ఒక చిన్న ఏకాంతం. మనసుకైన గాయం. ఈ రెండూ కలిస్తే ఒక గొప్ప కాక్టెయిల్పార్టీ ఆలోచనలకి. ఉవ్వెత్తుగా చెలరేగుతాయి. కన్నీటి వరదల్ని పొంగిస్తాయి.
సంయుక్త ఒక్కర్తే ఇంట్లో ఉంది. శ్రీధర్ కేంపులో ఉన్నాడు. పిల్లల్ని అతని పెద్దక్క మేఘమాల తీసుకెళ్ళింది. ఏవో ఆలోచనలు. ఏవేవో జ్ఞాపకాలు. తెల్లారితే శీను పెళ్లి. అందరూ వెళ్ళి ఉంటారు. తనొక్కదాన్నే పిలవలేదు. పదేపదే మనసుకు అయిన గాయాన్ని కెలుకుతోంది ఆ విషయం. అవమానంగా అనిపిస్తోంది. రావద్దని తల్లి చెప్పటం, వసంత ఫోన్లో ఏడవటం వెంటాడుతున్నాయి.
ఆమె ఇలా దిగులుగా ఉంటే శ్రీధర్ కోప్పడతాడు. కానీ సంయుక్త ఒక్కొక్కసారి చాలా మూడీగా ఉంటుంది. ఒక రోజా, రెండు రోజులా, పాతికేళ్ళ అనుభవాలు. చాలామందికి దురదృష్టం అంటూ మొదలయితే పెళ్ళితో మొదలౌతుంది .కానీ ఆమె దురదృష్టం పుట్టుకతోనే మొదలైంది. శేషుది చిన్నప్పటినుంచి ఒక తరహా మనస్తత్వం. పదిమంది పిల్లలమధ్య కొట్టి నెగ్గుకొచ్చేవాడు. పుట్టినప్పటినుంచీ సంయుక్త అతనికి పేరుపడటంతో ఆమెపట్ల చాలా స్వతంత్రంగా ఉండేవాడు. అందులో మార్దవం, సౌకుమార్యం ఉండేవి కాదు . అతని సమక్షంలో ఆమె అత్తిపత్తి ఆకులా ముడుచుకుపోయేది . తల్లిదండ్రులు, చుట్టూ ఉన్నవాళ్ళు పెంచి పోషించిన పురుషాహంకారం పుష్కలంగా ఉండేది. అలాగే పెరిగి పెద్ద అయ్యారు. ఆమె ఇష్టాఇష్టాలతో సంబంధం లేకుండా అతనితో పెళ్లయింది .
పెళ్లయ్యాక అతనికి ఇంకా స్వతంత్రం వచ్చింది. దేనికో ఒక దానికి హేళన చేయటం… మాటలతో గాయపరచడం… పుల్లవిరుపు మాటలనడం…కూరలో ఉప్పు ఎక్కువైతే కంచాన్ని గోడకి విసిరికొట్టేవాడు. చన్నీళ్లు సరిపడా తొరపలేదని వేడినీళ్ళ బకెటు ఆ పళంగా ఎత్తి నెత్తిమీద కుమ్మరించేవాడు. మనిషి నిత్యం అశాంతితో అసహనంతో రగిలిపోతుండేవాడు. దాన్ని ఎవరూ గుర్తించలేదు. జయలక్ష్మి అతన్ని సమర్ధించి సంయుక్తనే తప్పు పట్టేది . వళ్ళు దగ్గర పెట్టుకుని చేసుకోవద్దాని మందలించేది. రోజులు మారాయి. ఒకప్పటి పురుషాహంకారం దాష్టీకాలు ఇప్పుడు చెల్లవని ఆమెకి అనిపించేది కాదు . తన పెళ్ళప్పటి రోజుల్లో ఆవిడ అత్తగారు ఎలా ఉండేదో అలా ప్రవర్తించేదిగానీ పాలిస్టరు చీరలు కడుతున్న ఇప్పటి రోజులకి తగ్గట్టు కాదు. సంయుక్తకి బాధ్యత తెలియాలని వేరు కాపురం పెట్టించింది. వేరింట్లో శేషుకి ఇంకా అడ్డూ ఆపూ లేకుండా అయింది.అతని ఆగడాలను నిశ్శబ్దంగా భరించింది సంయుక్త ,పక్క వాటాలోకి శ్రీధర్ వాళ్ళు వచ్చి దిగేదాకా. శ్రీధర్‌కి ఇద్దరక్కలు . తల్లి లేదు. తండ్రి ఆశ్రమంలో ఉంటున్నాడు . ఒక అక్క ప్రొఫెసరు. స్త్రీవాది . పెళ్లి చేసుకోలేదు . పెళ్లి అనేది స్త్రీ ప్రగతికి ఆటంకమని గట్టిగా వాదిస్తుంది . రెండవ ఆమె డాక్టరు. గవర్నమెంట్ హాస్పిటల్లో పని చేస్తోంది. ప్రైవేట్ ప్రాక్టీస్ లేదు . పనివేళలూ లేవు. రోజంతా వృత్తికే అంకితమైంది. ఇప్పుడే పెళ్లేమిటనేది ఇరవయ్యెనిమిదేళ్ళ వయసులో కూడా. ఇప్పుడు ఇంకేం పెళ్లి అనే వయసుకి వచ్చింది. తన ఇద్దరక్కలతో కలిసి శ్రీధర్ సామాన్లు తెచ్చుకుని జీపులో దిగేసరికి శేషు సంయుక్తని దేనికోసమో తిడుతున్నాడు. ఆమె ఏడుస్తోంది. శ్రీధర్ వాళ్ళని ఆశ్చర్యంగా చూశాడు ఒక్క క్షణం. అలాంటి భార్యాభర్తలని … బహిరంగంగానే భార్యని తిట్టేవాళ్ళని అతనెప్పుడూ చూడలేదు.
కొన్ని రోజులు గడిచాయి. శేషు సంయుక్తని కొడతాడని కూడా తెలిశాక అతనిలో మరింత ఆశ్చర్యం. అతని కళ్ళు జాలిని వర్షించేవి ఆమెని చూసి. సంయుక్త కూడా శ్రీధర్ని చూసి డిస్ట్రబ్ అయింది. ఒక నిప్పురవ్వలాంటిది అంటుకుంది ఆమెలో . ఆలోచన మొదలైంది. శ్రీధర్ ఎంత సంస్కారవంతంగా ఉంటాడు! మనిషిలో ఎంత నిరాడంబరత! శేషు ఎందుకిలా ఉంటాడు? ప్రతిదానికీ మండిపడుతూ, అవమానిస్తూ … అశాంతిగా… అగ్నిగుండంలా? ఆలోచనా ద్వారాలు ఒక్కొక్కటీ తెరుచుకుంటూ ఆమెకి శేషు అంతరంగంలోకి దారి చూపుతున్నాయి.కొట్టుకున్నా తిట్టుకున్నా భార్యాభర్తలు ఒకప్పుడు కాకపోతే మరొకప్పుడేనా ప్రేమగా ఉంటారు. కానీ శేషు అలా కాదు. తను ఎంత ప్రేమగా ఉండబోయినా పురుగుని విదిలించినట్టు విదిలించేస్తాడు . ఎందుకు? ఎందుకా అసహ్యం? గునపాలతో గుచ్చినట్టు బాధ. అన్నిటి వెనకా ఒకటే ప్రశ్న… కార్చిచ్చులా ఆమెని నిలువునా ఆవహించింది. ఎంతో సంఘర్షణ తర్వాత అడిగేసింది, ” బావా నీకు నేనంటే ఇష్టం లేదా?”లోలోపల ఆశ! అతను తన ఆరాటాన్ని గుర్తిస్తాడేమోనని. కనీసం మొహమాటానికో, పెళ్లై ఇన్నేళయ్యాక ఇప్పుడు ఆ ప్రసక్తి దేనికనో అనుకుని అతను సానుకూలంగా జవాబు ఇచ్చి ఉంటే- ఉంటే?వాళ్ల జీవితాలు మరోలా ఉండేవి. జీవితకాలపు ఖైదు ఆమెకి, కాపలా అతనికీ అలాగే మిగిలి ఉండేవి. అలా కాకుండా అతను ఒక జవాబు ఇవ్వడంతో ఆ ఇచ్చిన జవాబు కొంత ఇఒరిపిడి తర్వాత అయినా ఆమె విడుదలకి తాళం చెవి అయింది.
“లేదు” నిర్లక్ష్యంగా జవాబిచ్చాడు శేషు.ఆ జవాబు తన మనసులో అనుకుందిగానీ అతన్నుంచి అంత బాహాటంగా వస్తుందనుకోలేదేమో సంయుక్త స్థాణువయింది.
” మరి…మరి ఎందుకు చేసుకున్నావు?” తనని తను కూడదీసుకుంటూ అడిగింది.
“అత్త కొడుకుని, నేనే కాదంటే నీకింక దిక్కెవరు? వెళ్ళు… అద్దంలో ఆ మొహం చూసుకో” హేళనగా అన్నాడు. ఆమె తీవ్రంగా గాయపడింది. తనలోకి తాను కుంచించుకుపోయింది.
ప్రేమతో విషాన్ని కూడా తాగించవచ్చు. ద్వేషించి అమృతాన్నైనా తాగించలేము.శేషు విషాన్నీ ద్వేషాన్నీ కలిపి ఆమెకు అందించాడు. ఆమె దాన్ని జీర్ణించుకోలేకపోయింది . తను గొప్ప అందగత్తె కాకపోవచ్చు . కానీ పెళ్లికి అనర్హురాలయేంత కురూపితనం మాత్రం లేదు. పోనీ తనతన్ని చేసుకొమ్మని వెంటపడి వేడుకుందా అంటే అదీ లేదు. పెద్దవాళ్ళు ఏకపక్షంగా నిర్ణయించారు. తల్లిదండ్రులకి ఒక్కత్తే కూతురు తను. ఆస్తి బైటికి పోరాదని చేసారు.తనకి మరో అవకాశమంటూ లేకుండా పుట్టినప్పుడే అతని భార్యగా నిర్ణయించేసారు. శేషు మాటలు విన్నాక ఏడుపు రాలేదు సంయుక్తకి. ఒక విధంగా నిర్వేదం కలిగింది. ఆరోజంతా తీవ్ర సంఘర్షణలో గడిపింది. తెల్లవారాక పనులన్నీ యాంత్రికంగా చేసింది. ఎక్కడివాళ్ళక్కడికి వెళ్లిపోయాక మిగిలిన వంటరితనం ఆమెలో విచక్షణని చంపింది. వార్నిష్ బ్రష్షులు కడగడానికి తెచ్చిన కిర్సనాయలు సీసాలో కొద్దిగా మిగిలి వుంటే వంటిమీద పోసుకుని నిప్పంటించుకుంది.మంటలు అందుకుంటుంటే ఆమె వేసిన కేకలకి చుట్టుపక్కలవాళ్ళొచ్చి ఆర్పారు. పక్క వాటాలోని శ్రీధర్ ఇంకా ఆఫీసుకి వెళ్లలేదు. ఇంట్లోనే వున్నాడు. తలుపులన్నీ వేసుకుని ఏదో రాసుకుంటున్నవాడు ఈ హడావిడికి ఇవతలికి వచ్చాడు. వంటినిండా మంటలతో వున్న సంయుక్తని చూసాడతను. అంతా కలిసి మంటలార్పినా ఆ దృశ్యం అతని మనోఫలకంమీంచీ చెరిగిపోలేదు. ఆ రూపాన్నింక మర్చిపోలేదు. వెంటనే హాస్పిటల్లో చేర్చారు ఆమెని.
“ఇలాంటిదేదో జరుగుతుందని మనం ఇంట్లో దిగినరోజే అనుకున్నాను. ఆ అమ్మాయితో పరిచయం కలుపుకుని వివరం తెలుసుకోవాలనుకున్నాను. మరీ మొదటి పరిచయంతోటే ఎవరూ బైటపడరుగా? ఇంత తొందరగా ఈ సంఘటన జరుగుతుందనుకోలేదు” అని బాధపడింది మేఘమాల… శ్రీధర్ పెద్దక్క. హాస్పిటల్‌కి వెళ్ళి చూసి వచ్చింది.“
“ఇలాంటి పని చేసావేంటమ్మాయ్? పెద్దవాళ్ళం మేమంతా చుట్టూ వుండగా నీకు నువ్వే పెద్దదానివనేసుకుని ఈ నిర్ణయం తీసుకున్నావా? కష్టమేదైనా వుంటే అమ్మావాళ్ళకి చెప్పాలి. వాళ్లు చెప్పేది నచ్చకపోతే సోషల్ యాక్టివిస్టులం మాకు చెప్పాలి” అని మందలించి తనున్నానని ధైర్యం చెప్పింది.
“ఆ గొడవలేం వద్దులెండి. ఇది మా ఇంటి సమస్య. మేము చూసుకుంటాం. అల్లుడుకూడా పైవాడు కాదు. మా మేనల్లుడే” అని సర్ది చెప్పింది శారద వెంటనే కలగజేసుకుని.
శ్రీధర్ కూడా వెళ్లాడు. వెళ్లకుండా వుండలేకపోయాడు. ఎక్కువ సేపూ వుండలేదు.”ఎందుకిలాంటి పని చేసారు? ఏదైనాసరే, బతికి సాధించాలిగానీ చచ్చాక సాధించడానికేం వుంటుంది?” మందలించాడు. సంయుక్త కళ్ళు దించుకుంది.
“మళ్ళీ కలుస్తాను. జీవితాన్ని ప్రేమించడం నేర్చుకోండి. మీకేం కావాలో , దాన్నెలా సాధించుకోవాలో మీకే తెలుస్తుంది” ” అని వెళ్లిపోయాడు.
శారద అతన్ని మొదటిసారి చూసింది….వారం తర్వాత సంయుక్తని డిశ్చార్జ్ చేశారు. కిర్సనాయలు తక్కువ ఉండటం, వెంటనే వైద్యం అందడం, అదీ కాకుండా ఆరోజు సంయుక్త కాటన్ చీర కట్టుకొని ఉండడం ఈ మూడూ కలిసొచ్చి గాయాలు పెద్దగా అవలేదు. మానుతుంటే జయలక్ష్మి అడిగింది రాజారావుని.
” దాన్ని ఎప్పుడు పంపిస్తావు రా? శేషు అడగమన్నాడు. కొట్టుకున్నా తిట్టుకున్నా భార్యాభర్తలకి తప్పదుకదా, కలిసుండటం? “
శారద భయంతో బిగుసుకుపోయింది. పంపిస్తే కూతురు ఇంకే అఘాయిత్యం చేస్తుందోనని. ఆమెకెందుకో శ్రీధర్ గుర్తొచ్చాడు అదే సమయానికి.
“అది కాదక్కా! వీళ్ళు చిన్నపిల్లలు కాదు. పెద్దయారు. పిల్లల్ని కన్నారు. ఈ కొట్టడం తిట్టడమేమిటి? దానికి పెట్టుపోతల్లో మేమేం తక్కువ చేస్తున్నాం? మాకున్నదంతా వీళ్ళకే కదా?”రాజారావు కాస్త భయపడుతునే అడిగాడు. శేషు కారణంగా కూతురు మృత్యుముఖందాకా వెళ్లి వచ్చిందంటే అతనికి చాలా కోపంగా వుంది. జయలక్ష్మిని నిలదీయాలనుంది. ఎన్నో మాటలనాలనుంది. మాట్లాడలేని బలహీనత. ఆ తర్వాత ఆమె చేసే రచ్చ భరించడం ఆయనవల్లకాదు.
“ఆ<! చిన్నతనంనుంచీ వున్న చనువు చేత ఓ దెబ్బ వేస్తున్నాడేమో! దానికింత రభస దేనికి? నేనూ తప్పని చెప్తూనే వున్నాను”తేలికగా అనేసింది ఆవిడ.
సంయుక్త దిగ్గున కళ్ళెత్తి చూసింది. శేషు తనని ఎంత హింస పెడతాడో ఆవిడకి తెలీదా? ఎంత మేనత్త కొడుకైనా చనువున్నా తనని కొట్టే తిట్టే హక్కు అతనికెవరిచ్చారు? తిరస్కారంగా చూసి అక్కడినుంచి వెళ్ళిపోయింది.
“చూడరా, దాని పొగరు? అది చూస్తే ఏ మగాడికేనా మంటెక్కుతుంది” ఆవిడ ఆరోపించింది. శారద కూతురి వెంట లోపలికి వెళ్లింది.
పశ్చిమగోదావరి జిల్లా రెడ్డి పోలవరంలో 16 July, 1962 లో జననం. వరంగల్‌లో వుద్యోగం. హెడ్పోస్ట్‌మాస్టర్గా వరంగల్‌లో స్వచ్చందపదవీ విరమణ.
వివాహం శ్రీ చదలవాడ విష్ణుమూర్తిగారితో. వారు డెప్యూటీ ఏగ్జిక్యూటివ్ ఇంజనీరుగా చేసి రిటైరయారు.
మొదటి కథ అనగనగా 1978లో వనితాజ్యోతి మాసపత్రికలో అచ్చైంది. వీరివి 225కి పైగా కథలు, 9 నవలలు వివిధ పత్రికల్లో ప్రచురించబడ్డాయి. గూడు, సింధూరి, గుండెలోతు అనే కథాసంపుటాలు, నీలినక్షత్రం అనే నవల పుస్తకాలుగా వచ్చాయి. సింధూరి అనే సంపుటానికి శ్రీమతి సుశీలా నారాయణ రెడ్డి అవార్డు 2005 లో వచ్చింది. ప్రేమలోంచీ ప్రేమలోకి అనే నవలకి ఆంధ్రభూమి ప్రథమ, తిరస్కృతులు, నీకోసం నేను అనే నవలలకి ఆంధ్రభూమి ద్వితీయ, 5-3-2 అనే నవలకి కినిగె ద్వితీయ బహుమతులు వచ్చాయి. ఎంతెంతదూరం? అనే కథకి విపుల కన్సొలేషన్ బహుమతి, శ్రీమతి రంగవల్లి ట్రస్ట్ అవార్డు వచ్చాయి. ఇవికాక కథలకు మరో ఏడెనిమిది బహుమతులు వచ్చాయి.
కథలకు కాన్వాస్ పెద్దదిగా వుండాలనేది వీరి అభిప్రాయం.