సంగమం 25 by S Sridevi

  1. సంగమం 23 by S Sridevi
  2. సంగమం 25 by S Sridevi
  3. సంగమం 26 by S Sridevi
  4. సంగమం27 by S Sridevi
  5. సంగమం 28 by S Sridevi
  6. సంగమం 29 – by S Sridevi
  7. సంగమం 31 by S Sridevi
  8. సంగమం 32 by S Sridevi
  9. సంగమం 33 by S Sridevi
  10. సంగమం 34 by S Sridevi
  11. సంగమం 35 by S Sridevi

శాంతి ఇక్కడ ఎలా ఉండగలదనే సందేహం కలిగింది. కానీ ఆ కదలికలూ హావభావాలూ పరిచితమైనవిగా అనిపిస్తుంటే ఆ గుంపులోని అమ్మాయి మరెవరో ఫ్రెండ్ కలిస్తే విడివడి ఇవతలికి రాగానే ఎదురుపడి అడిగాడు, “ఆ పింక్‍సారీ అమ్మాయి మన కాలేజేనా, అవుట్‍సైడరా?” అని.
ఆ అడగటంలో ఆతృతేతప్ప ఉచితానుచితాల ఆలోచనలేదు. అతను ఎందుకు అడిగాడో తెలియక కుతూహలంగా చూసి, “మధు… సీనియర్ ఇంటర్ ఎంపీసీ మధూవాళ్ల అక్కట” అంది.
” పేరు?”
“శాంతి”
భాస్కర్ సందేహాలన్నీ పటాపంచలైపోయాయి. అతని పిడికిళ్ళు బిగుసుకున్నాయి. కోపం… అతని నరనరాల్లోనూ పోటెత్తి పొంగుతున్న సముద్రంలా. ఎంత మోసం చేస్తోంది! ఎన్ని అబద్ధాలు చెప్పింది!
“మధుమతిని నేను రమ్మన్నానని పిలు” అన్నాడు. ఆ అమ్మాయి అలాగే వెళ్లి మధుతో చెప్పింది. ఎందుకోనని మధు, వెంట శాంతితో వచ్చింది. అక్కడ అనూహ్యంగా భాస్కర్ని చూసి నిరుత్తరురాలైపోయింది శాంతి.
“మీ అక్కా?” సూటిగా మధుని అడిగాడు భాస్కర్. అతనికి శాంతి ఎలా తెలుసో ఆమెకి అర్థం కాలేదు. అయినా తలూపింది.
“అక్కంటే?కజినా?” రెట్టించి అడిగాడు.
అతనంత గుచ్చిగుచ్చి ఎందుకడుగుతున్నాడో అర్థం కాలేదు మధుకి. తల్లిదండ్రులది లోకవిరుద్ధమైన ప్రజాసమ్మతంకాని వివాహమని ఆమెకి తెలుసు. చిన్నప్పటినుంచీ అంతా తనని అదోలా చూడటం, నర్మగర్భంగా మాట్లాడటం, వెనకాల ఏవో అనుకోవడంలాంటి అనుభవాలెన్నో ఆమెకి సంభవించాయి. మొదట్లో బాధపడ్డా క్రమంగా అలవాటుపడిపోయింది. ఎవరైనా ఏదైనా అంటే టపీమని జవాబిచ్చి అన్నవాళ్ళ నోరు మూయించడంతోపాటు డేగకళ్లతో మానసనీ, శీనునీ కూడా చూసి కాపాడుకోవడం నేర్చుకుంది. ఏ గొడవా ఆ తల్లిదండ్రులదాకా పోనివ్వదు.
“అక్కంటే అక్కే. హాఫ్ సిస్టర్. కజిన్ కాదు” అంది స్పష్టంగా.
భాస్కర్‍కి ఇంకా సంకోచపడాల్సిన అవసరంగానీ తనని తను నిగ్రహించుకోవలసిన అక్కరగానీ కనిపించలేదు.” మీఅమ్మ నీడే నీమీద పడలేదుకదూ? మరి నువ్వు ఇక్కడ? చెప్పు… ఇది ఎన్నో అబద్ధం? ఛీ… ఛీ… సిగ్గుగా లేదా, అబద్ధాలాడి అలా ఒక మనిషిని మోసం చేయడానికి? నీది కూడా ఒక బతుకేనా? నీతీ జాతీ లేని బతుకు…”
మధుకి అతనెవరో అర్థమైంది. తరుణ్- నాగార్జున- షారుక్ ఖాన్- ఇమేజిలన్నీ చెరిగిపోయి, బిత్తరపోయి చూస్తున్న శాంతినీ నిలదీస్తున్న అతన్నీ తనుకూడా తెల్లబోయిచూసింది. చుట్టూ చాలామంది పోగుపడ్డారు.
” మా పెద్దనాన్న… చచ్చిపోతే…” తడబడుతూ శాంతి చెప్పబోతుంటే భాస్కర్ అడ్డుపడి చెప్పనివ్వలేదు.
” గుడ్! అక్కడ మీ అమ్మని చంపావు. ఇక్కడ పెద్దనాన్నని. మరి నన్నెక్కడ చంపావు?” హేళనగా అడిగాడు.
శాంతికి ఇంకేం మాట్లాడాలో తెలియలేదు. ఏం చెప్పినా వినే పరిస్థితిలో లేడు. చెప్పాల్సిన అవసరం మాత్రం తనకి ఉందా? బతికున్నంత కాలం భరించాల్సిన బాధ్యత తప్పించుకుని తిరుగుతున్న ఈ మనిషికి తనెందుకు విన్నవించుకోవాలి? పైగా పబ్లిక్‍లో ఏమిటీ గొడవ? నిజంగా పెద్దనాన్న చనిపోయిన విషయం ఇతనికి తెలియదా? తెలియనట్టు నటిస్తున్నాడు. తనతో కలిసి ఉండే ఇష్టంలేనప్పుడు వెంటపడి ఈ రభస దేనికి? నలుగురిలో ఎంత అసహ్యంగా ఉంటుంది? చాలా అవమానంగా అనిపించింది. రేపట్నుంచి తల్లీవాళ్లూ తలెత్తుకుని ఎలా తిరుగుతారు?
“విడాకుల కాగితాలు సంతకం పెట్టి ఆరోజే పెద్దనాన్నకి ఇచ్చేశాను” అతనితో అని,” మధూ! పదండి” అంటూ గిరుక్కున వెనక్కి తిరిగి వాళ్ల రాకకోసమేనా చూడకుండా వేగంగా వచ్చేసింది. మధు, మానసనీ శీనునీ తీసుకుని అనుసరించింది. ఆటో మాట్లాడుకుని ఇంటికి వచ్చేసారు. ఎవ్వరూ ఒక్కమాటకూడా మాట్లాడలేదు. శాంతి ఏడుపుని వుగ్గబట్టుకుని ఆటో ఆగీఆగగానే ఒక్క వుదుటిని వెళ్లి మంచానికి అడ్డంపడింది.
తనమానాన తను బతుకుతుంటే అతనికి ఇంత కక్షేమిటో అర్థం కాలేదు. తను ఏం చేసింది? అతనికేం ద్రోహం చేసింది? పరిస్థితులన్నీ వివరించి చెప్పింది. తన నిస్సహాయత అర్థం చేసుకోవాల్సిన మనిషి… చదువుకుని నలుగురికి మంచిచెడులు బోధించే స్థానంలో ఉన్న వ్యక్తి… ఏవేనా అనుమానాలుంటే తెలుసుకుని నిర్ధారించుకోవలసినంత చదువున్నవాడు… తననుంచి ఆశిస్తున్నది ఏమిటి? ఎందుకిలా అవమానిస్తున్నాడు? తలుచుకున్నకొద్దీ అసహ్యం వేస్తోంది.
ఆమె ఏడుపు ఉద్ధృతి చూస్తుంటే మధుకి భయం వేస్తోంది. మానస, శీను బిత్తరపోయి చూస్తూ నిలబడ్డారు. ఏం జరిగిందో అంత హఠాత్తుగా ఎందుకు అక్కడినుంచీ వచ్చేసారో వాళ్లకి అర్థమవలేదు.
” శాంతీ! శాంతీ! ఊరుకోవే! కంట్రోల్ చేసుకోవే!” మధు ఏడుపు గొంతుతో బతిమాలింది.
కాలేజీకి వెళ్ళిన గోపాలకృష్ణ, కిరణ్మయి అక్కడ జరిగిన గొడవ తెలుసుకుని వెంటనే తిరిగి వచ్చేశారు. భాస్కర్… దాదాపు నెలరోజులనుంచీ తనతో కలిసి పనిచేస్తున్న భాస్కర్. .. శాంతి భర్తంటే గోపాలకృష్ణకి దిగ్భ్రాంతిగా ఉంది. మితభాషిగా ఉండే ఆ వ్యక్తి నలుగురిలో అంత అదుపుతప్పి అసహ్యంగా ప్రవర్తించాడంటే నమ్మలేకపోతున్నాడు.
తల్లినీ అతన్నీ చూడగానే శాంతికి ఉద్రేకం కట్టలు తెంచుకుంది. తన సమస్య తను ఎలా పరిష్కరించుకోవాలో చేతకానితనం… తన అదుపులోలేని పరిస్థితులకి ఉక్రోషం…” ఎందుకు కన్నావమ్మా నన్ను? మా నాన్న పోగానే ఏ అబార్షనో చేయించుకుంటే ఈ అవమానం, బాధ మనందరికీ ఉండేవి కాదు. అనాలోచితంగా నన్ను కనేసి… నా కర్మానికి నన్ను వదిలేసి నీ దారిన నువ్వు వెళ్ళిపోయావు. బతికున్న తల్లిని చచ్చినదానిగా జమకట్టినా ఊరుకోవలసిన నిస్సహాయతకి… నాతప్పేం లేకపోయినా తలవంచుకుని నిలబడాల్సిన పరిస్థితికి నన్ను బలిచేసి పెద్దనాన్న చేతులు దులుపుకున్నాడు. అతను నన్ను వెంటాడి వేధిస్తున్నాడు. నేనిక్కడున్నానని అతనికి ఎలా తెలుసు? ఎందుకు వెతుక్కుంటూ వచ్చాడు? నలుగురిలో గేలి… అవమానం… అసలు ఇప్పుడుమాత్రం నేను ఉండేం ఉద్ధరించాలి? ” క్రమంగా ఆమె ఆవేశం మళ్లీ దు:ఖంగా రూపుమార్చుకుంది. ఆమె మాటలకి కిరణ్మయి తలవంచుకుంది. గోపాలకృష్ణకి ముఖం చూపలేకపోయింది. తక్కిన పిల్లల్ని తీసుకుని అతను అక్కడినుంచి వెళ్ళిపోయాడు.
శాంతి చాలాసేపు ఏడ్చింది. తల్లినిమీద చెయ్యికూడా వెయ్యనివ్వలేదు. ఎవరినుంచీ పిసరంత ఓదార్పుకూడా ఆశించడం లేదు ఆమె. ఎలాంటి ఓదార్పూ పరిస్థితుల్ని మార్చలేదు. అనాలోచితంగా మాటలైతే అనేసింది కానీ తనవలన తల్లి కుటుంబానికి ఎంత ఇరకాటమైన పరిస్థితి ఎదురైందో తలుచుకుంటే ఒళ్లంతా దహించుకుపోతోంది. వాళ్ళిద్దరూ ఉద్యోగం చేసేది అక్కడే. పిల్లలు చదివేది అక్కడే. ఇన్నాళ్లూ జాగ్రత్తగా వాళ్లు కాపాడుకున్న పరువు మర్యాదలు తనవల్ల భంగమయ్యాయి. రేపట్నుంచి వాళ్లు ఎన్ని అవహేళనలని ఎదుర్కోవాలో! మధూవాళ్ళ భవిష్యత్తు ఏమిటి? తలుచుకున్నకొద్దీ అసహ్యంగా అనిపిస్తోంది. అలా ఏడుస్తూనే చాలాసేపటికి నిద్రలోకి జారుకుంది. అదీ కలతనిద్ర. కన్నీళ్ళు ఆగనివ్వని, బాధని వుపశమించనివ్వని సుషుప్తీ, జాగృతీకాని స్థితి.
కిరణ్మయికి ఆమె సంఘర్షణ అర్థమయ్యీ కాకుండా ఉంది. ఆమె అన్న మాటలకి మనసు చివుక్కుమంది. అనాలోచితంగా కన్నదా, దీన్ని? శ్రీధర్ చచ్చిపోయినప్పుడు తను మళ్లీ పెళ్లి చేసుకుంటుందనిగానీ, తన పెళ్లి దీని భవిష్యత్తుకి గొడ్డలిపెట్టు అవుతుందనిగానీ అనుకుందా? తనని అన్యాయం చేసి వెళ్లిపోయిన అతని ప్రతిరూపం అనుకుంది. గోపాలకృష్ణ మాత్రం? శాంతి మన పెద్దకూతురు. తనకోసం ఎప్పుడూ మన తలుపులు తెరిచే ఉంటాయన్నాడు. ఆ మాట నిలబెట్టుకున్నాడుకూడాను. జరిగిందేదో జరిగిపోయింది, ఎన్ని కష్టాలైనా కాలంముందు దిగదుడుపు అనుకుని దీన్ని చదివించి అభివృద్ధిలోకి తీసుకొద్దామనుకుంటే ఇలా జరిగిందేమిటి? శాంతి అన్నట్టు అతనిక్కడికి ఏమి ఆశించి వచ్చాడు? ఇది ఇక్కడున్నట్టు తెలుసుకుని వచ్చాడా? ఇక్కడికి పంపించినట్టు వాళ్లు చెప్పారా? ఎందుకు అతనికి దానిపట్ల ఆ కక్ష? కూతురి మాటలకి బాధకన్నా రేపట్నుంచీ ఎలాగన్న భయం కిరణ్మయికి ఎక్కువగా కలిగింది.
తను గోపాలకృష్ణని చేసుకున్న రోజుల్లో ఎన్నో తిరస్కారాలనీ అవమానాలనీ ఎదుర్కొంది. అతనిది రెగ్యులర్ ఉద్యోగం. తనది కాంట్రాక్ట్ జాబు. తన వెనక చేసే హేళనలు, తనని చూసి అన్న చులకనమాటలు పడలేక ఎన్ని ఉద్యోగాలు మారిందో! అప్పుడంటే తామిద్దరే! పడ్డ గోడల్ని నిలబెట్టుకునే ప్రయత్నంలో ఉన్నారు. ఇప్పటికి స్థిరపడ్డారు. ఇప్పుడు తమకూడా పిల్లలు ఉన్నారు. ఈ గొడవలకి వాళ్ల భవిష్యత్తు ఏమవుతుంది? ఎలా పరిష్కరించాలి ఈ సమస్యని? నిస్సత్తువగా శాంతి మంచం అంచుని కూర్చుని ఉండిపోయింది. ఎంత టైము గడిచిందో కూడా గుర్తించలేదు.
” నిద్రపోయిందా?” గోపాలకృష్ణ గొంతు విని ఉలిక్కిపడి బాహ్యస్పృహ తెచ్చుకుంది.
” వాళ్లు పడుకున్నారా?” ఎదురు అడిగింది.
“అన్నాలు తినిపించి డాబా ఎక్కించాను. మాటలు వినిపించడం లేదంటే పడుకునే ఉంటారు. మధు పర్వాలేదుకానీ మనో, శీను బాగా బెదిరిపోయారు” అన్నాడు.
“మనం అప్పుడు శాంతి విషయంలో సరైన నిర్ణయం తీసుకోలేకపోయాము కిరణ్! వాళ్లతో ఏదో ఒక లీగల్ ఒప్పందం చేసుకోవాల్సింది. వాళ్లకి కొంతైనా భయం, బాధ్యత ఉండేవి. శాంతిని ఏమైనా చేస్తారేమోనని భయపడ్డాము. సమస్యని వాయిదా వేసాము. అది మరింత జటిలమై మన ముందుకి వచ్చింది. వాళ్లు అనుకున్నంతా చెయ్యనే చేశారు”
“చాలా ఏళ్లతర్వాత మళ్లీ ఏడవాలని ఇప్పుడనిపిస్తోంది కృష్ణా!” జ్ఞాపకాల అట్టడుగు పొరలేవో చెదిరి అక్కడ నిక్షిప్తమై ఉన్న దుఃఖం ఎగదన్నుకొచ్చింది.
అతను ఆమెని దగ్గరకి తీసుకుని ఓదార్చాడు.” ఏడ్చి ఏం ప్రయోజనం? మనం నడుస్తున్నదే కొత్తదార్లో. మనకు ఎదురయ్యే సమస్యలు ఇంతకుముందు ఎవరికీ తటస్థపడనివి. పరిష్కారాలని మనమే కనుక్కోవాలి. వెనకతరాలవాళ్ళెవరూ మనకోసం కనిపెట్టి ఉంచలేదు” అన్నాడు.
“నాకు ఎటూ తోచడం లేదు” కళ్ళు తుడుచుకుంటూ అంది కిరణ్మయి.
“కాలం ఇక్కడితో ఆగిపోదు. రాత్రి తెల్లారితే పగలు వస్తుంది. ఉద్వేగాలు చల్లారితే ఆలోచనలు వస్తాయి. రేపు ఉదయం వెళ్లి అతనితో మాట్లాడదాం. అసలు గొడవకి మూలకారణం ఏమిటో, అతని మనసులో ఏముందో తెలుస్తుంది. ఆపైన ఏం చేయాలో నిర్ణయించుకుందాం” అన్నాడు.
రాత్రి కిరణ్మయి శాంతి పక్కనే కూర్చుంది. నిద్రపోలేదు. లోలోపల భయం… ఆమె ఏమైనా చేసుకుంటుందేమోనని. గోపాలకృష్ణ పిల్లల దగ్గర పడుకున్నాడు. రాత్రి కాళరాత్రిలా ఎంతకీ తెల్లవారలేదు కిరణ్మయికి. ఒకవైపు గతం, మరోవైపు భవిష్యత్తు ఆమెని క్షోభ పెడుతున్నాయి.
ఉదయం నిద్రలేచేసరికి శాంతికి ఎదురుగా తల్లి కనిపించింది. నిద్రలేమితో వడలిన ముఖం చూడగానే బాధతో ముడుచుకుపోయింది. “రాత్రంతా నిద్ర పోలేదామ్మా?” అడిగింది.
“పద. మొహం కడుక్కో. ముందు పాలు తాగుదువుగాని. రాత్రి ఏమీ తినకుండా పడుకున్నావు” అంది కిరణ్మయి మంచం దిగుతూ.
శాంతి గదిలోంచీ ఇవతలికి వచ్చింది. నేరుగా గోపాలకృష్ణని వెతుక్కుంటూ వెళ్ళింది. హాల్లో కూర్చుని పేపరు చదువుతున్నాడు. ముందురోజు రాత్రి తను చాలా తిక్కగా మాట్లాడింది. తల్లిని నిందించింది. వాటికి అతనికి కోపం వచ్చి ఉంటుందనిపించింది.
ఆమె అడుగుల చప్పుడికి అతను తల తిప్పాడు. వెంటనే రెండు చేతులూ జోడించింది.