ఒలీవియా by S Sridevi

  1. పాతకాలపు మనిషి by S Sridevi
  2. ఒలీవియా by S Sridevi
  3. నాకొద్దీ అభ్యుదయం by S Sridevi
  4. అర్హత by S Sridevi
  5. సింధూరి by S Sridevi
  6. మలుపు by S Sridevi
  7. యంత్రసేవ by S Sridevi
  8. ప్లాస్మా జీవులు by S Sridevi
  9. మనుషులిచ్చిన శాపం by S Sridevi
  10. వంకరగీత by S Sridevi
  11. బంధీ by S Sridevi
  12. లాటరీ by S Sridevi
  13. ముల్లు by S Sridevi
  14. లే ఆఫ్ by S Sridevi
  15. నేను విసిరిన బంతి by S Sridevi
  16. మలివసంతం by S Sridevi
  17. తప్పనిసరిగా by S Sridevi
  18. ప్రేమరాహిత్యం by S Sridevi
  19. పార్థివం by S Sridevi
  20. ఖైదీ by S Sridevi

Youtubers please WhatsApp to 7382342850

“అమ్మా! మాకు ఇంగ్లీషుకి కొత్త టీచరు వచ్చింది. పేరు ఒలీవియా” స్కూలునించీ రాగానే వుత్సాహంగా చెప్పింది అమూల్య. ఆ చెప్పడంలోనే అర్ధమైంది, కొత్త టీచరు బాగా నచ్చిందని.
ఆ పేరు కాలం పొరల వెనుక నిద్రాణంగా వున్న జ్ఞాపకాన్ని తట్టి లేపింది. సుదూర గతం. వర్తమానంతో లింకులు తెగిపోయినది. తెగిపోయాయనుకున్న లింకులు మళ్ళీ వర్తమానాన్ని అందుకుంటాయన్న వూహ ఆ క్షణాన్న కలగలేదు.
“అమ్మా! రాగానే ఒలీవియా టీచరు మాకో కథ చెప్పింది తెలుసా? చాలామంచిది కదమ్మా? ” అంది అమూల్య.
“ఏం కథ చెప్పింది?” చాలా మామూలుగా అడిగాను. వూహకి అందని జవాబు వస్తుందని అనుకోలేదు.
“ఒక చిన్నమ్మాయి వుందట. అమ్మ తప్ప ఎవరూ లేరు. స్కూల్లో కూడా తనతో ఎవరూ మాట్లాడేవారు కాదట…”
షాకయాను. ఆమె ఎవరో అపరిచిత వ్యక్తి కాదు. నాకు తెలిసిన ఒలీవియానే. అనూహ్యమైన పరిణామమేమో జీర్ణించుకోవడానికి కొంత వ్యవధి పట్టింది.
“ఆ కథ నాకు తెలుసు. మీ టీచరు నా చిన్నప్పటి స్నేహితురాలు” అన్నాను నెమ్మదిగా.
“నిజంగా? రేపు టీచరుకి చెప్పనా? ” వుత్సాహంగా అడిగింది తను. వాళ్ళ టీచరు నాకు తెలియడం పిల్లకి గర్వంగా వుంది.
“రేపు నేను మీ స్కూలుకి వస్తాను. తనకి చెప్పు” అన్నాను.
ఆ రోజంతా నాకు ఒలీవియా గురించిన ఆలోచనలే, తన జ్ఞాపకాలే. ఎలావుందో? మేం శ్రీకాకుళం వదిలిపెట్టి వచ్చేసాక వాళ్ళమ్మ చనిపోయారని తెలిసింది. పెళ్ళి చేసుకుందా, ఒలీవియా? ఎవరేనా ముందుకి వచ్చారా? ఎక్కడి శ్రీకాకుళం, ఎక్కడి హైద్రాబాదు? అసలిక్కడికి, ఇంతదూరానికి ఎలా వచ్చింది? సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ల విషయంలోనో మరెవరో పెట్టి పుట్టినవాళ్ళకో అదో పెద్ద విషయం కాకపోవచ్చు. కానీ ఒలీవియా సంగతి అలా కాదు. ఎన్నో ప్రశ్నలు.
నేను ఎనిమిదో తరగతి చదువుతున్నప్పటి రోజులు. నాన్న శ్రీకాకుళం జిల్లాలో ఒక పల్లెటూళ్ళో ప్రైమరీ హెల్త్ సెంటర్లో డాక్టరుగా చేసినప్పటి రోజులు. ప్రతి మూడేళ్ళకీ ట్రాన్స్ఫరవటం, ఆ చుట్టుపక్కలే కొత్త కొత్త వూళ్ళకి వెళ్ళటం, స్కూలు మారటం. . . అలా మేం ఈ వూరొచ్చాము. పెద్ద ఇల్లు, విశాలమైన ఆవరణ, పెరట్లోకి వెళ్తే కనుచూపుమేరంతా పచ్చగా పంట పొలాలు, అంత దూరాన్నించీ సువాసనల్ని మోసుకొస్తూ నాగమల్లిచెట్టు. . . నాకు చాలా నచ్చింది.
కొత్త స్కూలు, అంతా కొత్త స్నేహితులు. సాయంత్రం స్కూలైపోయాక అమ్మాయిలం నెట్ కట్టుకుని రింగు ఆడుతున్నాం. మాకు కొంత దూరాన్న సిమెంటు బెంచీ అంచుని ఎవరితోనూ సంబంధం లేనట్టు కూర్చుని వుంది ఒలీవియా. చామనఛాయకన్నా తక్కువరంగు, కాస్తంతలావుపాటి ఆకృతి, గుండ్రటి కళ్ళు ,నొక్కుల జుత్తు. . . అందరం ఆడుకుంటుంటే తనొక్కర్తీ అలా కూర్చుని వుండటం ఒక వింతైతే తను కూర్చున్న తీరు మరొక వింత. పక్కని ఎవరూ లేకపోయినా బెంచీ అంచుని ఎవరో నెట్టేస్తారన్నట్టు కూర్చుని వుంది. రింగు నా పార్ట్నర్‍కి ఇచ్చి, తన దగ్గిరకి వెళ్ళాను.
“ఒక్కదానివీ కూర్చున్నావేం? నువ్వూ రా! ” అన్నాను.
“వద్దులే. మీరు ఆడుకోండి” అంది తను. అమ్మాయిల సమస్యేమోఅనుకుని బలవంతపెట్టలేదు. తిరిగి నెట్ దగ్గిరకి వెళ్ళిపోయాను.
“తనంతే. ఎవరోటీ మాట్లాడదు. కలవదు. మేమంతా ఆడుకుంటుంటే తనొక్కతే అలా కూర్చుని వుటుంది. ఆటకూడా చూడదు” అంది నా పార్ట్నర్. ఆటైపోయింది. అందరూ పుస్తకాలు సర్దుకుని ఇళ్ళకి బయల్దేరారు. నేను మళ్ళీ ఒలీవియా దగ్గిరకి వెళ్ళాను. తనలాగే కూర్చుని వుంది , వెళ్ళటానికి ఇష్టం లేనట్టు.
“రా, వెళ్దాం” చెయ్యందిస్తే అందుకోలేదు. తనంతట తనే పుస్తకాలు సర్దుకుని లేచి నిలబడింది. ఇద్దరం కలిసి నడుస్తున్నాం,
““మా యిల్లిక్కడే. ఈ సందులో చివరికి వెళ్ళాలి” అంది కొంతదూరం వచ్చాక.
“ఎవరెవరుంటారు మీ యింట్లో?” కుతూహలంగా అడిగాను.
“అమ్మా. నేను” క్లుప్తమైన జవాబు. తనకి సంబంధించిన ప్రతీదీ అలాగే క్లుప్తంగానే వుంటుందని నాకు అతి త్వరలోనే తెలిసింది.
“ “మీ నాన్నగారు?”
“లేరు. నేను పుట్టకముందే మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారట.”
“ “నీకు ఫ్రెండ్సేవరూ లేరా?”
తల అడ్డంగా వూపింది.
“మీ యింటికి రానా?”
“రా? అంది. అలా అనటంలో కొంచెం సందిగ్ధం, కొంచెం ఆశ్చర్యం. ఇద్దరం వాళ్ళింటికి వెళ్ళాం. ఉండటానికి ఒక చిన్న గది, వంటకి వరండా, ఇల్లంతా కలిపి అంతే. వాళ్ళమ్మ గదిలో ఒక మూల మంచం మీద ముడుచుకుని పడుకుని వుంది. ఆ అమ్మే సమస్త ప్రపంచం ఒలీవియాకి. ఆవిడకి టీబీ. ప్రైవేట్ హాస్పిటల్లో నర్సుగా చేసేదట. టీబీ అంటువ్యాధిగాబట్టివాళ్ళు వుద్యోగంలోంచి తీసేసారట. వెళ్తే వైద్యం చేస్తున్నారటగానీ మందులు కొనుక్కోమంటున్నారట. కొన్ని టెస్టులు చేస్తే ఫీజు అడుగుతున్నారట. ఎక్కువసేపు వుండలేకపోయాను వాళ్ళింట్లో, ఇంటికి వచ్చాక మాత్రం తన గురించిన ఆలోచనలే. అమ్మని ఎన్నో ప్రశ్నలడిగాను. నాన్న క్లబ్‍నుంచీ వచ్చేదాకా మేలుకుని వున్నాను.
“ఏమ్మా?” అన్నారు నాన్న. ఒలీవియాగురించి చెప్పాను.
“ఆవిడని తీసుకుని ఆస్పత్రికి రమ్మని ఆ అమ్మాయికి చెప్పమ్మా! నేను చూస్తాను” అన్నారు.
“టీబీ చాలా పెద్ద వ్యాధికదా? దానికి బలమైన ఆహారం తినాలంటారు, వాళ్ళకి ఏమీ లేదు నాన్న గారూ! తనకి నాన్న లేరు. అంటువ్యాధి అని ఆవిడని వుద్యోగంలోంచీ తీసేసారట. ఆవిడ తప్ప ఒలీవియాకి ఇంకెవరూ లేరు” అన్నాను.
“వైద్యానికి ఫీజు తీసుకోను. నా దగ్గరున్న మందులు, శాంపిల్సు ఇస్తాను. బలమైన తిండి తింటే మందులు బాగా పనిచేస్తాయి. పాలూ, పళ్ళూ ఆకుకూరలూ సమృద్ధిగా తినాలి” అన్నారు నాన్న.
“సర్లెండి. లేనివాళ్ళంటోందిగా? పాలూ పళ్ళూ వాళ్ళకెలా వస్తాయి?”అంది అమ్మ.
“నాకు ప్రతి సంక్రాంతికి మూడు జతల బట్టలు కొంటారు. తిథుల ప్రకారం ఒకసారి, తేదీలప్రకారం ఒకసారి పుట్టినరోజులు జరుపుతారు. పెద్దపండుక్కి ఒక్కజత చాలు. తిథులప్రకారం ఒక్కసారి పుట్టినరోజు చేస్తే చాలు. మిగిలిన డబ్బులు వాళ్ళకిస్తాను” అన్నాను.
నాన్న నాకేసి సాలోచనగా చూసారు. “రేపు చూద్దాం” అన్నారు.
ఆరోజు రాత్రి అమ్మకీ నాన్నకీ మధ్యని ఈ విషయాన్ని గురించి కొంత చర్చ జరిగి వుంటుందనే అనుకున్నాను. నాన్న ఒలీవియా వాళ్ళమ్మని చూసి రాగానే వప్పుకున్నారు. ఆ యేడాది భోగికీ, కనుమకీ నేను కొత్తబట్టలు కట్టుకోలేదు. అమ్మ కూడా మానేసింది. ఇద్దరం అంతకి ముందు పండగలవి కట్టుకున్నాం. పుట్టినరోజుల్లో మార్పుకి అమ్మ వప్పుకోలేదు.
“ఎందుకిలా చేస్తున్నావు?” అడిగింది ఒలీవియా ఆశ్చర్యంగా.
“పర్వాలేదులే. నాకు చాలా బట్టలున్నాయి” అన్నాను. తనింకేం అనలేదు.
ఆ తర్వాత ఆర్నెల్లకి నాన్న మళ్ళీ ట్రాన్ఫరయారు. తనని రిలీవ్ చెయ్యడానికి వచ్చిన సుబ్బారావుగారికి ఒలీవియా అమ్మ బాధ్యత అప్పగించారు. ఇద్దరూ మెడిసిన్ కలిసి చదువుకున్నారు. మంచి స్నేహితులు.
“ఎందుకు? ఇదంతా? అవసరం లేని బాధ్యత కదా?” అన్న ఆయన ప్రశ్నకి –
“పిల్లలు చేస్తున్నది మంచిపనైనప్పుడు కాదనడం ఎందుకు? మనం మంచిని ప్రోత్సహిస్తే పెద్దయాక ఎదురయ్యే చెడుని తేలిగ్గా గుర్తించి అందులో ఇరుక్కోకుండా వుంటారు ” నాన్న జవాబు.
మేం మరో వూరుకి వెళ్ళిపోయాం. కొద్దిరోజులకే ఒలీవియా వాళ్ళమ్మ చనిపోయారనీ, ఒలీవియా చర్చి ఆర్ఫనేజిలో చేరిందని వార్తలు. అక్కడితో తనతో సంబంధం ఆఖరు. మళ్ళీ తనగురించి వినడం ఇదే మొదలు.
“నాతో శ్రీకాకుళంలో స్కూల్లో చదువుకున్నమ్మాయి అమూల్యకి టీచరుగా వచ్చిందట. తనని కలిసి వస్తాను. సాయంత్రం నన్ను స్కూలుదగ్గిర దింపి అమూల్యని ఇంటికి తీసుకు రండి” మరుసటిరోజు విపిన్‍కి చెప్పాను. తను సరేనన్నాడు. సాయంత్రం స్కూలయ్యాక అమూల్యని విపిన్‍తో పంపేసి నేను ఒలీవియాని కలవటానికి వెళ్ళాను. నాకోసం ఎదురుచూస్తూ గ్రౌండులో ఒకచోట చెక్కబల్లమీద కూర్చుని వుంది. మొదటిసారి కలిసినప్పటిలా కాకుండా …సౌఖ్యంగా. పోల్చుకోలేనంత మార్పేమీ లేదు. వయసు పెరిగిన ఒలీవియాలా వుంది. ముఖం, అరచేతులు, పాదాలు తప్ప మరేమీ కనిపించకుండా తెల్లటి డ్రెస్.
“రా , జయా!” అంది చాలా మామూలుగా. ఎలాంటి వుద్వేగంలేదు. నాకు మాత్రం తనని హగ్ చేసుకోవాలని, తన చేతిని నా చేతిలోకి తీసుకోవాలనీ బలంగా అనిపించింది. కానీ అవేవీ చెయ్యలేకపోయాను. అలా నియంత్రిస్తుంది తన చూపు. మౌనంగా వెళ్ళి తనపక్కని కూర్చున్నాను. తరువాత కూడా చాలాసేపటిదాకా మౌనమే. తనదగ్గిర కబుర్లేం వుండవు.
“నిన్న పొద్దుట మొదటిసారి అమూల్యని చూసినప్పుడు నువ్వెందుకో గుర్తొచ్చావు. తను నీ కూతురవడం చాలా ఆశ్చర్యంగా వుంది” అంది.
“వాళ్ళ నాన్న విపిన్. ఇంజనీరు. ఇల్లు ఇక్కడికి దగ్గరే. రాకూడదూ?” అన్నాను.
“మా రూల్స్ వప్పుకోవు”
“ఓకే. ఎలా వున్నావు?” అడిగాను.
“నీవలన అమ్మకి మంచి వైద్యం, పోషణ జరిగాయి. లేకపోతే ఆమె అలా నిస్సహాయంగా చనిపోతే చాలా బాధగా వుండేది. ఇంక నా గురించి. అమ్మా లేక, నాన్నా లేక నా అనేవాళ్ళూ లేక తెగిన గాలిపటంలాంటి జీవితం. అమ్మ దాన్ని మతమనే కొమ్మకి ముడేసింది. . . చర్చే నన్ను పెంచి పెద్దచేసింది. నాకు ఈ వుద్యోగం కూడా చూపించింది. ఆ ప్రభువు దయవల్ల బాగానే వున్నాను ” అని ఆగింది.
“ఏమిటి?” అడిగాను.
“ఒక ప్రశ్న నన్ను తీవ్రంగా బాధపెడుతోంది. జయా! మొదటిసారి హాస్పిటల్‍కి తీసుకెళ్ళినప్పుడు మా అమ్మని చూడగానే డాక్టరుగారిలో ఆశ్చర్యం. . . తరువాత అమ్మని చూడ్డానికి వచ్చిన సుబ్బారావుగారిలోనూ ఆశ్చర్యం. వాళ్ళ ముగ్గురి మధ్యా ఒక రహస్యం వుందనిపిస్తుంది. వాళ్ళెప్పుడూ నా యెదురుగా వైద్యానికిమించి యేవీ మాట్లాడుకోలేదు. కానీ మా అమ్మ కచ్చితంగా వాళ్ళిద్దరికీ తెలుసు. తెలిస్తే తెలిసినట్టు బయటపడాలి. కానీ దాచారు. అంటే …. వాళ్ళిద్దర్లో ఒకరు నా జన్మకి కారకులా అనే అనుమానం నాకు అప్పుడప్పుడు కలుగుతుంది. జవాబు తెలుసుకోవాలనే కోరిక నన్ను బలంగా వూపేస్తూ వుంటుంది” అంది. సాధారణమైన విషయాన్ని గురించి చెప్పినంత మామూలుగా తను చెప్పిందిగానీ నేనంత తొందరగా జీర్ణించుకోలేకపోయాను. నాన్న గురించిగానీ సుబ్బారావుగారిగురించిగానీ అలా వూహించుకోలేకపోయాను.
“తెలుసుకుంటాను” అన్నాను. నాగొంతు నాకే బలహీనంగా వినిపించిది.
“వద్దులే జయా! నా మనసులో మాట బయటికి అలా అనేసాను. జస్ట్ కుతూహలం అంతే. విషయం ఎట్నుంచీ ఎటొచ్చినా నువ్వు బాధపడతావ్” అంది ఒలీవియా. తండ్రి ఎవరో తెలీకుండా బతకడానికి చిన్నప్పట్నుంచీ అలవాటుపడిపోయి, యిప్పుడొక వైరాగ్యయుతమైన జీవితం గడుపుతున్న తనకి అది పెద్ద విషయం కాకపోవచ్చు. అలాంటి రహస్యాలు జీవితాలని అల్లకల్లోలం చేస్తాయని తనకి తెలియకపోవచ్చు. ఎన్నో యేళ్ళుగా మనసులో దాచుకుని చెప్పుకునే వాళ్ళు లేక ఇప్పుడు నన్ను చూడగానే చెప్పి వుంటుంది . నాకు మాత్రం చాలా అలజడిగా వుంది. మరికొద్దిసేపు కూర్చుని వచ్చేసాను. ఇంటికి రాగానే నాన్నకి ఫోన్ చేసాను. సంభాషణ ఎలా మొదలుపెట్టాలో అర్ధమవలేదు.
“ఒలీవియా కలిసింది నాన్నా” అన్నాను బలహీనమైన గొంతుతో,
“ఒలీవియా… అంటే సుబ్బారావు కూతురు. నీ చిన్నప్పటి ఫ్రెండు. అప్పుడు మీయిద్దరూ చిన్న పిల్లలు. ఏం చెప్పినా అర్ధం చేసుకోలేని వయసు. అందుకని ఏమీ చెప్పలేదు”
నా మనసులోంచి పెద్ద బరువు తొలగిపోయింది. మరోలా వినవలసి వస్తే ఏం చెయ్యాలో కూడా నాకు తెలిసివుండేది కాదు. కాలం మరుగునపడిపోయిన ఈ నిజం చుట్టూ బలమైన వుద్వేగాలు అల్లుకుపోయేవి.
“సుబ్బారావు నాకు మెడిసిన్లో ఒక సంవత్సరం సీనియరు. మంచి ఫ్రెండయాడు. ఒలీవియా వాళ్ళమ్మ సునంద నర్సు ట్రెయినింగ్ చేస్తుండేది. ఇద్దరిమీదా పుకార్లుండేవి. అలాంటిది సునంద వున్నట్టుండి కాలేజి వదిలిపెట్టి వెళ్ళిపోయింది. అందరూ రకరకాలుగా అనుకున్నారు. నేను సుబ్బారావుని అడిగాను. దానికతడు-
మాది పరతులేని ప్రేమ. అందులో ఎలాంటి ఆశింపులకీ చోటుండదు. నేను తనని పెళ్ళి చేసుకుంటాననిగానీ. తను నాకు ఫెయిత్‍ఫుల్ వైఫ్‍గా వుండి నా తల్లిదండ్రులకి సేవ చేస్తూ నాకు పిల్లల్ని కనిచ్చి నా వంశాన్ని అభివృద్ధి చేస్తుందనిగానీ- మేం అలాంటి షరతులేవైనా పెట్టుకుని వుంటే కనీసం వెళ్ళిపోవడానికి ముందు నన్ను నిలదియ్యడమో గొడవ చెయ్యడమో చేసి వుండేది. అదేమీ చెయ్యకుండా సైలెంటుగా వెళ్ళిపోయింది- అన్నాడు. సునంద ఎక్కడికెళ్ళిందని అడిగాను. తెలియదన్నాడు” అన్నారు నాన్న.
“తప్పుకదూ?” అన్నాను.
“సునందదా? ఔను. తప్పే. జీవితాలతో ప్రయోగాలు తప్పు. ప్రేమిస్తే వచ్చే పర్యవసానాలగురించి చర్చించుకోకుండా ప్రేమించడం తప్పు. ఒకవేళ అన్నీ కప్పదాటు వేసినా, మెడికల్ ప్రొఫెషన్‍లో వుంటూ జాగ్రత్తలు తీసుకోకపోవటం తప్పు. అనాలోచితంగా ఒక పిల్లని కనటం తప్పు. సుబ్బడిదేముంది? మగవాడు. చేతికంటుకోకుండా దులుపుకున్నాడు”
నేను సుబ్బారావుగారిది తప్పనుకుంటే నాన్న సునందగారిది తప్పంటున్నారు.
“డీ ఎన్ ఏ టెస్టుల్లో తెలుస్తుందికదా?
“అప్పుడు ఆ టెస్టుల్లేవు. మరోలా రుజువు చేసినా అందులో బ్రీచ్ ఆఫ్ ప్రామిస్ లేదని సుబ్బారావు వాదిస్తాడు. అసలు అలా అడిగే అవకాశం సునంద ఇవ్వలేదుకదా?”
“…”
“అలా మాయమైన సునంద ఒలీవియాకి అమ్మగా మళ్ళీ కనిపించింది. పెళ్ళి కాకుండానే తల్లి కాబోయినందుకు తల్లితండ్రులు బంధువులు ఎవరూ దగ్గిరకి రానివ్వలేదట. అబార్షన్ వాళ్ళ మతంలో తప్పు. అందుకని వంటరిగానే పిల్లని కని పెంచింది. పరతులేని ప్రేమ యొక్క పర్యవసానాన్నీ, బాధ్యతనీ తనే తీసుకుంది. టీబీ రాకపోతే ఆమెకి మరొకరి సహాయం అవసరమై వుండేది కాదు. అలాంటి పరిస్థితి వస్తుందనే మనుషులు సంఘానికీ సాంప్రదాయాలకీ కట్టుబడి వుంటారు”
“నష్టపోయింది ఒలీవియా”
“ఔను. పెద్దవాళ్ళు కట్టుబాటు దాటితే నష్టపోయేది పిల్లలే. ఇప్పుడెలా వుంది ఆ అమ్మాయి?”
“అమూల్య స్కూల్లో టీచరుగా చేస్తోందట. అది చెప్తే వెళ్ళి కలిసి వచ్చాను. మీరో సుబ్బారావుగారో తన తండ్రి అని గ్రహించింది.”
“చాలా తెలివైన పిల్ల” నాన్న చిన్నగా నిట్టూర్చారు. ” పెళ్ళి చేసుకుందా?” అడిగారు.
“అమూల్య స్కూల్లో టీచర్లు పెళ్ళిచేసుకోరు నాన్నా!”
సుదీర్ఘంగా నిశ్వసించి నాన్న ఫోన్ పెట్టేసారు. వెంటనే సుబ్బారావుగార్నించీ ఫోను.
“ఏమ్మా,జయా! కులాసానా? ఆంటీ పోయాక నన్ను పూర్తిగా మర్చిపోయినట్టున్నావు? ఫోన్ చెయ్యడం మానేసావు” అన్నారు నిష్టూరంగా. ఆయన భార్య గైనకాలజిస్ట్. ఆవిడ మొదట్నుంచీ హైద్రాబాదులోనే ప్రాక్టీసు చేసేది. ఆయన వుద్యోగరీత్యా తిరిగేవారు. మేం శ్రీకాకుళంనుంచీ వెళ్ళిపోయిన కొంతకాలానికి ఆయన వాలంటరీ రిటైర్మెంటు తీసుకుని భార్య దగ్గిరకి వచ్చేసారు. కన్సల్టెంట్ ఫిజీషియన్‍గా భార్యతో కలిసి ప్రాక్టీస్ మొదలుపెట్టారు. ఆవిడ రెండేళ్ళ క్రితం పోయింది. ఇద్దరు కొడుకులు. ఇద్దరూ అమెరికాలో స్థిరపడ్డారు. ఆవిడ వున్నప్పుడు మాకు రాకపోకలు బాగానే వుండేవి. వాళ్ళ పిల్లలు అక్కా అక్కా అంటూ నావెంట తిరిగేవారు. వాళ్ళు అమెరికా వెళ్ళటం, ఆవిడ పోవటంతో రాకపోకలు ఆగాయి. సుబ్బారావుగారితో నాకు ప్రత్యేకించి పెద్దగా చనువు లేదు. ఇప్పుడీ ఫోను.
“మీ ఇంటికి వద్దామనుకుంటున్నాను. కొంచెం మాట్లాడాలి” అన్నారు.
ఒలీవియా గురించేనని గ్రహించాను.
“తప్పకుండా రండి. భోజనానికి వచ్చెయ్యండి” అన్నాను. కొద్దిసేపు ఏవో విషయాలు మాట్లాడి పెట్టేసారు.
మర్నాడు విపిన్ ఆఫీసుకీ, అమూల్య స్కూలుకీ వెళ్ళిపోయాక సుబ్బారావుగారు మాయింటికి వచ్చారు. కొద్దిసేపు మామూలు కబుర్లయాయి.
“రండి. అన్నం తింటూ మాట్లాడుకుందాం” అన్నాను. నేను టేబుల్ మీద అన్నీ సిద్ధం చేసేసరికి ఆయన చేతులు కడుక్కుని వచ్చారు. ఇద్దరం భోజనం మొదలు పెట్టాం.
“ఇంటి భోజనం తిని చాలా రోజులైంది. వంటావిడ బాగానే వండుతుందిగానీ ఇలా ఎందుకుంటుంది?” అన్నారు. నేను నవ్వి వూరుకున్నాను. మనస్పూర్తిగా మాటలు కలపలేకపోయాను.
“ఒక ఫ్రెండుతో కలిసి అతని మనవడి విషయంలో స్కూలుకి వెళ్ళినప్పుడు ఒలీవియాని చూసాను” అన్నరాయన.
“తను మీకేమౌతుందో నాన్న చెప్పారు” అన్నాను, సంభాషణని సులభతరం చేసేందుకు.
“ఎప్పుడు?”
“నిన్న సాయంత్రం” జరిగింది క్లుప్తంగా చెప్పాను.
“నీతో ఈ విషయం ఎలా చెప్పాలో అర్ధమవలేదు జయా! మీనాన్న చెప్పి నన్ను బతికించాడు. చదువుకుంటున్నప్పుడు సునందతో పరిచయం. మేం చేసింది తప్పా ఒప్పా అనే చర్చ ఇన్నేళ్ళు గడిచాక అవసరం లేనిది. ఒలీవియాని చూసాను. వంటరిగా బతుకుతోంది. ఆంటీ పోయి. తమ్ముళ్ళు స్టేట్స్‌లో సెటిలయ్యి నేనూ వంటరిగానే వున్నాను. తండ్రికూతుళ్లం. ఒకరికొకరం ఆలంబన ఔతాం. తనకేం మరీ పెళ్ళి వయసు దాటిపోలేదు. ఏదైనా సంబంధం చూసి చేస్తాను. నా కళ్ళముందే వుంటుందనేది నా ఆలోచన”.
నేను మౌనం వహించాను.
“ఒలీవియాతో మాట్లాడాను. నాతో రమ్మని బతిమాలాను. తను రానంటోంది. నువ్వు నచ్చజెప్ప. నీ మాటైతే వింటుంది” అన్నారు.
“మీరూ, సునందగారూ చేసినదాంట్లోని తప్పొప్పులని విమర్శించను. కానీ అంకుల్, ఒలీవియాగురించేనా మీరు ఆలోచించలేదా?” అడిగాను.
“సునంద పోయాక ఒలీవియాని నా దగ్గిరకి తెచ్చుకుందామని ఎన్నోసార్లు అనుకున్నాను. కానీ అప్పటికే ఇటు ఇద్దరు పిల్లలు. ప్రాక్టీసు మంచి స్వింగ్‍లో వుంది. ఏం చేసినా అందరి జీవితాలూ తలక్రిందులౌతాయి. అలా చేసే హక్కు నాకు లేదనిపించింది. పైగా నాకూ సునందకీ మధ్య ఎలాంటి వొప్పందమూ లేదు. ఒలీవియాకి జీవితంపట్ల ఏ ఆశింపులూ లేవు. తనని నేను తెచ్చుకోవడానికి తెచ్చుకోకపోవడానికి తేడా కనిపించలేదు. “
“ఆర్ఫనేజిలో పెరిగింది అంకుల్, తను” గుర్తు చేసాను.
“నాదగ్గిరకి వచ్చివున్నా అంతకన్నా మంచి జీవితాన్ని ఇవ్వగలిగేవాడిని కాదేమో! ఆంటీ చాలా పొజెసివ్. సునందగానీ ఒలీవియాగానీ ఆమెకేమీ కారు. కానివాళ్ళకోసం ఇబ్బందిపడటమో సర్దుకుపోవడమో చేసే మనస్తత్వం కాదు ఆమెది. సమస్య ఎదురైతే దాన్ని సమూలంగా నిర్మూలించాలనుకుంటుంది. మామధ్యని ఒలీవియాకి స్థానం వుండేది కాదు. అయాం ష్యూర్ అబౌట్ ఇట్. నువ్వు నా కోణంలోంచీకాక ఆమె కోణంలోంచీ ఆలోచించు”
“…”
“నీ ఫ్రెండుని నొప్పించడానికి చూడు జయా! ఇంతకాలం ఏం జరిగిందో జరిగింది. ఇప్పడిక తన భవిష్యత్తు బాగుండేలా నేను చూస్తాను.”
భోజనం పూర్తైంది. కొద్దిసేపు విశ్రాంతి తీసుకుని ఇంక వెళ్తానని లేచారు. నేను మళ్ళీ ఒలీవియాని కలిసాను. ఈలోగా సుబ్బారావుగారు తనని మరో రెండుసార్లు కలిసారట. సుబ్బారావుగారింటికి తను వెళ్ళటం నాకు ఎంతమాత్రం ఇష్టం లేదు. ఆయనలో ప్రేమకన్నా ఈ పెద్దతనంలో తనకి ఆసరా ఔతుందన్న ఆలోచనే ఎక్కువగా కనిపించింది. కానీ ఒలీవియాజీవితంలో మార్పొస్తుందన్న ఆశ ఆ అయిష్టాన్ని అధిగమించింది.
“భార్యని కోల్పోయి, పిల్లలు దగ్గిర లేక వంటరిగా గడుపుతున్న ఆ వృద్ధుడి ప్రార్ధన కాదనలేకపోతున్నాను జయా! జన్మనిచ్చిన రుణంకూడా వుందికదా? కొంతకాలం సేవ చేస్తాను. అందుకు చర్చి నుంచీ కూడా అనుమతి వచ్చింది” ఒలీవియా చెప్పింది.
సుబ్బారావుగారి కొడుకులు మాత్రం ఆయన తల్లికీ తమకీ చేసిన ద్రోహాన్ని క్షమించలేకపోయారు. తెల్లటి మతసాంప్రదాయపు దుస్తుల్లో ఉన్న ఒలీవియాని వాళ్లు అక్కగా వప్పుకోలేకపోయారు. తండ్రికి కేర్‍టేకర్‍గా మాత్రమే గుర్తించారు.
సుబ్బరావుగారుండే ఇల్లు సిటీ సెంటర్లో వుంది. చాలా పెద్దది. ఆయన భార్య పేరుమీద వుంది. విల్లు కొడుకులకి రాసింది. ఆవిడ నర్సింగ్‍హెూంకోసం కట్టించుకున్నది. ఆవిడ పోయాక ఖాళీగానే వుండిపోయింది. మూడునాలుగుకోట్లేనా చేస్తుంది. దాన్ని ఒలీవియాకిరాసిచ్చేస్తారేమోనన్న భయం వాళ్ళలో మొదలైంది. దాచుకునే ప్రయత్నం ఏమీ చెయ్యలేదు. పెద్దకొడుకు మామగారికి పవరాఫ్ అటర్నీ ఇచ్చి ఇంటిని లీజ్‍కి ఇచ్చేసారు. తల్లి బంగారం వున్న లాకర్లనీ ఇతర ఆస్థుల్నీ అధీనంలోకి తీసుకున్నారు.
“మీకొక్కరికీ అంత ఇల్లెందుకు నాన్నగారూ! ఆమెని తీసుకుని వుప్పల్ ప్లాట్‍లో వుండండి” అన్నారు తండ్రితో. తను జీవిత శిఖరాలని ఒక్కొక్క మెట్టు దిగుతున్నట్టు ఆయన గ్రహించారు. రెండు పోరాటాలు ఒకేసారి మొదలయ్యాయి. మొదటిది కొడుకులపరంగా, మరొకటి…
“ఏమిటమ్మా, నీ ఫ్రెండు? ఆంటీ చీరలు కొన్ని వందలు బీరువాల్లో పడి వున్నాయి. కట్టుకోదట. అవి కట్టుకోవడం ఇష్టం లేకపోతే కొత్తవి కొనిపెడతానన్నాను. వద్దంది. ఆ గోనెసంచీల్లాంటి బట్టలే వేసుకుని తిరుగుతుందట. ఉద్యోగం మానదట” ఆయన కంప్లెయింటు అపరాథభావమో, కొడుకుల్లాగే ఒలీవియాని యధాతథంగా చూపించుకోవడానికి చిన్నతనమో.
నేను మళ్ళీ ఒలీవియాని కలవడానికి వెళ్ళినప్పుడు తన గదిలో నేలమీద కూర్చుని బైబిల్ చదువుకుంటోంది. నన్ను చూసి పుస్తకం మూసి లేచింది.
“ఎలా వున్నావు?” ప్రేమగా అడిగాను.
“ప్రభువు దయవలన బాగానే వున్నాను” అంది.
ఇద్దరం హాల్లోకి వచ్చాము.
“అంకుల్ లేరా?”
“ఎటో వెళ్ళారు”.
“పదిలక్షల డబ్బు, ఇప్పుడుంటున్న ప్లాటు నాపేరు పెడతానంటున్నారు. వద్దన్నాను. నాకెందుకు ఇవన్నీ ? ఎలా బతుకుతావని దెబ్బలాడుతున్నారు. ఇన్నాళ్ళూ బ్రతకలేదా? ” అంది ఒలీవియా.
“ఆయన కూతురివికదా? నీకేదైనా చెయ్యాలని వుందేమో! అన్నాను.
“చేసిన పాపానికి పరిహారంగానైతే చర్చికి ఇమ్మన్నాను. నా తల్లి చూపించిన మార్గాన్ని నేను వదలలేను. ఇంత దూరం వచ్చాక కొత్తదార్లోకి అడుగుపెట్టలేను.”
తనకి ఇంకెలా చెప్పను?
సుబ్బారావుగారు బయటినుంచీ వచ్చారు. ఒలీవియా ఆయనకి మంచినీళ్ళు తేవడానికి వెళ్ళింది.
“ఏ క్షణాన ఈ పిల్ల నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతుందోనని భయంగా వుంది జయా! ఈ పెద్దతనంలో అలా చెయ్యద్దని చెప్పు ” అన్నారు దీనంగా.
నాకాయనలో ఒకప్పటి ఒలీవియా కనిపించింది. ప్రతిక్షణం భయపడుతూ మానవసంబంధాల అంచుని వుండీవుండనట్టుగా వుంటూ ఇంత జీవితాన్ని నెట్టుకొచ్చింది. ఇప్పుడా స్థానంలో రావుగారు వుండటాన్ని విధో కర్మో అని నేను వప్పుకోలేను. స్వయంకృతం అనేమాట సరిగా సరిపోతుంది.
సునందగారు అమాయకురాలైతే ఆయన సరిదిద్ది వుండాల్సింది. అవకాశాన్ని తీసుకున్నారు. ఎప్పుడూ అవకాశాలు మనవైపే వుండవు .