“విష్ యు గుడ్ లక్”” అతను దిగేశాడు. కారు కదిలింది.
…
గోపాలకృష్ణ కిరణ్మయిని తనకి కాబోయే భార్యగా పరిచయం చేశాడు. లోలోపల ఏమనుకున్నారోగానీ పైకి అందరూ హర్షం ప్రకటించారు. అందరికీ వాళ్ళిద్దరి గురించి కాలేజీలో జరిగిన గొడవ తెలుసు. అదీకాక ఆమె అదే కాలేజీలో చదివి మానేసింది. ఆమెలో కొత్త కోణాలని అన్వేషిస్తున్నట్టు కుతూహలంగా చూశారు.
గోపాలకృష్ణ కిరణ్మయితో ఏకాంతం కల్పించుకోవాలని ఎంతగానో ప్రయత్నించాడు. అది గ్రహించి ఆమె తప్పించుకుని తిరిగింది. అతనికి ఎదురుపడాలంటే మాటల్లో చెప్పలేని సంకోచం నిలువునా ఆవహిస్తోంది. ఆఖరికి అమ్మవారి గుడిలో దొరికిపోయింది. ఆమె గుండె దడదడలాడింది. ఏం మాట్లాడతాడితను? తనకి ఈ పెళ్లి ఇష్టమో కాదో చెప్పమంటాడా? భవిష్యత్తు గురించి మాట్లాడతాడా? శాంతి గురించి ప్రస్తావిస్తాడా? ఎన్నో ఆలోచనలు ఆమెలో.
అతను అదే ప్రశ్న… ఆమె ఊహించినదే అడిగాడు.” నీకు ఈ పెళ్లి ఇష్టమేనా? అప్పుడు జరిగిన గొడవకీ, లోకనిందకీ భయపడి ఒప్పుకుంటున్నావా?”
” మీకు?” ఎదురు ప్రశ్నించింది.
అతను నవ్వాడు.” ఈ ప్రకరణాలన్నీ ఒకసారి ముగిశాయి. మళ్లీ మొదలవుతాయంటే నవ్వులాటగా ఉంది” అన్నాడు.
కిరణ్మయి చిన్నబుచ్చుకుంది. తనకి ఇష్టమేనని అతను అని ఉంటే బావుండేదా? ఇదమిద్ధంగా తేల్చుకోలేకపోయింది. అతను ఆమె భావాలని పట్టించుకోకుండా చెప్పుకుంటూ వెళ్ళాడు.
“చందూ నాతో ఈ విషయం చెప్పినప్పుడు కచ్చితంగా అలాగే అనిపించింది. ఒకసారి అన్నీ అనుభవించి, వాటన్నిటినీ పోగొట్టుకుని మిగిలాను. అలాంటి నాకు ఈ కొత్తబంధాలన్నీ ఏమిటి, ఎందుకనిపించింది. మీ నాన్నగారు చెప్పాక ఇంకొంచెం లోతుగా ఆలోచించాను. చివరిదాకా ఒక తోడుంటే మంచిదేకదా అనిపించింది. ఆ తోడు నువ్వేననేసరికి నేను మరి కొంచెం ఆసక్తిచూపించాను”
అతని మాటల్లో శ్లేష ఏమైనా ఉందా అని మథనపడింది కిరణ్మయి.
“పూర్ణయవ్వనంతో మిసమిసలాడుతూ, వైవాహికజీవితాన్ని గురించి కమ్మని కలలు కంటూ, నాతో జీవితాన్ని పంచుకోవాలని వచ్చే అమ్మాయికి నేను న్యాయం చేయలేను. శ్రీధర్ మరణం నిన్ను ఎంతగా బాధిస్తుందో నా భార్య విషయంలో నేను కూడా అందుకు మినహాయింపు కాదు. అది నీకు కూడా తెలుసు. మన వైవాహికజీవితాన్ని ఆ అవగాహనే నడిపించాలి. అదే మనని నియంత్రించాలి. ఒక్క మాటలో చెప్పాలంటే పెనుతుఫానులో సర్వం కోల్పోయి పునరుజ్జీవనం కోసం వెతుక్కుంటూ తారసపడిన అపరిచితులం మనం”
కిరణ్మయి తలెత్తి సూటిగా అతనికేసి చూసింది. నిర్మలంగా ఉంది అతని ముఖం. ఇప్పటివరకు తల్లిదండ్రుల నిర్ణయం వెనకాల దాగుంది తను. ఇప్పుడు ఇంకా సూటిగా జవాబు చెప్పాల్సిన తరుణం వచ్చింది.
” ఆ గొడవ జరిగేదాకా నాకు మళ్లీ పెళ్లిచెయ్యాలన్న ఆలోచన మా ఇంట్లో ఎవరికీ లేదు. అప్పటికప్పుడు తీసుకున్న నిర్ణయం అనుకుంటాను. అయితే మా నాన్నగారెప్పుడూ తొందరపాటు నిర్ణయాలు తీసుకోరు. ఆ నమ్మకం నాకు ఉంది. ఇప్పటికే మనిద్దరికీమధ్య కొంత పరిచయం ఉంది కాబట్టి మీతో నేను సుఖపడతానని అమ్మ వాళ్ళు చెప్పారు. సుఖం అనే మాటకి ఇంకా అర్థం మిగిలి ఉందని నేను అనుకోను. దేవుడిచ్చిన బ్రతుకుని బతకడానికి నావంతు కృషి నేను చేస్తున్నాను. ఒంటరిగాకన్నా అందుకు మీ సహకారం, తోడు, అండ ఉంటే ఎంతో బాగుంటుంది. సాంప్రదాయానికి ఎదురీదినందుకు నన్నెప్పుడూ అవమానించనని మాటివ్వండి” స్థిరంగా అంది.
అతను ఆమె తలమీద చెయ్యుంచాడు. ఆ చెయ్యి క్రమంగా భుజం మీదకు జారి ఆమెను దగ్గరికి తీసుకుంది. ఆమె అతనికి దగ్గరగా జరిగింది కూర్చుంది. టూరిస్టులు వాళ్లని తిరిగి చూసుకుంటూ వెళ్తున్నారు. ఇంతలో మిగిలిన వాళ్లంతా బిలబిల్లాడుతూ వచ్చేసారు. అప్పటికిగానీ ఇద్దరికీ బాహ్య స్పృహ కలుగలేదు. చప్పుని దూరంగా జరిగి సర్దుకున్నారు.
” అమ్మదొంగా! ఇక్కడున్నారా, మీరిద్దరూ? మీకోసం కాళ్లు పడిపోయేలా వెతికాము” అంది మంజీర అనే లెక్చరర్.
” కృష్ణా! ఇంకేమిటి ఆలస్యం? అమ్మవారి గుడి, మనసులు కలిసాయి. దండలు మార్చుకోండి” అన్నారు వయసులో పెద్దవాళ్ళయిన అతని సహోద్యోగులు. నవ్వుతూ తలూపాడు అతను. ఎవరో వెళ్లి దండలు తీసుకొచ్చారు. అమ్మవారి సమక్షంలో దండలు మార్చుకుని ఇద్దరూ భార్యాభర్తలయ్యారు. గుడి పూజారి పెళ్లి జరిగినట్టు రసీదు ఇచ్చాడు. దాన్ని రిజిస్ట్రార్ ఆఫీస్‌లో ఇచ్చి నమోదు చేసుకుంటే చట్టబద్ధంగా పెళ్లి అయినట్టే. గోపాలకృష్ణ హోటల్లో డిన్నర్ ఇచ్చాడు. చాలా సరదాగా గడిచిపోయింది ఒక్క కిరణ్మయికి తప్ప.
ఆమెకి చీకట్లో దారి తప్పిపోయినట్టుంది. ఇంకా తను ఆలోచనల్లోనే ఉంది. ఇంత హఠాత్తుగా జరిగిపోయిందేమిటి? ఇలా చెయ్యాలని ముందే అనుకున్నాడా? అమ్మావాళ్లకి తెలుసా? అతని తల్లిదండ్రులు? పెళ్లంటే ఇంత హఠాత్తుగా జరిగిపోయిందిగానీ ఇక ముందెలా? ఇది ఒక బాహ్యచర్య. ఒకరి అంతరంగంలోకి మరొకరు… అప్పటికే అక్కడ వేరొకరు నిర్మించిన దుర్బేధ్యమైన జ్ఞాపకాల కోటలు ఉన్నప్పుడు ఎలా ప్రవేశించటం? ముందుగా ఇద్దరికీ మధ్య సాన్నిహిత్యం పెరగాలి. సాన్నిహిత్యం అంటే ఇప్పటిదాకా ఇద్దరికీ మధ్య ఉన్న ఔచిత్యపు హద్దులు దాటని చనువులాంటిది కాదు. పెళ్లయ్యాక తనకీ, శ్రీధర్ కీ మధ్యన ఉన్నటువంటిది. శాంతి జన్మకి దారితీసినలాంటిది. ఎలా… ఎలా సాధ్యం?
ఫస్ట్‌నైట్ ఏర్పాటు చేస్తామన్నారు గోపాలకృష్ణ సహోద్యోగులు. కిరణ్మయికి ఆ మాటే ఎలాగో అనిపించింది. ఇబ్బందిగా… వెగటుగా… అతనంటే తనకు ఇష్టమేకానీ ఇలా కాదు. ఊబిలో కూరుకుపోతున్నట్లుగా అనిపించింది.
“మా పెళ్లి ఎలా హఠాత్తుగా జరిగిందో అదికూడా ఎప్పుడో అలాగే జరుగుతుంది, ఆర్బాటాలు లేకుండా” అని నవ్వుతూ సున్నితంగా తిరస్కరించాడు. దాన్ని ఎవరెలా ఆపాదించుకున్నారో తెలీదు. ఎందుకంటే నవ్వుతున్న కొన్ని నోళ్లపైన వెక్కిరిస్తున్న నొసళ్ళు ఉన్నాయి.
ఎక్స్కర్షన్కి వచ్చిన వాళ్లలో స్టూడెంట్స్కూడా ఉండడంచేత ఆ విషయం మళ్లీ ఎవరూ ఎత్తలేదు. తమది ఆదర్శవివాహమని వివరించి పిల్లల్లో తప్పు భావన తలెత్తకుండా చూసుకున్నాడు గోపాలకృష్ణ.
“పెద్దవాళ్ళకి చెప్పకుండా పెళ్లి చేసుకున్నారు, ఎక్స్కర్షన్ తర్వాత ఇంటికి తిరిగి వెళ్తారా? ఎక్కడికైనా పారిపోతారా?” అని అడిగింది ఒకమ్మాయి అమాయకంగా.
“ఇంట్లోవాళ్ళకి తెలీదని ఎందుకనుకుంటున్నారు? నేను పెద్దవాడిని. ఒకసారి పెళ్లై భార్య చనిపోయింది. అలాగే కిరణ్మయికికూడా. మేము మళ్ళీ పీటలమీద కూర్చుని ఆ ఆటలన్నీ ఆడుకుంటూ పెళ్లి చేసుకోగలమా? లేదు. అందుకే ఇలా” అతని జవాబుకి ఇంకెవరూ మాట్లాడలేదు.
కిరణ్మయి మనసంతా ఒకటే అలజడి. శ్రీధర్ జ్ఞాపకాలు ఆమెని పరిహసిస్తూ ఉన్నాయి. వేదమంత్రాలమధ్య ఆర్భాటంగా జరిగిన ఆ పెళ్లి… ఇప్పుడు అయ్యీ కానట్టు జరిగిన ఈ పెళ్లి…రెండూ కలా, వాస్తవమా?
మంగళస్నానాలు, పెళ్లికూతుర్ని చెయ్యటం, గౌరీపూజ, కన్యాదానం, జీలకర్ర-బెల్లం పెట్టుకోవడం, సూత్రధారణ… ఒకటేంటి? ఎన్ని తతంగాలు జరిగాయప్పుడు? ఇద్దరిమధ్యా పడిన బంధం యొక్క పవిత్రతని తెలపడానికి కొన్నీ, ఇద్దరిమధ్యా చనువు ఏర్పడటానికి ఇంకొన్నీ, వేడుకకోసం మరికొన్నీ… ఇలా ఎంతో అట్టహాసంగా జరిగింది. అదీ ఇదీ ఒకటేనా? అప్పుడు పుట్టినట్టే ఇప్పుడు ఇంకో పాపాయికి జన్మనిస్తుందా, తను? పెళ్లంటూ జరిగాక అంతేకదా మరి? అందుకేనా తను పెళ్లి చేసుకున్నది? అందుకు కాక ఏ ఉద్దేశంతో ఏమాశించి చేసుకున్నా పర్యవసానం మాత్రం అదే మరి!
దుఃఖం కరుడుగట్టుకుపోయినట్టు అనిపిస్తోంది ఆమెకి. రాయిలా బిగుసుకుపోయింది. ఆమె ముఖంలో ఏ భావాలు కనిపించాయో, పక్కనే కూర్చున్న ఆమె స్పర్శ ఏం అర్థం చెప్పిందో, గోపాలకృష్ణ వెంటనే అడిగాడు, ” ఆర్ యూ ఓకే?” అని.
ఆమె మళ్లీ వెన్నలా కరగసాగింది. ఈ ఓదార్పు, ఇతను ఇచ్చే సాంత్వనకోసమే తను పెళ్లి చేసుకున్నది. పర్యవసానం ఏదైనా కానీ. తనకంటూ చివరిదాకా చేయూతనిచ్చే వ్యక్తి కావాలని తల్లిదండ్రుల ప్రతిపాదనకి మౌనం వహించింది. పదేపదే అలా అనుకున్నాక ఆమెలో అపరాధభావన తగ్గసాగింది. తిరిగి వెళ్లే రోజు వచ్చేసింది.
కిరణ్మయికి దిగులుగా అనిపించింది. ఇంట్లోవాళ్లకి ఈ పెళ్లి విషయం ఎలా చెప్పాలి? వాళ్లేం అనుకుంటారు? వద్దువద్దంటూనే
తొందరపడిపోయిందనుకోరా? తనమీద తనకే కోపం వచ్చింది.
” మనం ఇంకొంతకాలం ఆగాల్సింది. అమ్మావాళ్లూ ఏమనుకుంటారు? నాకంటే ఆలోచన రాలేదు. మీకేనా ఉండద్దా?” అని గోపాలకృష్ణని పిలిచి కోప్పడింది. అంత చనువు ఎలా వచ్చిందో!
అన్ని చివాట్లూ తిని తాపీగా చెప్పాడు,”రాత్రి చందూకి ఫోన్ చేశాను. పెళ్లికి వచ్చిన చుట్టాలంతా వెళ్లిపోయారట. మనని మీ ఇంటికి వచ్చేయమన్నాడు”
” ఈ సంగతి చెప్పారా?” ఉక్రోషంగా అడిగింది.
చెప్పానన్నట్టు తలూపాడు.
“యూ…” చేతిలో దువ్వెన అతని మీదికి విసిరేసింది. అతను తప్పించుకుని నవ్వుతూ వెళ్ళిపోయాడు.
అతని నవ్వు చాలా ఆకర్షణీయంగా అనిపించింది. కిరణ్మయి గమనించలేదుగానీ గుడిలో సంఘటన తర్వాత అతనిలో మార్పు కనిపిస్తోంది. ఆమెలాగా ఆత్మన్యూనతగానీ, అంతర్మథనంగానీ కనిపించలేదు. ఎంతైనా మగవాడు!
…
కిరణ్మయీవాళ్లని రిసీవ్ చేసుకోవడానికి చందూ, ఉదయ స్టేషన్‌కి వచ్చారు.
” హ్యాపీ మ్యారీడ్ లైఫ్” అన్నారు ముందుగా.
కిరణ్మయి అప్రయత్నంగా వంగి వాళ్ళిద్దరి కాళ్ళకీ దణ్ణం పెట్టింది. ఉదయ ఆమెని లేవనెత్తి గుండెలకు హత్తుకుంది. ఇద్దరి కళ్ళల్లో తడి.” పద వెళ్దాం” కారు దగ్గరికి నడిపిస్తూ అంది వుదయ.
చందూ, గోపాలకృష్ణా వాళ్ళిద్దరికీ కాస్త దూరంగా వెళ్లారు. మాటలైతే వినిపించడం లేదుగానీ ఇద్దరూ సీరియస్ అవ్వడం గమనించింది కిరణ్మయి.
” వదినా! ఇలా చేశామని మీకు కోపం వచ్చిందా? నాన్న ఏమన్నారు?” బేలగా అడిగింది.
“లేదు కిరణ్! ఎవరికీ ఎలాంటి కోపం లేదు. చాలా మంచిపని చేశారు. కొన్ని పనులు వాయిదా వేయకూడదు” ఆమె మాటల్లో మెలిక వినిపించింది.
ఇద్దరూ కారు తలుపు తెరుచుకుని వెనక కూర్చున్నారు. మగవాళ్ళు ఇద్దరూ వచ్చి ముందు కూర్చున్నారు. వాళ్లు ఏదో మాట్లాడుకుంటున్నారు.
కారు శబ్దంలో ఏమీ వినిపించడంలేదుగానీ శాంతి పేరు వినిపించి, వాళ్ల మాటలు వినాలని చెవులు రిక్కించింది. అక్కడొకటీ, ఇక్కడొక అరా తప్పించి ఏమీ వినిపించలేదు.
” శాంతి ఎలా ఉంది? నాకోసం బెంగపెట్టుకుందా?” ఇంక తన ప్రయత్నం మానేసి ఉదయని అడిగింది.
పశ్చిమగోదావరి జిల్లా రెడ్డి పోలవరంలో 16 July, 1962 లో జననం. వరంగల్‌లో వుద్యోగం. హెడ్పోస్ట్‌మాస్టర్గా వరంగల్‌లో స్వచ్చందపదవీ విరమణ.
వివాహం శ్రీ చదలవాడ విష్ణుమూర్తిగారితో. వారు డెప్యూటీ ఏగ్జిక్యూటివ్ ఇంజనీరుగా చేసి రిటైరయారు.
మొదటి కథ అనగనగా 1978లో వనితాజ్యోతి మాసపత్రికలో అచ్చైంది. వీరివి 225కి పైగా కథలు, 9 నవలలు వివిధ పత్రికల్లో ప్రచురించబడ్డాయి. గూడు, సింధూరి, గుండెలోతు అనే కథాసంపుటాలు, నీలినక్షత్రం అనే నవల పుస్తకాలుగా వచ్చాయి. సింధూరి అనే సంపుటానికి శ్రీమతి సుశీలా నారాయణ రెడ్డి అవార్డు 2005 లో వచ్చింది. ప్రేమలోంచీ ప్రేమలోకి అనే నవలకి ఆంధ్రభూమి ప్రథమ, తిరస్కృతులు, నీకోసం నేను అనే నవలలకి ఆంధ్రభూమి ద్వితీయ, 5-3-2 అనే నవలకి కినిగె ద్వితీయ బహుమతులు వచ్చాయి. ఎంతెంతదూరం? అనే కథకి విపుల కన్సొలేషన్ బహుమతి, శ్రీమతి రంగవల్లి ట్రస్ట్ అవార్డు వచ్చాయి. ఇవికాక కథలకు మరో ఏడెనిమిది బహుమతులు వచ్చాయి.
కథలకు కాన్వాస్ పెద్దదిగా వుండాలనేది వీరి అభిప్రాయం.