషన్‌లో ఎవరి డిసిప్లిన్ వాళ్ళదైనా, తరుచు కలిసేవారు. మాస్టర్స్‌లో విడిపోయారు. అప్పుడు అర్థమైంది అబ్రహంకి తనది ప్రేమని. కానీ మొదట్లో వ్యక్తపరచలేకపోయినది ఇప్పటిదాకా సడిచెయ్యకుండానే వుండిపోయింది.
మనిషి ఒక స్థాయి వరకూ ఎదుగుతాడు. ఆ తర్వాత అతని ఎదుగుదల ఒక వృక్షపు శాఖల్లా విస్తరిస్తుంది. చిన్నప్పటి స్నేహాలు, పరిచయాలు మూలాల్నుంచీ పెరుగుతాయి. పసితనపు స్నేహాల్లో ఎదుటివ్యక్తి మానసిక స్థితి, గతి తెలుస్తాయి. అతడు ఎంతవరకూ ఎదిగాడో, అక్కడినుంచీ ఏమేరకి విస్తరించాడో అర్థమౌతుంది. పెద్దయాక ఏర్పడే స్నేహాల్లో విస్తరణనుంచీ ఎదుగుదలకీ అక్కణ్ణుంచీ మూలాల్లోకీ చూసుకోవల్సివుంటుంది.
ధన్యా, అబ్రహంల స్నేహంలో బాల్యపు పరిమళాలున్నాయి. అవి ఇద్దరికీ చిరపరిచితమైనవి. ప్రేమంటే ధన్య ఎలా స్పందిస్తుందోనని అబ్రహం భయపడ్డాడుగానీ ఇద్దరికీ ఒకరినొకరు చూసుకోగానే అవధుల్లేని స్నేహపు పరిమళం చుట్టుముట్టి౦ది.
“ధన్యా! నువ్వేంటి, ఇక్కడ?”” సంభ్రమంగా అడిగాడు.
“నేనూ అదే అడుగుతున్నాను”” ధన్య దబాయించింది. ఆమో సమక్షంలో వున్న బిడియం ఇప్పుడు లేదు. ఇద్దరూ నవ్వుకున్నారు.
క్వారంటైన్, ఫెలిసిటేషన్ అన్నీ యథాతథంగా జరిగాయి. ఫెలిసిటేషన్కి ధన్య వెళ్ళింది. ఆమోకూడా వచ్చాడు. అబ్రహంని ఆత్మీయంగా కౌగిలించుకున్నాడు. ధన్య ఆమోతో ఫ్రీగా వుండలేకపోయింది. పదేపదే పద్మమాలిక గుర్తొచ్చింది.
ప్రేమకోసం సృష్టిని తిరగేసే ప్రయత్నంలో వున్నాడితను! ప్రేమ ఎంత బలమైనది! ఒక ప్రేమికుడిగా అతను చేస్తున్న సాహసం గొప్పది. ఒక శాస్త్రవేత్తగా అతను చేసే ప్రయోగాలు గొప్పవి. తను అతని ప్రేమని ఆశించదు. అతని విజయానికి దోహదం చేస్తుంది అంతే. తనదీ ప్రేమే. ఇలా వ్యక్తపరుస్తుంది. ఎప్పటికేనా అతను దాన్ని గుర్తిస్తే చాలు! అనుకుంది. మాటల్లో అలా అనుకోగలిగినా మనసు లోలోపల బాధగానే అనిపించిది.
ధన్యలో మార్పు ఆమో గుర్తించాడు. తప్పు తనదే. తను ఆమె సందేహాన్ని సరిగా తీర్చలేకపోయాడు. మళ్ళీ ఆమెతో మాట్లాడే అవకాశం రాలేదు. ప్రయత్నపూర్వకంగా తప్పించుకు తిరుగుతోంది. స్పేస్‌లోకి వెళ్ళాక వివరంగా మాట్లాడాలనుకున్నాడు.
ఎంతోకాలంగా వాయిదాపడుతున్న విషయాలు అనుకోకుండా జరిగిపోతుంటాయి. అప్పటికప్పుడు జరగబోయిన విషయాలు ఎప్పటికప్పుడు వాయిదాపడుతుంటాయి.
“ధన్యా! నిన్నిక్కడ చూడటం చాలా సంతోషంగా వుంది. లంచికి బైటికి వెళ్దామా? ఫ్రీగా మాట్లాడుకోవచ్చు. చాలాకాలమైంది మనం కలుసుకుని, మనం మాట్లాడుకుని”” అబ్రహం అడిగాడు.
ధన్య సరేనంది.
సిటీకి ఇరవై కిలోమీటర్ల దూరాన వుంటుంది బాస్ కేంపస్. కేంటిన్లో ఆహారం చాలా బావుంటుంది. డైటీషియన్ సలహాలమేరకి రుచిగా చేస్తారు. అందుకే అక్కడ వుండేవాళ్ళకి చాలామందికి ఇల్లు గుర్తు రాదు. బైటికి వెళ్ళి తినాలనుకునే సందర్భాలు చాలా తక్కువ. ఆ అరుదైన సందర్భాల్లో ఇదొకటి. ఇద్దరూ ప్రైవేట్ రూంలో ముందుగా రిజర్వు చేసుకున్నటేబుల్ ముందు ఇద్దరూ కూర్చున్నారు.
“చెప్పు”” మెనూ కార్డు ధన్య ముందుకి తోసి అన్నాడు అబ్రహం.
ధన్య ఆర్డరిచ్చింది. అవి వచ్చేదాకా ఇద్దరూ ఎన్నెన్నో విషయాలు మాట్లాడుకున్నారు. ట్వెల్త్ పూర్తైన దగ్గిర్నుంచీ ఇప్పటిదాకా జరిగినవీ, సోషల్ నెట్‌వర్క్‌లోనూ ఫోన్లోనూ చెప్పుకోని ఎన్నో విషయాలు ఇప్పుడు మాట్లాడుకున్నారు. ఆర్డరొచ్చింది. తింటూకూడా ఆగకుండా మాట్లాడుకున్నాక కొద్దిసేపటికి మాటలన్నీ ఐపోయినట్టు ఆగిపోయాడు అబ్రహం.
“ఇద్దరివీ చదువులయ్యాయి. కెరీర్లో స్థిరపడ్డాం. నాకు బాస్లోకూడా పొజిషన్ వుంది. నీ అభిప్రాయాన్నిబట్టి నేను ఇక్కడుండాలా ఢిల్లీ వెళ్ళాలా అనేది నిర్ణయించుకుంటాను. శ్యాంతో ఆల్రెడీ చెప్పాను డిల్లీ వెళ్ళిపోతానని. నిన్ను చూసాక ఆ నిర్ణయం మారింది. చెప్పు ధన్యా, మనం పెళ్ళిచేసుకుందామా?”” కొద్దిసేపటి మౌనం తర్వాత అడిగాడు.
ధన్యకి కళ్ళలో నీళ్ళొచ్చేసాయి. వేళ్లతో సుతారంగా పట్టుకున్న చెమ్చా జారిపోయింది. అబ్రహం ఇలా అడిగినందుకు ఆమె బాధపడలేదు. యువతీయువకులు కలిసి తిరుగుతున్నప్పుడు ఇటువంటి ప్రతిపాదనలు వస్తుంటాయి. ఇద్దర్లో ఎవరికి ఇష్టం లేకపోయినా రెండోవాళ్ళు అర్థం చేసుకుంటారు. పెళ్ళనేది ఏకపక్షం కాదనే అవగాహన బాగా వచ్చింది.
కొన్ని దశాబ్దాలక్రితం ప్రేమని కాదంటే అబ్బాయిలు అమ్మాయిల్ని నరికి చంపడం, వాళ్ళమీద ఏసిడ్ పొయ్యటం వుండేవి. ఇంకొన్ని సందర్భాల్లో పెద్దవాళ్ళు కాదనటం, వేరేవాళ్ళతో బలవంతపు పెళ్ళిళ్ళు చెయ్యటం, అవి విఫలమవ్వటం జరిగేదట. కొన్ని కుటుంబాలలో పరువుకోసం అమ్మాయో అమ్మాయి తండ్రో తన ప్రాణం తను తీసుకోవడం లేదా తండ్రి, అమ్మాయి ప్రాణం తియ్యడంకూడా వుండేవట. ప్రేమ, పెళ్ళి భీభత్సంగా వుండేవట. ఇప్పుడు అందరూ కలిసి ఒక రాజీకి వచ్చినట్టుంది.
ధన్య కన్నీళ్ళు పెట్టుకుంటే వింతగా చూసాడు అబ్రహం.
“ఏమైంది?”” అడిగాడు.
“ప్రేమ విఫలమైతే ఎలా వుంటుందో ఆ బాధని అనుభవిస్తున్నాను అబ్రహం”” కళ్ళు తుడుచుకుంటూ అంది ఆమె.
అబ్రహం ముఖం మ్లానమైంది. పెద్ద పిడుగు నెత్తిమీద పడ్డట్టైంది. ఏదైతే జరుగుతుందని తను భయపడ్డాడో భయపడి వాయిదా వేస్తూ వచ్చాడో అది జరగనే జరిగింది. ప్రపంచం యథాతథంగా అలానే వుంది. ఎదురుగా కప్పుల్లో సూప్ పొగలు చిమ్ముతోంది. పనీర్‌తో చేసిన కూర మసాలా వాసన వేస్తోంది. అతనికీ కళ్ళల్లో నీళ్ళు చిమ్ముకొచ్చాయి. గొంతు గద్గదమైంది.
“ఎవరు నిన్ను కాదనుకున్న ఆ దురదృష్టవంతుడు?”” అడిగాడు.
“ఆనందమోహన్””
చెప్తున్న ఆమెకి మతిపోయిందో, వింటున్న తనకి మతిపోయిందో అర్థమవలేదు అతనికి. “”ఆమోనా?!”” వింతగా అడిగాడు. ధన్య తలూపింది.
“నీకు మతిపోయిందా? అతనొక పబ్లిక్ ఫిగరు. ఇద్దరం కలిసి స్పేస్‌లో పనిచేసినా అతను నాకన్నా ఎంతో ఎత్తుని వున్న వ్యక్తి” అన్నాడు.
“ట్వెల్త్ చదువుతున్నప్పుడు మనకి ఫిజిక్స్ క్లాసులో మొదటిసారి అతని గురించి చెప్పారు. గుర్తుందా? అప్పట్నుంచీ అతన౦టే నాకు ఆరాధన. అతని ఫొటోలు కలెక్ట్ చేసి దాచుకునేదాన్ని. అతని ఆర్టికల్స్ చాలా ఆసక్తిగా చదివేదాన్ని.అతన్ని రోల్‌మోడల్‌గా చూపిస్తూ ఇంట్లోకూడా నన్ను చాలా ప్రోత్సహించేవారు. అతన్ని కలవాలనే నేను బాస్‌లో రిసెర్చికి అప్లై చేసాను”
“ధన్యా! నాతో ఎప్పుడూ అనలేదు””
“నాకు అతనిపట్ల చాలా పొజెసివ్‌నెస్ వుండేది. అతని విషయాలు ఎవరితోటీ పంచుకోవాలనిపించేది కాదు”
“. . .””
“బాస్‌కి వచ్చిన నాలుగునెలలకి అతన్ని కలవడం జరిగింది. అంతకు ముందురోజే స్పేస్నుంచీ వచ్చాడు. క్వారంటైన్ అయింది. చెయిర్‌పర్సన్ నన్ను రమ్మని కాల్ చేసాడు. అక్కడ ఆమో వున్నాడు. నేను షాకయ్యాను. అప్పటిదాకా నా వూహల్లో వున్నాడు. టీవీలో చూసాను, వర్చువల్ ఇమేజెస్ చూసాను. ఇప్పుడతను వాస్తవంగా వున్నాడు. నాతో మాట్లాడాడు, తనతో స్పేస్‌లోకి వెళ్ళటానికి ఆహ్వానించాడు”
“నిజంగానా? కంగ్రాట్స్””
“అతనొక యూఎఫ్ఓని ట్రేస్ చేసాడు. దానిమీద ఇంకా ప్రయోగాలు చెయ్యాలట. అందుకు ఒక ఆస్ట్రోఫిజిస్ట్ సహాయం కావాలన్నాడు. నా పేరు శ్యామ్ చెప్పాడు, అతను వప్పుకున్నాడు”
“. . .” “
“ఆఫీసులోంచీ ఇద్దరం ఒకేసారి బయటికి వచ్చాం. అతన్ని టీకి రమ్మని నా క్వార్టర్‌కి ఆహ్వానించాను. వచ్చాడు. అదేరోజు అతనికి జ్వరం వచ్చింది, కమ్యూనిటీ హాస్పిటల్లో చేర్చారు. అతని పేరెంట్స్ వచ్చేదాకా నేనే అటెండయాను. నా మనసంతా అతనిపట్ల ప్రేమతో నిండిపోయింది. కానీ అతను వళ్ళు తెలియని స్థితిలో కలవరించింది నన్నుకాదు”
అబ్రహంకి బాధతో గుండె మెలిపెట్టినట్టనిపించింది.
“ధన్యా! ఒక విషయం చెప్పనా? ఆమో ఒక పబ్లిక్ ఫిగర్. ఎంతోమంది అతన్ని ఇష్టపడవచ్చు, ప్రేమించవచ్చు. కానీ అతను ప్రేమించగలిగేదీ పెళ్ళి చేసుకోగలిగేదీ మాత్రం ఒకరినే. ఆ ఒక్కరూ నువ్వు కావడానికిగల అవకాశం ఎంతో అది నువ్వు అర్థం చేసుకోవాలి””
“ఇవన్నీ నాకుమాత్రం తెలియవా? కానీ మనసుందే, అది మన మాట వినదు. అతనినుంచీ మరలించుకోవడానికి ప్రయత్నిస్తున్నాను””
“స్పేస్‌కి వెళ్ళే అవకాశం వాడుకోవాలనుకుంటున్నావా?””
“అతన్తో కలిసి పనిచేసే అవకాశం ఎలా వదులుకోగలను? అతన్తో అంటే అంతటి వ్యక్తితో. . .పువ్వుని అంటి వున్న దారానికి కూడా కొంచెం వాసన అంటుతుందికదా? కెరీర్ వేరు, వ్యక్తిగత వుద్వేగాలు వేరు””
అబ్రహం సుదీర్ఘంగా నిశ్వసించాడు.
“అతనిమీది ప్రేమని నువ్వు మర్చిపోవడం చాలా మంచిది ధన్యా! అతను నిన్ను ప్రేమించడం జరగదు. నువ్వతన్ని ప్రేమించడం భ్రమ. అది అతనిపట్ల నీకున్న హీరోవర్షిప్. అంతే. నువ్వెంత తొందరగా అందులోంచి బైటికి వస్తే అంత మంచిది. అప్పటిదాకా నేను వేచి చూడగలను””
ధన్య తలూపింది. బిల్లు చెల్లించి ఇద్దరూ లేచారు.
“డిల్లీ వెళ్ళిపోతున్నాను. చేస్తున్న ప్రయోగాలు నాకు సంతృప్తినివ్వడం లేదు. శ్యాంకి చెప్పాను”” దార్లో అన్నాడు.
“ఎందుకని అబ్రహం? నేను నిన్ను డిస్ట్రాక్ట్ చేసానా?”” అడగలేక అడిగింది ధన్య.
“లేదు. అదేంలేదు. నువ్వే ఆలోచించు . . .ఆమో ఒక యూఎఫ్ఓని పట్టుకున్నాడే అనుకో, అది మనకెందుకు వుపయోగపడుతుంది? అందులో ఒక గ్రహాంతరవాసికూడా వున్నాడనుకో, వాడూ మనకి దొరికాడు. సో వాట్? మన జీవితాలు మారిపోతాయా?””
“…”
“మారవు. ఇలాగే వుంటాం. ఆ యూఎఫ్ఓనీ ఆ ఏలియన్నీ మనం స్టడీ చేస్తాం. వాళ్ల టెక్నాలజీ తెలుసుకుంటాం. అప్పుడూ మన జీవితాల్లో వచ్చే మార్పేమీ వుండదు, ఇంకో పదిమంది శాస్త్రవేత్తలు స్పేస్‌లో ప్రయోగాలు చెయ్యడంతప్ప”
“అలా మాట్లాడకు అబ్రహం. నువ్వు బాస్‌ని వదిలిపెట్టే విషయం మరోసారి ఆలోచించు. ఏ ప్రయోగాలూ చెయ్యకపోతే భూమి బల్లపరుపుగా వుందనే సిద్ధాంతంలోనే ఇంకా వుండేవాళ్లం. క్షితిజరేఖ అంచుదాకా వెళ్తే అక్కడినుంచీ పడిపోతామేమోననే భయంతో ఎక్కడికీ వెళ్లకుండా మన చుట్టూ గిరిగీసుకుని వుండిపోయేవాళ్ళం. క్వినైనూ, పెన్సిలినూ వుండేవికాదు”
అబ్రహం నిరాసక్తిగా నవ్వాడు. శ్యాంతో మాట్లాడినప్పుడు అతన్లో ప్రయోగాలపట్ల విముఖత మాత్రమే వుంది. ఇప్పుడు ప్రేమ ఫలించని బాధ కూడా వుంది. ఇద్దరూ బాస్ కేంపస్‌కి చేరుకున్నారు. మరుసటిరోజు అతను వెళ్ళిపోయాడు. ఆమోకి జ్వరం తగ్గి నార్మల్ అవటంతో సంధ్య, రమేష్ కూడా బయల్దేరారు. వెళ్ళేముందు సంధ్య ధన్య క్వార్టర్‌కి వచ్చింది గులాబీలు చూసింది.
“ఇన్ని మొక్కలా, ధన్యా! నాకైతే ఇక్కణ్ణుంచీ వెళ్ళాలనిపించడంలేదు”” అంది విస్మయంగా.
“ఉండిపొండి”” నవ్వింది ధన్య.
“ఇంకో నాలుగురోజులు వుండాలనే వుంది. కానీ ప్రిన్స్ బెంగపెట్టుకున్నాడట. వీడియోలో మమ్మల్ని చూపిస్తేనేగానీ తిండి తినటం లేదని చెప్పింది కేర్‌టేకర్. రమ్మని అరుస్తాడట. మా స్పర్శ అందక ఏడుస్తాడట. మేం వెళ్ళాలి. తప్పదు ధన్యా! ఐనా ఇక్కడుండి చేసేదేముంది? కాస్త ఆరోగ్యం చిక్కిందో లేదో ఆమో ఇ౦ట్లోనే వుండట్లేదు. ఎప్పుడూ ఆఫీసు, లేబ్ . . .””
ఇద్దరూ చాలాసేపు మాట్లాడుకున్నారు. పద్మమాలికగురించీ ఆమెపట్ల ఆమోకి వున్న ప్రేమగురించీ ఎన్నో అడగాలనిపించింది ధన్యకి. కానీ ఏమని అడుగుతుంది? అతని వ్యక్తిగతజీవితంలోకి తనకి ప్రవేశం ఎక్కడిది?
సంధ్య వెళ్తానని లేస్తుంటే పెద్దపెద్ద పువ్వులు కోసి ఇచ్చింది ధన్య. సంధ్యకూడా తన మన్సులో వున్న మాట పైకి అనలేకపోయింది.
రోజులు వేగంగా గడిచిపోతున్నాయి. కాలానికి సంబంధించి అదొక పెద్ద భ్రమ. కాలం ఎక్కడికి వెళ్తుంది? మనుషుల్నీ, నాగరీకతల్నీ సంస్కృతుల్నీ మోసుకుంటూ తిరుగుతుందా?
కాలం ఎక్కడికీ కదలదు. ఉన్నచోటే వుంటుంది. ఒక సరళరేఖలా. దాని పొడవెంతో ఇప్పటి శాస్త్రవేత్తలు తేల్చి ఇదమిద్ధంగా చెప్పలేకపోతున్నారుగానీ భారతీయ ఋషులు చెప్పేసారు. సృష్టి మొదలైనప్పట్నుంచీ లెక్కవేసి కాలాన్ని కల్పాలుగా, మన్వంతరాలుగా, మహాయుగాలుగా, యుగాలుగా, సంవత్సరాలుగా, రోజులుగా, ఇంకా చిన్నచిన్నగా విభజించి. దానిమీద మానవ ప్రయాణం.
వైభవ్ వెనక్కి వచ్చేసాడు. అబ్రహంని తీసుకురావటానికి వెళ్ళిన శాస్త్రవేత్త అనసూయ. ఆమెకూడా తిరిగి వచ్చేసింది. అలా ముగ్గురు శాస్త్రవేత్తలు తిరిగొచ్చాక, ఆమోకి మళ్ళీ స్పేస్‌లోకి వెళ్ళే అవకాశం వచ్చింది. మరో మూడునెలలకి ధన్య వెళ్ళింది.
ఆమోని అంత వెంటనే పంపించడాన్ని గురించి కొన్ని విమర్శలు వచ్చాయిగానీ అవేవీ నిలబడలేదు. అతని ప్రయోగాల స్థాయి అందరికీ తెలుసు. అతను యూఎఫ్ఓని పట్టుకోబోతున్నట్టు బాగా ప్రచారమైందికూడా. ధన్య వెళ్ళినప్పుడు మాత్రం బహిరంగంగానే చర్చలు జరిగాయి. శ్యాం తన అధికారాన్ని దుర్వినియోగపరుస్తున్నాడనే వాదనలు గట్టిగా వినిపించాయి. ఎన్నో అప్లికేషన్లు పెండింగ్‌లో పెట్టి అంత జూనియర్ని పంపించడం అవసరమా?” అనే ప్రశ్నతో దుమారం రేపారు చాలామంది. ప్రిమియర్ అతన్ని వివరణ అడిగారు.
“ఆమోకి అసిస్టెన్స్ ఇవ్వడానికి ఆమె వెళ్ళింది. అతని ప్రయోగాల్లో ఆమె సహాయం చేస్తుంది. అంతే తప్ప స్వతంత్రంగా ప్రయోగాలు చేసేందుకుకాదు. ఇలా వెళ్ళినందుకు తన టర్న్ ప్రకారం వచ్చే అవకాశాన్ని వదులుకుంటుంది”” అని ఎంతో సంజాయిషీ ఇచ్చినమీదట అది చల్లారింది.
ధన్య వెళ్ళినది అన్నపూర్ణ అనే శాస్త్రవేత్త స్థానంలో.
మనిషి మనసు చాలా విచిత్రమైనది. అన్నపూర్ణకి పెళ్ళైంది. భర్త వ్యాపారస్థుడు. తను పై చదువులు చదవడానికి ఖర్చుపెడతాడనే అతన్ని చేసుకుంది. కొన్నేళ్ళదాకా ఆమెకి సంతోషంగానే ఉండేది. భర్తతో అన్యోన్యంగా ఉండటం, తను చదువులోనూ అతను వ్యాపారంలోనూ బిజీగా వుండటం నచ్చాయి. తనొక పెద్ద బిజినెస్ మేగ్నెట్ భార్యనని చెప్పుకోవడం సంతోషాన్నిచ్చింది.
బాస్‌లో అడుగు పెట్టాక ఆమె దృక్పథంలో మార్పొచ్చింది. ఆమో ఆమె మనసుని కదిలించాడు. అంటే అన్నపూర్ణ అతన్ని ప్రేమించిందని కాదు. తనుకూడా రిసెర్చి ఫీల్డులో ఉన్నతన్ని చేసుకుని వుంటే బావుండేదన్న ఆలోచన ఆమెని సతమతం చేస్తోంది. అటువంటి వ్యక్తి తన భర్త స్థానంలో వుంటే జీవితం భిన్నంగా వుండేదన్న భావన. అదొక దిగులుగా, అసంతృప్తిగా రూపు దిద్దుకుంది. ఆమోని చేసుకునే అమ్మాయి ఎవరో? ఇది అతన్ని చూడగానే తటాలుమని స్ఫురించే ప్రశ్న. అలా ఎందర్నో గమనించింది. గమనించడం ఒక అలవాటుగా మార్చుకుంది.
తనకి రిలీవరుగా వచ్చిన ధన్యని చూసి ఆ అమ్మాయి కళ్ళలో ఉన్న చురుకుతనాన్ని ఆమోతో పోల్చుకుని ఈమె అయితే అతనికి సరిపోతుందనుకుంది అన్నపూర్ణ. అది అసూయకాదు. మానవమనస్తత్వంలో వుండే ఒక పార్శ్వం. తనది కాకపోయినా అపురూపమైనది కనిపిస్తే అది మరొకరిదగ్గిరేనా పదిలంగా వుండాలని కోరుకునే తత్త్వం.
ఒకరినొకరు చూసుకోగానే వాళ్ళ కళ్ళలో లిప్తపాటు మెరిసిన మెరుపుల్ని పట్టుకుంది. ఇద్దరూ ఇంతకుముందే పరిచయస్తులు కావచ్చునన్న ఆలోచన రాలేదు. ఒకరికోసం ఒకరు పుట్టారేమోననిపించింది. ఒకరి వునికి మరొకరికి స౦తోషాన్నిస్తోందన్న విషయాన్ని వాళ్ళింకా గుర్తించలేదేమో! వాళ్ళ పెళ్ళి చరిత్రని తిరిగి రాస్తుందనిపించింది. ఇక్కడికి ఎలా వచ్చిందో అలాగే ధన్య అతని జీవింలోకి వెళ్ళిపోవాలన్న ఆకాంక్ష బలంగా కలిగింది.
ఇద్దరికీ వీడ్కోలు చెప్పి ధన్యని తీసుకొచ్చిన షటిల్లో వెనక్కి వెళ్ళిపోయింది అన్నపూర్ణ. ఆమె నిష్క్రమించడాన్ని పూర్తిగా చూసాక, “స్వాగతం… మనకిమాత్రమే చెందిన ప్రపంచంలోకి” అన్నాడు ఆమో” బాస్ విశ్వ సెంట్రల్ జోన్‌వైపు దారితీస్తూ. ధన్య అనుసరించింది.
ఆమె సరిగ్గా అక్కడికి రాగానే కంప్యూటర్ బటన్ నొక్కాడు. వర్చువల్ సాఫ్ట్‌వేర్‌లో తయారు చేసిన రంగురంగుల కార్నేషన్స్ ఆమె మీద వర్షంలా ఆగకుండా కురిసాయి. ఆ ఇమేజెస్ చూసి ఆమె థ్రిల్లౌతుంటే అతను సంతోషంగా నవ్వేసాడు. ఎంతగానో ఆశించిన పెన్నిధి దొరికినంత సంతోషం అది. పోగొట్టుకున్నానని భయపడుతున్నది మళ్ళీ దగ్గిరకి వచ్చినప్పుడు కలిగే ఆనందం అది.
ఒకవైపు పద్మలతకోసం అన్వేషిస్తూ మరోవైపు తన సమక్షంలో ఇంత సంతోషం ఎలా సాధ్యం? పద్మలత దుర్లభమని తెలుసా? తనంటే ఇష్టమా? ఎంత? ప్రేమ అనిపించేంతా? అతన్ని తదేకంగా చూసింది. అతని మనసులో పద్మలతే వుండనీ. . . తనుమాత్రం ఈ ఆకర్షణలోంచీ బయటపడగలదా? అదొక సూదంటు రాయి. మనసుని దహించేసే నిప్పు. అతనిమీంచీ చూపులు తిప్పుకోలేకపోతోంది.
ఎదురుగా వెళ్ళి … మునివేళ్లమీద కాళ్ళెత్తి నిలబడి … నుదుటిని ముద్దు పెట్టుకుంటే … ముక్కూముక్కూ రాసి అతన్నింకా నవ్వించి ఆ నవ్వులో తను జతకలవగలిగితే? క్షణంసేపే ఆ ఆలోచనలు. అతనికి తెలిసిపోతాయేమో! కనురెప్పలు వాలిపోయాయి. ముఖం ఎర్రబడిపోయింది.
అప్పటిదాకా తన చూపుల్లో చూపులు కలిపి నిలబడిన అమ్మాయి ఒక్కసారి ఇలా సిగ్గుపడిపోతోందేం? ముఖంలో ఆ ఎరుపేంటి? ఆ వింత వెలుగేంటి? కనురెప్పలు పైకెత్తలేనంతగా అంత బరువేంటి? ఆమో వింతగా చూసాడు.
పువ్వులవాన ఆగిపోయింది. ఇద్దరూ వాస్తవంలోకి వచ్చారు. ఆమెని తనతో తీసుకెళ్ళి లేబ్నీ పరికరాలనీ పరిచయం చేసాడు ఆమో. ధన్య చాలా థ్రిల్లైంది. ఇక్కడికి రావాలని ఎన్నో కలలు కన్నది. ఎందరో అలాంటి కలలు కని వుంటారు. కానీ తనకి దొరికినది మాత్రం చాలా అరుదైన అవకాశం…
పశ్చిమగోదావరి జిల్లా రెడ్డి పోలవరంలో 16 July, 1962 లో జననం. వరంగల్‌లో వుద్యోగం. హెడ్పోస్ట్‌మాస్టర్గా వరంగల్‌లో స్వచ్చందపదవీ విరమణ.
వివాహం శ్రీ చదలవాడ విష్ణుమూర్తిగారితో. వారు డెప్యూటీ ఏగ్జిక్యూటివ్ ఇంజనీరుగా చేసి రిటైరయారు.
మొదటి కథ అనగనగా 1978లో వనితాజ్యోతి మాసపత్రికలో అచ్చైంది. వీరివి 225కి పైగా కథలు, 9 నవలలు వివిధ పత్రికల్లో ప్రచురించబడ్డాయి. గూడు, సింధూరి, గుండెలోతు అనే కథాసంపుటాలు, నీలినక్షత్రం అనే నవల పుస్తకాలుగా వచ్చాయి. సింధూరి అనే సంపుటానికి శ్రీమతి సుశీలా నారాయణ రెడ్డి అవార్డు 2005 లో వచ్చింది. ప్రేమలోంచీ ప్రేమలోకి అనే నవలకి ఆంధ్రభూమి ప్రథమ, తిరస్కృతులు, నీకోసం నేను అనే నవలలకి ఆంధ్రభూమి ద్వితీయ, 5-3-2 అనే నవలకి కినిగె ద్వితీయ బహుమతులు వచ్చాయి. ఎంతెంతదూరం? అనే కథకి విపుల కన్సొలేషన్ బహుమతి, శ్రీమతి రంగవల్లి ట్రస్ట్ అవార్డు వచ్చాయి. ఇవికాక కథలకు మరో ఏడెనిమిది బహుమతులు వచ్చాయి.
కథలకు కాన్వాస్ పెద్దదిగా వుండాలనేది వీరి అభిప్రాయం.