“ఫ్రిజ్ లోకి ఏమి వండనూ?” అన్న నా ప్రశ్నకి …
నా వైపోసారి గుర్రుగా చూసి “అబ్బా! ఏమిటి మమ్మీ ? నీకు తోచిందే దో చెయ్యి.” అని “కార్తీ!!” అని గర్జిస్తూ టీవీ స్క్రీన్ మీద రెండు చేతులతో డోలు బజాయిస్తున్న మా నాలుగేళ్ళ మనవడి మీదకు బాహుబలి సినిమాలో ప్రభాస్ ఏనుగు మీదికి ఎగిరినట్లు ఎగిరి వాడిని రెక్కుచ్చుకు ఇవతలికి లాగి టీవీ స్క్రీన్ మా మనవడి బారి పడకుండా రక్షించి రొప్పుతూ సోఫా మీద కూల బడింది మా అమ్మాయి విజయ.
వాడు తన లక్ష్యం ఛేదించనీయనందుకు ఆరున్నొక్కరాగం అందుకుని కాళ్ళా చేతులా నటరాజును తలపించేలా నర్తనం చేస్తూ;—
తోడుగా మా మాతృశ్రీ ఆగకుండా వాడిని ఏడుపు అపమని అరుపు లు,వాడి తీవ్రస్థాయి ఆలపనా;—
ఈ జుగల్ బందీ ముగిసి సాక వాడు అలసి నిద్దరోయాడు.
మా అమ్మాయి నేనిచ్చిన కప్పుడు లిఫ్టన్స్ చాయ్ తాగి సరికొత్త తాజాదనంతో ఉన్నప్పుడు ఆ తరుణం మించి పోకూడదని…
“ఫ్రిజ్ లోకి ఏమి వండనూ?” మళ్ళీ నేను..
“అబ్బా! మమ్మీ! నేను వాడితో సర్కస్ చేస్తుంటే నీకు నవ్వుతాలు గా ఉంది.. ఫ్రిజ్ లో చూసి నీకు తోచిందేదో చెయ్యి.” అని …మోగుతున్న సెల్ తీసి “హలో! చెప్పు జయా!” అంది.
“ఆ ఫ్రిజ్ లోకి చూస్తే నాకే కాదు ప్రపంచం లో ఎవడికీ బుర్ర తోచదు. సరికదా వంటంటే విరక్తి వస్తుంది.” అని నాలో నేను గొణుక్కుంటూ…
అయినా ఈ దిక్కు మాలిన ఫోన్లు ఒకటీ. అందులో ఈ జయ ఫోన్ వస్తే మా విజయ ని పట్టలేం. జయ, విజయలిద్దరూ కొనసాగించే నాన్ స్టాప్ నాన్సెన్స్ కి ఛిన్నమస్తాదేవిలా ఎవరయినా వాళ్ళ తల వాళ్ళే ఖండిచేసుకుంటారు అన్నది నా స్వానుభవం. ఈ బాల్య స్నేహితుల ప్రభావం తో ఈ రోజు నా మెదడు మోకాల్లోకి చేరి పోయి..అక్కడ కూడా మెదడు డొల్ల అయి ఉండటానికి కారణం మా ఆయన పిల్ల లతో పాటు ఈ జయ ఫోన్లు కూడా అని నా బాల్య మిత్రుడు, రోగ నిర్ధారణ లో తిరుగు లేని వాడు, డాక్టర్ మూర్తి అభిప్రాయం. అదే నాకు చెప్పేడు కూడా.
“దీని కి నివారణ?” అని నేను అడిగితే…
పెదవి విరిచి, దీర్ఘంగా నిట్టూర్చి
“సారీ సావిత్రీ! ప్రాణమిత్రురాలివి నిన్నీ స్థితిలో చూడటం నాకూ బాధగానే ఉంది. కానీ నీ సమస్యకి మందు లేదు. బాగు చెయ్య లేని దాన్ని చచ్చినట్లు భరించటమే! ” అని నా దుర్భర స్థితికి ప్రగాఢసంతాపం ప్రకటించాడు.
అప్పటినుండీ ఇదిగో ఇలా నెట్టు కొస్తున్నాను వాళ్ళతో పాటు నేనూ డొల్లబుర్రతో ఇలా తలా, తోకా లేని పనులు చేస్తూ.
ఆ జయమ్మ ఫోన్ కదా ! ఇక ఇప్పట్లో అమ్మాయీ మణి వారు మన లోకం కి రారు. ” కతార్ లో జయకి బెంగుళూర్లో మా విజయకి బంధం ఒకనాటి మాట కాదు.ఒక నాడు తీరి పోదు.” అని వాళ్ళ మొగుళ్లు వీళ్ళని అచ్చేసి వదిలేశారు. వాళ్ళు వాళ్ళకి ఊహ వచ్చిన దగ్గరినుంచీ నేటి వరకు మొత్తం విషయాలన్నీ ప్రతి రోజూ ఫోన్ లో కలిసి కలబోసుకుని ఆ రోజులు మళ్ళీ రావని వలవల మంటుంటారు. వాళ్ళు ఆ ఫోన్ లోంచి మన లోకంలోకి రావటం అనేది పూర్తిగా ఆరోజు మన తారాబలం ,చంద్రబలం మీదే ఆధారపడి ఉంటుందని నా నమ్మకం.ఓ సారి మా అల్లుడు పెళ్లయిన కొత్తలో ఈ ఫోన్ లో రోజూ ఈ ఆరంభం తప్ప అంతం లేని కధ భరించలేక ….
“ఒక్కసారి లైన్లో ఉండు ఇప్పుడే వస్తాను.” అని ఫోన్ పెట్టి ఏ దో పని ఉందని మా విజయ వెళ్ళిన క్షణంలో వెయ్యోవంతు కాలంలో తటాలున మెరుపు వేగం తో దవడ బిగించి విజయ ఫోన్ మీదకి లంఘించి ఆమట్న…
జయతో “ఏమండీ! మీరిద్దరూ ఇలా టై మూ ,రై మూ లేకుండా ఒళ్ళూ పై తెలియకుండా ఫోన్లో అంతులేని కధాసరిత్సాగరాల్లో ఈతలు కొడుతుంటే నాలో ఉన్న అపరిచితుడు బయటికి వస్తాడు.” అన్నాడు.
జయ వెంటనే రివేర్స్ గేర్ లో “విజయలో కూడా ఒక చంద్రముఖి వుందండీ. ఆ విషయం నాకే తెలుసు ఎందుకంటే మేము శరీరాలు వేరు కానీ ఆత్మలొకటే. అందుకని మీలో అపరిచితుడు బయటికి వచ్చినప్పుడల్లా తనలో చంద్రముఖి బయటికి వస్తుంది. మరి మీ ఇష్టం.” అని అతనితో అని…
“నువు ఫోన్ పెట్టి వెళ్ళినపుడు మీ ఆయన లోని అపరిచితుడు బయటికి వచ్చి నాతో మాట్లాడేడు. నాలో చంద్రముఖి అతనికి గాలి తీసేసింది.”అని విజయ చెవిలో వేసింది.
అంతే “ఆ రోజు ఆకస్మిక అంతరాయనికి చింతిస్తున్నా. రేపు మరిన్ని ఉత్కంఠ భరిత విశేషాలతో ప్రోగ్రాం నిడివి పెంచి మరీ ప్రసారం కొనసాగిస్తాను.” అని జయ కి చెప్పి మరీ ఫోన్ పెట్టేసిన విజయను చూసి…
“నాలో అపరిచితుడి సంగతి జయ చెప్పి ఉంటుంది. కతార్ నుంచి ఆత్మ వచ్చేసరికి టైం పడుతుంది. ఈ లోపల అపరిచితుడు వస్తే కష్టం.” అని భయం పడి విజయ ఫోన్ పెట్టి ఉంటుంది అనుకున్న మా అల్లుడికి..
“ఎవడా అపరిచితుడు? రమ్మను బయటికి. నాన్ దా చంద్రముఖి!” అంటూ…
“రారా!సరసకు రారా! స్టయిల్లో…
పోరా! వెంటనె పోరా
ఫోన్ మాటనకురా!
తెలుసుకో ముందరా! ఫోను వీడ
నన్ను పట్ట లేవురా!
తోం తోం తోం” అని విజయలో చంద్రముఖి అరవంలో తెలుగులో విజృభించే సరికి…
మా అల్లుడు ఠారెత్తి పోయి అక్కడి నుండి శరవేగంతో ఉడాయించి వీధి చివర పార్క్ లో చెట్టు కింద కూలబడి …
“హమ్మా !హెంత పనయి పోయింది. బాబోయ్ ఈ ఏకాత్మ ఇంత సూపర్ ఫాస్ట్ గా ఎటాక్ ఇస్తుందనుకోలేదు.
అయినా కతార్‌లో ఉన్నప్పటికన్నా వీళ్లిద్దరి ఏకాత్మ భారత దేశంలోనే భయంకరంగా ఉంది. ఆవిడ అక్కడ నుండి కేవలం ఒకే ఆత్మ ఉందని చెబితే ఈవిడ ఏకంగా ఆ ఆత్మని సాక్షాత్కరింపజేసీ నన్ను తరింపజేసి జేసి చుక్కలు చూపించేసింది. ఎందుకొచ్చిన తంటా ఈ ప్రేతాలతో!”అనుకుంటుంటే అతనికి సోక్రటీస్ మాటలు గుర్తు వచ్చాయి. “పెళ్ళి చేసుకో. భార్య అనుకూలవతి అయిందా సుఖపడతావు. లేదా విరాగివి అవుతావు” అని.
మొదటిది చేసేసాడు. ఇక రెండోది తప్పని సరిగా చేయాలని అర్ధంచేసుకుని అప్పటినుండి ఈ లోకంలో వుంటూ విరాగి అయి పోవటానికి తగిన తన ఉద్యోగం ఒక సాఫ్ట్ వేర్ఫర్మ్ లో అన్ని మానవీయ బంధాలకు
దూరంగా కంప్యూటర్ స్క్రీన్ కు అంకితం అయి కాలం వెళ్ళమార్చుతున్నాడు పాపం పక్షి.ఇలా నా స్వగతంలో వర్షం వచ్చినప్పుడు మెట్రో మహానగరాల్లో రోడ్లమీద బురదనీళ్లలో సుళ్ళు తిరుగుతున్నట్లు పనికి మాలిన ఆలోచనలు సుళ్ళు తిరుగుతుంటే… చెట్టు వద్దకు కాళ్ళీడ్చుకుంటూ తిరిగి వెళ్లిన విక్రమార్కుడిలా మా అమ్మాయి ఉత్తర్వు ననుసరించి ఫ్రిజ్ దగ్గరికి వెళ్ళి తలుపు తీసి లోపలికి చూసాను.
విశ్వాన్ని ఇముడ్చుకున్న బాలకృష్ణుడి నోటిలా డోర్ తెరవగానే ఫ్రిజ్ లో విశ్వాన్ని దర్శించి కలయో , వైష్ణవ మాయో… ఒక ఫ్రిజ్ ఇన్ని ఇముడ్చు కోగలదా! ఈ ఘన కార్యాన్ని సాధించిన మా అమ్మాయీ మణి వారి నైపుణ్యానికి నిలువెల్లా ..అగ్గి రాజుకున్నట్లు మండిపోతుంటే…
“అది ఫ్రిజా? భోషాణమా? అలా దాన్ని ఏవేవో బోల్డు ఐటమ్స్ తో పాటు పళ్ళు ,కూరలు వండనివి , వండినవీ అన్నీ కూరి పీక్ అవర్ లో ఆర్టీసీ బస్ లా తయారు చేసావు. ఏదో చెయ్యి అనటం, ఏది చేసినా తినకపోవటం ,ఆనక అది ఫ్రిజ్ లో తొయ్యటం… బాగా అలవాటయి పోయింది నీకు. అసలు నిన్నిలా తయారుచేసిన మీ నాన్ననీ, బామ్మనీ అనాలి!” అని స్వర్గస్తు లయిన మా పెద్దలు మావారినీ,వారి తల్లిగారిని కసిగా తిట్టుకుని..
మా విజయ చేష్టలకే కాదు, ప్రపంచంలో ఎక్కడ ఏది జరిగినా మా ఆయనతోసహా వారి తరపు వాళ్ళందరినీ ఆ జరిగినదానితో వాళ్ళకి ఓ లింక్ పెట్టి తిట్టుకోకుండా అదే మీ భాషలో కాస్త సున్నితం గా చెబుతానులెండి తలచుకోకుండా ఒక్క క్షణం గడవదు నాకు.
ముంబయ్ లో టెర్రరిస్ట్ లు దాడి చేసినపుడూ అలాగే మీ నాన్న, బామ్మావలనే ఇలా జరిగింది. వాళ్లిద్దరూ ఒక్క పని తిన్నగాచేయరూ అంటే మా అబ్బాయి “మమ్మీ నువ్వలా అంటే తెలిసి కూడా చెప్పనందుకి నిన్ను , ఆ దాడితో సంబంధం ఉందని వాళ్ళని జైల్లో పడేస్తారు. ఆ దాడికీ వీళ్ళకీ సంబంధం ఏమిటీ అసలు? అన్నిటికీ డాడీని బామ్మని ఆడిపోసుకుంటావు” అన్నాడు వాడికేదో పెద్ద తెలిసినట్లు. వాడికి తెలియని అసలు విషయం వాళ్ళని ఆడిపోసుకోవటం నాకో పెద్ద రిలాక్సేషన్ , స్ట్రెస్ బస్టర్ జీవితంలో అని.
“వీళ్ళిద్దరికీ నిజంగా ఆ టెర్రరిస్టులతో సంబంధం ఉంటే అసలు ఆ దాడి ప్రయత్నం ఫెయిల్ అయి వుండేది అని నాకూ తెలుసు. ఎందుకంటే వీళ్ళిద్దరూ ఒక్క పని సరిగా చెయ్యరూ, చెయ్యనివ్వరూ” అన్న నా మాటలకి మావాడు అక్కడి నుండి జంప్.
రామచంద్రా, ఈ సోదంతా ఎందుకుగానీ…. ఫ్రిజ్ లో మిగుళ్ళు తగుళ్ళు ఏమున్నాయో చూదాం అని లోపల చెయ్యిపెట్టబోయేసరికి చేయి తగిలి ఓ జ్యూస్ గ్లాస్ పక్కకి ఒరిగి దొర్లుకుని కింద పడి, గ్లాస్ భళ్లు, నేల మీద జ్యూస్ మడుగు. ఆ చప్పుడు కి మా అమ్మాయి ఘొల్లు. ఒకే క్షణము లో నయము, భయము , భీభత్సము గదరా! అయిపోయి….
“మమ్మీ.. ఒక్కపని సరిగా చెయ్యవుకదా! దుబాయ్ నుంచి తెచ్చిన ,నా కెంతో ఇష్టమైన గ్లాసుల సెట్. అందులో గ్లాస్ అదీ!” అనీ ఏడుపొక్కటే తక్కువగా…
“అంత ఇష్టమైన సెట్ లో గ్లాస్ ఇలా కొండ అంచుమీదనుంచి వేలబడుతున్న హీరోలా ఎప్పుడు పడిపోతాడో అన్నట్లు తలుపు తీస్తే పడిపోయేలా ఎందుకు పెట్టావు? హీరోకి డైరెక్టర్ ఉంటాడు. రక్షిస్తాడు. నీ ఫ్రిజ్ లోఎవడుండి దీన్ని ఉద్ధరిస్తాడనుకున్నావు? నిన్నరాత్రి ఓ గాజుబౌల్ కి నూరేళ్లు నిండినప్పుడేనా నీకు బుద్ధిరావాలి కదా. గ్లాస్ ఇలా పెడితే పడుతుందేమో పగులుతుందేమో అని అనుకోకుండా ఇప్పుడిలా పెడబొబ్బలు పెట్టటం ఎందుకూ? నాకీ జన్మ భూమి కార్యక్రమం తగిలించటం దేనికి ఉన్న పని చాలదన్నట్లు?అయినా బుర్ర వుండగానే సరి కాదు. కాస్త ఉపయోగించాలి. ఆ అలవాటు మీకూ, మీ నాన్నకి ఉంటే నా బతుకిలా ఎందుకుంటుందీ. అందికే అన్నారు పుణ్యం కొద్దీ పురుషుడూ, దానం కొద్దీ బిడ్డలూ అని. ఇంతకూ ఇప్పుడు ఈ గాజుపెంకులు ఎక్కడ అఘోరించాలో చెప్పేడువు.” అని చూద్దునూ…
మా అమ్మడు లేదు. ఎప్పుడో నన్ను సోషల్ డిస్టెన్సింగ్ చేసేసింది. వాళ్ళు మీటర్ అంటే తాను ఆరామడలు పారిపోయింది నా మాటల తూటాలు తగలకుండా. నానుండి ఈ ఆత్మరక్షణ కిటుకులు మా ఇంటి మనుషులకు వెన్నతో పెట్టిన విద్య. తెలిసీ ఆవేశపడి మిరపకాయ తిన్న కాకిలా అరిచీ అరిచీ అలిసిపోయి ఉసూరుమంటూ మళ్ళీ పనిలో ఈదుకోవటం నా నిరంతర వ్యధ.
ఆ జ్యూస్ అంతా లోపల పదార్ధాలమీద కూడా పడి వాటన్నిటినీ పావనం చేసిందేమో అటేడు తరాల్నీ ,ఇటేడు తరాల్నీ అక్షులూ పక్షులూ తిట్టుకుంటూ ఫ్రిజ్ లోనా బయటా తుడుస్తూ ఆపకుండా మా అమ్మాయి పుట్టిన దగ్గరినుండి నేటివరకు తన వన్నెచిన్నెలన్నీ ఉటంకిస్తూ అష్టోత్తర ,శతనామావళులు , ఫ్రిజ్ క్లీన్ కార్యక్రమం పూర్తిచేసి అలసట వొచ్చి ఓ గ్లాస్ హార్లిక్స్ తాగి అమ్మాయీమణివారి అన్వేషణ చేస్తూ….హా సీతా!..హా లక్ష్మణా! స్టయిల్లో నా ఆర్తనాదాలకి మా అమ్మాయి ఓ చెవిలో సెల్ ఫోన్ తో ప్రత్యక్షం అయి….
“హేంటి మమ్మీ?”అంది అమాయకంగా ….
“హేముంది బేబీ! ఫ్రిజ్ లోకి ఏమి వండి తగలెయ్యా లో ఏడవమని చెప్తున్నాగా? కాస్త ఆ ఫోన్ బంగాళాఖాతంలో విసిరేసి నీ కళ్లు, చూపులు ఇటు పారేస్తే ఈ రోజుకి కృతార్థురాలినవుతాను మాతే ! ” అన్నాను కసిగా.
“అయిపోయింది మమ్మీ.” అని….
“మళ్ళీ మాట్లాడుతానే. నీకు తెలుసు కదా మాఇంట్లో ఊపిరి పీల్చుకుందికి కూడా అవదని. మా మమ్మీ నేను ఫోన్ తీస్తే బ్యాండ్ బాజా బారాత్ చేసేస్తుంది నాకు. ఉంటాను. బై ఫర్ నౌ.” అంటూ ఉంటే…
నాకు కారం ఒంటికి రాసినట్లు అనిపించి “నీ అఘాయిత్యం కూలా. ఉదయంనుండి మీరిద్దరూ ఎన్నిసార్లు ఫోన్ చేసుకున్నారు? అయినా ఇప్పుడే మాట్లాడింది మళ్ళీ అప్పుడే ఫోన్. ఏం కొంప మునిగిందని. పెళ్లయి సంసారాలు చేస్తున్న మీ ఇద్దరికీ పొద్దున్నే ఈ ఫోన్ లేమిటి? పనులూ, పాట్లు ఉండవా? ” అంతులేని నా వాక్ప్రవహానికి అడ్డు తగులుతూ…
“టీ ఇయ్యి మమ్మీ ప్లీజ్. ఇంతసేపూ ఫోన్లో లేను. మేడమీద బట్టలు అన్నీ ఆరేసాను. పైన రూమ్స్ తుడిచి ,పోచా చేసాను. వారంరోజులనుండి మా పనమ్మాయి లక్ష్మి రావటం లేదు. నువు నిన్న రాత్రే వచ్చావుకాబట్టి నీకు తెలియలేదు. తాను ఇంకో వారం రాదు. వాళ్ళ ఊరు వెళ్ళింది ఏదో పనిమీద. చచ్చిపోతున్నాను పనితో. నువు వచ్చావు కాబట్టి కాస్త నాకు చెయ్యి ఖాళీ అయింది. నిజం. నాపట్ల ఆ దేముడు అపార దయావర్షం కురిపించాడు నిన్ను పంపి.” అంది మీరాబాయిలా భక్తి పారవశ్యంతో.
“నా తల్లే! నేను ఇన్నేళ్లు పూజలు,పునఃస్కారాలు చేస్తే ఆ దేముడు నన్ను నీకిలా బలి చేసి
నిన్ను కరుణించాడు. చాలా సంతోషంగానీ ఫ్రిజ్ లోకి ఏమి వండిపెట్టేదో సెలవియ్యి. ఇదిగో టీ.” అంటుంటే… మళ్ళీ ఫోన్ …
“ఇప్పుడెవరు ఫోన్? ఆ జయేనా. అయినా ఎందుకు చేసిందీ” అంటే..
“గోల్డ్ ధర భారీగా పడిపోయిందటమ్మా. కొంటానన్నావు కదా. ఇండియా వస్తున్నాను కొనాలనుకుంటే చెప్పమంటోంది” అంది.“మన వంటయేలోపల పడిపోయిన గోల్డ్ ధర ఏమీ పెరిగిపోదుకానీ తరవాత మాట్లాడు. అయినా ఏ పూటా సూత్రాల తాడు అయినా వేసుకోని మీకు దేనికి బంగారాలు, బాచారాలు. ఏదో కొనటం. అక్కడినుండీ అది లాకర్లో పెట్ట, ఇంట్లో పెట్ట. ఓ చోట ఉంచరు. లాకర్ అద్దె దండగ. ఓ రెండేళ్లు పోయాక మోడల్ పాత అనటం దాన్ని చెడగొట్టించి మరేదో చేయించడం. ఈ పుస్తె మార్చి పూస, పూస మార్చి పుస్తె చేయించే తతంగంలో ఆ షాప్ వెధవలు బంగారం కొట్టేస్తారు. మీరిలా డబ్బు తగలేస్తారు. ఏ బంగారం కొనకు. ధర తగ్గడం ఏమిటి .నా పిండా కూడు. అవన్నీ వ్యాపార రహస్యాలు. సేల్స్ ప్రమోట్ చేసుకుందికి. మీలాంటి వెర్రిమొహాలు గొర్రెల్లా సరాసరి వెళ్ళి ఆ మాయలో పడిపోతారు తెలివితక్కువగా. ఓ వెయ్యి ధర తగ్గితేమాత్రం తులం నలభయ్ వేలు పెట్టి దేనికిపుడు బంగారం? ఉన్నది చాలు. ప్రతీదీ వండి వేలేసి ముట్టుకోకుండా ఫ్రిజ్ లో తోస్తారుగా ఫలితం నీ ఫ్రిజ్ తవ్వకాల్లో బయటపడ్డ స్టాక్ చూడు…. అసలు మీరు తింటానికా ఫ్రిజ్ లో కూరటానికా వండుతావు? ఈ మిగిలినవి చూస్తే ఫ్రిజ్ లోకి తొయ్యటానికే వండుతున్నావు అనిపిస్తుంది. ఇన్ని మిగిలిపోవటమా! హవ్వ! సొమ్మా? మన్నా? ఇలా వండి పారబో స్తున్నావు. చూడు ఎన్నో! సాంబార్,కేరట్ కూర,నాలుగు ఇడ్లీలు చట్నీ ,చల్ల పులుసు ,ఆలు ఫ్రై ,ఉప్మా,……”
“మమ్మీ ! ఇంక చాల్లే! ఏ టాపిక్ అయినా అనర్గళంగా శ్రోతలని బాదేస్తావు వాగ్దేవీ. కరుణించి ఆ లిస్ట్ చదవటం ఆపు. వారం రోజుల నుండి మా లక్ష్మి రావటంలేదు. వాచ్ మెన్ వాళ్ళు ఊరెళ్ళి నాలుగురోజులయింది. రాత్రే వచ్చారు. అందికే అవి అలావుండి పోయాయి. ఇవన్నీ నేను వాచ్ మేన్‌ని పిలిచి ఇచ్చేస్తానుగానీ జగజ్జననీ, ప్లీజ్
ఇక దండకం చదవక ఫ్రెష్ గా నీకేది తోస్తే అది వండు అమ్మా! తినడానికి నువు చేసేవే బావుంటాయి. నేను చేసేవి ఫ్రిజ్ లోకిగానీ నువు చేస్తే పొట్టలోకే ప్రామిస్. ” అంటూ పాట అందుకుంది.
అమ్మా వండాలీ.
నువ్వే ఇక పై వండాలీ
ముప్పూటల నువ్వొండాలి
ఇక ఫ్రిజ్ లో పెట్టక ఉండాలి
అమ్మా!అమ్మా!..అని పాడుతుంటే..
“చాల్లే! మీ ఇంటికి వచ్చేసరికి వంటిల్లు అప్ప చెప్పేస్తావు. అక్కడికి నా స్థానం ఏదో వంటిల్లు అయినట్లో లేదా నేనేదో వంటింట్లో వుండే ఓ సామాను ని అన్నట్లో. ఇక లే! ఇక్కడినుండి దయచెయ్యి కార్తీ లేచినట్లున్నాడు “అని కిచెన్ లోకి నడిచాను.
నా పేరు ఆయాపిళ్ళ సావిత్రి. జననం 1955. పుట్టింది అనకాపల్లి, ఆంధ్ర ప్రదేశ్ లో. తల్లితండ్రులు.. లేట్ గంటి వెంకట రమణయ్య,సుందరమ్మ. భర్త.. లేట్ A.V.Ramana Rao.విద్యార్హతలు: MSc physic s, Mphil, PG Dip Electronics ఉద్యోగం: విశాఖపట్నం AVN కళాశాలలో భౌతికశాస్త్ర విభాగంలో విభాగఅధిపతిగా చేసి.2013 లో రిటైర్ ఆయాను. కధలు, కవితలు రాయటం సరదా.కొన్ని ప్రచురింపబడ్డా అవి ఏవీ సేకరించి పెట్టుకోలేదు.అసలు ప్రచురణకి పంపటమే చాలా తక్కువ. రిటైర్ అయాకా ఈ fb లోకి వచ్చాకా ఏదో రాసి మన గోడ మీద పెట్టటం మొదలుపెట్టాను. ఆ రకం గా నా వ్రాతలు ఎక్కువగా fb లో పెట్టినవే అయ్యాయి.ఇది సరదాగా ఎంచుకున్నది. మిత్రుల ప్రోత్సాహంతో కొనసాగిస్తున్ది మాత్రమే. ఇప్పటి వరకూ ఎన్ని రాసాను అన్నది ఖచ్చితం గా చెప్పలేను. అయినా 2015 నుండీ గజల్స్, ఫ్రీ వెర్సెస్, కొన్ని వృత్తాలు, పద్యాలు, కధలు, మ్యుజింగ్స్ లా వివిధ విషయాలపై నా భావాలు Fb లో టపా లు గా వ్రాస్తూనే వున్నాను.