“ఇంతేనా, ఈ ప్రేమలూ, ఆపేక్షలూ? నాన్న ఉండి అన్నీ సమృద్ధిగా ఉన్నప్పుడు చూపేదేనా ప్రేమంటే? నాకన్నా మీరు అదృష్టవంతులు. ఏవి ఎలా జరిగినా మీవాళ్లకి మీమీద ప్రేమ ఉంది” అని ఏడ్చింది. తనను ఓదార్చటం నావల్ల కాలేదు.
జ్యోతి అక్క గాయత్రి, ఆమె భర్త మమ్మల్ని వెతుక్కుంటూ వచ్చారు. గాయత్రి జ్యోతికన్నా ఆరేళ్లు పెద్దది. జ్యోతి పుట్టినప్పుడు తల్లికి జబ్బు చేస్తే తన ఆలనాపాలనా ఆమే చూసిందట. ఆమె భర్త గౌతమ్కి కూడా జ్యోతి అంటే వాత్సల్యం ఉంది.
“మీరు గొడవలుపడుతున్న విషయం మాకు తెలుసు. ఇంతకాలం నాన్నావాళ్లూ చూసుకుంటున్నప్పుడు మేమెందుకు తలదూర్చాలని కలగజేసుకోలేదు. అమ్మ ప్రస్తుతం ఉన్న స్థితిలో నీకు ఏమీ చెయ్యలేదు. అలాగని నాన్నతోపాటు నేను కూడా చచ్చిపోయాననుకుంటే ఎలాగే? ఏ ఆస్తులకీ ఐశ్వర్యానికీ తులతూగనంత ప్రేమ మీ ఆయన నీకు ఇస్తున్నాడు. ఇంక దేనికీ దిగులుపడక్కర్లేదు నువ్వు. పడ్డగోడలు పడ్డట్టు ఉండిపోవు. మళ్లీ నిలబడతాయి. నిలబడకపోతే ఇన్ని సంస్కృతులూ నాగరికతలూ ఉండవు. నాతో రావమ్మా! పురుడు అయ్యాక పాపతో తీసుకొచ్చి దిగ విడుస్తాను” అంది. గౌతమ్ కూడా అలాగే అన్నాడు.
“మీకెందుకు శ్రమ? కావలసిన వాళ్లలో కొందర్ని మేము వదులుకున్నాము. ఇంకొందరు మమ్మల్ని వదులుకున్నారు. మా తిప్పలేవో మేం పడతాము” అన్నాను స్వాభిమానంతో.
“ఎంత ప్రేమ ఉంటే మాత్రం పురుడుకూడా మీరే పోస్తానంటే ఎలా?” అంది గాయత్రి హాస్యంగా. నేను సిగ్గుపడి నవ్వేసాను.
“దాన్ని ఎత్తుకొని పెంచాను నేను. అమ్మ అనారోగ్యంతో ఉన్నప్పుడు ఏమీ తెలియని వయసులో దాని బాధ్యత మోసి పెంచుకున్న ప్రేమ నాది. మీరు ఇంకేం చెప్పద్దు. మంచిరోజు చూసి వచ్చి తీసుకెళ్తాను” అంది.
అలాగే వచ్చి తీసుకెళ్ళిపోయింది.
మనుషులు తప్పులో ఒప్పులో చేస్తూ ఉంటారు. లేకపోతే జీవితం అనబడదు. అలా చేసే స్వతంత్రం ప్రతివాళ్లకీ ఉంటుంది. చుట్టూ ఉన్నవాళ్ళనుంచి సానుకూలమైన స్పందనని మాత్రమే ఆశిస్తారు. అలాంటిది దొరకనప్పుడు దూరం జరుగుతారు. కానీ అలా దూరం జరగనివ్వకుండా పట్టుకుని మరీ వ్యతిరేక స్పందన ప్రదర్శించేవాళ్లని ఏం చేయాలి? జ్యోతిని ప్రేమగా తనతో తీసుకెళ్లిన గాయత్రి అన్నదమ్ముల మాటలనుంచి రక్షణ కల్పించలేక పోయింది. ఆమె మనసుకు అయిన గాయానికి తన మాటలతో లేపనం పూయగలిగిందిగానీ కొత్త గాయాలనుంచి కాపాడలేకపోయింది.
నెలలు నిండి జ్యోతికి పాప పుట్టింది. ఒక గండం గడిచినట్టే అనిపించింది నాకు. ఇంక తల్లీబిడ్డలని జాగ్రత్తగా చూసుకుంటూ జీవితాన్ని గడిపేయొచ్చనుకున్నాను. పాపాయిని చూస్తుంటే నా మనసు అనిర్వచనీయమైన ఆనందంతో నిండిపోయింది. పూజ గదిలో చూసిన అమ్మ ఫోటోలోనుంచి తన పోలికలు తెచ్చుకున్నట్లనిపించింది. అమ్మే మళ్ళీ పుట్టిందనుకున్నాను. గాయత్రి, గౌతంలపట్ల కృతజ్ఞత కలిగింది. ఏమిచ్చి వాళ్ల రుణం తీర్చుకోగలను?
నేను లేనప్పుడు నర్సమ్మగారు జ్యోతిని చూడ్డానికి వచ్చిందట. మసకమసకగా ఉన్న మూలగది స్త్రీల అవసరాలకు వాడుకునేవారు ఆ రోజుల్లో. అలాంటి గదిలో ప్రసవమైన కొన్ని గంటలకి… మానసిక సంఘర్షణతోటీ, నేను చెప్పిన నిజాలతోటీ నలిగిపోయి వున్న జ్యోతి తన దగ్గరికి వస్తున్న నరసమ్మగారిని చూసి బెదిరిపోయి, పెద్ద కేక పెట్టి స్పృహ తప్పి పడిపోయింది. ఏం జరిగిందోనని గాయత్రి హడలిపోయింది.
“నేనేం అనలేదమ్మా! నేనేమీ చెయ్యలేదు… పిల్ల ఊరికే భయపడిపోయింది” అని ఆవిడ తడబడుతూ చెప్తున్న సమయానికి నేను అక్కడికి వెళ్లాను.
“ఈవిడని అసలు ఎందుకు రానిచ్చారు?” కఠినంగా అడిగాను. ఆవిడ నా తల్లనో సవిత్తల్లనో కదా, అందరికీ తెలిసినది? నేను అంత కటువుగా అడిగేసరికి గాయత్రి తెల్లబోయింది.
“ఆవిడ… మీ అమ్మగారు…” ఏదో చెప్పబోతుంటే –
“ఆమె నా తల్లి కాదు. నా తల్లిని చంపేసి నన్ను బలవంతంగా లాక్కుంది. నా తల్లికి పట్టిన గతే జ్యోతికికూడా పట్టిస్తుందన్న భయంతోటే ఇంతకాలం ఇంత శ్రమపడ్డాను” నాలో ఆవేశం కట్టలు తెంచుకుంది. నర్సమ్మగారు తప్పుకుని వెళ్ళిపోయింది. డాక్టర్ని పిలుచుకుని వచ్చాను . జ్యోతికి స్పృహ వచ్చింది గానీ మన లోకంలోకి రాలేదు.
“ఏదో షాక్లో ఉంది. డెలివరీ తర్వాత కొందరికి ఇలా జరుగుతుంది. ఎవరైనా సైకియాట్రిస్ట్కి చూపించండి” అన్నాడు డాక్టరు. గాయత్రి, ఆమె మీద ప్రేమతో గౌతం డెలివరీ అయితే చేయించారుగానీ ఈ వైద్యాలెక్కడ చేయించగలరు? గౌతమ్ ముఖంలో ఆ భావాలన్నీ చదివాను. చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. దీనిని ఎలా అధిగమించాలి?
గాయత్రి తన తల్లితోటీ అన్నదమ్ములతోటీ ఏం చెప్పిందో కానీ, వాళ్ళు వచ్చి జ్యోతినీ పాపనీ తీసుకెళ్లిపోయారు. ఒక ఆడపిల్లకోసం ఇంకో ఆడపిల్లని ఇరుకున పెట్టరు ఎవరూ. కానీ ఇలా చేయబోతున్నామని నాతో ఒక్కమాటకూడా ఎవరూ అనలేదు. మా ఇద్దరి దారులూ వేరయ్యాయి. అభిమానం చంపుకుని చూడ్డానికి వెళ్లాను. లోపలికి కూడా రానివ్వలేదు. వాళ్ల దృష్టిలో నేను అసమర్థుడిని. నాకు ఇచ్చి పెళ్లి జ్యోతి గొంతుకోయడమే. ఏది ఏమైనా మా నాన్న దగ్గరికి వెళ్లకపోవడం, అంత ఆస్తి వదులుకుని కష్టాలుపడడం వాళ్లకి నచ్చలేదు.
ఒక్కసారైనా తననీ పాపనీ చూడాలని వాళ్ళ ఇంటి ముందు నిలబడేవాడిని. అక్కడ జరుగుతున్నవన్నీ నాకు తెలుస్తుండేవి. వాళ్లు భూతవైద్యం చేయించేవారు. దెయ్యం పట్టిందనేవారు. అంజనాలు వేసి తాయెత్తులు కట్టించేవారు. పరిస్థితి రోజురోజుకీ దిగజారుతోందని అర్థమైంది. జ్యోతికి సరైన వైద్యం చేయించాలంటే అందుకు డబ్బు కావాలి.
నేనలా నిలబడి ఉంటే చూడలేకనేమో జ్యోతి తల్లి పాపని ఎత్తుకొచ్చి నాకు అందించింది. చాలా బలహీనంగా, అనారోగ్యంగా ఉంది. తల్లి అనారోగ్యంతో పాపకి సరిగా సంరక్షణ జరగడం లేదు. నాకు ఏడవాలనిపించింది.
“ఒక్కసారి తనని చూడనివ్వండి” అర్ధించాను.
“డబ్బు లేని ప్రేమలు నీరు ఎండిపోయిన చెలమల్లాంటివి. అక్కడ ఒక వూబి మాత్రం మిగిలి ఉంటుంది. అది అన్ని విలువలనీ మింగేస్తుంది. నీ దగ్గరేమో పిల్ల వైద్యానికి కానీ లేదు. నీ తండ్రిగారేమో దాని పసుపుకుంకాల కింద ఇచ్చిన అరెకరం తాలూకా కాగితాలు బిగపట్టుకొని కూర్చున్నారు. మేమే వైద్యం చేయించాలని ఆయన భావం కావచ్చు. తండ్రి పోయి వేర్లు పడ్డ మగపిల్లలు ఆడపిల్లలకి అన్నీ ఇచ్చాక కూడా ఎందుకు చేస్తారయ్యా? మీకూ మీకూ మధ్య ఎన్నెన్నో ఉండొచ్చు. నా కూతుర్ని ఎందుకు బలి తీసుకుంటున్నారు? అది బతుకుతుందన్న ఆశ నాకు లేదు. అది పోగానే నీకు కబురుచేస్తాను. కర్మ చేయాల్సింది నువ్వే కాబట్టి ఇప్పటికిలా వదిలేయ్. నువ్వొచ్చి వెళ్ళావని తెలిస్తే నా కొడుకులు దాన్ని పట్టించుకోరు. ఈ మాత్రం కూడా దానికి జరగదు” పాపని తీసుకుని వెళ్ళిపోతూ అంది ఆవిడ. నేను నిర్విణ్ణుడినయ్యాను. తగలకూడని చోట ఎక్కడో దెబ్బ తగిలింది. కర్తవ్యం అర్థమైంది.
ఇంటికి వెళ్లాను.” నా భాగం నాకు పంచండి” అన్నాను నాన్నతో.
ఇది ఇలా జరుగుతుందని ముందే ఆయన ఊహించాడేమో, ఏ మాత్రం తొణకలేదు. “అంతా నా స్వార్జితమే. నీకు ఇందులో పైసా కూడా రాదు” అన్నాడు తాపీగా.
“మీది నాకు అవసరం లేదు. తాతగారిది పంచండి” అన్నాను.
ఆయన హేళనగా నవ్వి, ” నేనే అక్కర్లేకపోయాక నా తండ్రి నీకే వరసని చుట్టం అవుతాడు?” అడిగాడు.
నా సహనం నశించిపోయింది.” సరే. మీదీ వద్దు, మీ తండ్రిదీ వద్దు. కనీసం జ్యోతిది జ్యోతికి ఇవ్వండి. తను చావుబతుకుల్లో ఉంది. వైద్యం చేయించుకుంటాను” అన్నాను.
“ఇన్నాళ్లూ ఇద్దర్నీ కూర్చోబెట్టి మేపాను. నీ చదువు, ఫీజులు అన్నిటికీ చెల్లు” అన్నాడు. నాకు ఆయన్ని చూస్తుంటే అసహ్యం వేసింది. నిస్సహాయత… జ్యోతికి ఏం జరుగుతుందోనన్న ఆందోళన… పాప పరిస్థితి… నాలో తీవ్రమైన ఒత్తిడిని కలుగజేశాయి. మొదటిసారి తాగాను. తాగి ఇంటిమీదికెళ్లి గొడవ చేశాను. నాన్నని అనరాని మాటలన్నీ అన్నాను.
“దాని మీదే ప్రాణాలన్నీ పెట్టుకుని బతుకుతున్నాడు వాడు. పోనీ ఎంతోకొంత ఇవ్వరాదండీ, వైద్యం చేయించుకుంటాడు?” అంది నరసమ్మగారు నా పరిస్థితి చూసి.
“గోడకేసిన సున్నం, చెయ్యి దాటిన డబ్బూ ఒకటే. దానికి వైద్యం కన్నవాళ్ళు చేయించుకోరా? మొదటి పురుడు వాళ్ల బాధ్యత కాదా?” అన్నాడు నాన్న.
“తండ్రి పోయాడు. తల్లి అస్వతంత్రురాలు. ఇంకెవరున్నారు, దాని మంచిచెడ్డలు చూడడానికి? ఏదైనా తేడా వస్తే వీడికి మనం మొహం చూపెట్టగలమా?” అంది.
పశ్చిమగోదావరి జిల్లా రెడ్డి పోలవరంలో 16 July, 1962 లో జననం. వరంగల్లో వుద్యోగం. హెడ్పోస్ట్మాస్టర్గా వరంగల్లో స్వచ్చందపదవీ విరమణ.
వివాహం శ్రీ చదలవాడ విష్ణుమూర్తిగారితో. వారు డెప్యూటీ ఏగ్జిక్యూటివ్ ఇంజనీరుగా చేసి రిటైరయారు.
మొదటి కథ అనగనగా 1978లో వనితాజ్యోతి మాసపత్రికలో అచ్చైంది. వీరివి 225కి పైగా కథలు, 9 నవలలు వివిధ పత్రికల్లో ప్రచురించబడ్డాయి. గూడు, సింధూరి, గుండెలోతు అనే కథాసంపుటాలు, నీలినక్షత్రం అనే నవల పుస్తకాలుగా వచ్చాయి. సింధూరి అనే సంపుటానికి శ్రీమతి సుశీలా నారాయణ రెడ్డి అవార్డు 2005 లో వచ్చింది. ప్రేమలోంచీ ప్రేమలోకి అనే నవలకి ఆంధ్రభూమి ప్రథమ, తిరస్కృతులు, నీకోసం నేను అనే నవలలకి ఆంధ్రభూమి ద్వితీయ, 5-3-2 అనే నవలకి కినిగె ద్వితీయ బహుమతులు వచ్చాయి. ఎంతెంతదూరం? అనే కథకి విపుల కన్సొలేషన్ బహుమతి, శ్రీమతి రంగవల్లి ట్రస్ట్ అవార్డు వచ్చాయి. ఇవికాక కథలకు మరో ఏడెనిమిది బహుమతులు వచ్చాయి.
కథలకు కాన్వాస్ పెద్దదిగా వుండాలనేది వీరి అభిప్రాయం.