తిరస్కృతులు – 30 by S Sridevi

  1. తిరస్కృతులు – 21 by S Sridevi
  2. తిరస్కృతులు – 22 by S Sridevi
  3. తిరస్కృతులు – 23 by S Sridevi
  4. తిరస్కృతులు – 24 by S Sridevi
  5. తిరస్కృతులు – 25 by S Sridevi
  6. తిరస్కృతులు – 26 by S Sridevi
  7. తిరస్కృతులు – 27 by S Sridevi
  8. తిరస్కృతులు – 28 by S Sridevi
  9. తిరస్కృతులు – 29 by S Sridevi
  10. తిరస్కృతులు – 30 by S Sridevi
  11. తిరస్కృతులు – 31 by S Sridevi

నేనుకూడా నాకున్న పరిచయాలన్నీ తిరగేసుకున్నాను. అక్కడున్న ఒక ఈవెంట్ మేనేజిమెంటు కంపెనీలో దక్షిణాది రాష్ట్రాల పెళ్ళిళ్ళ వింగ్‍లో చిన్న అవకాశం వచ్చింది. తేలిగ్గా నిట్టూర్చాను, అడుగుమోపడానికి చిన్న సందేనా దొరికిందని. అమ్మావాళ్ళు ప్రయాణం ఏర్పాట్లు మొదలుపెట్టారు.
రాజ్‍మోహన్‍కి దూరంగా వెళ్ళిపోవటమే నా ఆలోచనకాబట్టి అతనికి చెప్పలేదు. ముందే అతనికి చెప్పటం ఇష్టంలేదు. అతను ఏవేవో అఫర్స్ యిస్తాడు. వాటిని వప్పుకోలేను. అతనికి మగపిల్లలతో ఎంతవరకూ అనుబంధం వుందో నాకింకా తెలీదు. అక్కడి పిల్లలు కరోడాలు. తండ్రి మాట వినరు. ఇక్కడి పిల్లలు వెన్నముద్దలు. అందుకని ఇక్కడికి పారిపోయి వస్తాడు. విజయవాడకి విజిట్లు కొట్టినట్టే అక్కడికీ మొదలుపెడతాడు. ఎక్కడో ఒకచోట ఇది ఆగాలి. కనీసం కొన్నాళ్ళు.
వరంగల్లో విషయాలు తెలిపాయి. మధుకర్ తను నడుపుతున్న ఫినాన్స్ కంపెనీ బోర్డు తిప్పేసి పారిపోయాడట. రెండుకోట్లట ముంచినది.
రూసీ ఎవర్నో ప్రేమించానని యింట్లోంచీ వెళ్లిపోయింది. మైకేల్ తమ్ముడిని ఫీజులు కట్టలేదని హాస్టల్లోంచీ పంపేస్తే అతడసలు ఇల్లే పట్టకుండా తిరుగుతున్నాడు. తండ్రి వున్నా లేనట్టే. తల్లీ తనూ ఒకరికొకరం మిగిలామనీ తనని మర్చిపోవద్దనీ మేరీ ఏడుస్తూ చెప్పింది.
“మీ నాన్నగారి ఆఫీసులో కంప్లెయింటు చేస్తే జీతం ఇప్పిస్తారనుకుంటా మేరీ! ఒకమాటు రామకృష్ణతో మాట్లాడు. అతన్తో వెళ్ళి ఆంటీని కంప్లెయింటు ఇవ్వమను” అని చెప్పాను.
“అవన్నీ అయ్యాయి వసంతా! జీతం కేష్‍లో యిచ్చినప్పుడు నాన్నని బెదిరించి కొంత జీతం మాకు ఇప్పించేవారు. తర్వాత నాన్న బేంకు అకౌంట్లో పడుతోంది. ఆయనింక మాకు దొరక్కుండా పోయాడు. కోర్టుకెళ్ళి అటాచిమెంటు తెచ్చుకోవాలట. పాతవాళ్ళు చాలామంది రిటైరయ్యారు. మాకసలు అక్కడ పలికేవాళ్ళే లేరు” అంది. ఈమాటలన్నీ పొద్దుటి కాల్‍లో జరిగాయి. ఆరాత్రికే రెండో ఫోను. ఆయన పోయాడట. మురిక్కాలువ పక్కని పడి వుంటే ఎవరో పోలీసు కంప్లెయింటు ఇచ్చారట. అలా ముగిసింది ఆయన కథ.
చక్కగా బతకమని ఓ జీవితాన్ని దేవుడూ, భార్యాపిల్లలని సమాజం, బతుకుతెరువుకి వుద్యోగాన్ని ప్రభుత్వమూ ఇస్తే బతకడం చేతకాని మనిషి. ఆయన బెనెఫిట్స్ లక్షలల్లో వస్తాయి. కానీ ఆ పిల్లలు పోగొట్టుకున్న జీవితాలు తిరిగి రావు.


ప్రయాణం రోజు రానే వచ్చింది. నా సామాన్లన్నీ పేక్‍చేసి తెలిసిన కుర్రాడితో విజయవాడ స్టేషన్‍కి పంపించాను. అమ్మానాన్న బయల్దేరారు. అమ్మమ్మ పిల్లల్ని వదల్లేకపోతోంది. మాతో తననీ రమ్మన్నాను. రానంది.
“కుటుంబం అన్నాక ఒక నెలవు వుండాలి. నేనున్నంతకాలం యీ యిల్లు వుండాలి. మీరు అక్కడ కాస్త కుదురుకున్నాక ఎవరో ఒకరు వచ్చి తీసుకెళ్దురుగాని. చూసి వస్తాను” అంది.
స్టేషనుకి రమ్మన్నాను.
“వద్దమ్మా! మీరంతా వెళ్లిపోయాక ఒక్కదాన్నీ వెనక్కి తిరిగి రాలేను” అంది.
స్టేషను చేరేసరికి అమ్మ, నాన్న మాకోసం ఎదురు చూస్తున్నారు. అందరం కలిసి ప్లాట్‍ఫాంమీదికి వెళ్లాము. రైలు రావటానికింకా చాలా టైముంది. సుధ చుట్టూ చూస్తోంది. ఎందుకోననుకున్నాను.
“అదుగో నాన్న!” వున్నట్టుండి అరిచింది సంతోషంతో. అక్కడ సిమెంట్ బెంచీమీద కూర్చుని పేపరు చదువుకుంటున్న వ్యక్తి ఆ మాటలు విని మాకేసి తల తిప్పేసరికి అదిరిపోయాను. రాజ్… రాజ్‍మోహన్ !
“ఇప్పుడెక్కడికి పారిపోతున్నారు మేడమ్?” నా దగ్గిరకొచ్చి చేతులు కట్టుకుని నిలబడి సవినయంగా అడిగాడు. వెంటనే కోపంగా, “నీకిలా పారిపోతుండటం అలవాటా? కొంచెం బిజీగా వుండి నేను ఫోన్ చెయ్యట్లేదు. సుధ ఫోన్ చేసి చెప్తే నాకు తెలిసింది. ఊరెళ్తున్నాం నాన్నా అంది. ఎక్కడికో, ఎప్పుడో, ఏ వూరో తెలీదు దానికి. ఆ వొక్క మాట పట్టుకుని ఇంత పెద్ద స్టేషన్లో ఇంతమంది జనం మధ్య ఎలా పట్టుకోను నిన్ను? మీ అమ్మమ్మకి ఫోన్ చేస్తే ముంబాయని చెప్పింది. ఆవిడకి నువ్వు చెప్పింది నిజమేనా, అలాగని చెప్పి ఇంకెక్కడికేనా వెళ్తున్నావో తెలీదు. నీ కన్సెల్టెన్సీవాళ్ళే సాయం చేసారు. తెల్లారుగట్టనుంచీ అంటించిన చార్టు అంటించినట్టు చదివి నీ పేరుందేమోనని వెతికారు. సుధకి నా సెల్ నెంబరు… అంత పెద్ద నెంబరు నొక్కడం దానికి చాతకాలేదట. ఎన్నోసార్లు ట్రైచేస్తేగానీ కలవలేదట. అసలు నువ్వే నాకెందుకు చెప్పలేదు?” అడిగాడు. సుధకి అతని ఫోన్ నెంబరు ఎలా తెల్సిందనే విషయంలో నాకెలాంటి ప్రశ్నా లేదు. వాళ్ళ బొమ్మలమీద మార్కరు పెన్నుతో రాస్తూ వుంటాడు. వాళ్లకి అలా తల్లిదీ తండ్రిదీ ఫోన్ నెంబర్లు చిన్నప్పట్నుంచీ అలవాటైపోవాలట.
ఎవరైనా మమ్మల్ని గమనిస్తున్నారేమోనని అమ్మ భయంగా చుట్టూ చూసింది.
“మీరుకూడా వెళ్తున్నారా, ఈవిడ ఒకర్తేనా?” అడిగాడు.
“అందరం వెళ్తున్నాం” అంది అమ్మ.
“ముంబై షిఫ్టౌతున్నాం. అక్కడికెళ్లాక ఫోన్ చెయ్యచ్చనుకున్నాను” ముక్తసరిగా అన్నాను. అతను హర్టయ్యాడు. ఐనా సర్దుకుని, “ఓకే. ఎక్కడుంటున్నారు? ఇల్లు దొరికిందా?” అడిగాడు. చెప్పాను. ముఖం చిట్లించాడు.
“నాకక్కడ ఫ్లాటుంది. ప్రస్తుతం ఎవరో వున్నారు. ఖాళీ చేయిస్తాను. అంతదాకా ఈ అడ్రెస్‍లో వుండండి. పిల్లల అడ్మిషన్లవి నేను చూసుకుంటాను” అన్నాడు. నేను వుండబోయేది మిడిల్‍క్లాస్ ఏరియా కావచ్చు. అందుకే అతను ముఖం చిట్లించాడు. అలాగే పిల్లల చదువు. అతనంత ఎత్తుకి నేను ఎగరలేను. అతనే మళ్లీ అన్నాడు. “
“వసూ! నాకు దూరం జరగాలనే ప్రయత్నంలో నీకు నువ్వు హాని చేసుకోకు. నీకు దూరంగా వుంటేనే మగపిల్లలకి దగ్గరౌతాననే ఆలోచనకూడా సరైనది కాదు. ప్రస్తుతానికి అంతా చక్కబడేదాకా నీమాటే కానిద్దామనుకున్నాను. ఇద్దరు పెద్దవాళ్లతో, ఇద్దరు పిల్లల్తో ముక్కూమొహం తెలినిచోటకి ఎలా బయల్దేరావు? వరంగల్లో ఉన్నట్టే ముంబైలోనూ వుంటుందని ఎలా అనుకుంటావు? ప్లీజ్… నీ దారికి నేను అడ్డురాను. కానీ నువ్వు సెటిలయ్యేదాకా నా మాట విను” అన్నాడు.
“నీ డబ్బు, నువ్విచ్చే కంఫర్ట్స్ చూసి నీ వెంట పడ్డానని మా అమ్మా, నాన్న అనుకునేలా చెయ్యకు” అన్నాను.
అతనింకేం అనలేదు. ట్రెయినొచ్చింది. మమ్మల్ని ఎక్కించి అది కదిలేదాకా వున్నాడు.
స్టేషన్‍కి రాజ్ ఏర్పాటు చేసిన కారొచ్చింది. వద్దని తిప్పి పంపేసాను. అమ్మా, నాన్నా కల్పించుకోలేదు. టాక్సీ చేయించుకుని నాన్న ఫ్రెండింటికెళ్లాము. వాళ్లు మమ్మల్ని సాదరంగా ఆహ్వా నించారు. మాకోసం పగిడీ కట్టి తీసుకున్న ఫ్లాటు చూపించారు. రెండు చిన్న చిన్న బెడ్రూములు, హాలు. యింకా చిన్న వంటిల్లు… అందరం అందులోనే సర్దుకోవాలి.
సామాన్లు తెచ్చుకుని అన్నీ సర్దుకుని రొటీన్ పడేసరికి కొంచెం టైం పట్టింది. కొత్త మనుషులు… కొత్తపరిసరాలు… కానీ మనసూ, అనుభవం పాతవే. నాన్న జాబ్‍లో చేరారు. అందులో అవమానం, బాధ వున్నాయి. దాన్ని పంటిబిగువుని సహించారు.
“నేను చేసింది తప్పేకదా? ” అన్నారు నిర్లిప్తంగా. “తప్పుచేసిన నేనే గొప్ప జీవితాన్ని కోరుకుంటే చెయ్యనివాళ్ళకి ఇంకెంత ఆశ వుంటుంది? ఆ ఆశ నీ పిల్లల కళ్ళలో చూస్తున్నాను వసూ! అవి నీకు దారి చూపించే దీపాలు” అన్నారు.
నేనూ ఒక అసైన్‍మెంటు చేసాను. కాళ్ళకింది నేల గట్టిపడుతోంది. మళ్లీ ఫంక్షన్లు, డెకరేషన్లు, పెళ్లిళ్లు… ఆవృతవృత్తంలా నన్ను చుట్టుకుంటున్నాయి. రాజ్ ఫోన్ చెయ్యలేదు. అతనికి చాలా కోపం వచ్చివుంటుంది. నాకులాగే అతని మనసూ విరిగిందేమో!


ప్రపంచం ఎంత విశాలమైనదో అంతగానూ యిరుకైనది. మనం కోరుకునే వ్యక్తులు అందనంత దూరాన్న వుంటారు. మనకి అవసరంలేనివాళ్లు మాత్రం అవాంఛనీయంగా తారసపడతారు. ఒక ఫంక్షన్లో కపాడియాని చూసాను. నేను రాజ్ దగ్గరున్నపుడు పార్టీల్లో కలిసాము. ఇప్పుడు చూసి గుర్తుపట్టాడు. “హౌ యీజ్ రాజ్?” అని అడిగాడు. నవ్వేసి వూరుకున్నాను.
“ఒక్కదానివే వుంటున్నావా?”” అడిగాడు మళ్లీ. ఏకవచనంలో. ఇబ్బందిగా అనిపించింది.
బైటపడ్డాడు. “రాజ్ ముసలాడు. పెళ్లాం పోయాక వైరాగ్యంలో కూడా పడ్డట్టున్నాడు. అందుకే నిన్నొదిలేసాడు. నీలాంటి అందమైన అమ్మాయిల్ని ఎలా చూసుకోవాలో వాడికి రాదు. అందుకే నా దగ్గరకి వచ్చెయ్ బేబీ!”” అన్నాడు ఎవరూ లేకుండా చూసి.
నా గుండె సర్రుమని కోసినట్టయింది. రాజ్‍మోహన్ ఎప్పుడూ నన్ను తక్కువగా చూడలేదు. ప్రమీలాదేవిని ఎలా చూసేవాడో నాకు తెలీదు. నన్ను మాత్రం భార్యకి తక్కువస్థాయిలో చూడలేదు. నాకలా ఎప్పుడూ అనిపించలేదు. అతనికీ నాకూ కనిపించని స్థాయీభేదం బైటివాళ్లకి కనిపించేదా? అంతేననిపించింది కపాడియా ప్రవర్తనతో.
చెంప పగలగొట్టి ఇంటికి వచ్చాను. అవమానం. గుండెల్నిండా బాధ. రాత్రి కాళరాత్రైంది. ఓ గదిలో అమ్మ, నాన్న. మరో గదిలో పిల్లల మధ్య నేను. ఏడుపు తన్నుకొస్తోంది. నేను రాజ్ దగ్గరకి వెళ్లిన కొత్తలో ఎందరో ఎన్నోరకాలుగా నన్ను అన్నారు. అప్పుడు ప్రేమ మత్తులో వున్నాను. ఆపైన రాజ్ సపోర్టుండేది. మరిప్పుడు? వంటరిగా యీ మనుషుల్తో పోరాడాలి. ఎందుకు? నా బతుకు నేను బతుకుతుంటే ఎందుకిలా? ఎంత బాహాటంగా అడిగాడు! రగిలిపోయింది. ఏమిటీ, యిందులో అతడికి లభించేది? అనుభవించడానికి అమ్మాయిలే కావాలనుకుంటే అలాంటి అభిరుచిగలవాళ్లు కోకొల్లలు. కానీ నన్ను అడిగాడు అంటే? అహం చల్లార్చుకోవడానికా? రాజ్‍ని దెబ్బతీసానన్న తృప్తికోసమా? రాజ్ ప్రమీలాదేవినే వొదిలేసివుంటే ఆమెకీ యిలాంటి సమస్య ఎదురయ్యేదా? ఇలాగే అడిగేవాడా? కపాడియాని నేనెలా ఎదుర్కోను? అతను నన్నింతటితో వదిలి పెడతాడా? ఇంకా ముందుకెళ్తాడా? ఇలా అడిగేవాళ్లింకెంతమంది తారసపడతారో? వాళ్లందరితో ఎలా?
నిద్ర పట్టలేదు. పిల్లలమధ్య నేను అటూయిటూ కదుల్తూ వుంటే వాళ్లు లేచి కూర్చుంటారేమోనని నెమ్మదిగా మంచం దిగి కిటికీ దగ్గరకొచ్చి నిలబడ్డాను. బైటంతా చీకటి. అలా చీకట్లో చూస్తూ ఎంతసేపు నిలబడ్డాఅను. భుజంమీద చెయ్యి పడేసరికి ఉలిక్కిపడ్డాను. నాన్న! “పడుకోమ్మా! ఇంత రాత్రిదాకా మేలుకోవడం మంచిదికాదు” బాధగా అన్నారు.
“జరిగిపోయిన వాటిగురించీ జరగటం సాధ్యపడనివాటిగురించీ కన్నీళ్లెందుకు వసూ? వద్దమ్మా! బాధపడకు. దేవుడున్నాడు. తెలీక చేసిన తప్పులకి శిక్షించడు. నువ్వు కోరుకుంటున్న అవకాశాన్ని పిల్లల రూపంలో యిచ్చాడు”” అన్నారు లాలనగా. కళ్లు తుడుచుకుని ఏదో పుస్తకం అందు టేబుల్‍లాంపు ముందు కూర్చున్నాను.
“ఎక్కువసేపు వుండకు” అని హెచ్చరించి వెళ్లిపో నేను తలూపి, పుస్తకం తెరిచాను. అది మరో ప్రపంచం. మనని మన వ్యక్తిగత భావోద్వేగాలలోంచీ విడగొట్టి ఎక్కడికో తీసికెళ్తుంది. అక్కడ కూడా నవ్వూ ఏడుపూ, బాధలూ, కష్టాలు వుంటాయి. కానీ అవి మనవి కావు. మనం వాటితో తదాత్మ్యం చెందవచ్చు. సానుభూతి చూపించవచ్చు. పొరపాట్లకి హాయిగా నవ్వొచ్చు… పుస్తకంలో లీనమైపోయాను. సగం అయ్యాకగానీ రాలేదు మొదటి ఆవులింత. పుస్తకం మూసేసి వెళ్లి మంచంమీద వాలితే తెల్లవారుఝాముని నిద్ర పట్టింది. మరికొద్దిసేపటికే నుదుటిమీద చల్లటి స్పర్శ.
“ఇంత వేళయ్యేదాకా పడుకుందేం? వొంట్లో బాగాలేదా?” ఆదుర్దా నిండిన గొంతు.
గుండెల్లో ఎక్కడో అమృతం వలికినట్లయింది. కళ్లు తెరిచాను. రాజ్‍మోహన్. నిద్రమత్తంతా ఒక్కసారి ఎగిరిపోయింది. లేచి కూర్చుని చుట్టూ చూసాను. నేను నిద్రపోయింది కొద్దిసేపేగానీ బాగా తెల్లవారిపోయింది. “నువ్వు… నువ్వు” నోట్లోంచీ మాట రాలేదు.