(అముద్రిత రచన- 29.9.2023)
ఒకడున్నాడు. వాడు వస్తున్నాడంటేనే అంతా భయపడిపోతాం. సామాన్లన్నీ అక్కడా ఇక్కడా దాచేసుకుంటాం. బీరువాలకి తాళాలు వేసేసుకుంటాం. వంటింటికి తలుపు లేకపోవడంతో ఇంట్లో మహాయుద్ధాలైపోతుంటాయి. స్వతంత్రంగా చెంచాలు, గిన్నెలు, గరిటెలు అన్నీ తెచ్చేసుకుంటాడు. కిచెన్ ప్లాట్‍ఫామ్‍మీదివి అందకపోతే మాడ్యులార్ కిచెన్ డ్రాల్లో కాళ్ళు పెట్టి ఎక్కి తెచ్చేసుకుంటాడు. స్వతంత్రంగా ఫ్రిజ్ తెరిచి చాక్లెట్లకోసం వెతికేసుకుంటాడు. ఫ్రిజ్ తాళం వేసి వుంటే బాలభీముడిలా ఫ్రిజ్ వూపేస్తాడు. క్రేయాన్ తీసుకుని గోడలమీద ఆధునిక చిత్రకళని ప్రదర్శిస్తాడు. అడ్డగీత గీసి రెండు చుక్కలు పెట్టి అది చేప అంటే మనం వప్పుకుని తీరల్సిందే. నిలువుగీత గీసి, ఇంకో రెండు చుక్కలు పెట్టి అది తనేనన్నా సరే అనాల్సిందే. అంత జబర్దస్తీ.
వాడికి “ఏ” అక్షరం రాయడం రాదు. ఏబీసీడీలు రాయమంటే కళ్ళుమూసుకొమ్మని ఏడుస్తాడు. కళ్ళుమూసుకుంటే వీ రాసి బొజ్జలో గీత గీసి, పలక తిప్పేసి మనకి చూపిస్తాడన్నమాట.
వాడికి ల పలకడం రాదు. స్నేహితులపేర్లు చెప్పమంటే బాన, బాను అంటాడు. బాల, బాలు అని మనం తెలుసుకోవాలి.
వంట చేస్తుంటే మినీస్టూలు తెచ్చుకుని వచ్చేసి పక్కని నిలబడి నేను కూరలో వుప్పేస్తుంటే తనూ వేస్తానంటాడు.
“ఆ< చెయ్యి కాలింది… అబ్బా! వుఫ్… వుఫ్…” అంటే నిజమనుకుని స్టూలు తీసుకుని దూరంగా పారిపోతాడు.
ఎత్తైన అలమారముందు నిలబడి, “లిఫ్ట్ మీ” అని చేతులందిస్తాడు. వాడికి అందకూడదని పైనెక్కడో దాచుకున్న వస్తువులు, వాడిని ఎత్తుకుంటే తనే తీసుకుంటాడన్నమాట.
ఓటమి అసలే వప్పుకోడు. కేరంబోర్డుమీద రెండు రెడ్‍లు వుండాల్సిందే.
వాడున్నన్నిరోజులూ టీవీలో పిగ్‍లు తప్ప మరేవీ కనిపించవు. వాడు పిగ్‍లాగా అని వినిపిస్తే మనం నవ్వాలన్నమాట.
వాడు వచ్చి వెళ్ళాక ఏదీ వెనుకట్లా వుండదు. సగం వస్తువులు చాలారోజులు కనపడవు. మనసు ఒక సగం ఖాళీ ఐపోతుంది. మరోసగం వాడి అల్లరి జ్ఞాపకాలతో నిండిపోతుంది.
“అమ్మా! తేజూ అల్లరి భరించలేకపోతున్నాను. ఇల్లంతా తిరిగేస్తున్నాడు. అందకుండా ఎంత ఎత్తుని పెట్టినా లాగి కింద పారేస్తున్నాడు. ఇరవైనాలుగ్గంటలూ వీడితోనే సరిపోతోంది” ఆ ఒక్కడినీ కన్న అమ్మ, మాకు బుజ్జి, రికార్డుల్లో అర్చన ఫిర్యాదు. ఫోన్లో.
“నేనూ చిన్నప్పుడు ఇంత అల్లరీ చేసేదాన్నా? అన్నకూడానా? మేం బుద్ధిగానే వుండేవాళ్ళంకదా?” అడిగింది. చెయ్యలేదంటానేమోనని ఆశపడింది. అలాగానీ నేను జవాబిస్తే వాడిని మరికాస్త తిట్టడానికీ, తను ఇంకెంత కష్టపడుతోందో చెప్పడానికీ ఏదేనా సాకు దొరుకుతుందేమోనని వెతుక్కుంది.
“అబ్బా! అంత బుద్ధిమంతులేం కాదు మీరిద్దరూ. నీకు వీడొక్కడే. మనింట్లోనైతే నువ్వూ, అన్నా కలిసి చేసేవారు అల్లరి. నేనూ భరించలేకపోయేదాన్ని” అన్నాను. తనని ఓడించేసాను.
“నీ చిన్నప్పుడు? నువ్వూ చేసేదానివా?” ఇంకో ప్రశ్న.
“అల్లరేమీ చేసేవాళ్లం కాదు. కాంపౌండులో ఆరువాటాలుండేవి మొత్తం పదిమంది పిల్లలం వుండేవాళ్ళం. మేమూ, మిగతా అద్దెకుండేవాళ్ల పిల్లలూ అందరూ కలిసి ఆడుకునేవాళ్ళం. వేళకి మమ్మల్ని వెతుక్కుని తీసుకెళ్ళి అన్నం పెట్టి పంపించేది అమ్మమ్మ. పెద్దగా అరుపులూ కేకలూ పెడితే మాత్రం “ఆపండే, మీ అల్లరి అని పెద్దవాళ్ళొచ్చి కోప్పడేవాళ్ళు”
“అలా వదిలేసేవాళ్ళా?! ఏమీ జరిగేది కాదా?” ఆశ్చర్యం తన గొంతులో.
“ఏం జరుగుతుంది? ఎప్పుడేనా దెబ్బలాడుకుని కొట్టుకునేవాళ్ళం. మా అరుపులూ, ఏడుపులూ విని, పెద్దవాళ్ళెవరో వచ్చి విడిపించేవాళ్ళు. పరుగులు పెడుతూ పడేవాళ్ళం. ఇంత బెల్లంముక్కో ఏదో చేతిలో పెట్టి ఓదార్చేవారు”
“అంతేనా?” ఇంకేదో తెలుసుకోవాలనే తపన తనలో.
“ఇంకేం వుంటుంది? ఎప్పుడేనా పెద్దవాళ్ళమధ్య నీళ్ళపంపు దగ్గిరో, తుడుపులదగ్గిరో కొంచెం గొడవలయ్యేవి. ఓ రెండుమూడురోజులు మాటలు మానేసేవాళ్ళు. అలాంటప్పుడు పిల్లలని ఆ గొడవపడ్డవాళ్ళింటికి వెళ్ళద్దని కట్టడి చేసేవాళ్ళు. మేమెక్కడ ఆగుతాం? చూసీచూడనట్టు వదిలేసేవారు”
“కాదమ్మా! ఇళ్ళలో పెద్దవాళ్ళూ, ముసలివాళ్ళు వుంటారుకదా?”
“ఉంటే?”
“నీకసలు ఏవీ తెలీవా?” విసుక్కుంది. నిజంగానే తను దేనిగురించి అడుగుతోందో అర్థం కాలేదు.
“ఇక్కడ… మా కింద ఫ్లోర్లో ఒక పెద్దాయన వుంటారు. ఆయన…” ఇబ్బందిగా ఆగిపోయింది.
“ఆయన…?” రెట్టించాను.
“పదేళ్ల పాపని మోలెస్ట్ చేసాడు. చాలా గొడవైపోయింది. పోలీసు కేసు పెట్టారు. తర్వాత ఇల్లు ఖాళీ చేసి వెళిపోయాడు” అంది. “అలాంటివి మీ చిన్నప్పుడు జరిగేవి కాదా?”
నాకు జుగుప్సలాంటిది కలిగింది.
“మా చిన్నప్పుడు అలాంటివి మాకు తెలీదు. చిన్నపిల్లలకి గొలుసులూ, చెవులకీ పెడితే వాటికోసం దొంగతాలూ అవీ జరిగేవి. అదీ అరుదుగా. నూటికో కోటికో ఒకసారి. నువ్వు చెప్పినలాంటివి జరగలేదా అంటే జరిగేవేమో! ఎక్కడో ఒకటీ అరా! పిల్లలకి తెలిసే అవకాశం తక్కువ. ఆ చుట్టుపక్కల నాలుగిళ్లలో తెలిస్తే అదే పెద్దప్రచారం. ఆ తప్పు చేసిన పెద్దమనిషి తలొంచుకుని తిరిగేవాడు. చుట్టూ వున్నవాళ్ళు మాటలతో కుళ్ళబొడిచేవాళ్ళు. అప్పుడు మనిషి పరిధి చాలా చిన్నది. తను పుట్టి పెరిగిన వూరు, బంధువులు, స్నేహితులు… ఏదేనా చెయ్యడానికి జంకేవారు. ఇప్పుడు ఎక్కడున్నవాడు అక్కడ వుండట్లేదు. ఇరుగూపొరుగూ ఎవరో తెలీదు. ఏ పరిచయాలూ మూలాలనుంచీ జరగట్లేదు. ఎవరిమీదా ఎవరి నియంత్రణా లేదు. ఆపైన వంటరితనాలు. ఎవరి గదులు వాళ్ళకి. పిల్లలక్కూడా. ఇవన్నీ మనిషికి నేరం చెయ్యడానికి అవకాశాలు ఇస్తాయి. సమాచారంకూడా బాగా వ్యాపిస్తోందికదా? ఒకడు చేసాడని ఇంకొకడు, వాడు తెలివితక్కువవాడుకాబట్టి దొరికిపోయాడు, నేను తెలివిగా క్రైం చేస్తానని మరొకడు తయారౌతున్నాడు. ప్రత్యేకించి ఈ క్రైం వార్తలూ, వీడియోలూ చూసేవాళ్ళే వుంటారట బుజ్జీ! వాళ్లకి శిక్షణకూడా యిస్తారట” అన్నాను.
“కానీ అంత చిన్నపిల్లని… అలా ఎలా చెయ్యగలిగాడు? ఇలాంటివాటిల్లో వాడికేం శిక్షణ వుంటుంది?” అసహనంగా అడిగింది.
“ఆ పిల్ల వుపకరణం మాత్రమే. ఒక కథ చెప్తాను. నా చిన్నప్పట్నుంచీ వింటున్నదే. ఆఫీసులో పై అధికారి అకారణంగా తిడతాడు కింది వుద్యోగిని. అతను ఆ కోపాన్ని ఇంటికి వచ్చాక భార్యమీద చూపిస్తాడు. ఆవిడ అతన్నేమీ అనలేక కొడుకుని కొడుతుంది. వాడు ఈ అందర్లోకీ బలహీనుడు. అందుకని రోడ్డుని పోతున్న కుక్కపిల్లమీద రాయి విసిరి తన కోపాన్ని చూపెడతాడు. అంచెలంచెలుగా మనిషిమీద పడుతున్న వత్తిడికి ఎవరో బలౌతున్నారు. ఆ వత్తిడి ఎక్కడినుంచీ వస్తోందో మనకి తెలుసు. ఆ ట్రిగ్గర్ పాయింటు ఇంటర్నెట్. దీన్ని ఆపగలమా? తిండికి లేకపోయినా మొబైల్‍డాటామాత్రం వేయించుకుంటున్నారు. ప్రీలోడెడ్ వీడియోలతోటే వస్తాయట కొన్ని ఫోన్లు”
“ఎందుకో చాలా భయంగా వుందమ్మా! వీడిని ఎలా పెంచగలను? ఇంత క్రైం మధ్యని బతుకుతున్నాం. స్కూల్లో వెయ్యాలన్నా భయంగానే వుంది. మొన్న ఒక స్కూలుదగ్గిర షాపులో డ్రగ్స్ దొరికాయట. చాక్లెట్లలో పెట్టి పిల్లలకి అమ్ముతున్నారట” అంది.
ఎన్ని భయాలు అమ్మలకి? పిల్లలని అద్దాలగూట్లో బొమ్మల్లా దాస్తే మాత్రం జాగ్రత్తగా పెరుగుతారా? ఆ సమస్యలు వేరే వుంటాయి. పిల్లలకి సోషల్ బిహేవియర్ తెలీకుండా పోతోంది. ఒకళ్ళూ ఇద్దరూ కావడంతో పక్కపిల్లల్తో పంచుకోవడం రావట్లేదు. పిల్లల్ని ఇరికించే మూసలు ఎక్కడో తయారౌతున్నాయి. ఇక్కడికి దిగుమతి ఔతున్నాయి. అందులో వీళ్లని ఇరికించే ప్రయత్నం జరుగుతోంది. అలా ఇరుక్కుని వుండలేని పిల్లలకోసం పేర్లూ తయారౌతున్నాయి. పదిమంది పిల్లలు చుట్టూ వుంటే ఒకడు మందకొడిగానూ, ఇంకొకడు చురుగ్గానూ వుండేవారు. వాళ్ళ జీవితాలు దానికితగ్గట్టే వుండేవికానీ సులభత ఏమీ తగ్గేదికాదు. ఇప్పుడు మూసలో ఇరుక్కోలేని పిల్లలకి సమస్యగానే వుంది.
“మీరోజులే బావున్నాయేమో! అప్పుడు మీరేవో కష్టాలు పడిపోయారని మేం జాలిపడుతూ వుంటాం” అంది తనే.
“ఆలోచనే మనిషికిగల కష్టం. అది ఎప్పుడూ వుంది. మా అప్పుడు దాన్ని కట్టడి చేసేవారు. ఇప్పుడు కట్లు తెంపి వదిలేసారు. అంతే తేడా. అప్పుడు మేం అనుభవించినది మీకు కష్టంగా తోస్తుంది. ఇప్పటి మీ జీవితాలు మాకూ అలానే అనిపిస్తాయి. అదే గమ్మత్తు” అన్నాను.
“ఇంక మళ్ళీ అలాంటి అమాయకమైనరోజులు రావుకదూ?” అడిగింది.
“యద్భావం తద్భవతి అంటారు బుజ్జీ! పదేపదే ఇలాగే జరుగుతుందని అనుకుంటే తథాస్తుదేవతలు దాన్ని జరిపిస్తారు. ఏదో జరుగుతుందని నువ్వు భయపడుతూ వుంటే అదే జరుగుతుంది. మంచి జరుగుతుందనుకుంటే మంచే జరుగుతుంది”
“నువ్వవన్నీ నమ్ముతావా?”
“నమ్మకపోతే ధైర్యం ఎలా వస్తుంది?”
“అబద్ధాన్ని నమ్మితే ధైర్యం వస్తుందా?”
“మన చేతుల్లో లేనిదాన్ని నమ్మడానికి అబద్ధమైతేనేం, నిజమైతేనేం?”
“యూ ఆర్ సో హోప్‍లెస్ మా! పొద్దున్న లేస్తే చుట్టూ జరుగుతున్నవన్నీ ఎంతో భయాన్ని కలిగిస్తాయి. వీడిని స్కూలుకి పంపిస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలా అని ఆలోచిస్తుంటాం. ఏ ఛానెల్ పెట్టినా ఇవే వార్తలు. నువ్వసలు టీవీయే చూడవు”
“వీటిని నువ్వు నియంత్రించగలవా? లేదుకదా? నేరాన్ని హెడ్‍లైట్స్‌లో పెట్టి పాతిక చానెల్స్‌లో రోజంతా తిప్పితిప్పి చూపిస్తున్నారు. అవసరమా అది చూడ్డం? ఆ నేరస్తుణ్ణి పోలీసులు ఎంత వేగంగా పట్టుకున్నదీ, కోర్టులు ఎంతవేగంగా విచారణ చేసి శిక్షవేసిందీకదా చూపించాల్సింది? నా వరకూ అవి వైఫల్యగాథలే. ఒక మనిషి సామాజికంగా, ఒక సమాజం వ్యవస్థాపరంగా విఫలమైన కథలు కావూ అవి?” అని, ” అవి నాకు సంతోషం ఇవ్వవు. నాకు సంతోషం కలిగించనివి ఏవీ నేను చూడను. టీవీ, వార్తలూ, సోషల్ మీడియా… ఏవీ. నువ్వుకూడా మానెయ్. చాలా సంతోషంగా వుంటావు” చెప్పాను.
మా ఇద్దరికీ మధ్య తరుచుగా జరిగే వాదనే. ఇప్పుడు తనచుట్టూ జరిగిన సంఘటనలకి బాగా వ్యాకులత చెంది వుందేమో కాస్త ఎక్కువ వాదించింది. సమాజంలో చాలా మార్పొచ్చింది. చాలామంది దేవుణ్ణి నమ్మట్లేదు. దేవుడంటే మనిషి నిస్సహాయత మొదలయ్యే క్షితిజరేఖ అని వప్పుకోవడానికి అహం అడ్డొస్తోంది. పాపభీతి లేదు. ప్రతిదానికీ లాజిక్ చెప్తున్నారు. ఇందుకు నా కూతురు మినహాయింపు కాదు.
ఇగ్నొరెన్స్ ఈజ్ అ బ్లిస్… అప్పుడూ ఇప్పుడూ. మనిషిని సంతోషంగా, నిరంధిగా వుంచేది ఏమీ తెలీనితనమే.
వాడు మళ్ళీ వచ్చాడు.
మళ్ళీమళ్ళీ వస్తునే వున్నాడు. దేశంలో కరోనా వున్న రెండేళ్ళూ జీవితం వాడినుంచీ తప్పిపోయిందని అనిపిస్తుంది ఒకొక్కసారి. వాడిమీద చాలా ప్రభావం చూపించింది. ప్రపంచం ఏమిటో తెలిసిన మేము సమాజానికి దూరంగా వుండటానికీ, తెలియాల్సిన వయసులో వాడు దూరంగా వుండటానికీ చాలా తేడా వుంది. ఇంట్లో మా అందరిమధ్యనీ వున్నంత సౌకర్యంగా నలుగుర్లోకీ వెళ్ళినప్పుడు వుండడు.
ఐనా…
బ్లూ జీన్స్‌మీద రెడ్ టీ షర్టు వేసుకుంటే వాడి అందానికి ఫిదా. దుబ్బులా పెరిగే ఉంగరాల జుత్తు అదనపు ఆకర్షణ.
కేరం కాయిన్స్ డబ్బాలో రెండు రెడ్ కాయిన్లు చూసి ఒకటే నవ్వు. స్టూలేదీ అక్కర్లేకుండానే కిచెన్ ప్లాట్‍ఫామ్ ముందు నిలబడి నాకు
సేండ్‍విచ్‍లు చేసిస్తున్నాడు.
“ఏ రాయడం వచ్చిందా ఇప్పటికేనా?” అని దబాయిస్తాను. అందంగా నవ్వుతాడు.
“ఇంతందం దారి మళ్ళిందా…” అని పాటలు పాడుతున్నాడు. ఏవో స్టెప్స్ వేస్తున్నాడు. స్కూలుకి వెళ్తున్నాడు. బాగా కోపం వచ్చినప్పుడు ఒకటో రెండో వూతపదాలు వాడతాడు. తప్పని చెప్తాను. తడబడతాడు. సరిదిద్దుకుంటాడు.
“ఎంతకాలం ఇలా హోల్డ్ చెయ్యగలం?” అంటుంది నా కూతురు. నిజమే!
“ఇంట్లో మంచి మనం నేర్పిస్తే బైటికెళ్ళాక చెడుకీ మంచికీ మధ్య వుండే తేడా వాళ్ళే తెలుసుకుంటారు” అనేది మా అమ్మ. తేడా కనిపించడానికి మంచి అనేదాన్ని కలికం వేసి వెతికి పట్టుకోవలసివస్తోంది. ప్రపంచాన్నిప్పుడు భయాలూ, జాగ్రత్తలూ, ఆకాంక్షలూ కాకుండా వుద్వేగాలూ, వైఫల్యాలూ, నిస్పృహలూ నిర్మిస్తున్నాయి.
“మనింట్లోలా మేం పెరిగినట్టు మృదువుగా పెరిగితే సరిపోవట్లేదు. స్కూలు బస్సుల్లో గొడవలు, రాజకీయాలు, గుంపులు, కొట్లాటలు. చిన్నక్లాసుల్లో వున్నప్పుడు ఒక్కోరోజు బస్సులోంచీ ఏడుస్తూ దిగేవాడు. ఇప్పుడలా ఏడవట్లేదుగానీ వాడి ముఖంలో కోపాన్ని స్పష్టంగా చూస్తున్నాను. ఏదీ చెప్పడు. పెద్దైపోతున్నాడా? ఏమిటో, వాడి ఇప్పటి వర్తమానంకన్నా, బాల్యపు జ్ఞాపకాలే ఎక్కువ ఆనందాన్నిస్తున్నాయి. అప్పుడేమిటో వాడు పడిపోతాడేమో, దెబ్బలు తగిలించుకుంటాడేమో అనే భయం ఒకటే వుండేది. లేవదీయగలమనే ధైర్యంకూడా వుండేది. ఇప్పుడు పడితే మరింక లేవదీయలేమేమో అని ఒకటే . ” అంటుంది బుజ్జి.
ఒక స్థితి… అక్కడినుంచీ ముందుకి వెళ్తే మళ్ళీ వెనక్కి రాలేమని తెలుసు. ఐనా కదుల్తునే వుంటాం.
పశ్చిమగోదావరి జిల్లా రెడ్డి పోలవరంలో 16 July, 1962 లో జననం. వరంగల్‌లో వుద్యోగం. హెడ్పోస్ట్‌మాస్టర్గా వరంగల్‌లో స్వచ్చందపదవీ విరమణ.
వివాహం శ్రీ చదలవాడ విష్ణుమూర్తిగారితో. వారు డెప్యూటీ ఏగ్జిక్యూటివ్ ఇంజనీరుగా చేసి రిటైరయారు.
మొదటి కథ అనగనగా 1978లో వనితాజ్యోతి మాసపత్రికలో అచ్చైంది. వీరివి 225కి పైగా కథలు, 9 నవలలు వివిధ పత్రికల్లో ప్రచురించబడ్డాయి. గూడు, సింధూరి, గుండెలోతు అనే కథాసంపుటాలు, నీలినక్షత్రం అనే నవల పుస్తకాలుగా వచ్చాయి. సింధూరి అనే సంపుటానికి శ్రీమతి సుశీలా నారాయణ రెడ్డి అవార్డు 2005 లో వచ్చింది. ప్రేమలోంచీ ప్రేమలోకి అనే నవలకి ఆంధ్రభూమి ప్రథమ, తిరస్కృతులు, నీకోసం నేను అనే నవలలకి ఆంధ్రభూమి ద్వితీయ, 5-3-2 అనే నవలకి కినిగె ద్వితీయ బహుమతులు వచ్చాయి. ఎంతెంతదూరం? అనే కథకి విపుల కన్సొలేషన్ బహుమతి, శ్రీమతి రంగవల్లి ట్రస్ట్ అవార్డు వచ్చాయి. ఇవికాక కథలకు మరో ఏడెనిమిది బహుమతులు వచ్చాయి.
కథలకు కాన్వాస్ పెద్దదిగా వుండాలనేది వీరి అభిప్రాయం.