కాస్త సహనం వహిస్తే by Savitri Ramanarao

  1. నీల by Nandu Kusinerla
  2. ఫ్రిజ్ లోకి ఏం వండనూ!!! by Savitri Ramanarao
  3. ఆధునిక కవితోపాఖ్యానం by Savitri Ramanarao
  4. దానం కొద్దీ…! by Nandu Kusinerla
  5. కర్మణ్యేవాధికారస్తే!!!… by Savitri Ramanarao
  6. బలిపశువు by Pathy Muralidhara Sharma
  7. వైద్యంలో వేద్యం by Savitri Ramanarao
  8. నేనూ మనిషినే by Pathy Muralidhara Sharma
  9. చిన్న కుటుంబ చిత్రం by Savitri Ramanarao
  10. ఒక్క క్షణం by Pathy Muralidhara Sharma
  11. ఎందుకు రాదూ!! By Savitri Ramanarao
  12. యద్భావం తద్భవతి by Pathy Muralidhara Sharma
  13. అలా అర్థమైందా? by Pathy Muralidhara Sharma
  14. మనసు మూయకు!!! by Savitri Ramanarao
  15. ఎవరికెవరు ఏమవుతారో! by Pathy Muralidhara Sharma
  16. కాస్త సహనం వహిస్తే by Savitri Ramanarao
  17. అమ్మ దయ ఉంటే… by Savitri Ramanarao
  18. మై హుం నా బెహన్! by Savitri Ramanarao

శేఖరం పోయిన పదోరోజు. ఉదయం ధర్మోదకాల కార్యక్రమం అయి అందరూ భోజనాలు అవీ చేసి వెళ్లినవాళ్ళు వెళ్లగా మిగిలినవాళ్ళు హాల్లో కబుర్లు కలబోసుకుంటున్నారు.
అప్పుడే శేఖరం కోడలు సునీత నా దగ్గరకి వచ్చి “అక్కా! ఇక రేపు ఎల్లుండి కార్యక్రమాలకు కావలసిన లిస్ట్ రాసేసుకుందామా? ఆరింటికి వాసు అంటే శేఖరం కొడుకు వస్తానన్నాడు. మనం వెళ్లి కావలసినవి అన్నీ ఒకేసారి తెచ్చేయవచ్చు” అంది.
నేను లోకఅక్కని, అలాగే మా రాజ్యం పిన్ని లోకపిన్ని. చిన్నా పెద్దా అందరూ నన్ను అక్కా అనే పిలుస్తారు. రాజ్యం పిన్నిని యవద్భారతదేశం పిన్నీ అంటారు. మాఇళ్లలో ఇలాటివి పిలుపులు వయసుతో, వావివరసలతో సంబంధం లేకుండా పిలిచే అలవాటు ఎక్కువ.
“సరే, పద!” అంటూ లేవబోతుంటే మా రాజ్యం పిన్ని “ఇలా వచ్చి ఇక్కడ కూర్చుని నాముందు రాయండి. మీరు దూరంగా వెళిపోవడం ఎందుకూ?” అంది.
సునీత, నేను పెన్ను కాయితం పట్టుకు పిన్ని దగ్గర చేరాం. “పదకొండోరోజు, పన్నెండోరోజు కార్యక్రమాలకు కావలసిన సామాన్లు అన్నీ కర్మ జరిపించే అతను తెస్తానన్నాడు పిన్నీ! ఇక మన ఇంట్లో మనకే ప్రత్యేకంగా వుండేవి ఏవైన ఉంటే అవి చూసుకోవాలి ” అన్నాను.
“ఆ! ఇదేమైనా పెళ్ళిటే? చావింట్లో వేరే ఏముంటాయి, ఆ కర్మ చేయించే బ్రాహ్మడు ఏమి చెబితే అవి తప్ప?” అంటూ “అయినా ఏం పుట్టి మునిగిపోయిందనో శేఖరం, యశోదా ఇలా దాటేశారు నా కళ్ళముందే? దేముడు నన్ను మరిచిపోయాడు! ” అంది కొంగుతో కళ్ళొత్తుకుంటూ.
“పోనీలే పిన్నీ! నువు బాధపడకు. వాళ్లకి పిలుపొచ్చింది. వెళ్లిపోయారు. ఎవరు ఎప్పుడన్నది మన చేతుల్లో లేదుకదా? మీకు తెలియనిది ఏముంది?” అంటుంటే మధ్యలోనే పిన్ని ఎప్పటిలాగే తన గతం చిట్టా విప్పింది.
“అవునే తల్లీ! అయినా ఈ శేఖరం వెధవ భూమిమీద పడ్డాడో లేదో కడితేరా బిడ్డని కళ్ళ చూసుకోకుండానే వీళ్ళమ్మ అదే మా అక్క కొంప మునిగిపోతున్నట్లు వెళిపోయింది వాతం కమ్మి. వీడికోసమే మా బావకి నన్నిచ్చి పెళ్లి చేశారు. అప్పటికి నాకు పదేళ్ళు. మా అమ్మ ఈ చంటిపిల్లాడిని ఎలా సాకాలో నాకు చెబుతూ ఉంటే శేఖరం పెంపకం సాగించేను. బావ నాకంటా పద్దెనిమిదేళ్ళు పెద్ద. నన్నో చిన్నపిల్లలాగే చూసే వాడు. బాగానే ముద్దుముచ్చట చూసేవాడు. కానీ నాకు ఇరవై వచ్చేసరికి టైఫాయిడ్ వచ్చి బావ, తరవాత ఒకొరొకరుగా మా అమ్మ, నాన్న రాలిపోయారు. ఇలా నాకు ముప్ఫయి ఏళ్ళు వచ్చేసరికి నేనూ శేఖరం ఒకరికొకరుగా మిగిలాం. వాడు కావాలన్న చదువులు చదివించి మా తమ్ముడు కూతురు యశోదని ఇచ్చి చేసి వాళ్ల దగ్గరే కాలంవెళ్లబుచ్చుతుంటే ఇదిగో, ఇలా ఆ దేముడికి కన్ను కుట్టిందేమో ముందు యశోదని, ఆనక ఇప్పుడు శేఖరాన్ని . ఏమనాలి చెప్పు? తొంభైయేళ్ల తొక్కుని నన్ను వదిలేసి వాళ్లని పట్టుకుపోయాడా ఆ పైవాడు. ఏమిటో దేముడికి కూడా మతి సరిగా పనిచేయదు కాబోలు…” ఆ వాక్ప్రవాహం కొనసాగేదే కానీ సునీత “కాఫీ తీసుకోండి పిన్ని !”అని అడ్డుతగలకపోతే.
ఇంచుమించుగా బతుకంతా పుట్టింట్లో గడిచిపోయిన, నాకు వరసకి పిన్ని అయే, మా రాజ్యం పిన్ని పూర్తిగా సంప్రదాయవాది. రాజ్యం పిన్ని అమ్మానాన్నలు చుట్టాల సురివిలు. వాళ్ళకి గొప్ప బంధుప్రీతి. వారింటిని రామంగారి సత్రవ అనేవారు. పిన్నీవాళ్ళనాన్న మోతుబరి. కాస్త ఉన్న వాళ్లే. వ్యవసాయం చూసుకుంటూ ఊర్లోవారికి తలలో నాలుకలా వుండేవాడు. పిన్నీవాళ్ళమ్మ భర్త మాట జవదాటని సతీమతల్లి అక్షరాలా. ఆ ఇంటికి వచ్చేపోయేవారికి లెఖ్ఖలేదు. అలా వేళాపాళా లేకుండా వచ్చిన వారికి విస్తరేసి వడ్డించే అన్నపూర్ణమ్మ తల్లి అని ఆవిడని అందరూ అనేవారు. రాజ్యం పిన్ని అన్నయ్య చిన్నతనంలోనే పోయాడు. అక్క శేఖరాన్ని కని పోయింది. రాజ్యం పిన్ని తమ్ముడు అప్పట్లోనే బాగా చదువుకుని IAS చేసి మా ఊరునుండి ఉద్యోగం అంటూ దూరంగా వెళ్లిపోయాడు. అతను కూడా పోయి పదేళ్లు అయింది. పిన్ని బాధ అదే. తనకన్నా చిన్నవాళ్ళు అందరూ పోతున్నారు, తాను మిగిలిపోయిందని.
“ఇవన్నీ చూడటానికేనా, ఆ దేముడు నన్ను ఉంచాడు?”అని వాపోతుంది.
అయితే ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా సంప్రదాయాలు పాటిస్తుంది. తన తల్లిదండ్రుల్లాగే తానూ చుట్టాల సురివి అనే పేరు తెచ్చుకుంది. తన మాట వేదవాక్కుగా అందరూ పాటిస్తారు. అలా తన మాటకి తిరుగులేకుండా బతికే రాజ్యం పిన్ని దగ్గర యశోద, శేఖరం ఆవిడ గీసిన గీటు దాటకుండా నడుచుకున్నారు. తల్లి లేని తనను పెంచి పెద్ద జేసి ప్రయోజకుడిని చేసిందని రాజ్యం పిన్ని మీద శేఖరంకు ఎనలేని ప్రేమ, గౌరవం, భక్తి. యశోదకు, శేఖరంకు ఎప్పుడూ పిన్ని ఎంత చెబితే అంత. అందుకే ఈరోజువరకు రాజ్యం పిన్ని మాటకి ఎదురులేకుండా జరిగిపోయింది. ఇప్పుడు శేఖరం తరవాతి తరం వచ్చింది.
శేఖరం కొడుకు విశ్వనాధ్, కోడలు సునీత. ఇంజినీరింగ్ అవగానే అమెరికా వెళిపోయిన విశ్వనాధ్‍కి, అంతా అతన్ని వాసు అంటారు, అక్కడ సునీతతో పరిచయం తరవాత పెళ్లి. వాళ్ళు అక్కడే స్థిర పడిపోయారు. వాళ్లకి ఇద్దరు పిల్లలు.
వాసు వాళ్ళు అప్పుడప్పుడు ఇండియా వచ్చి వెళుతుంటారు. ఇదిగో, ఇప్పుడు శేఖరం పోవటంతో ఇలా వచ్చారు వాసు కుటుంబం. ఈ హడావుడి అయిపోతే మళ్లీ వెళ్లిపోతారు. ఇక నేను, మావారు శేఖరం కుటుంబానికి చాలా సన్నిహితులం. మా అమ్మ రాజ్యం పిన్నికి స్వయానా పినతల్లి కూతురు అవటంవలన అక్కా ,బావా అని శేఖరం ఎంతో ఆప్యాయంగా పిలుస్తూ ఏదీ మాతో సంప్రదించకుండా చేసేవాడు కాదు. అదే సంప్రదాయం వాసు, సునీత కొనసాగిస్తున్నారు. అమెరికాలో వుండేవాళ్ళు ఇండియాలో అన్నిటికీ మామీద ఆధారపడి పనులు చక్కబెట్టుకుంటారు.
శేఖరం కొడుకు ఇంటికి ఒక్కసారి కూడా వెళ్ళలేదు తాను వెళితే రాజ్యం పిన్ని ఒంటరిగా ఉండాలి అని. అది పిన్నిపట్ల వాడి తీరు, అభిమానం, బాధ్యత.
ఈరోజు వాడు పోవటం పాపం పిన్నికి మానసికంగా పెద్ద దెబ్బే. ఇంత వయసులో ఆవిడకి మరోమనిషి లేకుండా ఒంటరిగా ఉండవలసి రావటం దినవారి కార్యక్రమాలలోను చాలా ఇబ్బంది. అయితే ఆమె “ఒరే, వాసూ! ఇన్ని తుఫానులు చూసిన నాకు ఈ గాలివాన ఓ లెఖ్ఖా? నాకు అటెండెంట్‍ని పెట్టెయ్ రా ! నా దినం ఇక్కడే తెల్లారాలి. మంచికి, చెడుకి దగ్గరే సావిత్రక్క వుంది. చూస్తుంది”అని డిక్లేర్ చేసింది. మా అందరికి అదే మంచిది అనిపించింది.
ఇక కాఫీలు అయ్యాక లిస్ట్ రాయటానికి మళ్లీ నేనూ, సునీతా రాజ్యం పిన్ని దగ్గర కూచున్నాం. ఏవో కొన్ని అవసరమైన సామానులు రాయటం అయ్యాక చివరిగా బట్టలు కొనే అంకం వచ్చింది. “అత్తయ్యగారికి, కర్మ చేయించిన అతని భార్యకి చీరలు కొనాలి” అంది సునీత.
వెంటనే పిన్ని “యశోదకి ఇంక చీరా పసుపు కుంకం ఇయ్యక్కరలేదు” అంది .
“అదేమిటి అత్తయ్య పునిస్త్రీగా పోయారు, ప్రతికథకి కార్యానికి అత్తయ్యకి చీరా, పసుపు కుంకం ఈయాలని మీరేగా అన్నారు?” అంది సునీత ఆశ్చర్యంగా.
“అవును. కానీ ఇప్పుడు శేఖరం పోయాడుగా? ఇక ఇప్పుడు యశోద పునిస్త్రీ కాదు. అందికే ఇక పసుపు, కుంకం ఎలా ఇస్తాం?” అంది పిన్ని.
“కానీ పోయినవాళ్ళకి…” అని ఏదో అనబోతున్న సునీతని ” మా ఇంటి పద్ధతులు మాకున్నాయి అమ్మా! నీ అమెరికా పద్ధతులు మాకు చెప్పకు” అని ఖండించింది పిన్ని. “అమెరికాలోనే ఉంటూ మొగుడిని కొంగుకు కట్టేసుకుంది. అత్తారింటికి రాదు” అంటూ సునీతని సందు దొరికితే విమర్శిస్తుంది పిన్ని.
మళ్లీ సునీత నోరు తెరవబోతుంటే వద్దని కళ్ళతోనే వారించాను. అయిష్టంగా మొహం పెట్టి అక్కడనుండి అసహనంగా లేచి కిచెన్‍లోకి వెళిపోయింది సునీత. పిన్ని ఆగకుండా వాళ్ళ కాలంలో భర్త పోయిన ఆడవాళ్లు పాటించే పద్ధతులు ఏకరువు పెడుతోంది. యశోద ముందు పోయి సుఖపడింది. లేకపోతే పిన్ని పాలపడి నిత్యం చస్తూ ఉండేది అనుకున్నాను మనసులో.

ఈలోపల “అక్కా! ఓ సారి ఇటు వస్తారా?” సునీత పిలుపు.
“వస్తున్నా!” అంటూ “బతుకు జీవుడా !” అని లేచి కిచెన్‍లోకి వెళ్ళాను.
“ఈరోజు శనివారం రాత్రి పిల్లలు తప్ప పెద్దవాళ్ళు ఎవరూ భోజనాలు చేయరట. ఫలహారాలకి ఏమి చేయిద్దాం అక్కా?” అంటే, కాస్త ఇద్దరం తర్జనభర్జనపడి ఏమి చేయాలో వంటమనిషికి చెప్పేసాకా…
సునీత “ఏమిటక్కా రాజ్యం పిన్ని చాదస్తం? ఎప్పుడో పోయిన అత్తయ్యగారికి ఇప్పుడు మామయ్యగారు పోయారని వైధవ్యం అంటగడుతున్నారు. అర్ధం వుందా ఆ మాటలకి? ఒకప్పుడు ఈవిడేగా, పునిస్త్రీగా పోయింది యశోద, కథలకీ, కార్యాలకీ పసుపుకుంకం ముందు తనకి ఇచ్చి తీరాలని శాసనం చేసింది? ఓసారి మావాడి అక్షరాభ్యాసానికి మామయ్యగారు అత్తయ్యగారికి చీర తేవడం మరిచిపోయారు అని నానా హంగామా చేస్తే, వాసు అప్పటికప్పుడు వెళ్లి చీరా, పసుపుకుంకం తెచ్చాడు. వింటున్న కొద్దీ వేస్తుంది ఈవిడ ఆర్డర్లు. ఇంత వయసు వచ్చింది, ఊరుకోక ఈవిడకి ఇంకా పెత్తనం చెలాయించాలనే పట్టుదల. అప్పటినుండి వాసు ప్రతిసందర్భంలో వాళ్ల అమ్మకి చీర, పసుపుకుంకం చూపెట్టి అవి ఒక బీదముత్తైదువకి ఇస్తున్నాడు. ఇప్పుడు మీ నాన్న పోయారు, ఎప్పుడో పోయిన మీ అమ్మకి కొత్తగా వైధవ్యం వచ్చిందట. రాజ్యం పిన్ని చెప్పారు. ఇక మీరు మీ అమ్మకి పసుపుకుంకం ఇవ్వక్కరలేదు అంటే తాడెత్తున నామీద లేస్తాడు. పోయినవాళ్ళకి వైధవ్యం ఏమిటి, ఆవిడకి లేకపోతే నీకు మతుందా అంటూ. చెప్పేది ఒక్కటి కూడా వినకుండా అన్నిటికీ అరిచే వాసుకి నేనేమీ చెప్పలేను. మీరే చెప్పండి అక్కా!” అంది చిరాగ్గా.
చచ్చిపోయినా ఆడవాళ్ళని ప్రశాంతంగా వుండనీయని సంప్రదాయాలు, అవి వంటపట్టించుకున్న రాజ్యం పిన్నిలాంటి ఛాందసులు. “ఈశ్వరా! వీళ్ళ మనస్తత్వాలు మార్చు” అని లోపలే అనుకుంటుంటే వాసు వచ్చాడు. జరిగింది చెప్పాను ఈ విషయంలో పిన్నికి వాసుకి ఘర్షణ రాకుండా ఉండాలనే ముందు జాగర్తతో.
అంతా విని, “ఏమిటక్కా, వయస్సు అయినకొద్దీ మరీ చాదస్తం… ముసలి ధోరణి…. నాన్న కనక ఆవిడతో పడ్డారు. నావల్లకాదు, ఆ మతిమాలిన గోలపడటం. నాన్న పోతే ఎప్పుడో పోయిన అమ్మకి ఇప్పుడు వైధవ్యం ఏమిటి? నాన్న మరీ ఆవిడని నెత్తికెక్కించుకున్నారు. ఇప్పుడు ఇక నేను ఆవిడ మాట వినను. మా అమ్మకి నేను చీర, పసుపుకుంకం ఇస్తాను. ఎవరు అడ్డువస్తారో చూస్తాను” అని మండిపడ్డాడు.
“ఒరే వాసు! కాస్త చల్లబడు నాన్నా! నువ్వు అంటున్నది ఒప్పుకుంటున్నాను. నువు కూల్‍గా వింటానంటే నేనోటి చెప్తాను. వద్దంటే మాట్లాడను. నీఇష్టం వచ్చింది చెయ్యి” అన్నాను.
దాంతో వాడు కొంచెం తగ్గి “చెప్పక్కా ఏమిచెబుతావో!” అన్నాడు.
“ఒరే! కోపం తెచ్చుకోకుగాని, ఆవిడ నాన్న పోయాక అమ్మకి వైధవ్యం అంటుంటే నువ్వు పోయిన అమ్మకి పసుపుకుంకం అంటున్నావు. నీకు, ఆవిడకి ఆలోచనావిధానంలో తేడా ఏముందిరా? నిజానికి ఈ రెంటితో ఎప్పుడో పోయిన మీ అమ్మకి నిమిత్తం లేదు. పోనీ ఆవిడ ఆత్మ ఉంది అనుకున్నా ఆత్మకి ఏదీ అంటదు. అవసరం లేదు. అలాటపుడు ఇవన్నీ అవసరమా ఆలోచించు. మన అహంకారాలు, మాట నెగ్గించుకోవాలి అనే పంతాలు తప్ప ఇందులో మరేమీ లేదు నాన్నా! నీకంతగా మీ అమ్మకి పసుపుకుంకం ఇవ్వాలని ఉంటే చీర, పసుపుకుంకం ఎప్పటిలాగే ఎవరో బీదముత్తైదువకి ఇచ్చెయ్ రాజ్యంపిన్నికి తెలియకుండా. ఆవిడకి తొంభై ఏళ్ళు. మీ నాన్న ఉన్నన్నిరోజులు ఆవిడ మాటే శాసనం. ఇప్పుడు కాదు అని నువు ఎదురుతిరిగితే ఆవిడ ఏమీ చేయలేకపోవొచ్చు కానీ మానసికంగా బాధపడుతుంది. అలా ఆవిడని బాధపెట్టి నువ్వు ఏమి బావుకుంటావు? ఈ రెండురోజులు అయితే మీరు వెళ్ళేపోతారు. సరే! పిన్నీ! నువు చెప్పినట్లే కానిద్దాం అన్నావనుకో పెద్దవయసులో అందరూ నామాట గౌరవిస్తున్నారు. నన్ను ఆదరిస్తున్నారు అనే భావన ఆవిడలో ఆనందం కలిగిస్తుంది కదా? ఒక్క సారి ఆలోచించు. పెద్దవారి చాదస్తాలు భరించటం మీకు విసుగుగానే ఉంటుంది. కానీ రవంత ఓపికతో సానుభూతితో వారి మాట వీలయినంత వరకు కొట్టేయకుండా వారికి, మనకి ఇబ్బందిలేకుండా ఎలా ప్రవర్తించాలి అనేది కాస్త సహనంతో ఆలోచించి అడుగేస్తే ఆ పండిన వయసులో వారికి కాస్త సంతోషం కలిగించి వారు తృప్తిగా చివరిరోజులు గడిపే అవకాశాన్ని ఇచ్చినవాళ్ళం అవుతాము కదా! “అన్నాను.
వాడు అంతా విని “నిజమే అక్కా! వినగానే కోపం వచ్చిందిగానీ నువు చెప్పింది సమంజసంగానే ఉంది. అలాగే చేస్తాను” అని కాఫీ తాగి వెళ్లిపోయాడు.
సునీత “అమ్మయ్య బతికాను అక్కా! ఈ విషయంలో వాసు వేసే యక్షప్రశ్నలు, నా జవాబులు నచ్చక నామీద పడే చిరాకుబారినుండి తప్పించారు నన్ను” అంటూ ఫోన్ వస్తే తీయటానికి వెళిపోయింది.
“సావిత్రీ !ఎంతసేపు? ఏమిటా చర్చలు? ఇక్కడ నాముందు మాటలాడుకోవచ్చుకదా!” అన్న రాజ్యం పిన్ని పిలుపుకు “ఏమీలేదు పిన్నీ! రాత్రికి ఏమి చెయ్యాలో మాట్లాడుకుంటున్నాం” అంటూ పిన్ని దగ్గరకి నడిచాను నా ముందుతరాన్నీ వెనకతరాన్నీ సమన్వయం చేయటంలో కృతకృత్యురాలి నయానుకదా అనే తృప్తితో.