కోడలొచ్చింది by S Sridevi

  1. వంటింటి కిటికీ by S Sridevi
  2. పగుళ్ళు by S Sridevi
  3. స౦దిగ్ధపు రహదారులు by S Sridevi
  4. కోడలొచ్చింది by S Sridevi
  5. అతనిష్టం by S Sridevi
  6. ఆమె విజేత కాదు by S Sridevi
  7. యుద్ధదృశ్యం by S Sridevi
  8. బేబీ ఆఫ్ అర్చన by S Sridevi
  9. తరంగనాట్యం by S Sridevi
  10. చిట్టికి క్షమార్పణలతో by S Sridevi
  11. ఇంకో మజిలీకి by S Sridevi
  12. అధిరోహణం by S Sridevi
  13. లివింగ్ టుగెదర్ by S Sridevi
  14. గుమ్మడి గింజలు by S Sridevi
  15. బంగారుపంజరం by S Sridevi
  16. చీకట్లో పూసిన పూలు by S Sridevi
  17. గినీ పిగ్స్ by S Sridevi
  18. మలయమారుతం by S Sridevi
  19. సార్వభౌముడు by S Sridevi
  20. అమ్మానాన్నలు by S Sridevi

“ఇంకేంటి అహల్యా! వాసు పెళ్ళి కుదిరిపోయింది. కోడలొస్తుంది. అంతా తీరికే” ఫ్రెండ్సు అన్నమాటలు పదేపదే గుర్తొచ్చాయి అహల్యకి. పెదాలమీద చిన్ననవ్వు విరిసింది. నిజమే. కోడలొస్తే యింటి బాధ్యతలనుంచి తనకి కొంతేనా విముక్తి. ముందు వారంరోజులు పల్లెటూళ్ళో వుండే తన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి రావాలి. ఆ తర్వాత వరసపెట్టి అక్కచెల్లెళ్ళందరి ఇళ్ళకీ వెళ్ళి తలో రెండురోజులూ వుండాలి. ఢిల్లీలో వుండే అన్నగారు, ముంబాయిలో వుండే తమ్ముడూ ఎప్పుడూ అంటూవుంటారు, “ఒక్క వారం రోజులేనా వుండేలా రావే. ఊరంతా చూద్దువుగాని” అని.
వాళ్ళు రమ్మనీ అంటారు. ఇక్కడ భర్త, పిల్లలు వెళ్ళమనీ చెప్తారు. కానీ తనే వెళ్ళలేదు. వెళ్ళినా ఒక్కరోజుమించి వుండలేదు. ఏవో అజ్ఞాతబంధాలు తనని వుండనివ్వవు. ఇక్కడ యిబ్బందిపడుతున్నారేమో. వేళకి వండుకున్నారో, తిన్నారో లేదో! ఎన్నో సందేహాలు. అంతా కలిసి
వెళ్దామనుకుంటే భర్త చేసేది పోస్టాఫీసులో. ఎప్పుడూ లీవు దొరకదు. మరోవైపు పిల్లల చదువులు. వాసు భార్య వస్తే యింటి బాధ్యత ఆమెకి వదిలిపెట్టి తను నిశ్చింతగా వెళ్ళిరావచ్చు….ప్రపంచం చాలా అందంగా కనిపించింది ఆమెకి.
“స్నేహా! ఫ్రిజిలోంచి పచ్చిమిరపకాయలు, కరివేపాకు తెచ్చివ్వవే” అంది కూతురితో,
ఆపిల్ల ఓ చేత్తో నోట్‍బుక్ పట్టుకుని చదువుకుంటూనే, మరోచేత్తో తల్లి అడిగినవి తీసుకుని వచ్చి, వాటిని ఆవిడకిస్తూ,”ఇంకెంతమ్మా, వదినొస్తే నేనింక వంటింట్లోకి అడుగే పెట్టను” అంది.
తల్లి చెప్పే చిన్నచిన్న పనులు, కోరే సహాయాలూ స్నేహకి నవ్వు తెప్పిస్తాయి. తను సీరియస్‍గా చదువుకుంటున్నప్పుడైతే కోపంకూడా వస్తుంది. ఇంటిపనంతా నిలబడి అవలీలగా చెయ్యగలిగే తల్లి ఇలాంటి పుమాయింపులు చెయ్యటం వింతగానూ అనిపిస్తుంది. ఒక్కర్తే వుండటంచేత వంటింట్లో బోరు కొడ్తుందేమో, వదినొస్తే మంచి కంపెనీ! అనుకుంది.
“ఆ< నేనూ వదినకోసమే ఎదురుచూస్తున్నానులేవే. నాగదిలో పుస్తకాలవీ చిందరవందరగా వుంటాయని నాన్నగారు కోప్పడుతుంటారా, అమ్మేమో తనకి తోచినట్టూ సర్దేస్తుందా, తర్వాత నాక్కావల్సినవి దొరక్క పడే తిప్పలు మీకేం తెలుసు? వదిన పోస్ట్ గ్రాడ్యుయేట్. నారూమ్ ఛార్జి తనకిచ్చేస్తాను” అన్నాడు హరి అప్పుడే అక్కడికొస్తూ.
అందరిమాటలూ వింటుంటే నవ్వొచ్చింది ప్రసాదరావుకి . అలాగే నవ్వొచ్చి పెదాలనీ, మనసునీ పలకరించిన మరో వ్యక్తి వాసు. కాబోయే పెళ్ళికొడుకు.
కోడలొస్తుంది, కొడుకు జీవితంలోకి వసంతంలా… అనుకోవడంలేదెవరూ. ఎవరి బాధ్యతల్ని వాళ్ళు చిలక్కొయ్యకి తగిలించినట్టు ఆమె భుజానికి తగిలించి వూపిరి పీల్చుకుందామనుకుంటున్నారు.
వాసుకి సెటిలైన అమ్మాయి సృజన. చామనఛాయలో మృదుత్వం, దృఢత్వం సమపాళ్ళలో కలిసినట్టుంటుంది. చదువుకుంది. ఉద్యోగం చేస్తోంది. పెళ్ళిచూపులప్పుడు వాసుతో స్పష్టంగా తన యాంబిషన్స్ చెప్పింది. వాళ్ళది యిదే వూరు. ట్రాన్స్ఫర్ల బెడదలేదు. చాలా యిష్టపడి వప్పుకున్నారు ఇద్దరూ !
అహల్యా ప్రసాదరావూ కొంచెం చర్చించుకున్నారు. జాబ్ చేస్తున్న అమ్మాయిగాబట్టి, గృహిణిగానే వుండిపోయిన అహల్యతో కలవగలదా లేదా అనేది ఆయన ప్రశ్న. ఆ ప్రశ్నని భార్యవైపు నుంచి కూడా వేసుకున్నాడు. తేలిగ్గా కొట్టిపారేసింది అహల్య, భర్త సంశయాలని.
“ఈరోజుల్లో ఎందరు వుద్యోగాలు చెయ్యటంలేదు? అలాగే నా కోడలూను. మనకేమంత ఆస్తులున్నాయి? పిల్లలకి ఎంత మిగిల్చివ్వగలం? ఇద్దరూ ఉద్యోగస్తులైతే ఆసరాగానూ వుంటారు, మననుంచీ ఆశించరు ” అంది.
ఆఖరికి అంతా కలిసి ఓకే చేశారు.

ఎంతో ఎదురుచూసిన పెళ్ళి… వాసు పెళ్ళి అవనే అయింది. కొత్తకోడలింకా పాతబడనేలేదు, ఆఫీసుకి తయారైంది.
“అదేంటమ్మా! పదహార్రోజుల పండుగయేదాకానేనా వుండవా?” తెలతెలబోతూ అడిగింది అహల్య.
“ప్రొబేషన్లో వున్నానుకదండీ! లీవు పీరియడ్‍కి ప్రొబేషన్ పొడిగిస్తారు. అందుకే ఎక్కువ లీవు పెట్టలేదు” అంది.
అహల్య యింకేదో అనబోతుంటే ప్రసాదరావు కలగజేసుకున్నాడు. “వెళ్ళి జాయినవనీ, అహల్యా! ప్రొబేషనరీ పీరియడ్లో లీవులు పెట్టడం అంత మంచిది కాదు” అన్నాడు.
సృజన వెళ్ళిపోయింది. వాసు వెళ్ళి డ్రాప్ చేసి వచ్చాడు. మళ్ళీ ఆమె రావటం ఆరింటికి.
వస్తూనే వాసు పిక్చర్ ప్రోగ్రాం పెట్టాడు. ఫ్రెండు, భార్యతో వెళ్తూ వీళ్ళనీ రమ్మన్నాడట. తిరిగొచ్చేసరికి రాత్రి పదిన్నర. అప్పుడొచ్చి అన్నం పెట్టుకుని తిన్నారు. అహల్యకి కొద్దిగా అసహనంగా అనిపించింది. అదెందుకో అర్థం కాలేదు.

పొద్దున్న ఆరింటికి లేస్తుంది సృజన. ఒక్కొసారి ఆరున్నరకూడా ఔతుంది. లేచి, గబగబ స్నానం చేసి వంటింట్లో కొస్తుంది. అప్పటికే అహల్య లేచేసి వుంటుంది. స్టామీద ఒకవైపు పొగలు చిమ్ముతున్న పాలు, మరోవైపు హిస్స్‌మంటూ కుక్కరూ వుంటాయి..
“అయ్యో! మీరు కుక్కరు పెట్టేసారా? నేనొచ్చేదాన్నిగా, ఆగకపోయారా?” అంటుందేమోనని ఆశిస్తుంది అహల్య. అంతేకాదు, మర్నాటినుంచి తనకన్నా ముందే లేచి వంటింట్లో కనిపిస్తుందని కూడా అనుకుంటుంది.
ఉ<హు< అలాంటిదేం జరగదు. కామ్‍గా మిగిలినపని అందుకుంటుంది. గబగబ అయిందనిపించి, వాసుకి పెట్టి, తను తిని బైటపడ్తుంది. ఆరింటికి వచ్చాక కొద్దిసేపు వాళ్ళ గదిలో రిలాక్సై స్నానం చేసి ఆ తర్వాత తీరిగ్గా వంటగదిలో అడుగుపెట్టేసరికి సగం వంటైపోయి వుంటుంది. అప్పుడూ ఏమీ మాట్లాడదు. పద్దతీ మార్చుకోదు.
రాత్రి పదింటికి లైట్ ఆరిపోతుంది. మళ్ళీ పన్నెండింటికి వెలుగుతుంది. ఆ అర్ధరాత్రివేళ అంతసేపు లైట్ వేసుకొని ఏం చేస్తున్నారో అర్థం అవ్వదు అహల్యకి. మధ్యలో మాటలు వినిపిస్తుంటాయి చిన్నగా. ఏం చేస్తుంటారు? కబుర్లు చెప్పుకుంటుంటారా?
ఉదయం సృజన లేచేసరికి ఆరు దాటిపోతోంది తరుచుగా.
“ఈ పిల్ల పద్దతి నాకేం నచ్చలేదండీ! ఎంతకాలం కొత్తకోడలు? చకచక నాలుగు పనులూ చేసుకోవాలిగానీ అంతా నావంతన్నట్టు తూచితూచి చేస్తుంది. పొద్దున్నేమో పదింటిదాకా లేవకపోవడం. పరాయి ఇంటికి వచ్చిన ఆడపిల్ల ఇలాగేనా వుండటం? బుద్ధి ఉండద్దూ, ఆ తల్లికి? ఇదేం పెంపకం?”” ప్రసాదరావుతో అంది అహల్య.
కోడలు వస్తుంది, బాధ్యతలు తగ్గుతాయి, సరదాలు పెరుగుతాయి అనుకుంటే అక్కరకు రాని చుట్టంలా వచ్చి పడింది. అదే చాకిరి, అదే బాధ్యత. ఉక్రోషంతో ఆమె కళ్ళలో నీళ్ళు తిరుగుతున్నాయి.
“ఏవో పనులు చేస్తూనే వుంది కదు, అహల్యా?” అన్నాడు ప్రసాదరావు సర్దిచెప్తూ.
“ఉ<హు< నాకేం నచ్చలేదు. నేను లేచేసరికి తను వంటింట్లో ఉండాలిగానీ. నేను పనంతా చేసుకున్నాక తను తిప్పుకుంటూ రావడం కాదు. సాయంత్రం మాత్రం? రాగానే వంటింట్లోకి ఎందుకురాదు?”
“తొందరపడకు ” హెచ్చరించాడు ప్రసాదరావు. తను అనుకున్నట్టే జరగటం అతనికి బాధని కలిగించింది.

“ఇంట్లో పని, ఆఫీసులో పని ఆపైన ఈ టెస్టులు అసలు పాసౌతానా? ఉ<హు< నావల్లకావటం లేదు. కొద్దిరోజులు మా అమ్మవాళ్ళింట్లో వుంటాను” కళ్ళలో నీళ్ళు తిరుగుతుండగా అంది సృజన . నిన్నమొన్నటిదాకా ఏ బాధ్యతలూ లేకుండా పెరిగి, ఒక్కసారి యింతమంది మధ్యకొచ్చిపడేసరికి గిజగిజలాడిపోతోంది. ముఖ్యంగా అహల్య తనని దోషిలా చూడటాన్ని తట్టుకోలేకపోతోంది. అమ్మ , పిన్ని, మేనత్తలు వీళ్ళ ప్రేమని మాత్రమే చూసిన ఆమెకి యిక్కడ ఎదురౌతున్న కటుత్వం గాయపరుస్తోంది. తనకి పెద్దగా పనులు రావు. కుక్కరు పెట్టడం, కొన్ని కూరలు చెయ్యడం, సాంబారు చెయ్యటం వచ్చు. అదీ పెళ్ళికి ముందే నేర్చుకుంది. తనకొచ్చినవేదో చేస్తూనే వుంది. టైం చాలటంలేదు. ఆఫీసులో రోజూ లేటు.
సృజన అన్న ఆ కొద్దిమాటల్లోనూ ఆమె అంతర్యాన్ని విన్నాడు వాసు. “అమ్మావాళ్ళతో మాట్లాడతాను” అన్నాడు మృదువుగా దగ్గరికి తీసుకుని.
పెళ్ళికి ముందు తనింట్లో జరిగిన చర్చలు గుర్తొచ్చాయి. అప్పుడే తల్లిలో అసంతృప్తిఛాయలు కనిపిస్తున్నాయి, ఆవిడ ఆశించినట్టు కోడలు యింటిని అల్లుకుపోవడం లేదని.
ముప్పయ్యేళ్ళుగా యింటికీ వంటకీ అంకితమైపోయిన ఆవిడ అలా ఆశించంటంలో తప్పులేదు. మరి సృజన? ఇంట్లోనూ ఆఫీసులోనూ ఎంతకని చెయ్యగలడు? అందులోనూ పెళ్లైన కొత్తలో?
ఆమె పుట్టింట్లో ఇద్దరూ ఆడపిల్లలే. చదువూ, వుద్యోగం, కెరీర్ అనే పరుగులు పెట్టారు తప్ప పనులమీద పెద్దగా దృష్టి పెట్టలేదు. పెళ్ళి చేసుకోవటంతో సరికాదు. యింకా పెద్దబాధ్యతేదో తనపైన వుందనిపించింది వాసుకి.

“ఇప్పుడది పుట్టింటికి పనికిరా?” తెల్లబోతూ అడిగింది అహల్య
“ఆఫీసులో ఏవో టెస్టులున్నాయమ్మా! రొటీన్ మారిందికదా, ఇబ్బందిపడుతోంది” అన్నాడు వాసు.
అతని మాటలింకా పూర్తికానేలేదు, విరుచుకుపడింది. “ఇప్పుడంత కొంపలంటుకుపోయే ఎగ్జామ్సేం వున్నాయి? తర్వాత రాసుకొమ్మను. పెళ్ళై అత్తగారింటికొచ్చిందా లేక హాస్టలు కొచ్చిందా?”
“తనది. టెంపరరీ పోసింగ్. ప్రొబేషన్లో వుంది. అది పూరైయి పరీక్షరాస్తే రెగ్యులరౌతుంది. కేడర్ ఎగ్జామ్స్ రాయటానికి ఎలిజిబులిటీ వస్తుంది.” నచ్చజెప్పబోయాడు వాసు.
“ఐతే?”
“వాళ్ళింట్లోనైతే శ్రద్ధ పెట్టి చదవచ్చని…”
“ఇక్కడేం కష్టమొచ్చిందట? తిని కూర్చొవడమేగా? ఆ తిండికూడా మంచం దగ్గరికే పంపించమనా?” అహల్య బైటపడిపోయింది. వాసు నిర్విణ్ణుడైపోయాడు. అది సృజన యింట్లోలేని సమయం.
ప్రసాదరావు వెంటనే జోక్యం చేసుకున్నాడు. “వాసూ! నీకెలా మంచిదనిపిస్తే అలాగే చెయ్యి, నువ్వేం చిన్నవాడివికాదు. పెళ్ళైనవాడివి. అన్నిటికీ మమ్మల్నడగడం దేనికి?” అన్నాడు. |
వాసు తలొంచుకుని వెళ్ళిపోయాడు. ఈ పరిస్థితుల్లో సృజనని కొంతకాలం తల్లికి దూరంగా పంపటమే ఉత్తమమనిపించింది. లేకపోతే మనసులు విరుగుతాయి. తన లేడీకోలీగ్స్‌లో అత్తలంటే కోడళ్ళకీ , వీళ్ళంటే వాళ్లకీ ఎంత ద్వేషమో అతనికి తెలుసు. తనింట్లో కూడా అంతేనా? దిగ్ర్భాంతిగా వుంది.
“అహల్యా! నువ్వేం మాట్లాడుతున్నావో మతుండే మాట్లాడావా?” భార్యని మందలించాడు ప్రసాదరావు. అతనికి కోడల్ని చూస్తే ముచ్చటవేస్తుంది. పిజీ చదివి, కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌లో నెగ్గుకొచ్చి వుద్యోగం సంపాదించుకుంది. వాసూ, హరీ, స్నేహలకీ ఆ అమ్మాయికీ తేడా కనిపించదు. మరి అహల్యలో ఎందుకామెపట్ల ద్వేషం మొదలైంది? సాంప్రదాయిక వైరమా లేక అసూయా?
భర్త మందలింపుతో తనని తను నిగ్రహించుకుంది.అతనిముందు తన అసంతృప్తిని పరిచింది. “ఇదేమిటి? కోడలోస్తే నాకు కొంత ఆసరా ఔతుందనుకున్నాను. ఓ కొడుకుని నాకు దూరంగా తీసుకుపోవటమా, తను నాకు చేసే సాయం?” అంది.
అతను చిన్నగా నవ్వాడు. “”ఎదుటివారినుంచీ ఆశించడం, వాళ్ళకి మనం ఏదో యివ్వాలనుకోవటం – యీ రెండూ చాలా సమస్యల్ని సృష్టిస్తాయి అహల్యా! కోడలు తీసుకోవడానికి నీకున్న బాధ్యతలేమిటి? ఆ అమ్మాయికి లేనివేమిటి? చేతిలో పనందుకుని నిన్ను కూర్చోబెట్టిచెయ్యాలనుకుంటున్నావు …తను చేసేవిధంగా నువ్వు చేయించుకుంటావా? కెరీర్ అనే కేంద్రకం చుట్టూ తిరిగే ఆ పిల్లకి ఇంత ఇల్లూ, ఇన్ని సామాన్లూ, పనులూ అవసరం లేదు. ఏదో ఇంత వండుకు తిని ఆఫీసుకి పరిగెత్తటం తిరిగొచ్చాక వోపిక వుంటే మళ్ళీ వంట…లేకపోతే బయటతినటం…”
“తనొక్కతేనా, ఉద్యోగం చేస్తోంది? ” మధ్యలోనే ఆపి వుక్రోషంగా అడిగింది. “ఏదో ఒక ఉద్యోగం వుంది. ప్రమోషన్లనీ వాసు చూసుకుంటాడు. ఆడపిల్ల తనకెందుకవన్నీ?””
ప్రసాదరావుకి నవ్వూ, కోపం రెండూ వచ్చాయి. భార్యది అజ్ఞానమో, మూర్ఖత్వమో అర్ధమవలేదు. తన అడుగులకి మడుగులొత్తడానికి కోడలు ప్రమోషన్లు వదులుకుని కూర్చోవాలని ఆశిస్తోంది.
“చచ్చేదాకా ఈ చాకిరీ నాకు తప్పుదులెండి. అదేగా మీరు చెప్పేది? ఆవిడగారు సింగారించుకుని ఆఫీసుకు వెళ్లి కూర్చుంటుంది. నేనేమో అన్నీ అమర్చిపెడతాను” అంది తనే మళ్ళీ.
ప్రసాదరావు సూటిగా చూసాడామెని “ఎవరికి చేస్తున్నాను నువ్వు ? నీ కుటుంబానికి చేస్తున్నావు. నీ భర్తకీ పిల్లలకీ చేస్తున్నావు. నీ బాగుకోసం చేస్తున్నావు. ఎవరో బైటిపిల్ల నీ యీ బాధ్యతలన్నీ నెత్తిన వేసుకోవాలనే కోరికేంటో నాకు తెలీడం లేదు… అహల్యా! ఇంట్లోవుండి నువ్వేదో కష్టపడిపోతున్నాననుకుంటున్నావు. వుద్యోగంతో నేనూ విసిగిపోయాను. పెళ్ళి పిల్లలు,కుటుంబం – అనేవి నీ స్వేచ్చని ఎలా అరికట్టాయో, నా విషయంలోనూ అంతే చేసాయి… అహల్యా! నువ్వే ఈ పనులు చెయ్యాలనిగానీ, యిలాగే చెయ్యాలనిగానీ, నీ పుట్టింటికీ, అన్నదమ్ముల దగ్గరికీ వెళ్ళరాదనిగానీ నేనెప్పుడూ నిర్దేశించలేదు. నీకు నువ్వే కొన్ని స్టాండర్డ్స్ పెట్టుకున్నావు. కొన్ని బంధాలు వేసుకున్నావు. ఈ పనులు యీ పద్ధతిలోనే చేస్తాననుకున్నావు. నువ్వెళ్తే యిక్కడంతా అస్తవ్యస్తమౌతుందేమోనని భయపడ్డావు…. నీ జీవితాన్ని నీకు తోచినట్లు గడిపావు. అలాంటి స్వేచ్ఛని సృజనకీ యివ్వు. నువ్వు యివ్వకపోయినా వాళ్ళ స్వేచ్చని వాళ్ళు వదులుకోరు. మరో విషయం. పిల్లలకి పెళ్ళిళ్ళు చేసేది మన అహాలని నిలబెట్టుకోవడానికి కాదు, వాళ్ళ జీవితాలు అర్థవంతంగా వుండటానికి. వాళ్లమధ్య అనుబంధాన్ని పెరగనీ. వాసునిబట్టి నువ్వుగానీ నిన్నుబట్టి వాసు కాదు. తొందరపాటుతో తెగేదాకా లాగకు.” అనేసి ప్రసాదరావుకూడా వెళ్ళిపోయాడు.
లోపల స్నేహ, హరితో అంటోంది. “వదిన పాపం మంచిది కదన్నయ్యా! నేనేవో సమ్స్ అడిగితే చాలా బాగా చెప్పింది. అమ్మెందుకని యిలా మారిపోయింది? మననేమో చదువు చదువని అంటుంది. వదిన చదువుకుంటుంటే యిలా మాట్లాడుతోంది”
“పెళ్ళయ్యాక చదువులూ, ఎగ్జామ్సు అంటే ఎలా కుదుర్తుందే? చిన్నపిల్లవి నీకు తెలీదివన్నీ.అమ్మ… మనకోసం ఎంత కష్టపడ్తోంది? ఆమెనలాగే కష్టపడమని ఎవరిదారిన వాళ్ళు వెళ్ళిపోతే ఎలా?” అన్నాడు హరి అసహనంగా. అన్నీ కృత్రిమమైన బంధాలు, బాధ్యతలు. ఎవరిదారిన వాళ్ళు సుఖపడ్డం చాతకాక, ఒకళ్ళ పరిధిలోకి మరొకరు చొరబడిపోయి అంతా కలగాపులగం చేసుకోవటం. కోడలొచ్చి తనకి ఆసరా యిస్తుందనే కోణంలోంచీకాక, కన్న ముగ్గురు పిల్లల్నీ లైఫ్ లో సెటిల్ చేసేస్తే తనకి విముక్తి అనే దిశగా అహల్య ఆలోచించి వుంటే యీ అసంతృప్తి వుండేదికాదు.

ఆరోజు సాయంత్రమే వాసు సృజనని పుట్టింట్లో వదిలి వచ్చాడు. రాత్రి ఇంట్లో తల్లితో సరదాగా మాట్లాడలేకపోయాడు. అప్పటిదాకా ఆమెపట్ల అతనికిగల వున్నతాభిప్రాయాలు మూలాలలో కదిలాయి. అమ్మ పెద్దగా చదువుకోలేదు. నలుగురిలోకి వెళ్ళలేదు. అంతేకాదు, తన పిల్లలకి అన్నీ అనువుగా చేసిపెట్టుకుని, ప్రతిక్షణం వాళ్ళు పైకి పోవాలని ఆకాంక్షించిన ఆమే మరో తల్లి కూతురైన సృజనని తన సంతానంలో కలుపుకోలేకపోతోందని అనిపించింది. ఏమిటి, మగవాడు పెళ్లి ద్వారా పొందేది? భార్య సంతోషంగా వుంటేనే అతడి నిజమైన ఎదుగుదల. కానీ సృజన ఆకాంక్షలు తల్లికి పట్టవు. ఇద్దరికీ సమన్వయం లేదు. ఏది తన నిజమైన కుటుంబం? తల్లి తండ్రి నిర్మించుకున్న కుటుంబంలో తనూ, సృజనా భాగమా లేక తామిదరూ వేరే కుటుంబమా అనేది తెలుసుకోవలసిన పరిస్థితి. తల్లిదండ్రుల కుటుంబంలో తాము భాగమైతే తమ కోరికలకీ ఆకాంక్షలకీగల విలువేంటి? క్రాస్‍రోడ్స్‌లో వున్నట్టనిపించింది వాసుకి. అన్నయ్య మారిపోయాడనుకున్నాడు హరి తనవరకూ తను. వాసుతో ఫ్రీగా మాట్లాడలేకపోయింది స్నేహ.
ఆ రాత్రి అహల్యకి సరిగా నిద్రపట్టలేదు. ఎన్నో ఆలోచనలు! తన మాట కాదని వాసు సృజనని పుట్టింట్లో దింపి రావటం తన అధికారపరిధికీ వాళ్ల స్వేచ్ఛకీ హద్దుగీత గీసినట్టనిపించింది… ఇంకా? సృజన తిరిగొచ్చాక కూడా తన విషయంలో పెద్దగా మార్పేదీ వుండదన్న విషయం లీలగా స్ఫురించింది అహల్యకి. ఈ టెస్టు పాసౌతుంది. ఇంకా కొన్ని టెస్టులు ఎదురుచూస్తుంటాయి. అవి రాస్తుంది. ప్రమోషన్లు వస్తాయి. కెరీర్… దాన్ని నిరంతరం ముందుకి తీసుకెళ్లాలి. ఈ మధ్యలో ఎప్పుడో తీరిక చేసుకుని ఓ పాపనో బాబునో కంటుంది. ఆ పాపోబాబో పెద్దై స్కూలుకెళ్ళేదాకా
తమతో కలిసుంటారేమో! అదేనా తను మంచిగా వుంటేనే, లేకపోతే వేరే వెళ్ళిపోతారు. పిల్లల్ని పెంచడానికి తను కాకపోతే ఆమె తల్లివుంది. అంతేనా, యీ పెళ్ళినుంచి తాను పొందబోయేది? తలుచుకుంటే గుండె చిక్కబట్టినట్టింది. అహల్య కళ్ళలోంచి నీళ్ళు జారిపడ్డాయి.
పక్కమంచం మీద వున్న ప్రసాదరావు గమనించాడు. “”వాసు పెళ్ళికి ముందు నీకెలాంటి కష్టాలు వుండేవి కాదనుకుంటా. నువ్వేడవడం నేనెప్పుడూ చూడలేదు” అన్నాడు వ్యంగంగా… అహల్య తీవ్రంగా గాయపడింది.
సృజన తోడులేకపోవడం వాసుకి వెల్తిగా అనిపిస్తోంది. ఆమె ఎప్పుడు తిరిగొస్తుందా అనే ఆత్రం అతన్ని నిలవనివ్వటం లేదు. అత్తగారింటికి చక్కర్లు కొడున్నాడు. అలావెళ్ళినప్పుడు ఒకొక్కసారి అక్కడే భోజనం చేసి వస్తున్నాడు. అది అహల్య అసహనాన్ని పెంచుతోంది. పెళ్ళవడంతో కొడుక్కి కొత్త బంధం ఏర్పడి, కొత్త బాధ్యతలు వచ్చాయని అనిపించటం లేదామెకి. అంతేకాదు, తమ కుటుంబం యొక్క సంస్కారాన్ని వియ్యాలవారింట్లో అందంగా ప్రెజెంట్ చేయటం అతనిద్వారా మాత్రమే సాధ్యమని కూడా. మగవాడు సాంప్రదాయిక భర్త స్థాయినుంచి స్మార్ట్ జీవితభాగస్వామిగా ఎదగడాన్ని కూడా ఆమె గుర్తించడం లేదు. అసలా ప్రక్రియ ఒక్కొక్క తరంలోనూ కొద్దికొద్దిగా జరుగుతూ వస్తోంది. ఏ తరం తల్లికి ఆ తరానికి తన కొడుకు మారిపోయినట్టనిపిస్తోంది. తమ భర్తల్లో వచ్చిన మార్పు మాత్రం వాళ్ళు గుర్తించడంలేదు. అహల్య దీనికి మినహాయింపుకాదు…
సృజన తల్లితో అత్తవారింటి గురించి చెప్పింది.
“ఇప్పుడే చేసుకోనంటుంటే వినకుండా పెళ్ళిచేసేసారు” అని ,”ఆవిడకేమిటో నా వునికే యిష్టం లేనట్టుంది. నేనేం చేసినా తప్పే కనిపిస్తుంది.నేను చేసే పనులతో సంతృప్తి లేదు. వాసుకి నాగురించి ఏవోచెప్తుంటుందనుకుంటా. ఒక్కొక్కసారి అతను మూడీగా వుంటాడు. ఎందుకమ్మా, అంత యిష్టం లేకుండా పెళ్ళిచెయ్యడం?” అంది
“పెళ్ళవగానే ఆడపిల్ల పరాయిదౌతుందని బాహాటంగా వప్పుకుంటాం. మగవాడి విషయంలో కూడా అదే నిజమైనా అలా వప్పుకోలేరు. అతనింకా తన కొడుకే, తన చెప్పుచేతల్లోనే వుండాలని ఆశిస్తారు. క్రమంగా అర్థమౌతుంది. అప్పటిదాకా సంఘర్షణ తప్పదు. నువ్వు కూడా సర్దుకుపోవాలి” అంది సృజన తల్లి.
ఆవిడా అత్తచేతుల్లో ఆరళ్ళుపడ్డదే. ఆవిడ అత్త కొడుకు సమక్షంలో ఒకలా పరోక్షంలో మరొకలా ప్రవర్తించేది. ఇదంతా యిద్దరు స్నేహితుల మధ్యకి మూడోవ్యక్తి ప్రవేశంలాంటిది. ఆ మూడో వ్యక్తిని ప్రేమించడానికి కొంతకాలం పడుతుంది. ఒక్కొక్కసారి అలా ప్రేమించబడకుండానే జీవితమంతా గడిచిపోవటంకూడా జరుగుతుంది. వాసు ప్రేమపట్ల సృజనకెలాంటి సందేహం లేదు. కానీ దానిమీద అత్తగారి ప్రభావంఎంత వుంటుందనేదే ఆమెని భయపెడుతుంటుంది.
ఆఖరి పరీక్ష అవగానే తనే వెళ్ళి సృజనని తీసుకొచ్చేసాడు వాసు.
“మంచిది చూసుకుని మేమే తీసుకొచ్చి దింపుతాం” అని సృజన తల్లితండ్రులు చెప్పినా వినలేదు. ఇంకొక్క క్షణంకూడా ఆమెని వదిలిపెట్టి వుండలేని స్థితికొచ్చేసాడు.
ఇంటికి రాగానే అహల్య అననే అంది. “”ఏమ్మా మీవాళ్ళకి సాంప్రదాయం, పద్ధతి ఏమీ తెలీవా? లేకపోతే అలాంటి పట్టింపులేం లేవా? మొదటిసారి వెళ్ళావుకదా, పెద్దవాళ్ళువెంటబెట్టుకుని రావాలన్న కనీసపు మర్యాద కూడా లేదా?” అని
“మీ అబ్బాయే వద్దన్నారండీ!”” సృజన మామూలుగా అనేసింది.
అహల్య అహం దెబ్బతింది. విసురుగా వెనక్కి తిరిగి లోపలికి వెళ్ళిపోయింది. సృజన మనసు ముడుచుకుపోయింది. వాసు చిన్నబోయాడు.
“వదినా!” అంటూ వుత్సాహంగా రాబోయిన స్నేహ ఆగిపోయింది.
ఈ పరిస్థితంతా చూసాక ప్రసాదరావు ఒక కచ్చితమైన నిర్ణయానికి కొచ్చాడు.

“ఇప్పుడు లీవెందుకు పెట్టారు?” ఆశ్చర్యంగా అడిగింది అహల్య.
“కొద్దిరోజులు అందరిళ్ళకీ తిరిగొద్దాం. నువ్వూ అనుకుంటున్నదేగా?”“ జవాబిచ్చాడు ప్రసాదరావు. అహల్య మొదట అపనమ్మకంగా చూసినా, అతను ప్రయాణపు ఏర్పాట్లు చూస్తుంటే నమ్మక తప్పులేదు.
“కొద్ది రోజులు మనం బైటికి వెళ్ళొస్తే సృజనకి బాధ్యత తెలుస్తుంది. ఈ యిల్లు తనదికూడాననే ఆలోచన కలుగుతుంది.” అనికూడా అన్నాడు ప్రసాదరావు. ఈ యిల్లు సృజనదా? తనింత కష్టపడి అభివృద్ధి చేసినది? ఇంత అనుబంధం పెంచుకున్నది? అహల్యకి గుండెల్లో ఎక్కడో వాడిగా గుచ్చుకుంది. ప్రసాదరావు నిట్టూర్చాడు.
కొడుకు పెళ్ళవ్వాలి. కోడలు రావాలి. ఆ కోడలు అతన్ని సుఖపెట్టాలి . అత్తిల్లే లోకంగా బతకాలి కానీ ఆమె ఆయింట్లో భాగం కాదు. పరాయిదే. ఎక్కడినుంచో వచ్చినదే. ఎవరింటికో చెందినదే. ఆమెదంటూ ఏదీ వుండకూడదు… భార్య ఆలోచనలు యీ స్థాయిని దాటవనిపించిందతనికి.


ఒక్కొక్కరింటికీ వెళ్తూ వుంటే ప్రపంచానికి సంబంధించిన కొత్త ద్వారం తెరుచుకుంటున్నట్టనిపిస్తోంది అహల్యకి. ఇదివరకూ కూడా వాళ్ళతో బంధుత్వాలున్నాయి, రాకపోకలున్నాయి. కానీ యిప్పుడు మొదలైనది కొత్త విశ్లేషణ. అందరిళ్ళలోనూ వాసుకి సమవయస్కులైన పిల్లలున్నారు.
ఒక్కొక్కరిది ఒక్కో సమస్య.
ప్రసాదరావు అన్నకొడుకు సింధీ అమ్మాయిని ప్రేమించాడట. పెళ్ళి చేసుకుంటానన్నాడట.
“అలా ఎలా కుదుర్తుంది? కులం, గోత్రం, సాంప్రదాయం…” అని వీళ్ళంటే-
“నాలాగే బీటెక్ చదివి, నాతోపాటే జాబ్ చేస్తున్న అమ్మాయైతే ఇద్దరం ఒకే చోట చేసే వీలుంటుంది. అంతేగానీ మీరు అన్ని లెక్కలూ వేసి తీసుకొచ్చేదాంతో అలా ఎలా కుదుర్తుంది? ఐనా పెళ్ళిచేస్కునేది నేను, కాపురం చేసేది నేను. నాకు వీలుగా వుండాలా, మీకా?” అన్నాడట.
“అదికాదురా! ఆంధ్రాలో మాత్రం వీడిపాటి చదువుకున్న అమ్మాయిలు లేరంటావా? వాళ్ళు ముంబైలో వుద్యోగాలు చెయ్యట్లేదంటావా? వీడికా సింధీపిల్ల వచ్చింది… అంతే” తమ్ముడితో చెప్పుకుని బాధపడ్డాడు ప్రసాదరావు అన్న.
“కులాలు మతాలు అర్థాలు మారిపోయాయేమోలే అన్నయ్యా! కొత్త నిర్వచనాలు చెప్పుకోవలసి వస్తోంది. డాక్టరు చదివిన కుర్రాడు డాక్టర్నే చేసుకోవాలనుకుంటున్నాడు. ఇంజనీరు మళ్ళీ యింజనీరునే. కంపాటిబులిటీ కోసమేమో!” అన్నాడు ప్రసాదరావు సర్దిచెప్పుతూ.
“ఈయనెప్పుడూ పిల్లల పక్షమే” అంది అహల్య. ప్రసాదరావు నవ్వాడు.
అక్కడినుంచీ అహల్య అక్కగారింటికి వెళ్లారు. ఆవిడ కూతురూ, అల్లుడూ అమెరికా వెళ్తున్నారట. ఆ సంతోషం అక్కలో కనిపించలేదు అహల్యకి.
“నా కూతురని చెప్పుకోవడానికే సిగ్గుగా వుందే అహల్య! మావారి మేనత్త కొడుక్కేగా దాన్నిచ్చినది? బైటి సంబంధం కూడా కాదు. ఆవిడకేమో మడి, ఆచారం. దీనికి ఆవిడ వునికే గిట్టదు. ఇప్పుడా పెద్దావిడ్ని వదిలేసి అమెరికా వెళ్తున్నారు. పాపం! ఆవిడెంత బాధపడ్తోందో!” అంది.
ఆమె కూతుర్ని కదిలిస్తే, ““ఇప్పుడు మా అత్తగారికేం తక్కువ చేసామని పిన్నీ? ఓపిగ్గా వుంది. మడి కట్టుకుని వండటం నావల్లకాదు. నాకు నచ్చని, నాకు నమ్మకం లేని ప్రిన్సిపుల్స్ నేను పాటించలేను. ఆవిడ వంట ఆవిడ చేసుకుంటారు. ఆవిడ సిద్ధాంతాలని ఆవిడ నిలబెట్టుకుంటున్నారు… ఇంక అమెరికా అంటావా, వెళ్ళక యిక్కడే వుండి మేం చేసేదేముంది? ఆవిడ్నీ తీసికెళ్తామన్నాం రానంది. అమ్మానాన్నలు ఆవిడ్ని తమ దగ్గరికి పిలిపించుకోవచ్చు. వాళ్ళు పిలవరు. ఎందుకంటే యిది వాళ్ళకి అక్కర్లేని బాదరబందీ. ఒకవేళ వాళ్ళు పిల్చినా ఆవిడ వెళ్ళదు. మగపిల్లాడి తల్లినని ఇగో. మేం మాత్రం అవసరంలేని త్యాగాలు చెయ్యాలి…” అంది.
ప్రసాదరావు పొయెటిక్ జస్టిస్ అన్నాడు. పిల్లలు త్యాగాలు చెయ్యాలని తాము కోరుకుంటున్నారా అనేది అహల్యకి అర్ధమవలేదు.
అహల్య అన్న యింట్లో మరోరకం సమస్య. కొడుకూ కోడలూ దెబ్బలాడి వేరుపడ్డారట. అన్నగారు దాన్ని తాత్వికంగానే తీసుకున్నా, “ఎదిగిన పిల్లలు ఎంతకాలం మనని అంటి పెట్టుకుని వుంటారు? వాళ్ళకీ మనకీ యింటరాక్షన్స్ ఆగిపోయాక కూడా కలిసెలా వుంటారు? ఎక్కడ యింటరాక్షన్స్ వుంటాయో సహజంగానే అటువైపు ఆకరించబడతారు” అని ఫిలాసఫి మాట్లాడినా, అహల్య వదినమాత్రం తన బాధని దాచుకోలేకపోయింది.
“ఎంత అపురూపంగా పెంచానే అహల్యా వాడిని? అలాంటిది నామాట విషమైంది. భార్య బెల్లమైంది” అంది.
“బావుందే, నువ్వు చెప్పేది. రేపెప్పుడో కోడలొచ్చి వేరుచేస్తుంది, దానికోసం నా కొడుకుని నేనెందుకు అపురూపంగా పెంచాలనుకుంటారా ఏమిటి, ఎవరేనా?” అని అన్నగారంటే అహల్యకి నవ్వొచ్చింది. కానీ వదిన బాధపడ్తుందని ఆపుకుంది.
“రోలొచ్చి మద్దెలతో మొరపెట్టున్నటుందిలే బావా! మాయింట్లోనూ ఓ కోడలుంది. వాసుమీది పెత్తనం వదులుకోవడానికి యీవిడ సిద్ధంగా లేదు. విసుర్లు, కసుర్లు… ” ప్రసాదరావు నోరిప్పాడు.
నిజమా అన్నట్టు చూసారు అహల్య అన్నావదినలు. అహల్య చిన్నపిల్లే అయింది. కళ్ళలో నీళ్ళు నిలిచాయి. “నేను చేస్తున్నది తప్పని నాకే తెలుస్తోందన్నయ్యా. కానీ వాడిమీది ప్రేమ…. వాడు నాకు దూరమౌతాడేమోనన్న బెంగ… నన్ను వుక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. పైగా యీయనకూడా ఆ పిల్లవైపే మాట్లాడతారు. నన్నర్థంచేసుకోరు.” అంది.
విషయం కొంత సీరియసేనని అర్థమైంది అహల్య వదినకి. “”సరే! ఈవిషయాలన్నీ తీరిగ్గా మాట్లాడుకుందాం. ముందు స్నానాలు చేసి, భోజనాలకి లేవండి” అంది మాటమార్చి.
వీళ్ళు వచ్చినట్లు కొడుక్కి ఫోన్ చేసింది అహల్య వదిన. అతను భార్యనీ కొడుకుని తీసుకుని మేనత్తమామల్ని చూడటానికొచ్చాడు. అతని ప్రవర్తనలో ఎలాంటి లోపమూ కనబడలేదు అహల్యకి. సాయంత్రందాకా వుండి వెళ్ళిపోయారు.
ఆ రాత్రి వదినా మరదళ్ళు చాలాసేపు మాట్లాడుకున్నారు.
“ప్రఫుల్ పెళ్ళైన కొత్తలో నేనెంత సిల్లీగా ప్రవర్తించానో తలుచుకుంటే నాకే సిగ్గనిపిస్తుంది అహల్యా! పెళ్ళితో వాడికొక వ్యక్తిగత జీవితం ఏర్పడింది. అందులోకి నాకు ప్రవేశం లేదు. వాడు నాకు దూరమయాడనిపించి, అసూయతో రగిలిపోయేదాన్ని. కోడలిమీద అకారణ ద్వేషం చూపించేదాన్ని” అహల్య వదినగారి అనుభవాన్ని నిశ్శబ్దంగా వింది.
“వాళ్ళిద్దరి విషయాల్లో అనవసర జోక్యం చేసుకునేదాన్ని. ఇంతలో మీనా ప్రెగ్నెంటవడం, బాబు పుట్టడం జరిగింది. వాడు… నామనవడు నా కొడుకురక్తం… నా భర్త రక్తం… ఇలా అనుకుంటుంటే నామనసు వుప్పొంగిపోయేది. వాడిని ఒక్కక్షణం కూడా వదిలి పెట్టి వుండలేకపోయేదాన్ని. వాడి పనులన్నీ నేనే చేసేదాన్ని. మీనా వాడిని సరిగా ఎత్తుకోలేదేమో! పెంచట్లేదేమో! ఇలాంటి ఆలోచనలొచ్చేవి. రాత్రివేళవాడు కాస్త కంయిమంటే చాలు, వెంటనే లేవలేదని మీనామీద కోపం వచ్చేది. పొద్దున్న లేవగానే అంత మొద్దు నిద్రేమిటని కోప్పడేదాన్ని. అహల్యా! అది చాలా మంచి పిల్లగాబట్టి ఎంతో ఓర్చుకుంది”
“…”
“భార్యని అపురూపంగా చూసుకుని ఆమెని గౌరవించి, ఆమె అభిప్రాయాలని మన్నించేవాడిని ఎంతో వున్నతంగా భావిస్తాం. మన భర్తలు అలా వుండాలని ఆశిస్తాం. కానీ కొడుకలా వుంటే వోర్వలేం. కొడుకు ఎప్పటికీ కొడుకుగానే వుండిపోవాలని మన కోరిక. అతను ప్రేమికుడిగా, చక్కటి భర్తగా, తండ్రిగా ఎదుగుతూ వుంటే సహించలేం…ఏదో ద్రోహం జరిగిపోయినట్టు బాధపడతాం. అహల్యా! ఆఖరికి ఒకరోజు మీనా బయటపడింది . ప్రఫుల్‍ని నిలదీసి అడిగింది-
మనకంటూ పర్సనల్ లైఫ్ లేదా? ప్రతి విషయంలోనూ ఆవిడెందుకు తలదూర్చడం?తొమ్మిదినెలలు మోసి కన్నదాన్ని, నాకొడుకుని నేను పెంచుకోలేనా? – అని.
ప్రఫుల్‍కి కూడా నా పద్ధతి నచ్చనట్టే వుంది. మొదట్లో సున్నితంగా చెప్పేవాడు. తర్వాత పెద్ద దెబ్బలాటే అయింది. వాళ్ళని వేరే వెళ్ళిపొమ్మన్నారు. మీ అన్నయ్య.”
“అదేంటొదినా! మనవలు మనకి మాత్రం ముద్దుకాదా? వాళ్ళని దగ్గరికి తియ్యడం తప్పా?” చప్పున అడిగింది అహల్య.
“నేనిదే ప్రశ్న మీ అన్నయ్యని అడిగాను. ఆయన తప్పనే అన్నారు. తల్లితండ్రుల తర్వాతే ఎవరేనానట. భార్యాభర్తల మధ్య, తల్లితండ్రులకీ పిల్లలకీ మధ్య అనుబంధాలు పెరిగితేనే స్వచ్ఛమైన కుటుంబబంధాలు ఏర్పడతాయట. ఆలోచించగా నాకూ అదే నిజమనిపించింది. పుట్టిన పిల్లవాడు పుట్టినట్టే తల్లివడిలో వుండిపోడు. పారాడుతూ దూరం జరుగుతాడు. అదే ఎదుగుదల. మనకి వాళ్ళే ప్రపంచం కావచ్చునుగానీ వాళ్ళ ప్రపంచంలోమాత్రం మనం ఒక భాగమే. మనం ఏ ప్రేమనైతే వాళ్ళమీద చూపించామో, దాన్ని నేర్చుకుని వాళ్ళు వాళ్ళ పిల్లలమీద ప్రకటిస్తారు.”
“మరి మనం?”
“నాకు మీ అన్నయ్యా, నీకు ప్రసాదూ లేరా?”
“అంటే పిల్లలకి పెళ్ళిళ్ళు చేస్తే మనకి మిగిలేది యిదేనా?”
“ఏమీ మిగలకపోవటమేమిటి? నువ్వు పెళ్ళి చేసుకున్నావు. వాసు పుట్టాడు. మిగిలిన యిద్దరూ పుట్టారు. వాసు పెళ్ళైంది. వాళ్ళకీ పుడతారు. మనం పెర్పెచ్యువేట్ కావటం లేదూ? అదంతా మిగులేగదమ్మా?”
అహల్య నిశ్శబ్దంగా ఏడ్చింది. చాలాసేపు ఏడ్చింది. ఏదో బాధ… ఏదో ఆవేదన…. ఇంకేదో ఆర్తి… అన్నీ బహిర్గతమయ్యాయి. ఆ తర్వాత మనసు వెల్తిపడింది.
“ఎందుకు ఏడుస్తావు, అహల్యా! మగవాళ్ళలా అంటీముట్టనట్టు వుండేలా మనని పెంచరు. అనుబంధాలూ, ప్రేమా అంటూ రంగరించిపోస్తారు. సృష్టికి మనమే ఆధారమని అభూతకల్పనలు చేస్తారు. అవన్నీ నిజమేనని నమ్మి ఆరాటపడతాం. కానీ జీవితంలో ఒక్కొక్క మెట్టూ దాటుతుంటే అర్థమౌతుంది, మనదంటూ ఏదీ లేదని. పెళ్ళిచేసుకోవటం, పిల్లల్ని కనటం, వాళ్ళని చక్కగా పెంచటం-అక్కడితో మన బాధ్యత తీరుతుంది. ఆ తర్వాత?”” అని ఆగింది అహల్య వదిన.
“ఆ తర్వాత?”” అప్రమేయంగా అడిగింది అహల్య.
“మనం దాటిన స్టేజిలన్నీ మన పిల్లలు దాటుతారు. అది మనం చూస్తాం. అందులో మనం ఒరిపిడి పడక్కర్లేదు. ఎవరి జీవితం వాళ్ళదనుకుంటే సరి… ఏ అత్తా తన కోడలు మంచిదనిగానీ ఏ కోడలూ అత్త మంచితనాన్నిగానీ వప్పుకోదు.ఇది కొత్తగా వచ్చినది కాదు. ఉమ్మడి కుటుంబాలలోనూ వుండేది. దీన్ని సాంప్రదాయక వైరం అంటారు. కానీ నువ్వే ఆలోచించు. తను పెరిగిన వాతావరణాన్ని, తనవాళ్ళని, అక్కడ తనకుండే స్వేచ్ఛాస్వతంత్రాలని వదులుకుని జీవన శైలిని సైతం మార్చుకోవడానికి వచ్చిన పిల్లకి మనం ఏపాటి సహకరిస్తున్నామో! కావాలంటే ఆమెమీద ఆంక్షలు పెడతాం. సాంప్రదాయాన్ని రుద్దుతాం. కానీ ఆంక్షలూ, సాంప్రదాయాలూ ప్రేమని పుట్టించవు. కుటుంబాలను నిలబెట్టవు. మనుషులని కలిపి వుంచవు” అంది.
అహల్య ఆలోచనలో పడింది.
అవతలి గదిలో ప్రసాదరావు బావమరిదితో అంటున్నాడు “మాకోడలు… సృజన చాలా తెలివైన పిల్ల. నాకా అమ్మాయిని చూస్తే చాలా ముచ్చటగా అనిపిస్తుంది బావా! మంచికల్చరున్న కుటుంబంలోంచి వచ్చింది. వాసుకి చక్కటిజోడీ. కానీ అహల్య ప్రవర్తనే సరిగా లేదు. వాసు పెళ్ళయేదాకా తనేగా, యింట్లో అన్ని పనులూ చేసుకునేది? ఇందరికోసం వంట సునాయాసంగా చేసేది. మేం సాయం చేయబోయినా చెయ్యనిచ్చేది కాదు… అలాంటిది… ఇప్పుడా అమ్మాయితో వంతుపోతోంది… సూటిపోటి మాటలంటోంది. అసహనంతో రగిలిపోతోంది. తను వాసునించి ఏం ఆశిస్తోందో తెలీదు. వాడు పెళ్ళికి ముందులాగే తన చుట్టూ తిరగాలనుకుంటోందా? సృజనని పట్టించుకోవద్దనుకుంటోందా? ఇంట్లో యిదివరకులేని అశాంతి యిప్పుడు చోటుచేసుకుంది.”
ఆయన సుదీర్ఘంగా నిశ్వసించాడు. “ఒక కొత్త వ్యక్తి యింట్లోకి ప్రవేశించగానే కలతలు మొదలు. వాటిని కలతలని అనడంకన్నా సర్దుబాటు సమస్యలనో యిగోప్రాబ్లమ్సనో అనటం సబబేమో ప్రసాద్! ఆడవాళ్ళకోసం వంటింటిని సృష్టించి, దానికి వాళ్లని పట్టాభిషిక్తులని చేసినది ఒకప్పుడు మనమే. ఇప్పుడు వాళ్ళని డ్రాయింగ్ రూమ్ దాకా తీసుకురావాల్సిన బాధ్యత కూడా మనదే… కోడలు పరాయిదనే కోణంలోంచీ ఆలోచిస్తే సమస్య కొంచెం జటిలంగా అనిపిస్తుంది. మన పిల్లల్లాంటిదే అనుకుంటే, మన పిల్లలనుంచీ ఎదురయ్యే సమస్యలే ఆమెనించి కూడా ఎదురౌతున్నాయని అర్థమౌతుంది. మే పెద్దవాళ్ళమయాం. ఇంకా ఎంతకాలం మీమాట వినాలి? – అని పిల్లలు ప్రశ్నిస్తే అది వాళ్ళ వ్యక్తిత్వవికాసంలో భాగమనుకుంటాం. కోడలుమాత్రం అలాంటిదికాదా? మరో విషయం… ఎదిగిన పిల్లల్ని స్నేహితుల్లా చూడమంటారు. కొడుకు స్నేహితుడైనప్పుడు కోడలు స్నేహితుడి భార్యౌతుంది. స్నేహితుడి భార్యపట్ల ఎలాంటి డీసెన్సీ చూపిస్తామో ఆమె పట్ల కూడా చూపిస్తే యీ గొడవలు తలెత్తవు. కానీ అదే చెయ్యలేకపోతున్నాం” అన్నాడు.
“…”
“వెనుకట ఆర్థికంగా వెసులుబాటు లేక , వ్యవసాయం, వ్యాపారం, పెద్దకుటుంబాలలో సహకారం కోసం అలాంటి కొన్ని ప్రత్యేక అవసరాలకోసం కలిసి వున్నారు. ఇప్పుడు అలాంటివేం లేవు. ఐనా కూడా మనుషులు కలిసి వుండాలంటే ప్రేమ ఒక్కటే వాళ్లని కలిపి వుంచేది. అది ఒక్కరోజులోనో, ఒక సాంప్రదాయంతోనో పుట్టేది కాదు”
ఆ తర్వాత వాళ్ళా విషయాన్నొదిలేసి టీవీ వార్తల్లో లీనమయ్యారు. అదయ్యాక రాజకీయాగురించిన చర్చలో పడ్డారు. చాలాసేపు మాట్లాడుకున్నాక ప్రసాదరావుకి సందేహం కలిగింది – ఇద్దరు ఆడవాళ్ళు వంటరిగా కూర్చున్నప్పుడు ఏం మాట్లాడుకుంటారాని. వెంటనే జవాబు కూడా దొరికింది – భర్తలమీదో, అత్తలమీదో, కోడళ్ళమీదో చెప్పుకుంటారని. ఎందుకంటే వాళ్ల అసంతృప్తి అక్కడే మొదలౌతుంది.
మరుసటి రోజు ప్రఫుల్ వచ్చాడు, అహల్యని తనింటికి తీసుకెళ్ళడానికి. “
“మీనానీ బాబునీ యిక్కడ చూసానుకదరా, మరోసారి వస్తాను”” అంది అహల్య మామూలుగా. అతను చిన్నబుచ్చుకునేసరికి బయల్దేరింది. దార్లో అన్నాడతను. “అమ్మావాళ్ళనుంచీ వేరే వచ్చేసానని కోపంగా వుండచ్చు అత్తా! కానీ ఒక్క విషయం చెప్పు. నాకు పెళ్ళిచేసారు. ఆమెని ప్రేమగా చూసుకొమ్మన్నారు. అదే నేను చేస్తుంటే అమ్మకి కోపం. నాకు యిద్దరూ ఒకటే . తల్లిదండ్రులు తమ ప్రేమనంతా మొదటిబిడ్డమీద కేంద్రీకరిస్తారు. రెండోబిడ్డ పుట్టగానే యిద్దరి మధ్యా పంచుతారు. మరోవ్యక్తి నా జీవితంలోకి వచ్చాక కూడా నేను వెనకటిలా వుండటం ఎలా సాధ్యం? మీనాని ప్రేమించడానికీ అమ్మని గౌరవించడానికీ ఏమిటి సంబంధం? రెండూ వేర్వేరు విషయాలు కావా?”” అతను వ్యక్తపరిచిన భావాలకి అహల్య నివ్వెరబోయింది. నిన్న మొన్న పెళ్ళైన ప్రపుల్‍లో ఎంత మెచ్యూరిటీ?!
అతనే మళ్ళీ అన్నాడు. “”మావైపునించీ కూడా ఆలోచించండి. మా సంపాదన ఎక్కువే. మాకుండే కంఫర్డ్స్ కూడా. ఎక్కువే. అలాగే వత్తిళ్ళు. నాన్నా, మామయ్యా వాళ్ళలాగా ఏ యిరవయ్యేళ్ళకో వుద్యోగంలో చేరితే అరవయ్యేళ్ళదాకా నిశ్చింతగా చెయ్యగలిగేవి కావు. ప్రతిక్షణం మా వుద్యోగాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేయ్యాలి. బాస్‍ని యింప్రెస్ చెయ్యాలి. కాలంతో పరిగెడ్తూ మా స్కిల్స్ పెంచుకోవాలి. నువ్వుత్త వెధవ్వి అని ఎవరేనా మొహం మీదే అన్నా నేనెలా వెధవని కాదో నవ్వుతూ వివరించగలగాలి. అదంతా ఒక కృత్రిమమైన లైఫ్. ఇంటికొచ్చాక ప్రశాంతంగా వుందామనుకుంటే అమ్మకీ మీనాకీ పడదు. ఎప్పుడూ ఏదో ఒక గొడవ. ఆ గొడవల్ని తప్పించడానికి వేరే వచ్చాను. నాకు యిద్దరినుంచీ కూడా సంతోషమేకావాలి”” అన్నాడు.
మాటల్లోనే యిల్లు చేరారు. ఇల్లు పొందిగ్గా, కళాత్మకంగా వుంది. ఆ యింట్లో ప్రఫుల్ తనెలా వుండాలనుకుంటున్నాడో అలా వుంటాడు. అతనొక ఎదిగిన వ్యక్తిలా అనిపించాడు తప్పించి మేనల్లుడిలా అనిపించలేదు. అంటే ఆత్మీయత లేదని కాదు. అదతని కొడుకుని చూడగానే పొంగివచ్చింది. వాడిని ఎత్తుకుని ముద్దు పెట్టుకుంది.

వదిన జీవితంలో వచ్చిన మార్పుని గమనించింది అహల్య. ఇదివరకట్లా చాదస్తంగా పనితో కాలాన్ని గడపడంలేదు. పూజలు కూడా తగ్గాయి. టీవీ చూస్తోంది. పుస్తకాలు చదువుతోంది. మ్యూజిక్ క్లాసులకి కూడా వెళోందట. మార్నింగ్ వాక్, యీవెనింగ్ వాక్ చేస్తోంది. ఎలాంటి జీవితం గడపాలని పెళ్ళైన కొత్తలో ఏ ఆడపిల్లేనా అనుకుంటుందో అలాంటిది గడుపుతోంది. కానీ అందులో వెల్తి వుంది. కారణం – యిప్పుడు అది ఆమె మీద బలవంతంగా రుద్దబడింది.
అహల్యకి తన గమ్యం ఏమిటో స్పష్టమైంది. అది రెండు విధాలు. తను సృజనని మరో కూతురిలా ప్రేమించగలగాలి. అప్పుడు కూడా వాళ్ళు తమ మధ్య యిమడలేకపోతే స్వేచ్ఛనివ్వాలి. వదినలా బాధపడుతూకాదు, నవ్వుతూ.