సృష్టి ఆరంభంలో ఎప్పుడో ఒకిద్దరు వ్యక్తులు చనిపోయేదాకా అనుకున్నారు . వాళ్లలాగే కలిసి ఉన్నారు. పెళ్లి చేసుకోలేదుగానీ విడిపోలేదు.
ఆ తర్వాత కూడా ఇంకో ఇద్దరు వ్యక్తులు అలాగే కలిసి ఉండాలని అనుకున్నారు కానీ కలిసి ఉండలేమేమోనన్న అనుమానం కలిగింది. అందుకు పంచభూతాలని సాక్షిగా ఉంచుకొని చనిపోయేదాకా విడిపోకూడదని తమ నిర్ణయాన్ని ప్రకటించారు.
ఆపైన కూడా ఎన్నో కోట్లమంది స్త్రీ పురుషులు కలిసి ఉందామనుకున్నారు కానీ ఏ ఒప్పందం లేకుండా కలిసి ఉండలేమనే నిర్ణయానికి వచ్చి కొన్ని కట్టుబాట్లని ఏర్పరచుకున్నారు. ఆ ఏర్పాట్ల అంతిమరూపమే పెళ్లి. ఒకరు ఇంకొకర్ని కోరుకోవడంకన్నా కలిసి ఉండటం ప్రధానమైపోయింది.
…
తెర తొలగింది. జీలకర్ర బెల్లం పెట్టుకోవడం అయింది. శాంతి మెడలో మంగళసూత్రం కట్టాడు భాస్కర్. ఓరగా అతన్ని చూసింది శాంతి. అతని చూపులు కలిశాయి. చిన్న చిరునవ్వు. ఒక మైమరుపు. ఇద్దరిలోనూ ఒక చెలిమికి నాంది.
కానీ…
పెళ్లికి చాలా తక్కువమంది వచ్చారు. ఎవరిని పిలవక్కర్లేదో ముందు నిర్ణయించుకుని, ఆ తర్వాత పిలవాల్సిన వాళ్ళ లిస్టు తయారుచేసి నాలుగైదు వడపోతల తర్వాత మిగిలిన వాళ్ళనే పిలిచారు శాంతివైపు వాళ్లు. కారణం అమ్మాయికి తండ్రి లేడు. తల్లి ఉన్నా ఆమె గురించి తెలిసింది చాలా తక్కువ. అందరూ చెప్పుకున్నది వినటమేతప్ప ఆమెని ఙాపకాలేవీ లేవు. పెద్దనాన్న చేస్తున్నాడీ పెళ్లి. ఎంతో బరువు మోస్తున్నట్టు, దాన్ని దింపుకోబోతున్నట్టు, తిరుగుతోంది ఆ పెద్దనాన్న భార్య. తల్లీ తండ్రీ లేని పిల్ల పెళ్లికి ఆర్భాటం ఎందుకని చాలా కొద్దిమందిని పిలిచారు.
సరిగ్గా అదే క్షణాన భాస్కర్ పినతండ్రి ఒక వ్యక్తిని వెంటపెట్టుకుని హడావిడిగా వచ్చాడు.
“ఒక మాటిలా రారా!” అతని పిలుపు.
పీటలమించీ లేవచ్చా? భాస్కర్ లో సందేహం.
బ్రహ్మగారి ముఖంలోకి చూశాడు. ఆయన తలూపాడు. అతను లేచి చిన్నాన్న వెంట వెళ్ళాడు. మరికొద్దిసేపటికి కోపంతో ఎర్రబడ్డ మొహంతో తిరిగొచ్చాడు. ఆ రావటం అతనెందుకు వెళ్లాడాని చూస్తున్న శాంతి భుజాన్ని గుచ్చి పట్టుకుని లేవదీశాడు.
” చెప్పు. మీ అమ్మ బతికే ఉంది కదూ?” కటువుగా అడిగాడు.
ఆ మాట అక్కడ డైనమైట్లా పేలింది. శాంతి పెద్దనాన్న ఈశ్వర్రావు వెంటనే కలగజేసుకుని సర్ది చెప్పబోయాడు.
” ఆమె బతికుందని మేం ఎప్పుడూ అనుకోలేదు భాస్కర్! మా తమ్ముడితో పాటే ఆమె కూడా పోయిందనుకున్నాం” అన్నాడు.
” మీరేమనుకున్నారో నాకనవసరం. అబద్ధం ఎందుకు చెప్పారు? బతికున్న మనిషిని చచ్చిపోయిందని అబద్ధం ఆడారు. నిజమని నమ్మి నేను పెళ్లికి ఒప్పుకున్నాను. మీరు అబద్దమాడి మోసం చేయడానికి నేనే దొరికానా? ఇదొక్కటేనా? ఇంకా ఎన్ని అబద్ధాలు చెప్పారు?” భాస్కర్ మాటల్లో కాఠిన్యం.
అతను పదే పదే అబద్ధమని అంటుంటే ఈశ్వరరావుకి కోపం చాలా వచ్చింది. నిజం చెప్తే అతను చేసుకునేవాడేనా? అదే నిలదీసి అడగాలనిపించినా నిగ్రహించుకున్నాడు. అతను ఆవేశ పడ్డాడని తను కూడా ఆవేశపడితే ఎలా? పిల్లనిచ్చుకున్నవాళ్లు. అందులోనూ ఎత్తు చూపటానికి తమవైపు అనేక లోపాలు ఉన్నప్పుడు.
ఆయనింకా ఏదో చెప్పేలోగానే పెద్ద పెద్ద అంగలేసుకుంటూ భాస్కర్ వెళ్ళిపోయాడు. అతని వెనుకనే ఒకరొకరుగా మగపెళ్లివారంతా వెళ్లిపోయారు. ఎవరో వచ్చి శాంతిని లోపలికి తీసుకెళ్లారు. అప్పటిదాకా సందడిగా ఉన్న పెళ్లిపందిరంతా ఒక్కసారి అల్లకల్లోలమైంది. పెళ్లికి వచ్చినవాళ్ళకి ఏం చేయాలో తోచలేదు. ఆడపెళ్ళివారివైపు ఆహుతులు చాలావరకు దగ్గర బంధువులే. బయటివాళ్లు అతి కొద్దిమంది. వాళ్లు ఎవరికి ఏం చెప్పాలో తెలీక నిశ్శబ్దంగా వెళ్లిపోగా మిగిలినవారు ఒక దగ్గర కూర్చుని రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. ఈశ్వర్రావు తన బలగంతో సమావేశమయ్యాడు.
” అందుకే పెద్ద సంబంధం వద్దన్నాను. నువ్వు వింటేనా, అన్నయ్య? కాస్త లోకువైనవాడిని తీసుకొస్తే నోరెత్తేవాడు కాదు” తమ్ముడు కమలాకర్ ఆయన్ని సన్నసన్నగా మందలించాడు
” ఏమోరా, ఇంతదాకా వస్తుందని ఎవరనుకున్నారు ? వాళ్ళంతట వాళ్ళు చేసుకుంటామని ముందుకొస్తే ఒప్పుకున్నాను. అయినా ప్రత్యేకించి వాళ్లకు ఈ విషయం చెప్పారుమో నాకర్థమవడం లేదు” అన్నాడాయన.
” పెళ్లికి వచ్చినవాళ్లలో సగంమందికి తెలిసునీ విషయం”
” తెలిస్తే తెలిసిందిలేరా! పని కట్టుకుని పెళ్లిచెడగొట్టే వాళ్ళెవరు? అందరూ మనవాళ్ళే”
” మీలో మీరు వాదించుకోవడం కాదు. అసలు ఏం చేయాలో ఆలోచించండి” వాళ్ళిద్దరూ వాదులాడుకోవడం చూసి చిన్నాన్న వరుసయ్యే పెద్దాయన మందలించాడు.
” జరిగిందేదో జరిగిపోయింది. ఇంకాస్త కట్నం ఇస్తామని ఆశ చూపిస్తే వింటారేమో!” ఎవరో సలహా ఇచ్చారు
అప్పటికే చాలా ఖర్చయిందని ఈశ్వర్రావు ముఖం కళ తప్పింది. అతని భార్య కూడా చాలా గొడవ చేసింది. ఇంకా ఖర్చంటే అసలొప్పుకోదు. కొంత తర్జనభర్జన జరిపి అదే సరైనదని అంతా నిర్ణయించాక అతడింక తన అయిష్టాన్ని బాహాటంగానే ప్రకటించాడు.
” తండ్రి లేడు. తల్లి అక్కర్లేదని వదిలేసి పోయింది. అలాంటిదానిమీద ఇంత ఖర్చు దేనికని సావిత్రి గొడవ చేసింది. ఇంకా పెట్టడం అంటే మా పిల్లలకి అన్యాయం చేయడమే. తను ఒప్పుకోదు. ఇదే ఎక్కువ. వాళ్లు తీసుకెళ్లకపోతే మనతోనే ఉంటుంది. ఇంతకాలం ఉండ లేదా, ఇకమీదట కూడా అంతే. ఆ ఇచ్చిన కట్నం వెనక్కి తీసుకుందాం. ఇంకా ఇస్తే లోకువైపోతాం” అన్నాడు కోపంగా.
” అదేం మాటరా? పెళ్లయిన ఆడపిల్లని అత్తవారింటికి పంపించకుండా మన దగ్గరే ఉంచుకుంటామా? ఎంత పరువు తక్కువ? ఎంత చెడ్డా అదీ మనింటి ఆడపిల్లే” చిన్నాన్న మందలింపు విన్నాక ఇంకేమీ అనలేక ఊరుకున్నాడు.
పెద్దలంతా కలిసి బయలుదేరారు ఆగిపోయిన కార్యక్రమాలని కొనసాగించడానికి.
లోపల హాల్లో ఆడవాళ్ళంతా చేరి చర్చించుకుంటున్నారు. తలోమాటా అనుకుంటున్నారు. ఎప్పుడో జరిగిపోయిన చరిత్రను ఇప్పుడు తవ్వుతున్నారు. శాంతి తల్లి ఎన్నో ఏళ్ల క్రితం రెండో పెళ్లి చేసుకుంది. వీళ్ళెవరూ ఆమోదించని పెళ్లి అది. దాన్నసలు పెళ్లిగానే ఎవరూ ఒప్పుకోలేదు. అంత తెగించిన దాన్ని ఎక్కడా చూడలేదు అంటున్నారు.
” రెండేళ్ల పిల్లని గాలికి వదిలి పెట్టి తల్లి తన దారి తాను చూసుకుంటే చేరదీసి పెంచాము. ఇన్నేళ్ల శ్రమ గాలికి కొట్టుకుపోయింది. డబ్బుకి డబ్బూ వదిలింది, శనికి శనీ చుట్టుకున్నట్టు అయింది మా పరిస్థితి” అంది ఈశ్వర్రావు భార్య సావిత్రి.
ఆమె మాటల్లో శాంతిపట్ల బాధకన్నా తమ ప్రయత్నం విఫలమైందన్న ఆవేదన ఎక్కువగా వినిపించింది. ప్రశ్నార్ధకంగా మిగిలిన ఆమె భవిష్యత్తు కన్నా తమకి ఆమె బరువు ఇంకెంతకాలం అన్న భయం బయటపడింది. మిగిలిన ఇద్దరు కోడళ్ళూ కూడా ఆమెకి సానుభూతి చెప్పారు. ఇంకొంత కట్నం ఆశ చూపబోతున్నారన్న సంగతి అప్పుడే వాళ్ల దాకా వచ్చింది. కమలాకర్ వచ్చి అని వెళ్ళాడు. అప్పట్నుంచీ లోలోపల గిజగిజలాడిపోతున్నారు. ఎవరితోనూ మాట్లాడకుండా శాంతి నాయనమ్మ వర్ధనమ్మ ఒక వారగా కూర్చుని సన్నగా ఏడుస్తోంది.
” ఆ విషయం దాచి పెట్టొద్దని నేను ముందే చెప్పాను” అంది శాంతి పక్కనే తనూ కూలబడుతూ.
అంతకుముందే తనని చూసి చిరునవ్వు నవ్వాడు. అంత లో ఎంత మార్పు! ఏం జరిగింది? అమ్మ గురించి తెలియగానే అంత మార్పా? అంత తప్పు పనా ,ఆమె చేసింది? అదంత తప్పైతే ఎందుకు చేసింది? ఎన్నో ప్రశ్నలు.
తను పుట్టకముందే తండ్రి చనిపోయాడట. ఇప్పుడు తనకు ఊహ తెలియనప్పుడు వదిలిపెట్టేసిందట తల్లి. ఆమెను తన ఎప్పుడూ చూడలేదు. ఎలా ఉంటుందో తనకి తెలీదు. ఆమె జీవితాన్ని ఆమె సరిదిద్దుకుందేమోగానీ తన పట్ల చేసింది మాత్రం తప్పే. తప్పు ఆమెదైతే శిక్ష మాత్రం తనకి. అప్పట్నుంచీ ఇప్పటిదాకా. ఆమెనీ తననీ బూతు పెంచుకున్న తెగని సంకెళ్లేవో ఉన్నాయనిపించింది. అవి తెగవు. తన ప్రతి కదలికలోనూ చప్పుడు చేస్తూ కదులుతుంటాయి. అలాంటప్పుడు దాచి ఏం ప్రయోజనం?
భాస్కర్ తనని చేసుకోవడానికి ఇష్టపడి ముందుకి వచ్చినప్పటినుంచీ ఆ విషయం చూచాయగానైనా చెప్పమని అంటూనే ఉంది. ఎవరూ వినలేదు. ఇప్పటికిది ఇలా జరిగింది.
” బావుందే ! అదేమంత గొప్ప విషయమని చాటింపు వేసుకోవడానికి?” వర్ధనమ్మ కోపంగా అడిగింది.” పెళ్లయ్యాక తెలిస్తే అదే సర్దుకుపోతాడనుకున్నాం”
” తెలుస్తూనే ఉంది గొప్పతనం! పీటల మీదే తెంచుకునిపోయినవాడు ముందుగా తెలిస్తే చేసుకుంటాడు కూడానా? మా పిల్లలకోసం వెతుక్కుంటూ వచ్చాయి సంబంధాలు. తేలిగ్గా కుదిరిపోయాయి. దీనికోసం పడరాని పాట్లన్నీ పడ్డాం. కుదిరేదాకా ఒక బెంగ. కుదిరాక ఇదిగో ఇలా…” సావిత్రి ఎద్దేవాగా అంటూ వ్యవహారమంతా నడిపించిన వర్ధనమ్మనీ ,భర్తనీ సమర్థించింది.
అక్కడ ఎవరూ శాంతిని ఓదార్చే ప్రయత్నంగానీ, ధైర్యం చెప్పే పనిగానీ చెయ్యలేదు. ఎవరూ ఆమె అంతరంగాన్ని మృదువుగా స్పృశించి సాంత్వనపరిచే దిశగా అడుగు వెయ్యలేదు. ఈ కష్టం ఆమెది కాదు, తమదనుకుంటున్నారు. వదిలి పోతుందనుకున్న గుదిబండ మళ్లీ మెడకే చుట్టుకున్నట్టుంది వాళ్ళందరికీ.
వాళ్ల మధ్యని కూర్చోలేకపోయింది శాంతి. ఇంకో గదిలోకి వెళ్లి ముందుగా మధుపర్కం చీర విప్పేసింది. పూలజడ తీసి పక్కని పారేసింది. బాత్రూంలోకి వెళ్లి కళ్యాణం బొట్టు పోయేలా ముఖం రుద్ది రుద్ది కడుక్కుని మామూలు బొట్టు పెట్టుకుంది. అంతరాంతరాలలో గట్టి నమ్మకం కలిగింది, ఇంకా కట్నం అనే ప్రతిపాదనకి భాస్కర్ వప్పుకోడని. ఇంతటితో తామిద్దరికీ సరి. ఈ అనుబంధం ఇంతవరకే. తనకు ఇంతే ప్రాప్తం. అలా అనుకోగానే అప్పుడు వచ్చింది ఉప్పెనలా దుఃఖం.
ఎన్నాళ్ళీ గాలివాటు జీవితం? ఎవరికీ అక్కర్లేని బ్రతుకు? ఈ ప్రశ్నలు ఆమె మెదడుని రంపపుకోత కోస్తున్నాయి. ఆ బాధకి ఒక అంతూ దరీ లేవు. ఇంట్లో ఆమె అనుభవించిన ఆర్తీ, ఆప్యాయతలు ఏమీ లేవు. సుఖభోగాలు అసలే లేవు. అందరూ ఉన్న అనాథలా పెరిగింది. మనుషుల సందడి మధ్య ఎవరు లేని ఏకాకిలాంటి మనసుని పెంచుకుంది.
పని చేయడం, వాళ్ళు పెడితే తినడం, మర్చిపోయినట్టు వదిలేస్తే అలాగే ఉండడం…. పసి వయసులో ఏదో కావాలనే తపనతో, ఏం కావాలో తెలియని అమాయకత్వంతో నట్టింట కూర్చుని ఏడుస్తుంటే వీపు పగలగొట్టినవాళ్లే కానీ ఎత్తుకుని ఓదార్చినవాళ్ళు లేరు. కాస్త పెద్దదైన దగ్గర్నుంచి మరోరకం సమస్య. ఇంట్లో పిల్లలందరికీ పెళ్లిళ్లు అవుతూ ఉంటే ఈ పిల్లకి ఎప్పుడు చేస్తారని ఊళ్లోవాళ్ళు అడుగుతుంటే ఆ కోపం తనమీద చూపించేవారు. వానాకాలం చదువులు ఇంటర్ దాకా చెప్పించి ఆపైన మాన్పించి ఇంట్లో కూర్చోబెట్టారు. ఏ కాస్తయినా ఆమెకాయింట్లో మంచి జరిగిందంటే అది భేషజం కోసం. నలుగురూ వేలెత్తి చూపకుండా ఉండడం కోసం.
పెళ్లితో ఇంతకంటే గొప్ప బతుకు తనకి సాధ్యపడుతుందని అనుకోలేదు శాంతి. లోకంకోసం ఏదో సంబంధం చూసి చేసి పంపిస్తారని అనుకుంది. ఇదే చరిత్ర అక్కడ కూడా పునరావృతమవుతుందని భావించింది. అయితే కొంతలో కొంత స్వేచ్ఛ… స్వతంత్రం… ఎప్పటికో ఒకప్పటికి దొరుకుతాయని ఆశించింది. ఆ ఒక్క ఆశే చాలు, ఆమెకి రేపుని చూపటానికి.
అతను లెక్చరరనీ, తనని కోరి వచ్చాడనీ తెలిసి ఆశ్చర్యపడింది. ఆ తర్వాత ఈశ్వర్రావు కొంత కట్నం కూడా ఇవ్వబోతున్నాడని తెలిసి మరింత ఆశ్చర్యం. అప్పటిదాకా ముళ్ళపొదలమయంగా కనిపించిన ఊహాలోకంలో చిన్ని చిన్ని పూలు వికసించటం మొదలైంది. ఇప్పుడా పూలన్నీ వికసించకుండానే రాలిపోయాయి.
ఎంతసేపలా కూర్చుందో ఆమెకే తెలియలేదు. కాలం స్తంభించిపోయినట్టు మనసుకి అనిపిస్తే గంటలే గడిచాయని వాలుతున్న పొద్దు సూచించింది. ఆడవాళ్ళ మధ్య నుంచి ఈశ్వర్రావు గొంతు వినిపించేసరికి ఒక్కసారి ఉలిక్కిపడింది.
” నాలుగుసార్లు చర్చలయ్యాయమ్మా! తల్లిదండ్రులు కొంచెం మెత్తబడ్డారుగానీ, అతడుమాత్రం పట్టిన పట్టు వీడటంలేదు. సామాన్లన్నీ సర్దుకున్నారు. విడిదిల్లు ఖాళీ చేసి వెళ్లిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ల ఊరు వెళ్ళగానే కట్నం డబ్బులు తిప్పి పంపించేస్తామన్నారు. వాళ్ళు పెట్టిన బంగారం తిరిగిచ్చెయ్యమన్నారు. పెళ్లి ఖర్చులకింద కూడా కొంత ఇస్తామన్నారు. అన్నీ అతనే చెప్పేసాడు”
ఆయన గుండెల్లోంచీ ఆవేదన ఎగదన్నుకు వచ్చింది. తన లోకానుభవం, పెద్దరికం అన్నీ వీగిపోయాయి. అవసరార్థం చెప్పిన ఒక్క అబద్ధం… ఒకే ఒక్కటి… అదే నిప్పులా కాలుస్తోంది.
వాళ్లు వెళ్లిపోవడానికి తయారుగా ఉన్నారన్న విషయం శాంతిలో అలజడి రేపింది. అంటే… తెగతెంపులు చేసుకుంటాడా? మొదటిసారి చూసినప్పుడు అతని చూపులు తనని వెంటాడటం… ఆ తర్వాత పెళ్లి చూపుల్లోనూ, చివరగా పెళ్లిలో తెర తీసుకున్నప్పుడూ అతను తనకేసి చూసీచూడనట్టు సన్నగా నవ్వడం గుర్తొచ్చి మనసంతా అదోలా అయిపోయింది. కమ్మటి కల… ఎంతలో కరిగిపోయింది!
తను తల్లిదండ్రులు లేనిదని తెలిసే చేసుకోవడానికి ముందుకొచ్చాడంటే మంచివాడే అయి ఉండాలి. ఆ తర్వాత పెద్దనాన్న ఇంకొంచెం డబ్బు ఇస్తానన్నా ప్రలోభ పడలేదంటే… కట్నం తీసుకున్నా కూడా అతనిమీద శాంతికి గౌరవమే కలిగింది. అలాంటి వ్యక్తిలో ఇంత పంతం దేనికో! ఒక్కసారి తనుగా అతనితో మాట్లాడితే? వింటాడేమో! పరిస్థితి అర్థం చేసుకుంటాడేమో! తన నిస్సహాయతని గుర్తిస్తాడేమో! చాలాసేపు సంఘర్షించాక ఆలోచనలు ఒక కొలిక్కి వచ్చాయి.
కమలాకర్ చిన్న కొడుకు రాజుని వెతుక్కుంటూ వెళ్ళింది. అతను శాంతికన్నా రెండేళ్లు చిన్నవాడు. ఆమెంటే చాలా ఇష్టం. అతను నోట్సులవీ రాసిస్తేనే శాంతి ఇంటర్ గట్టెక్కింది. ఈ పెళ్ళి జరిగితే సుఖపడుతుందని ఆమెగురించి నిజాయితీగా ఆశించినది అతనొక్కడే. ఇలా జరిగినందుకు చాలా బాధపడుతున్నాడు.
” రాజూ!” అని పిలిచింది.
” చెప్పక్కా!” దగ్గరగా వచ్చి నిలబడ్డాడు. ఏడ్చేడ్చి ఎర్రబడ్డ ఆమె కళ్ళూ, ముఖమూ చూసి అతనికీ కళ్ళల్లో నీళ్ళొచ్చాయి. ” ఒక్క సాయం చేస్తావురా?” గొంతు తగ్గించి అడిగింది. అతను తలూపాడు. ఏం చేయాలన్నట్టు చూశాడు.” వాళ్లు వెళ్లిపోతున్నారటరా! అతన్ని ఒక్కసారి వెంటపెట్టుకుని రాగలవా? నేను డాబా మీద ఉంటాను. ఎవరికీ తెలీకూడదు” గబగబా అంది.
ఆమె తెగింపుకి అతడు తెల్లబోయాడు. సందిగ్ధంగా అడిగాడు,” వస్తాడంటావా?”
” అడిగి చూడరా!” బతిమాలుతున్నట్లుగా అంది. సరేనని చెప్పి అతను వెళ్ళిపోయాడు. ఆమె డాబామీదికి వెళ్ళింది. అక్కడికి సాధారణంగా ఎవరూ రారు. అందులోనూ ఇంటి నిండా చుట్టాలున్నప్పుడు అసలే రారు.
దాదాపు పావుగంట గడిచింది. అతను రాలేదు. రాజు కూడా రాలేదు. ఏం జరిగిందో? తనిలా పిలవడాన్ని అతనెలా అర్థం చేసుకున్నాడో? ఇంతకీ వస్తాడా, రాడా? నరాలు తెగి పోయేంత ఉద్విగ్నత ఆమెలో.
మరి కాసేపటికి మెట్లమీద అడుగుల చప్పుడు వినిపించి ఉలిక్కిపడి చూసింది. ఆఖరి మెట్టు మీద భాస్కర్ నిలబడి ఉన్నాడు. మొహంలో కోపం, అశాంతి… నిలబడ్డంలో అసహనం.
” రమ్మన్నావట?” అతని గొంతు ఖంగుమంది.
“పైకి రండి”
పెళ్లిపీటల మీద అతని సమక్షంలో ఉన్న సిగ్గు, మృదుత్వం ఇప్పుడామెలో లేవు. తెగింపు కనిపిస్తోంది. వీలైనంతవరకు అతన్ని వప్పిద్దామన్న ఆరాటం కనిపిస్తోంది.
భాస్కర్ శాంతి దగ్గరికి రాలేదు. రాదల్చుకోలేదు. అక్కడే ఉండి, ” చెప్పు” అన్నాడు.
ఉపోద్ఘాతాలవీ అనవసరం అనిపించాయి ఆమెకి. సూటిగా అడిగింది.” నేనే తప్పు చేశానని ఇంత శిక్ష విధించారు?”
” మీవాళ్లు ఆడిన అబద్ధాల్లాగే ఈ పెళ్లి కూడా అబద్ధమే అనుకుంటే ఇది శిక్షగా అనిపించదు” నిర్మొహమాటంగా చెప్పాడు.
” అదే ఎందుకని? ఇందులో నా ప్రమేయం ఉందా? మా అమ్మ రెండో పెళ్లి చేసుకోవడంలోగానీ మావాళ్లు ఆ విషయాన్ని దాచిపెట్టడంలోగానీ? పెళ్లి విషయానికి వచ్చేసరికి ఆడపిల్లకి ఎంత స్వేచ్ఛ ఉంటుందో మీకు తెలియదా? అందులోనూ బంధువుల దయాధర్మంమీద బతుకుతున్నదానికి?”
” నిజమే కావచ్చు. కానీ నా మనసు విరిగి పోయింది. నీకోసమని మా వాళ్లందరినీ ఎదిరించి ఒప్పించాను. వాళ్ళందరిముందూ నాకెంత తలవంపులైందో తెలుసా? మీ పెద్దనాన్న చెప్పిన ఏ ఒక్కమాటా నమ్మలేకపోతున్నాను. మీ అమ్మ నిజంగా మరో పెళ్లి చేసుకుందా లేక ఇల్లీగల్ గా ఎవరితోటేనా ఉంటోందా? పెళ్లే చేసుకుంటే ఆ విషయాన్ని బాహాటంగా చెప్పకుండా దాచారెందుకని?”
” అది ఇప్పటి విషయం కాదు. దాదాపు ఒకటిన్నర దశాబ్దాల కిందటిది. ఆ తరం మనుషులు వాళ్లు. అందుకే దాన్ని తేలిగ్గా తీసుకోలేకపోతున్నారు.”
” మీరిలా మోసం చెయ్యడాన్ని… నేను కూడా.”
” దయచేసి నా మాట వినండి”
” వద్దు. నాకేం చెప్పక్కర్లేదు. ఇష్టపడి వెంటపడ్డానని అందరూ కలిసి మోసం చేశారు. ఈ భేదాభిప్రాయాలతో మనం కలిసి కాపురం చెయ్యలేము. నాకు నీ పరిస్థితిపట్ల జాలిగానే ఉంది. కానీ నేనేం చేయలేను. డబ్బు విషయాలు మీ వాళ్లతో మాట్లాడాను. వెళ్లగానే విడాకుల పేపర్లు పంపిస్తాను. జరిగింది మర్చిపోయి ఎవరి దారిన వాళ్ళు బతుకుదాం” అన్నాడు చాలా స్పష్టంగా. అతను అక్కడికి వచ్చిందే తన నిర్ణయం ఆమెకి చెప్పి ఇంకే ఆశలూ పెంచుకోకుండా చేద్దామని. రాజు పిలవగానే మొదట ఒప్పుకోలేదు. ఎంతో బతిమాలాక ఆఖరికి అతని వెంట వచ్చాడు. ఇంకే ఆశా మిగిలిలేదని శాంతికి అర్థమైంది.
” మరొక్క మాట” వెనుతిరగబోతూ అన్నాడతను. ఏమిటన్నట్టు చూసింది శాంతి.” మరో ప్రయత్నం చేసేటప్పుడేనా ముందే అన్నీ మాట్లాడుకోవడం మంచిది.” అనేసి గిరుక్కుమని తిరిగి వెళ్లిపోయాడు.
అతని అడుగుల చప్పుడు ఆ నిశీధి నిశ్శబ్దంలో ప్రతిధ్వనించింది. ఆ చప్పుడు దూరమయ్యాక అతను వెళ్ళిపోయాడన్న విషయాన్ని ఆమె మనసు అప్పుడు స్వీకరించింది. తన శక్తంతా అతన్తో వెళ్లిపోయినట్టు నిలుచున్న చోటే కూర్చుండిపోయింది. ఏడుపు రావటం లేదు. ఇక మీదట తన బతుకు ఏమిటనే ప్రశ్న కళ్లముందు నిలిచింది.
” ఒక్కదానివీ ఇక్కడేం చేస్తున్నావే? నీకోసం ఇల్లంతా వెతికాను. ఏం పిచ్చి పని చేస్తున్నావోనని భయం వేసింది. రాజు వచ్చి చెప్పేదాకా ఇక్కడున్నావని తెలీదు.” అని వర్ధనమ్మ కంగారుపడుతూ వచ్చి అనేదాకా శిలలా అక్కడే కూర్చుంది. ఇల్లంతా వెతికీ, అన్ని మెట్లెక్కీ వచ్చినందుకు పెద్ద వయసువల్ల ఆవిడ కొద్దిగా రొప్పుతోంది.
” ఇక మీదట చివరిదాకా ఒక్కదాన్నే గడపాలి కదా బామ్మా!” అంది శాంతి నిర్లిప్తంగా.
” ఏం మాటలే, అవి?” ఆవిడ శాంతిని దగ్గరగా తీసుకుంటూ అంది. గొంతు రుద్ధమైంది. ” అతనిది తాత్కాలిక ఆవేశం. కొద్దిరోజులు పోతే అన్నీ అవే సర్దుకుంటాయి. పెద్దనాన్న మళ్లీ వెళ్తానంటున్నాడు. నీకు అన్యాయం జరుగుతుందేమోననేకదా, మీ అమ్మకి నిన్ను ఇవ్వనిది? అలాంటిది మేము నీకు అన్యాయం జరగనిస్తామా?” అంది. భాస్కర్ వచ్చి వెళ్లిన సంగతి ఆవిడకి తెలీదు. రాజు చెప్పలేదు.
శాంతి నిస్తేజంగా నవ్వింది. ఆ నవ్వులో ఎన్నో భావాలు.
” పద. కిందకి వెళ్దాం” అని తీసుకెళ్లింది వర్ధనమ్మ.
హాల్లో కూర్చుని గట్టిగా మాట్లాడుకుంటున్నవాళ్లంతా వాళ్ళిద్దర్నీ చూసి ఆగి మళ్లీ మాటలు కొనసాగించారు. వాళ్లలో ఈశ్వర్రావు లేడు. తన గదిలో ఉన్నాడు. ఎంతో అశక్తత ఒక్కసారిగా వచ్చి మీద పడ్డట్టయింది. జరిగింది తలుచుకుంటే దిగ్భ్రాంతిగా ఉంది. ఆ ఇంట్లో ఎన్నో పెళ్లిళ్లు జరిగాయి. ఎందరో కొత్త కోడలు వచ్చారు. కొత్త అల్లుళ్ళు వచ్చారు. కొత్త చుట్టరికాలు కలిశాయి. అందరూ తన పెద్దతనాన్ని గౌరవించారు. చిన్న చిన్న అసంతృప్తులున్నా సర్దుకుపోయారు. ఇప్పుడిలా? ఆరోజున శాంతి తల్లి తనని ఎదిరించింది. వంశంలో ఎవరూ చెయ్యని పని చేసింది. శాంతిని తెచ్చేసుకుని ఆమెకి జీవితకాలపు దుఃఖం కలిగించి బుద్ధి చెప్పాడు. కానీ ఇప్పుడీ భాస్కర్ కి ఎలా చెప్పాలి? ఏం చెప్తే వింటాడతను?
ఆయనకి పశ్చాత్తాపం మొదలైంది. మరదలి మీద పంతానికి శాంతి తీసుకు వచ్చేశాడు. ఆమె నిస్సహాయురాలుకాబట్టి అలా చెయ్యగలిగాడు. పెంచాడు. పెద్ద చేశాడు. పెంచి పెద్ద చేయడమంటే? తమది కలిగిన కుటుంబం కాబట్టి తిండికీ బట్టలకీ లోటులేకుండా పెరిగింది. కానీ దాని ఆలనాపాలనా ఎవరు చూశారని? మిగిలిన పిల్లలమీద చూపించిన ప్రేమలో వెయ్యోవంతేనా చూపించారా? ఈ పిల్ల భవిష్యత్తేంటి? తన తర్వాత దీని మంచిచెడ్డలు ఎవరు చూస్తారు? అసలిది ఏం అనుభవించిందని? పుట్టుకతోటే తండ్రి లేడు. తల్లిని తను దూరం చేశాడు. భాస్కర్ కి దీని మీద ప్రేమ లేకపోతే లేకపోయింది కనీసం జాలి కనికరం కూడా లేకపోయాయి.
దీన్ని తీసుకురాకుండా ఉంటే బావుండేదేమో! తల్లీ కూతుళ్ళని విడదీసిన పాపం ఆయన్ని బాధపెట్టసాగింది. మరదలు మరో పెళ్లి చేసుకుంటే ఆమెమీద బురద చల్లాడు. ఎవరితోనో పోయిందన్నాడు. ఆ మాటలే ఈరోజుని తన బతుకును వెక్కిరించాయి. ఇప్పుడీ పిల్ల పరిస్థితి ఏమిటి? నిస్త్రాణగా కుర్చీలో వెనక్కి వరిగాడు.
” ఎవరెంత బాధపడి ఏం లాభం? అసలు వ్యక్తి ఆ తల్లికి లేకపోయాక? దీన్నామె దగ్గరే వదిలేస్తే మనకి ఈ మనస్తాపం, అప్రతిష్టా ఉండేవి కాదు” అంది సావిత్రి.
ఈశ్వర్రావు జవాబివ్వలేదు. భార్య మాటలు తన మనసుకి అద్దం పట్టినట్లు ఉన్నాయి. నిజమే. ఎందుకు తీసుకున్నాడు ఇంత పెద్ద బాధ్యతని? ఒక పసిదాన్ని తీసుకొచ్చి పెంచి పెద్ద చేసి జీవితానికో దారి చూపించడమంటే మాటలా? అప్పుడు తెలియలేదు. ఇప్పుడు అర్థమవుతోంది. ఒక్క నిమిషం అలాగే ఊరుకుని,” శాంతీ!” అని పిలిచాడు.
ఆమె వచ్చింది.
” ఇలా రావే!” దగ్గరికి పిలిచి కూర్చోబెట్టుకుని ముఖంలోకి తదేకంగా చూశాడు. తమ్ముడి రూపం లీలగా కదిలినట్టయింది. అంతా కలిసి నా కూతురికి అన్యాయం చేస్తున్నారని ఆక్రోశించినట్టనిపించి మనసు కలచివేసింది.
” మీ అమ్మ కు దూరం చేసి నీకు అన్యాయం చేశానేమో నాకు తెలియదు గానీ అలా చేసి ఇక్కడికి తీసుకొచ్చి మాత్రం సరైన న్యాయం చెయ్యలేకపోయాను” అన్నాడు ఆవేదనగా.
పశ్చిమగోదావరి జిల్లా రెడ్డి పోలవరంలో 16 July, 1962 లో జననం. వరంగల్లో వుద్యోగం. హెడ్పోస్ట్మాస్టర్గా వరంగల్లో స్వచ్చందపదవీ విరమణ.
వివాహం శ్రీ చదలవాడ విష్ణుమూర్తిగారితో. వారు డెప్యూటీ ఏగ్జిక్యూటివ్ ఇంజనీరుగా చేసి రిటైరయారు.
మొదటి కథ అనగనగా 1978లో వనితాజ్యోతి మాసపత్రికలో అచ్చైంది. వీరివి 225కి పైగా కథలు, 9 నవలలు వివిధ పత్రికల్లో ప్రచురించబడ్డాయి. గూడు, సింధూరి, గుండెలోతు అనే కథాసంపుటాలు, నీలినక్షత్రం అనే నవల పుస్తకాలుగా వచ్చాయి. సింధూరి అనే సంపుటానికి శ్రీమతి సుశీలా నారాయణ రెడ్డి అవార్డు 2005 లో వచ్చింది. ప్రేమలోంచీ ప్రేమలోకి అనే నవలకి ఆంధ్రభూమి ప్రథమ, తిరస్కృతులు, నీకోసం నేను అనే నవలలకి ఆంధ్రభూమి ద్వితీయ, 5-3-2 అనే నవలకి కినిగె ద్వితీయ బహుమతులు వచ్చాయి. ఎంతెంతదూరం? అనే కథకి విపుల కన్సొలేషన్ బహుమతి, శ్రీమతి రంగవల్లి ట్రస్ట్ అవార్డు వచ్చాయి. ఇవికాక కథలకు మరో ఏడెనిమిది బహుమతులు వచ్చాయి.
కథలకు కాన్వాస్ పెద్దదిగా వుండాలనేది వీరి అభిప్రాయం.