యద్భావం తద్భవతి by Pathy Muralidhara Sharma

  1. నీల by Nandu Kusinerla
  2. ఫ్రిజ్ లోకి ఏం వండనూ!!! by Savitri Ramanarao
  3. ఆధునిక కవితోపాఖ్యానం by Savitri Ramanarao
  4. దానం కొద్దీ…! by Nandu Kusinerla
  5. కర్మణ్యేవాధికారస్తే!!!… by Savitri Ramanarao
  6. బలిపశువు by Pathy Muralidhara Sharma
  7. వైద్యంలో వేద్యం by Savitri Ramanarao
  8. నేనూ మనిషినే by Pathy Muralidhara Sharma
  9. చిన్న కుటుంబ చిత్రం by Savitri Ramanarao
  10. ఒక్క క్షణం by Pathy Muralidhara Sharma
  11. ఎందుకు రాదూ!! By Savitri Ramanarao
  12. యద్భావం తద్భవతి by Pathy Muralidhara Sharma
  13. అలా అర్థమైందా? by Pathy Muralidhara Sharma
  14. మనసు మూయకు!!! by Savitri Ramanarao
  15. ఎవరికెవరు ఏమవుతారో! by Pathy Muralidhara Sharma
  16. కాస్త సహనం వహిస్తే by Savitri Ramanarao
  17. అమ్మ దయ ఉంటే… by Savitri Ramanarao
  18. మై హుం నా బెహన్! by Savitri Ramanarao

మా ఇంటి ప్రక్కనే గోపాలరావు ఇల్లు. గోపాలరావూ,నేనూ స్నేహితులం. స్నేహితులం అనేకంటే ఒకే ఆఫీసులో పని చేస్తున్నవాళ్ళం అనొచ్చు. గోపాలరావు రెండు పోర్షన్ల ఇల్లు కట్టేడు. ఒకటి తను ఉండడానికీ, రెండవది అద్దెకివ్వడానికీ. కాని అద్దెకొచ్చిన వాళ్లందరిలో ఏదో లోపం వెదికి చూసి ఇల్లు అద్దెకివ్వడానికి సంకోచించేవాడు. అలా అద్దెకు వచ్చేవాళ్ళు రావడం, గోపాలరావు తటపటాయించడం జరిగేవి.
ఓసారి ఓ కుటుంబం వచ్చింది అద్దెకు.
“అన్ని విధాలా బాగుంది కదా ! ఆ కుటుంబం మంచిదే కదా ! మరెందుకు కాదన్నారు ? ” అని గోపాలరావును అడిగేను.
“చూడండి ఈశ్వరరావుగారూ ! అన్నీ బాగున్నాయి కానీ వాళ్ళ కుటుంబంలో ఓ పండుముసలమ్మ ఉందటండీ. అతని తల్లట. ముసలివాళ్ళుంటే ఎప్పుడూ ఏదో రోగమూ, రొష్టూ. ఆ తర్వాత హరీమనడం. ఇంత ఇల్లు కట్టి ఇంట్లో ఒకవేళ అలాంటి అశుభం జరుగుతుందేమోనని వాళ్లకు ఇల్లు అద్దెకివ్వలేదు” అని చెప్పేడు గోపాలరావు.
దానికి నేను ” కుటుంబం అన్న తర్వాత తల్లీ, తండ్రీ ముసలాళ్ళు కాకుండా ఎలా ఉంటారు? రేపు మనమూ అంతే కదండీ. మనందరికీ కూడా ఎప్పుడో ఒకప్పుడు ఆ గతి పట్టక తప్పదు. పుట్టినవాళ్ళందరూ చావకుండా ఉంటారా చెప్పండి. ” అని గోపాలరావుకు సర్దిచెప్పి ఆ కుటుంబానికి అతని ఇల్లు అద్దెకిప్పించేను. అద్దెకు ఇల్లు దొరకని వాళ్ళకో ఉడత సాయం చేసేనన్న సంతృప్తితో సంతోషిస్తూ.
ఓ రెండు రోజుల తర్వాత ఉదయం పక్కమీదనుండి లేచేసరికి గోపాలరావు ఇంట్లోంచి ఏడుపులు వినపడ్డాయి. వెంటనే అటు పరుగెత్తేను. నా మనసేదో కీడు శంకించింది. ఒకవేళ గోపాలరావు అన్నట్టు అద్దెకు దిగిన వాళ్ళ ముసలమ్మగాని పోయిందేమోనని. కానీ అక్కడకు వెళ్ళేక తెలిసిందేమిటంటే గోపాలరావు అమ్మగారు తెల్లవారుజామున గుండెపోటు వఛ్చి చనిపోయేరని. అప్పుడనిపించింది ” యద్భావం తద్భవతి ” అని ఊరికే అనలేదు పెద్దలు అని. అద్దెకు దిగిన బామ్మగారు మాత్రం ఎంచక్కా ఉన్నారు.
ఇంతకీ ఫలశృతి ఏమిటంటే గోపాలరావుగారి అమ్మగారు పోయిన తిథీ, వార, నక్షత్రాలు మంచివి కావని తెలిసి అద్దెకు దిగిన వాళ్ళు కాస్తా ఖాళీ చేసి వెళ్ళిపోయేరు. గోపాలరావుకు కూడా ఇల్లు విడిచిపెట్టక తప్పదని తెలిసి అద్దెకు ఇంటికోసం వేటలో పడ్డాడు. మరి ఆయనకు ఇల్లు అద్దెకు ఇచ్చేవాళ్ళు ఎన్ని ఆలోచించాలో ? అందుకే పోనీలే పాపం అని మా ఇంట్లో ఉన్న ఓ చిన్న పోర్షన్ ఖాళీ చేసి గోపాలరావుకు అద్దెకిచ్చేను తాత్కాలికంగా. మన మనసులో ఎలాంటి భావన ఉంటే అలాంటి ఫలితాలే కనబడతాయని గోపాలరావుకు అనుభవంలోకి వచ్చింది.
(“స్వప్న” జూలై 2011 మాసపత్రికలో ప్రచురితమైంది. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రంలో26.02.1988న ప్రసారితమైంది.)