ఆ నో భద్రాః క్రతవో యంతు విశ్వతః
(Let noble thoughts come to me from all directions)
సోషియో ఆంథ్రోపాలజీ పట్ల అమిత ఆసక్తి కలిగిన రశ్మి ఫ్రెండ్ ఎమిలీతో కలిసి పాయకరావుపేటలో ఉంటున్న నానమ్మ శారద ఇంటికి వచ్చింది. శారద మాథ్స్ టీచర్‌గానూ, ఆమె భర్త బ్యాంక్ మేనజర్గాను విశాఖపట్నంలో పనిచేసి రిటైర్ అయిపోయాక పాయకరావుపేటలోని పూర్వీకుల ఇల్లుకావలసిన మార్పులు చేయించుకుని, విశాఖ వదిలి వచ్చి ఆరేళ్లుగా తమ పొలాల్లో ఆర్గానిక్ ఫార్మింగ్ మొదలుపెట్టారు.
విశాఖలో ఇంటిని కూడా రెండు పోర్షన్స్‌గా మార్పులు చేసి ఒక పోర్షన్ తాము వెళ్ళినపుడు ఉండటానికి అన్నట్లు అన్నీ సౌకర్యాలతో సిద్ధంగా ఉంచుకుని రెండవదానిని భర్త పోయిన, పిల్లలు లేని తన చెల్లెలు రాజ్యం ఉండేందుకు ఇచ్చాడు శారద భర్త శంకరం. ఇక శారద ,శంకరం మేడ్ ఫర్ ఈచ్ అథర్ అన్నట్లు వుంటారు. వారికి ఇద్దరు కొడుకులు. ఇద్దరు అమెరికాలో డాక్టర్స్. అక్కడే స్థిరపడిపోయారని చెప్పవచ్చు. శారదా, భర్తా అప్పుడప్పుడు వెళ్ళి వస్తుంటారు.
రశ్మి వారి పెద్దకొడుకు శరత్ కూతురు. అమెరికాలో ఆంత్రోపాలోజికల్ స్టడీస్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. కొన్నాళ్ళు రిలాక్స్ అయి తరవాత ఏమి చెయ్యాలో ఆలోచిస్తాను అని నిర్ణయించుకుంది. వివిధప్రాంతాల్లో ప్రజల జీవితవిధానాలపట్ల ఉన్న ఆసక్తి కారణంగా ఆ రంగంలో
పరిశోధన చేయాలని ఆమె అభిలాష. కథలు, కవితలు రాస్తూ ఉంటుంది.
“ట్రైబల్ సొసైటీస్ ఎలా ఉంటాయో చూస్తాను” అని సరదాగా శంకరంతో అంటే, “రా! ఇక్కడ అరకు, లంబసింగిలాటి ఏజెన్సీ ఏరియాస్ వున్నాయి. చూద్దువుగాని” అన్నాడు శంకరం.
“అయితే నేనూ, నా ఫ్రెండ్ ఓ నెల ఉండటానికి వస్తాము” అని శంకరంకి చెప్పి వెంటనే తండ్రిని ఒప్పించి తన క్లోజ్‌ఫ్రెండ్, సహాధ్యాయి ఎమిలీతోసహా తాతగారింట్లో లాండ్ అయింది.
” మొదటిసారి నాన్నావాళ్ళతో కాక నేను ఒక్కదాన్నీ ,ఆఫ్‌కోర్సు మా ఫ్రెండ్‌కూడా ఉంటుందిలే, వస్తున్నాను. నెల్లాళ్ళు ఉంటాను నానమ్మా!ఎప్పుడూ ఇలా వచ్చి అలా వెళిపోతాం అని దెప్పుతావు కదా?” అంటూ వచ్చేముందు శారదకి ఫోన్ చేసింది రశ్మి.
“బావుందమ్మా! నాకోసం వస్తున్నావా? నన్ను అంటిపెట్టుకు వుంటావా? అరుకు, బరుకు అంటూ ముందే రోడ్డెక్కటానికి కాళ్ళలో చక్రాలు తగిలించుకు వస్తున్నావు కదా. నీకాలు ఒకచోట నిలుస్తుందా తల్లీ!” అంటూ మనవరాలిని ముదరకించింది శారద.
“అబ్బా! నిన్ను మాటల్లో గెలవలేంకానీ చూడు, ఈసారి నీమాట వింటూ ఎంత బుద్ధిగా వుంటానో. నువ్వే అంటావు చాలా మారిపోయావు అని నన్ను, నా తీరుని చూసి”అంది రశ్మి.
“సరేలే చూసి సర్టిఫై చేస్తానుగానీ నీక్కావాల్సిన మందులు, మాకులు అన్నీ పట్టుకురా. మళ్ళీ ఇక్కడ దొరకకపోతే ఇబ్బంది” అని బయలుదేరేముందు జాగర్త చెప్పింది.
“మనం ఎన్ని ఎంత పర్ఫెక్ట్గా చేసినా మా అమ్మకి పాఠం చెప్పటానికి, జాగర్త చెప్పటానికి ఏదో ఒకటి ఉండి తీరుతుంది. లాస్ట్ వర్డ్ ఆమెదే ఎప్పుడూ మా ఇంట్లో అంటారు నాన్న. నాన్న అన్నది నూటికి నూరుపాళ్ళు నిజం తల్లీ. నువ్వే కరెక్ట్. అయినా అన్నీ తెచ్చుకుని జాగర్తగా వస్తాను. ప్రామిస్. ఇప్పటికి ఈ సెషన్ ముగిద్దామా? నెల్లాళ్ళు ఎలాగో నీ పాలపడుతున్నా కదా, అప్పుడు విజృభించేద్దువు నీ ట్రైనింగ్ సెషన్స్‌తో, ప్రవచనాలతో” అంది అల్లరిగా నవ్వుతూ.
“చాల్లే! వేళాకోళం. మీ నాన్న మాటలకేం? అలాగే అంటాడు వాడు. టెంత్ పరీక్షకు వెళుతూ హాల్‌టికెట్ మరిచిపోయిన ఘనుడు వాడు. అక్కడ ఉన్నవాళ్ళకి వీడు నా కొడుకు అని తెలుసుకాబట్టి అది ఆఖరి పరీక్షకాబట్టి రాయనిచ్చారు. ముందుజాగర్త లేకపోతే తరవాత ఇబ్బందులు పడాలి. అందికే చెప్పాను… సరేనమ్మా, నాకు పని ఉంది. వెళతాను. జాగర్తగా రా!” అని మరోసారి జాగర్త చెప్పి మనవరాలి మాటలకి మురిపెంగా నవ్వుకుంటూ ఫోన్ పెట్టేసింది శారద.
శారద అన్నట్లే రశ్మి వచ్చిన దగ్గరనుండి మొదటి రెండురోజులు జెట్లాగ్ అని ఊరుకుందిగానీ తరవాతిరోజు రాత్రి డిన్నర్ దగ్గర “ఎలా చేయాలి, ఏమి చేయాలి చెప్పండి తాతయ్యా!” అని మొదలుపెట్టింది.
శంకరం తెలిసిన వారిద్వారా ఇద్దరు డ్రైవర్స్‌ని ముందే ఏర్పాటు చేసుకుని తన సెవెన్ సీటర్ టయోట ఇన్నోవా కార్ సర్వీసింగ్ చేయించి తిరగడానికి వీలుగా ఉంచాడు. లాంగ్ డిస్టెన్స్ తాను డ్రైవ్ చేయడు. అందుకే ముందు జాగర్తగా డ్రైవర్స్‌ని పెట్టాడు. ఒకరు మిస్ అయితే మరొకరు ఉంటారని ఇద్దరిని ఏర్పాటు చేశాడు. రశ్మితో అదే చెబుతూ “శారద పక్కనున్నాక ముందుజాగర్త పడకుండా వుండడమా ! టాప్ లేచిపోతుంది.” అని భార్యని ఆటపట్టించితే…
“చాల్లెండి. జాగర్తపడక లేనిపోని పాట్లు పడండి మీకంత సరదాగా ఉంటే”అంది తెచ్చి పెట్టుకున్న కోపంతో.
“అబ్బే శారద ఉండగా అలాంటి సరదానా? అంత ధైర్యం ఎప్పుడన్నా చేసానా!”అన్నాడు మళ్ళీ. కొంటెగా నవ్వుతూ.
“సరేలెండి సంబడం. నిజం అనుకోగలరు జనం. మీ సరదాలకేమి లోటొచ్చింది? ఆయన మాటలు నమ్మకమ్మా. మీ తాత ఓ రంగేళీరాజా” అంటూ నవ్వుతూనే కౌంటర్ ఇచ్చింది శారద.
రశ్మికి ఇదంతా చాలా వినోదంగా ఉంది. నానమ్మాతాతయ్యల ఛలోక్తులు, అన్ని పనులు కలిసిచేయటం. పద్ధతి ప్రకారం దినచర్య. ఇలా వత్తిడిలేని చాలా తక్కువ అవసరాలతో ప్రశాంతం జీవనం వారిది. ఇద్దరూ సోషల్ సర్వీస్ కూడా చేస్తున్నారు ఓ ఎన్జీఓలో చేరి. అసంతృప్తి అన్న మాట లేకుండా గడుపుతున్నారు జీవితాలు.
“మొదటి వారం ఆ చుట్టుపక్కల గుళ్ళు ,గోపురాలు అన్నీ తిరుగుదాం” అన్నాడు శంకరం.
“ఓకే తాతయ్యా! మీరే మా గైడ్. మా ఇంట్రెస్ట్స్ ఇవి” అని టకటకా వల్లించేసింది రశ్మి.
“రేపు శనివారం, ఏకాదశి. ముందు అన్నవరం సత్యనారాయణస్వామివారి దర్శనం చేసుకుందాం” అంది శారద.
“సరే అంటే సరే”అనుకున్నారు.
“ఉదయం అయిదుగంటలకల్లా కొండమీద ఉండాలి” అని శారద ఆర్డర్.
“శారద టైం అంటే టైమే. తను చెప్పినట్లు చేసేయ్. టైం వేస్ట్ అవదు.” అని రశ్మికి చెప్పాడు శంకరం.
“ఓకే తాతయ్యా!” అంది రశ్మి.
వీలయినంత వరకు అందరూ ఇంగ్లీష్‌లో మాట్లాడటం, తెలుగులో మాట్లాడినవి ఎమిలీకి ఇంగ్లీష్‌లోకి తర్జుమా చేసి చెప్పటం రశ్మికి అదనపు పని అయినా రశ్మి, ఎమిలీ “శారద, శంకరం ల కంపెనీ చక్కగా ఎంజాయ్ చేస్తున్నాం కదా!” అని అనుకుని లేచారు అక్కడి నుండి.
అన్నట్లే మర్నాడు నాలుగు గంటలకు రశ్మిని లేపి “తయారవండి” అని చెప్పింది శారద. వాళ్ళు స్నానం చేసి రాగానే చక్కని ఫిల్టర్‌కాఫీ ఇచ్చి బయలు దేరమంది. అయిదుగంటలకల్లా అన్నవరంకొండమీదకి చేరుకున్నారు. శనివారం, ఏకాదశి కావటంవలన జనం ఎక్కువగానే వున్నారు కొండ మీద. శంకరం, డ్రైవర్ వెళ్ళి వ్రతానికి టికెట్స్ తీసుకువచ్చారు. వాళ్ళు వచ్చాక అంతా కలిసి వెళ్ళి వ్రతం చేసుకుని దర్శనం పూర్తిచేసుకు వచ్చేసరికి ఎనిమిదిగంటలయింది. తిరుగుప్రయాణంలో కొండ దిగేటపుడు దారిలో కనిపించే ప్రకృతిని పూర్తిగా ఆస్వాదించారు రశ్మి, ఎమిలీ.
ఇంటికి వచ్చి రిఫ్రెష్ అయి వచ్చేసరికి వేడిగా ఇడ్లీ, కొబ్బరి చట్నీ ,సాంబార్, కారప్పొడి బ్రేక్‌ఫాస్ట్ పెట్టింది.
“ఇవన్నీ ఎప్పుడు చేశారు నానమ్మా? మాతోనే వున్నారు కదా!” అని ఎమిలీ ఆశ్చర్యపోయింది.
“మా నానమ్మ తను పడుకోదు. దేముడిని కూడా పడుకోనీయదులే”
“అంటే…?” ఎమిలీ ఆశ్చర్యం.
“చాల్లే! పని పెట్టుకున్నాక పడుకుంటే ఎలా? పడుకోవడానికి సమయం సందర్భం ఉండాలి” అని సన్నగా మందలించింది రశ్మిని శారద.
“ఈరోజు పాఠాలు మొదలయ్యాయి” అని నవ్వేసింది రశ్మి. ఎమిలీ కూడా జత కలిపింది.
“నిన్ను మరీ గడుగ్గాయిలా పెంచాడు మీ నాన్న. క్షణం నోరుముయ్యవు కదా!” అని నవ్వి “ఈ రోజుకి ఈ ట్రిప్ చాలుగానీ రేపుగురించి లంచ్ అయాకా ఆలోచిద్దాం. మీకంత రష్ , ఆ రకం కార్యక్రమాలు అలవాటు ఉండవు కదా, కాస్త రిలాక్స్ అవండి” అని కిచెన్‌లోకి నడిచింది శారద.
లంచ్‌కి అంతా కూర్చున్నప్పుడు శారద కూర్చోకపోవటం చూసి “మీరు లంచ్ చేయరా?”అని అడిగింది ఎమిలీ.
“ఈరోజు ఏకాదశి కదా, నేను ఉపవాసం. భోజనం చేయను అంది” శారద.
“అయ్యో ! మీరేమీ తినకుండా మా అందరికోసం అన్నీ చేస్తున్నారా ?” అన్న ఎమిలీతో-
“మా నానమ్మ ఏదో కారణం చెప్పి ఉపవాసాలు చేస్తూంటుంది. ఆరోగ్యం పాడవుతుంది అంటే వినిపించుకోదు” అంది రశ్మి.
దానికి శారద “ఉపవాసం చేస్తే ఆరోగ్యం పాడవుతుంది అని ఎవరు చెప్పారు. ఒక పద్ధతి ప్రకారం ఉపవాసాలు చేస్తే ఆరోగ్యం బావుంటుంది అనే
ఈ ఉపవాసాలు, పద్ధతులు ఏర్పరిచారు మన పూర్వీకులు” అంది.
“ఓయ్!ఓయ్! ఉపవాసాలు చేస్తే ఆరోగ్యమట. ఇక తినటం మానేస్తే సరి. ప్రపంచంలో ఆహారసమస్య తీరిపోతుంది”అంటూ నవ్వుతున్న రశ్మితో-
“నవ్వులాట కాదు. నిజమే. అయినా 2016లో ఫిజియోలజీ అండ్ మెడిసిన్‌లో నోబెల్‌ప్రైజ్ దేనికిచ్చారో ఓసారి చెప్పి అప్పుడు నవ్వు” అంది శారద.
“అబ్బా! ఒప్పుకున్నాను. అవన్నీ నేను అంతగా ఫాలో అవలేదు. అదేమిటో నువ్వే చెప్పు” అంది రశ్మి.
“అలా చెప్పు. నాకు తెలియదు నువ్వు వివరంగా చెప్పు అనటం బుద్ధిమంతుల లక్షణం. నిజం ఏమిటో తెలుసుకోకుండా ఆటపట్టించడం పరిణితిలేనితనం. ఇక విను”అని మొదలు పెట్టింది.
“అగ్రీడ్. చెప్పు” అన్నట్లు తల ఆడించింది రశ్మి.
“నెలకి రెండు ఏకాదశిలు వస్తాయి. ఆరోజు నిర్జల ఏకాదశి అని పచ్చిమంచినీళ్ళు ముట్టుకోకుండా, నిరాహారంగా అంటే ఏమీ తినకుండా ఉండి ద్వాదశి ఘడియలు వచ్చిన తరువాత మాత్రమే తినటం అంటే పారణ చేయటం అనేది మన సనాతనధర్మంలో అనాదిగా ఉన్నదే. అలాగే అనేకమతాలలో కూడా ఉపవాసాలు చేయటం మనకు అనుభవమే కదా? ఆయుర్వేదం ప్రకారం ఉపవాసం చేయటం శరీరంలో మలినాలను తొలగించుకోవటంకోసం. మనకు అనేక దేహసంబంధ సమస్యలు శరీరంలో విషపదార్ధాలు పేరుకుపోవటం వలన కలుగుతాయి. ఉపవాసంతో ఆ మలినాలను తొలగించుకుని తర్వాత నాణ్యమైన ,పోషకాలతో కూడిన ఆహారం తీసుకోవడంద్వారా మన శరీరాన్ని తాజాగా ఆరోగ్యంగా వుంచుకోవచ్చు అని చెబుతారు ఆయుర్వేద వైద్యులు. అందికే ’లంఖణం పరమౌషధం అన్న నానుడి వచ్చింది”
“…”
“ఇక ఉపవాసం చేయటంవలన కలిగే ముఖ్యమైన ఉపయోగం జీర్ణక్రియకు తగినంత విశ్రాంతి లభించి అజీర్ణంవంటి సమస్యలు తొలగిపోయి జీర్ణవ్యవస్థ కొత్తశక్తితో చక్కగా సమర్ధవంతంగా పనిచేస్తుంది అనేది అందరూ ఆమోదించిన విషయమే. ఈభావాన్ని తిరుగులేకుండా సశాస్త్రీయంగా బలపరచే ఘటన 2016లో జపాన్ శాస్త్రవేత్త యోషినోరి ఒశుమీకి ఆటోఫేజి అంటే కణాల స్వయంభక్షకత్వం అనే అంశంమీద చేసిన పరిశోధనలకుగాను ఫిజియోలజీ అండ్ మెడిసిన్ విభాగంలో నోబెల్ బహుమతి రావటం అసలు విషయం. ఆటోఫేజి అంటే ఏమిటో తెలుసా? కొత్త, ఆరోగ్యకరమైన కణజాలాలను పునఃసృష్టించుకోవటంకోసం శరీరం తనలోని వ్యర్ధకణాలను తనంత తానే నిర్మూలించుకుని తనను తాను శుభ్రపరచుకోవటం. ఈ ఆటోఫేజి ప్రక్రియ ఉపవాసంచేయటంవలన అంటే నిరాహారంగా ఉండటంవలన శరీరంలో మొదలు అవుతుంది. అందికే పదిహేనురోజులకు ఒకసారి ఉపవాసం చేయటం మంచిది అని సైన్సుకూడా చెబుతోంది. మన సంప్రదాయాల్లో కూడా ఈ నిర్జలం, నిరాహారంగా వుండే విధానాలు ఎప్పటినుండో అనుసరిస్తున్నారు అనేది ముందే అనుకున్నాం కదా?”
“…”
“ప్రతి ఏకాదశికి ఉపవాసం, వారానికి ఓరోజు ఒంటిపొద్దు చేయటం ఆరోగ్యానికి మంచిది. అలా ఉపవాసంచేయటం కాసేపు దైవస్మరణ లేదా ధ్యానం చేయటం వలన శారీరిక, మానసిక ఆరోగ్యాలు పొందుతారు. అందరూ అలా పద్ధతి ప్రకారం ఉపవాసాలు చేస్తే మరెందరో తిండి దొరకనివారికోసం మనం ఆహారం మిగల్చగలుగుతాము. మా చిన్నపుడు మన మాజీప్రధాని లాల్‌బహదూర్ శాస్త్రి ప్రతి సోమవారం రాత్రి భోజనం మానేయమంటే మా ఇంట్లో పిల్లల దగ్గరనుండీ అందరం సోమవారం రాత్రి భోజనం మానేసాము. ఆరకంగా మనం ఉపవాసాలవలన స్వకార్యం, స్వామికార్యం రెండూ చేయగలుగుతాం” అని ఆగింది శారద.
“ఏమిటోయ్. గుక్క తిప్పుకోకుండా పాఠం చెప్పేస్తున్నావ్ వాళ్ళకి” అంటూ శంకరం రావటంతో-
“లేదు తాతయ్యా! నానమ్మ చాలా ఆసక్తికరమైన అంశాలు చెబుతున్నారు. శాస్త్రవిజ్ఞానాన్ని, సంప్రదాయాన్ని సమన్వయం చేస్తూ ఉపవాసాలగురించి వివరంగా చెబుతున్నారు. చెప్పండి నానమ్మా!” అంది ఎమిలీ ఎంతో ఆసక్తిగా.
“అబ్బే, అంత సమన్వయం చేసేంత సామర్ధ్యమూ లేదు, నేనెప్పుడూ లోతైన అధ్యయనమూ చేయలేదు కానీ ఏదో విన్నవీ, కన్నవీ జతచేసి మీతో కలబోసుకుంటున్నాను అమ్మా ! అయితే ఒకటి శాస్త్రమైనా, సంప్రదాయమైనా తన హితం, జనహితం ఏదో దాన్ని అర్ధం చేసుకు ఆచరించాలి అనే తత్వం ముఖ్యం బాధ్యత గల పౌరులుగా అందరికీ. ఈమధ్య కరోనా వ్యాప్తి నేపధ్యంలో చేతులు జోడించి నమస్కారం పెట్టటం, గ్లాసును ఎత్తి పట్టి పెదాలకు తాకించకుండా నీళ్లు తాగమనడం, చేతులు కడుక్కోమనటం, భౌతికదూరం పాటించమనటం ఇలా ఎన్నో సంప్రదాయబద్ధమైన విధానాలను మళ్ళీ ఆచరణలోకి తీసుకురావటం జరిగిందికదా, వాటి వెనక ఉన్న శాస్త్రపరమైన అంశాలు-అన్నీ వేదాల్లో ఉన్నాయిష- అని హేళనచేసి కొట్టిపారేయవలసిన అంశాలు కాదని అర్ధం అయిందికదా? మొత్తంగా పాత, కొత్త, సైన్స్, సంప్రదాయం అని కాక ఏది మంచి అనేది తెలుసుకుని , జనాళికి ఉపయోగపడేది ఏది అయినా ఆచరించాలి అని అవగతమైందిగా?” అంది శారద వుద్విగ్నంగా.
“మన మనసులు ముడుచుకోక పూర్తిగా తెరుచుకుని ఆ నో భద్రాః క్రతవో యంతు విశ్వతః అన్న ఋగ్వేదవాక్యంలో చెప్పినట్లు ఉత్కృష్టమైన భావనలు అన్నివైపులనుండి నాలో ప్రవేశించుగాక అనుకుంటూ ప్రతి మనిషి తన వంతు తాను చేయగలిగే సంస్కారం పెంపొందించుకుంటే చాలు, మిగిలినవి అన్నీ అవే గాడిలో పడతాయి” అంది తనే మళ్ళీ.
భోజనాలు పూర్తి అవటంతో “మీరెళ్ళి రెస్ట్ తీసుకోండి. తరవాత కార్యక్రమం టీలు ఆయాకా ఆలోచిద్దాం” అనడంతో రశ్మి, ఎమిలీ వాళ్ళ
రూమ్‌కి వెళిపోయారు.
ఎమిలీ “భారతదేశం వేదభూమి, సంప్రదాయబద్ధం అంటే ఏమిటో అనుకున్నాను. ఈ రోజు సనాతనధర్మం, వేదసంబంధిత విషయాలు తన ప్రతిచర్యలో, మాటలో ప్రతిబింబించటం నానమ్మలో ప్రత్యక్షంగా చూసాను. ఆమెను కలవగలగటం నా అదృష్టం. థాంక్స్ ఏ లాట్ రశ్మీ. లవ్ యు డియర్ ఫర్ మేకింగ్ మీ విజిట్ థిస్ గ్రేట్ ల్యాండ్, ఇండియా. ఇట్స్ గోయింగ్ టు బీ ఏ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ ఫ్రూట్‌ఫుల్ ట్రిప్ ఫర్ మీ. లవ్ యూ డియర్” అంది పెల్లుబుకుతున్న ఉత్సాహంతో.
“థాంక్ గాడ్. నీకెలా అనిపిస్తుందో ఈ వాతావరణం, ఇక్కడి తీరుతెన్నులు అని భయ పడ్డాను. నువ్విదంతా ఎంజాయ్ చేస్తున్నావు అంటే నాకదే పెద్ద రిలీఫ్ డియర్” అంది రశ్మి పెద్దబరువు ఏదో దించుకున్నపుడు కలిగిన భావనతో.
నా పేరు ఆయాపిళ్ళ సావిత్రి. జననం 1955. పుట్టింది అనకాపల్లి, ఆంధ్ర ప్రదేశ్ లో. తల్లితండ్రులు.. లేట్ గంటి వెంకట రమణయ్య,సుందరమ్మ. భర్త.. లేట్ A.V.Ramana Rao.విద్యార్హతలు: MSc physic s, Mphil, PG Dip Electronics ఉద్యోగం: విశాఖపట్నం AVN కళాశాలలో భౌతికశాస్త్ర విభాగంలో విభాగఅధిపతిగా చేసి.2013 లో రిటైర్ ఆయాను. కధలు, కవితలు రాయటం సరదా.కొన్ని ప్రచురింపబడ్డా అవి ఏవీ సేకరించి పెట్టుకోలేదు.అసలు ప్రచురణకి పంపటమే చాలా తక్కువ. రిటైర్ అయాకా ఈ fb లోకి వచ్చాకా ఏదో రాసి మన గోడ మీద పెట్టటం మొదలుపెట్టాను. ఆ రకం గా నా వ్రాతలు ఎక్కువగా fb లో పెట్టినవే అయ్యాయి.ఇది సరదాగా ఎంచుకున్నది. మిత్రుల ప్రోత్సాహంతో కొనసాగిస్తున్ది మాత్రమే. ఇప్పటి వరకూ ఎన్ని రాసాను అన్నది ఖచ్చితం గా చెప్పలేను. అయినా 2015 నుండీ గజల్స్, ఫ్రీ వెర్సెస్, కొన్ని వృత్తాలు, పద్యాలు, కధలు, మ్యుజింగ్స్ లా వివిధ విషయాలపై నా భావాలు Fb లో టపా లు గా వ్రాస్తూనే వున్నాను.