పెళ్లి పిలుపు – 9 by S Sridevi

  1. పెళ్లి పిలుపు – 1 by S Sridevi
  2. పెళ్లి పిలుపు – 2 by S Sridevi
  3. పెళ్లి పిలుపు – 3 by S Sridevi
  4. పెళ్లి పిలుపు – 4 by S Sridevi
  5. పెళ్లి పిలుపు – 5 by S Sridevi
  6. పెళ్లి పిలుపు – 6 by S Sridevi
  7. పెళ్లి పిలుపు – 7 by S Sridevi
  8. పెళ్లి పిలుపు – 8 by S Sridevi
  9. పెళ్లి పిలుపు – 9 by S Sridevi
  10. పెళ్లి పిలుపు – 10 by S Sridevi
  11. పెళ్లి పిలుపు – 11 by S Sridevi
  12. పెళ్లి పిలుపు – 12 by S Sridevi
  13. పెళ్లి పిలుపు – 13 by S Sridevi
  14. పెళ్లి పిలుపు 14 by S Sridevi“
  15. పెళ్లి పిలుపు – 15 by S Sridevi

“ఎక్కడికెళ్ళిపోయారే, ఇద్దరూను?” వాళ్లకి ఎదురొస్తూ అడిగింది నిర్మల.
“ఆ విషయం తన్మయి పెళ్లీ, అంపకాలూ అయ్యాక చెప్తానుగానీ, వీళ్ళిద్దరూ ఏరి?” అని శ్రీధర్, సంయుక్తల గురించి అడిగింది మేఘమాల.
“పెళ్లీ, అంపకమూనా? పెద్ద గాలివాన వచ్చి వెలిసింది”
“ఏమైంది? గొడవా? ఎవరితో?””
“ఇంకెవరితో? మగపెళ్ళివారితోనే” అంటూ నిర్మల కొంతా, తన్మయి ఇంకొంతా చెప్పారు….
తన్మయి మాటలు ఒక హెచ్చరికలా వినిపించాయి శ్రీనుకి. ఇంకాసేపట్లో పెళ్లి చేసుకోబోతున్న అమ్మాయి అంత ధైర్యంగా కాబోయే భర్తతో మాట్లాడటం అతను ఎక్కడా ప్రత్యక్షంగా చూడలేదు, వినలేదు కూడా.
“నీకు నచ్చనిదేదీ జరగదు. నేను మళ్ళీ మాట్లాడతాను” ఫోన్ పెట్టేసాడు. అతనికి చాలా కోపం వచ్చింది. అంతా సంయుక్త వల్లనే. తగుదునమ్మా అని పిలవని పెళ్లికి ఎందుకు రావాలి? తెలీక వచ్చినా తమని చూడగానే తలొంచుకుని తిరిగి వెళ్ళిపోవాలి. అది మానేసి తిన్నగా వెళ్ళి ఆడపెళ్ళివాళ్ళ మధ్య కూర్చుని మంతనాలాడిస్తుందా? దాన్ని వెనకేసుకురావడానికి వాళ్లకేనా వుండద్దూ ? అని భగ్గుమని మండిన మంట తన్మయి ఆఖరిగా అన్నమాటలు ఒక్కసారిగా చెవుల్లో రింగుమని, కొంత చల్లారింది.
పెద్దవాళ్ళంతా కలిసి ఆమెని సాధిస్తున్నారా అనికదా, అంది. వట్టి అనటం కాదు. అందులో ఆమె భవిష్యత్తు చూసుకుంది. నిజమే! పెద్దత్తకి ఎందుకంత పంతం? సంయుక్తని పిలవద్దంది. అలాగే పిలవలేదు. అవతలివాళ్లు పిలిస్తే వచ్చింది. చూసీ చూడనట్టు వదిలేస్తే సరిపోయేది. అందరికీ ఎదురుపడలేక అదే తప్పుకు తిరిగేది.
ఇప్పుడేమైంది? తను అడకత్తెర్లో ఇరుక్కున్నట్టైంది. తన్మయి దృష్టిలో చులకనయాడు. పెళ్ళి ఆపడానికి బలమైన కారణం కూడా కాదిది. తన్మయిలాంటి అమ్మాయి మళ్ళీ దొరుకుతుందా? దు:ఖంలాంటిది వచ్చింది. ఒక్క సంఘటన పెద్దత్తకి సంబంధించినది జరిగితేనే గిజగిజలాడిపోతున్నాడు. మరి సంయుక్త? పుట్టినది మొదలు ఆవిడ పిడికిట్లో ఇరుక్కుపోయింది. అందుకే తెగించింది . తిరగబడింది. బలంగా శ్వాస తీసుకున్నాడు. మెదడుకి పట్టిన బూజేదో వదిలిపోయినట్టైంది. విడిదింట్లోకి నడిచాడు. అక్కడ తల్లిదండ్రుల మధ్య దేనికో వాగ్వివాదం జరుగుతోంది. ఈమధ్య ఎందుకో తల్లి విసుగుపడుతోంది. కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తే ఏదో జరగకూడనిది జరిగిందనిపించింది.
“ఏమైంది?” తల్లిని అడిగాడు.
” ఆడపిల్ల… పసిపిల్ల… దాని వుసురుపోసుకుని బతుకుతున్నార్రా మీరంతా !” విసురుగా అంది వసంత. “మీ యింట్లో పెళ్లి. మీరు ఎవరిని పిలుచుకుంటారో మీ యిష్టానికే వదిలేసాం. సంయుక్తని పిలవద్దనుకున్నారు. దానికీ మేము కాదనలేదు. మా బాధ్యతగా మేము వచ్చాము. ఆడపెళ్లివాళ్ళు పిలిస్తే అది భర్తతో కలిసి వచ్చింది. దాన్ని వెళ్లిపొమ్మని పంతం పడుతున్నారు. మా కళ్ళముందు దానికి అంత అవమానం జరిగితే చూస్తూ తట్టుకోలేము- అని ఏడుస్తూ పెద్దమ్మ పెద్దనాన్నని తీసుకుని వెళ్లిపోయింది”
“పెద్దనాన్న, పెద్దమ్మ వెళ్లిపోయారా?” దిగ్భ్రాంతుడయాడు శీను.
” పెద్దమ్మ నడిపిస్తుంటే కలలో మనిషిలా ఆవిడ చెయ్యి పట్టుకుని నడుస్తూ వెళ్లారాయన. సింహంలా వుండేవారు. అంత దిగిపోయారు. నలుగుర్లోకీ రావడం మానేసారు. ఇంట్లోవాళ్లే తలోమాటా అంటున్నారు. ఆయన మనసులో ఏముందో ఎవరూ పట్టించుకోవడంలేదు. పోనీ అన్నయ్యా, జరిగిందేదో జరిగిపోయింది, కలిసుంటారని పెళ్లి చేసాం, వుండలేకపోయారు. ఎవరిదారిన వాళ్లు సుఖంగా బతికితే చాలు-అని ఒక్క ఓదార్పు మాట చల్లగా అంటారేమోననుకున్నారు. ఒక్కరూ అనలేదు. ఇప్పుడుకూడా ఇలా చేస్తున్నారు. సమ్మూ పై పిల్ల కాదు. ఆయన కన్నకూతురు. లేకలేక పుట్టిన పిల్ల. ఆయన అంత:ప్రాణంరా అది. మీకది అర్థం కాదెందుకు? ఆయన బాధపడేది అది చేసిన పనులకి కాదు, దానిపట్ల మనందరి ప్రవర్తనకి. పెద్దవాళ్ళు, వీళ్ళకంటే నచ్చలేదు దాని పని. మరి నీ చదువెందుకు, చట్టుబండలవను?” అంది వసంత.
భార్య మాటలు చెంపపెట్టులా తగిలాయి నారాయణరావుకి. శీనుకి కూడా మొదట్నుంచీ ఆమె అంటూనే వుంది, తల్లిదండ్రులకి ఇష్టమై కలుపుకున్నప్పుడు మనం ఎందుకు దూరం పెట్టాలని. వదిన వత్తిడికి అన్నగారు తటస్థంగా వుంటున్నాడుగానీ జరిగినదేదీ మనసు లోలోపల ఆయనకి ఇష్టం లేదనే ఇన్నాళ్ళూ నమ్మాడు. కానీ ఈరోజుని కూతురికోసం ఆయన పడిన బాధని తన కళ్ళతో చూసాడు.
తనకీ తన్మయికీ మధ్య జరిగిన సంభాషణ చెప్పాడు శ్రీను. “ఈ విషయంలో తను చాలా పట్టుదలగా వుంది. అతను వాళ్లకి బాగా కావలసినవాడట” నిస్సహాయంగా అన్నాడు.
“నీకూ మీ నాన్నకీ చెప్పదగినంతదాన్ని కాను. కానీ చెప్పకుండా వుండలేను. కొట్టీ తిట్టీ కాల్చుకు తిన్న అత్తకొడుకు నీకు పెద్ద చుట్టం ఎలా అయ్యాడు? అంత బాధని వోర్చుకున్న మనింటి ఆడపిల్ల… నీ చెల్లెలు… స్వంత పెద్దనాన్న కూతురు పరాయిదెలా అయింది? అందుకే తన్మయి నిన్ను చేసుకుని మనింటికి రావటానికి భయపడుతోంది” వసంత తన్మయి మనసు చదివినట్లు అంది.
శీను ముఖం ఎర్రబడింది. అప్పటిదాకా అభావంగా కూర్చున్నవాడల్లా నారాయణరావు గమ్ముని అన్నాడు,” అన్నయ్యా, వదినా ఎంతో దూరం వెళ్లి వుండరు. నేను వెళ్లి వాళ్లని వెనక్కి తీసుకొస్తాను” అని, “నువ్వు సంయుక్తనీ అతన్నీ పిలుచుకురారా ! అందరం కూర్చుని మాట్లాడుకుంటే కలతలు తీరిపోతాయి. మీ అమ్మ అన్నట్టు ఎవరిదారిన వాళ్లు బతుకుతున్నప్పుడు ఈ గొడవలెందుకు? అన్నయ్యకి లేని అభ్యంతరం నాకు దేనికి? పీటలమీద పెళ్లి ఆపుకునేంత విషయం ఏమీలేదు. పిల్లావాళ్లకి మతిలేకపోతే మనకేనా వుండాలి” అన్నాడు. అతను వెళ్లాడు.
శీను మేనత్తలు వున్న గదిలోకి వెళ్ళాడు. ఐదుగురూ అక్కడే వున్నారు. శారదా, రాజారావు వెళ్లాక వాళ్లు ఇక్కడికి వచ్చి కూర్చున్నారు. వాళ్లమధ్య కూడా ఈ విషయంమీద వాదనలు జరుగుతున్నట్టున్నాయి. ముఖాలు ఎర్రగా వున్నాయి. శీను రాగానే మాటలు ఆపారు. శీను వెళ్లి జయలక్ష్మి పక్కన కూర్చున్నాడు. ఆవిడ మొహం తిప్పుకుంది.
“అత్తా! విషయం చాలా దూరం వెళ్లేలా వుంది. నువ్వే పెద్దమనసు చేసుకోవాలి” అన్నాడు ఆవిడ చేతిని తన చేతిలోకి తీసుకుని. ఆవిడ విదిలించుకుంది.
“పెద్దన్నయ్య చాలా బాధపడుతున్నాడే… పెళ్లివాళ్లుకూడా పంతంమీద వున్నారు. ఈరోజుల్లో ఆడపిల్లలు దేనికీ తగ్గడం లేదు. ముహూర్తందాకా ఉండి నాలుగు అక్షింతలు వెయ్యి. ఇష్టమైతే చివరిదాకా వుండు. నీ పెద్దరికం నిలబెట్టుకో. లేదంటే ముహూర్తం అవగానే వెళ్లి పంతం నెగ్గించుకో… ” అని నచ్చజెప్పబోయింది జయలక్ష్మి తరువాతి ఆమె.
ఈ గదిలోకి వచ్చినప్పట్నుంచి అదే చెప్తున్నారు. ఆవిడ వినట్లేదు. ఇంకేదో జరగాలని వుంది. సంయుక్తని వెళ్లగొట్టేది లేదని వాళ్లు చెప్పేసాక ఇంకేం జరుగుతుంది? ఆవిడేనా సర్దుకోవాలి. పెళ్లేనా ఆగిపోవాలి. రెండవది బైటికి అనలేకపోతోంది.
“ఏమిటే జయక్కా, నీ పంతం? పెద్దదానివి, అమ్మ తర్వాత అమ్మంతటి దానివని ఇన్నాళ్ళూ నీకు ఎదురు చెప్పలేదు. ఇప్పటికేనా నువ్వు పద్ధతి మార్చుకోకపోతే మేమందరం నష్టపోతాం. పెద్దవాళ్ళం, మనమంతా భర్తలని గుప్పిట్లో పెట్టుకుని కాపురాలు చేసుకుంటే సంయుక్త మాత్రం ఏడుస్తూ, కన్నీళ్ళు తుడుచుకుంటూ బతికింది. ఇన్నాళ్ళకి దానికి తెలివి వచ్చి తనదారి తను చూసుకుంది” అంది ఆఖరి చెల్లెలు.
సమస్య ఇంతకాలం తమ మధ్యనే వుంది. ఇప్పుడు బజారుకెక్కింది. అక్కగారికి మొదట్నుంచీ చెప్తునే వుంది. పెళ్లికి ముందు సంయుక్తకీ శేషుకీ కలవదనీ చెప్పింది. వాళ్లు గొడవలు పడుతుంటే శేషుని మందలించమనీ చెప్పింది. సంయుక్త మళ్ళీ పెళ్లి చేసుకున్నాక ఆ పిల్ల జోలికి వెళ్లద్దనీ చెప్పింది. అందరికంటే ఆఖరిది కావటాన్న ఎవరూ ఆమె మాట వినలేదు. రాజారావు కూడా. ఫలితం దగ్గరకు వచ్చేసరికి ఒకరికి అనుకూలమైనది మరొకరికి ప్రతికూలమౌతోంది.
” శీనూ !ఇప్పటికే చాలా జరిగింది. తన్మయి ముందు నువ్వు చులకనపడకు. సమ్మూలాంటి పిల్ల ఇంకొకరుండరు. శేషు దాన్ని జారవిడుచుకున్నాడు. తన్మయిలాంటి అమ్మాయి నీకు మళ్ళీ దొరకదు. సమ్మూ విషయాన్ని తన్మయి భవిష్యత్తుతో తూస్తున్నారు. తెగేదాకా లాగకు. తర్వాత ఏం జరగాలో చూసుకో. వెళ్లు” అందామె.
అతను వెళ్లిపోయాడు.తన్మయి వున్న దగ్గరకు వెళ్లాడు. సంయుక్త అక్కడే వుంది.
“ఒకొక్క ఇంట్లో వుంటారు తన్మయీ , మా అత్తలాంటివాళ్ళు. ఆవిడకి ఎదురు చెప్తే జరిగే రచ్చ భరించలేక ఆవిడ ఎలా చెప్తే అలా చెయ్యడానికి అలవాటుపడిపోయాం. ఇది అలవాటులో పొరపాటే తప్ప ప్రత్యేకించి చేసింది కాదు. ” అన్నాడు తన్మయితో.
“సారీ సమ్మూ! పెద్దత్త గురించి నీకు తెలీనిదేముంది? అమ్మకీ నాన్నకీ మిగిలినవాళ్ళకీ ఏ సమస్యా లేదు. నిజానికి నిన్ను మేమే పిలవాలి. ఆవిడ కారణంగానే ఆగిపోయాం. బావగారేరి? ఇద్దర్నీ వెంటపెట్టుకు రమ్మన్నారు నాన్న. అందరికీ పరిచయం చేద్దువుగాని” అన్నాడు.
శేషుతో కలిసి శ్రీధర్ ఇంటిమీదికి దొమ్మీకి వచ్చిందీ, పెళ్లికి రావద్దని వసంత ఫోన్లో ఏడ్చిందీ మర్చిపోలేదు సంయుక్త.
“అక్కడికి వచ్చాక అంతా కలిసి మమ్మల్ని తిట్టరుకదా అన్నయ్యా?” భయంగా అడిగింది. ఆ ఒక్క ప్రశ్న అక్కడ వున్న ఇద్దరినీ కదిలించింది… శీనునైతే మూలాల్లోంచీ. చిన్నప్పుడు తామంతా కలిసి ఆడుకున్నప్పటి రోజులు గుర్తొచ్చాయి. శేషు దౌర్జన్యంగా వుండేవాడు. ఆటల్లో తొండి చేసేనా గెలిచేవాడు. ఎప్పుడేనా వోడిపోక తప్పని పరిస్థితి వస్తే ఆ వుక్రోషాన్ని సంయుక్త మీద తీర్చుకునేవాడు. వంగదీసి రెండు దెబ్బలు వెయ్యటం, జడలు పట్టి లాగటం, మొట్టికాయలు వెయ్యటం, గిచ్చడం… అకారణంగా ఏడిపించేవాడు.
“ఎందుకురా, దాన్నలా కొడతావు?” అని ఎవరేనా అడిగితే ,”అది నా పెళ్లం. ఏమైనా చేసుకుంటా” అని నిర్లక్ష్యంగా జవాబిచ్చేవాడు . అదో నవ్వులాటగా చెప్పేది అత్త. అంత చిన్న వయసునుంచే తమకి అలవాటైపోయింది… సంయుక్తమీద శేషుకి హక్కు వున్నట్లు… సంయుక్త అంటే శేషు నీడ అన్నట్టు. ఆ జడత్వంలోంచీ బైటికి వచ్చాడు ఇంతకాలానికి. శ్రీధర్‍ని పరిచయం చేసుకుని అతన్నీ సంయుక్తనీ వెంటపెట్టుకుని వెళ్లాడు శీను.