ఝరి – 48 by S Sridevi

  1. ఝరి – 46 by S Sridevi
  2. ఝరి – 47 by S Sridevi
  3. ఝరి – 48 by S Sridevi
  4. ఝరి – 49 by S Sridevi
  5. ఝరి – 50 by S Sridevi
  6. ఝరి – 51 by S Sridevi
  7. ఝరి – 52 by S Sridevi
  8. ఝరి – 53 by S Sridevi
  9. ఝరి – 54 by S Sridevi
  10. ఝరి – 55 by S Sridevi
  11. ఝరి – 56 by S Sridevi
  12. ఝరి – 57 by S Sridevi
  13. ఝరి – 58 by S Sridevi
  14. ఝరి – 59 by S Sridevi

జరిగిన కథ-వాసు, గీత భార్యాభర్తలు. గీత ఆత్మహత్యకి ప్రయత్నం చేసి బైటపడుతుంది. తులసికి కేన్సరొచ్చి తగ్గుతుంది. భర్తతో విడిపోవాలనుకుంటుంది. అతనికి విడాకులు ఇష్టం వుండదు. గీతకి ఎవరో ఫోన్‍చేసి బెదిరిస్తారు. ఆ ఫోన్ సుధీర్‍ చేసాడేమోననే అనుమానం వస్తుంది వాసుకి. మహతి భర్తతో విడాకులు తీసుకుంటుంది. మేఘన ఆమె కూతురు. తల్లి దగ్గిరే వుంటుంది. తండ్రికి యాక్సిడెంటైతే చూడటానికి వస్తుంది. మహతితో విడాకులయ్యాక నరేంద్ర మరో పెళ్ళి చేసుకుంటాడు. ఆమెవలన ఇద్దరు పిల్లలు. ఆమె చనిపోతుంది. అతనికి యాక్సిడెంటైతే సాయానికి హాస్పిటల్‍కి వెళ్తుంది మహతి. రాత్రి అతనికి అటెండెంటుగా వుంటుంది. పిల్లలని వాసు తనింటికి తీసుకెళ్తాడు. మహతికి అతనితో తన పెళ్ళైనప్పటి రోజులు గుర్తొస్తుంటాయి. నరేంద్రతో విడిపోయాక ఆమె ముంబైలో వుండిపోతుంది.
గీత గతం. చదువయ్యి, చిన్నవయసులోనే వుద్యోగంలో చేరుతుంది. ఇంట్లో ఆమెకి పెళ్ళి చెయ్యాలనుకుంటారు. తండ్రి అడిగితే సూచనాప్రాయంగా వాసు పేరు చెప్తుంది. ఆమెని తనింటికి తీసుకెళ్ళి సుధీర్ని చేసుకొమ్మని నచ్చజెప్పే ప్రయత్నం చేస్తాడు రవి. గీతావాసులకి చాలామంది కజిన్స్. చిన్నతనంలో వాళ్లంతా ఒకే స్కూల్లో చదువుకుంటారు. రామారావు యశోద ప్రమీల ఇంటికి వెళ్ళి పెళ్ళివిషయం చెప్పి, ఆహ్వానించి వస్తారు. సుధీర్ గీతని ఇష్టపడతాడు. ఆమెని చేసుకోలేకపోతున్నందుకు బాధపడతాడు.
వెంకట్రావు, విశాల అనే భార్యాభర్తలు అప్పులబాధ తట్టుకోలేక వురివేసుకుని చనిపోతారు. వాళ్ళ కూతురు అమృత. అమృత అవంతీ ఎస్టేట్స్‌లో మాధవరావు ప్రాపకంలో వుంటుంది. పోలీసుస్టేషన్‍కి పిలిచి బెదిరిస్తారు అమృతని. విజయ్, శ్యామ్మోహన్ అండగా నిలబడతారు. తనకి అమృత అంటే ఇష్టమని ప్రసూనకి చెప్తాడు. ఆ విషయం చెప్పి రోహిణిని హెచ్చరిస్తుంది ప్రసూన.


“ఎప్పుడో ఒకప్పుడు నువ్వో గీతో అడుగుతారని తెలుసు. దాంతో ఎందుకు మాట్లాడాలి?” అంది.
“తను చాలా బాధపడుతోంది తెలుసా?”
“దేనికి బాధపడటం? కోరుకున్నవాడినే చేసుకుందికదా?”
“మనంమాత్రం చేసుకోలేదా?”
“రెండూ ఒకటేనా?”
“కాదా?”
“కాదు” స్థిరంగా వుంది సుమతి జవాబు. “మాఅమ్మ అడిగినదానికి ఎక్కడ వాళ్ల నాన్న వప్పేసుకుంటాడోనని కంగారుపడిపోయి వాసుని యిష్టపడుతున్నట్టు చెప్పేసింది. అంత చెడ్డవాళ్ళమా, మేం? అడగబోయేది స్వంత అన్నా, సుఖపడేది ఆయనకూతురూకాబట్టి అమ్మ ఒక ప్రతిపాదన తెచ్చింది. మామయ్య ఖర్చుపెట్టలేకపోతే పీడించి లాక్కునేవాళ్లలా కనిపించామా తనకి? ఎందుకే ఆ తొందర?” తీవ్రంగా వుంది ఆమె స్వరం.
“వాళ్ళిద్దరూ ఒకళ్లనొకళ్ళు ఇష్టపడ్డారు సుమా! వాసుని చేసుకుంటానని మొదటే చెప్పిందట”
“కొన్నేళ్ళపాటు వాళ్ళసలు మాట్లాడుకోనే లేదు. ప్రేమేమిటి? మామయ్యకి కష్టం వుండకూడదని తీసుకున్న ఛాయిస్ కావచ్చు. పెద్దవాళ్ళు చూసుకోవలసిన విషయంలో తను పెత్తనం చేసింది. ఈరోజు నీకు చెప్తున్నాను. ఈ విషయాలు బైటికి రాకూడదని చాలా జాగ్రత్తపడ్డాం. బైటికొస్తే వాళ్ళ నలుగురి జీవితాలూ తలకిందులౌతాయని భయపడ్డాం”
“??”
“సుధీర్‍కి తనంటే ప్రాణం. మాకసలు తెలీనే తెలీదు, వాడికి అలాంటి ఆలోచన వుందని. గీత పెళ్ళి కుదిరందని మామయ్య మాయింటికి వచ్చి చెప్పినరోజు చాలా గొడవైంది. చిన్నపిల్లాడిలా ఏడ్చాడు. అమ్మని ఎన్నో మాటలన్నాడు. నాన్న తలదించుకున్నారు. అహర్నిశం కష్టపడి, వాళ్ల సొంత సుఖసౌఖ్యాలని మర్చిపోయి, మేము పైకి రావడమే జీవితాశయం అనుకున్నారు వాళ్లు. ఇద్దర్నీ బాధపెట్టాడు. చచ్చిపోవాలని ప్రయత్నం చేసాడు. ఏదో ఇంజెక్షన్ చేసేసుకుంటుంటే టైముకి సుమంత్ చూసాడు. ఆతర్వాతకూడా వాడిని ఎంత జాగ్రత్తగా కాపాడుకున్నామో తెలుసా? ఇరవైనాలుగ్గంటలూ వంతులు వేసుకుని కాపలాకాసాం. అమ్మతో ఈరోజుకీ వాడు సరిగ్గా మాట్లాడడు. ఇండియా వచ్చినా, ముంబైలోనే వుండిపోతాడుగానీ అక్కడికి రాడు. వాళ్ళ పెళ్ళైన కొత్తలో రమ ఎన్నోసార్లు నన్నడిగింది, సుధీర్ ఎందుకలా మూడిగా, డల్‍గా వుంటాడని. సర్ది చెప్పాను. ఈ విషయం బైటపడితే తను కాపురం చేస్తుందా? వాసుమాత్రం గీతతో కలిసి వుండగలడా?” ఆవేశంగా అడిగింది. ఈ గొడవలు ఇంత వివరంగా తెలీదు మహతికి. అపార్ధాలు చోటుచేసుకున్నాయని అనుకున్నారు. అవి యివని యిప్పుడే తెలిసింది.
“సుధీర్‍ గీతని యిష్టపడుతున్నాడన్న విషయం మీకెవరికీ తెలీదన్నావు. గీతావాసుల విషయంకూడా అంతేకదా?” అడిగింది సున్నితంగా. సుమతి కంగుతింది ఆ ప్రశ్నకి. కొంత సమయంపట్టింది తేరుకోవడానికి.
“అదీ యిదీ ఒకటేనా?”
“వాసూగీతలు ఒకళ్ళనొకళ్ళు యిష్టపడ్డారనేది వాళ్ళ పెళ్ళప్పుడు బయటికి వచ్చిన విషయం. వరసైన ఏడుగురు మగపిల్లలమధ్య తనని చాలా బేలన్స్‌డ్‍గా పెంచారు. ఒక్కమాటు గుర్తుతెచ్చుకో. ఫంక్షన్సూ అవీ జరిగినప్పుడు అందరం వరసగా పక్కలేసుకుని మాట్లాడుకుంటూ పడుక్కునేవాళ్ళం. నువ్వు పక్కని లేకపోతే నిద్రపట్టట్లేదే అని ఏదో ఒక టైంలో గీతని మామయ్య పిలుచుకు వెళ్ళిపోయేవాడు. తనని ఎవరింట్లోనూ వదిలేవాళ్ళు కాదు. ఎంతరాత్రైనా వచ్చి తీసుకెళ్ళేవాడు. అందరూ వరసైన పిల్లలు దానికి. అందుకే అంత జాగ్రత్తగా పెంచారు. మనకి అర్థమయ్యేదికాదు. నాన్నకూచి అని వెక్కిరించేవాళ్ళం. అలాంటి క్రమశిక్షణ వుండటంచేతే వాళ్ళిద్దరూ ఒకళ్ళమీద ఒకళ్ళకి వున్న యిష్టాన్ని దాచుకున్నారు… సుధీర్‍లాగే. ఆ టైం వచ్చినప్పుడు చెప్పచ్చనుకుని వుంటారు”
“దాన్ని భలే సమర్ధిస్తావు నువ్వు”
“ఇందులో సమర్ధించడానికేం వుందే? సుధీర్ తనకోసం ప్రాణాలు తీసుకోబోయాడన్నది ఇప్పుడు నువ్వు చెప్తేకదా, నాకు తెలిసింది? వాళ్ళిద్దరి విషయం అంతే. మన మధ్య వున్నప్పుడు వాళ్ల ఇమోషన్స్ బైటపడతాయని భయపడి మాట్లాడుకోవడం మానేసారేమో! “
“…”
“ఒకరోజూ రెండురోజుల పరిచయాలు కావుకదా, మనవి? పుట్టినప్పట్నుంచీ కలిసి తిరిగాం. రెండుమూడు విషయాలు. వాళ్ళిద్దరిగురించి. మనందరం కలిసి తింటున్నప్పుడు వాసు ఎప్పుడు తినడం ఆపి, మంచినీళ్ళు తాగుతాడో గీతకి తెలుసు. వాడు నీళ్ళగ్లాసుకోసం వెతుక్కోవడానికి ముందే తను వాడిముందుకి తోసేది. నేను, ప్రహ్లాద్ ఒక ఆటలా గమనించేవాళ్ళం. అందరం ఎక్కడికేనా వెళ్ళినప్పుడు మగపిల్లలు వేగంగా నడిచేసి, మనం వెనకబడ్డామని ఆగేవారు. గీత పెత్తనాలు చేస్తూ నడిచేది. తన అడుగులచప్పుడు మాకు కలిసేదాకా వాసు ఆగిపోయేవాడు. గీత రాలేదని వీడికెలా తెలుస్తుందే, వీపుకి చెవులూ, కళ్ళుగానీ వున్నాయా అని విసుక్కునేది రవళి. అంత సునిశితంగా ఇద్దరూ ఒకళ్ళొకళ్ళకి తెలుసు. ఇవన్నీ సాధారణ విషయాలే కావచ్చు. మామూలు పరిశీలనో, అలవాటో, కాకతాళీయమో కావచ్చు. ప్రేమరంగు అద్దితే దృశ్యం మారిపోతుంది”
సుమతి ఈ కోణంలోంచీ ఎప్పుడూ ఆలోచించలేదు. తల్లిదండ్రులు బాధపడ్డారన్న కోపం, తను నమ్మిందే నిజమన్న మంకుతనం, ఆ కోణాన్ని పూర్తిగా మూసేసాయి. ఇప్పుడుకూడా ఆ కోణాన్ని ఆవిష్కృతం చెయ్యడానికి మనసు వప్పుకోలేదు.
“నువ్వన్నదే నిజం అనుకుందాం. వాసుకీ గీతకీ మధ్యని పెళ్ళికిముందు ఏమీలేదు. వాసుతో పోలిస్తే సుధీర్ చాలా మంచి మేచి తనకి. త్రాసుముల్లుమీద నిలబెడితే మనలో ఎవ్వరమేనా సుధీర్‍వైపే మొగ్గుతాం. సుధీర్ని చేసుకుని వుంటే ఈరోజుని అమెరికాలో వుండేది గీత. కాకపోయినా, నీలాగా హైసొసైటీలో తిరిగేది. వాళ్ల నాన్నమీది ప్రేమతోనే అనుకుందాం, వద్దనుకుంది. అది గొప్ప విషయం కాదూ? మనం ఎవ్వరం చెయ్యని పని అది. ఆ కోణంలోంచీ చూస్తే త్యాగంమాత్రమే కనిపిస్తుంది. వాసుకోసం వదులుకుంది అనుకుంటే అదొక గొప్ప ప్రేమకావ్యమౌతుంది. ఆ సౌందర్యం తను ఆస్వాదించడంలో తప్పేం వుంది?” అడిగింది మహతి.
“నువ్వు చెప్పినంతగా నేను ఆలోచించలేదు మహీ! తన పెళ్ళి మా కుటుంబంమీద చూపించిన ప్రభావం తక్కువది కాదు. గీతని చూసినా, తనతో మాట్లాడినా అవే విషయాలు గుర్తొచ్చి మనసు కలతబారుతుంది. వాళ్ళ పెళ్లయ్యాకకూడా అందరం చాలాసార్లు కలిసాం. ఫంక్షన్లకి రాకపోతే పెద్దవాళ్ళు వూరుకోరు. కారణం అడుగుతారు. చెప్పాలికదా? ఒకసారి, రెండుసార్లు… ప్రతీసారీ వెళ్ళకుండా వుంటే బావోదు. మొదట్లో వాసుముందు బైటపడకూడదనీ, తర్వాత రమకూడా వుందనీ ఎంత కంగారుపడేవాళ్లమో! సుధీర్ని రావద్దని చెప్పలేకపోయేవాళ్లం. వాడు రాకుండా వుండేవాడుకాదు. గీతని చూడటంకోసం. వాడి మనసులో ఎలాంటి చెడు అభిప్రాయం లేదు. కానీ దాన్ని వదల్లేనితనం. అది పరాయిదని వప్పుకోలేకపోయేవాడు. మనం ఆడపిల్లలం. మనమధ్య పెళ్ళిళ్ళైనా స్నేహం కొనసాగుతుంది. కానీ వాళ్ళిద్దరిమధ్యా అలాకాదుకదా?”
“గీతకికూడా మీ యింట్లో జరిగినవి తెలీవు. మీ సంబంధం వద్దన్నందుకు మీకు కోపం వచ్చిందనుకుంటోంది”
“…”
“గీత సుధీర్ని చేసుకుని వుంటే ఇలాంటి విషయాలే నేనూ మాధవ్ మాట్లాడుకునేవాళ్ళం. వాసుకూడా గీతని అంతగానూ యిష్టపడ్డాడు. వాళ్ళ పెళ్లై పదేళ్ళైంది. జరిగినదాన్ని తిరిగి రాయగలిగే అవకాశం ఎంతమాత్రం లేదు. అలాంటప్పుడు ఈ కోపాలు దేనికి? తన జీవితం తనకి నచ్చినట్టు గడుపుతోంది. మనందరికీ వున్న స్వతంత్రం తనకీ వుంటుందికదా? తన నిర్ణయాన్ని గౌరవించే అవసరం మనకి లేదా? ఎప్పుడూ విడిపోకూడదని ఒట్లు పెట్టుకున్నాం. పోనీలే నాన్నా, అది తెలివితక్కువది… అని ఒక్కమాట అనేస్తే పెద్దనాన్న కాదంటాడా? ఆమ్మ కాదంటుందా?” అంది.
సుమతి ఆమె చేతిని తనచేతిలోకి తీసుకుని మృదువుగా పెదాలకి తాకించుకుంది. ఆమె మనసు ఇప్పుడు ప్రకాశవంతంగా వుంది.
“ప్రేమంటే ఏమిటో ఇప్పుడు అర్థమైంది” అంది ఫక్కుని నవ్వి. “జో ఎప్పుడు మంచినీళ్ళు తాగుతాడో గమనించుకోవాలి. నేను నడకలో వెనకబడ్డప్పుడు తను నాకోసం ఆగాడో లేదోకూడా చూసుకోవాలి”
“పదోతరగతిలో లెక్కలుకూడా బట్టిపట్టి రాసిన బేచి మనది” అంది మహతి.
వీళ్ళు నలుగురూ చదువులు అలాగే చదివారు!! కాస్త వెనకాముందూగా. ఒకళ్ళనొకళ్ళు ఆదర్శంగా తీసుకుని. వీళ్ళకి పరీక్షలంటే మగపిల్లలంతా స్కూలు చుట్టుపక్కలా, గోడలెక్కి దూకుతూనూ, తప్పించుకుంటూనూ వుండేవాళ్ళు. చిట్టీలు అందించడానికి.
“మీ మొద్దుమొహాలేవైనా ఎగ్జామ్స్ రాస్తున్నాయేమిట్రా, మీరంతా ఇక్కడ చేరారు?” అని వేళాకోళం చేసేవాళ్ళు తెలిసినవాళ్ళు. ఇవి పిల్లలకి సంబంధించిన రహస్యాలుగానే వుండిపోయాయి.


మహతి అంత చెప్పాక సుమతికి మనసు కాస్త తేలికపడిందిగానీ, వైమనస్యం పోలేదు. దాన్ని అలాగే పట్టి వుంచే బలమైన కారణాలు వున్నాయి. మాట్లాడుతూనే ఇద్దరూ నిద్రపోయారు. మర్నాడు మాధవ్ ఆఫీసుకి వెళ్ళి సెలవు పెట్టి చార్జి యిచ్చి వచ్చాడు. అతనిక్కూడా సుమతితో గడపాలనుంది.
“ఇలా తోచినప్పుడల్లా సెలవు పెడుతున్నారు, ఉద్యోగం వుంటుందా అసలు?” అని దబాయించింది నీలిమ.
“ఉద్యోగం ఎక్కడికీ పోదు. నీకా భయం అక్కర్లేదు. మహా ఐతే రాజస్థాన్ బ్రాంచికి వేస్తారు. చల్ మోహనరంగా అని వెళిపోదాం” అన్నాడు.
“బానే వుంది!” అని, “మీ అక్కగారు ఏకంగా వుద్యోగమే మానేసినట్టుంది?” అడిగింది మహతిగురించి.
“తను డెయిలీ వేజెస్‍మీద పనిచేస్తోంది. అది మానేసినా వాళ్ళు వదులుకోరు. టైపులో మంచి స్పీడుంది. డిజిటైజేషన్ ఔతోందికదా, తక్కువ ఖర్చుతో ఎక్కువ పనిచేసేవాళ్ళు కావాలి గవర్నమెంటుకి”
నాలుగురోజులు ముంబాయంతా చెడతిరిగేసారు. విజ్జెమ్మ తిరగలేనని యింట్లో వుండిపోయింది. ఆవిడకి వండిపెట్టి, తాము తినేసి బయల్దేరేవారు. మాధవ్ ఖర్చులు పెట్టబోతే సుమతి వప్పుకోలేదు. “చిన్నప్పట్నుంచీ ఎవరి ఖర్చులు వాళ్ళు పెట్టుకునేవాళ్ళం. ఇప్పుడూ అంతే. అలాగైతేనే ఎంజాయ్‍మెంటు వుంటుంది” అంది కచ్చితంగా. నలుగురూ కలిసి తిరగడం అందరికీ చాలా వుత్సాహాన్నిచ్చింది. నీలిమకి వాళ్ళ చిన్నప్పటిరోజుల్లోకి తొంగిచూస్తున్నట్టో కాలు పెట్టడానికి సందుదొరికినట్టో అనిపించింది.
“సుధీర్ అత్తగారింటికి వెళ్ళాలి. వాళ్ళు వచ్చే నెల్లో యూయస్ వెళ్తున్నారు. అక్కడికి పట్టుకెళ్లడానికి కొన్ని వస్తువులు ఇచ్చి రావాలి” అంది సుమతి వెళ్ళే ముందురోజు.
“ఈమధ్యనే వాళ్ళింటికి అందరం వెళ్ళివచ్చాము. మళ్ళీ బెటాలియనంతా కదిల్తే బావోదు. మనిద్దరం వెళ్ళొచ్చేద్దాం” అన్నాడు మాధవ్. అలాగే అతన్తో వెళ్ళి వస్తూ షాపింగ్ చేసి వచ్చింది. నీలిమకీ, మహతికీ, పిల్లలకీ డ్రెస్సులూ, విజ్జమ్మకి చీరా తీసుకుంది.
“ఇన్ని బట్టలు … ఎందుకే, నాకు?” అంది మహతి మొహమాటంగా.
“బైటికి వెళ్తావు, మంచిడ్రెస్సులు వుండాలి. బస్సులు, లోకల్ ట్రెయిన్లూ ఎక్కి దిగేప్పుడు చీరలైతే కాళ్లకి బంధాలు పడతాయి. ఇవి ఫ్రీగా వుంటాయి. నాన్నకూడా చెప్పారు ఈ విషయం. మహీ! నువ్వు నిలదొక్కుకుని మళ్ళీ ఎప్పట్లా కనిపించాలి. అందరం అందుకే ఎదురుచూస్తున్నాం” అంది దగ్గిరకి తీసుకుని.
నీలిమ చీరపెడితే, “ఇస్తినమ్మ వాయినం, పుచ్చుకుంటినమ్మ వాయినం” అంది నవ్వేసి. నీలిమకూడా నవ్వింది. సుమతి ఆమెకి చాలా నచ్చింది. గీత- రవళి- మహతిలకన్నా, భిన్నంగా వెలుగులు చిమ్ముతున్నట్టు. కనిపించే వస్తువు, చూసే చూపునిబట్టి భావాన్ని అద్దుకుంటుందని ఆమెకి తెలీదు. సుమతికి తిరుగుప్రయాణానికి టికెట్టు వుంది. మాధవ్ తనుకూడా చేయించుకుని బయల్దేరాడు. ఆమె రావడం ఎంత ఒక్కర్తీ వచ్చేసినా, అలా తిరిగి పంపడం మర్యాద అనిపించలేదు. విజ్జెమ్మకూడా సమర్ధించింది.
“అమ్మని తీసుకొస్తాను. రెండుమూడు నెలలుంటుంది” అన్నాడు.
“మరి పిల్లలు?” అడిగింది నీలిమ.
“వాళ్ల స్కూలికీ వీళ్ళు రావడానికీ గంట తేడా వుంటుంది. అమ్మ ఎక్కడికేనా వెళ్తే ముందుగదికి విడిగా తాళం వేసి తాళంచెవి మయూఖ్‍కి మొలతాడుకి కట్టేస్తారు. వాడికి తాళం తీసుకోవడం వచ్చు. అక్కడే బట్టలూ, తినడానికీ పెడితే పెరట్లోకి వెళ్ళి, కాళ్ళూ చేతులూ కడుక్కుని, బట్టలు మార్చేసుకుని స్నాక్స్ తినేసి ఆటలకి వెళ్ళిపోతారు”
“భలే పెంచుతోందిరా, మీ వదిన వాళ్లని” అంది సుమతి.
“ఆవిడెవరు?” చురుగ్గా అడిగాడు మాధవ్.
“వాళ్ల పెళ్ళిలోనేగా మనందరికీ తాఖీదులు జారీ అయ్యాయి, ఇంక వరసలు పెట్టి పిలుచుకోవాలని” ఆమె తగ్గలేదు.
“వాసుని చేసుకుని వదిన్నని దబాయిస్తోంది. అందరికంటే తనే చిన్నది” అన్నాడు కోపంగా. సుమతి నవ్వేసింది ఆ కోపం చూసి.
“అంటే?” అడిగింది నీలిమ ఆరాగా. ఇంతకుముందుకూడా ఎన్నోసార్లు అడిగితెలుసుకుంది ఆ విషయాన్ని. ఇప్పుడుకూడా లెక్కలేమీ మారలేదు.
“వసంత్, రవళి, గీత… ఇదీ వరస. నెలలు తేడా వాళ్లకి. ఎప్పుడూ రెండో మూడో వుయ్యాలలు వూగుతూ వుండేవి, మా మామయ్య యింట్లో. హాల్లో వాసానికేసి చీరల్తో కట్టేవారు వుయ్యాలలు. ఇప్పుడు వీళ్ళకంటే స్టాండు వుయ్యాలలు కొంటున్నాంగానీ, అప్పుడన్నీ అవే” అంది మహతి. చెల్లెలి భర్త, వసంత్‍కంటే కూడా గీత చిన్నదవడం నీలిమకి డైజెస్టవదు.


1 వాసు, గీత – భార్యాభర్తలు, మేనత్తమేనమామ పిల్లలు. మయూఖ్, విహంగ్ గీతావాసుల పిల్లలు. రామారావు గీత తండ్రి.
2 ప్రమీల – రామారావు పెద్ద చెల్లెలు. సుధీర్, సుమతి, సుమంత్ ఆమె పిల్లలు. భర్త గురుమూర్తి.
రమ – సుధీర్ భార్య. వ్యాస్, హాస్ వాళ్ళ పిల్లలు. సరళ ఆమె తల్లి. సుమతి భర్త జోగేశ్వర్రావు.
3 లక్ష్మి – రామారావు రెండో చెల్లెలు. వాసు, మాధవ్, తులసి ఆవిడ పిల్లలు. నీలిమ మాధవ్ భార్య. పంకజ్ కొడుకు.
4 నిర్మల – రామారావు మూడో చెల్లెలు. నారాయణ ఆమె భర్త. మహతి, రవళి ఆమె కూతుళ్ళు.
నరేంద్ర, మహతి భర్త, మేఘన కూతురు. విజయ నరేంద్ర రెండో భార్య. హరి, ఇందిర ఆమె పిల్లలు.