గినీ పిగ్స్ by S Sridevi

  1. వంటింటి కిటికీ by S Sridevi
  2. పగుళ్ళు by S Sridevi
  3. స౦దిగ్ధపు రహదారులు by S Sridevi
  4. కోడలొచ్చింది by S Sridevi
  5. అతనిష్టం by S Sridevi
  6. ఆమె విజేత కాదు by S Sridevi
  7. యుద్ధదృశ్యం by S Sridevi
  8. బేబీ ఆఫ్ అర్చన by S Sridevi
  9. తరంగనాట్యం by S Sridevi
  10. చిట్టికి క్షమార్పణలతో by S Sridevi
  11. ఇంకో మజిలీకి by S Sridevi
  12. అధిరోహణం by S Sridevi
  13. లివింగ్ టుగెదర్ by S Sridevi
  14. గుమ్మడి గింజలు by S Sridevi
  15. బంగారుపంజరం by S Sridevi
  16. చీకట్లో పూసిన పూలు by S Sridevi
  17. గినీ పిగ్స్ by S Sridevi
  18. మలయమారుతం by S Sridevi
  19. సార్వభౌముడు by S Sridevi
  20. అమ్మానాన్నలు by S Sridevi

“మనిషి మెదడు అనే ప్రయోగశాలలో ఏ కొత్త ఆలోచన వచ్చినా దానికి ముందు బలయ్యేది అతని పిల్లలే”” శివరావు కొడుకు ఇంట్లోంచి పారిపోయాడని తెలిసినప్పుడు అన్నాడు మాధవ్ చంద్రమోహన్తో. అతనలా అనటానికి దాదాపు నెలక్రితం వాళ్లిద్దరి స్నేహం పునరుద్ధరింపబడింది. శివరావు, చంద్రమోహన్‍కీ అలాంటి ఇంకా చాలామందికి ఆధ్యాత్మిక గురువు.
నెలక్రితం, ఆరోజు…
ఆఫీసు నుంచీ ఇంటికొస్తున్నాడు చంద్రమోహన్. ట్రాఫిక్ చాలా ఎక్కువగా ఉంది. హారన్ కొడుతూ, ఒకరినొకరు ఓవర్‍టేక్ చేస్తూ… అతనికి చాలా చికాకు తెప్పించే దృశ్యమది. జనానికి బొత్తిగా సివిక్‍సెన్సు లేకుండాపోతోంది అనుకుంటూ ట్రాఫిక్ క్లియరయ్యాక స్కూటరు ఇంటివైపు మలుపు తిప్పబోతుంటే ఎవరో వెనకనుంచీ ఓవర్‍టేక్ చేసి అతని ముందు ఆగారు, సడెన్‍బ్రేకు వేసుకుని ఆగక తప్పలేదతనికి. తీరా చూస్తే మాధవ్.
ఒకప్పుడతని క్లాస్‍మేటు. ఇద్దరూ కలిసి గది తీసుకుని ఉండి కొన్నాళ్లు చదువుకున్నారు. తర్వాత ఒకరి పద్ధతులొకరికి నచ్చక విడిపోయారు.
చాలా ఖరాఖండీగా ఉంటాడు చంద్రమోహన్. ప్రతీదీ పద్ధతిగా ఉండాలతనికి, లేకపోతే ఊరుకోడు. బాగా గంజి పెట్టి ఇస్త్రీ చేసిన తెల్లషర్టులే వేసుకుంటాడు. వాటి మీద చిన్న మరక కూడా పడకుండా జాగ్రత్తపడతాడు. ఆఫీసునుంచీ ఇంటికొస్తున్నాడంటే ఇంట్లో అందరికీ హడలే. ఇంట్లో ఉన్నంతసేపూ సరేసరి.
వాళ్ళింట్లో న్యూస్‍పేపరు అతనొక్కడే చదువుతాడు. ఇంకెవరూ దాన్ని ముట్టుకోరు. ముట్టుకుంటే దాన్ని మడతలో మడతేసి పెట్టాలి.
“పదిహేనువేలు పెట్టి ఫారిన్ గ్రాస్ వేయించాను, ట్రిమ్ చెయ్యాలని ఒక్కళ్లకీ అనిపించలేదా? పిల్లలు స్కూలునించీ వచ్చాక ఏం చేస్తారు? అదెంత పని?” అంటాడు.
“అందరిళ్లల్లోనూ డేడీ అంటే ఎంతో ఫ్రెండ్లీగా ఉంటారు, మనింట్లో ఏంటమ్మా?” అంటారు పిల్లలు. నిట్టూర్పే స్వప్న జవాబు.
పిల్లలు కొంచెం అల్లరి చేసినా సహించడు. ఎంతసేపూ చదువుకోవాలి. లేకపోతే కేరమ్స్, చెస్‍లాంటి ఆటలాడుకోవాలి. ఎగిరి, దూకి గొడవచెయ్యకూడదు. ఎంతసేపని చదువుకుంటారు? హోంవర్కు చేసేశాక బోల్డు తీరిక. ఆడుకుంటారు, దెబ్బలాడుకుంటారు. మళ్లీ కలుసుకుంటారు. వాళ్ల గొడవేదో వాళ్లు పడతారని వదిలిపెట్టడు. వాళ్లు స్పాయిలౌతారని భయం.
ఒక్కో మనిషికి ఒక్కొక్కటి ప్రధానమనిపిస్తుంది. ఇల్లు నీట్‍గా ఉండటం అవసరమేగానీ అదొక్కటే పని కాదు, స్వప్నకి. కాసేపు పిల్లల్తో అన్ని బాధ్యతలూ మర్చిపోయి కబుర్లు చెప్పాలనిపిస్తుంది. పెళ్లికిముందు సంగీతం నేర్చుకుంది తను. వాళ్లకి నేర్పించాలనిపిస్తుంది. సంగీతం అనగానే పొద్దున్నే లేచి ప్రాక్టీసు చెయ్యాలని అతని శాసనం. పొద్దున్నే పాటలు పాడుతూ కూర్చుంటే పనులెలా ఔతాయి? ఇంకా ముందు లెమ్మంటాడు. ఎంత ముందు లేవగలదు?
అతనిక్కూడా విసుగ్గానే ఉంటుంది. ప్రతీదీ వెంటపడి చేయించటమే తప్ప, భార్యగానీ పిల్లలుగానీ వాళ్లేం చెయ్యాలని తను ఆశిస్తాడో అది వాళ్లంతట వాళ్లే చెయ్యకపోవటం బాధిస్తుంటుంది.
చదువుకునే రోజుల్లో ఇంకా రిజిడ్‍గా ఉండేవాడు. సాంచీస్తూపం అనేవాళ్ళు అతన్ని. యూబ్రెయిన్ అని ఇంకో నిక్‍నేమ్. అంటే యురేనియం బ్రెయినట. యురేనియం ఎలాగైతే ఏకపక్షంగా రేడియేషన్ని వదుల్తుంటుందో ఇతనూ తన ఆలోచనల్ని వదలటమే తప్ప, ఇంకొకరు చెప్పినది వినడని. తన పుస్తకాలూ, వస్తువులూ మరొకరు ముట్టుకోవటం నచ్చేది కాదు. మాధవ్ పూర్తిగా ఫ్రీ టైపు. ఇద్దరికీ కెమిస్ట్రీ బుక్ విషయంలో గొడవ వచ్చింది. చాలా చిన్నగొడవ. మాధవ్‍కి కెమిస్ట్రీ బుక్ దొరకలేదు. తప్పనిసరై చంద్రమోహన్‍ది వాడుకునేవాడు. ఒకసారి అది చేతిలోంచీ జారిపడి అట్ట ఊడిపోయింది. చంద్రమోహన్‍గురించి తెలుసు కాబట్టి వెంటనే సారీ చెప్పి వెళ్లి బైండింగ్ చేయించుకొచ్చాడు. ఐనా అతను గొణిగేసరికి ఇంక సహించలేక గది ఖాళీ చేసి వెళ్లిపోయాడు. వెళ్లే ముందు అతనన్న మాటలు…
“ఆఫ్ట్రాల్, కొన్ని ఉమ్మడి అవసరాల కోసం కలిసుంటున్నాం. చదువుకోవటానికి వీలుగా ఉంటుందనీ, ఖర్చులు కలిసి వస్తాయనీ, ఒక ఊరివాళ్లమనీ…ఇలా ఎన్నో ఆలోచించి మనిద్దర్నీ ఒకచోట ఉంచారు మన తల్లిదండ్రులు. నువ్వేమో ఏ విషయంలోనూ సర్దుకోలేకపోతున్నావు. రేపు పెళ్లయ్యాక ఎలా కలిసుంటావురా, జీవితాంతం ఒకటిగా బతకాల్సిన అమ్మాయితో?” అని.
ఆ మాటలు గుర్తొచ్చాయి చంద్రమోహన్‍కి. మాధవ్ ఇలా కనిపించేసరికి ఆశ్చర్యపోయాడు. చదువుకునే రోజుల్లో చాలా అస్తవ్యస్తంగా ఉండేవాడు మాధవ్. వస్తువులు సర్దుకోవడంలోగానీ బట్టల విషయంలోగానీ ఇంకెందులోగానీ ఎలాంటి పట్టింపు ఉండేది కాదు. ప్రతీదీ నవ్వుతూ తీసిపారేసేవాడు. ఇప్పుడూ అదే నవ్వు. ఆ నవ్వులో అదే ఉల్లాసం. ఇంకా పెరిగింది కానీ తగ్గలేదు. అప్పుడు సన్నగా రివటలా ఉండేవాడు. ఇప్పుడు కాస్త వళ్ళొచ్చి అందంగా కనిపిస్తున్నాడు. అంతే తేడా.
“అప్పటికీ ఇప్పటికీ నువ్వేం మారలేదు” ఆరోపించాడు చంద్రమోహన్,
మాధవ్ నవ్వేశాడు. “ఇక్కడేనా, ఉండేది? శాంతికి ఇక్కడికి ట్రాన్స్ఫరైంది. ముందుగా పిల్లల్ని తీసుకుని ఇక్కడికొచ్చేసింది. ఇప్పుడు నేనూ లీవు పెట్టి ట్రాన్సఫర్‍కోసం ప్రయత్నిస్తున్నాను. పద మా ఇంటికెళాం దగ్గరే” అన్నాడు.
చంద్రమోహన్ ఇబ్బందిగా చూశాడు. “మరోసారి వస్తాను. ఎడ్రెసివ్వు” అన్నాడు.
“అర్జెంటు పనేం లేదుగా?” అడిగాడు మాధవ్ బలవంతపెడ్తూ. ద్వైదీభావంతో ఊగిసలాడాడు చంద్రమోహన్. అతన్ని తప్పించుకుని పారిపోవాలని అనిపించింది ఆరోజుని అతనన్న మాటలకి. అతనింటికి వెళ్లి అన్ని చెప్పిన అతనెలా బతుకుతున్నాడో చూడాలనీ ఉంది. రెండో కోరిక జయించింది. రెండు స్కూటర్లు మాధవ్ ఇంటి దారిపట్టాయి.
వీళ్లు వెళ్లేసరికి మాధవ్ భార్య శాంతి పిల్లల్తో షటిల్ ఆడుతోంది. విశాలమైన ఆవరణలో నాలుగ్గదుల ఇల్లు. కొద్దిగా స్థలం వదిలి కాంపౌండంతా గచ్చుచేయించారు. రంగురంగుల పువ్వుల మొక్కలున్నాయి ఆ కొద్దిస్థలంలో. మిగతా ఆవరణలో పెద్ద ఉయ్యాలా, కూర్చోవటానికి ఎల్ ఆకారంలో రెండు సిమెంటు బెంచీలు ఉన్నాయి. వాటి మధ్యగా చిన్నది సిమెంటు టీపాయ్ ఉంది. బోర్‍వెల్, దాని పక్కని పెర్కొలేషన్ పిట్ ఉన్నాయి. ఈమధ్యే కట్టుకున్నామని చెప్పాడు మాధవ్.
శాంతీ, పిల్లలూ ఆటాపి వచ్చారు. పిల్లలు చంద్రమోహన్‍కి హలో చెప్పేసి, మళ్లీ ఆడుకుందుకు వెళ్లిపోయారు.
శాంతి వీళ్లకి రెండేళ్లు జూనియరు. వీళ్ల కాలేజీలోనే చదివింది. పెద్దవాళ్లు ఆమెని చంద్రమోహన్‍కి ప్రతిపాదిస్తే అతన్ని కాదని మాధవిని ఇష్టపడి చేసుకుంది. చంద్రమోహన్‍ గురించి పెళ్లికి ముందే కొద్దిగా తెలుసు. తర్వాత మాధవ్ ద్వారా తెలుసుకుంది. ఇప్పుడిలా కలుసుకోవటం ఇద్దర్లోనూ కొద్దిగా ఇబ్బందిని రేపినా, వెంటనే సర్దుకున్నారు.
మిత్రులిద్దరూ కబుర్లలో పడ్డారు. శివరావు ప్రస్తావన కూడా వచ్చింది. అతడు మాధవ్‍కి కూడా తెలుసు. దూరపు బంధుత్వం, చంద్రమోహన్ అతనితో కాంటాక్టులో ఉన్నాడని తెలిసి, “ఇంకా అలాగే ఉన్నాడా? ఏమైనా మారాడా?” అనడిగాడు. చంద్రమోహన్ నవ్వి మాట దాటేశాడు. మాధవ్‍కి చాలా విషయాలు నచ్చవు. అతనికి నచ్చనివి తనకి నచ్చుతాయి. శివరావు అందులో ఒకటి.
శాంతి మూడుగ్లాసుల్లో షర్బత్ తీసుకొచ్చింది. వాళ్లిద్దరికీ ఇచ్చి, తనూ తాగుతూ అక్కడే కూర్చుంది. టీచరట. మాధవ్‍కన్నా మాటలపోగు. ఏవో చెప్తూనే ఉంది. ఇంకేవో అడుగుతూనే ఉంది. తమతో కూర్చుని ఇలా కబుర్లు చెప్తుంటే వంటప్పుడు చేస్తుంది, పిల్లలచేత హోమ్‍వర్కు ఎప్పుడు చేయిస్తుందనిపించింది చంద్రమోహన్‍.,ఇంతలో ట్యూషన్ మాస్టరొచ్చాడు. పిల్లలు ఎవరూ చెప్పకుండానే ఆటలు కట్టిపెట్టి పుస్తకాలు తెచ్చుకున్నారు. కాంపౌండులోనే వేరేచోటికి వెళ్లిపోయారు.
“మీరూ టీచరే కదా, మళ్లీ ట్యూషనెందుకు?” అడక్కుండా ఉండలేకపోయాడు చంద్రమోహన్.
“టీచర్నే. స్కూల్లో. ఇంట్లోమాత్రం కాదు” నవ్వింది శాంతి. “ఆరున్నరగంటలసేపు స్కూల్లో చెప్పి మళ్లీ ఇక్కడ వీళ్లకేం చెప్పగలను? అక్కడ చెప్పేది సైన్సు. వీళ్లకోసమంటే మళ్ళీ ప్రిపేరవ్వాలి”
“కానీ తల్లి చెప్తే పిల్లలు బాగా గ్రహిస్తారంటారు. మా పిల్లలకి మా స్వప్నే చెప్తుంది”
“ఇంట్లో ఉండే తల్లులు చెప్పవచ్చనుకోండి” సందిగ్ధంగా ఆగింది.
“తనూ ఉద్యోగస్తురాలే. సెంట్రల్ ఎక్సైజ్లో చేస్తుంది” అన్నాడు చంద్రమోహన్ ఆమె సందిగ్ధాన్ని గమనించి.
“రోజుకి ఏడెనిమిది గంటలు బైట గడుపుతాను. ఇంకో ఐదారు గంటలు ఇంటిపని. ఆ పైన నిద్ర. ఇంక తీరికెక్కడిది? పెయింటింగ్ నా హాబీ. రోజుకి ఒక్క గంటేనా పెయింట్ చెయ్యకపోతే ఉండలేను. ఐనా రిక్రియేషన్ లేకపోతే ఎలా?” అంది.
“వర్క్ యీజ్ వర్షిప్ అన్నారండీ! పనిలోనే ఆనందం దొరుకుతుందన్నారు” తనకి తెలీకుండానే వాదనలోకి దిగాడు. “అబ్రహం లింకనంతటివాడు తన బూట్లు తను పాలిష్ చేసుకుని అందులో ఆనందం పొందేవాడట. డిగ్నిటీ ఆఫ్ లేబర్” అని కూడా అన్నాడు. శాంతికీ మాధవ్‍కీ చాలా పెద్ద ఫ్రెండ్స్ సర్కిలుంది. ఇలాంటి వాదోపవాదాలు వాళ్లకి అలవాటే. అందుకే శాంతీ తగ్గలేదు. నిర్ద్వంద్వంగా ఖండించింది. “డిగ్నిటీ ఆఫ్ లేబరంటే ఒక దేశానికి ప్రెసిడెంటు బూట్లు పాలిష్ చేసుకోవటం కాదు. ఆయన టైం అంత విలువలేనిది కాదు. ప్రజలు ఆయన్ని ఏదో చేస్తాడని ఎన్నుకుని ఉంటారు. చెప్పులెవరేనా పాలిష్ చేస్తారు. కానీ ఆయన విధుల్ని ఇంకెవరూ చెయ్యలేరు. ఇంక ఆ పనిలో ఆనందం పొందటమంటారా, అది పూర్తిగా వ్యక్తిగతం. ఎక్కడో చదివాను బ్రిటీష్ యువరాజుకి కమోడ్స్ సేకరించడం హాబీ అని. అందరూ అలాగే సేకరించాలని కాదుకదా?” అంది.
“ఎవరి పని వాళ్లు..”
“ఎన్నని చేసుకోగలం? అనారోగ్యం వస్తే వైద్యం చేసుకోగలమా? మనిల్లు మనం కట్టుకోగలమా? మన తిండి మనం పండించుకోగలమా?”
“మన చేతిలోలేనివాటికి మనమేం చెయ్యలేం. కనీసం చిన్నచిన్న పనులేనా వేసుకోవచ్చుకదా?”
“జాకాఫ్ ఆల్ ట్రేడ్స్ అనిపించుకోవడం కన్నా కనీసం ఒక్క దాంట్లోనేనా పరిణతి పొందటం మన అవసరం. జీతం తీసుకుంటున్నందుకు ఉద్యోగధర్మం సక్రమంగా నిర్వర్తించడం, అంకితభావంతో పనిచెయ్యటం ఎంత ముఖ్యమో అలా జీతం తీసుకునే అవకాశం లేనివారికి మనమే కొన్ని అవకాశాలిచ్చి వాళ్లు మనకోసం చేసిన దాని విలువ గుర్తించి సరిగ్గా పే చేసి, వీలైతే కృతజ్ఞతని చూపించడం కూడా అంతే ముఖ్యం. మీరిందాకా అన్నారే. డిగ్నిటీ ఆఫ్ లేబరనీ అదే ఇది”
వృత్తిపరంగా, ప్రవృత్తిపరంగా విస్తృతమైన ప్రపంచాన్ని చదివిందామె. స్కూల్లో పిల్లలు, వాళ్ల తల్లిదండ్రులు, స్నేహితులు, బంధువులు. ఇలా ఎందర్నో చూసింది. ఎన్నో పరిచయాలు… ఇంకెన్నో పరిశీలనలు… రకరకాల మనస్తత్వాలు.. వాటిల్లో ఎంతో విలక్షణత. మనుషులంతా ఒకే సామాజిక నీతికి కట్టుబడి ఉంటే ఆ సాంఘికజీవనంలో ఎలాంటి సంఘర్షణా ఉండదు. అందరికీ రాముడో, కృష్ణుడో ఎవరో ఒకరే దేవుడిగా, రోల్‍మోడల్‍గా ఉంటే అతడు చెప్పిన, ఆచరించిన సిద్ధాంతాలని పాటించడంలో ఎవరికీ ఎలాంటి ఆక్షేపణా ఉండదు. కానీ వాస్తవంలో అలా ఉండదు పరిస్థితి.
ప్రతివాడూ తను చెప్పిందే వేదం అంటాడు. అందరిదగ్గరా అలాంటి వేదాలు వుంటాయి. అప్పుడు దేన్ని పాటించాలి? కష్టపడి పైకొచ్చినవాడు అదో క్రెడిట్లా ప్రకటించుకుంటాడు. అలాగే లంచం తీసుకోనివాళ్లు, డిసిప్లిన్ మనుషులు… ఎవరికి వారు తమని తాము గొప్పగా చెప్పుకుంటారు. కానీ తాము ఆ విధంగా తయారవ్వాలనుకుని తయారవ్వలేదనీ పరిస్థితులు తయారుచేశాయనీ అనుకోరు. పిల్లలకి తమే రోల్‍మోడల్స్ కావాలనుకుంచారు. తానే కష్టపడి అన్నీ సమకూర్చాకా ఇంకా అలాగే కష్టపడే అవసరం కొడుక్కి ఎందుకుంటుంది? తను నిర్మించిన డిసిప్లిన్ చట్రంలో భార్యాపిల్లలు నలిగిపోతున్నారేమో! చుట్టూ ఉన్నవాళ్లందరూ లంచం తీసుకుని తానొక్కడే లంచం తీసుకోకుండా
ఉంటూ ఉనికిని నిలుపుకోవటంకోసం చేసే ప్రయత్నంలో ఇంకెన్ని మానవీయవిలువలు ధ్వంసమవుతున్నాయో! ఇవన్నీ ఎవరి ఊహకీ అందనివి. ఎవరూ ఊహించడానికి కూడా ఇష్టపడనివి.
చంద్రమోహన్ దిగ్భ్రాంతిగా విన్నాడు శాంతి మాటలని. అతనికి కొన్ని విషయాలు తెలుసు. వాటి ఆధారంగా కొన్నికొన్ని సిద్ధాంతాలు ఏర్పరుచుకున్నాడు. అవి సరైనవని నమ్ముతూ వస్తున్నాడు. ఇప్పుడు వాటి మూలాలు కదిలాయి. శాంతిలో ఉన్న లైవ్లీనెస్, వాక్పటిమ అతన్ని
ఆశ్చర్యపరుస్తున్నాయి. తనని చేసుకోవటానికి విముఖత చూపించి, మాధవ్‍ని కోరి చేసుకుని మాధవ్ నవ్వులకి తనూ ఒక అలంకారంగా ఉండటం అతన్ని విస్మయపరుస్తోంది. స్వప్న ఎప్పుడూ ఇలా ఉండదు. తన ప్రెజెన్స్‌ని ఎంజాయ్ చెయ్యదు. ఏదో అయిష్టత. స్వప్నే కాదు, తను చూసిన ఏ స్త్రీ కూడా ఇలా ఉండదు.
“మా శాంతికి చాలావిషయాల్లో మంచి స్పష్టత వుందిరా ! పెద్ద ఇల్లూ, కారూలాంటి కోరికలేం లేవు తనకి. అలాంటి వాటిగురించి కలలు కనేముందు వాటి మెయింటినెన్సు గురించి ఆలోచించమంటుంది” మాధవ్ కలుగజేసుకున్నాడు.
“మెయింటినెన్సుదేముంది? ఈరోజుల్లో రెండు మూడు బెడ్రూమ్సుతోనో డూప్లెక్స్‌టో ఇల్లూ, కారూ కామనైపోయాయి. ఇద్దరూ సంపాదిస్తున్నప్పుడు ఆపాటి కొనుక్కోకుండా ఎలా? బేంకులోను తీసుకుని ఇల్లు కట్టాను. ఇరవై లక్షలైంది. మా ఇల్లు, సినిమా సెట్టింగులా ఉంటుంది” అన్నాడు చంద్రమోహన్.
శాంతి నెమ్మదిగా అక్కడినుంచీ లోపలికి వెళ్లిపోయింది. వాళ్ల మాటలు వినిపిస్తూనే ఉన్నాయి.
“ఎఫర్డ్ చెయ్యడమంటే డబ్బు విషయంలో అని కాదు. డబ్బుందికదాని పెద్దిల్లు కడతాము. కారు కొనుక్కుంటాము. వాటి మెయింటెనెన్స్? నెలకి రెండువేలో ఐదువేలో ఇచ్చి మనిషిని పెట్టుకోగలమో లేదో చూడాలంటుంది తను”
“మరి ఆడవాళ్లున్నది దేనికట?” వ్యంగ్యంగా అడిగాడు చంద్రమోహన్.
“వాళ్లకే అక్కర్లేకపోతే?””
“అక్కర్లేదనుకుంటే సరిపోతుందా? స్టేటస్?”
“వాళ్ల టైముని మన లెక్కలో వేసేసుకుంటే ఎలా?”
“నువ్వేం చేస్తావు?”
“శాంతి నాకు వండిపెడితే థాంక్స్ చెప్తూ తింటాను” నవ్వుతూ చెప్పాడు మాధవ్.
“థేంక్స్ దేనికి?” తనూ నవ్వు తెచ్చిపెట్టుకుంటూ అడిగాడు చంద్రమోహన్,
“ఎందుకేమిటి? నాతో సమానంగా సంపాదిస్తూ కూడా నాకు వండి పెడుతున్నందుకు”
“నువ్వేం మారలేదు” అన్నాడు చంద్రమోహన్.
తర్వాత చాలాసేపటిదాకా మాట్లాడలేదు. తనలో తను ఆలోచించుకుంటూ ఉండిపోయాడు. చాలా పెద్ద ఇల్లు కట్టాడు తను. ఇంటిముందు గార్డెన్, ఇంట్లో కుక్క, ఖరీదైన ఫర్నిచర్. ఇవ్వన్నీ స్వపకి అవసరమని చూడకుండా, డబ్బుంది కదాని, తనకి నచ్చాయని అమర్చాడు. అవి పద్ధతిగా ఉన్నాయా లేదాని మాత్రం చూస్తూ వచ్చాడు. ఎక్కడేనా దుమ్ము కనిపిస్తే భార్యనీ, వస్తువేదైనా పాడైతే పిల్లల్నీ తిడతాడు. ఈ రెండిటితో అంతా సవ్యంగానే సాగిపోతుంది. ఈ భావపరిమళాలు తనకి కొత్త. స్వప్న శాంతిలా ఇలా బోల్డ్‌గా తన అభిప్రాయాలు చెప్పగలదా? అసలామెకి ఇష్టానిష్టాలున్నాయా?
మాధవ్ అతన్ని చూసి నవ్వాడు మళ్లీ.
“నాలో ఏ మార్పూ రానట్టే నీలోనూ రాలేదు” అన్నాడు. “కానీ నేను చాలా హేపీగా ఉన్నాను. నవ్వులనావలా సాగిపోతోంది జీవితం. ఏవేనా
లోపాలు ఉండచ్చు కానీ వాటి బరువు మా మనసుల్ని కృంగదీయదు”
చంద్రమోహన్ నిస్తేజంగా చూశాడు.
“స్వప్ననీ పిల్లల్నీ నేనెంతో ప్రేమిస్తాను. ఐనా మా ఇల్లు నీ ఇంటిలా ఉండదు. నా భార్య తన ఇష్టానిష్టాలని ఎప్పుడూ బైటికనదు. నా పిల్లలు నన్ను చూసి పక్కకి పక్కకి తప్పుకుంటారు” అన్నాడు.
“నీ అభిప్రాయాలమీద నువ్వు సడలకుండా కూర్చున్నప్పుడు అవతలివాళ్లకింక తమ సొంత ఆలోచనలని చెప్పే అవకాశం ఎక్కడిది? మనం మడత నలగని షర్టు వేసుకున్నామా లేదా అనేది కాదు, ముఖ్యం. వంటిమీద వేసుకుని తెల్లారి లేచి ఉతుక్కుని వేసేదానికోసం ఇంత కష్టపడడం అవసరమా అనేది ముఖ్యం. మూణ్ణాళ్ల బ్రతుకుకోసం కొత్త సిద్ధాంతాలని అన్వేషిస్తూ, ప్రతిక్షణం మెదడుకి పదునుపెడుతూ బతకడం కన్నా, ఉన్న సిద్ధాంతాలతోనే అందర్లాగే సర్దుకుంటూ బతికేస్తే పోలే? నీ తెల్లషర్టు చూసినప్పుడే అనుకున్నాను, నువ్వింకా మారలేదని. చిన్నప్పటి చనువుతో చెప్తున్నాను. ఇప్పటికేనా మారే ప్రయత్నం చెయ్యి. లేకపోతే ఎన్నో కోల్పోతావు” చెప్పాడు మాధవ్.
కొద్దిసేపు ఊరుకుని లేచాడు చంద్రమోహన్. భోజనానికి ఉండమంది శాంతి. మరోసారి వస్తానని వీడ్కోలు తీసుకున్నాడు.
ఎలాంటి ఫ్లెగ్జిబులిటీ లేకుండా ఉన్న అతన్ని తలుచుకుంటే శాంతికి ఆశ్చర్యం వేసింది. మనుషులు నవ్వకుండా బిగదీసుకుని ఎలా ఉండగలరు? భార్య ఎలా నెగ్గుతోందో! పురుషాహంకార భావజాలంతో స్త్రీ ఎంత నష్టపోతోందో, ఎంత స్వేచ్ఛని కోల్పోతోందో తెలుసు. సిద్ధాంతాలని మగవాళ్లు తయారుచేస్తారు. నెగ్గించుకుంటారు. ప్రతిఘటించి లొంగిపోవటం, ప్రతిఘటించకుండా లొంగిపోవటం అనే రెండే స్త్రీకిగల మార్గాలు.
చాలా చిన్న శాంతిమంత్రం. మనకి మనమే ఒకర్ని ఒక పని చెయ్యమన్నప్పుడు వాళ్లెలా చేస్తారో అలా చేయించుకోవటం, ఒకరి పని మనంతట మనమే ముందు పడి చెయ్యాలనుకున్నప్పుడు వాళ్లకి నచ్చేలా చెయ్యటం…
ఇంటిపని ఆడవారికి అప్పగించారు. ఆమెకి నచ్చినట్టు చేసుకునే స్వేచ్ఛనివ్వాలి. అందులో ఆమెకి ఆనందం కలిగే స్ఫూర్తి ఉండాలి. ఈ చిన్నసూత్రాన్ని దాదాపు మగవాళ్లంతా విస్మరిస్తున్నారు. నువ్విలా చెయ్.. అలా చెయ్…ఇది చెయ్… అది చెయ్… నాకు నచ్చినట్టు చెయ్. నాకు లాభం కలిగేలా చెయ్.. అన్నీ ఆదేశాలే. ఏ చిన్న పొరపాటు జరిగినా ఆమెని దోషిని చేస్తారు. మగవాళ్లకే సరదా ఉన్నా దాన్ని నిర్మోహమాటంగా భార్యల మీదికి నెట్టేస్తారు. తన సహోద్యోగికి కుక్కంటే ఇష్టం. అతని భార్యకి ఇష్టం లేదు. అతను కొంటాననీ, ఆమె వద్దనీ.. ఆఖరికతను కొనుక్కొచ్చి ఇంట్లో వదిలాడు. ఆమెకి దాని చాకిరి. దాన్ని శుభ్రంగా ఉంచి, తిండీ అదీ పెడుతుంటే అతను దాన్ని వాకింగ్‍కి తీసుకెళ్ళి కుక్కని పెంచుతున్నానన్న సంతోషాన్ని పొందుతాడు. నిత్యం ఇలాంటివెన్నో. ప్రపంచం విస్తృతమై దైనందిన కార్యకలాపాలు పెరుగుతున్నకొద్దీ భార్యాభర్తలమధ్య అభిప్రాయభేదాలూ పెరుగుతున్నాయి.
చంద్రమోహన్ని కాదని మాధవ్‍ని చేసుకోవటం జీవితంలో అన్నింటికన్నా తను చేసిన తెలివైన పని అనిపించింది శాంతికి.


“ఎందుకింత ఆలస్యమైంది?”” అడిగింది స్వప్న.
“మాధవ్ కనిపించి వాళ్లింటికి తీసుకెళ్లాడు” అన్నాడు.
మాధవ్ స్వప్నకి బాగా తెలుసు. ఇంట్లో ఏది పద్ధతిగా లేకపోయినా అతన్ని ఉదాహరణగా చెప్తాడు చంద్రమోహన్.
“ఎక్కడ కలిశాడు? ఏం చేస్తున్నాడు? ఈ ఊళ్లోనే ఉంటున్నారా, వాళ్లు? ఏం చేస్తున్నాడు? మనింటికే రమ్మనకపోయారా?” కుతూహలంగా ఇన్ని ప్రశ్నలడిగింది. అతను అన్యమనస్కంగా చెప్పి, ఫోన్ మోగుతుంటే లేచి వెళ్లాడు. అవతల పార్వతి. శివరావు భార్య.
చాలా ఆందోళనగా ఉంది ఆమె స్వరం.
“రాజా ఇప్పటిదాకా ఇంటికి రాలేదు. మీ ఇంట్లోగానీ ఉన్నాడా?” అడిగింది. చంద్రమోహన్ టైము చూశాడు. పది దాటింది.
“ఇంకా రాకపోవటమేమిటి? సినిమాకేమైనా వెళ్లాడేమో!” అని అతనంటే, “లేదు, వాడి ఫ్రెండ్సందరూ ఇళ్లల్లోనే ఉన్నారు. ఒక్కడూ వెళ్లేంత తెలివి లేదు” అంది. అంటూ చెప్పుకొచ్చింది. ముందురోజు రాత్రి శివరావ్ ఇంట్లో బాగా గొడవైందట. రాజా వాళ్ల ఏకైక సంతానం. వాడు పొద్దున్నే లేవడనీ, రాత్రి పొద్దుపోయేదాకా మేలుకుంటాడనీ, గంటలుగంటలు క్రికెట్టాడతాడుగానీ, యోగాసనాలు వేసి సూర్యనమస్కారాలు చెయ్యడనీ, తిండి దగ్గర గొడవ చేస్తాడనీ, ఇంట్లో తెలీకుండా బైటితిళ్లు తింటాడనీ చాలా కంప్లైంట్స్ ఉన్నాయి శివరావుకి వాడిమీద. కొడుతుంటాడు కూడా. వాడిప్పుడు పదోతరగతి పరీక్షలు రాశాడు.
సమ్మర్ క్లాసుల్లోనూ తర్వాత ఇంటర్లో రెసిడెన్షియల్లోనూ పడేస్తే వాళ్లే వాడిని దార్లో పెడతారని అన్నాడట శివరావు.
వాడు హాస్టల్‍కి వెళ్ళనని ఏడ్చాడట.
వాడిదింకా పసితనమేననీ, బాల్యచాపల్యాలుంటాయనీ అనుకోడు. బాగా స్పాయిలయ్యాడని అతని నమ్మకం.
“ఇంక దాపరికమేమీ లేదు. మీ మిత్రుడితో చాలా విసిగిపోయాను. తనకెంత తోస్తే అంత తప్పించి మరొకరి మాట వినరు. ఒక్క పిల్లాడు. వాడికి నచ్చిన తిండి తిననివ్వరు. కంటినిండా నిద్రపోనివ్వరు. చదువుకొమ్మని మూడింటికీ నాలుగింటికీ లేపేస్తారు. చన్నీళ్లస్నానం చేయిస్తారు. తనకేవైనా నమ్మకాలూ, ఆశయాలూ ఉంటే తనవరకూ ఉంచుకోవాలి. యోగాస్కూలేదో మొదలుపెట్టారు. అందులోకి ఇష్టపడి
వచ్చేవాళ్లకి చెప్పుకోవాలి. అంతేగానీ వీడినలా వేధిస్తే ఎంతకని సహిస్తాడు? ఇంతకాలం వాడు చిన్నపిల్లాడు, ఎదురుతిరగడం రాదనుకున్నాను. కానీ వాడెంతో ఎదిగిపోయాడు. పెద్ద ప్రయత్నమే చేశాడు, తండ్రిబారినుంచి బైటపడటానికి. ఎక్కడికెళ్ళాడో, ఏ అఘాయిత్యం చేసుకున్నాడో తెలీడం లేదు. ఇప్పుడేనా ఏమంటారు, కడుపు మాడితే వాడి తిరిగొస్తాడనేసి తన దార్నితను యోగాకేంపుకి వేరే ఊరు వెళ్లిపోయారు. ఏంచెయ్యను? ఎక్కడని వెతకను? మా నాన్న ముసలివాడు. అన్నదమ్ముల్లేరు. ఎవరున్నారు నాకు, నా కొడుకుని వెతకడానికి?” నిస్సహాయంగా ఏడుస్తోంది.
“నువ్వేం కంగారుపడకు పార్వతీ! నేను వాడిని వెతికిస్తాను. నేనూ వెళ్తున్నాను” అన్నాడు చంద్రమోహన్,
“ఏం జరిగింది?” అడిగింది స్వప్న అతను మాట్లాడటమయ్యాక. చెప్పాడు.
“ఈరోజుల్లో లంగోటీలు కట్టుకుని యోగాసనాలు వేసేవాళ్లెవరు? అందులోనూ పిల్లలా? ఫ్రెండ్సుముందు చిన్నతనమనుకుంటారు” అంది స్వప్న.
అతను ఎవరెవరికో ఫోన్లు చేశాడు. ఫ్రెండు సి.ఐ. అతనికి కూడా చెప్పాడు. రాజా ఫోటో కావాలంటే అప్పటికప్పుడు పార్వతి దగ్గరకి వెళ్లి ఇచ్చి వచ్చాడు. శోకమూర్తిలా ఉన్న ఆమెని చూస్తుంటే బాధేసింది. వెంటబెట్టుకుని తమింటికి తీసుకొచ్చాడు.
ఎంత వెతికించినా , పేపర్లో వేయించినా పోలీసు కంప్లైంటిచ్చినా కూడా రాజా ఆచూకీ దొరకలేదు. ఏడ్చేడ్చి చిక్కి శల్యమైంది పార్వతి. వాడింక తిరిగి రాడని నిర్ధారించుకుంది. కొడుకుని కనీసం ఇంకొన్ని రోజులు… వాడికి వయసొచ్చి ఉద్యోగం దొరికేదాకానేనా హోల్డ్ చెయ్యగలననుకుంది. కడుపునిండా తిండీ, కంటినిండా నిద్రా ఉన్నప్పుడే ఏ సంబంధాలేనా నిలిచేది. శివరావ్‍కి ప్రకృతిబద్ధమైన జీవనంమీద నమ్మకం ఏర్పడింది. పొద్దున్నే నాలుగింటికి లేచి యోగాసనాలు వేసి చన్నీళ్ల స్నానం చేసి, చప్పిడి తింటాడు. పచ్చికూరలూ, మొలకధాన్యాలూ తింటాడు. మాంసాహారం పూర్తిగా మానేసాడు. అందుకు పూర్తిగా భిన్నమైన వాతావరణంలోంచీ వచ్చిన పార్వతికి తన సిద్ధాంతాలని పరిచయం చేసి వాటిమీద నమ్మకం కలిగించే ప్రయత్నం చెయ్యలేదు. అలాగే అతను తన సిద్ధాంతాలని కొడుకుమీద రుద్దే పని చేశాడు. చుట్టూ ఉన్న ప్రపంచానికి, వాడికి అప్పటిదాకా అయిన అలవాట్లకీ వ్యతిరేకదిశలో వాడినీ ఇంటినీ నడిపించే ప్రయత్నం చేశాడు.
తెల్లటి లంగోటి కట్టుకుని యోగాసనాలు వేసే భర్తమీద పార్వతికి శృంగారభావన కలుగలేదు. వెగటనిపించేది. అతను తినే తిండీ, దానివలన వచ్చిన పశుబలం ఆమెకి నచ్చలేదు. ఐనా ఊరుకుంది. కొడుకుముందు బైటపడలేదు.
“కడుపెంత మాడినా వాడింక తిరిగి రాడు. ఇంత మొండిమనిషితో కలిసుండటం ఇంక నావల్ల కాదు. వాడికి నావలన తండ్రి ప్రేమ ఎందుకు దూరమవ్వాలని ఇంతకాలం ఓపిక పట్టాను. ఇంక మేం కలిసుండటంలో అర్ధంలేదు” అని పుట్టింటికి వెళ్లిపోయింది పార్వతి.
ఒక కుటుంబం నిష్కారణంగా విచ్ఛిన్నమవ్వటం కళ్లారా చూశాడు చంద్రమోహన్,
ప్రకృతి గురించీ, మనిషిలో ఉండే అంతర్గతశక్తి గురించి ఆ రెండింటినీ సమన్వయపరిస్తే మనిషి సాధించగలిగే శక్తి గురించీ ఉపన్యాసాలిచ్చే శివరావ్ సొంత కుటుంబ విషయాలలో దారుణంగా ఓడిపోయాడు. ఆకులూ అలములూ తింటూ ముక్కుమూసుకుని కాలం గడపడం సన్యాసులు చేసే పని. అలాంటిదాన్ని సంసారిగా ఉంటూ ఆచరించాలని చూశాడు. విఫలమయ్యాడు. మనిషి ఉంటే ఒంటరిగా సంఘానికి దూరంగానేనా ఉండాలి, లేకుంటే సమాజంలో ఉంటూ దాని విలువల్నేనా పాటించాలి.


“ఎక్కడో లోపం జరిగిందనిపిస్తోంది రాజా విషయంలో” బాధగా అన్నాడు చంద్రమోహన్ మాధవ్‍తో.
అప్పుడు పోల్చాడు మాధవ్, పిల్లలని గినీపిగ్స్‌తో.
“క్రమశిక్షణ అవసరమే. కానీ, అది మనిషిని కదలకుండా బంధించి ఉంచే ఫ్రేం కాకూడదు. ఆ ఫ్రేం అవతల కూడా జీవితం ఉంటుంది. అదీ అనుభవించదగ్గదే. భౌతికమైన క్రమశిక్షణకన్నా నైతికనిబద్ధత సమాజానికి మనిషికి చాలా మంచిది. నేను అబద్ధం చెప్పననుకోవటానికీ తెల్లషర్టే వేసుకుంటాను, నల్లపేంటే వేసుకుంటాననుకోవటానికి చాలా తేడా ఉంది. అందుకే ఎన్నోచోట్ల యూనిఫాం ఉన్నా ఈ రోజుకీ మనకి సోషలిజం రాలేదు. పిల్లల్ని చూడు, స్కూలునుంచీ రాగానే యూనిఫాం విడిచేసి మంచిమంచి బట్టల్లోకి మారిపోతారు. మంచి అంటే నచ్చిన, పిల్లల్ని అలరించగలిగిన… ఆ మంచిబట్టల్ని కొనిపెట్టగలిగే తల్లిదండ్రుల సామర్ధ్యతమీదే వాళ్ల భవిష్యత్తూ వాళ్లు నిర్మించబోయే సమాజం ఉంటాయి” అన్నాడు తనే మళ్లీ.
“ప్రలోభాల మధ్య బ్రతుకుతూ మనసుని నియంత్రించుకోవటం చాలా కష్టం. దాదాపు అసాధ్యం. నిన్న ప్రలోభమైనది ఈ రోజుని అవసరం. రేపు అది లేనిదే బ్రతుకు లేదు. ఉదాహరణకి ఒకప్పుడు వంట గేస్. ఇప్పుడు కంప్యూటర్. అలాంటప్పుడు వేటిని నువ్వు ప్రలోభాలుగా నిర్వచించగలవు? అందుకే ప్రలోభాలకీ చెడ్డ అలవాట్లకీ మధ్య గిరిగీసి చెడ్డవాటి జోలికి వెళ్లకపోతే చాలనుకుంటాను. అలాగే సాధ్యాసాధ్యాల మధ్యకూడా. అదే మానసికమైన క్రమశిక్షణ. కొంత వయసు రాగానే అనేక విషయాలపట్ల మనకే విరక్తి కలుగుతుంది. శివరావ్ నాకు నచ్చలేదు. అతనితో మాట్లాడితే అసంతృప్తి కలుగుతుంది. మనం తప్పుగా బతుకుతున్నామేమోననిపిస్తుంది. అందుకే అతన్ని కలవను. ఎవాయిడ్ చేస్తాను” అనేది అంతకు ముందు చెప్పినదానికి కొనసాగింపు.
చంద్రమోహన్‍కి చాలా బాగా అర్థమైంది. ఐస్‍ఫ్రూట్ బండివాడి గంట విని ఏడ్చి కొనిపించుకున్నప్పటి బాల్యపురోజులనుంచీ కమ్మగా రకరకాలు
వండించుకుని అందమైన డైనింగ్‍సెట్ సంపాదించుకుని అందులో తింటూ ఆనందాన్ని పొందే యౌవనం అక్కడినుంచి ఏదో ఇంత ఉడకేసుకుని తిని కాలక్షేపం చేసే వృద్ధాప్యందాకా ప్రస్థావించడమే జీవితమనీ, కాలమే మనిషికి పెద్ద ప్రలోభమనీ, వయసుతోపాటే ఆ ప్రలోభాల ఉత్థానపతనాలుంటాయనీ.

శివరావ్ ఒక ప్రకృతి వైద్యశాలలో ట్యూటర్‍గా చేరాడు. మనుషులు వచ్చికూరలూ, ఉప్పూకారం లేని వంటలు తినాలనీ, శ్వాస లెక్కపెట్టుకుంటూ పీల్చి వదలాలనీ, శృంగారం మగవాడికి ఆయుఃక్షీణమనీ అతను రాసే వ్యాసాలు పుస్తకాల్లో వస్తుంటాయి. వాటిని చదివిన పాఠకులు వాటిని పాటించలేక బహుశః ఎంతో కోల్పోయామని బాధపడుతుండవచ్చు.
“అతనూ జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నట్టే” అన్నాడు మాధవ్ సరదాగా.
రాజా గుర్తొచ్చి చంద్రమోహన్ గుండె బరువెక్కింది. మౌనంగా ఉండిపోయాడు. మాధవ్ అర్థం చేసుకున్నాడు. “ఇంటికన్నా సౌఖ్యమైన ప్రదేశం బైటెక్కడో ఉందని ఎవరికేనా అనిపించడం అత్యంత దురదృష్టకరం” అన్నాడు. అది శివరావుని గురించో రాజాని గురించో లేక ఇద్దరికీ అన్వయిస్తుందో చంద్రమోహన్ అర్ధం చేసుకోలేకపోయాడు.
రాజా తిరిగి రాలేదు.
పార్వతి ఆత్మహత్య చేసుకుంది. శివరావులో ఏ కదలిక వచ్చిందో తెలీదు, గడ్డాలూ మీసాలు పెంచేసి పూర్తిగా యోగాలో లీనమైపోయాడు. రేపెప్పుడేనా రాజా తిరిగొచ్చినా అతనికి ఇల్లంటూ మిగల్లేదు.
ఇన్ని పరిణామాల తర్వాత చంద్రమోహన్ తనున్న ఫ్రేంలోంచీ బైటికి రావాలని స్ట్రగుల్ చేస్తున్నాడు.
మాధవ్‍లో ఏ మార్పూ లేదు. అతను ఒకప్పుడెలా ఉన్నాడో ఇప్పుడు అలాగే ఉన్నాడు.