(గీత గది. అందులోకి అడుగుపెట్టగానే ప్రకంపనాలు మొదలయ్యాయి నీలిమలో. పాతకాలపు పెద్దచెక్కబీరువా. పెయింటూ అదీ వేసి, ఇత్తడి నాబ్స్ పెట్టేసరికి బావుంది. తెరిచింది. కింది అరలనిండా ఎవరెవరివో బేగులవీ వున్నాయి. పై అరకిమాత్రం లోపల మరో తలుపుంది. అది తెరిచింది. గీత వస్తువులున్నాయి. మూసెయ్యబోతూ ఆగింది.
కొబ్బరిపుల్లలకి చాక్లెట్ రేపర్లని దారంతో కట్టి చేసిన సీతాకోకచిలుకలు రెండు. ఒక పుల్ల పొడవు, ఇంకోటి పొట్టి. గచ్చకాయలు, తొక్కుడు బిళ్ళలు, వాచీ బాక్స్, ఇంకా ఏవేవో. స్వంతిల్లు వుంటే పిల్లల చిన్నతనాలు పొందిగ్గా దాక్కుని వుంటాయి. పెళ్ళై వచ్చాక తమింట్లో ఒక ఖాళీ పౌడరుడబ్బాలో పోసిన గోళీలు కనిపించాయి. ఇంత జాగ్రత్తగా దాచుకుంటారని తెలీక, ఇప్పుడు ఆడేవాళ్లెవరని తీసేసింది. గోళీలాడుతూ, సైకిలు చక్రం తోసుకుంటూ తిరిగే మగపిల్లల్ని తనూ చూసింది. వాళ్ళు పెద్దయ్యాక ఏమౌతారు, ఎంత అందమైన భర్తలౌతారన్న వూహ అప్పుడు వుండేదికాదు.
మాధవ్ అందమైన ప్రేమ మళ్ళీ తిరిగొస్తుందా? ఆమె కళ్ళలో నీళ్ళు తిరిగాయి. అమాయకంగా వుండే అవకాశాన్ని పోగొట్టుకుంది తను)
ఎవరేనా వస్తే బావుండదని వెంటనే సర్దుకుని బేగ్ ఆమధ్యలో పెట్టేసి వచ్చి మాధవ్‍కి చెప్పింది. అతను తాళం తెచ్చి యిచ్చాడు. వేసి దగ్గర పెట్టుకుంది.
రాత్రి తొమ్మిది దాటుతుంటే జో, సుమంత్ వచ్చారు. మహతి ఇక్కడే వుండిపోతానంది. మిగిలినవాళ్ళు బయల్దేరారు. సుధీర్ చాలా మూడీగా వుండటాన్ని గమనించింది సుమతి. సుమంత్, జో మాట్లాడుతుంటే యాంత్రికంగా జవాబిస్తున్నాడు. ముగ్గురూ అతన్ని చూసీచూడనట్టు చూస్తున్నారు. పొద్దున్న వాసూ, సుధీర్ నవ్వుతూ మాట్లాడుకున్నారట. సాయంత్రం ఇద్దరూ రివర్‍సైడు వెళ్ళారు. అక్కడినుంచీ వచ్చాకకూడా చాలాసేపు మాట్లాడుకున్నారు. మరిప్పుడెందుకు యిలా? అక్కడేం మాట్లాడుకున్నారు? గొడవేమైనాపడ్డారా? అసలెందుకు వచ్చినట్టు వీడు? ఏ దు:ఖాన్ని వెతుక్కుంటూ వచ్చాడు? సుమతికి చాలా ఆందోళనగా వుంది.
సుమంత్, లతలని వాళ్ళింటిదగ్గిర దించేసి, వీళ్ళింటికి వీళ్ళు వచ్చారు. ప్రమీలా, గురుమూర్తీ చావింట్లో వుంటున్నారు. ఒక్కడే ఎందుకని సుధీర్ని తమింటికి తీసుకొచ్చింది సుమతి. లోపలికి వెళ్ళగానే గుడ్‍నైట్ చెప్పేసి తనకి కేటాయించిన గదిలోకి వెళ్లిపోయాడు సుధీర్. భార్యాభర్తలిద్దరూ మొహాలు చూసుకున్నారు. తర్వాత పిల్లలు పడుక్కున్న గదిలోకి వెళ్ళారు. వాళ్ళు నిద్రపోతున్నారు. ఫుల్‍టైమ్ మెయిడ్ వీళ్లని చూసుకుంటుంది. తొమ్మిదింటికల్లా పడుకోబెట్టేస్తుంది. వీళ్ళకోసం చూస్తోంది. వీళ్ళు రాగానే ఆమె సర్వెంట్ క్వార్టర్లోకి వెళ్ళిపోయింది.
సుధీర్ బట్టలేనా మార్చుకోకుండా అలానే మంచంమీద వరిగిపోయాడు. చిన్నప్పటిరోజులు గుర్తొస్తున్నాయి. వాసుతో కలిసి తిరిగినరోజులు, చేసిన అల్లరి, అందరూ కలిసి తిరిగిన సందర్భాలు పదేపదే మనసులో మెదిలాయి. వాసు మాటలు మర్చిపోలేకపోతున్నాడు.
ఎప్పుడనిపించింది వాడికి, పెద్దవుద్యోగం చేసివుండాల్సిందని? ఎందుకనిపించింది? ఎవరు అవమానించారు? తనేనా? అందరూనా? వాసుకన్నా సుధీర్ సంబంధం మంచిదని రవిమామయ్య అన్నప్పుడు వాళ్ళింట్లోనే ఏడ్చిందట గీత. ఆయన అలా ఎలా అనగలిగాడు? ఆ విషయం తెలిసినప్పుడు వాసు ఎలా అనుకుని వుంటాడు? స్వంతవాళ్ళే బేధభావం చూపించారని మనసు కష్టపెట్టుకుని వుంటాడా? ఆయనద్వారా తనే అడిగించాడని అనుకున్నాడా? సుమతికీ అప్పుడే పెళ్ళైంది. గీతకన్నా పెద్దది. ఎన్నో హాస్యాలూ, పరిహాసాలూ వాళ్ళమధ్య వుండల్సింది. అలకలూ, కోపాలతో పదేళ్ళు సాగాయి. వాళ్ళిష్టపడీ, పెద్దవాళ్ళకి నచ్చీ జరిగిన పెళ్ళికి ఎన్ని తిరస్కారాలు? ఇద్దరూ ఒకరినొకరు ఓదార్చుకుని మనకి మనమే బతుకుదాం అని చెప్పుకుని వుంటారా? మాధవ్‍తోకూడా గొడవలట. ప్రహీ, వసంత్, మాధవ్‍ల భార్యలు స్వంత అక్కచెల్లెళ్ళు. సహజంగానే, అదో గ్రూపు తయారై వుంటుంది. వీళ్ళిద్దరూ విడిగా మిగిలిపోయారు. ఎవరింటికీ పెద్దగా వెళ్ళరట. వాళ్ళ ప్రపంచాన్ని వాళ్ళు కట్టేసుకుని అందులో కూర్చున్నారు. అందర్నీ వద్దనుకున్నారా? వద్దనుకుంటే గీత వుదయం అంత బాధపడదు. మహీకోసం అంతచెయ్యదు. వీణకోసం ముందుకి రాదు.
తనకి గీతతో పెద్దగా పర్సనల్‍స్పేస్ లేదు. గ్రూపులో కలిసి తిరగడమే. వాసుకి వుంది. ఆ చిన్నప్పటి వాసు, గీత పెరిగి పెద్దయ్యారు. ఒకరినొకరు వదిలిపెట్టి వుండలేనంత దగ్గిరయారు. దాన్ని ప్రేమ అనుకున్నారు. పెళ్ళితో పరిపూర్ణం చేసుకున్నారు. ఈ ప్రపంచంలోని అన్ని విషయాలూ ఎంత నిజమో, అదీ అంతే నిజం. తన ప్రేమ నీటిమీద రాసిన రాత. అప్పుడే ముద్రపడి, అప్పుడే చెరిగిపోయింది. దాని గుర్తులేవీ మిగిలి లేవు. అమ్మ అడిగిన కట్నమో, గీతయింట్లో ఆర్థికపరిస్థితులో తనతో పెళ్ళికి ఆటంకం కాలేదు. దాన్ని ఆనవాలనుకుని పడ్డ దు:ఖం ఇక చాలు. మిగిలిన జీవితం రమది. వ్యాస్, హాస్‍లది.
తర్వాత?
అన్ని దారులూ చీలిపోయాయి. పందొమ్మిదిమందిలో ఇద్దరిదిమాత్రమే ఏకదారి. మిగతా అందరిదీ ఎవరిది వారిది. ఏ సంఘటనలకూడలిలోనో కలుసుకోవడంమాత్రమే మిగిలింది. లేచి ఇవతలికి వచ్చాడు. హాల్లో బెడ్‍లాంపు వెలుగుతోంది. బాల్కనీలోకి వచ్చాడు. ఒకటీ అరా కార్లు తిరుగుతున్నాయితప్ప అంతా నిశబ్దం. చాలాసేపు అలానే కూర్చున్నాడు. నిద్ర రాలేదు. ఈ వంటరితనం అక్కడ రమతో వున్నప్పుడు సాధ్యపడదు. మనసులో వున్న దు:ఖాన్నంతా అందులోకి వంపేసి, తెల్లవారుతుంటే లోపలికి వెళ్ళి నిద్రకి వుపక్రమించాడు.
మేనల్లుడు యశస్వి వచ్చి లేపాడు.
“మామయ్యా! నేను స్కూలుకి వెళ్తున్నాను. నువ్వు ముంబై వెళ్తున్నావటగా? నేనొచ్చేసరికి నువ్వుండవా?” అన్నాడు కాస్త దిగులుమొహం వేసుకుని.
“వెళ్ళాలిరా మరి! నీకు అక్కడినుంచీ ఏం తేను?” అడిగాడు.
“ఇప్పుడొద్దులే మామయ్యా! అమ్మమ్మమ్మ ఆకాశంలోకి వెళ్ళిపోయిందటగా? ఇంక మనకి కనిపించదని చెప్పి, అమ్మ ఏడ్చింది. నిన్నేదో టాయ్ అడిగితే మనం ఇప్పుడేవీ కొనుక్కోకూడదని చెప్పింది” అన్నాడు. అమ్మనీ అమ్మమ్మనీ కలిపేసి చుట్టరికాన్ని తయారుచేసుకున్నాడు వాడు. విజ్జెమ్మని అలానే పిలిచేవాడు. పెద్దవాడైపోయాడు. దు:ఖాన్ని గుర్తుపట్టడం వచ్చింది.
“గుడ్ బాయ్!” నవ్వి అన్నాడు సుధీర్. వాడు వెళ్ళిపోయాడు. లేచి, బ్రష్‍చేసుకుని స్నానంచేసి వచ్చి ప్రయాణానికి తయారవ్వసాగాడు.
కాసేపటికి సుమతి వచ్చింది. అడుగుల చప్పుడు, కాలి మువ్వలచప్పుడుతో కలిసి వినిపించింది. వెనక్కి తిరగలేదు. ఆమె అడిగే ప్రశ్నలని తను ఎదుర్కోలేడు.
“బావ ఎయ్‍ర్‍పొర్టుకి వస్తానన్నారు” అంది సంభాషణకి నాందిగా.
“ఎందుకే? టాక్సీ బుక్‍చేసుకుని వెళిపోతాను. తనకి శ్రమ” అన్నాడు.
“శ్రమేం వుంటుంది? లాంగ్‍డ్రైవ్ తనకి యిష్టం. నీతో మాట్లాడచ్చు. ఫోన్లలో మాట్లాడుకున్నదీ పక్కపక్కని కూర్చుని మాట్లాడుకున్నదీ వేరు”
“యశూ స్కూలుకి వెళ్ళాడా?”
తలూపింది.
“తలూపాను. ఇటు తిరిగితేగా, తెలిసేది?” అంది.
“మంచి ప్రేమకథ వింటావా? పొద్దున్నే నిద్రలేచి, మంచం దిగి, వాసూ అంటూ ఓ పిల్ల వాళ్ళింటికి వెళ్ళిపోయేదట”
“వెళ్తూ వెళ్తూ ఓ గ్లాసో చెంచానో నూతిలో విసిరేసేదా? దాని చిన్నప్పుడు వాళ్ళింట్లో సగం వస్తువులు నూతిలో వుండేవట. ఎండాకాలం నుయ్యి అడుగంటాక మనిషిని దింపి తీయించుకునేవారట. అక్కడకదా, కథ మొదలవ్వాల్సింది?”
“దొరవారు ఆ ఎపిసోడ్ చెప్పడం మర్చిపోయారు. ఆ తర్వాత వారు వీళ్ళింటికి వచ్చేవారట. ఇద్దరూ కలిసి అక్కడో ఇక్కడో కథలలోకంలో విహరించి అలిసిపోయి, మార్పుకోసం స్కూలుకి బయల్దేరేవారట”
“ఇంకా?”
“సైకిలెక్కి తిరుగుతూ లారీకింద పడబోయారట”
“అదెప్పుడు?!!”
“వాళ్ళ రహస్యాల్లో అదొకటి”
“మాట్లాడుకోవడం ఎందుకు మానేసారట?”
“వీళ్ళ ప్రేమకథలో రాణాగాడు విలన్. సైడు విలన్ పిన్ని”
“వాడెందుకొచ్చాడ్రా, మధ్యలోకి? ఆవిడేం చేసిందట? పిన్నికి అన్నకూతురంటే ప్ర్రాణమే మరి!”
“చెప్పేసానుకదా? నువ్వు చెప్పింది వప్పుకున్నట్టేకదా? ఇంక ప్రశ్నలొద్దు. ఇక్కడితో వదిలేద్దాం. నిన్న ఇవే విషయాలు మాట్లాడుకున్నాం సుమతీ! వాడిని చాలా బాధపెట్టాను” అని వాసు తనని అడిగిన ప్రశ్నలని చెప్పాడు. “వాడికి విషయం తెలుసు. సూటిగా వ్యవహారం మాట్లాడినట్టు మాట్లాడాడు. తమది ప్రేమని చెప్పే ప్రయత్నం చేసాడు. అటువంటి పరిస్థితికి వాడిని తీసుకొచ్చినందుకు నాకు సిగ్గేసింది. వాళ్లని చూసి గ్రహించాలికదా, నేను? నోటితో చెప్పించాను. తామిద్దరూ ఎందులో తక్కువని అడిగాడు. మనింట్లో గొడవతో వాళ్ళకలా అనిపించింది” అన్నాడు. రాణా అన్నమాటలు చెప్పాడు. “అందరం తలోరాయీ వాళ్ళమీద విసిరామనిపించి చాలా బాధకలిగింది. వాసు నాకన్నా ఎందులోనూ తక్కువకాదు. వాడలా అనుకుని బాధపడటం నేను తట్టుకోలేకపోతున్నాను. ఐ వాజ్ షేమ్‍లెస్. నువ్వు కరెక్ట్. ఇప్పటికి అర్థమైంది” అన్నాడు చివరిగా.
“రమగురించి నీకేం అనిపించలేదా?”
“ఆలోచించుకున్నానుగాబట్టే మారాను సుమా! అన్నీ మర్చిపోవడానికి చెయ్యగలిగిన ప్రయత్నాలన్నీ చేసాను. ఐ వాజ్ యాజ్ డెడ్ యాజె కార్ప్స్. చనిపోయిన మనిషికన్నా నేను ఎక్కువేమీ కాదు. ఇది పునర్జన్మ. బతికించింది తనుకాబట్టి నాలో వున్న వూపిరిసైతం తనదే. ఇంక వదిలేద్దాం” అన్నాడు సుధీర్. సంభాషణకి ముగింపు చెప్పి.
“వెళ్దామా, సుధీర్?” జో వచ్చాడు.
“నేను వెళ్ళిపోతానుకదా, మీకెందుకు శ్రమ?” అంతకుముందు సుమతిని అడిగిన ప్రశ్నే అతన్నీ అడిగాడు.
“పర్వాలేదు” అన్నాడతను. సుమతి కూతుర్ని ముద్దుచేసి బయల్దేరాడు సుధీర్. జో ఏదో చెప్పాలనే తనతో బయల్దేరాడని సుధీర్ గ్రహించాడు. చాలా టైముండగానే బయల్దేరారు. అంటే అతను చెప్పాలనుకున్నది చెప్పడానికి అవకాశం తప్పిపోకుండా వుండేలా. అనుకున్నట్టుగానే జో సగందార్లో మొదలుపెట్టాడు.
“అతను రమ్మనగానే ఆ చీకట్లో రివర్‍సైడుకి ఎలా వెళ్ళిపోయావు సుధీర్? ఎవరికీ చెప్పనుకూడా లేదు. మీరెళ్ళాక తెలిసిందట సుమతికి. అక్కడేం జరుగుతోందోనని చాలా భయపడింది. వాసుదేవ్‍కి కోపం ఎక్కువని విన్నాను. ఎవరితోనేనా చెప్పి వెళ్ళి చూడమనటానికి ఇంటిగుట్టు బైటపడేసుకున్నట్టేకదా? సుమతి నాకు ఫోన్ చేసింది. సాయంత్రం నాకు చాలా రష్ వుంటుంది. క్లినిక్ మూయడానికి లేదు. సుమంత్‍దీ అదే పరిస్థితి. ఆఖరికి లతని ఇక్కడ క్లినిక్‍లో కూర్చోమని నేనే బయల్దేరాలనుకున్నాను. ఇంతలో మీరు తిరిగొచ్చారని మళ్ళీ ఫోనొచ్చింది” అన్నాడు జో. ఇద్దరూ కలిసి గొడవపడతారేమోనని సుమతి కంగారుపడింది నిజం. వాసు సుధీర్ని ఏదో చేస్తాడనికాదు. కానీ జోకి మరోలా అర్థమైంది. ముక్కోణపు ప్రేమకథలు అంత సున్నితంగా ముగియవు. అమ్మాయిలకొసం కొట్టుకోవడాలూ, చంపుకోవడాలూ ఎన్నో విన్నాడు, కొన్ని చూసాడు. జీవితకాలపు కక్షలు వుంటాయి. అవి డైల్యూట్ కావు. అందుకే అంత టెన్షనుపడ్డాడు. అతనిమాటలకి సుధీర్ తెల్లబోయాడు. వెంటనే జవాబివ్వలేకపోయాడు. ఎవరివాళ్లని వాళ్ళు చక్కగా కాసుకుంటున్నారు. వాసు ఏకాకితనం స్పష్టంగా కనిపించింది.
“మామధ్య అలాంటిదేం వుండదు బావా! వాడలాంటివాడు కాదు. సుమతికి తెలీదా, ఆ విషయం? అనవసరంగా కంగారుపడింది” అన్నాడు నెమ్మదిగా. “నాది పాతప్రేమలని లెక్కవేసుకునే వయసు కాదు. భార్యా, పిల్లలూ, వాళ్ళ చదువులూ, ఆస్తులు సంపాదించుకోవడం, జీవితంలో పైకి రావడంలాంటివి చాలా వుంటాయి. కొన్ని నిర్ణయాలు జీవితంలో ఒకసారే తీసుకోగలుగుతాం. పెళ్ళి, కెరీర్ అలాంటివి. ఒకసారి నిర్ణయించుకుంటే అవి జీవితమంతా విస్తరించుకుపోతాయి. వాళ్ళ పెళ్ళితర్వాత కొన్ని అపార్థాలతో ఇద్దరిమధ్యా దూరం పెరిగింది. నేనుకూడా అనవసరమైన స్పర్థలు వద్దనుకుని దూరంగా వుండిపోయాను. నిన్న కేజువల్‍గా మాట్లాడుకోవడం మొదలుపెట్టాం. కూర్చుని అన్నీ సార్ట్ చేసుకోవాలని వెళ్ళాం. మా మీటింగ్‍పాయింట్ అది”
“ఇన్నేళ్ళూ రానివాడివి ఇప్పుడెందుకొచ్చావో తెలీడంలేదు సుధీర్! సరె, అమ్మమ్మకోసం వచ్చావు. నిన్నట్నుంచీ నీ ప్రవర్తనలో మార్పుచూసింది సుమతి. రాత్రంతా భయపడుతునే వుంది. నిద్రపోలేదు. అలా నిన్ను గమనించుకుంటూ వుంది” అన్నాడు జో అతన్ని నిశితంగా చూస్తూ.
“మా అమ్మ పెద్ద ఆర్చరని నిన్న మాకు అర్థమైంది. సుమతికూడానని ఇప్పుడే తెలిసింది. వీళ్ళని ఒలింపిక్స్‌కి పంపిస్తే మెడల్స్ తీసుకొస్తారు” అన్నాడు సుధీర్ నవ్వుతూ. విషయాన్ని యింకా ముందుకి తీసుకెళ్ళాలనుకోలేదు.
“అదేంటి?” జో తెల్లబోయాడు.
తనకీ వాసుకీ జరిగిన సంభాషణ చెప్పి, “కట్నం అనే ఒక్కబాణంతో మా ముగ్గుర్నీ పడేసింది ఆవిడ. ఇప్పుడిక ఇదన్నమాటలు వాసుకి తెలిసాయంటే గిలగిలా కొట్టుకుంటాడు వాడు. ఒకే ఒక్క వాగ్బాణంతో” అన్నాడు.
జో గట్టిగా నవ్వేసాడు.
“బ్రాండెడ్ జీన్సూ, టీస్, ఏప్రాన్లు, స్టెత్‍లు, డంపీ లెవెల్సు, బ్లేజర్లు, టైలు అన్నీ తీసి పక్కని పారేసి, షార్ట్స్, పాతటీషర్టు వేసేసుకుని, కాఫీమగ్గో, టీ కప్పో పట్టుక్కూర్చుని, అప్పుడలా జరిగిందికదా, ఇప్పుడిలా చేసాంకదా అనుకుంటూ కాలాన్ని ముందుకీ వెనక్కీ జరిపేస్తూ, ఎక్కడో ఒకచోట ఆపేసి, గంటలూ రోజులూ గడిపెయ్యగలరు మీ కజిన్సంతా కలిస్తే. చాలా సరదాగా వుంటుంది సుధీర్! అది అన్నీ సరిగ్గా వున్నప్పుడే. నిన్నమాత్రం చాలా భయపడ్డాం” అన్నాడు.
“వాసుని అలా అనుకోకండి బావా! నా రిక్వెస్ట్. వాడు చాలా మంచివాడు” అన్నాడు సుధీర్.
“మనిషి మంచివాడే. ఆకారానికి తగ్గ పదార్ధం బుర్రలో లేదేమోనని నిన్న కాస్త అనుమానం వచ్చింది” జోకూడా నవ్వుతూ తేల్చేసాడు.
రామారావు యిల్లు.
మాధవ్, నీలిమ, మహతి తప్ప మూడోతరాన్నించీ రెండోతరాన్ని ఎక్కినవాళ్ళు ఇంకెవరూ లేక ఇల్లంతా చిన్నబోయినట్టుంది. పెద్దతరం అంతా ఇద్దరూ ముగ్గురూ ఒక్కోచోట చేరి కబుర్లు చెప్పుకుంటున్నారు. రవళికూడా మళ్ళీ వస్తానని వాళ్ళ వూరు వెళ్ళిపోయింది. అక్కదగ్గరే వుండి ఆమెతో గడపాలని వున్నా చెవికి వినబడని, కంటికి కనిపించని పరిమితులు ఆమెకి. ఇంటాబైటా పనితో నలిగిపోతోంది. తల్లి లేదు. ఇక్కడికొస్తే ఎవరో ఒకరు పిల్లల్ని చూసుకుంటారు, విశ్రాంతి దొరుకుతుందనుకోవడానికి లేదు. శ్రీనివాస్ ఏదీ కాదనడు. ఆమె యిష్టానికే వదిలేస్తాడు. ఐతే ఎక్కడా అతను అనుకున్నదానికి తేడా రాకూడదు. వీళ్ళంతా ఎలా సర్దుకుంటారో ముంబైలో చూసి సరదాపడ్డది నిజమే. పిల్లలు చిన్నవాళ్ళు. ఇంతమందిమధ్య సదుపాయాలు కుదరక వాళ్ళకేదైనా వచ్చిందంటే అతనికి జవాబు చెప్పలేదు. అందుకే బంధువులింట్లో దిగింది.
“అక్కడికి వచ్చేస్తావే? మాకు పట్టింపులేం లేవు” అంది గీత మహతితో. రవళినీ అడిగింది.
“ఇక్కడైతే అంతా వున్నారు. మీరిద్దరూ ఆఫీసులకి వెళ్తే నేను వచ్చి ఏం చెయ్యను? సాయంత్రం మీరే ఇటొచ్చెయ్యండి. వర్కు తెచ్చుకున్నాను. కృష్ణ కంప్యూటరు తీసుకుని చేసుకుంటాను” అంది మహతి.
ఆఫీసులో చేరిపోయి పదోరోజుకి మళ్ళీ వస్తానంది రవళి.
ఆఫీసులకి వెళ్తూ, కుదిరినవాళ్ళు వస్తున్నారు. వచ్చి కాసేపుండి వెళ్ళిపోతున్నారు. పిల్లలని స్కూలుకి పంపించి వచ్చారు గీత, వాసు. కొద్దిసేపుండి వెళ్ళిపోయారు.
తిని, ఏదో చదువుకుంటూనో, రాసుకుంటూనో, నిద్రపోతూనో తనలోకంలో తను బతికేస్తున్న ఆమెని చూస్తుంటే అందరికీ మనసు మెలిపెట్టినట్టౌతోంది. ఆమె జీవితంలో మేఘన ఒకతే ఓదార్పు. నారాయణ యిందరి మధ్య వున్నానని ఆగుతున్నాడుగానీ, కూతుర్ని ఏదో ఒకటి అనకుండా వుండడు.
“ఇంక మహీ అంతేనామ్మా?” అడిగాడు మాధవ్ తల్లిని. లక్ష్మి నిట్టూర్చింది. సంధ్య, మహీ కళ్లముందు కనిపిస్తున్న, పరిష్కారం లేని సమస్యలు. వీణ విషయం ఏంటో!
“దానికి చెయ్యగలిగింది చేసారు మాధవ్! వీణ విషయం ఆలోచించండి. ఎవరెవరు వెళ్తున్నారు? గీత బాగానే ఆలోచించింది. గొడవకి వెళ్తున్నట్టు కాకుండా దాన్ని చూడటానికి వెళ్ళినట్టు వెళ్ళడం మంచిదే. వాళ్లతో మీరెవరెళ్తున్నారు?” అంది లక్ష్మి.
“వదిన వద్దులేమ్మా! ప్రతివాళ్ళకీ ఆవిడో సాఫ్ట్ టార్గెటైపోయింది. ఆవిడ్ని ఇందులోకి లాగడం వాసుకికూడా యిష్టం లేదు” అన్నాడు మాధవ్.
“అది లేకపోతే అందర్నీ కూడగట్టేదెవర్రా? ముందుపడి తెలివైనదో తెలివితక్కువదో ఓ మాటంటేకదా, ముళ్ళు విడేది? సుమతికా అంత తెలివిలేదు. గీత పక్కనుంటేనే అదేమైనా చెయ్యగలదు” అంది లక్ష్మి. లీల ఏదీ చెప్పట్లేదు. తమ్ముడుమాత్రం ఎవరేనా పరిస్థితిని చక్కదిద్దుతారా అని ఆశగా చూస్తున్నాడు. ఒకనాడు యింటిబాధ్యతలు మీదపడతాయని అన్నగారినుంచీ దూరం పారిపోయాడు. బావమరుదులు, తోడల్లుళ్ళ చెలిమిలో చేరాడు. వాళ్లు మంచివాళ్ళే. కాదనడానికి లేదు. తోబుట్టువుమీది ప్రేమతోనే చేసారు. కానీ సంబంధం సరిగ్గా విచారించలేదు. ఇక్కడ జమాజెట్టీల్లాంటి మగపిల్లలున్నారు. వాళ్లందర్నీ తూలనాడుకుని దూరంపెట్టింది. ఈ పొదలో, యీయింటి పద్ధతులప్రకారం పెరగాల్సిన పిల్లని దూరంగా వుంచి పెంచింది. మగపిల్లల్ని చూస్తేనే భయపడిపోయేంత పిరికిగా పెంచింది. గీత వీళ్ళందరిమధ్యా తిరిగిందే. ఏ తప్పులు జరిగాయి? అందరూ కలిసి పువ్వులా దాన్ని చూసుకున్నారు. అర్చనమాత్రం? పసిపిల్లలా వీళ్లందరిమధ్యా తిరిగింది. జో అర్చననీ, పల్లవినీ వెంటేసుకుని తిరిగేవాడు. అన్నవరసైనా పరాయివాడు. ఎవరూ తప్పుపట్టలేదు.
“అవన్నీ తర్వాత. అసలావిడ వప్పుకోవాలికదా?” అన్నాడు మాధవ్.
“మా మేనకోడలిమీద ఆవిడ పెత్తనమేంటి? మాతో సమానంగా మా పుట్టింటిపేరు, గోత్రం మోసింది పిల్ల. దానిగురించి మాకుకాక ఇంకెవరికి కావాలి?” గట్టిగా అంది లక్ష్మి.
లోపలెక్కడో కూర్చుని వీళ్ళమాటలు వింటున్న లీల ఇవతలికి వచ్చింది. చాలాసేపట్నుంచీ ఏడుస్తున్నట్టు కళ్ళూ, మొహం వుబ్బి వున్నాయి. వంటినిండా బంగారం పెట్టుకుని ఖరీదైన చీర కట్టుకుని, ఎంతో దర్పంగా, నా సంసారం నాకే స్వంతం అన్నట్టుండే మనిషి సర్వం కోల్పోయినట్టు దీనంగా వుంది. వీళ్ళని తగలకుండా కాస్త దూరంలో నేలమీద చతికిలబడి గోడకి ఆనుకుని కూర్చుని, పమిటచెంగులో ముఖం దాచుకుంది.
“లీలా! అసలేమైందే? వీణ పెళ్లై రెండేళ్ళైంది. ఇన్నాళ్ళూ లేనిది ఈ ఏడుపులేంటి? ఇప్పటికిప్పుడు కొత్తగా ఏం జరిగింది?” అడిగింది లక్ష్మి. “మమ్మల్నందరినీ వుత్సవవిగ్రహాలని చేసి కూర్చోబెట్టి నీ పెత్తనం సాగించుకున్నావు. ఏం చేసారే దాన్ని? ఏదొచ్చినా మా అమ్మ, మానాన్న, మా అన్నలు, మా తమ్ముళ్ళనేదానివి. వాళ్ళేకదా, ఈ సంబంధం తెచ్చింది? ఏమంటున్నారు?” నిలదీసింది ప్రమీల.
“పెళ్ళయాక దాన్ని మళ్ళీ పంపించలేదు. మేమే నాలుగైదుసార్లు వెళ్ళి చూసొచ్చాం.
మా పెద్దన్నయ్య వెళ్తే ఎవరికి పడితే వాళ్ళకి కోడల్ని చూపించం- అని వాళ్ళిచ్చినవన్నీ తీసుకుని ఆయన్ని పంపేసారు.
వదిన్ని తీసుకుని మళ్ళీ వెళ్తే అతికష్టమ్మీద నాలుగుమాటలు మాట్లాడించారు. ఉండమనీ, తినమనీ ఏదీ లేదు.
హోటల్లో గది బుక్‍చేస్తాం. మరోమాటు కావాలనుకుంటే రేపు మళ్ళీ వచ్చి చూసి వెళ్లండి- అంది దాని అత్తగారు.
అంతమాత్రానికే సంతోషపడిపోయి,
మీరెందుకు, మేమే బుక్ చేసుకుంటాం- అని వుండి మరోసారి దాన్ని చూసి వచ్చారు. అదయ్యాక ఆవిడ మాకు ఫోన్ చేసి, పెద్ద దెబ్బలాట పెట్టుకుంది.
మమ్మల్ని ప్రశాంతంగా బతకనివ్వరా? పిల్లకి పెళ్ళి చేసి పంపించారంటే ఇంక మర్చిపోవాలి. అక్కడ దానికెవరేనా వున్నారా? ఉంటేనే ఈ గోలలన్నీ. మీయిళ్లలో మగాడైతే చాలు, వావీవరసా చూడకుండా అత్తకొడుకునీ, మామనీ, మామకొడుకునీ చేసేసుకుంటారటకదా? మాకవన్నీ తప్పు. పుట్టిల్లు దాటి వచ్చిన పిల్ల మళ్ళీ అత్తిల్లు దాటేది చావుతోనే. అవి మా పద్ధతులు. మీకు తెలీకపోతే తెలుసుకోండి. మేమేమైనా మీ పిల్లని కొరుక్కుతింటామా? అంత రాకాసుల్లా కనిపిస్తున్నామా? కోడలేకదా, మాకు? కొడుక్కి చేసుకున్నాంకదా? అంత భయమైతే వచ్చి తీసుకెళ్ళిపోండి. ఇంక మళ్ళీ పంపద్దు- అని నానా మాటలూ అంది.
ఐ హేట్ యూ నాన్నా- అనిపించారు దానిచేత. వీణకి సెల్‍ఫోన్ కొని పంపాం. అదేమైందో తెలీదు. ఇంకెలాంటి సమాచారం లేదు దానిదగ్గిర్నుంచీ. ఈ వార్త చెప్పాలని ఫోన్‍చేసినప్పుడు అదే ఎత్తింది. విని ఏదో చెప్పబోతుంటే రిసీవరు లాక్కున్నారు. తర్వాతేం జరిగిందో తెలీదు. మళ్ళీ ఫోన్ లేదు. మేం చేసినా డెడ్ వస్తోంది. దాని తలరాత ఎలా వుంటే అలా జరుగుతుందన్న వైరాగ్యంలో పడ్డారు మావాళ్ళు. కాలమే అన్నిటికీ పరిష్కారం చూపిస్తుందంది మా అమ్మ.
అది మనసిప్పి మాట్లాడి,
నేను సంతోషంగానే వున్నాను, మీరేం బెంగపడకండి- అని ఒక్కసారి చెప్తే మాకీ దిగులుండదు. బిడ్డకి నాచేత్తో అన్నం పెట్టి రెండేళ్ళైంది” భోరుమని ఏడ్చింది. ఆవిడ దు:ఖంలో న్యాయం వుంది. చెప్పినవిమాత్రం సగం నిజాలే. సందర్భానికి అవసరమైనంతవరకే చెప్పింది. చాలా లౌక్యంగలది. ఆచితూచి ప్రవర్తిస్తుంది. పెళ్ళై వచ్చాక ఇక్కడింట్లో చాలా సమస్యలే వుండేవి లీలకి. చాలామంది కోడళ్ళలా తనరాకతోనే అత్తవారిల్లనేది మొదలైందనుకుంది. అప్పటిదాకా అత్తారింట్లో గడిచిన కాలానికి తెరపడిపోయి, నాటకం కొత్తగా మొదలైందనుకుంది. పాత నాటకానికి తను కొత్త అంకం అనుకోలేదు.
పెళ్ళి చేసి పంపిస్తూ లీలకి ఆవిడ తల్లి చెప్పింది,
ఆరుగురాడపిల్లలకి పెళ్ళిచేసారంటే మీ మామగారు బానే వదిలిపెట్టి వుండాలి. రెండోపెళ్ళీ, మూడోపెళ్ళీ కాకుండా మొదటి సంబంధాలే చేసారు. అవేవీ ఇప్పుడు లెక్కలకి రావు. మీ మరిది యింట్లో తనవాటా తను అమ్ముకుని తెచ్చుకున్నాడు. మళ్ళీ అటువైపు చూడలేదు. మీరూ అలానే తెచ్చుకోండి. ఆ బాదరబందీల్లో పడకండి. ఆస్తుల్లో సరిగ్గా పంచి యివ్వనప్పుడు బాధ్యతల్లో దూరిపోవలిసిన అవసరం లేదు- అంది.
మరిది చాలాకాలం అతని మామగారి చెప్పుచేతల్లో వుండేవాడు. అలానే భర్తని తనూ దారికి తెచ్చుకుంది. వంటిమీద పెద్దగా బంగారమేమీ లేకుండా సన్నటి గొలుసు, బంగారం పూతపూసిన లక్కగాజులూ వేసుకుని తిరిగే అత్తగారిని చూస్తే తన తల్లితో పోల్చుకుని చిన్నతనంగా పడేది. లీల యింట్లో మగసంతతి ఎక్కువవడంతో వాళ్ళ పరిస్థితి విజ్జెమ్మ యింటికి భిన్నంగా వుండేది. యశోదని చూసినా పెద్ద గౌరవం కలగలేదు. తీర్థం తీర్థం, ప్రసాదం ప్రసాదమన్నట్టు మనసులో భావాలకీ పై ప్రవర్తనకీ పొంతనలేకుండా వుండేది.
ఆవిడకి తర్వాతి ఆక్షేపణ గీత పెంపకం. పరిశుభ్రంగా క్రమశిక్షణతో వున్నా మిగిలిన పిల్లల్తో పోలిస్తే ఆమెలో లేమి కనిపిస్తూ వుండేది. ఆపైన అదేమిటీపిల్ల, వరసైన మగపిల్లలందరిమధ్యా అలా తిరుగుతుందని ఆశ్చర్యంగా వుండేది. అలా తిరిగినా చెక్కుచెదరకుండా వాసుని పెళ్ళిచేసుకుని స్థిరపడటం మరో ఆశ్చర్యం. అతనిమీద చిన్న చులకనభావంకూడా అప్పుడే, అందుకే వచ్చింది. గీతకోసం సుధీర్, వాసు గొడవపడ్డారు. సుధీర్ని చేసుకొమ్మని రవి అడగడం, వాళ్ళడిగిన కట్నం యివ్వలేమని గీత వాసుని చేసుకుంటాననడం, తర్వాత వాళ్ళూ వీళ్ళూ మాటలు మానెయ్యడం అందరికీ తెలిసిందే. కొన్ని విషయాలు అసలు జరగనట్టూ, మర్చిపోయినట్టూ వుండటం కొందరికి నచ్చదు. లీలకీ నచ్చదు. వీణకి సంబంధాలు చూస్తున్నప్పుడు వీళ్ళంతా తలదూర్చబోయారు. ఇవన్నీ ఎత్తి చూపించి, ఏం చూసి చేసుకున్నావు గీతనని అడిగినందుకు ఆవిడని కొట్టినంత పని చేసి, మాట్లాడ్డం మానేసాడు వాసు. శేఖర్ తిరిగి చెయ్యిలేపలేదు మేనల్లుడిమీద. భార్య పరువు నిలబెట్టలేదు. అదో కోపం వుందావిడకి. ఈ చావింట్లో యిన్నేళ్ళతర్వాత వాసుకీ సుధీర్‍కీ మాటలు కలిసాయి. ఆడపిల్లకోసం కొట్లాడుకుని ఏ మొహాలు పెట్టుకుని మళ్ళీ మాట్లాడుకున్నారో! ఆమధ్యని ఇదెంత సిగ్గులేకుండా తిరుగుతోందో!
గీతకి తండ్రి స్థలం రాసినప్పుడు ఆవిడ పుట్టింట్లో అందరికీ చురుక్కుమంది.
బైటివాళ్ళకి చేతిలో పెట్టినట్టు స్థలానికి ధరకట్టి మీచేతిలో పెట్టి పంపించారు. ఇల్లు కట్టుకోవడానికికదా, మీరు అమ్మింది? మరో నాలుగుపైసలు ఇస్తేనేం? మీ మామగారిచ్చింది ఏమైందో మీరేమైనా లెక్కడిగారా? ఇన్నేళ్ళయాక వాళ్ళు చెప్పబోతారా? అంతస్థలం కూతురికి ఒక్కదానికీ యిచ్చేబదులు, అమ్మేసి, దీనికీ ఎంతో కొంత యిస్తే ఏంపోతుంది? ఆ పిల్లకి గవర్నమెంటు వుద్యోగం, లంకంత కొంపా వున్నాయి. ఉన్నదంతా ఇంకా మూటలుకట్టి యివ్వడం దేనికి? మీ మరిదిది పెద్దవుద్యోగం. అతనికి పట్టింపు లేదు. మీ ఆయన వుద్యోగం చిన్నదేకదా – అంది తల్లి.
వీణ పెళ్ళికి బావగారు ఎంతోకొంత సర్దుతాడనుకుంది. ఆయన పట్టనట్టు వుండిపోవడంతో మనసుకి కష్టమనిపించింది. గీత పెళ్ళికి అందరూ కలిసి సాయంచేసారు. తమచేతా పెట్టించారు. పెట్టింది వీణపెళ్ళికి తిరిగొస్తుందనుకుంటే చదివింపులతో సరిపెట్టారు. ఇంత నేపథ్యం పెట్టుకుని, మనసులో వున్నది పైకి రానివ్వకుండా దాచుకుని, ఎవరూ ఏదీ పెట్టనప్పుడు మీ పెత్తనాలు దేనికన్నట్టు, పూర్తిగా పుట్టింటివారి అధ్వర్యంలో పెళ్ళి జరిపించింది. అదిలా బెడిసికొట్టింది. ఇన్నాళ్ళూ గుండెనిబ్బరంతోటే వుంది. భర్త మరీ బెంబేలెత్తిపోతున్నాడు. ఎందరు వాళ్ళ బాగు వాళ్ళు చూసుకోలేదు? తనేం ఎవరికీ హానిచెయ్యలేదు. ఎవరిదీ ఆశించి తినలేదు. ఎంతమంది దూరపు సంబంధాలు చెయ్యలేదు? తమకెందుకిలా జరిగింది?
వీళ్లంతా కలిసి ఇప్పుడేం చేస్తారు? భర్త ఒకటో రెండో దెబ్బలేసాడని, మహతిని కాపురం విడిపించి తీసుకొచ్చేసారు. వీణకికూడా అదే జరగబోతోందా? ఇంకో ఏడాదో రెండేళ్ళో సర్దుకుంటే సరిపోతుందేమో! ఒక పిల్లో, పిల్లాడో పుడితే మార్పొస్తుందేమో వాళ్ళలో! భర్త ఏడుపుల్తో అంతా బట్టబయలైపోయింది. మగవాడు అతనలా ఏడవటేమిటి? భర్తమీది చిన్నచూపూ, కూతురికోసం బెంగా, ఆమె భవిష్యత్తుపట్ల భయంతో నలిబిలి ఐపోయింది.
“ఏడవకు లీలా! ఏం చేద్దామనుకుంటున్నారో చెప్పు” అరుణ కలగజేసుకుంది.
“ఎటూ దారితోచకుండా వుంది. అదక్కడ బానే వుండి, మేము వూరికే కంగారుపడుతున్నామా? వాళ్ళకిష్టం లేనప్పుడు వెళ్ళడం దేనికనే ఆలోచన వుంది. అనవసరంగా వాళ్లని రెచ్చగొట్టినట్టౌతుంది. ఇప్పటికే వాళ్ళు బోల్డన్ని తప్పులు చెప్పారు. మగపిల్లల్ని పంపడం బావోదు. మనింట్లో పిల్లలందరికీ సూతకాలు. వాళ్ళు వెళ్లడానికి లేదు” అంది.
గీతావాళ్ళూ వెళ్ళడం ఆవిడకి యిష్టం లేదని అర్థమైంది అక్కడున్న అందరికీ.
“మీవాళ్ళతో ఆలోచించి చెప్పు. కావాలంటే వాళ్ళనీ వెళ్లమను వీళ్లతో. హోటల్లో వుండేవాళ్ళు వుంటారు, మిగతావాళ్ళు యింటికి వెళతారు. ఆలస్యం చెయ్యకండి” అంది లక్ష్మి.
“పదోరోజుకి వస్తుందేమో!” అంది లీల. మాధవ్ కలగజేసుకున్నాడు.
“అత్తా! వీణ తులసీవాళ్ళకన్నా చిన్నది. దాన్ని మాకు మరదలని అనడం నీకే తగింది. ఇంట్లోవాళ్ళే ఇలా అర్థంపర్థం లేకుండా మాట్లాడితే బైటివాళ్ళు అనరా? సరే, నువ్వన్నట్టు మరదలే. ఐతే? మాకు విలువలూ అవీ లేవా? మా పెంపకాలంత దరిద్రంగా ఏడ్చాయా? పసిపిల్లతో పరాచికాలాడేంత సంస్కారహీనంగా పెరిగామా? ఎవర్ని చూసావు నువ్వు, అలా హద్దుమీరి ప్రవర్తించడం? అందరం ఇక్కడే వున్నాం. ఇదే యింట్లో తిరుగుతున్నాం. కనిపించట్లేదా? ఒక్కడు రాణా. వాడేనా బైటేవో వేషాలేస్తాడుగానీ, మనమధ్య బానే వుంటాడు. వీణ, సంతోష్ మా పందొమ్మిదిమందిలోవాళ్ళు. పిల్ల ఎలా వుందోనని వాడు టెన్షనుపడుతున్నాడు. వాడికి సపోర్టు యివ్వాలని మేం నిర్ణయం తీసుకున్నాం. వీణకి ఏదేనా జరిగేదాకా చేతులు ముడుచుకుని కూర్చోం. పదోరోజుని అది రాకపోతే మేం చేసేది చేసేదే. వదినే అక్కర్లేదు. ఇక్కడ కూర్చుని తను చెప్పినా, ఆవిడ చెప్పింది చెప్పినట్టు చెయ్యడానికి చాలామందే వున్నాం” అన్నాడు. ఆవిడ మరి మాట్లాడలేదు. వీళ్ళకి తెలీకుండా అన్నగారికి ఫోన్ చేసి మాట్లాడింది.
“వెళ్ళనివ్వు లీలా! అందరూ ఆడవాళ్ళే అంటున్నావుకదా? మీరు హోటల్లో వున్నట్టు వీణ అత్తవారికి తెలియనివ్వకండి. వీణ అత్తవారు తలుపు తెరిచి వీళ్ళని లోపలికి రానిస్తే అసలది ఎలా వుందో తెలుస్తుంది. ఒకవేళ వీళ్ళేదైనా హెచ్చులు చేస్తే, జరిగింది తెలీనట్టు వీణ అత్తగారిని దబాయించు. మా పేరు చెప్పుకుని ఎవరెవరో వస్తే మీరెలా రానిచ్చారని అడుగు” అని సలహా యిచ్చింది ఆవిడ తల్లి. ఆవిడ విని నిశ్వసించింది.
ఇంట్లో ఎవరూ లేరని రాణా వస్తున్నాడు.
“ఎంతసేపని యింట్లో కూర్చుంటావే? అలా బైట తిరిగొద్దాం పద” అని మహతిని బలవంతంగా తీసుకెళ్ళాడు. ముంబైలో వుండగా ఆమెదగ్గిర తీసుకున్న డబ్బు వద్దంటున్నా తిరిగిచ్చేసాడు.
“ఇప్పుడు సంపాదన బానే వుంది మహీ!” అన్నాడు.
“ఐతేనేం? ఉంచరా! పిల్లలకి ఏవైనా కొను. యమున ఎలా వుంది? పదోరోజుకి తీసుకురా! అమ్మమ్మ అందరినీ ఒక్కలానే చూసింది. ఎవరినీ ఎక్కువా తక్కువా అనుకోలేదు. మేమూ అనుకొవట్లేదు” అంది మహతి.
“నువ్వనుకోవట్లేదేమో! నేనొస్తే మీ లీడరు ఏమంటుందో!” అన్నాడు.
“ఎవరు, గీతా? అదేమంటుంది?”
“వాళ్లకి బాగా డబ్బు పొగర్లెక్కాయి లేవే! నాలాంటివాళ్లం కళ్ళకి కనిపించం”
“ఎవరికి వుండేది వాళ్లకి వుంటుంది! వాసు తెలివైనవాడు. సంపాదిస్తున్నాడు. నువ్వూ తెలివిగా వుంటే వద్దని ఎవరేనా అన్నారా?”
“అదృష్టంకూడా కలిసి రావాలమ్మా! సంపాదించి పెట్టే పెళ్లం, కానుకలు కుమ్మరించే అత్తమామలు, అమెరికా బావమరిదీ అందరికీ వుంటారా?”
“అవేం మాటల్రా? గీత చిన్నతనం మర్చిపోవద్దు రాణా! వాళ్ళ నాన్న బాధ్యతలకోసం ఎంత సర్దుకు బతికిందో మనకి తెలీనిదికాదు”
“అయ్యబాబోయ్! మీరంతా ఒకటేనే. దాన్నేమీ అనకూడదు”
“ఇంకా అదీ యిదీ ఏంట్రా? పెద్దవాళ్ళయాం. ఆడపిల్లలం మాలో మేము అనుకుంటాం. మిగతావాళ్ళంతా వదినా అని పిలుస్తున్నారు. నువ్వూ అను”
“వదినగారని అనక్కర్లే? మామకూతురే బాబూ! అలా పిలుచుకుంటూనేగా, పెద్దయ్యాం?”
మహతికి చిరాగ్గా అనిపించింది. అతనితో అనవసరంగా వచ్చాననుకుంది. టాంక్‍బండ్‍మీద అరగంట కూర్చున్నాక, సినిమాకి వెళ్దామన్నాడు.
“అమ్మమ్మ పోయిందని మర్చిపోయావేంట్రా? ఎవరికేనా తెలిస్తే నవ్వుతారు. పద, యింటికి” అని కేకలేసి బయల్దేరదీసింది. ఆమెని యింటిదగ్గిర దింపేసి వెళ్ళిపోయాడు రాణా.
“వాడితో ఏంటమ్మా? నన్నడిగితే తీసుకెళ్ళేవాడినికదా?” అన్నాడు మాధవ్.
“ఎక్కడికెళ్తాన్రా నేను? బైట నాకేం పనులుంటాయి? బలవంతంగా లాక్కెళ్ళాడు. తలవాచిపోయింది. ఇలా తయారయాడేంటి మాధవ్, వీడు? మనతో కలిసి పెరిగినవాడేనా అని ఆశ్చర్యంగా వుంది” అంది మహతి.
“మందలోంచీ తప్పిపోయినవాళ్ళు యిద్దరు మహీ! సుధీర్, వీడు. వీడినైతే పూర్తిగా వదిలేసాం. సుధీర్‍గాడి ఏడుపేంటో తెలీదు. ఎప్పుడో జరిగిన విషయాలు పట్టుకుని ఇంకా ఏడుస్తుంటాడు. నిన్న వాసుతో కలిసి రివర్‍సైడు వెళ్లాడు. ఏం గొడవపడ్డారో తెలీదు. నన్నూ రమ్మంటే వెళ్ళేవాడిని. ఇద్దరం కలిసి రేవుపెట్టి వచ్చేవాళ్ళం” అన్నాడు మాధవ్.
“నాకో విషయం అర్థంకాదురా! ఆమ్మ కట్నం అడిగిందంటే పెద్దనాన్నతో ఆలోచించివుండదా? అసలు పెత్తనం ఆయనదేకదా? ఆయన్నొదిలేసి, వాడేమో ఆవిడ్నీ, సుమతేమో గీతనీ సాధించి పొడుం చేస్తున్నారు. భలే వున్నార్రా, అన్నాచెల్లెళ్ళు. పెద్దవడం అంటే ఇదా?” అంది ఆశ్చర్యంగా.
“ఇప్పుడది కాస్త మారిందిలే!” అన్నాడు మాధవ్.
ఈ ఐదురోజులూ మామూలుగా గడిచిపోయాయి. ఎనిమిదోరోజు సాయంత్రానికి హడావిడి మొదలైంది. ఒక్కొక్కరే రావడం మొదలుపెట్టారు. సుధీర్‍కూడా తిరిగొచ్చేసాడు. ఇక్కడికి మళ్ళీ ఎప్పుడొస్తాడో తెలీదు. రావాలన్న కోరికా లేదు. ఈ వున్న కొద్దిరోజులూ అన్ని స్నేహాలనీ పూర్తిగా ఆస్వాదించాలనిపించింది. ఇక్కడి జీవితం సుమతిదీ, సుమంత్‍దీ. తనది కాదు. తనకి యిక్కడేం లేదు. వచ్చినా తమ్ముడింట్లోనో, చెల్లెలింట్లోనో అతిథిగా వుండాలి. తండ్రికి తను కొనిచ్చిన యింట్లోకూడా తను అతిథే. వాళ్ళతోటీ కలవలేడు. తల్లితో బాహాటంగా విముఖత. తండ్రితో లోలోపలి విముఖత. మనుషులెవరూ స్వంతవాళ్లనిపించట్లేదు. తెగిపోయింది గీతతో బంధం ఒకటే కాదు. ఇక్కడి మొత్తం జీవితంతో తెగిపోయింది. తన జీవితంలో తనకి దొరకని సంతోషం తనతోటి జీవితంలో రమకి వుంది. తన గమ్యం ఆమెతో ముడిపడి వుంది. చేపపిల్లలా పదేపదే జారిపోతున్న మనసుకి చెప్పుకుంటున్నాడు. సుమతి చెప్పిన అఫర్మేషన్స్ ఇచ్చుకుంటున్నాడు.
ఆరోజు రాత్రి చెప్పాలనుకున్నవి చెప్పుకున్నాక మళ్ళీ వాసుకీ సుధీర్‍కీ మధ్య పెద్దగా మాటలు నడవలేదు. మనసు వెల్తిపడిందో, తేలికపడిందో సుధీర్‍కి తెలీలేదు. ఐనా ఇద్దరూ పక్కపక్కనే కూర్చున్నారు, కలిసే తిరిగారు. ఇద్దర్నీ చాలాసార్లు జో గమనించాడు.
“ఊరికే ముంబై ట్రిప్పులు వేస్తున్నావు. ఏం కొన్నావురా అక్కడ?” నవ్వుతూ అడిగాడు వాసు.
“మాఅందరం అక్కడ ఫ్లాట్స్ తీసుకున్నాం వాసూ! ఒక ఫ్లోరంతా తీసుకున్నాం” అన్నాడు సుధీర్.
“ఇంక ఇక్కడికి రావన్నట్టేనా?” ప్రశ్న వాసు పెదాల వెనకే ఆగిపోయింది. ఎంత దూరాలు పెంచుకున్నారు! ఈ కుటుంబం, పుట్టి పెరిగిన వూరు, తాము నడిపించిన గ్రూపు, చిన్నప్పటి స్నేహాలు ఇవన్నీ ఎక్కడో వెనక్కి జారిపోయి వుంటాయి. తనకి వీడితో స్నేహం యిష్టం. వీడికి కాకపోవచ్చు. ఎవరి ప్రాథమ్యాలు వారివి. తమదారులు పూర్తిగా చీలిపోయాయి. బలమైన ఏ సంఘటనలో నిర్మించే కూడలిలో కలుసుకుని బంధువుల్లా మర్యాదలు పాటించి వీడ్కోలు చెప్పుకోవటం మినహా మరేమీ మిగిలి లేదు. ఇలాంటి సందర్భాల్లో వీడ్కోలుకూడ వుండదు. మంచుబొమ్మల్లా కరిగి కొన్ని అనివార్యమైన గుర్తుల్ని నీటిమడుగులా వదిలిపెట్టి అదృశ్యమైపోవటమే. అందరూ యూయస్ దారే పడుతున్నారుగాబట్టి అక్కడే కలవచ్చని తర్వాత జరగబోయే పెళ్ళిళ్లకికూడా రాకపోవచ్చు వీడు. చిన్నగా నిట్టూర్చాడు.
“మీయిల్లొకసారి చూడాలని వుందిరా! అలాగే వుంచారా, మార్చారా?” అన్నాడు సుధీర్ వాసుతో.
“అలాగే వెళ్దాం. పెద్దగా మార్పులేం చెయ్యలేదు సుధీర్! నా చిన్నప్పుడెలా వుందో అలానే వుంచాం” అన్నాడతను. రాత్రి భోజనాలయ్యాక ఇద్దరూ వెళ్ళారు. గీత ఇక్కడే వుండిపోయింది. వాళ్లతో వెళ్లలేదు. ఒకటి రెండుగంటలుండి వచ్చేసారు.
కర్మచేస్తున్న ముగ్గురు అన్నదమ్ములకీ ఆశీర్వచనం యిచ్చి, బట్టలుపెట్టడానికి బావమరుదులు వచ్చారు. తొమ్మిదోరోజుని కర్మకాండ మొదలుపెట్టారు. అందర్లోనూ తెలీకుండానే వీణగురించి ఎదురుచూపు మొదలైంది. తొమ్మిది సాయంత్రానికి వస్తుందనుకున్నారు. వాళ్ళదగ్గిర్నుంచీ ఫోనులేదు. వస్తున్నామనిగానీ, రావట్లేదనిగానీ ఎలాంటి సమాచారం లేదు. వీళ్ళు ఫోన్ చేస్తే కలవట్లేదు. పదోరోజు అంతా ధర్మోదకాలివ్వడానికి రివర్‍సైడు వెళ్ళిపోయారు. రాణా యమునని తీసుకుని వచ్చాడు. ఆమె గీతని వెతుక్కుని వెళ్ళి పలకరించి వచ్చింది. కొడుకూ కోడలూ పక్కనే నిలబడ్డా తనకి పట్టనట్టు సంధ్య ముభావంగా వుండిపోయింది. ఆవిడ భర్త హనుమంతరావు వచ్చాడు.
“ఆయనతో అంతా మామూలుగా వుండండి. కనీసం ఇక్కడ దొరికే మర్యాద చూసేనా మారతాడేమో!” అన్నారు, వాసు, రవి. ధర్మోదకాలిచ్చి, భోజనం చేసి వెళ్ళాడు. వెళ్ళేదాకా ఎవరో ఒకరు కాస్త ప్రాధాన్యత యిచ్చి మాట్లాడుతూ ఆయన చుట్టూ తిరిగారు. వాసుకూడా పాత గొడవలు మర్చిపోయినట్టే వుండిపోయాడు. ఆరోజు సాయంత్రానికి బైటివాళ్ళు వెళ్లిపోగా ముఖ్యమైనవాళ్ళు మిగిలారు.
విజ్జెమ్మ పేరుమీద ఏదో ఒకటి చెయ్యాలనుకుని మనవలంతా డబ్బు పోగుచేసారు. ఎవరెంత యిచ్చారో అందరికీ తెలిసి, తక్కువ యిచ్చినవాళ్ళు చిన్నతనంపడకూడదని పక్కగదిలో డబ్బాపెట్టి అందులో వేసుకున్నారు. సుధీర్, సుమంత్, సుమతిమాత్రం ముగ్గురికీ కలిపి చెక్కు యిచ్చారు. రెండులక్షలదాకా పోగైంది.
“పెద్దమొత్తం కాబట్టి ఏదేనా మెడికల్ ఎమర్జెన్సీకి వాడదాం. మామ్మ బదులుగా మరోమనిషి ఎక్కడో బతుకుతారు” అంది గీత. పెద్ద తర్జనభర్జన లేకుండా అంతా వప్పుకున్నారు. లత డిస్పోజల్లో పెట్టారు డబ్బుని.
“దూకేద్దామా సంతోషపు లోయలోకి?
పదండి చేతులుపట్టుకు ఒకరినొకరు తోసుకు
ఎర్రాఎర్రాని పువ్వుల్లూ అమ్మాయీ అలకల్లూ
పచ్చాపచ్చని నవ్వుల్లూ అబ్బాయీ పకపకలూ
ఆకాశాపందిరినా
మబ్బుల్లూ చిక్కన్నీ రెమ్మలై
చుక్కల్లూ పూసే పువ్వుల్లై
మురిపించే వేళల్లోనా
ఏడే ఏడే ఆ అల్లరివాడూ?
ఏడ్చే తుంటరివాడూ?
తప్పించుకు పోయాడెక్కడికి?”
చిన్నప్పుడెప్పుడో పద్మ వీళ్ళకోసం రాసిచ్చిన పాట గుర్తున్నంతవరకూ పాడింది రవళి.
“ఇంకా మర్చిపోలేదే?” అక్కడినుంచో విని వీళ్ళదగ్గిరకొచ్చి ఆశ్చర్యంగా అడిగింది పద్మ. “నన్నుకూడా ఆరోజుల్లోకి లాగేసారు” అంది. పెద్దవాళ్ళంతా ఒకొక్కరూ వచ్చి కూర్చున్నారు.
“రాముడుద్భవించినాడు రఘుకులంబునా” అని అందుకుంది వల్లి. తర్వాత అచ్యుతం కేశవం పాడింది. అందరూ నచ్చిన కృతులు, కీర్తనలు అడిగి పాడించుకున్నారు.
“అమ్మమ్మకి చాలా గొప్ప కానుక ఇచ్చావు వల్లీ!” అన్నాడు ప్రహ్లాద్ చెల్లెలితో ప్రేమగా.
“సంగీతం నేర్చుకున్నావే?” అడిగింది గీత.
“కెరీర్‍గేప్‍లో రెండేళ్ళు నేర్చుకున్నాను” అందామె.
“కోయి లౌటాదె మేరే బీతే హుయె దిన్” రాగయుక్తంగా అంది గీత.
“నీ దౌర్జన్యం మండిపోనూ, అదేం బేరమే?” అంది సమీర.
“నువ్వూ నేర్చుకున్నావే? చిన్నప్పుడెప్పుడూ పాడేదానివి కాదు?” ఆశ్చర్యంగా అడిగింది సుమతి.
“నాది శృతపాండిత్యమే. చిన్నప్పుడు అప్పజెప్పేదాన్ని. ఇప్పుడు దానికి కాస్త రాగం చేర్చాను” అంది గీత.
“విహీకి ఇప్పుడు తొమ్మిదేళ్ళు సుధీర్! అంటే తొమ్మిదిమంది పిల్లల్ని మేం పెంచుకుంటున్నాం. వీళ్ళిద్దరు. సెలవులు రాగానే తులసి పిల్లలొస్తారు. ఒకడు కంజీర పట్టుకుంటాడు. మరొకడు డోలక్ బజాయిస్తాడు. పాటలు, ఆటలు. పగలంతా వుంటారు. ఎంతల్లరీ, సందడీ చేస్తారో తెలీదు. రాత్రయ్యేసరికి ఎక్కడివాళ్లకి వెళ్ళిపోగా మిగిలినవాళ్ళు వాళ్ళ ప్రపంచంలోకి వాళ్ళు జారుకుంటారు. కబుర్లు, కథలు, కంప్యూటరు, గేమ్స్. అందులో మాకు చోటుండదు. ఇద్దరమే మిగుల్తాం. ఒకప్పుడు మాకు ఏకాంతం అనిపించినది యిప్పుడు వంటరితనంలా అనిపిస్తోంది. రాత్రనేది వుండకూడదనిపిస్తుంది. బైటికెళ్తే మయూ విహీల అమ్మానాన్నలగానే మా గుర్తింపు. ఇప్పుడది మయూ విహీల యిల్లు. రామకృష్ణగారిది కాదు, వాసు, మాధవ్‍లది కాదు. ఇదంతా ప్రతివాళ్లకీ అనివార్యమేమో!” అన్నాడు వాసు.
ఇంక విడిపోతున్నామని అందరికీ తెలుసు. సుధీర్ చుట్టే వున్నారు అందరూ. అందని చందమామ అతనే.
సంధ్య వచ్చి సుధీర్ పక్కని కూర్చుంది.
“చెప్పు పిన్నీ!” అన్నాడతను ప్రేమగా.
“మీరందరు పైకొచ్చారు సుధీర్! రాణాని అలా వదిలేసారేంట్రా? ఈ మహరాణీగారికి కోపం వస్తే ఇంక అంతేనా? ఎవరికేనా పట్టూ విడుపూ వుంటుంది. దీనికి అలాంటిది లేదు. పట్టిందే పట్టు” అడిగింది గీతని ఎత్తిచూపిస్తూ.
“మధ్యలో వదిన్ననడం దేనికి? మాకెవ్వరికీ వాడిమీద కోపం లేదు. అందరం కలిసి ముంబై పంపిస్తే బతకలేకపోయాడు. సుధీర్ రెండుసార్లు డబ్బిచ్చాడట. బాగుపడతాడనే యిచ్చాడుకదా? ఇంకేం చెయ్యాలో నువ్వే చెప్పు” అన్నాడు సుమంత్.
“మావి నాలుగైదు కుటుంబాలు పిన్నీ! అందరికీ కార్లున్నాయి. వాడికి డ్రైవింగ్ వచ్చు. అందరిమధ్యలో తిరుగుతూ అందరికీ అందుబాటులో వుంటే కాదన్నామా? ఉత్తిగా చేయించుకోముకదా? బైటివాళ్లకి యిచ్చేది వాడికీ యిస్తాము.మా పిల్లల్ని వాడితో పంపడానికి స్వంతమనిషికాబట్టి మాకూ భయం వుండదు” అంది సుమతి.
“బంట్రోతుగానో, డ్రైవరుగానో వాడుకుంటారే వాడిని? ఎంత డబ్బు బలుపొచ్చిందే, మీకందరికీ?”
“అకౌంట్స్ రాయగలడా? కంప్యూటర్లో చెయ్యగలడా?” అడిగాడు ప్రహ్లాద్.
“ఏదీ రాదు. చదువు లేదు. మరేం చెయ్యమంటావు ఆమ్మా?” అడిగాడు వసంత్.
“వీళ్ళందర్లా వాడూ నాకు తమ్ముడే. వాడి హద్దులో వాడుంటే ఎలాంటి అమర్యాదా జరగదు. నాది డబ్బు బలుపనుకో, మరోటనుకో. మేం చెయ్యగిలింది ఇదే. భార్యాపిల్లల్ని వదిలేసి తిరుగుతున్నాడు. వాళ్ళని తీసుకొచ్చి దగ్గిరపెట్టుకుంటే నలుగుర్లో విలువ వుంటుంది. వీడికి చదువులేకపోయినా, పిల్లల్ని బాగా చదివించుకుంటే గౌరవం దొరుకుతుంది. కాదంటావా, వాసూవాళ్లకీ పొలాలున్నాయి. రెండెకరాలు తీసుకుని కౌలు చెయ్యమను. రాణీసాహెబాని నేను వప్పిస్తాను” అంది సుమతి.
“ఏ రాయైతేనేం పళ్ళు రాలగొట్టుకోవడానికి? మీమధ్యనే పడేసుకోండి. మళ్ళీ వాళ్లెందుకు?”’ అంది సంధ్య.
అందరూ వాచీలు చూసుకున్నారు. పూనానుంచి వచ్చే ఆఖరిరైలుకూడా వెళ్ళిపోయింది. స్టేషనుకి వెళ్ళిన రవి, పల్లవి నిరాశగా తిరిగొచ్చేసారు.
లీల ఇంక నిలవరించుకోలేక పెద్దగా ఏడుపు మొదలుపెట్టింది. మరోవైపు శేఖర్ దు:ఖపడుతున్నాడు. ఇక్కడి హడావిడి అయిన వెంటనే బయల్దేరాలని నిర్ణయించారు ఆడపిల్లలు. వాసుకి ఇష్టం లేదని తను రానంది గీత.
“నువ్వు రాకపోతే ఎలాగే?” అంది సుమతి. అంతా కలిసి అడిగితే వాసు కాదనలేకపోయాడు. ఇప్పుడు కుటుంబం అందరిదీగా వున్న సమస్య తిరిగి తమనే చుట్టుకుని, తమ వైవాహికజీవితాన్ని కూకటివేళ్లతో పెళ్లగించే ప్రయత్నం చేస్తుందని ఇద్దరికీ తెలీదు. రాబోయే కాలంలో జరగబోయే కొన్ని సంఘటనలకి సంబంధించిన ముందస్తు సూచనగా కొద్దిపాటి దు:ఖం లిప్తపాటు వాసూగీతలిద్దరి మనసుల్లోనూ చోటుచేసుకుంది. పన్నెండోరోజు సాయంత్రానికి ఎక్కడివాళ్లక్కడికి వెళ్ళిపోయారు. సుధీర్ యూయస్ ఫ్లైట్ ఎక్కేసాడు. వరుసలో తర్వాత కృష్ణ వున్నాడు. మాధవ్ ఇప్పుడు రాజస్థాన్లో చేస్తున్నాడు.
ఎవరూ వెళ్ళే అవసరం రాకుండా పదమూడోరోజు తెల్లారి పూనా పోలీస్‍నుంచీ ఫోనొచ్చింది. స్పృహలేని స్థితిలో రోడ్డుమీద పడి వుందట వీణ. పదోరోజుకి పంపమని అత్తమామల్ని గట్టిగా అడిగినందుకు వాళ్ళు బాగా కొట్టి వూరెళ్లిపోయారు. ఆమె భర్త తన ఆట మొదలుపెట్టాడు. తెల్లారేదాకా మత్తు దిగకుండా వుండేలా హెవీ డోస్ ఇస్తాడు. కానీ ఆరోజు తెల్లారి మూడౌతుంటే మెలకువ వచ్చేసింది. తమ బెడ్‍రూంలో డిమ్‍గా వున్న బెడ్‍లాంపు వెలుతుర్లో తాగుతూ సెల్‍ఫోన్ చూసుకుంటూ నవ్వుకుంటున్న ముగ్గురు మగవాళ్లని చూసి హడిలిపోయింది. సర్వశక్తులూ కూడగట్టుకుని మంచం దిగి అదాటుని ఇంట్లోంచీ తప్పించుకుని బైటపడింది. రోడ్డుదాకా రావడమే పెద్ద తెగింపు. పరిగెత్తడానికి సహకరించక కాళ్ళు తడబడి, కళ్ళు తిరుగుతుంటే నడిరోడ్డుమీద కుప్పకూలిపోయింది. నైట్ పెట్రోలింగ్‍వాళ్ళు చూసి, హాస్పిటల్‍లో చేర్చి, ఆమెకి కొద్దిగా స్పృహ రాగానే నెంబరు తీసుకుని ఫోన్ చేసారు. శేఖర్, అతని బావమరుదులు, రవి వెంటనే బయల్దేరారు. మెడికల్ రిపోర్టు చూసి అందరికీ మతిపోయింది. వంటిమీద దెబ్బలున్నాయి. ముగ్గురు మనుషులు అబ్యూజ్ చేసినట్టు టెస్టుల్లో రెమ్నెంట్స్ దొరికాయి. వంట్లో మత్తుమందు అవశేషాలున్నాయి. వీళ్ళు వెళ్ళాక ఆ పిల్లకి పూర్తిగా స్పృహ వచ్చింది. భర్తమీదా, అత్తమామలమీదా వివరంగా కంప్లెయింటు రాసిచ్చింది. ఆ పిల్లని వెంటబెట్టుకుని వెనక్కి వచ్చారు వెళ్ళినవాళ్ళు. తిరిగి రాగానే విమెన్ పోలీసు స్టేషన్లో కొత్తగా వచ్చిన డొమెస్టిక్ వయొలెన్స్ చట్టంకింద కంప్లెయింటు యిచ్చారు. అది నాన్‍బెయిలబుల్ అఫెన్స్. అతన్నీ, అతని తల్లిదండ్రులనీ సంబంధించినవాళ్లందరినీ జైల్లో పడేసారు.
ఏవో తెలీని నెంబర్లనుంచీ వస్తున్న ఫోటోలు వీణని కలవరపెడుతున్నాయి. ఎన్నిసార్లు జరిగిందో ఇలా? కనీసం పాతికసార్లు. అతను తనకి మత్తింజెక్షన్లు యిచ్చినన్నిసార్లూ జరిగే వుంటుంది. అత్తమామలున్నప్పుడు అతన్తో గడిపినా ఇంత బాధ వుండేది కాదు. తామిద్దరే వున్నప్పుడు నరకానికి దారులు తెరిచేవాడు. తనతో వున్న మగవాళ్ళు భర్త స్నేహితుల్లా యింట్లో తిరిగినవాళ్ళే. రేప్ కేసా, బ్రోతలా అని పోలీసులు తర్జనభర్జన పడ్డారు. రిపోర్టుల్లో యథాతథంగా రాసారు. అన్నీ బహిర్గతమే. తనెవరనేది ఇప్పుడింక చుట్టూవున్నవాళ్ళు నిర్ణయిస్తారు. నిర్వేదంగా వుంది వీణకి.
జరిగినదానికి తక్షణప్రతిచర్యలా రవి, పల్లవికి పెళ్ళిచేసాడు. జోద్వారా సంబంధం వెతుక్కుని పెద్దఆర్భాటం లేకుండా క్లుప్తంగా ఐందనిపించి, అల్లుడితో ఆమెని అమెరికా పంపించేసాడు.
“జరిగిందేదో జరిగింది. దాని తలరాత ఇలా వుందని ఎవరం అనుకోలేదు. కొట్టడం కాదు, తిట్టడం కాదు, తార్పుడుగాడు దాని భర్తయాడు. తప్పు ఎవరిదైనా, చెడిపోయినదాన్ని ఇంట్లో ఎలా పెట్టుకుంటావు? వాడు జైలునించీ వచ్చాక వదిలిపెడతాడా? ఎటేనా పంపించెయ్” అంది లీల తల్లి.
లీల తెల్లబోయింది. తర్వాత ఏడ్చింది. “అది నా కూతురమ్మా!” అంది. ఆవిడా ఏడ్చింది.
“నాకుమాత్రం మనవరాలు కాదటే? ఎంత అపురూపంగా పెంచాను దాన్ని? కానీ ఆలోచించు లీలా! సంతోష్‍కి యింకా పెళ్లవలేదు. ఇదింట్లో వుండగా వాడిని చేసుకోవడానికి ఎవరేనా ముందుకొస్తారా? వాడి బతుకు నాశనం చేస్తావా? కాదంటావా, ఇంత విషం కొని, కళ్ళెదురుగా పెట్టు. ఎప్పుడో దానికే తోచి మింగుతుంది” అంది. ఈ విషయాలు తెలిసి సంతోష్ తల్లితో బాగా దెబ్బలాడాడు.
“చెల్లి యిలా వుండగా నాకిప్పుడు పెళ్ళి కావలిసొచ్చిందామ్మా? పిల్లని అపురూపంగా పెంచడం గొప్పకాదు. అది ప్రేమ కాదు. అలా పెంచడం నీకు సంతోషాన్నిచ్చింది కాబట్టి చేసావు. దానికి కష్టం వచ్చినప్పుడు ఆదరించకపోతే ఇంక నీ ప్రేమ ఎందుకు? మనమే కాదంటే ఎక్కడికి పోతుంది? ఇంకెవరు చూస్తారు దాన్ని? ఇది దానిల్లు కాదా?” అన్నాడు. అమ్మమ్మతోటీ దెబ్బలాడాడు.
“నీకు చెప్తే అర్థమవ్వట్లేదు. మాకిక్కడ యింటినిండా ఆడపిల్లలున్నారు. దాన్నిటు రానివ్వకండి” అందావిడ. అలాంటి తిరస్కారం గుండెని పగలేస్తుంది.
“అదేకాదు, ఎవ్వరం ఇంక మీ గడప తొక్కం. మాకూ మీకూ చుట్టరికాలు యింతటితో సరి!” అన్నాడు సంతోష్.
అన్నీ బావున్నప్పుడే అడ్డదిడ్డంగా మాట్లాడిన మనిషి ఇలాంటప్పుడు ఇంకెలా మాట్లాడుతుందోనని మగపిల్లలంతా దూరంగా వుండిపోయారు. పెద్దవాళ్ళంతా వచ్చి మాట్లాడి వెళ్ళారు. రోగమా, కొట్టి తిట్టడమా, ఏమని ధైర్యం చెప్పాలో ఎవరికీ తెలీలేదు. ప్రమీల అడిగితే లత వెళ్ళి వీణని చూసి, కొన్ని టెస్టులవి చేయించమని రాసిచ్చి, ధైర్యం చెప్పి వెళ్ళింది. వల్లి వచ్చి,
“ఒసేయ్, అదృష్టం బావుండి వాడు నిన్ను ఎవరికీ అమ్మెయ్యలేదు. అర్ధరాత్రి రోడ్డునపడ్డా పోలీసులు నిన్ను జాగ్రత్తగా కాపాడి మీ అమ్మానాన్నలకి అప్పజెప్పారు. లైఫ్ ఇచ్చిన బంపర్ అఫరనుకో. తెల్లారిలేస్తే ఎన్ని వింటున్నాం, ఎన్ని చూస్తున్నాం? జరిగింది పీడకలలా మర్చిపో. చదువుకున్నావు. ఉద్యోగం సంపాదించుకుని బతుకు. ఐదేళ్ళ గేప్ తర్వాతే నాకు మళ్ళీ జాబొచ్చింది. నీకు రాకేమి? నీ రెజ్యుమె నాకు మెయిల్ చెయ్యి. ఎక్కడేనా పొజిషన్సుంటే పుష్ చేస్తాను” అంది.
గీత యింకా వెళ్లలేదు.
“ఎంతమంది పెళ్ళిళ్ళు చేసుకోవట్లేదు? దీనికే యిలా జరిగిందేమిటి?” అని మథనపడింది లక్ష్మి.
ఒకొక్కరూ వస్తుంటే కూతుర్నింక అదే దృష్టితో చూస్తారని భయంవేస్తోంది లీలకి. రాత్రికి రాత్రి యిల్లు ఖాళీచేసి వెళ్ళిపోయారు. ఎక్కడికెళ్ళారో తెలుసుకోవడం పెద్దసమస్య కాదు ఎవరికీ. వాళ్లలా వెళ్ళిపోయారంటే ప్రైవసీ కోరుకుంటున్నారని గ్రహించి తెలుసుకోవడానికి ఎవరూ ఎలాంటి ప్రయత్నం చెయ్యలేదు. అందులోనూ లీల మనస్తత్వం అందరికీ తెలుసు.
“అత్తా! గవర్నమెంటవనీ, ప్రైవేటుకంపెనీ అవనీ, ఒకమనిషికి వుద్యోగం యివ్వాలంటే అతనిమీద పోలీసుకేసుల్లేవనీ, అతని సర్టిఫికెట్లు నిజమైనవనీ నిర్ధారించుకునిగానీ యివ్వదు. బేంకులో అకౌంటు తెరవాలంటే ఎన్నో ఆధారాలడుగుతారు. తులసి చెప్పింది, ఢిల్లీలో యిల్లు అద్దెకివ్వాలన్నా, పనిమనిషిని పెట్టుకోవాలన్నా పోలీసువెరిఫికేషన్ చేయించుకుంటారట. ఆడపిల్లని తెలిసినచోట యిచ్చుకోవాలి. మా అందరి పెళ్ళిళ్ళూ అలానే జరిగాయి. దూరపుసంబంధాలు చేసుకునేటప్పుడు ఏమీ చూసుకోకుండా ముక్కూమొహంతెలీని మనిషికి నేరుగా మన పిల్లమీదా, పరోక్షంగా మన ఆస్తిపాస్తులమీదా చట్టపరమైన హక్కులన్నీ ఎలా, ఏ ధైర్యంతో యిచ్చేసారు? అతను డాక్టర్నన్నాడు. సుధీర్నీ, సుమంత్‍నీ మనం చదువుతుండగా చూసాం. మరితన్ని సర్టిఫికెట్టేనా చూపించమని అడిగారా? ఏం చూసి చేసారని, ఇలా జరిగిందని బాధపడుతున్నారు? గాల్లో దీపం పెట్టారు, అది వుఫ్‍మని కొండెక్కింది” అంది ఆగ్రహంగా. కడుపులోంచీ ఆవేదన ఎగజిమ్ముకొచ్చింది.
“పెళ్ళిపేరుతో దాన్ని తీసుకెళ్ళి తాయిలాన్ని పంచినట్టు పంచాడు. ఎలా భరించింది అదంత హింసని? డాక్టరెవరిదగ్గిరకేనా తీసుకెళ్ళారా? ప్రెగ్నెన్సీ వస్తే తీయించండి. ఎవరం చిన్నపిల్లలం కాదు. అన్నీ తెలిసినవాళ్లం. వెళ్లడం చూసి రావడం కాదు. ఇవన్నీ మాట్లాడారా? ఏదీ మాట్లాడకపోతే దాని మనసులో వున్న బాధ ఎలా బైటికొస్తుంది?” అంటుంటే లక్ష్మి నివ్వెరపాటుతో చూసింది. తామంతా వెళ్ళింది నిజమే. ఎవరూ ఇవన్నీ ఇంత బాహాటంగా అడగలేదు, అనలేదు. మొహమాటపడుతూ మాట్లాడి వచ్చారు.
“నాకింకా దాంతో మాట్లాడే ధైర్యం రాలేదు. ఆడపిల్లవి, జాగ్రత్త అనే మాటలు వింటూనే మేమంతా పెరిగాం. సుమతికి చెప్పారు, మహీరవళీవాళ్ళకి చెప్పారు, నాకూ చెప్పారు.
మగపిల్లాడివి జాగ్రత్త- అని మీకెవరేనా చెప్పేవారా బావా?” అని వాసుని అడిగింది గీత.
“లేదు గీతా! దొంగతనాలూ, హత్యలతోసహా అన్ని నేరాలూ సమంగా ఆడామగా చేయగలరు. మనిషి భావోద్వేగాలతో ఆడుకుని, జీవితాలని చిందరవందర చేసే ఈ ఒక్క క్రైమ్‍మాత్రం మగవాళ్ళే ఆడవారిమీద చెయ్యగలరు. మామీద ఎవరూ చెయ్యలేరుగాబట్టి చెప్పరు” అన్నాడతను.
లక్ష్మి వాళ్ళమధ్యనుంచీ లేచి వెళ్లిపోయింది. ఇదివరకూ లేనిది వాళ్ళిద్దరిమధ్యా పరాయిగా అనిపిస్తోంది యీమధ్య తనకి తనే. ఇంట్లో తన ప్రాధాన్యత తగ్గిపోయింది. ఒకప్పుడు యిదే యింట్లో వాసూ, మాధవ్‍లని వెంటపెట్టుకుని తిరిగేది తను. దు:ఖసముద్రంలో మునకలేసింది. ఇప్పుడు మయూ విహీలని పెట్టుకుని తిరుగుతోంది గీత. సంతోషపు కెరటంలా తుళ్ళిపడుతోంది. అధికారాలూ, నిర్ణయాలూ దానివే. గీత చెప్తుంది, వాసు వింటాడు. చెట్టంతమనిషీ దాని చూపుడువేలిచుట్టూ ఆడతాడు. ఇద్దరూ యింటికీ ఆస్తులకీ సంబంధించిన వ్యవహారాలు మాట్లాడుకుంటారు. తనకి సంబంధం లేనివి. అదయ్యాక పిల్లలు చదువుకుంటూ వుంటే పెరట్లోకి వెళ్ళి కూర్చుంటారు. ఆమధ్యలోకి తను వెళ్లలేదు.
పిల్లలు పెద్దవాళ్ళయారు. దేనికీ తనమీద ఆధారపడి లేరు. తల్లి పనుల్లో సగం మయూ చేసేస్తాడు. తమ్ముడిని, తోటిపిల్లలని చూసుకోవడం, ఆఫీసునించీ రాగానే గీతకీ, వాసుకీ టీ చేసి యివ్వడం నేర్చుకున్నాడు. బియ్యం కడిగి రైస్‍కుక్కర్లో పెట్టి ఆన్ చేయడం వచ్చింది. గీత అన్నీ నేర్పిస్తుంది. అదొక పనో, బాధ్యతో అన్నట్టు కాకుండా చిన్నిసరదాలా నేర్పిస్తుంది. తను దగ్గిరుండి చేయిస్తుంది. అన్నీ వాళ్ళే చేసుకుంటే తనేం చెయ్యాలో అర్థమవ్వదు లక్ష్మికి. తల్లీపిల్లలు తనతో గడిపే టైము తగ్గింది. వంటరితనం తెలుస్తోంది ఆవిడకి.
వీణ సంఘటన మరుగునపడకముందే దు:ఖోద్వేగాలన్నీ వసంత్ యింటికి ప్రయాణం చేసాయి. ఏ యింటి కథలు ఆయింటికే వున్నాయి. సంతోషం, దు:ఖం, బాధ, కోపం చూపించాల్సిన సంఘటనలు రంగస్థలంమీద నాటకం అంకాలు మారినట్టు మారుతున్నాయి. అతనికి ఇద్దరు ఆడపిల్లలు. రెండోసారి కూతురుపుట్టినప్పుడు పద్మ, రాజశేఖరం చెయ్యగలిగినంత గొడవచేస్తే, మరోసారి చూద్దామని బర్త్‌కంట్రోల్ ఆఫరేషన్ చేయించుకోకుండా ఆగారు. కచ్చితమైన నిర్ణయం తీసుకోకముందే జరిగిన చిన్నపొరపాటుతో మానస మళ్ళీ ప్రెగ్నెంటైంది.
“జాగ్రత్తగా వుండద్దా? ఇప్పటికే ఇద్దరు ఆడసంత. ఇంకో పిల్ల పుడితే ఏం పెట్టి పెంచుతారు?” పద్మ కోడలిని తిట్టింది. అది పూర్తిగా కొడుకూకోడళ్లకి సంబంధించిన విషయమనీ, వాళ్ళమధ్యలోకి రాకూడదన్న కనీసపు యింగితం ఆవిడకి లేకపోయింది. స్కానింగ్‍లో కవలలని తెలిసినా, వున్న గొడవలకితోడు కొత్తగా మాటలనిపించుకోవడం దేనికని ఎవరికీ చెప్పలేదు భార్యాభర్తలు. ఈ తిట్లూ మాటలనుకోవడాలమధ్య తొమ్మిదినెలలూ నిండి డెలివరీ ఐపోయింది. ఇద్దరు ఆడపిల్లలు. మొదటి రెండుసార్లలాగ టెన్షనేమీ పడలేదు వసంత్. అత్తమామలు, మాధురి వచ్చి వున్నారు. ఆ టైముకి హాస్పిటల్‍కి తీసుకెళ్ళారు. మళ్ళీ తనింటికే తీసుకొచ్చాడు. అత్తమామలు తనకింక జీవితాంతం మనశ్శాంతి వుండనివ్వరనుకుంది మానస. అదే జరిగింది. పిల్లలుమాత్రం అందమైన బొమ్మల్లా వున్నారు.
“ఇదేం పేకేజే తల్లీ? మొదట విడివిడిగా యిద్దరు, ఇప్పుడు కలిపి యిద్దరు?” అన్నాడు వసంత్ నవ్వుతూ. అందర్లోకీ ముందుగా తేరుకుని. డెలివరీ తర్వాత అలిసిపోయి వున్న భార్యతో.
“ఇలా జరుగుతుందనుకోలేదు. కవలలంటే ఒక మగా, ఒక ఆడా వుంటారట చాలామందికి. ఇప్పుడేం చేద్దాం?” బెంగగా అడిగిందామె.
“ఏం చేస్తాం? మేమిద్దరం, మాకు చెరొక్క యిద్దరూ అని చెప్పుకుంటూ బతికేద్దాం” అన్నాడు.
“మీకు కోపం రాలేదా?” దిగులుగా అడిగింది. అతనికి జాలేసింది.
“కోపం దేనికి మానసా? నువ్వేం చేస్తావు? అసలు ప్లానే చెయ్యకుండా పుట్టేసారు. నెక్స్ట్ ఎలాగో ఆలోచిద్దాం. తిండి పెట్టగలం. చదివించగలం. అక్కడిదాకా వచ్చాక అప్పుడుకదా, పెళ్ళిళ్ళు? అప్పడికి చూద్దాంలే. ఇప్పుడేం ఆలోచించకు. రెస్టు తీసుకో” అన్నాడు. అతనికీ కొంచెం నిరుత్సాహంగానూ, భయంగానూ వుంది. తనే గట్టిగా వుండకపోతే తల్లి మానసకి యింక కాళ్లకింద నిప్పులే పోస్తుందని బైటపడట్లేదు.
అతను భయపడ్డట్టే పద్మ అతని నవ్వుని చెరిపేసింది. ఇంటికి వెళ్ళీవెళ్లడంతోటే గొడవ మొదలుపెట్టింది. వియ్యపురాలినీ కోడలినీ తిట్టినతిట్టు తిట్టకుండా తిట్టింది. అలసిపోయేదాకా తిట్టింది. ఆవిడ తిట్లతో ఎవ్వరికీ మెదడు పనిచెయ్యలేదు. రాజశేఖరం కొడుకుమీది కోపంతో మాటకూడా మాట్లాడలేదు. కోడలిముఖమైనా చూడలేదు. కొత్తగా పుట్టిన పిల్లల్ని పట్టించుకోలేదు. తనూ భార్యని అలా తిట్టినవాడేకాబట్టి కుటుంబరావు మాట్లాడలేదు. ఇంకా మాట్లాడితే కూతురు తన పరువు తీసిందని కుమిలిపోయాడు.
వీళ్ళిలా గొడవలు పడుతున్నారని బైటికి తెలీదు. అందులోనూ కవలలు కొత్త. ఎవరినీ చూడలేదేమో వీళ్లని చూడాలని ఆతృతపడుతున్నారు. రాణా పిల్లలని ఎవరూ ప్రత్యేకం చూడలేదు. ఫోన్లూ, వేళాకోళాలూ మొదలయ్యాయి.
“వన్ ప్లస్ వన్ సిక్సెలారా, వసంత్? ఇంజనీరింగులో కొత్తఫార్ములా ఏదైనా కనిపెట్టారా?” అడిగాడు సుమంత్ ఫోన్ చేసి.
“ఇటొచ్చావంటే కాళ్ళు విరగ్గొడతారా” అన్నాడు వసంత్.
“ఎలా వున్నార్రా వాళ్ళు? ఐడెంటికలా? ఫ్రాటర్నలా? ఎంత తేడా ఇద్దరికీ? ఒక్కలానే వున్నారా? ఎవరెవరో పోల్చుకోగలుగుతున్నారా మీరు?” అని ప్రశ్నలు గుప్పించాడు యూయస్‍నుంచీ సుధీర్.
చాలారోజులైంది కలుసుకుని అని చెప్పుకుని సమీర, వల్లి, సుమతి, తులసి వచ్చారు. వాళ్ళొస్తున్నారని గీతకూడా బయల్దేరింది.
“మరేం భయపడకురా, ఐదుగురక్కచెల్లెళ్లం వున్నాం. ఇద్దరు బావమరుదులుకూడా వున్నారు. ఇంకో రౌండుకూడా మేనేజి చెయ్యచ్చు” అంది సమీర.
“నారీనారీ నడుమ మురారి, హరికీ హరికీ నడుమ వయ్యారి” రాగం తీసింది వల్లి. “నలుగురు వయ్యారులున్నారుగానీ, అందరు మురారులని ఎలా తెస్తావురా?” అంది వల్లి. ఒకవైపు చెల్లెల్ని అత్తగారు అన్ని మాటలంటుంటే అదేదీ పట్టనట్టు వీళ్ళిలా నవ్వుతూ మాట్లాడుకోవడం మాధురికి ఆశ్చర్యంగా వుంది. చెల్లెలికి వచ్చింది పెద్దకష్టం ఔనో కాదో తేల్చుకోలేకపోతోంది.
“ఒకవైపు నలుగురు ఆడపిల్లల్ని ఎలా పెంచుతారా వీళ్ళూ అని అందరం దిగులుపడుతుంటే మీ హాస్యాలూ పరాచికాలూ ఏంటి వల్లీ?” అంది, వదినగారినని పెద్దరికం చూపిస్తూ.
“అలా అందరికీ గడ్డిపెట్టు మాధురీ! అసలే ఇద్దరాడపిల్లలని గాభరాయెత్తిపోయాం మేం. ఇప్పుడింకో యిద్దరు తయారయ్యారు. తెలివితక్కువవాళ్ళ సంసారాలు ఇలానే వుంటాయి. మీ చెల్లెలికి తెలీదు, పెద్దవాళ్లని అడగదు. అన్నీ స్వంతనిర్ణయాలు. ఇద్దరూ ఆడపిల్లలేనని యింకోసారి చూదామనుకుంటున్నామని చెప్తే ఆలోచించి మేం చెప్పమా? ఐనా ఒకళ్ళు చెప్పే విషయాలా యివి? ఎవరికివాళ్లకి తెలియక్కర్లేదా?” అంది పద్మ. వసంత్ పడకటింటివిషయాలు ఆవిడ బాహాటంగా చర్చిస్తూ వుంటే అక్కడున్నవాళ్లంతా తెల్లబోయారు. అతని ముఖం ఎర్రగా జేవురించింది. లేచి వెళ్ళిపోయాడు. అక్కకూడా అతని తల్లికి వంతపాడుతుంటే మానసకి మనసు మెలితిప్పినట్టైంది.
“ఈరోజుల్లో ఆడేంటి, మగేంటి పిన్నీ? మరీ పాతకాలందానిలా మాట్లాడుతున్నావు. వసంత్ ఎమ్‍టెక్ చదివాడు. వీళ్లని చదివించడా? చదువుకుంటే వుద్యోగాలు రావటం ఎంతసేపు? ఉద్యోగాలు వచ్చాక పెళ్ళిళ్లవడం ఎంతలో” అంది వల్లి.
“కబుర్లకేమే, ఎన్నేనా చెప్పచ్చు. ఇందరికి తిళ్ళూ, బట్టలూ అయ్యాక, అప్పుడు చదువులగురించి ఆలోచిద్దాం. వీళ్ళిద్దర్నీ చదివించడానికి టఠాలు గుణించాం. మీ చదువులుమాత్రం? ఊరికే అయ్యాయా? ” అంది పద్మ.
“ఐతే ఏమంటావమ్మా? వాళ్ళుమాత్రం ఇలా జరుగుతుందని అనుకున్నారా? మగపిల్లలు పుట్టలేదని అప్పుడు తిట్టిందీ నువ్వే. అందుకని మరోసారి చూద్దామనుకుని వుంటారు. ఇలా జరిగింది. కన్నది వాళ్ళు, పెంచుకునేది వాళ్ళు. నువ్వెందుకంత హైరానపడిపోతున్నావు? వసంత్‍దేమైనా చిన్నవుద్యోగమా? చిన్నచదువా? మనకన్నా ఎక్కువ తెలుసు వాడికి” తల్లిని కోప్పడింది సమీర. కూతుర్ని ఏమీ అనలేక కోపాన్ని దిగమింగుకుంది పద్మ.
గీత వచ్చింది.
“ఏంట్రా, ఇక్కడున్నావు ఒక్కడివీను?” ఇంటిముందు కారిడార్లో ఒక్కడే కూర్చుని వున్న వసంత్‍ని చూసి అడుగుతూ, అతని చెయ్యిపట్టుకుని లోపలికి నడిచింది. పలకరింపులయ్యాయి. పిల్లలని ముచ్చటగా చూసింది గీత. ఒక్కరెమ్మకి పూసిన రెండు జాజిమొగ్గల్లానో లిల్లీపువ్వుల్లానో అనిపించారు ఆమె కంటికి.
“డెలివరీ నార్మలేగా? ఎలా వుంది నీకిప్పుడు?” మానసని అడిగింది. “పిల్లలు నీలానే చక్కగా వున్నారు” అంది.
“డల్‍గా వున్నావేంటి వసంత్? ఆడపిల్లలనా? ఏమీ కాదు. అలా భయపెట్టడం అందరికీ అలవాటైపోయింది. అంతే. మగపిల్లలైతేమాత్రం పుట్టగానే వుద్యోగాలు చేసేస్తారా? తిండి పెట్టి, చదివిస్తేనేగా వాళ్ళకీ సంపాదనలు వచ్చేది? ఇప్పుడు ఆడపిల్లలు జాబ్ చెయ్యడం సాధారణమైపోయింది. చక్కగా చదివిస్తే వీళ్ళూ అంతే” అంది.
“కడుపునిండిన మాటలు ఎన్నేనా చెప్పచ్చులేవే! నీకేమో ఇద్దరూ మగపిల్లలు. ఇంకో నాలుగేళ్ళో ఐదేళ్ళో కళ్ళుమూసుకుంటే చేతికి అందొస్తారు. ఆపైన వూరంతా నొల్లుకొచ్చి నీవొళ్ళో పోస్తాడు వాసు. స్వపరాలు చూడకుండా లంకంత యిల్లు స్వంతం చేసుకున్నారు. ఎక్కడెక్కడి స్థలాలూ మీవే, పొలాలూ మీవే” అంది పద్మ అక్కసుగా. ఎప్పటెప్పటి కోపాలో అందులో వ్యక్తమయ్యాయి. ఆ అభియోగాలకి ఒక్కక్షణం అందరూ నివ్వెరబోయారు. గీత ఇంకాస్త ఎక్కువగా. కానీ ముందు ఆమే తేరుకుంది.
“అన్నన్ని స్థలాలూ పొలాలూ మాకేం వున్నాయి? మాయిల్లే మేం డబ్బులు పెట్టి కొనుక్కున్నాం. ఎవరిది నొల్లుకున్నాం? ఎవరికి నష్టం చేసాం? ” అడిగింది విసురుగా.
“ఉన్నమాటంటే అలానే వుంటుంది. నాలుగుడబ్బులు చేతిలోపడేసి మాధవ్‍ని వెళ్లగొట్టలేదా? వాడు తలనిండా అప్పుల్లో మునిగి తేలుతున్నాడు. అప్పట్లో శేఖర్ విషయంలో మీ నాన్న వుపయోగించిన తెలివే ఇప్పుడు వీడి విషయంలో వాడారు” అంది పద్మ.
“నాలుగుడబ్బులేం కాదు. మాధవ్ వాడివాటా వాడు తీసుకున్నాడు. దర్జాగా యింటిమీద పెట్టుకున్నాడు. సింపుల్‍గా కట్టుకొమ్మని ఎవరు చెప్పినా వినకుండా అన్ని అప్పులెవరు చెయ్యమన్నారు?” అంది తులసి. మాధురి ఆమాటలకి ముఖం మాడ్చుకుంది.
“శేఖర్‍మామయ్యకేమైంది? అప్పటి ధరలప్రకారం సరిగ్గానే లెక్కగట్టి యిచ్చారటకదా? ఆయనా యింటిమీద పెట్టుకున్నాడు. ఏం గొడవలు తవ్విపోసుకుంటున్నారు పిన్నీ? మన యిల్లో స్థలమో కొనుక్కున్న మనిషి కళ్లెదురుగా కనిపిస్తుంటే ఇంకా యివ్వు, యింకా యివ్వని దెబ్బలాడుతూ వుంటారా? మీరు అడిగినంతమాత్రాన ఐపోయిన లావాదేవీకి మళ్ళీ యిస్తారా?” అంది సుమతి.
“పోవే, నీకో రెండెకరాలు రాసిచ్చేసరికి కరిగిపోతున్నావు” అంది పద్మ తులసితో.
“కాక? అన్నయ్యల్తో సమానంగా యిచ్చారు నాకు. మీరంతా మీ కూతుళ్ళకి ఎంతెంత యిస్తారో నేనూ చూస్తాను” అంది తులసి.
“వాళ్ళింటి గొడవా, వాళ్ళ ఆస్తుల గొడవా దేనికమ్మా? మనకేమైనా సంబంధం వుందా? పాలుపంపులవాళ్ళం కాదు. గీత పిల్లల్ని చూడ్డానికొచ్చిందిగానీ, ఆస్తితగాదాలకి కాదుగా? నీకందులో కలిసొచ్చేది ఏమైనా వుందా? ఏ అవసరానికీ మేం మొహమొహాలు చూసుకోకుండా చేస్తున్నావు” అన్నాడు వసంత్ విసుగ్గా.
“వాసు లేకుండా నేనిలా రావడం తప్పులే, వసంత్! మొహమొహాలు చూడననంత పట్టింపులు మాకేం లేవు. వచ్చాను, పిల్లల్ని చూసాను, తల్లీ పిల్లలూ జాగ్రత్త. పాతబియ్యం, నెయ్యీ వున్నాయి. ఎవర్నేనా పంపిస్తే ఇస్తాను” అని లేచింది గీత. ఉండమని ఎవరెంత చెప్పినా వినకుండా వెళ్ళిపోయింది.
“పిల్లకి వులుకెక్కువౌతోంది. గేదెలవ్యాపారం వీళ్ళదే, గాడిదల వ్యాపారం వీళ్ళదే” అంది పద్మ. ఒక్కసారి వాతావరణం తేలికైపోయింది. అంతా నవ్వేసారు.
“గాడిదల వ్యాపారం ఇంకా లేదులే పిన్నీ! దేనికేనా వుపయోగపడతాయంటే చెప్పు, రెండు కొని నీకే యిస్తాడు చూడమని” అంది తులసి.
“గేదెలేమిటే?” అడిగింది సుమతి.
“ఏమీ లేదే, పొలం వుందికదాని నాలుగు గేదెలు కొని పెట్టుకున్నారు. అవిప్పుడు పదయ్యాయి” అంది తులసి.
“వాడు తలుపుచెక్కనికూడా పిలిచి నాలుగు డబ్బులు సంపాదించుకు రమ్మని పురమాయిస్తాడంటే యిదా?!!” ఆశ్చర్యంగా అంది సుమతి.
“చిన్నప్పట్నుంచీ వాడి స్వభావం అంతేనే. ఎవరికీ రాని ఆలోచనలు వాడికొచ్చేవి. మొదటిసారి పొలం కొన్నాక పల్లెటూళ్ళు ఎక్స్‌ప్లోర్ చెయ్యడం మొదలుపెట్టారు” అంది తులసి.
“మాకెవరికీ తెలీదు” అంది వల్లి.
“నాక్కూడా కొన్ని చెప్తారు, కొన్ని చెప్పరు వల్లీ! తోచింది చేస్తుంటారు. ఇద్దరికీ గవర్నమెంటు జాబ్స్. వ్యాపారం చెయ్యకూడదు. వ్యవసాయానికి అలాంటిదేం లేదు. అందుకని ఈ ఆటలన్నీ ఆడతారు. పిల్లలాటల్లాగే వుంటాయి కొన్నైతే. రాతికి దారంకట్టి, నూతిలో వేసి, బైటికి లాగేవాళ్ళం చూడు చిన్నప్పుడు, అలా చేస్తారు. కుతూహలం. అంతేకదా? కాస్తంత పెట్టుబడి పెట్టి తమాషా చూస్తారు” తులసి జవాబిచ్చింది.
“మరా వుద్యోగం దేనికే? వదిలెయ్యచ్చుకదా?” అడిగింది పద్మ.
“నువ్విందాకా ఎద్దేవాగా అన్నావే, అప్పుడింక అదే అంటారు” జవాబిచ్చింది తులసి.
ఇల్లు చేరేసరికి గంటపైన పట్టింది గీతకి. కోపం చల్లారలేదు. ఈమధ్య వీళ్లందర్నీ చూస్తుంటే విసుగూ చిరాకూ వస్తున్నాయామెకి. సుమతీవాళ్ళతో గొడవ ముగిసింది. రాణావాళ్లమ్మ తనని చూస్తేనే ఒంటికాలిమీద లేస్తుంది. వసంత్ యింట్లో ఇలా. వాసుని ఎవరూ ఏమీ అనరు. తనే అందరికీ లోకువ. ఎప్పుడో చిన్నప్పుడు డబ్బు లేకుండా బతికిందని ఇప్పటికీ అలానే వుండాలని వాళ్ల కోరిక కావచ్చు. మరి యీయనగారిలా సంపాదించి పోస్తుంటే, గవర్నమెంటు రెండు జీతాలిస్తుంటే, కొనుక్కునవాటి ధరలు రెక్కలుకట్టుకుని ఎగురుతుంటే డబ్బులేకుండా ఎలా వుంటుంది? సుమతికి కవర్ డిజైన్ చేసిచ్చింది తను. అది చూసి, ఇంకో నలుగురు అడిగారు. కుదిరినవాళ్లకి యిస్తోంది. అలాగా డబ్బులే. వస్తున్నాయని తామేం జల్సా చెయ్యట్లేదు. పిల్లల్ని పెంచుకుని చదువు చెప్పిస్తున్నారు. ఇప్పటికి తేలిగ్గానే ఔతోంది. వీళ్ళంతా పెద్దచదువులకి ఎదిగితే ఎంత కావాలో? వసంత్‍కీ సమీరకీ ఎంతొస్తోందని తామెప్పుడేనా అడిగారా? మాధవ్‍ని అడిగారా? లేదు. తమ లెక్కలన్నీ వీళ్లకెందుకు?
“ఇదో బావా! ఇహమీదట నీ చుట్టాలెవరూ నాకేం కారు. నేనింక మా నాన్న కూతుర్నికాదు, అమ్మ కూతుర్ని. నేను వేరు, మీరంతా వేరు” అంది యింటికెళ్లగానే వాసుతో. వసంత్ కూతుళ్లని చూడటానికి వల్లీవాళ్లంతా వస్తున్నారని, తనూ ఆఫీసునించీ వెళ్తానని చెప్పింది గీత. అట్నుంచీ తులసిని వెంటబెట్టుకుని వస్తానంది. అంతవరకూ తెలుసు అతనికి. తులసిని వెంటతీసుకురావటం అటుంచి కోపంగా తిరిగొచ్చింది. అక్కడేదో జరిగిందని అర్థమైంది.
“ఎవరేనా ఏదేనా అన్నారా? అక్కడ జవాబిచ్చి రావాలిగానీ, ఇంటికొచ్చి ఎగిరితే ఎలానే?” అడిగాడు. ఇంతలో వసంత్ ఫోనొచ్చింది.
“గీత యింటికొచ్చిందా? అమ్మతో ఇక్కడేదో చిన్న గొడవలే. కోపంగా వచ్చేసింది” అన్నాడు.
“వచ్చింది” క్లుప్తంగా చెప్పి పెట్టేసాడు వాసు.
“పిన్నింక మారదామ్మా?” అడిగాడు.
“ఇంకేం మారుతుంది?” అంది లక్ష్మి.
“అందరూ కలిసి సుమతి యింటికి వెళ్ళారు. తులసిని నేను తీసుకొచ్చి దింపుతాను. నువ్వు కంగారుపడకు” అని కాసేపటికి సుమ్ంత్ ఫోన్‍చేసి చెప్పాడు. అన్నట్టే రాత్రి తొమ్మిదౌతుంటే ఇద్దరూ వచ్చారు. సుమంత్ హాల్లో కూర్చుని వాసుతో మాట్లాడుతుంటే తులసి లోపలికి వచ్చింది.
“నలుగురూ ఆడపిల్లలని వసంత్‍ని బాగా తిడుతోందిరా పిన్ని. వాడేం చేస్తాడ్రా? మగపిల్లలైతే పరిస్థితి మారిపోతుందా? ఎవరేనా యిప్పటికిప్పుడు వాళ్ళ తిండి వాళ్ళు సంపాదించుకుని తినెయ్యరు. ఇరవయ్యేళ్ళో పాతికేళ్ళో మనం పెంచి పెద్దచెయ్యాల్సిందే. ఎవరం సర్దిచెప్పబోయినా వాళ్ళతో గొడవపడుతోంది. ఏరా, మనమ్మావాళ్ళూ తొమ్మిదిమంది. పెరగలేదూ? నలుగురు పిల్లలు పుట్టగానే ప్రపంచం తలకిందులైపోతుందా? ఫామిలీ ప్లానింగూ, పిల్లలలెక్కలూ మనిళ్ళలోగానీ, మిగతా ప్రపంచం ఏం మారింది? ఒకగొడవైతే తట్టుకుంటాడు.
ఆయనకి రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకి దిగాలని బాగా వుంది. ఇల్లు అమ్మేసేనా పెట్టుబడిపెట్టి దిగాలనుకుంటున్నాడు. ఇల్లుకూడా మిగల్చకపోతే ఎలా అని వాడి టెన్షను. ఆయనకో ముగ్గురు నలుగురు స్నేహితులు. వాళ్ళు బాగా ఎగేస్తున్నారు. బాబాయ్ మంచివాడే. కానీ చేసే పని లోతుపాతులు తెలీనిమనిషి.
మీయిల్లు జారిపోయాక ఆయన ఆ విషయం వదిలేస్తాడనుకున్నాం. కానీ వేరే దారులు వెతుకుతున్నాడు. వీడి జీతంలో చాలావరకూ ఆయనే తీసుకుంటాడట. లోన్లవీ పెట్టిస్తాడట. ఆయనేనా దాచేదేకదా అని వీడు అడిగినంతా యిస్తూ పోతున్నాడట. ఇప్పుడీ కొత్తసమస్య మొదలైంది. వందగజాలో రెండొందల గజాలో స్థలం కొంటే మనది మనకే వుంటుంది, ఫ్రెండ్సుతో కలిసి ఈ వయసులో చేసే వ్యాపారంలో ఎన్ని లొసుగులుంటాయోనని భయపడుతున్నాడు. అదేంట్రా, ఆయన? మనతో క్రికెట్టూ అవీ ఆడి సరదాగా తిరిగిన మనిషేనా? పిన్నికూడా. ఆ తిట్లూ దెబ్బలాటలూ చూస్తుంటే భయమేస్తోంది. వాడి పర్సనల్ విషయాలన్నీ బాహాటంగా మాట్లాడేస్తోంది. సమీరతప్ప ఆ యింట్లో వాడి భార్యని పట్టించుకునేవాళ్ళే లేరు. మూడోసారైనా ఎంత జాగ్రత్త తీసుకోవాలి? ఏదేనా తేడా జరిగిందంటే నలుగురుపిల్లలూ దిక్కులేకుండాపోతారు. స్వంతచెల్లెల్ని వదిలేసి ప్రహీ భార్య పిన్నిని కాకాపడుతూ తిరుగుతుందేమిటి? వాళ్లమ్మకి అసలు నోరులేదు. వాళ్ళ నాన్నని చూడనే చూసాం. కోడిమెదడు మనిషి. మీ కర్మమీదని వీళ్ళు వదిలేసిపోయినా ఏదో ఒకలా నడుపుకుంటాడు వసంత్” అన్నాడు సుమంత్. రాత్రి పదకొండౌతుంటే వెళ్ళాడు.
“ఏమిట్ట, మీ తమ్ముడు అంతసేపు మాట్లాడాడు?” అడిగింది గీత.
“ఈవిడ ఇప్పుడు వాళ్ళమ్మ కూతురంటే తులసీ! మామయ్యకూతురని చేసుకున్నాను. ఇప్పుడేం చేద్దాం? అందరూ నా చుట్టాలేనట, నా చుట్టాలెవరూ తనకేమీ కారని తేల్చి చెప్పేసింది” అన్నాడు వాసు.
“అదే కరెక్టు. అలానే వుండొదినా! అందర్నీ నెత్తికెత్తుకుని తిరక్కు. ముఖ్యంగా ఆ పద్మావతిగారిని” అందామె.
గీత పరోక్షంలో అతనితోకూడా అదే చెప్పింది.
“కొన్నాళ్ళు అందరినీ దూరం పెట్టండన్నయ్యా! చాలా అసూయపడుతున్నారు. మీకెంతుందని లెక్కలు పెడుతున్నారు. ఇందులో లేనివాళ్ళెవరూ లేరు. వదిన కనిపించగానే లెక్కలన్నీ గుర్తొస్తున్నాయి. ప్రపంచంలో జరిగే అన్ని తప్పులకీ ఆవిడే కారణం అనుకుంటున్నారు” అంది తులసి.
వాసుకీ గీతకీ అలా అందర్నీ దూరంగా వుంచే అవకాశం రాలేదు. ఎక్కడ ఏది జరిగినా వీళ్ళింటికి దాని ప్రభావం నడుస్తూనో పాకుతూనో వచ్చేస్తోంది.
వసంత్ తండ్రి చనిపోవడం పెద్దకుదుపు.
యాక్సిడెంట్లో చనిపోయాడు. రోడ్డు ఖాళీగా వుందని బైక్ వేగం పెంచి వెళ్తుంటే కుక్క అడ్డొచ్చింది. దాన్ని తప్పించబోయి పడి, డివైడర్‍కి కొట్టుకున్నాడట చూసినవాళ్ళు చెప్పారు. అక్కడికక్కడే చనిపోయాడు. అప్పటికి వసంత్ కవలపిల్లలు పుట్టి ఇంకా పదిహేనురోజులవలేదు.
పోస్ట్‌మార్టమ్ చేసాక డెడ్‍బోడీని ఇంటికి తీసుకురావద్దని చెప్పారు, ఇంట్లో అద్దెకున్నవాళ్ళు. రాజశేఖరం ఇల్లు తమకి అమ్మేసాడనీ, రిజిస్ట్రేషన్‍కూడా ఐపోయిందనీ చెప్పారు. వీళ్ళు ఇంకో నెలలో ఖాళీచెయ్యాలి. మ్రాన్పడిపోయాడు. చేతిలో పైస లేదు, ఇల్లుకూడా లేదు. జరుగుతున్నది కలో నిజమో అర్థమవ్వని పరిస్థితి. రామారావు ఆయనింటికి తీసుకురమ్మన్నాడు. వద్దని, తనింటికే తీసుకెళ్ళాడు వసంత్. అందరూ తలోచెయ్యీ వేసి, మొదటిమూడురోజులూ అయిందనిపించారు.
పుట్టలోని పాముల్లా ఒకొక్క నిజం బైటికి వస్తోంది. బేంకులో ఒక్కపైస లేకుండా ఫిక్స్‌డ్ డిపాజిట్లతోసహా అన్నీ తీసేసాడు. ఇల్లమ్మాల్సిన అవసరం ఏమొచ్చింది? అంత డబ్బూ ఏమైంది? చెట్టంత మనిషిపోయాడన్న దిగులు పక్కని పెట్టి యిల్లంతా గాలించారు డబ్బుగురించి ఏదేనా ఆధారం దొరుకుతుందని. బట్టలబీరువాలో గోడకి పెట్టుకున్న సీక్రెట్ లాకరుకూడా చూసారు.
వసంత్ కలలోమనిషిలా దిమ్మెరపోయి వున్నాడు. మాధవ్, నీలిమ వచ్చారు.
కొత్తగా పుట్టిన యిద్దరు పిల్లలనీ ఈ దురదృష్టానికి కారకుల్ని చేసి తిడుతోంది పద్మ. ప్రాణావశిష్టంగా వుంది మానస. వీళ్ళుకాక ఎవరూ పట్టించుకోక బిక్కచచ్చిపోయి తిరుగుతున్న పెద్దపిల్లలు. పిల్లలని దగ్గిరకి తీసుకుని ఏడ్చింది నీలిమ. చెల్లెలిని చూస్తుంటే కడుపు తరుక్కుపోయింది.
“వసంత్! మానసనీ పిల్లలనీ నాతో తీసుకెళ్తాను. మీ వ్యవహారాలు దార్లోపడ్డాక వచ్చి తీసుకెళ్లు. కష్టాలొస్తాయి, నెపాన్ని యింకొకరిమీదికి నెట్టేసినంతమాత్రాన అవి కారణాలవ్వవు. ఎవరికీ తెలీనంత రహస్యంగా మీ నాన్న ఏ రాచకార్యం వెలగబెట్టాడో, ఈ తెలివితక్కువ పెద్దమ్మ అంత పట్టించుకోకుండా ఎలా వుందో తెలుసుకో ముందు. ఇంటి వ్యవహారాలు చక్కబెట్టుకోవడం రాని మనిషికి వూరి వ్యవహారాలెందుకో అడుగు” అని పెద్దకర్మయ్యాక తల్లీపిల్లలని స్వతంత్రంగా తనింటికి తీసుకొచ్చింది లక్ష్మి. గీతా వాసుల అభిప్రాయం అడగలేదు. ఇంట్లో తన ప్రాధాన్యం తగ్గిపోయిందని కొద్దిరోజులకిందట అనుకున్న విషయం మర్చిపోయింది.
“గీతూ! కొన్నాళ్ళు ఓర్చుకోవే! నాకోసం, వసంత్‍కోసం. మా అమ్మానాన్నలు మిమ్మల్నెన్ని మాటలన్నారో నాకు తెలుసు. ఐనా మీరు తప్ప ఇంకో దిక్కులేకపోవడం వుంది చూడు, అది ఐరనీ. ప్రమీల ఆమ్మ రమ్మంది. కానీ లత పైపిల్ల. నీదగ్గిరున్నట్టు మాకు స్వతంత్రం వుండదు” అంది సమీర పెద్దరికం మీదేసుకుని.
“అలా ఆలోచించకు సమీరా! కష్టం, సుఖం తెలీకుండా మాటపంతాలే పట్టుకుని కూర్చునేంత చెడ్డవాళ్ళం కాదు. వాళ్లైదుగురినీ పువ్వుల్లో పెట్టి అప్పజెప్పినట్టు అప్పజెప్తాం. ముందసలు మీడబ్బేమైందో చూసుకోండి” అంది గీత.
కమలాక్షి కూతురితో వచ్చింది. కుటుంబరావు నీలిమ యింటికి వెళ్ళాడు. మానస తనతో రావద్దని ఆయనకి కచ్చితంగా చెప్పేసింది.
“నేనే వాళ్ల దయాధర్మంమీద వెళ్తున్నాను. అమ్మ సాయం లేకపోతే నడవదుకాబట్టి ఆవిడ్ని తీసుకెళ్తున్నాను. నువ్వు అక్క యింట్లో వుండి ఎలాగో సర్దుకో” అంది. ఆయనకి చాలా కోపం వచ్చింది.
“అమ్మ లేకపోతే నాకెలా నడుస్తుందే? ఈ వయసులో మేమిద్దరం చెరోచోటా వుండటమేమిటి?” అన్నాడు.
“ఐతే మీదగ్గిరకే వస్తాను. ఆ రెండుగదుల్లోనే సర్దుకుందాం. నా దగ్గిర చిల్లిగవ్వ లేదిప్పుడు. ఈ పరిస్థితుల్లో వసంత్‍ని అడగలేను. ముందు నువ్వు డబ్బుకి ఏర్పాట్లు చేసుకో” అందామె. భార్య కోప్పడిందాయన్ని.
“నాలుగురోజులు ఇంత వుడకేసుకుని తినలేరా? పిల్లలకన్నా ఎక్కువా, మన సౌఖ్యాలు? చేతిలో డబ్బు లేకుండా ఎందుకీ హెచ్చులు?”అని దులిపాక అప్పుడు విన్నాడు.
“మానసా! ఇది నీ స్వంతింటిలాగే అనుకో. వసంత్ నా చెల్లెలి కొడుకు. మీ అక్కచెల్లెళ్ళు ముగ్గురూ ఎలానో, మా ఆరుగురం అలాగ. మహతిని అందరూ కలిసి నిలబెట్టారుచూడు, అలానే మీ వ్యవహారంకూడా ఒక కొలిక్కి తెస్తారు. నీ పిల్లలని దృష్టిలో వుంచుకుని ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో. ఏంకావాలో మొహమాటపడకుండా మీ అమ్మకి చెప్పి చేయించుకో. వదినా! ఏది కావాలన్నా మొహమాటపడకుండా నాకో గీతకో చెప్పండి” అంది లక్ష్మి.
“ఇదేమిటే, దిక్కూమొక్కూ లేనట్టు వీళ్ళింట్లో వుండటం? బావుండదేమోనే. అమ్మావాళ్ల దగ్గిరకి వెళ్ళు. మనకున్నదేదో తింటాం. ఒక పోర్షను ఖాళీ చేయించనా?” అంది నీలిమ చెల్లెలితో. సిగ్గుగానూ, ఇబ్బందిగానూ అనిపించింది. అత్తగారు ఆవిడ యిల్లని తీసుకెళ్ళినా, చూడాల్సిందీ చెయ్యాల్సిందీ గీతా వాసులే.
“వద్దక్కా! నాకిక్కడే బావుంది. వసంత్ నన్నిక్కడికే వెళ్లమన్నాడు” అంది మానస. తనకేదైనా ఔతే పిల్లలేమౌతారన్న ఒక్కమాట ఆమెని వణికిస్తోంది.
“పోర్షనంటే ఖాళీచేయిస్తావుగానీ, బాలింతరాలినీ, నలుగురు పిల్లలనీ చూసేంత స్తోమత మాకెక్కడిది నీలిమా? అతను యిక్కడికి పంపించాడు. వాళ్ళూవాళ్ళూ చూసుకుంటారు. అంతగా ఐతే ఎంతోకొంత వాళ్లకి యివ్వండి. ఇక్కడే అద్దెకి వున్నామనుకోండి” అంది కమలాక్షి. నీలిమా, మాధురీ ఇక్కడికే వచ్చేసారు. నీలిమకి ఇది అత్తవారిల్లు. మాధురి ఎందుకొచ్చిందో ఆమెకే తెలీదు. ప్రహ్లాద్ మాట వినదు. ఒకసారి చెయ్యెత్తాడతను. రెండోసారి చెయ్యి చేసుకున్నాడు. పెద్ద గొడవైంది. అరుణ కొడుకునే కోప్పడింది. కొత్తగా వచ్చిన డీవీ చట్టం అందర్లోనూ బాగా భయాన్ని రేపుతోంది. కుటుంబసంబంధాల్లో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది.
“గీతూ! మొత్తం కుటుంబాన్ని తీసుకొచ్చి దగ్గిరపెట్టుకున్నారు. చేయించుకుంటున్నప్పుడు అన్నీ బాగానే అనిపిస్తాయి. అవసరం తీరిపోయాక కోడిగుడ్డుకి ఈకలు పీకే కార్యక్రమం మొదలౌతుంది. మీయింట్లో జరిగినవి నువ్వు నోరుతెరిచి చెప్పకపోయినా మాకు కొన్ని తెలిసాయి. ఈ ముగ్గురుఅక్కచెల్లెళ్లతో జాగ్రత్తగా వుండు. మీ పద్మత్తమాత్రం? ఆవిడ కొడుకు వసంత్. నిండా కష్టాల్లో వున్నాడు. అతని నాలికకూడా ఎటేనా జారచ్చు. మాయింటికేనా పంపించి వుంటే బావుండేది. లక్ష్మి ఇక్కడికి వెంటబెట్టుకుని వచ్చింది” కూతుర్ని హెచ్చరించింది యశోద.
“అక్కడేనా నేనేకదమ్మా, చూసుకోవాలి? అత్త తీసుకొచ్చాక మరోమాటంటే బావుండదు. బాధపడుతుంది. హద్దుల్లోనే వుంటాంలే” అంది గీత.
మూడునెలలు వీళ్ళింట్లో వుంది మానస. రాజశేఖరం డబ్బేం చేసాడో ఎవరికీ అంతుచిక్కలేదు. ఆయన ఆఫీసులోవాళ్లనీ, స్నేహితులనీ, పరిచయస్తులనీ అందరినీ అడిగారు. బేంకు లావాదేవీలన్నీ చూస్తే ఎక్కడా డబ్బు ట్రాన్స్ఫర్ చేసినట్టు లేదు. స్థలాలవీ వెతుకుతూ తిరిగాడని అనేకమంది చెప్పారు. ఎక్కడేనా ఎవరికేనా అడ్వాన్స్ ఇచ్చాడా అనేది ఎవరూ చెప్పలేకపోయారు.
తెలిసిన వ్యక్తి ఒకే ఒక్కడు.
ఐదొందలగజాల స్థలం అందుబాటుధరలో అమ్మకానికి వుందని తలిసింది రాజశేఖరానికి. ఇంట్లో తెలిస్తే భార్య, కొడుకు తన ప్రయత్నాలకి అడ్డుపడతారని ఒక స్నేహితుడిని నమ్మాడతను. అతనిదగ్గిర అగ్రిమెంటుకాగితం దాచాడు. అదింక బైటికి రాలేదు. ఏం జరిగిందో తెలీక దాదాపు పిచ్చివాడైపోయాడు వసంత్. దానికితోడు పద్మ గొడవ, ఏడుపులు. అర్ధంలేని పిరికి ఆలోచన అతన్ని నిలువునా ఆవహించింది. అర్ధరాత్రి పన్నెండింటికి పూనకం వచ్చినట్టు వాసు యింటికి వచ్చేసాడు. డోర్‍బెల్ నొక్కితే అతనే తలుపుతీసాడు. నేరుగా భార్య వున్న గదిలోకి వెళ్ళిపోయి, కూర్చున్నాడు వసంత్. వాళ్ళు మాట్లాడుకుంటారని యివతలికొచ్చింది కమలాక్షి. అతని వాలకానికి భయంకూడా వేసింది. ఆవిడ కంగారుపడుతుంటే వాసు గీతనీ, తల్లినీ లేపాడు. ఈ హడావిడికి మిగిలినవాళ్ళుకూడా లేచారు.
పెద్దపిల్లలిద్దర్నీ చూసుకున్నాడు వసంత్. చిన్నవాళ్ళిద్దర్నీ ఎత్తుకుని ముద్దులు కురిపించాడు. అతని ప్రవర్తనకి తెల్లబోయి చూస్తోంది మానస. గెడ్డం పెరిగి, బట్టలు మాసిపోయిన అలాంటి అవతారంలో ఎప్పుడూ చూడలేదు.
“స్వంత తల్లిదండ్రులు పిల్లలమీద ఇంత కక్షకడతారని నాకు తెలీదు మానసా! నిన్నే చేసుకుంటానని పంతమేం పట్టలేదు. కట్నం తీసుకోనప్పుడు ఎవరైతేనేం, నువ్వూ ఇక్కడే వుంటే కజిన్సందరం ఒకే కుటుంబంలా వుంటామని, నచ్చజెప్పి చేసుకున్నాను. వప్పుకున్నారు. దగ్గరుండి మన పెళ్ళి చేసారు. కానీ మనసులో ఇంతంత కోపాలు పెట్టుకుంటారనుకోలేదు. నిన్ను నేను చేసుకోకపోయినా ఎక్కడో ఒకచోట సుఖంగా బతికేదానివి. ఇలా తిట్లు తింటూ, దరిద్రం అనుభవిస్తూ వుండేదానివికాదు. ఏం చూసి చేసుకున్నావే నన్ను? ఎంటెక్ చదివాను, పెద్ద వుద్యోగం చేస్తున్నాననేకదా? కానీ నా హోదానీ డబ్బునీ ఎప్పుడేనా అనుభవించావా? లేదుకదా? నీకింక స్వేచ్ఛ దొరుకుతుంది. మానసా! నీ చేతికో పదిలక్షలొస్తే తెలివిగా దాచుకోగలవుకదూ? జాబ్ చెయ్యగలవా? మీ అమ్మానాన్నలని పిలిపించుకో దగ్గిరకి. పిల్లలు పెద్దయేదాకా వాళ్ళ సపోర్టుకావాలి” అన్నాడు.
ఆ మాటలు విన్నాక లోపలికొచ్చింది గీత. అతని వీపుమీద ఒక్కటి చరిచింది.
“ఏం మాట్లాడుతున్నావురా? నువ్వెక్కడికి వెళ్తున్నావు? దానికి ఈ అప్పగింతలేమిటి? సెన్సెస్‍లోకి రా, వసంత్!” అంది.
“వీళ్ళిప్పటిదాకా ఏడ్చి ఇప్పుడే పడుక్కున్నారు. లేచేస్తారేమో! బైట కూర్చుని మాట్లాడుకుందాం” అని చెయ్యిపట్టుకుని తీసుకొచ్చాడు వాసు.

పశ్చిమగోదావరి జిల్లా రెడ్డి పోలవరంలో 16 July, 1962 లో జననం. వరంగల్‌లో వుద్యోగం. హెడ్పోస్ట్‌మాస్టర్గా వరంగల్‌లో స్వచ్చందపదవీ విరమణ.
వివాహం శ్రీ చదలవాడ విష్ణుమూర్తిగారితో. వారు డెప్యూటీ ఏగ్జిక్యూటివ్ ఇంజనీరుగా చేసి రిటైరయారు.
మొదటి కథ అనగనగా 1978లో వనితాజ్యోతి మాసపత్రికలో అచ్చైంది. వీరివి 225కి పైగా కథలు, 9 నవలలు వివిధ పత్రికల్లో ప్రచురించబడ్డాయి. గూడు, సింధూరి, గుండెలోతు అనే కథాసంపుటాలు, నీలినక్షత్రం అనే నవల పుస్తకాలుగా వచ్చాయి. సింధూరి అనే సంపుటానికి శ్రీమతి సుశీలా నారాయణ రెడ్డి అవార్డు 2005 లో వచ్చింది. ప్రేమలోంచీ ప్రేమలోకి అనే నవలకి ఆంధ్రభూమి ప్రథమ, తిరస్కృతులు, నీకోసం నేను అనే నవలలకి ఆంధ్రభూమి ద్వితీయ, 5-3-2 అనే నవలకి కినిగె ద్వితీయ బహుమతులు వచ్చాయి. ఎంతెంతదూరం? అనే కథకి విపుల కన్సొలేషన్ బహుమతి, శ్రీమతి రంగవల్లి ట్రస్ట్ అవార్డు వచ్చాయి. ఇవికాక కథలకు మరో ఏడెనిమిది బహుమతులు వచ్చాయి.
కథలకు కాన్వాస్ పెద్దదిగా వుండాలనేది వీరి అభిప్రాయం.
I was very pleased to uncover this great site. I need to to thank you for ones time for this fantastic read!! I definitely appreciated every bit of it and I have you bookmarked to look at new information on your blog.