పెళ్లి పిలుపు – 10 by S Sridevi

  1. పెళ్లి పిలుపు – 1 by S Sridevi
  2. పెళ్లి పిలుపు – 2 by S Sridevi
  3. పెళ్లి పిలుపు – 3 by S Sridevi
  4. పెళ్లి పిలుపు – 4 by S Sridevi
  5. పెళ్లి పిలుపు – 5 by S Sridevi
  6. పెళ్లి పిలుపు – 6 by S Sridevi
  7. పెళ్లి పిలుపు – 7 by S Sridevi
  8. పెళ్లి పిలుపు – 8 by S Sridevi
  9. పెళ్లి పిలుపు – 9 by S Sridevi
  10. పెళ్లి పిలుపు – 10 by S Sridevi
  11. పెళ్లి పిలుపు – 11 by S Sridevi
  12. పెళ్లి పిలుపు – 12 by S Sridevi
  13. పెళ్లి పిలుపు – 13 by S Sridevi
  14. పెళ్లి పిలుపు 14 by S Sridevi“
  15. పెళ్లి పిలుపు – 15 by S Sridevi

అదేసమయానికి పినతండ్రులూవాళ్ళతో జోరుగా పేకాటలో వున్నాడు శేషు. పొద్దుటినుంచీ సాగుతోంది. ఎవరో వచ్చి అతనికి వుప్పందించారు.
“సంయుక్త వచ్చిందిరా! దాని బలగాన్నందర్నీ వెంటేసుకు వచ్చింది. పెద్ద గొడవైపోతోంది” అని వార్త.
ముక్కలు కింద పడేసి దూకుడుగా లేచాడు శేషు.
“శేషూ! ఎక్కడికిరా? ” అని ఒక పినతండ్రి అంటునే వున్నాడు, అతను గది దాటేసాడు. సాధారణంగా అత్తవారింటి వ్యవహారాల్లో అల్లుళ్ళెవరికీ గొంతు లేవదు. వాళ్లతో నెగ్గలేక భార్యలకీ, బావమరుదులకే సమస్తం వదిలేస్తారు. అందులో సంయుక్తా శేషుల విషయం మరీ జటిలమైనది. విడవమంటే పాముకి కోపం, కరవమంటే కప్పకి కోపంలాంటిది. ఇప్పుడుకూడా తాము చేసేదేమీ లేదని శేషు తండ్రితోసహా అందరికీ తెలుసు.
“అత్తా! మామయ్య ఎక్కడ?” అదే దూకుడుతో వసంతావాళ్ళ విడిదికి వెళ్ళి దురుసుగా అడిగాడు.
సర్దుబాటైన గొడవ మళ్ళీ మొదటికి వచ్చిందనుకుంది వసంత. శేషుకి ఎంతవరకూ తెలుసో, ఏమేరకి తెలుసుకుని యుద్ధానికి వచ్చినట్టు వచ్చాడో తెలీదు.
“పెద్దమామయ్యావాళ్లని తీసుకు రావటానికి వెళ్ళారు” అంది నెమ్మదిగా.
“ఎక్కడికెళ్ళారు వాళ్ళు? పొద్దున్న మనతోనేగా వచ్చారు?”
“అత్తేం చెప్తుందిగానీ నేనున్నాను చెప్పటానికి…” పక్కగదిలోంచీ వచ్చింది జయలక్ష్మి. కొడుకుని చూసి ఆమెకి బలం వచ్చింది.
“సమ్మూ వచ్చిందిరా! దాన్ని వెళ్ళగొట్టమని చెప్పాను. అందుకు అలిగి పెద్దమామయ్యా అత్తా వెళ్ళిపోయారు. ఏడుపులూ మొత్తుకోళ్ళూ అయ్యాయి. ఇహ… వీళ్ళ వ్యవహారం… ఆ శ్రీధరు ఆడపెళ్ళివాళ్లకి బాగా కావలిసినవాడట. వాళ్ళని గెంటేస్తే ఈ పెళ్లెక్కడ ఆగిపోతుందోనని… ఓ… ఈ తల్లీకొడుకులిద్దరూ అగ్గగ్గలాడిపోతున్నారు…అంతా కలిసి ఇక్కడ సభచేస్తారట…” అంది. శేషు ముఖం జేవురించింది.
“వాళ్లని ఎవరు పిలిచారు?” ఆగ్రహంగా అడిగాడు.
వసంతకి పైప్రాణం పైనే పోతోంది. ఒకవైపు శీను వాళ్ళని వెంటబెట్టుకుని రావటానికి వెళ్ళాడు. వచ్చేస్తాడేమో! మరోవైపు అన్నావదినల్ని తీసుకొస్తానని భర్త వెళ్ళాడు. వాళ్ళూ వచ్చేస్తారేమో! ఈ శేషు ఏ వీరంగం ఆడతాడో!
“శేషూ! ఇక్కడికి రారా, మాట్లాడుకుందాం” ఆమె మనసు చదివినట్టు ఆఖరి ఆడబడుచు జయలక్ష్మిని తోసుకుంటూ వచ్చి శేషు చెయ్యిపట్టుకుని తమ గదిలోకి తీసుకెళ్ళింది. అప్పుడే శీను రావటం జరిగింది. శేషుని చూడగానే అతని ముఖం కళతప్పింది.
“బావా! రారా, అలా వెళ్ళి మాట్లాడుకుందాం…” అంటూ అతన్ని తీసుకెళ్ళిపోయాడు.
“ఎక్కడికిరా? వాళ్ళిద్దరూ వచ్చారటగా? మంచిసందు దొరికింది. మెత్తగా చావగొట్టి గదిలో పడేసి గొళ్ళెం పెట్టేద్దాం… అది… ఆ సంయుక్త ఎవరితో చెప్పుకుంటుందో నేను చూస్తాను” అన్నాడు శేషు.
“ఇది పెళ్ళిల్లురా, బావా! అలాంటివన్నీ వద్దు. మర్యాదగా వుండదు” అన్నాడు శీను.
“ఐతే వాళ్ళని వెళ్లగొడ్తే తప్ప పీటలమీద కూర్చోనని చెప్పు…”
“అవన్నీ జరిగే పనులు కావు…” అప్పటికి ఇద్దరూ పెళ్ళి మంటపం గేటుదాకా వచ్చేసారు. శీనుకి మనసులో శేషుని పంపించెయ్యాలని ఎలాంటి ఆలోచనా లేదు. నచ్చజెప్పి పక్కని కూర్చోబెడదామని అనుకుంటున్నాడు. కానీ శేషు మరోలా అర్థం చేసుకున్నాడు. అతన్లో ఒక దిగ్భ్రాంతి. సమ్మూ ఇంట్లోంచీ వెళ్ళిపోయాక తనకి అండగా వున్నవాడు, శ్రీధర్‍ని కొట్టించడానికీ, కొట్టడానికీ చూసింది ఈ శీనేననుకుంటే నమ్మకం కలగట్లేదు.
“నువ్వు మారిపోయావురా! చాలా మారిపోయావు… ఇంకా పెళ్ళేనా అవలేదు, వాళ్ళు చెప్పినట్టల్లా ఆడుతున్నావు… మారిపోయావురా, బావా!” అతని చెయ్యి విడిపించుకుని, దూరంగా వెళ్ళిపోయాడు. అతని కళ్ళలో చిరుతడి. శీను అలా తెల్లబోయి చూస్తుండగానే శేషు తన బైక్‍మీద అతని ముందునించీ వెళ్ళిపోయాడు.
“శేషు అన్నాయన అలా వెళ్ళిపోయినందుకు కొంచెం గిల్ట్ వుందిగానీ మొత్తానికి అంతా సుఖాంతమైంది పిన్నీ!” అంది తన్మయి చెప్పడం ముగించి.
” అంత రిస్క్ ఎందుకు తీసుకున్నావే? శ్రీధర్ ఏమీ అనుకునేవాడు కాదు. ఆ అమ్మాయి… సంయుక్త కూడా మంచిదే”” అంది మేఘమాల.“
“అలా ఎలా పిన్నీ? నువ్వేనా ఇలా మాట్లాడుతున్నది? ఇది శ్రీనుకి లిట్మస్ టెస్ట్‌లాంటిది. తన ప్రాథమ్యాలు ఎలా ఉండాలో అర్థం చేసుకున్నాడు…. లేకపోతే… మనం పిలుచుకున్నవాళ్ళని వెళ్లిపొమ్మని ఆవిడ చెప్పటం ఏమిటి?” కోపంగా అడిగింది తన్మయి.
” నా సిద్ధాంతాలు నావరకే. ఈ కారణాన పెళ్లి ఆగిపోయిందంటే మాకు బాధ కాదా?” అడిగింది మేఘమాల.
” ఇప్పుడు బాధపడ్డా తర్వాత సుఖపడేదాన్ని. సంస్కారం లేని వ్యక్తితో పెళ్లి జీవితకాలపు బాధ కదా?” స్థిరంగా అంది తన్మయి .ఇటువంటివి ఎవరికి వారు తీసుకోవలసిన నిర్ణయాలు. అందుకే నిర్మల ఆమెకి వదిలేసింది. సరిగ్గా అదే ప్రశ్న అడిగింది సంయుక్త తన్మయిని కొద్దిసేపటి తర్వాత.
ఆమెకి తగిన జవాబు చెప్పింది తన్మయి .” భార్య అభిరుచులనీ, అవసరాలనీ, ఒక్కొక్కసారి ఆమె పరంగా ఎదురయే తప్పనిసరి పరిస్థితులనీ అర్థంచేసుకోలేనప్పుడు అతన్ని ఆమె పెళ్లిచేసుకుని లాభమేమిటి? అందమైన పువ్వులు దోసిలి నిండా తీసుకుని వాటి స్పర్శని తనువారా వాటి అందాన్ని కనులారా ఆస్వాదించి వాటి వాసనని గుండెలనిండా పీల్చుకున్నట్టు ఉండాలి సహచర్యం అంటే… స్నేహమేనా పెళ్లేనా” అంది తన్మయి. “శీను అలాంటివాడేనని నాకు నమ్మకం ఉంది . ఒకవేళ కాకపోతే అతన్నలా మార్చుకోవగలనని ఇప్పుడు రుజువైందిగా?” ఆమె గొంతులో ధీమా.
సంయుక్తకి శ్రీధర్ మెడ చుట్టూ రెండు చేతులూ వేసి, అల్లుకుపోయి అతని కళ్ళలో కళ్ళుంచి చూస్తూ అతని శ్వాసలో మమేకం కావాలనిపించింది ఆ క్షణాన . అన్ని సంకోచాలను జయించిన క్షణం అది.
వీళ్లు వచ్చీ రావటంతోటే గొడవ మొదలైంది . అది పెద్దవాళ్లదాకా వెళ్లకూడదని జాగ్రత్తపడ్డారు. అందుకే ఇంకా నిర్మల, దయానంద్‍ల తల్లిదండ్రులను కలవలేదు శ్రీధర్, సంయుక్తలు. గొడవ సర్దుబాటయాక సంయుక్తవైపువాళ్ళని పరిచయం చేసుకుని వచ్చారు. ఇప్పుడు శ్రీధర్ సంయుక్తని వెంటపెట్టుకుని అందర్నీ కలిసి వచ్చాడు.
ఇద్దరు పిల్లల తల్లిని అతను చేసుకున్నాడన్న విషయం నిర్మల తల్లిదండ్రులని బాగా ఇబ్బంది పెట్టింది. అటువంటి పెళ్లిని ఇప్పటి తరంవారు నిలబెట్టుకోగలరా అనే భయంనుంచి వచ్చిన ఇబ్బంది అది. సంయుక్త శీను పెదనాన్న కూతురన్న నిజం కొంచెం కటువుగా అనిపించింది. ఈ విషయాన్ని పెళ్లివాళ్లు దాచిపెట్టారని అనుకోవడానికి ఇద్దరూ స్వంత అన్నాచెల్లెళ్ళు కారు. సంయుక్త ప్రవర్తనలో సాత్త్వికత, అమాయకత్వం చాలావరకూ వాళ్ల మధ్య సానుకూలతని ఏర్పరచింది. మనసులోని భావాలు బయటపడకుండా బాగానే మాట్లాడారు.
“బ్యూటీపార్లర్ అమ్మాయిలు వచ్చారు. మీరుకూడా రండి” అని పిలవడంతో సంయుక్త వెళ్లింది.
“అదేమిట్రా, మమ్మల్ని సంబంధం చూడమంటే చూడమా? పిల్లల తల్లిని చేసుకోవడమేమిటి? లోకం గొడ్డుపోయిందా?” అని శ్రీధర్‍ని కోప్పడింది నిర్మల తల్లి. శ్రీధర్ నవ్వేసాడు.
“పిల్ల నచ్చిందిలే, పిన్నీ! చాలా మంచిది” అన్నాడు.
“సర్లే. అంతగా నచ్చి చేసుకుంటే సరేమరి. ఆ ఇష్టాన్ని చివరిదాకా నిలబెట్టుకోవాలి” అని హెచ్చరించి ఆ విషయం అంతటితో వదిలేసింది. అతను వెళ్లి రాజారావు, శారదలని పిలుచుకొచ్చి పరిచయం చేసాడు. సంయుక్త పరోక్షంలోనే వాళ్ల మొదటి పరిచయం జరగాలని అనుకున్నాడు. ఆమె మొదటిపెళ్ళి ప్రస్తావన అనివార్యంగా వస్తుంది. పదేపదే ఆమె గాయపడటం అతనికి ఇష్టం లేదు.పరిచయాలయ్యి, కొంత సంభాషణ జరిగాక తనుకూడా అక్కడినుంచి వెళ్ళిపోయాడు .నిర్మల తల్లిదండ్రులు బాహాటంగా అడగలేని ఎన్నో విషయాలకి రాజారావు, శారదలు స్పష్టమైన జవాబులు ఇచ్చారు. పెళ్లికి ముందు మాట్లాడుకోని విషయాలు ఇప్పుడు మాట్లాడుకున్నారు.
“మేనరికం అని చిన్నప్పుడే చేసేసాం. అష్టకష్టాలూ పడింది. ఆత్మహత్య కూడా చేసుకోబోయింది. విడాకులకికూడా వాళ్లే తొందరపడ్డారు… పుట్టిన ఇన్నాళ్ళకి మా పిల్ల మొహంలో నవ్వు చూస్తున్నాం” అంది శారద. ఆమె గొంతు దు:ఖంతో పూడుకుపోయింది. ” ఈ పెళ్లిలో మా ప్రోద్బలం ఏమీ లేదమ్మా! ఈవేళ తన్మయికి మీరు ఎలా స్వేచ్ఛ ఇచ్చారో అలాగే మేము కూడా సంయుక్త నిర్ణయానికి వదిలేసాం. ఇద్దరూ ఇష్టపడి చేసుకున్నారు. సంతోషంగా తిరుగుతున్నారు. ” అని చేతులు జోడించాడు రాజారావు. వాళ్లకి ఇదంతా కలలా వుంది తప్ప నమ్మశక్యంగా లేదు. ఇంకొంతసేపు వుండి వెళ్లిపోయారు.
“ఈవేళ ఏం జరిగిందే?” వాళ్లు వెళ్లాక నిర్మలని అడిగింది ఆవిడ. చెప్పక తప్పలేదు.
“అంత గొడవ జరిగితే మాకెందుకు చెప్పలేదు? ” అని నిలదీస్తే…
“మేమే ఏమీ చెయ్యకుండా పక్కకి తప్పుకున్నాం. అందుకే చెప్పలేదు” అంది.
పిల్లలు ఇంత స్వతంత్రంగా వ్యవహరించడం ఆవిడ పుట్టింటిలో చూడలేదు. ఎంత అభ్యుదయ భావాలున్నా తల్లిదండ్రుల వెనకే నిలబడేది తను. అత్తింటికి వచ్చాకే చాలా తెలుసుకుంది.
రాజారావు కుటుంబంలో సంయుక్త పెళ్లి మొదటిది. చాలా వేడుకగా జరిగింది. తర్వాత చెల్లెళ్ళ కూతుళ్ళ పెళ్లిళ్లయ్యాయి. అంతే సందడి. వాళ్ల ఎనిమిది కుటుంబాలు కలిస్తేనే పెద్ద సందడి. మామయ్యలు, పిన్నుల అక్కచెల్లెళ్ళు, అన్నదమ్ములు, వాళ్ల కుటుంబాలు కలిస్తే ఇంక చెప్పనే అక్కరలేదు. అలాంటిది ఇక్కడ లెక్కపెట్టుకున్నట్టు ఎక్కువమంది లేరు. చిన్న కుటుంబాలు ఎలా వుంటాయో మరో రెండు మూడు తరాల తర్వాత వుండే దృశ్యం ఇప్పుడే కనిపిస్తోంది.తన్మయి అలంకారం జరుగుతుంటే ఒక నడివయస్కుడు ముసలామెని నడిపించుకుంటూ వచ్చాడు.
అతను నిర్మల పెదనాన్న కొడుకు. ఆవిడ నిర్మల నాయనమ్మ. నిర్మల తల్లిదండ్రులు, పెద్దనాన్న పెద్దమ్మలు అదే వూళ్ళో ఒకే దగ్గర ఫ్లాట్లు కొనుక్కుని వుంటారు. ఆవిడని జాగ్రత్తగా చూసుకుంటారు.
” రా అన్నయ్యా! రా నానమ్మా! ” అని ఆహ్వానించి పెద్దామెని సోఫాలో జాగ్రత్తగా కూర్చోబెట్టి దిళ్లూ అవీ అమర్చింది నిర్మల . ” మిగతావాళ్ళు ఏరి?” అని అడిగింది.
“వస్తున్నారు నిర్మలా! నిన్నంతా ఇక్కడే వున్నారుకదా, అమ్మకి కీళ్ళనొప్పులు వచ్చేసాయి” జవాబిచ్చాడు అతను.
ఒక్కొక్కరే వచ్చి పలకరిస్తున్నారు పెద్దావిడని.
“చీరలో బావున్నానా తాతమ్మా?” అడిగింది తన్మయి. ఆవిడ నవ్వి, దగ్గరకు తీసుకుని ప్రేమగా ముద్దు పెట్టుకుంది. తనతో తెచ్చిన కానుకలు యిచ్చి, ” రాత్రి ముహూర్తం కదా, వుండలేను” అంది.
ఆవిడకి తొంభయ్యేళ్ళు దాటాయి. చిన్న కుదుపు కూడా తట్టుకోలేదని చెప్పారట డాక్టర్లు. ఆఖరి రోజులన్నట్టే.
“అబ్బాయిని తీసుకొస్తావా, ఒకసారి? ” అడిగింది. తన్మయి శీనుని తీసుకురావటానికి వెళ్లింది. అతను రావటం, పరిచయం, ఆశీర్వాదం అన్నీ అయాక –
“శ్రీధర్ ఏడే? ఏదో ఘనకార్యం చేసాడట?” అడిగింది.
నిర్మల అక్కడే వున్న సంయుక్తని ముందుకి తోసింది. “ఈ అమ్మాయే వాడు చేసుకున్న పిల్ల. పేరు సంయుక్త” అంది.
అక్కడ అందరూ శ్రీధర్‍కి ప్రత్యేకమైన స్థానం ఇవ్వడం గుర్తించాడు శీను. అతని చదువు, హోదా, హుందాతనం పైకి కనిపించే కారణమైతే దాన్ని సాధించి పెట్టిన వ్యక్తిత్వం రెండవ కారణం. వెరసి ప్రయోజకుడైన కొడుక్కి వుండేలాంటి స్థానం.
సంయుక్త ఆవిడకి నమస్కరించింది. “నీ గురించి మేఘమాల చెప్పింది. చూడాలనుకున్నాను. తీసుకురమ్మని చెప్పాను. ఈలోగా ఇలా చూడటం జరిగింది. చాలా మంచి పని చేశావు . కొద్దిసేపు నా దగ్గరగా వచ్చి కూర్చో. నీతో మాట్లాడాలి ” అంది. అంతా వాళ్లిద్దరినీ వదిలేసి ఎవరి పనిలో వాళ్లు పడ్డారు. ఐనాకూడా మధ్యలో కూడా ఒకరిద్దరు వచ్చి పెద్దావిడని పలకరించి వెళ్తున్నారు. అవసరమైనవాళ్ళకి సంయుక్తని తనే పరిచయం చేస్తోంది. శ్రీధర్‍కూడా వచ్చి ఆవిడని చూసి వెళ్లాడు.
“అత్తయ్యగారు చెప్పేవి జాగ్రత్తగా విను సంయుక్తా! జరిగినవాటిని మనం తుడిచివెయ్యలేము. వాటి దుష్ప్రభావం మనమీద లేకుండా చూసుకోవాలి. వాటినుంచీ స్ఫూర్తిని పొందాలి. నువ్వు, శ్రీధర్ సంతోషంగా వుండటం మాకు కావలిసినది” అని, నిర్మల తల్లి అక్కడ వున్నవాళ్ళందరినీ మరోగదిలోకి తీసుకెళ్ళింది, వాళ్లకి మాట్లాడుకోవడానికి వీలు కల్పిస్తూ.
సంయుక్త చేతిని తన చేతిలోకి తీసుకుంది ఆవిడ. వడిలి ముడతలుపడినా పట్టు బలంగానే వుంది.” నా పేరు తెలుసునా? కాంతామణీ, బియ్యే బీఎల్ . ఒకప్పుడు లీడింగ్ లాయర్ని. ఆడవాళ్ళ కేసులు చూసేదాన్ని” చిరునవ్వుతో చెప్పింది. సంయుక్త ఆశ్చర్యంగా విన్నది ఆవిడ మాటలని. అపనమ్మకంగా చూసింది.
“మీ పక్కింటిలో దిగినప్పుడు, మీ ఆయన పద్ధతి చూసి మేఘమాల నాకు ఫోన్ చేసింది. ఏమైనా చేద్దామా నానమ్మా అని అడిగింది” “పెద్దక్కయ్యగారు… నా గురించి…?”
“ఔనమ్మా! ఇలాంటివి అది చూసి తట్టుకోలేదు… ప్రతివారికీ ఆప్టిమమ్ టాలరెన్స్ పాయింట్ వుంటుంది. అక్కడదాకా మనిషి ఎదుటి మనిషిని భరిస్తాడు. ఆ తర్వాత తిరగబడతాడు. నువ్వింకా అప్పటికి సహించే స్థితిలోనే వున్నావు. కల్పించుకోవద్దని చెప్పాను. ..ఔనూ, ఆత్మహత్య ఎందుకు చేసుకోవాలనుకున్నావు? “
“విసుగేసింది ఆ జీవితం. అమ్మావాళ్ళకి అర్థం కాదు. బావ గురించి వాళ్లకి తెలుసు. ఐనా నన్ను అక్కడే వుండమనేవారు”
” నాతో దీటైన పిల్లవి. ఎంతోకాలంగా వెతుకుతున్నాను. ఇప్పటికి దొరికావు. నా గురించి చెప్పనా?” అని నవ్వింది ఆవిడ.