లాటరీ by S Sridevi

  1. పాతకాలపు మనిషి by S Sridevi
  2. ఒలీవియా by S Sridevi
  3. నాకొద్దీ అభ్యుదయం by S Sridevi
  4. అర్హత by S Sridevi
  5. సింధూరి by S Sridevi
  6. మలుపు by S Sridevi
  7. యంత్రసేవ by S Sridevi
  8. ప్లాస్మా జీవులు by S Sridevi
  9. మనుషులిచ్చిన శాపం by S Sridevi
  10. వంకరగీత by S Sridevi
  11. బంధీ by S Sridevi
  12. లాటరీ by S Sridevi
  13. ముల్లు by S Sridevi
  14. లే ఆఫ్ by S Sridevi
  15. నేను విసిరిన బంతి by S Sridevi
  16. మలివసంతం by S Sridevi
  17. తప్పనిసరిగా by S Sridevi
  18. ప్రేమరాహిత్యం by S Sridevi
  19. పార్థివం by S Sridevi
  20. ఖైదీ by S Sridevi

Youtubers please WhatsApp to 7382342850

” ఔన్రా ! మనకి కంప్యూటర్లంటే ఏంటో తెలీదు. పెద్దగా చదువుకోలేదు. మెట్రిక్కుగాళ్ళం. అయినంత మాత్రాన ఉద్యోగాల్లోంచీ తీసేస్తారా?” పాతతరానికి చెందిన రాజమౌళి ప్రశ్నే కొద్దిగా మారి తన కొడుకు నుంచి కూడా వస్తుందని వెంకట్రావు అనుకోలేదు ఆ క్షణాన. రాజమౌళి అలా అడగటానికి కారణం వాళ్ల డిపార్ట్మెంట్‍ని ఆధునీకరణ చేసి కంప్యూటర్లు ఇచ్చారు. కంప్యూటర్లు వచ్చాయి కాబట్టి పని తగ్గి సిబ్బంది ఎక్కువయ్యారని యాజమాన్యం నిర్ణయానికి వచ్చి వీఆర్ఎస్ ప్రకటించింది. ఎన్నో ఉద్యోగాల మీద వేటు పడబోతోంది. అంతా గొడవ గొడవగా మాట్లాడుకుంటున్నారు. అన్ని గొంతుల మధ్య నుంచి రాజమౌళి ప్రశ్న ప్రస్ఫుటంగా వినవచ్చి వెంకట్రావు చెవుల్ని తాకింది. అదింకా అతని మనసును చేరలేదు.
వెంకట్రావు ఉద్యోగంమీదకూడా విఆర్‍ఎస్ ప్రభావం ఉంటుంది. అది రెండు రకాలుగా ఉండొచ్చు. కంప్యూటర్‍హ్యాండ్ కాదు కాబట్టి ఉద్యోగం పోవచ్చు. అలా కాకపోతే ముగ్గురు నలుగురి పని ఒక్కడే చేయాల్సిరావచ్చు. అప్పటిదాకా టర్ను ద పేజ్ అండ్ లెర్న్ ద వర్క్ తరహాలో నడిచిన పనికి తెలివితేటలు అవసరం కావచ్చు.
జీవనానికి మూలాధారమైన ఉద్యోగం పోతుందన్న బాధ, ఉద్యోగం పోయిన తర్వాత జీవితం ఎలా నడుస్తుందోననే భయం ఎంత తీవ్రంగా కలిగినా, దాదాపు ఇరవై ఏళ్లుగా ఇనప చట్రంలా తనని బిగించి ఉంచి ఎటూ ఏ విధంగానూ ఎదగడానికి అవకాశం లేకుండా చేసిన ఈ ఉద్యోగం వదిలిపోతున్నందుకు అతనికి లోలోపల అనిర్వచనీయమైన సంతోషం కూడా కలిగింది.
అతనికి ఆలోచన ఉంది. ఆలోచన మనిషిని సుఖపడనివ్వదు. అందరికీ భిన్నంగా ఉండే దారిలోకి తోస్తుంది. అందరూ ఒప్పుకున్న విషయాలను అతనంత తేలిగ్గా ఒప్పుకోడు. ప్రకృతిలో స్వేచ్ఛగా తిరుగుతూ అందరూ అన్నీ అనుభవించగలిగే స్థాయినుంచీ స్వేచ్ఛా స్వాతంత్ర్యాల పరిధిని కుదించుకుని తనకి నచ్చని జీవనశైలిలో మరొకరి అవసరాలకి అనుగుణంగా బతకడాన్ని నాగరికతని ఎలా అంటారో అతనికి ఒక్కనాటికీ అర్థమవదు.
వెంకట్రావు, అతని మేనేజరు ఒకే రోజుని ఉద్యోగంలో చేరారు. మేనేజర్‍కి మూడుసార్లు ప్రమోషన్ వచ్చింది. అధికార పరిధి విస్తరించింది. పదేళ్ల ప్రమోషనూ, ఇరవయ్యేళ్ల ప్రమోషనూ తీసుకున్నాక కూడా వెంకట్రావుమాత్రం గుమస్తాగానే పిలవబడుతున్నాడు. జీతంలో పెద్దగా మార్పులేదు. అదే పని. అదే జవాబుదారీతనం. జీవితమన్నా ,ఉద్యోగమన్నా విరక్తి పెరిగింది. అందుకే ఈ వీఆర్ఎస్ ఆర్డర్స్‌గాని ఉద్యోగసంఘనాయకులు ఇచ్చిన సమ్మె తాకీదుగాని పెద్దగా కదల్చలేదు.
” ఏంట్రా వెంకట్, మాట్లాడవు? ఉన్న ఉద్యోగం కాస్తా పోతే ఎలా?” రాజమౌళి రెట్టించి అడిగాడు.
నిర్వేదంగా నవ్వాడతను.” ఉద్యోగం ఉండటానికీ పోవటానికీ పెద్దగా తేడా నాకు కనిపించడం లేదు. చావకుండా ఇంత తిండి పెడుతోంది. అంతేగా?”
” అది కూడా లేకపోతే ఎలా? బాధ్యతలో?”
” ఉద్యోగం చేసి ఎంత కూడబెట్టావేమిటి? జీతంలో బాధ్యతలు తీరుతాయటున్నావు?” వెంకట్రావు గొంతులో స్వల్పంగా వ్యంగ్యం.
రాజమౌళి చిన్నబుచ్చుకున్నాడు. ” ఉద్యోగం ఉందంటే కనీసం ఎవరైనా అప్పిస్తారు. చీటీలు పాడితే షూరిటీ ఇస్తారు” అన్నాడు.
వెంకట్రావు నవ్వేసాడు. “కోపం తెచ్చుకోకు, నాకూ అగమ్యగోచరంగానే ఉంది. అసలీ ఉద్యోగంలో ఇరుక్కున్నప్పటినుంచీ ఇలాగే ఉంది. అందుకే ఇప్పుడు కొత్తగా ఏమీ అనిపించడం లేదు. చేతికొచ్చే బొటాబొటి జీతంతో ఇద్దరు పిల్లలు చదువు, ఆడపిల్ల పెళ్లి ఎలాగా అని రోజూ చర్చించుకుని, ఎన్నో పథకాలు రచించి రచించి అలిసిపోయాము నేనూ నా భార్యా. ఏదెలా రాసిపెట్టి ఉంటే అలాగే జరుగుతుంది, మా చేతుల్లో ఏదీ లేదనే నిర్ణయానికి వచ్చాం” అన్నాడు.
వెనకాల ఎలాంటి ఆస్తులుగానీ అండగానీ లేకుండా కేవలం ఉద్యోగం మీదే ఆధారపడి బ్రతకడం ఆయుధాలు లేకుండా యుద్ధంలోకి దిగడంలాంటిది. రాజమౌళి నిట్టూర్చాడు. బతుకు భారం భగవంతుడి మీద వేసి బతకడం ఈ దేశపు సంస్కృతి ప్రతివాడికి నేర్పింది. కానీ పాపం పెరిగిపోతున్న ఈ రోజుల్లో ఏ దేవుడు మాత్రం ఎంత భారాన్ని మోయగలడు?
” ఈ వేళ ఇంటర్మీడియట్ ఫలితాలటగా?” రాజమౌళి మాట మార్చాడు.
వెంకట్రావు తలూపాడు. “మూడింటికి ఇంటర్నెట్లో వస్తాయి”.
“నీ కొడుకు?”
” బాగానే రాశానన్నాడు”
” బిట్స్‌లో వస్తుందా?”
” రావాలనేగా, రెసిడెన్షియల్ కాలేజీలో వేశాను? రంగారావు దగ్గర చీటీ సగానికే పాడి తీసుకోలేదా?”
” ఏమో! ఏం చదువులో,మనని ఆర్పేస్తున్నాయి”
” వాడిమీదే నా ఆశలన్నీ. బిట్స్‌లోనైతే క్యాంపస్ ఇంటర్వ్యూలు ఉంటాయి. అందులో వాడు నెగ్గుకు రాగలిగితే నేను వడ్డుని పడ్డట్టే. అలా కాకపోతే మళ్లీ ఎంసెట్ అనీ అదనీ, ఇదనీ ఎంట్రెన్స్‌లు తడిపి మోపెడంత ఖర్చు. అదీకాక నువ్వేం చదివావు అనేదానికన్నా ఎక్కడ చదివావు అనేది ముఖ్యం ఈ రోజుల్లో”.
వెంకట్రావు కొడుకుమీద పెట్టుకున్న ఆశలు తలుచుకుంటే కొద్దిగా భయం కలిగింది రాజమౌళికి. తల్లిదండ్రులు పిల్లలనుంచీ ఎప్పుడూ అతిగానే ఆశిస్తూ ఉంటారు. పదిమంది పిల్లల్ని కని వాళ్లందరికీ దారి చూపించాల్సిన బాధ్యత తల మీద వేసాడు తన తండ్రి. కొడుకు పెద్ద చదువు చదివి, డబ్బు యంత్రంగా మారి గట్టెక్కించాలని చూస్తున్నాడు వెంకట్రావు. ఎక్కడో అపశృతి.
ఆఫీస్ అయ్యాక ఇంటర్నెట్ సెంటర్‍కేసి నడిచాడు వెంకట్రావు. అప్పటికే ఫలితాలు వచ్చేసాయి. ప్రతిచోటా ఈగల్లా ముసిరి వున్నారు పిల్లలు. కొడుకుకూడా అలాంటి గుంపులోనే ఎక్కడో ఉంటాడనిపించి, తన ప్రయత్నాన్ని విరమించుకుని ఇల్లు చేరాడు. అతను వచ్చిన పది నిమిషాలకే ఫలితాలు చూసుకుని ప్రసేన్ వచ్చాడు. ఆ కుర్రాడి ముఖంలో సంతోషం ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. ఏదో అద్భుతాన్ని చూసినట్టు ఉన్నాడు.
” ఎనభయ్యేడు శాతం నాన్నా!” అన్నాడు గట్టిగా.
వెంకట్రావు ఆశించినది ఆ మార్కులు కాదు. అందుకే కొడుకు మాటల్ని తను సరిగ్గా విన్నాడో లేదోననే అనుమానం వచ్చింది. ఇంతలోకే కళ్యాణి లోపల్నుంచి అందుకుంది.
” ఎనభయ్యేడు శాతమా? సరిగ్గానే చూసుకున్నావా? చెప్పడానికి సిగ్గుగా లేదా? ఏడాదికి యాభయ్యేసివేలు. .. మా శక్తికి మించినదైనా మంచి కాలేజీలో వేసాము… చదివావా అసలు ?లేక జల్సా చేసి వచ్చావా?” అంది ఆగ్రహంగా.
ప్రసేన్ ముఖంలోని ఆనందం ఉఫ్ మని ఆరిపోయింది. వచ్చిన మార్కులు తనకి గొప్ప. కానీ వాళ్లు పడిన కష్టానికవి సరిపోవు.
” బిట్స్ పిలానీలో వస్తుందనుకున్నాను. చెత్త మార్కులు వచ్చేయి. ఇంటరే ఇలా వెలగబెడ్తే ఎంట్రెన్సు పరీక్షలు ఎలా రాస్తావు? ఎంసెట్లో ఏ చెత్త ర్యాంకో వస్తే ఇంకే చెత్త కాలేజీలోనో వాడిచ్చే పరమ చెత్త సీటు తీసుకుని వెలగబెట్టాల్సిందే!” వెంకట్రావు మండిపడ్డాడు.
” దానికి కూడా బోల్డన్ని ఫీజులు. ఇంతా చదివిస్తే ఉద్యోగం వస్తుందో రాదో తెలియదు. ఎందర్ని చూడడం లేదు, నాలుగేళ్లూ చదివి రోడ్లు సర్వే చేస్తున్నవాళ్ళని?” అంది కళ్యాణి.
ఇద్దరికీ అపనమ్మకంగా ఉంది, ప్రసేన్‍కింత తక్కువ మార్కులు వచ్చాయంటే. రెసిడెన్షియల్లో వేసాం, మిగిలిన మార్కులు ఎలా ఉన్నా ఇంటర్లో బాగా వస్తాయని ఆశించారు. ఇద్దరూ ఒకరి తర్వాత ఒకరు నిర్విరామంగా తిడుతూనే ఉన్నారు. తమ అసంతృప్తినీ, ఆశాభంగాన్నీ ప్రకటిస్తున్నారు. కొద్దిసేపు అలాగే నిలబడి, అక్కడినుంచి వచ్చేసాడు. వెనకే వెళ్ళింది రేణు.
” ఇలా చేసావేంట్రా తమ్ముడూ?” అంది తన వంతుగా.
” ఏం చేశాను?” కస్సుమన్నాడు ప్రసేన్ అప్పటికి ఊపిరిపీల్చుకుని.
” నీకు మంచి మార్కులు వస్తాయని ఎంతో ఆశపడ్డారు నాన్నగారు” అంది.
అందులో ఇంకా ఎన్నో భావాలు. అమ్మానాన్నల ఆకాంక్షలని అర్థం చేసుకో లేదన్న మందలింపు, అతడు పెద్ద చదువు చదివి మంచిజీతంతో ఉద్యోగం చేస్తే తనకి తండ్రి పెద్ద సంబంధం తేగలిగేవాడన్న స్పృహ నరనరాన ఇంకి , అసహనం. .. ఇప్పుడు ఎలాగన్న నిస్పృహ.
గెలుపుని గుర్తించకపోవటం ఓటమికన్నా ఘోరమైనది. ప్రసేన్‍కి ఇది చాలా గొప్ప విజయం. ఆ విషయం ఇంట్లోవాళ్లకి ఎందుకు అర్థంకావటంలేదో అతనికి తెలియడం లేదు. ఉక్రోషంతో ఉడికిపోతూ పెద్దగా అరిచాడు.
” ఏం మాట్లాడుతున్నారే మీరు? ఎనభయ్యేడు శాతం మంచి మార్కులు కావా? నాకవే ఎక్కువ తెలుసా? నాన్నకి ఇంటర్లో ఎన్ని వచ్చాయి? నలభైరెండు పర్సంట్. అమ్మకి? గ్రేస్ మార్కులు కలిపితే పాస్ అయింది”
అతని గొంతు చిన్న దుఃఖపుజీరతో ఇల్లంతా మార్మోగింది. ప్రళయం తర్వాతి ప్రశాంతతలా నిశ్శబ్దం పరుచుకుంది.
” అమ్మానాన్నలతో కాదు, నీ తోటి పిల్లలతో పోల్చుకో” అనేసి ఇవతలకి వచ్చింది రేణు. సున్నితంగా తాకింది ప్రసేన్‍కి ఆ దెబ్బ… ఇంకా సున్నితమైన చోట.
నిస్సత్తువగా మంచంమీద అడ్డంపడ్డాడు. దిండులో ముఖం దాచుకున్నాడు. వెచ్చటి కన్నీటి ధారలు దిండుని తడపడం తెలుస్తోంది. ఏడుస్తున్న శబ్దం బయటికి రాకుండా నిగ్రహించుకున్నాడు చాలా ప్రయత్నం మీద.
చిన్నప్పట్నుంచీకూడా ప్రసేన్‍కి చదువంటే భయం. టీచర్లు చెప్పే పాఠాలు తలకెక్కేవికాదు. పక్క పిల్లలు తేలిగ్గా నేర్చేసుకుని అప్పజెప్పే విషయాలు తలక్రిందులుగా తపస్సు చేసినా వచ్చేవి కాదు. రానందుకు టీచర్లు కొట్టేవారు. పనిష్మెంట్ ఇచ్చేవారు. దాంతో ఇంకాస్త భయం పెరిగింది. డిటెన్షన్ లేదు కాబట్టి టెంత్‍దాకా లాక్కొచ్చాడు. ఎంత చదివినా రాని చదువుని పరీక్షల ముందు బట్టీ పట్టి తాత్కాలికంగా మెదడులో ఉంచుకుని పరీక్షలు గట్టెక్కే పద్ధతిని తనే కనిపెట్టుకున్నాడు. అలా బట్టీపట్టిందికూడా ఒక్కోసారి గుర్తు రాక ఇబ్బంది కలిగేది. అవకాశాల్ని బట్టి పక్క పిల్లల్ని అడిగి రాయటం, కాపీ కొట్టడం ప్రత్యామ్నాయాలుగా ఉంచుకున్నాడు. ఎనభైశాతంతో పదో తరగతి దాటాడు. అవేమీ తన స్వంత మార్కులు కావని తెలుసు. పరీక్షా విధానాల్లో ఉండే లోపాలు మంచి అవగాహనకి వచ్చినట్టై ఏదో ఒకలా మార్కులు తెచ్చుకోగలననే నమ్మకంతోటే తండ్రి చేరుస్తానంటే రెసిడెన్షియల్లో చేరాడు. తండ్రి కూడా ఆ మార్కులు చూసే ఆశపడ్డాడు, మంచి కాలేజీలో వేస్తే ఇంకా ఇంప్రూవ్ అవుతాడని.
” అన్నానికి లే. ఆ ఏడుపు ముందే ఉండాలి. చదువుకుంటే బాగుపడతావని మా ఆశ. మీ నాన్నని చూస్తున్నావుగా? చాలీచాలని జీతం… నువ్వలా కాకూడదనుకున్నాం. రాతలు గాడిదలు రాస్తుంటే బుద్ధులు భూములేలతాయా? నేను, మీ నాన్న ఎలాగో టెన్తూ , ఇంటరూ అనిపించుకున్నాం. బొటాబొటి మార్కులతో పాస్ అయ్యాం. నిజమే. మమ్మల్నెవరూ చదువుకొమ్మనలేదు. మా బాధ్యత మాకే తెలిసి, మాకున్న అవకాశాలతో చదువుకున్నాం. నీకులా మాకు మావాళ్ళు చేసి ఉంటే ఈరోజుని ఏ స్థాయిలో ఉండేవాళ్లమో…” తల్లి మాటలకే కడుపు నిండిపోయింది ప్రసేన్‍కి. అన్నం తినాలనిపించలేదు. కానీ ఆమె ఊరుకోదని తెలిసి ఎలాగో కంచం ముందు కూర్చుని లేచాడు. తిన్నాననిపించాడు.
మళ్ళీ గదిలోకి వచ్చి మంచం మీద వాలాడు. ఆలోచనలు… జ్ఞాపకాల సుడులు.
తండ్రి చేర్పించాడని హాస్టల్లో చేరాడుగానీ తన ధ్యాసంతా ఇంటిమీదే ఉండేది. ఎన్నో ఏళ్లుగా అలవాటు పడిన వాతావరణాన్ని వదిలిపెట్టి కొత్త వాతావరణంలో ఇమడటం చాలా కష్టం అనిపించేది. ఇంటిమీద బెంగగా ఉండేది. వచ్చేముందు తండ్రి అననే అన్నాడు-
” ఈ ఫీజులవీ నా శక్తికి మించినవి. ఊరికే వచ్చి వెళ్లాలంటే కుదరదు. బెంగా అదీ పెట్టుకోకుండా శ్రద్ధ పెట్టి చదువు. నా వీలునుబట్టి నేనో అమ్మో వచ్చి చూస్తాం” అని.
హోమ్‍సిక్ హాలిడేస్ కోసం ఎదురుచూపు. అదయ్యాక కాస్త స్థిమితపడ్డాడు. ఇదంతా ఒకరకమైన బాధైతే చదువు మరొక రకం బాధ. మొదట్లో అందరినీ కలిపి చదివించేవారు. ఆ పద్ధతి తనకి గందరగోళంగా ఉండేది. తెలివైన పిల్లలు చకచకా నేర్చుకుంటూ ఉంటే తను అయోమయంలో పడేవాడు. మొదటి టెస్ట్ అయ్యాక గ్రేడింగ్ జరిగింది. తనని సుమారైన తెలివిగల పిల్లల గ్రూపులో వేసారు.
లెక్చరర్లలో కూడా రెండు రకాలు ఉండేవారు. ఇంటలెక్చువల్స్ తెలివైన బ్యాచ్‍కి చెప్పేవారు. వాళ్లు చెప్పేవారు, వీళ్లు గ్రహించేవారు. అదొక అద్భుతమైన ప్రక్రియ. తమకి వేరే లెక్చరర్లు ఉండేవారు. వాళ్లు పదే పదే చెప్పిందే చెప్తూ, చదివిందే చదివిస్తూ బాగా డ్రిల్లింగ్ చేయించేవారు. యూనిట్ టెస్ట్ లలో పాఠాలు తక్కువ ఉంటుంది కాబట్టి బాగానే బట్టీ పెట్టేవాడు. క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ పరీక్షల్లో తడబడేవాడు. యూనిట్ టెస్టుల మార్కులు చూసి తండ్రి సంతోషించేవాడు. మిగిలిన మార్కులు చూసి” బాగా చదవాలి. ఇంకా చదవాలి” అనేవాడు.
చదువు!
చక్కటి స్కూల్లో మంచి పునాది మీద మొదలుపెట్టిన పిల్లలకీ తనకీ ప్రస్ఫుటమైన తేడా కనిపించింది. వాళ్లు కాన్సెప్టువల్ రీడింగ్‍కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారు. చదివి, గ్రహించి, తిరిగి రాయటం. కష్టపడకుండా టాప్ ర్యాంకులు వచ్చేవి. తనకలాంటి పునాది లేదు. దివారాత్రాలూ చదువే!
ఇంటర్ పరీక్షల్లో కాఫీ కొడుతూ రెండుసార్లు పట్టుబడ్డాడు. డిబారు చేస్తానని బెదిరించి వదిలేసాడు ఇన్విజిలేటర్. పక్క స్టూడెంట్స్‌ని అడిగితే విసిగించద్దని చెప్పారు.
వెరసి…ఎనభయ్యేడు శాతం.
అయితే, ఇప్పుడు తన భవిష్యత్తు ఏమిటి?
సరిగ్గా ఇదే ప్రశ్నని వెంకట్రావు కూడా వేసుకున్నాడు.
కొడుకుని ఏం చేయాలి?
గుమస్తాగా ఇరవై రెండేళ్ల సర్వీసు చేసి, ఆ స్థాయిలో ఉండే న్యూనతని గుర్తించి ప్రసేన్ తనలా కారాదనుకున్నాడు. డాక్టరో ఇంజనీరో కావాలని కలగన్నాడు. మొదటిది సీట్ల పరంగానూ ఖర్చు పరంగానూ అందుబాటులో లేనిది కాబట్టి రెండోదాన్ని కోరుకున్నాడు. అయితే తనకి ముందూ, తర్వాతా కూడా ఎందరో అలాంటి కలలని కన్నారు. పిల్లలంతా ఇంజనీర్లు అయ్యే ప్రక్రియ మొదలైంది. అందరికీ విద్య స్థాయినుంచీ అందరికీ ప్రొఫెషనల్ విద్య స్థాయికి సమాజం ఎదిగిపోయింది. వీధికో ఇంజనీరింగ్ కాలేజీ… ఏడాదికి రెండుమూడు లక్షలమంది ఇంజనీర్లు. అందరూ ఎక్కితే అది అందలమవదు. పబ్లిక్ బస్సు అవుతుంది. దిగి మళ్లీ ఎవరి దారిలో వాళ్లకి వెతుకులాట. ఈ పోటీలో కొడుకు వెనుకబడి ఉన్నాడు. ఎలా?
“ఏం చేద్దామనుకుంటున్నావురా?” ఇంటర్ ఫలితాలు వచ్చిన రెండురోజులకి కొడుకుతో మొదటిసారి మాట్లాడాడు వెంకట్రావు. ఇంకా కోపం తగ్గలేదు. అన్ని అవకాశాలూ కన్పించినా ఆశించినన్ని మార్కులు తెచ్చుకోకపోవడానికి గల కారణం దొరకలేదు.
ఈ రెండు రోజుల నిరాదరణతో ప్రసేన్ కూడా సమస్యని బాగా మథించాడు. అందుకే నిదానంగా అన్నాడు.
” చదువంటే ఏంటో అర్థమైంది నాన్నా! బట్టీ పట్టడం, కాపీ కొట్టడం, మార్కులు తెచ్చుకోవడం కాదు. చదివే విషయం పట్ల అవగాహన ఉండాలి. అలా కాన్సెప్ట్ అర్థం చేసుకుని చదివి నూటికి నూరు మార్కులు తెచ్చుకునేవాళ్లు ఒక్కరో ఇద్దరో ఉంటారు. నాలాంటివాళ్ళు నూటికి తొంభైమందికి పైనే. మీరు నూటికి నూరు తెచ్చుకునేవాళ్ళని మాత్రమే చూస్తున్నారు. ఐఐటీ, బిట్స్,ఎయ్‍మ్స్, జిప్‍మర్‍లాంటి సంస్థలు తప్ప, అందులో కోర్సులు చేయడం తప్ప మార్గాంతరం లేదా నాన్నా? ఎందరికి అందులో ప్రవేశం దొరుకుతుంది? దొరకనివాళ్ళు? నేనంటే సరే, ఎనభయ్యేడు శాతమే. మరి తొంభయ్యైదుదాకా లాక్కొచ్చినవాళ్ళ పరిస్థితి కూడా అగమ్యగోచరంగానే ఉంది. మీరన్న కోర్సుల్లో రాకపోతే… ఎంసెట్, ఏ ఐ ట్రిపుల్ యీల్లో మంచి ర్యాంకులు రాకపోతే ఈ మార్కులు దండగేనా? నాకింకే ప్రత్యామ్నాయం లేదా?” అడిగాడు.
వెంకట్రావు చకితుడై చూసాడు. ఎక్కడో చురుక్కుమంది. తనూ, భార్యా కూడా చదువులో వీకే . చదవటమంటే ఏదో ఒకలా పరీక్షలు గట్టెక్కడం. కాన్సెప్టువల్ రీడింగ్ గురించి తనకీ తెలుసు.
కానీ ఆ కోణంలోంచీ చదువు చెప్పే స్కూళ్లెన్ని? టీచర్లెందరు? ప్రసేన్‍కి మార్కులు రాలేదని తను బాధపడుతున్నాడుగానీ రాకపోతే ఏం చేయాలని ఆలోచించడంలేదు. ఎవరో పిల్లలకి అద్భుతమైన మార్కులు వచ్చాయి. కాకతాళీయంగానే కావచ్చు. వాళ్ల కృషీ తెలివితేటల వల్లే కావచ్చు. కారణాలు అప్రస్తుతం. వాళ్లలాగే తన కొడుక్కి కూడా రావాలనుకున్నాడు. రాలేదు. అవకాశం కలిసి రాకపోవచ్చు. వాడి తెలివి ఇంతే కావచ్చు. కారణాలు ఇక్కడ కూడా అప్రస్తుతమే. వీడికి కూడా ఏదో ఒక భవిష్యత్తు కనిపించాలి కదా?
రాజమౌళి ప్రశ్న… మనం మాత్రం బతకక్కర్లేదా? అని. అది గుర్తొచ్చింది. దానిలోతు అర్థమైంది. దాని వాడి తెలిసింది.
ఒక్కసారి అతని చూసి రావాలనిపించింది. తమ ఉద్యోగాలు పోబోతున్నాయి. తను పెద్దగా చలించలేదు. దాని తీవ్రత ఇప్పుడు తెలిసింది.
దిగ్గుమని లేచి నిల్చున్నాడు.ఈ రెండు రోజులుగా ఆఫీస్‍లో గొడవ గొడవగా ఉంది. స్ట్రైక్ నోటీసులు, ధర్నాలు… ఉన్నపళంగా రాజమౌళిని చూసి రావాలనిపించింది.
” మమ్మల్ని ఏ పని చెయ్యమంటే అది చేశాము. ఇన్నాళ్లూ ఉత్పాదకత లేని పని చేయించుకున్నారు. ఇప్పుడేమో నష్టాలు వస్తున్నాయని మమ్మల్ని ఇంటికి పంపేస్తే ఎలా? నిర్ణయాలు మీవి, ఫలితాలు మావీనా?” అని మేనేజర్ని నిలదీసి అడిగిన రాజమౌళిని.
కొడుక్కి ఎటూ జవాబు ఇవ్వకుండా” ఇప్పుడే వస్తాను” అని ఆఫీస్ కేసి దారి తీసాడు. ముందు రోజు ధర్నా, ఆ రోజునుంచి స్ట్రైకు. ఆఫీస్ ముందు టెంటు వేసి ఉంది. రాజమౌళిని వెతుక్కుంటూ వెళ్ళాడు. పదిమంది మధ్య నిలబడి పెద్దగా మాట్లాడుతున్న అతను దూరం నుంచే వెంకట్రావుని చూసి ఎదురొచ్చాడు. అతనికెందుకో వెంకట్రావుని చూస్తే అభిమానం.
” ఈవేళ నుంచీ స్ట్రైకు” అన్నాడు. తెలుసన్నట్టు తలూపాడు వెంకట్రావు.
” ఏదో సాధిస్తామని కాదు. మన ఒక్కరి సమస్యో, మన ఒక్క తరానికి చెందిన సమస్యో కాదు ఇది. మన ప్రతిఘటన మేనేజ్మెంట్‍కి తెలియాలి” అన్నాడు రాజమౌళి.
దానికి కూడా తలూపాడు వెంకట్రావు. రాజమౌళి అతని ముఖంలోకి చూసి అర్థమైనట్టు నవ్వేడు.
” కొడుక్కి తక్కువ మార్కులు వచ్చాయని బాధపడుతున్నావా?” అడిగాడు. ఓదార్పుగా భుజం తట్టి, జేబులోంచి సిగరెట్ ప్యాకెట్ తీసి తనొకటి వెలిగించుకుని అతనికొకటి ఇచ్చాడు.
తనకి, ప్రసేన్‍కి మధ్య జరిగిన సంభాషణ చెప్పాడు వెంకట్రావు. ” వాడి భవిష్యత్తేంటో అర్థం కాకుండా ఉంది. చదివి ఉద్ధరిస్తాడనుకున్నాను” అన్నాడు ఆవేదనగా.
” చాలామంది తల్లిదండ్రులు చేసే తప్పే నువ్వు కూడా చేశావు”
” అవకాశం లేక ఎంతోమంది వెనకబడుతున్నారు. నేను వాడికి అవకాశాలు కల్పించడం తప్పా?”
“పరీక్షల్లో వచ్చే మార్కులు కేవలం పిల్లల తెలివితేటలు మీదే వస్తాయనేది మేధావులెవరూ ఒప్పుకొని సత్యం.”
” కానీ, పిల్లల భవిష్యత్తు నిర్ణయించబడేది వాటి ఆధారంగానేగా?”
” రూపాయి పెట్టి లాటరీ టిక్కెట్టు కొనడాన్ని అనైతికంగా భావించే మన మధ్యతరగతివాళ్ళం పిల్లల్ని చదువుల పందెంలోకి నెట్టి కాయ్ రాజా కాయ్ అని లక్షలు కుమ్మరిస్తున్నాం”
ఛెళ్ళుమని చరిచినట్టయింది వెంకట్రావుకి. ఇది జూదం, లాటరీ కాకపోతే మరేమిటి? ఎవరో అందలం ఎక్కారని దాన్ని అందుకోవడానికి ప్రతివాళ్ళూ ప్రయత్నిస్తే తొక్కిసలాట తప్పించి ఇంకేమీ ఉండదు. పైగా అందలం ఎక్కినవాడి విజయం విలువ పెరుగుతుంది. కొందరు పారిశ్రామికవేత్తలు, వ్యాపారస్తులు కలిసి కార్పొరేట్ కాలేజీలు పెడుతున్నారు. తనలాంటివాళ్లు వేలు గుమ్మరించి పిల్లల్ని చేర్పిస్తున్నారు. తెలివైన పిల్లల్ని వదిలేస్తే ఇంతమందిలో ఒకరిద్దర్ని వాళ్లు తీసుకుని పాతికలూ, యాభైలూ జీతాలిస్తున్నారు. ఆ డబ్బు ఎవరిది? తమదే. అంటే లక్షమంది లాటరీ టికెట్లు కొంటే ఒకరికి జాక్ పాట్ తగలటంలాంటిది. ఇంక ఆలోచించలేకపోయాడు.
” పదోతరగతి పాసయ్యేసరికి నేనో ఉద్యోగం చూసుకోవలసిన పరిస్థితి ఏర్పడిపోయింది మా ఇంట్లో. ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజిలో పేరు నమోదు చేసుకున్నాను. గవర్నమెంటు ఉద్యోగాలకి వయస్సు చాల్లేదు. ఎప్పుడెప్పుడు పద్ధెనిమిది నిండుతాయని ఎదురుచూశాను. ఎన్ని ఉద్యోగాల్రా, అప్పుడు? పోస్టల్, టెలికం, రైల్వే, బ్యాంకు, ఎల్ఐసి… బోల్డన్ని క్లరికల్ పోస్టులు. తేలిగ్గా వచ్చేవి. పెద్ద చదువు లేకపోయినా బతికేసాం. పిల్లల్ని కన్నాం, పెంచి పెద్ద చేసాం. ఇప్పుడేవీ అలాంటి అవకాశాలు?… ఎలారా బతకడం? మనలాంటి మామూలువాళ్లకి మనుగడ కనిపించట్లేదు” రాజమౌళి ఇంకా ఏదో అంటూనే ఉన్నాడు. వెంకట్రావు అడుగులు టెంట్ వైపు దారి తీశాయి. అక్కడ ఎంతోమంది తన సహోద్యోగులు… అప్పటిదాకా కొడుకు భవిష్యత్ ఒక్కటే అగమ్యగోచరంగా అనిపించింది. ఇప్పుడు తనది కూడా అలానే ఉందని అర్థమైంది.

(ఆంధ్రభూమి వారపత్రిక 2000 కి ముందు)