“అమ్మా! నేనక్కడికి వెళ్ళను. మళ్లీ నన్ను అక్కడికి పంపించడానికే అయితే, అంత కష్టపడి సాధించుకున్న చావునుంచి ఎందుకు తప్పించారు?” ఆవేశంగా అడిగింది సంయుక్త ఆమెని.
“సమ్మూ! ఇద్దరు పిల్లల తల్లివి. ఇంకా చిన్నతనం పోకపోతే ఎలా? ప్రాణాలు తీసుకోవాలనిపించేంత గొడవలు కొత్తగా ఏం పుట్టుకొచ్చాయే? బావ దుడుకుతనం చిన్నప్పట్నుంచి ఉన్నదే కదా?” అంది శారద.
“ఇన్నేళ్ళూ భరించానమ్మా! తిట్లు , దెబ్బలు ఏ ఆడపిల్లా భరించనంత భరించాను . ఇంక నావల్ల కాదు “
“ఎవరి అండ చూసుకుని నువ్వు నీ కాపురానికి నీళ్లు వదులుకుంటున్నావో అతను నీకు ఏమీ కాడు. నీకేదో చేస్తాడని అనుకోవడం కూడా తప్పే. పొరపాటంటూ ఏదైనా చేస్తే దాన్ని ఇప్పుడే సరిదిద్దుకో. శేషుకి నాన్నా, అత్తయ్యా గట్టిగా చెప్తారు” తన మనసులో ఉన్న భావనని ఇంక అణుచుకోలేకపోయింది శారద.
సంయుక్త తల్లికేసి దిగ్భ్రాంతిగా చూసింది. తనని అనుమానిస్తోందా! ఒక్కసారి శ్రీధర్ హాస్పిటల్ కి వచ్చి చూసి వెళ్లినంత మాత్రాన?
“ఎవరి అండేనా నాకు ఉంటే చావుకు ఎందుకు తెగిస్తాను? మనిషిలా బతకాలనుందమ్మా! సంస్కారవంతంగా సంతోషంగా. మీకు కూడా బరువయితే చెప్పు . ఏ సేవాసదనానికో వెళ్ళిపోతాను” అంది కన్నీళ్లతో .
శారద ఇంకేమీ అనలేదు. అసలే గాయపడి ఉన్నదాన్ని ఇంకా గాయపరిచినందుకు, తనుగా ఓ కొత్త గాయం చేసినందుకు బాధపడింది . వెళ్లి భర్తకు చెప్పింది.
” అది వెళ్లనని మొండికేస్తోంది. నాలుగు రోజులు ఆగితే అదే సర్దుకుంటుంది. మళ్లీ నచ్చ చెప్తాను” అంది నిస్సహాయంగా.
అప్పటికి ఆ విషయం సద్దుమణిగినా మళ్ళీ మళ్ళీ సంయుక్తని పంపించమని శేషు తల్లి ద్వారా ఒత్తిడి చేస్తూనే ఉన్నాడు. వెళ్లనని సంయుక్త మొండిగా కూర్చుంది. ఎటూ చెప్పలేక , ఏమంటే ఎవరికి కోపం వస్తుందో, ఇంకేమి అంటే కూతురికి బాధ కలుగుతుందోనని శారద సతమతమవుతోంది.
“వెళ్ళనంటే దాన్ని బలవంతపెట్టకు. అక్కడికి వెళ్ళాక ఏ మందోమాకో మింగితే ఏం చేయగలం? ఒకసారంటే దాన్ని కాపాడుకోగలిగాం. ఇంకోసారి పరిస్థితి చేయి దాటితే?” ఆ విషయమే ఊహించలేనట్టు భయంతో కంపిస్త్తూ అన్నాడు రాజారావు. జయలక్ష్మి ప్రభావానికి లోను కాకుండా ఆయన తీసుకున్న మొదటి నిర్ణయం అదే ! మనవలిద్దరినీ దగ్గరికి తీసుకుని గుండెకి హత్తుకుని కళ్ళ నీళ్ళు పెట్టుకున్నాడు. వాళ్లతోపాటు కూతుర్ని కూడా దగ్గరకు తీసుకోవాలనిపించినా ఆమె పెళ్లయాక అలవాటు తప్పిన ఆ పని చేయలేకపోయాడు. భర్త అలా అంటాడని శారద వూహించలేదు. కూతురి విషయంలో ఆమెకి కూడా అలాంటి భయమే ఉంది. పెద్దబరువు తొలగి పోయినట్లు అయింది. అయితే మనసులోని అనుమానం పాము పిల్లలా మళ్లీ కదిలింది. కానీ మళ్ళీ ఎప్పుడూ శ్రీధర్ రాకపోవడంతో ఎటూ నిర్ధారణకు రాలేకపోయింది.
” అది రాకపోతే నేను ఊరుకుంటానా? ఎందుకు రాదో చూస్తాను” అని చిందులు తొక్కి లాయర్ నోటీసు పంపించాడు శేషు. రిజిస్టర్ పోస్టులో పంపిన ఆ నోటీసు సంయుక్తకి ఎప్పుడు ముడుతుందో తెలుసుకుని ఆ సమయానికల్లా రాజారావ్ ఇంటికి వెళ్లి కూర్చుంది జయలక్ష్మి. అతను ఇంట్లో లేడు. పోస్ట్‌మ్యాన్ తెచ్చిన నోటీసు సంతకం పెట్టి తీసుకుని చదువుకుంది సంయుక్త.
“చచ్చినా అక్కడికి వెళ్ళను” తల్లి చేతిలో దాన్ని పెట్టి తెగేసి చెప్పేసింది.
“దేనికే ఆ మిడిసిపాటు? రాకపోతే వాడేం చేతులు ముడుచుకు కూర్చోడు” ఆగ్రహంగా అంది జయలక్ష్మి. “విడాకులు పడేస్తాడు. మనోవర్తి కూడా ఇవ్వడు. అడుక్కు తిందువుగాని”
“ముందు నన్ను వదిలిపెట్టేస్తే చాలు. అడుక్కుతినాలో ఇంకేం చెయ్యాలో తర్వాత ఆలోచించుకుంటాను” అంది సంయుక్త. దు:ఖం వుప్పెనలా ముంచుకొచ్చింది. అసహ్యం వేసింది.
” మీ నాన్న అండ చూసుకునేనా? వాడిని రానీ, వాడిచేతే బైటికి ఈడ్పిస్తాను” అంది జయలక్ష్మి. కూతురు సంస్కారం అన్నదేమిటో అర్థమైంది శారదకి.
“పిల్లని అలా అంటారేమిటి?” వదినగారితో గట్టిగా అంది.
“అనక? ఇదిలా బరితెగిస్తే వదిలేస్తానా? వదలేస్తే మనింట్లో మరే ఆడపిల్లేనా భర్తతో కాపురం చేస్తుందా?” అని ఆవిడ అంటుండగా రాజారావు ఇంట్లో అడుగుపెట్టాడు.
” అది రానంటోంది కదా, వదిలేయ్ అక్కయ్యా! ఎలా రాసిపెట్టి ఉంటే అలాగే జరుగుతుంది” అన్నాడు.
శారద నోటీసు అతని చేతిలో పెట్టింది. చదివాడు. ముఖం పాలిపోయింది. అక్కడే వున్న కుర్చీలో కూలబడ్డాడు. శేషు ఇలా చేస్తాడనుకోలేదు. అక్కకీ మేనల్లుడికీ తనపట్ల ఉన్నది ఇదేనా? సంయుక్తని వాళ్లు ఎలా చూసి ఉంటారో ఎలాంటి సందేహాలూ లేకుండా అర్థమైంది.“
“నేను వెళ్ళను నాన్నా! ఇక్కడే వుంటాను ” ఏడ్చేసింది సంయుక్త.
“అది రానంటోందికద అక్కయ్యా! కొన్నాళ్ళు ఓపిక పట్టండి. చావుకి కూడా తెగించింది” నచ్చజెప్తున్నట్టు అన్నాడు. ఒకవైపు కూతురు, మరోవైపు తల్లంతటిదైన అక్కగారు. అడకత్తెర్లో పోకచెక్కలా నలిగాడు కాసేపు.
“అన్నీ వేషాలు. నిజంగా చావాలనుకున్నదైతే చచ్చేంత కిర్సనాయలు పోసుకునేది. అలా సెంటు జల్లినట్టు జల్లుకునేది కాదు” అంది జయలక్ష్మి. రదకి గుండెలు అవిసిపోయాయి. రాజారావు సహనానికి అది ఆఖరి మెట్టైంది.
“అది రాదమ్మా! ఏం చేసుకుంటారో చేసుకోండి” అన్నాడు విసుగ్గా.
“చూద్దువుగాని” అని విసవిస వెళ్లిపోయింది.కొంతకాలం చర్చలూ రాయబారాలూ జరిగాయి. తమ్ముళ్ళూ, చెల్లెళ్ళూ ఏకపక్షంగా జయలక్ష్మి వెనక నిలబడ్డారు.
“తప్పు చేస్తున్నావన్నయ్యా!” అన్నారు ఏకకంఠంతో.
చివరికి విడాకుల కోర్టులో నిలబడ్డారు భార్యాభర్తలు. రెండువైపులా ఒకడే ప్లీడరు. అతనికి వీళ్ళ ఇంటి వ్యవహారాలన్నీ తెలుసు. సంయుక్త ఆత్మహత్యాప్రయత్నం కూడా తెలుసు. ఐనా విద్యుక్తధర్మంగా కౌన్సెలింగ్ చేయబోయాడు. సంయుక్త ససేమిరా కాపురం చెయ్యనంది. శేషు మాట కూడా చొరబడనివ్వలేదు జయలక్ష్మి. ఇంతదాకా వచ్చాక వ్యవహారం పొసగడం ఆమెకి ఏమాత్రం ఇష్టం లేదు. సంయుక్తకీ, ఆమెని వెనకేసుకొచ్చిన తమ్ముడూ మరదలికీ బుద్ధి రావాలి, ఇలా ఎదురు తిరిగినందుకు ఆ ఇంట్లో అదో గుణపాఠం కావాలి. ఎలిమనీ, మెయింటెనెన్సు ఏవీ వద్దన్నాడు రాజారావు.
“నా కూతురు , దాని పిల్లలు నాకు బరువు కాదు. అతనే వద్దనుకున్నాక అతని డబ్బు మాకెందుకు?” అన్నాడు. డబ్బు దగ్గర అక్కగారిని నిలదియ్యలేకపోయాడు
“నాకు మా అమ్మావాళ్లు చాలా బంగారం పెట్టారు. నాది నాకు ఇచ్చెయ్యమనండి” అంది సంయుక్త.
తమ్ముడి మాట పట్టుకుంది జయలక్ష్మి. తక్కువలో తక్కువగా యాభై తులాలేనా పెట్టి వుంటారు.”పెళ్ళే వద్దనుకున్నాక ఆ పెళ్లిలో పెట్టిన బంగారం మాత్రం ఎందుకు? వాడు మళ్ళీ పెళ్లి చేసుకుంటే ఆ పిల్లకి పోతుంది అది” అంది.
“అమ్మా! వాళ్లు అడిగినదానికి మీరు వప్పుకోవడం మంచిది. పెళ్ళిలో పెట్టిన బంగారం సంయుక్తదే ఔతుంది. ఆ అమ్మాయిది ఆ అమ్మాయికి ఇచ్చెయ్యండి. మీపట్ల గౌరవంతో వాళ్లు చాలా సామరస్యంగా వెళ్తున్నారు. గృహహింస, కట్నం వేధింపులు, మనోవర్తి…మూడు కేసులు పెట్టచ్చు మీమీద. అవేవీ చెయ్యటం లేదు” అన్నాడు ప్లీడరు. జయలక్ష్మికి ఇవ్వక తప్పలేదు. లీగల్ సెపరేషన్ పీరియడ్ అవగానే చట్టబద్ధంగా విడిపోయారు.
విడాకులు మంజూరైన రోజుని శారద ఏడ్చింది పాతికేళ్లకే కూతురి జీవితం ఇలాగైందని. ఊళ్ళో పరువు పోయిందని రాజారావసలు వారంరోజులపాటు ఇంట్లోంచీ కదలలేదు. సంయుక్తకి మాత్రం సంకెళ్ళేవో తెగిపడ్డట్టైంది. పైకి నిర్వికారంగా వుంది.
ఆ యేడు తండ్రి ఆబ్దికానికి ఏమీ జరగనట్టే అందరూ వచ్చారు… జయలక్ష్మికూడా.
“అది వెధవపని చేసిందని తమ్ముడిని వదులుకుంటానా?” అంది. రావద్దనలేకపోయాడు రాజారావు. తిట్టీ, దెబ్బలాడీ కాల్చుకు తిన్నా అత్తగారిని ఎలా వదుల్చుకోలేరో అలాగైంది శారద పరిస్థితి. సంయుక్త ఆవిడకి ఎదురుపడదు. లోపలెక్కడో వుంది. భయంతో కాదు. నిరాసక్తతతో.
“శేషుకి సంబంధాలు వచ్చిపడుతున్నాయి. రెండవపెళ్ళైనా బోల్డు కట్నంతో పిల్లనిస్తామని వస్తున్నారు. మొన్నో సంబంధం చూసి వచ్చాము. పిల్ల బంగారపు బొమ్మనుకో” జయలక్ష్మి అంటుంటే శారద రక్తం వుడికిపోతుంది నిస్సహాయతతో. ఆవిడని రాకుండా చేసే అస్త్రం ఏదీ ఆమె దగ్గర లేదు. ఆవిడపట్ల తను తప్పు చేసాడనే భావం లోలోపల ఎక్కడో వుంది రాజారావుకి. కూతురి పెళ్ళి ఇలా పరిణమించకుండా వుండాల్సింది. సంయుక్త కొంచెం సర్దుకుపోతే బావుండేది…చస్తానని బెదిరించేసరికి ఏం చెయ్యలేకపోయాడు. ఇలాంటి ఆలోచనలన్నీ కలిగి, మళ్ళీ తనవాళ్ళంతా దగ్గరకు వచ్చినందుకు అతనికి వూరట కలిగింది.
శారదకి ఇంకా స్వతంత్రం తగ్గింది. పెళ్లై ఇన్నేళ్ళైనా తనింట్లో తనకి స్వతంత్రం లేకపోవటం శారదని బాధిస్తోంది. సంయుక్త పుట్టినప్పటినుంచీ మా కోడలు, మా కోడలని శతపోరారు. పోరి, పెళ్లి చేసుకుని పాతికేళ్లకే కాపురం వద్దనుకునేలా చేసారు. సరే, తలరాతో మరొకటో అనుకుంటే ఇంకా ఈ రాకపోకలేమిటి? ఈ రంపపుకోతేమిటి? తరవాత ఏంచేయాలో తోచకుండా జరిగిన సంఘటనలని పదేపదే గుర్తు చెయ్యటమేమిటి? ఆమె లావాలా వుడికిపోతుంటే, సంయుక్త వచ్చి జయలక్ష్మి పక్కన కూర్చుంది. ఆవిడ మొహం తిప్పుకుది.
“ఈసారి పెళ్లి చూపులకి నేనూ రానా? బావకి ఎలాంటి పిల్లైతే సరిపోతుందో తెలిసినదాన్ని. ..ఆ పిల్లని నిట్టనిలువునా చీల్చినా చీమూ నెత్తురూ వుండకూడదు. కొట్టినా తిట్టినా ఎదురు తిరగకూడదు. దిక్కూదివాణంలేనిదైతే మరీమంచిది. అడవిలో కొట్టి పడేసిన తుమ్మమొద్దైతే సరిపోతుంది ” అనేసి మళ్ళీ అక్కడ నుంచి వెళ్ళిపోయింది. జయలక్ష్మి ముఖం మాడిపోయింది
పశ్చిమగోదావరి జిల్లా రెడ్డి పోలవరంలో 16 July, 1962 లో జననం. వరంగల్‌లో వుద్యోగం. హెడ్పోస్ట్‌మాస్టర్గా వరంగల్‌లో స్వచ్చందపదవీ విరమణ.
వివాహం శ్రీ చదలవాడ విష్ణుమూర్తిగారితో. వారు డెప్యూటీ ఏగ్జిక్యూటివ్ ఇంజనీరుగా చేసి రిటైరయారు.
మొదటి కథ అనగనగా 1978లో వనితాజ్యోతి మాసపత్రికలో అచ్చైంది. వీరివి 225కి పైగా కథలు, 9 నవలలు వివిధ పత్రికల్లో ప్రచురించబడ్డాయి. గూడు, సింధూరి, గుండెలోతు అనే కథాసంపుటాలు, నీలినక్షత్రం అనే నవల పుస్తకాలుగా వచ్చాయి. సింధూరి అనే సంపుటానికి శ్రీమతి సుశీలా నారాయణ రెడ్డి అవార్డు 2005 లో వచ్చింది. ప్రేమలోంచీ ప్రేమలోకి అనే నవలకి ఆంధ్రభూమి ప్రథమ, తిరస్కృతులు, నీకోసం నేను అనే నవలలకి ఆంధ్రభూమి ద్వితీయ, 5-3-2 అనే నవలకి కినిగె ద్వితీయ బహుమతులు వచ్చాయి. ఎంతెంతదూరం? అనే కథకి విపుల కన్సొలేషన్ బహుమతి, శ్రీమతి రంగవల్లి ట్రస్ట్ అవార్డు వచ్చాయి. ఇవికాక కథలకు మరో ఏడెనిమిది బహుమతులు వచ్చాయి.
కథలకు కాన్వాస్ పెద్దదిగా వుండాలనేది వీరి అభిప్రాయం.