“ఎందుకిస్తారండీ? మా పిల్లని మాకు అప్పజెప్తే మాయింటి వ్యవహారం ఎలా చూసుకోవాలో అలా చూసుకునేవాళ్లం. మా తమ్ముడి జీతంలోంచీ ఒక్కపైస ఎప్పుడూ మాకు పెట్టనివ్వలేదు ఆ మహాతల్లి, వాడి భార్య. పోయేటప్పుడేమైనా కట్టకట్టుకుని వెంట తీసుకుపోయిందా? లేదే? అందర్నీ నిండా అప్రతిష్ఠలో ముంచి వెళ్ళింది. వాళ్ళు చేసినపనికి తలెత్తుకుని తిరగలేకపోతున్నాం. ఐనా మా తమ్ముడికి మేమే చదువు చెప్పించాం. అమ్మనీ, నాన్ననీ మేమే చూసుకున్నాం. ఉద్యోగం వచ్చాక వాడి జీతం మాకేమైనా పంపించాడా? వాడిది వాడే తిన్నాడు. మా నాన్నపొలంలో మేమెందుకు వాటా వేస్తాం?” అన్నాడు రెండో ఆయన.
తండ్రి పొలమ్మీదా, ఆదాయంమీదే ముగ్గురు అన్నదమ్ములూ పెరిగి పెద్దయ్యారు. వెంకట్రావు ఇంటరు చదువుకుని వుద్యోగం వెతుక్కున్నాడు, వీళ్ళు అదీ చదవకుండా వ్యవసాయంలో వుండిపోయారు. అతను వుద్యోగం చేసి సంపాదించుకుంటే వీళ్ళు వ్యవసాయం చేసి సంపాదించుకున్నారు. భూములు మంచివి. రేగడినేలలు. పత్తి వేసి బాగా సంపాదించారు. కౌలుడబ్బుగురించి గొడవలుపడేవారని చెప్పింది అమృత. వెంకట్రావుకి ఉద్యోగం వుందిగాబట్టి ఏమీ యివ్వక్కర్లేదని వీళ్ళ అభిప్రాయం కావచ్చు. కానీ అవకాశాలు హక్కుల్ని తొలగించవు. అక్కడికీ తండ్రి స్వార్జితం కాజేశారు. అమృతకి వాటాలేకుండా చేసారు. అందరూ స్థితిమంతులే. ఎవరిమీద ఎవరూ జాలిపడే పరిస్థితి లేదు. అమృతమీదకూడా. హక్కుగా ఆమెకి వచ్చేవన్నీ వస్తే.
బాగా గొడవ జరిగింది. కొనేవాడిదగ్గిర అప్పటికే పదిలక్షలు అడ్వాన్సు తీసుకున్నారు. అతను అడ్వాన్సు వెనక్కి యిచ్చెయ్యమన్నాడు. అమృత పెత్తల్లులుకూడా బయటికి వచ్చి నానా తిట్లూ తిట్టారు. మూడురోజులగొడవ తర్వాత వివాదం సెటిలైంది. పిత్రార్జితంలో అమృతవాటా అమృతకి వచ్చింది. స్వార్జితంలోంచీకూడా వచ్చి వుంటే ఆమె వొడిదుడుకుల్లోంచీ తేలిగ్గా బయటపడేది. కానీ ఆమె పెత్తండ్రులకి అంత వుదారత్వం లేదు. చీటీల డబ్బు ఎవరిది వాళ్ళకి ఇచ్చేస్తే ఇంక కేసుతో అమృతకి సంబంధం వుండదని చెప్పాడు పోలీసు ఆఫీసరు. బంగారం అమ్మిందీ, పొలంలోవాటా అందుకు సరిపోయేలా వుంది.
“మా అప్పులేం చేస్తావు?” అని నిలదీస్తున్నారు అప్పులు ఇచ్చినవాళ్ళు.
“నాకు సంబంధం లేదు, మీ దిక్కున్నచోట చెప్పుకోండి” అనిపించవచ్చు అమృత చేత. పేపరు నోటిఫికేషనుకూడా ఇప్పించవచ్చు. ఆ పిల్ల భవిష్యత్తుకూడా దాంతో ముడిపడి వుంటుంది. అప్పులు ఎగ్గొట్టిందన్న నింద మీదపడిన పిల్లని విజయ్‌కి చేసుకోరు. పరపతి వదులుకోవడానికి మాధవరావు ఇంట్లో ఎవరూ వప్పుకోరు. ఇది మాధవరావు, విజయ్‌లకి మాత్రమే సంబంధించిన విషయం కాదు. వాళ్ళ వుమ్మడికుటుంబం అందరికీ సంబంధించినది. షేర్లలోంచీ వచ్చినంతవరకూ రాబట్టుకుని ఆ యిల్లు సరైన ధరకి అమ్మగలిగితే అప్పులు తీరతాయి. అమృత కట్టుబట్టలతో మిగిలినా మాధవరావు ఇంట్లోవాళ్ళకి అభ్యంతరం వుండదు. కానీ ఈ పరిస్థితుల్లో ఆ యిల్లు ఎవరు కొంటారు?
శ్యామ్మోహన్కి అంతుచిక్కట్లేదు. సరిగ్గా అప్పుడే త్రిమూర్తులు ఫోను వచ్చింది. రమ్మని.
వాసు యింట్లో మర్నాడు మామూలుగా అందరూ నిద్రలు లేచారు. కాఫీలు, టిఫెన్లు మొదలైన అవశిష్టాలన్నీ అయ్యాయి. తులసికూడా కాస్త తేలికపడింది. నరేంద్రని చూడటానికి పిల్లలు ముగ్గురూ బయల్దేరారు. మేఘన ఆ విషయంలో అంత వుత్సాహం చూపించకపోవడం గమనించింది మహతి. గీతకూడా. ఎంతలో ఎదుటివాళ్ల మనసు విరిచేస్తారు మనుషులు! ఏళ్ళుగా మహతి పెట్టలేకపోయిన దూరాన్ని ఇప్పుడు తనకి తను నిర్దేశించుకుంది ఆ పిల్ల. కానీ వెళ్ళకుండా వుండలేకపోయింది. బాధ్యతనించీ దూరంగా పోవటం సాధ్యపడలేదు ఆమెకి.
“నేనూ రావాలా? మీరు ముగ్గురూ వెళ్ళొస్తారా?” కారు కీస్ ఇస్తూ అడిగాడు వాసు.
“మేం వెళ్తాంలే” అంది మేఘన. “కారు నాకు ఇస్తే మరి నీకు?” అడిగింది.
“పెద్దగా పనులేం లేవులేవే” అన్నాడతను.
ముగ్గురూ వెళ్ళారు. ఆమె డ్రైవ్ చేస్తుంటే ఆరాధనగా చూసాడు హరి. వెళ్ళీవెళ్లగానే తండ్రి దగ్గిరకి చేరిపోయింది ఇందిర.
“ఎలా వుంది నాన్నా?” అని తండ్రి దగ్గరికి వెళ్ళి పలకరించి, వేణుతో మాట్లాడింది.
“ఏ ప్రాబ్లం లేదమ్మా! నాకు ఇంటినుంచీ కేరేజి వస్తోంది. సార్‌కి బ్రెడ్ పెట్టచ్చంటే తినిపించాను” అన్నాడతను. తర్వాత డాక్టరుని కలిసి మాట్లాడింది. నరేంద్ర హాస్పిటల్లో ఇంకా వుండాలన్నాడు సర్జన్. కాలు చీరుకుపోయినచోట కుట్లు వేసారు. అవి తీసాక డిశ్చార్జి చేస్తానన్నాడు. మందులూ అవీ చూసుకుంది. కేసుషీటు తీసుకుని చదివింది.
“నేను వెళ్తాను నాన్నా! ఇవాళనుంచీ వర్క్ ఫ్రం హోం. వీడియో కాన్ఫరెన్సుంది. పదింటికల్లా లాగిన్ అవాలి” అంది మరో ఐదునిముషాలు అతనిదగ్గర కూర్చున్నాక. ఆమె ప్రవర్తనలో తేడాని నరేంద్రకూడా గమనించాడు. ఏమైంది? ఇంట్లో ఏమైనా అన్నారా? తమది, అవసరం లేని బాధ్యత వాళ్ళకి. మేఘనకోసం మెహర్బానీగా వచ్చారుగానీ ఎన్నాళ్ళు చూస్తారు? అతని మనసు పరిపరివిధాల పోయింది.
“హరీ! నువ్వూ, ఇందూ రాగలరుకదా? లొకేషన్ షేర్ చేస్తాను. కేబ్ బుక్‌చేసుకుని వచ్చెయ్యండి. సెల్లో జీపీఆరెస్ యాక్టివేట్ చేసి పెట్టుకో. ట్రాక్ చేస్తూ వుంటాను” తండ్రికి మరోసారి బై చెప్పి బయల్దేరింది.
“అక్క ప్రిన్సెస్ నాన్నా!” అన్నాడు హరి ఆమె వెళ్తున్నవైపే చూస్తూ. “వాళ్ళింట్లో అందరికీ తనంటే చాలా యిష్టం. కానీ…” ఆగిపోయాడు.
“ఏమైంది?” అడిగాడు నరేంద్ర ఆతృతగా.
వాళ్ళు మాట్లాడుకుంటారని వేణు బైటికి వెళ్ళాడు.
“నిన్న చెల్లి మీతో అన్నమాటలు తను వింది. ఇంటికి వెళ్ళాక చాలా ఏడ్చింది. వాళ్ళంతా బాధపడ్డారు” అన్నాడు. నరేంద్ర ముఖం పాలిపోయింది. ముందురోజు ఇందు అన్నమాటలు తప్పే. ఫోన్ కాల్మీద కారిడార్లోకి వెళ్ళిన మేఘన వెంటనే తిరిగొచ్చింది. తను మాట మార్చేసాడు. అలాకాకుండా మేఘన వినేలా ఇందుకి తప్పని సర్దిచెప్పాల్సింది. ఇప్పుడనేకాదు, ఎప్పుడూకూడా తను మేఘన పొజిషన్ని ఎఫర్మేటివ్గా ఇంట్లో చెప్పలేదు. వచ్చేది, వెళ్ళేది. అంతే. ఆమె వున్న ఆ ఒక్కరోజో రెండురోజులో, ఇంట్లో ఎలాంటి గొడవా జరక్కుండా చూసుకోవటంతో సరిపెట్టేసాడు.
“ఎవరెవరుంటారు వాళ్ళ ఇంట్లో?” అడిగాడు.
“చాలామందే వుంటారు. మామ్మా, తాతయ్యా అని అక్క ఇద్దర్ని పిలుస్తుంది. ఇంకొకావిడ్ని అమ్మమ్మ అంటుంది. అత్తా, మామయ్య, పెద్దమ్మ, తులసి అనే ఆవిడ, పిన్నిట. ఇందరుంటారు. ఇందు అందరితోటీ రూడ్‌గా మాట్లాడుతోంది” అన్నాడు.
“నాకక్కడ వుండాలని లేదు. మేమిద్దరం మనింటికి వెళ్ళిపోతాం నాన్నా! నాకు అన్నం వండటం వచ్చు. పచ్చళ్ళు వేసుకుని తినేస్తాం. లేకపోతే కర్రీపాయింట్లో కూరలు తెచ్చుకుంటాం” అంది ఇందిర వెంటనే. కళ్లమ్మట నీళ్ళొచ్చేసాయి ఆ పిల్లకి.
“పెద్దవాళ్ళు లేకుండా ఇద్దరమే ఇంట్లో ఎలా వుంటాం ఇందూ? సేఫ్ కాదనికదా, వాళ్ళు మనని తీసుకెళ్ళారు? కొత్తవాళ్లతో పరిచయాలు చేసుకోవద్దని గీతగారు చెప్పారు. కర్రీపాయింట్లకీ వాటికీ తిరుగుదామా?”
“ఐతే అక్కనికూడా మనతో రమ్మను. తను పెద్దదేగా?”
“తనెందుకు వస్తుంది? వాళ్ళెందుకు పంపుతారు?”
“ఎందుకు రాదు? నాన్నకోసంకూడా రాదా?” అని అన్నని నిలదీసి, తండ్రితో ఫిర్యాదు చేస్తున్నట్టుగా అంది. ” నిన్న అన్నయ్య వాసుగారితో
లాంగ్‌డ్రైవ్‌కి వెళ్ళాడు. ఆయన పక్క మంచంమీద పడుకున్నాడు”
“అందరూ ఎవరిపనుల్లో వాళ్ళున్నారు. ఒక్కడినీ కూర్చుని వుంటే ఆయనే బైటికి వెళ్తూ నన్నూ రమ్మన్నారు నాన్నా! కాదంటే బావుండదని వెళ్ళాను. వాళ్ళందరూ మాట్లాడుకుంటూ ఒకదగ్గిర పడుక్కుంటారట. అక్క రమ్మంటే మేమూ వెళ్ళి పడుక్కున్నాం. ఇదేమో వాళ్ళందరితో గదిలో పడుక్కుంటే హాల్లో ఆ తాతయ్య, వాసుగారూ, నేనూ పడుక్కున్నాం” మొహమాటంగా చెప్పాడు హరి. నరేంద్ర ఆలోచనలో పడ్డాడు.
మహతి మళ్ళీ తన జీవితంలోకి రావాలనుకుంటోందా? వాళ్ళు ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నట్టే వున్నారు. అది సాధ్యమేనా? తనెప్పుడూ పిల్లలకి మహతిగురించి చెప్పలేదు. మేఘన ఏమౌతుందోకూడా పెద్ద వివరంగా చెప్పలేదు. ఆ పిల్ల నాన్నా అని పిలిస్తే వీళ్ళకి ఆశ్చర్యం. అసహనం. ఈ సంఘటనతో హరిలో కొంత మార్పు వచ్చినట్టే కనిపిస్తోంది. ఐతే ఒక ప్రశ్న. తను ఆ కుటుంబానికి చెందుతాననే ఫాంటసీలో పడ్డాడా? ఇందు, మహతిని స్వీకరించేలా లేదు. ఇందులో అటువంటి స్పర్థ వుంటే తనూ మహతీ మళ్ళీ కలవడం ఇంకో డిజాస్టర్‌గా మారుతుంది.
“చెల్లీ! గడుస్తున్నరోజులు మనకి నచ్చకపోతే ముందుముందు ఏం చెయ్యచ్చో ఆలోచించుకోవాలి. నాన్న ఇంకో మూడునాలుగురోజులు ఇక్కడే వుండాలి. మనం వాళ్ళింట్లో వుండక తప్పదు. నాన్న డిశ్చార్జై, మనింటికి మనం వెళ్ళాక ఏం చెయ్యచ్చో, ఎలా వుండచ్చో ఇప్పట్నుంచీ ప్లాన్ చెయ్యి” నచ్చజెప్తున్నట్టుగా అన్నాడు హరి. ఆ మాటలుకూడా అతనివిగా అనిపించలేదు నరేంద్రకి. కొడుకులో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. తల్లిపోయిన దిగులులో కుంగిపోయి వుండేవాడు. ఆ వయసు పిల్లల్లో వుండే వుత్సాహం అతన్లో పూర్తిగా తగ్గిపోయింది. ఒక్కరోజులో మార్పు చూసాడు నరేంద్ర.
“అక్కకి పెళ్లట నాన్నా! వాళ్ళ మామయ్యగారబ్బాయట. స్టేట్స్లో వుంటారట ఫేమిలీ అందరూ. అక్కావాళ్ల అత్తామామయ్యలు ప్రస్తుతం ముంబైలో వున్నారట. నువ్వు డిశ్చార్జైనతర్వాత వాళ్ళు చూసుకోవడానికి వస్తారట. అంతా ఆ బిజీలో వున్నారు” హరి మాటమార్చాడు.
“ఆవిడ్నికూడా వాళ్ళతో తీసుకెళ్ళిపోతారట” ఠపీమని అంది ఇందిర.
నరేంద్రకి అర్థమవలేదు.
“పెద్దమ్మనికూడా స్టుడెంట్వీసామీద తనతో తీసుకెళ్తుందట అక్క” హరి వివరించాడు. ఆమాటల్ని పెద్దగా పట్టించుకోలేదు నరేంద్ర. కానీ పెళ్ళి కుదిరిన విషయం మేఘన తనతో ఇంకా అనలేదు. ఎప్పుడనుకున్నారు, పెళ్ళి విషయం? ఏం పెట్టి అమెరికా సంబంధం చేస్తుంది మహతి? తనకి తెలిసి వాళ్లకి పెద్దగా ఆస్తులేం లేవు. ముంబైలో డీటీపీ సెంటరుమీద ఎంత సంపాదించి వుంటుంది? ఇల్లు గడిచిందేమో! అదీ వాళ్ళ నాన్న సహకారంతో. ఇక్కడ వాసుదేవ్వాళ్ళూ మంచిచెడులు చూసారేమో! వాసుదేవ్వాళ్ళు బాగా స్థిరపడ్డవాళ్ళు, స్థితిమంతులు. వాళ్లతో మేఘనకి పోలికేమిటి? వాళ్ళు తనకి సాయం చెయ్యడంలో ఏమైనా ఆశింపు వుందా? ఇప్పుడీ పెళ్ళికి డబ్బు సర్దాలా తను? మహతికి పెళ్ళిలో పెట్టినవన్నీ తిరిగి తీసేసుకున్నారు. ఇంకా తనకి బాధ్యత వుందా? ఎంతవరకు? అలాంటప్పుడు తన యిష్టాన్నీ స్థాయినీకూడా దృష్టిలోకి తీసుకోవాలికదా? తనని సంప్రదించాలికదా? అతను కణతలు రుద్దుకున్నాడు.
మేఘన తిరిగి ఇంటికి వచ్చేసరికి గీత, మహతి కూర్చుని మాట్లాడుకుంటున్నారు.
“జుగల్బందీ మొదలుపెట్టేసారా? మీకసలు చెప్పుకోవడానికి అన్ని కబుర్లేం వుంటాయి?” అడిగింది.
“అప్పుడే వచ్చేసావేమే?” అడిగింది గీత.
“ఆఫీసుపని వుంది అత్తా!” అందామె.
“ఎలావుంది మీ నాన్నకి?”
“బాగానే రికవరయ్యారు. ఇంకా హాస్పిటల్లో వుండాలట. కుట్లు తీసాక పంపిస్తామన్నారు. నన్నో గంటదాకా ఎవరూ పిలవకండి” చెప్పి, మేఘన వెళ్ళిపోయింది.
“ఆ చివరిగదిలో కూర్చో. ఎవరూ అటు రారు. వర్క్స్టేషనవీ వున్నాయి” వెనకనుంచీ కేకేసి చెప్పింది గీత.
“నిన్న మధ్యలో వదిలేసిన విషయాలు మొదలుపెట్టు” అంది మహతి.
“నువ్వు వాళ్లతో వస్తావాని అడుగుతున్నాడు నీ కొడుకు” అంది గీత ఆ మాటలు పట్తించుకోకుండా.
“కొడుకా? కొత్తగా వాడెవరు? నాకున్నది ఒక్క కూతురే” అంది మహతి ఎవర్నిగురించి అంటోందో మొదట అర్థంకాకపోయినా వెంటనే గ్రహించి తొణక్కుండా జవాబిచ్చింది.
“నిజంగానే అడుగుతున్నాను, వెళ్తావా, మహీ?” అడిగింది గీత.
“ఎందుకే, అందరూ ఇలా అడుగుతున్నారు? అతనికి ఒక కష్టం రాగానే జాలికురిసిపోతోందా?” కోపంగా అడిగింది మహతి.
We are dedicated to giving you the best content and quality time on our website.
When we started, our passion for the Telugu story drove us to create this website and form a community. Now, we serve Telugu readers all over the world and are thrilled to share our passion with you.
As an offering, we have stories, novels from well-known writers, reviews of renowned books, and translations as well.
We hope you enjoy our content. If you have any questions or comments, please reach us using the Contact Us form or write to us on somanchisridevi@gmail.com