ఝరి – 61 by S Sridevi

  1. ఝరి – 61 by S Sridevi
  2. ఝరి – 62 by S Sridevi
  3. ఝరి – 63 by S Sridevi
  4. ఝరి – 64 by S Sridevi
  5. ఝరి – 65 by S Sridevi
  6. ఝరి – 66 by S Sridevi
  7. ఝరి – 67 by S Sridevi
  8. ఝరి – 68 by S Sridevi
  9. ఝరి – 69 by S Sridevi
  10. ఝరి – 70 by S Sridevi
  11. ఝరి – 71 by S Sridevi
  12. ఝరి – 73 by S Sridevi
  13. ఝరి – 74 by S Sridevi
  14. ఝరి – 75 by S Sridevi
  15. ఝరి – 72 by S Sridevi

జరిగిన కథ-వాసు, గీత భార్యాభర్తలు. గీత ఆత్మహత్యకి ప్రయత్నం చేసి బైటపడుతుంది. తులసికి కేన్సరొచ్చి తగ్గుతుంది. భర్తతో విడిపోవాలనుకుంటుంది. అతనికి విడాకులు ఇష్టం వుండదు. గీతకి ఎవరో ఫోన్‍చేసి బెదిరిస్తారు. ఆ ఫోన్ సుధీర్‍ చేసాడేమోననే అనుమానం వస్తుంది వాసుకి. మహతి భర్తతో విడాకులు తీసుకుంటుంది. మేఘన ఆమె కూతురు. తల్లి దగ్గిరే వుంటుంది. తండ్రికి యాక్సిడెంటైతే చూడటానికి వస్తుంది. మహతితో విడాకులయ్యాక నరేంద్ర మరో పెళ్ళి చేసుకుంటాడు. ఆమెవలన ఇద్దరు పిల్లలు. ఆమె చనిపోతుంది. అతనికి యాక్సిడెంటైతే సాయానికి హాస్పిటల్‍కి వెళ్తుంది మహతి. రాత్రి అతనికి అటెండెంటుగా వుంటుంది. పిల్లలని వాసు తనింటికి తీసుకెళ్తాడు.
గీత గతం. చదువయ్యి, చిన్నవయసులోనే వుద్యోగంలో చేరుతుంది. ఇంట్లో ఆమెకి పెళ్ళి చెయ్యాలనుకుంటారు. తండ్రి అడిగితే సూచనాప్రాయంగా వాసు పేరు చెప్తుంది. ఆమెని తనింటికి తీసుకెళ్ళి సుధీర్ని చేసుకొమ్మని నచ్చజెప్పే ప్రయత్నం చేస్తాడు రవి. గీతావాసులకి చాలామంది కజిన్స్. చిన్నతనంలో వాళ్లంతా ఒకే స్కూల్లో చదువుకుంటారు. రామారావు యశోద ప్రమీల ఇంటికి వెళ్ళి పెళ్ళివిషయం చెప్పి, ఆహ్వానించి వస్తారు. సుధీర్ గీతని ఇష్టపడతాడు. ఆమెని చేసుకోలేకపోతున్నందుకు బాధపడతాడు.
వెంకట్రావు, విశాల అనే భార్యాభర్తలు అప్పులబాధ తట్టుకోలేక వురివేసుకుని చనిపోతారు. వాళ్ళ కూతురు అమృత. అమృత అవంతీ ఎస్టేట్స్‌లో మాధవరావు ప్రాపకంలో వుంటుంది. పోలీసుస్టేషన్‍కి పిలిచి బెదిరిస్తారు అమృతని. విజయ్, శ్యామ్మోహన్ అండగా నిలబడతారు. తనకి అమృత అంటే ఇష్టమని ప్రసూనకి చెప్తాడు. ఆ విషయం చెప్పి రోహిణిని హెచ్చరిస్తుంది ప్రసూన. అమృత ఆస్తుల లెక్కలు
జరుగుతుంటాయి.


చాలా విషయాలు చెప్పకా, వినకా కాలగర్భంలో కలిసిపోతాయి. అలా కలవకుండా మిగిలే కొన్ని విషయాలూ ఒక ప్రశ్నార్ధకాన్నీ మోస్తూ కాలంతోపాటు కదుల్తుంటాయి. ఎవరో ఒకరిమీదికి ఆ ప్రశ్నార్ధకాన్ని విసురుతాయి. వాళ్ళు కొక్కానికి ఎరలా చిక్కిపోతారు. రవీ, రామారావూ ఎందుకు మాట్లాడుకోరనేది గీతావాళ్ళకి చాలాకాలంపాటు జవాబు దొరకని ప్రశ్న. అలాంటిదే మేఘన ఇంటి వ్యవహారం. తల్లిదండ్రులు ఎందుకు విడిపోయారో మేఘనకి కచ్చితమైన కారణం తెలీదు. అంతమంది మధ్యని తిరుగుతున్నప్పుడు దాగకుండా బహిర్గతమయ్యే విషయాల చుట్టూ ఆమె అల్లుకున్న ఆలోచనలు, అర్ధసత్యాలే తప్ప పూర్తి వివరం తెలీదు. అత్త ఏం చెప్తుందోనని కుతుహలంగా చూస్తోంది.
“మేఘనా! నువ్వింక పెద్దదానివయ్యావు. పెళ్ళికూడా అవబోతోంది. కొన్ని విషయాలు చెప్తాను. విని అర్థం చేసుకో. ఎవరినీ జడ్జి చెయ్యకు. ఎందుకంటే నువ్వు ఎవరి జోళ్ళల్లోనో కాళ్ళుపెట్టి నడవలేవు. సులువుగాగానీ, ఎక్కువదూరంగానీ. ఎవరి అనుభవాలూ, స్పందనా వాళ్లవి. ఐతే ప్రేమ అనే ఒక విశ్వజనీనమైన మూసలో పడ్డప్పుడు ఎంత పెద్దసమస్యైనా దాని తీవ్రతని పోగొట్టుకుంటుంది. పెళ్ళి అనేది కేవలం సంఘటనల పరిక్రమం కాదు. అది జీవితకాలపు భావవ్యక్తీకరణ. భార్యాభర్తలమధ్యా, వాళ్ళకీ, వాళ్ళ పిల్లలకీ మధ్యా, వాళ్ళిద్దరి వెనుకా వున్న కుటుంబాలకీ వాళ్ళకీ మధ్యా, సమాజానికీ వాళ్లకీ మధ్య. ఈ భావవ్యక్తీకరణ ప్రక్రియ నిరంతరాయంగా సాగుతునే వుండాలి. అది ఆగిపోయినచోట సమస్యలు మొదలౌతాయి. దురదృష్టవశాత్తూ మన కుటుంబంలో కొన్నిళ్ళలో ఇది ఏకపక్షంగా మారిపోయింది. అంటే ఎదుటివాళ్ళు చెప్పేది వినకుండా తమ మాటే సాగించుకుంటారన్నమాట” అంది గీత నెమ్మదిగా. తను చెప్పినది మేఘనకి అర్థమైందో లేదో తెలుసుకోవాలని ముఖంలోకి లోతుగా చూసింది.
వాళ్ల సంభాషణ చాలావరకూ ఇంగ్లీషులోనే సాగింది. మొదట ఇంట్లో అందరూ మాట్లాడుకునే భాష వస్తే మిగిలినవన్నీ వాటికవే వస్తాయన్న సూత్రంమీద పెంచింది మహతి, కూతుర్ని. కానీ ఆ పిల్ల పెరిగి పెద్దయాక తెలుగు ప్రాధాన్యం తగ్గి, మరాఠీ, ఇంగ్లీషు వాడుక, అవసరం పెరిగాయి. అంతా దాన్ని వప్పుకున్నారు. ఇలా పరరాష్ట్రంలో పెరుగుతున్న పిల్లలు ఇంకా వున్నారు. మాధవ్, వసంత్, రవి – వీళ్ళ పిల్లలు. ఇదికాక దేశాంతరాలు వెళ్ళిన, వెళ్ళినవాళ్ళ పిల్లలు. భాష అనేది పరిధులని విస్తరించుకుంది. ఒకప్పుడు దేశాన్ని ఏలిన సంస్కృతం ఇప్పుడు వాడుకలో లేదు. అందునించీ కొత్తభాషలు పుట్టుకొచ్చాయి. మార్పు అనేది ఒక ఝరి. నిరంతరాయంగా సాగే ప్రవాహం.
“నువ్వన్నది నిజం అత్తా! పెళ్ళేకాదు, జీవితమే పెద్ద కమ్యూనికేషన్ ప్రాసెస్. చాలా నిజం. ఇది అర్థంకాక అన్నివిధాల మానవసంబంధాలలోనూ విఫలమౌతున్నాం” అంది. ఆమెలో తను ఆశించిన పరిణతి కనిపించాక గీత ముందుకి సాగింది.
“ప్రేమ అనేది అతి గొప్ప కమ్యూనికేషన్. ఎదుటివ్యక్తిమీద మనకి కాస్తంత ప్రేమ వుంటే చాలు, వాళ్లపట్ల సానుకూల దృక్పథం మొదలౌతుంది. వాళ్ళు మనకి అర్థమైపోతారు. వాళ్ళ బాధ మనదైపోతుంది. చాలామందికి చిన్నవో పెద్దవో ఆరోగ్యసమస్యలు వుంటాయి. వాసూవాళ్ళ మామ్మకి విపరీతమైన పార్శ్వనొప్పి వుండేదట. ఏ తెల్లారో తలనొప్పి మొదలై, మధ్యాహ్నందాకానో సాయంత్రందాకానో వుండిపోయేది. ఎండ తీక్ష్ణంగా వున్నరోజుల్లో కన్నుకూడా తెరిచి చూడలేకపోయేది. అలాంటావిడతో ఇల్లు ఎంత అస్తవ్యస్తంగా వుంటుందో ఆలోచించు. పాపం అలాగే సర్దుకుంటూ గడిపారట ఆ తాతయ్యగారు. ఎందరో డాక్టర్లకి చూపించారు. చిట్కావైద్యాలు, నాటువైద్యాలు, మంత్రాలు ఎన్నో చేయించాక మా తాతయ్యదగ్గిరకి వస్తే ఆయన నయం చేసారట. ఎలాగని అడక్కు. తగ్గింది. వాళ్లకి అది పెద్ద రిలీఫ్. అందుకు కృతజ్ఞతగా లక్ష్మమ్మమ్మని కట్నం తీసుకోకుండా చేసుకున్నారు” అని ఆగింది.
మేఘన ఆలోచించింది. ఈ విషయాన్ని వుదాహరణగా ఎందుకు చెప్పిందో అర్థమైంది.
“మీ అమ్మకి చిన్నప్పట్నుంచీ కొన్ని సమస్యలు వుండేవి. గుర్తు తెచ్చుకో, నీ స్నేహితుల్లో ఎవరికీ ఎలాంటి కంప్లెయింట్సూ వుండేవికాదూ?
మాట్లాడుకుంటారా, ఈ విషయాలు?” అడిగింది గీత.
“ఎందుకు మాట్లాడుకోం? ఎవరిదాకానో ఎందుకు? ఇందిరకే విపరీతమైన కడుపునొప్పి. రెండేళ్లైంది అది పెద్దదై. ఆ టైము వచ్చిందంటే దాన్ని ఎవరూ పట్టలేరు. గోలగోల చేసేస్తుంది. ఏడుస్తూ పడుక్కుంటుంది. పిన్ని ఒకసారి అడిగింది. మీ అమ్మకిలా నీకే బాధా వుండదా అని” అంది మేఘన. గీత పెదాలమీద అదోలాంటి నవ్వు మెరిసి లిప్తలో మాయమైంది.
“ఆ పిల్లకి పెళ్లౌతుంది. ఈ నొప్పి ఇలాగే వుంటుంది. వచ్చేవాడికి అర్థమవ్వదు. అర్థం చేసుకోడు. అప్పుడు?”
నిజమే. అప్పుడు?
“చెప్పటం ఒక్కటే కాదు, విని, అర్థం చేసుకోవడంకూడా కమ్యూనికేషన్ ప్రాసెస్‍లో భాగమే. మీ అమ్మ తన శరీరం ఇచ్చిన సంకేతాలన్నిటినీ అర్థం చేసుకుంది. పెళ్ళి చేసుకోనంది. మీ తాత వినలేదు. దాన్ని భయపెట్టీ, ప్రలోభపెట్టీ పెళ్ళిచేసారు. అలాగని తనకి నొప్పులూ, బాధలూ ఏమీ లేవు. పై పెదవిమీదా, కాళ్ళూచేతులమీదా కాస్త అన్‍వాంటెడ్ హెయిర్ వుండేది. పేర్లర్‍కి వెళ్ళటాలూ, వేక్సింగు, త్రెడింగ్‍లాంటివి ఇంకా మనింటికి రాలేదు. మొహం కడుక్కోవడం, ఇంత పౌడరు ముఖానికి రాసుకుని బొట్టు పెట్టుకోవడం. పెట్టుకుంటే కళ్ళకి కాటుక, తల్లో పూలు. లేకపోతే లేదు. అంతే. అలాగే దాన్ని పెళ్ళిచూపుల్లో చూసి, వాళ్ళిస్తామన్న కట్నానికి మోజుపడి చేసుకున్నారు మీ నాన్నావాళ్ళు. ఇప్పుడు చెప్పు, తప్పెవరిది? మీ అమ్మని వున్నదాన్ని వున్నట్టే చూపించారు. ఇంతమందాన మేకప్ వేసి, అందంగా తయారుచేసి మీ నాన్నముందు కూర్చోబెట్టలేదు. ఆ మేకప్ కరిగిపోయేలోగా హడావిడిగా పెళ్ళీ చెయ్యలేదు. రెండునెలలు బేరసారాలు జరిగాయి. ఒకరొకరుగా రెండుమూడుసార్లు దాన్ని చూసారు. వాళ్లకి కట్నంముందు మరేదీ కనిపించలేదు” అంది.
“మా నాన్న కట్నం తీసుకున్నారా?” ఆశ్చర్యంగా అడిగింది మేఘన.
“అదంత తప్పుగా ఎవరూ అనుకోలేదు. ఆడపిల్ల పెళ్లవాలంటే ఇవ్వక తప్పేదికాదు. అందుకని ఇచ్చేవారు. వాళ్ళుకూడా లేక తీసుకోవడం కాదు, ఎంత కట్నం యిచ్చారంటే అంత గొప్ప. అందుకు తీసుకునేవారు”
“వాసు మామయ్య?”
“లేదు”
కొద్దిసేపు ఇద్దరూ మాట్లాడుకోలేదు.
“మా అమ్మని తప్పుపట్టాలని కాదత్తా! నాకు నాన్న కావాలనిపిస్తుంది. ఎప్పటికీ ఆయన మాతోనే వుండిపోవాలనిపిస్తుంది” మేఘనే నెమ్మదిగా అంది. ఆమెకి కళ్ళలో నీళ్ళు తిరిగాయి. ప్రేమగా దగ్గిరకి తీసుకుంది గీత. “అలాని అతనికీ వుండాలికదే?” అంది.
“లేదంటావా?” దెబ్బతిన్నట్టు అడిగింది.
“ఉంటే, ఈరోజు పొద్దున్న అలా ఎందుకు జరిగింది? వెళ్ళగానే వాళ్ళిద్దరూ తండ్రి దగ్గిరకి పరిగెడితే నువ్వెందుకు దూరంగా వుండిపోయావు?”
“అమ్మ చెప్పిందా?”
“ఉహు< మామయ్య చెప్పాడు”
“…”
“మేఘనా! నాన్నగురించి నీకలా అనిపించడం తప్పుకాదు. అతనికీ అలానే వుండాలని కోరుకోవడం తప్పు. అక్కడే నువ్వన్నట్టు సంబంధాలు దెబ్బతింటున్నాయి. ఎవరి ప్రాథమ్యాలు వాళ్ళకి వుంటాయి. మరొకరిని పెళ్ళిచేసుకున్న మనిషికి మొదటిభార్యా పిల్లలూ ఏమౌతారమ్మా?” ఆ పిల్ల జుత్తు సరిచేస్తూ అడిగింది. “నువ్వు ఏర్‍పోర్టులో దిగి ఒక్కమాట అనగానే మామయ్య పరిగెత్తుకుని వచ్చాడా? నువ్వు కోరిన ఆ సాయం మేము చెయ్యగలిగినది. మరి మా చేతుల్లో లేనిదానికి నువ్వు ఏడిస్తే మేం ఏం చెయ్యగలం? నాకు నువ్వేమౌతావు? నాకున్న ఆరుగుర్లో ఒక మేనత్త మనవరాలివి. అంతేకదా? కొంతమంది యిళ్లలో రాకపోకలే వుండవు. ఎవరు ఎవరో అన్నట్టు బతికేస్తారు. మరి మాకు? నువ్వు ప్రాణం. మీ అమ్మ ప్రాణం. అంటే ప్రేమేకదా, మనందరినీ కలిపి వుంచుతున్నది? అలాంటి ప్రేమ మీ నాన్నలో లేదు. అందుకే మీ అమ్మ అక్కడ వుండలేకపోయింది. ఒక్కపిల్లని కనడంకోసం చచ్చి బతికింది అది. మూడు అబార్షన్ల తర్వాత నువ్వు పుట్టావు. మరి అంత కష్టపడిన భార్యమీద మీ నాన్నకి కొంచెమేనా ప్రేమ వుండాలికదా? సర్దుకుని నార్మల్ లైఫ్‍లోకి రావడానికి సమయం ఇవ్వాలికదా? కొట్టడం తప్పుకదా? వాసూవాళ్ల మామ్మగురించి చెప్పాను. చెయ్యాలనుకుంటే ఆ తాతగారుకూడా అలా చెయ్యచ్చుకదా?” అంది.
“తలంటేసావా?” అడిగింది మేఘన తులసి మాటలు గుర్తుతెచ్చుకుని.
“ఉ<హు< ఇంకా లేదు. ఇది నలుగే” గీత నవ్వేసింది.
“హు< అదెలా వుంటుందో!”
సరిగ్గా అప్పుడే మహతి అక్కడ అడుగుపెట్టింది. గది గుమ్మాన్ని పట్టుకుని నిలబడింది. ఇంకా లోపలికి అడుగుపెట్టలేదు. ఆమె రాకని వాళ్ళిద్దరూ గమనించలేదు.
“అత్తా! నీకు అన్నీ తెలుసు. అందరూ నీమాట వింటారు. అందరికీ నువ్వంటే యిష్టం. మామయ్య చాలా మంచివాడు. మరి నువ్వెందుకలా
చేసావు?” నెమ్మదిగా అడిగింది మేఘన. ఆ కుటుంబంలోని మూడోతరంలోని పిల్లలందరి ప్రతినిధిగా అడిగింది. జవాబుకోసం వెతుక్కుంటున్న మయూఖ్, విహంగ్‍లపక్షాన ప్రత్యేకంగా అడిగింది. అడుగుతున్నప్పుడు ఆమె గొంతు వణికింది. కళ్ళలో పలచటి నీటిపొర కదిలింది. గీత నవ్వు ఆగిపోయింది. ముఖం వెలతెలబోయింది. వెంటనే సర్దుకుంది. నవ్వు తిరిగిరాలేదు.
“నువ్వూ అడిగేసావా?” అంది. “చెప్పానుగా? టాబ్లెట్లు కనిపించాయి. ఏదో అర్జ్. అలా వేసేసుకున్నాను. అంతే” అంది నింపాదిగా మాటలు పేర్చుకుని. మేఘన ఆమె ముఖంలోకి తదేకంగా చూసింది.
“ఇది జరగడానికి సరిగ్గా రెండురోజులముందు తాతయ్య అమ్మని బాగా తిట్టాడు. ఆయన అలా తిట్టడం మాకు అలవాటే. ఆరోజుమాత్రం-
నువ్వుపోయి మీ అమ్మ బతికున్నా బావుండేది. ఆవిడ నీ బెంగతోనే పోయింది. నువ్వుమాత్రం నిరంధిగా బతికేస్తున్నావు. బతికేం సాధిస్తున్నావే? అందర్నీ కాల్చుకు తింటున్నావు – అన్నారు.
ఎన్నోసార్లు ఎన్నోమాటలు అన్నా, ఆరోజు అమ్మ ఆ మాటలకి తట్టుకోలేక ఏడ్చింది. నాకు చాలా కోపం వచ్చింది. అప్పటికప్పుడు ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకుని ఆయన్ని తీసుకెళ్ళి పిన్ని దగ్గిర కొన్నాళ్ళుండమని వదిలిపెట్టి వెంటనే వచ్చేసాను. నన్నో రెండురోజులు వుండమని పిన్నీ బాబాయ్ అడిగినా వుండలేదు. ఇక్కడ అమ్మని ఒక్కదాన్నీ వదిలిపెట్టి వెళ్ళానని భయం.
అలా ఎందుకు చేసావు మేఘనా? ఆయన నాకు నాన్న, నీకు తాత. ఒకమాట అన్నా, పడ్డా మనమధ్యనే వుంటుంది. అక్కడ బాబాయ్ వున్నారు. ఆయన్నీ పిన్నినీకూడా అంటారు నాన్న. వాళ్లల్లో ఎవరిని అన్నా రెండోవాళ్ళకి కోపం వస్తుంది. అలాగని తిరిగి బాబాయ్ ఆయన్ని ఏదేనా అంటే పిన్నికి ఇంకాస్త కోపం వస్తుంది. వాళ్లమధ్య అవసరంలేని గొడవలుకదా- అంది అమ్మ.
నేను వెళ్ళాక అమ్మ ఏడుపు ఆపిందీ, కడుపుకి ఏమైనా తిన్నదీ లేదు. నేను వచ్చాకే పొయ్యి వెలిగించింది. అత్తా! అదేరోజు రాత్రి నీగురించిన వార్త వచ్చింది. ఏ కారణం లేకుండానే నీకు చచ్చిపోవాలనిపించిందన్నావు. అదే నిజమైతే నేను లేని సమయంలో అమ్మకి జరగాల్సిన ప్రమాదం నీమీంచీ దాటిపోయిందని అనుకోవాలి. మీ యిద్దరికీ అంత ప్రేమకదా? అక్కడ అమ్మ పడ్డ బాధ ఇక్కడ నువ్వెలా అనుభవించావు? మనం చదువుకుంటున్న సైన్సు, టెక్నాలజీని దాటి ఇంకేదో వుందనుకోవాలి. అలాంటి ప్రేమని నేనూ నేర్చుకుంటాను. నువ్వింక నాకు తలంటక్కర్లేదు.” అంది.
తర్వాత తల తిప్పి చూసి, “అమ్మ” అంది. మహతి లోపలికి వచ్చింది. గీత పక్కన కూలబడింది.
“నేను వెళ్తాను. నా చుట్టాలిద్దరూ ఏం చేస్తున్నారో చూడాలి” అని వెళ్ళిపోయింది మేఘన. గీత ఏమీ మాట్లాడలేదు. ఏదో ఆలోచనలో నిమగ్నమై వుండిపోయింది. ఆ మౌనముద్రలో ఆమె తామంతా చిన్నప్పట్నుంచీ ఎరిగున్న వ్యక్తికి భిన్నంగా అనిపించడాన్ని గుర్తించింది మహతి. అల్లరి, చురుకుతనం, క్రియాశీలత్వం అన్నీ కలిసి చైతన్యస్రవంతిలా వుండే మనిషిని శిలలా బిగుసుకుపోయి వుండటాన్ని చూసి తట్టుకోలేకపోయింది.