“సారీ, తన్మయీ! పెళ్లికి మేము రాకుండా వుండాల్సింది ” బాధపడుతూ అంది సంయుక్త.
” వివరంగా చెప్పు అత్తా!”
” మా పెళ్లి ఎలా జరిగిందో నీకు తెలుసు కదా? ఇప్పుడు ఇక్కడి మగపెళ్ళివారు నా పుట్టింటివారు. అంటే శ్రీనివాస్ నాకు స్వయానా చిన్నాన్న కొడుకు. నా మొదటి పెళ్లి మేనరికం. మాది ఉమ్మడి కుటుంబం కాదుగానీ ఆ అత్త మాటకి మా ఇంట్లో చాలా విలువ యిస్తారు. మాచిన్నాన్నావాళ్లు మమ్మల్ని పెళ్లికి పిలవలేదు. మేము రాకూడదని అనుకున్నారు. కానీ వూహించని విధంగా మీ పిలుపు అందుకుని మేము వచ్చాము. అదే వాళ్ల కోపానికి కారణం అనుకుంటాను”
” అదేంటి?”
” ఇంతదాకా వచ్చినందుకే నాకు సిగ్గనిపిస్తోంది. అక్కడికీ దారిలో తెలిసి అన్నాను, తిరిగి వెళ్ళిపోదామని …”
” జరిగినదాంట్లో నీ తప్పేముంది? నీ జీవితం… నీ ఇష్టం. తిన్న అవమానాలు నీవి. తెంచుకున్న బంధం నీది. దానికీ మీరు పెళ్లికి రావడానికీ సంబంధం ఏమిటి? శ్రీను అలాంటివాడు కాదే? మేం చాలా ఓపెన్‌గా అన్ని విషయాలూ మాట్లాడుకుంటున్నాము. అతని అభిప్రాయాలు, అభిరుచులు అన్నీ నాకు నచ్చాకే పెళ్లికి వప్పుకున్నాను… ఉండు అతనితో నేను మాట్లాడతాను” అని సెల్ ఫోన్ తీసి నెంబర్ నొక్కబోతుంటే-
” నువ్వు మాట్లాడటం ఏమిటి? అమ్మానాన్నలు చూసుకుంటారు ఆ విషయం” సంయుక్త వారిస్తూనే ఉంది, తన్మయి కాల్ అవతలి వ్యక్తికి చేరనే చేరింది.
మరో గదిలో అదే విషయం చర్చిస్తున్నారు శ్రీధర్, దయానంద్, నిర్మల.
” బావా! ఇలాంటి గొడవేదో జరుగుతుందని సంయుక్త దారిలోనే అంది. మేము పెళ్లికి వుండము. తన్మయికి బ్లెస్సింగ్స్ ఇచ్చేసి వెళ్లిపోతాం ” అన్నాడు శ్రీధర్.
“మంచిపని చేస్తే సమాజం హర్షించదు. మళ్లీ ఆ సమాజమే మార్పుని కోరుకుంటుంది” దయానంద్ బాధపడ్డాడు.
” అసలు ఈ సంబంధం ఎలా దొరికింది? వాళ్ల గురించి అన్నీ తెలుసుకున్నారా? చాలా పేచీకోరు మనుషులు” అలా చెప్పడానికి చాలా
ఇబ్బందిపడ్డాడు శ్రీధర్. ఒకరిని గురించి చెడ్డగా చెప్పడం అతనికి రాదు. తన్మయిమీద వున్న ప్రేమతో నిజం చెప్పక తప్పలేదు.
“తెలిసినవాళ్ల ద్వారా వచ్చింది. పెద్ద కుటుంబం అని చాలా గొప్పగా చెప్పారు. ఆ అబ్బాయి చదువులోనూ, వుద్యోగంలోనూ తన్మయికి దీటుగా వున్నాడు. వాళ్లిద్దరూ చాలాసేపు మాట్లాడుకున్నారు. అన్నీ బావున్నాయనే అనుకున్నాం ” అంది నిర్మల.
“చెప్పానుగా, నిర్మలా! మేము వెళ్లిపోతాం. మేఘమాలా, నీహారికా కూడా మాతో వచ్చేస్తారు. మీరు వాళ్లతో మాట్లాడండి. వ్యవహారం సున్నితంగా నడిపిద్దాం” అన్నాడు శ్రీధర్.
“నువ్వుండరా! మాటకి ముందు వెళ్లిపోతాం వెళ్లిపోతాం అంటావు. మావైపుని వున్నదెవరు? మీరు తప్ప. అలా మిమ్మల్ని పంపించేస్తే సమస్య తీరిపోతుందా? తన్మయి వూరుకుంటుందా? ఇలా పంపించడమంటే ఎప్పటికీ మీతో సంబంధం తెంచుకోవటమేకదా? అదంత తేలికా?” ” కోప్పడింది నిర్మల.
” తన్మయితో మాట్లాడదాం. అదేమంటుందో! చిన్నపిల్ల కాదుకదా? దానికి ఇలాంటివి నచ్చవు. దాచిపెట్టి పెళ్లి చేసే విషయం కాదు. మరీ ఇంత సంకుచితంగా ఆలోచించేవాళ్ళ మధ్య మన పిల్ల ఎలా వుంటుంది? ఈరోజు వాళ్లు కోరుకున్నట్లు చేసి, బుజ్జగించో నచ్చజెప్పో పెళ్లిచేసి దాన్ని పంపిస్తే ఇది ఇక్కడతో ఆగుతుందా? ఇంకెన్ని విషయాలు తలెత్తుతాయో! విబేధాలతో రేప్పొద్దున్ననుంచీ వాళ్లు విడాకులుకోసం కోసం ప్లీడర్ల చుట్టూ తిరిగే పరిస్థితి వచ్చి మనం తలలు దించుకోవాలేమో! ఎవరంతటి వాళ్లు వాళ్లు. ఎవరి నిర్ణయాలు వాళ్లే తీసుకుంటే మంచిది” అంది.“
“నా ఉద్దేశం నేను చెప్పాను. ఆపైన ఆలోచించుకోవాలసింది మీరు. తన్మయి కన్నా మాకు ఏదీ ఎక్కువ కాదు” అని అక్కడనుండి తన్మయిని వెతుకుతూ వెళ్లాడు. అప్పటికి ఆమె శీనుతో మాట్లాడటం పూర్తైంది. పదిహేను నిముషాలసేపు మాట్లాడింది ఆ అమ్మాయి ఇంకొన్ని గంటల్లో తన పక్కన పెళ్లిపీటల మీద కూర్చోబోయే వ్యక్తితో.
“ఏంటి శ్రీనూ! మీవాళ్ళేంటో అలిగారట. అలగటమేమిటి సిల్లీగా? మనసులో వున్నదేమిటో చెప్పచ్చు కదా ? … మామయ్యా, అత్తయ్యా వచ్చారని కోపం వచ్చిందా? వాళ్లు వెళ్లిపోవాలా? ఎందుకు? మన పెళ్లికి వాళ్లేం అడ్డు?…మామయ్యంటే స్వంత మామయ్య కాదు. వాళ్ల పెద్దక్కా మా అమ్మా పీజీదాకా కలిసి చదువుకున్నారు. వాళ్ల రెండవ అక్క, మా అత్త అంటే నాన్న చెల్లెలు మెడిసిన్‌లో క్లాస్ మేట్స్. మా అమ్మమ్మగారి వూరు వాళ్లది. చిన్నప్పుడే తల్లి పోతే అమ్మమ్మ దగ్గరే ఎక్కువగా పెరిగారు… ముఖ్యంగా అతను. మేము ఈ విషయాలు ఎప్పుడో మర్చిపోయాము. ఈరోజుని మళ్ళీ ఇలా గుర్తుచేసుకుంటున్నాం. చాలా బాధనిపిస్తోంది. మీరంటున్న విషయం వాళ్లకి తెలిస్తే ఎంత అసహ్యంగా వుంటుంది? చాలా బాధనిపిస్తోంది…మా అమ్మ పెళ్లిలో నాన్న గెడ్డం కింద బెల్లం ముక్క పెట్టిందీ, ఇప్పుడు నన్ను గంపలో కూర్చోబెట్టి తీసుకు రావలసినదీ అతనే… తల్లి పోవటంతో వాళ్ల కుటుంబం బాగా దెబ్బతింది. అక్కలు పెళ్లి చేసుకోలేదు. ఇతనూ అలాగే వుండిపోతాడని అనుకున్నాం. ఇన్నాళ్ళకి పెళ్లి చేసుకున్నాడని ఎంతో సంతోషపడ్డాం…. అతని భార్య నీ కజిన్ కావడం కేవలం కాకతాళీయం… మాకు తెలియదు. ఐనా మాకు ముఖ్యమైనవాళ్ళని మేము పిలుచుకున్నాం. మీవాళ్ళని మీరు పిలుచుకున్నారు. పిలవకముందు వేరే సంగతి. మేము పిలిచాక వాళ్లు వచ్చాక వెళ్లిపొమ్మని ఎలా చెప్తాం?” అని అతను చెప్తున్నది వింటూ వింటూనే వాయించేసింది.
ఆమె అడిగింది చెప్తూ, ఆమె చెప్పింది విన్నాడు శీను.
“తన్మయీ! కొంచెం అర్థం చేసుకో. మా పెద్దత్తని ఇంట్లో అందరూ గౌరవిస్తారు. ఆవిడకి నచ్చనిదేదీ మాయింట్లో జరగదు”
“ఆవిడని గౌరవించడమంటే మరొకరిని అవమానించడమా? …అరె… సంయుక్త ఎంత చిన్నది? తమ వయసులో సగంకూడా లేని ఆ అమ్మాయిని సతాయిస్తున్నారా మీ పెద్దవాళ్ళంతా? ఆమె ఒక తప్పు చేసిందే అనుకుందాం, క్షమించలేరా? మీయింట్లోని అమ్మాయితోనే ఇలా వుంటే నాపట్ల మీ ప్రవర్తన ఎలా వుంటుందోని భయం వేస్తోంది”
“తన్మయీ ! నువ్వు అలా ఎందుకు చేస్తావు? ఆ సమస్యే రాదు”
“నేను అలాగే ఎందుకు చేస్తాను? ఇంకోలా చేయచ్చు . నావి చాలా స్వతంత్రభావాలు. ఇలాంటివి నేను జీర్ణించుకోలేను. నన్ను పెళ్లి చేసుకోవడమంటే నా మెదడు, మనసు, ఆలోచనలు, స్పందనలతోసహా నన్ను చేసుకోవటం. అంతేగానీ కేవలం నా చదువు, వుద్యోగం, అందం, ఐశ్వర్యంలాంటి బయటి విషయాలు చూసి కాదు “
సరిగ్గా అదే సమయానికి పెళ్లి మంటపానికి దూరంగా లాన్లో కూర్చుని వున్నారు శ్రీధర్ అక్కలు… మేఘమాల, నీహారిక.
“నీతో మాట్లాడాలి” అని, అందరికీ దూరంగా తీసుకొచ్చిందిగానీ చెప్పాలనుకున్నది ఎలా చెప్పాలో తెలీక సతమతమౌతోంది నీహారిక.
“ఏమిటే? ఏదో చెప్పాలన్నావు? ” అడిగింది మేఘమాల.
” పెళ్లయ్యాక శ్రీధర్ చాలా మారాడు కదూ?” అంది నీహారిక. “మనం ముగ్గురం కూర్చుంటే మాట్లాడుకోటానికి మాటలే దొరికేవి కాదు. సంయుక్తతో తెగ ముచ్చట్లు పెడుతున్నాడు “
“నిజమే. వాడిలో చాలా మార్పు వచ్చింది ” మేఘమాల ఏకీభవించింది.
“ఇద్దరి మధ్యా అంత కబుర్లేం వుంటాయా అనుకున్నాను … ఒకటి రెండు సంభాషణలు నా చెవిని పడ్డాయి. అన్నీ సిల్లీ విషయాలు. అలాంటివాటిమీద అంతంతసేపు మాట్లాడుకుంటారా అని నవ్వొచ్చింది. శ్రీధర్… అంత పెద్ద వుద్యోగం చేస్తున్నది వీడేనా అనిపించింది “
చెల్లెలు ఏదో చెప్పాలనుకుని చెప్పలేకపోతోందని అర్థమయింది మేఘమాలకి.
“ఆమధ్యని ఒకరోజు సంయుక్త చిన్నకూతురు స్నానం చేసి వళ్లు తుడవనివ్వకుండా పరుగులు పెడుతూ నాకాళ్ళకి అడ్డం పడింది. వంగుని ఎత్తుకున్నాను… మొదటిసారి. నా మొహంలో మొహం పెట్టి నవ్వింది. తడివొళ్ళు, వంటిమీద మెరుస్తున్న నీటి చుక్కలు, కాళ్ళకి గజ్జెలు, మొలకి మువ్వల మొలతాడు, చేతులకి మురుగులు, మెడలో చిన్న గొలుసు, చెవులకి లోలక్కులు… ఆ రూపం, ఆ నవ్వు, ఎత్తుకున్నప్పటి ఆ స్పర్శ… నేను మర్చిపోలేకపోతున్నాను. నా చదువు, హుందాతనం, నేను పోగేసుకున్న సంపద అన్నీ దానిముందు తక్కువేననిపించాయి”“
“ఇప్పటికేనా మించిపోయిందేమీ లేదు. నీకూ సంబంధాలు చూడమని చెప్పనా?” అడిగింది మేఘమాల.
ఇబ్బందిగా నవ్వింది నీహారిక. కొద్దిసేపు మౌనంగా వుండిన తర్వాత నెమ్మదిగా అంది.”కొంతకాలంగా నా కొలీగ్ ఒకతను పెళ్లిచేసుకుందామని అడుగుతున్నాడు. ఈ వయసులో పెళ్లేమిటని ఇంతకాలం పట్టించుకోలేదు. నిన్ననే ఇద్దరం కలిసి అనుకున్నాం… వుద్యోగాలు వదిలేసి ఒక హాస్పిటల్ పెట్టి సర్వీస్ చెయ్యాలని. అలాగే ఒక బేబీని పెంచుకోవాలని…”
“అంటే… అతనికి చేసుకుంటానని చెప్పేసావా? ఎవరతను?”
“ప్రహ్లాద్… నీకు తెలీదులే. నాలాగే నలభై దాటాయి. జర్మనీకీ, అమెరికాకీ, ఇక్కడకీ తిరిగుతూ తన గురించి తను మర్చిపోయాడు. ఇప్పుడేనా అతను కోరుకుంటే కనీసం పదేళ్ళు చిన్నమ్మాయి దొరుకుతుంది. కానీ అతని కలలు నాతో కలిసి నిజం చేసుకోవాలనుకుంటున్నాడు”
“మరైతే ఎందుకు ఆలస్యం?”
“పెళ్లి చేసుకోవాలనైతే అనుకున్నాంగానీ ఎలా ముందుకి వెళ్ళాలో తెలీడం లేదు”
“శ్రీధర్ కి చెప్పనా, ఐతే?”
“ఏమిటే, వాడితో చెప్పేది? నాకన్నా చిన్నవాడు. వాడా, నా పెళ్లి చేసేది?”
” నువ్వొక్కదానివీ చేసుకోలేవుకదా? సాక్షి సంతకాలకేనా కావాలి “
“తన్మయి పెళ్లి హడావుడి అయాక నిర్మలకి చెప్తాను”
“సరే మరి. ఇంకా ఆలస్యం చెయ్యకు. మనసు మార్చుకోకు” అంది మేఘమాల. నీహారిక తలూపింది.
“చాలాసేపైంది. నిర్మల వెతుక్కుంటుంది. వెళ్దామా?” అని లేచింది మేఘమాల. అడుగు వెయ్యబోతూ ఆగింది.
” మీకన్నా పెద్దదాన్నైనా, మీ జీవితాలు ఎలా తీర్చిదిద్దాలో నాకు తెలీలేదు. నాన్నేనా చెప్పి వుండాల్సింది. అన్నీ మీకే తెలుస్తాయని వదిలేసాను” బాధపడుతూ అంది.
“మాకన్నా ఎంత పెద్దదానివే నువ్వు? నీకు మాత్రం ఏం తెలుసు?” అంది నీహారిక.
ఇద్దరూ విడిదింట్లోకి అడుగుపెట్టేసరికి అక్కడ శ్రీధర్, సంయుక్త కనిపించలేదు.
పశ్చిమగోదావరి జిల్లా రెడ్డి పోలవరంలో 16 July, 1962 లో జననం. వరంగల్‌లో వుద్యోగం. హెడ్పోస్ట్‌మాస్టర్గా వరంగల్‌లో స్వచ్చందపదవీ విరమణ.
వివాహం శ్రీ చదలవాడ విష్ణుమూర్తిగారితో. వారు డెప్యూటీ ఏగ్జిక్యూటివ్ ఇంజనీరుగా చేసి రిటైరయారు.
మొదటి కథ అనగనగా 1978లో వనితాజ్యోతి మాసపత్రికలో అచ్చైంది. వీరివి 225కి పైగా కథలు, 9 నవలలు వివిధ పత్రికల్లో ప్రచురించబడ్డాయి. గూడు, సింధూరి, గుండెలోతు అనే కథాసంపుటాలు, నీలినక్షత్రం అనే నవల పుస్తకాలుగా వచ్చాయి. సింధూరి అనే సంపుటానికి శ్రీమతి సుశీలా నారాయణ రెడ్డి అవార్డు 2005 లో వచ్చింది. ప్రేమలోంచీ ప్రేమలోకి అనే నవలకి ఆంధ్రభూమి ప్రథమ, తిరస్కృతులు, నీకోసం నేను అనే నవలలకి ఆంధ్రభూమి ద్వితీయ, 5-3-2 అనే నవలకి కినిగె ద్వితీయ బహుమతులు వచ్చాయి. ఎంతెంతదూరం? అనే కథకి విపుల కన్సొలేషన్ బహుమతి, శ్రీమతి రంగవల్లి ట్రస్ట్ అవార్డు వచ్చాయి. ఇవికాక కథలకు మరో ఏడెనిమిది బహుమతులు వచ్చాయి.
కథలకు కాన్వాస్ పెద్దదిగా వుండాలనేది వీరి అభిప్రాయం.