ఝరి – 47 by S Sridevi

  1. ఝరి – 46 by S Sridevi
  2. ఝరి – 47 by S Sridevi
  3. ఝరి – 48 by S Sridevi
  4. ఝరి – 49 by S Sridevi
  5. ఝరి – 50 by S Sridevi
  6. ఝరి – 51 by S Sridevi
  7. ఝరి – 52 by S Sridevi
  8. ఝరి – 53 by S Sridevi
  9. ఝరి – 54 by S Sridevi
  10. ఝరి – 55 by S Sridevi
  11. ఝరి – 56 by S Sridevi
  12. ఝరి – 57 by S Sridevi
  13. ఝరి – 58 by S Sridevi
  14. ఝరి – 59 by S Sridevi

జరిగిన కథ-వాసు, గీత భార్యాభర్తలు. గీత ఆత్మహత్యకి ప్రయత్నం చేసి బైటపడుతుంది. తులసికి కేన్సరొచ్చి తగ్గుతుంది. భర్తతో విడిపోవాలనుకుంటుంది. అతనికి విడాకులు ఇష్టం వుండదు. గీతకి ఎవరో ఫోన్‍చేసి బెదిరిస్తారు. ఆ ఫోన్ సుధీర్‍ చేసాడేమోననే అనుమానం వస్తుంది వాసుకి. మహతి భర్తతో విడాకులు తీసుకుంటుంది. మేఘన ఆమె కూతురు. తల్లి దగ్గిరే వుంటుంది. తండ్రికి యాక్సిడెంటైతే చూడటానికి వస్తుంది. మహతితో విడాకులయ్యాక నరేంద్ర మరో పెళ్ళి చేసుకుంటాడు. ఆమెవలన ఇద్దరు పిల్లలు. ఆమె చనిపోతుంది. అతనికి యాక్సిడెంటైతే సాయానికి హాస్పిటల్‍కి వెళ్తుంది మహతి. రాత్రి అతనికి అటెండెంటుగా వుంటుంది. పిల్లలని వాసు తనింటికి తీసుకెళ్తాడు. మహతికి అతనితో తన పెళ్ళైనప్పటి రోజులు గుర్తొస్తుంటాయి. నరేంద్రతో విడిపోయాక ఆమె ముంబైలో వుండిపోతుంది.
గీత గతం. చదువయ్యి, చిన్నవయసులోనే వుద్యోగంలో చేరుతుంది. ఇంట్లో ఆమెకి పెళ్ళి చెయ్యాలనుకుంటారు. తండ్రి అడిగితే సూచనాప్రాయంగా వాసు పేరు చెప్తుంది. ఆమెని తనింటికి తీసుకెళ్ళి సుధీర్ని చేసుకొమ్మని నచ్చజెప్పే ప్రయత్నం చేస్తాడు రవి. గీతావాసులకి చాలామంది కజిన్స్. చిన్నతనంలో వాళ్లంతా ఒకే స్కూల్లో చదువుకుంటారు. రామారావు యశోద ప్రమీల ఇంటికి వెళ్ళి పెళ్ళివిషయం చెప్పి, ఆహ్వానించి వస్తారు. సుధీర్ గీతని ఇష్టపడతాడు. ఆమెని చేసుకోలేకపోతున్నందుకు బాధపడతాడు.
వెంకట్రావు, విశాల అనే భార్యాభర్తలు అప్పులబాధ తట్టుకోలేక వురివేసుకుని చనిపోతారు. వాళ్ళ కూతురు అమృత. అమృత అవంతీ ఎస్టేట్స్‌లో మాధవరావు ప్రాపకంలో వుంటుంది. పోలీసుస్టేషన్‍కి పిలిచి బెదిరిస్తారు అమృతని. విజయ్, శ్యామ్మోహన్ అండగా నిలబడతారు. తనకి అమృత అంటే ఇష్టమని ప్రసూనకి చెప్తాడు. ఆ విషయం చెప్పి రోహిణిని హెచ్చరిస్తుంది ప్రసూన.


“పోవే… నీ మాటలు. నువ్వసలు గీతతో మాట్లాడుతున్నావూ?” అడిగింది మహతి.
“మాట్లాడకపోతేనేం? తను చెప్తేనేకదా, నేను యిక్కడికి వచ్చింది?”
“అసలు మీమధ్య గొడవేంటి సుమతీ? ఎందుకు మాట్లాడుకోరు?” అడిగాడు మాధవ్.
“గొడవ వుంటేనే మాటలు మానేస్తారా? లేకుండా కూడా మానెయ్యచ్చు. ఆదిదంపతులిద్దరూ ఆరేళ్ళు మానేసి చూపించలేదూ? ” అంది. ఆమె మాట దాటేస్తోందని అర్థమైంది మాధవ్‍కి. భార్య ఎదురుగా వద్దని తనూ వూరుకున్నాడు.
“ఎలా భరిస్తున్నాడే, ఇంత తిక్కలమేళాన్ని మీ జోగేశ్వర్రావు?” అడిగాడు నవ్వుతూ.
“నీలమ్మోవ్! ఇప్పుడు నీ కాఫీ టిఫెన్లేవో ఇస్తే తినిపెడతాం” అంది సుమతి.
నీలిమ లేవబోయి మళ్ళీ కూర్చుంది. “ఖర్మ. మీరే పేరుతో పిలిస్తే దానికే పలికేస్తున్నాను. ఇంకాసేపు మీ యిద్దరిమధ్యనా కూర్చుంటే నా పేరు మర్చిపోయేలా వున్నాను. మీ నీలమ్మెవరో ఆమెని పిలుచుకుని యిప్పించుకోండి” అంది.
“పేరు, పేరని ఇందాకట్నుంచీ ఒకటే గొడవ చేస్తున్నావు, నీ సర్టిఫికెట్లు తెచ్చుకోవే! అసలు నీ పేరేంటో చెక్ చేద్దాం” అన్నాడు మాధవ్.
“పేరేంటో తెలుసుకోకుండానే పెళ్ళి చేసేసుకున్నావా?” అడిగింది మహతి నవ్వుతూ.
“అంత ప్రేమలో పడిపోయాను” అన్నాడు మాధవ్. నీలిమ ముఖం చిరుసిగ్గుతో ఎర్రబడింది. అక్కడినుంచీ లేచి లోపలికి వెళ్ళింది. మహతి కాస్త యిబ్బందిపడింది. అతనికి పొరపాటు అర్థమైంది. భార్యాభర్తల మధ్య వుండే సరసాలు వాళ్ల ఏకాంతాన్ని దాటకూడదు. వెంటనే సర్దుకున్నాడు.
“బావకి కలుపు. మాట్లాడదాం” అన్నాడు సుమతితో. ఆమె ఫోన్ కలిపింది.
“చేరావా?” అడిగాడతను.
“మాటల్లో పడి ఫోన్ చెయ్యడం మర్చిపోయాను” అందామె. ఇద్దరూ రెండోవాళ్లదగ్గిరున్న పిల్లలగురించి అడిగి, తెలుసుకుని నిశ్చింతపడ్డారు. మాధవ్ మాట్లాడాడు.
“మీరూ రావలిసింది బావా! సరదాగా గడిపేవాళ్లం. చాలాకాలమైంది మిమ్మల్ని చూసి” అన్నాడు మాధవ్.
“సుమతి వున్నట్టుండి బయల్దేరింది. అలా రావడం నాకు వీలవదు. నా ప్రొఫెషన్ అనుమతించదు. మీకు తెలుసుగా? ఈసారి ప్లాన్ చేద్దాం” అన్నాడతను. ఇద్దరూ కొద్దిసేపు మాట్లాడుకుని ఫోన్ పెట్టేసారు. నీలిమ వంటింట్లోంచీ ప్లేట్లు తెచ్చి టీపాయ్‍ అందరికీ దగ్గరగా జరిపి, దానిమీద పెట్టింది. మాధవ్ వెళ్ళి నీళ్ళ జగ్, గ్లాసులు తెచ్చాడు. పిల్లలకి బిస్కెట్లు ఇచ్చింది.
“సో… ఎలా వుంది లైఫ్?” అడిగాడు మాధవ్. డబ్బు, ఆస్తులు ఎంత వున్నాయనేదాంతో సంబంధం లేకుండా ప్రమీల పిల్లలు ముగ్గురిదీ వీళ్ళందరికీ పూర్తిగా భిన్నమైన జీవితం. గీతకి వాళ్లది డబ్బుగర్వం అనిపించేది అదే. సుధీర్, సుమంత్‍ల జీవనశైలి కొంచెం అర్థమైనా, సుమతి ఎలా వుంటుంది, ఏం చేస్తుంటుందనేది వీళ్ళందరికీ కుతూహలం.
“ఉండటానికీ, క్లినిక్కీ కలిపి ఒకటే ఇల్లు లీజుకి తీసుకున్నాం. వంటకి మనిషుంది. పొద్దున్నా, సాయంత్రం వచ్చి వండి వెళ్తుంది. ఇంటిపని చేసి, పిల్లల్ని చూసుకుని, రోజంతా వుండటానికి యింకొకళ్ళున్నారు. యశూ స్కూలికి వెళ్ళేదాకా అందరం హడావిడిపడుతూ వుపగ్రహాల్లా వాడిచుట్టూ తిరుగుతాం. ఆ తర్వాత బావ తయారై క్లినిక్కి వెళ్ళేదాకా ఆయన చుట్టూ. ఆ లోకంలోకి తను వెళ్ళారంటే ఇవతలికి రావడం కష్టమే. మొదట్లో మధ్యమధ్యలో వచ్చేవారు. ఇప్పుడు ప్రాక్టీసు బాగా పెరిగిపోయింది. అక్కడికీ లెక్కగానే చూస్తారు పేషేంట్లని. కానీ మొహమాటాలుంటాయి. మెడికల్ రిప్రజెంటేటివ్స్ వస్తుంటారు. వీళ్ళంతా తన పర్సనల్ టైమ్‍లోకి చొరబడిపోతారు…” అంది సుమతి.
“మరి రోజంతా నువ్వేం చేస్తావే? అసలు టైమెలా గడుస్తుంది?” అయోమయంగా అడిగింది మహతి.
“డ్రైవింగ్ నేర్చుకున్నాను. కారు చేతిలోనే వుంటుంది. ఎక్కడికి వెళ్ళినా వద్దనరు. పుస్తకాలు బాగా చదువుతానని ఎన్ని కొన్నా కాదనరు. పెద్ద కలెక్షన్ చేరింది నా దగ్గిర. టీవీ, సీడీ ప్లేయరు… సినిమా వీడియోలుకూడా చాలా వున్నాయి”
“ఒక్కళ్ళూ కూర్చుని సినిమాలేం చూడగలరు? పుస్తకాలు ఎంతకని చదవగలవు? అన్నిటితోపాటు సినిమాలు, పుస్తకాలుగానీ, అవే కాలక్షేపంకాదుకదా?
“సరదాగానే వుంటుంది మహీ, జీవితం. అప్పుడప్పుడు జో ఫ్రెండ్స్‌తో పార్టీలు… ఇద్దరం వెళ్తాం. ప్రెండ్సని అనను, నా సర్కిల్లో నాకు కిట్టీపార్టీలు… కొత్తకొత్త నగలు, చీరలు కొనుక్కుని చూపెట్టుకోవడం, ఇంకా లేటేస్ట్‌వి ఎక్కడొచ్చాయో తెలుసుకుని పోటీలుపడి కొనుక్కోవడం… చిన్నప్పుడంతా చూసిచూసి కొనుక్కునేవాళ్ళంకదా, ఇలా నచ్చినవన్నీ కొనుక్కోవడం థ్రిల్లింగ్‍గానే వుంటుంది. పుస్తకాలమీద నాలాగా ఆసక్తి వున్నవాళ్ళు నలుగురైదుగురు పరిచయం అయ్యారు. రీడింగ్ సర్కిల్ ఏర్పరుచుకుని చదివిన పుస్తకాలగురించి చర్చించుకుంటాం… అంతా వడిగా సాగిపోతున్న మధ్యలో ఒక్కసారి హఠాత్తుగా అనిపిస్తుంది, ఎక్కడో కొత్తచోటికి వచ్చాను, ఇంక తిరిగి వెళ్ళిపోవాలని. నా జీవితమే యిదని అర్థమయ్యాక తెల్లబోతాను. మీ అందరూ బాగా గుర్తొస్తారు. చిన్నప్పుడు ఏదేనా అందరం కలిసి చేసాము. ఇప్పుడేమిటో ఎవరికివాళ్ళం … ఏడేడు సముద్రాల దూరాన వున్నట్టు. కలిసినా, మాట్లాడుకున్నా ఇంకా చెప్పాల్సింది చాలా మిగిలిపోయి వుండగానే అర్ధాంతరంగా ముగిసిపోయే కలయికలు… అవంతీపురంలో చిన్నప్పుడు చూసిన యిళ్ళలో చాలా యిళ్ళు అపార్టుమెంట్లుగా మారిపోతున్నాయి. కొన్నిటికి పక్కని వెనుకటి డాబా యిల్లుంటుంది. కానీ ఆ యింటికి యీ యిల్లు పొరుగిల్లు కాదు. రెండిళ్ళూ పక్కపక్కనే వున్నా కలవనంత దూరం. నాకు అలా అనిపిస్తుంది” సుమతి గొంతు చిన్నగా వణికింది.
మహతికీ, మాధవ్‍కీ గుండె లోపల్లోపల్లెక్కడో కదిలింది. నీలిమ ఆశ్చర్యపోయింది. మాధవ్‍కీ ఇలానే వుంటుందా? మగవాడు… పెళ్ళయ్యాకకూడానా?
“పెద్దవాళ్ళం అయాం. ఎవరిళ్ళు, జీవితాలూ వాళ్లవి. అలా దిగులుపడితే ఎలానే?” అనునయంగా అడిగింది మహతి, తనున్నచోటినుంచీ లేచి సుమతి పక్కని కూర్చుని , అనునయంగా దగ్గరికి తీసుకుని. ఆమె భుజంమీద తలవాల్చింది సుమతి. రెండు కన్నీటిచుక్కలు జారిపడ్డాయి.
“బావ బానే వుంటారా, సుమా? ఇందాకా ఏవో పార్టీలన్నావు, వెట్ ఈవెంట్సా…” సందిగ్ధంగా అడిగాడు మాధవ్. సుమతి చప్పుని సర్దుకుని కూర్చుంది. కళ్ళు తుడుచుకుంది.
“ఛ… అలాంటిదేం లేదురా! ఫెండ్స్ ఎంత బలవంతపెట్టినా తను తీసుకోరు”
“నువ్వు లేనప్పుడు?”
“అతన్నేమైనా అంటే కళ్ళు పోతాయ్. చెంపలేసుకో…” అంది సుమతి నవ్వేస్తూ.
“మరింక ఏడుపు దేనికే? బావ మంచివాడు. చక్కటి జీవితం… సంతోషంగా వుండాలికదా?” మృదువుగా అడిగాడు మాధవ్.
“ఆక్సిమొరాన్లు ఇలానే వుంటాయి”
“నేను వెళ్ళి ఆవిడ్ని తీసుకొస్తాను. ఒక్కర్తీ బయల్దేరుతుందేమో” లేచాడు మాధవ్. అతని మనసులో ఆలోచనలు సాగుతున్నాయి.
తమ యింట్లో మొదట ఆరుగురు ఆడవాళ్ళు అన్న చూపించిన దిక్కుగా ప్రయాణం మొదలుపెట్టారు. అప్పుడు మనుషులందరి కోరికలూ, ఆలోచనలూ ఒకేలా వుండేవి. ఏదో ఒకలా వుద్యోగం సంపాదించుకుని, పెళ్ళిచేసుకుని పిల్లల్ని కని బాధ్యతగా వుండటం మగవాళ్ళకీ, భర్త సంపాదించి తెచ్చినదేదో పొదుపుగా ఖర్చుపెట్టుకుని, సంసారాన్నీ, పిల్లల్నీ పైకి తెచ్చుకోవడం ఆడవాళ్ళకీ జీవితాశయాలుగా వుండేవి. ఆమ్మనుంచీ ఆఖరి పిన్నిదాకా పెద్దగా తేడా లేకుండా అలానే గడిపారు. అటుతర్వాత తమ బేచిలో నలుగురు ఆడపిల్లలు నాలుగుదారుల్లో ప్రయాణం మొదలుపెట్టారు.
గీత బంధాలమధ్య చిక్కుకుని వుంది. మహతి వైఫల్యాన్ని దాటే ప్రయత్నంలో వుంది. సుమతి అంత:పురంలో రాకుమారి. రవళి జీవనపోరాటంలో వురుకులూ పరుగులూ పెడుతోంది. ఆ తరువాత కదిలినవాళ్ళు ముగ్గురు- తమింట్లోంచీ తులసి, ప్రహ్లాద్ చెల్లెలు ప్రవల్లిక, వసంత్ చెల్లెలు సమీర. ముగ్గురూ చిన్నాపెద్దా వుద్యోగాలు చేస్తున్నారు. సంపాదించుకుంటూ, ఖర్చుపెట్టుకుంటూ, ఏవో కొనుక్కుంటూ గడిపేస్తున్నారు. ఇంకో ముగ్గురు ప్రయాణానికి కొంచెం దూరంలో వున్నారు. వీళ్ళంతా సంతుష్టంగా వున్నారా అంటే సందిగ్ధమే. సమూలంగా మారవలసిన అవసరం ఎంతవరకూ వాళ్ళని రాజీకి తెచ్చిందో తెలీదు. మగపిల్లలకి ఈ కుటుంబంలో అనేకాదు, మొత్తం సమాజంలోనే చిన్నచిన్న సర్దుబాట్లు తప్ప, మౌలికమైన మార్పులు వుండవు. స్థిరమైన, నిలకడైన పరిస్థితి తమది. తమ యింటి ఆడపిల్లలనేకాదు, బయటినుంచీ వచ్చిన వాళ్లకికూడా ఈ స్ట్రగుల్ వుంటుంది. అందుకే నీలిమదగ్గిర అంత సామరస్యం చూపిస్తాడు. కానీ… నీలిమకి గీతతో పడదు. అదే పెద్ద విషాదం. మహతి మరోవిషాదం అనుకుంటే ఇప్పుడు సుమతికూడానా? తను సంతోషంగా లేదా? ఎందుకు ఏడ్చింది? అదేదో తేల్చుకోవలసిన విషయమేననిపించింది.
మాధవ్ వెళ్ళేసరికి విజ్జెమ్మ తాళం వేసుకుని బయల్దేరుతోంది.
“అనుకున్నాను, నువు బయల్దేరేస్తావని” అంటూ ఆవిడ చెయ్యిపట్టుకుని తనతో నడిపించుకు వెళ్ళాడు. వెళ్ళేసరికి సుమతి మామూలుగానే నవ్వుతోంది. నవ్వులూ, పరిహాసాలూ రువ్వుతోంది. ఐనా అతనికి స్థిమితంగా లేదు. తెలుసుకోవలసినది మిగిలినట్టే వుంది. ఆరోజు సాయంత్రందాకా అక్కడే వున్నారు. సుమతి కూతురు కొద్దిగా మాధవ్‍కి చేరికైంది. ఎత్తుకోనిచ్చింది. మిగతావాళ్ళనిమాత్రం తనని ముట్టుకున్నందుకు, తనకేసి చూసినందుకుకూడా బాగా కోప్పడింది.
“ఇక్కడే వుండిపోండి” అన్నాడు మాధవ్.
“మహీతో చాలా మాట్లాడాలిరా! ఎంతోకాలమైంది ఇద్దరం కలుసుకుని. మళ్ళీ ఎప్పటికి యిలా కలుస్తామో! రేపు మళ్ళీ వస్తాం” అంది సుమతి. మహతికికూడా ఆమెని నిలదీసి అడిగే విషయాలు వున్నాయి. నీలిమకి చురుక్కుమంది.
పిల్లలిద్దర్నీ పడుక్కోబెట్టాక అక్కచెల్లెళ్ళిద్దరూ తెల్లారేదాకా మాట్లాడుకున్నారు.
“ఇంక పడుక్కోండే! అర్ధరాత్రైంది…”
“తెల్లారిపోతుంది…”
“రేపంతా ఏం చేస్తారు?” అంటూ విజ్జెమ్మ అప్డేట్స్ ఇస్తున్నా ఆగలేదు వాళ్ల కబుర్లు. చిన్నప్పట్నుంచీ మొదలుపెట్టి ఎన్నో విషయాలు దొర్లాయి. ఎన్ని సరదాలు, ఎన్ని విహారాలు…
ఇక్కడికి వచ్చేముందు మహతి సమస్యని భర్తతో చర్చించింది సుమతి. అతను కొన్ని ప్రశ్నలు చెప్పి అడిగి తెలుసుకొమ్మన్నాడు. ఎలా అడగాలో, జవాబులు ఎలా రాబట్టాలో నేర్పించి పంపాడు. భార్యాభర్తలిద్దరికీ ఒకళ్ళంటే ఒకళ్ళకి విముఖత లేనప్పుడు కలపడంలో తప్పులేదని అతని ఆలోచన. అవి గుర్తుతెచ్చుకుంటూ ఏదో అడగబోయింది సుమతి.
“పుస్తకాన్ని తెరిచి చూపించినట్టు అందరిముందూ చెప్పేసాను. ఇంక చెప్పడానికేం లేదు. మనిద్దరం మాట్లాడుకోవాలంటే భర్తలూ, సంసారాలూ పిల్లలూ తప్ప ఇంకేమీ లేవా? ఇవేవీ, వీళ్ళెవరూ మన జీవితాల్లో లేనప్పుడు… మనంతప్ప మరెవరూ మన ఆలోచనల్లోకి రానప్పుడు ఎంత హాయిగా వుండేవాళ్ళం? ఇప్పుడేమిటో ఏదో తప్పు జరిగినట్టు, కష్టాలేవో ముంచుకొచ్చి మీదపడ్డట్టు అందరూ ఒకటే గుంజాటన పడుతున్నారు. నాన్నేమో అక్కడికి రమ్మంటాడు. ఆయన రిటైరయ్యేలోపు నేను వుద్యోగం తెచ్చుకోవాలట. లేకపోటే తట్టాబుట్టా సర్దెయ్యాలట. ఏమే? అక్కడికి వస్తే ఏం జరుగుతుంది? మేఘన అందుబాటులోనే వుంటుందికాబట్టి చీటికీమాటికీ వాళ్ళొచ్చి చూడటం, నేనేదో తప్పు చేసినట్టు దాని మనసులో ముద్రపడటం, ఇవన్నీ అవసరమా? ముప్పయ్యేళ్ళొచ్చాకేనా నా బతుకు నన్ను బతకనివ్వచ్చుకదా? ” అంది మహతి.
“పిల్లని యివ్వకపోతే?”
“ఎందుకివ్వరు? కోర్టులూ చట్టాలూ వున్నదెందుకు? న్యాయం చెయ్యడానికి కాదా? ఇచ్చేదాకా పోరాడతాను. అప్పుడు మీరంతా నాకు సపోర్టివ్వండి”
“కోర్టులూ చట్టాలూ అన్నీ వుంటాయి. కానీ నిరపేక్ష న్యాయం అనేది వుండదు. మనది మగవాళ్ళు అధికంగా అధికారంలో వుండే సమాజం. న్యాయాలన్నీ వాళ్ల కోణంలోంచే చూడబడతాయి. కొద్దోగొప్పో ఆడవాళ్ళున్నా, వాళ్ళుకూడా చాలావరకూ అలానే ఆలోచిస్తారు”
“పసిపిల్లని తల్లినుంచీ విడదీయమని ఏ చట్టం చెప్పదు. ఏ మనిషీ చెప్పడు. ఆ పిల్లకి తనంతట తను ఆలోచించుకునే వయసు వచ్చేదాకా ఆగుతారు. అప్పటి విషయం అప్పుడు చూడచ్చు. మీయింట్లో అంతా మెడికల్ ఫీల్డులో వున్నవాళ్లు. ఎలా చేస్తే పాప నాదగ్గిర వుంటుందో ఆలోచించండి. నాకు ఆరోగ్యం బాలేదని చెప్పి అవకాశంతీసుకుంటారేమో నరేంద్రావాళ్ళు” అంది. ఆమె అన్నీ లోతుగా ఆలోచించుకుందని అర్థమయ్యాక సుమతి ఇంకేం మాట్లాడలేకపోయింది.
“ఇవన్నీ సరేనే, నువ్వు గీతతో ఎందుకు మాట్లాడ్డంలేదు?” అడిగింది మహతి. ఎదురుచూసిన ప్రశ్నే. మొదట మాధవ్ అడిగాడు. అక్కడ నీలిమ వుండటంతో మాటదాటేసింది. ఇప్పుడిక చెప్పక తప్పదు.

1 వాసు, గీత – భార్యాభర్తలు, మేనత్తమేనమామ పిల్లలు. మయూఖ్, విహంగ్ గీతావాసుల పిల్లలు. రామారావు గీత తండ్రి.
2 ప్రమీల – రామారావు పెద్ద చెల్లెలు. సుధీర్, సుమతి, సుమంత్ ఆమె పిల్లలు. భర్త గురుమూర్తి.
రమ – సుధీర్ భార్య. వ్యాస్, హాస్ వాళ్ళ పిల్లలు. సరళ ఆమె తల్లి. సుమతి భర్త జోగేశ్వర్రావు.
3 లక్ష్మి – రామారావు రెండో చెల్లెలు. వాసు, మాధవ్, తులసి ఆవిడ పిల్లలు. నీలిమ మాధవ్ భార్య. పంకజ్ కొడుకు.
4 నిర్మల – రామారావు మూడో చెల్లెలు. నారాయణ ఆమె భర్త. మహతి, రవళి ఆమె కూతుళ్ళు.
నరేంద్ర, మహతి భర్త, మేఘన కూతురు. విజయ నరేంద్ర రెండో భార్య. హరి, ఇందిర ఆమె పిల్లలు.

1 thought on “ఝరి – 47 by S Sridevi”

  1. I was very pleased to uncover this great site. I need to to thank you for ones time for this fantastic read!! I definitely appreciated every bit of it and I have you bookmarked to look at new information on your blog.

Comments are closed.