సంగమం 28 by S Sridevi

  1. సంగమం 23 by S Sridevi
  2. సంగమం 25 by S Sridevi
  3. సంగమం 26 by S Sridevi
  4. సంగమం27 by S Sridevi
  5. సంగమం 28 by S Sridevi
  6. సంగమం 29 – by S Sridevi
  7. సంగమం 31 by S Sridevi
  8. సంగమం 32 by S Sridevi
  9. సంగమం 33 by S Sridevi
  10. సంగమం 34 by S Sridevi
  11. సంగమం 35 by S Sridevi

వివాహవ్యవస్థని బహుశా మగవాడే సృష్టించి ఉంటాడు. దానికి స్త్రీని బానిసని చేశాడు. కారణం గోపాలకృష్ణ చెప్పినట్టు మాతృత్వం వాస్తవం. పితృత్వం నమ్మకం. ఆ నమ్మకంమీదే ఆధారపడి నడుస్తున్న పితృస్వామిక వ్యవస్థ మగవాడిలో అభద్రతా భావాన్ని రేపింది. స్త్రీని పూర్తిగా తన అధీనంలోనే ఉంచుకుని ఆ నమ్మకాన్ని నిజంగా మార్చాలని ప్రయాసపడుతున్నారు మగవారు. జనరల్ ప్రిన్సిపల్‍లాగా మగవాళ్ళంతా మంచివాళ్లు, ఆడవాళ్ళుమాత్రం తిరుగుబోతులు, మగవారు వాళ్లని కట్టడి చేస్తేనే అదుపులో ఉంటారనే ఒకానొక భావన… జీవరహితమైన సమాజానికి దారితీసింది. ఎన్నో కట్టుబాట్లు… సాంప్రదాయాల పేరుతో సృష్టివిరుద్ధమైన అసహజతలు… సమాజంలో సగభాగం… మగవాడి జీవితంలో సగభాగం అయిన స్త్రీలని అపనమ్మకంగా చూస్తూ వీళ్ళేం సాధిస్తున్నారో తెలియడం లేదు. తన అనుకున్నది… తన తర్వాత కూడా తనది గానే ఉండాలనే కోరికేనా వీటన్నిటికీ కారణం? తన అనుకున్నదానిలో స్త్రీకూడా భాగస్తురాలేకదా? ఆమెకి హక్కు లేకుండా చేయటం, అర్ధసంబంధాలు, ఆర్థిక సూత్రాలేనా ఈ సమాజం మూలాలు? ఎన్నో ప్రశ్నలు అతని మనసులో తలెత్తాయి. తమ మూలాలని వెతుక్కున్నాయి. ఒక నిర్ణయం వైపుగా ప్రయాణించడానికి చాలా వ్యవధి తీసుకున్నాయి.
చాలారాత్రిదాకా అక్కడా ఇక్కడా తిరుగుతూ గడిపి ఇల్లు చేరాడు. సింధు తలుపు తీసింది.
“సింధూ! నాన్న మాటలు నువ్వు విన్నావు. అతన్ని అమెరికా పంపించడానికి సిద్ధపడితే నిన్ను చేసుకుంటాడట. నిన్నలా అనడం తప్పే. కాదనను. క్షమాపణ చెప్పిస్తాను. కానీ అమెరికా వెళ్లాలనే అతని ఆకాంక్షలోని తీవ్రత నువ్వు గుర్తించు. ఇది అవకాశాల దేశం కాదు. వెతుక్కున్నా అవకాశం దొరకదు. కష్టం. జీవితంలో ఎదుగుదల ఉండదు. అలాంటప్పుడు అతని ప్రవర్తన తప్పు కాదేమో! బలమైన కోరిక మనిషి ప్రవర్తనని అంతగా నియంత్రిస్తుంది. బావా అంటూ సరదాగా మన ఇంట్లో తిరిగిన వ్యక్తిని నేనింకా మర్చిపోలేదు. మరోసారి ఆలోచించుకో. డబ్బు… నాన్న డబ్బు గురించి భయపడుతున్నారు. ఏదో ఒకలా నేను పుట్టించి ఇస్తాను. నాన్నను ఒప్పించి ఇంటిమీద అప్పుతెచ్చి తీర్చుకుంటాను. డబ్బు… సమస్య కాదు” అన్నాడు.
“నామీద నీకు ఉన్న అభిమానానికి థాంక్సన్నయ్యా! పదేపదే ఆ విషయం నన్నడగద్దు. మరోసారి చెబుతున్నాను. కానీ నా కోరిక ఏమిటంటే నన్ను ఆడపిల్లగా మాత్రమే కాకుండా మనిషిగా కూడా గుర్తించమని. అతనికి ఎన్నో కోరికలు, ఆకాంక్షలు ఉండొచ్చు. వాటిని తీర్చుకునే మార్గం ఇదికాదు. ఏదో ఒకలా కోరుకున్నవి పొందడం నాకు నచ్చదు. రుజుమార్గం వుండాలి. అతని కపటత్వం నాకు నచ్చలేదు. అతనికి కట్నం ఇచ్చి అతని కోరికలన్నీ తీర్చడంకోసమే జరిగే ఈ పెళ్లివలన నాకు ఒరిగేదేమీ లేదు. నా వ్యక్తిత్వాన్ని కించపరుచుకుంటూ, నా కెరీర్‍కీ, సరదాలకీ అన్నిటికీ హద్దుల్ని నియంత్రించుకుంటూ బతకాలి. అతనికి నాపట్ల ఎనలేని ప్రేమ ఉంటే ఈ త్యాగాలకి అర్థం ఉంటుంది” స్పష్టంగా అంది సింధు.
భాస్కర్ లోపలికి నడిచాడు.
” అమ్మేది?”
“పడుకుంది. నిన్నటినుంచి ఒకటే ఏడుపు. నాన్న నచ్చజెప్పినట్లున్నారు. ఇందాకే కొద్దిగా మారింది.”
“నాన్న?”
” నువ్వూ వెళ్లగానే బయటికి వెళ్లారు. ఇంకా రాలేదు”
“రేపు నేను వెళ్లి వదినని తీసుకొద్దామనుకుంటున్నాను” కొంచెం తటపటాయించాక అన్నాడు భాస్కర్.
“కానీ నాన్న నీకు వేరే సంబంధాలు చూస్తున్నారు”
“నాకు తనంటే ప్రేమ చావలేదని ఇప్పుడే అర్థమైంది” అనేసి అక్కడినుంచి వెళ్ళిపోయాడు.

గోపాలకృష్ణతో వెళ్లొచ్చాక కిరణ్మయి భాస్కర్‍గురించి కాస్త ఆలోచించింది. అతనుగానీ తను చేస్తున్న తప్పును గుర్తించి సరిదిద్దుకోవడానికి ముందుకు వస్తే శాంతిని పంపించవచ్చు. దానివలన అనేక సమస్యలు పరిష్కారమవుతాయి. కానీ అతనిలో అలాంటి ఆలోచన ఉన్నట్టు ఎక్కడా కనిపించలేదు. చదువుకున్నాడు. మంచి ఉద్యోగంలో ఉన్నాడు. తన తరంవాళ్ళు తనని ఆక్షేపించారు. తరానికీ తరానికీ మార్పు వస్తుందంటారు. అతనింత సంకుచితంగా ఉన్నాడేంటి? ఇంతకీ శాంతి కూడా ఇష్టపడాలికదా?
శాంతి తల్లిని వెళ్లిన విషయం గురించి ఒక్క మాటకూడా అడగలేదు. కొంచెమైనా కుతూహలం చూపించలేదు. ఆమె భయపడుతునే పెళ్లి చేసుకుంది. పెళ్లి ఆగిపోయాక కూడా ఇంకా ఏదో జరగాల్సింది మిగిలిపోయిందనే భయపడింది. అన్నీ పూర్తయ్యాయని ఇప్పుడు తేలికపడింది.


కాలింగ్‍బెల్ చప్పుడికి శాంతి వెళ్లి తలుపు తీసింది.
భాస్కర్!
తెల్లబోయింది. వెంటనే తేరుకుని కఠినంగా అడిగింది.” ఎందుకు నన్నిలా వెంటాడుతున్నావు? కాలేజీలో జరిగిన గొడవ చాలదా? ఇంటికి కూడా వచ్చి గొడవ చేయాలా? నీకూ నాకూ ఏ సంబంధం ఉంది? నువ్వే తెంచేసావు కదా? అయినా మూడునిమిషాలు నీముందు తలవంచుకు కూర్చున్న పాపానికి బతుకంతా నీకు భయపడి గడపాలా?”శాంతి కోపంగా మాట్లాడడం వినిపించి, కిరణ్మయి అక్కడికి వచ్చి పరిస్థితి అర్థం చేసుకుంది.
“అతన్ని లోపలికి రానివ్వమ్మా!” మృదువుగా మందలించింది. శాంతి విసురుగా లోపలికి వెళ్ళిపోయింది.
“రండి” కిరణ్మయి అతన్ని ఆహ్వానించింది. అతను ఇంట్లోకి వెళ్లి కూర్చున్నాడు.
“శాంతిని తీసుకెళ్దామని వచ్చాను” మాటలు పేర్చుకుంటూ అతికష్టంమీద అన్నాడు. చేసేదంతా చేసేసి సారీ చెప్పడం అంత తేలికైన పని కాదనిపించింది. “నాకు తనంటే చాలా యిష్టం. ఆ యిష్టమే తనపట్ల ఇంత స్వతంత్రాన్ని యిచ్చిందనుకుంటాను. క్షమించమని చెప్పండి” గొణిగినట్టు అన్నాడు.
“దాన్ని అడక్కుండానే? దానితోనే మాట్లాడండి. పిలుస్తాను ఉండండి” అని వెళ్లి నచ్చజెప్పి కూతుర్ని పంపించింది. శాంతిలో కొట్టవచ్చినట్టు కనిపిస్తున్న మార్పు… ఆరోజు రాత్రి తనని పిలిచి మాట్లాడినప్పటికీ ఇప్పటికీ ఉన్న తేడా… దాన్నతను తేలిగ్గా గుర్తించాడు.
“చెంపమీద కొట్టి నోటితో సారీ చెప్పినంతమాత్రాన బాధ, అవమానం తీసేసినట్టవ్వదని నాకు తెలుసు. నిన్న ఉదయంనుంచీ ఇప్పటిదాకా ఎందరి దగ్గరో ఎన్నో పాఠాలు నేర్చుకున్నాను నేను. మనిషి తనకి తానుగా ఆపాదించుకున్న సాంఘిక విలువల్లో ఏది ముఖ్యమైనదో కాదో అర్థం చేసుకున్నాను. నాకు నీమీద ఉన్న అపరిమితమైన ప్రేమ… నాకు, నీకు మధ్యన నేనే కల్పించుకున్న ఏవో అపార్థపు తెరలు…. ఆ తెరలని తొలగించాను. నీమీద ఉన్న ప్రేమ మాత్రమే మిగిలింది. మన ఇంటికి వెళ్దాం శాంతీ!” అన్నాడు.
తల్లీవాళ్ళూ అతనింటికి వెళ్లారంటే అతన్ని దారికి తెచ్చే ఉంటారని శాంతి ఊహించిందిగానీ ఆ మార్పు ఇంత త్వరగా వస్తుందనుకోలేదు. ఇంత తొందరగా వచ్చిన మార్పు క్షణికమే అయితే?
“నా రెండేళ్ల వయసునుంచీ దాదాపు పద్ధెనిమిదేళ్లపాటు ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాను. జాలీ ప్రేమా అనేవి చవిచూడకుండా నిరర్ధకమైన బతుకు బతికాను. ఇన్నాళ్ళకి నన్ను ప్రేమించి నా అభివృద్ధిని కాంక్షించే వ్యక్తులు కనిపించారు. వాళ్ల ప్రేమ ఇప్పుడే నాకు అనుభవంలోకి వచ్చింది. ఇంకా పూర్తిగా ఆస్వాదించలేదు. మీ ప్రేమని నేనసలు పొందనే లేదు. దేన్ని వదులుకోమంటారో మీరే చెప్పండి. చిన్నప్పటినుంచి నాకంటూ చిన్న పిసరంత చోటుకూడా లేకుండా ఇతరుల దయాదాక్షిణ్యాల మీద బతికాను. పెళ్లనేది స్త్రీ పురుషుల ప్రగతికి ఉమ్మడి వేదిక. అక్కడినుంచి కూడా నన్ను తోసేస్తే గాలివాటానికి ఇక్కడికి వచ్చిపడ్డాను. ఇక్కడకూడా నాకు ఎలాంటి హక్కూ లేదు. అమ్మ, గోపాలకృష్ణగార్ల మంచితనమే నాకు రక్ష అయింది. మీలాంటి అస్థిరుడితో కాపురం కాదు నాకు కావలసినది, నా కాళ్ళ మీద నేను నిలబడటం. దయచేసి నన్ను వదిలిపెట్టండి. నా జోలికి రాకండి. నిజంగా మీలో పశ్చాత్తాపమే కలిగితే ఈఒక్క సాయం నాకు చేసి పెట్టండి” అంది. భాస్కర్ నిరుత్తరుడయ్యాడు. కాఫీ కప్పులతో వచ్చిన కిరణ్మయి కూడా చేష్టలు దక్కి నిలబడిపోయింది. అవకాశం మనిషిని అందలం ఎక్కిస్తుంది. ఆత్మన్యూనత అధ:పాతాళానికి అణగదొక్కుతుంది. శాంతిలో వచ్చిన మార్పు ఇప్పటికి పూర్తయింది. కొంత వ్యవధి పట్టింది భాస్కర్‍కి తేరుకోవడానికి. కిరణ్మయికి కూడా.
“నీకోసం ఎంతకాలమైనా ఎదురు చూస్తాను శాంతీ!” అని లేచి వెళ్ళిపోయాడతను. కిరణ్మయి కూతురి దగ్గరికి వచ్చింది.
“ఒకరి దయాధర్మాలమీద ఆధారపడి నేను నాకుగానీ ఇతరులకుగానీ బరువుగా బతకాలనుకోవడంలేదమ్మా! ఇంతకాలం అలాగే బతికాను. ఇకమీదట స్వతంత్రంగా ఉండాలని ఉంది. ఈ ప్రలోభాలన్నిటికీ దూరంగా ఉండకపోతే అది సాధ్యపడదు. దయచేసి నన్నర్థం చేసుకో” అంది శాంతి తన చర్యకి వివరణ ఇస్తూ.
“అతను నీకు ప్రలోభమేనా?” ఆరాటంగా అడిగింది కిరణ్మయి. శాంతి నవ్వింది.
“కొత్తమిత్రుడికన్నా పాతశత్రువు నయమని చెప్తారు” అంది.
“ఓసినీ!” అని నవ్వింది కిరణ్మయి. ఆమె ముఖం ప్రకాశవంతమైంది. పుట్టినప్పటినుంచే అపసవ్యమైన దారిలో నడుస్తున్న తన బతుకుని సరైన దారిలో పెట్టే ప్రయత్నంలో పడింది శాంతి. చదువు ముఖ్యం అంటే డిగ్రీకి కట్టింది. అన్నట్టుగానే సివిల్స్ కోచింగ్‍కి పంపాడు గోపాలకృష్ణ. అందరికీ తెలుసు అదంత తేలిక కాదని. ఏ ఒక్క అవకాశం వదులుకోరాదని ఒకటీ, ఈ కోచింగ్ ఆమెలో ఆత్మవిశ్వాసాన్ని పెంచి వేరే పరీక్షలు రాయడానికి దోహదం చేస్తుందని మరొకటీ. ఈ రెండు కారణాలచేతా పంపించాడు. అతను ఆశించినట్టే ఆమెలో పోరాటపటిమ బాగా పెరిగింది. బ్యాంకులో క్లర్కు ఉద్యోగం చాలా తేలిగ్గా వచ్చింది. ఇది అతి పెద్ద విజయం శాంతికి. సంతోషంతో ఉక్కిరిబిక్కిరైంది. తను… తనకు ఉద్యోగం… స్వతంత్రమైన జీవనశైలి… ఎంతలో ఎంత మార్పు! విస్మయంగా అనుకుంది. పెద్దనాన్న చనిపోకపోతే? తనక్కడే ఉండిపోయేది. అలా జడ్డిగానే.
ఆమె గుండె ఝల్లుమంది. ఎవరూ మరొకరి జీవితానికి కర్తలో నిర్ణేతలో కారాదు. భాస్కర్ గుర్తొచ్చాడు. ఆరోజు తర్వాత మళ్లీ తనని కలవలేదు. తన ఆకాంక్షని గుర్తించినట్టా? లేక కోపంతో మరోదారిలో వెళ్లిపోయాడా? మనసు అట్టడుగు పొరల్లో మొదలైన తపన పైదాకా రాలేదు. కిరణ్మయికికూడా ఆరాటంగానే ఉంది. శాంతి చెప్పింది నిజం. ఇప్పుడో కొత్త సంబంధం పట్టుకొచ్చి వాళ్లకి పరిస్థితులన్నీ వివరించి సానుకూలత కల్పించి పెళ్లి చేయటంకన్నా భాస్కర్‍తో సంబంధాన్ని పునరుద్ధరించుకోవడం తేలిక. పాతబంధంలో ప్రమాదాలన్నీ దాటిపోయాయి. ఇప్పుడిక బలపడటమే మిగిలి ఉంది. కొత్తబంధం ఈ ప్రమాదాలన్నీ దాటాలి. అతనిలో ఆకర్షణ, శాంతిపట్ల ప్రేమ ఇంకా అలాగే ఉన్నాయా? ఇన్నేళ్లలో ఇద్దరూ ఒక్కసారి కూడా కలుసుకోలేదు. కాలేజీలో ముఖాలు చూసుకోవడం తప్పిస్తే తాముకూడా వ్యక్తిగతంగా ముందుకు వెళ్లలేదు. అతను గిరిగీసుకుని దాని వెనుకే ఉండిపోయాడు. అతను శాంతి మాటలతో కొత్తగా గాయపడ్డాడా లేక ఆ పాతగాయంనుంచీ కోలుకుంటున్నాడా? శాంతి… భాస్కర్… ఇద్దరికీ ఇద్దరే ఘనీభవించిన మంచుముద్దల్లా ఉన్నారు. దగ్గరికి జరిపితే అతుక్కుంటారు. లేకపోతే విడిగానే ఎప్పుడో ఒకప్పటికి కరిగిపోతారు. ఒకప్పుడు తనుకూడా అంతే. గోపాలకృష్ణకి చేరువ కాలేకపోయింది. ఇద్దరిమధ్యా ఏవో సంకోచాలు వుండేవి. శాంతి దూరం కావడంతో అతనిలో అపరాధభావనకూడా చోటు చేసుకుంది. వెరసి ఇద్దరి మధ్యా అగాధం… తల్లి …తండ్రి… అన్న… వదిన అంతా తమ వంతు కృషి తాము చేశారు. ఇప్పుడు శాంతి విషయంలోకూడా అంతే.