వైద్యంలో వేద్యం by Savitri Ramanarao

  1. నీల by Nandu Kusinerla
  2. ఫ్రిజ్ లోకి ఏం వండనూ!!! by Savitri Ramanarao
  3. ఆధునిక కవితోపాఖ్యానం by Savitri Ramanarao
  4. దానం కొద్దీ…! by Nandu Kusinerla
  5. కర్మణ్యేవాధికారస్తే!!!… by Savitri Ramanarao
  6. బలిపశువు by Pathy Muralidhara Sharma
  7. వైద్యంలో వేద్యం by Savitri Ramanarao
  8. నేనూ మనిషినే by Pathy Muralidhara Sharma
  9. చిన్న కుటుంబ చిత్రం by Savitri Ramanarao
  10. ఒక్క క్షణం by Pathy Muralidhara Sharma
  11. ఎందుకు రాదూ!! By Savitri Ramanarao
  12. యద్భావం తద్భవతి by Pathy Muralidhara Sharma
  13. అలా అర్థమైందా? by Pathy Muralidhara Sharma
  14. మనసు మూయకు!!! by Savitri Ramanarao
  15. ఎవరికెవరు ఏమవుతారో! by Pathy Muralidhara Sharma
  16. కాస్త సహనం వహిస్తే by Savitri Ramanarao
  17. అమ్మ దయ ఉంటే… by Savitri Ramanarao
  18. మై హుం నా బెహన్! by Savitri Ramanarao

మంచంమీద కూచుని పేపర్ చదువుకుంటున్నాను . మూడేళ్ళ మనుమడు బాబీ పక్కనే వాడి ఆటసామాను , పుస్తకాలు, కలర్‍‍పెన్సిల్స్ అన్నీ చిందరవందరగా పడేసి ఆడుకుంటున్నాడు. వాడు తెగ దుముకుతూ ఒకచోట స్థిరంగా ఉండడు .  ఎప్పుడు ఎక్కడనుండి తీసాడో తెలియదు, కేప్ లేని ఓ బాల్‍పాయింట్‍పెన్ చేతిలో ఉండగా టక్కున నామీదకి దూకాడు. ఆ పెన్ వచ్చి నా కుడికంట్లో కుడివైపు తెల్లగుడ్డుకు తగిలింది. అది సూదిమొన కావటంవలన  తగిలిన స్థానం నొప్పిచేసి ఎర్రగా  అయిపోయింది. కళ్ళలో ఫ్లోటర్స్ వచ్చి మసకగా  అయిపోతూ కూడా ఉంటుంది . అలాటపుడు కళ్ళకి బాగా రెస్ట్ ఇస్తుంటాను . ఆరోజు కూడా ఫ్లోటర్స్ బాగా రావటంతో మా అమ్మాయి బెంబేలెత్తిపోయి నా డాక్టర్ ఫ్రెండ్‍కి ఫోన్ చేసి “అంకుల్,   మమ్మీకి ఫ్లోటర్స్ వచ్చేసాయి . చదవొద్దు ,మొబైల్ చూడవద్దు అంటే వినదు .కళ్ళకి రెస్ట్ ఇవ్వదు . దానికితోడు ఈరోజు కంట్లో బాల్‍పాయింట్‍పెన్ గుచ్చుకుంది . కన్ను ఎర్రగా అయిపోయింది” అంటూ  మొత్తం పూసగుచ్చింది . 
అతను నాతో ” నీకు యువిటిస్, గ్లకోమా  సమస్యలు ఉన్నాయి. అవిగాక ఫ్లోటర్స్ ఎక్కువ గా వస్తున్నాయి అంటున్నావు కాబట్టి ఓసారి అక్కడ డాక్టర్‍కి చూపించు. ఎందుకైనా మంచిది” అన్నాడు  నా  కళ్ళ పరిస్థితి బాగా తెలిసిన ఆ మిత్రుడు .
వెంటనే మా అమ్మాయి “గతంలో కళ్ళ సమస్య వచ్చినపుడు చూపించుకున్న డాక్టర్ దగ్గరకి వెళ్ళు ” అంటూ అతనికి ఫోన్ చేసి ఉండేది లేనిదీ కనుక్కుని క్యాబ్ బుక్ చేసి ఆ సాయంత్రం అతని క్లినిక్కి పంపింది.
అది బెంగళూరులోని ఓ సూపర్ స్పెషలిటీ ఐ హాస్పిటల్ . వెళ్ళగానే ముందు ఓ ఏభయి చెల్లించుకు షుగర్ బీపీ రీడింగ్స్ ఓ స్లిప్‍మీద రాయించుకుని ఫస్ట్‌ఫ్లోర్‍లో కళ్ళడాక్టర్ రిసెప్షన్ కౌంటర్ దగ్గరకి వెళ్ళాను . వాళ్ళకి నేను పాతపేషెంట్‍నే కాబట్టి నాకు గతంలో ఇచ్చిన మెడికల్‍కార్డ్‌మీద నా వివరాలు అన్నీ చూసి కంప్యూటర్‍లో  నా పేజీ ఓపెన్ చేసి ఇప్పుడు ఎందుకు వచ్చేనో కనుక్కుని అక్కడ హాల్లో పేషెంట్స్ కూచునేచోట కూచోమన్నారు.
అది పెద్ద హాల్. పేషెంట్స్ కూచునేందుకు కుర్చీలు వేసి ఉన్నాయి .కుడిపక్క కళ్ళజోళ్లు అమ్మే షాప్,  ఎడమపక్క డాక్టర్ రూమ్ , దాని పక్కనే మరో పెద్ద రూమ్‍లో ఏవేవో మెడికల్ పరీక్షలు చేయటానికి కావలసిన సరంజామా అంతా ఉంది .
డాక్టర్ ఇంకా రాలేదు . ఒక నర్స్ వచ్చి నా కళ్ళలో చుక్కల మందు వేస్తానంది .
“నేను కళ్ళ టెస్ట్ కోసం రాలేదు . బాల్‍పాయింట్‍పెన్ గుచ్చుకుంది . చూపించుకుందామని వచ్చాను” అన్నాను.
“అయినా  మందు వేయాలి” అని డ్రాప్స్ వేసి టిష్యూ పేపర్ చేతికి తుడుచుకుందికి ఇచ్చి వెళిపోయింది . నేను కళ్ళు మూసుకు కూర్చున్నాను .
పక్కన ఎవరో ఒక జంట నడివయసువారు నాకన్నా ముందే  వచ్చారు. ఆవిడ కళ్ళలో  డ్రాప్స్   వేయించుకుంది . ఆయన  ఆవిడకి  తోడుగా వచ్చినట్లున్నాడు . ఆవిడ పక్కనే కూచున్నాడు .
వాళ్ళు ఇద్దరూ తెలుగులోనే మాట్లాడుకుంటున్నారు . చిన్న గొంతుకలతో . అవి నా చెవులలో  పడుతున్నాయి .
వాళ్ళ సంభాషణ సారాంశం ఏమిటంటే వాళ్ళ అమ్మాయి తొలిచూలు పురిటికి వచ్చింది . ఈ  వారంలోనే డెలివరీ అవుతుందని చెప్పారు. ఆ హాస్పటల్ ఖర్చు , పురుడు అయ్యాక చేయాల్సిన బారసాల, పెట్టుపోతలకి సంబంధిన ఖర్చు… ఇలా మొత్తంమీద ముందు పెద్ద బేరమే ఉంది . ఇవన్నిటి మధ్య పాపం పులిమీద పుట్రలా ఇప్పుడే  ఈవిడకి  ఈ తలపోటు  సమస్య ఒకటి వచ్చింది . వారంరోజులుగా ఆవిడకి విపరీతమైన తలనొప్పి, వాంతులు , కళ్ళుపోట్లు . ఏ గృహవైద్యాలకి , తలనొప్పి మందులకి లొంగక ఇక తప్పనిసరి అయి హాస్పిటల్‍కి వచ్చింది . డాక్టర్ ఏమి చెబుతాడో . ఎంత ఖర్చు అవుతుందో అని ఆ దంపతులు బెంగపడుతున్నారు .
అవును పాపం! మధ్యతరగతి మందహాసాలు పెదవిమీదే. మనసులోమాత్రం ఎన్నో గుబుళ్లు. ఎప్పుడే ఖర్చు  వచ్చి మీదపడ్డా గుండె గుభేల్మంటుంది . పైకి చెప్పలేక లోన భరాయించుకోలేక యమయాతన . అలాటివి ఎన్నో  పడిపడి వచ్చిన  నాకు  వాళ్ళ  పరిస్థితిపట్ల జాలి వేసింది .
“భగవంతుడా! వీళ్ళకి ఏ సమస్యా రాకుండా ఈ బాధ్యతలు గట్టెక్కేటట్లు  చూడు” అని మనసులోనే దేముడిని ప్రార్ధించేను . ఇంతలో ఆ చుక్కలమందు నర్స్ వచ్చి మరోసారి మందు వేసి వెళ్ళింది . 
ఆ నడివయసు జంటలో ఆవిడను డాక్టర్ పిలిచినట్లున్నాడు, ఆవిడ లోపలకి వెళ్ళటం, ఆవిడకూడా అతను నడవటం. అంతవరకు వాళ్ళ మాటలు వినటం వలన కలిగిన ఆసక్తిచేత చూసి మళ్లీ కళ్ళు మూసుకున్నాను .
నాకు ఆవిడ మాటలే గుర్తు వస్తున్నాయి.
“అద్దాలు రాస్తాడేమో. అవి కనీసం ఓ వెయ్యో పదిహేనువందలో ఉంటాయి . అదిగాక కన్సల్టేషన్ , మందులు.  ఇవన్నీ తడిపి మోపెడు అవుతుంది . ఏమిటో అన్నీ ఓసారే వస్తాయి . ఇంతకీ మీ లోన్ ఎప్పుడు  సేంక్షన్ అవుతుందో కానీ  రేపు వెళ్లి నా గాజులు , చంద్రహారాలు బాంక్‍లో పెట్టి డబ్బు తెండి . పిల్ల ఏ క్షణంలో బలువు పడుతుందో . చేతిలో డబ్బు లేకుండా అవదు” అని ఆమె అనటం-
దానికి అతను  ” ప్రతిసారి నీ వస్తువులు బాంక్‍లో పెట్టక తప్పట్లేదు . అవి నువ్వు  వేసుకున్నకన్నా బాంక్‍లో ఉన్నదే ఎక్కువ”   అని అతను అనడం-
 “పోనిద్దురూ  ఆలికి సింగారం అదునుకు బంగారం అని ఊరికే అన్నారా పెద్దలు? ఇలా అవసరానికి ఆదుకుంటాయనే నగలు చేయించుకునేది . ఈ ఖర్చులన్నీ అయి ఈ సమస్య గట్టెక్కాక ఏదో చేసి విడిపిద్దాం లెండి” అని  ఆమె వోదార్చటం-
“అలాగేలే, రేపు వెళతాను”అని  అతను జవాబు  ఇవ్వటం అన్ని నా  చెవుల్లో రింగుమంటూ వారి ఆర్ధికస్థితిని కళ్ళకు కడుతూ అలాటి పరిస్థితులు దాటివచ్చిన నా గతం కళ్ళముందు పరిచింది. 
ఇలా ఆలోచనల్లో మునిగి పోయిన నేను  ..
“సరే పద” అనే అతని గొంతు విని స్పృహలోకి  వచ్చాను. వాళ్ళు డాక్టర్ గదిలోంచి బయటపడ్డారు. ముందు కూచున్నచోటికి వచ్చి  నన్ను  కాస్త చూడమని వదిలి వెళ్ళిన సామాన్లు ఉన్న బాగ్ తీసుకుని నాకు థాంక్స్ చెప్పి అక్కడనుండి కదిలారు. ఆవిడ భయపడ్డట్టే అద్దాలు, మందులూ  రాసారు .అక్కడ కళ్ళజోళ్ళషాప్‍ నే అద్దాలకి ఆర్డర్ ఇవ్వటానికి వాళ్ళు   వెళ్ళారు .
కాసేపటికి డాక్టర్  నన్ను పిలిచాడు. అక్షరాలు చదివించి మిగిలిన చేయాల్సిన పరీక్షలు చేశాక,  “అమ్మా! మీకు రెటీనా మేపింగ్‍తోపాటు కేటరాక్ట్  వస్తోంది కనక వాటికి సంబంధించిన పరీక్షలు అన్నీ చేయాలి” అన్నాడు .
 “సరే !  ఎంత అవుతుంది వీటి అన్నిటికీ ?” అడిగాను. 
ఈ ఊరు తీరుతెన్నులు తెలుసుకాబట్టి ఓ పదివేలు బాగ్‍లో వేసుకుని వచ్చాను .దూరాభారాలు… అస్తమనూ తిరగలేం. వచ్చినప్పుడే అన్నీ చక్కబెట్టుకు వెళ్ళాలి  మరి!
“అన్ని టెస్టులకి మూడు వేలు అవుతుంది” అన్నారు. అప్పటికే క్యాబ్‍కి కన్సల్టేషన్‍కి  బీపీ ,షుగర్ టెస్ట్‌లకి వెరసి ఓ వెయ్యి వదిలింది. తప్పదుకదా! అన్ని టెస్ట్‌లు చేయించాను . ఇక అద్దాలు మార్చాలి అన్నారు . 
“ఈ అద్దాలు వేసుకు ఆరునెలలే అయింది . వీటితో ప్రస్తుతం నాకు పెద్ద ఇబ్బంది లేదు. అయినా మార్చేయాలి అంటే మార్చేస్తాను” అంటే-  
 “ఇబ్బంది లేకపోతే సరే. కానీ  మీ దృష్టి రానురాను తగ్గుతోంది . అలా మారుతోందికాబట్టి ఆరునెలలకు ,ఏడాదికి పరీక్ష చేయించి అవసరాన్నిబట్టి అద్దాలు  మార్చటం మంచిది ” అన్నాడు డాక్టర్.
“అలాగే మారుస్తాను” అన్నాను.
ఇక ప్రెస్క్రిప్షన్‍లో నేను రెగులర్‍గా వాడే  టిమోలెట్  ఐ డ్రాప్స్ కాక మరో మూడు రకాల ఐ డ్రాప్స్ , ఓ రెండు రకాల టాబ్లెట్స్, ఇవి కాక మల్టీవిటమిన్ టాబ్లెట్స్ రాసి అవి అలా మూడు నెలలు వాడమని , పైగా అవి ఎలా వాడాలో అందులో చూపిస్తూ ఇచ్చాడు.
“సరే ! ” అని డాక్టర్‍కి ” థాంక్స్! ” చెప్పి బయటికి నడిచాను .
ఆ ప్రెస్క్రిప్షన్ ప్రకారం నేను రోజుకి డజనుసార్లు ఆ కళ్ళ మందులన్నీ క్రమం తప్పకుండా కళ్ళలో వేసుకోవాలి. ఇదిగాక ఆ మాత్రలు మూడు  పూటలా వాడాలి . నిలువునా నీరసం వచ్చింది . గతంలో  దృష్టి సమస్య వచ్చినపుడు ఇలాగే రోజుకి డజనుసార్లు చుక్కల మందులు, స్టెరోయిడ్స్ అవీ వాడేను . అప్పుడు చాలా విసుగు వచ్చేది మందులు వాడటం అంటే .అవన్నీ ఎలాగో క్రమంగా డోసేజ్ తగ్గించి ఇప్పుడు అన్నీ మానేసి ఒక్కరకం కంటిచుక్కలు మాత్రమే వాడే పరిస్థితికి  తెచ్చాడు నా డాక్టర్ మిత్రుడు .ఇప్పుడు మళ్లీ ఇన్ని రకాల మందులు అంటే నాకు నవనాడులు కృంగినట్లు అనిపించింది .
డయలేట్ అయిన ప్యూపుల్స్‌తో  చూడటానికి చిరాగ్గా ఉన్న కళ్ళతో  కళ్ళజోడు ప్రెస్క్రిప్షన్ పట్టుకు కళ్ళజోడు షాప్‍కి వెళితే అద్దాలు రెండువేల అయిదు వందలు , ప్రేమ్‍కూడా బావులేదు, మార్చేయమని ఉచితసలహా . అతి తక్కువలో అక్కడ ఉన్న ఫ్రేమ్ పన్నెండు వందలు. ఆరేసి నెలలకి మారిపోయే కళ్ళజోడు ఈ లెఖ్ఖన నాలుగేసి వేలు పోసి కొనుక్కోవాలి అక్కడ అయితే అని అర్ధం అయింది .
హాస్పిటల్‍కి అనుసంధానించబడ్డ మందుల షాప్‍కి  వెళ్ళి ఆ మందుల ధర ఎంత అని అడిగాను . వాడు లెక్కవేసి అయిదువేలు అవుతుంది అన్నాడు .
నేను ఏమీ కొనకుండా ,కళ్ళజోడుకు ఆర్డర్ ఇవ్వకుండా వైజాగ్‍లో నా డాక్టర్ మిత్రుడికి ఫోన్  మొత్తం  జరిగినదంతా చెప్పి-
“ఏమి చేయమంటావు ? ” అని అడిగాను . 
“రిపోర్ట్స్ , ప్రెస్క్రిప్షన్ వాట్సప్  చెయ్యి. చూసి చెప్తాను” అన్నాడు .
నేను అన్నీ వాట్సాప్ చేసి  మిత్రుని స్పందన కోసం ఎదురు  చూస్తూ పక్కన కూర్చున్నాను. పనిలోపనిగా ఇందాకటి నడివయసు జంట విషయం చెప్పి, “వాళ్ళింకా ఇక్కడే వున్నారు, జాలేస్తోంది. ఏదైనా సలహా చెప్పకూడదూ?” అని అడిగాను.
ఆ నడివయసు జంట కళ్ళజోడుకి ఆర్డర్ ఇచ్చుకుని  మందుల షాప్‍లో మందులు కొనుక్కుని  మరేదో పని చూసుకు  వచ్చినట్లు వున్నారు .
నావైపుగా మళ్లీ వచ్చారు ఎందుకో . ఆవిడ నావైపు చూసి పలకరింపుగా నవ్వి, ” ఈరోజుల్లో హాస్పిటల్‍కి వస్తే నిలువుదోపిడీయేనండీ”  అంటూ అతను పిలుస్తుంటే  ” వస్తాను  అండీ” అని భారంగా వెళ్ళిపోయింది .
మరి కాసేపటి లో నా మిత్రుడి ఫోన్.
“నువ్వు వైజాగ్ ఎప్పుడు వస్తావు?” అనడిగాడు.
“త్వరలోనే” 
“ఈ రిపోర్ట్స్‌లో అంత గాభరాపడిపోవలసినవి ఏమీ లేవు. రెగులర్‍గా వాడే డ్రాప్స్ ఒక్కటీ  వాడు. మిగిలినవి ఏవీ వాడకు. కళ్ళకి నాలుగురోజులు పూర్తి రెస్ట్ ఇయ్యి”
“…”
“తరువాత కూడా ట్వంటీ ,ట్వంటీ ,ట్వంటీ రూల్ ఫాలో అవు .అంటే ఇరవై నిముషాలు కళ్ళతో పనిచేస్తే ,ఇరవై సెకండ్లు రెస్ట్ ఇయ్యి  ,ఇరవై మీటర్ల దూరంలో ఉన్న వస్తువుని చూడు కాసేపు. నువు రెగులర్‍గా  చేసే కంటి  వ్యాయామం నొప్పి, స్ట్రైన్ ఎక్కువవకుండా చేసుకో,చాలు. శుభ్రంగా క్యాబ్ బుక్ చేసుకుని ఇంటికెళ్లి కంటికి రెస్ట్ ఇయ్యి ” అన్నాడు.
“అమ్మయ్య !  బతికించావు ! ఆ చుక్కల మందులు రోజంతా వేసుకోవాలంటే నాకు చుక్కలు కనిపించాయి బాబూ !” అంటూ “అవును, మరి ఏమీ సమస్య లేకపోతే అన్ని పరీక్షలు  చేసి మందులు ఎందుకు  రాసినట్లు?” నేను  సందేహంగా అడిగాను. 
దానికి అతనో నవ్వు నవ్వి “తల్లీ ! నీకు చేసే ప్రతిపరీక్షలో, నువు కొనే ప్రతీ మందులో సుమారు ముప్ఫయ్ శాతం డాక్టర్‍కి ముడుతుంది . అసలే డయలేటెడ్ ప్యూపుల్స్  ఇప్పుడు నీవి. కాస్త జాగర్తగా క్యాబ్ బుక్ చేసుకు ఇంటికి వెళ్ళు. సాయంత్రం మాట్లాడుతాను .అప్పుడు చెప్తాను నీయక్షప్రశ్నలకి సమాధానాలు” అన్నాడు.
“ఓహ్! సారీ!  నీకు  ఇప్పుడు పేషెంట్స్ వుంటారు. సాయంత్రం నేనే ఫోన్ చేస్తాను” అని చెప్పి క్యాబ్ బుక్ చేసుకుందికి నడిచాను .
సాయంత్రం మాట్లాడినప్పుడు ఆ నడివయసు జంట గురించి మరింక గుర్తుచెయ్యలేదు. కిటుకు తెలిసాక ఇంకెందుకు అడుగుతాను?