కోడికూత వినబడింది. బాలమ్మ మెళుకువలోనే ఉన్నది. నిదుర ఆలస్యంగానే పడుతుంది కానీ , మెళుకువ మాత్రం పెద్దగా టైం తీసుకోదు. అంతవరకూ కాళ్ళు చాపుకొని కూర్చుని , రాలి పడి ఉన్న వేపాకులను చూస్తూ ఏదో ఆలోచిస్తున్నది. కానీ, ఏం ఆలోచించిందో తనకి కూడా తెలియదు. లేచి మెల్లగా నడుచుకుంటూ పోయి , వాకిలి ఊడ్చి , పేడ నీళ్ళు చల్లి , ముగ్గేసింది. ఇక పశువుల దొడ్డిలోకి చేరింది.
ఆమె రాకను చూసి మచ్చల ఆవు టక్కున లేచి నిలబడింది “ఏమాయేనే అపుడే లేచినవ్ ? ఇంగా చెంబు తేలేదు కూసో కూసో” అనుకుంటూ ముందుకు కదిలింది. నల్ల ఆవు ముందల ఉన్న గడ్డి సగం అట్లాగే కనిపించింది “ఏమైందే తిననట్టుండవ్ ? ఆకలి కాలేదా ?” అని దాని పొట్టని చేత్తోని తడిమింది. గుంజకి కట్టేయబడి ఉన్న గేదె ముందున్న గడ్డిని ఎవరో పక్కకు జారగొట్టినట్టుగా పరకల ఆనవాళ్ళు ఒక తీరుగా కనిపించినయ్. అంటే మొద్దుకు కట్టేయబడిన గేదె దీని గడ్డిని కూడా మేసిందని అర్థమైంది. దాన్ని కోపంగా చూసింది. ఊడ్చుకుంటూ “దాంది గుంజుకొని తింటే ఎట్లనే ? గట్టిగ అరిస్తే వచ్చి ఇంగో మోపు ఏస్తుంటి
కదా? పనికిమాలిందానవ్. పసురానివై పుట్టినపుడు నీతి మీద బతకాలెనే. మమ్ముల చూసి నేర్సుకుంటుండావ్ ? పద్దతి కాదు ఇది” అని తిట్టింది.
పేడనంతా గంపలో నింపుతూ పెంటకి చేర్చింది. ఆ గంపని ఎత్తుతున్నపుడల్లా నడుము “నా వల్ల కాదే తల్లీ” అని మెదడుతో మొర పెట్టుకుంటున్నది. కానీ , పరిస్థితులకు చెవులుండవు కదా ! ఆ మెదడు మాత్రం ఏం చేయగలుగుతుంది. మనసేమో మెదడు లాగా నిశ్చలం కాదు. లోలోపలే దుఃఖిస్తది. ఆ విధంగానే పాకంతా శుభ్రం అయిపోయింది.
చుక్కలు మాయమైపోతున్నాయి. మిగతా వాకిళ్ళలో కూడా చీపురు ఆడుతున్న శబ్దం చర్రా చర్రా వినడుతోంది. అవన్నీ టైం చూసుకొని నిద్ర లేచే ఇళ్ళు. ఐదు దాటిన తర్వాత ఒక్కొక్క తలుపూ బద్దకంగా తెరుచుకుంటుంది. అంతవరకూ నడుముని పట్టుకొని కూర్చుని కొద్దిగా విశ్రాంతి తీసుకున్న బాలమ్మ సర్వలు తీసుకుని వచ్చి ఒక్కొక్క దాని పొదుగుని పితికి వాటిలో పాలు నింపబట్టింది. మొత్తం మూడు ఆవులు , ఆరు గేదెలు. బాలమ్మ వెళ్ళి దూడల తాళ్ళు విడుస్తూ “ఇంగ పోండి , కడుపు నిండ తాగండి బిడ్డా!” అని మురిపెంగా చెప్పింది. అవి వాటి తల్లులను చేరి పాలు తాగుతుంటే చూడటం ఆమెకి ఒక ఆనందం. అంతవరకూ శరీరంలో నిండుకున్న రకరకాల నొప్పులన్నీ ఆ తృప్తిలో కొట్టుకుపోతాయ్. అలసిపోయి నీరుగారిపోయిన జీవం ఆ సంతోషంలో ఉత్తేజం పొందుతుంది.
తలుపు తెరిచి ఆవలిస్తూ బయట అడుగుపెట్టింది కోడలు. వంట రూంలోకి పోయి తోమవలసిన అంట్లు అన్నీ తెచ్చి కుళాయి దగ్గర పెట్టి , పాలను తీసుకొని ఇంట్లోకి వెళ్ళింది. బాలమ్మ అంట్ల పని పట్టింది. ఇంతలో ఆమె కొడుకు లేచి , ముఖం కడుక్కుని , పాల క్యాన్ లు తీసుకుని టౌన్ బాటకి పోయినాడు. పిల్లలు కూడా లేచి పళ్ళు తోముకుని, బడికి పోవడానికి సిద్దమయ్యే పనులలో నిమగ్నమైనారు. బాలమ్మకి అంట్లు తోమడం పూర్తవుతున్నంగనే , ఇవాళటి వంటకోసం తరగవలసిన కూరగాయలను తెచ్చి సిద్దంగా పెట్టింది కోడలు.
ఆమె అత్తకు ఏమాత్రం ఇబ్బంది కలగనివ్వకుండా ఇట్లాగే అన్ని ముందే అందుబాటులో పెడుతుంది. కొడుకు కూడా తిరిగివచ్చిండు. బాలమ్మ అంట్లు పూర్తిచేసి , కాయగూరలు తరుగుతుండగా కోడలు చాయ్ గిన్నె , తాగడానికి ఒక గ్లాసు అక్కడ పెట్టిపోయింది. ఆమె అందులో వేడిగా పొగలు ఎల్లుతున్న తేనీరును చూసి “ఇవాల రెండు చుక్కలు ఎక్కువగానే మిగిలిచ్చింది.” అనుకుంటూ తాగింది. ఆ తర్వాత పశువులకు గడ్డి వేయడానికి పోయింది. తవుడు కలిపి ఒక్కొక్కదానిముందు ఉంచి తాగిస్తున్నది.
ఆపని పూర్తై చేతులు కాళ్ళు కడుక్కుని వాకిట్లోకి వస్తుండగా , ఆమె కొడుకు తినడం పూర్తై ఊళ్ళోకి బయలుదేరుతున్నాడు. మోటార్ సైకిల్ మీద కూర్చుని తల్లివైపు చూసి “అమ్మ నేను తమ్మునోళ్ళ ఇంటిదిక్కునుంచే పోయేడిది. బయల్దేరుతవా ? మరి ఆ ఇంటికాడ దించుకుంటపోత. మల్ల నడవడం ఎందుకు ?” అన్నాడు.
తను నడిచి అలిసిపోకూడదని , తన పెద్ద కొడుకు చూపుతున్న ఆ ఆప్యాయతకు ఎట్ల స్పందించాలో కూడా అర్థంకాని స్థితిలో పడింది బాలమ్మ. చిన్న కొడుకు ఇల్లు మైళ్ళ కొద్ది దూరంలో ఏమీలేదు. గట్టిగా కూత వేస్తే కొద్దిగానైనా వినబడేంత దూరమే. ఈ వీధి దాటి అవతలి వీధి అంతే. “నేను ఆమాత్రం దూరం నడిచినా అరికాళ్ళు కందిపోతాయమో అని దిగులుపడుతున్నట్టున్నాడు చిట్టితండ్రి” అనుకున్నది మనసులో. “కనీసం తిన్నవా ?లేదా ? అని కూడా అడగకుండా , నడక గురించి మాత్రమే చింత చేస్తన్నాడు పుత్రరత్నం” అనుకున్నది.
“సరే, బట్టలు సర్దుకుంట జెరసేపు ఆగు” అన్నది. ఆలోపైనా “ఇంతకీ తిన్నావా ?” అని అడుగుతాడేమో అని ఆశ.
కానీ, అతడు మాత్రం “సరే తొందరగా కానీయ్. నాకు లేట్ అయితుంది” అని తొందర పెడుతున్నాడు. ఆమె ఉబుకున్న కన్నీటి ఉప్పెనని గొంతులోనే అణిచి పెట్టుకొని , నిన్ననే సర్ది పెట్టుకున్న బట్టల సంచిని చంకలో పెట్టుకుని బయటికి వస్తూ “పోయొస్త అమ్మా” అని కోడలికి చెప్పింది. ఆమె “సరే” అన్నట్టుగా తల ఊపింది అంతే.
” ఇంకా నేను తిననేలేదు” అనే మాట, అతని చెవిలో పడటానికి ఆమె మనసులోనుండి నాలుక మీదికి పరిగెత్తుకొస్తున్నా , నిరాశ బలంగా తాడుకట్టి వెనక్కి లాగుతోంది. ఎందుకంటే “తినే ఉండొచ్చులే అనుకుంటున్నాడేమో !” అనే భ్రమని తన గుండెకు కవచంలాగా ఏర్పరుచుకున్నది. ఒకవేళ ఆమె తినని సంగతి చెప్తే అతడు “ఆ ఇంటికాడ తిందువులే” అనటానికి కొద్దిగా కూడా సంకోచించడని తెలుసు. ఆ మాట అనిపించుకొని , హృదయానికి ఏర్పరచుకున్న కవచాన్ని ధ్వంసం చేసుకునే సాహసానికి ఆమె సిద్దంగా లేదు. ఇప్పటికే ఆ ముసలి గుండె ఎంతగానో శిథిలమైంది.
మోటార్ సైకిల్ ఎక్కబోతూ ఒకసారి పశువులవైపు చూసింది. అన్నీ ధీనంగా ముఖం పెట్టినయ్. వాటి కళ్ళలోని దిగులు బాలమ్మను గాఢంగా స్పర్శిస్తోంది. ఆ దూడలు తాళ్ళు విప్పుకొని రావడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఆమె లేకపోతే తమ తల్లుల పొదుగులో పాలు రెండు చుక్కలు కూడా మిగలవు. ఆ పసి హృదయాలు ఆమె పట్ల ఎంతో ఆప్యాయతని పెంచుకున్నాయ్ కాబోలు. “నెల అయినంక మల్ల వస్తా” అని మనసులోనే వాటితో చెప్పుకుని వీడ్కోలు తీసుకున్నది.
చిన్నకొడుకు ఇంటిముందు బండి ఆగింది. పెద్దవాడు ఇంజన్ ని ఆపనైనా ఆపలేదు. బాలమ్మ కిందికి దిగి ” ఇన్ని నీళ్ళైనా తాగిపోదువు రారా” అన్నది.
“తర్వాత వస్తలే” అనుకుంటూ వెళ్ళిపోయిండు.
బాలమ్మ గడపవైపు నడుస్తుండగా వారం నుండి ఎదురు చూస్తున్న బట్టలు , తిరుగలి పక్కన సగం సంచి జొన్నలు , గింజలు కొట్టవలసిన గంపెడు చింతపండు. పలుకు తీయవలసిన సంచెడు వేరుశనగలు అన్నీ ఆమెకు సాదరంగా స్వాగతం పలుకుతున్నాయ్. చిన్నకోడలు , పెద్దావిడకంటే అనుకూలవతి. పెద్దామె ఒకదాని వెనక ఒకటి సమకూరుస్తుంది. కానీ , చిన్నామె అట్లా కాదు. ఆలస్యం ఉండకూడదని అన్నీ ఒకేసారి సిద్దం చేస్తుంది.
కాళ్ళు కడుక్కుని ఇంట్లోకి వెళ్ళింది. కోడలు టి.వి.లో నిమగ్నమై ఉంది. బాలమ్మ వంటింట్లోకి వెళ్ళి చూస్తే తినటానికి ఏమీ కనిపించలేదు. ఉదయం తినగా కడగవలసిన పాత్రలే ఉన్నాయ్. ఇక చేసేదేమీ లేక గంట ఆగి ఒకేసారి మధ్యాహ్నానికి వంట చేసింది.
ఇద్దరూ కలిసి తిన్నారు. సాయంత్రం పొలం నుండి చిన్న కొడుకు, బడి నుండి పిల్లలు వచ్చిన్రు. “రేపు వస్తావనుకున్న ఇయ్యాలనే వచ్చినవా ?” అన్నాడు పుత్రరత్నం. బాలమ్మ ఏమీ అనలేదు. పిల్లలు నాన్నమ్మతోని కొద్దిసేపు ఆడుకొని టి.వి.కి అతుక్కున్నారు. రాత్రి భోజనం అయి అందరూ పడుకున్నారు. ఈ ఇంట్లో కూడా బాలమ్మ పడక బయటే.
నల్లని ఆకాశంలో ఒక చుక్క రాలుతున్నట్టుగా కనిపించింది. వాటివైపే చూస్తూ ఆలోచనలో మునిగింది. “నా కాలంనాటి వరకూ కొన ఊపిరితోటి ఉన్న అత్త ముందైనా కోడలివి జింక కాళ్ళే. ఏమిటో నాతరం మద్దెల లాగా ఇట్ల తగలబడింది. ” అని తలుచుకుంటూ కూర్చున్నది. తన కూతురితో వేగుతున్న వియ్యపురాలి మీద కూడా బాలమ్మకు జాలి ఎక్కువే. అదే విధంగా తన అక్క చెప్పిన బాధలు , ఊళ్ళోని ఇంకొందరు స్నేహితురాళ్ళు ఓర్చుకుంటున్న వ్యధలు అన్నీ వరుసగా కళ్ళ ముందు చీకటి తెరపైన కదలాడుతున్నాయి. “ఈ మాత్రం దానికేనా బిడ్డలను వద్దనుకుని కొడుకులను కన్నది?” అనుకుంటూ కుమిలిపోయింది. అంతలోనే కోడి కూయనే కూసింది. ఇంకేముంది ?
కె. నందన్ కుమార్ గౌడ్s/o రామాంజనేయులు గౌడ్.అమ్మ :- లక్ష్మి.గ్రామం :- ఉయ్యాలవాడ.
విద్య :- M.A. తెలుగుసాహిత్యం.MVS GOVT కాలేజ్.occ :- Self employment.email :- kusinerlanandu@gmail.com ph :- 9603234503.
కవితలు , కథలు , వ్యాసాలు రాస్తుంటాను.పుస్తకాలు చదవటం అలవాటు.
కుషినేర్ల నందు.పేరుతో రాస్తుంటాను.