జుర్రేరు నదీలోయ by S Sridevi

  1. జుర్రేరు నదీలోయ by S Sridevi
  2. జ్వాలాపురంపిల్ల కోసం by S Sridevi
  3. సోన్‍లోయలో సరికొత్త చందమామ by S Sridevi
  4. కనిపించని ఒకటో వంతెన by S Sridevi

జుర్రేరు నది వొడ్డు. నది మంద్రంగా ప్రవహిస్తోంది. కొద్దిరోజులుగా ఎండపొడ లేదు. సూర్యుడిని మబ్బులు విడవట్లేదు. అంతా కనుచీకటి. ఆకాశం నల్లగా వుంది. ఎక్కడినుంచో పిల్లనగ్రోవి వినిపిస్తోంది. దానికి బదులు పలుకుతున్నట్టు ఒక పక్షి పదేపదే కూస్తోంది. ఆ మాధుర్యాన్ని చెదరగొడుతూ కొన్ని జంతువులు వికృతంగా అరుస్తున్నాయి.
ఆమె ఒక చెట్టుకింద బండరాయిమీద కూర్చుని వుంది. జేగురురంగు చీర కట్టుకుంది. ఛాతీఅనాచ్చాదితంగా వుంది. మెళ్ళో పూసలదండ వుంది. పొడవాటి జుత్తు నేలని తాకుతోంది. దాన్ని ముందుకి తీసుకుని వొళ్ళో వేసుకుంది. వేలికొసలు జుత్తు పాయల్లో కదులుతున్నాయి. ఒక వ్యక్తికోసం ఎదురుచూస్తోంది. దాపుల్లోని పల్లెనుంచీ రావాలి అతను. పళ్ళూ కాయలూ ఏరుకుంటూ అడవుల్లో తిరుగుతున్నప్పుడు పరిచయం. మనసు దోచాడు. ఇప్పుడు ఆమెకి కాబోయే భర్త. అంటే పెళ్ళీ అదేమీ కాదు. కలిసి వుండాలని నిర్ణయించుకున్నారు. అదే అక్కడి, అప్పటి సాంప్రదాయం. అతన్ని తీసుకెళ్ళి తన తండ్రికి పరిచయం చెయ్యాలి. గ్రామస్తులందరిముందూ నిలబెట్టాలి. అటు తర్వాత చిన్న విందు వుంటుంది. ఇదంతా ఇప్పుడు మొదలై మరుసటిరోజువరకూ కొనసాగే కార్యక్రమం.
చాలా చిన్న వూరది. వందగడపలుంటాయి. అన్నీ పూరిళ్ళు. ఏవో కొన్ని అవసరాలకి తప్పించి ఇళ్ళలో ఎవరూ వుండరు. ఆరుబయలు జీవనం. ఆడామగా అంతా వ్యవసాయం చేస్తారు. నదీలోయ సారవంతంగా వుంటుంది. జొన్నలు, వరి పండుతాయి. వ్యవసాయానికి రాళ్ళు, రాతి పనిముట్లూ వాడతారు. రోళ్ళూ, రోకళ్ళూ వున్నాయి. పంట తెచ్చుకోవడం, దంచుకోవడం చాతవును. చిన్న చిన్న జంతువుల్ని వేటాడి తెచ్చుకుంటారు.
నిప్పు గురించి తెలుసు. రెండు చెకుముకి రాళ్ళని ఒకదాంటో ఒకటి కొట్టి నిప్పు రాజేస్తారు. ఊళ్ళో ఒక కుమ్మరికుటుంబం వుంది. వాళ్ళు కుండలు చేస్తారు. మూడు రాళ్ళని అడ్డంగా ఒకటీ, దానికింద అంచులకి రెండువైపులా చెరోటీ పెట్టి అందులో కర్రలూ గడ్డీ కూర్చి నిప్పు రాజేసి, ఆ కుండల్లో వండుకుని తింటారు. ఒక నేతగారి కుటుంబం వుంది. వాళ్ళు చెట్ల నారలతో బట్టలు నేస్తారు.వాటికి చెట్ల రంగులు అద్దుతారు. అదో విద్య. అక్కడక్కడా దొరికే పత్తితో నేస్తే బట్టలు చాలా నాణ్యంగా వుంటాయని వాళ్లకి తెలుసు. కానీ వ్యవసాయమంటే తిండికి ధాన్యాలు పండించుకోవటమే తప్ప ఇలాంటివి పండించవచ్చని వాళ్ళకి తెలీదు. మగాళ్ళకి కాస్తంత చిన్న బట్ట, ఆడవాళ్ళకి పెద్దది నేస్తారు.
అతడు వస్తున్నాడేమోనని ఆమె సుదూరానికి చూపు సారించింది. మళ్ళీ నదివైపుకి నిలిపింది. మనసులో ఏదో అలజడి మొదలైంది. ఏదో జరగబోతోందన్న ఆందోళన. నదిమీద ఏదో రాలుతున్నట్టనిపించింది. ఆమె చేతిమీద కూడా. దులుపుకుని చీరకొంగు బిగుతుగా కప్పుకుని కూర్చుంది.
ఏమయ్యాడు తనవాడు?
చూస్తుండగా ఆకాశాన్ని నల్లటి మేఘాలు ఇంకా దట్టంగా కప్పేసాయి. అప్పటిదాకా కనుమాపుగానేనా కనుపిస్తున్నవన్నీ నల్లటి దుప్పటిలోకి జారుకున్నట్టు అదృశ్యమయాయి. క్షణాల్లో అంతా మారిపోయింది. కన్ను పొడుచుకున్నా కానరాని చీకటి. పైనుంచీ ఏదో బూజుబూజుగా, దుమ్ముదుమ్ముగా రాలిపడుతోంది. ముక్కులోకి పోయి వుక్కిరిబిక్కిరైంది. ఊళ్ళోవాళ్ళంతా పెద్దగా కేకలు పెడుతూ పరుగెడుతున్నారు.
ఎక్కడికి? నదిని ఆనుకుని వున్న కొండగుహల్లోకి. నది దాటాలి. నదినిండా తెట్టులా బూడిదే. పైనుంచీ రాలుతోంది. ఎక్కడినుంచీ వస్తోంది? చూస్తూ వుండగా మోకాలిలోతు బూడిదలో ఆ వూరంతా మునిగిపోయింది. ఇంటి పైకప్పుల నిండా అదే.
అతను వస్తాన్నాడు. ఇంకా రాడేం? తనేం చెయ్యాలి? ఆమె అలాగే కూర్చుంది. చీర వొళ్ళంతా కప్పుకుని. ఆమెమీద గుట్టగా బూడిద పడుతోంది.
అతనేమయాడు? ప్రేమా అది? అతనికేదో అయిందన్న అంతర్గత సూచన అందిందా?
ఆమె కదల్లేదు. ఊపిరితిత్తుల్లోకి పోయిన బూడిద గాజురజనులా కోత పెడుతోంటే ఆ బాధకి కళ్ళలోంచీ నీళ్ళు జారిపోతున్నాయి. ప్రాణం కన్నా ప్రేమ గొప్పదా? ప్రేమ మానవ స్పందనా? ఎవరు చెప్పాలి?
ఆమె శరీరం, ఎముకలూ అన్నీ కాలగర్భంలో కలిసిపోయినా ఆత్మమాత్రం అక్కడే తిరుగుతుండవచ్చు.


“జ్వాలాపురం, కర్నూలు జిల్లా. 75000 సంవత్సరాలక్రితం సుమత్రా దీవిలోని టోబా అగ్నిపర్వతం పేలినప్పుడు ఇక్కడి జుర్రేరులోయ నాగరికత ఆ బూడిదలో కూరుకుపోయింది. అప్పటి మనుషులెవరేనా మిగిలారో లేదో తెలీదు. కానీ అంతకిముందూ ఆ తర్వాతకూడా అక్కడ మనుషులు నివసించిన ఆధారాలున్నాయి. వాళ్ళు వ్యవసాయం చేసుకుని బతికేవారు” అన్నాడు ఆర్కియాలజిస్టు.
“అదెలా?” అడిగాడు పథికుడు. అది ఒకటే ప్రశ్న. ఎన్నో వేల జవాబులు.
“మనుషులు తెలివిని మెదడులో నిక్షిప్తం చేసుకుని పుడతారు. అది ఒకొక్కపొరా విప్పుకుంటూ వుంటుంది. మళ్ళీ ముడుచుకుంటూ వుంటుంది” క్లుప్తమైన జవాబు.
సరిపోతుందా?
ఏమో!