ఊదాపచ్చనౌక – 7 by S Sridevi

  1. ఊదాపచ్చనౌక – 1 by S Sridevi
  2. ఊదాపచ్చనౌక -2 by S Sridevi
  3. ఊదాపచ్చనౌక -3 by S Sridevi
  4. ఊదాపచ్చనౌక -4 by S Sridevi
  5. ఊదాపచ్చనౌక -5 by S Sridevi
  6. ఊదాపచ్చనౌక – 6 by S Sridevi
  7. ఊదాపచ్చనౌక – 7 by S Sridevi
  8. ఊదాపచ్చనౌక – 8 by S Sridevi
  9. ఊదాపచ్చనౌక 9 by S Sridevi
  10. ఊదాపచ్చనౌక – 10 by S Sridevi
  11. ఊదాపచ్చనౌక – 11 by S Sridevi
  12. ఊదాపచ్చనౌక – 12 by S Sridevi

మాటలు బయట్నుంచీకాక మెదడులోనే విపించసాగాయి. అది వినిపించడంకూడా కాదు. ఒక శబ్దాన్ని చెవి గ్రహించి మెదడుకి పంపించి అదక్కడ డీకోడ్ చేసి అర్థం చేసుకోవడం అనే ప్రక్రియ ఏదీ లేకుండానే ఆలోచనలు బయటికి వెళ్తున్నాయి. వాటికి జవాబులూ, ఆదేశాలూ, సూచనలూ వస్తున్నాయి.
“నమస్తే. నాపేరు మృత్యుంజయుడు. నేను మీరనుకుంటున్నట్టుగా గ్రహాంతరవాసిని కాదు. మనిషినే. భూగోళవాసినే”” అన్న మొదటి సమాచారం అందగానే ఆమో ఆశ్చర్యంగా చూసాడు.
“నమస్తే. నేను ఆనందమోహన్. తను ధన్య… ధన్యాపార్థసారథి. మీది ఏ దేశం? ఇటువంటి నౌకని తయారుచేసినట్టు ఏ సైన్స్‌జర్నలూ ప్రచురించలేదు””
“నేను దాదాపుగా తొమ్మిదివేలసంవత్సరాలక్రిందటివాడిని “”
“అసంభవం””
“ఎలా?” “
“అంతకాలం వుండటానికి మీరు ఫిజికల్ ఆబ్జెక్ట్ కాదు. మనిషి. బయలాజికల్ సిద్ధాంతాలు వప్పుకోవు. కణవిభజనకి నిర్దిష్టమైన కాలపరిమితి వుంటుంది. మనిషి శరీరంలోని కణాలన్నీ ఆ పరిమితి దాటాక మరణిస్తాయి. అదే మనిషి మృత్యువుకూడా””
“కాదనను. కానీ నేను గతానికీ వర్తమానానికీ మధ్య ప్రయాణం చేస్తూ మృత్యువుని జయించాను”
“ఇదంతా ఎక్కడ? ఎప్పుడు?””
“తొందరపడకు. అన్నీ నిదానంగా మాట్లాడుకుందాం. నీకు చెప్పాల్సింది చాలా వుంది. పాపం ఆ అమ్మాయి… ధన్య… చాలా భయపడుతోంది. నువ్వు ధైర్యం చెప్పాలని కోరుకుంటోంది”” అని చిరునవ్వు నవ్వాడు.
“ముందా యాంటెన్నా తీసెయ్యండి. నా మెదడు పనిచెయ్యటంలేదు””
“తీసేస్తే మనం కమ్యూనికేట్ చేసుకోలేం. ట్రాన్స్మిట్టర్లు పెట్టనా? అవంత ఇబ్బందిని కలిగించవు. మీరూ మాట్లాడుకోవచ్చు. మీ ఆలోచనలు నాకూ తెలుస్తాయి”” అన్నాడు. అతని మాట వినటం తప్ప మరో మార్గం లేదని ఆమోకి అర్థమైంది.
“ఇద్దరూ ఆ స్పేస్‍సూట్లు తీసెయ్యచ్చు. ఇక్కడ మామూలుగానే వుంటుంది”” అన్నాడు మృత్యుంజయుడు. ఇద్దరూ అలాగే చేసారు.
మృత్యుంజయుడు ఆంటెన్నాలని తీసేసాడు. వెంటనే ట్రాన్స్‌మిట్టర్లని పెట్టలేదు. వాళ్ళిద్దరికీ స్పేస్ వదిలాడు. తను మళ్ళీ నౌకలోంచీ బయటికి వెళ్ళాడు. అతని నౌకకి వేలాడుతూ గుండ్రంగా తిరుగుతోంది బాస్ విశ్వలో ఆమోవాళ్ళున్న భాగం. కంటికి కనిపించనంత సన్నటి గ్రాఫీన్ పోగులు రెండిటినీ కలిపి వుంచాయి. అది ఎంతేనా ప్రమాదం. రెండిటినీ విడగొట్టాలి. అతను ఆ పనిలో పడ్డాడు. చాలా శ్రమ తర్వాత అది సాధ్యపడింది.
మృత్యుంజయుడు ఆంటెన్నాలని తీసేసాక ఆమో మెదడు పనిచెయ్యడం మొదలుపెట్టింది. ఏం పని చేసాడు తను! ఇందులో ఇంత ప్రమాదం పొంచి వుంటుందని వూహలోకూడా అనుకోలేదు. ఇది గెలుపా, ఓటమా? ఇతను చెప్పినది నిజమా? ఇది కాలనౌకా? ఇతడు టైంహంటరా? తన ఆలోచన నిజమైనందుకు సంతోషపడాలా, ఇలా ఇరుక్కుపోయినందుకు దు:ఖపడాలా? ఇతను తమనేం చేస్తాడు? మళ్ళీ భూమ్మీదికి చేరుకోవడం ఎలా? అక్కడివాళ్ళు తమగురించి ఏమనుకుంటున్నారు? ఎన్నో ప్రశ్నలు.
ధన్య తననుంచీ ఓదార్పుకోసం చూస్తోందన్నమాట మదిలో మెదిలింది. తనొక తెలివైన మూర్ఖుడు. తనదే పైచెయ్యనుకున్నాడు. అవతలి వ్యక్తి బలాన్ని అంచనా వెయ్యలేదు. తనతోపాటు ఆమెనీ ప్రమాదంలోకి తోసేసాడు. నమ్మి వెంట వచ్చినందుకు మృత్యుముఖంలోకి నెట్టేసాడు. తాము బతకడం ఒక అద్భుతం. కానీ తిరిగి భూమ్మీదకి వెళ్ళగలగడం? కనీసం ధన్యనేనా క్షేమంగా పంపగలిగితే బాగుంటుంది.
“ధన్యా! ఆర్యూ ఓకే?”” ఆమె భుజంమీద చెయ్యి వేసి మృదువుగా అడిగాడు. ఆమెని గుండెకి హత్తుకోవాలనిపించింది. ఆమె గుండెల్లో తలదాచుకుని మృత్యుముఖంలోంచీ బయటపడిన అనుభూతిని పంచుకోవాలనిపించింది. కానీ చెయ్యలేకపోయాడు. అపరాథభావన దాన్ని జయించింది.
ఆమో తీసేస్తుండటం చూసి తనూ యాంత్రికంగా సూట్ తీసేసిందిగానీ ధన్య ఇంకా షాక్‍లోంచీ తేరుకోలేదు. అతనికి సాయం చేసింది. తనూ సాయం తీసుకుంది. కానీ జరిగింది ఇంకా నమ్మలేకపోతోంది. అతని చేతిని గట్టిగా పట్టుకుంది.
“అయాం సారీ! సో సారీ! అతన్తో మాట్లాడతాను. కనీసం నిన్నేనా వెనక్కి పంపే ఏర్పాటు చేస్తాను”” అన్నాడు గొంతులో దు:ఖం సుళ్ళు తిరుగుతుండగా. తన చేతిని పట్టుకున్న ఆమె చేతిని తను మరింత గట్టిగా పట్టుకున్నాడు.
అతని స్పర్శ ఆమెలో చైతన్యాన్ని నింపింది. “మిమ్మల్ని వదిలేసి నేను ఒక్కదాన్నీనా? కుదరదు. నేనూ మీతోటే”” అంది.
“నామాట విను””
“నేనూ శాస్త్రవేత్తనేకదా? మీ అసిస్టెంటునేకదా? నన్నూ వుండనివ్వండి. ఈ ప్రయోగంలో ఇద్దరం భాగస్తులం. విజయవంతమైతే ఇద్దరం సంతోషపడేవాళ్ళం . ఇప్పుడూ అంతే”” అంది ధన్య. అతను తోడున్నాడన్న ఆలోచన ఆమెలో క్షణక్షణానికీ ధైర్యాన్ని నింపుతోంది.
మృత్యుంజయుడు వచ్చాడు. ఇంక వాళ్ళిద్దరే మాట్లాడుకున్నది చాలన్నట్టు ఇద్దరికీ ట్రాన్స్మిట్టర్లు పెట్టాడు మృత్యుంజయుడు. అవి చిన్న బటన్సంత వున్నాయి. వాళ్ళేం మాట్లాడినా అది వాటిల్లోంచీ స్పేస్‍షిప్‍కి వున్న యాంటెనాలోకీ వెళ్ళి, ప్రాసెసర్లో తిరిగి ఆలోచనా తరంగాలుగా మారి, మృత్యుంజయుడిని చేరతాయి. అలాగే అతను చెప్పేవికూడా.
టెలిపతిక్ టెక్నాలజీ! ఎంత అధునాతనంగా వుంది! విస్మయంగా వుంది ఆమోకీ ధన్యకీకూడా.
ఏది ఎక్కడినుంచీ మొదలుపెట్టాలో ముగ్గురికీ తికమకగానే వుంది.
“యాంటీమేటర్… విరుద్ధపదార్ధాన్నిగురించి తెలుసా మీకు?”” మృత్యుంజయుడు అడిగాడు. ఆమో తలూపాడు తెలుసన్నట్టు. ధన్య తామిద్దరివంతూ మాట్లాడే బాధ్యతని అతనిమీదే వదిలేసింది.
“పరస్పర సంబంధం లేని రెండు విషయాలని సమన్వయపరిచి దానిద్వారా ఒక వాస్తవాన్ని మీముందు వుంచబోతున్నాను”” అన్నాడు మృత్యుంజయుడు. అతనే అన్నీ చెప్తానంటున్నాడుగాబట్టి ఆమో జవాబివ్వలేదు.
“మీగురించీ, మీ పరిశోధనలగురించీ నాకు కొంతవరకూ తెలుసు”” అన్నాడు మృత్యుంజయుడు.
“ఎలా?””
“నేను మీషిప్ దగ్గిరదగ్గిర్లోనే పరిభ్రమిస్తుంటాను. దీనికొక యాంటెనా వుంది. శూన్యంలో శబ్దం ప్రయాణించదు కాబట్టి మీ షిప్‍లోంచీ వచ్చే ఆలోచనా తరంగాలని రప్పించుకునే ఏర్పాటు చేసుకున్నాను. ఎంత దూరంనుంచేనా రప్పించుకోవచ్చు. భూమ్మీంచీకూడా. వాటిలో నీవి కూడా వున్నాయి. ఈ ఆలోచనా తరంగాలని డీకోడ్ చేస్తున్నప్పుడు అన్నికోట్ల మనుషుల ఆలోచనలు నాకు అవసరం లేనివనిపించాయి. కానీ నీ ఆలోచనలు నాకు ఆసక్తిని కలిగించాయి. నిన్నలా అనుసరిస్తూ వస్తున్నాను. ఒకొక్కసారి బాస్‍కి చాలా దగ్గిరగా రావడంవలన భూమికి కనిపిస్తాను. నువ్వు మాత్రమే నన్ను గుర్తించావు. ఇది కాలనౌక అనే విషయాన్నికూడా నువ్వే గుర్తించావు. చిన్న దిద్దుబాటు. ఇది కాలనౌక కూడా”
“నాకొచ్చే కల మీకు తెలుసునా? దానికీ మీకూ ఏమైనా సంబంధం వుందా?”” ఆమో మృత్యుంజయుడిని నువ్వనలేకపోయాడు చప్పుని.
“కల తెలుసును. దాంతో నాకెలాంటి సంబంధం లేదు”
“కల వచ్చినప్పుడే మీరెందుకు కనిపిస్తారు?””
“అప్పుడు నాకొచ్చే సమాచారంలో చాలా తికమక వుండేది””
“మీకెందుకు మా వివరాలు?””
చిన్నగా నవ్వాడు మృత్యుంజయుడు.” “మిత్రమా! తొమ్మిదివేలసంవత్సరాలు బతకడం ఏ జీవికేనా విసుగుపుట్టించే విషయం. అందులోనూ ఆలోచించేశక్తిగల మనిషికి. వంటరిగా. అందుకే ఏదో ఒకటి చేస్తుంటాను. మీ మాటలు తెప్పించుకోవడం, విని అర్థంచేసుకోవడం, మీరు ఎదుర్కొంటున్న సమస్యలకి పరిష్కారాలు వెతకడం అవన్నీ నాకు సరదా. నాక్కూడా ఒక సమస్య వుంది. దానికి పరిష్కారం దొరుకుతుందేమోననికూడా చూస్తుంటాను” ” అన్నాడు.
అతనిముఖంలోకి చూసాడు ఆమో. నిజమే చెప్తున్నాడా? తొమ్మిదివేల సంవత్సరాలు బతకడం నిజమేనా? సందిగ్ధం. కానీ కాలనౌక నిజమైనప్పుడు అదికూడా నిజమే కావచ్చు. ధన్యకీ అలానే అనిపించింది.
ఆమోనే మాట్లాడనిద్దామని అనుకున్న విషయం మర్చిపోయి ధన్య అడిగేసింది. “”ఇక్కడే ఇన్ని సంవత్సరాలు వుండే బదులు భూమ్మీదికి రావచ్చుకదా?”” అంది.
“మనుషులగురించి నాకు పూర్తి అనుభవం. నేను భూమ్మీద దిగిన వుత్తరక్షణంలో ఏం జరుగుతుందో నాకు తెలుసు. అందుకే నా పరిధిలోకి మిమ్మల్ని రప్పించుకునే ప్రయత్నం చేసాను. ఇంకొద్దిరోజులు ఆగివుంటే నేనే మిమ్మల్ని కేప్చర్ చేసేవాడిని”” అన్నాడు. అతని ముఖంలో అదోలాంటి భావన. దాన్ని ఆలోచనగా మారకుండా జాగ్రత్తపడ్డాడు. అది ఆమో దృష్టిని దాటలేదు.
“ఇప్పుడు జరిగిందదేకదా?”” అన్నాడు ఆమో.
“యాంటీమేటర్‍గురించి తెలుసుకదా? పాజిటివ్ ఎలక్ట్రాన్సు, నెగెటివ్ ప్రోటాన్సు, నెగెటివ్ స్పిన్… ఈ కాలనౌక యాంటీమేటర్‍తో తయారైంది. లేజర్‍కి రిపెల్ అయింది. మీరు మీవైపు లాక్కుందామనే ప్రయత్నం చేసేసరికి అది వ్యతిరేక దిశలోకి వెళ్ళి మిమ్మల్ని తనవైపు లాక్కుంది” సంభాషణ దారి మళ్ళించాడు మృత్యుంజయుడు.
ఇద్దరూ దిగ్భ్రాంతులయ్యారు. “”ఒక కాలనౌకని తయారుచెయ్యగలిగేంత యాంటీమేటరు మీరెలా చేసారు? అది సాధ్యపడదుకదా?” ” అడిగాడు ఆమో. ఇంకా నమ్మలేకపోతున్నాడు.
“మనకి తెలిసినదాంతోనే సైన్సుకి చుక్క పెట్టేస్తే ఎలా? ఎన్నో తెలుసుకున్నా తెలియనివి అనంతం”” అన్నాడు మృత్యుంజయుడు. లేచి వెళ్ళి, వాళ్ళకి తినడానికి ఏవో పట్టుకొచ్చాడు.
“గతంలోంచీ పట్టుకొచ్చాను”” అన్నాడు వాళ్ళు అడగని ప్రశ్నకి జవాబుగా.
ధన్య తినబోతుంటే ఆపి, ముందుగా తను తిన్నాడు ఆమో. తర్వాత ఆమెని తిననిచ్చాడు.
“నిన్ను స్నేహితుడివన్నాను. ఇంకా నమ్మకపోతే ఎలా?”” అలిగాడు మృత్యుంజయుడు.
“సారీ!”” అన్నాడు ఆమో.””గతంలోంచీ పట్టుకొచ్చానన్నారు, ఇవి ఎవరేనా తిని వుంటే వాళ్ళ కడుపుల్లోంచీ వచ్చినవా అనే అనుమానం””
“లేదు. నావే. నాకోసం వుంచుకున్నవి. అప్పుడు తినలేకపోయినవి. అలా గతంలోకి వెళ్ళి తెచ్చుకుని వర్తమానంలో తింటాను”” అన్నాడతను. గతమూ, వర్తమానమూ మెట్రోరైలుకి అటూ ఇటూ వున్న రెండు స్టేషన్లలా అనిపించి నవ్వొచ్చింది ధన్యకి.
“దూరంలాగే కాలంకూడా”” అన్నాడు మృత్యుంజయుడు. అతని ముఖంలో విషాదం పరుచుకుంది. తొమ్మిదివేలసంవత్సరాల గతం గుర్తొచ్చి అతన్ని బాధపెట్టింది. వేలయేళ్ళ వంటరితనం మళ్ళీ మనసుని ముసురుకుంది. వాళ్ళ వునికిని భరించలేకపోయాడు
“మీరు బాగా అలిసిపోయినట్టున్నారు. కొద్దిసేపు విశ్రాంతి తీసుకోండి. ఇప్పటికిప్పుడు అన్నీ తెలుసుకుని అర్థంచేసుకోవడం కష్టం”” అన్నాడు ఇద్దర్నీ వుద్దేశించి. వెంటనే తన ట్రాన్స్మిటర్ తీసేసాడు, భావాలు వాళ్ళకి తెలియకూడదని. అతన్లో హఠాత్తుగా వచ్చిన మార్పుకి ఆమో ధన్యలిద్దరూ ఆశ్చర్యపోయారు. కానీ అతనన్నది నిజమే. జరిగిన సంఘటనలకి కొంతా, టెలిపతిక్ ట్రాన్స్మిషన్‍వల్ల కొంతా కలిపి బాగా అలిసిపోయారు. అతను చూపించిన కేబిన్లో బెడ్స్‌మీద వొరిగారు.
ఇది శత్రుస్థావరమా, మిత్రస్థావరమా? ఆమో పూర్తిగా నిర్ధారించుకోలేకపోతున్నాడు. మృత్యుంజయుడు చెప్పింది నిజమైతే అతను ఇంతకాలం ఎలా బతికివున్నాడు? అవయవాలన్నీ పూర్తిగా శిథిలమైపోయి వుండాలి. అంటే తమలాంటివాళ్ళని పట్టుకుని… అతనింక వూహించలేకపోయాడు… తనగురించికాదు, ధన్యగురించి. కళ్ళలో నీళ్ళు రాలేదన్నది ఒక్కటేగానీ ఇలాంటి స్థితిలో ఆమెని వుంచినందుకు ఆక్రోశించిపోతున్నాడు.
“ధన్యా!”” అని పిలిచాడు కొద్ది సంకోచంగా.
“చెప్పండి”” అందామె.
“ఏమీ అనుకోకపోతే…”” ఎలా చెప్పాలో తెలీక ఇబ్బందిపడ్డాడు. ఆమె ప్రశ్నార్థకంగా చూసింది.
“మనం ఎంతవరకూ సేఫ్‍గా వున్నామో నాకు తెలీదు. మృత్యుంజయుడు హఠాత్తుగా సంభాషణ ఎందుకాపేసాడు? అతని మనసులోని ఆలోచనలు మనకి తెలియకూడదనేగా? మధ్యలోకూడా తన ఆలోచనల్ని నియంత్రించుకున్నట్టు అనిపించింది. మరోవైపు మనం పడ్డ అలసటకి నిద్ర ముంచుకొస్తోంది … నువ్వు … మనం …””
అతనంత తడబడే విషయం ఏమిటాని ఆలోచిస్తోంది ధన్య.
చాలా దగ్గిరగా ఒకరినొకరం తాకుతూ పడుక్కుందాం. కనీసం ఒకరు కదిల్తే మరొకరికి తెలుస్తుంది”” అన్నాడు తల దించుకుని. ధన్య జవాబివ్వలేదు. మరో ఆలోచనా చెయ్యలేదు. అతనికి దగ్గిరగా జరిగి పడుక్కుంది. అతని చేతిమీద తలపెట్టి, అతనిలోకి వొదిగిపోయి క్షణాల్లో నిద్రలోకి జారుకుంది. ఆమెని మరింత దగ్గిరగా జరుపుకుని ఆమోకూడా నిద్రలోకి జారిపోయాడు. ఆ సాన్నిహిత్యం ఇద్దరి అంత:చేతననీ చాలా సాంత్వనపరిచింది.


ఒక్కడూ శూన్యంలోకి చూస్తూ నిలబడ్డాడు మృత్యుంజయుడు. ఏవో జ్ఞాపకాల నీలినీడలు అతని మనసంతా పరుచుకున్నాయి. అంతా దు:ఖమే. అంతులేని వంటరితనం…ఈరోజుకోసం చాలా ఎదురుచూసాడు తను. వచ్చింది. రోదసిలో ఈచోట చాలా ప్రమాదరహితంగా వుంటుంది. తోకచుక్కల తాకిడిగానీ మరో సమస్యగానీ వుండదు. అది చూసేకదా, బాస్ విశ్వని నిర్మించింది ! తనుకూడా తన నౌకని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్నాడు. సమస్య వచ్చినప్పుడల్లా గతంలోని తన ప్రయోగశాలకి వెళ్ళి బాగుచేసుకుంటున్నాడు. ఈ ఇన్ని సంవత్సరాలలో ఎన్నో జరిగాయి. భూమ్మీద ఎన్నో మార్పులొచ్చాయి. తనకక్కడ చోటులేదని అర్థమైంది. బలవంతంగా నిలుపుకుంటున్న ప్రాణం. దాన్ని వదిలెయ్యలేని అసక్తత. ఇప్పుడింక ఆ విముక్తి పొందే రోజు వచ్చిందేమో!
మహాభారతయుద్ధం తర్వాత నాగరీకతంతా నశించిపోయింది. అంతటి నాశనానికి దారితీసిన విజ్ఞానశాస్త్రం పుక్కిటిపురాణంలా మిగిలిపోయింది. ఎవరూ, దేన్నీ నమ్మడానికి వీల్లేని కట్టుకథలనుకునేంత జ్ఞానరహితస్థితిలోకి జారిపోయారు జనం. మరుగునపడ్డవన్నీ మళ్ళీ నిజమనిపించేలా విజ్ఞానశాస్త్రం మళ్ళీ వూపిరిలూదుకుంది. వీళ్ళూ రెండు మహాయుద్ధాలు చేసుకున్నారు. ఇంకొకటి వస్తుందేమోనని భయంతో వణుకుతున్నారు. ఇలాంటి తరుణంలో తను వీళ్ళకి ఎప్పుడో కాలగర్భంలో కలిసిపోయి అందనంత దూరంలో వున్న తన సాంకేతికతని ఇవ్వటం ఎంతవరకూ సమంజసం?
అతని ఆలోచనలు మలుపులు తిరుగుతున్నాయి. చివరికి సుడిగుండంలా వడితిరుగుతూ అనేక భావచిత్రాలని ఆవిష్కరిస్తున్నాయి. చివరికి అర్థమైంది. అంత విరుద్ధపదార్ధాన్ని ఇప్పటివాళ్ళకి ఇవ్వడం సమంజసం కాదనిపించింది. వాళ్ళ విధ్వంసానికి తనెందుకు తోడ్పడాలి? ఎలాగా భవిష్య పరిణామాలు ఇలానే దారితీస్తాయి. ఆ దారిని తనెందుకు తెరవాలి? మనసుకి కొంత సాంత్వన చిక్కింది. తన గురించిన ప్రశ్న మళ్ళీ శేషప్రశ్నగానే మిగిలిపోయింది.
ఆమో ధన్యలు గుర్తొచ్చారు. వాళ్ళు తనని పూర్తిగా నమ్మట్లేదని అర్థమైంది. ఈరోజు కాకపోయినా రేపేనా నమ్ముతారు. అదికాదు సమస్య. తన తదుపరి గమ్యం ఏమిటని? అతడు ఆమో ధన్యలున్నదగ్గిరకి వచ్చాడు. వాళ్ళు పడుకున్నారో, నిద్రలేమితో బాధపడుతున్నారో చూడటానికి. ఏన్నో ఏళ్ళై పెళ్ళైన దంపతుల్లా ఒకరిలోకి ఒకరు వొదిగి నిర్వికారంగా పడుకున్నారు. అలా పడుకోవడంలో వాళ్ళ ఆలోచన అర్థమై చిన్నగా నవ్వొచ్చింది. అక్కడున్న శాలువా వాళ్ళకి కప్పి మళ్ళీ ఇవతలికి వచ్చాడు.
దాదాపు నాలుగ్గంటల గాఢనిద్ర తరువాత ఆమోకి మెలకువ వచ్చింది. చేతిమీద బరువుగా అనిపించి చూసుకున్నాడు. ధన్య… ఒక్క క్షణం ఏం జరిగిందో, ఇదెలా సాధ్యమో, తనెక్కడున్నాడో ఏమీ అర్థమవలేదు. క్రమంగా అన్నీ స్ఫురించాయి.ఆమెకి మెలకువ వస్తుందేమోనని కదలకుండా అలాగే వుండిపోయాడు.
ధన్య పక్కనున్న ఈ క్షణం శాశ్వతమైతే ఎంత బాగుంటుంది! అతని మనసెంతో ప్రలోభపడింది. తనకా అర్హతలేదు… లోలోపల్నుంచీ నిరసన… అతను లేచిన మరికొద్ది నిముషాలకి ధన్యలేచింది. ఆమెకూడా మొదట అతన్లాగే తికమకపడింది. పరిస్థితిని అర్థంచేసుకుంది. ఆమెలో ఆశ కలిగింది…. ఆమోతో అలాగే శాశ్వతంగా వుండిపోవాలని. అతనికి దూరం జరిగి సర్దుకుని కూర్చుంది.
ఇద్దరూ పక్కమీదున్న శాలువాని చూసారు. తామిద్దరూ పడుకుని వున్న పొజిషన్లో ఒకరికి తెలీకుండా మరొకరు దాన్ని కప్పటమనేది సాధ్యపడదు. అంటే… తాము నిద్రపోయాక మృత్యుంజయుడొచ్చాడా? అంతే అయుంటుంది. తాము నిద్రపోయారో లేదో నిద్రపట్టకపోతే సెడెటివ్ ఇవ్వటానికి వచ్చి వుంటాడు. ఆ స్ట్రెస్ అలాంటిది. తామలా ఎందుకు పడుక్కున్నాడో గ్రహించాడా? తప్పుగా అనుకుని వుంటాడా? ఇద్దరి ముఖాలూ ఎర్రబడ్డాయి. కొద్దిసేపు ఒకరినొకరు చూసుకోలేకపోయారు.
“పద. అతనేం చేస్తున్నాడోచూసి, ఏమైనా చెప్తాడేమో విందాం”” అని లేచాడు ఆమో. అతని వెనుక తనూ నడిచింది ధన్య.
మృత్యుంజయుడింకా శూన్యంలోకి చూస్తూ నిలబడే వున్నాడు. అతను తమలాగే మామూలుగా వుండటాన్ని ఇద్దరూ గుర్తించారు. అతను విడిచిన వూదాపచ్చరంగు తొడుగు ఒక గోడకి మెరుస్తోంది. వీళ్ళ అలికిడికి తల తిప్పాడు. కాఫీమేకర్ చూపించాడు.
“అన్నీ వాళ్ళ వూరు వెళ్ళినట్టు వెళ్ళి అప్పట్లోంచీ తెచ్చేసుకుంటున్నట్టున్నాడు”” అంది ధన్య నవ్వులాటగా. ఆమోకూడా నవ్వాడు. ఇద్దరూ కాఫీ చేసుకుని తాగారు. మృత్యుంజయుడు తానప్పుడే తాగానన్నాడు.
మళ్ళీ ట్రాన్స్మిటర్ల ప్రహసనం మొదలైంది.
“మానవ నాగరీకతగురించి మీరు కొన్ని సిద్ధాంతాలు చేసుకున్నారు. వాటిలో వున్న అసంబద్ధతలతోపాటుగా వాటిని నమ్మాలని ప్రయత్నిస్తున్నారుకదా?”” అన్నాడతను.
“అలా ఎందుకనుకుంటున్నారు?”” అడిగాడు ఆమో.
“ఇప్పుడున్న ఈ నాగరీకత మూడు నాలుగువేలేళ్ళక్రితంది మాత్రమేననికదా, మీరనుకునేది? భారతయుద్ధాన్ని నమ్మరు. రాక్షసులనే జాతిని నిర్మూలించి, రాముడనేరాజు భరతవర్షాన్ని ఆర్యులకనువైనదిగా మార్చడాన్నీ నమ్మరు. అంతేనా?””
“ఆధారాలు లేనిదే ఎలా నమ్మగలరు ఎవరేనా?””
“భీమ్‍బైఠక్ శిలావాసాలు లక్షసంవత్సరాలనాటివి. అక్కడి కుడ్యచిత్రాలు కనీసం ముప్పైవేలేళ్ళనాటివి. ద్వారక నీళ్ళలో మునిగి తొమ్మిదివేలేళ్ళకి పైనే. ఈజిప్షియన్ స్ఫింక్స్, గొబెక్లి తెపె, హరప్పా మొజంజొదారొ, యొనగుని శిథిలాలు తొమ్మిదివేలేళ్ళకి పైనే. ఇవన్నీ ఆధారాలు కావా? ప్రపంచవ్యాప్తంగా ఎన్నో వున్నాయి ఇలాంటివి”” అంటూ ఉనికిని కోల్పోయిన కాలాన్ని గురించి చెప్పాడు.
ఆమో జవాబివ్వలేదు. మిగతాచోట్ల ఎలా వున్నా, భారతదేశంలోమాత్రం నాగరీకత ఎప్పట్నుంచో వుందని ఇతిహాసాలూ, పురాణాలూ చెప్తాయి. నమ్మకమనికాదుగానీ, దాన్ని సీరియస్‍గా తీసుకోరు. వాటిమీద ప్రయోగాలు చెయ్యరు. ఆర్యుల దండయాత్ర సిద్ధాంతమని ఒకటి వుంది. ఆర్యులనే ఒక సంచార తెగ భారతదేశంలోకి వచ్చి అప్పటిదాకా అనాగరికంగా బతుకుతున్న మనుషులందరికీ నాగరీకత నేర్పిందని ప్రచారం చేస్తారు ఆ సిద్ధాంతాన్ని నమ్మేవాళ్ళు.
“ఒకాయనేమో వుపరిచర వసు మహారాజు. ఆయన భూమి వుపరితలంమీద అంటే గాల్లో తిరుగుతాడు. మరొకాయనేమో చోదకుడు లేని, ఎందరినేనా ఎక్కించుకోగలిగే పుష్పకమనే విమానం కలవాడు. రావణాసురుడు. ఇంకొకాయనేమో విమానంలో తన ప్రియురాలితో విహారం చేస్తూ తాంబూలచర్వణం చేసి లాలాజలాన్ని వూస్తే అదెళ్ళి సూర్యుడికి అర్ఘ్యమిస్తున్న కృష్ణుడి చేతుల్లో పడింది. నలకూబరుడు. ఇంకొకాయన ఏకంగా త్రీడీ సాంకేతికతతో సభనే నిర్మింపజేసుకున్నాడు. అది మయసభ. విశ్వామిత్రుడు త్రిశంకుడికోసం స్పేస్ సిటీని నిర్మించాడు. యయాతి మెటమార్ఫసిస్ ద్వారా తనకి సంభవించిన అకాల వృద్ధాప్యాన్ని వదిలించుకున్నాడు. కృష్ణుడిమీద సాల్వుడు ఆకాశంలోకూర్చుని యుద్ధంచేసాడు. ఇవన్నీ ఆధారాలు కావా? ఇవన్నిటిగురించీ చదువుకుని వుంటారు. ఆ సాంకేతికత నిజంగానే వున్నరోజుల్లో నేను బతికాను”
ఆమో, ధన్యల ఆలోచనలు ప్రభావితమయ్యాయి. మరే అనుమానం లేకుండా మృత్యుంజయుడు చెప్పిన విషయాలని వినసాగారు.
“ఏ నాగరీకతాకూడా ఒక్కసారిగా పుట్టుకు రాదు. ఆవిష్కారాలన్నీ క్రమంగా జరిగి, ఏదో ఒక్క ఫలితంతో చరిత్రగతిని మార్చేస్తాయి. అలాంటి ఆవిష్కారం జరగడానికి కొన్నివేల యేళ్ళుకూడా పట్టవచ్చు. ఎప్పుడో పుట్టిన నాగరీకతలు ఇవి. మహానగరాలు. మహాభారతయుద్ధకాలందాకా ఈ నాగరికతలు కొనసాగాయి. అనేకమంది ఆచార్యులు, రుషులు… మీ ఇప్పటి భాషలో శాస్త్రవేత్తలు. శాపాలివ్వడం … అల్ట్రాసోనిక్ శబ్దాలని సృష్టించడంద్వారా ఎదుటివ్యక్తికి హాని చెయ్యగలిగేవారు. ద్రోణాచార్యుడు, కృపాచార్యుడు, భీష్ముడు, అశ్వత్థామ వీళ్లంతా అణుపితామహులని చెప్పుకోవచ్చు. భారతయుద్ధం తర్వాత రాజులు ఎవరూ మిగలలేదు. చెప్పుకోదగ్గ రాజ్యాలు మిగలలేదు. ఆచార్యులుకూడా అందరూ చనిపోయారు. అలా ఒక గొప్ప సాంకేతిక విజ్ఞానం కాలగర్భంలో కలిసిపోయింది”
“మీరు తెలుగువారా ? అప్పటి రాజ్య వ్యవస్థ ఎలా ఉండేది?”” ఆమో అడిగాడు.
“రాచరికమే. మంత్రులతోకూడిన సభ వుండేది. వారు చారులద్వారా రాజ్యంలోని వ్యవహారాలు, ప్రజల అభీష్టాలు తెలుసుకునేవారు. రాజుకి సలహాలిచ్చేవారు. రాజులు పాలన జరిపేవారు. ప్రజోపయోగమైన పాలన అని నేను చెప్పను, ప్రజలని సంతృప్తిగా వుంచి, తమ వ్యవహారాలు తాము చూసుకునేవారు రాజులు. అనేక ఇతర చిన్నా పెద్దా రాజ్యాలతోపాటు అస్మక, ఆంధ్ర రాజ్యాలనేవి ఉండేవి. కాలక్రమంలో అవే తెలుగు రాజ్యాలుగా రూపొందాయి. రాజులదే పాలన. ఇప్పటి జోధ్‍పుర్ అప్పుడు అనేకమంది శాస్త్రవేత్తలకి వేదిక అయింది. అక్కడి రాజు సర్వవీక్షణుడు. దేశ విదేశాల శాస్త్రవేత్తలని తన రాజ్యానికి ఆహ్వానించి వారిచే వివిధ విషయాలలో పరిశోధనలు చేయించేవాడు”
“…”
“యువకులందరం శలభాల్లా ఆకర్షించబడేవాళ్ళం””
“అదేంటి, అలా అంటున్నారు? బాస్ అనే ఒకానొక సంస్థ లేని రోజుల్లో విద్యకీ విద్వత్తుకీ విలువే ఉండేది కాదు. అలాంటిది ఒక రాజు తనే ప్రోత్సహిస్తూ ఉంటే మీరలా అనటం ఆశ్చర్యంగా ఉంది” అడిగాడు ఆమో.
“సర్వవీక్షణుడు చేయించే ప్రయోగాల వెనక చెడు ఆలోచన ఉంది. ప్రపంచాన్నంతటినీ తన గుప్పెట్లో పెట్టుకోవాలనుకునే వాడు””
“అప్పుడూనా?””
“మానవ ప్రవృత్తి ఎప్పుడూ అలాగే ఉంటుంది””
“మనుషులలా వుంటే విజ్ఞానం విపత్తే””
“అక్షరాలా””
“మరేం జరిగింది?” “