Youtubers please WhatsApp to 7382342850
డాక్టరు దగ్గర్నుంచి తిరిగొచ్చాక అప్పటిదాకా అయిన ఖర్చు లెక్కవేసుకున్నాడు తిలక్. ఎనిమిదివందల ఎనబై అంటే. భార్య చేతికొచ్చేదాంట్లో సగం. ఇవి కాకుండా ఇంకా అదనం ఖర్చులు, నెల మధ్యలో కూడా కొనాల్సివచ్చే మందులు కలిపి మరో ఇంత ఉంటాయి.
ఇలాంటవ్పుడే కరిగిపోయిన ఆస్తులూ, గతవైభవాలూ గుర్తొస్తాయి. రోజులు సాఫీగా సాగిపోయినన్నాళ్ళూ మనిషి మెడ గతం వైపుకి తిరగదు. తిలక్ తండ్రి పాతకాలం మనిషి. ఆ మాట తిలకే అనుకుంటాడు. పైకనడానికి కూడా ఏమాత్రం సంకోచించడు. వల్లమాలిన బంధుప్రీతితో ఆస్తంతా కర్పూరంలా కరిగించేశాడని అతని అభిప్రాయం.
ఆయనకి ముగ్గురక్కచెల్లెళ్ళు, అక్కగారికి, అంటే తిలక్ పెద్ద మేనత్తకి చిన్నప్పుడే పెళ్ళవడం ఆ వెంటనే భర్త చనిపోవడం జరిగింది. ఆవిడ పుట్టింటికి వచ్చేసింది. తండ్రి పోయాక ఇంక తమ్ముడితోనే ఉండిపోయింది. మిగిలినవాళ్ళిద్దరూ ఆయన తరవాతి వాళ్ళు. స్థితిమంతులు కాదు. అప్పుడప్పుడు అన్నగారి సహాయం కోరుతుండేవారు. వాళ్ళకి పిల్లలు. ఆ పిల్లల చదువులకి ఈయన తనకి తోచింది ఇచ్చేవాడు. వీళ్ళంతా కాకుండా విధవమేనత్త ఒకావిడుండేది. తిలక్ తండ్రి మేనత్త. ఎక్కడో ఆయన తండ్రి తండ్రికి చెల్లెలు. ఆవిడ , తమ దగ్గిరుండడం!
తండ్రికెలా చెప్పాలో, ఈ అనవసరపు బాదరబందీలన్నీ ఎలా తప్పించాలో అర్ధమవక సతమతమయ్యేవాడు తిలక్. ఇంత మంది మధ్య అతనికి పెద్ద గారాబమేమీ జరిగేది కాదు. మూడు పూటలా కడుపుకింత తినడమే గొప్పగా ఉండేది.
ఎన్నో సర్దుబాట్లుండేవి. పెద్దపిల్లలకి కుట్టించిన బట్టలు ఆ కుటుంబంలో చిన్నపిల్లలదాకా వరుసక్రమంలో వచ్చేవి. అలాగే పుస్తకాలూను. ఇప్పటన్ని ప్రైవేటు స్కూళ్ళు లేవు. విద్యారంగం ఇంత ఎత్తుని ప్రైవేటీకరణ చేయబడలేదు. గవర్నమెంట్ స్కూళ్ళేగాబట్టి దాదాపుగా అవే పుస్తకాలు చేతులు మారేవి. ఎప్పుడైనా పుస్తకం మారితే కొత్త పుస్తకం కొనేవాడు తిలక్ తండ్రి. అలాంటిది తిలక్ వంతులో ఎప్పుడూ రాలేదు. కాళ్ళకి చెప్పులుండేవి కాదు. చేతికి వాచీ ఉండేది కాదు. క్రికెట్టూ, కేరమ్సూ తెలీవు. కోతికొమ్మచి, బిళ్ళంగోడు, కబాడీ – ఇవే ఆటలు. ఇవిగాక ఆడపిల్లల్తో కలిసి గచ్చకాయలు, చింతపిక్కలు, తొక్కుడు బిళ్ళలూ ఆడేవాడు తిలక్ కొంత వయసాచ్చేదాకా. ఛఛ! ఏం జీవితమది! అనిపిస్తుందనికి ఇప్పుడారోజులు గుర్తొస్తే,
తిలక్ ఇంట్లోవాళ్ళతో కలవకుండా ఒకింత పెడగా ఉండేవాడు. తనకి సంబంధించిన విషయాలో నిర్ణయాలు తానే తీసుకునేవాడు. అవి చిన్నచిన్నవే గాబట్టి ఇంట్లో వాళ్ళకి అభ్యంతరం ఉండేది కొదు. కానీ, పెళ్ళి దగ్గిర కూడా అతనా స్వతoత్రం అలాగే నిలబెట్టుకోవడంతో గొడవైంది. మాటపట్టింపులూ, పంతాలూ వచ్చాయి. పెద్దవాళ్ళ మనుసులకి గాయాలయ్యాయి. అయినా, అతను చలించలేదు.
రెండో మేనత్త కూతుర్ని తిలక్కి ఇచ్చి చెయ్యాలని ఇంట్లో ప్రతిపాదన.
“నేను ఉద్యోగస్థురాలైన అమ్మాయినే చేసుకుంటాను” అని అతను ప్రకటించాడు. దానికి అనేకమైన కారణాలున్నాయి. ఇంట్లో ఇంట్లో ముడి పెట్టుకుంటే కట్నం అంటూ ఏమీ రాదు. చిన్నత్తా వాళ్ళదీ లేని కుటుంబమే కావచ్చు. కానీ, వాళ్ళ లేమికి తాను బాధ్యత వహించాలా? తనపాటి ఉద్యోగం ఉన్న వాళ్ళు బయట వేలకి వేలు కట్నం తీసుకుంటున్నారు. తానూ తీసుకోవచ్చు. కట్నం తీసుకుని బయటి సంబంధం చేసుకున్నాక కూడా తన బతుకులో మార్చేమీ రాదు. భార్య ఉద్యోగం మిషమీద ఈ ఇంటితోటీ, ఊరితోటీ సంబంధాలనీ తెంచేసుకోవాలి. తల్లిదండ్రులంటే తనకి విధాయకంగానీ, ఈ మందంతానా? ఈ మాటల్ని తిలక్ బయటికనలేదు.
“అదేమిట్రా? చిన్నప్పట్నుంచీ అనుకుంటున్న మేనరికం ఉండగా బైటి సంబంధం చేసుకోవడమేమిటి?” తల్లి తెల్లబోతూ అడిగింది.
“మేనరికం అనుకున్నారా?ఎవరనుకున్నారు? మీరనుకున్నారేమోగానీ నేనెప్పుడూ అనుకోలేదు” కొట్టినట్టే జవాబిచ్చాడు తిలక్.
“ఔనోయ్! మేమే అనుకున్నాం. ఏం, మా మాటకంత విలువలేకుండా పోయిందా? కనేటప్పుడు నిన్నడిగి కన్నామా, ఇందులో మాత్రం నిన్నడగడానికీ?”” దెబ్బతిన్న ఆత్మాభిమానంతో అడిగాడు తండ్రి.
“నన్నడిగి వుంటే కనద్దని చెప్పేవాణ్ణి” కొట్టినట్టే జవాబు ఇచ్చాడు తిలక్.
“ఏరా, అంత తీసిపోయిందా మా కడుపుని పుట్టడం? పెద్దంతరం, చిన్నంతరం లేకుండా మాట్లాడుతున్నావు?” తల్లి బాధపడింది.
“అంత గొప్పగా పెంచారామ్మా నన్ను? గుర్తు చేసుకుని చెప్పు. ఎన్నిసార్లు కొత్త బట్టలు కుట్టించారు నాకు? కొత్త పుస్తకాలేప్పుడైనా కొన్నారా? కోరుకున్న తిండి… చదువు.. ఏది అమరింది నాకు? నాకన్నా తక్కువ మార్కులొచ్చేవి చక్రధర్‍కి… వాడిప్పుడు డాక్టరు. తెల్లకోటేసుకుని నా కళ్ళముందే బోర్డు కట్టాడు..” బయటపడ్డాక ఇంక తగ్గడం దేనికని మనసులో వున్నదంతా అనేసాడు తిలక్.
“వాళ్ళతో మనకి సాపత్యమా? వాళ్ళకి తగలేసినంత ఆస్తుంది. ఖర్చు పెట్టి చదివించారు.”
“ఎక్కడిదమ్మా వాళ్ళకంత ఆస్తి? అక్కర్లేని బాధ్యతలూ, అనవసరపు ఖర్చులూ తగ్గించుకుంటే మీరు నన్ను మాత్రం చదివించలేకపోయేవారా” అనేసి విసురుగా వెళ్ళిపోయాడు.
ఆ మాటలు ఎక్కడ తగలాలో అక్కడ తగిలాయి
“చిన్నవాడైనా తిలక్ చెప్పింది నిజం తమ్ముడూ. మా బాధ్యతలు ఎత్తుకుని వాడికి అన్యాయం చేశావు. ” తిలక్ పెద్దమేనత్త బాధపడుతూ చెప్పింది.
“వాడి మాటలు మీరేం పట్టించుకోకండి వదినా! తల్లీ, తోడూ అన్నాక బాధ్యతలుండవా ? అయినా, మీకు మేమేం పెట్టేమని? మాతోపాటు ఇంత తిండి. అంతేకదా? తోటివాడు డాక్టరయ్యాడు కదూ, అదీ బాధ! దాచుకోలేక బైటికి వెళ్ళగక్కాడు”” తిలక్ తల్లి బతిమాలింది.
ఆ మాటలకి సాంత్వన కలగలేదు పెద్దావిడకి. “నాలుగు రోజులు చిట్టెమ్మ దగ్గిరుండి వస్తాను. ఈ బతుకెలా తెల్లవారుతుందో ఏమిటో” అంటూ పెద్ద చెల్లెలి దగ్గరికి ప్రయాణమైంది. చూస్తూ కూడా ఏమీ అనలేకపోయాడు తిలక్ తండ్రి.
“నీకు వంట్లో శక్తుంది. వెళ్ళడానికి చెల్లెళ్ళు వున్నారు. వెళ్ళిపోతున్నావు. నేనెక్కడికి వెళ్ళనే” అని ఏడ్చింది ఆయన మేనత్త. ఆవిడ చేతుల్ని తన తడికళ్ళ మీద ఉంచుకున్నాడు తిలక్ తండ్రి. ఇంకెప్పుడూ ఆవిడ తన బాధ బైటికనలేదు . ఆ మరుసటేడే దేవుడి పిలుపందుకుంది.
ఈలోగానే తిలక్ పెళ్ళయింది. కట్నం దగ్గర అతనే మాత్రం తగ్గలేదు. తండ్రివల్ల కాదని ముందుగానే తెలుసుకాబట్టి మధ్యవర్తిని పెట్టుకుని అన్నీ ఖరాఖండీగా మాట్లాడుకున్నాడు. బేరసారాలని చూసి తిలక్ తండ్రికి మనసు చెదిరి ఏదో తప్పు చేస్తున్న భావనతో తలదించుకున్నాడు. పిల్ల పేరు భారతి. పెళ్ళి జరుగుతున్నంత సేపూ పెళ్ళికూతురి మొహంలో ఎలాంటి కళాకాంతి కనిపించలేదాయనకి. పాపం! తండ్రి ఇస్తున్న కట్నం గురించే దిగులు పడ్తోందేమో! విలవిల్లాడాడు. వాళ్ళు బట్టలవీ పెడ్తుంటే చేతులు చాచి భిక్ష తీసుకుంటున్నట్టు అనిపించింది. ఇలాంటివేం తిలక్‍కి లేవుగాబట్టి నవ్వుతూ తుళ్ళుతూ తిరిగాడు.
కట్నం డబ్బు చేతిలో పడ్డాక తిలక్ మొదటిసారిగా తాను సుఖపడే మార్గాల గురించి ఆలోచించాడు. అంటే ఇంతకాలం అతను సుఖాన్ని గురించి ఆలోచించలేదని కాదు. అవన్నీ పేకమేడలు. వట్టి ఊహాసౌధాలు. పగటి కలల్లో మాత్రమే కట్టుకునేవి. ఇప్పటి ఆలోచనలు అతని వాస్తవ సుఖాలకి దారితీసేవి.
సుఖం! అతనికికి కొన్ని సుఖాలు తెలుసు. చాలా చిన్నప్పుడు – వేడి వేడి అన్నంలో పాతచింతకాయ పచ్చడి కలిపి చెయ్యి తడిసేలా నెయ్యిపోసి, నోట్లో ముద్దలు కలిపి తల్లి పెడ్తుంటే జిహ్వకి చాలా సుఖం తోచేది. కొంచెం పెద్దయ్యాక తండ్రి కుట్టించిన కొత్త షర్టు వేసుకుని స్కూలుకెళ్ళినప్పుడు పిల్లలందర్లో గొప్పగా తోచి మనసుకి సుఖమనిపించేది. తల్లి తాను చేసిన ఏ తాయిలమో కొంచెం మిగిల్చి చాటుగా చేతికిస్తే, అది తింటుంటే అమరసుఖం దొరికేది. కానీ, వీటినెవరూ సుఖాలని ఒప్పుకోరు. రోజూ పంచ భక్ష్య పరమాన్నాలు తినేవాడికి పాతచింతకాయ పచ్చడి రుచించదు. నిత్యం పట్టుబట్టలు కట్టుకునేవాడి సుఖంలో ఒక కొత్తచొక్కా తెచ్చే మార్పేం ఉండదు. కడుపు నిండిన వాడికి చాటుగా తినడంలో నీతి కనిపించదు. తనకవేవీ లేవు. అందుకే అవే సుఖాలనుకుంటున్నాడు. తనకి లభించినవి అంతమాత్రమేగాబట్టి అవే సుఖానిచ్చాయి.
ఆ క్షణాన్నించే తిలక్ ప్లాన్డ్‌గా ఆలోచించడం మొదలు పెట్టాడు. మూడేళ్ళదాకా పిల్లలొద్దనుకున్నాడు. అలాగే భార్యని డాక్టరు దగ్గరకి తీసికెళ్ళి లూపు వేయించాడు. ఈ మూడేళ్ళలో ఇంట్లోకి కావలసినవన్నీ కొన్నాడు.. అన్నీ అంటే, కలర్ టీవీ, ఫ్రిజ్, కూలర్ ఇత్యాది సమస్తం. ఆ తర్వాతే భారతికి నెల తప్పింది. తల్లిదండ్రులని దగ్గరకు తెచ్చి పెట్టుకున్నాడు. లోతుగా ఆలోచించి. లాభనష్టాలు లెక్కవేసుకుని. మేనత్తమాత్రం చెల్లెలిదగ్గిరే వుండిపోయింది.
“ఒక్కరు చాలు మనకి, ఆడేనా, మగేనా సరే! ఏం?” అన్నాడు భార్యతో.
ఆమె దిగ్గున తలెత్తి చూసింది. తనకి అతిచేరువలో ఉన్నా ఏమీ అర్థంకాని మనిషి. అతని కళ్ళలోకి లోతుగా చూసింది. అవి తేజోహీనంగా అనిపించాయి. అభావంగా వున్నాయి.
“ఏమిటాలోచన?” అడిగాడు తిలక్.
“మరీ ఒక్కరే ఏంటి? కనీసం ఇద్దరు పిల్లలేనా ఉండాలి” అంది నచ్చజెప్తూ. అతనిలో తెచ్చి పెట్టుకున్న సౌమ్యం ఎగిరిపోయింది.
“దేనికిద్దరు? మనకేం ఆస్తులున్నాయని? చాలీచాలకుండా వాళ్ళని పెంచుకొచ్చి గుమాస్తాగిర్లు వెలగబెట్టమని దేశంమీదికి వదుల్దామా? బుర్ర తక్కువ ఆలోచనలూ, బుర్ర తక్కువ మనుషులూ!”” అని విసురుగా లేచి వెళ్ళిపోయాడు.
భారతి ఏడ్చింది. నిరసనప్రతం చేసింది. అయినా, తిలక్ తనమాటే నెగ్గించుకున్నాడు.
తిలక్‍కు ఇప్పుడు ఒక్కడే కొడుకు. అతని ఆశలన్నిటికీ ఆయువుపట్టు వాడే. తనేవైతే మిస్ చేశాననుకున్నాడో అవన్నీ కొడుక్కి అమర్చాడు తిలక్. బిర్లా, టాటా లెవెల్లో వాడిని పెంచకపోవచ్చుగానీ, వాడికి జరిగినంత ముద్దు వాళ్ళకు జరిగివుండదన్నది మాత్రం నిస్సంశయం.
పిల్లాడి నాలుగోయేటిదాకా అన్నీ సవ్యంగానే జరిగాయి. తల్లీ, తండ్రీ ఆఫీసుకెళ్ళేవారు. వేల మీద ఆర్జించి తెచ్చేవారు. వాళ్ళు ఆఫీసుకి వెళ్ళినప్పుడు తాతాబామ్మలు చూసుకునేవారు .
స్కూల్లో వేశారు. తెల్లగా, బొద్దుగా ఉండేవాడేమో అక్కడంతా ముద్దు చేసేవారు.కాళ్ళకి షూస్, యూనిఫామ్‍తో మడత నలగని పుస్తకాలని బేగ్‍లో పెట్టుకుని వాడు స్కూల్‍కి వెళ్తుంటే తిలక్‍కి మనసు పరవశించిపోయేది. వాడిని దించడానికి లోన్ తీసుకుని తాను స్కూటర్ కొనుకున్నాడు. కానైతే వాడినడిగి తాను కనలేదనీ, తన అభిరుచులమేరకే వాణ్ణి పెంచుతున్నాడనీ ఎప్పుడూ తిలక్కి అనిపించలేదు.
నాలుగోయేడు నిండుతుంటే వాడిలో అనూహ్యమైన మార్పు వచ్చింది. స్కూలుకెళ్ళినని మొరాయించడం, మన్నుతిన్న పాములా స్తబ్దుగా ఉండడం, అస్తమానూ నిద్రపోవడం, ఆపైన తిండి. అతిగా. డాక్టర్ల చుట్టూ తిరిగే అధ్యాయం మొదలైంది.
…
అప్పుడే డాక్టర్ దగ్గరనుంచీ తిరిగివచ్చారు.
“ఏమన్నాడురా డాక్టరు?” తల్లి ఆతృతగా అడగడంతో తిలక్ ఆలోచనల్లోంచి తేరుకున్నాడు.
“ఏమీ చెప్పడం లేదు. ఆ టెస్టులు చేయించండి, ఈ టెన్టులు చేయించండంటాడు” బాధగా జవాబిచ్చాడు
“బంతిలాంటి పిల్లాడు, చలాకీగా తిరుగుతూ ఒక్కపనీ తోచనిచ్చేవాడు కాదు.. లేకపోతే వేరే డాక్టరుకి చూపించరా.” అంది.
“అదే అలోచిస్తున్నాను” సాలోచనగా చెప్పాడతను.
భారతి భర్తతో ఎక్కువగా మాట్లాడదు. అతన్ని కదిపి, తన మనసు నొప్పించేలా చేసుకోవపడంకన్నా మౌనమే వుత్తమమని చాలా తొందరగా గ్రహించిందామె. కానీ, అతన్తో సంప్రతించక తప్పని విషయాలూ ఉంటాయి. కొడుకు గురించి అతన్తోకాక ఇంకెవర్తో మాట్లాడుతుంది?
“వాడికేమెంది. పిచ్చా? మానసికంగా ఎదగడం లేదా? ఎందుకిలా జరిగింది?” భారతి ప్రశ్న వాడిగా వచ్చి తాకింది.
“ఛఛ… కాదు”
“బాబుని ముంబాయి తీసుకెళ్దాం. అక్కడ మంచి డాక్టరున్నాడట. నా ఫ్రెండొకతను చెప్పాడు.” తిలక్ ఆశగా చెప్పాడు
“మరేమిటి వాడికి? మీరు నాకెందుకు చెప్పరు? నాకు చెప్పాల్సిన అవసరం లేదని అనుకుంటున్నారా? అసలే విషయంలోనేనా నా మాట విన్నారా? వాడికేమిటసలు? అందరు పిల్లల్లా ఎందుకుండడు?” ఉద్రేకంగా అడిగింది.
“ఏమీ లేదు భారతీ! ముంబాయి తీసుకెళ్దామన్నానుకదా?”
“మీరు నా దగ్గర రాస్తున్నారు.”
“ఏం లేదన్నానా?” విసుక్కున్నాడతను.
ఆమె చాలా ఏడ్చింది. ఏడుస్తునే వుంది. ఏమిటిది? భార్యాభర్తలిద్దరూ కలిసి తీసుకోవలసిన నిర్ణయాలన్నీ తనే ఏకపక్షంగా తీసుకుంటున్నాడు. ప్లాన్‍డ్‍గా జీవితాన్ని గడపటంలో తప్పులేదు. కానీ ప్లానింగ్ అంటే డబ్బొకటే కాదు. కట్నకానుకలు తీసుకుని, జీతాలు పైసపైస లెక్కపెట్టుకుంటూ, ఎవర్నీ గౌరవించకుండా, పిల్లలు పుట్టడాన్నికూడా డబ్బుతో ముడిపెడుతూ… ఇలాగా బతకడం? చిన్నతనంలో ఏవీ జరగలేదేమో! ఎవరింట్లో లేవు సర్దుబాట్లు? తాము ఇద్దరు అక్కచెల్లెళ్ళు, ఒక తమ్ముడు. తమ్ముడికి ముద్దు జరిగేది. తమని సర్దుకుపొమ్మనేవారు. ఇప్పుడు తమ జీవితం తమదైంది. జీవితం చిందరవందరగా వుందనిపించింది.
ఆరోజు ఇంట్లో వంట లేదు. నిండింట అభోజనం ఉండరాదని తిలక్ తల్లికి మనసు లాగుతూనే ఉంది. కానీ, నా కొడుక్కిలా ఉండి మేం ఏడుస్తుంటే వంటెందుకు చేశానని అతననేస్తాడని అవిడకి భయం. ఏం చెయ్యకుండా కూర్చుంది. అపార్ధాలు, దారుణమైన అపార్ధాలు. భార్యా భర్తలకి మధ్య, తల్లి కొడుకులకి మధ్య. రాత్రి తాను ముంబాయి వెళ్ళే విషయాన్ని తండ్రితో ప్రస్తావించాడు.
“బాబుని ముంబాయి తీసికెళ్ళి చూపించాలనుకుంటున్నాను. రెండేళ్ళయింది. డాక్టర్ల చుట్టూ తిరగడం మొదలు పెట్టి ఏ ప్రయోజనమూ కనిపించడం లేదు. వాడిని సంతోషంగా ఉంచమంటారు. ఏమిటి సంతోషమంటే? ఎన్ని బొమ్మలు కొన్నాను? వీటి ఖర్చు వీటిదే అవుతోంది. మందుల ఖర్చు మందులదే అవుతోంది.” ఆవేదన వ్యక్తమైందతని మాటల్లో.
తిలక్ తండ్రి తాత్వికంగా నవ్వాడు. ఆ నవ్వు జీవితాన్ని కాచి వడబోసిన అనుభవాలని ప్రతిధ్వనిస్తాన్నా, వాటిని తిలక్ వినలేకపోయాడు. అవతనికిప్పుడే వినిపించవు కూడా.
“భారతీ, నేనూ సెలవు పెట్టి వెళ్తున్నాం. డబ్బు బాగా ఖర్చువుతుంది. అందుకే పొలం బేరం పెట్టాలనుకుంటున్నాను” అన్నాడు.
తండ్రి కొద్దిసేపు ఏమీ మాట్లాడలేదు. ఆ పొలం పిత్రార్జితం. తనతో సమానంగా అందులో కొడుక్కి హక్కుంది. అమ్మనంటే అతని వాటాకోసం గొడవప్డడతాడు కూడా. మంచి చెప్పినా వినే పరిస్థితిలో లేదు. ఇక్కడి సమస్య పాలం అమ్మాలా వద్దా అనేది కాదు. పదెకరాల పొలం తన పేరుమీద ఉన్నప్పుడే కొడుక్కి తాను భారంగా అనిపిస్తున్నాడు. ఎలాంతి విలువా ఇవ్వడు. ఆ పొలం కాస్తా అమ్మేశాక తన యొక్క నిజమైన భారాన్ని అతను మోస్తాడా అనిపించింది.
ఎటూ తాను అంగీకరించినా, అంగీకరించకపోయినా పర్యవసానం గృహచ్ఛిద్రాలే. అంగీకరిస్తే అవి బయటపడడానికి కొంత సమయం పడుతుందిది. లేకపోతే ఈ క్షణాన్నే వస్తాయి. దాని ప్రభావం పసివాడి మీద ఎక్కువగా ఉండచ్చు. ఆకొద్ది సేపట్లోనూ ఆయన పరిస్థితిని అవలోకించుకున్నాడు. రేపెప్పుడో రాబోయే రోజుకి అన్వయించకున్నాడు. అన్నీ తేటతెల్లమయ్యాయి. వెంటనే సరేననలేకపోయాడు. మనసు పీకింది. తాతల నాటి ఆస్థినే సెంటిమెంట్ వెనక్కి లాగింది. తాను చెప్పదలుచుకున్నది చెప్పేశాక
ఎక్కువ సేపు ఉండలేదు తిలక్. ఆయన అభిప్రాయం కూడా వినలేదు.
పెద్దాయన అశాంతిగా మంచం మీద ఒరిగాడు. పక్క మంచం మీద భార్య నిద్రపోతోంది. తానున్నాడన్న నిశ్చింతలో ఏ ఆలోచనా లేకుండా విశ్చంతంగా ఉంది. పాలం అమ్మేసాక ఈ నిశ్చింత ఎంతకాలం ఉంటుంది? రెక్కల కష్టంతో ఆమెని పోషించాలేమో! అప్పుడింక ఇద్దరికీ మిగిలేవి కన్నీళ్ళే ఆలోచిస్తున్న కొద్దీ బాధనిపిస్తుంటే ఇంక ఆలోచించడం మాని బాధని దూరం చేసుకునే ప్రయత్నంగా కళ్ళు మూసుకున్నాడు.
కోడలొచ్చి టేబుల్ మీద నాలుగరటిపళ్ళు, గ్లాసుతో పాలూ తెచ్చి పెట్టింది. ఆఖరిగా మరచెంబుతో మంచినీళ్ళు పెట్టి, దానికింద ఒక చీటి ఉంచింది. దాన్ని చూసి ఆయన గమ్ముని లేచాడు. మడతలిప్పి గబ గబ చదివాడు.
“పొలం అమ్మకానికి మీరొప్పుకోకండి. దానివల్ల ప్రయోజనం ఉండగలదన్న ఆశ నాకు ఏమాత్రం లేదు. అమ్మిన తదుపరి పరిణామాలలెలా ఉంటాయో నేను ఊహించగలను. ఒకవైపుని కన్నకొడుకిలా ఉండగా, కన్నవాళ్ళలాంటి మిమ్మల్ని కూడా దూరం చేసుకుని ఎడారిలాంటి బతుకుని ఓ అపరిచిత బాటసారితో గడపలేను. పెళ్ళయి ఇన్నేళ్ళైనా మీ అబ్బాయి నాకు బొత్తిగా అర్ధం కాలేదు.”
భారతి చాల ఉద్వేగంతో రాసినట్టుంది. తిలక్ ఇంట్లోనే ఉన్నాడు. మామగారితో ఈవిషయం మాట్లాడడం అతనున్నప్పుడు కుదరదు. అతను వింటే గొడవవుతుంది. అందుకే కాగితం మీద పెట్టింది. కాలిన గాయానికి నవనీతం పూసినంత చల్లగా అనిపించింది తిలక్ తండ్రికి. గుండెల మీద బరువంతా తీసేసినట్లయి తేలికపడి, కంటి మీదికి కునుకు కూడా వచ్చింది.
మర్నాడు ఆయన లేచేసరికి తిలక్ స్టాంపు కాగితాలో సిద్ధంగా ఉన్నాడు. వాటిని ఆయనకిచ్చి సంతకాలు చెయ్యమన్నాడు. ఆయన ఏమాత్రం సంకోచించకుండా చేసేశాడు. కాఫీ ఇవ్వడానికి అక్కడికొచ్చిన భారతి నిశ్చేష్టురాలైపోయింది.
“ఒక్క విషయం చెప్తాను, వింటావా తిలక్?” కొడుకు నడిగాడు.
తిలక్‍కి ఆయన పట్ల ఒక విధమైన జాలి కలిగింది. పొలం అమ్మడానికి ఆయన ప్రతిఘటిస్తాడని భావించి అప్పుడు తానేం చెయ్యాలో రంగాన్ని సిద్ధం చేసుకున్నాడు. అలాంటిదేమీ జరగలేదు. ఎన్నో ఆస్తులు కరిగిపోగా మిగిలిన ఈ చివరిది అమ్మడానికి కూడా ఆయనే మాత్రం సంకోచించలేదు. అది ఈ ఇంట్లో ఆయన ఉనికినీ, తన దగ్గర ఉండడానికి ఆయనకి గల హక్కునీ సవాలు చేసేదే అయినప్పటికీ వెనుకంజ వెయ్యలేదు. ఎంచేత? తనమీదున్న నమ్మకమా? మనుమడి మీదున్న ప్రేమా? రెండింట్లో ఏదో ఇదమిద్ధంగా తేల్చుకోలేక మరోసారనుకున్నాడు – బొత్తిగా పాతకాలం మనిషని.
ఇందాకటి జాలి స్థానంలో కొద్దిగా ప్రేమ పుట్టింది. వెళ్ళి పక్కలో కూర్చుకున్నాడు.
“చెప్పండి” అన్నాడు.
“ఇప్పుడు నువ్వమ్మబోతున్న భూమి తరాలక్రితం మన కుటుంబంలోకి ప్రవేశించింది. అంటే నీ తండ్రికన్నా, నా తండ్రి కన్నా ముందు తరానికి చెందినది”
“అమ్ముతున్నందుకు బాధపడ్తున్నారా?”
“నువ్వే అన్నీ ఊహించుకోకు. నన్ను కూడా చెప్పనీ. ఇన్నేళ్ళుగా మన కడుపుల్ని నింపింది. మనని ఆశ్రయించిన వారికి కూడా ఇంతన్నం పెట్టింది. ఇప్పుడున్నవి గడ్డురోజులు. రాబోయేవి మరీ గడ్డురోజులు.”
“ “మనం అయిదుగురం. ఇద్దరం తెచ్చుకుంటున్నాం. ఆపాటి తినలేమా?”
“ “తిండి తినలేమని కాదు నేననేది.”
“ “మరేమిటి మీరు చెప్పేది? అదేదో సూటిగా చెప్తే బావుంటుంది. అమ్మడం ఇష్టం లేకపోతే మీ అయిదెకరాలూ మీరే ఉంచుకోండి. ఆవారా అప్పో సప్పో చేసి తర్వాత తీర్చుకుంటాను” అని లేచి నిల్చున్నాడు తిలక్.
తండ్రి అతని చెయ్యి పట్టుకుని ఆపాడు. అతను మళ్ళీ కూర్చున్నాడు. ఈసారి అయిష్టంగా,
“బాబుకన్నా పొలం నాకు ముఖ్యమైనది కాదు. అలా ఆలోచించేవాడినైతే కాగితాలమీద సంతకం చేసేవాడిని కాదు. బొంబాయి వెళ్ళడం అనవసరమని నాకనిపిస్తోంది. జీవనశైలి కొద్దిగా మార్చుకుని చూడు. అప్పటికీ మార్పు రాకపోతే అప్పుడు వెళ్ళచ్చు. నీకన్నా రెట్టింపు వయనూ, అనుభవం ఉన్నాయి నాకు. ఎంతోమంది పిల్లల్నీ పెద్దల్నీ చూశాను. ఎన్నో జీవితాల్ని చదివాను.”
తిలక్ ముఖం గంటుపెట్టుకుని విన్నాడు.
“ఏమీ అమర్చిపెట్టలేనప్పుడు నన్నెందుకు కన్నారని ఒకనాడు నన్ను నిలదీసావు. అదే ప్రశ్న నా చెల్లెళ్ళుగానీ, నాకూతుళ్ళుగానీ అడిగి వుంటే? వాళ్ళడగలేదు. చూపించిన సంబంధాలు చేసుకున్నారు. తృప్తిగా బతుకుతున్నారు. నువ్వుమాత్రం ప్రపంచం బరువు మోస్తున్నట్టు తిరుగుతున్నావు”
“…”
“అందర్నీ వదిలి పెట్టి నువ్వొక్కడివే సుఖపడాలన్న ఆలోచన ఎలా వచ్చిందో
ఎప్పుడొచ్చిందో నాకు తెలీదు. సుఖమంటే డబ్బుండం ఒక్కటే కాదు. డబ్బుతో కనిపించినవన్నీ కొనుక్కోవడం మాత్రమే కాదు. ఉన్నవీ, కొన్నవీ నాకు చాలన్న తృప్తినిచ్చే మనసుండడం మనిషి సుఖానికి మూలం. ఆ సంగతిని పెద్దలు చెప్పనే చెప్పారు. శాస్త్రజ్ఞులు చెప్తేగానీ నమ్మదేమో మీ తరం””
“ఇప్పుడివన్నీ ఎందుకు?”
“ “బాబు సమస్య దీంతో ముడిపడి ఉంది. ఏ మనిషి తన దగ్గర సరిపడ్డంత డబ్బుందని ఒప్పుకోడు. ఎంత సంపాదించినా ఇంకా కొరత మిగిలే ఉంటుంది. డబ్బు సంపాదించడం, దాన్ననుభవించడమే సుఖమైతే నీ లెక్క ప్రకారం ఈ ప్రపంచంలో నిజంగా సుఖపడ్డవాడు అత్యంత ధనవంతుడవుతాడు. అది తప్పు. మానవ సంబంధాలు సరిగ్గా ఉంటే మనిషి సుఖానికి డబ్బుతో నిమిత్తం లేదు. ఆలోచిస్తే నీకే అర్ధమవుతుంది”
“అంటే మీ ఉద్దేశం? నేను డబ్బు మనిషిననా?”
“అని కాదు. డబ్బుతో పిల్లాడికి సుఖాన్నీ, వైద్యాన్ని కొనివ్వగలననుకోవడం తప్పని నా భావం. వాడికి సందడి కావాలి. చుట్టూ మనుషులుండాలి. ఉలకని పలకని టెడ్డీబేర్లూ, మిక్కీమౌస్లు కాదు. తోటి పిల్లల్లో ఆటపాటలు కావాలి. జీవం, చైతన్యం ఉట్టిపడే లోకం కావాలి. ఇంకో పిల్లో పిల్లాడో ఉంటే వాడికింత ఒంటరితనం ఉండదు. ఇప్పుడా అవకాశం లేదా?”
మామగారి మాటలకి భారతి ముఖం ఎర్రబడగా అక్కణ్ణుంచి వెళ్ళిపోయింది. తండ్రి మాట్లాడం ఆపేసినా లేచి వెళ్ళే ప్రయత్నం చెయ్యలేదు తిలక్. తండ్రి చెప్పినట్టు తన ఆలోచనల్లో ఎక్కడో లోపం ఉంది. విత్తనాన్ని పెట్టి అది మొలకెత్తిందో, లేదోనని పదేపదే తవ్వి చూసుకున్నట్టు ఒక్కపిల్లాణ్ణి కని తన ఆశల ఆరాటంతో వాణ్ణి ఉక్కిరిబిక్కిరి చేసేస్తున్నాడు. వాడు స్వతంత్రంగా ఏదీ చెయ్యకుండా కీలుబొమ్మని చేసి వాడితో తాను ఆడుకుంటున్నాడు. తన తండ్రికి తమతో ఇంత ఎటాచిమెంటుండేది కాదు. పిల్లల విషయాలు తల్లికే వదిలేసేవాడు. ఆవిడ స్వేచ్ఛగా తమని పెంచింది. భారతికి తనలాంటి స్వేచ్ఛని ఇవ్వలేదు.
కాసేపాగి తిలక్ తండ్రి మళ్ళీ అన్నాడు. ” పెళ్ళైన వెంటనే భర్త పోయాడు నా పెద్దత్తకి. అత్తింట్లో పెట్టరాని ఆరళ్ళు పెడితే అర్ధరాత్రివేళ కట్టుబట్టలతో పొలంగట్లమ్మట పడి పారిపోయి వచ్చింది. ఇంక నా చెల్లెలు… దానికీ అలానే జరిగింది. మనోవర్తి చేతిలో పెట్టి పంపేసారు. ఆ డబ్బు మా నాన్న చేతికే ఇచ్చింది. నా తండ్రి తాతలిచ్చిన ఇల్లూ, పొలం కావాలని తీసుకున్నప్పుడు వాళ్ళ బాధ్యతలు… అందులో నిస్సహాయులైన ఆ ఆడపిల్లల బాధ్యతలు నావి కావా? నా తోబుట్టువుల్ని సరే, నీ తోడబుట్టినవాళ్ళని కూడా దూరం చేసుకుని ఏం సాధించేవు? నీ డబ్బు వాళ్ళంతా తినేస్తారనేగా నీ భయం? నీ చెల్లెళ్ళకి ఏడాదికి ఒకసారి పసుపుకుంకాలిస్తేనూ, భారతి తన తండ్రి మందులకని ఓ వంద రూపాయలిస్తేనూ తప్పా? అంత తరిగిపోయే ఆస్తుల్ని నువ్వు ఎంతకని పైసపైసా కూడబెట్టి పోగెయ్యగలవు? వాళ్ళకి లేక కాదురా, ఆ ఆశింపు. మనని మరొకరు గుర్తిస్తున్నారు. కని పెట్టుకుని ఉన్నారనే తృప్తికోసం “
తిలక్ తలొంచుకున్నాడు, తండ్రి తన మనసుని చదివేస్తుంటే,
“బాబు అమ్మ ఒళ్ళోని ఆర్తినీ, అనుభూతిని పూర్తిగా అనుభవించకముందే అమ్మాయెళ్ళి ఆఫీసులో చేరింది. ఇంకా లీవు పెడితే జీతం పోతుందని గొడవ. మూడేళ్ళకి స్కూల్లో వేసారు. అక్కడ బితుకుబితుకుమంటూ గడిపి వాడు ఇంటికొస్తే గుండెకి హత్తుకుని సేదదీర్చడానికి అమ్మ ఎదురురాదు. ఆడుకోవడానికి బయటికి వెళ్ళకూడదని ఆంక్ష. ముసలివాళ్ళం మేమిద్దరం. వాడి చిన్ని మనసు ఎంత నలిగిపోయి వుంటుందో ఆలోచించావా? నీ చిన్నప్పుడు నువ్వు మమ్మల్ని ఎంతేనా ద్వేషించి వుండవచ్చు. కానీ, తోటి పిల్లలతో ఆటల్లో పడ్డప్పుడు ఆ ద్వేషాన్ని కాసేపైనా మర్చిపోగలిగావా? మరిప్పుడు? నీ బాధని పంచుకోవడానికి ఎవరూ లేరు. ఓదార్చుకోవాలేగానీ ఒక్కరూ నీ సాయానికి రారు. నీ అంతట నువ్వు సేదరీరేంత ధైర్యం నీకుందా? నీకేగాదు, ఏ మనిషికీ ఉండదని నా నమ్మకం.”
“వద్దు. ఇంకేమీ చెప్పకండి.” సిగ్గేసింది తిలక్కి.
అతనికి చప్పుని గుర్తొచ్చింది . ‘డబ్బు’ అనేదొకటి ప్రపంచాన్ని శాసిస్తుందనీ, దాన్ని తండ్రి దుర్వినియోగపరచడం చేతనే తనకి దక్కాల్పివన్నీ దక్కడం లేదని తను అనుకోకముందు చాలా సంతోషంగా ఉండేవాడు. ఆ సంతోషపు రోజుల్లో తండ్రి మేనత్తని అతను అమ్మమ్మా అని పిలిచేవాడు. పెద్దమేనత్త అతన్ని ఎత్తుకుని తిరిగేది. అప్పట్లో కాస్తక్కువ దూరం నడవాల్సొస్తే తండ్రి అతన్ని భుజాల మీద ఎక్కించుకుని తీసుకెళ్ళేవాడు.
ఆకాశంలోని మబ్బులన్నీ తొలగి చంద్రోదయమైనట్టు అతని మనసంతా చల్లటి వెలుతురు పరుచుకుంది. ఆ వెలుతుర్లో డబ్బుని మినహాయించుకున్న ప్రపంచం కూడా శోభాయమానంగానే కనిపించింది. కొడుకు తన తెలివితక్కువతనం, అనుభవరాహిత్యాల వల్ల ఊబిలోకి కూరుకుపోతుంటే తండ్రి చేయూతనిచ్చి పైకి లాగుతున్న దృశ్యం రూపుదిద్దుకుంది.
ఆయన పాతకాలం వాడే కావచ్చు. డబ్బు దాచలేకపోవచ్చు, చీకూ చింతా లేకుండా నిశ్చింతగా ఉన్నాడు. ఆయన ఆలోచనల తాలూకూ వేర్లు సృష్టి ఆదిలోకి… మానవ సమాజపు తొలిపునాదుల్లోకి చొచ్చుకుపోయి సృష్టి అంతం దాకా విస్తరించేంత విశాలమైనవి. మనిషి సృష్టించినది డబ్బు. అది జీవితాల్ని శాసిస్తుందనుకోవడం భ్రమ. ఆ భ్రమని సృష్టించి మనిషి తానే సాటి వాడికి అన్యాయం చేస్తున్నాడు. అప్పుడున్నంత చిక్కదనం ఇప్పుడుండకపోవచ్చు కానీ, మనిషికి మానవ సంబంధాలు చాలా అవసరం అనుకుంటూ లేచాడు.
( ఇండియాటుడే, 3 ఆగస్టు 1999)
పశ్చిమగోదావరి జిల్లా రెడ్డి పోలవరంలో 16 July, 1962 లో జననం. వరంగల్లో వుద్యోగం. హెడ్పోస్ట్మాస్టర్గా వరంగల్లో స్వచ్చందపదవీ విరమణ.
వివాహం శ్రీ చదలవాడ విష్ణుమూర్తిగారితో. వారు డెప్యూటీ ఏగ్జిక్యూటివ్ ఇంజనీరుగా చేసి రిటైరయారు.
మొదటి కథ అనగనగా 1978లో వనితాజ్యోతి మాసపత్రికలో అచ్చైంది. వీరివి 225కి పైగా కథలు, 9 నవలలు వివిధ పత్రికల్లో ప్రచురించబడ్డాయి. గూడు, సింధూరి, గుండెలోతు అనే కథాసంపుటాలు, నీలినక్షత్రం అనే నవల పుస్తకాలుగా వచ్చాయి. సింధూరి అనే సంపుటానికి శ్రీమతి సుశీలా నారాయణ రెడ్డి అవార్డు 2005 లో వచ్చింది. ప్రేమలోంచీ ప్రేమలోకి అనే నవలకి ఆంధ్రభూమి ప్రథమ, తిరస్కృతులు, నీకోసం నేను అనే నవలలకి ఆంధ్రభూమి ద్వితీయ, 5-3-2 అనే నవలకి కినిగె ద్వితీయ బహుమతులు వచ్చాయి. ఎంతెంతదూరం? అనే కథకి విపుల కన్సొలేషన్ బహుమతి, శ్రీమతి రంగవల్లి ట్రస్ట్ అవార్డు వచ్చాయి. ఇవికాక కథలకు మరో ఏడెనిమిది బహుమతులు వచ్చాయి.
కథలకు కాన్వాస్ పెద్దదిగా వుండాలనేది వీరి అభిప్రాయం.