ఝరి 151-160 by S Sridevi

  1. ఝరి 101-110 by S Sridevi
  2. ఝరి 111-120 by S Sridevi
  3. ఝరి 121-130 by S Sridevi
  4. ఝరి 131-140 by S Sridevi
  5. ఝరి 141-150 by S Sridevi
  6. ఝరి 151-160 by S Sridevi

(“నేను చూసేదేంటి? పెళ్ళకావల్సిన పిల్లల సమాచారం గీతదగ్గిర బోల్డంత వుంది. ఎందుకేనా పనికొస్తుందని బాగా తెలిసినవాళ్ల గోత్రం, నక్షత్రం వివరాలు రాసి పెట్టుకుంటోంది”
“పెళ్ళిళ్ళు చెయ్యడం ఐపోయింది, ఇప్పుడింక పెళ్ళిసంబంధాలు చూడటం మొదలుపెట్టిందా? అంత తీరికెక్కడిదే తనకి?” పడీపడీ నవ్వాడు సుమంత్. లత శృతి కలిపింది.)
కృష్ణ, భవానీని ఎందుకు చేసుకోలేదు? వీడింకా ఎందుకు పెళ్ళిచేసుకోకుండా వుండిపోయాడు? అంత పసిపిల్లని తీసుకుని భవానీ చావింటికి ఎందుకొచ్చింది? వీడిని చూడటానికేనా? పెళ్ళిచేసుకొమ్మని చెప్పడానికా? గీత సుధీర్‍కి చెప్పినట్టు? అసలీ మగపిల్లలెందుకిలా ప్రేమ పేరుతో జీవితాలని తగలబెట్టుకుంటున్నారు? సుమతి మనసులోంచీ ఆ ఆలోచన పోవట్లేదు.
భవానీని కలవద్దని కృష్ణకి గీత చెప్పినట్టే అతనికి దూరంగా వుండమని భవానీకికూడా చెప్పింది ఆమె తల్లి.
“మీకిద్దరికీ చిన్నతనాలు పోలేదు. ఒకరినొకరు చూసారంటే హద్దూపద్దూ తెలీదు. ఆడామగా స్నేహాలు వప్పుకునేంత గొప్పదనం మగవాళ్లలో వుండదు. వాడు నీకేమౌతాడనే చూస్తారు ఎవరేనా. మీ ఆయనేనా. లేనిపోని సమస్యలు తవ్వి తలకెత్తుకోకు” అని. కొంచెం గట్టిగానే చెప్పింది. లక్షలుపోసి ఎత్తుకున్న వ్యవహారం పెళ్ళి. అందులో రిస్కు తీసుకోకూడదని తెలుసు భవానీకి. దాన్ని మనోవర్తిగానో, పెళ్ళిఖర్చులవ్యవహారంగానో మార్చుకోవడమంటే జీవనవ్యాపారంలో ఐపీ పెట్టినట్టే అనిపించి పెళ్ళయాక తన ప్రపంచంలో తనుండిపోయింది. దేశం, కాలం, తను గడపవలసిన మనిషి, చేసే ప్రాజెక్టు, దైనందిన జీవితం అన్నీ కొత్తవి. వీటన్నిటితో సర్దుకోవడానికి చాలానే సమయం పట్టింది. కృష్ణని కలవడమనేది యీ యిన్ని యితరవిషయాలమధ్యా అంత ప్రాధాన్యత సంతరించుకోలేదు. మిగిలిన స్నేహాల్లాగే పక్కకి పడింది. అతను వాస్తవాన్ని గ్రహిస్తాడనికూడా కొంత వుపేక్షవహించింది.
డెలివరీ అయ్యి, ఇక్కడికొచ్చాక పాతస్నేహం గుర్తొచ్చింది. అతనింకా పెళ్ళిచేసుకోలేదని తెలిసి తెల్లబోయింది. విజ్జెమ్మ పరామర్శకి తల్లి బయల్దేరితే వెంట తనూ తయారైంది.
“చంటిపిల్లని తీసుకుని నువ్వెందుకే?” అందావిడ.
“కృష్ణ వస్తాడు. వాడినోసారి చూడాలనుంది. ఇలాంటప్పుడుకూడా కలవకపోతే ఎలా?” అంది. బైటిలోకానికి భయపడటమే తప్ప తల్లికి పిల్ల చొక్కమే. చిన్నప్పటి మమకారాలు ఎక్కడికి పోతాయనిపించి కాదనలేకపోయింది. వాకిట్లోనే ఎదురుపడ్డాడతను. వీళ్లని చూసి ఆశ్చర్యపోయాడు.
“నువ్వెప్పుడొచ్చావే? ఈ బేగేజి ఎప్పుడు చేతికెక్కింది?” అడిగాడు నవ్వుతూ, భవానీ దూరాన్నించే చూపిస్తే చూసి, కూతుర్ని చూసి. “మరీ తిరగబడ్డ తేలుపిల్లలా వుంది. కాస్త అందమైన పిల్లని కనకపోయావే?” అన్నాడు నవ్వుతూనే. కొడతానన్నట్టు చెయ్యెత్తి బెదిరించింది. ఇద్దరూ పెద్దయ్యారు. పరిణతి వచ్చింది. హద్దులు తెలుసుకునే ప్రవర్తించారు. కెరీర్‍గురించి మాట్లాడుకున్నారు. ఆమె భర్తగురించీ సంసారాన్నిగురించీ అడిగాడు. ఇంకా చాలా విషయాలు వాళ్ళ మాటల్లో దొర్లాయి.
“ఎలా వుంది లైఫ్?” అభిమానంగా అడిగాడు.
“నేను చెప్తే నీకెలా తెలుస్తుంది?” అడిగింది.
“తెలియాలంటే స్వీయానుభవం వుండాలంటావు?” అన్నాడు.
“నిజమేరా! పెళ్లికిముందు గలగల పారే జలపాతంలాంటి జీవితం పెళ్లయాక నిండునదిలా నిశ్చలంగా మారిపోతుంది. రెండూ ఒకే జలధారకి వేర్వేరు స్థితులు. పెళ్ళి చేసుకుంటేనే అనుభవం వస్తుంది. చేసేసుకో” అంది.
“చేసేసుకుంటాను” అన్నాడతను.
నిజం చెప్పాలంటే ఈ నాలుగేళ్ళూ అతను భవానీగురించిన ఏ విషయం ఎవరూ చెప్పక, తనకి తను తెలుసుకోవాలంటే గీత చేసిన హెచ్చరికవల్ల ఆగి, తల్లడిల్లిపోయాడు. ఇప్పుడింక మనసు తేలికపడింది. ఆమెకికూడా మనసుని పలచగా కప్పేసిన పొరలాంటి దు:ఖమేదో తొలగిపోయినట్టైంది. యశోదనీ, రామారావునీ గీతనీ పరామర్శ చేసాక, మిగిలినవాళ్ళనికూడా పలకరించి, వెళ్తున్నామని చెప్పకూడదుకాబట్టి చెప్పకుండా వెళ్ళిపోయారు వాళ్ళు. ఉన్నట్టుండి అదృశ్యమైపోయినట్టు అనిపించిందతనికి.
వాళ్ళు వెళ్ళాక కృష్ణని పిలిచింది నీలిమ. ఇప్పుడామెకి కూతురుకూడా. అప్పటి కొంచెం తమ్ముడు యిప్పుడింకాస్త ఎక్కువనిపిస్తున్నాడు. తండ్రి ప్రభావంలోంచీ బైటికి వచ్చాక చాలా మారింది నీలిమ.
అన్ని సదుపాయాలూ చేయించినా, ఇంట్లో ఆయనకిచ్చిన వాటా నచ్చలేదని గొడవేసుకున్నాడు కూతురితోటి. ఒకవైపు తీసుకున్న లోన్లు కొండంత కనిపిస్తుంటే పెద్దపోర్షను ఆయనకిచ్చి అద్దె వదులుకునే పరిస్థితి మాధవ్‍కి లేదు. మాధవ్ అన్న, వాళ్ళని ముంచాడని అద్దెలవాళ్ళకి చెప్పాడు. ఆయన అద్దెలవాళ్ళతో అన్నమాటలు అతనిదాకా వచ్చాయి. బాగా కోపం వచ్చింది. ఐనా నిగ్రహించుకున్నాడు.
“పెద్దాయన అన్నీ అబద్ధాలు చెప్తాడు. చెయ్యడానికి పనేమీ లేక మెదడు చెడింది. మా అన్నదములిద్దరిమధ్యా ఎలాంటి గొడవలూ లేవు. అన్నయ్య చాలా మంచివాడు రెండుసార్లు మాట్లాడితే మీకే తెలుస్తుంది. ఆయన మాటలు పట్టించుకోకండి” అని వాళ్లకి వివరణ యిచ్చుకుని సర్దిచెప్పి, అత్తగారితో,” అమ్మా! మా అమ్మమ్మకి ఆరుగురు అల్లుళ్ళు. ఎవరింటికి వెళ్తే ఆ అల్లుడే గౌరవంగా చూసుకునేవారు. మా అమ్మకి తులసి యింట్లో చక్కటి గౌరవం యిస్తారు. మా అత్తని మేము ఎలా చూసుకుంటామో, మీకూ తెలుసు. మిమ్మల్నికూడా అలా చూసుకోవాలనుకుంటే ఈయనెక్కడా ఆ విలువ నిలబెట్టుకునేలా లేడు. ఇప్పటికే చాలా జరిగింది. నావాళ్లని మీవాళ్లనుకోగలిగితే ఇక్కడుండండి. మీకు ఇంకో అభిప్రాయం ఏదేనా వుంటే మీ అమ్మాయికి చెప్పండి” అని ఖండితంగా చెప్పేసాడు. ఎటూ మాట్లాడలేక తల్లి యిరుకునపడింది. ఉంటామంటే మీకు గౌరవం యివ్వనంటున్నాడు, వెళ్తామంటే మావాళ్ళని మీరు గౌరవించట్లేదంటాడు. లిటిగెన్సీ అంటే యేంటో అర్థమైంది తనకి. బంతి ఎదుటివాళ్ల బరిలోకి విసరడమంటే ఏంటో తెలిసింది. ఒకసారి తెంచుకోవడందాకా వచ్చిందంటే తామిద్దరికీ ప్రేమలేక కాదు, అతనికే పరిమితమైన పరిధులని తను గౌరవించక. తండ్రి అపరిమితమైన జోక్యంచేత. ఆయన తనని కూతురని కాకుండా కొన్ని అసంబద్ధమైనవి అనుకుని, వాటిని సాధించడానికి ఒక వుపకరణంగా చూడటంచేత. ప్రేమ అనే పైపూత తొలగి, మైమరుపులు తగ్గి, నిజదాంపత్యంలోకి అడుగుపెట్టాక జీవితాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలని తెలిసి, అతనెదురుగానే తండ్రిని కోప్పడి,
“ఈ వయస్సులో ఎక్కడికెళ్తారు? ఇంతకన్నా మీకు ఎవరు చేస్తారు? నాన్నని అర్థంపర్థం లేకుండా మాట్లాడద్దని చెప్పలేవా నువ్వు?” అని తల్లిని దబాయించి వచ్చింది. ఇది జరిగాక తనలో చాలా మార్పొచ్చింది. మాధవ్ పెద్దవాళ్ళని ఈ వయసులో వెళ్లగొడితే తనకి బాధగా వుండేది. అతనికీ బంధువుల్లో పరువుండేదికాదు. అందుకని అతనా నిర్ణయం తీసుకోలేదు. తనకే వదిలేసాడు. సంతోషం అనేది ఒక రాజీపద్ధతి. దానికి పెద్ద ప్రయాసపడక్కర్లేదు. ఒకరి ఇష్టాల్ని మరొకరు ప్రేమతో గౌరవించుకుంటే దానినుంచీ పుట్టేదే సంతోషం. అతన్ని తను బాధపెడుతూ, తనని అతను సంతోషపెట్టట్లేదని ఆరోపించడం అర్థం లేనిది. గీత ఆమెని ప్రేమించమని అడగలేదు. వాళ్లని గౌరవించడం, గౌరవించకపోవడం తమ యిష్టానికే వదిలేసింది. తను ద్వేషించినంతమాత్రాన ఆమెకి ప్రేమ తరగలేదు, తను గౌరవించనంతమాత్రాన వాసుని వదిలేసి ఎవరూ తమవెంట రాలేదు. మాధవ్‍కీ తనకీమధ్యమాత్రం చీలిక వచ్చింది. అతను ఈ విషయాలని భావోద్వేగాలకోణంలోంచీ కాకుండా సంస్కారహీనత అనే కోణంలోంచీ చూసాడు. ఇష్టపడి చేసుకున్న పెళ్ళిలో వైఫల్యం చూసాడు. కృంగిపోయాడు. అతనికి అతనివాళ్లంతా అండగా నిలబడ్డారు. తనకి వంటరితనం చూపించారు. దాన్ని దాటుకుని అతన్ని మళ్ళీ చేరే క్రమంలో మారిందామె. రెండోపిల్ల పుట్టేదాకా ఆమెలో ఈ సంఘర్షణ, దాని వెంబడి మార్పూ, ఒకదాన్నొకటి తోసుకుంటూ తిరిగాయి. అవన్నీ ఓ కొలిక్కి వచ్చి, ఎలా బతకాలో నేర్చుకుని, తేటబడ్డ మనిషి ఇప్పుడు.
“నీ ఫ్రెండు చేసేసుకుంది, మరి నువ్వెప్పుడు చేసుకుంటావు?” అనడిగింది కృష్ణని.
“నువ్వుకూడా చేరావా వీళ్ళ లైన్లో. వరసలో నిలబడు, నీకాళ్ళకికూడా దణ్ణం పెట్టుకుంటాను. ఆవిడకి ఇరవైకీ, ఈవిడకి ఇరవైమూడుకీ అయింది. పెళ్లప్పుడు తమరికెంతో? నాకిందాకే పెళ్ళివయసొచ్చింది” అన్నాడు. నీలిమ నవ్వింది.
“భవానీ చెప్తే తెలిసిందా?” అడిగింది. అతనూ నవ్వాడు.
“తనగురించి ఏదీ తెలీక కొంచెం టెన్షనుగా వుండేదక్కా! అందుకే ఆగాను. ఇప్పుడిక పర్వాలేదు. సెటిలైపోయింది” అన్నాడు. ఆ జవాబుకి బిత్తరబోయింది నీలిమ. భవానీ పెళ్ళిలో స్థిరపడకపోతే ఇతను చెయ్యందించి చేరదీసేవాడా? ఏమిటి వీళ్ళ ఈ ప్రేమలు? బైటిపిల్లల్తోకూడా వీళ్ళింతే కమిటెడ్‍గా వుంటారనడానికి మాధవ్ పెద్ద వుదాహరణ.
నీలిమదగ్గర్నుంచీ లేచి మరోవైపుకి వెళ్తే గీతా వాసూ కనిపించారు కృష్ణకి. వెళ్ళి అక్క పక్కని కూర్చున్నాడు.
“ఏంట్రా? వెళ్లాలన్న బెంగ అప్పుడే మొదలైపోయిందా?” అతని భుజాలచుట్టూ చెయ్యేసి, దగ్గిరకి తీసుకుని నవ్వుతూ అడిగింది గీత.
“ఒక్కడివీ వుంటే అలానే వుంటుంది. అదే అక్కడ నీకోసం ఎవరో ఎదురుచూస్తుంటారనుకో, ఇక్కడ కాలు నిలవదు. నాలుగేళ్ళు ఆగమన్నావు, ఎప్పుడో ఐపోయాయి. ఇంక చేసేసుకో. చాలా సంబంధాలున్నాయి. వల్లి తోటికోడలి చెల్లెలట. అమ్మాయి బావుంటుంది. నీలాగే చదివింది. వాళ్ళు చాలాసార్లు అడిగారు. అమ్మమ్మ పెద్దావిడ, వయసు తీరి, పోయింది. ముంబైనుంచీ వచ్చేసాక యాక్టివ్‍లైఫ్‍లో లేదు. తాతయ్య లేరనే ఒక్క లోటు తప్పిస్తే జీవితాన్ని పెద్దపండుగలా గడిపింది. ఆవిడని సాగనంపడంకూడా వేడుకలానే చేస్తున్నాం. దిగులుపడక్కర్లేదు. ఎలాంటి తప్పూ వుండదు. ఈ హడావిడి అయ్యాక ఆ పిల్లని ప్రహీవాళ్ళింట్లో పరిచయం చేస్తాం. పెళ్ళిచూపులనేం కాదు. మామూలుగానే. మాట్లాడుకోండి. నచ్చితే చెప్పు, ఏడాదీ అయాక ముహూర్తాలు పెట్టుకుందాం” అన్నాడు వాసు.
“ఆ అమ్మాయి నాకు తెలుసు బావా! మా ఫ్రెండు చెల్లెలు. అతనుకూడా వల్లిద్వారా అడిగించాడు. మళ్ళీ చూడటం అక్కర్లేదు. అతని దగ్గిర ఫోన్ నెంబరు తీసుకుని నేను మాట్లాడతాలే. మాట్లాడాక మీకు చెప్తాను. ఫోటోకూడా పంపిస్తాను. అప్పుడు మీరు వెళ్ళి చూడండి” అన్నాడు కృష్ణ. బైట పనులుంటే చూసుకోవడానికి వెళ్లిపోయాడు వాసు. అక్కా తమ్ముళ్ళ కబుర్లలో చాలాసమయం గడిచింది. ఎవరో పిలిస్తే లేచి వెళ్ళింది గీత. కృష్ణకూడా లేచి ఇవతలికి వచ్చాడు.
అన్నేళ్ళ తర్వాత భవానీని చూడటం అతనికి మొదట సంతోషాన్ని కలిగించింది. కాసేపటికి క్రమంగా మనసులో ఏదో వెల్తి మొదలైంది. ఇద్దరి దారులూ పూర్తిగా చీలిపోయిన విషయం సుస్పష్టమై ఇప్పుడు కాస్త దు:ఖం కలుగుతోంది. ఆమెనింక మర్చిపోవాలని గీత కచ్చితంగా చెప్పడంచేత అతను ఆమె గురించి ఇన్నేళ్ళూ పట్టించుకోకుండా వుండిపోయాడుగానీ ఒక సందిగ్ధం వుండేది తను తప్పు చేసాడా అని. లేదని అర్థమయ్యాక బాధెందుకు కలుగుతోందో తెలీడం లేదు. తనింక ముందుకి వెళ్ళిపోవాలి. తామిద్దరికీ మధ్యనుండే బంధం మరింత బలహీనపడిపోతుంది. ఇకపై కలవడంకూడా వుండకపోవచ్చు. అక్కడ ఎప్పుడేనా కలిసినా హలో టూ హలో పరిచయం మిగులుతుందేమో! భవానీ భర్త ఎలాంటివాడో! అది తెలియాలంటే సంఘటనలు జరగాలి. తను భవానీని కలిస్తే, ఆమె తన మరదలని తెలిస్తే, తమకి పెళ్ళి జరగాల్సింది వద్దనుకున్నారని అర్థమైతే, అతని స్పందన బైటపడితే, అప్పుడు అతనిగురించి తెలిసేది. ఇవేవీ జరక్కుండా ఇద్దరూ తమవంతు కృషి తాము చేసారు. కాబట్టి అతనింక మంచివాడుగానే వుండిపోతాడు. ఇతరత్రా ఏవన్నా వున్నా, తనతో సంబంధంలేనివికాబట్టి తనకి బాధ వుండకూడదు. గట్టిగా వూపిరిపీల్చి వదిలాడు. కళ్ళు చెమర్చాయి. అరచేత్తో తుడుచుకున్నాడు.
వీణ సమస్యేంటి? ఏం జరుగుతోంది దాని అత్తవారింట్లో? పరిష్కారం తమచేతిలోనే వుందా? సంతోష్ చాలా కంగారుపడుతున్నాడు. వాడికి పూర్తిగా వీణ ధ్యాసే. స్వంతచెల్లిని ఏడాదో రెండేళ్ళో చూడకుండానూ మాట్లాడకుండానూ వుండటమంటే బాధే. తనకే ఎలానో వుంది. సంతోష్‍కి ఇంకెలా వుండాలి? అక్క తలదూర్చితే సమస్య తీరిపోతుందనుకుంటున్నాడు. స్వంత తల్లిదండ్రులు సృష్టించి పెట్టిన సమస్యని బైటివాళ్ళు తీర్చగలరా?
పిన్నికి అక్కంటే ఎందుకు అయిష్టం? ఒకమాటంది. గీతంటే అందరు మగపిల్లలమధ్య బరితెగించి తిరిగినా, వాసు చేసుకున్నాడు, వీణకి అలా ఎవరూ లేరని. తనకి కోపం వచ్చి ఆవిడతో మాట్లాడ్డం మానేసాడు. వాళ్ళింటికీ వెళ్ళేవాడు కాదు.
“అరేయ్, మీరంతా ఆవిడకి భయపడి పారిపోయారు, మేమెక్కడికి పోవాలి? సొంత అమ్మ” అన్నాడు సంతోష్ బాధపడి.
“అక్క రాదు, నువ్వూ రాకపోతే ఎలారా? మమ్మల్ని అమ్మ ఎక్కడికీ పంపదు. మాతో ఎవరు మాట్లాడతారు?” అని ఏడ్చింది వీణ. గీతకి అల్లరిలో పల్లవీ, అమాయకత్వంలో వీణా పోటీ.
తనకీ గీతకీ ఐదేళ్ళు తేడా. చాలా అల్లరి చేసేదట. వీళ్ళు పదకొండుమంది. ఒక గుంపుగా తిరుగుతూ చెయ్యగలిగినంత అల్లరి చేసేవారట. దీనిది ప్రత్యేకం. స్కూలవ్వగానే వాసూవాళ్ళింటికి వెళ్ళి ఆడుకోవడం, సెలవులొస్తే ఎవరో ఒకరింట్లో కలుసుకోవడం చేసేవారట. చాలా సంతోషంగా గడిపేవాళ్ళమని చెప్పుకుంటారు. అందరూనా? ఆరోజులు గుర్తుచేసుకుని నవ్వుకుంటారు. అందరి అనుభవాలూ ఒకేలాంటివా? కాదు.
చేతిమీద మెలికేసుకుని జడపట్టి లాగితే ఎవరికేనా చాలా నొప్పుంటుంది తెలుసా- అని అడగడం గీతకే ప్రత్యేకం.
పిన్ని ఎందుకంది అలా? ఆవిడ మామూలుగానే అందేమో, లోకరీతి చెప్పిందేమో!
గీతేమీ ఆవిడనుకున్నట్టు స్వేచ్ఛగా తిరగలేదు. చాలా హద్దుల్లో పెట్టి పెంచారు. బైట ఏం జరిగినా ఇంట్లో చెప్పడానికి తను వెంట వుండేవాడు. వసంత్ రవిబాబాయ్‍కి చేర్చేవాడు. సగంమంది పిల్లలని సుధీర్, ఇంకోసగాన్ని వాసూ మైండ్ చేసేవారు. గీత వాసు పరిధిలో వుండేది. అల్లరిదని వెయ్యికళ్ళతో చూసుకునేవాడు. సుమతి, గీత చెయ్యి వదిలిపెట్టేదికాదు. ఐనా జరిగింది. పిన్ని కరెక్టా? అంతేకదా? అక్క సమస్య ఎవరు తీర్చారు? అది పూర్తిగా తీరిపోయినట్టేనా? పాములాంటి ఆ మనిషి ఈ కుటుంబం పరిధిలోనే వుండగా అలాంటి సమస్యలు తీరతాయా?
తనకప్పుడు తొమ్మిదేళ్ళు. గీతకి పధ్నాలుగు. వాసు, మాధవ్‍లతో కలిసి సుధీర్‍ యింటికి వెళ్ళింది. వెంటనే వచ్చేసింది. ఎవరు చెప్పినా వుండలేదట. జాగ్రత్తగా చేరిందో లేదో చూసుకుని వెళ్ళారు వాసు, సుధీర్. అప్పటికే పెద్దదైందిగాబట్టి ఏమైందని అడగడానికి మొహమాటపడ్డారు. తనకి జ్వరం. ఇంట్లోనే వున్నాడు. స్కూలుకికూడా వెళ్లలేదు. అడగాలనుకున్నది అడిగేసి, తన పక్కని దుప్పటీ ముసుగేసుకుని ఏడుస్తూ పడుక్కుంది.
“ఎందుకే” అమ్మ గమనించి అడిగితే తలనొప్పంది.
“అంత వెంటనే వచ్చేసావేం? అక్కడ నిన్నెవరేనా ఏమన్నా అన్నారా? ఈ తలనొప్పేంటి? ఉన్నట్టుండి ఎందుకొచ్చింది” ఎన్నో ప్రశ్నలు అడిగింది ఆవిడ.
“నాకింత పెద్ద జడెందుకు? కత్తెర తీసుకుని కోసెయ్. తమ్ముడిలా క్రాఫ్ చేయించుకుంటాను” ఏవేవో అంది గీత.
“ఎవరేనా జడపట్టుకుని లాగారా? మగపిల్లల మోటుతనాలలాగే వుంటాయి. అందుకే నిన్ను వాళ్లమధ్యకి వెళ్ళద్దనేది. నువ్వేమో వినవు. వెళ్ళినా సుమతీవాళ్ల మధ్యని కూర్చోవాలి. లేకపోతే వాసు చెయ్యిపట్టుకుని వదలకూడదు. అయిందేదో అయింది. ఎవరితోటీ అనకు. ఇంకెప్పుడూ వెళ్లకు” అని కోప్పడింది అమ్మ. అమ్మ, మామ్మ మాట్లాడుకున్న మాటల్లో రాణా పేరు వచ్చింది. ఆ విషయం నాన్నకికూడా తెలీనివ్వలేదు. ఎందుకు దాచిపెట్టారో తెలీలేదు. క్రమంగా మరుగునపడిపోయింది. తను పూర్తిగా మర్చిపోలేదు. అది నిజమా, వూహా అనే సందిగ్ధం కొన్నాళ్ళు వెంటాడింది.
తర్వాత గీత పెళ్లైంది. ఆ వెంటనే సుమతి పెళ్ళి. మయూని ప్రెగ్నెంటు గీత. బాగా నిద్రపోయేది. మంటపానికి రాగానే నిద్రొస్తోందని విడిదిగదుల్లో ఒకగదిలోకి వెళ్ళి పడుక్కుంది. కాసేపటికి రాణా వెళ్ళాడా గదిలోకి. అప్పుడు మళ్ళీ గుర్తొచ్చింది చిన్నప్పటి ఆ సంఘటన. నొప్పితోటీ, అవమానంతోటీ విలవిల్లాడుతున్న పధ్నాలుగేళ్ళపిల్ల రూపం కళ్ళముందు కదిలింది.
వీడు అక్కని మళ్ళీ జడపట్టుకుని గుంజుతాడా- చాలా భయం చేసింది. తను లేచి వెళ్లబోతుంటే పెద్దమామయ్య వెళ్ళి వాడిని ఇవతలికి పంపించారు. తల్లినడిగాడు, ఆరోజున ఎవరలా చేసారో నీకు తెలీదా, విషయం నలుగుర్లో పెట్టి ఎందుకు నిలదియ్యలేదని.
అలా బైటపడితే అది రాణాకి పేరుపడేది, ఇంకెవరూ చేసుకునేవారు కాదు, వాడికే ఇచ్చి చేయాల్సి వచ్చేదని ఆవిడ జవాబు.
తన నోరు మూతపడింది. అర్థంకాని అసంబద్ధత.
మహీని భర్త కొట్టాడట. అతను కొడుతుంటే భయపడిందా మహీ? వీణనికూడా భర్త కొడుతున్నాడా? అందుకే కలవనివ్వట్లేదా? అదీ భయపడిపోతోందా? భవానీ భర్త ఎలాంటివాడు? పూర్తిగా తనని మర్చిపోయి బతగ్గలదా? ఒక స్నేహితుడిని, చిన్నప్పట్నుంచీ ఏకప్రాణంగా బతికినవాడిని చూసినా ఏ అనుబంధం లేనట్టు వుండటం సాధ్యమా? అంత బలమైన భావాన్ని చంపుకోగలిగిన వ్యక్తి ఎంతమేరకి జడపదార్ధంగా మారిపోతుంది? ఈ మధ్యలోనే రాణాగాడు తిరుగుతుంటే గీత ఎంత సేఫ్‍గా వుంది? ఆడపిల్లల ఈ సమస్యలకి మూలం ఏమిటి? అనేక భావాలతో అతను వుక్కిరిబిక్కిరౌతుంటే వచ్చింది సుమతి. అతని ఆలోచనలు ఆగిపోయాయి.
“ఒక్కడివీ ఇక్కడేం చేస్తున్నావురా? నీకోసమే వెతుకుతున్నాను. పదపద. నీతో చాలా మాట్లాడాలి” అతన్ని చెయ్యిపట్టుకుని లాక్కెళ్ళిపోయింది. ఇప్పుడే వచ్చారు వాళ్ళు. ఒక్కర్తీ కూర్చుందని తల్లి పక్కని సుధీర్ వెళ్లి కూర్చుంటే, సుమతి కృష్ణకోసం వెతుక్కుంటూ ఇటొచ్చింది. మహతి, లత ఇంకోచోట సెటిలయారు. రవళి అత్తవారివైపు చుట్టాలింట్లో దిగింది. ఇంకా రాలేదు.
“నాన్నేరి?” అడిగాడు సుధీర్ తల్లిని.
“ఎక్కడో ఎవరితోటో మాట్లాడుతుంటారు. ఆయనకి ఇలాంటప్పుడేగా, నలుగురూ కలిసేది?” జవాబిచ్చి, జో, సుమ్ంత‍లగురించి అడిగింది. “సుమతి వాళ్లకి వండించి పెట్టి వచ్చింది. రాత్రెప్పుడో వస్తారట” అన్నాడు. గీతావాసులకోసం అతని చూపులు వెతుక్కున్నాయి. కనిపించలేదు. ఇల్లూ, పెరడూ అంతా విస్తరించుకుని కూర్చున్నారు అందరూను. ప్లాస్టిక్ కుర్చీలు తెప్పించి పెట్టారు. అవి పట్టుకుని తిరుగుతున్నారు కాస్త ఓపికమంతులు. పిల్లలంతా తెగ ఆడేస్తున్నారు. ముగ్గురాడబడుచులు, ముగ్గురక్కచెల్లెళ్ళు త్రిపాదనక్షత్రాల్లా తిరుగుతున్నారు.
“వాడిని వదలవేంటే, నువ్వు? మీకందరికీ ఏదైనా తలకెక్కితే దిగదేం?” సుధీర్ వీళ్ళిద్దర్నీ చూసి నవ్వుతూ అడిగాడు. కృష్ణకి చెయ్యందించి పక్కని కూర్చోబెట్టుకున్నాడు.
వాసు, సుధీర్ చిన్నప్పుడు చాలా సన్నిహితంగా వుండేవారని తెలుసు కృష్ణకి. సుమతి, గీతకూడా అలానే వుండేవారు. వీళ్ళూ వాళ్ళూ ఎందుకు గొడవపడ్డారో ఈ బేచికి పెద్దగా తెలీదు. గొడవల్ని ఎక్కడికక్కడే పరిమితం చేసుకోవడంతో, కుటుంబం మొత్తంలో చీలిక రావడం, నువ్వు వాళ్లతో మాట్లాడకు, వీళ్ళతో మాట్లాడకు అని చెప్పడం వుండదు. ఆ కారణాన్నే గీతతో నీలిమ పెట్టుకున్న గొడవకూడా బైటికి రాలేదు. అలాగని గీత సర్దుకోలేదు. నీలిమకి ఆమె అగ్నిజ్వాలే. అత్తగారినీ, మాధవ్‍నీ అంటించి వదిలిపెట్టిందనుకుంటుంది. ప్రహ్లాద్, వసంత్‍ల ప్రవర్తనలోకూడా మార్పొచ్చింది.
భవానీకోసం ముంబై వెళ్ళొచ్చాక నీలిమకీ, గీతకీ మధ్య గొడవ జరిగిందని చూచాయగా తెలిసింది కృష్ణకి.
“వెళ్ళేముందు ఎందుకు చెప్పలేదు? ఆగిపోయేవాడిని” అడిగాడు తల్లిని.
“గీతావాళ్ళింట్లో మాధవ్‍, తులసితోసహా అందరూ నీలిమని నిలవరించి కట్టడిచేస్తున్నారు. అదాపిల్ల మనసులో అక్కమీద కక్ష నింపకూడదు. అందుకే అత్తకి చెప్పి, ఏమీ తెలీనట్టు నీకిచ్చి చీర పంపాను. వైమనస్యం వుండకూడదని వెళ్ళేముందు నీకు ఇవన్నీ చెప్పలేదు. నీవంతు నువ్వు నిర్వర్తించి వచ్చావు. అంతే” అంది తల్లి. ఇలాంటి రాజకీయాలుకూడా వుంటాయని తెలీదు నీలిమకి.
“ఏరా, నాకొడుక్కి నువ్వు మేనమామవి కావా?” అని, కొడుకు పుట్టాక మాధవ్ నిలదీసాడని యిక్కడ లేకపోయినా వాళ్ళ పిల్లలిద్దరికీ మేనమామ పట్టింపులన్నీ చేసాడు. అన్నప్రాశన గిన్నెలూ, పుట్టువెంట్రుకలకి చిన్నచిన్న అందమైన కత్తెర్లూ పంపించాడు. ఫోన్లో మాట్లాడినప్పుడు పిల్లలమీద ప్రేమ కురిపిస్తాడు. నీలిమమీద లోలోపల చిన్నకోపరేఖ వుంది కృష్ణ మనసులో. దాన్ని అలాగే దాచుకున్నాడు. జ్వలింపనివ్వలేదు.
“ఇందాకా మీ మామయ్య భార్యా, కూతురూ వచ్చారు. నీకు కలిసారా? మేం కారెక్కుతుంటే వాళ్ళొచ్చారు. అప్పట్లో మీకిద్దరికీ అనుకున్నారుకదరా, ఎందుకు చేసుకోలేదు?” ఆరాగా అడిగింది సుమతి.
“మామయ్యకూతురైనంతమాత్రాన చేసేసుకోవాలా?” నవ్వి అడిగాడు కృష్ణ .
“మీ అక్క చేసుకుందికదరా?”
“ఐతే? లోకంలో వున్నవాళ్లంతా చేసేసుకోవాలా? తెలుగుసినిమాలు చూసి మీరంతా బాగా చెడిపోతున్నారమ్మా! కాస్త తగ్గించు చూడ్డం”
“వీళ్ళుకూడా సినిమాలు చూసే చెడిపోయారా ఏంటి?”
“మీకు అక్కా, బావా చిన్నప్పట్నుంచీ చూపించింది సినిమా కాదా?”
“మూకీ చూపించార్లే”
కృష్ణ నవ్వేసాడు. “ఏదో ఒకటైతే చూసావుకదా? మామధ్య అలాంటిదేం లేదు. వరసకాబట్టి కేజువల్‍గా అడిగారు. అంతే. ఐనా ఇంకెందుకు ఆ విషయం? భవానీ పెళ్ళైపోయింది. వచ్చేయేడు నాపెళ్ళిలో మనందరం కలుసుకుందాం. సరేనా?” అని, “నువ్వుకూడా వెళ్ళి నీలిమ పక్కని వరసలో నిలబడు. కాళ్ళకి దణ్ణం పెట్టుకుంటాను. మీ పెళ్ళప్పుడు జోకి ఎన్నేళ్ళే? ఖర్మ. మీ ఆడమళయాళం పోలికల్తో చచ్చిపోతున్నాను” అన్నాడు నవ్వుతూనే.
లేచి తులసీవాళ్ళదగ్గిరకి వెళ్ళాడు. అక్కడ రెండు త్రిపాదనక్షత్రాలమధ్య ఇరుక్కుపోయాడు.
సుమతి, సుధీర్‍వైపు చూసింది.
“ఇంకా ఎంతకాలం నిన్ను నువ్వు మభ్యపెట్టుకుంటావు సుధీర్? ఏం సాధిద్దామని? ఒక అబద్ధాన్ని నమ్ముతూ, దానికి నీ సంతోషాన్నీ అమ్మ గౌరవాన్నీ, విలువనీ తాకట్టుపెట్టేసావు. వాళ్ల ప్రేమ నిజం. అందరూ చెప్తున్నారు. చాలా మామూలుగా చెప్పేస్తున్నారు. ఇద్దర్నీ ఒక్కసారి చూడు, ఎంత లైవ్లీగా వుంటారో!” లోగొంతుకతో అంది.
“రాజీపడ్డానుకదే? వదిన సంతోషంగానే వుంది”
“నువ్వు?’
“ఇలా ఎవరూ అఫర్మేషన్లు ఇచ్చుకోరు” చిన్నగా నవ్వి అన్నాడు.
“నీలాంటి మొద్దుబుర్రకి తప్పదు. ఎవరో ఒకరు గుర్తుచేసి ఇప్పిస్తూ వుండాలి. ఇదివరకటిమీద నయంలే. సంతోషం” అంటూ ఆమెకూడా నవ్వింది. వాళ్ళ సంభాషణ విని నిట్టూర్చింది ప్రమీల.
వాసు పనులు కానిచ్చుకుని తిరిగొచ్చి, సుధీర్ని వెతుక్కుంటూ వచ్చాడు. సుమతికూడా ఏ కబుర్లగుంపుకో చిక్కుకుపోగా తల్లీకొడుకులిద్దరే కూర్చుని వున్నారు. ఆవిడ తూర్పుకి చూస్తుంటే ఈయన ఉత్తరానికి చూస్తున్నాడు. గట్టిగా నిశ్వసించాడు. బాగా కోపం వచ్చింది.
“అరేయ్, అలా తిరిగొద్దాం. మళ్ళీ ఎప్పుడు దొరుకుతావో!” అన్నాడు అతని చెయ్యందుకుని. సుధీర్ లేచాడు. ఇద్దరూ ఇవతలికి వచ్చాడు.
“రివర్‍సైడు వెళ్దాం. బైకుమీదా? కారు తీయనా? ఆరుబైట నీకు బానే వుంటుందా? ఎలర్జీలు, దగ్గులూ, తుమ్ములూ వుండవుకదా?” అడిగాడు.
“నేనూ ఇక్కడ పుట్టి పెరిగినవాడినే. బైకు చాలు” అన్నాడు సుధీర్ క్లుప్తంగా. “ఆ పర్సనాలిటీ ఏంట్రా? కాస్త వొళ్ళు తగ్గించు” అన్నాడు, వాసు బైకు తీస్తుంటే దాన్నీ, అతన్నీ మార్చిమార్చి చూస్తూ.
“మరీ సన్నగా వున్నాననిపించి కాస్త లావెక్కే ప్రయత్నం చేస్తే ఇంక మన కంట్రోల్లో వుండదు. టైం పడుతుంది, తగ్గడానికి” జవాబిచ్చాడు వాసు.
తపస్వినీ నది వొడ్డు. అవంతీపురాన్ని చుట్టుకుని ఒక ఆభరణంలా వుంటుంది నది. కృష్ణపక్షపు రాత్రి. పైన నక్షత్రాలు మెరుస్తున్నాయి. అందులో కొన్ని కిందికి దిగి నదీవిహారానికి బయల్దేరినట్టు వరసదీపాలు వెలుగుతున్న పడవొకటి దూరాన్న కదులుతోంది. ఒకప్పుడైతే సాయంత్రం అవగానే జనంతో కిటకిట్లాడేది. ఇప్పుడు చదువుల్లో మార్పులొచ్చి పిల్లలు, ఆడామగా అందరికీ వుద్యోగాలొచ్చి పెద్దవాళ్ళు, టీవీలకి అతుక్కుపోయి జమిలిగా అందరూ రావడం మానేసారు. ఒకళ్ళూ యిద్దరూ ఎవరేనా వచ్చినా నైట్ పెట్రోలింగ్ స్టాఫ్ తొమ్మిది దాటితే వుండనివ్వట్లేదు. కాస్త రోడ్డు దిగి బైక్ పార్క్ చేసి, ఇద్దరూ ఇసుకలో నడవడం మొదలుపెట్టారు.
సుధీర్ తనతో ఎందుకు మాట్లాడటం మానేసాడో వూహించలేనంత అమాయకుడు కాదు వాసు. చాలా సున్నితమైన విషయం అది. అందుకే తనూ దూరంగా వుండిపోయాడు. ఉద్వేగాలు చల్లబడి సుధీర్ మామూలుజీవితంలో పడేదాకా ఓపిగ్గా వేచి చూసాడు. చిన్నప్పటి స్నేహం, అన్నదమ్ములమన్న స్పృహ పల్చటి మబ్బుతెరల్లా జరిగిన సంఘటనమీద కమ్ముకుని, క్రోధావేశాలు చోటుచేసుకోకుండా నియంత్రించాయి. ఇద్దరూ ఎవరికివారే ఆ సమస్యని ముట్టుకోకుండా పక్కనుంచీ వెళ్తూ దాన్ని బలహీనపరిచారు. సుధీర్ తన పాతనవ్వుతో ఆ స్పర్థకి తెరదించేసాడు. జరిగినదానికి చిన్న వివరణ యివ్వాల్సిన బాధ్యత తనమీద వుందనుకున్నాడు వాసు. అందుకే తీసుకొచ్చాడు.
“ఎన్నోరోజులైందికదా, నీతో చాలా మాట్లాడాలనిపిస్తోంది. ఇదివరకైతే నేను పక్కని కూర్చోగానే లేచి వెళ్ళిపోయేవాడివి. వీడితో మాట్లాడేదేంటని నాకూ కోపం వచ్చేది. ఇప్పుడిద్దరం ఆ స్టేజి దాటినట్టేకదా?” అన్నాడు వాసు.
“కోపమేం లేదురా! ఏదో ఫ్రస్ట్రేషన్” ఇబ్బందిగా జవాబిచ్చాడు సుధీర్. ఎప్పుడో చిన్నప్పుడు కూర్చున్న బండరాళ్ళని వెతుక్కుని వాటిమీద కూర్చున్నారు. చీకటి లేకపోతే వాటిమీద పిల్లలెందరో చెక్కిన పేర్లమధ్య వీళ్ళవీ కనిపించేవి.
“థేంక్సె లాట్. మళ్ళీ యిక్కడికొచ్చి ఈ రాతిమీద కూర్చుంటానని అనుకోలేదు. లవబుల్ మెమరీ” అన్నాడు సుధీర్. ఇద్దరికీ కలిపి సెల్ఫీ తీసాడు.
“లేటెస్టా?” అడిగాడు వాసు అతని ఫోన్ గురించి. సెల్‍ఫోన్ మార్కెట్లు ఇప్పుడప్పుడే ఇక్కడకూడా వూపందుకుంటున్నాయి. ఏదైనా యూయస్ టెక్నాలజీ ఇక్కడికి రావటానికి కొంచెం టైమ్ పడుతుంది.
“ఫ్రంట్ కెమేరా వుంది. ఫ్లాష్ వుంది. కెమేరాలు పక్కకి పడ్డట్టేనేమో! ఇప్పటికే చాలా మారిపోయింది. ముందుముందు ప్రపంచమంతా అరచేతిలో ఇమిడిపోతుందంటున్నారు. కంప్యూటర్లలో చేసుకునేవన్నీ ఫోన్లలో చేయచ్చట. డెస్క్‌టాప్ కంప్యుటర్లు తగ్గిపోతున్నాయి. యూత్ అంతా లాప్‍టాప్‍లు వాడుతున్నారు. వ్యాస్‍కి ఎక్కువ తెలుసు నాకన్నా. రమకి చాలా ఆసక్తి. వాళ్ళ చెల్లీ, మరిదీ అన్నీ చెప్తారు” అన్నాడు. భార్యగురించి వాసుతో చెప్పడం తమాషాగా అనిపించింది.
“పిల్లలు నేర్చుకుంటారని ఇంట్లో డెస్క్‌టాప్ కొన్నాం. ఇద్దరం ఆఫీసుపని తెచ్చుకుని చేసుకుంటాం. ఆఫీసుల్ని కంప్యూటరైజ్ చేసారుగానీ, కావలిసినన్ని సిస్టమ్స్ వుండవు. ఒకరితర్వాత ఒకరు చేసుకోవాలి. ఒకసారి అలవాటుపడ్డాక ఇంక చేత్తో చెయ్యాలనిపించదు. అందులోనూ తనది బ్రహ్మరాత. రాసింది తనకేనా అర్థమౌతుందో లేదో తెలీదు”
సుధీర్ చిన్నగా నవ్వాడు.
“ఇంక లైట్లకిందికి వెళ్దాం. ఇంత చీకట్లో దేనికి? నీతో కలిసి ఇక్కడికి రావాలనిపించింది. చీకటి పడకపోతే బావుండేది” అన్నాడు వాసు. సుధీర్ కూడ లేచి నిలబడి, వడ్డుని చెప్పులు విడిచి నీళ్ళలో కాళ్ళు పెట్టాడు. పాదాలని చల్లగా తాకిన నీటిస్పర్శ వళ్లంతా పాకి, ఒక అనిర్వచనీయమైన సుఖాన్ని అందించింది. దాన్ని ఆస్వాదిస్తూ అలానే నిలబడ్డాడు. వాసు నెమ్మదిగా నడక మొదలుపెడితే తనూ ఇవతలికి వచ్చి, అతన్ని అనుసరించాడు. ఇద్దరూ బైక్ పార్కుచేసినచోటికి వచ్చి, అక్కడికి కాస్త దూరంలో వున్న సిమెంటు బెంచిమీద కూర్చున్నారు. రోడ్డుకి అటువైపు కోట కనిపిస్తోంది. మూసేసి వుంది.
“ఇప్పుడక్కడ పెద్దగా యాక్టివిటీసేం లేవు. రాజకుటుంబంవాళ్ళుకూడా తరాలు మారినకొద్దీ దూరం జరిగిపోతున్నారు. రాజభరణాలూ, గన్‍సాల్యూట్స్ వుంటే ఆ గౌరవాన్ని నిలబెట్టుకునే ప్రయత్నమన్నా చేస్తారు. అవంతీపురం ఈజ్ డైయింగ్ సుధీర్. ఒకొక్కసారి బాధనిపిస్తుంది. మా యింటినీ, అందులోని మమ్మల్నీ మేం చూసుకుంటే గతంలో బతుకుతున్నామేమో అనిపిస్తుంది ఒక్కొక్కసారి. గీత వప్పుకోదు. మన జీవితంలోని ఫేజెసే చుట్టూ వుండే పరిసరాల్లో ప్రతిబింబిస్తాయంటుంది. కొత్తగా పుట్టిన పిల్లలకి ఈ వూరూ, మనుషులూ ఇలానే పరిచయమౌతారు, ఇలానే నచ్చుతారు. పెరిగే క్రమంలో వాళ్ళూ మనలానే బాధపడ్డం మొదలుపెడతారనేది ఆవిడ అమూల్యాభిప్రాయం. నిజమే కావచ్చు” అన్నాడు వాసు. అతని నోటమ్మట గీతగురించి వింటుంటేకూడా కొత్తగా అనిపించింది. తనకి తెలిసిన గీత కాదు. మూడున్నరపదుల దగ్గర్లో వున్న, పరిణతి చెందిన, కొన్ని అనుభవాలు పొంది, వాటికోసం మనోవైశాల్యాన్ని విస్తరించుకున్న గీత.
“ఎక్కడున్నా ఈ వెతుకులాట తప్పట్లేదురా! ఏదో పోగొట్టుకుంటున్నామని అనిపిస్తోందిగానీ, అదేంటో తెలీడంలేదు. అమ్మావాళ్లంతాకూడా మన ఈ స్టేజిలన్నీ దాటి వచ్చారు. వాళ్ళెవరికీ లేని ఈ ఆలోచనలు మనకి ఎందుకొస్తున్నాయి? అంతర్నిహితంగా వుండే చైతన్యధార జాగృతమౌతోందా మన తరంలో? అక్కడికి వెళ్ళి చాలా డబ్బు సంపాదించుకుని, విలాసవంతంగా బతుకుతున్నా ఎప్పుడో తట్టి లేపినట్టు ఈ ఆలోచన తప్పట్లేదు. సుమతీ అంటుంది”
“రమా, పిల్లలూ ఎలా వున్నారు? తీసుకురావలిసింది”
“నేనంటే వున్నపళంగా బయల్దేరేసాను. అందరం కలిసి రావడమంటే ఆఖరిచూపులు అందేవికావు. అంత పెద్దావిడ, ఎంతోకాలం వుండదని తెలిసినా గుర్తించడానికి మనసొప్పదు. ఆవిడ్ని తీసుకెళ్ళి అన్నీ చూపించాలని ఎన్నోసార్లనుకున్నాను. ఎప్పటికప్పుడు ఏవో కారణాలు చెప్పేది. జీవితపు చివరిదశలో వున్న తను అందరికీ దూరంగా అక్కడ చచ్చిపోతుందేమోనని భయపడేది. అమ్మా నాన్నాకూడా అంతే. ఇక్కడందరూ వుండగా అక్కడికొచ్చి మేమేం చెయ్యాలని అడుగుతారు. సుమతినీ దాని పిల్లల్నీ వదిలిపెట్టి వుండలేరు. నా స్థానంలోకి జో వచ్చేసాడు. అంతా కలిసి నన్ను బైటికి పంపేసారు” కినుగ్గా అన్నాడు సుధీర్. “తిరిగి రావద్దని ఎవరూ అనలేదుగా?” అన్నాడు వాసు. ఇద్దరిమధ్యా మౌనం చోటుచేసుకుంది కాసేపు.
“నిన్నూ, మీ అమ్మనీ, చెల్లినీ, తమ్ముణ్ణీ అందర్నీ చితక్కొట్టేద్దామనుకుంటున్నాను” అన్నాడు వాసు వున్నట్టుండి. ఫక్కుమని నవ్వాడు సుధీర్. అదే వాసు, అవే మాటలు.
“అందర్నీనా? ఒక్కసారేనా? ఇన్స్టాల్‍మెంట్స్‌లోనా? దేనికిరా?” అడిగాడు.
“అసలేమనుకుంటున్నార్రా, నాగురించి? ఆమ్మ అడిగిన కట్నం ఇవ్వలేక, వాళ్ళివ్వగలిగినదానికి అందుబాటులో వున్నానని గీత నన్ను చేసుకుందనా? ఇదేమైనా మార్కెటా? నేనంత బేవార్సు కేండిడేటునా? లేకపోతే నేనేదో దయతలిచి తనని చేసుకున్నాననా? కోపం రావల్సింది మాకిద్దరికీ కదా?”
“అరేయ్, అరేయ్, అదేం దెబ్బలాటరా? అలా ఎందుకనుకుంటాం? నీకేం తక్కువ? ఆరడుగుల అందగాడివని, వలచీ వలపించీ చేసుకుంది గీత. తనుమాత్రం? ఒక్కగానొక్క కూతురని ఘనంగా పెళ్ళిచేసి పంపాడు మామయ్య” అన్నాడు సుధీర్ కంగారుగా.
“కదా? ఆ విషయం తెలీక అమ్మలా అడిగింది, పొరపాటే అని ఒక్కళ్ళేనా తప్పొప్పుకున్నారా? అందుకే వరసపెట్టి అందర్నీ చితక్కొడతానన్నది. మా ప్రేమని గౌరవించాలికదా? ఎంతసేపూ ఆమ్మలా అంది, గీత యిలా అందనే గొడవ. ఇంకెంతకాలం?” అన్నాడు వాసు.
“అసలు నువ్వేంట్రా, అంత చిన్నవయసులో ప్రేమలేంటి? పెళ్లప్పటికి తనకి ఇరవై దాటినట్టున్నాయి. అందులో ఆరేళ్ళు మీమధ్య మాటలే లేవు. ఎప్పుడు ప్రేమించుకున్నారు, ఎప్పుడు చెప్పుకున్నారు? మేథావులురా, ఇద్దరూను. పైకసలు ఏమీ తెలీనట్టే వుండేవారు. మాట్లాడుకోవడంకూడా ఆపేసి, మీరే అంత రహస్యంగా దాచుకుంటే మిగతావాళ్ళకెలా తెలుస్తుంది?” అడిగాడు సుధీర్ తనని తను కూడదీసుకుంటూ. వాసు మాటలు మెత్తమెత్తటి దూదిమేఘంలాంటి సంతోషాన్ని నింపుతుంటే మనసు తేలికపడుతున్నట్టనిపించింది. ఇంత చిన్నవిషయం తనకెందుకు తెలీలేదు? సుమతి, సుమంత్ ఎంత చెప్పినా అర్థం చేసుకోనివాడు, వీడితో కలిసి ఒకసారి మనసారా నవ్వుకోగానే ఇలా మారిపోయాడేంటి తనని, ఆశ్చర్యంగా అనిపించింది.
“మీరిద్దరూ చాలా క్లోజ్‍గా వుండేవారు, ఎందుకు మాట్లాడుకోవట్లేదని ఇంటాబైటా చాలామంది అడిగారు సుధీర్! ఏవైనా వుంటే ఇద్దరం చెప్పుకుని రిసాల్వ్ చేసుకోవచ్చు. మనమధ్య కమ్యూనికేషన్ ఉన్నట్టుండి ఆగిపోయింది. చెప్పాల్సినవీ, అడగాల్సినవీ చాలా వుండిపోయాయి. అవయ్యాక మనం మాటలు కొనసాగించచ్చు, లేదా వెనకటిలాగే వుండిపోవచ్చు. కానీ మాట్లాడుకోవాలి. ఆమ్మ ఏదో అందని నువ్వు అలిగి నాతో మాటలు మానెయ్యడం చాలా అసహజంగా వుంది. నువ్వుకూడా గీతగురించి నాలానే అనుకున్నావేమోననే అనుమానం వస్తుంటుంది ఒక్కోసారి. అందుకేనా నామీద కోపం అని సందేహం. కానీ ఎంతకాలం? ఈపాటికి అన్నీ సర్దుకుపోవాలికదా? అనుకోవడం వేరు, ప్రేమ వేరు, తదనంతర అనుభవాలు వేరు. చాలాదూరం వచ్చేసాం. ఇంక వెనక్కి తిరిగి రాలేనంత దూరం” అన్నాడు వాసు నెమ్మదిగా.
సుధీర్ వులిక్కిపడ్డాడు. మనుషులూ, ప్రవర్తనా ఇంత తేలిగ్గా అర్థమైపోతాయా? రమకికూడానా? నీ భార్యని నేనూ ప్రేమించానని వాసుకి చెప్పగలడా? తమ్ముడి భార్యని ప్రేమిస్తూ నీతో కాపురం చేస్తున్నానని రమకి చెప్పగలడా? ఆ ఆలోచనలు నెమ్మదిగా సంస్కారపు తెరవెనక్కి వెళ్ళిపోయాయి. వివేకం మేల్కొంది.
“అలాంటిదేం లేదు వాసూ! నాకా ఆలోచనకూడా రాలేదు. నేనప్పటికి ఇంకా సెటిలవ్వలేదు. బైటికి మేం చెప్పుకోలేదుగానీ, అమ్మానాన్నలిద్దరి జీతాలున్నా మా ఆర్థికపరిస్థితి అస్సలు బాలేదు. బేంకుల్లోనూ, బైటా చాలా లోన్లుండేవి. మగపిల్లలం మామాట అలా వుంచు, చెల్లి భవిష్యత్తేమిటో అర్థమయేదికాదు. ఎమ్మే చదివింది. రిసెర్చి చెయ్యమన్నారు నాన్న. దాంతో వచ్చే లాభం ఏమిటి? ప్రొఫెసరు వుద్యోగం వచ్చేస్తుందా? రాదు. దాని పెళ్ళి వాయిదావెయ్యడానికి అలా అంటున్నారేమోననికూడా అనిపించిన క్షణాలున్నాయి. మీపెళ్ళి నన్ను గట్టిగా తట్టిలేపింది. వెంటనే జో సంబంధం రావడం, దాని పెళ్ళి చెయ్యడం జరిగాయి. తర్వాతకూడా అన్నీ ఓ కొలిక్కి తీసుకురావడానికి చాలా టైం పట్టింది. అంతా అస్తవ్యస్తంగా చాలా చికాగ్గా వుండేది. ఏ కోపం ఎంత వున్నా, అమ్మానాన్నల్ని అలా అద్దెయింట్లో చూడలేకపోయాను. ఇల్లుకొన్నాం. పెళ్ళికి ఇంకో రెండుమూడేళ్ళు ఆగాలనుకున్నాను. ఈలోగా సుమంత్ విషయం ముందుకి వచ్చింది. నువ్వు చేసుకోకపోతే వాడెలా చేసుకుంటాడని గీతే అడిగింది. మిగతావన్నీ ఆలోచించే తీరెకెక్కడిది? ఇటు చూస్తే ఈవిడో తెలివితక్కువ మాట అనేసి కూర్చుంది. అదో ముద్రలా పడిపోయింది. మరోపక్కని ఎంతో ప్లాన్డ్‌గా అన్నీ చేసుకుంటున్న నిన్ను చూస్తే నీపక్కని నిలబడే అర్హతకూడా లేదనిపించేది. పిల్లల్ని పైకి తీసుకురావాలి, పెద్ద చదువులు చదివించాలన్న ఆలోచన మంచిదే. కానీ ముగ్గురు పిల్లల్ని ఒకేసారి చదివించడం వాళ్లకి శక్తికి మించిపోయింది. ఆ విషయం వాళ్లంతట వాళ్ళు వప్పుకోలేకపోయారు. వప్పించాల్సి వచ్చింది” అన్నాడు వెంటనే సర్దుకుని.
“ఇంత వివరంగా తెలీవు. నాకూ కాస్త కోపంగానే వుండేది” అన్నాడు వాసు.
“సారీరా! అంత ఆలోచించలేదు”
ఇద్దరూ మనసుల్లో వున్న భావాలేవీ బైటపడకుండా జాగ్రత్తగానే మాట్లాడుతున్నారు.
“కథల్లోనూ, సినిమాల్లోనూ చూపించినట్టు ప్రేమ అనేదాన్ని నిజజీవితంలో వివరించి చెప్పడం చాలా కష్టం” అన్నాడు వాసు.
“మీమధ్య గొడవేంటి వాసూ, అసలు? ఎందుకు మాటలాపేసారు? మేమందరం ఎన్నోసార్లు అడిగాం గీతని. ఏమీ చెప్పలేదు. అసలే తిక్కది. మాతోకూడా మాట్లాడటం మానేస్తుందని భయపడి వూరుకున్నాం”
“అదొక భయంకరమైన ఫేజ్ తనకి. నాక్కూడా పెళ్లయాకే చెప్పింది” అన్నాడు వాసు. “ప్రేమంటే ఏమిటని కొంతమందీ, అంత చిన్నప్పట్నుంచీ తెలిసిన అమ్మాయితో ప్రేమేమిటని ఇంకొంతమందీ అడిగారు నన్ను. ప్రేమ పుట్టడానికి షరతులు వుంటాయా? తల్లిదండ్రులమీద, తోబుట్టువులమీద, స్నేహితులమీద ఇంకా ఎందరిమీదో ఎన్నోరకాల ప్రేమలు పుడతాయి. ఈ వొక్కప్రేమ మాత్రం ప్రశ్నలమీద ప్రశ్నలు అడుగుతూ వుంటుంది. నేను ప్రేమనేనా, ఒక భావననా, నిజాన్నా, అబద్దాన్నా, ఎప్పటికీ వుంటానా, మధ్యలో కరిగిపోతానా ఇలా ఎన్నో. చిన్నప్పట్నుంచీ మాకున్న యిష్టం ఈ ప్రశ్నలకి జవాబులు వెతుక్కుంటూ, రూపాంతరం చెందుతూ అలా ముందుకి వెళ్ళిపోయింది.
మాయింటికి వస్తూ వెళ్తూ వుండేది. నా గదిలోకి వచ్చి కుర్చుని మాట్లాడేది. మాధవ్‍కి అంత కుదురుండేదికాదు. అందుకని తన మాటలన్నీ నాతోనే. ఏవేవో చెప్పేది. పౌరాణిక- జానపద సినిమాలూ చూసి మగపిల్లలం బొమ్మకత్తులూ, బాణాలూ వేసుకుని ఆ పాత్రల్లో లీనమై తిరిగాం చూడు, అలా తను విన్న కథల్లో తనూ లీనమైపోయేది. ఆ పాత్రలు తనే అనుకునేది. ఆ వూహల్లో ఏం చేసినా అందులో నేనే తనకి తోడు. రవళి, మహీ, వసంత్ ఇంకెవరూ కాదు. నక్షత్రాలు కోసుకుని బుట్టలో వేసుకున్నా, సైకిలు తొక్కుతూ భూమి అంచుదాకా వెళ్లిపోయినా, వానధారలు పట్టుకుని పైకి ఆకాశంలోకి వెళ్ళిపోయి కాసేపు అక్కడ ఆడుకుని వచ్చినా తనకి తోడుగా నేనే. రష్యన్ కథల పుస్తకాలు చదివేవాళ్లం, గుర్తుందా? మళ్ళీ ఆ పిల్లల్లో తన వెనక పుట్టగొడుగులు ఏరి యిస్తూ, బెరీస్ వెతికిస్తూ నేనే వుండేవాడిని. నేను తనకన్నా బాగా పెద్దని అర్థమయేదికాదు. వసంత్‍నో రవళినో వెంట తీసుకెళ్ళమంటే వప్పుకునేది కాదు. ఆ ఫేజ్‍లోంచీ బైటికొచ్చింది.
క్లాసుపుస్తకాల్లో కథలు మార్చేసి చెప్పేది.
నీకు తోచినవి రాస్తే మార్కులు వెయ్యరు. మేమంతా పై తరగతులకి వెళ్ళిపోతాం, నువ్వెప్పుడూ ఇదే క్లాసులో వుంటావు. కథలు వేరు, పాఠాలు వేరు- అని బాగా అర్థమయ్యేలా చెప్తే గ్రహించింది.
సైకిలు పెద్దఫాంటసీ తనకి. తొక్కడం నేర్పమనేది. అప్పటికింకా ఆడపిల్లలకి సైకిలు కొనలేదు మనింట్లో. పడి దెబ్బలు తగిలించుకుంటారని భయపడేవారు. మాయింటికి వచ్చినప్పుడు సైకిలుమీద ఎక్కించుకుని వాళ్ళింటికి తీసుకెళ్లమని అడిగేది. కేరేజిమీద కూర్చోమనడానికి భయం, వెనకచక్రంలో కాలు పెట్టేస్తుందని. రాడ్‍మీద ఎక్కించుకునేవాడిని. హార్మోనల్ రష్ మొదలయ్యేది. చాలా కష్టంగా వుండేది అలా తనని తీసుకెళ్ళడం. తనకింకా తెలిసేది కాదు. మాధవ్‍కూడా ఒక్కోసారి వచ్చేసి వెనక ఎక్కేవాడు. ఒకసారి ముగ్గురం వెళ్తూ లారీకింద పడబోయి తప్పించుకున్నాం. రెండిళ్ళవాళ్ళూ బాగా భయపడ్డారు. జరిగింది చిన్నవిషయం కాదు. ముగ్గురం ఒకచోట చేరి అల్లరిచేస్తున్నామని మాయింటికి రాకుండా తనని బాగా కట్టుదిట్టంచేసారు.
క్రమంగా మార్పు. చాలా మారింది. మనలోకంలోకి వచ్చేసింది. అల్లరి తగ్గింది. కథలూ, కబుర్లూ ఆగాయి. ఎప్పుడేనా గుర్తుచేసి అడిగితే సిగ్గుపడి నవ్వేసేది. నాగదిలోకి వచ్చి కూర్చునేది. మాట్లాడాలనుకున్నా ఇద్దరికీ మాటలు దొరికేవి కాదు.
అలా మీరిద్దరే విడిగా కుర్చుని మాట్లాడుకోకూడదు- అని అమ్మ రెండుమూడుసార్లు ఇద్దరికీ చెప్పింది. తను హర్టైంది.
రాణాకీ నాకూ గొడవైన పక్కరోజు మా యింటికి వచ్చి తన విషయాల్లో కలగజేసుకోవద్దని నాకు కచ్చితంగా చెప్పి వెళ్ళింది. అప్పట్నుంచీ నాతో మాట్లాడ్డం పూర్తిగా మానేసింది. మీ అందర్తో మాట్లాడుతూ నన్నెందుకు ఎవాయిడ్ చేసేదో తెలిసేది కాదు. ఎంత బతిమాలినా చెప్పలేదు. నేను వాళ్ళింటికి వెళ్లినా లేచి మౌనంగా లోపలికి వెళ్ళిపోయేది. రోజులు కాదు, సంవత్సరాలు గడుస్తున్నాయి. ఇద్దరికీ వయసు పెరిగింది. ఇప్పుడెలా మాట్లాడుతోంది తను? ఏం చెప్తోంది? ఇప్పటికీ వూహల్లో నన్ను వెంటపెట్టుకునే తిరుగుతోందా? నేనంటే యిష్టమా, కాదా? చిన్నప్పటి ఇష్టాలు మారాయా? ఎందుకు నాతో మాట్లాడదు? ఎన్నో ప్రశ్నలు నన్ను వేధించేవి. అలాగని నన్ను తను పూర్తిగా వుపేక్షించనూ లేదు. అందరం కలిసి ఎక్కడికెళ్ళినా నావెంటే వుండేది. తింటుంటే మంచినీళ్ళయేసరికి గ్లాసు దగ్గిరకి జరిపేది. వాళ్ళింటికి వెళ్లినప్పుడు నేను కూర్చుని లేచిన కుర్చీలో అలా కూర్చుండిపోయేదట. ఒక్కోసారి అకారణంగా ఏడ్చేదని కృష్ణ చెప్పాడు. ఏదేనా అడిగి తెలుసుకుందామన్నా, వాడి వయసెంత?
తన టెంతయ్యేసరికి నాకు జాబ్ వచ్చింది. టెంత్ రిజల్ట్స్ చూసి వాచీ కొనిచ్చాను. నేనేది చేసినా వాళ్ళెప్పుడూ ఆపలేదు. ఇలా చెయ్యద్దని చెప్పలేదు. మామయ్య ఎదురుగా తీసుకుని, తర్వాత కృష్ణతో పంపించేసింది.
బొమ్మలు వేసేది. చూపించమని అడిగితే కొన్ని తీసుకొచ్చి చూపించాడు కృష్ణ. మంచిహేండు. మొదట్లో పిచ్చిగీతల్లా వుండేవి, బాగా ఇంప్రూవ్‍చేసింది. నాతో తను మాట్లాడిన మాటలన్నీ ఆ బొమ్మల్లో వుండేవి. అమ్మాయి బొమ్మ బానే వుండేది, అబ్బాయిమాత్రం పొట్టి. నా హైటు కాదు. నన్ను తన ప్రపంచంలోంచీ తీసేసిందా? వసంత్‍నో రవళినో వెంట తీసుకెళ్లమని చిన్నప్పుడు అన్నట్టు ఇప్పుడంత తేలిగ్గా తీసుకోలేకపోయాను. గుండెల్ని మెలిపెట్టేసేంత బాధ. తట్టుకోలేకపోయాను.
ఈ పొట్టిబుడంకాయలెవర్రా? నా హైటు ఆరూరెండు. తెలీకపోతే అడిగి తెలుసుకోమను- అన్నాను. అదెవరో తెలుసుకోవడానికి.
ఎవరూ అంత ఎత్తుండరట. నిన్నే హైటు తగ్గించుకోమంది- అని జవాబొచ్చింది. తల పట్టుకున్నాను. రంగులు, బ్రష్షులు కొని పంపించాను. తీసుకోలేదు. బాధపడ్డాను.
తనతో మాట్లాడబోతే,
నేనిప్పుడు చెవుడు ప్రాక్టీస్ చేస్తున్నాను. నువ్వేం చెప్పినా వినపడదు- అని వెళ్లిపోయింది.
అంతకన్నా ఏదన్నా చెయ్యాలంటే రవిమామయ్య చేత్తో బెత్తం పట్టుకుని రెడీగా వుండేవాడు. ఆయన అన్నకూతుర్ని ఏదో అన్నానంటే వూరుకుంటాడా? అప్పటికే స్ట్రీట్‍ఫైట్లుకూడా చేసి వున్నాను. మనగ్రూపుతో కలిసి తిరిగినా తన నవ్వులు మనసులోంచీ రాలేదనిపించేది. పూర్తిగా మననుంచీ దూరం జరిగినట్టనిపించేది.
గీత అమ్మమ్మావాళ్ళూ బాగా పల్లెటూరివాళ్ళు. ఆవిడకి నేనంటే యిష్టం. గీతని నాకిచ్చి చెయ్యాలన్న కోరికని సూచనాప్రాయంగా తెలియబర్చేది. మనందరిమధ్యనా మనవరాలు తిరగడం ఆవిడకి నచ్చేదికాదు. గీతమీద ఫిర్యాదులన్నీ నాకు చెప్పుకునేది. ఒకరోజు ఏదో పిచ్చిపని చేస్తే ఇంట్లో తనని బాగా కోప్పడ్డారు. నాకు కంప్లెయింటు చేసిందావిడ.
మీ మనవరాలిని నాకిచ్చెయ్యండి. తీసుకెళ్లిపోతాను- అన్నాను సరదాగా. మనసులో మాట అనేసాను.
అలా వుత్తినే ఇచ్చేస్తారేంటి? అదే మాటమీద వుండు. టైము రానివ్వు- అంది ఆవిడకూడా అంతే సరదాగా. సంతోషపడిపోయింది. తప్పుపట్టుకోలేదు.
మీమామయ్య అసలా మాటే ఎత్తనివ్వడు- అని బాధపడింది.
గీత టెన్తయాక ఒకసారీ, ఇంటరయ్యాక మరోసారీ మా పెళ్ళిప్రసక్తి తెచ్చిందట ఆవిడ. ఇలాంటి ప్రతిపాదనలూ, చర్చలూ నాలుగ్గోడలమధ్య వస్తాయి. అక్కడే వుండిపోతాయి. బైటికి రావు. తర్వాత గీత చెప్తే తెలిసాయి. తన డిగ్రీ అవనిదే చెయ్యనని మామయ్య ఖచ్చితంగా చెప్పి ఆపారట. డిగ్రీ అయాక గీత జాబ్‍లో చేరింది. పెళ్ళి చెయ్యకుండా వుద్యోగంలో చేర్చాడని ఆవిడ అలిగి మామయ్యతో మాట్లాడటం మానేసింది. ఆయన డబ్బుకి కూడదీసుకోవాలి. ఆవిడకేమో చేతికొచ్చిన సంబంధం తప్పిపోతుందని భయం. అందులోనూ నన్ను మాటహద్దుమీద నిలబెట్టిందికూడా.
వాళ్ళింట్లోనూ మాయింట్లోనూ ఒకేసారి పెళ్ళిమాటలొచ్చాయి. ఇద్దరం ఒకరి పేరొకరం చెప్పాం. యాదృచ్చికంకాదు. సుధీర్! తను వాళ్ళ నాన్న యిష్టానికి వదిలెయ్యలేదు. ఎవర్ని చేసుకోవాలనుకుందో స్పష్టంగా చెప్పింది.
అంత యిష్టం వున్నదానివి నాతో ఎప్పుడూ ఎందుకనలేదని పెళ్ళయ్యాక అడిగాను. తన జవాబు పెద్ద షాకు నాకు.
మీకు డబ్బు లేదు, నిన్నెవరూ చేసుకోరని- రాణా అన్నాడట. అప్పుడు దీనికి పధ్నాలుగు, వాడికి మరో మూడు ఎక్కువ. పెళ్లంటే ఇద్దరూ ఏం అనుకున్నారో నాకు తెలీదు. వాడి మాటల్ని నమ్మేసింది. అమ్మ అన్న మాటల్ని వాడి మాటల్తో ముడిపెట్టుకుంది. నేను చేసుకోననుకుని దూరంగా వుండిపోయింది. మాట్లాడటం మానేసింది. ఆరేళ్ళు సుధీర్, తను నరకం చూసింది, నాకు చూపించింది. నాకైతే పిచ్చెక్కిపోయేది. అమ్మమ్మని ఒకసారి అడిగాను.
అంత చిన్నవయసులో ప్రేమ తెలుస్తుందా-అని.
మిగతా విషయాలు తెలీవుగానీ, ప్రేమ ఎందుకుండదు? దానికి నువ్వంటే ప్రాణం- అంది”
“వాడు అలా ఎలా అన్నాడురా?” దిగ్భ్రాంతిగా అన్నాడు సుధీర్.
“నీగురించి నువ్వు చెప్పుకోవాలిగానీ నావిషయం నువ్వెలా చెప్తావురా- అంటూ వెళ్ళి వాడితో బాగా గొడవేసుకుని వచ్చాను. తనేమో అమ్మతో గొడవేసుకుంది, వాసుతో మాట్లాడద్దని ఎందుకన్నావని.
ఇక్కడ నేనొద్దన్నానుసరే, మీయింటికి వెళ్ళద్దన్లేదు వాడిని. అక్కడ మాట్లాడచ్చుకదా, ఆ రాచవ్యవహారాలేవో- అని ఆవిడ.
నువ్వొద్దన్నాక ఎలా మాట్లాడతాను? నీకూ ఇష్టంలేదనుకున్నాను- అని గీత. రెండురోజులు అమ్మతో ఒకటే గొడవ. ఏడుపు.
నీకు తెలివితేటలు లేకపోతే నేనేం చెయ్యనే- అని ఆవిడ నవ్వడం.
అపరిపక్వతో, ఇష్టమో, ప్రేమో- ఇద్దరం ఒకరినొకరం కోరుకుని పెళ్ళిదాకా వచ్చాం. తనకి నేను తప్ప మరో ప్రపంచం లేదు. అంతకి అంతా నేను తిరిగి యిస్తున్నానా అని ప్రశ్నించుకుంటాను. ఆ ప్రశ్న ఈమధ్యే తలెత్తింది. పెద్దవుద్యోగం చెయ్యాల్సింది, ఇంకా హోదాగా వుండాల్సిందనిపిస్తుంది. తనకోసం. మీ అందరివీ మంచి పొజిషన్స్. నాకు ఈవూరు వదిలిపెట్టి వెళ్ళే అవకాశం లేదు అప్పట్లో. మాయింటి పరిస్థితులు నీకు తెలుసు. అమ్మ రోజంతా అలా ఏడుస్తూ వుండేది. అలాంటావిడ్నీ, ఆవిడమీద తమ్ముడినీ, చెల్లినీ వదిలేసి నాదారిన నేను వెళ్ళలేకపోయాను. ఆ పని చేసుంటే రాణావాళ్లమ్మలానే తను తయారయ్యేది. దొరికిన వుద్యోగంలో చేరిపోయాను” ఆగాడు వాసు.
“అలాంటి ఆలోచన నీకెందుకొచ్చిందిరా? నీకేం తక్కువ?”
“మనలో మనకి అనిపించకపోవచ్చు. మనకి మనం, మన జీవితాలకీ, మనవాళ్ళకీ మహరాజులమే. కానీ కొత్తనీరు కొట్టుకొస్తుందికదా, కుటుంబంలోకి, మన విలువని తగ్గించి చూసే కొత్తకొత్త ఆలోచనలుకూడా వస్తాయి”
“ఏదేనా కొంత మూల్యం చెల్లిస్తేనే దొరుకుతుంది వాసూ! నా విషయం చూడు, ఇంటికీ దేశానికీ దూరంగా బతుకుతున్నాను. జోకి ఫామిలీటైమ్ అనేది దొరకడం కష్టంగా వుంది. సుమంత్‍కి అంత కష్టపడి చదివిన చదువూ, ప్రాక్టీసూకన్నా, మామగారి వ్యాపారాలకి ప్రాధాన్యత యివ్వాల్సిన పరిస్థితి. నీకు డబ్బుంది, ఫామిలీటైమ్ వుంది. నీమీద ఎవరి పెత్తనం లేదు. ఉద్యోగంలో రాజీపడటం అనేది నువ్వు చేసింది”
“ఇవన్నీ నాకూ తెలుసు. కానీ తప్పుచేసి మభ్యపెట్టుకుంటున్నానా అని అనుమానం”
“తెలివెక్కువైతే ఆలోచనలు ఇలానే వుంటాయి. అతితెలివి మానేసి, ఎలాగా దానపత్రం వుందిగాబట్టి నువ్వే తననిబట్టి వెళ్ళిపో” నవ్వాడు సుధీర్. వాసుకి ఆరోజటి గీత దు:ఖం గుర్తొచ్చింది.
“ఒక ఆఫ్రికన్ నది వొడ్డుని చిన్న గుడిసె వేసుకుని, చిన్న నాటుపడవలో రోజూ చేపలు పట్టి, వాటిల్లో కొన్ని అమ్మి డబ్బు తెచ్చుకుని యిల్లు నడుపుకుంటూ ప్రశాంతంగా గడుపుతుంటాడు. పాశ్చాత్యుడొకడు అతన్ని చూసి,
ఇదేం జీవితం? మరపడవ కొనుక్కుని బోల్డన్ని చేపలుపట్టి, క్రమంగా ఫీషరీ ఇండస్ట్రీ పెట్టి, ధనవంతుడివై, పెద్దభవనం కట్టుకుని, విలాసవంతంగా గడిపి, రిటైరై ఇలాంటిచోట గుడిసె వేసుకుని వుండచ్చు- అంటాడు.
ఇప్పుడు నేను చేస్తున్నది అదేకదా- అని ఆఫ్రికన్ అడిగితే,
రెండూ ఒకటెలా ఔతాయని ప్రశ్న.
ఇప్పుడు మాయింటి విషయానికి వస్తే, మా చదువులకోసం ఇల్లమ్మారు. చదువయ్యాక నా గోల్ ఏంటంటే అమ్మానాన్నలకి మంచియిల్లు కట్టించి యివ్వడం. పైని చెప్పిన కథలోలాగే. ఇల్లమ్ముకుని చదువుకుని, మళ్ళీ యిల్లు కొనుక్కోవడం. ఈమధ్యలో ఏవేవో అనుభవాలు. అనుభవం వుండేది ఒకటే. అది నీ ఆస్వాదనలోకి వచ్చేసరికి పదిమంది ఆలోచనలు దానికి చేరతాయి. అనేక పొరలు ఏర్పడతాయి. నువ్వెలా వుండాలో , నీ యిల్లెలా వుండాలో నీకోసం చాలామంది ఆలోచించి వుంచుతారు. అప్పుడు వాటికి వివిధరూపాలు వస్తాయి. అన్నీ ఒకటెలా ఔతాయనే ప్రశ్న మొదలౌతుంది. మనిషికి ఇంక మనశ్శాంతి వుండదు. దేన్ని కోరుకోవాలి, ఒకటే ఎందుకు, అన్నీ ఎందుకు కాదు అనే వేట మొదలౌతుంది. అందుచేత అనుభవాలు మనిషికి ఎలాగా తప్పవు. అవి యిలానే వుండాలనే నిర్దేశిత మాయలో పడద్దు. నువ్వు నీలా చాలా బావున్నావు. మరొకరికి చెప్పే అవకాశం యివ్వకు”
“ఒకొక్కసారి ఆలోచిస్తే ఇదంతా కలా నిజమా అనిపిస్తుంది సుధీర్! మన చిన్నతనం, ఆటలు, దెబ్బలాటలు అన్నీ నిన్నటి జ్ఞాపకాలైపోయాయి. గీత ఒక్కర్తే నా జీవితంలో మిగిలిన బాల్యపుగుర్తు. ఎక్కడో వుండి ఇక్కడికి రావాలంటే మనసు మెలిపెట్టినట్టు వుంటుందన్నావు. నిజానికి ఇక్కడే వున్న మాకూ అలానే వుంటుంది. అందరూ మారిపోయార్రా! మారటమంటే యాజ్ లైఫ్ డిమాండ్స్. వాళ్లమధ్యని అలా తిరుగుతూ, ఆకుని అందకుండా పోకని పొందకుండా బతికేస్తున్నాం. సంపాదించుకుంటున్నాం, అన్నీ కొనుక్కుంటున్నాం, సంతోషంగానే వున్నాం. ఇంకా ఏదో కావాలనిపిస్తుంది. అదే మానవస్వభావం అనుకుంటాను” అన్నాడు వాసు.
“నువ్వింకా నయం. నేనైతే పూర్తిగా దూరమైపోయాను. పొద్దుట గీత అదే అంది, ఇంకెంతకాలం మనని మనం హోల్డ్‌చేసుకోగలమని” అన్నాడు సుధీర్.
“ఇటు నువ్విలా. అటు సుమతి గీతతో మాట్లాడేది కాదు. సుమంత్ పర్వాలేదు. గోడమీది పిల్లిలా జాగ్రత్తగా వుండేవాడు. మీరిద్దరే, భలే సాగించుకున్నారు”
“అరేయ్, మయూ గుడ్‍న్యూస్ నేనే చెప్పాను” గుర్తుచేసాడు సుధీర్.
“అందుకే క్షమించేసాం” అన్నాడు వాసు. ఇద్దరూ నవ్వుకున్నారు.
“నువ్విలా నవ్వుతుంటే చాలా బావుంటావురా సుధీర్! నీ చిన్నప్పటి ఫోటోలు చూసుకో, ఎలా నవ్వేవాడివో! రమ చూసిందా, ఎప్పుడేనా? చూసివుంటే కచ్చితంగా అడిగేది, ఈ నవ్వెక్కడ పారేసావని? దేనికిరా, కోపం? వదిలేసెయ్. నాక్కూడా రావాలికదా, మీరంతా కలిసి చేసినదానికి? వచ్చింది. పట్టించుకోను. నీతో ఇవన్నీ మాట్లాడాలని ఎన్నోసార్లు ప్రయత్నించాను. రమ చిన్నప్పుడు ఏ అల్లరి చేసిందో, ఎలాంటి మాటలు మాట్లాడిందో, ఎలాంటి పాటలు పాడిందో, ఎవరికి ఎన్ని కథలు చెప్పిందో నీకు తెలుసా?’తెలీవుకదా? ఎప్పుడేనా అడిగావా? మన జీవితంలోని అతిముఖ్యమైన వ్యక్తిగురించి మూలాలదాకా తెలుసుకుంటూ వెళ్తే మిగతా ఎన్నో విషయాలకి మనం అనవసరంగా యిచ్చే ప్రాధాన్యత తగ్గిపోతుంది” అడిగాడు వాసు.
సుధీర్ తెల్లబోయాడు. “ఇవేం ప్రశ్నలు?”
“లేకపోతే ఇద్దరు మనుషుల పరిచయాలు ఎలా పూర్తౌతాయి? భార్యాభర్తలుగా వుండటం ఒకటేకాదుకదా, ఇద్దరు వ్యక్తులు జీవితకాలం కలిసి వుండటమంటే? అదొక సమయంలో వుంటుంది. కొంతకాలం వుంటుంది. రోజంతా వుండదు. జీవితమంతా వుండదు. నాకు గీత విషయంలో అవన్నీ తెలుసు. నాగురించి తనకీ చాలా తెలుసు. రెండు జీవితాల పిల్ల అది. ఈ రెండూ ఎక్కడ కలిసిపోయి కనిపిస్తాయో, ఎక్కడ విడివిడిగా వుంటాయో నాకు తెలుసు. అదొక అద్భుతమైన అనుభవం సుధీర్. చదవని పుస్తకంమీది కుతూహలంలా ఒకసారీ, ఎప్పుడో రాసేసుకున్న పాతడైరీలోని అందమైన జ్ఞాపకంలా మరోసారీ అనిపిస్తుంది తను. అందుకే ఆరేళ్ళు మాట్లాడుకోకపోయినా, మామధ్య గేప్ రాలేదు. ఈ విషయాలు అప్పుడు తెలీక ఇద్దరం చాలా టెన్షనుపడ్డాం” అన్నాడు వాసు.
“భార్యాభర్తల అనుబంధాన్ని ఇలాకూడా పెంచుకుంటారని తెలీదు నాకు”
ఇద్దరూ చాలాసేపు మాట్లాడుకున్నారు.
“సమాజం చాలా మారిపోయింది. ఆడా మగా సరే, ఇద్దరు మగవాళ్ళుకూడ ఇలా వంటరిగా కుర్చుని మాట్లాడుకునే వీలు అక్కడుండదు. భుజాలమీద చేతులేసుకుని తిరగకూడదు. ప్రతీదీ జెనిటల్స్ దగ్గిరకి చేరిపోతుంది. సహజమైన స్నేహం, ప్రేమా, ఫీలింగ్సూ కండిషన్ ఔతూ వుంటాయి. అసహజంగా బతికేవాళ్ళ పోరాటాల్లో కొట్టుకుపోతుంటాయి. స్త్రీపురుష సంబంధాలలో ఇక్కడ వుండే సాంక్టిటీ అక్కడ ఒక్కోసారి కనిపించదు. ప్రతీదీ హక్కులపరిధిలోకి వెళ్ళిపోతుంది. అలాగని అక్కడి జీవితం బావోదని కాదు. భౌతికంగా బావుంటుంది. ఆలోచిస్తే నచ్చదు”
“ఇక్కడికీ దిగుమతౌతోంది”
“ఇంక వెళ్దాం. చాలాసేపైంది” అనుకుంటూ లేచారు.
ఒకరి చెయ్యొకరు పట్టుకుని నడవడం మొదలుపెట్టారు. ఇద్దరికీ మనసు తేలికపడింది. సుధీర్ ఇక్కడికి రాకముందు పరిస్థితులతో రాజీపడి బతుకుతూ వచ్చాడు. ఇప్పుడిక మొదలైంది వప్పుకోలు. గీత తనకోసం పుట్టలేదనే వప్పుకోలు. వాసుకూడా చెప్పవలసినదంతా చెప్పాననే అనుకున్నాడు.
వీళ్ళిద్దరూ బైక్ పార్క్ చేసి ఇంట్లో అడుగుపెట్టగానే తులసీ, సమీరా, వల్లీ ఎక్కడినుంచో వచ్చి, వాళ్ళ వెనక చేరి, అడుగుల్లో అడుగులెయ్యడం మొదలుపెట్టారు.
“వాళ్ళు ముగ్గుర్నీ చూడు, చిన్నపిల్లల్లా ఎలా చేస్తున్నారో!” అంది మాధురి ఆరోపణగా. ఇక్కడ యీ కుటుంబంలో అందరూ అనుభవించే సరదాలేవీ తాము పొందలేదన్న దుగ్ధ ఆమెని ఒకొక్కసారి పట్టుకుంటుంది. అన్నదమ్ములు లేని లోటు తెలిసిపోతూ వుంటుంది.
“అన్నలుకదా, ఆటపట్టిస్తున్నారు” అంది నీలిమ.
హఠాత్తుగా ఆగి, వెనక్కి తిరిగాడు వాసు. సమీర చెవి పట్టుకోబోతే ఆమె తప్పించుకుంది.
“ఎలా తెలిసిందిరా, మేం మీ వెనక వస్తున్నట్టు? నీ వీపుకిగానీ కళ్ళుంటాయా?” అడిగింది తులసి.
“కోతులు కిచకిచలాడుతుంటే తెలిదేమిటే?” అన్నాడు వాసు.
“అబ్బో!” అంది సమీర.
“నీకోసం గీత ఒకటే వెతుక్కుంటోంది” అంది వల్లి.
“అంత భయపెట్టారేంటే, తనని?”
“అదా?! భయపడ్డమా?! హరికీ గిరికీ భయపడరని వాళ్ళక్కచెల్లెళ్ళిదరికీ పేరుకదా?”
“నీకొక్కడికే ఆవిడ వింటుందట? చిన్నప్పట్నుంచీ చాలా విన్నాం” అడిగింది వల్లి.
“అమ్మమ్మ నిన్నేదో అందంటనే? సరిగ్గా చెప్తాడు, సుమంత్‍ని పిలవనా?” అన్నాడతను నవ్వుతూ.
“ఆడపిల్లల్ని ఏడిపిస్తే పాపమొస్తుందిరా!” అందా అమ్మాయి.
“ఆడపిల్లలేం కాదు, ఆడరౌడీలు. వీళ్ళు ముగ్గురూ కలిస్తే ఎంత గొడవచేస్తున్నారో! మేం నలుగురం చాలా బుద్ధిగా వుండేవాళ్ళం. వీళ్ళేంటి? ఎవ్వర్నీ బతకనివ్వట్లేదు. వదిన్నికదా, నాకైతే అస్సలు గౌరవం యివ్వట్లేదు” గీత అతన్ని వెతుక్కుంటూ వచ్చి ఆరోపించింది. ఐదుగురూ కలిసి నవ్వేసారు. ఆమెకి అర్థం కాలేదు.
“రాగానే చెప్పానా, వెళ్లి కనిపించమని. పాపం బెంగపెట్టేసుకుంది”
“సుధీర్ వున్నాడని ఆగాడు. లేకపోతే వీడూ వెతుక్కుంటూ వెళ్ళిపోయేవాడు. అందుకే, కృష్ణ పెళ్ళిలో అరుంధతీ నక్షత్రానికి బదులు మిమ్మల్ని చూపిస్తే సరిపోతుందని ఒక నిర్ణయం తీసుకున్నాం”
“ఒకరితో ఐతే మాట్లాడచ్చు. ముగ్గురు రాకాసుల్తో నేనెక్కడ చాలతాను? వీళ్ళకా ముగ్గురు వదినగార్లే సరి” అని, వాసుకేసి చూసి, “నుదుటిమీద ఆ బొడిపేంటి? అంత హైటూ వేసుకుని ఎక్కడకి దూసుకెళ్ళావు? కాస్త తలదించుకుని వెళ్ళచ్చుగా? కిరీటాలేం పడిపోవు. మయూకూడా నీలానే తయారౌతాడేమో! కొత్తటెన్షను నాకు” అంది గీత.
“హైటు తగ్గించుకొమ్మని నాకు సలహా యిచ్చావుగా, నీ కొడుక్కి తగ్గించి చూపించు” కళ్ళెగరేసాడు వాసు.
అతన్ని ఎగాదిగా చూసింది గీత. “ఎత్తు కిందినుంచి పైకే పెరుగుతారుకదా? రేపట్నుంచీ రోజూ గంటసేపు వాడిని శీర్షాసనం వేయిస్తాను. ఎలా పెరుగుతాడో చూస్తాను” అంది. హడిలిపోయాడతను. ఆమె దగ్గిర అలాంటి పరిష్కారం వుంటుందనుకోలేదు.
“పొరపాట్న అన్నాను, వాడు నీ కొడుకుకాదు, నాకొడుకే. వాడిజోలికి రాకమ్మా! ఆ పొట్టిబుడంకాయగాడే నీ కొడుకు” అన్నాడు తప్పు సరిదిద్దుకుంటూ.
“విహీ పొట్టిబుడంకాయేం కాదు. మా యిద్దరిదీ మంచి హైటు. మగపిల్లల్లో నువ్వూ, ఆడపిల్లల్లో అదీ తాటిచెట్లలా ఎదిగికూర్చున్నారు” అంది.
“తేలుకొండితనం అంటే ఇదే. మీరిద్దరూ మాట్లాడుకుంటూ మధ్యలోకి నన్నెందుకు లాగావే?” కోపంగా అడిగింది వల్లి.
“వాసు చెప్తాడులే” అని, “నేను అప్పగింతలు పెట్టేసి వస్తాను. ఇంక బయల్దేరదాం” అంటు వెళ్ళిపోయింది గీత.
వల్లి వాసుకేసి చూస్తే, “వింటూ నిలబడ్డావుకదా, అందుకు. ముట్టించేసి వెళ్ళిందమ్మా! మనం ముట్టుకోకూడదు” అన్నాడతను నవ్వు బిగబట్టి.
“అబ్బ! ఇద్దరికిద్దరే. భలే వెనకేసుకొస్తారు ఒకరినొకరు” దెప్పింది. ముగ్గురూ వెళ్ళిపోయారు.
సుధీర్ వినోదంగా చూసాడు. వాసు, గీత కొత్తకోణంలోంచీ కనిపిస్తున్నారు. రమ గుర్తొచ్చింది అతనికి అదే క్షణాన. తామిద్దరికీ మధ్య చెరగకుండా సన్నటి వేర్పాటుగీతేదో ఇంకా వున్నట్టే వుంది. దాన్ని చెరిపెయ్యాలన్న బలమైన ఆకాంక్ష ఆమెలో వుంది. దాటడం తనకి రావట్లేదు. అంత చనువు చూపించలేకపోతున్నాడు.
“బానే తగిలింది. చూసుకోవద్దురా?” ఆలోచనలోంచీ బైటికి వచ్చి అన్నాడు.
“జాగ్రత్తగానే వుంటాను. అప్పుడప్పుడు తప్పదు” అన్నాడు వాసు దెబ్బని అరచేత్తో రాసుకుని. “ఇంత అల్లరి చేస్తారా, వీళ్ళు ముగ్గుర్నీ చూస్తే భలే ఆశ్చర్యంగా వుంటుంది సుధీర్! సమీరావాళ్ళకి ఎమ్‍సెట్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ వుంది. ఇది బ్రహ్మాండమైన ఫిజిక్స్ హేండు. అత్తవారింట్లో తనో పెద్ద అసెట్. పెళ్లయాక బెడ్‍రెస్టూ అవీ వచ్చినప్పుడు వల్లి జాబ్ వదిలేసింది. పిల్లలు స్కూలుకెళ్ళేదాకా గేప్ తీసుకుంది. మళ్ళీ మంచి వుద్యోగం సంపాదించుకుంది. ఇక తులసి. దానికి చదువుమీద శ్రద్ధలేదనుకున్నాం. ఎలాగో పీజీ అవగొట్టించాడు శ్రీధర్. భార్యాభర్తలిద్దరూ స్టార్‍గేజింగ్ చేస్తారు. రకరకాల పుస్తకాలు తెప్పించుకుని చదువుతారు. దీనికి తెలీనివి అతను చెప్తాడు. మనతో పోలిస్తే వీళ్ళలో చాలా వికాసం కనిపిస్తుంది.
వీళ్ళతో కలిసి తిరగాల్సింది వీణ. బీటెక్ గోల్డుమెడలిస్టు అది. దాన్ని ఏం చేసారో తెలీడం లేదు. సంబంధం మంచిదై, అంతా బానే వున్నప్పుడు వాళ్ళమ్మ దేనికి కంగారుపడుతోందో అర్థమవ్వడంలేదు. వాళ్ళ నాన్నైతే కన్నీళ్ళే పెట్టేసుకుంటున్నాడు. కొంచెం చెత్త మాట్లాడుతుంది ఆవిడ. అలాంటి మాటలు మనింట్లో లేవు. ఒకమాటు గీతనిగురించి ఏదో అంది. నాకు బాగా కోపం వచ్చింది.
సరదాగా తిరగడానికి మామధ్యకి వచ్చిన పిల్లతో అమర్యాదగా ప్రవర్తించేంత సంస్కారహీనంగా పెరగలేదు మేము- అన్నాను. రాణాని ఎత్తి చూపించింది. వాడిని కలుపుకోవడం మానేసామని చెప్పాను. ఐనా ఏదో అంది. మళ్ళీ ఇప్పటిదాకా నేరుగా మాట్లాడుకోలేదు ఇద్దరం.
వాళ్ళకి కోపం వస్తుంది, వాళ్లకి నచ్చదు, వద్దని ఎవరికీ ఫోన్ నెంబరు‍కూడా యివ్వలేదు. అరేయ్, పెళ్ళిచేసుకున్న పిల్ల కుటుంబంతో అలాంటి షరతులేంటి? వదిలేద్దామంటే చాలా చిన్నపిల్లరా, అది. ఇప్పుడిప్పుడుకదా, వీళ్ళందరికీ అన్నీ చక్కదిద్దుకోవడం వచ్చింది? అదీ ఇందరం వెనకుండి అన్నీ చూస్తుంటే. వీణకేం తెలుస్తుంది? ఈత నేర్పించకుండా నడిసముద్రంలో వదిలేసినట్టు వదిలేసారు. కోపం వాళ్లమ్మమీద. దీనిమీద కాదు. వీళ్ళంతా వెళ్తామంటున్నారు. చాలా జాగ్రత్తగా మానిటర్ చెయ్యాలి. అన్నిటికన్నా ముందు ఆవిడ సరేననాలి.
ఈమధ్యలో కృష్ణగాడొకడు. వాడికి మరదలితో ఒకటిరెండుసార్లు అనుకున్నారు. ఇద్దరిదీ ఒకటే వయసు. ఆ పిల్ల చేసుకోననేసింది. వీడికి మనసులో వుందేమోకానీ, అది కాదనేసరికి తనూ వద్దనేసాడు. కొంచెం బాధవున్నట్టుంది. పెళ్ళి మానేసి కూర్చున్నాడు. ఇప్పటికి సరేనన్నాడు. ఇంక సంతోష్, పల్లవీ మిగులుతారు. ఆ తర్వాత మన పిల్లలు ఆట చూపిస్తారు” అన్నాడు.
సుధీర్ తలూపాడు.
గీత కేష్‍బేగు మాధవ్‍కి యిచ్చింది. “ఆవిడ వెళ్ళిపోయి అప్పుడే మూడోరోజు” అంది దిగులుగా. “అందరం కలిసామని నవ్వుతూ మాట్లాడుతూ తిరుగుతున్నా, మధ్యలో ఎప్పుడో నన్ను మర్చిపోయారే అని అడుగుతున్నట్టు గుర్తొస్తోంది” అంది దిగులుగా.
“పెద్దదైందికద వదినా? మంచంలో నిస్సహాయంగా పడుకుని వుండటం ఆవిడకీ బాధే. అలా అనే మనని మనం ఓదార్చుకోవాలి” అన్నాడతను.
“ఈ వారం ఆఫీసులకి వెళ్ళొస్తాం. పొద్దున్న అటూయిటూ ఔతే డబ్బుకి యిబ్బందౌతుంది. అందుకని డబ్బువిషయాలు మీలో ఎవరో ఒకరు చూసుకోండి. సాయంత్రాలు ఇటే వచ్చేస్తాం. ఐదురోజులు వెళ్తే మళ్ళీ సెలవుపెట్టి వచ్చెయ్యచ్చు. కర్మ మొదలౌతుంది. మీకిక్కడ బావుంటే సరే, లేకపోతే అటొచ్చెయ్యండి” అనేసి వెళ్ళిపోయింది. మాధవ్ తలూపి బేగు నీలిమకి యిచ్చాడు.
“అదేంటి, ఆవిడ మీకిచ్చింది” అంది.
“నువ్వు లెక్క చూడలేవా?” అన్నాడు.
“చాలా డబ్బున్నట్టుంది. ఇంతా బైటపెట్టుకుని నేను తిరగలేను. కొంత నా హేండుబేగ్‍లో పెట్టుకుని మిగతాది లోపలెక్కడేనా బీరువాలో పెట్టి తాళం వేస్తాను” అంది.
“ఈవిడ గది ఒక్కటీ మైలపడకుండా వుంది. మహీవాళ్లంతా అందులోనే వుంటున్నారు. అక్కడి బీరువాలో పెట్టు. బైటివాళ్ళుకూడా తిరుగుతున్నారు. చిన్నదేదో తాళం తెచ్చిస్తాను” అన్నాడు.
గీత గది. అందులోకి అడుగుపెట్టగానే ప్రకంపనాలు మొదలయ్యాయి నీలిమలో. పాతకాలపు పెద్దచెక్కబీరువా. పెయింటూ అదీ వేసి, ఇత్తడి నాబ్స్ పెట్టేసరికి బావుంది. తెరిచింది. కింది అరలనిండా ఎవరెవరివో బేగులవీ వున్నాయి. పై అరకిమాత్రం లోపల మరో తలుపుంది. అది తెరిచింది. గీత వస్తువులున్నాయి. మూసెయ్యబోతూ ఆగింది.
కొబ్బరిపుల్లలకి చాక్లెట్ రేపర్లని దారంతో కట్టి చేసిన సీతాకోకచిలుకలు రెండు. ఒక పుల్ల పొడవు, ఇంకోటి పొట్టి. గచ్చకాయలు, తొక్కుడు బిళ్ళలు, వాచీ బాక్స్, ఇంకా ఏవేవో. స్వంతిల్లు వుంటే పిల్లల చిన్నతనాలు పొందిగ్గా దాక్కుని వుంటాయి. పెళ్ళై వచ్చాక తమింట్లో ఒక ఖాళీ పౌడరుడబ్బాలో పోసిన గోళీలు కనిపించాయి. ఇంత జాగ్రత్తగా దాచుకుంటారని తెలీక, ఇప్పుడు ఆడేవాళ్లెవరని తీసేసింది. గోళీలాడుతూ, సైకిలు చక్రం తోసుకుంటూ తిరిగే మగపిల్లల్ని తనూ చూసింది. వాళ్ళు పెద్దయ్యాక ఏమౌతారు, ఎంత అందమైన భర్తలౌతారన్న వూహ అప్పుడు వుండేదికాదు.
మాధవ్ అందమైన ప్రేమ మళ్ళీ తిరిగొస్తుందా? ఆమె కళ్ళలో నీళ్ళు తిరిగాయి. అమాయకంగా వుండే అవకాశాన్ని పోగొట్టుకుంది తను.