ఆమె తిరిగి వాసు దగ్గిరకి వెళ్ళేసరికి అతను లేచేసి వున్నాడు. ఎంత నెమ్మదిగా మాట్లాడినా అతను పూర్తిగా దృష్టిపెట్టడంచేత చాలావరకూ వినిపించింది.
“పడుక్కున్నావుకదా? ఎప్పుడు లేచేసావు?” అడిగింది.
“జస్ట్ అప్పుడే పట్టింది. మయూ వచ్చి తలుపు తట్టినప్పుడు మెలకువ వచ్చింది. ఒకడేమో,
యూ హావ్ డిచ్చ్‌డ్ మై మామ్- అంటాడు.
ఈజ్ హి స్టిల్ అవర్స్- అంటాడు ఇంకొకడు. ఎవరో బైటిమనిషిని గురించి అన్నట్టు.
ఆ భాషా ఆ అడగటం ఏంటి గీతా? మా అమ్మకీ మీ అమ్మానాన్నలకీ జవాబు చెప్పాలంటే ఇప్పటికీ ఆలోచిస్తాను నేను” అన్నాడు దిగ్భ్రమగా.
“మనని అమ్మానాన్నలు పెంచారు. వీళ్ళని సమాజం పెంచుతోంది. ఎలాంటి తడీ లేకుండా మాట్లాడటానికి యింగ్లీషు వుపయోగపడుతోంది” అంది గీత.
“పిల్లలతోకూడా కలిసి వుండగలిగే రోజులు కావేమో! చాలామంది పెళ్ళిళ్ళు చేసి పిల్లల్ని వేరు పెట్టేస్తున్నారు” అన్నాడు. చాలా గాయపడ్డాడతను.
రెండురోజులు పిల్లల్తో గడిపి, వెనక్కి తిరిగొచ్చేసరికి ఆదాయానికి మించిన ఆస్తులున్నాయని ఎవరో కంఫ్లెయింటు యిచ్చారు. ఆఫీసులో విచారణ మొదలైంది.
వాసు యింటినుంచీ తీసుకొచ్చిన వస్తువులన్నీ విసిరేసి, లాప్‍టాప్‍ని విసిరికొట్టి, వాసుకి ఫోటోలు పంపి, లక్ష్మితో మాట్లాడేసాకకూడా నెమ్మదించలేదు వీణ. తను మార్ఫ్ చేసినవాటిని సెల్‍లోంచీ కచ్చగా మరికొందరికి పంపేసింది. అందులో మయూ, విహీ వున్నారు. పిల్లలు, వాళ్ళకి పంపకూడదన్న యింగితం ఆమెకి లేకపోయింది.
గది తలుపులు తియ్యమనీ, భోజనానికి రమ్మనీ లీల, శేఖర్ ఎన్నో విధాలుగా బతిమాలారు. ఎన్నోసార్లు పిలిచారు.
“నేనేం చావను. మీరే అంతా చచ్చిపొండి. లేకపోతే నేనే చంపేస్తాను. ఆ గీతనికూడా చంపేస్తాను. అప్పుడూ నేను చచ్చేది” అని అరిచింది. మళ్ళీ వస్తువులేవో విసిరేస్తున్న శబ్దాలు వినిపించాయి.
“చూడు, చచ్చేవాళ్లం ఎలాగా చస్తాం. నువ్వు ఎవ్వర్నీ ఏమీ చెయ్యలేవు. ఎందుకలాంటి ఆలోచనలు? మాటలు? ఆ మాత్రలేవో వేసుకుంటావుకదా, వుత్తికడుపుమీద వేసుకోకూడదు. కొంచెం తినేసి వెళ్ళు” అంది లీల. అందులో దు:ఖపుతడికన్నా భరించలేనితనపు పొడితనమే ఎక్కువగా వుంది. మార్పేదో రాబోతూ ఆగిపోవడం ఆవిడ మనసుని వొడిపట్టి పిండేస్తోంది. ఎలా? ఎంతకాలం? సంతోష్ వస్తాడట. వచ్చి? ఎన్నో ప్రశ్నలు. శూన్యంలో గిరికీలు కొట్టే గ్రహశకలాల్లా జవాబుల్లేకుండా మనసులో కదులుతునాయి.
“అక్కడ డబ్బాలో బిస్కెట్లున్నాయి. కనీసం అవేనా తిను” అని నిస్సత్తువగా సోఫాలో నడుం వాల్చింది. కూతురిమీద పెద్దావిడకి జాలేసింది. అప్పటిదాకా లోపలే వున్నది ఇవతలికి వచ్చి, కూతురిదగ్గిర కూర్చుంది.
“ఎంత రాక్షసమూకే? మాటకిముందు పూనా వెళ్తామని బెదిరిస్తున్నారు! ఇంక నేనేం మాట్లాడను? ఆ పిల్లది అదేం నోరు? బావగారిని వెనకేసుకొచ్చి, రాక్షసిలా పడిపోయింది. మీ అత్తగారు వున్నంతదాకా అందరూ మంచీమన్ననగానే వున్నారు. ఆవిడ పోయింది, మీ బావగారు యింత వయసొచ్చీ పూలరంగడిలా పెళ్ళాన్ని తీసుకుని అమెరికా తిరిగొస్తున్నాడు, ఇక్కడ వీళ్లకి తప్పొప్పులు చెప్పేవాళ్ళు లేరు. మీ మరిది రెటమతంమనిషి. చూడు, యిప్పుడు బాధపడి లాభంలేదు. మగవాడికి అలుసివ్వకూడదు. ఇది తెలివితక్కువది. ఒకసారి చచ్చి బతికింది. మళ్ళీ ఏదేనా మీదకి తెచ్చుకుందంటే కష్టం. ఇంట్లోంచీ కదలనివ్వకు. అటుచూస్తే సంతోష్ వస్తానంటున్నాడు. వచ్చి ఏం చేస్తాడట? ఇక్కడున్న దరిద్రానికితోడు అక్కడో విధవరాలిని చేసుకుని కూర్చున్నాడు. దానికో పిల్లకూడాను. వాళ్లనికూడా వెంటపెట్టుకుని వస్తున్నాడటనా? వద్దని చెప్పు లీలా! రావాలనుకుంటే ఒక్కడినీ రమ్మను. నెమ్మదిగా మనసు మార్చి ఇక్కడుంచెయ్యచ్చేమో ఆలోచిద్దాం. ఆడపిల్లలని మీకు ఏదీ తక్కువచెయ్యలేదు. ఏ లోటూ లేకుండా పెంచాం. ఇవేం కష్టాలే నీకు? కనీసం మరొకరితో చెప్పుకోవడానికికూడా లేదు” అని ఏడవడం మొదలుపెట్టింది. శేఖర్‍కి భరించలేని అసహ్యం కలిగింది.
జీవితం కారణం కాదు, పర్యవసానంగానే వస్తుంది. తెలిసో తెలియకో చేసినవాటి ఫలితాలు కళ్ళెదురుగా కనిపిస్తూ వున్నా, వాటిని విశ్లేషించుకోకుండా కొత్తగా బాధల్ని సృష్టించుకుంటారు. సంతోష్ పెళ్ళి చేసుకోవాలనుకోలేదు. చెల్లెలికోసం మానెయ్యాలనుకున్నాడు. అనుకోకుండా దేశం కాని దేశంలో భర్తని పోగొట్టుకుని పసిపిల్లతో వంటరిగా మిగిలిపోయిన అమ్మాయి తటస్థపడింది, చేసుకున్నాడు. ఆమెని ఏదో వుద్ధరిస్తున్నానని కాదు, ఇంట్లో వున్న పరిస్థితులతో వచ్చిన వంటరితనాన్ని దాటేందుకు. ఎప్పుడు అడిగినా చెల్లెలికి తనింట్లో స్థానాన్ని యివ్వగలిగేందుకు. మర్యాదాకరమైన వప్పందంలా జరిగిందట వాళ్ళ పెళ్ళి. ఇద్దరూ దాన్ని గౌరవిస్తున్నారు. అతనికి ఆమె వూరట, జీవనసహచరి, వీణ జీవితంలో జరగబోయే మంచి ఏదైనా వుంటే దానికి ఆలంబనమన్న ఆశ. ఆమె పిల్లకి అతను తండ్రి. వీళ్ళెవరు దాన్ని మార్చాలనుకోవడానికి? సాంప్రదాయసిద్ధంగా తాము వెతికి చేసే పిల్ల వీణ బాధ్యత తీసుకునేదా? వీళ్ళలాగే పతివ్రతాస్త్రీ కబుర్లు చెప్పేది. నావ విరిగాక, తనూ మునిగాక అప్పుడుకదా, నీళ్లలో మునుగుతున్న సహప్రయాణీకుడిమీద చూపు పడేది? తొందరగా కొడుకొస్తే బావుణ్ననిపించింది ఆయనకి.
ఆరోజే పెద్దావిడ వెళ్ళిపోయింది. మర్నాడుకూడా వీణ తలుపు తియ్యలేదు. అమ్మమ్మ వెళ్లిపోయిందని రూఢీగా తెలుసుకున్నాక యివతలికి వచ్చింది. స్నానం లేదు, ఏమీ లేదు, టేబుల్‍మీద వున్న అన్నం పెట్టుకుని ఆవురావురుమని తింది. ఎన్నో ఆలోచనలు కలగాపులగంగా కలిగాయి. లక్ష్మి యింట్లో అడుగుపెట్టినప్పట్నుంచీ జరిగినవన్నీ రంగు చెదిరిపోయిన వర్ణచిత్రాల్లా మనోఫలకంమీద కదిలాయి. వాసు కాఠిన్యాన్ని జీర్ణించుకోలేకపోతోంది.
స్వర్గం చెయ్యిజారిపోయినట్టూ, సేదదీర్చే చెయ్యి పట్టు వదిలేసి దూరం జరిగినట్టూ అనిపించింది. గుండెల్లో భరించలేని బాధ సుళ్ళు తిరిగింది. ఏం చెయ్యచ్చో ఏం చెయ్యకూడదో తెలీని ఆతృత తనది. విస్తృతమైన హింస తర్వాత దొరికిన వోదార్పు అతను. తనని ముట్టుకుంటేనూ, తనగాలి సోకితేనూ అపవిత్రమైపోతాననుకోలేదు. ఉదారంగా ప్రవర్తించాడు. మాట్లాడిన కొద్దిమాటలూ ప్రేమగానూ, దయగానూ మాట్లాడాడు. అక్కడి నవ్వులు, హాస్యాలు, పరిహాసాలు, బొమ్మలు, పాటలు, కథలు, ఆటలు అన్నీ చూసాక తనలో కదలిక వచ్చింది. అతన్ని చూసాకే తనకి జీవితంమీద చిన్న ఆశ పుట్టింది. అలా నవ్వుకుంటారా, అలా మాట్లాడుకుంటారా అని ఆశ్చర్యం. మెదడుని అంతంత సంతోషాన్ని సృష్టించడానికి వాడతారని తెలిసింది. చిందరవందరగా చెదిరిపోయిన బతుకుముక్కలన్నీ ఒకచోటికి చేరి, తనుగా మారడం మొదలైంది. తనుగా మారాక ఈ మార్పులన్నిటికీ ఆలంబన అతను అనిపించింది. దగ్గిరకి తీసుకుని, గాఢంగా గుండెకి హత్తుకుని,
నేనున్నాను, భయం లేదు, ఇకపై అంతా నీకు సంతోషమే- అనాలని ఆశపడింది. విస్తారమైన ఎడారిలాంటి తనమీద అతను ప్రేమై వర్షించాలనుకుంది.
అతనే ఎందుకు?
తనలో నిండిపోయిన అసహ్యాన్నీ, జుగుప్సనీ చెరపడానికి గీత పనికిరాదు. అంతేకాదు, అదంటే కోపం. తను అనుభవించినదాంట్లో ఒక్కశాతంకూడా దానికి జరగలేదు. వాసు స్పర్శలో దేవతాపుష్పంలా సుతారంగా వికసించింది. దాన్ని తాకిన పురుషస్పర్శ ఒక్కటే. తన తల్లికి చులకన, మిగతావాళ్ళందర్తో చనువుగా వుంటుందని. ఆవిడది అబద్ధం. తనలాగే అసూయ. తండ్రి చెప్పింది నిజం. ఆయనది ప్రేమ. పైకి చెప్పడు. దాచుకుంటాడు. ఏమీ లేనట్టు నటిస్తాడు. అందుకే తను దాన్ని భరించలేదు. దాన్ని చూస్తే తను కోల్పోయినవి గుర్తొస్తుంటాయి. దాన్ని చంపెయ్యాలి. దాని నవ్వుని చెరిపెయ్యాలి. ఎక్కడిది దానికంత నవ్వు? తలకాస్త వెనక్కి వంచి, కళ్ళు సగం మూసి, విరగబడి నవ్వుతుంది. ఆకాశంలోంచీ ధారగా జారిపడే ఆనందపు ధారని దోసిలితో పట్టుకుని తాగుతున్నట్టు అదేమి నవ్వు? ఎన్ని ఫోటోలు దానివి? ఎటర్నల్ బ్లిస్‍ట ఆల్బం పేరు. ఆ నవ్వులన్నీ అతనే యిచ్చాడా దానికి? అవన్నీ లాక్కోవాలనే బలమైన కోరిక. తను గీతగా మారిపోతే? దాన్నక్కడినుంచీ తోసేసి ఆ స్థానంలో వెళ్లి కూర్చుంటే?
తన ఫోటోలన్నీ అతనితో మార్చుకుంది. వాటిల్లో గీత స్థానంలో తను. అందుకు అంత కోపమా? మరి తనకోపం ఎవరికి చెప్పుకోవాలి? పెళ్ళి పేరుతో తనమీద జరిగిన వికృతహింస అతనికెలా తెలుస్తుంది? తన మనసులో పేలే అగ్నిపర్వతాలూ, వొంటి నరనరంలోనూ ప్రవహించే లావాలకి సాదృశ్యరూపాలవి. ఎవరితోనో వున్న ఫోటోలని పంపలేక మార్చిన ఫోటోలని పంపింది. అంత వయొలెంటుగా స్పందించాలా? అర్చనా పల్లవీవాళ్ళలా తను లేదు. అతనితో అంతకన్నా మరో అనుబంధం ఎలా ఏర్పడుతుంది? పాతికేళ్ళ వైవాహికజీవితం అనుభవించినవాడు, తనకో చిన్నస్థానాన్ని కల్పించలేకపోయాడేం? గీతని వప్పించలేడా? ఇద్దరూ బాల్యస్నేహితులు, ప్రేమికులు, రెండున్నర దశాబ్దాల దాంపత్యం. దాని సంతోషం తరిగిపోతుందా? ఇంక వాళ్లదేం ప్రేమ? మేం పందొమ్మిదిమందిమని చెప్పుకునే ఇదేం ప్రేమ? అతను తనకి స్నేహితుడు కాదా?
ఆమె పూర్తిగా ఔచిత్యాన్ని మర్చిపోయింది.
టేబుల్‍మీద వున్నవన్నీ కిందకి తోసేసి, అక్కడే తలానించుకుని ఏడ్వసాగింది. గిన్నెలు దడదడా కిందపడ్డ శబ్దానికి లీల, శేఖర్ చెరోవైపునించీ వచ్చారు. చర్వితచర్వణం. ఒకసారి అయింది, మళ్ళీ మొదలైంది. లీల గుండె క్షోభించింది.
“చెప్పు వీణా! వాసుతో ఫామ్‍హౌసుకి వెళ్ళావా? ఎప్పుడెళ్ళావు? అక్కడ మిమ్మల్ని ఎవరేనా చూసారా? నువ్వు నిజం చెప్తే నేవెళ్లి అత్తని నిలదీస్తాను. వాడిని వదలను. ఇక్కడితో ఐపోయిందనుకోవద్దు” అంది లీల.
“నన్నెందుకు తీసుకెళ్తాడు?! నేనెవర్నని? గీతని కాదుకదా?”
“మరా ఫోటోలు?”
“నీకూ కావాలా?”
లీల హడిలిపోయింది. శేఖర్ అక్కడినుంచీ వెళ్లిపోయాడు.
అదంతా అక్కడితో ఆగలేదు. లీల పుట్టింట్లో ఈ వ్యవహారం బాగా చర్చకి వచ్చింది. జరిగినదాన్నిగానీ, మాధవ్ బెదిరింపునిగానీ వాళ్ళు తేలిగ్గా తీసుకోలేకపోయారు. జరిగిన సంఘటన మంచిదైనా చెడ్డదైనా కొంతమంది స్పందించకుండా వుండలేరు. అన్నిటికన్నా ముఖ్యంగా వీణ విషయంలో దొరికినట్టే దొరికి జారిపోయిన అవకాశం. లీల తమ్ముడు మంచి పొజిషన్లో వున్నాడు. వాసుకన్నా కాస్త పెద్ద. బంధువులేకాబట్టి వాసుగురించి ఇదివరకూ విన్నాడు. ఇప్పుడింక అతన్నిగురించిన సమాచారమంతా సేకరించాడు. సోషల్ యాక్టివిస్టు ఫ్రెండుద్వారా వాసు డిపార్టుమెంటులో కంప్లెయింటు వేయించి, తను వెనకనుంచీ నడిపించాడు. సంతోష్‍కి పొరపాట్న తెలిస్తే గొడవౌతుందని లీలదగ్గిరకూడా దాచారు.
వాసు పిల్లలదగ్గిర్నుంచీ తిరిగి వచ్చేసరికి సస్పెన్షన్ ఆర్డరు, షోకాజ్ నోటీసు టేబుల్‍మీద వున్నాయి. అనూహ్యమైన సంఘటన అది. షాకయ్యాడు. మరో ఆలోచన రాలేదు. పలకరించడానికి వచ్చిన ఫ్రెండ్సుకి తలూపి, వాటిని తీసుకుని మౌనంగా ఇంటికి వచ్చేసాడు. గీతకికూడా ఫోన్‍చేసి చెప్పలేదు. మంచుదెబ్బతిన్నవాడిలా స్తబ్దుగా వుండిపోయాడు. సాయంత్రం ఇంటికి వచ్చాకే ఆమెకి తెలిసింది. అతనిలాగే తెల్లబోయింది. జవాబు తోచలేదు. అతన్ని సముదాయించడానికి మాటలూ దొరకలేదు.
పాతిక ముప్పయ్యేళ్ల సర్వీసు తామిద్దరిదీ. మొదట్నుంచీ విలాసాలూ, ఖర్చులూ లేని జీవితం. ఇంటద్దె లేదు, ఒక్కసారికూడా ఎలాంటి లోనూ తీసుకోలేదు. దేన్ని ముట్టుకుంటే అదే సంపాదించి పెడుతోంది. ఉద్యోగంలో చేరినప్పట్నుంచీ ఇప్పటిదాకా క్రమంతప్పకుండా మ్యుచువల్ ఫండ్స్, పబ్లిక్, జెనరల్ ప్రావిడెంట్ ఫండ్లలో దాస్తున్నదంతా కలిపి ఏడంకెల గుణకాల్లో వున్నాయి. దారాలు యేకి, యేకినవన్నీ కలిపి పురిపెట్టి పేనుకుంటూ వచ్చినట్టు పోగుపడ్డాయి. మళ్ళీ తన జీతం తనకే వుంది. జీతాలకి జీతాలు మిగులుతున్నాయని కొంతమంది పిల్లలని దగ్గరకి తీసి చదువు చెప్పిస్తున్నారు. మొదట్లో ఇద్దరు ముగ్గురు పిల్లలతో ఆపాలనుకున్నారు. సేవింగ్స్, రిటర్న్స్ పెరుగుతుంటే ఇంకొందరు పిల్లలని తీసుకున్నారు. ఒక్కపైస లంచం తీసుకోకుండా, సంపాదించిన ప్రతిపైసనీ ఐటీ రిటర్న్స్‌లో చూపిస్తూ, ఇన్‍కమ్‍టాక్సూ, కేపిటల్ గెయిన్సూ కడుతూ రూల్స్‌ప్రకారం వెళ్తుంటే వచ్చిన బహుమతా? వాసుమీద కంప్లెయింటు యిచ్చే అవసరం ఎవరికుంది? ఎవరికి నష్టం చేసాడు?
వాసుకి పైకి కన్నీళ్ళు రావట్లేదు, గీతకి ఆపుకుందామన్నా ఆగట్లేదు.
“ఈసారి ఎవరికీ చెప్పకు గీతూ! నేను యే తప్పూ చెయ్యలేదని పదేపదే నిరూపించుకోవలసి రావడం నాకు చికాగ్గా వుంది” అన్నాడు బాగా చిన్నబుచ్చుకుని. వీణ ఆ ఫోటోలు అందరికీ పంపించి వుంటుందన్న ఆలోచన ఎవరిని కలవాలన్నా అతనిలో సంకోచాన్ని కలిగిస్తోంది. అతని అనుమానం నిజమే. ఎవరినీ వదిలిపెట్టలేదామె. ఐతే వల్లి అందరికీ అల్టిమేటమ్ యిచ్చింది.
“వీణకి పిచ్చిపట్టి అలా చేసింది. వచ్చిన ఫోటోలు వచ్చినట్టు తీసేసి, ఏమీ తెలీనట్టు వుండండి. లేకపోతే వాసు మనముందు తలెత్తుకోలేడు. మళ్ళీ మనమధ్యకి రాడు” అంది. మరీ పట్టించుకోకుండా వదిలేసారని ఇద్దరూ మనసు కష్టపెట్టుకోకుండా సుమతి తనెళ్ళి మాట్లాడి వస్తానంది. వాసు మనసుని తడుముతున్నది మరొకటి వుంది. ఇప్పటిదాకా తులసి అతన్తోగానీ, గీతతోగానీ మాట్లాడలేదు. ఆ అవమానం ఇద్దర్నీ కుంగదీస్తోంది. బైటివాళ్ళు ఎవరెవరో ఓదార్చడం వేరు, స్వంతవాళ్ళు మేం తోడుగా వున్నామని పక్కని నిలబడటం వేరు. తల్లిసరే, తులసికూడానా? జీర్ణించుకోలేకపోతున్నాడు.
“మనచేతికి వచ్చిన ప్రతిపైసకీ లెక్కలున్నాయి. టాక్సులకి భయపడలేదు. మనిద్దరికీ రూల్సూ, రెగ్యులేషన్సూ తెలుసు. భయపడాల్సిన అవసరం లేదు. ఎవరికీ చెప్పద్దనుకుంటే ఎలా?” అంది గీత. షోకాజ్ నోటీసుకి జవాబు చెప్పాల్సిన అవసరం తప్ప ఇద్దర్లోనూ ఎలాంటి వుత్సాహం లేదు. అయిష్టంగానే ప్రహ్లాద్‍ని కలవడానికి వప్పుకున్నాడు వాసు. అతనికి ఫోన్ చేస్తే,
“సాయంత్రం వచ్చెయండ్రా! భోజనాలుకూడా ఇక్కడే చేద్దురు. రాత్రిదాకా మాట్లాడుకోవచ్చు” అన్నాడు. మాధవ్‍ద్వారా అన్ని విషయాలూ తెలిసాయతనికి. లక్ష్మి ప్రవర్తన పెద్దషాకిచ్చింది. ఈ సమయంలో వాళ్లకి ధైర్యం చెప్పి, తోడుగా వుండాల్సింది ఆమ్మ అలా ఎలా చెయ్యగలిగింది? గీతమీదా, వాసుమీదా కోపమేంటి? వాసు ఎలాంటివాడో బైటవాళ్ళందరికీ తెలుసు. స్వంతతల్లి, ఆవిడకి తెలీదా? ఆ గొడవలగురించే లెక్కలు తేల్చుకోవాలనుకుంటున్నాడేమోనన్న అనుమానం వచ్చింది.
ఇద్దరూ వెళ్ళారు.
“ఇప్పుడింత హఠాత్తుగా అకౌంట్స్ చూసుకోవడం దేనికిరా, వాసూ? టాక్స్ లెక్కలవీ మీవి మీరే చూసుకుంటారుకదా?” ఆశ్చర్యంగా అడిగాడతను.
“ఆఫీసులో చిన్న సమస్య” అంది గీత.
“చిన్నదేం కాదు, పెద్దదే” విసుగ్గా కాగితాలు ముందు పడేసాడు వాసు.
“అడ్డంగా అనడానికి లేదు. అన్నింట్లోనూ నిలువునా యిరుక్కుంటున్నాడు” ప్రహ్లాద్‍తో అంది. దిగులుని వర్షిస్తున్న మేఘాల్లా వున్న యిద్దరినీ చూస్తుంటే ప్రహ్లాద్‍కి మనసుకి చాలా కష్టంగా అనిపించింది.
“ఆదాయానికి మించిన ఆస్తులున్నాయని ఎవరో కంప్లెయింటిచ్చారు ప్రహీ! జీతాలుతప్ప మాదంతా చాలావరకూ పాసివ్ ఇన్‍కం. లైవ్‍స్టాక్‍కూడా చాలావరకూ తీసేసాం. ఆ డబ్బు మేము నేరుగా తీసుకోలేదు. అమ్మ అకౌంట్లోకి వెళ్ళేది. తను మాకు బినామీకాదుగానీ మంచి ఆదాయమార్గాన్ని ఆపెయ్యలేకపోయాం. అదే నచ్చచెప్పి వాళ్లకి ఇచ్చేసాం. నాన్న రిటైరైపోయారు. తమ్ముడు సెటిలయ్యేదాకా వుపయోగపడ్డాయి. రెండుమూడుసార్లు నాకు పెద్దమొత్తంలో యిచ్చింది. నాకేదో పెట్టామన్న తృప్తి వాళ్ళకి. అన్నిటికీ లెక్కలున్నాయి. ఒక్కమాటు టాక్స్ కన్సల్టెంటు చూస్తే బావుంటుందనుకుంటున్నాం” అంది.
“అంత ఏమున్నాయే, మీకు?” ఆశ్చర్యంగా అడిగాడు.
“ఏవో వున్నాయిలే. అందరికీ వున్నట్టే మాకూ వున్నాయి. ముందైతే ఓమాటు చూడు. నీ ఫీల్డు కాకపోతే ఎవరికేనా చూపించు” అని, బుక్స్ ముందు పెట్టింది. మాధురి వచ్చి ఆమెని లోపలికి తీసుకెళ్ళింది. ఇంత పకడ్బందీగా లెక్కలన్నీ రాసుకున్నారంటే ఎంత దాచారోనన్న కుతూహలం కలిగింది ప్రహ్లాద్‍కి.
“పెద్దగా ఆశ్చర్యపోకు. ఇద్దరికీ ఖర్చుపెట్టడం రాదు. అలా పోగుచేస్తున్నాం. మాకు డబ్బంటే అంకెల సమూహం. అంతే. బేంకుల్లోనూ, పోస్టాఫీసుల్లోనూ ఫ్రెండ్స్ వుండేవాళ్ళు. వడ్డీలు బానే వుండేవి. వాళ్ళిచ్చే వడ్డీ తీసుకుని ఇన్ఫ్లేషన్‍తో కంబాట్ చెయ్యడం కాకుండా రిటర్న్ ఇంకా వుండాలని ఆలోచించేవాళ్ళు ఒకరిద్దరు వుండేవాళ్లం. కొత్తగా మ్యుచువల్ ఫండ్స్ మొదలయ్యాయి. వాటిలో పెట్టేవాడిని. అప్పటికే కొద్దిగా ట్రేడింగ్ చేసి, జాబ్‍లో చేరాక చెయ్యకూడదంటే మానేసాను. ఆ జీల్ పోదుకదా? నావి చాలావరకూ చిన్నచిన్న లాంగ్‍టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్స్. ఏడాదికి రెండుసార్లు డియ్యే, ఒక ఇంక్రిమెంటు ఇస్తారు మాకు. జాబ్‍లో చేరిన సంవత్సరం మూడూ కలిపి వంద. అలా పెరిగినదాన్ని పెరిగినట్టు దాస్తున్నాను. కొన్ని రిటర్న్స్ వూహించనంతగా వచ్చాయి. ఇప్పటిదాకా తియ్యలేదు. గీతవి అటూయిటూ తిప్పుతూ వుంటాను” కొంచెం మొహమాటంగా అన్నాడు వాసు. చెప్పడంలో గర్వమేం లేదు. అతను ఆశ్చర్యపడద్దన్నా ఆశ్చర్యమే కలిగింది ప్రహ్లాద్‍కి.
“మయూకూడా మొదలుపెట్టాడు. ఉద్యోగంలో చేరాక మొదటి పదేళ్ళూ కీలకం. ఖర్చులు బిగబట్టి దాస్తే తర్వాతి జీవితాన్ని ఆ దాచినడబ్బు నడిపించగలదు. కానీ ఆ పదేళ్ళలోనే అన్నీ అమర్చుకోవాలనుకుని అప్పులు చేస్తూ ఇన్స్టాల్‍మెంట్స్ కడుతూ ఒక వలయంలో యిరుక్కుపోయి తిరుగుతున్నారు. అదేమిటంటే లైఫ్ ఇంకెప్పుడు ఎంజాయ్ చేస్తాం అంటున్నారు” అన్నాడు వాసు తనే మళ్ళీ.
“మీరందరూ చదువుతూ వున్నప్పుడు నాకు నెలతిరిగేసరికి ఏడెనిమిదివందలు చేతికి వచ్చేది. తమాషాగా అనిపించేది. ఏదో పోగొట్టుకున్నట్టు దిగులుగానూ వుండేది. బహుశ: అప్పట్నుంచే నేను పోగొట్టుకున్నదానికి డబ్బు ప్రత్యామ్నాయంలా అనిపించిందేమో! వస్తున్న వడ్డీలూ డివిడెండ్లూ చాలా ఇన్స్పిరేషన్ యిచ్చేవి. ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ దెమ్” అని, “స్పాయిల్ కావల్సినవాడిని, కాలేదు” అంటూ నవ్వాడు.
“నువ్వా? చెడిపోవడమా? నో వే. గీత చెవులు మెలేసి దార్లో పెట్టుకునేది” అన్నాడు ప్రహ్లాద్ తనూ నవ్వుతూ. “ఏం చేస్తార్రా, ఇదంతా? డబ్బు రూపంలో ఎందుకు వుంచారు? స్థలాలమీద పెట్టకపోయారా?” అడిగాడు.
“ఉన్నవి చాలు. మొదట్లో అంతగా తెలీక ఏవో కొన్నాం. ఏం కొనాలన్నా ఎంతో కొంత బ్లాకులో కావాలంటున్నారు. అంతా వైటే అంటే అసలు ట్రాన్సాక్షన్‍కే ముందుకి రావట్లేదు. మూడురకాల రేట్లు. అగ్రిమెంటులో రాసుకునేది, మార్కెట్లో వున్నది, గవర్నమెంటు రేటు. స్టాంపుడ్యూటీ, రిజిస్టేషన్ చార్జీలూ అమ్మేవాడి పేరుమీద మనమే కొనాలి. చేసేదంతా ఫేకే. పొలం కొన్నప్పుడు అన్నీ గీత మేనమాలు చూసుకున్నారు. గీత పేరుమీదే రిజిస్టర్ చేయిద్దామనుకుంటే తన జాతకానికి నప్పదని నాపేర చేయించారు. ఫామ్‍హౌసు కొన్నప్పుడు సమస్యైంది. నాదంతా వైటే. దీన్ని బ్లాక్‍గా మార్చి కొనడం దేనికి? అమ్మేటప్పుడు మళ్ళీ అదే సమస్య వస్తుంది. ఇదే మంచిదనిపించింది. మయూ విహీలు సెటిలైతే అన్నీ తీసేసి వాళ్లకి యిచ్చి చేతులు దులుపుకోవడమే ప్రహీ! ఎలా లైఫ్ మొదలుపెట్టామో అలా! పెన్షన్లు చాలు మాకు. లతలాంటి బేక్‍గ్రౌండు వుండి, వీళ్లకి వయసయ్యే ఇద్దరు ఆడపిల్లలున్న కుటుంబంకోసం వెతుకుతున్నాం” అన్నాడు వాసు. ప్రహ్లాద్‍కి ఎక్కడో చురుక్కుమంది. మొదట్లో తనూ యిలానే ఆలోచించేవాడు. బ్లాకూ, వైటూ వ్యవహారాలు నచ్చేవికాదు. నెమ్మదిగా రాజీకొచ్చాడు. మనిషికి ఆదర్శాలకన్నా ముందు సంపాదనా, కుటుంబం నడవడం ముఖ్యం. మరీముఖ్యంగా వాసులా గిరిగీసుకుని వుండిపోవటానికి ఉద్యోగం లేదు, స్వంతిల్లు లేదు. మాధురికి తన తల్లిదండ్రులతో సర్దుకుపోవడం రాదు. తన దారి తనదైంది. చిన్నవైనా క్రమం తప్పని జీతాలు, దాపరికాలు అందలం ఎక్కించాయి వాడిని. మరి ఇప్పుడీ సమస్య ఎందుకొచ్చింది?
“అసలు మీకు ఈ వుద్యోగాలు దేనికిరా? నువ్వే ఏదేనా బిజినెస్ మొదలుపెట్టకపోయావా?” అడిగాడు.
“మనింట్లో అందరివీ వుద్యోగాలే. వ్యాపారాలు ఎవరు చేసారు? ధైర్యం చెయ్యలేకపోయాను. టాక్సులన్నీ సరిగా కడుతున్నాను. ఐటీ రిటర్న్స్, ఆఫీసులో మూవబుల్, ఇమ్మూవబుల్ ప్రాపర్టీ రిటర్న్స్ వేస్తున్నాను. ఎక్కడా కొరీస్ లేవు. తేడా వుంటే డిపార్టుమెంటే అడుగుతుంది. కంప్లెయింటుదాకా అక్కర్లేదు. అసలది ఎవరిచ్చారో తెలీదు. గీతమీదకూడా యిస్తారా అని సందేహం వస్తోంది. డబ్బు ఖర్చుపెట్టకుండా దాచడంకూడా సమస్యలు సృష్టిస్తుందనుకోలేదు”
“అన్నీ క్లియర్‍గా వుంటే భయపడక్కర్లేదు. నీకెవరిమీదేనా అనుమానం వుందా? ఈమధ్య ఎవరితోటేనా గొడవపడ్డావా?”
“బైట గొడవపడితే ఆఫీసుల్లో కంప్లెయింట్లు యిచ్చేస్తారేంటి? ఐనా నాకెవరితోటీ గొడవల్లేవు. ఇచ్చిన వర్కేదో చేసేసి అక్కడ పడెయ్యడమేతప్ప దేంట్లోనూ తలదూర్చను”
“వీణావాళ్ల నాన్న?”
“ప్రహీ!!” తెల్లబోయాడు వాసు. గెస్ చాలా దగ్గరివరకూ వచ్చి ఆగింది.
“అసలిదంతా ఎలా జరిగింది వాసూ? అందరం ఫోటోలు చూసి, వెంటనే తీసేసాం. ఏమని అడగాలో తెలీక ఎవరం మాట్లాడట్లేదు. మేం కలగజేసుకుని చేసేది ఏదేనా వుందా? సుమతి నిన్నొచ్చి కలుద్దామనుకుని, ఈ సందిగ్ధంలోనే ఆగింది” అన్నాడు ప్రహ్లాద్. తన కుర్చీలోంచీ లేచి వచ్చి, వాసు భుజంచుట్టూ చెయ్యివేసి ప్రేమగా అన్నాడు. వాసులో చిన్న కుదుపు, ఏదో ఆలోచన మొదలైంది.
“బైటికి వెళ్దామా, ప్రహీ?” అడిగాడు.
“టెర్రస్‍మీద కుర్చుందాం. ఎవరూ రారు” అన్నాడు ప్రహ్లాద్. ఇద్దరూ లేచారు.
“ఇవాళ మీ భోజనాలు ఇక్కడే” అంది మాధురి. ఆమెకేసి ఇదివరకట్లా చూడలేకపోయాడు వాసు. తలదించుకున్నాడు. ఆమెకికూడా యిబ్బందిగానే అనిపించింది. వీళ్ళు పైకి వెళ్తుంటే రెండు ప్లేట్లలో వేయించిన జీడిపప్పు పోసి, ట్రేలో పెట్టి, ఫ్లాస్కులో కాఫీ, రెండు కప్పులూ, వాటర్ జగ్, గ్లాసులు సర్ది యిచ్చింది ప్రహ్లాద్‍కి.
“గీతని ఎంగేజ్ చెయ్యి” అన్నాడతను లోగొంతులో. తలూపింది.
ప్రహ్లాద్ పిల్లలిద్దరూ హాస్టల్స్‌లో వున్నారు. భార్యాభర్తలిద్దరికీ చాలా పెద్దదనిపించేంత యిల్లు. కట్టినదే కొన్నారు. కింద సగం ఆఫీసుకి వాడుకుంటారట. అది కాక ఒక బెడ్‍రూమ్, వంటిల్లు వున్నాయి. పైన మూడు బెడ్‍రూమ్స్, ఆ పైన పెంట్‍హౌస్ వున్నాయి. అరుణ, నందగోపాల్ ఇక్కడుండరు. కోడలితో మొదట్లో వచ్చిన స్పర్థ అలానే వుండిపోయింది. కొడుకు జీవితంలో తమకి తాము పైవాళ్ళలానే అనిపిస్తారు.
“నువ్వూ మొదలుపెట్టావా?” జీడిపప్పు చూస్తూ అడిగాడు వాసు. “ఏరా! తాగకపోతే మీ బుర్రలు పనిచెయ్యవా?”
“సొసైటీ అలా నడిచిపోతోంది వాసూ! గుంపులో కలిసి తిరగడమే” అన్నాడు ప్రహ్లాద్. వాసు చాలాసేపు మాట్లాడకుండా ఆలోచనలో వుండిపోయాక, హఠాత్తుగా అన్నాడు.
“మా చిన్నాడు మొదలుపెట్టాడు” అతని గొంతులో దు:ఖం సుళ్ళుతిరిగింది. తలదించుకుని చేతుల్లో ముఖం దాచుకున్నాడు. అతని భుజాలకుదుపు చూసి ప్రహ్లాద్ తెల్లబోయాడు.
“కూల్! వాసూ! విహీయా? వాడి వయసెంతరా? తీసుకొచ్చెయ్యకపోయారా?” అన్నాడు లేచి దగ్గిరకి వెళ్తూ.
“అన్నీ ధ్వంసమైపోయాయి ప్రహీ! ఒకడేమో కుటుంబపట్ల నా లాయల్టీస్ ఇంకా వున్నాయో లేదో తెలుసుకోవాలనుకున్నాడు. ఇంకొకడు వాళ్లమ్మని నేను మోసంచేసాననుకున్నాడు. ఇద్దరూ ఆ ఫోటోస్ చూసారు. ఇద్దరికీ పంపించింది. ఓదార్చడంలో భాగంగా ఫ్రెండ్స్ విహీకి డ్రింక్ రుచిచూపించారు. బంగారుతండ్రిరా వాడు. మయూని అమ్మావాళ్ళూ పెంచారు. వీడిని నేనే చాలావరకూ ఎత్తుకుని తిప్పాను. వాడి ఆటలు, నిద్ర అన్నీ నా గుండెలమీదే. ప్రహీ! ఒకసారి మొదలుపెడితే మళ్ళీ బైటికి రాగలుగుతారా? వాడి జీవితం మాకు భిన్నంగా వెళ్ళిపోతుందా?” ఆవేదనగా అడిగాడు. పిల్లలు దారితప్పుతుంటే ఎంత బాధ! తలతిరిగిపోయింది ప్రహ్లాద్‍కి.
“గీత పైకి ఏడుస్తోంది. నేను లోపల దాచుకుంటున్నాను. నిన్ను చూసాక ఆపుకోవడం నావల్ల కాలేదు. సారీ!”
“ఏం చేద్దామనుకుంటున్నారు వాసూ?
“మంచీ చెడూ చెప్పి వచ్చాం. దార్లోకి వస్తే సరే, లేకపోతే తీసుకొచ్చేస్తాం”
మళ్ళీ ఇద్దరిమధ్యా మౌనం.’
“విహీ మనసులో మెదిలినప్పుడల్లా ఈ పిల్లకూడా కదుల్తోంది. మా కళ్లలోంచీ జారిపడే కన్నీటిచుక్కల్లో వాటా అడుగుతోంది. ఇప్పటిదాకా కఠినంగానే వున్నాం. ఇప్పుడే కొద్దిగా మార్పు. స్పష్టత. నాలో. ఇక్కడికి వచ్చేదాకా. ఈ కొద్దిరోజులూ నా ఆలోచనలు వేరేగా వుండేవి. చాలా అవమానంగా, చెయ్యని తప్పుకి శిక్షపడ్డట్టు బాధగా, కోపంగా వుండేది. మీ అందరినీ తప్పించుకుని ఎక్కడికేనా వెళ్ళిపోదామన్న బలమైన కోరిక వుండేది. వీణని చంపేద్దామన్నంత ఆవేశంకూడా వచ్చింది. దానిమీద అసహ్యం వేసింది. అది చేసిన పనికి, చెడిపోయిందని అనుకున్న ఆడపిల్లమీద కలిగే సాధారణమైన అభిప్రాయంకదా? ఇక్కడికి వచ్చాక, నువ్వు నా భుజాలు పట్టుకుని ప్రేమగా మాట్లాడావు చూడు, అది నాలో కొత్త ఆలోచన రేపింది. అది పసిపిల్లే. అటొకటీ ఇటొకటీ పిలకలు వేసుకుని పరుగులు పెడుతూ తిరిగేది. గుర్తుందా, నీకు? సుధీర్ దాన్ని రెండు భుజాలూ పట్టుకుని పైకి లేపి, టేబుల్‍మీదో కుర్చీమీదో ఎక్కించడం, కిందకి దించమని అది ఏడవడం ఒక స్పష్టమైన జ్ఞాపకం”
గుర్తున్నట్టు ప్రహ్లాద్ తలూపాడు. “నిజమే! అలాంటిపిల్లకి మత్తుమందులిచ్చి దగ్గిరకి దున్నపోతుల్లాంటి మనుషుల్ని పంపించినవాడు పశువా, రాక్షసుడా వాసూ? అక్కడినుంచీ తప్పించుకుని వచ్చాక యిక్కడకూడా దాన్ని సరిగ్గా చూడలేదు. ఇంట్లోంచీ వెళ్లగొట్టమందట వాళ్ళ అమ్మమ్మ. లత చెప్పినట్టు వైద్యం చేయించలేదు. నాటుమందులిచ్చి అబార్షన్ చేయించారు. చచ్చి బతికిందట. ఇప్పటికీ ఇంట్లో ఎవ్వరూ సరిగ్గా మాట్లాడరట దాంతో. ఆపైన ఏకాంతవాసం. కొన్ని అలాఅలా పైపైన తెలిసిన విషయాలు, కొన్ని సంతోష్ చెప్పినవి. విని నేనే చాలా డిస్టర్బయాను. ఫోటోలు రెండూ చూస్తుంటే చాలా భయం వేసింది. మన పిల్ల. ఎక్కడో తెలీనిచోట అలా. ఫోటోల్లో నాకు నువ్వు కనిపించలేదురా! నీ మొహం అతికించుకున్న పశువు కనిపించింది. వీణ తనకి జరిగినవి మనకి తెలియాలనుకుంది. తన మనస్థితికి తగ్గట్టు చెప్పింది. దోజ్ ఫోటోస్ ఆరె కమ్యూనికేషన్. అంతే. అంతకన్నా నువ్వు ఆలోచించి బాధపడద్దు. గీతకి చెప్పు. ఇంకేదైనా ఆలోచన వాళ్ళకి వున్నా, దాన్ని పట్టించుకోవలసిన అవసరం మనకి లేదు. మా అందరిదీ యిదే అభిప్రాయం” అన్నాడు.
“గీతకి దానిమీద చాలా ప్రేమ. అక్కడికీ పూనానుంచీ వచ్చిన కొత్తలో పెద్దవాళ్లంతా వెళ్ళి చూసి వస్తుంటే అంది, దాన్ని మాట్లాడించండి, దాని బాధ వినండని. అలా జరగలేదు. మొహమాటపడుతూ, సిగ్గుపడుతూ వీళ్లంతా వెళ్ళివచ్చారు. వాళ్లమ్మకి నచ్చలేదు. అసలే ఆవిడది మూర్ఖత్వం. ఈ ఆడపిల్లలంతా వెళ్ళి ఏదో ఒకటి చేసేలోగా వాళ్ళే అందరికీ దూరంగా వెళ్ళిపోయారు”
“మళ్ళీ మీ యిల్లు వెతుక్కుంటూ ఎందుకొచ్చార్రా? పరిష్కారం వెతుక్కోవడంలో తప్పులేదు వాసూ! వెతుక్కోవడానికి ఎంచుకున్న దారి తప్పు. వీణ మనందర్లో ఒకతి. దాని దు:ఖానికి పరిష్కారం చూపించాల్సిన బాధ్యత మనకి వుంది. దాని కష్టాలు భిన్నమైనవి. మనం కనీ వినీ ఎరగనివి. ఎవరూ తట్టుకోలేనంత అమానుషమైనవి. మహీ, వసంత్, రాణా వీళ్లందరికీ సపోర్టిచ్చాం. వీణకీ ఇవ్వచ్చు. తల్లీతండ్రీ ప్రేమగా దగ్గిరకి తీయాలి. ధైర్యం చెప్పాలి. ఇదివరకూ ఆయన వొళ్ళో కూర్చునీ, ఆయన భుజాలమీద పడీ పెరిగిన పిల్లేకదా? ఆయన కూతురేకదా? ఆయనా, ఆవిడా అసహ్యించుకుంటే ఎలా బతుకుతుంది? ఎంతకాలం అందరినుంచీ దాక్కుని వంటరిగా వుంటుంది? సమస్యని డబ్బాలో పెట్టి దాచేస్తే అది బాంబులా పేలుతుంది. సంతోష్ వచ్చాక అందరం కలిసి వెళ్ళి ఇదే చెప్పాలనుకుంటున్నాం”
“ఆ బాంబు మాయింట్లో పేలింది. అదీ సమస్య. మన పిల్లేకదా అనుకున్నాం. ఇలాంటిది జరుగుతుందని కొంచమేనా వూహించి వుంటే జాగ్రత్తపడేవాళ్ళం. ఒరిజినల్స్ నా చేతిలోనే వున్నాయికాబట్టి ధైర్యం. డీమార్ఫ్ అయుంటే సంతోషంగా వుండేది. సంతోష్‍కోసమే నేనూ ఆగాను. వాడొచ్చాక ఏం చెయ్యాలనేది నిర్ణయించుకుంటాను. గీతకి నా తప్పేం లేదని తెలుసు. నాకు తను ప్రాణవాయువులాంటిది. మాకు రెండు అభిప్రాయాలు ఎప్పుడూ వుండవు ప్రహీ!”
“విడాకులిస్తానందటకదరా? అందరం కలిసి సన్మానం చేద్దామని నిర్ణయించుకున్నాం” ప్రహ్లాద్ పకపక నవ్వాడు. వాసుకూడా నవ్వాడు. ఇద్దరూ చాలాసేపు మాట్లాడుకుంటూ కూర్చున్నారు. ఆఖర్లో అన్నాడు వాసు.
“విహీ విషయం ఎవరితోటీ అనకు ప్రహ్లాద్! వాడిమీద ముద్రపడిపోతుంది. అలాగే ఈ డబ్బువిషయంకూడా. తెలిసేవాళ్ళకి తెలుస్తుంది. ఇప్పుడు నీకులాగే” అన్నాడు. ప్రహ్లాద్ మొదటిదానికి తలూపాడు. రెండోదానికి నవ్వేసాడు.
కిందకి వెళ్ళారు. అప్పటికి గీత, మాధురి చెప్పుకునేవన్నీ చెప్పేసుకుని వీళ్ళకోసం ఎదురుచూస్తున్నారు. ఎప్పుడూ అందరికీ వీళ్ళు సాయంచెయ్యడమే తప్ప వీళ్లకి ఎవరి అవసరం ఇప్పటిదాకా రాలేదు. అలాంటివాళ్ళు నీలిమ, మాధవ్‍ల సాయంతో అంత పెద్దసమస్యలోంచీ బైటపడటం మాధురికి కొద్దిగా గర్వాన్ని కలిగించింది.
“అసలలా ఎలా వదిలిపెట్టారు గీతా? దాన్ని జుట్టుపట్టుకుని నలుగుర్లోకీ లాక్కొచ్చి బుద్ధిచెప్పద్దా?” అంది. గీత తెల్లబోయింది.
“చదువుకుని ఒక పద్ధతిలో బతుకుతున్నవాళ్ళం, అలా బజారెక్కి దెబ్బలాడగలమా మాధురీ? ఇలాంటివి బైటికి రాకుండా చూసుకుంటాంగానీ? లాయరుకి అప్పజెప్పాం. దాని మనస్థితి బాగా లేదు. సంతోష్ వచ్చి చూసుకుంటానని బతిమాలుకున్నాడు. అందుకే ఆగాం” అంది నెమ్మదిగా. మాధురికి నచ్చలేదు. నీలిమ ఆమెకి అన్నివిషయాలూ చెప్పింది. చెప్పేదగ్గిర నీలిమా, అడిగేదగ్గిర మాధురీ కొంచెంకూడా హద్దుని గీసుకోలేదు. తెలీనట్టో, వినీవిననట్టో వూరుకోవడం యిద్దరికీ రాదు.
“విడాకులు యిస్తానన్నావట దేనికి?”
ఉండెలుదెబ్బ తగిలినట్టు విలవిల్లాడింది గీత ఆ ప్రశ్నకి. ముఖం మ్లానమైంది. దు:ఖాన్ని ఆపుకోవడం చాలా కష్టమైంది. “అప్పటికి తోచిన మార్గం అది. జైలుకి పంపలేనుకదా, వాసుని? అతనికి ఏ చిన్న ఆపద వచ్చినా తట్టుకోలేను. నాకు భర్తకన్నా ఎక్కువ, ప్రాణస్నేహితుడతను. దానిముందు చట్టపరమైన బంధాలెంతవి?” అంది గొంతు వణుకుతుండగా. ఏ యిద్దరూ ఒకరికొకరు అర్థమవ్వరు. గీత ఔచిత్యపు హద్దు దాటదు. మాధురికి అలాంటివేవీ వుండవు.
“పిచ్చా, నీకు? ఎవరికోసమో కాపురం వదులుకుంటానన్నావు. అవన్నీ పుస్తకాల్లో రాసే మాటలు. అంత అవకాశం యిచ్చాక మగాళ్ళు లొంగి వుంటారా? బావగారుకూడా అమాయకులు కాబట్టి సరిపోయింది. తెలివిగా వుండు గీతా! ఇద్దరూ యాభైలకి దగ్గిరపడుతున్నారు. ఇప్పటినుంచేకదా, భార్యాభర్తలకి ఒకరి తోడు ఒకరికి కావల్సింది? బాధ్యతలు తీరిపోయాయి. బాగా సంపాదించుకున్నారు. బైట లోకం బాగా లేదు. బట్ట కాల్చి మీదపడేసి, దెబ్బలాటకి వస్తున్నారు. అందులో మీ పిన్నికి నీమీద నిండా ద్వేషం. దాన్ని మీయింట్లో పడెయ్యాలని పెద్ద స్కెచ్చి వేసారు” అంది. గీత మాధురి అంతకుముందటి ప్రశ్నలోంచీ తేరుకుని బలహీనంగా నవ్వింది. ఇవన్నీ తామిద్దరికీ వచ్చిన ఆలోచనలే. బైటికి అనడం తమకి సభ్యతనిపించలేదు. జాగ్రత్తపడమని హెచ్చరించడం మాధురికి తప్పనిపించలేదు.
మాధురికి ఎదురైన మరో సందిగ్ధం, వాసుతో తనిప్పుడు ఎలా వుండాలి? ఇదివరకట్లా వుండచ్చా, కొంగూ అదీ కప్పుకుని తప్పుకుని తిరగాలా అని. అంత జరిగాక గీత వాసుతో మామూలుగా ఎలా వుండగలుగుతోందనే సందేహం యింకొకటి. అందరినీ వాళ్ళింటికి రప్పించుకునే గీత, వాసు యిప్పుడు తమింటికి అతిథులుగా వచ్చారు. తనకున్నవన్నీ ఆర్భాటంగా చూపించుకోవాలనే ఆరాటం మరొకటి. ఇవన్నీ కలగాపులగంగా ఆమెమీద ప్రభావం చూపించాయి. వాసుకి అర్థమైంది. ప్రహ్లాద్ అన్నాడని భోజనాలకి ఆగారుగానీ, ఇద్దరూ ఏమీ తినలేకపోయారు. వాసు అటూయిటూ కెలికి ఆకలి లేదని వదిలేసాడు. తనూ తినకపోతే బావుందదని తిన్నాననిపించింది గీత. వాళ్ళు వచ్చినప్పటికీ ఇప్పటికీ తేడా కనిపించింది ప్రహ్లాద్‍కి. ముఖ్యంగా గీత కంటిచివర్ల ఆగివున్న కన్నీటితడి అతన్ని విచలితుణ్ణి చేసింది.
“మీరిద్దరేకదరా, వుండండి యీవేళ” అన్నాడు ప్రహ్లాద్.
“ఆఫీసులో?” అడిగింది గీత.
“ఇక్కడినుంచీ వెళ్లండి. ఏం, రానివ్వరా?” అంది మాధురి.
“ఇదేదో బావుంది. స్లీప్ ఓవర్లు పెట్టుకుందాం. శనివారం రాత్రి ఎవరో ఒకరం మరొకరి ఇంటికి వెళ్ళిపోతే బావుంటుంది. అందరం ఒక్కసారి కలవాలంటే కుదరదు. కనీసం ఇలా ఒకొక్కరం కలుద్దాం” అన్నాడు ప్రహ్లాద్.
“ఈ గొడవలన్నీ అయాక మొదలుపెడదాం” అన్నాడు వాసు.
“పిల్లలు పెద్దయ్యారు. ఇక మన వ్యాపకాలు మనమే కల్పించుకోవాలి” అంది గీత. ఏవో మాటలు అనాసక్తంగా సాగాక వెళ్తామని లేచారు యిద్దరూ. ఉండమని మరోసారి చెప్పాడు ప్రహ్లాద్.
“మరోసారి వస్తాం” అంది గీత. “నువ్వు చూడటం అయాక నాకు ఫోన్ చెయ్యి ప్రహీ! ఎవర్నేనా పంపించి తెప్పించుకుంటాను” అంది. ఇద్దరూ యింటికి వచ్చేసారు.
“గీతతో ఏం మాట్లాడావు?” అడిగాడు ప్రహ్లాద్ మాధురిని, వాళ్ళు వెళ్ళాక. ఆమె దాపరికం లేకుండా చెప్పింది. అతనికీ తప్పనిపించలేదు. అన్నిటికన్నా పెద్దసమస్య, ఇద్దరిదగ్గిరా అంత పెద్దమొత్తాల్లో డబ్బుండటం. కోటో రెండుకోట్లో బేంకులో ఫిక్స్ చేసుకుని వచ్చే వడ్డీతో దర్జాగా బతికెయ్యచ్చునని మాటల్లో అనుకోవడం వేరు, ఆచరణ వేరు. పిల్లలు పెట్టమని అలా వదిలేసాడు వాసు. చెప్పుకోదగ్గ ఆస్తులున్నాయి. ఏం చేస్తాడు అంత డబ్బు? రిటైరైతే గ్రాటుటీ, పెన్షనూ వస్తాయి. అవీ పెద్ద మొత్తాల్లోనే వుంటాయి. ప్రస్తుతం వున్నది కార్పొరేట్ ఎకానమీ. వాళ్ల వుద్యోగులకి పెద్దపెద్ద జీతాలిచ్చి విలాసంగా ఖర్చుపెట్టమని ప్రోత్సహిస్తున్నారు. మిగతావాళ్లంతా ఆ మాయలో పడుతున్నారు. పగలూ రాత్రీ అని లేకుండా కష్టపడి సంపాదించి, తిరిగి వాళ్ళకే చెల్లించుకుంటున్నారు. సగటుని ఐదేళ్ళకొసారి టీవీ, ఫ్రిడ్జి, కారు, వాషింగ్ మిషను, కంప్యూటరు, సెల్ మార్చిమార్చి కొంటున్నారు. అందరూ వీళ్లలా పొదుపుచేస్తే వ్యవస్థ కుప్పకూలుతుంది. వీడొక్కడూ ఆ వలయంలోంచీ ఇవతలికి వచ్చి లాభపడ్డాడు.
ఎంట్రప్రెనర్‍గా మయూని తయారుచెయ్యాలి. దొరవారు వాడికీ దాచడం నేర్పాడట. ఏం చెయ్యాలనో! పిల్లల భవిష్యత్తుగురించి వాసు మాటలు గుర్తొచ్చి చిన్ననవ్వు మెదిలింది అతని పెదాలమీద. సుమంత్‍తో చర్చించాలనుకున్నాడు. ముందైతే మాధవ్‍కి ఫోన్ చేసి మాట్లాడాడు.
“ఇంకోసారి నన్ను ఎవరింటికీ రమ్మనకు గీతూ! మాధురి ప్రవర్తన కంఫర్టబుల్‍గా లేదు” చిరాగ్గా అన్నాడు వాసు ఇంటికొచ్చాక. గీత అతని భుజంమీద తలవాల్చి ఏడ్చేసింది.
“ఏమైందమ్మా? నీతో ఏదేనా తలతిక్కగా మాట్లాడిందా?” చిరాకు అదుపుచేసుకుని బుజ్జగింపుగా అడిగాడు. చెప్పలేదామె.
“నాకూ నీలానే అనిపించింది” అనిమాత్రం అంది.
మరో పావుగంటకి మాధవ్ ఫోన్‍చేసాడు.
“ప్రహ్లాద్ చెప్తే తెలిసింది. నాకు నువ్వెందుకు చెప్పలేదురా, వాసూ? ఏం జరిగింది?” అన్నాడు.
“నేను చూసుకుంటాలే, వదిలేసెయ్” వాసు నిరాసక్తంగా జవాబిచ్చాడు. ఎన్నిసార్లడిగినా అదే జవాబు. ఫోన్ పెట్టేసి గీతకి చేస్తే ఆమె చెప్పింది. ఆ ఆదివారం అతను వాళ్ళదగ్గిరకి ప్రయాణమౌతుంటే లక్ష్మి అడిగింది. అతను చెప్పింది వింది.
“చూద్దాం, ఇంకా ఎక్కడిదాకా తీసుకెళ్తుందో వాడిని!” అంది.
“ఎక్కడికి తీసుకెళ్తుంది? ఎందుకు తీసుకెళ్తుంది? వాళ్ళిద్దరూ భార్యాభర్తలు. వాళ్ళకి తోచినట్టు వాళ్ళుంటారు. ఇందులో ఎవరూ చిన్నపిల్లలు కాదు. వాళ్లవి వాళ్ళకి వదిలేస్తే వాళ్ల పరిష్కారం వాళ్ళే చూసుకుంటారు. అవసరమైతే కొట్టేవాళ్లని నాలుగు కొడతారు, పోలీసులకి చెప్పుకునేవి చెప్పుకుంటారు. ఏం గొడవమ్మా, నీది? ముందు ఏదారీ తోచక విడాకులిచ్చి వాడిని బైటపడేద్దామనుకుంది వదిన. లేకపోతే వీణని తెచ్చుకుని తనగదిలో పెట్టుకుంటుందా? అదే పట్టుకుని కూర్చున్నావు. మేం వెళ్ళాక పరిస్థితి మారింది. తర్వాతేం చెయ్యాలో సంతోష్ వచ్చాక ఆలోచించుకుంటారు. ఇప్పుడేనా వాడు చేసిన తప్పేమీ లేదు. అనవసరఖర్చులకీ, ఆర్భాటాలకీ పోకుండా దాచారు. అది చూసి ఎవడికో కడుపుబ్బి కంప్లెయింటు రాసాడు. ఆఫీసుల్లో ఇలాంటివి జరుగుతునే వుంటాయి. ఆఫీసరుతో పడకపోతే అరగంట ఆలస్యానికికూడా వివరణ అడుగుతాడు. వాడి దాపరికాలు మనకి తెలీనివా? అవీయివీ కొనుక్కొచ్చి నీకు చెప్పకుండా తులసిదగ్గర దాచుకునేవాడు. మర్చిపోయావా?” అన్నాడు మాధవ్.
లక్ష్మి ఏమీ మాట్లాడలేదు.
“ఆరేళ్ళపాటు ఎలాంటి సమాచారం లేకుండా వున్నారు వాళ్ళు. వీణకి ఏవేవో జరిగాయి. అలాంటివాళ్ళు నిన్ను వెతుక్కుంటూ వచ్చారంటే అది ప్రేమని నువ్వెలా నమ్మావు? నమ్మితే నమ్మావు, దాని పద్ధతి నచ్చలేదని వాళ్ళిద్దరూ అన్నప్పుడేనా రావద్దని చెప్పలేదు. జరిగేవన్నీ జరిగిపోయాక ఎవరిని తప్పుపడతావు? ఇప్పటికేనా వాడు అందులోంచీ క్షేమంగా బైటపడ్డాడని అనుకోలేం. సంతోష్ రావాలి, వచ్చి ఆ మంత్రగత్తె గుహలో ఇంకేం వున్నాయో చూస్తే తప్ప తెలీదు. ఇలాంటి టైంలో వాళ్ళని విడిచిపెట్టేసావు. మామయ్యావాళ్లకి చెప్పాలంటే నీకన్నా పెద్ద బీపీమనిషి ఆయన. ఈ రాజదంపతులేమో ఎవరింట్లోనూ వుండలేరు. ప్రహీ ఆపుదామని చూస్తే ఇద్దరూ వినలేదట” కొనసాగింపుగా అన్నాడు.
“మీ చెల్లెలూ అలానే వుంది.
పెద్దన్నయ్యని దేవుడనుకున్నాను. అలా ఎలా చేసాడు? వీణ మాతో ఫోన్లో మాట్లాడటానికే భయపడి దాక్కునేది. అలాంటిది వాసుని ఒక్కడినీ ఎలా నమ్మిందో, నమ్మింది. మిగతా మూడు ఫోటోలూ వదిలేసినా, ఫామ్‍హౌసులో తీసుకున్నవి కాదని ఎలా అనగలడు? వాటిని అంత మార్ఫింగ్ చేసుకునే అవసరం ఏం వుంటుంది? అన్నీ మార్చిందే అనుకుందాం, ఒక్కటేనా రివర్స్ కాదా- అంటోంది.
ఒక్కటి మార్చగలిగితే అన్నీ మారతాయే- అని వల్లి అన్నా నమ్మట్లేదట.
మారలేదంటే ఒరిజినలేకదా- అని వాదించిందట.
శ్రీధర్ మాట్లాడారట మీ అన్నయ్యతో” అంది నీలిమ.
“మనుషుల్ని దేవుళ్ళనుకోవడం దేనికి, వాళ్ళు తప్పుచేసారని బాధపడటం దేనికి? వాడు మనిషి. మనుషులకొచ్చే సమస్యలే వాడికీ వచ్చాయి” విసుక్కున్నాడు మాధవ్.
“అరేయ్, నీతో మాట్లాడేవాళ్ళు మాట్లాడతారు, లేనివాళ్ళు లేదు. విషయం అలాంటిదికాబట్టి అంతా యిబ్బందిపడుతున్నారు. అంతేగానీ ఒక్కసారిగా నువ్వేం దుర్మార్గుడివైపోలేదు. ఇంతకన్నా పెద్దపెద్ద సమస్యల్లోంచే బైటపడ్డాం మనందరం. ఇప్పుడూ అంతే. బైటపడతావు. ధైర్యంగా వుండు” అన్నాడు అక్కడికి చేరాక వాసుతో. అతనొచ్చాడని ప్రహ్లాద్ వచ్చాడు. నెమ్మదిగా ఒకొక్కరూ రావడం మొదలైంది. జోకూడా వచ్చాడు. విషయానికిగల తీవ్రత తగ్గింది. సుమతి వచ్చింది. దూరంగా వున్నవాళ్ళకి సమస్యలేవీ ప్రత్యేకించి చెప్పొద్దన్న కట్టుబాటు చేసుకున్నారుగాబట్టి మహతికీ, రవళికీ తెలీలేదు. రాణా ఎప్పట్లానే దూరం. సమీర రాలేకపోయింది. శశిధర్‍కి రాణా చూపిస్తే, వాటిని అతను సమీరకి చూపిస్తే ఆమె చిటికెనవేలితో తోసిపారేసింది.
“అన్నీ ఫేక్. వల్లి చెప్పింది” అంది. ఆమెకి వాసుమీద వున్న నమ్మకం అతని ద్వేషానికి మరొక చిన్నపోగుని కలిపింది.
“ఏమే, పిల్లలు పెద్దైపోయారని వాసుని వదిలేసి వెళ్ళిపోదామనుకున్నావా? ఎంత గర్వమే నీకు?” అంది సుమతి గీతతో.
“అంత తెలివి ఎక్కడిది? వాడిమీద ఈగ వాలింది. దాన్ని చంపడానికి ఈవిడ కత్తి తీసుకుని బయల్దేరింది” అన్నాడు ప్రహ్లాద్ పెద్దగా నవ్వి.
“పోరా! అందరూ నన్ననేవాళ్ళే” అంది గీత. అందులో కోపం లేదు, చురుకు లేదు. చల్లారిపోయి నుసి రాలుస్తున్న మండుకట్టెలా వుంది.
రెండురోజులుండి, మాధవ్ వెళ్ళిపోయాడు. లెక్కలన్నీ సరిగానే వున్నాయిగాబట్టి సెన్షూర్‍తో సరిపెట్టి వాసుమీద సస్పెన్షన్ తీసేస్తారనుకున్నాడు. అందుకు భిన్నంగా జరిగింది.
వాసు కొద్దికొద్దిగా వెల్తిపడుతున్నాడు. జరుగుతున్న అవమానాలని తట్టుకోలేకపోతున్నాడు. మనసు రగిలిపోతోంది. గీతని విడిచిపెట్టడంతప్ప మరోమార్గం లేనంత ప్రమాదంలోకి వెళ్ళిపోయిందా ఈ పెద్దకుటుంబలోని తన చిన్ని అంతర్భాగం? చట్టం ఎక్కడినుంచీ వ్యక్తుల జీవితాల్లోకి చొచ్చుకువస్తోంది? వందమంది దోషులు తప్పించుకున్నా పర్వాలేదు, ఒక నిర్దోషికి శిక్షపడకూడదనికదా, చెప్పేది? తను దోషి కాడు. గీతా, పిల్లలూ ఏ నేరం చెయ్యలేదు. ఇందరు నిర్దోషులకి పడబోయిన శిక్ష యిది. అతనికి దిగ్భ్రమగా అనిపిస్తోంది. అసలా ఆలోచనే తట్టుకోలేకపోతున్నాడు. గుండెకి పెద్దదెబ్బ తగిలినట్టుంది. మరోవైపు పిల్లల మాటలు, తల్లి కోపం, తులసి తిరస్కారం అతన్ని లోలోపల్నుంచీ తినేస్తున్నాయి. మిగిలినవాళ్ళు ఎవరేం మాట్లాడినా పైపై పూతలా వుంటోందితప్ప మనసుకి పట్టట్లేదు. ప్రేమ వున్నచోట కోపం, పంతం కొన్నాళ్ళుంటాయి. ఆ తర్వాత బెంగా, దిగులూ మొదలౌతాయి. శ్రీధర్ మాట్లాడినా అది అతనికి ఓదార్పు కాలేదు. గీతకూడ వీలైనంత లీవు పెట్టి మధ్యమధ్యలో వెళ్ళి వస్తోంది. ఇంట్లో జరిగిన వ్యవహారం ఎవరికీ తెలీదు. అది తెరిపి. వాసు సస్పెన్షన్ విషయం బైటపడింది. స్టాఫంతా రూల్ పొజిషనదీ చెప్తూ ధైర్యం చెప్తున్నారు. గీత ప్రోపర్టీ రిటర్న్స్‌కూడా చర్చలోకి వచ్చాయి.
“మాక్కూడా పని పెడతారా గీతగారూ? జీపీయఫ్‍లో నెలకింతని నామినల్‍గా వేసి, ఏడాదికి కచ్చితంగా లక్ష వడ్డీ తీసుకునే పార్టీ మీరు. గవర్నమెంటుకి ఎంత లాస్ చేస్తున్నారో మీకు తెలీడంలేదు” పరిహాసంగా అడిగాడు గీత బాస్. అతను గీతకన్నా బాగా చిన్నవాడు. ఆమెతో సరదాగా మాట్లాడతాడు.
“పన్నెండుశాతం వడ్డీ చూసిన బేచి మాది. ఇప్పుడిస్తున్నది ఏమూలకి? అబ్బబ్బ ఏం లెక్కలండీ! మరి నేను సర్వీసులో చేరినప్పట్నుంచీ దాచుకున్నవో?” అందామె చురుగ్గా.
“అవి దాచేసుకున్నారుకదా? మళ్ళీ వడ్డీ ఎక్కడిది?” నవ్వుతూ అని, “వాసుదేవ్‍గారు యింట్లోనే వుంటున్నారా? సస్పెండ్ చెయ్యటమనేది కొంచెం అసహజంగా వుంది. విజిలెన్స్ కేసుగాబట్టి చేసి వుంటారు. మీకు రూల్స్ తెలీవని కాదు, రిప్లై స్టేట్‍మెంటు యిచ్చేటప్పుడు ఒకరిద్దరితో క్రాస్‍చెక్ చేసుకోండి. నాకు యిచ్చినా చూస్తాను” అన్నాడు.
“మరీ రూల్స్ పట్టుకుని వేలాడకుండా యూనియన్‍ద్వారా ప్రయత్నించండి. అవసరమైతే డబ్బు పడెయ్యండి” కాస్త చనువున్న ఫ్రెండ్సు సలహా యిచ్చారు.
మాధవ్, వసంత్, శ్రీధర్ సమస్య తలెత్తిన మూలాలు వెతుకుతున్నారు. ఇన్ఫ్లుయెన్స్ చెయ్యడానికి ఏవేనా లింక్స్ దొరుకుతాయెమోనని శ్రీధర్ బాగా ప్రయత్నం చేస్తున్నాడు. చాలా పైనించీ వత్తిడి వుందనిమాత్రం అర్థమైంది. ప్రమోషన్‍మీద పై రేంకులకి చేరుకున్నవాళ్ళని మేనేజి చెయ్యచ్చుగానీ, నేరుగా సివిల్స్ రాసి వచ్చినవాళ్ళు ఇతరుల జోక్యానికి హర్టై, బిగుసుకుపోతారు. వాళ్ళ ఈక్వల్సో, ఇంకా పైవాళ్ళో చెప్తేగానీ వినరు. పిచుకమీద బ్రహ్మాస్త్రంలాంటి ఇదంతా దేనికి దారితీస్తుందో తెలీడం లేదు.
“ఇన్నేసి డబ్బులు దాచుకోవడమేంట్రా? అలా గాల్లో వదిలెయ్యడానికి భయం వెయ్యదా?” విసుక్కున్నాడు రవి.
“గవర్నమెంటు అకౌంట్సేకదా?’” అన్నాడు వాసు.
“ఏరా, జీపీయఫ్‍లూ అవీ తియ్యరా? పిల్లల చదువులు? అంత ఎక్కువయ్యాయా మీకు? భార్యాభర్తలిద్దరూ వుద్యోగాలు చేస్తున్నప్పుడు ఒక జీతం దాచాలని సలహాయిస్తాం. దాన్నిలా తూచా తప్పకుండా పాటించేవాళ్లుంటారని నాకు తెలీదు. ఇప్పటికి గీత సర్వీసెంత? ఎంత సంపాదించి వుంటుంది? అదంతా అక్కడా యిక్కడా పెట్టుబడి పెట్టేసావా? మీ యిద్దరినీ భూమ్మీద పెడితే పంటలూ, ఆకాశంలో పెడితే వానలూ వుండవనేది అందుకే. మనింట్లో ఫంక్షన్లలో చూసాంకదా? మేనేజిమెంటంతా దానిచేతుల్లో పెట్టేసి నిశ్చింతగా కూర్చునేవాళ్ళం. పొదుపంటే ఇలా వుంటుందా?”
రవి బాధేంటో అర్థమైంది అతనికి. అందరూ యించుమించు ఒకేరకమైన ఆర్థికనేపథ్యంలోంచీ వచ్చారు. ఎవరు సంపాదించుకున్నది వాళ్ళు సంపాదించుకున్నారు, దాచుకున్నది దాచుకున్నారు. ఇప్పుడు తనని చూసి నాలిక కరుచుకోవడం. ఇన్నేళ్ళూ సంపాదించిందంతా ఏమైపోయిందాని కంగారుపడుతున్నాడు.
“లక్షరూపాయలు దాచి, ఎప్పుడు చేతికొస్తాయాని రోజులు లెక్కపెట్టుకునే మనుషులం. మేమంతా వచ్చినవి వచ్చినట్టు తగలేసి, చేతులు దులుపుకుని రిటైర్మెంటు డబ్బులకోసం ఎదురుచూస్తూ కూర్చున్నాం”
ఆఖరిమాటలతో స్పష్టమైంది.
“మీ అందరి డబ్బూ ఎన్ని మెమరబుల్ ముమెంట్స్‌గా మారిపోయి వుంటుందో గుర్తుతెచ్చుకో. సంపాదించడంకన్నా ఖర్చుపెట్టడం చాలా కష్టం మామయ్యా! చాలా తెలివితేటలుండాలి. లేకపోతే అనవసరంగా ఖర్చుపెట్టేసామని బాధపడుతూ వుంటాం. ఇప్పుడు మాకూ ఖర్చులు మొదలయ్యాయి. ఇందరు పిల్లల చదువులూ, తిరగడాలూ చూసుకోవాలి ” అన్నాడు చిన్నగా నవ్వి. రవికూడా నవ్వాడు. వాసు మనసులోని గాయంకూడా అర్థమైంది. సుధీర్‍తో పోల్చి తక్కువ చేసాడు వీడిని. వాడు పెద్దడాక్టరైతే వీడు ఆ డాక్టరుకికూడా బతకడానికి కావల్సిన ఆక్సిజెన్‍లాంటి డబ్బుని పోగుచేస్తున్నవాడు. ఎవరూ తక్కువ కాదు.
“ఐనా ప్రతియేటా అన్నిటికీ లెక్కలు అప్పజెప్తునే వున్నాక ఇంకా కేసేమిట్రా? అంత బుర్రతక్కువగా కంప్లెయింటు యిచ్చినవాళ్ళెవరు? ఇస్తే యిచ్చారు, ముందూ వెనకా చూడకుండా సస్పెన్షనేంటి? ” అన్నాడు రవి చివరగా.
సర్వీస్ యూనియన్స్ బాగా గొడవచేసాయి, సస్పెన్షన్ అన్యాయమనీ, ఎత్తెయ్యమనీ డిమాండ్‍చేసాయి. ఎంక్వైరీ రిపోర్టు రావాలన్నాడు వాసు పై ఆఫీసరు. రోజూ ఎవరో ఒకరు వాసుని యింటికొచ్చి కలుస్తున్నారు. అతని ఇన్నర్ సర్కిల్లోకి ఎవరేనా రావడం అరుదు. తమమధ్య అతను మిస్‍ఫిట్ అని తీర్మానించుకున్నారు. అతను సరదాగానే మాట్లాడతాడుగానీ, సరిగ్గా రెండే రెండు నిముషాలయ్యాక మాటలకోసం వెతుక్కుంటారు అవతలివాళ్ళు. ఇప్పుడు వచ్చి చనువుగా మాట్లాడుతున్నారు. చిన్నప్పటిరోజుల్లోకి ప్రయాణం చేసినట్టనిపించింది అలాంటి యిళ్ళలో గడిపినవాళ్ళకి.
అతని పాతకాలపు యింట్లో చక్కటి పెయింటింగ్ వేసిన టేబుల్ ముందు కూర్చుని, దండిగా నెయ్యి వేసి చేసిన వేడివేడి కిచిడీనో, వుప్పుపిండో తింటూ, కండెన్స్ చేసి పెట్టుకున్న యింటిపాలతో తయారైన కాఫీయో, అల్లం జీలకర్రా నలగ్గొట్టి వేసిన చిక్కటి మజ్జిగో తాగుతూ మాట్లాడటం అందరికీ ఒక కొత్త అనుభవం.
“బాబూ, ఇదేనా మీ తిండి? ఇంక మీకు ఖర్చులేం వుంటాయిలే? మటనూ, చికెనూ తినేవాళ్ళకి వుంటాయిగానీ!” అనేసారు.
“ఇలాంటి యిల్లొకటి నాకుంటేనా?” అని ఒక కొలీగ్ అంటే,
“దాన్ని పడగొట్టి మళ్ళీ కట్టించి సంపాదించిందంతా ఖర్చయ్యేదాకా నిద్రపోయేవాడివి కాదు” అని రిపార్టీ ఇచ్చాడు వాసు. అతను లంచాలవీ యివ్వడని అందరికీ తెలుసు. ఆ విషయం అంతా వుపేక్షించారు. సమాజం యావత్తుగా చెడిపోలేదు. అంతా అతనివైపే వున్నారు.
ఈ హడావిడిలో సంతోష్, భార్యా వచ్చారు. ఎయ్‍ర్‍పోర్టునుంచీ నేరుగా యింటికెళ్ళాడు. కొడుకునీ కోడలినీ అయిష్టంగా ఆహ్వానించింది లీల.
“ఎందుకొచ్చావురా? ఏం వుద్ధరిద్దామని? నీ బతుకేదో నువ్వు బతక్క?” అడిగింది కోపంగా. అతను జవాబివ్వలేదు. కోడలు కాళ్ళకి దణ్ణం పెడితే వెనక్కి జరిగింది. ఆ అమ్మాయి చిన్నబుచ్చుకుని దూరంగా నిలబడింది.
“తను నా భార్య, ఈ పిల్ల నా కూతురు. చట్టపరంగా దత్తత తీసుకుని మనింటిపేరు యివ్వబోతున్నాను. నీకు యిష్టమైనా కాకపోయినా వప్పుకుని తీరాలి. ఇప్పుడు మేం వచ్చిన గొడవ యిది కాదు. కావాలంటే మనం తర్వాత దెబ్బలాడుకుందాం” అన్నాడు సంతోష్.
“ఎందుకు చేసావే ఇలాంటి పని?” వీణని సూటిగా అడిగాడు. ఆమె జవాబివ్వలేదు.
“మాట్లాడకపోతే వదిలిపెట్టను. ఎందుకు పుట్టింది నీకలాంటి బుద్ధి?” గట్టిగా అడిగాడు. “చదువుకున్న చదువు వదిలేసావు, తెలివితేటలు వదిలేసావు. మిగిలిన సభ్యతా, సంస్కారంకూడా వదిలిపెట్టి నీకు తగని జీవితం ఎందుకు కోరుకున్నావు వీణా? ఎన్నిసార్లు నిన్నడిగాను, నాతో వచ్చెయ్యవే అని? ఎందుకు రాలేదు?” అడిగాడు. మనుషులు వదిలేసినట్టు విజ్ఞతకూడా వదిలేసిందా చెల్లెలిని? ఆమెని చూస్తుంటే దు:ఖం ఆగట్లేదు.
తర్వాత ఎన్నో మాటలు, వాదోపవాదాలు.
ఎందుకు తమిల్లు ఇలా మారిపోయింది? తండ్రివైపువాళ్లకి ఎడంగా వున్నా తల్లివైపువాళ్లు చాలా బాగా చూసుకునేవారు. వాళ్ళ పద్ధతులకి తగ్గట్టు తమిద్దర్నీ బానే గారాబం చేసారు. వీణ పెళ్ళిక్కూడా నిలబడి బాధ్యత మీదేసుకుని చేసారు. దాని పెళ్లయ్యాకకూడా మంచీ చెడూ పట్టించుకున్నారు. ఈ వ్యవహారం ఇలా మారడంతో వదిలేసారు. అలాగని పూర్తిగా వదలనూ లేదు. ఎలా చూసినా, ఏం చేసినా అమ్మమ్మ తన తల్లిని ముందుకి నడిపిస్తునే వుంది. వీణకి ఎందుకలా అనిపించింది? దానిది ప్రేమకోసం తపన. అది అనుభవించిన అమానుషచర్యల తాలూకూ దు:ఖాన్నించీ ఓదార్పుకోసం వెతుకులాట. తన దగ్గిరకి రాదు. తల్లి రానివ్వదు. దాన్ని దగ్గరకి తీసుకుని ఓదార్చేవాళ్ళు లేరు. అందరూ చిడాయించుకుంటున్నారు. వాసు దగ్గరకి తీస్తాడనుకుందా? అతనికి పతిభక్తి షష్ఠీవిభక్తి. సప్తమి కాదు. గీతంటే అంత యిష్టం. వాళ్ళిద్దరిదీ మరోలోకం. అలాంటివాడు, అతనేదో అలుసుతీసుకున్నాడంటుంది తల్లి. తనకి వాసు చాలా దగ్గిరగా తెలుసు. కాకపోతే వీణకి ఆ ఆలోచన ఎందుకొచ్చిందని ప్రశ్న? వాళ్ళిద్దర్నీ చూస్తుంటే దానికీ అలాంటి జీవితం కావాలనిపించిందేమో! వాళ్ళనే కాదు, ఎవర్ని చూసినా అలానే అనిపించి వుండేది.
ఎందుకెళ్ళారు వీళ్ళు వాళ్ళింటికి? వాళ్ళింటికే ఎందుకు? సుధీర్‍వాళ్ళింటికి వెళ్ళచ్చు. వీణకి మెడికల్ హెల్ప్ దొరికేది. అమ్మమ్మ ఇలాంటి సలహా ఏదైనా యిచ్చిందా దాన్ని వదిలించుకోవడానికి? వాసుని లోకువగా అనుకుందా? అతనిగురించి మర్చిపోయిందా? అంత తేలిగ్గా షిఫ్ట్ ఎలా తీసుకోగలిగింది? తాము ఆకాశంనుంచీ వూడిపడ్డవాళ్ళన్న భ్రమలోంచీ ఇంకా బైటికి రాలేదా?
సభ్యత, సంస్కారం, వుచితానుచితాలలాంటి అనేక సీళ్ళు వేసి వుంచిన పండోరాబాక్స్ సమాజం అనేది. వాటిని తీసేస్తే అసంబద్ధమైన ఎన్నో విషయాలు మూత తోసుకుని బైటికి వచ్చేస్తాయి. ఆరుగురు అక్కచెల్లెళ్ళూ, ముగ్గురన్నదమ్ములతో మొదలైన రామారావుగారి కుటుంబం అనేక యితరకుటుంబాలతో అనుసంధానించుకుని మొత్తం సమాజానికి ప్రతికగా మారిపోయింది. ఈ సంఘటన జరగ్గానే అందరూ తనని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టారు. రాణాతప్ప. అతని మాటలు ఆశ్చర్యాన్ని కలిగించాయి. అలాంటివాడు తమలో ఒకడని తెలిసి అశ్చర్యం వేసింది.
“ఏరా, ఆ ఫోటోలేంటి? వాసు అలాంటివాడు కాదే? వాడికేసి సూటిగా చూసి ఒక్కమాటంటేనే గుడ్లుపీకేస్తుంది గీత. మరి నీ చెల్లెలు మీదపడితే వూరుకుందా? వాడినేదైనా అంటే అది చావగొట్టేస్తుంది. కిక్‍బాక్సింగ్‍లాంటి విద్యలన్నీ కరెస్పాండెన్స్ కోర్సులా నేర్చుకుని వాడేస్తుంది. ముందు తను చితక్కొడుతుంది. తర్వాత వాడిని పంపించి చావగొట్టిస్తుంది. సర్లే, వీణ వీరనారీమణి అని చెప్పుకోవచ్చు యీ విషయంలో. మీరు వాసు విషయం చూసుకోండి, నేను గీత విషయం చూసుకుంటాను. ఇద్దర్నీ విడగొడితే తప్ప సాధించలేం” అన్నాడు.
“రాణా! గీత మా అక్కరా!” అన్నాడు తను తెల్లబోయి.
“ఎలారా అక్క? మీనాన్నే అక్కర్లేదనుకుని దూరంగా వెళ్ళిపోయాక నీకు అక్కెలా అయింది?” వెటకారం. “అప్పట్లో గీతని పెళ్ళిచేసుకోవాలనుకున్నాను. వాసుగాడు ఎగరేసుకుపోయాడు. ఇప్పుడింక ఇంతంత వయసులొచ్చాక ప్రేమాదోమా ఏమీ కాదుగానీ, తనదగ్గిర చాలా డబ్బుంది. నా జీవితం సాఫీగా సాగిపోతుంది”
“రాణా! తను మీచేత వ్యాపారం పెట్టించింది?”
“తనెవర్రా, నాకు సాయం చెయ్యడానికి? నా పెళ్ళానికి ఎప్పుడెంత తిండి పెట్టాలో నాకు తెలీదా? యమునచేత షాపు పెట్టించి, నా అదుపులోంచీ తప్పించింది. ఈ అందానికి పిల్లలని ఇంజనీరు చదివిస్తుందట. సమీరకి అప్పజెప్పింది. నేనేమో బోడి యింటరు. నాపిల్లలు, అందులో ఒకర్తి ఆడపిల్ల, వాళ్ళు ఇంజనీర్లా? జన్మలో నామాట వింటారా? అరేయ్, నా బతుకంతా చిందరవందర చేసేసింది. గీతమీద నాకోపం ఎప్పటికీ తీరదు. మీ ప్రయత్నాల్లో మీరుండండి. దాని విషయం నేను చూసుకుంటాను”
“రాణా! ఇప్పటిదాకా నిన్ను ఎవరెవరు చితక్కొట్టారో నాకు తెలీదు. ఇద్దరు మగవాళ్ళు, మానాన్న, బాబాయ్ బాధ్యతలనుంచీ తప్పించుకుంటే, చిన్నప్పట్నుంచి పెద్దనాన్న పడ్డ కష్టాలన్నీ దగ్గిర్నుంచీ చూసి, ఆయన్ని యింకా కష్టాలు పెట్టకూడదనుకుని చదువు ఆపేసి, వుద్యోగంలో చేరి, సుధీర్ని కాదని వాసుని చేసుకుని ఆ యింటినీ యీ యింటినీ వెలిగిస్తున్న దీపం అది. నాకు తనంటే గొప్ప గౌరవం, అంతకిమించి ప్రేమ. అక్క వూసుకి వెళ్ళావంటే నన్నుకూడా ఆ లెక్కలో వేసుకోవలసి వుంటుంది. ఇప్పుడన్న మాటలకే ఆ పని చెయ్యచ్చు. కానీ నేనొచ్చిన పని వేరు. అదయ్యక నీ సంగతి చూస్తాను. జరిగిన పొరపాటేదో జరిగింది. దాన్ని సరిదిద్దడానికి ప్రయత్నిస్తాను అంతేకానీ, దాన్ని తప్పుగా మార్చను. గుర్తుందిగా, అక్క వూసెత్తకు” అని పెట్టేసాడు.
బాధ. ఎడతెగని బాధ. వీణ ఎందుకిలా చేసింది? గీత జీవితంలో ఈ ముళ్ళేమిటి?
అతని ఆలోచనలు మొదలూ తుదీలేకుండా సాగాయి. వీణలాంటివాళ్ళు పోగొట్టుకున్నదానికి ప్రత్యామ్నాయం వుండదు. పరిహారంగా జాలి, దయ, కరుణ చూపించగలరు. మనుషులమీద నమ్మకాన్ని కలిగించలేరు. దగ్గరకి తీసుకుని ఓదార్చి, ఎలాంటి నమ్మకాన్నైతే పోగొట్టుకుందో దానికి సమతూకమైనదాన్ని యివ్వడానికి ఎవరూ ముందుకి రారు. రెండోపెళ్ళి చేసుకునే మగవాడుకూడా పెళ్లవని అమ్మాయినే కోరుకునే సమాజం మనది. యాభయ్యేళ్ళవాడుకూడా పెళ్ళిచేసుకోబోయే అమ్మాయి కేరక్టర్ని స్కాన్ చేసుకుని చూసుకుంటాడుతప్ప మూడొంతుల జీవితం ఐపోయింది, ముందుకి సాగిపోదామనుకోడు. వీణ వుద్యోగంలో చేరి వుండాల్సింది. చేరితే కొంత డైవర్షన్ వుండేది. ఇంకెటేనా మనసు మళ్ళేది. సహజమైన జీవితం గడుపుతున్నవాళ్ళమధ్య తను యిమడలేదు.
వాసుమీద కంప్లెయింటు గొడవేంటి? తన తండ్రి యిచ్చాడని వాళ్ళ అనుమానం. ప్రహ్లాద్ దానికీ తిట్టాడు. అంత చెడ్డవాళ్ళా తాము? కాదేమో! సాఫీగా సాగిపోతున్న ముప్పయ్యేళ్ళ కెరీర్లో ఎవరికి ఆ అవసరం వుంటుంది? తండ్రి అలా చేస్తాడా? కుటుంబబాధ్యతలనుంచీ తప్పించుకోవడానికి ఫస్ట్‌పోస్టింగ్ దూరంగా యిప్పించుకుని తనదారి తను వెతుక్కుని వచ్చేసిన వ్యక్తి అలా చేస్తే పెద్ద ఆశ్చర్యపోనక్కర్లేదు. కానీ కాదేమో! స్వార్థపరుడు, మెతకమనిషేగానీ మరీ అంత దుర్మార్గుడు కాడేమో!
“వాసు సస్పెన్షన్లో వున్నాడట. మీకు తెలుసా? కంప్లెయింటిచ్చింది మీరేనా?” అన్నాడు. అతనంతే. మొహంమీద కొట్టినట్టు అనేస్తాడు. ముందసలు ఆ వార్తకి ఆయన తెల్లబోయాడు. తర్వాత తనమీద చేసిన అభియోగానికి స్పందించాడు.
“వాడిని సస్పెండ్ చెయ్యటమేంటి? చాలా క్రమశిక్షణగల వ్యక్తి. స్కేలు పెట్టి జాగ్రత్తగా గీత గీసినట్టుంటుంది వాడి పద్ధతి. ఏమని కంప్లెయింటు ఇచ్చారు? ఎవరిచ్చారు?” అడిగాడు.
“నేననుకోవడం కాదు, మీరే యిచ్చివుంటారని వాళ్లంతా అనుకుంటున్నారు”
“నువ్వూ నమ్ముతున్నావా?”
“సగం”
“అరేయ్!”
“మరిదంతా జరుగుతుంటే చూస్తూ వూరుకున్నప్పుడు నమ్మడంలో తప్పేం వుంది?”
ఎంక్వైరీ నెలరోజులు సాగింది. ప్రతి చిన్నవివరం స్పూన్‍ఫీడింగ్ చేసినట్టు స్పష్టంగా వుండటంతో ఎక్కడా ఏదీ దొరకలేదు. ఇంకా సాగదియ్యడం సాధ్యపడట్లేదు. అత్యుత్సాహం చూపించి ప్రిలిమినరీ ఎంక్వైరీ చెయ్యకుండా సస్పెండ్ చేసారు. సస్పెన్షన్ తీసేసి ఛార్జెస్ డ్రాప్ చెయ్యడానికి ఇప్పుడది ఇగో యిష్యూగా మారింది.
భూతద్దంకింద పెట్టి వెతికినట్టు వెతికితే ఒక్క పొరపాటు దొరికింది. పొలం కొన్నప్పుడు ఆయుర్వేదిక్ ట్రీట్‍మెంటని ప్రావిడెంట్‍ఫండ్ లోన్ తీసుకున్నాడు వాసు. దాన్ని పన్నెండు వాయిదాల్లో కట్టాడు. తీసుకున్న కారణం వేరు, వాడుకున్న అవసరం వేరు. వివరాలన్నీ అప్పటికే రాసివ్వడంచేత ఇంకో సోర్సు చూపించలేకపోయాడు. తెలీక చేసిన తప్పది. దాన్ని ఫినాన్షియల్ ఇర్రెగ్యులారిటీగా గుర్తించి, మూడు ఇంక్రిమెంట్లు మళ్ళీ కలవకుండా ఆపి, సస్పెన్షన్ని జస్టిఫై చేసాడు ఎంక్వైరీ ఆఫీసరు. ఆ ఆర్డర్సు సంతకమైంది వాసు ఆఫీసులోనే. రిమూవలో డిస్మిసలో యివ్వాలని జరిగిన ప్రయత్నాన్ని తన శక్తికొద్దీ ఆపాడు వాసు పై ఆఫీసరు.
ఇరవైతొమ్మిదేళ్ళ సుదీర్ఘమైన సర్వీసు ఒక్క రిమార్కుకూడా లేకుండా చేస్తే దొరికిన ఫలితమది. చేతిలో పవరూ, పొజిషనూ లేకపోవడంలోని తక్కువతనాన్ని నీలిమ మొదట రుచిచూపించింది. ఇది రెండోసారి రుచితగలటం.
ఆర్డర్సు రెండూ తీసుకుని ఆఫీసరు చాంబర్లోకి వెళ్ళాడు. ఇద్దరూ ఒకేసారి వుద్యోగంలో చేరారు. మంచిస్నేహం వుండేది. ఇప్పటికీ ఆఫీసయ్యాక స్నేహితులే. చాలా విషయాలు మాట్లాడుకుంటారు.
“నేనేమైనా లంచాలు తింటున్నానా, పని యెగ్గొట్టి వ్యాపారాలు చేస్తున్నానా? ఆఫీసు డబ్బేదైనా వాడానా? నా పీయఫ్‍లోంచీ తీసుకుని వాడుకున్నాను. ఎంతమంది జీపీయఫ్ లోను, అడ్వాన్సు తీసుకుని వాడుకోవట్లేదు? తెలీక చేసిన పొరపాటది. తర్వాత మళ్ళీ ఎప్పుడూ లోన్‍గానీ అడ్వాన్సుగానీ తీసుకోలేదు. దానికి ఇంత పెద్ద పనిష్మెంటా? ఎవ్వడికేనా వుద్యోగంమీద గౌరవం వుంటుందా?” అన్నాడు.
“రియల్లీ సారీ వాసూ! పీయఫ్‍ల్లో ఇంతంత బేలన్సులు వుండటం, ప్రైమ్ లొకాలిటీల్లో ఆస్తులు, అంతమంది పిల్లలకి చదువులు. నువ్వే రాబిన్‍హుడ్‍వో అనుకుని దిగారు. అక్కడికీ నేను మన డైరెక్టర్తో మాట్లాడాను. నీ బేక్‍గ్రౌండు చెప్పాను. నీ ప్రాపర్టీస్ ఇప్పుడు కొన్నవి కాదన్న విషయంకూడా చెప్పాను. నమ్మలేదు. ఎంక్వైరీలో తేలుతుందన్నాడు. ఆయన చాలా తలబిరుసు మనిషి. సబార్డినేట్ స్టాఫంటే ఎంతో చులకన. మీటింగ్స్‌కి వెళ్తే మమ్మల్ని కూర్చోమనికూడా అనడు. కంప్లెయింటు నా లెవెల్లోనే యిచ్చి వుంటే ఇంతదాకా రానిచ్చేవాడినికాదు. అది తెలిసే పై ఆఫీసులో యిచ్చి, వెనకనుంచీ నడిపించారు. నా సలహా. దీనిమీద అపీల్‍కి వెళ్లకు. పనిష్‍మెంటు రివ్యూకాకుండా నేను చూసుకుంటాను”
“ఎవరున్నారు దీని వెనక?”
“తెలుసుకుంటాను”
“థేంక్స్”

పశ్చిమగోదావరి జిల్లా రెడ్డి పోలవరంలో 16 July, 1962 లో జననం. వరంగల్‌లో వుద్యోగం. హెడ్పోస్ట్‌మాస్టర్గా వరంగల్‌లో స్వచ్చందపదవీ విరమణ.
వివాహం శ్రీ చదలవాడ విష్ణుమూర్తిగారితో. వారు డెప్యూటీ ఏగ్జిక్యూటివ్ ఇంజనీరుగా చేసి రిటైరయారు.
మొదటి కథ అనగనగా 1978లో వనితాజ్యోతి మాసపత్రికలో అచ్చైంది. వీరివి 225కి పైగా కథలు, 9 నవలలు వివిధ పత్రికల్లో ప్రచురించబడ్డాయి. గూడు, సింధూరి, గుండెలోతు అనే కథాసంపుటాలు, నీలినక్షత్రం అనే నవల పుస్తకాలుగా వచ్చాయి. సింధూరి అనే సంపుటానికి శ్రీమతి సుశీలా నారాయణ రెడ్డి అవార్డు 2005 లో వచ్చింది. ప్రేమలోంచీ ప్రేమలోకి అనే నవలకి ఆంధ్రభూమి ప్రథమ, తిరస్కృతులు, నీకోసం నేను అనే నవలలకి ఆంధ్రభూమి ద్వితీయ, 5-3-2 అనే నవలకి కినిగె ద్వితీయ బహుమతులు వచ్చాయి. ఎంతెంతదూరం? అనే కథకి విపుల కన్సొలేషన్ బహుమతి, శ్రీమతి రంగవల్లి ట్రస్ట్ అవార్డు వచ్చాయి. ఇవికాక కథలకు మరో ఏడెనిమిది బహుమతులు వచ్చాయి.
కథలకు కాన్వాస్ పెద్దదిగా వుండాలనేది వీరి అభిప్రాయం.