నానిగాడి చదువు by Mangu Krishna Kumari

“హాచ్ హాచ్” రెండు సార్లు తుమ్మేడు నానిగాడు. వాడి అసలు పేరు శుశ్రుత్. వాడి బుర్ర చకచకా పని చేసింది.
“అమ్మోయ్ అమ్మా!” సగం ఏడుపుగొంతుతో పిలిచేడు. పాలగ్లాసు తీసుకొని వచ్చింది హిమబిందు.
“ఏమయిందమ్మా” అడిగింది.
“జలుబు, తుమ్ములు. జొరం వస్తే?” దీనంగా అన్నాడు. ఆమెకి బోధపడింది. వారానికి రెండుసార్లయినా ఏదో వంకపెట్టి స్కూల్ ఎగ్గొడతాడు.
మెడమీదా, నుదుటి మీదా చెయ్యి వేసింది. మామూలుగానే ఉంది.
“సరే, మొదట ఈ పాలు తాగేసి కూచో!” అంది. పాలగ్లాసు తీసుకొని తాగుతూ నాని “అమ్మా” అని నసుగుతున్నాడు.
“ఏమిటిరా” అంది.
“మరేమో ఆటో‌ వచ్చేస్తే ఎలా?” అన్నాడు సాధ్యమయినంత నీరసంగా.
హిమబిందు తొణక్కుండా, “నేను చెప్తాలే! అయినా పదయేసరికి నీ జ్వరం తెలిసిపోతుందిగా! నాన్నని మందులు తెమ్మంటాలే” అంది. వాడికి గాల్లో తేలినట్టుంది.
“హమ్మయ్య! ఈ రోజుకి ఇహ బడి పీడ లేదు. నాన్న బేంక్‍కి వెళ్లిందాకా పడుకున్నట్టు చేసి, ఆనక ఆటలే ఆటలు…” అని మురుసుకుంటున్నాడు.
హిమబిందు పాలగ్లాసు తీసుకొని వంటింట్లోకి వెళ్ళింది. రెండోసారి కాఫీని గ్లాసులో పోసుకుంటోంది అత్తగారు, లక్ష్మీదేవి.
“అమ్మాయ్! నానిగాడికి లేట్ అయిపోటంలేదూ, ఇడ్లీ పెట్టీనా?” అంది.
“మీ మనవడు ఈరోజు స్కూల్ ఎగ్గొట్టే మూడ్‍లో ఉన్నాడు. ఈయన వేళకి చేస్తాలెండి” అంది హిమబిందు.
“అస్తమానం ఈ మానీడాలేమిటే? మా రోజుల్లో పిల్లలు బడి మానేస్తాం అంటే-
అన్నం‌ పెట్టను- అని బెదిరించే వాళ్ళం.
ఈ వెధవకి అలా అంటే మరీ ఆనందం. వెంటపడి పెట్టినా తినడు” కోపంగా అంది ఆవిడ.
అప్పటికి రామకృష్ణ లేచి వచ్చేడు.
“వీడిని డాక్టరో, ఇంజనీరో చేద్దామని అనుకుంటూ ఉంటే, వీడసలు టెంత్ అయినా పూర్తి చేస్తాడా” అన్నాడు, విషయం అర్థమై.
“అప్పటికీ వాడి స్కూల్లో ఏ సమస్య ఉందో తెలుసుకోవాలని కనీసం నాలుగుసార్లు వెళ్ళి మాటాడేను. పరిశీలించి మరీ చూసేను-
మీ బాబు చాలా తెలివయినవాడండీ! కానీ ఆటలమీదే ధ్యానం అంతా- అన్నారు వాళ్ళ టీచర్‍కూడా” హిమబిందు చెప్పింది.
తనే మళ్ళా “నేను చూసుకుంటాలెండి. మీరివాళ ఆఫీసుకి వేగం వెళ్ళాలన్నారుకదా, బాక్స్ రెడీ చేస్తా” అంది.
పదికి ముందే రామకృష్ణ ఆఫీస్‍కు బయలు దేరుతూ “నానీ! ఇవాళ అమ్మ చెప్పినట్టు విను. ఇల్లు కదలకు” అని చెప్పేడు. నానీ బుద్ధిగా తలూపేడు.
వంటింటి పని పూర్తి చేసి హిమబిందు, “అత్తయ్యా! నేను నాని సంగతి చూస్తాను. ఇవాల్టికి మీరు ఇక్కడ పని ఉంటే చూసుకోండి. మరీ అవసరం అయితేనే నేను వస్తాను” అని చెప్పి బెడ్‍రూమ్‍లోకి వెళ్ళింది. నానీ సైకిల్ ఎక్కి తొక్కుతున్నాడు.
వాడిని పిలిచింది. ‌థర్మా మీటర్ పెట్టి చూస్తే నార్మల్! “హమ్మయ్యా! నానీ! జ్వరం లేదు. ఇహ ఇప్పుడు స్కూల్‍కి ఏం వెళతావులేగానీ నీ పుస్తకాల
బేగ్ తే” అంది. నానీకి ఎందుకో బోధపడకపోయినా స్కూల్‍బేగ్ తెచ్చేడు. తనో కుర్చీ వేసుకొని కూర్చుంది. స్కేల్ పట్టుకొని సరిచూసుకుని, గోడకి ఇంట్లో వాడే చిన్న బ్లాక్‍బోర్డ్ పెట్టింది. పుస్తకాల బేగ్‍లోంచి స్కూల్ డైరీ తీసి “ఇదిగో, ఈ రోజు నీకు ఈ క్లాస్‍లు ఉన్నాయి. మిస్ చెయ్యకూడదు. ముందు ఇంగ్లీషు బుక్ తియ్యి” అని, తీయించి అందులోంచి ఆరోజు లెసన్ బోధపరచడం మొదలెట్టింది.
నానికి ఎందుకో బోధపడకపోయినా చేసేదేమి లేక విన్నట్టు నటించేడు.
మధ్యలో “ఇప్పుడేం చెప్పేను?” అని ఓ ప్రశ్న తల్లి వేసేసరికి వాడు వెర్రిమొహం వేసేడు. మంచంమీద స్కేల్‍తో రెండు గట్టిగా వేసింది.
“జాగ్రత్తగా విను. ఈసారి జవాబు చెప్పకపొతే నీచేతి మీదే పడతాయి” అని మళ్ళా బోధపరచింది. తరవాత వేసిన ప్రశ్నకి ఠకీమని జవాబు చెప్పేసాడు. ఇంగ్లీష్ క్లాస్ తరవాత మేథ్స్ తీసింది. నానిగాడికి దడ వచ్చేసింది. వాడికి ఏ లెక్కలూ రావు.
“అమ్మా! నాకు కొంచెం రావేమో” అన్నాడు దీనంగా.
“చూడు. ఇప్పుడు నేను నీకు అమ్మను కాను. స్కూల్ టైమ్ అయిందాకా టీచర్‍నే! రానివి నేను బోధపరుస్తాలే” కఠినంగా అని ఓ ఛాఫ్టర్ అంతా చెప్పింది.
నానీ చచ్చినట్టు విన్నాడు. తరవాత సైన్స్ క్లాస్. వాడి సత్తా ఏమిటో వాళ్ళమ్మకి తెలిసి పోయింది. తరవాత లంచ్ బ్రేక్. హిమబిందు తనకి
వడ్డించుకొని వాడికి కూడా పెట్టింది. అమ్మ చాలా నిశ్శబ్దంగా తింటూ ఉంటే నానికి మధ్యాహ్నం తన భవిష్యత్తు బోధపడింది. వాడు ఊహించినట్టే అరగంట వాడిని వదిలేసి మళ్ళా కూలేసింది హిమబిందు. మధ్యాహ్నం చెప్పే సొషల్, మోరల్ సైన్స్ అన్నీ చెప్పి హోమ్‍వర్క్ రాసుకోమంది.
ఏడుపు మొహంతో రాసేడు నానిగాడు.
“పాలు తాగి ఏవన్నా తిని, ఓ గంట ఆడుకొని రా! ఇద్దరంకలిసి హోమ్‍వర్క్ చేద్దాం. పంపించేనుకదాని ఇష్టారాజ్యంగా ఆడడం కాదు. ఓన్లీ వన్ అవర్ అంతే. రాకపోయేవో పదిరోజులు ఆటలకి వెళ్ళడం బంద్” అని సీరియస్ వార్నింగ్ ఇచ్చి వాడిని పంపించింది.
వాడు నిజంగానే గంటలో హాజరయేడు. హొమ్‍వర్క్ తల్లి డైరెక్షన్‍లో పూర్తి‍చేసి, రాత్రి భోజనం చేసి పడుకొనేసరికి, స్కూల్ ఎగ్గొడితే ఇంట్లో తన పరిస్థితి ఏమిటో వాడికి అర్థమైపోయింది.


కాలం ముందుకి నడిచింది. నాని ఇప్పుడు మెడిసన్ థర్డ్ ఇయర్ చదువుతున్నాడు. శుశ్రుత్‍గానే అందరికీ తెలుసు. తన జూనియర్ హారిక “అబ్బా! కాలేజ్ ఎగ్గొట్టి ఏదన్నా మూవీకి వెళ్ళాలని ఉంది “అని గోముగా అంటూ ఉంటే, తను చిన్నప్పటి బడి ఎగ్గొట్టడం, తల్లి ఇల్లే బడిలా మార్చడం సంగతంతా చెప్తే ఆమె పకపకా‌‌ నవ్వి “ఆంటీని చూడాలని ఉంది” అంది.
“యెస్. మా అమ్మే నన్ను ఇంతవరకూ లాక్కొచ్చింది. షి ఈజ్ ఎన్ ఎక్సలెంట్ మదర్! రియల్లీ అయామ్ ప్రౌడ్ ఆఫ్ హెర్” అన్నాడు శుశ్రుత్ గొంతులో తల్లి మీద ప్రేమంతా ఒలుకుతూ వుంటే.