అవి నేను ఇంటర్మీడియట్ రెండో సంవత్సరంచదువుతున్నరోజులు. అప్పట్లో రెండో సంవత్సరాంతంలో రెండుసంవత్సరాల కోర్స్‌మీద పరీక్షలు జరిగేవి. పరీక్ష ఫీజు కట్టే టైం వచ్చింది. కాలేజ్‍లో పరీక్ష ఫీ కట్టడానికి కావలసిన వివరాలు నింపాల్సిన ఫార్మ్ ముందురోజు ఇచ్చి తరవాతరోజు ఫీజ్, నింపిన ఫార్మ్ సబ్మిట్ చేయమన్నారు.
మరుసటిరోజు తెల్లారుఝామున ఫార్మ్ నాన్నగారికి చూపించాను.ఆయన అది సాంతం చదివి “రా అమ్మా! నింపుదువు” అన్నారు.
నేను ఫార్మ్‌లో ఆడిగినవి ఒకొక్కటి పైకి చదువుతూ వాటికి ఏమి రాయాలో నాన్నగారు చెబుతుంటే రాస్తూ పరీక్ష మొత్తంగానా, లేదా ఏఏ సబ్జెక్ట్‌లు రాస్తారు అనే అంశం దగ్గరికి వచ్చాను. ఆ అంశం చదవగానే నాన్నగారు “హోల్ “అని రాయమన్నారు.
కొంచెం భయంభయంగానే “అన్నీ ఈసారి రాస్తాను. మాథ్స్ మాత్రం సెప్టెంబర్లో రాస్తాను”అన్నాను.
“ఏమీ?ఎందుకూ?” ఆశ్చర్యం ధ్వనించింది ఆయన గొంతులో.
“టైఫాయిడ్ రావటం, తిరగబెట్టటం వీటన్నిటివల్లా చాలారోజులు నేను కాలేజ్‍కి వెళ్ళలేదుకదండీ? అప్పుడు చాలా కోర్సులు అయిపోయాయి. ముఖ్యంగా లెఖ్ఖల్లో కేలిక్యులస్, కో ఆర్డినెట్ జామెట్రీ పూర్తిగా అయిపోయాయి. మాథ్స్ సెకండ్‍పేపర్ పూర్తిగా ఆ రెంటిమీదే. అవి నాకు రావు కనక పరీక్ష ఫెయిల్ అవుతాను” అన్నాను సన్నని గొంతుకతో మధ్యమధ్యలో ఆగుతూ తల వొంచుకుని బిక్కచచ్చిపోయి.
నాన్నగారు శంకరాభరణం శంకరశాస్త్రి టైప్ తండ్రి. ఆయన ముందు నోరెత్త టానికి చచ్చేంత భయం.
“సరేలే !ముందు హోల్ అని రాయి. ఫార్మ్ నింపాక మాట్లాడుదాం” అన్నారు.
చేసేది లేక మనసులోనే ఏడ్చుకుంటూ ఆయన చెప్పినట్లు ఫార్మ్ నింపాను. ఓసారి మళ్లీ ఆయన దాన్ని సరిగా ఉందో లేదో చూసి తాపీగా “ఇందాక ఏమన్నావ్? ” అని అడిగారు?
“మాథ్స్ సెకండ్ పేపర్ సిలబస్ నాకు రాదు. ముఖ్యంగా కేలిక్యులస్. ఆ క్లాసులకి నేను వెళ్లలేదు” అన్నాను.
“రాదా? ప్రయత్నించావా?” నాన్నగారు.
“లేదు!” దీనంగా నేను.
“ప్రయత్నించకుండా రాదని ఎలా చెబుతున్నావ్?”
నాకు గొంతులో పచ్చివెలక్కాయ పడ్డట్లు ఉంది.
“క్లాసులు వినలేదుకదా అందికే రావనుకున్నాను” నీరసంగా నూతిలోంచి మాట్లాడుతున్నట్లు నా గొంతు. నాకే వినబడకుండా.
“సరేలే! రేపు ఉదయం నాలుగుగంటలకు నీ సెకండ్ ఇయర్ మాథ్స్ టెక్స్ట్‌బుక్ చూపించు. సిలబస్ ఏమిటో చూదాం” అని అక్కడినుండి వెళ్లిపోయారు.
నాన్నగారు కాలేజీలో మాథ్స్ బోధిస్తారు. ఎందరో విద్యార్థులు ఆయన దగ్గర మాథ్స్ నేర్చుకున్నారు. కానీ ఇంతవరకు ఆయన అంటే భయంవలన ఇంట్లో పిల్లలం ఎప్పుడూ ఆయనని ఏదీ అడిగేవారం కాదు. ఆయన చాలా బిజీ ఎప్పుడూ. అందికే మేము ఏమి చదువుతున్నాం అనేది పట్టించుకునే వారు కాదు. ఏదో పరీక్షలు రాసేవాళ్ళం. పాస్ అయిపోతుండే వాళ్ళం. అప్పట్లో తలితండ్రులు ఇప్పటివారిలా పిల్లల చదువులకోసం అంత హైరానాపడిపోయేవారు కాదు.
ఇప్పుడు ఆయన రేపటినుంచి చూదాం అంటే నా గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. ఆయన ఈ గదిలో ఉంటే మేమా గదిలో వుండేవాళ్ళం. ఇప్పుడు ఆయన ఎదురుగా కూచుని పాఠం వినాలి.
“ఈశ్వరా! నాకెందుకీ శిక్ష ,నేనేం పాపం చేసాను!”అనుకుంటూ-
అమ్మ దగ్గరికి వెళ్లి జరిగింది చెప్పి “అమ్మా! ఆయన చూదాం అన్నారంటే చేదాం అని అర్ధం. రేపటినుండీ ఈ లెక్కలు చేయాలి. అదీ నాన్నగారు చెబుతుంటే. ఏం దారి నాకు? ఆ కోర్స్ సమ్మర్ హాలిడేస్‍లో తీరికగా చేసుకుని సెప్టెంబర్లో పరీక్ష రాదామనుకుంటే హోల్ ఎగ్జామ్ అని రాయించారు. ఇప్పుడు ఈయనే ఆ కోర్స్ కవర్ చేస్తారు. అవేవీ నాకు రావు. ఇంత తక్కువ టైంలో అన్ని సబ్జెక్ట్స్ చేయటం నావల్ల కాదు” ఏడుపు గొంతుతో అన్నాను.
“ఆ ఏడుపు అక్కడ ఏడవాలి. నా దగ్గర చెబితే నేనేం చేస్తాను? అయినా ఇప్పుడు కొంపేమ్మునిగింది అని ఏడుపు? ఆయన చెప్తారు. నువు చెయ్యి. రాకపోతే ఆ పరీక్షరోజే మానేద్దువు. దానికి ఇప్పటినుండీ ఏడుపెందుకు. ఓసారి ఆయన చెప్పాక విని తీరాల్సిందే కదా!” అనేసింది అమ్మ.
“హుం ! నీతో ఏమి చెప్పినా వేస్ట్. చచ్చినట్లు నోరుమూసుకు చెయ్యి అంటావు” అని విసురుగా అంటే-
“అనక? నాన్నగారి మాట వినకు, నీ ఇష్టం వచ్చినట్లు చెయ్యి అంటానా? ఏమి చెయ్యాలో మానాలో ఆయనకి తెలుసు. నీ పని ఆయన చెప్పింది చేయటమే”అని డిక్లేర్ చేసింది.
“ఛా! ప్రయోజనం ఉండదని తెలిసీ నీతో చెప్పటం నాదే బుద్ధి తక్కువ” అని గొణుక్కుంటూ అక్కడినుండి వెళ్ళిపోయాను.
మర్నాడు ఉదయం నాలుగుగంటలకు నేను నాన్నగారి దగ్గరకి వెళ్ళి టెక్స్ట్‌బుక్ ఇచ్చాను. ఆయన టెక్స్ట్‌బుక్‍లో ఏ టాపిక్స్ వున్నాయో చూసి “ఈరోజు లిమిట్ కాన్సెప్ట్ చూదాం” అన్నారు.
అది బోధపరిచి దానిమీద ఒక ప్రమాణమైన పుస్తకం కాంట్ కెలిక్యులస్ పుస్తకం ఇచ్చి ఆ టాపిక్ అందులో ఒకసారి చదవమని చెప్పి వెళ్లిపోయారు తన రొటీన్ వర్క్‌కోసం.
సరిపోయింది నాకు. ఆ రోజుకి అది ఓవర్‍డోస్. చచ్చినట్లు ఆయన చెప్పింది చేసి మర్నాడు ఏమి అర్ధం అయిందో, ఏమి అర్ధం కాలేదో చెప్పి కొత్త భావన చెపితే విన్నాను.
ఇలా రోజూ ఒక భావన అరగంట పాఠం చెప్పటం పావుగంట ముందురోజు పాఠం పునశ్చరణ, పావుగంట ఆరోజు చెప్పిన భావన పునఃసమీక్ష. నాభావనకి సంబంధించిన అంశంమీద ఒక ప్రమాణపుస్తకం ఇచ్చి ఆ భావన అందులో ఎలా రాసారో చదవమనటం. ఇవికాక ప్రతి భావనమీద బోల్డు లెఖ్ఖలు. ఓ పదిరోజులు ఇలా గడిచేసరికి ఆ విషయాలు నాకు బాగానే అర్ధం అవుతున్నాయి అనిపించింది.
కేలిక్యులస్‌లో డిఫరెన్టీయేషన్, అప్లికేషన్స్ ఆఫ్ డిఫరెన్టీయేషన్ బాగానే వంటబట్టేయి మరో పదిరోజులకి.
అలా నేను మిస్ అయిన సిలబస్ అంతా ఓ రెండునెలల్లో నాన్నగారు కవర్ చేశారు. ధైర్యం వచ్చింది. అవి అన్నీ సాధన చేసి ఫైనల్ పరీక్షలు బాగా రాసాను. పాస్ అవుతాను అనే నమ్మకం కలిగి అమ్మయ్య ఇక్కడికీ బెడద వదిలి పోయింది. హాయిగా సమ్మర్ ఎంజాయ్ చేయవచ్చు అనుకున్నాను.
అనుకున్నట్లే ఫలితాలు వచ్చాయి. ఫస్ట్‌క్లాస్‍లో పాస్ ఆయాను. మాథ్స్‌కూడా నూటికి తొంభై అయిదు మార్కులు వచ్చాయి. నా ఆనందానికి హద్దు లేదు.
మార్క్స్‌లిస్ట్ తెచ్చి నాన్నగారికి చూపించాను. ఆరోజువరకు ఏమీ మాట్లాడని నాన్నగారు ఆరోజు-
“చూసావా, సెప్టెంబర్‍కి రాస్తానన్నావు మాథ్స్, నువ్వు సిలబస్ కనీసం చూడకుండా, ప్రయత్నమేనా చేయకుండా రాదు అనేసుకున్నావు. అది నీ మొదటి తప్పు. చూసిన తరువాతకూడా తగిన కృషి చేయకుండానే నేను చేయలేను అన్నావు. కృషి లేకుండా ఏదయినా ఎలా చేయగలవు? అది నీ రెండో తప్పు. ఏది అయినా చేయలేను అనటం ఆత్మవిశ్వాసలేమిని సూచిస్తుంది. లేని పోనివి ఊహించుకుని చేయలేను అనుకోవటం చాలా పెద్ద వ్యక్తిత్వలోపం. అలా నీగురించి నువ్వే తీర్మానించుకుని ఏమీ చేయకుండా కూచుంటే, లేదా నువ్వన్నట్లు సెప్టెంబర్లో మాథ్స్ నిన్ను రాయనిస్తే, నీకు విలువైన ఒక విద్యా సంవత్సరం వృధా అయేది. ఇప్పుడు చేయలేను అనుకున్న నువ్వేగా కష్టపడిందీ, పరీక్ష రాసిందీ, పాస్ అయిందీను? నేను చేయగలను, చేస్తాను అనే దృఢనిశ్చయంతో సాధన చేస్తేనే సవ్యమైన ఫలితాలు వస్తాయి. అంతేతప్ప ఆత్మవిశ్వాసం కోల్పోయి కృషిచేయకపోతే జీవితంలో ఏవీ సాధించలేవు” అన్నారు.
అర్ధం అయింది అన్నట్లు తల ఆడించి “ఈశ్వరా! జన్మజన్మలకి నన్ను ఈ తండ్రికే బిడ్డగా పుట్టించు” అని మనసులోనే దేముడికి దండం పెట్టుకున్నాను.
100 must read books
నా పేరు ఆయాపిళ్ళ సావిత్రి. జననం 1955. పుట్టింది అనకాపల్లి, ఆంధ్ర ప్రదేశ్ లో. తల్లితండ్రులు.. లేట్ గంటి వెంకట రమణయ్య,సుందరమ్మ. భర్త.. లేట్ A.V.Ramana Rao.విద్యార్హతలు: MSc physic s, Mphil, PG Dip Electronics ఉద్యోగం: విశాఖపట్నం AVN కళాశాలలో భౌతికశాస్త్ర విభాగంలో విభాగఅధిపతిగా చేసి.2013 లో రిటైర్ ఆయాను. కధలు, కవితలు రాయటం సరదా.కొన్ని ప్రచురింపబడ్డా అవి ఏవీ సేకరించి పెట్టుకోలేదు.అసలు ప్రచురణకి పంపటమే చాలా తక్కువ. రిటైర్ అయాకా ఈ fb లోకి వచ్చాకా ఏదో రాసి మన గోడ మీద పెట్టటం మొదలుపెట్టాను. ఆ రకం గా నా వ్రాతలు ఎక్కువగా fb లో పెట్టినవే అయ్యాయి.ఇది సరదాగా ఎంచుకున్నది. మిత్రుల ప్రోత్సాహంతో కొనసాగిస్తున్ది మాత్రమే. ఇప్పటి వరకూ ఎన్ని రాసాను అన్నది ఖచ్చితం గా చెప్పలేను. అయినా 2015 నుండీ గజల్స్, ఫ్రీ వెర్సెస్, కొన్ని వృత్తాలు, పద్యాలు, కధలు, మ్యుజింగ్స్ లా వివిధ విషయాలపై నా భావాలు Fb లో టపా లు గా వ్రాస్తూనే వున్నాను.