సంగమం 23 by S Sridevi

  1. సంగమం 23 by S Sridevi
  2. సంగమం 25 by S Sridevi
  3. సంగమం 26 by S Sridevi
  4. సంగమం27 by S Sridevi
  5. సంగమం 28 by S Sridevi
  6. సంగమం 29 – by S Sridevi
  7. సంగమం 31 by S Sridevi
  8. సంగమం 32 by S Sridevi
  9. సంగమం 33 by S Sridevi
  10. సంగమం 34 by S Sridevi
  11. సంగమం 35 by S Sridevi

“నువ్వు… మాట్లాడావా? పిలిస్తే వచ్చాడా?” విస్మయంగా అడిగింది కిరణ్మయి.
“వచ్చాడు. చెప్పాను, ఇందులో నా తప్పేమీ లేదని. వినిపించుకోలేదు. పెద్దనాన్నావాళ్ళు వెళ్లి బతిమాలారు. అతని తల్లిదండ్రులు కూడా సర్దిచెప్పారట. అయినా వినలేదు.”
“విడాకులు కాగితాలు ఎప్పుడు పంపించాడు?”
“పెద్దనాన్నావాళ్ళు వెళ్లి వచ్చాక. అవి చూసే పెద్దనాన్నకి హార్ట్‌ఎటాక్ వచ్చింది”
“మేంకూడా అతన్ని కలిసి మాట్లాడదామనుకుంటున్నాం శాంతీ! పెద్దనాన్నావాళ్లు విషయం దాచిపెట్టారని కోపం ఉండొచ్చు. చదువుకున్నవాడు. తల్లిదండ్రులే అర్థం చేసుకున్నప్పుడు అతను చేసుకోడా? అంతగా అయితే పెళ్ళికానుకగా ఇంకొంత డబ్బో, ఫ్లాటో, బంగారమో ఇస్తామని చెప్తాం”
“ఇవన్నీ వాళ్లూ చేశారు”
కొద్దిసేపు తల్లీకూతుళ్ల మధ్య నిశ్శబ్దం తాండవించింది.
“మీరు వెళ్తారు. అతన్ని ఏదో ఒకవిధంగా వప్పిస్తారు. అతను దయతలిచి నన్ను తీసుకెళ్తాడు. ఎప్పుడూ ఎవరో ఒకళ్ళ దయాధర్మంమీదే నేను బతకాలామ్మా? నాకు… నాకంటూ స్వేచ్ఛాస్వాతంత్రాలు ఉండక్కర్లేదా? జాలిపడి ఆదరించడమేగానీ నన్ను నన్నుగా ఎవరూ ఎప్పటికీ గుర్తించరామ్మా? ఇక్కడికి రానంతవరకు నా బతుకు అంతేననుకున్నాను. ఇక్కడికి… అంటే మీమధ్యకి వచ్చాక నేను ఎంత నష్టపోయానో అర్థమవుతోంది. నాకూ నీలా గర్వంగా తలెత్తుకుని తిరగాలని ఉంది. నువ్వేదో చేశావని నన్ను చిన్నచూపు చూసే మనిషి నాకక్కర్లేదు” అంది శాంతి తన మనస్సులోని భావాలకి మాటల రూపం ఇచ్చి తల్లి ముందు పరుస్తూ.
కొద్దిసేపటి క్రితమే భాస్కర్ని గుర్తు తెచ్చుకుని ఏడిచి, అంతలోనే అతను అక్కర్లేదని చెప్తున్న శాంతికేసి తదేకంగా చూసి నవ్వింది కిరణ్మయి. ఇది ఇంకా చిన్నపిల్లే! తనకు ఏం కావాలో ఏమి అక్కర్లేదో నిర్ణయించుకునే వయస్సూ, అనుభవం రెండూ లేవు. తన విషయంలో ఇలాంటి సందిగ్ధావస్థలో తల్లిదండ్రులూ, అన్నావదినలూ ఏకపక్షంగా నిలిచి చక్కటి నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడలాంటి నిర్ణయం తీసుకోవడం తన వంతు… అనుకుంది.
“నాకాళ్ళమీద నేను నిలబడి నాకొక స్థాయి అంటూ ఏర్పడేదాకా భాస్కర్ ప్రసక్తి తేవద్దమ్మా! నన్ను ఇష్టపడి చేసుకుంటానని ముందుకొచ్చి నీగురించి విని తెగతెంపులు చేసుకుని మళ్లీ మీరు వెళ్లి ఏదో ప్రలోభపెడితే చేసిన పొరపాటు సరిదిద్దుకునేతరహాలో మీరు కలిపినా మామధ్య ఆ బేధాలూ అపోహలూ అలాగే ఉంటాయి. ఒకసారి పెద్దవాళ్ల జోక్యం తదితర ప్రకరణాలన్నీ ముగిసాయి. మళ్లీ వద్దు. తనంతట తను అతను తప్పు తెలుసుకోవాలి. నన్ను నన్నుగా స్వీకరించడానికి రావాలి” తల్లి మనస్సు చదివినట్టు స్థిరంగా అంది శాంతి.
ఈమాటు కిరణ్మయి నివ్వెరపోయింది, ఆ అమ్మాయిని ఎలా అర్థం చేసుకోవాలో తెలిక.
” నాకేదైనా జాబ్ కావాలమ్మా!” అంది శాంతి.
” ఇంటర్‍కి ఏం జాబ్ వస్తుందే?” అడిగింది కిరణ్మయి.
” మరైతే ఏం చదివితే వస్తుంది?”
“అర్జెంటుగానా?” కిరణ్మయి నవ్వింది.” లే, ముఖం కడుక్కో. తయారైతే అలా బజారుకెళ్లి వద్దాం. కూరగాయలు తెచ్చుకోవాలి. ఫ్రిజిలో పళ్లేమీ లేవు. మనో స్కూల్ మిడ్డీలు కుట్టి ఇస్తానన్నాడు టైలరు. తీసుకురావాలి. బోల్డన్ని పనులు” అని హడావుడిపడుతూ లేచింది.
శాంతి అన్న ప్రతిమాటా గోపాలకృష్ణకి చేరిపోతుంది. కిరణ్మయి వాళ్లిద్దరికీమధ్య వారధి. గోపాలకృష్ణ అభిప్రాయాలు ఆమెలో ప్రతిబింబిస్తాయి. శాంతిగురించి అతనితో చర్చించడానికి ఆమెకు ఎలాంటి సంకోచం ఉండదు.
“దానికి చదువుమీదకన్నా తన కాళ్ళమీద తను నిలబడాలన్న విషయంమీద ఎక్కువ శ్రద్ధ ఉంది. అక్కడేం గొడవలు పడ్డారో, అతనేమన్నాడోగానీ అతని దగ్గరికి వెళ్లడానికి సుముఖంగా లేదు” అంది.
“ఆ ఆలోచన మంచిదే కిరణ్! ఇప్పటిదాకా తనదైన పద్ధతిలో పెరిగింది. ఆ పెళ్లీ, అనుభవం, అవమానం అన్నీ తనవే. తనకి ఏది మంచిదనిపిస్తే అదే చెయ్యనీ” అన్నాడు.
“ఈలోగా అతను మరో పెళ్లి చేసుకుంటే?” ఆమె భయాన్ని వ్యక్తపరిచింది.
“అలాంటి ఉద్దేశం అతనికిగాని ఉంటే నువ్వు ఆపగలవా?” గోపాలకృష్ణ సూటిగా అడిగాడు.
“కాదండీ! దీని భవిష్యత్తు?” ఆమె గొంతు రుద్ధమైంది.” ఇలాంటి పరిస్థితి ఎదురవుతుందనుకోలేదు” అంది.
“పెళ్లితోనే బతుకా కిరణ్? శాంతికి ఏమంత వయస్సు మించిపోయిందని? ముందు మానసికంగా, ఆర్థికంగా నిలదొక్కుకోనీ. తర్వాత ఏదో ఒకదారి కనిపించకపోదు. అతనికీ ఇష్టంలేక శాంతికీ ఇష్టంలేక ఎందుకా కలయిక? పోనీ, శాంతి అతనికోసం బాధపడుతోందంటే అది వేరు” అన్నాడు. అందులో కిరణ్మయికి ఏదో వెలితిగా అనిపించింది. కానీ రాజీపడటం మినహా మరొక మార్గం లేదు. తను నడుస్తున్న దారి వర్ధనమ్మ చెప్పినచోటికే సాగుతుండటం బాధ కలిగించింది.
కెరీర్ గైడు కొనుక్కొచ్చి కిరణ్మయికి ఇచ్చాడు గోపాలకృష్ణ శాంతికిమ్మని.
ఎక్కడి వాళ్ళు అక్కడికి వెళ్లిపోయాక శాంతి టీవీ ముందు కూర్చుని దాన్ని యథాలాపంగా తిరగేసి కొద్దిసేపటికే అందులో నిమగ్నమైపోయింది. నిలదొక్కుకోవడానికి మనిషికి ఎన్ని అవకాశాలో! వండుకోవడం, తినడం, ఇల్లు సర్దుకోవడం… ఇలాంటి చట్రంలోంచి బయటికి రావడానికి ఆడవాళ్లకి ఎన్నిమార్గాలో! తిండికోసం తాపత్రయపడటం ప్రతిమనిషికీ తప్పదు. నిజమే! మగవాడు ఒకసారి తినడం అయాక ఇంక ఆ ఊసే ఎత్తడు. కానీ దివారాత్రాలూ ఆడవాళ్లకు మాత్రం అదే బతుకు అయిపోయింది. తెల్లారి లేచిన దగ్గర్నుంచి అర్ధరాత్రిదాకా ఊపిరిసలపని పనితో సతమతమయ్యే పెద్దమ్మలనీ, మేనత్తలనీ ఇంకా ఎందరో అటువైపువాళ్ళని చూసింది. పుట్టుకకి అర్ధం పరమార్థం అంతే కామోసుననుకుంటూ వచ్చి తల్లి దగ్గర కొత్తఅర్థాల్ని గ్రహించింది.
ప్రతిపనీ కిరణ్మయే చెయ్యాలన్న నియమం లేదిక్కడ. ఎవరు ముందులేస్తే వాళ్ళు పాలపేకట్లు కత్తిరించి, పాలు స్టౌమీద సిమ్‍లో పెడతారు. తర్వాత లేచినవాళ్ళు కూరగాయలు తరిగి అక్కడ పెడతారు, బియ్యం, పప్పు కడిగి కుక్కర్లలో పెడతారు. ఆఖరికి శీనుకూడా ఏదో ఒకటి అతని వయసుకి చాతనైంది చెయ్యడం చూసింది శాంతి. మంచినీళ్ళ సీసాలు నింపి ఫ్రిజిలో పెట్టడం, కూరలు బజారునించీ తెస్తే వాటిని విడికవర్లలో వేసి ఫ్రిజిలో పెట్టడం… ఇలా. పనులన్నీ చులాగ్గా ఐపోతాయి. ఎవరి ప్లేటు వాళ్ళు కడిగేసి, స్టాండులో పెడతారు. అనీఅనిపించని, కనీకనిపించని క్రమశిక్షణ.
అన్నిదారులూ మూసుకుపోయాక ఆఖరి ప్రత్యామ్నాయంగా తల్లి దగ్గర చేరాననుకున్న ఆమెకి ఒక్కసారి ఎన్నో ద్వారాలు తెరుచుకుని ప్రపంచం వేలవేల చేతులతో తనని ఆహ్వానిస్తున్నట్లు అనిపించింది. తను అన్నివిధాలా ఓడిపోయింది, ఎందుకూ పనికిరాదనిపించిన ఆత్మన్యూనత ఆవిరైపోయింది.
ఇంటీరియర్ డెకరేషన్, ఫ్యాషన్ టెక్నాలజీ, బ్యూటీషియన్ కోర్సులు… పెద్దపెద్ద చదువులు అవసరంలేని ఎన్నోకోర్సులు శాంతిని ఆకర్షించాయి. నచ్చినవన్నీ అండర్ లైన్ చేసింది. మధు కాలేజీనుంచి వచ్చి శాంతి చేతిలో పుస్తకాన్ని చూసి కుతూహలంగా తీసుకుంది.
“అబ్బా! వండ్రఫుల్. శాంతీ! ఇల్లూ కాలేజీ తప్పించి ఇంకో ప్రపంచం. .. ఇంత విస్తృతమైన ప్రపంచం ఉందని నాకు తెలీదు. ఎక్కడిది నీకిది?”” అడిగింది మెరుస్తున్న కళ్ళతో.
ఇంజనీరింగ్‍కోసం ప్రిపేర్ అవుతున్న మధు మాటలు శాంతికి ఆశ్చర్యాన్ని కలిగించాయి. “”అమ్మ ఇచ్చింది. నాకు నచ్చిన కోర్సులు అండర్ లైన్ చేశాను” బిడియంగా అంది. మధూవాళ్ల ముందు కిరణ్మయిని అమ్మ అనటానికికూడా సంకోచమే.
” కచ్చితంగా అమ్మ సెలక్షనై ఉండదు ఈ పుస్తకం. నాన్నకే ఇలాంటివన్నీ ఆసక్తి” అంది మధు. గోపాలకృష్ణ ఈ పుస్తకం తనకోసం కొన్నాడనేసరికి గమ్మత్తయిన భావం కలిగింది శాంతికి.
“ఫర్ హెవెన్స్ సేక్… మనకి డబ్బుకోసం ఇవేవీ నేర్చుకోవలసిన అవసరం లేదు శాంతీ! సరదాగా… కేవలం సరదాగా ఏ ఒక్కటి నేర్చుకున్నా జీవనశైలే మారిపోతుంది తెలుసా? మంచి గ్రాడ్యుయేట్ డిగ్రీయో పోస్ట్‌గ్రాడ్యుయేట్ డిగ్రీయో చేతిలో ఉండాలి. ఆపైన ఇలాంటి సర్టిఫికేషన్ ఉంటే కెరీర్ అద్భుతంగా ఉంటుంది. ఉద్యోగం అంటే అయిష్టంగా చేస్తాము. హాబీ అంటే ఇష్టంగా చేస్తాము. అంటే… హాబీతో సుఖంగా బతికేస్తామన్నమాట” అంది మధు. ఆమె మాటలన్నీ గజిబిజిగా అనిపించాయి శాంతికి.
“ఒక సలహా ఇవ్వనా?” మళ్లీ తనే అంది మధు. ఏమిటన్నట్టు చూసింది శాంతి.
“వీటితోపాటు ఇంగ్లీషు టకటకా మాట్లాడటం నేర్చుకో. డిగ్రీ చెయ్యి. ఈ రెండూ చాలా అవసరం” అంది.
శాంతి కోణం వేరు. మధు కోణం వేరు. తల్లిదండ్రుల ప్రేమతో ఆప్యాయత అనుబంధాల మధ్య అపురూపంగా పెరిగింది మధు. ఈ ఇల్లు తనది. తల్లితండ్రులు తనకోసం ఏదైనా చేస్తారన్న ధీమా ఉంది. ఏదైనా తలుచుకుంటే సాధించుకునే పట్టుదల ఉంది. దానికి తగిన ప్రోత్సాహం ఉంది.
శాంతికలా కాదు. ఎక్కడా కాళ్లకింద నేల లేదు. ఎవరో ఒకరిని వూతం చేసుకుని నిలబడటమే ఇప్పటిదాకా. ఇప్పటికి కాస్త నేలానింది. నిలదొక్కుకునే ప్రయత్నం చెయ్యాలి. తనదైన ప్రపంచాన్ని నిర్మించుకోవాలి.
అదే తపన.
అయినా మధుని చూస్తే శాంతికి అసూయలాంటివేమీ కలగవు. వయసులో పెద్దదానిగా ఆమెపట్ల వాత్సల్యం ఉంది. అభిమానం, ఆరాధన ఉన్నాయి. తల్లికూడా ఇలాగే ఉండేదా అని ఊహించుకుని ఇంకో నాలుగైదేళ్లలో మధులో రాబోయే మార్పుల్ని ఊహించుకుని తల్లి తనని ఎత్తుకుని తిరిగిన రూపాన్ని చిత్రించుకోవడానికి ప్రయత్నిస్తుంది.
మధు, శాంతికి ఎన్నో విషయాలు చెప్తుంది. కాలేజీగురించీ కాలేజీఫ్రెండ్స్ గురించీ చెప్తుంది. తనెప్పుడూ చూడకపోయినా మధు స్నేహితులు ఎవరో వాళ్ళ అలవాట్లేమిటో అన్నీ శాంతికి తెలుసు. అక్కకి జడేస్తుంది. పొడవైన శాంతి జుత్తు చూసి ఆశ్చర్యపోతుంది. నీకింత జుట్టు ఉంది, నాకెందుకు లేదని అలుగుతుంది. చీర అలా కాదు, ఇలా కట్టుకో అంటుంది. సరదాకైనా తన చుడిదార్ డ్రెస్సులు వేసుకొమ్మని గొడవచేస్తుంది.
“దీని అల్లరి నువ్వెలా భరిస్తున్నావమ్మా?” అంది శాంతి తల్లితో నవ్వుతూ.
“ఇంకా ఏం చూసావు? పరీక్షలు దగ్గరపడుతున్నాయని బుద్ధిగా చదువుకుంటోందిగానీ, పాటలతో ఇల్లంతా హోరెత్తించదూ? ఇంక దాని ఫ్రెండ్స్ వచ్చారా, ఇల్లు పీకి పందిరేస్తారు” అంది కిరణ్మయి. “మనో అలాకాదు. చాలా నెమ్మది. ఇద్దరికీ అసలు పోలికే లేదు. మేమిద్దరం పక్కన నిలబడకపోతే వీళ్ళిద్దర్నీ అక్కాచెల్లెళ్లంటే ఎవరూ నమ్మరు”
శాంతి చిరునవ్వుతో విన్నది తల్లి మాటల్ని.” చిన్నప్పుడు నువ్వు చాలా అల్లరి చేసేదానివి. ఇప్పుడెంత కుదురు వచ్చిందో తెలుసా?” అడిగింది కిరణ్మయి.
అప్పటి జ్ఞాపకాలని గుర్తు చేసుకుంటున్నట్టు ఆమె చూపులెక్కడో చిక్కుపడ్డాయి. కొద్దిసేపటికి సర్దుకుని లేచి వెళ్లి శాంతి చిన్నప్పటి ఫోటోలున్న ఆల్బమ్ తీసుకొచ్చింది. అన్నీ ఒంటరి ఫోటోలు. అమ్మమ్మ తాతయ్యలతోటీ, మిగిలిన కుటుంబసభ్యులతోటీ తీయించుకున్న ఫొటోలు. ఒక్క ఫోటో మాత్రం తల్లితో ఉంది.