ఎంత ఎండ? ఎంత వెన్నెల? by S Sridevi

1.8.2040.
ఉదయం ఎండ కాస్త తీవ్రంగానే వుంది. పౌర్ణమి కావటాన్న రాత్రి వెన్నెలకూడా బాగానే కాస్తుంది. రోజంతా బైటే గడిపి నా డబ్బుని కిట్టుబాటు చేసుకోవాలనుకున్నాను.
“బిల్లులు వచ్చాయా, పొద్దున్నే బైటికొచ్చి కూర్చున్నారు?” పరిహాసంగా అడిగింది శిల్ప. నాకు కొద్దిగా అవమానంగా అనిపించింది. ముఖం ఫోన్లో దాచేసాను. నిజంగా వెక్కిరించినట్టే వుంటాయి ఆ రెండు బిల్లులూ. పెద్దమొత్తమేమీ కాదు. కానీ కట్టడానికి చిన్నతనంగా వుంటుంది. వారంరోజులు గడువు. ఆలోపల చెల్లించకపోతే ఇంటర్నెట్ ఆపేస్తారు. దినచర్యంతా దాదాపుగా ఆగిపోతుంది. ఇది ఆయా వ్యక్తులు జీవితకాలంపాటు కట్టాలని నిబంధన వుంది. ఇలాంటి బిల్లులు అవంతీపురంలో దాదాపు లక్షమందికి వస్తాయి. ఒరిజినల్‍గా ఎంతమందికి వచ్చేది, వాళ్ళలో ఎంతమంది ఇప్పటివరకూ బతికి వున్నారు, ఎంతమంది చనిపోతే బిల్లు ఆగిపోయిందనే కచ్చితమైన లెక్కలు గూగుల్లో వున్నాయి.
కట్టడానికి పద్ధతికూడా వింతగా వుంటుంది. డబ్బులావాదేవీలు డిజిటైజ్ కాని రోజుల్లో ఎలా వుండేదో అలా వుంటుంది ప్రక్రియ. ముందుగా బేంకుకి వెళ్ళాలి. డబ్బు తీసుకోవాలి. దానికి పెద్ద ప్రాసెస్ వుంటుంది. కరెన్సీ ఏటీయమ్ సెంటర్లలో పెట్టడం ఆపేసి చాలాకాలమైంది. ఎందుకోసం కరెన్సీ కావాలో అప్లికేషన్ రాసి బేంకరు దగ్గిరకి వెళ్ళాలి. అప్లికేషన్‍మీద “ఎంత ఎండ? ఎంత వెన్నెల?” అనే హెడ్డింగ్ చూడగానే బేంకరు పెదాలు చిరునవ్వు దాచుకునే ప్రయత్నంలో వంకర్లు తిరుగుతాయి. వింతగా మొహంలోకి చూసి, పర్మిషన్ ఇస్తాడు. ఆ తర్వాత సేఫ్ లాకర్లోంచీ కరెన్సీ తీసి ఇస్తాడు. వాటిని తీసుకుని మునిసిపల్ ఆఫీసుకి వెళ్ళాలి. అక్కడ ప్రత్యేకమైన కౌంటర్లు వుంటాయి, ఈరకమైన బిల్లులు తీసుకోవడానికి. అప్పటికే అక్కడికి ఈ లక్షమందిలో బతికున్నవాళ్ళంతా చేరుకుంటూ వుంటారు. పెద్దపెద్ద క్యూలు వుంటాయి.
“ఎంత ఎండ? ఎంత వెన్నెల?” అనే ప్రశ్నలతో హోరెత్తిపోతూ వుంటుంది.
అడిగేవాళ్ళు అడుగుతూ వుంటారు, చెప్పేవాళ్ళు చెప్తూ వుంటారు.
మళ్ళీ అక్కడో అప్లికేషన్ రాయాలి, బిల్లు కేటగరీ ఇది కాబట్టి, డబ్బురూపంలో చెల్లించడానికి అనుమతి ఇవ్వమని. ఆ అనుమతిపత్రం తీసుకుని కౌంటరుముందు క్యూలో నిలబడాలి. క్యూ నెమ్మదిగా కదుల్తూ వుంటుంది. బిల్లు కట్టించుకుని రశీదు ఇస్తారు. ఈ రశీదులన్నీ జాగ్రత్తగా దాచాలి. ఇవి చూసిస్తేనే మనం పోయాక మరణధృవీకరణపత్రం ఇస్తారు. వెరసి మొత్తం ప్రక్రియంతా చిన్నపాటి శిక్షలాంటిది.
ఒకప్పుడు ప్రభుత్వం తలపెట్టిన ఒక పనిని తీవ్రంగా ప్రతిఘటించినందుకు ఈ పన్నులు వసూలుచేస్తారు. ఎండనీ, వెన్నెలనీ వాడుకున్నందుకు ఇంటి వైశాల్యాన్నిబట్టి వేస్తారు. బిల్లు పేరు ఇర్రేడియన్స్ బిల్లు. లక్స్ అనే యూనిట్లలో లెక్కకట్టి వేస్తారు. ఇంత వైశాల్యంగల ఇంట్లో నివసిస్తున్న నువ్వు ఇన్ని లక్స్ యూనిట్ల ఎండనీ, వెన్నెలనీ వాడుకున్నావనేది బిల్లు సారాంశం. దాన్ని ఎవరికేనా చూపించడమంటే నన్నో తెలివితక్కువ దద్దమ్మగా చూడమని లైసెన్స్‌పత్రం చూపించినట్టే.
అసలు ఆ వ్యూహంలో నేనెలా ఇరుక్కున్నానో ఇప్పటికీ నాకు ఆశ్చర్యంగా వుంటుంది. అప్పుడు నాకు ఇరవయ్యైదేళ్ళేమో! ఉడుకురక్తం. దుడుగ్గా వుండేవాడిని. ఏ విషయం మీదైనా పైకి కనిపించేదే తప్ప లోతైన అవగాహన వుండేది కాదు. తేలిగ్గా ఇతరుల ప్రభావంలో పడిపోయేవాడిని. అలాంటి ఒక సందర్భమే నన్నీ వుద్యమంలోకి లాగింది.
2035లో.
ఈ సమయంలో దాదాపు పదిదేశాలు ఒకదాంతో ఒకటి పోటీపడి అంతరిక్షంలోకి పరుగులు పెడుతున్నాయి. చంద్రుడిమీదికీ, మంగళగ్రహంమీదికీ వెళ్ళడం, సూర్యుడి వుపరితలాన్ని పరిశోధించడం ఒకెత్తైతే బుధుడి వుపగ్రహం యూరోపామీద నీటి ఆనవాళ్ళు కనిపించాయని అక్కడికీ వెళ్ళి ప్రయోగాలు చేయటం మరోయెత్తు. ఆ పోటీల్లో మనదేశంకూడా వుండటం అత్యంత విషాదకరంగా అనిపించేది.
దేశం అనేక శతాబ్దాలపాటు పరాయిపాలనలో వుంది. స్వతంత్రం వచ్చి ఎనభయ్యెనిమిది సంవత్సరాలైంది. అప్పటి లెక్కలప్రకారం బ్రిటిష్‍వాళ్ళు మనదగ్గిర్నుంచీ దోచుకువెళ్ళింది నూటయాభైట్రిలియన్ డాలర్లని ఒక లెక్క. వాళ్లతోపాటు వచ్చిన ఫ్రెంచి, పోర్చుగీసు, డచ్చివాళ్ళు ఎంత తీసుకెళ్ళారో! వాళ్లకిముందు దండయాత్రలు చేసిన నాదిర్షాలు, ఘోరీలు ఎంత దోచుకెళ్ళారో! ఈలెక్కలన్నీ యువత మెదళ్లని తినేస్తూ వుండేవి. అవన్నీ వెనక్కి తెచ్చుకోలేకపోవడం మన అసమర్ధతగా అనిపించేది. విదేశాలకి వెళ్లడం, విదేశీ కంపెనీల్లో పనిచెయ్యడం, విదేశాల్లో జీవనప్రమాణాలు బావుండటం మాకు బాధ కలిగించేది. చాలామంది యువత ఎక్కడెక్కడికో వుద్యోగాలు వెతుక్కుంటూ వెళ్ళిపోతున్నారు. గ్లోబల్ సిటిజెన్స్‌గా మారిపోతున్నారు. ఇక్కడే మిగిలినవాళ్ళు పేదరికంతో సహజీవనం చేస్తున్నారు. ఎంత్రాప్రెనర్స్, జీవితంపట్ల పెద్దగా పట్టింపులేనివాళ్ళు మాత్రమే ఇక్కడ వుంటున్నారు.
ప్రిమియర్ ఆలోచన అందుకు భిన్నంగా వుండేది. నేలకి కొట్టిన బంతిలా పైకి లేవాలనేది ఆయన ప్రతి వుపన్యాసంలోనూ చెప్పేవాడు. ఒక సందర్భంలో ఆయన అన్నమాటలు-
ప్రపంచమంతటా వున్నది మన మనుషులే. ప్రపంచమంతా నిర్మించబడింది మన సంపదతోనే. వాళ్ళు న్యాయంగా తీసుకెళ్ళారా, దోచుకెళ్ళారా అనేది అప్రస్తుతం. ఎక్కడ అవకాశం వుంటే అక్కడికి వెళ్ళి సంపాదించుకోండి- అని.

అది చేతకానితనంగా అనిపించింది. కొందరికి. అందులో నేనూ వున్నాను.
ప్రభుత్వానికి వ్యతిరేకంగా చాలా పెద్ద వుద్యమం జరిగింది. మా నిరసనని ప్రభుత్వ పోర్టల్‍కి తీవ్రమైన పదజాలంతో రాసి పంపేవాళ్లం. మామీద కేసులు పెట్టేవారు. ఎక్కడా తగ్గలేదు. ఫలితమే అంతరిక్ష సాంకేతికతలో ముందున్న దేశాలు వెనకబడ్డ దేశాలమీద ఇర్రేడియన్స్ బిల్లు వెయ్యాలని నిర్ణయం తీసుకున్నప్పుడు మన ప్రభుత్వం ఈ బిల్లు మామీద వేసింది. ఆధునిక సాంకేతికతని నిరసించినందుకు తిరోగమన పద్ధతిలో వసూలు చేస్తోంది.
“ఆసలు మీకలాంటి ఆలోచన ఎందుకొచ్చింది? అలాంటి వుద్యమం చెయ్యాలని ఎందుకనుకున్నారు?”
కాఫీకప్పులతో వచ్చి, ఒకటి నాకు ఇచ్చి, మరొకటి తను తీసుకుని నా ఎదురుగా కూర్చుని అడిగింది శిల్ప. ఇప్పటికి ఎన్నోసార్లు అడిగింది. నేను చెప్పలేదు. మాట దాటేసాను. ఇంత అవమానకరమైన బిల్లుగురించిఎలా చెప్తాను? ఇప్పుడికి ఎలాగేనా చెప్పించాలనే కృతనిశ్చయంతో వచ్చికూర్చున్నట్టుంది. ఐనా గూగుల్ చేస్తే తెలుస్తుంది అప్పట్లో మేం చేసిన వుద్యమాన్నిగురించి. ప్రత్యేకించి అడగడం దేనికి, పుండు రేపినట్టు?
“ఎంతమంది వుంటారు, ఈ బిల్లు కట్టేవాళ్ళు?” తెరలుతెరలుగా వస్తున్న నవ్వుని ఆపుకుంటూ అడిగింది.
కోపంగా చూసాను.
“నన్నూ అడిగారు, వుద్యమంలో చేరమని. చేరలేదు” అంది.
“ఎందుకు?” అడిగాను.
“ప్రపంచం ముందుకి వెళ్తున్నప్పుడు మనం వున్నచోటే ఆగిపోతే ఎలా?”
తన ప్రశ్న నాలో అప్పటి జ్ఞాపకాలని తట్టిలేపింది.
వందలూ, వేల కోట్లు ఖర్చుపెడుతున్నారు. ఆ డబ్బు దేశాభివృద్ధిమీద పెట్టచ్చుకదా అనిపించేది. విద్యావైద్యరంగాల అభివృద్ధి, వుపాధికల్పన చేస్తే చదువుకున్న యువత దేశం వదిలిపెట్టి వెళ్లరని అనిపించేది.
“… మాకు అలానే చెప్పేవాళ్ళు. యువత దేశాన్ని వదిలిపెట్టి వెళ్తోంది. దేశంలో పేదరికం వుంది. ఈ ప్రయోగాలు అవసరమా అని ప్రశ్నించేవాళ్ళు మాకు చాలామంది తటస్థపడేవారు. ప్రజల పన్నులడబ్బుని ఈ అర్థంలేని ప్రయోగాలమీద ఖర్చుపెట్టడం అనైతికం కాదా అని చాలా ఆవేశంగా ప్రశ్నించేవారు” అంది శిల్ప.
“నిజం కాదా?” అడిగాను.
“పన్నులు కట్టేవాళ్లకీ కొన్ని కోరికలుంటాయికదా? ఎంతకని, ఎన్నింటికని త్యాగాలు చేస్తారు? మాకు ప్రభుత్వం అలా ఖర్చుపెట్టడమే యిష్టమని చెప్పేవాళ్లం. పేదరికం అనేది సమాజం నడిచే ప్రాసెస్‍లో తయారయ్యే బైప్రోడక్టు. దానికి కారణాలు అనేకం. అది ఒక దేశంయొక్క వ్యక్తిగతసమస్యలాంటిది. ప్రపంచదేశాలు చేసే పరుగుపందెంలోంచీ ఆ దేశానికి మినహాయింపు వుండదు. తప్పుకుంటే నష్టపోయేది ఆ దేశమే. ఆలోచించు సోమయాజీ! చంద్రుడి దక్షిణార్ధగోళంమీద ప్రయోగాల తర్వాతేకదా, మన శరీరంలో వుండే ఎన్నో వైరస్‍లకి మూలం దొరికింది? హీలియమ్3ని సులువుగా తయారుచెయ్యగలుగుతున్నాం? లేకపోతే ఆ టెక్నాలజీ అంతా ఎంతో డబ్బు వెచ్చించి కొనుక్కునేవాళ్ళం. ఇప్పుడు భాగస్తులం. చాలా మార్పులు వచ్చాయి. ఇప్పుడేం జరిగింది? చంద్రుడిమీద అడుగుపెట్టిన దేశాలన్నీ ఆ వుపగ్రహాన్ని వాటాలు వేసి పంచేసుకుని, వెళ్లని దేశాలమీద ఎండపన్నూ, వెన్నెలపన్నూ వేస్తున్నాయి. అంటే తమ ప్రయోగాల ఖర్చు వాటినుంచీ వసూలు చేస్తున్నాయి. డబ్బు ఖర్చెలాగా తప్పదు, గౌరవం నిలబడిందికదా?” అడిగింది.
నేను ఆలోచనలో పడ్డాను.