ఎవర్రా, మీరంతా? by S Sridevi

(ముందుగా సహరచయితలకూ, వుత్తమపాఠకులకూ మంచిచానెల్స్ నడుపుతూ రచయితల గౌరవం నిలబెడుతున్నవారికీ నమస్కారం.
సరిగా చదవని, అసభ్యకథలమధ్య యిరుక్కుపోయిన, రచయితల పేరుకూడా వెయ్యని, మధ్యలోంచో మరెక్కడినుంచో మొదలుపెట్టబడిన, రచయిత గుర్తుపట్టలేదని అనుకుంటూ వణుకుతున్న పీలగొంతులలో పలుకుతున్న, టెలిగ్రామ్ చానెల్లలో కనిపిస్తున్న కనీసం పదివేలకథలకీ నవలలకీ ఈ కథ అంకితం)

“సాత్యకిసార్ కొత్త నవలేదో డీటీపీకి యిచ్చాడు. వెన్నెలపువ్వో వెండినవ్వో దాని పేరు. డీటీపీఅన్న నా ఫ్రెండే. చెప్పిపెట్టి వుంచాను. పీడీఎఫ్ ఇస్తాన్నాడు. బుక్ రిలీజు ఈ నెల ఇరవయ్యైదుకి. ముందురోజు రాత్రికి మన టెలిగ్రాం గ్రూపులో పెట్టేస్తే సెర్వరు క్రాషైపోద్ది. అంత క్రేజు ఆయన పుస్తకాలంటే. బుక్ రిలీజుదాకా ఆగద్దు. పుస్తకాలు అమ్ముడైతే మనకి లాస్” అన్నాడు సూరి.
“బుక్, వందారెండొందల కాపీలు చీప్ పేపరుమీద ప్రింటు తీయించితే రైళ్లలో అమ్మెయ్యచ్చు. చెన్నైనుంచి విజయవాడ వచ్చే రైళ్లలో బాగా సేలైతాయి” వెంటనే రియాక్టయ్యాడు సుబ్బు.
“నీకు తెలుసా? శీనన్న యూట్యూబ్ చానెల్లో కథలవి చదువుతుంటాడుకదా? ఆన్లైన్లో దొరికినవన్నీ తెచ్చి చదువుతాడు. అలా చదవకూడదట. కాఫీరైట్లని ఏవో వుంటాయట. కేసులు పెట్టి చానెల్ మూయించారు” చాలా బాధపడ్డాడు సూరి. శీను అతనికి చాలా క్లోజు.
“కాఫీరైట్లు కాదెహె. కాపీరైట్లు. కాపీకొట్టుకునేందుకు పర్మిషను. ఆమధ్య నామీదా కేసైతే ఒకాయన చెప్పాడ్లే. మనలాగా అక్కడా యిక్కడా తెచ్చి కథలు చదివేవాళ్ళంటే ఎంత చులకనో. ఒకొక్క కామెంటు చూస్తే రక్తం మరిగిపోతుంది. పైగా తప్పుల్లేకుండా బాగా చదవాలట. ఇదేమైనా నాటకమా, మనం చదివేవి పద్యాలా? ఎవరో వింటారని చదువుతామా? పైసలొస్తాయని చదువుతాంగానీ. యూట్యూబు రాకముందు కథలెప్పుడేనా చదివామా? అవేంటో అర్థంకూడా కావు. ఇప్పుడుమాత్రం అర్థమయ్యే చదువుతున్నామా? ఒకమ్మి ఏదో అంటుంది. ప్రేమంటుంది. పెళ్ళంటుంది. ఇంతంత పొడుగు మాట్లాడుకుంటారు, పెళ్ళిమాత్రం చేసుకోరు. ఆ కథలేంటో, అవి చదవడమేంటో! కొన్నిమాటలైతే అనడానికికూడా రాదన్నా!” సుబ్బు వాపోయాడు.
“ఏదైతేమిగానీ, లక్షమంది సబ్‍స్క్రైబర్లన్నా! కోట్లలో వ్యూస్. వ్యూస్‍కోసం పేకేజిలుంటాయి. అవ్వి కొనేవాడు. వ్యూస్ బాగా వుండేసరికి మంది వచ్చేవారు. పైసలుకూడా బానే వచ్చేవి. కడుపుమీద కొట్టారు”
“అయ్యో! అందరు చేస్తున్నపనేగదా? ఎన్ని చానెల్లు లేవు? వాళ్లందరూ చదవట్లేదా?”
“చెత్తబుజ్జి వున్నాడుకదా? పాతపేపర్లవీ కొంటాడు, ఆ అన్నదగ్గిరకెళ్ళి పాతపుస్తకాలుంటే ఏరుకొచ్చేవాడు చదవటానికి. చెత్తలో దొరికిన కథలేకదా, చదవకూడదా? వాళ్లది టెలిగ్రాం చానెలుంది. అందులో యూట్యూబర్లంతా వుంటారు. రోజురోజు పెట్టిన వీడియోల లింకులు అందులో పెడితే వాళ్ళు చూసినా చూడకపోయినా వీడియోలు నడిపిస్తారు. అలా గంటలు పెరుగుతాయి. గంటలు పెరిగితే పైసలొస్తాయి. ఇదో బిజినెస్సు. మొన్నొక అక్కమీదకూడా కంప్లెయింట్లిచ్చారట. ఆమెకు ఇద్దరు పిల్లలు. భర్త పట్టించుకోడు. నాలుగు పైసలు సంపాదించుకుంటుంటే ఈ గొడవేంటని ఆ అక్క ఒకటే ఏడుపు. తెల్లారి లేస్తే ఎవడేం కేసు పెడతాడోననే భయం” అన్నాడు సూరి.
“ఆ రాసినోళ్ళు ఎక్కడుంటారో మనకెలా తెలుస్తుంది? కథ దొరుకుతుంది. దానిమీద సత్యాజీ అని రాసుంటుంది. లేకుంటే శ్యామల అనుంటుంది. సత్యాజీ ఎవరో, శ్యామలెవరో ఎక్కడుంటారో మనకెవరు చెప్తారు? సరె, దొరకబడతాం, కాపీకొట్టుకుంటామని అడిగితే సరేనంటారా? అనరుకదా? పరీక్షల్లో అడిగి కాపీ కొడతామేంటన్నా?” విసుక్కున్నాడు సుబ్బు.
“పూర్ణా అన్న లేడు? వాడు ఎలాగో వాళ్ళవీ వీళ్ళవీ కథలు కాపీకొట్టి ఫేస్‍బుక్‍లో రచయితగా వుంటాడు. రచయితల గ్రూపుల్లోకూడా వున్నాడు.
రచయితలూ, నేను టెలిగ్రామ్ చానెల్ పెట్టాను, మీకథలన్నీ అందులో పెట్టబోతున్నాను. ఎవరికేనా అభ్యంతరం వుంటే ముందుకు రండి- అని వాల్‍మీద పెట్టాట్ట.
మా కథలు అలా ఎలా పెడతావని అందరూ యుద్ధానికొచ్చారట.
అలా చెప్పి పెడతార్రా- అని నేను తిట్టాననుకో” పూర్ణారావనే రచయితగురించి ప్రేమగా చెప్పాడు సూరి.
“అదికాదన్నా! కథ రాసినోడు మంచి వుద్యోగం చేస్తాడు, జీతం తీసుకుంటాడు. కథ రాసినందుకు డబ్బులు తీసుకుంటాడు. పుస్తకాలమ్మితే పైసలొస్తాయి. ఒకొక్క పుస్తకం రెండువందలు, మూడువందలు తెలుసా? మనమో పక్కనుండి నాలుగు పైసలు చేసుకుంటే ఏడుస్తారేంటి? అందులో వాళ్లకేం కష్టం? టెలిగ్రాంలో పెట్టే కష్టం, యూట్యూబులో చదివే కష్టం మనదేకదా? కష్టపడ్డవాడికి రోజులుకావు. ఎప్పుడూ అంతేకదా?” సుబ్బు ఎర్రెర్రగా అన్నాడు.
“కథ రాసి ఆన్లైన్లో పెట్టాసాక ఇంక వాళ్లదేంటి? లేపోతే వాళ్ళింట్లోనే బీరువాలో దాచుకోవాలి. రోడ్డుమీద పడ్డ డబ్బులు ఎవరికి దొరికితే వాళ్లవే. పేరు రాసుంటుందా? కప్పు కాఫీకోసం కక్కుర్తిపడతారు. కాఫీరైట్లంట, కాఫీరైట్లు. బ్రిటిషోడు పెట్టిపోయినట్టున్నాడు. అవన్నీ తీసేస్తేగానీ మనకి సొతంత్రం వచ్చినట్టుకాదు” సూరికి కోపం వచ్చింది.
“బీరువా అంటే గుర్తొచ్చింది. నీకీ సంగతి తెలుసా? సుజాత లేదూ? శివా చెల్లెలు. బస్టాపులో నిలబడుంటే ఎవడో చెయ్యి పట్టుకున్నాట్ట. శివా మమ్మల్నందర్నీ రమ్మన్నాడు వాడిని తన్నడానికి.
పిల్ల రోడ్డుమీదికొచ్చింది. నచ్చింది. చెయ్యిపట్టుకున్నాను. లవ్వూ. కుదరకపోతే నీ చెల్లెల్ని యింట్లోనే దాచుకోవాలి- అన్నాడ్రా!
వాడి లాజిక్కి మాకు బుర్ర తిరిగిపోయిందనుకో” సుబ్బు చెప్పాడు. బీరువాకీ ఈ పిల్లకీ లింకేంటో సూరి చెప్పింది వినగానే ఇదెందుకు గుర్తొచ్చిందో, అందులోని లింకేంటో అతని బుర్రకి ఎక్కలేదు.
“అందుకేనా, సుజాత బస్టాపులో కనిపించట్లేదు? చదువు మానిపించేసారట” అన్నాడు సూరి.
“సర్లెగానీ పుస్తకం ప్రింటు తీయించినప్పుడు మూడో పేజీలో “షిఫ్ట్ నొక్కి రెండు” అచ్చేయించడం మర్చిపోకు. అదుంటే కాపీ కొట్టరట. మనదెవరేనా కాపీకొడితే కష్టం. పుస్తకాలు అచ్చేసుకుని ఆడు అమ్ముకుంటాడు” జాగ్రత్త చెప్పాడు సుబ్బు.


అరేయ్! ఎవర్రా మీరంతా?
తిండికి తిమ్మరాజులం. పనికి పోతరాజులం. తెలుక్కి చెదరాజులం.