( నవ్యలో 2003లో నాలుగు వారాల సీరియల్ గా వచ్చింది)“
“నా వయసెంతో తెలుసా? తొంభయ్యేళ్ళు. పంధొమ్మిది వందల పదమూడులో పుట్టాను. అంటే మీ వూహకి కూడా అందనటువంటి జీవితాన్ని గడిపాను. అప్పటికి ఇంకా బాల్యవివాహాల నిరోధక చట్టం… శారదా యాక్ట్ రాలేదు” ఆవిడ చెప్పసాగింది. ఆవిడ ఎందుకు చెప్తోందో, చెప్తున్నది తనకి దేనికి వుపయోగపడుతుందో అర్థమవలేదు సంయుక్తకి. ఐనా పెద్దావిడమీది గౌరవంతో శ్రద్ధగా వినసాగింది.
“శారదా యాక్ట్ రావటానికన్నా ముందే నా జీవితంలోని వైభవాలన్నీ తెల్లారిపోయాయి” ఆవిడ నిట్టూర్చింది. ” మూడేళ్లకి పెళ్లైంది. ఏడేళ్లకి భర్త పోయాడు”
“మూడేళ్లకి పెళ్లా?!!” సంయుక్త తెల్లబోయింది. తనకే చాలా చిన్నవయసులో చేసారనుకుంటోంది. వ్యక్తురాలైంది కాబట్టి తనకి శృంగారం గురించి కొంచెమేనా తెలుసు. ఆ వయసులో పెళ్లి చేసి ఆ పిల్లనేం చేస్తారు? ఏడేళ్లకి వైధవ్యమా? అంటే? అయోమయంగా చూసింది.
“ఇంకెన్నో రోజులు బతుకుతానని అనుకోను సంయుక్తా! దెబ్బ తిన్నవాళ్ళకే గాయం లోతు తెలుస్తుంది. నీదీ నాదీ ఒకేలాంటి నెప్పి కాకపోవచ్చు. కానీ నెప్పి వుందికదా? … పెళ్లి ముహూర్తం అర్థరాత్రి, కాసేపు మాట్లాడుకుందామా? మళ్ళీ అనుకుని కలుసుకునేదాకా నేను వుంటానో వుండనో ” అడిగింది ఆవిడ.
“అయ్యో, చెప్పండి” అంది సంయుక్త.
“పిల్లలకి ఇవన్నీ తెలుసు… నా జీవితంలో భాగంగా. నాకు ఆర్తితో కూడిన స్పందన కావాలనిపిస్తోంది చాలాకాలం తర్వాత. చెప్పానుగా, ఏడేళ్లకి అతను పోయాడని. అసలు అవేవీ నాకు తెలియవు… అంటే నా జీవితంలోని ముఖ్యమైన రెండు విషయాలూ నాతో నిమిత్తం లేకుండానే జరిగిపోయాయి”
“మరీ సంతానం?…”ఆవిడ ఆ ప్రశ్నని పట్టించుకోలేదు. తన ధోరణిలో చెప్పుకుపోయింది.” ఆడవాళ్ళని అణిచేసిందీ మగవాళ్ళే. మళ్ళీ వాళ్ళ బాగుకోసం వుద్యమాలు చేసిందీ వాళ్లే. ఆ వుద్యమాలని నీరుగార్చిందీ వాళ్లే. ఆడవాళ్ళకి ఆడవాళ్ళే శతృవులంటారు కానీ కాదు. వాళ్లనలా మూర్ఖుల్లా వుంచి కుటుంబాలని ఏలుతారు మగవారు….” ఆవిడ ఆయాసపడుతుంటే మంచినీళ్ళు తెచ్చి తాగించింది సంయుక్త. ప్రేమగా చూసింది కాంతామణి.
“ఎవరికీ చదువులు లేవు. సంస్కారం లేదు. నాలుగు సంస్కృతం మంత్రలు, శ్లోకాలూ వల్లెవేసి అదే పాండిత్యం అనుకునేవారు. అందుకు అహంకారం. ఆడామగా బేధం లేకుండా అందరూ అజ్ఞానంలో బతికిన రోజులవి… పధ్నాలుగేళ్ళకి పెద్దపిల్లనయాను. ఘనంగా వితంతువుని చేసారు. అది నా మనసు మీద పుండు నయమైన మచ్చలా వుందిలే. ..ఐదు మూరల మల్లుబట్ట ఇచ్చారు. జుత్తు తీయించారు… వంటింట్లో గాడిపొయ్యిల మధ్య మరో పదేళ్ళు గడిచాయి. వాళ్లు … అత్తవారు మనోవర్తి ఇచ్చారు, వీళ్ళు దాన్ని తమదనేసుకున్నారు “
“మరి ప్లీడరు… బియ్యే బీయెల్…?” సందిగ్ధంగా అడిగింది సంయుక్త. కాంతామణి మనోహరంగా నవ్వింది.
“ముందువి తర్వాత, తర్వాతవి ముందు జరిగాయి… చచ్చిపోయి మళ్ళీ పుట్టాక” అంది. సంయుక్తకి కొంచెం భయం వేసింది. ఆవిడ మన:స్థితి సరిగా లేదేమోననే అనుమానం కూడా వచ్చింది. ఎవరేనా గది తలుపు తీసుకుని వస్తే బావుంటుందని కూడా అనుకుంది. పెద్దావిడ అదేం పట్టించుకోలేదు. జ్ఞాపకాలని తవ్వుకుంటూ సోఫాలో వెనక్కి వరిగి కళ్ళు మూసుకుంది. కొద్ది క్షణాల తర్వాత ఆవిడ గొంతు మంద్రంగా సాగింది.
“అమ్మానాన్నలు తాతయ్యాబామ్మలు, పెదనాన్నలు, చిన్నాన్నలు ఇంకా ఇంకా పిల్లలని కంటుండేవారు. బావలు, మరుదులు నా కళ్ళముందే నా అక్కలతో చెల్లెళ్ళతో సరసాలాడేవారు. నా కళ్ళముందు పుట్టినవాళ్ళకి పెళ్లిళ్ళు, శోభనాలు, పురుళ్ళు… కొందరికి వైధవ్యాలు కూడా. ఆ జీవితమంటే అసహ్యం వేసింది. వూపిరి ఆడనిచోట ఇరుక్కున్నట్టు గిజగిజలాడాను. ఆఖరికి ఇంట్లో తద్దినాలకి వచ్చే భోక్త ఒకడితో లేచిపోయాను”
“ఆ<!?” అంది సంయుక్త వులిక్కిపడి.
“నన్ను వాడేదో వుద్ధరిస్తాడనుకున్నాను. అసలేం వుద్ధరించాలనుకున్నానో, వాడికి తెలిసిందీ నాకు తెలీనిదీ ఏమిటో నాకు ఇప్పటికీ నాకు అర్ధం అవదు. రైలెక్కాము. మూడో తరగతి బోగీ… తెగ జనం. క్రిక్కిరిసిపోయి వున్నారు. నేను ఆదమరిచి వున్న సమయంలో వాడు నా చేతిసంచీ కాజేసి ఏదో స్టేషన్లో దిగిపోయాడు. వాళ్లూ వీళ్ళూ నామీద జాలితో ఇచ్చిన పదీ పరకా పోగుచేసుకుని దాచుకున్న డబ్బులు ఐదారు రూపాయలు అందులో వున్నాయి. నేను కట్టుకునే మారుపంచ కూడా అందులోనే వుంది. అవన్నీ పోయినందుకు ఏడవనా? నడిసముద్రంలో ఇరుక్కుపోయినందుకు ఏడవనా? నిజం చెప్తే ఎవరేనా నన్ను అయ్యో అంటారా?”
ఏదో కాలప్రవాహంలో పడి కొట్టుకుపోతున్నట్టు అనిపించింది సంయుక్తకి . డబ్బు పట్టుకుని ప్రేమించినవాడితో ఇంట్లోంచీ పారిపోవడం, వాడు మోసం చెయ్యటం అప్పుడూనా?
“ఇప్పుడు నేనేం చెయ్యాలి? రైలు దిగి గోదార్లో దూకడం తప్ప గత్యంతరం లేదు. కానీ చావాలంటే భయం. గోదారి స్టేషన్లో దిగి, చాటుకి కూర్చుని జాప్యం చేసి చేసి తెలతెలవారుతుంటే ఇక తప్పదన్నట్టు లేచి అదే పని చెయ్యబోయాను. ఎవరో పెద్దమనిషి నన్ను ఆపి, నా కథంతా తెలుసుకుని,
“బలవంతంగా చావటానికి దేవుడు మనిషిని పుట్టించ లేదమ్మాయ్! మనుషులే మనుషులని పీక్కు తింటున్నారు… ముఖ్యంగా ఆడమనుషులని. నాతో రా, నీకు దారి చూపిస్తాను అని తీసుకెళ్ళి వీరేశలింగంగారి ఆశ్రమంలో చేర్పించాడు “
“మీరు ఆయన్ను చూసారా?” ఆతృతగా అడిగింది సంయుక్త.
“లేదు . అప్పటికే ఆయన పోయారు. ఆయన శిష్యులు వుండేవారు”
“…”
“ఒకాయన వితంతు వివాహం చేసుకుంటానని వచ్చారు. నన్ను చూపించారు. మనిషి నల్లగా దృఢంగా పోతపోసిన విగ్రహంలా వున్నాడు. ముఖంమీద స్ఫోటకం మచ్చలు. మరి నేనెలా వున్నాను? ఇంకా వెంట్రుకలు మొలవని బోడిగుండు, బోసి వొళ్ళు…” అప్పటి రూపం గుర్తు తెచ్చుకుని ఆవిడ నవ్వేసింది. సంయుక్తకి కూడా చిన్న నవ్వు వచ్చి సంకోచంతో పెదాల వెనుక ఆగిపోయింది.
” నా పరిస్థితి ఏమిటి? నిలవనీడ లేదు. ఇప్పుడు సరే, ముందు బ్రతుకేమిటి? మరో దారి లేదు. దారే వుంటే ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు. అలా మా పెళ్లి అయింది. నా వూహ తెలిసాక మొదటిసారి రంగు చీర కట్టుకుని, బొట్టు పెట్టుకున్నాను. చేతులకి గాజులు, మెడలో పసుపుతాడు. దండల మార్పిడి పెళ్లే అయినా వెలితిగా వుండకూడదని మంగళసూత్రం కట్టారు”
“మీరు చాలాసేపు మాట్లాడారు” కొంచెం బెరుగ్గా అంది సంయుక్త.
“పరవాలేదు. నాకు అనారోగ్యం ఏమీ లేదు. ఎంత జాగ్రత్తగా చూసుకున్నా పువ్వు వాడిపోకుండా వుంటుందా? మనిషీ అంతే”
“చాలా బాగా మాట్లాడుతున్నారు” అంది సంయుక్త .
“మొదట భయపడ్డావు కదూ?” ఆవిడ మిస్టిగ్గా నవ్వింది. ఆమె సిగ్గుపడిపోయింది.
“అమ్మావాళ్ళూ నాకేదీ చెప్పరు. చిన్నదానివి, నీకెందుకంటారు”
“పెద్దదాన్నయానని నిరూపించావుగా?”
“…”
“తొందరగా చెప్పుకుందాం. ఎదురు సన్నాహం అవీ వుంటాయిగా… అవన్నీ చూద్దువుగాని. ఊ< పెళ్లైపోయిందా, వాళ్లింటికి వెళ్లాం వీధిలోంచే మమ్మల్ని వెళ్లగొట్టేసారు. ఇది తప్పు కాదని ఎన్నో విధాల చెప్పడానికి ప్రయత్నించారు. వాళ్లమ్మ వినలేదు. ఇంట్లో ఆడపిల్లలకి సంబంధాలు రావనీ, కుటుంబాన్ని వెలేస్తారనీ ఎన్నో చెప్పి, నన్ను వదలేసి, ఆయన్ని ప్రాయశ్చిత్తం చేసుకొమ్మన్నారు”
అక్కడదాకా చెప్పి, “ఇప్పుడు నీకు అహల్య కథ చెప్తాను. నన్ను అప్పుడప్పుడు ఆవిడ పూనుతూ వుంటుంది. దీనితో ఆఖరు. నిన్ను వదిలిపెట్టేస్తాను” అందావిడ. ఆవిడ మాటల్లో అల్లరి, చిలిపితనం.
“అయ్యో!అలాంటిదేం లేదు” కంగారుగా అంది సంయుక్త. ఆవిడ తదేకంగా ఆమెని చూస్తూ వుండిపోయింది. ఎంత చక్కని పిల్ల! ఎందుకు బంధాన్ని నిలుపుకోలేకపోయాడు ఆ శేషు అన్నవాడు? తను చూడని ఆ మనిషిమీద కోపం వచ్చింది.
“అహల్యగురించి చాలా కథలున్నాయి సంయుక్తా! అందులో ఒకటి నాకు నచ్చింది. అది నీకు చెప్తాను” అంది. అవతల తలుపు మీద ఎవరో తట్టారు.
“ఐపోయింది. ఇంకొక్క పావుగంట”అని ఈవిడ కేకేసింది. ఆ ప్రహసనానికి సంయుక్త నవ్వేసింది.
“అలా నవ్వుతూ వుండు. బెరుకుబెరుగ్గా వుండకు” అంది కాంతామణి.
పశ్చిమగోదావరి జిల్లా రెడ్డి పోలవరంలో 16 July, 1962 లో జననం. వరంగల్లో వుద్యోగం. హెడ్పోస్ట్మాస్టర్గా వరంగల్లో స్వచ్చందపదవీ విరమణ.
వివాహం శ్రీ చదలవాడ విష్ణుమూర్తిగారితో. వారు డెప్యూటీ ఏగ్జిక్యూటివ్ ఇంజనీరుగా చేసి రిటైరయారు.
మొదటి కథ అనగనగా 1978లో వనితాజ్యోతి మాసపత్రికలో అచ్చైంది. వీరివి 225కి పైగా కథలు, 9 నవలలు వివిధ పత్రికల్లో ప్రచురించబడ్డాయి. గూడు, సింధూరి, గుండెలోతు అనే కథాసంపుటాలు, నీలినక్షత్రం అనే నవల పుస్తకాలుగా వచ్చాయి. సింధూరి అనే సంపుటానికి శ్రీమతి సుశీలా నారాయణ రెడ్డి అవార్డు 2005 లో వచ్చింది. ప్రేమలోంచీ ప్రేమలోకి అనే నవలకి ఆంధ్రభూమి ప్రథమ, తిరస్కృతులు, నీకోసం నేను అనే నవలలకి ఆంధ్రభూమి ద్వితీయ, 5-3-2 అనే నవలకి కినిగె ద్వితీయ బహుమతులు వచ్చాయి. ఎంతెంతదూరం? అనే కథకి విపుల కన్సొలేషన్ బహుమతి, శ్రీమతి రంగవల్లి ట్రస్ట్ అవార్డు వచ్చాయి. ఇవికాక కథలకు మరో ఏడెనిమిది బహుమతులు వచ్చాయి.
కథలకు కాన్వాస్ పెద్దదిగా వుండాలనేది వీరి అభిప్రాయం.