సంగమం 24 by S Sridevi

  1. సంగమం 24 by S Sridevi
  2. సంగమం 30 by S Sridevi

అమ్మ ఎంత కళాహీనంగా ఉంది! నమ్మలేనట్టు, విభ్రాంతిగా తల్లి ముఖంలోకి చూసింది.
“నాన్న నేను పుట్టకముందే చనిపోయారా?” కుతూహలంగా అడిగింది. అందులో తల్లిని నొప్పిస్తున్నానేమోనన్న స్పృహ లేదు.
“అవునమ్మా!” కిరణ్ ని జవాబిచ్చింది. అంతే. శాంతి ఇంకేమీ అడగలేదు.
రాత్రులు పిల్లలంతా ఒకగదిలో పడుకుంటారు. మధు, శాంతి పక్కన చేరుతుంది. శాంతికి రెండోవైపుని చేరడానికి మానసకీ, శీనుకీ పోటీ.
ఎర్లీటీన్స్‌లో ఉన్న మానస మధుకి చాలా చిన్నపిల్లలా అనిపిస్తుంది. టీనేజీ దాటిన శాంతికి తను కూడా అలాగే కనిపిస్తున్నాననుకోదు. ఎన్నో కబుర్లు చెప్తుంది. రహస్యాలని పంచుకుంటుంది.
“అక్కా! బావగారు ఎలా ఉంటారు?” ఒకరోజు హఠాత్తుగా అడిగింది. శాంతిని చూసిన మొదటిరోజునుంచి అడగాలనుకుని అడగకుండా ఆగిపోయిన ప్రశ్న అది.
లోపలిగదుల్లో ఏమో సర్దుతున్న కిరణ్మయికూడా ఆ ప్రశ్నని వింది. శాంతి ఏం జవాబిస్తుందోనని కుతూహలంగా చెవులు అప్పగించింది. గోపాలకృష్ణా అక్కడే ఉన్నాడు.
“ఎలా అంటే?” మాట మార్చాలని ప్రయత్నించింది శాంతి.
” తరుణ్‍లా ఉంటారా? జాన్ అబ్రహంలాగా? షారుక్ ఖాన్… అమీర్ ఖాన్… అక్షయ్?”
“అబ్బబ్బ! ఆపవే నీగోల. మనవాళ్లు మరొకళ్ళలా ఎందుకుంటారు? భాస్కర్ భాస్కర్‍లాగే ఉంటాడు. ఎవరిలాగా ఉండడు. నీకు పెద్దకబుర్లు దేనికి? చక్కగా చదువుకుంటూ పడుకో. లేకపోతే అమ్మని పిలుస్తాను. నీకూ చేస్తుంది పెళ్లి” గుండెల్లో వ్యక్తిని రేగిన అలజడిని అణుచుకోవడానికి మధుని కాస్త ఎక్కువే కేకలేసింది. మధు మూతి ముడుచుకుని అటు తిరిగి పడుకుంటే మానస కిసుక్కున నవ్వింది.
లోపల గోపాలకృష్ణ కూడా కిరణ్మయిని చూసి నవ్వాడు.” పర్వాలేదు. గట్టిదే నీ కూతురు” ప్రశంసగా అన్నాడు.
“దానికాపాటి గట్టితనం, తెలివీ ఉంటే నాకింకే దిగులూ లేదు” అంది కిరణ్మయి.
“అతనెవరో ఏమిటో రేపు నెమ్మదిగా కనుక్కో. వెళ్లి మాట్లాడదాం. మనం వెళ్లి చెప్తే వింటాడేమో చూద్దాం” అన్నాడు సాలోచనగా.
మర్నాడు ఉదయం శాంతి బాగా పొద్దెక్కినా లేవలేదు.
“రాత్రి అక్క బాగా ఏడ్చింది” మానస తల్లితో చెప్పింది. కిరణ్మయి గుండె ద్రవించింది.
“నాకు అప్పుడే ఎందుకు చెప్పలేదు? నువ్వు ఎప్పుడు చూసావు?” అని అడిగింది.
“మధ్యరాత్రి దాహం వేసి మెలుకువ వచ్చింది. కళ్ళు తెరిచి చూస్తే బెడ్‍లైట్‍కూడా లేదు. చీకట్లో భయం‍వేసి అక్కమీద చెయ్యి వేద్దామనుకుంటే తను ఏడుస్తోంది. ఎందుకు ఏడుస్తున్నావని అడిగాను. ఏడవడంలేదని చెప్పిందికానీ నాకు తెలుసు, తను చాలాసేపు ఏడ్చింది” చెప్పింది మానస.
కిరణ్మయి శాంతి పడుకున్నదగ్గరికి వెళ్ళింది. అప్పుడే ఆమె నిద్రలేచింది. తల్లిని చూసి తలదించుకుంది. నిద్రలేమితోటీ, దుఃఖభారంతోటీ కళ్ళు ఎర్రగా ఉన్నాయి. కిరణ్మయి ఆమె తల గుండెలకు హత్తుకుంది.
“ఎందుకు శాంతీ, ఈబాధ? మీ బామ్మ నాకు అతని అడ్రస్ సరిగా చెప్పలేదు. అతనిదో అతని తల్లిదండ్రులదో అడ్రస్ ఇవ్వమ్మా! మేం వెళ్లి మాట్లాడతాం” అంది ప్రేమగా.
శాంతి తల్లి గుండెల్లో తల దాచుకుంది. ఏడుపు వస్తుంటే బలవంతంగా ఆపుకుంది.
“అతనిమీద ప్రేమ కాదమ్మా ఇదంతా. అప్పుడే మంగళసూత్రధారణ అయ్యింది. ఎవరో అతన్ని బయటికి తీసుకెళ్లారు. తిరిగి వచ్చి మొరటుగా నాభుజం పట్టుకుని లేపి, మీ అమ్మ చచ్చిపోయిందని అబద్ధం చెప్పారని నిలదీసినప్పుడు… అతని స్పర్శలోంచి ప్రవహించిన అసహ్యం, జుగుప్సా నేను మర్చిపోలేకపోతున్నాను. అతన్ని పిలిచి మాట్లాడినప్పుడు కూడా నన్నో పురుగును చూసినట్టు చూసి, నీదెంత నీచమైన పుట్టుకో అనడాన్ని కూడా మర్చిపోలేకపోతున్నాను. నా తప్పేముందని నాకీ అవమానం? అంతేగానీ అతన్ని తలుచుకుని ఏడవడానికి మా ఇద్దరి మధ్యనీ ఒక్క ప్రేమ సంభాషణ కూడా జరగలేదు. ప్రేమించికూడా బేరసారాలతో కుదుర్చుకున్న పెళ్లి మాది. అంతేగానీ నన్ను వలచీ తా వలపించీ చేసుకున్న దక్షిణనాయకుడు కాదు. అతను గుర్తొచ్చి ఇప్పుడైనా ఏడిస్తే అవమానంతో ఏడుస్తాను. అంతేగానీ ప్రేమతో కాదు”
కిరణ్మయి నిరుత్తరురాలైంది. కూతురి మనసెంత గాయపడిందో అర్థమైంది. అర్థంకాకుండా మిగిలిందంటూ ఏమీ లేనంతగా అర్థమైంది. మానాభిమానాలతో, రక్తమాంసాలతో పుట్టిన ఆడపిల్లని పరస్పర ప్రయోజనాలకోసం చేసుకునే మగవాడు ఆ పెళ్లిని సమాజానికి అంకితం ఎందుకు చేస్తాడోమాత్రం అర్థం కాలేదు. భాస్కర్ అంతర్గత భయాలేమిటి? సమాజమా? అంతకన్నా లోతైనదా?
“శాంతీ! రెండేళ్లపిల్లని వాళ్లు తీసుకెళ్లిపోయారు. నీ కష్టాల్లోగానీ సమస్యల్లోగానీ నేనెప్పుడూ నీకూడా లేను. నీది ఒంటరి పోరాటమే. మంచేదో, చెడేదో అమ్మానాన్నల ఒద్దికలో, భర్త సంరక్షణలో బతికిన నాకన్నా నీకే బాగా తెలుస్తుందని నా నమ్మకం. నీకేది మంచిదనిపిస్తే అదే చెయ్యి. నీకూడా మేమిద్దరం ఎప్పుడూ ఉంటాము. బాధపడి మనసు పాడుచేసుకోకు. దిగులుపెట్టుకుని క్రుంగిపోకు. గడిచిపోయిందిమాత్రమే జీవితం కాదు. మిగిలి ఉన్నది కూడా జీవితమే. ఎన్నోరోజులు ముందున్నాయి. వాటిని అందంగా తీర్చిదిద్దుకో. ఇది నేను నేర్చుకున్న పాఠం. నీకు నేర్పిస్తున్నాను” అంది తడికళ్ళతో.
శాంతి మౌనంగా ఉండిపోయింది. కాసేపటికి ఇద్దరూ ఇవతలికి వచ్చారు. అప్పటికి గోపాలకృష్ణ తప్ప మిగిలినవాళ్లంతా వెళ్లిపోయారు. అతనికీ తల్లికీ మధ్యని కూర్చుని భోజనం చేసింది శాంతి. మనసుకి తప్పు చేసినట్లు అనిపించింది, ఆయన తనపట్ల చూపిస్తున్న కన్సర్న్‌కి తను సరైన విలువ ఇవ్వడంలేదని. ముగ్గురిమధ్యా పెద్దగా కబుర్లు నడవలేదు. వడ్డనకు సంబంధించినదితప్ప ఇంకేం మాట్లాడుకోలేదు. భోజనం చేసి గోపాలకృష్ణ కాలేజీకి వెళ్లిపోయాడు. కిరణ్మయి తన సబ్జెక్టుకి సంబంధించిన పుస్తకం చదువుతూ, శాంతి ఏదో నవల చదువుతూ మిగిలిపోయారు.
సాయంత్రం వచ్చీ రాగానే మధు జరిగినదానికి శాంతికి సారీ చెప్పింది.” నువ్వూ బావగారూ తరుణ్ శ్రియలా ఉంటారా, నాగార్జున అసిన్‍లా ఉంటారా అని జస్ట్ కుతూహలం… అంతే” అంది.
శాంతి పెదాలు నవ్వేసింది. “అబ్బా! ఆపవే నీ సినిమాగోల” అని మురిపెంగా కసిరింది.
“ఈవేళ మా కాలేజ్‍లో అంత్యాక్షరీ ఆడుకున్నాం. రేపు కాలేజ్‍డే. అందుకని క్లాసులేమీ జరగలేదు. భలే ఎంజాయ్ చేసాం” అని మాట మార్చింది మధు. అంతా డాబామీదికి చేరారు
శ్రీను వచ్చి శాంతి పక్కన కూర్చున్నాడు.” ఇప్పుడు మనంకూడా ఆడదాం. నేనూ అక్కా ఒక పార్టీ” అన్నాడు.
“పొట్టి బుడంకాయ్! నీతోటే ఆడాలి… ఆడక ఆడక” మానస వెక్కిరించింది.
“ఆడదాం. అంతే” శ్రీను పంతం పట్టాడు.
“ఓకే ఓకే” అంది మధు. అంతే! ఆట మొదలుపెట్టారు. శాంతి చూస్తూ కూర్చుంది. కాసేపటికి కిరణ్మయి, ఆ తర్వాత గోపాలకృష్ణ వచ్చి కలిశారు.
“నువ్వు నోరు తెరవ్వేమే?” అడిగింది కిరణ్మయి. మొహమాటంగా నవ్వింది శాంతి. అక్కడ అన్నిటికీ దూరంగా ఉండటంతో ఇక్కడ దేంట్లోనూ కలవలేకపోతోంది. బలవంతంగా రెండు పూర్తి పాటలు పాడించింది మానస.
“నీ గొంతు అమ్మ గొంతులా భలే ఉంది” అంది మధు.
పాటలు పాడి పాడి అలిసిపోయారు. కిరణ్మయిలో మరో కోణాన్ని చూసింది శాంతి.
“భోజనాలకి లేవండిక” అంది కిరణ్మయి.
“ఇక్కడే తిందాం. ఆరుబయట వెన్నెల్లో తింటే చాలా బాగుంటుంది” అన్నాడు గోపాలకృష్ణ.
అందరూ కలిసి చకచక ఏర్పాట్లు చేశారు. కిరణ్మయి కంచాల్లో వడ్డించింది. గుండ్రంగా కూర్చుని తినటం మొదలుపెట్టారు.
“శాంతీ! నీచదువుసంగతి ఏమైంది?” ఉన్నట్టుండి అడిగాడు గోపాలకృష్ణ. అతనంత సూటిగా అడుగుతాడని ఊహించలేదేమో శాంతి తడబడిపోయింది.
“ఇంకా ఏమీ అనుకోలేదు” అంది.
“ఇప్పుడు నువ్వంత అర్జెంటుగా ఏదో ఒక ఉద్యోగం చేసి ఏం సాధించాలి? ముందు బిఏకి కట్టు. సంవత్సరం మధ్యలో కాబట్టి కాలేజీలో సీటు దొరకడం కష్టం. అలాగని సంవత్సరం వృధా చేసుకోకూడదు. డిస్టెన్స్ లర్నింగ్ ద్వారా డిగ్రీ చేయొచ్చు. నీ వయసెంత? ఇరవై…ఇరవయ్యొకటి కావచ్చు. ఇంకా ఏజి ఉంది. సివిల్ సర్వీసెస్‍కి ప్రిపేర్ అవ్వు. ఇప్పటినుంచే మొదలుపెడితే మంచిది” అన్నాడు.
శాంతికి తింటున్న అన్నం పలమారింది. సివిల్ సర్వీసెస్ అంటే ఏమిటో అర్థం కాలేదు వెంటనే. ఆమాటకే అర్థం తెలియని తనకి అంతంత ఆశలు పెట్టుకునే అర్హత ఉందా అని తెల్లబోయింది ఆ వెంటనే.
“నేనా?” అడిగింది అపనమ్మకంగా.
“ఏం? మధు ఐఐటీలో ఇంజనీరింగ్ చదువుతుందట. ఇప్పటిదాకా అంత్యాక్షరిలో మనందరినీ అవలీలగా ఓడించిన దీని బుర్రలో చదువుకీ పాఠాలకీ చోటేమైనా ఉందంటావా? సినిమాపాటలతో క్రిక్కిరిసిపోయిన దీని మెదడులో పాఠాలు దూరేందుకు సందు ఉందా? అయినా ఇంజనీరింగ్ చదువుతానంటోంది. కష్టపడుతోంది. ఆపాటి కష్టం నువ్వు పడలేవా? చెయ్యలేమని చేతులు ముడుచుకుని కూర్చున్నంత కాలం ఏమీ చేయలేము. చేయాలనుకుంటేనే కనీసం మొదటి అడుగేనా వేస్తాము. ఆ అడుగు మనని ఎంత ఎత్తుకు తీసుకెళ్తుందో ఎవరికి తెలుసు?” అన్నాడు.
అతనంత ప్రేమతో పెద్దరికంతో చెప్తుంటే ప్రయత్నం చెయ్యాలనే నిశ్చయించుకుంది. తలూపింది. తండ్రి తనని ఎద్దేవా చేసినందుకు మధు మూతి ముడుచుకుంది.
“అదికాదే మధూ! లిమ్కా బుక్ లోకి ఎక్కడానికి నువ్వు ఇంకెన్ని పాటలు నేర్చుకోవాలి?” అని మానస ఏడిపించింది.
“కాలేజ్ డే రేపేనా?” కిరణ్మయి అడిగింది.
“అవును” మధు వెంటనే జవాబిచ్చింది.” నేనూ శాంతీ ముందే వెళ్లిపోతాం. ఈ రెండుకోతుల్నీ తీసుకుని నువ్వూ నాన్నా రండి” అంది కోపంగా.
“నేనా? మీ కాలేజీకి నేనెందుకు?” గాభరాగా అడిగింది శాంతి.
“ఎందుకేమిటే? ప్రోగ్రామ్సవీ ఉంటాయి. చాలా బాగుంటాయి. మీ ఊళ్లో స్కూల్‍డే ఫంక్షన్స్‌కి ఎప్పుడూ వెళ్లలేదా?” అడిగింది కిరణ్మయి.
” కో ఎడ్యకేషన్‍కదా, గొడవలయ్యేవి. పెద్దనాన్న వద్దనేవాడు” అంది శాంతి.
“థియొసాఫికల్ సొసైటీ మీటింగ్స్ ఉన్నాయిరా మధూ మాకు. వాటికి వెళ్లాలి. తప్పదు. మీరు నలుగురూ ఆటోలో వెళ్లిపోండి. ఎనిమిది దాటాక మేము వస్తాము” అన్నాడు గోపాలకృష్ణ. తండ్రి మాట్లాడేసరికి మధు కోపం మర్చిపోయింది .
మర్నాడు సాయంత్రందాకా హడావిడిపడుతూనే ఉంది మధు. కాలేజీడేకి ఇంత హడావిడీ హంగామా ఎందుకో అర్థం కాలేదు శాంతికి. తల్లి తనకోసం కొన్న జరీబూటా పింక్‍కలర్ ప్యూర్‍సిల్క్ చీర కట్టుకుని సింపుల్‍గా తయారయింది. అంత హడావిడీ చేసి ఏ చీరా నచ్చక తన చుడిదార్ డ్రెస్సే వేసుకుంది మధు.
నలుగురినీ ఆటో ఎక్కించి గోపాలకృష్ణా, కిరణ్మయీ వాళ్ల పనిమీద వెళ్ళిపోయారు. రంగురంగుల దీపాలతో వెలుగుతున్న కాలేజీ ఆవరణనీ, ఆటో దిగగానే సుడిగాలిలా చుట్టేసిన మధు స్నేహితుల్నీ విస్మయంగా చూసింది శాంతి.
“మా అక్క. శాంతి. డిగ్రీ చేస్తోంది” అని అందరికీ పరిచయం చేసింది మధు. వాళ్లు తనని ఏమి ప్రశ్నలు వేస్తారో ఇన్నాళ్ళు లేని అక్కయ్య ఇప్పుడు ఎక్కడినుంచి వూడిపడిందని అడుగుతారో ఏమోనని భయపడింది శాంతి. కానీ వాళ్లు సింపుల్‍గా హలో చెప్పేసి వదిలేశారు.
పదిమంది అమ్మాయిల గుంపులో ఉన్న శాంతిని దూరంనుంచీ చూశాడు భాస్కర్. అతని భృకుటి ముడిపడింది.