తిరస్కృతులు – 24 by S Sridevi

  1. తిరస్కృతులు – 21 by S Sridevi
  2. తిరస్కృతులు – 22 by S Sridevi
  3. తిరస్కృతులు – 23 by S Sridevi
  4. తిరస్కృతులు – 24 by S Sridevi
  5. తిరస్కృతులు – 25 by S Sridevi
  6. తిరస్కృతులు – 26 by S Sridevi
  7. తిరస్కృతులు – 27 by S Sridevi
  8. తిరస్కృతులు – 28 by S Sridevi
  9. తిరస్కృతులు – 29 by S Sridevi
  10. తిరస్కృతులు – 30 by S Sridevi
  11. తిరస్కృతులు – 31 by S Sridevi

మనిషి వంటరిగా బ్రతికెయ్య గలననుకుంటాడు. ఎటువంటి భావోద్వేగాలూ తెలీని పిచ్చివాళ్లకో వాటిని జయించిన ఋషిపుంగవులతో తప్పించి అలాంటిది మామూలువాళ్లకి సాధ్యపడదు. నా ఏడుపు భరించలేక నాన్న డాక్టర్నడిగి రెండు కంపోజ్ మాత్రలు తెచ్చి బలవంతంగా మింగించారు. నిద్రలోకి జారిపోతుండగా అమ్మమ్మ అనడం వినిపించింది.
“ఈ గొడవల్తో ఇది బాగా పాడైపోతోంది. ఇలాగే వదిలేస్తే ఆరోగ్యం దెబ్బతింటుంది. కొద్దిరోజులు ఎటేనా వెళ్లిరండి” అంది. గాఢమైన నిద్ర పట్టేసింది.


పిల్లలు వెంటనే తిరిగొచ్చారు.
“పెద్దమ్మని హాల్లో పడుకోబెట్టారు. మీదన్నీ పూలదండలే. అక్కడంతా చాలామంది ఏడుస్తున్నారు… నాన్నకూడా. మేం వెళ్లగానే నాన్న పెద్దమ్మ దగ్గరికి తీసుకెళ్లి దణ్ణం పెట్టమన్నారు. పెట్టాము. ఇదేమో భయపడిపోయింది. వెంటనే తల తిప్పేసుకుని నాన్నని గట్టిగా పట్టుకుని ఏడుపు మొదలుపెట్టింది. నేను దణ్ణం పెట్టానమ్మా! నిద్రపోతోంది. నాకూ ఎందుకో ఏడుపొచ్చింది. ఆ తర్వాత మమ్మల్ని దాసుతో వెళ్లిపొమ్మన్నారు” సుధ అక్కడ జరిగినవన్నీ చెప్పింది.
నాకా దృశ్యం కళ్లకి కట్టినట్టు కనిపించింది. అదే పెద్ద హాలు… ఆరోజు నేను నడిచి వెళ్లినదే కావచ్చు. ఆ హాల్లో యాక్సిడెంట్లోనే సగం శిథిలమై ఆపైన పోస్టుమార్టం జరిగి పూర్తిగా ఆకృతి కోల్పోయిన ఆమె శరీరం దగ్గిర కూర్చుని హృదయ విదారకంగా ఏడుస్తున్న తండ్రీ పిల్లలు…
“అమ్మా! పెద్దమ్మని ఎక్కడికో తీసుకెళ్తారట. అక్కడినుంచీ ఇంక తిరిగిరాదట. నిజమేనా?” కళ్లలో నీళ్లు తిరుగుతుండగా అడిగింది సుధ.
నా గొంతు మూగవోయింది.
“చాలా మంచిదమ్మా, పెద్దమ్మ. ఇదలా అక్కడ ఏడుస్తూనే వుండేది. పెద్దమ్మకూడా ఎప్పుడూ ఏడుస్తూ వుండేది. దీన్నెప్పుడూ ఎత్తుకునేది. నాన్నెందుకు వాళ్ళింట్లో వున్నారు? ఒకసారైతే తన గొలుసులవీ వేసి పాపిడిపిందెలు పెట్టి పూలజడ వేయించి మాకు ఫొటో తీసింది. ఆ తర్వాత మమ్మల్ని దూరం నేట్టేసి, బాగా ఏడ్చింది. నాకప్పుడు భయం వేసింది. పెద్దమ్మలూవాళ్ళూ కూడా ఏడుస్తారా? వాళ్ళని ఎవరూ ఎత్తుకోలేరుకదా? ఎలా వూరుకుంటారు మరి? అమ్మా! పెద్దమ్మ యింక అసలే రాదా?” మళ్లీ అడిగింది. ఎన్నో ప్రశ్నలు. అనుబంధాలు ఏర్పడటానికి సరైన కారణం ఏదీ వుండదేమో!
“అసలు మనింటికొచ్చినపుడు వెళ్లద్దని చెప్తే యిక్కడే వుండిపోయేది” అంది.
“ఇక్కడికొచ్చిందని ఎవర్తోటేనా అన్నారేమిటే?” అమ్మమ్మ అప్పటిదాకా మౌనంగా వుండి ఒక్కసారి కంగారుగా అడిగింది. సుధ తల అడ్డంగా వూపింది. అందరం తేలిగ్గా నిశ్వసించాం.
ప్రమీలాదేవి మరణం నన్ను బాగా కదిలించింది. కులం. మతం, ఆస్తి, అంతస్తూ వేటికీకూడా అర్థం లేదనుకునేదాన్ని. కానీ అసలు అర్థమంటూ లేనిది జీవితానికేనని గ్రహించాను. ఏ అర్థం లేని మహాశూన్యం కాబట్టి దాన్ని ఏవేవో కృత్రిమవిలువల్తో నింపడానికి ప్రయత్నిస్తాం. ప్రమీలాదేవేనా అంతే, నేనేనా అంతే! ఐతే ఎవరి ప్రాథమ్యాలు వాళ్లవి.
కులమతాలు, సాంప్రదాయం, ఆస్థి, అంతస్తు అంటూ ఎన్నిటినో తనవనుకున్న ఆమె చివరికేం తీసుకెళ్లింది? పోనీ నేను? ప్రేమే అన్నీ అనుకుని ఏం మిగుల్చుకున్నాను? అంతులేని వంటరితనం, నాకంటూ ఎవరూ మిగిలిలేని భావశూన్యం. బతికున్నంతవరకేనా, ఆమె నమ్మకాలమేరకేనా ప్రమీలాదేవి కొన్నిటిని పొందగలింది. రాజ్‍మోహన్ తనవాడని అధికారికంగా చెప్పగలిగింది. కొన్ని చేసింది. అతన్నుంచీ హక్కుగా కొన్ని ఆశించింది. పొందగలిగింది. వాస్తవాలని నమ్మి వాస్తవాల్లోనే బ్రతికింది. ఇప్పుడతను ఆమెని తలుచుకుని ఏడుస్తుంటాడు. ఆమె వియోగం అతన్ని కృంగదీస్తుంది. అతని జీవనశైలిని మారుస్తుంది. మరి నేను?
ఊహల్లో బ్రతికి గాల్లో గిరికీలు కొడ్తున్నాను. ఎలా? ఈ బ్రతుకెలా వెళ్తుంది? డబ్బు సంపాదించు కోవడం, దాన్ని ఖర్చు పెట్టుకుంటూ బ్రతకడం, ప్రభాకర్‍లాంటి మరే వ్యక్తో యింకెప్పుడో తటస్థపడి నన్ను మరింత బలంగా ఆకర్షిస్తే నా బతుకేదో అతన్ని ఆధారం చేసుకుని లాగించడం కాదు… ఈ సంఘ ర్షణ, ప్రవాహానికి ఎదురీత లేకుండా వుండలేనా? రేపు సుధా, సుమలు పెద్దౌతారు. వాళ్ల భవిష్యత్తేంటి? ఈ సంఘం వాళ్లని తన వొరవడిలో యిముడ్చుకుంటుందా? లేక నన్నుబట్టి వాళ్లకీ ఎదురీత తప్పదా? వాళ్లు నన్ను యీ అనిశ్చితికి నిలదీస్తారా? నిందిస్తారా? ఈ విషయాలు రాజ్ దగ్గరకి వెళ్ళేముందు ఎందుకు ఆలోచించలేకపోయాను? ఇలాంటివి ఎవరూ నేర్పరు. మనకి మనమే తెలుసుకోవాలి. తెలిసే విధంగా పెరగలేదు నేను.
బాధ… బాధ… బాధ…
ఇప్పుడు జరిగిన యీ సంఘటనల తదుపరి పరిణామంగా రాజ్ నన్ను రమ్మంటాడా? వెళ్లద్దని అంత కచ్చితంగా అనుకున్న నాలో మళ్లీ ఎందుకీ వూగిసలాట? నేనుకూడా ఈ సంఘపు ఆలోచనాసరళికి అలవాటుపడుతున్నానా? అతను రమ్మంటే నేనేం చెయ్యాలి? రమ్మంటే ఈ ప్రశ్న రమ్మనకపోతే మరొక సమస్య.
“వసూ! ఆమె చనిపోతే నువ్వెందుకే యింత బాధపడటం?” అమ్మ అడిగింది వింతగా.
“ఆమెని చావువైపుకి తోసుకెళ్లింది నేనేనేమో!” అన్నాను. “ఆమె చనిపోయినందుకు కాదు బాధ. ఆమె జీవితంలోకి చొరబడి అంతా చిందరవందర చేసాననే అపరాధభావన” అన్నాను. “
“జరిగిపోయినదానికి ఎంత బాధపడేం లాభం? ఈ బాధనేది నీ చుట్టూ ఒక దుర్భేద్యమైన గోడలా ఏర్పడి మిగిలినవాళ్లని దూరం చేస్తోంది. నువ్వు ఏడుస్తుంటే పిల్లలు నీదగ్గిరకి రావటానికి భయపడ్తున్నారు. వాళ్ళ నాన్నకోసం తల్లడిల్లుతున్నారు. నేను చేసిన తప్పులు నువ్వు చెయ్యద్దు. మిమ్మల్ని దగ్గిరకి తీసి పెంచలేదు నేను. దూరదూరంగానే వుంచాను. ఇప్పటికీకూడా మన మధ్య ఆ ఎడం అలాగే వుంది. మీ మనసుల్ని చదివే శక్తి లేదు నాకు. నేనేంటో నా అభిరుచులూ, భావాలూ ఏంటో మీకు బోధపరచి ఒక మార్గదర్శిగా మీ మనసులమీద ముద్ర వెయ్యలేకపోయాను” అంది. ”
సాధారణంగా ఆడపిల్లలు తల్లినీ మగపిల్లలు తండ్రినీ అనుకరిస్తారు. అలా అనుకరించగలిగితేనే కుటుంబవ్యవస్థలో సౌలభ్యత వుంటుంది. తండ్రి తను తప్పులు చేస్తూ అవి తప్పులని తెలుసుకాబట్టి పిల్లలు తనలా వుండకూడదని ఆశిస్తాడు. అలాగే తల్లి తను స్త్రీగా ఎదుర్కొంటున్న వివక్షతని దృష్టిలో వుంచుకుని తను కన్నవాళ్లు తనని మించి ఎదగాలని అనుకుంటుంది. అంటే భార్యని గౌరవించని భర్త, భర్త ఆధిక్యతకి విలువివ్వని భార్య… ఇద్దరి ఆకాంక్షలూ ఒకలా, ఆచరణ మరోలా… తాము రూపుదిద్దుకోవడానికి సరైన మూస లేని పిల్లలు… ఆ పిల్లలే మళ్లీ రేపు తల్లులూ తండ్రులూ…
“వసూ! ఇప్పటిదాకా జరిగినవేవో జరిగాయి. నువ్వు పెళ్లిచేసుకోవడం తప్పని నేననుగానీ ప్రయత్నపూర్వకంగా వద్దు. కొన్నిటిని కాలానికే వదిలెయ్యాలి” అంది.
విన్నాను. తను చెప్పింది వాస్తవమే! చదువుకుని ఉద్యోగం చేస్తూ కూడా మగవాడితో సమానమైన గౌరవం పొందని ముందుతరం స్త్రీగా అమ్మ- నాన్నకి కొంత లొంగుతూనే కొంత దూరాన్ని మెంటేన్ చేసింది. ఒక డొల్లలాంటి ప్రపంచాన్ని తనకోసం సృష్టించుకుని అందులో వుండిపోయింది. ఇప్పుడు నేను కూడా అలాంటి డొల్లని సృష్టించుకుంటున్నానని ఆమె భయం. అతికష్టమ్మీద నా ఆలోచనల్ని మరల్చుకుని దుఃఖాన్ని నియంత్రించుకుంటున్నాను. నా ఫోన్ నెంబరు అందరికీ తెలిసిపోయింది. ఎవరో ఒకరు చేస్తూనే వున్నారు. మొదట కళావతిగారు చేసింది.
“ఎలా వున్నావమ్మా, వసంతా? ఉన్నట్టుండి కనిపించకుండా పోయేసరికి ఏం జరిగిందో తెలీక చాలా కంగారుపడ్డాం. నీ విషయాలన్నీ తెలిసాయి. చాలా అన్యాయం జరిగిందమ్మా నీకు. అసలింత ధైర్యంగా తట్టుకుని ఎలా నిలబడ్డావోనని ఆశ్చర్యంగా వుంది. నీకిద్దరు పిల్లలటగా? ఎక్కడున్నారు వాళ్ళిప్పుడు?” అడిగింది వాత్సల్యాన్ని కనబరుస్తూ.
ఒకప్పుడు ఆమె ఎవరో నాకు తెలీదు. ఆమెకీ నేను తెలీదు. పూర్తిగా అపరిచితులం. అలాంటిది యిప్పుడీ ప్రేమ… ప్రేమంటే పరిచయంవలన కలిగే యింటరాక్షనా? కెమికల్ యీక్వేషన్స్‌లా మనిషి+పరిచయం= ప్రేమ అని వేసుకోవచ్చా? ఎవరితోటీ ఎలాంటి సమస్యలనీ ఉత్పన్నం చేయని ప్రేమ… రాజ్ విషయానికొచ్చేసరికి యింత సమస్యాత్మకంగా తయారైందేం?
“ఏమ్మా? మాట్లాడవు? నా గొంతు వినిపిస్తోందా?” అడిగేసరికి ఆలోచనల్లోంచీ తేరుకున్నాను. “
“వాళ్లిప్పుడు నా దగ్గిరే వున్నారండీ!” అన్నాను. తర్వాతి ప్రశ్నని ఎదుర్కోవడానికి సంసిద్ధమయ్యాను.
“నువ్వూ, ప్రభాకర్ పెళ్లి చేసుకోబోతున్నారని తెలిసింది. శుభలేఖకోసం ఎదురు చూస్తున్నాము. నీతో సంబంధాలు తెగిపోయాయి. ఏమయ్యావో తెలీదు. మార్కెట్లో ఆ నల్లటికుర్రాడు మైకేల్ కనిపించి చెప్తే తెలిసాయి. చదువుకున్నదానివి నువ్వూ యిలా రెండోపెళ్లికి భయపడితే ఎలాగ?” అంది. నేను సుదీర్ఘంగా నిశ్వసించాను. జవాబు చెప్పేంతలో రావుగారి గొంతు వినిపించింది.
“రాజ్‍మోహన్ నాకు తెలుసు వసంతా! పెద్దగా పరిచయం లేదుగానీ ఒకటి రెండు సందర్భాల్లో చంద్రలేఖ ఇంట్లో కలిసాము. నేను చెయ్యగలిగినదేమైనా వుంటే చెప్పు. అతన్తో కూర్చుని మాట్లాడతాను. జీవితం అన్నాక పొరపాట్లు జరుగుతాయి. అతనిదీ తప్పుందిగా? మనుషులింత బాధ్యతారహితంగా వుంటే ఎలా? నువ్వసలు యీ వూరొదిలేసి, నీ కన్సల్టెన్సీ వదిలిపెట్టి ఎందుకు వెళ్లిపోయావు? ధైర్యంగా నిలబడి ఎదుర్కోవాలి? నా కూతురికేనా నేనిలాగే చెప్తాను. అసలు ప్రభాకర్తో ఏమిటి సమస్య? పిల్లలొచ్చేసరికి పెళ్ళి వద్దనేసాడా? మనసు మార్చుకున్నాడా?” ఆయన గొంతు ఖంగుమంది.
“అతను కాదంకుల్, నేనే వద్దనుకున్నాను. వీళ్ళు ప్రభాకర్ని తండ్రిలా వప్పుకోలేకపోతున్నారు. ఒకవేళ వప్పుకున్నా అతనుమాత్రం ఎంతకాలమని వీళ్ల బరువు మొయ్యగలడు? అలాగని ఎందుకంటున్నానంటే వాళ్ల మధ్యని వుండేది నేచురల్‍బాండ్ కాదు. ఇచ్చిపుచ్చుకోవడంమీద ఆధారపడి వుంటుంది. వాళ్లది యింకా ఆశించే వయసేగానీ యిచ్చే వయసుకాదు. అతను ఎంతకాలం అలా యివ్వగలడని?”
“అందుకు నీ భవిష్యత్తు పాడుచేసుకుంటున్నావా? పెద్దవాళ్ళెవరూ లేరా? పిల్లల్ని చూసుకోలేరా? రాజ్‍మోహన్‍కి బాధ్యత లేదా? లేకపోతే హాస్టల్లో వేస్తే వాళ్ళు వుండలేరా?””
“ప్రభాకర్నే చేసుకోవాలన్నంత బలమైన కోరిక నాలోనే లేదేమోనండీ!” అన్నాను.
“సరే! అంత బాగా నడుస్తున్న కన్సల్టెన్సీ ఎందుకు మూసేసావు? వసంతా! నువ్వొకసారి యిటొస్తావా? లేక నన్నే అటు రమ్మంటావా? ఆంటీ నేనూ వీలుచూసుకుని రామా?””
“నేనే వస్తానండీ” అన్నాను తప్పించుకోవడానికి. నాకక్కడికి వెళ్లాలనిగానీ అక్కడ నేనొదిలిపెట్టేసి వచ్చిన జీవితానికి జవాబుదారీ తీసుకోవాలనిగానీ అనిపించలేదు.
“నువ్వు వచ్చేటప్పుడు పిల్లల్ని తీసుకురా వసంతా! వాళ్లెలా వుంటారో చూడాలనుంది” అంది కళావతిగారు.
మనిషిని పట్టి వుంచే చట్రం వదులౌతోంది. వాళ్ల దృక్పథం విశాలమౌతోంది. నాలాంటివాళ్లని తక్కువగా చూసే బదులు నాణెం మరో పార్శ్వాన్ని కూడా స్పృశిస్తు న్నారు. ఆవిడ చదువుకున్నది. నాలుగువైపులా మనుషుల్ని చూసింది. మనస్తత్వాలు చదివింది. కష్టసుఖాలని అర్ధం చేసుకుంది. అందుకే నా వ్యక్తిగత జీవితంలో తప్పు ఆవిడకి కనిపించలేదు. తప్పే అనిపించినా సరిదిద్దాలని చూస్తోంది.
ఆవిడకి పూర్తిగా భిన్నమైన వ్యక్తి చంద్రలేఖ.
“మా ప్రమీల నీగురించే చచ్చిపోయింది. డ్రైవింగ్‍లో తను చాలా ఎక్స్‌పర్ట్. అసలది యాక్సిడెంట్ కానేకాదు. సూసైడ్‍. జీవితంమీద విరక్తి పెంచుకుంది. నిర్లక్ష్యంగా డ్రైవ్ చేసింది. అందుకే అలా…” అంది మొట్టమొదటే.
“ప్రమీలాదేవి నీకేమౌతుంది?” కుతూహలంగా అడిగాను.
“అక్క… అక్కంటే పెద్దమ్మ కూతురు. నలుగురు మగపిల్లల తర్వాత ఒక్క ఆడపిల్లని ఎంతో అపురూపంగా పెంచారు తనని. పెళ్లయ్యాక అన్నీ కష్టాలే. అతను అమ్మాయిల్తో తిరిగేవాడు. తిరుగుబోతు, తాగబోతు ఐనా వోర్చుకుంది. కానీ ఎవర్నో తెచ్చి పెట్టుకున్నాడనేసరికి తల్లడిల్లిపోయింది. మాయిళ్లలో తరచు యీ విషయం చర్చకొచ్చేది. వసంతా! నిన్ను చూస్తే ఎంతో సివిలైజ్డ్‌గా కనిపించావు. అంత కల్చర్ లేకుండా ఎలా ప్రవర్తించేవు? పరాయి మగవాడిని ఆకర్షించి వల్లో వేసుకోవాలని ఎలా అనిపించింది? నాకిప్పటికీ షాకే. అక్కాబావలిద్దరికీ మధ్యనున్నది నువ్వేనంటే… సిగ్గుపడాలి నువ్వు” అంది ఆవేశంగా. నేను రిసీవర్ పెట్టేసాను. నాకిప్పుడు కళావతిగారి ఔన్నత్యంలో గొప్పతనం కనిపించలేదు. ఇద్దరూ సమానంగానే అనిపించారు. అన్ని పొరలూ తొలగిపోయాక కనిపించే స్వచ్చమైన దృశ్యానికి నా కళ్ళు అలవాటుపడ్డాయి.


రోజులు దొర్లిపోతున్నాయి. దాదాపు నెల గడిచింది. రాజ్ పిల్లలకి ఫోన్ చేస్తున్నాడు. వాళ్లతో కాంటాక్ట్ వుంటున్నాడు. వాళ్ల సంభాషణలో నా ప్రస్తావన రావడంలేదు. నేను ప్రభాకర్ దగ్గిరకి వెళ్లిపోయాననుకున్నాడేమో! అతని కాల్‍కోసం పిల్లలు ఆత్రంగా ఎదురుచూస్తారు. నాకు నిరాసక్తంగానే వుంది. మాట్లాడే ప్రయత్నం చేయలేదు. వీళ్లని ఏదో ఒకటి చేయాలి. ముందు వీళ్లనో స్కూల్లో పడేసి చేసి నేను వీళ్ల వెనక ప్రయాణం మొదలుపెట్టాలి. అదెక్కడ?