“ఈ ఒక్కసారికీ వదిలెయ్ వాసూ! పెద్దదాన్ని, అమ్మలాంటిదాన్ని చెప్తున్నాను. వాడు మళ్ళీ గీత జోలికి రాడు. ఎలాగా దుబాయ్‍కూడా వెళ్ళిపోతున్నాడు- అంది పిన్ని బలహీనమైన గొంతుతో. బతిమాలుతున్నట్టు. కోపం, అవమానం, దిగులు, నిస్సహాయత ఇలాంటివన్నీ మనిషిని తినేసాక మిగిలిన జీవావశేషంలా వుంది తను.
దీనిమీద సంతకం పెట్టు పిన్నీ! కింద పేరూ అడ్రెసూ రాయి- జేబులోంచీ ఒక కాగితాన్ని తీసి, అత్తముందు పరిచి, పెన్ను ఇచ్చి, అన్నాడు.
దేనికనికూడా అడక్కుండా సంతకం పెట్టేసింది. మామయ్య తెల్లబోయి చూసారు. దాన్ని జాగ్రత్తగా మడిచి జేబులో పెట్టుకున్నాడు వాసు.
నామీద నమ్మకమో, రాణా భవిష్యత్తుపట్ల భయమో, ఎందుకనికూడా అడక్కుండా సంతకం పెట్టావు. థేంక్స్ పిన్నీ! నీ నమ్మకాన్ని నేను ఎప్పుడూ పోగొట్టుకోను. మీయింట్లో గొడవలు మాకందరికీ తెలుసు. పెద్దవాళ్ళ విషయమని మేం తలదూర్చలేదు. ఇప్పుడిక నేను కలగజేసుకుని సరిదిద్దక తప్పట్లేదు. ఈ కాగితంమీద నువ్వు రాసినట్టు కంప్లెయింటు రాసి బాబాయ్ వాళ్ళ ఆఫీసులో ఇస్తే ఏం జరుగుతుందో ఆయనకి నేను చెప్పక్కర్లేదు. ఐనా నీకు తెలియాలని చెప్తున్నాను. బిగామీయో, అడల్ట్రీ కేసో ఔతుంది. ఉద్యోగం పోతుంది. ఇంకెంత, రిటైర్‍మెంటుకి దగ్గిరే వున్నానని ఆయన అనుకోవచ్చు. అప్పుడు ఆయనమీద చర్య తీసుకునే ప్రదేశం మారుతుందితప్ప కేసు మాఫవ్వదు. ఆఫీసుకి బదులుగా పోలీసుస్టేషనులో నడుస్తుంది. సో! రాణాని అదుపులో వుంచాల్సిన బాధ్యత ఆయనది. అదుపు తప్పకుండా వుండాల్సిన అవసరం వాడిది. నువ్వు కంప్లెయింటు వెనక్కి తీసుకున్నాకూడా జరగాల్సిన డేమేజి జరిగిపోతుంది- అన్నాడు వాసు. నేను తనని కొత్తమనిషిని చూసినట్టు చూసాను. నాతోపాటు మిగిలిన అందరూకూడా.
అరేయ్, నువ్వు మాలో ఒకడివని ఇంటికి వచ్చి ఇంతగా చెప్తున్నాను. మళ్ళీ గీతజోలికి వచ్చావంటే మర్యాదగా వుండదు. నాకోపం తెలుసుగా? సుధీర్‍కూడా పక్కన లేడు ఆపడానికి- అని రాణాని హెచ్చరించాడు.
నువ్వు ఇక్కడ వుండాల్సిన అవసరం లేదు పిన్నీ! మా అమ్మలాంటిదాన్నన్నావు. ఇప్పటికిప్పుడు నాతో వచ్చేసినా తీసుకెళ్ళిపోతాను. ఇద్దరం సంపాదించుకుంటున్నాం. నువ్వు మాకు బరువు కాదు- అన్నాడు అత్తతో. తన ముఖం పాలిపోయింది. కన్నీళ్ళు బలవంతంగా ఆపుకుంది.
నేను వెళ్ళాక ఆవిడ్ని ఏమీ అనకండి బాబాయ్! మీకులేని బాధ్యత తను తీసుకుంది. అంతే- అన్నాడు వాసు.
మాతో వచ్చెయ్ అత్తా- అన్నాను నేనుకూడా.
గొప్పవాళ్ళే ఇద్దరూ. భూమ్మీద పెడితే పంటలుండవు, ఆకాశంలో పెడితే వానలుండవు. ఇంకెన్ని చూడాలో మేము- అంది నిరసనగా. ఆవిడ కోపం నామీద. వాసుమీద కాదు. ఈ బేధభావాన్ని ఎలా జీర్ణించుకోను?
పిన్నీ! నువ్వెప్పుడు రావాలనుకున్నా రావచ్చు. ఒక్కమాట నాకు ఫోన్ చేసి చెప్తే నేనే వచ్చి తీసుకెళ్తాను- ఆవిడ మాటలు పట్టించుకోకుండా మరోమాటు అని లేచాడు వాసు. నేను అనుసరించాను” అని ఆగింది గీత.
“ఇలాంటి ఆలోచనలు వాసుకే వస్తాయి. ఏదేనా తేడా వస్తే ఇద్దర్నో ముగ్గుర్నో అందులో ఇరికించి జుట్లు ముడిపెట్టేస్తాడు. పిన్ని రాలేదుకదూ? మామయ్య త్రిమూర్తులుగారినీ, సుధీర్‍వాళ్ళ నాన్ననీ తీసుకుని వెళ్ళి బతిమాలితేనే రాలేదు ఆవిడ. ఐనా అలా వెళ్ళి అడిగితే ఎలా వస్తుందే?” అంది మహతి.
“మరెలా అడుగుతారు? ఆవిడ వుపేక్షించడంవల్లనేకదూ, రాణా పూర్తిగా దారితప్పాడు? అదే యింట్లో వుంటూ తండ్రిని చూసి నేర్చుకోవలసినదంతా నేర్చుకున్నాడు. తప్పుడు ఆలోచనలూ, తప్పుడు పనులూ చేసాడు. ఒక చెడు జరుగుతున్నప్పుడు అందరం కలిస్తేనేకదా, దాన్ని ఆపగలిగేది? నాన్న పిలిచినప్పుడు వెళ్ళడానికి అభిమానం అడ్డొచ్చింది ఆవిడకి. ఇంకా అప్పటికి ఆ కుటుంబం మునుగుతున్న పడవకాదు. తర్వాత మునిగింది. ఆవిడ్ని దయదల్చి యింటికి వస్తున్నాడంతే మామయ్య. రోజంతా ఆ రెండోయింట్లోనే. మరి మేం రమ్మన్నప్పుడు రావటానికేం? ఆరోజుని వాసుకి వచ్చిన కోపానికి నాకెంత భయం వేసిందో! సుధీర్‍ది ఆవేశం. ఇతనిది కోపం. అది గుప్పుమని లేచి చల్లబడుతుంది. ఇది రగులుతునే వుంటుంది. ఇలాంటి విషయాల్లో చంపుకోవడానిక్కూడా వెనక్కి తియ్యరు మగవాళ్ళు. చిన్నవిషయమేం కాదుకదా? ఏమన్నాడని వాసు అడగలేదుగానీ, అడిగితే నోరు తెరిచి చెప్పగలిగే విషయమేనా? ఏమిటే, వాడి తెగింపు? అడగ్గానే వాడి వెంట వెళ్ళిపోతాననుకున్నాడా? వీళ్ళందరితోటీ వ్యవహారాలు నడిపించేదాన్ననుకున్నాడా? కామన్‍ప్రాపర్టీననుకున్నాడా? వంటిమీద పెట్రోలుపోసుకుని దహించుకుపోవాలనిపించదూ, అలాంటి మాటలు విన్నప్పుడు? అసలు అటువంటి ఆలోచన వాడిలో రావడానికి వాళ్ళ నాన్నకాదూ, కారణం?” ఆవేశంగా అడిగింది గీత. రామ్మోహన్ గుర్తొచ్చాడు మహతికి. అతనూ తనని అలానే అడిగాడు. తనూ స్వాగతించలేదు. ఆడామగా మనుష్యజీవులకి వున్న తేడా స్పష్టంగా తెలిసింది. సాంత్వనపరుస్తున్నట్టు ఆమె చేతిని తనచేతిలోకి తీసుకుంది. ఆత్మీయస్పర్శ చాలా ఆవేశాలని తగ్గిస్తుంది.
“వాళ్లింటినుంచీ నేరుగా ఇంటికి రాలేదు మేము. కోటకి తీసుకెళ్ళాడు. ఒకచోట కూర్చున్నాం. గొడవకి కొనసాగింపు మా యిద్దరిమధ్యనీ వుంటుందనుకున్నాను. ఏమన్నాడని అడుగుతాడా వాసు? ఏం చెప్పను? చెప్పగలిగే మాటలేనా, రాణా అన్నవి? మేమిద్దరం ఎలా కాపురం చేస్తామో చూస్తానన్నాడు వాడు. అదే జరగబోతోందా? మా యిద్దరి పెళ్ళీ, ఈ ఆనందం స్వల్పకాలమేనా? నాకు కన్నీళ్ళు కారిపోతున్నాయి. పెద్దగా ఏడవాలని వుంది. బలవంతంగా ఆపుకుంటున్నాను. చాలాసేపు మాట్లాడలేదు తను.
కంఠాణీతో పొడిచెయ్యాలనీ, పేపర్‍వెయిట్ తీసుకుని మొహం పగలగొట్టెయ్యాలనీ అనుకున్నావా? ఇంత వయొలెన్సేమిటే, నీకు- అడిగాడు కాస్త కోపం చల్లారాక, నవ్వుతూ. తలదించుకున్నాను. తను మరికాసేపు మాట్లాడలేదు.
నువ్వు పబ్లిక్ సర్వెంటువి. డ్యూటీలో వున్నావు. పైగా వర్క్‌ప్లేస్. అలాంటిదేదైనా చేసి వుంటే వాడే నీమీద కంప్లెయింటు ఇచ్చేవాడు. మీ ఆఫీసరు వెంటనే నిన్ను సస్పెండ్ చేసేవాడు. రాణా పంతం పడితే నేరపూరితమైన చర్యకాబట్టి పోలీస్‍కంప్లెయింటుకూడా చేసేవారు. ఇవి చిన్నపిల్లల ఆటలుకావు గీతా! తెలివిగా బతకడం నేర్చుకో. నూటికి ఇద్దరికో ముగ్గురికో వుంటాయి ప్రభుత్వవుద్యోగాలు. మిగిలిన ఆ తొంభయ్యేడుమందికన్నా మనం పద్ధతిగా ఆలోచించాలి. కాండక్ట్ రూల్స్ మన వుద్యోగజీవితాన్నీ, వ్యక్తిగతజీవితాన్నీకూడా నియంత్రిస్తాయి. అవే మనకి ఆయుధాలుకూడా ఔతాయి. మనం చాలా సామాన్యమైన మనుషులం. సాఫీగా జీవితాలు గడిచిపోయేలా చూసుకోవాలి. అలాగని ఎవరేమన్నా పడి వూరుకొమ్మని కాదు. ఆలోచించి చెయ్యాలి ఏది చేసినా. ఇప్పుడీ కాగితం చూడు, ఆ రూల్స్ పరిధిలోకే వస్తుంది. బాబాయ్‍ని ఒక ఆట ఆడిస్తుంది- అన్నాడు. తలూపాను.
మరో విషయంకూడా చెప్పాడు.
నీకు మరొకళ్ళతో గొడవ జరిగినప్పుడు అవతలివాళ్ళు ఏమన్నారో నువ్వుగా చెప్పే ప్రయత్నం ఎప్పుడూ చెయ్యకు.
నేనా వుద్దేశంతో అనలేదు, నువ్వే తప్పుగా అర్థం చేసుకున్నావు- అనేస్తారు తేలిగ్గా. అప్పుడు నువ్వే డిఫెన్సులో పడిపోతావు.
ఆ మాటలు నువ్వే వుద్దేశంతో అన్నాగానీ నాకు బాధని కలిగించాయి. సంజాయిషీ యివ్వమనాలి- అన్నాడు.
అంతేకదా? నేను చెప్పినా రాణా తనన్న మాటలు అందరిముందూ వప్పుకుంటాడా? వప్పుకోడు.
నేనంటే మొదట్నుంచీ యిష్టం వున్నప్పుడు ఆమాట నాతో ఒక్కసారేనా అని వుంటే మిగతావన్నీ చూసుకునేవాడిని. అమ్మేదో అందని నాతో పూర్తిగా మాట్లాడ్డం మానేసావు. ఒకవైపు సుధీర్ నీపట్ల కన్సర్న్ చూపించేవాడు. మరోవైపు సుమంత్‍తో కలిసి ప్రపంచయుద్ధాలు చేసేదానివి. వీడితో గొడవపడుతుండేదానివి. నీ మనసులో ఏం వుందో తెలిసేది కాదు. – అన్నాడు.
మాకు డబ్బులేదు. మీలో ఎవరేనా చేసుకుంటారని ఎలా అనుకుంటాను? నన్ను బాగా చూసుకోవడం వేరూ, ఇది వేరూకదా- అన్నాను. అనడంకాదు, బైటపడిపోయాను. ఆరేళ్లకిందట మనసుకి గాయంలా తగిలి ఇప్పటికీ నొప్పిగానే వున్న మాట. వాసుపట్ల నాకుగల యిష్టాన్ని నియంత్రించి, నన్నతనికి దూరంగా నిలబెట్టిన మాట. అతనిమీద నాకున్న ప్రేమని ఆరేళ్ళు నష్టపరిచిన మాట. ఎవరో అన్నది నా భావనగా స్థిరపడిపోయిన మాట. ఆ మాటే లేకపోతే మా యిష్టం అందరిముందూ స్థిరపడిపోయేదికదూ? ఎవరికీ నామీద మరో భావంవుండేది కాదు.
గీతూ- అన్నాడు దిగ్భ్రాంతిగా. బాధతో విలవిల్లాడాడు.
నా ప్రాణమే, నువ్వు. పెళ్ళికి వప్పుకుంటావో లేదోనని గిజగిజలాడిపోయాను. ఎవరన్నారు, నీతో అలా? చిన్నప్పుడంతా నాచుట్టూనే తిరిగావుకదా, అలా ఎలా అనుకోగలిగావు- అడిగాడు. నేను చెప్పలేదు. తనే అర్థం చేసుకున్నాడు. ఇంటికి వచ్చాం. వచ్చేదార్లో అన్నాడు-
తులసి పచ్చగులాబీతీగేదో కావాలంది. మొక్క వుంది మనింట్లో. మళ్ళీ ఈ తీగేమిటో? నీ స్నేహితులు, ఆఫీసువాళ్ళు ఎవరింట్లోనేనా వుందేమో కనుక్కో. నేనూ కనుక్కుంటాను- అని. తులసి అంటే అతనికి చాలా ప్రేమ. దాని నోట్లోంచీ ఒక మాట వచ్చిందంటే శిరసావహించాల్సిన ఆజ్ఞే అన్నదమ్ములకి. వాసుకి మరీ ఎక్కువగా.
ఇంట్లో మాకోసం ఎదురుచూస్తున్న అత్తకి క్లుప్తంగా విషయం చెప్తే తను బాధపడింది.
ఆఖరికి దాని బతుకు ఇలా అయింది. అటు భర్తా సరిగ్గా లేక, ఇటు కొడుకూ ఇలా తయారయ్యి, ఎంతకని భరిస్తుంది? వదిలేసి వచ్చెయ్యమంటాంకానీ, తననదైన నెలవు వదులుకుని, పరాయివాళ్ళ యింట్లో వుండాలంటే ఎవరేనా ఆలోచిస్తారు- అంది.
రాణా విషయం రవిబాబాయ్‍దాకా వెళ్ళింది. అత్త చెప్పింది. ఆయన వాడిని రూమ్‍లో వేసి కొట్టాడని చూచాయగా తెలిసింది. ఆయన్ని సంధ్యత్త, మామయ్య ఏమైనా అన్నారా అనే విషయాలేవీ బైటికి రానివ్వలేదు. వాసు దగ్గిర వున్న కాగితానికి అంత భయపడ్డారు వాళ్ళు. నాకు చట్టం అంటే ఏమిటో అర్థమైంది.
పువ్వు నెమ్మదినెమ్మదిగా రెక్కలు యిప్పుకుంటున్నట్టు జీవితంలోని అనేక అంశాలు నెమ్మదిగా తెరుచుకుంటున్నాయి. నా జీవితం మంచి మలుపు తిరిగిందనే అనుకుంటాను. ప్రపంచాన్ని వాసుకోణంలోంచీ చూడటం మొదలుపెట్టాను. కానీ వాసు సుధీర్‍కోసం లోలోపల బెంగపడుతున్నాడు. ఇద్దరికీ నెలలు తేడా. పుట్టినప్పట్నుంచీ ప్రాణస్నేహితులుగా వున్న ఆ యిద్దరూ ఇప్పుడు విడిపోయారు. నా కారణంగా. నన్నుసరే, వాసునీ, మాధవ్‍నీకూడా దూరంపెట్టారు వాళ్ళు ముగ్గురూ. మాధవ్‍తో కలిపి మా ముగ్గురికీ కష్టంగానే వుంది ఇలా విడిపోవడం. సుధీర్ అసలు ఎదురుపడనే పడడు. మిగిలిన యిద్దరూ కలిసినా పొడిపొడిగా మాట్లాడి తప్పుకుంటున్నారు.
వీడింత ఫూలేమిటి-అని ఒకసారి వాసు అనేసాడు.
వాసుకీ సుధీర్‍కీ చాలా తేడా వుంది. సుధీర్ ప్రపంచం చాలా పరిమితమైనది. తల్లిదండ్రుల కలలపంటలా అపురూపమైన ప్రేమమధ్య చాలా సున్నితంగా పెరిగాడు. తనకి సమస్యలంటే మన గ్రూపులోనూ, కాలేజిలోనూ తలెత్తేవి. మన వయసువాళ్ళవి. అంతే. మళ్ళీ అవేనా భావోద్వేగాలతో ముడిపడివుంటాయి. అలక, కోపం, చిన్నబుచ్చుకోవడం, ఇలా. వాసు అలా కాదు, చిన్నప్పట్నుంచే పెద్దవాళ్ళ ప్రపంచంలో అడుగుపెట్టాడు. సమస్యలని చూడాల్సిన కోణాన్ని తెలుసుకున్నాడు. మా రెండిళ్లవాళ్ళనీ కలిపే ప్రయత్నం వసంత్, ప్రహ్లాద్ చేస్తున్నారు. ప్రహ్లాద్ సియ్యేలో ఇంటర్మీడియెట్ పాసైన సందర్భంగా పార్టీ ఇచ్చాడు” అంది గీత.
“నేను రాలేదు. ఏదో హెల్త్ ఇష్యూ. రవళి వచ్చింది. మరోరోజు పెట్టుకుందామని అన్నాడు వాడు. కానీ ఈ పార్టీ వెనుక వుద్దేశం మీ ఆరుగురినీ ఒకచోట కలపడం. ఆ విషయం వాడు చెప్పగానే, నాకోసం మానద్దన్నాను” మహతి గుర్తు చేసుకుంది. “అప్పుడేనటకదూ, మయూ తను ఈ ప్రపంచంలోకి రాబోతున్నట్టు ప్రకటించింది?” అడిగింది నవ్వుతూ. చివర్లో మహతి చేసిన పరిహాసానికి గీత ముఖం ఎర్రబడింది.
“నోరుమూసుకో. బస్సుల్లోనూ, రెస్టరెంట్లలోనూ, ఇంకా పబ్లిక్ ప్లేసెస్‍లోనూ వున్నప్పుడు ఈ పిల్లవెధవలు వీళ్ళ రాకల్ని ప్రకటించుకుంటే ఎలాగే? ఎంత ఎంబరాసింగ్‍గా వుంటుంది?” అంది చిరచిర్లాడుతూ. మహతి పెద్దగా నవ్వింది. ఆత్మహత్యాప్రయత్నం దాటిపోయాక గీత అసలు మాట్లాడింది లేదు. ఇప్పుడే కాస్త ఓపెనప్ అయింది. చాలాసేపు మాట్లాడుకున్నాం అని మాటలాపేసి లేచి వెళ్ళిపోతుందేమోనన్న భయం ఎలాగా వుంది. తామిద్దరూ మాట్లాడుకుంటున్నారన్న విషయం మేఘన అక్కడ అందరికీ చెప్పి వుంటుంది. అందుకే ఎవరూ ఇటు రాలేదు. గీత ఏం చెప్పి వుంటుందోనని ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారేమో! ఇప్పటిదాకా చెప్పిందంతా వుపోద్ఘాతమేగానీ అసలు కథ ఇంకా బయటికి రాలేదు.
పశ్చిమగోదావరి జిల్లా రెడ్డి పోలవరంలో 16 July, 1962 లో జననం. వరంగల్‌లో వుద్యోగం. హెడ్పోస్ట్‌మాస్టర్గా వరంగల్‌లో స్వచ్చందపదవీ విరమణ.
వివాహం శ్రీ చదలవాడ విష్ణుమూర్తిగారితో. వారు డెప్యూటీ ఏగ్జిక్యూటివ్ ఇంజనీరుగా చేసి రిటైరయారు.
మొదటి కథ అనగనగా 1978లో వనితాజ్యోతి మాసపత్రికలో అచ్చైంది. వీరివి 225కి పైగా కథలు, 9 నవలలు వివిధ పత్రికల్లో ప్రచురించబడ్డాయి. గూడు, సింధూరి, గుండెలోతు అనే కథాసంపుటాలు, నీలినక్షత్రం అనే నవల పుస్తకాలుగా వచ్చాయి. సింధూరి అనే సంపుటానికి శ్రీమతి సుశీలా నారాయణ రెడ్డి అవార్డు 2005 లో వచ్చింది. ప్రేమలోంచీ ప్రేమలోకి అనే నవలకి ఆంధ్రభూమి ప్రథమ, తిరస్కృతులు, నీకోసం నేను అనే నవలలకి ఆంధ్రభూమి ద్వితీయ, 5-3-2 అనే నవలకి కినిగె ద్వితీయ బహుమతులు వచ్చాయి. ఎంతెంతదూరం? అనే కథకి విపుల కన్సొలేషన్ బహుమతి, శ్రీమతి రంగవల్లి ట్రస్ట్ అవార్డు వచ్చాయి. ఇవికాక కథలకు మరో ఏడెనిమిది బహుమతులు వచ్చాయి.
కథలకు కాన్వాస్ పెద్దదిగా వుండాలనేది వీరి అభిప్రాయం.